చూసి రమ్మంటే....

 

మమ్మీ ఇలాగయితే నేనిక ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అంతే!

 

మళ్ళీ కొంపదీసి ఏమయినా నాన్సెన్స్ చేసావా ఏమిటి?

 

ఏమిటి మమ్మీ నువ్వు కూడా ఆ మోడీ అంకుల్లాగ నన్నే అంటావు?

 

ఏమన్నాడురా?

 

నేనేమో మా నానమ్మ,నాన్నగారు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. నన్నుకూడా ఏదో ఒక రోజు అలాగే చంపేస్తారేమో అని జనాలని సెంటిమెంటుతో పడేయాలని ట్రై చేసాను.

 

ఒరేయ్! ప్రచారానికి వెళ్లిన వాడివి అవేమి మాటలు రా? ఎంచక్కా నీకిష్టమయిన అభివృద్ధి, యువత, రాజకీయ ప్రక్షాళన వంటి మంచి టాపిక్స్ మాట్లాడుకోకుండా, రేపోమాపో సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి చచ్చిపోతానని చెపుతావేమిటిరా?అది కూడాఎన్నికల ప్రచార సభలో...అయినా నువ్వు పోతానంటే ఆ మోడీకేమిటట?

 

అదికాదు మమ్మీ..ఊరికే పోతానంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అందుకే మొన్న ముజఫర్ నగర్ మతఘర్షణలలో చాలా మంది పోయారు. అలాగే నేనూ పోవచ్చునని చెప్పిన తరువాత, ఇక్కడ ఒక మంచి పంచ్ డైలాగొకటి పడితే గానీ మన మాటలకి మంచి ఎఫెక్ట్ రాదని, అక్కడి మత ఘర్షణలలో మిగిలిన ముస్లిం కుర్రాళ్ళని పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు తమతో చేతులు కలపమని అడిగారని చెప్పాను మమ్మీ.

 

అదేమిటిరా ఆ సంగతి నీకెవరు చెప్పారు?

 

నాకా మాత్రం తెలివితేటలు లేవనుకొన్నావా? మన ఇంటలిజన్స్ అంకుల్స్ నాకు చెప్పారని చెప్పాను. అంతే జనాలు బలే నమ్మేసారనుకో.

 

కొంపముంచావు పో! అయినా నీకు తెలీని విషయాలన్నీ ఎందుకు కెలికేవురా? ఆ మోడీకి తెలిస్తే నీ పని నా పని ఇక అయిపోయినట్లే!

 

తెలిసిపొయిందమ్మా!

 

ఈ మోడీ ఒకడు మన ప్రాణాలకి. ఇంతకీ ఏమంటున్నాడు రా?

 

నేను మత ఘర్షణలు గురించి మాట్లాడేసరికి మోడీ అంకుల్ బాగా భయపడిపోయినట్లే ఉన్నాడు మమ్మీ. అందుకే నా ప్రశ్నలకి జవాబు చెప్పలేక, అతితెలివి ప్రదర్శిస్తూ నన్నేఎదురు ప్రశ్నిస్తున్నాడు.

 

ఏమని?

 

అలా అడుగు చెపుతాను! అసలు ఇంటలిజన్స్ వాళ్ళు ఏ అధికారం లేని నాకు ఇటువంటి రహస్య సమాచారం ఎందుకు చెపుతున్నారని అడిగారమ్మా. నేనెవరో తెలియకుండానే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడు. పైగా మనదేశంలో పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారని మన ఇంటలిజన్స్ వాళ్ళే చెపుతుంటే మరి మన ప్రభుత్వం నిద్ర పోతోందా? పైగా ఏదో మీడియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లు నేను ఆ విషయం రిపోర్ట్ చేయడమేమిటి? బుద్ధి లేకపోతేను..అని నన్నుతిట్టాడు మమ్మీ.

 

ఒరేయ్! నీ మాటలతో నా బీపీ పెరిగిపోతోంది. ఇంకా నువ్వేమి మాట్లాడావు? ఆయనేమని అడిగాడు తొందరగా చెప్పు. వెంటనే దిగ్గీ అంకుల్నో లేక షిండే అంకుల్నో వెళ్లి నీ మాటలని ఖండించమని చెప్పాలి.

 

అదేమిటి మమ్మీ..నేను మోడీని భలే పడేసానని మెచ్చుకొంటావనుకొంటే నువ్వు కూడా నా మాటలను ఖండించమని చెపుతానంటున్నావు...అలాగయితే నేనిక నిజంగానే ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్ళను పో!

 

పోన్లే..పోన్లే...నేను చెప్పను గానీ, ముందేమీ జరిగిందో త్వరగా చెప్పు. టెన్షన్ తట్టుకోలేపోతున్నాను.

 

ఏమి లేదు మమ్మీ.. ఇంక నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఓడిపోయానని నన్నుక్షమాపణలు కోరే బదులు నేను మన ఇంటలిజన్స్ అంకుల్స్ తో రహస్య సమాచారం షేర్ చేసుకొన్నానని ఒప్పుకొంటావా? లేదా? ఒప్పుకొంటే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళుమన దేశంలో తిరుగుతుంటే మన గవర్నమెంటు పట్టించుకోవడం లేదని ఒప్పుకొంటారా లేదా? అలాగయితే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు ఎవరెవరు కుర్రాళ్ళని కలిసారో వాళ్ళ పేర్లు చెపుతావా లేదా? అంటూ ఒకటే అర్ధం పర్ధం లేని ప్రశ్నలు మమ్మీ. పైగా నేను చెప్పిన మాటలు నిజం కానట్లయితే, ముస్లిం కుర్రాళ్ళందరికీ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళతో సంభందాలు అంటగట్టినందుకు బేషరతుగా ముస్లిములందరికీ క్షమాపణలు చెప్పమని పెద్ద గొప్పగా డిమాండ్ ఒకటి..హా తెలివి తేటలు ఆయనకే స్వంతం అనుకొంటున్నారు పాపం..

 

అయ్యో దేవుడా... చూసి రమ్మంటే కాల్చి వచ్చావేమిట్రా బాబు...బాబోయ్! ఆ బీపీ మాత్రలందుకో..ఆ త్వరగా ..త్వరగా ....ఇదిగో సెక్రెటరీ వెళ్లి ఆ షిండే గారిని, దిగ్విజయ్ ని మన వాళ్ళందరినీ వెంటనే ఉన్నపళంగా రమ్మని చెప్పు. వెళ్ళు పరిగెత్తు.. వెంటనే మనోడి మాటలను ఖండించకపోతే కొంపలు మునిగేట్లు ఉన్నాయి... ఓరి దేవుడా...

 

ఛ్చీ..నువ్విప్పెడు అంతే మమ్మీ నీతో ఇక మాట్లాడను...కటీఫ్