వారిని విడదీయడం మహా పాపం

  జగన్ చల్లగా ఉంటే చూసి ఓర్వలేని సీబీఐ అన్యాయంగా ఆయనని చంచల్ గూడా జైల్లో పెట్టి హింసిస్తోంది. ఆయనకు ఏదో కొంచెం మాట సాయం చేసి, తన తెలివి తేటలతో నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టిన పాపానికి, పాపం! విజయసాయి రెడ్డి మీద కూడా సీబీఐ కక్ష పెంచుకొని అన్యాయంగా అతనిని కూడా కటకటాల వెనక్కి తోసేసింది.   అయితే మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుందనే ఫార్ములా ప్రకారం ఆయన తంతే బూర్లె గంపలో పడినట్లు, పోయి పోయి చంచల్ గూడా జైల్లో జగన్ ఒళ్ళోనే పడటంతో, సీబీఐ కరెంటు షాక్కు కొట్టినట్లు త్రుళ్ళిపడింది. వారిద్దరినీ ఒకే జైలులో ఉంచితే న్యూట్రలు, ఫేసు వైర్లు కలిసిపోయినట్లు వారి బుర్రలు మరింతగా వెలిగిపోతాయి, గనుక వారిరువురినీ వేర్వేరు జైళ్ళలో ఉంచాలని కోర్టుకి సీబీఐ సవినయంగా మనవి చేసుకొంది. అయితే, బొమ్మ బొరుసు వలె అతుక్కుపోయున్న వారిరువురిని విడదీయడం కుదరదని కోర్టు కూడా కరాకండిగా తేల్చి చెప్పేసింది. తానొకటి తలిస్తే కోర్టోకటి తలచిందని సీబీఐ వాపోతే, ఈనాటి ఈ బందం ఏనాటిదో’ అని వారివురు చంచల్ గూడా జైల్లో యుగళ గీతం పాడుకొంటున్నారు.

ప్రకృతి విలయం వెనుక మానవ తప్పిదం ..ప్రభుత్వ నిర్లక్ష్యం

....సాయి లక్ష్మీ మద్దాల       ఉత్తరాఖండ్ ...... చార్ ధామ్ .......... ప్రముఖ పుణ్య క్షేత్రాల నిలయమే కాదు. భూకంపాలు, వరద భీత్సాలు,కొండచరియలు,విద్వంసపు విలయాలకు మారుపేరుకుడా! ఈ రాష్ట్రంలో 93%పర్వత ప్రాంతమే. ప్రస్తుతం చోటుచేసుకున్న వైపరీత్యానికి మానవతప్పిదమే కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు. పర్యాటకుల తాకిడిని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన రోడ్లు,భవనాల నిర్మాణం నదులను ఆక్రమిస్తూ హోటళ్ళు,ఇళ్ళ నిర్మాణం ...... ఫలితం .... నేడు రుద్రనేత్రుడి ఆలయ ప్రాంగణం రుద్రభూమిని తలపిస్తోంది. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న పర్యావరణ విద్వంసాన్ని 'కాగ్' మూడేళ్ళ కిందటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. జల విద్యుత్త్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారని,అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది భవిష్యత్తులో పెనుముప్పుగా పరిణమిస్తుందని 'కాగ్ 'హెచ్చరించింది. ప్రాజెక్టుల వల్ల భాగీరధి,అలకనందలు బాగా దెబ్బతింటున్నాయని వివరించింది. ఫలితంగా వర్షాలు ఉదృతంగా పడితే.... వరదలు విలయం సృష్టిస్తాయని 'కాగ్'తెలిపింది. ఈ జల విద్యుత్ కేంద్రాలు... పేలడానికి సిద్దంగా ఉన్న బాంబుల్లాంటివని అభిప్రాయపడింది. ఇక్కడ పట్టనీకరణకు,హైడల్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన మేర విచ్చలవిడిగా అడవులను నరికేస్తున్నారు. పశ్చిమ హిమాలయాలలో ముఖ్యంగా గడ్వాల,కుమనోవ్ ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం విచక్షణంగా అడవులను నాశనం చేస్తున్నారు. వరదలను తట్టుకునే స్వభావం ఉన్న ఓక్ చెట్లను,చిర్ అడవులను నరికేస్తున్నారు. దీనితో నీటిని పీల్చుకోగలిగే,భూమిని బిగువుగా ఉంచగలిగే చెట్లవేళ్ళు లేకపోవటంతో...... కురిసిన వర్షం వరదలా కిందికి దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న పుణ్య క్షేత్రాలను దర్శించుకొనే వారి సంఖ్య క్రమేపి పెరగటంతో ఇక్కడ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కొండల వెంబడి రోడ్లు నిర్మించింది. ఇదే అదనుగా నదీ పరీవాహక ప్రాంతమంత ఆక్రమిత కట్టడాలతో నిండిపోయింది. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు. నదీ తీరానికి 100 మీటర్ల లోపు నిర్మాణాలేవీ చేపట్ట కూడదని 2002లో ప్రభుత్వం నుండి ఉన్న నిషేధాజ్ఞలను నేడు తుంగలో తొక్కిన ఫలితం ఇంతమంది ప్రాణాలకు ముప్పు. ఇవన్ని నేటి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణాలు. కాని ప్రమాదం సంభవించిన తర్వాత,దానికి ముందు ప్రభుత్వం తీరును పరిశీలిస్తే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల అంతగా భాద్యత ఉన్నట్లు కనిపించటంలేదు.                    వారం రోజులుగా తిండి లేదు....... నీరులేదు.... పొంచి ఉన్న ప్రమాదం గురించి అక్కడి ప్రజలను ముందుగా హెచ్చరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము చేయలేదు,అక్కడి రాష్ట్ర ప్రభుత్వానినికి అంతటి వైపరీత్యాన్ని అంచనా వేసే వాతావరణ పరిశీలనా కేంద్రములేదు. ఇది ఎవరి తప్పిదం. నదుల క్యాచ్ మొనిట్ ఏరియాలో వర్షం పడిన వెంటనే వరదలు రావని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. భారీ వర్షం మొదలైన 15 గంటల తర్వాత  నదులకు నీటి తాకిడి పెరిగి వరదలు సంభవిస్తాయని వారు ఇస్తున్న సమాచారం. జూన్ 16న 340 మి॥ మీ ॥ వర్షపాతం నమోదు అయింది. ఇది ఆ ప్రాంతం లో 375%ఎక్కువ. దీనిని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయటంలో అలసత్వం వహించింది. పోనీ ఆతరువాత అయినాయుద్ధ ప్రాతిప్రదికన పనులు చేపట్టటం లోను ప్రభుత్వం ధోరణి ప్రజలకు చాల అసహనాన్ని కలిగిస్తోంది. వరదల్లో చిక్కుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని రక్షించ టంలో ఉన్న చొరవ,అక్కడి వరదల్లో చిక్కుకున్న యాత్రికులను రక్షించటం లో కనబరచలేదు. ముఖ్యంగా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించటానికి కుడా వెనుకాడుతున్నారు. ఇక్కడ చేపట్టిన చర్యలలో ప్రభుత్వ అధికారుల మద్య సమన్వయం కొరవడిందని సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి షిండే వ్యాఖ్యానించటం మరింతగా ప్రభుత్వ అలసత్వాన్ని తేట తెల్లం చేస్తోంది.             ఎవరి తీరు ఎలా ఉన్న సైన్యం సేవలను అక్కడి ప్రమాదం నుండి బయట పడిన యాత్రికులు వేనోళ్ళ కొనియాడుతున్నారు. వారి సేవలు అనిర్వచనీయం. గతంలో నిర్భయ వ్యవహారంలోనూ కేంద్రం రెండు,మూడు రోజులు ఆలస్యంగా స్పందించింది. అన్నాహజారే విషయంలోనూ వారం రోజులు ఆలస్యంగా స్పందించింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోను మూడు రోజుల తర్వాత స్పందించింది. అన్నిటికి మించి ఆప్రాంతాని నష్ట పరిహారంగా 143 కోట్లు ప్రకటించటం అంటే,అసలు అక్కడ సంభవించిన నష్టాన్ని అంచనా వేయటంలో కుడా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా?ఇప్పటికైనా దేశంలోని ఆక్రమిత నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి వాటిని తక్షణం ఖాళి చేయించే చర్యలను చేపట్టక పోతే భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలను చూడవలసి వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రమాదం హైదరాబాదుకు పొంచి ఉంది,మూసి పరివాహక ప్రాంత ఆక్రమణలతో.     

రాజకీయ శాసనసభ

.....సాయి లక్ష్మీ మద్దాల       మొత్తం మీద శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 20 రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ప్రజాసమస్యలు పక్కదారి పట్టినాయి. 294 మంది సభ్యులలో సభకు హాజరైనది ఎంత మంది. ఈసారి శాసనసభ సమావేశాల కోసం వినియోగించిన సమయం అక్షరాల 57 గంటల 29 నిముషాలు. ప్రజాసమస్యల మీద సభలో గళమెత్తవలసిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో పాదయాత్ర లో మరోసారి సమావేశాలలో అమెరికా యాత్రలో బిజీగా ఉన్నారు. ఉన్న కొద్దిమంది తే.దే. పా ఎం.ఎల్.ఎ లకు కళంకిత మంత్రుల మీద ఎదురుదాడి చేయటమే సరిపోయింది. అందులో ప్రజావాణి ఎందరిది?విమర్శల గోల ఎవరిదో?ప్రజలకు అర్ధంకాని పరిస్థితి. పార్టీల ఎజెండాలో ప్రజాసమస్యలు ఎక్కడా చర్చకు రాలేదు. ఆరంభసూరత్వంగా చర్చలు మిగిలినాయి.   విపక్షాల వాకౌట్లు,నిరసనలు,సస్పెన్షన్లతోనే  సభాసమయాన్ని పూర్తిగా వృధా చేశారు. కేవలం బిల్లుల ఆమోదం కోసమే సభా నిర్వహణ జరిగిందా?16 బిల్లులు,8 పద్దులకు సభ ఆమోదం లభించింది.ఆకోవలోనే ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందింది. కొన్ని సందర్భాలలో అధికారపక్ష  నేతలు,మంత్రులు కొందరు లేకుండానే బిల్లుల ఆమోదం జరిగిపోయింది. నిభందనల మేరకు శాసనసభ కనీస సమయం 144 గంటలు. కాని ఈ  57 గంటల సమయాన్ని వెచ్చించి మాత్రం ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రులు ఏమి సాధించారు?

చాప క్రింద నీరులా పేరుకుపోతున్న అవినీతి

  రాజకీయనాయకులు, అధికారులు, అవినీతి ఈ మూడు కలిస్తే ఏర్పడేదే ప్రభుత్వం. ఈ నిర్వచనం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే, అక్కడ ఎవరూ ఎవరికీ జవాబు దారీ కారు. ఇక విషయానికి వస్తే, కళంకిత మంత్రులను నిర్లజ్జగా, నిర్బీతిగా వెనకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి చాప క్రింద నీరులా ఎప్పుడూ ఉండనే ఉంటుంది.   అవినీతి నిరోధక, విజిలన్స్, పోలీసు వంటి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలు దాదాపు 400పైనే పేరుకుపోయున్నాయి. రెవెన్యు, మునిసిపల్, ఆరోగ్యం, నీటిపారుదల వంటి అనేక ప్రభుత్వ శాఖలలో అవినీతి, లంచగొండి అధికారులను వలపన్ని పట్టుకొని, , వారిపై శాఖా పరంగా మరియు సివిల్, క్రిమినల్ కేసులు నమోదుచేసి వెంటనే తగిన చర్యలు తీసుకోమని కోరినప్పటికీ, నేటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. కారణం కొందరు కాంగ్రెస్ నేతలతో సదరు అధికారులకు ఉన్న సత్సంబందాలే. వారిపై దైర్యం చేసి చర్యలు తీసుకొన్నట్లయితే, పార్టీలో, ప్రభుత్వంలో కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. గనుక, ఏ నిర్ణయమూ తీసుకోకుపోవడమే ఒక నిర్ణయంగా మారింది.   దీనివల్ల ప్రభుత్వాధికారులకి మరింత దైర్యం కలిగితే, వారిని శ్రమ పది పట్టుకొన్న విజిలన్స్ మరియు అవినీతి శాఖల అధికారుల మనో దైర్యం నానాటికి సన్నగిల్లి నిర్లిప్తత ఏర్పడుతుంది.   కేవలం అవినీతి, లంచ గొండి అధికారులను పట్టుకోవడమే కాక, వివిధ శాఖలలో, ప్రభుత్వ పధకాల అమలులో అవినీతి బీజాలు పడుతున్నపుడే వాటిని కనిపెట్టి విజిలన్స్ శాఖ ప్రతీనెలా టంచనుగా హెచ్చరిక నివేదికలు కూడా పంపుతుంటుంది. అంటే అవినీతిని మొగ్గ దశలోనే త్రుంచేసే వ్యవస్థ కూడా మనకి ఉందన్న మాట. అయితే, కిరణ్ ప్రభుత్వం కనీసం ఈ హెచ్చరికలను సైతం ఖాతరు చేసే పరిస్థితిలో లేదని ఆయన వద్ద పేరుకుపోయిన 197 (2011); 176 (2012); 228 (2013) నివేదికలు తెలియజేస్తున్నాయి.   కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇంత వరకు విజిలన్స్ మరియు అవినీతి నిరోధక శాఖలు మొత్తం 395 నివేదికలు పంపి వెంటనే తగిన చర్యల కోసం సిఫార్స్ చేస్తే వాటిలో కనీసం ఒక్కటి ఇంతవరకు పరిష్కరించలేదు. వాటిలో 148 మంది ప్రభుత్వంలో అత్యున్నత పదవులలో ఉన్నవారిపై చర్యలకి సిఫార్సు చేయబడినవీ ఉన్నాయి. అయితే షరా మామూలుగానే ఆ నివేదికలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో బూజులు పడుతున్నాయి.   ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో పనులు ఏవిధంగా జరుగుతాయో ఎవరయినా ఊహించవచ్చును. తాజా లెక్కల ప్రకారం గత 3 నుండి 12 సం.ల కాలంలో పంపబడిన 1987 నివేదికలతో కలిపి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మొత్తం 2,966 నివేదికలు పోగుబడి ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గిర పడినప్పుడు రైతుల రుణాలు, వడ్డీలు మాఫీ చేసినట్లు, సదరు ప్రభుత్వాధికారులను మంచి చేసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ నివేదికలన్నీ బుట్ట దాఖలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.   ఇక, అటువంటప్పుడు ప్రభుత్వ శాఖలలో అవినీతి గురించి ఎంత చర్చించుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం?

కళంకిత మంత్రులు నిర్దోషులని ముఖ్యమంత్రి జడ్జిమెంట్

  ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రా రెడ్డి ఇద్దరు రాజీనామా చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తాము నిర్దోషులమని, కోర్టు కేసులోంచి త్వరలోనే బయటపడతామని అన్నారు. వారి మాటలను పట్టుకొని వారిరువురూ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ మరో కొత్త కేసు పెట్టింది. కళంకిత మంత్రుల వ్యవహారం కోర్టులో ఉంది గనుక దానిపై మాట్లాడటం తగదంటూనే సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా అవే అభిప్రాయలు వ్యక్తం చేయడమే కాకుండా కళంకిత మంత్రులందరూ నిర్దోషులని ఆయన జడ్జిమెంటు కూడా ఇచ్చేసారు.   శాసనసభలో జరిగే చర్చలు కోర్టు పరిధిలోకి రాకపోవచ్చు గాక, కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా శాసన సభ సాక్షిగా తన మంత్రులు నిర్దోషులని, వారికి న్యాయ సహాయం చేస్తామని ప్రకటించడాన్ని సాక్షులను ప్రభావితం చేయవా? అటువంటప్పుడు సీబీఐ ఏవిధంగా స్పందించాలి?   ఇక, కాంగ్రెస్ అధిష్టానం కళంకిత మంత్రుల విషయంలో కటినంగా వ్యవహరించి వారికి ఉద్వాసన చెప్పించిన తరువాత కూడా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని ఇంకా వెనకేసుకు రావడం గమనిస్తే, ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయాన్నిఇప్పటికీ వ్యతిరేఖిస్తునట్లు అర్ధం అవుతుంది. మరి దీనిని బట్టి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్రమంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అడుగు జాదలలోనే నడుస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే తానే అన్నవిధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి ఆయన ధోరణిని కాంగ్రెస్ అధిష్టానం సమర్దిస్తుందా? లేక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఆయన ఈ ధిక్కార ధోరణిని చూసి చూడనట్లు ఊరుకొంటుందా?   ఇక శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించవలసిన ముఖ్యమంత్రి మరియు శాసనసభ్యులు అందరూ తమ బాధ్యతలు మరిచి కళంకిత మంత్రులపైనే తీవ్ర వాదోపవాదాలు చేయడం ఎంతవరకు సబబు? దానివల్ల ప్రజలకి ఒరిగేదేమిటి? వారి వారి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సభలో ఈ విధంగా గంటలు గంటలు వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సమయాన్ని, అంతకంటే విలువయిన ప్రజాధనాన్ని వృధా చేయడం విచారకరం.

కేంద్రంలో మంత్రివర్గ 'విస్తరి '

......సాయి లక్ష్మీ మద్దాల       కేంద్రమంత్రివర్గ విస్తరణ కారణంగా దేశానికి, తద్వారా ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. కేవలం 2014 ఎన్నికల దృష్టితోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రయత్నం చేసిందనేది అందరికి తెలిసిన విషయం. కాకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ 77 మంది సైన్యంతో తన కొలువును నింపుకున్నారు. అసలే కుంభకోణాల మాయమై పోయిన కేంద్ర సర్కారుకు తాజా విస్తరణ కారణంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కోవచ్చు అనే అభిప్రాయం ఉండవచ్చు. యు. పి. ఎ తొలివిడత పాలన పట్ల పెరిగిన ప్రజావిశ్వాసంతో తమ బాధ్యతను గుర్తెరిగి మరింత సమర్ధవంతమైన మంత్రివర్గకూర్పు ఉంటే ప్రజలకు మరోసారి తమపట్ల విశ్వాసాన్ని కలిగించిన వారయ్యేవారు. అక్కడ ప్రదానికే స్వేఛ్చ లేని విస్తరణ. ఇహ దీనివలన ఎవరు లాభనష్టాల బేరీజు వేసుకోవాలి? జనం ఆకాంక్షల్ని తీర్చే ధీటైన ప్రభుత్వం ఇదికాదు. అసలు మంత్రివర్గమంటే ఏమిటి? ఐక్య ప్రగతిశీల కూటమి. కాని నేటి పాలక కూటమిలో ఐక్యత ఎక్కడుంది? భయపెడుతున్న ఆహారద్ర వ్యోల్భణం రోజురోజుకి పడిపోతున్న రూపాయి విలువ,గుండెబేజారేత్తిస్తున్న కరెంటు ఖాతా లోటు ...... ఇంకా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో భారత ప్రగతి ఆగిపోయింది. ఒకనాదు ఆర్ధిక శాస్త్ర వేత్తగా ఈ దేశాన్ని ప్రగతి పధంలో నడిపించిన వ్యక్తి పాలనలో నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి కారణం ఎవరు? ఆయన నోరుమెదపలేని మెతకవైఖరి కాదా? మరి ఈఆర్ధికసంక్షోభం గురించి ఆలోచించే ప్రయత్నం అంటే వారి దృష్టిలో అసలు ఉందా? నిర్ణయ రాహిత్యం,పారదర్సకత లేని నిధులవ్యయమ్ వెరసి పారిశ్రామికరంగం కుప్పకూలుతున్న వైనం.                సత్వరాభివ్రుద్ధిని గాలికి వదిలేసి లక్షల కోట్లకుంభకోణాలలో మన్మోహన్ ప్రభుత్వం కూరుకుపోయి ఉంది. నాలుగేళ్ళలో రైల్వే శాఖకు ఆరుగురు,మిగతా వివిధ శాఖలకు ముగ్గురేసి,నలుగురేసి మంత్రుల చొప్పున మారిపోయిన ఏలుబడిలో ఇప్పుడు కొత్తగా పరచిన మంత్రి వర్గ విస్తరి ఎవరి కడుపు నింపటానికి? అవినీతి నిర్నయరాహిత్యం ఇవి రెండు ప్రభుత్వాన్ని తద్వారా ప్రజలను పట్టిపీడిస్తున్న అంశాలు. వాటినుండి ఈ తొమ్మిదేళ్ళలో ఈ దేశ ప్రజలను రక్షించే ప్రయత్నం ఏలినవారు ఎన్నడూ చెయ్యలేదు. మాటికిముందు మంత్రి వర్గ విస్తరణ పేరుతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకుంటూ సదరు మంత్రులను సంతుష్ట పరుస్తున్నారు తప్పించి.

