వెంకయ్య చెప్పింది వేదమయ్యా.. కానీ! ?
posted on Oct 8, 2025 @ 12:43PM
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతోంది. ఆ ఖర్చు కూడా శృతి మించి పాకాన పడుతోంది. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచితాలు అనుచితంగా మారాయని వెంకయ్య అన్నారు.
ఈ మాటలు కూడా నిజమే కదా అనిపించక మానవు. ఏం పథకాలవి? జగన్ బటన్ నొక్కుడు పాలన బామ్మ కూడా చేస్తుందన్న బాబు.. ఇప్పుడేం చేస్తున్నారన్నది కూడా ఒక చర్చనీయాంశమే. జగన్ ఏటా డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యేలాంటి పథకాల రూపకల్పన చేస్తే, అదే చంద్రబాబు అంతకు రెట్టింపు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.
అలాగని ఇదంతా చంద్రబాబుకు నచ్చి చేస్తున్నది కాదన్నది కూడా అంతే వాస్తవం. ప్రస్తుత రాజకీయాల్లో జనాన్ని సంక్షేమ పథకాల ద్వారా మభ్య పెట్టడం ద్వారా మాత్రమే రాణించగలమన్నది తెలిసిందే.
గత ఎన్నికల సమయంలో ఇక్కడ జగన్ అయిన దానికీ కానిదానికీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఆయన పథక రచన డీ కోడ్ చేయాలంటే అంతకన్నా మించిన పథక రచన చేస్తేనే సాధ్యం. జగన్ ప్రవేశ పెట్టిన చాలా చాలా పథకాలు గతంలో లోకేష్ ప్రస్తావించినవే. ఆ పథకాలను బాబు తొలుత వద్దన్నారు. కానీ, అదే 2019 ఎన్నికల్లో టీడీపీకి పరాజయం కొని తెచ్చి పెట్టింది.
2024 ఎన్నికల నాటికి చంద్రబాబు తన ప్లాన్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయన ప్రభుత్వ సొమ్ము పప్పు బెల్లాల్లా పంచి పెట్టడానికి ఏమంత సముఖంగా లేరు. అందుకే పీ-4 వంటి పథకాలను తీసుకొచ్చి ప్రయివేటు వ్యక్తుల భాగస్వామ్యం సంక్షేమంలో పెంపొందిస్తున్నారు.
ఇక మెడికల్ కాలేజీల్లో పీపీపీ పథకం కూడా సరిగ్గా ఇలాంటిదే. ప్రైవేటు భాగస్వామ్యం ఎలాంటి ఫలితాలనిస్తుందో హైదరాబాద్- మెట్రోను బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీస్కోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఎల్ అండ్ టీ చాలా చాలా తక్కువ ధరకు తమ వాటాలను వదులుకోడానికి సిద్ధ పడుతోంది. దీని ద్వారా లాభమేంటంటే ఈ మొత్తం ప్రభుత్వానికి ఒక ఆస్తిగా మరుతున్నది. భవిష్యత్ లో నగరానికే ఇదొక మణిహారంగా మారుతుంది.
కానీ విధిలేని పరిస్థితుల్లో బాబు ఆయా పథకాలను ఇస్తుండటం ఒక రాజకీయ అనివార్య పరిస్థితిలో భాగంగానే పరిగణించాల్సి వస్తోంది. పోటా పోటీ రాజకీయాల కారణంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఇస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఆటో డ్రైవర్ల సేవ ఇంచు మించు అలాంటిదే. ఉచిత బస్సు పథకం ఆటో డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలను విధిలేని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది.
వాజ్ పేయి అన్నట్టు విద్యా, వైద్యం తప్ప మరేదీ ఉచితంగా అందివ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఇటు ఏపీలో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు ఉన్న రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కావడంతో.. ఇక్కడ సంక్షేమానికి పెద్ద పీట వేయక తప్పదు.
దానికి తోడు రాజకీయాల్లోకి ఈ వ్యూహకర్తల రాకడ వల్ల కూడా.. ఈ పోటా పోటీ సంక్షేమ పథకాలు తెలుగు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కర్ణాటకలో వర్కవుట్ అయిన పథకాలను గత ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించడంతో.. అప్పటి వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన పథకాలు కాస్తా గాలికెగిరిపోయాయి. మహిళలంతా కలసి తమ కోసం కాంగ్రెస్ ప్రకటించిన.. రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, సన్నబియ్యం.. అన్నిటికన్నా మించి ఫ్రీ బస్ కి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ ఇక్కడ అనూహ్యంగా మూడో స్థానం నుంచి దూసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. అధికారం కైవసం చేసుకుంది.
ఇది గుర్తించిన తెలుగుదేవం కూటమి ఇవే సంక్షేమాలను అటు ఇటుగా మార్చి.. సూపర్ సిక్స్ అన్న నామకరణం చేసి వదలడంతో.. ఇక్కడ జగన్ సంక్షేమ జాతరకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడ్డట్టయ్యింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువైంది.
ఉచితం అన్నది రాజకీయ క్రీడలో ఒక భాగమై పోయింది. మేము ఎలాంటి సంక్షేమ పథకాలూ ఇవ్వం అని చెప్పి ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీల్లేని పరిస్థితి. ప్రస్తుతం వెంకయ్య నాయుడు మాత్రమే కాదు గతంలో జేపీ నడ్డా ఏపీ వచ్చినపుడు కూడా ఈ సంక్షేమాలు తమ అభిమతం కాదన్నారు. కానీ ఏపీలోని రాజకీయాలపై సంక్షేమం ఎంతటి పవర్ఫుల్ అంటే, సోము వీర్రాజును కాస్తా సారాయి వీర్రాజుగా మార్చేంత. ఆయన కూడా ఉచితాల ప్రకటనలో భాగంగా ఆనాడు.. అత్యంత చౌకగా మద్యం అందుబాటులోకి తెస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఇక్కడ అలాంటి కాంట్ బట్ సిట్యువేషన్ రాజ్యమేలేతున్న విధం కూడా పరిగణలోకి తీసుకోవల్సి ఉంది.
పొలిటికల్ గా ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. దీంతో సంక్షేమాలు ఒక అనివార్యంగా తయారయ్యాయి. అభివృద్ధి మాత్రమే చేస్తామని తెలుగు రాజకీయాల్లో నెట్టుకు రావడం చాలా చాలా కష్టం అన్నది ఇక్కడ ఏ క్రియాశీల రాజకీయ నాయకుడ్ని అడిగినా చెబుతారు.