యువ గళంతో కమల దళం భవిష్యత్ వ్యూహం!
posted on Sep 19, 2025 9:27AM
వందేళ్ళు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్),భవిష్యత్ వ్యూహంలో భాగంగా బీజేపీ సహా, సంఘ్ పరివార్ సంస్థల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? ముఖ్యంగా, బీజేపీకి కొత్త రూపు ఇచ్చేందుకు, కాషాయ కూటమి కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందా? దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు పార్టీకి యూత్ లుక్, యువ వర్చస్సు ఇచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగ్తున్నాయా అంటే ఇటు పరివార్ వర్గాల నుంచి అటు పార్టీ వర్గాల నుంచి కూడా అవుననే సమాధానమే వస్తోంది.
నిజానికి.. 2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా బీజేపీ ఒక పథకం ప్రకారం పార్టీలో యువ నాయకత్వానికి సముచిత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఆర్ఎస్ఎస్ , విద్యార్ధి పరిషత్’ వంటి సంఘ్ పరివార్ సంస్థల నుంచి ఎంపిక చేసిన యువ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి బాధ్యతలు అప్పగించింది. నిజానికి.. పరివార్ సంస్థల నుంచి పార్టీలోకి రావడం కొత్త విషయం కాదు. ముందు నుంచి కూడా ఉన్నదే. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రి వర్గాల్ల, సంఘ్ పరివార్ సంస్థలలో పనిచేసిన అనుభవం సైద్ధాంతిక అవగాహన ఉన్నవారే మెజారిటీగా ఉన్నారు.
అయితే.. ఇప్పుడు 2029 తర్వాత కూడా అధికారం నిలుకునేందుకు, అంతకంటే ముఖ్యంగా ప్రస్తుత సైద్ధాంతిక ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకు పోయేందుకు, భవిష్యత్ నాయకత్వ నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ద అవసరమని బీజేపీ, పరివార్ నాయకత్వం గుర్తించింది. అందుకే 2024 ఎన్నికలకు ముందు నుంచి యువ నాయకత్వ నిర్మాణం పై దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పడు యువ నాయకత్వ నిర్మాణంలో వేగం పెంచిందని పార్టీ వర్గాల సమాచారం.
అదలా ఉంచితే.. సంఘ్ పరివార్ సంస్థల నుంచి యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంతో పాటుగా.. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో సత్తా నిరూపించుకున్న సమర్ధ యువ నేతలను ఆకర్షించే దిశగా కమల దళం కదులుతోంది. నిజానికి.. ఇప్పటికే రాహుల్ గాంధీ పుణ్యాన, కాంగ్రెస్ పార్టీని వదిలిన జ్యోతిరాదిత్య సింధియా వంటి అనేక మంది యువ నాయకులు బీజేపీలో చేరారు. ముఖ్యంగా, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్న కాంగ్రెస్ యువ నాయకులు బీజేపీ గూటికి చేరిన వారిలో అధికంగా ఉన్నారు.
ఉదారణకు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా, మన్మోహన సింగ్ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక భూమిక పోషించిన అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే.. గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా నిలిచిన రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే అంటోనీ కుమారుడు అనీల్ అంటోనీ సైతం కమలం గూటికి చేరారు.అదే విధంగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా.. ముందస్తు అప్పాయింట్ మెంట్ లేకుండా నేరుగా ఆమెను కలిసే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ఏపీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారడు, నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన నాయకుల కుమారులు అనేక మంది కమల దళంలో చేరారు. కమల దళంలో చేరడం మాత్రమే కాదు.. మెల్ల మెల్లగా బీజేపీ ఐడియాలజీతో మమేక మవుతున్నారు.
నిజమే.. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోవడం కాంగ్రెస్ యువ నాయకులు బీజేపీలో చేరడానికి ఒక కారణం అయితే కావచ్చు కానీ.. బీజేపీ జాతీయ భావజాల వ్యాప్తి లక్ష్యంగా రచించిన భవిష్యత్ వ్యూహంలో భాగంగా పార్టీలతో సంబంధం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా యువ నాయకులను అకర్షించే ప్రయత్నాలు చేసింది. అందుకే.. యువ నాయకులను ఆకర్షిచడం ద్వారా భావజాల వ్యాప్తికి విశేషంగా కృషిచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి.. జాతీయ స్థాయి మొదలు గ్రామ స్థాయి వరకు యువతను ఆకట్టుకునేందుకు, తద్వారా యువతలో జాతీయ భావజాలాన్ని నింపేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఫలితంగా ఈరోజు బీజేపీ భావజాలం ముందుకంటే వేగంగా విస్తరిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి పైకి కనిపించే పేర్లు కొన్నే అయినా అనేక రాష్ట్రాలలో చాప కింద నీరులా వేర్వేరు పార్టీల యువ నాయకులు కమల దళం లో చేరుతున్నారని సోదాహరణంగా చెబుతున్నారు.
మరో వంక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పాటుగా ఎన్డీఎని బలోపేతం చేసేందుకు, ఎన్డీఏ పరిధిని విస్తరించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిత్ర పక్షాలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ముఖ్యంగా మిత్ర పక్షాల యువ నాయకత్వాన్ని ఆకర్షించేందుకు, యువ నేతలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఏపీలో తెలుగుదేశం, బిహార్ లో జేడీయు, ఎల్జీపీతో పాటుగా.. వేర్వేరు పార్టీల యువ నాయకులను, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. కేంద్ర మంత్రులుగా ఉన్న యువ నాయకులు కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, జ్యోతిరాదిత్య సింధియా సహా పార్టీతో సంబంధం లేకుండా యువ మంత్రులకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అంతే కాదు..త్వరలో చేపట్టే మంత్రివర్గ పునర్వ్య స్థీకరణలో యువతకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేక పోలేదని, తద్వారా ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న కేంద్ర మంత్రివర్గ సగటు వయసును మరింతగా తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న విశ్లేషకులు దేశ జనాభాలో ఇంచుమించుగా 60 శాతానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని అంటున్నారు.