జగన్ పట్టుదల వల్లే..

 

 

 

సమైక్యవాదిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం కలుగుతూనే వుంది. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభను పెట్టుకుందామనుకుంటే మొదట పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చినా సభ డేట్ ఈనెల 26కి మారింది. హైదరాబాద్‌లో సభ జరిపి తమ పార్టీ సత్తా చూపించాలని జగన్ కలలు కంటుంటే, ఆయన కలల మీద వరుణుడు వాన నీళ్లు చల్లాడు.

 

వర్షాలు, వరదలతో సీమాంధ్ర మొత్తం సమస్యలు ఎదుర్కొంటూ ఉండటంతో సభ నిర్వహణను వాయిదా వేయాలన్న ఆలోచనకి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్రతోపాటు తెలంగాణలో ముఖ్యంగా సభ జరిగే హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో సభను వాయిదా వేసుకోవడమే కరెక్టన్న  అభిప్రాయానికి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్ర నుంచి కూడా జనం వచ్చే పరిస్థితి లేదు. ఇటు తెలంగాణ నుంచి ఎంతమంది సమైక్యవాదులు సభకు వస్తారో చెప్పలేని పరిస్థితి.




ఒక పార్టీ గొడుకు కింద జరుగుతున్న సభకి గొడుగులు వేసుకునో, వర్షంలో తడుస్తూనో వచ్చే ఆసక్తి ఎవరికి వుంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో సభ జరిగితే జనం లేక సభాప్రాంగణం వెలవెలపోయే అవకాశం, తద్వారా వైకాపా పార్టీకి, సమైక్యవాదానికి అవమానకర పరిస్థతులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావించారు. అందుకే  ఒక దశలో సభ వాయిదా ఖాయమే అనుకున్నారు.




అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సభ జరిగి తీరాలని పట్టుబట్టడంతో 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావాన్ని నిర్వహించాలనే తీర్మానించారు. అయితే సభలో పాల్గొనేవారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, వైకాపా ముందు జాగ్రత్త చర్యగా సీమాంధ్ర జిల్లాల నుంచి తమ కార్యకర్తలను సభకు రావొద్దని ప్రకటించింది. రేపు సభలో జనం పలుచగా వుంటే, ‘‘మేమే జనాన్ని రావొద్దని చెప్పాం’’ అనడానికి వీలుగా ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంది.