ఔషధాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ బాంబు
posted on Sep 27, 2025 @ 9:55AM
ఇప్పటికే.. భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. మరోసారి టారిఫ్ షాక్ ఇచ్చింది. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్ విధించింది. దాంతో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైనా అమెరికా అధ్యక్షుడు సుంకాలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేటెంట్ ఔషధాలపై.. ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక.. కిచెన్ క్యాబినెట్, బాత్ రూమ్ పరికరాలపై 50 శాతం, అపహోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై పాతిక శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ విధించిన జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని.. ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సుంకాలతో.. భారత ఫార్మా ఉత్పత్తులపై ఎంత ప్రభావం పడుతుం దన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 28 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం ఔషధాలు యూఎస్‌కే వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం ఇండియా నుంచి సరఫరా అయ్యేవే ఉంటాయి. ఇప్పుడు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో అమెరికా మార్కెట్‌లో భారత ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే.. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే మెడిసిన్లలో ఎక్కువ భాగం జనరిక్ మందులే ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై టారిఫ్ లేదు. కేవలం.. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే ఈ వంద శాతం టారిఫ్ వర్తిస్తుంది. దీంతో.. ఈ తరహా ఔషధాలు ఎగుమతి చేసే కంపెనీల లాభాల మార్జిన్‌లు, స్టాక్ ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ.. టారిఫ్ పరిధిని కాంప్లెక్స్ జనరిక్స్‌కి కూడా విస్తరిస్తే.. భారతీయ ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
తక్కువ ధరలలో నాణ్యమైన ఔషదాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసమయ్యే 47 శాతం ఔషధ అవసరాలను భారత్ కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్‌లు కేవలం బ్రాండెడ్, పేటెంట్ కలిగిన ఔషధ దిగుమతులకే వర్తిస్తాయి. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి జనరిల్ ఔషధాలే. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత్ ఎగుమతులపై ప్రభావం ఉండబోదంటున్నారు.
అయితే.. సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు.. భారతీయ కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గానీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై ఫోకస్ చేయడం లాంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తరచుగా ట్రంప్ సర్కార్.. భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని.. విదేశాంగ విధాన వైఫల్యంగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. సుంకాలు, హెచ్1బీ వీసాల ఫీజు పెంపు, వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. అమెరికా చర్యల పట్ల.. కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంపైనా.. విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.