ఛలో అసెంబ్లీ హిట్టా ఫట్టా

.....సాయి లక్ష్మీ మద్దాల       తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు. ఇది చాలామంది తెలంగాణా వాదుల సందేహం కూడా. ఇంతకు ముందు తలపెట్టిన తెలంగాణా మార్చ్ లో కూడా కె.సి.ఆర్ పాల్గొనలేదు. అంటే వారు పిలుపునిస్తారు కానీ వారు మాత్రం ఫామ్ హౌసులొ విశ్రాంతి తీసుకుంటారు. చదువుకోవలసిన విద్యార్ధులు వారి భవిష్యత్ నాశనం చేసుకోవాలి, రోజు కూలీలు వారి బ్రతుకు నష్ట పోవాలి కాని గులాబి బాస్ మాత్రం అంత అయిపోయిన తర్వాత తెలంగాణ బంద్ కు మళ్ళి పిలుపునిస్తారు. మల్లి ఇక్కడ నష్టపోయేది అదే సామాన్య ప్రజానీకం. అసలు నిన్న జరిగిన ప్రహసనాన్ని చూస్తే రాజకీయ నాయకులు అంటేనే జుగుప్సగా అనిపిస్తోంది. ఎవరికి వారే రాజకీయ లబ్ధి కోసం పార్టీలతో సంబంధం లేకుండా రోడ్డెక్కి ఛలోఅసెంబ్లీఅని నినాదాలు,అరెస్టులు విపరీతమైన రాజకీయ నాటకాలు. ఏరాజకీయ లబ్దికోసం వీరు ఇంతగా తాపత్రయ పడుతున్నారో ప్రజలకు అర్థం కావటంలేదనే భ్రమలో వారు ఉన్నారు. కానీ ప్రజలకు అన్ని తెలుసు. కానీ ఒక్క విషయంలో వీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభాపతులుగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు సభా మర్యాదను కాపాడుతామని,సభ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని ప్రమాణం చేసిన ఈపెద్దమనుషులు నిన్న అన్నీ మర్చిపోయారా? వారి రాజకీయ స్వార్ధం ముందు సభ దాని విలువ,మర్యాద , గౌరవం  అన్ని మంట గలసి పోయాయా? ఈనాడు శాసనసభ పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించిన వీరికి మళ్ళి ఎన్నికలలో నిలబడే అర్హత ఉందా? ఎన్నికల కమీషన్ ఎలాంటి చర్యలు వీరి మీద తీసుకోదా?

అద్వాని రాజీనామా నాటకాలెందుకు?

  .....సాయి లక్ష్మీ మద్దాల         మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు. కానీ మధ్యలో రాజనాధ్ సింగ్ రాయబారాన్ని కాదు. అసలు అద్వాని ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు? నరేంద్ర మోడీకి కేవలం గుజరాత్ ప్రజల జనాకర్షనే తప్ప, దేశ ప్రజల జనాకర్షణ లేదని అద్వాని అభిప్రాయం. అలాంటివాడు ప్రజాస్వామ్యంలో దేశనేత కాలేడు అని ఆయన పిడి వాదం కుడా. కాని మరి అద్వాని ఎ ప్రజాకర్షణతో బి. జె. పి అధ్యక్షుడు అయ్యాడు.   అద్వాని మొన్న రాజీనామా చేసినా, నేడు దానిని ఉపసంహరించుకున్నఅది ఎవరికోసం? ప్రజల కోసమా? పార్టీ కోసమా? పదవి కోసమా? ఈ ప్రశ్నలన్నిటికి  సమాధానం దేశ ప్రజలకు అద్వాని వివరించాలి. ఇలా మొహం చాటేయటం కాదు ఒక అనుభవఘ్నుడైన రాజనీతిఘ్నుడు చేయవలసింది. బి. జె. పి.. ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యం లోనే నడుస్తుందని మోహన్ భగవత్ రాయభారంతో మెత్తబడిన అద్వాని వైఖరే స్పష్టం చేస్తోంది. మరి అద్వాని సారధ్యంలోని బి.జె. పి కి ఏ ముద్ర వేయాలి? దానికి మళ్ళి రాజీనామా, ఉపసంహరణ అంటూ ఇంత ప్రయోగాత్మకమైన చవుకబారు నాటకాలెందుకు? ఈ మొత్తం ఉదంతంతో దేశప్రజలకు అద్వాని గురించి ఏమని అర్ధం కావాలి? అద్వానీ కేవలం ఒకరాజకీయ నాయకుడే కాని, రాజనీతిఘ్నుడుకాడు అనా !.....     

చల్లబడ్డ అద్వానీ !

..... గోపి చిల్లకూరు     మొత్తానికి RSS చీఫ్ మోహన్ భగవత్ గారి అభ్యర్ధన మేరకు అద్వానిజి సర్దుకొన్నారు. రాజీనామ ఉపసంహరించుకొన్నారు. ఒక యోధుడి రాజీనామా ఒక్కరోజు లో ఎంతటి పెను తుపాను BJP లోను ,దేశం మొత్తం మీద కలిగించిదొ చూసాము . గౌరవం పెద్దరికం లేకుండా ఏ పార్టీ కి మనుగడ వుండదు ,తన రాజీనామా ధిక్కారం తో పార్టీ లో తన స్థాన మేంటో ఒక్కరోజులో తెలియ చెప్పారు.   BJP పార్టీ ఎందరో జీవితాలు ఫణంగా పెట్టి నిర్మించుకొన్న పార్టీని ఒక వ్యక్తీ గద్దలా తన్ను కేలుతుంటే కొంచెం ఆపగలిగారు. పార్టీలో మోడిజి లాంటి వారు ఎందరిదో త్యాగఫలం ఈ నాటి కమలం వికాసం అని గట్టిగా చెప్పగలిగారు. గుజరాత్ లో RSS చేయలేని పని అద్వాని కేంద్రంలో చేయగలిగారు. గుజరాత్ లో మోడీ గారి దెబ్బకు RSS ప్రముఖులు ఇతర ప్రాంతాలకు మారిపోయారు . గతంలో RSS కేంద్ర నాయకులు Vaidya గారు కూడా BJP మాజీ అధ్యక్షుడు గడ్కరికి పదవికి ఎసరు వచ్చినపుడు ఇది నరేంద్ర మోడీ గారి వర్గం కుట్ర వల్లే అని మాట్లాడినది మల్లి మోడీ వర్గీయుల భయంతో ఖండించినది మనకు తెలిసిందే. గుజరాత్ లోని BJP పార్టీ ని మోడీ గారు  మ్రింగేసి మోడీ బ్రాండ్  పార్టీ గా మార్చింది . ఇప్పుడు గుజరాత్ లో వున్నది మోడీ వ్యక్తీ పార్టీ తప్ప BJP కాదు అన్నది మన కందరికీ తెలిసిందే !.       సరిగ్గా దీనినే అద్వాని గారు వ్యతిరేకించారు . ఒక వ్యక్తీ  పూజ ఏ పార్టీ కి మంచిది కాదు ,దాని నుంచి BJP బయటపడాలి  అన్నది తేల్చి చెప్పారు .      ఏ పార్టీ కి ప్రజల సంపూర్ణ మద్దత్తు లేక సంకీర్ణ యుగాలు దశాబ్దాలుగా  నడుస్తున్న సమయం లో భాగస్వామ్య పార్టీ లు లేకుండా కేంద్రం లో ప్రభుత్వాలు ఏర్పడవని అద్వాని గారికి 13 రోజుల్లో ఒకసారి  ,13 నెలల్లో ఒక్క ఓటు తేడాతో మరొక్క సారి  BJP ప్రభుత్వం పడి పోవడం అనేది స్వయానా నేర్చుకొన్న గుణపాటం కనుక ,సర్వం మోడియే,ప్రతి దానికి మోడీ బ్రంహస్రం  అంటూ మోడీ చుట్టూ తిరుగుతున్నా BJP ని  తన రాజీనామా ద్వార  సరి అయిన కక్షలో పెట్టడానికి ప్రయత్నిచారు .      గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా 2004 లో అత్యుత్సహముతొ సోనియా గాంధీ ,రాహుల్ ,ప్రియాంక గాంధీ ల విదేశీయత పై ఎక్కువ ఆగమాగం చేసి వారికి ఢిల్లీ లో  ఇల్లు కూడా ఇవ్వకూడదని మాట్లాడి ప్రజల్లో  వారి పట్ల సానుభూతి తెప్పించిన  అయన  వివాదాస్పద  వాక్యలు BJP ని ఇరుకున పెట్టి న  సంగతి తెలిసిందే !.    అదేవిదముగా ఈ మద్య మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ని ఇబ్బంది పెట్టిన విషయం విదితమే .అలాగే మోడీ గారి దేశభక్తి ,గుజరాత్ అభిరుద్దిని ,క్రియ శీలక నాయకత్వ లక్షణాలను ఎవరు కాదనలేరు కాకపోతే వ్యక్తీ పూజ ఎక్కువై పార్టీ సున్నా అయ్యే పరిస్థితి ఏ పార్టీ కి మంచిది కాదు .      BJP లో రగిలిన  భోగి మంటల్లో వేడి నీళ్ళు కాచుకొంటూ కాంగ్రెస్ కు ఇప్పుడు మల్లి మంచి రోజులు మొదలైనట్లు నేటి వరకు తెగ సంబరపడి అద్వాని జి BJP లో సర్డుకోగానే అధికారం పై BJP కి ఎందుకో అంత యావ అంటున్నది .       "ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు BJP లో వాజపే యి మంచోడు అద్వానీ తోనే నరకం అనే వాళ్ళు (Vajpayee is right person in wrong party అనే వారు )  ఇప్పుడు పాపం అద్వానీ చాలా మంచోడు  మోడిజి తో నరకం అంటున్నారు ! ". ఇదే కాంగ్రెస్ మార్కు రాజకీయం !.  అది అర్దం కాకపోతే BJP కి బ్రతుకు భారం అవుతుంది. BJP లో అనైక్యత పై ద్రుష్టి పెట్టి  అందరిని కలుపుకొని పార్టీ ని ఎన్నికలకు సిద్దం చేయాల్సిన అవసరం భాద్యత నరేంద్ర మోడీ గారి మీద  వున్నది .  

సమాచారహక్కు చట్ట పరిధిలోకి రాజకీయ పార్టీలు

        ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలకు,ఆకాంక్షలకు స్వరాన్నిచ్చేవి,వాటి సాధన కోసం కృషి చేసేవి రాజకీపార్టీలే. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధికార,విపక్షాలు మధ్యనిరంతరం సాగే చర్చ ....వాటి మధ్య ఉండే స్పర్ధ ..... ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయాలి. మొత్తం మీద సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళగలగాలి.     కాని నేడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా నీతి,నిబద్ధతలను పాటించటం మానేశాయి. ఏపార్టీ చరిత్ర  చూసినా అవినీతిమయం. ఎవరూ ఎలాంటి పారదర్శక మైన పాలనను అందించే స్థితిలో లేరు. పార్టీల విపరీత పోకడల ఫలితంగా నేడు ఎన్నికల ప్రక్రియ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయి,నల్లధనం ప్రభావం ఎక్కువై పోయి దేశ ఆర్ధిక వ్యవస్థ జవసత్వాలను తల్లక్రిందులు చేస్తున్న పరిస్థితిని ప్రజలు చూస్తున్నారు.              వీటన్నిటిని నేపధ్యంలోనే కేంద్ర సమాచార (సి . ఐ .సి )కమీషన్ రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబు దారీ కావాలని తీర్పునిచ్చింది. సి. ఐ. సి పూర్తిస్థాయి ధర్మాసనం రాజకీయ పార్టీలన్నీ కూడా సమాచారహక్కు చట్టం కింద ప్రజాసంస్థలేనని తేల్చి చెప్పింది. దీనిప్రకారం పార్టీలన్నీ తమకు అందుతున్న నిధులన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయో,వాటిని ఏ రకంగా ఖర్చుపెడుతున్నారో వెల్లడించాల్సిన్దేనని స్పష్టం చేశాయి. దీని ప్రకారం కేవలం రాజకీయ పార్తీలేకాదు,ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు అందరు ఈసమాచారహక్కు చట్టుం పరిధిలోకి రావాలి. అపుడే వారి వారి వ్యక్తిగత ఆస్తుల వివరాలు,వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిస్థాయి నిజానిజాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలు వాటిపై పూర్తిస్థాయిలో ఆయా ప్రతినిధులను నిలదీసే హక్కును కలిగిఉంటారు. అపుడే అవినీతి చాలా వరకు కట్టడి చేయగల పరిస్థితి ఉంటుంది.                            ధీరూభాయి అంబానీ నుండి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు రాజకీయాలను ఉపయోగించుకుని వారి వ్యాపార సామ్రాజ్యాలను ఎలా విస్తరించుకున్నారనేది జగమెరిగిన సత్యం. అంటే నేడు రాజకీయాలను అంతర్గతంగా శాసిస్తున్నది పారిశ్రామికవర్గాలే. ఈ చట్టం పరిధిలోనికి రాజకీయపార్టీలను,ప్రజాప్రతినిధులను తీసుకురావటం కారణంగా అంబానీలు, బిర్లాలు,టాటాలు వంటిపారిశ్రామికవేత్తలు ఏఏ పార్టీలకు ఎంతెంత విరాళాలు ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలుసుకొనే వీలుకలుగుతుంది.                          అంతేకాదు ఈ కమీషన్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో పాటిస్తున్న మార్గదర్శకాలేమిటో చెప్పాలని కోరింది. దీనిమూలంగా సమర్ధులైన అభ్యర్థులను పక్కకు తప్పించి కేవలం అసమర్దులైన అభ్యర్ధులను ఎలా ఎంపిక చేస్తున్నారనే విషయం ప్రజలకు అవగతమవుతుంది.                                                             ఈ సమాచార హక్కు చట్టం కారణంగా వివిధ రకాల కుంభకోణాలు అన్నీ నేడు వెలుగు చూస్తున్నాయి. నేడు రాష్ట్రంలో వివిధ రకాల రాజకీయపార్టీలు,ఒక్కొక్కరికి ఒక్కో పేరుమోసిన ప్రాంతంలోవిలాసవంతమైన పార్టీ భవనాలు . వీటన్నిటికి అయ్యేఖర్చు ప్రజాధనమే కదా !మరి వీరంతా ప్రజలకు జవాబుదారీ ఎందుకు కారు ?అడ్డదారుల్లో వేల కోట్లను పోగేసుకొనే వెసులుబాటును వదులుకొనే ప్రసక్తే లేదని నేడు పార్టీలు మొరాయిస్తున్నాయి.                        బ్రిటన్ లో సర్ క్రిస్టోఫర్ కెల్లి నేతృత్వంలోని కమిటీ వ్యక్తులైన,సంస్థలైన ఏ రాజకీయపార్టీకి ఏడాదికి  పదివేల పౌండ్లును మించి విరాళాలు ఇవ్వరాదని నిర్దేశించింది. అలాంటి కతినమైన నిర్ణయాలు మన ప్రజాస్వామ్యదేశంలో కూడా ఖచ్చితంగా ఉంది తీరాలి. ఏ పారిశ్రామికవేత్తలైన నిర్దేశిత మొత్తంలోనే పార్టీ నిధులకు విరాళాలు అందించాలి. అందించిన మొత్తానికి జమా,ఖర్చులను ప్రజలకు ఆయాపార్టీలు నివేదించాలి.               అలాజరిగినప్పుడే ఈ రాజకీయనేతల పిల్లలు ఏ పారిశ్రామికవేత్త అండదండలతో విదేశాలలో చదువులు, వ్యాపారాలు కొనసాగిస్తున్నారో ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుఉంటుంది. అన్నింటికీ మించి ఈ సమాచారహక్కు చట్టాన్ని ప్రజలు తమ చైతన్యవంతమైన ఆలోచనలకు పదును పెట్టటం ద్వార వినియోగించుకోగలగాలి. అపుడే అడుగంటిపోతున్న ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలే రక్షించుకున్న వారవుతారు.    

బిజెపి తెలం 'గానం'

        జూన్ 3న హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణ ఆత్మ గౌరవ సభలో బిజెపి తరపున పలువురు నేతలు ప్రసంగించటం జరిగింది. ఆ సభలో వారు ప్రసంగిస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లు పెట్టండి.... మేం మద్దతు ఇస్తాం అంటూ కాంగ్రెస్ ను ఆదేశించారు. 2004లో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందని, అందుకే యువత ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈసభ ద్వారా నాగం జనార్ధన రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకూడా బిజెపి ద్వారానే తెలంగాణా సాద్యం అంటున్నారు.   ఈ మొత్తం విషయాన్నీ ఒకసారి పరిశీలిస్తే .. 1997 లొ ఒకవోటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వాజపాయ్ నేతృత్వంలోని బిజెపి తరువాత తెలంగాణా అంశాన్ని ఎందుకు థాటవేసింది? ఆనాడు కేంద్ర హోమ్మంత్రి గా ఉన్న అద్వాని తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ రాజధాని హైదరాబాద్ తెలంగాణా మద్యలో ఉన్నది కనుక ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని చెప్పారు. ఇపుడు బిజెపిలోకి కొత్తగాచేరిన నాగం జనార్ధనరెడ్డిది మరోచిత్రమైన వైఖరి. 1977 లో టిడిపితో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి చత్తీస్ ఘడ్ ,జార్కండ్ ,ఉత్తరాంచల్  అనే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, తెలంగాణాను టిడిపి అడ్డుపడిన కారణంగా ఏర్పాటు చేయలేదని ఇపుడు చెపుతున్నారు. మరి ఇప్పుడు కూడా బిజెపి ఎవరొవకరి పొత్తులేకుండా అధికారంలోకి రాలేదు. అలా జరిగితే మళ్ళీ ఎవరొవొకరి పెత్తనానికి తలవచి తెలంగాణా అంశాన్ని పక్కకు నెట్టరు అన్న గ్యారెంటీ ఏమిటి? నాగం జనార్ధనరెడ్డి చెప్పినప్రకారం ఆనాడు టిడిపి అడ్డుపడిన కారణంగానే తెలంగాణా ఏర్పడలేదంటే, మరి  ఇన్నేళ్ళు  ఆయన తెలంగాణా వాదిగా టిడిపిలొ ఏన్నో మంత్రి పదవులు అనుభవిస్తూ ఎందుకు కొనసాగారు. అసలు అన్నిటికి మించి ముఖ్యంగా నాది "సమైఖ్యవాదం", నేను సమైఖ్యవాదిని అంటూ టిడిపిని స్థాపించిన అన్న నన్దమూరి తారక రామారావు పార్టీలో 30సం'ల క్రితం ఈయన చేరినపుడు మరి తెలంగాణ వాదం ఎటుపోయింది? సమైఖ్యవాదిని అని వ్యాఖ్యానించిన ఎన్.టి.ఆర్ హయాంలోనూ, తరువాత చంద్రబాబు హయాంలోనే కదా తెలంగాణ అభివృద్ధి సాధించింది. మరి నాగం ఆరోజు పదవులు అనుభవిస్తూ తెదేపాలో ఉండి, ఇపుడేమో తెలంగాణ ఆత్మగౌరవం అంటూ, వింత వ్యాఖ్యానాలు చేయటం ఎంతవరకు సబబు. నిన్నగాక మొన్నతెలంగాణ నగారా అంటూ బాకా ఊదిన నాగం,నేడు ఆ నగారా ఎవరికీ వినబడక పోయేసరికి ఇపుడు కొత్తగా బిజెపిలో చేరి, తన సీటును, రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఐన చిన్న రాష్ట్రాలుగా విడగొట్టి బిజెపి సాధించిన అభివృద్ధి ఏమిటి? నేడు ఆ రాష్ట్రాలు మావోయిష్టుల హస్తగతమై, నిత్యం నెత్తురోడుతున్న వైనం బిజెపి మూటగట్టుకున్న పాపం కాదా?  ఏది ఏమైనా నేడు ప్రతి ఒక్కరిది రాజకీయ దురాశ. ఈనాడు మనం చూస్తున్నది రాజకీయ చదరంగం. ఎవరు ఎంత తెలివిగా ఈ చదరంగంలో పావులు కదప కలిగితే అంతగా రాజకీయ లబ్ధి పొందిన వారవుతారు. అంతేకాని ఏ ఒక్కరికి ప్రజాసంక్షేమం పట్టదు. ఏ ఒక్కరికి సమర్ధ పాలన అందించే సత్త గాని,ధైర్యం గాని లేవు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి.  

బాబు గారి థర్డ్ ఫ్రంట్ జపం

        రాబోయే రోజుల్లో మళ్లీ థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికలకు ముందో తరువాతో థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని, సుస్థిర, సమర్థ పాలన అందిస్తుందని, ఇందుకోసం తెదేపా కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు నాయుడు మహానాడులో వ్యాఖ్యానించారు.   13 పార్టీల కూటమితో యునైటెడ్ ఫ్రంట్ 1996లో ఆవిర్భవించింది. ఈ ఫ్రంట్ కి కన్వీనర్ చంద్రబాబు నాయుడు. 1996 నుండి 1998 వరకు ఈ ఫ్రంట్ ఆధ్వర్యంలో రెండు ప్రభుత్వాలు నడిచాయి. దేవె గౌడ ప్రధానిగా ఒక  ప్రభుత్వం, ఐ. కే. గుజ్రాల్ ప్రధానిగా మరొకటి. ఈ థర్డ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నడిచిన నాటి కేంద్ర ప్రభుత్వాలు రెండు పెద్దగా సాధించిన విజయాలేవి లేవు. ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. దేవె గౌడ ప్రధానిగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన వ్యవహరించిన తీరు దేశానికి ప్రధానిగా కాక కర్ణాటకకి ప్రధాని అన్నట్లు ఉండేది.        ఈ థర్డ్ ఫ్రంట్ ఓటమి పాలైన తరువాత 1999 నుండి 2004 వరకు పరిపాలించిన వాజ్ పేయ్ నేతృత్వం లోని ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని 5 సం. రాలు చంద్రబాబు ఎందుకు సమర్ధించారు?థర్డ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడు? థర్డ్ ఫ్రంట్ లో కాని, ఎన్ డి ఎ లో కాని కింగ్ మేకర్ పాత్ర పోషించిన తెదేపా మరోసారి థర్డ్ ఫ్రంట్ తో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కలలు కంటోంది. అప్పుడు కింగ్ మేకర్ గా రెండు సార్లు వెలుగు వెలిగిన చంద్రబాబు రాష్ట్రానికి సాధించి పెట్టింది ఏమిటి? బాలయోగికి స్పీకర్ పదవి, కొన్ని చిన్న చిన్న మంత్రి పదవులు మినహా.            2004 లో ఎన్ డి ఎ ని సపోర్ట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు ఓటమిని చవి చూసారు. మరి అప్పుడు కూడా థర్డ్ ఫ్రంట్ ఊసు ఎత్తలేదు. 2009 ఎన్నికలలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ జపం చేసి ఎన్నికల బరిలో నిలిచి తాను ఓడిపోవటమే కాక, 2004నాటి పరిస్థితి కన్నా మరిన్ని తక్కువ సీట్లు థర్డ్ ఫ్రంట్ పార్టీలకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.          మళ్లీ ఇప్పుడు చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నాడు. 2014 ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తెదేపా కీలక పాత్ర వహించే థర్డ్ ఫ్రంట్ అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి ఆయన చెబుతున్న కారణం యూపీఎ చతికిల పడిపోతోందని, ఎన్ డిఎ కోలుకునే పరిస్థితి లేదు అని.           థర్డ్ ఫ్రంట్ అంటే వివిధ ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల కూటమి. ప్రాంతీయ పార్టీలంటే ఒక్కో పార్టీకి ఒక్కో స్వతంత్ర ఎజెండా ఉంటుంది. వివిధ రకాల స్వతంత్ర ఎజెండాలతో, స్వతంత్ర ప్రతిపత్తులతో కలిపిన కూటమి ఎంతవరకు విజయ పథాన నడుస్తుంది? థర్డ్ ఫ్రంట్ కూటమిలో ఉండబోయే పార్టీలు తెదేపా, తెరాస, ఎఐఎడిఎంకె, జెడి(ఎస్), బిఎస్పి.... మొ.నవి, అందులోనూ మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే థర్డ్ ఫ్రంట్ లో బిఎస్పి కొనసాగుతుంది. మరి ములాయం సింగ్, జయలలితలేమి తక్కువవాళ్ళు కారు. మరి ఇంతమంది మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ ఎంత కాలం ఈ అతుకుల బొంత ప్రయాణం సాగుతుంది?             చివరిగా అందరి ఉద్దేశ్యం ముస్లిం వోటర్లను ఆకర్షించటం. అందుకోసమే అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నాయి. అయితే ఈ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వాన్ని వహించేది ఎవరు? ఎవరి నాయకత్వాన్ని ఎవరు అంగీకరిస్తారు?        దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతోంది థర్డ్ ఫ్రంట్ లో అధికారం కోసం ప్రాంతీయ పార్టీల కుమ్ములాటలే కాని దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత ఎక్కడా కాన రాదు అని. ఇన్నీ తెలిసి మళ్లీ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనని తెర మీదకు తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడి అంతర్గత ఉద్దేశ్యం ఏమిటి?

తెలంగాణ పై చంద్రబాబు వైఖరి

        మే 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు తెదేపా మహానాడు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ తాను తెలంగాణ విషయంలో 2008 నాటి మాటలకే కట్టుబడి ఉన్నానని, అందులో తన వైఖరి మారలేదని వ్యాఖ్యానించారు. వైఖరి మారలేదని అంటే దాని అర్థం ఏమిటి? ఇదే నినాదంతో 2014 ఎన్నికల బరిలో నిలబడితే ఆయన ఆంధ్ర ప్రాంత ప్రజల మన్నలను ఎలా పొందగలడు? ఎలా గెలవగలడు? 2014 లో తెదేపా అధికారంలోకి వస్తే కేంద్రప్రభుత్వ నిర్ణయానుసారం రాష్ట్రాన్ని రెండుగా విడగోట్టగలడా? అలా విడగొట్టడాన్ని ఆయన సమర్థిస్తారా? దాని వలన ఆయన సాధించేదేమిటి? అదే కనుక కొనసాగితే అపర చాణక్యుడిగా పేరు గాంచిన ఆయన తెలివి, సామర్థ్యం ప్రశ్నార్థకం కావా?  శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడిందని తేలింది. చంద్రబాబు మహానాడులో ప్రసంగిస్తూ తెలంగాణలో అభివృద్ధికి తానే కారణం అన్నారు. మరి ఆ విధంగా పరిశీలిస్తే ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధి కుంటు పడడానికి చంద్రబాబే కారణం కదా! 2004లో వైయస్ఆర్ కెసీఆర్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణా అంశాన్ని రాజకీయంగా వాడుకుని, తరువాత కెసిఆర్ ని ఏ విధంగా ప్రలోభపెట్టి అణిచి వేశాడో కాని 2009లో వైయస్ఆర్ మరణానంతరం కాని కెసిఆర్ కి తెలంగాణా ఉద్యమం గుర్తుకురాలేదు.            అయితే, 2009లో చంద్రబాబు, కెసిఆర్  తో పొత్తు పెట్టుకున్నందునే కదా... ఆ తరువాతి పరిణామాలలో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ తీవ్రత కారణంగానే కదా చిదంబరం డిసెంబర్  9 నాడు తాము తెలంగాణకు అనుకూలమనే ప్రకటన అర్థరాత్రి ప్రకటించాల్సి వచ్చింది. అంటే నేడు రాష్ట్రం తెలంగాణ విషయంలో రావణ కాష్టంలా మారటానికి రాజశేఖర రెడ్డి ఎంతవరకు కారణమో, చంద్రబాబు అంతకు మించి కారణం అయ్యాడు.            2014లో తేదేపా అధికారం లోకి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని, కెసిఆర్ ని, తెరాస ని అణిచివేయగల సత్తాగాని, తెలంగాణ  సామర్థ్యం గాని ఏమైనా ఉన్నాయా?మరెందుకు ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం?             నాయకులున్నది ప్రజల సమస్యలు తీర్చటానికి. కాని ఆ నాయకులే ప్రజలకు సమస్యగా మారితే ప్రజాసంక్షేమం అనేది గాలిలో దీపమే. ఈ రోజున ఉన్న రాజకీయ నాయకులకు కావలిసినది తమకు ఒక పదవిని సంపాదించుకొని, తద్వారా తాము కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడం తప్పా... రాష్ట్రాభివృద్ధి ఎంతమాత్రం కాదు. దానికి చంద్రబాబు నాయుడు ఏమీ మినహాయింపు కాదు.           ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రాంత అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఏనాటికి సాధించగలడు? ఎందుకంటే, ఈనాడు మనం చూస్తున్న అభివృద్ధి ఒక్కరోజుతో వచ్చిందా? 60 సం.రాల శ్రమ ఫలితం ఈనాటి మన రాష్ట్రం. మరి ఇప్పుడు కొత్తగా అభివృద్ధి మొదలుపెట్టి ఎన్నేళ్ళకు చూపిస్తారు?             ఏది ఏమైనా విజన్ 20 అంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు పూనుకోవడం కడుశోచనీయం. ఏనాడు ప్రజలు చాలా మంది వోట్లు వేయడానికి సుముఖంగా లేరు. కానీ బాబు గారి ఇలాంటి వైఖరి వల్ల ఆ సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉంది. 

