బీసీ కార్డ్.. తీన్మార్ మల్లన్న సరే.. కవిత ఎంట్రీ ఎప్పుడు?
posted on Sep 18, 2025 @ 1:19PM
తెలంగాణ రాజకీయాలలో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలూ బీసీల అభ్యున్నతి, సంక్షేమం తమ అజెండాగా చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ బీసీల విషయంలో చాంపియన్ గా నిలిచేందుకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆయుధంగా వాడుకుం టుంటే... ఈ పార్టీ నుంచే ఎమ్మెల్సీ అయ్యి.. ఇప్పుడు కాంగ్రెస్ బీసీ విధానాలు లోపభూయిష్టమని విమర్శలు గుప్పిస్తూ.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నఏకంగా ఓ కొత్త పార్టీ ప్రారంభిం చేశారు. తెలంగాణ రాజ్యధికార పార్టీ (టీఆర్పీ) అని తన పార్టీకి పేరు పెట్టి, బీసీలకు రాజ్యాధికారం అంటూ నినదిస్తున్నారు. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా తెలంగాణ రాజకీయాలలో కి ఎంట్రీ ఇచ్చిన తీన్మార్మల్లన్న బీసీ నినాదంతో రాష్ట్రంలో గతంలో లేని కుల రాజకీయాలను వేదికపైకి తీసుకువచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సరే తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదంతోనే రాజకీయాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధన అంటూ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి సస్పెండై మరీ సొంత రాజకీయ బాట ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. తన కార్యక్రమాలలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్న కవిత.. సొంత పార్టీతో ఎప్పుడు ముందుకు వస్తారన్న చర్చ తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు తరువాత మరింత గట్టిగా వినిపి4స్తోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ బీసీ కార్డును ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్ కు కవితను బీఆర్ఎస్ ట్రంప్ కార్డుగా ప్రయోగించిందా? కవిత తిరుగుబాటు వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు గుప్పించి సస్పెండైనా, హరీష్ కు మద్దతుగా, కవితకు వ్యతిరేకంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కానీ కవితపై పన్నెత్తు మాట అనలేదు.
దీంతో ఇప్పుడు అందరి దృష్టీ తీన్మార్ మల్లన్న పొలిటికల్ ఎంట్రీపై పడింది. ఆయన బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనడం లేదు.. కానీ కల్వకుంట్ల కవితపై నిప్పులు చెరుగుతున్నారు. కవితపై తీన్మార్ మల్లన్న విమర్శలను బీఆర్ఎస్ ఖండించడం లేదు. దీంతో ఈ ఇరువురి వెనుకా ఉన్న శక్తులేంటి? వ్యక్తులెవరు అన్న సందేహం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. సరే శక్తుల సంగతి పక్కన పెడితే.. తీన్మార్ మల్లన్న టీఆర్సీ పార్టీని ప్రకటించడంతో.. ఇప్పుడు కవితపార్టీ ప్రకటన ఎప్పుడన్న ప్రశ్నకు ఆమె బదులు చెప్పుకోవాల్సి ఉంది. చూడాలి మరి జూబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ తరువాత తెలంగాణ రాజకీయాలలో ఎవరి రంగు ఏమిటి? ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.