థాంక్యూ కేటీఆర్!
posted on Oct 25, 2013 @ 2:25PM
తెరాస నాయకులు కేటీఆర్ గారికి సీమాంధ్ర ప్రజల మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. అసలే వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న సీమాంధ్ర ప్రజలు ఘనత వహించిన కేటీఆర్ గారు తమ మీద కురిపిస్తున్న అపారమైన ప్రేమ ధాటికి మరింత ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సీమాంధ్ర వాళ్ళని దొంగలు, దోపిడీదారులుగా, హైదరాబాద్ నుంచి తరిమికొట్టాల్సిన వాళ్ళుగా భావించే కేటీఆర్, సడన్‌గా సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన సానుభూతిని వ్యక్తం చేశారు.
అదెలాగంటే, వై.ఎస్.జగన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సమైక్య సభని తిట్టిపోయడానికి కేటీఆర్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జగన్‌ని నోరారా తిట్టిన అనంతరం ‘‘ఒకవైపు సీమాంధ్ర ప్రజలు వర్షాలతో, వరదలతో బాధలు పడుతుంటే, ఆ విషయాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌లో సమైక్య సభ ఎందుకు పెడుతున్నావ్?’’ అని లా పాయింట్ లాగారు.
కేటీఆర్ ప్రశ్నని జగన్ పట్టించుకున్నారో లేదో గానీ, కరడుగట్టిన విభజనవాది నోటి వెంట తమ మీద సానుభూతి వాక్యాలు రావడం విని సీమాంధ్ర ప్రజలు పులకరించిపోతున్నారు. ఇది కలా నిజమా అని తమని తాము గిల్లుకుంటున్నారు. సీమాంధ్రుల బాధల్ని తలచుకుని బాధపడిపోతున్న కేటీఆర్‌కి మనసులోనే థ్యాంక్స్ చెబుతున్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె చేసినప్పడు కూడా ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్ర ప్రజలు బాధలు పడుతున్నారని, అంచేత వెంటనే సమ్మె విరమించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడిపోయారు. సీమాంధ్ర ప్రజల మీద టీఆర్‌ఎస్ నాయకులకు ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!