మన చదువులు మేడిపండు చందం

        ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల పిల్లలు సంపూర్ణ వ్యక్తులుగా ఎదగలేక కేవలం మరబొమ్మలుగా తయారవుతున్నారు. మన భావి భారతం ఇలాగేనా ఉండాల్సింది? ప్రపంచ దేశాల ముందు భారతావని నవ్వులపాలు అవ్వక తప్పదా? ఈ పరిస్థితికి కారణం ఎవ్వరు?విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలదా? మిడిమిడి జ్ఞానం తో ఉన్న తల్లిదండ్రులదా? లేక ఎదిగీ ఎదగని సమాజానిదా? ఎవరిది తప్పు? ...ఆలోచిస్తే అందరిది అని అనిపిస్తుంది కదా....    పక్కింటి పిల్లవాడు ఏం చదువుకుంటే మనకెందుకు? ఒకటి... వెళ్లి మనవాడితో వాడిని పోల్చటం, ఫలితం.... 'మరమనిషి బ్రతుకు'... ఇది అవసరమా? అందరూ డాక్టర్లు, ఇంజినీర్లేనా? ఇంకా వేరేవి చదువులు కావా? ఒక సమాజం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక రైతు, సైనికుడు, పోలీస్, టీచర్, డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్... ఇలా చెప్పుకుంటూపోతే  చాలా మంది కావాలి. ఎవరి వృత్తిలో వారు గొప్ప. ఎవరి వృత్తి వారికి గొప్ప. కాని నేడు మన ఆలోచనలు కొన్ని రంగాలకే పరిమితమైపోతున్నాయి.        ఇవాళ విద్యావిధానం పరిశీలిస్తే మొత్తం బట్టీ విధానమే తప్ప సృజనాత్మకతకు, ఆలోచనాపటిమకు, భావవ్యక్తీకరణకు ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదు. పాఠ్య పుస్తకాలలో ఉన్నది ముందు టీచర్ లు బట్టీ పట్టి పిల్లల చేత బట్టీ వేయించటం.... ఇక వారు సొంతంగా ఏం ఆలోచిస్తారు? కొత్తకొత్త విషయాలను ఎలా కనుగొంటారు? అది ఇంటి నుండే మొదలవ్వాలి. వారి పనులు వారు సొంతంగా చేసుకునే స్వాతంత్ర్యం, వెసులుబాటు తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి. 15 ఏళ్ళు వచ్చిన వాడికి కూడా ఏం తినాలో, ఏం  తినకూడదో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ సినిమా చూడాలో, ఏ ఆటలు ఆడాలో, ఎవరితో స్నేహం చేయాలో, చివరికి ఎలాంటి కలలు కనాలో కూడా తల్లిదండ్రులే నిర్ణయిస్తే.... భవిష్యత్తులో వాడు ఏం అవుతాడు... ఒక మర మనిషి కాక...        చదువు పేరుతో ఈ రోజు పాఠశాలలో జరుగుతున్నది నిజంగా చాలా దారుణం. ఆ స్కూళ్ళల్లో ఆట స్థలాలు ఉండవు... ఆటలు ఉండవు.... కేవలం చదువు! చదువు! ఆటపాటలు లేకపోతే పిల్లలకు మానసికోల్లాసం ఎక్కడనుండి వస్తుంది? మానసికోల్లాసం ఉంటేనే కదా పిల్లలు ఏదైనా భిన్నంగా ఆలోచించగలుగుతారు. చదువుతున్న చదువుకు తగిన పాఠాలు చెప్పరు ... ఫలితంగా ఇతర అంశాల పట్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం తగ్గుతుంది. బాలబాలికల వయసుకు తగినట్లు పాఠ్యాంశాలు ఉండి, అలాంటి పాఠాలు చెబితే... వారికి అన్ని విషయాల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. జీవితం లో ఒడిదుడుకులను ఎదురుకోవడం కోసం శ్రమించి సాధించే మనస్తత్వాన్ని వారిలో వృద్ధి చేయాలి. అప్పుడే వారు వారి జీవితంలో సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు.        జాతీయ విద్యావిధానానికి కాలం చేల్లిందన్న చేదు నిజం, ఇటీవలే మన్మోహన్ మంత్రి వర్గంలో మళ్లీ అడుగిడిన శశి థరూర్ నోటి వెంట తన్నుకొచ్చింది. వారు చెప్పినట్లు దేశ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చి దిద్దడంలో మన  పాఠశాలలు, కళాశాలలే కాదు విశ్వవిద్యాలయాలు కూడా ఘోరంగా విఫలమవుతున్నాయి. 621 విశ్వవిద్యాలయాలు, 33,500 కళాశాలలతో కూడిన భారత ఉన్నత విద్యావ్యవస్థ- చెప్పుకోవడానికే .... అయినా కాని మన విద్యార్థులు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్ళాల్సి రావడమే చెబుతోంది- ఇక్కడ రాశి ఘనం.... వాసి హీనమని.              అసలీ పరిస్థితి దాపురించడానికి కారణం ఎవరు? భవిష్యదవసరాలకు ధీటుగా ఉన్నత విద్యారంగ పరిపుష్టీకరణ జరగాలని 1949లోనే విశ్వవిద్యాలయ సంఘ అధ్యక్షులుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దిశానిర్దేశం చేశారు. దానిని కేంద్రంలో కొలువుదీరిన ప్రభుత్వాలన్నీ పోటాపోటీగా తుంగలో  తొక్కాయి. "ఆలోచనను సృజించి వాటికి ఆలంబనగా నిలిచి, అవి బలం పుంజుకుని, ఎదిగి, రెక్కలు తోడుక్కోవడానికి దోహదపడేదే విశ్వవిద్యాలయమన్నది " అని ప్రొ. యష్ పాల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అర్థవంతమైన నిర్వచనం. ఆ స్ఫూర్తిని దశాబ్దాల క్రితమే వంటబట్టించుకున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సాధించటంలో విశేష ప్రగతి నమోదుచేసుకున్నాయి.              విశ్వవిద్యాలయాలకు, పరిశ్రమలకు మధ్య నిరంతర అనుసంధానం, అవసరానుగుణంగా తరచూ పాఠ్యాంశాలలో మార్పులు... ఆ మేరకు ఎలాంటి బంధనాలు లేకుండా సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించగల వెసులుబాటు... ఇవన్నీ అక్కడి ప్రమాణాల పెంపుదలకు తోడ్పడుతున్నాయి. రాజకీయ  తాబేదారుల్ని, ఉన్నతాధికార వర్గాలను ఉపకులపతులుగా ఎంపిక చేయోద్దన్న జాతీయ విజ్ఞాన సంఘం సిఫార్సులు నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. కుల... మత ప్రాతిపదికన, అనుచిత ఒత్తిళ్లకు లోబడి కీలక నియామకాలు యధేచ్చగా జరుగుతున్నట్లు సాక్ష్యాత్తు "ప్రధాన మంత్రే" 5 ఏళ్ళ నాడు లెంపలేసుకున్నారు.          వ్యవస్తాగాతమై వర్ధిల్లుతున్న ఈ అలసత్వమే మేడిపండు చదువులకు నారు... నీరు  పోస్తోంది. ఫలితం, విద్యాలయాల్లో మరబొమ్మల తయారీ... ఈ విద్యావ్యవస్థ బాగుపడాలంటే విశ్వవిద్యాలయాలకు పట్టిన 'కుల, రాజకీయ వ్యవస్థ' అనే చెదలను వదిలించాలి.

