ఆసియా కప్ కాదు.. భారత్- పాక్ గ్రౌండ్ వార్?
posted on Sep 29, 2025 @ 1:12PM
ఈ సారి ఆసియా కప్ చాలా చాలా ప్రత్యేకం. దీన్ని పిచ్ పై జరిగిన భారత్- పాక్ వార్ గానే పరిగణించాల్సి వస్తోంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ లో భారత్ గెలిచిందే కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. అప్పటి నుంచి మొదలైంది అసలు రగడ. ఈ రెండు జట్ల మధ్య కేవలం సరిహద్దులోనే కాదు ఏ వైదికమీదనైనా యుద్ధం యుద్ధమేని.
అందుకే మోడీ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశారు. పిచ్ మీద జరిగిన ఆపరేషన్ సిందూర్ లో కూడా భారత్ దే విజయమంటూ ఆయన అనడం అదే సూచించింది. ఈ టోర్నీలో రెండు జట్ల మధ్య మొత్తం మూడు మ్యాచ్ లు జరిగాయి.. ఫైనల్లో భారత్, పాక్ ని ఉత్కంఠ పోరులో చిత్తు చేసి తన క్రికెట్ ప్రతీకారంతీర్చుకోగలిగింది.
ఒక దశలో పాక్ ఆటగాళ్లు అన్న మాటలేంటంటే.. తాము ఎందుకు ఓడిపోయామంటే.. భారత్ ని ఫైనల్ వచ్చేలా చేసి.. అక్కడ ఓడించి ప్రతీకారం తీర్చుకోడానికీ అన్న కామెంట్లు పెద్ద ఎత్తున హాస్యాస్పదమయ్యాయి. ఆ సరికే గన్ పేల్చిన పోజులు, విమానాన్ని కూల్చామన్న సిగ్నళ్లిచ్చి వివాదాస్పదమైన పాక్ ఆటగాళ్లు.. తర్వాత ఐసీసీ చేత చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇక ఇలాంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా నేరమన్న కోణంలో సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రతీకార చర్యకు ఐసీసీ ద్వారా మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కోవల్సి వచ్చింది. అయినా సరే ఏమంత లెక్క చేయలేదు.. సూర్యా భాయ్. పైపెచ్చు ఆ దేశాన్ని తమకు ప్రత్యర్ధిగా అభివర్ణించరాదని కూడా సూచించారాయన. కారణం.. తమతో ఏ పిచ్ మీద, ఏరకమైన మ్యాచ్ జరిగినా.. వరుసగా ఓడిపోయే టీమ్ ప్రత్యర్ధి జట్టు ఎలా అవుతుందని నిలదీశారు సూర్య.
ఇక ఫైనల్ అయితే టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన పాక్.. తొలుత మంచి ప్రారంభం చేసింది. కానీ ఓపెనర్లు ఔట్ కాగానే, ఆ ఇన్నింగ్స్ కాస్తా పేకమేడలా కూలింది. కుల్ దీప్ అయితే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఆ నాలుగు వికెట్లలో మూడు ఒకే ఓవర్ లో తీసుకున్నాడు. ఇక 147 పరుగుల లక్ష్య చేధన మొదలు పెట్టిన భారత్ .. అభిషేక్ శర్మ రూపంలో ఊచ కోత మొదవుతుందని అందరూ ఆశిస్తే.. అది కాస్తా ఆశ అడియాశే అయ్యింది. ఆపై శుభ్ మన్ గిల్, సూర్య కూడా తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. అయితే ఇండియా చేతులెత్తేయలేదు. తెలుగింటి కుర్రాడు.. తిలక్ వర్మ.. తనదైన బ్యాటింగ్ విధ్వంసంతో కప్పు భారత్ చేజారి పోకుండా కాపాడాడు. దీంతో 9వ సారి ఆసియా క్రికెట్ కింగ్ భారతే అని నిరూపించగలిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తిలక్ వర్మ చేసినవి కేవలం 69 తొమ్మిది పరుగులు మాత్రమే కావు, కోటాను కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు. దీంతో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకి టేక్ అబౌ ఇచ్చి గౌరవించాడు.
ఇక కప్ ఒక పాకిస్తానీ నుంచి అందుకోవడం భారత్ కు నచ్చకపోవడంతో.. ప్రజంటేషన్ సెర్మనీ గంటన్నర ఆలస్యంగా జరిగింది. ఆపై మరొకరి ద్వారా ఇస్తారన్న మాట కూడా వినిపించింది .కానీ.. ఏషియన్ ఛాంప్స్- 2025 ఈ సారి కప్ అందుకోకుండానే టీమిండియా సభ్యులు తమ సెలబ్రేషన్స్ చేసుకోవల్సి వచ్చింది. దీనంతటికీ కారణం పాకిస్థానీయులకు షేక్ హ్యాండ్ ఇవ్వక పోవడం మాత్రమే కాదు, వారిచ్చే కప్పు కూడా మాకు గడ్డిపోచతో సమానం అన్న అర్ధమొచ్చేలా వ్యవహరించింది భారత జట్టు. ఒక దశలో టోర్నీ నుంచి నిష్క్రమిద్దామనుకున్న పాక్ జట్టు.. కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టలేక కొనసాగడం మాత్రమే కాదు.. ఫైనల్ లోనూ భారత్ చేతిలో ఓడి.. భారత్ ముందు తన పరాజయ పరంపరను పూర్తి చేసుకుంది.
దీంతో కదన రంగంలో,క్రికెట్ పిచ్ పైనా.. రెండింటా.. భారత్ ముందు పాక్ దిగదుడుపే అని మరోమారు ప్రపంచానికి అర్ధమయ్యేలా ఈ ఆసియా కప్ జరిగినట్టు భావిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పండ్రా అమెరికన్లూ.. కాల్పుల విరమణ మీరు చేశారా? లేక భారతే పాక్ ని తల వంచేలా చేసిందా? అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఆ మాటకొస్తే ఇండియన్ ఫ్యాన్స్ ఫస్ట్ మ్యాచ్ నే బాయ్ కాట్ చేశారు. పెహల్గాంలో అకారణంగా 26 మంది చావుకు కారణమైన పాక్ జట్టుతో మనం క్రికెట్ ఆడ్డం ఏంటన్నది వీరి వాదన. కాగా.. ఇపుడీ ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ ద్వారా పాక్ కి మరో మారు బుద్ధి చెప్పగలిగింది భారత్. ఇదిలా ఉంటే కొందరు పాకిస్థాన్ క్రికెట్ లవర్స్.. మా క్రికెట్ జట్టు వల్ల మాకెలాంటి లాభం లేదు. సుఖం సంతోషం లేదు.. పాకిస్థాన్ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా కూడా భారత్ పై మేం గెలవడం సాధ్యం కాదు. అందుకే ఐ లవ్ ఇండియా. మేం కూడా టీమిండియా అభిమానులమే.. అనడం కనిపించింది.