మూర్తీభవించిన మానవత్వం..ఏంజెలీనా

        ఆమె అందానికి ప్రతిరూపం... ప్రపంచ ప్రసిద్ధ నటి... ఆస్కార్ అవార్డు గ్రహీత... ఆమె మరేవ్వరోకాదు... ఏంజెలినా జోలి. ఆమె వయస్సు 37 సం.లు. ఇది నాణానికి ఒకవైపు. నాణానికి మరోవైపు చూస్తే జన్యు పరంగా వచ్చే రొమ్ము కేన్సర్ తనకు సోకే ప్రమాదం 87% ఉందని, అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం 50% వరకు వచ్చే ప్రమాదం ఉందని వైద్యుల ద్వారా తెలుసుకున్న ఆమె క్రుంగిపోలేదు. మానసికంగా ముందు తనని తాను సిద్ధం చేసుకొని, అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ద్వారా తన రొమ్ము కణజాలాన్ని తొలగించి దాని స్థానంలో తాత్కాలిక ఫిల్లర్లు అమర్చారు. 9 వారాల తరువాత రొమ్ముల పునర్నిర్మానంతో చివరి ఆపరేషన్ ను పూర్తి చేసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని 87% నుండి 5% కి తగ్గించుకోగలిగారు.         ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పదేళ్ళపాటు కేన్సర్ తో పోరాడిన అనంతరం 56 ఏళ్ళ వయస్సులో జోలి వాళ్ళ అమ్మగారు రొమ్ము కేన్సర్ తో చనిపోయారు. జోలి మంచి వైద్య  పరమైన అవగాహనతో కేన్సర్ ను ఎదురించగలిగారు. అంతే కాదు, ఇలాంటి వ్యక్తిగత అంశాలని బయటకు వెల్లడించడానికి ఎవరూ ఇష్టపడరు. కాని ఆమె తన స్వీయ అనుభవం తో న్యూ యార్క్ టైమ్స్ అనే పత్రిక లో "my medical choice" అనే శీర్షిక తో ఒక వ్యాసాన్ని కూడా రాశారు. కుటుంబ పరంగా ఈ వ్యాధుల చరిత్ర ఉన్నవాళ్ళు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. మాస్టెక్టమి చేయించుకోవాలన్న నిర్ణయం అంత సులభమేమీ కాదు అని, కానీ తను ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఎంతో సంతోషంగా ఉన్నానని ఆ వ్యాసం లో పేర్కొన్నారు. ఏటా రొమ్ము కేన్సర్ తో 4,58,000ల మంది... ప్రధానంగా పేద, మధ్య స్థాయి దేశాలలో మరణిస్తున్నారని పేర్కొన్నారు.       ఇక ఆమె వ్యక్తిత్వం విషయానికి వస్తే, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మైహిళ ఆమె. ఆమె ఐక్య రాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో లైంగిక హింసకు వ్యహిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్ కు చికిత్స తీసుకుంటూనే ఆమె Democratic Republic of Congo వెళ్ళారు. లండన్ లో జరిగిన జి8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. తాలిబాన్ ల చేతిలో దాడికి గురైన మాలాల నెలకొల్పిన బాలికల విద్యా సంస్థకు నిధులు సేకరించారు. ఆన్నింటికి మించి ఆమెకు ముగ్గురు సంతానం. మరో ముగ్గురు అనాధ పిల్లలను దత్తత తీసుకున్నారు.              ఏంజెలీనా జోలి నుండి మన నటీనటులు చాలా నేర్చుకోవాలి. తాత వారసుడినని, నాన్న వారసుడినని, మేనమామ వారసుడినని తోడగోట్టే వంశమని పనికి మాలిన అంశాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తూ జబ్బలు చరుచుకునే వీరులు కనీసం తమ సినిమా పరిశ్రమలో కార్మికులనైనా ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని హీరోలమని చెప్పుకునే జీరోలు. పది మంది డూపులని పెట్టుకుని తెరమీద ఇరగదీసే సాహస దృశ్యాలను చిత్రీకరిమ్పచేసుకోవడం కాదు. నటన అంటే ప్రతి డైలాగుకొకసారి నా వంశమేమితో తెలుసా, నా వంశ చరిత్ర ఏమిటో తెలుసా? అంటూ పనికిమాలిన సంభాషణలు పేల్చటం కాదు. నటుడు అనగానే అద్దాల మేడకు అంకితమై ప్రేక్షకుడికి అందనంత దూరంలో సామాన్య మానవుడికి, బడుగు జీవికి తానేదో ఒక పరమాత్ముడిలా ఒక భయంకరమైన వలయాన్ని గిరిగీసుకుని కూర్చోవటం కాదు. ఒక సామాన్య ప్రేక్షకుడు, ఒక సగటు మనిషి, ఒక బడుగు జీవి వందల్లో డబ్బులు వెచ్చించి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తేనే ఈ నటులంతా కోట్లకు పడగలెత్తారు. అంతే గాని దివి నుంచి భువికి ఊడి పడిన దైవాంశ సంభూతులేమి కారు వీరంతా.              వీళ్ళ సినిమాలలో కథాబలం ఉండదు, వీళ్ళ వ్యక్తిత్వంలో నైతిక బలం ఉండదు. ఒక సెలబ్రిటీ 10 మందికి ఆదర్శప్రాయంగా ఎలా బ్రతకొచ్చో ఏంజెలీనా జోలి జీవితాన్ని చూసి వీళ్ళు నేర్చుకుంటే కనీసం మనుషులుగా మిగులుతారు.... లేకపోతే సినిమాలోను, నిజజీవితంలోను కూడా నటులుగానే మిగిలిపోతారు.      

రాజకీయ వలయంలో సీబీఐ

        భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం "సుప్రీం కోర్టు" ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం రేకెత్తించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజరంలో చిలుకలా మారిందంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య దేశంలో పెద్ద దుమారాన్నే లేపింది. దానికి తోడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అవునని సుప్రీం మాటలని సమర్ధించడం దేశ ప్రజలందరిని మరింత విస్మయానికి గురిచేసింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే... కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ప్రభుత్వమూ రెండు కుమ్మక్కై నిస్పాక్షికత లోపించిన విచారణను నిర్వహిస్తున్నదని. సుప్రీం మాటల నేపథ్యంలో సీబీఐ కి సర్వస్వతంత్రతను కల్పించటమే ప్రభుత్వం రంజిత్ సిన్హా చేసిన ముందున్న ఏకైక పరిష్కారం. సీబీఐ కి స్వతంత్రత కల్పించటం అన్నది ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజాపాలకు సుతరాము ఇష్టం లేని వ్యవహారం. ఒకటి మాత్రం నిజం- పార్టీలతో సంబంధం లేకుండా, పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా సీబీఐ తనకు తానుగా బాగుపడే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పటికైనా సుప్రీమ్ కోర్ట్ ముందుకు వచ్చి బాహ్య ప్రభావాల బారిన సీబీఐ పడకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ స్వతంత్రతను పరిపుష్టం చేసేన్దుకున్న మార్గాలు, బాహ్య ప్రభావాలనుంచి రక్షణ కల్పించటానికి ఉన్న మార్గాలపై ఈ బృందం సమాలోచనలు చేస్తుంది.        ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనల నేపథ్యంలో సీబీఐ ప్రవర్తన తీరును పరిశీలిస్తే.... బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించక ముందే ప్రభుత్వానికి చూపించింది. న్యాయశాఖా మంత్రి, ప్రధాని కార్యాలయం అధికారులు ఆ నివేదికను చూసిన వారిలో ఉన్నారు. ఈ విషయంలో న్యాయ శాఖా మంత్రి అశ్విని కుమార్, ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన దానికన్నా సీబీఐ డైరెక్టర్ చేసిన నేరం తక్కువ ఎలా అవుతుంది? రాజకీయనాయకులను ఏమంటాం? నీతి, నిజాయితి అంటే ఎలా ఉంటాయో మర్చిపోయిన నీచులు వాళ్ళు. కనీసం ప్రజల సొమ్ము తింటున్న ప్రభుత్వ ఉద్యోగులైన నీతి, నిజాయతీలతో పనిచెయొద్దా?             ఉద్యోగ విరమణ తర్వాత భారీ వేతనం, గొప్ప సోకర్యాలతో కూడుకున్న పదవుల కోసం వారు అంతగా సాగిల పడాల? ఇది ఒక్క సీబీఐ సంస్థకు మాత్రమే వర్తించదు. ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, పోలీస్ డిపార్టుమెంటు, జడ్జిలు, ఇతర ప్రభుత్వ అధికారులు... ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ రాజకీయ ప్రమేయం ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? రాజశేఖర రెడ్డి జమానాలో జరిగిన విపరీతమైన రాజకీయ జోక్యం ఫలితంగానే ఈ రోజు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో మగ్గుతున్నారు.          నీతి, నిజాయితీలకు ప్రాణం పెడుతూ, ఏ  రాజకీయనాయకుడిని లెక్కచెయ్యని అశోక్ ఖేమ్కా లాంటి ఆఫీసర్లు ఉన్నారు. ఎంతో నీతిమంతుడైన ఐఏఎస్ అధికారి ఆయన. అందుకే రాజకీయ నాయకులు, పాలకులు ఆయనను ఒక్క చోట కుదురుగా ఉంచటం లేదు, పనిచేసుకోనివ్వడం లేదు. అతి తక్కువ కాలం లోనే అత్యధికసార్లు బదిలీ ఐన అధికారిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా రికార్డుల పుస్తకానికి ఎక్కింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఆయనది. ఆయన హర్యానాలో పనిచేసారు. ఓం ప్రకాష్ చౌతాలా ప్రభుత్వంలో 5సం.ల కాలంలో 9 సార్లు బదిలీ అయ్యారు. ఆయన 21 సం.ల సర్వీస్ లో 40 సార్లు బదిలీ అయ్యారు. ఆయన నిజాయితీకి రాబర్ట్ వాద్రా అవినీతి కేసుల విషయంలో ప్రాణ హాని హెచ్చరికలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.     మరి ఇంతగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆఫీసురు నీతి నిజాయితీల పరంగా ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందులు లిమ్కా బుక్కు రికార్డ్సు వరకు వెళ్ళినా కాని కలగని చైతన్యం సుప్రీం కోర్టుకు ఈనాడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యవహారంలోనైనా కలగటం ఇపాతికైనా స్వాగతిన్చదగినదే.        చివరిగా ఒక్క మాట ఒక పదవి, అధికారం అంటే... నిజాయితీ, అవగాహన, ధైర్యం, సాహసంతో కూడుకున్న వ్యవహారం. ఈ లక్షణాలన్నీ ఉన్న అధికారి ఎవరైనా ప్రజలకోసం పాటుపడడానికి వస్తే వారిని కాపాడుకునే ప్రయత్నం లో ప్రజలందరూ సమాయత్తం అవ్వాలి. ఎందుకంటే వారి శ్రమ, తెగువ, చొరవే... భావిభారతం.     

ఆంధ్ర బడిలో 'కన్నడ' పాఠాలు

        దేశం బాగుపడాలంటే జాతీయ పార్టీలను భూస్థాపితం చేయాలి. ప్రాంతీయపార్టీలు మరింతగా బలం పున్జుకుంటే తప్ప, సూట్కేస్ లో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రుల కేటాయిమ్పులనేవి ఆగవు. ఒక్కోసారి ఒక్కోపార్టీ కారణంగా ఆయ రాష్ట్రాల ప్రగతి ఎన్నో ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్ట పోయిన విధంగా భాజాపా ఓట్ల చీలిక పుణ్యమా అని గద్దెనెక్కబోతోంది. కాని ఇహ రోజుకో ముఖ్యమంత్రి మారినా ఆశ్చర్యపోనవసరంలేని స్థితిని ఆ రాష్ట్ర ప్రజలు తద్వారా దేశ ప్రజలు చూడబోతున్నారు. వరుస కుంభ కోణాలతో మారుమోగుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు మెరుగైన పరిపాలన అందిస్తదో అందరికి సందేహమే. ఐనా గాలి జనార్థనరెడ్డి మాత్రమే భాజపాని నడిపించటం లేదు. మఠాలు, పీఠాలు, పీఠాధిపతులు ప్రజల తలరాతలని మార్చటానికి సిద్ధమవుతుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తామేమి తక్కువ తినడం లేదని ముందుకు ఉరికి వస్తుంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం కాని, ఆలోచించకపోతే పార్టీ మనుగడను గూర్చిన భయం కానీ ఆనేతలకు ఉండాల్సిన పని లేదు. ఏది ఏమైన రానున్న రోజులలో యువత ముందడుగు వేయాలి. మధ్యతరగతి, ఆపైవర్గం ప్రజలు,అంటే నోట్లకు అమ్ముడుపోని వర్గం ప్రజలు ముందుకు వస్తేనే కాని దేశ రాజకీయాలు బాగుపడవు. చిన్నపాటి కుదుపులు ఈనాటి రాజికీయ పరిస్థితులను ఎమీచేయలేవని కాంగ్రెస్ ధీమా. అన్ని ప్రాంతాలలోను ఒక నరేంద్రమోడి లాంటి నాయకుడు కావాలి అంటున్నారు అంటే 120కోట్లమందిలో నీతి, నిజాయతీ, సామర్ధ్యం, సత్తా, ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు ఒకేఒక్కడా ? ఆ ఒక్కడు నరేంద్రమోడీనా? ఆ ఒక్కడినైనా భాజపా అధిష్టానం ఎంతకాలం నిలవనిస్తుంది?              కర్ణాటక రాజకీయాలనుండి మన ఆంధ్ర ఓటర్లు చాలా నేర్చుకోవాలి. కేవలం కులం మీద అభిమానంతో నడిచే రాజకీయాలు, గెలిచే పార్టీలు ప్రజాలకు ఏమి అభివృద్ధిని చూపిస్తాయనేది. కులాన్ని నమ్ముకుని,మతంతో మాయ చేయగలను అనే ధైర్యంతో ఉన్నవే  వైకాపా, కాంగ్రెస్, తెదేపా, భజాపాలు కూడా. వాళ్ళందరికీ సరైన సమాధానం ప్రజలేచెప్పాలి. కొంతవరకు తెదేపా ద్వారా రాష్ట్రానికి అభివృద్దే జరిగింది. కాని కేవలం రెడ్డి సామాజికవర్గ అభిమానంతో,మతమార్పిడి చర్యలతో రాష్ట్రాభివృద్ధికి గండిపడింది. 2009 ఎన్నికలలో తెదేపా ఆ కారణంగానే ఓడిపోయిందని  చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజశేఖరరెడ్డి మరణం కారణంగా తీవ్రంగా నష్టపోయింది తేదేపానే . రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటె  2014 ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వాడు. ఎందుకంటే మధ్యలో ఈ జగన్ రెడ్డి ఎపిసోడ్ వచ్చేదే కాదు.              కాని ఈనాడు ప్రజలు కూడా తినడానికి తిండి లేకపోయినా, కులాల కోసం, మతాల కోసం ప్రాకులాడి చచ్చిపోతున్నారు. అది ఈ రాజకీయ దళారులను గద్దెనెక్కించడానికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ముఖ్యమంత్రి పదవిని వాడుకోవటానికి మంచి అవకాశంగా మారింది.             మాటకు ముందు రాజకీయనాయకులని అవినీతిపరులని అంటున్నారే కాని వారి కన్నా ముందు చెడిపోతుంది ప్రజలే. నోటుకి ఓటు అమ్ముకోవడం తోనే లంచగొండితనం మొదలై, అది పెరిగి పెద్ద వృక్షమై, మహా వృక్షమై కూర్చున్నది. మరి తప్పెవరిది? ప్రజలదే కదా! ప్రజలలో ఐకమత్యం ఉండదు.... ఎలా ఉంటుంది కులాల కోసం కుమ్ముకుచస్తుంటే? కులమన్నది ఒక జాడ్యం. అది ఎయిడ్స్ కన్నా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధికి ఏ రాష్ట్రము మినహాయింపు కాదు.             చివరిగా చెప్పేది ఒక్కటే.... కర్ణాటక రాజకీయాల నుండి ప్రజలు తెలుసుకోవలసింది నాయకుడు ప్రజల మధ్యనుండి కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, వర్గాలకతీతంగా రావాలి. అలా రావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలి. ఏ కులం పేరుతో పదవి దక్కించుకున్నవాడు, వాడి కుటుంబం, వాడి బంధువర్గం మాత్రమే బాగుపడతారు. కాని పేదవాడు పేదవాడిగానే ఉంటాడు. వీలైతే మధ్యతరగతివాడు కూడా పేద వాడిగా మారిపోతాడు. ప్రజాసంక్షేమం ఉండదు, రాష్ట్రాభివృద్ధి ఉండదు. ఎందుకంటే అవి ఈ నేతలకు అవసరం లేదు. పధకాలను చూపించి మన సొమ్ము మనకే ఖర్చుపెడుతూ ఏవో ప్రగర్బాలు పలుకుతారు.            చైతన్యవంతుడైన ఓటరుమహాశయా, మేలుకో! మేలుకొని నీ భవితను నువ్వే దిద్దుకో! ప్రతి పనికిమాలినవాడు (గుండాలు, వీధి రౌడీలు, వ్యాపారవేత్తలు) గద్దెనెక్కుతాడు. నిన్ను మరింత అథః పాతాళంలోకి తోక్కుతాడు. 

"కార్పోరేట్" వ్యవసాయం

        భారత దేశం వ్యవసాయాధారిత దేశం. దేశానికి రైతే వెన్నెముక. కానీ ఈనాడు ఆ రైతుకే వెన్నెముక విరిగిపోతున్న పరిస్థితి. నానాటికీ క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ రంగంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం తో ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని 17 రాష్ట్రాలలో అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో మన ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రూ. 7,000 కోట్లు ఖర్చుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం రైతులు ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు వాడాలి దగ్గరనుంచి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వరకు ఈ కార్పోరేట్ కంపనీల ద్వారానే జరుగుతుంది.    ఆహార భద్రత అంటూ వల్లె వేసే ప్రభుత్వాలు... ఆ ఆహార భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజెప్పే ప్రయత్నం చెయ్యరు. క్షీణిస్తున్న భూసారాన్ని అరికట్టాలి. విచక్షణారహితంగా ఎరువులు వాడటం తో పాటు, సేంద్రీయ ఎరువుల ఉపయోగం, సాంద్రీకరణ వ్యవసాయం తక్కువ స్థాయిలో ఉండటం వలన భూములు నిస్సారమైపోతున్నాయి. ఆ నేలల్లో ఉత్పాదకత పూర్తిగా పడిపోతోంది. చివరకు అవి పంటల సాగుకే పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.             సరియైన మౌలిక వసతులు లేకపోవడం,పండిన పంటలు నిల్వచేసుకోవడానికి సరియైన సీతలగిడ్డంగులు లేకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో తరలించేందుకు సరియైన రవాణా సదుపాయాలు లేకపోవడం, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటం, సకాలం లో సేంద్రీయ ఎరువులు లభించకపోవడం, పాత పద్ధతులను అనుసరించడం వలన భూసారం తగ్గిపోవటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడానికి సరియైన భీమా సౌకర్యం లేకపోవడం వంటి మొదలైన కారణాల వల్ల వ్యవసాయ రంగం నానాటికి కుంటుపడుతోంది.            ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వనిర్లక్ష్యం మరియు వారు చేసిన తప్పులకు ఈనాడు రైతు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టటం ఆహ్వానించదగిన పరిణామం. పైన చెప్పిన సమస్యలకు ఈ కార్పోరేట్ వ్యవసాయం వలన చాలా వరకు పరిష్కారం దొరకవచ్చు. కాని ఈ కార్పోరేట్ రంగం వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవి ఏమిటంటే: 1. ఏ పంటలు వేయాలో ఈ కంపనీలు నిర్ణయించడం వలన లాభదాయకమైన వాణిజ్య పంటలను వేయడం ద్వారా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ. 2. పెట్టుబడి ప్రభుత్వానిదే అయినా పెత్తనం కార్పోరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది. 3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది. 4. యంత్రాల వినియోగం పెరిగి నిరుద్యోగం పెరుగుతుంది. 5. ధరల నియంత్రణ ప్రభుత్వం నుంచి కార్పోరేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోతుంది.          ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రస్తుత రైతుసమస్యలను ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమం ఎలా పరిష్కరిస్తుందో ప్రభుత్వం విపులంగా రైతులకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా కొత్త సమస్యలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వివరించవలసి ఉంది. వీటన్నిటి కంటే ముఖ్యంగా క్షీణిస్తున్న భూసారాన్ని రక్షించే విధంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. దీన్ని దీర్ఘకాలిక వ్యవహారంగా ముందుకి తీసుకు వెళ్ళాలి. సేంద్రీయ, జీవ ఎరువులను సైతం రసాయన ఎరువులతో కలిపి శాస్త్రీయంగా వాడేలా చూడాలి. దాని వల్ల నెల ఆరోగ్యం మెరుగు పడి అన్ని రకాల పోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఇది వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం.