ఆంధ్ర బడిలో 'కన్నడ' పాఠాలు
దేశం బాగుపడాలంటే జాతీయ పార్టీలను భూస్థాపితం చేయాలి. ప్రాంతీయపార్టీలు మరింతగా బలం పున్జుకుంటే తప్ప, సూట్కేస్ లో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రుల కేటాయిమ్పులనేవి ఆగవు. ఒక్కోసారి ఒక్కోపార్టీ కారణంగా ఆయ రాష్ట్రాల ప్రగతి ఎన్నో ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్ట పోయిన విధంగా భాజాపా ఓట్ల చీలిక పుణ్యమా అని గద్దెనెక్కబోతోంది. కాని ఇహ రోజుకో ముఖ్యమంత్రి మారినా ఆశ్చర్యపోనవసరంలేని స్థితిని ఆ రాష్ట్ర ప్రజలు తద్వారా దేశ ప్రజలు చూడబోతున్నారు. వరుస కుంభ కోణాలతో మారుమోగుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు మెరుగైన పరిపాలన అందిస్తదో అందరికి సందేహమే. ఐనా గాలి జనార్థనరెడ్డి మాత్రమే భాజపాని నడిపించటం లేదు. మఠాలు, పీఠాలు, పీఠాధిపతులు ప్రజల తలరాతలని మార్చటానికి సిద్ధమవుతుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తామేమి తక్కువ తినడం లేదని ముందుకు ఉరికి వస్తుంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం కాని, ఆలోచించకపోతే పార్టీ మనుగడను గూర్చిన భయం కానీ ఆనేతలకు ఉండాల్సిన పని లేదు.
ఏది ఏమైన రానున్న రోజులలో యువత ముందడుగు వేయాలి. మధ్యతరగతి, ఆపైవర్గం ప్రజలు,అంటే నోట్లకు అమ్ముడుపోని వర్గం ప్రజలు ముందుకు వస్తేనే కాని దేశ రాజకీయాలు బాగుపడవు. చిన్నపాటి కుదుపులు ఈనాటి రాజికీయ పరిస్థితులను ఎమీచేయలేవని కాంగ్రెస్ ధీమా. అన్ని ప్రాంతాలలోను ఒక నరేంద్రమోడి లాంటి నాయకుడు కావాలి అంటున్నారు అంటే 120కోట్లమందిలో నీతి, నిజాయతీ, సామర్ధ్యం, సత్తా, ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు ఒకేఒక్కడా ?
ఆ ఒక్కడు నరేంద్రమోడీనా? ఆ ఒక్కడినైనా భాజపా అధిష్టానం ఎంతకాలం నిలవనిస్తుంది?
కర్ణాటక రాజకీయాలనుండి మన ఆంధ్ర ఓటర్లు చాలా నేర్చుకోవాలి. కేవలం కులం మీద అభిమానంతో నడిచే రాజకీయాలు, గెలిచే పార్టీలు ప్రజాలకు ఏమి అభివృద్ధిని చూపిస్తాయనేది. కులాన్ని నమ్ముకుని,మతంతో మాయ చేయగలను అనే ధైర్యంతో ఉన్నవే వైకాపా, కాంగ్రెస్, తెదేపా, భజాపాలు కూడా. వాళ్ళందరికీ సరైన సమాధానం ప్రజలేచెప్పాలి. కొంతవరకు తెదేపా ద్వారా రాష్ట్రానికి అభివృద్దే జరిగింది. కాని కేవలం రెడ్డి సామాజికవర్గ అభిమానంతో,మతమార్పిడి చర్యలతో రాష్ట్రాభివృద్ధికి గండిపడింది. 2009 ఎన్నికలలో తెదేపా ఆ కారణంగానే ఓడిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజశేఖరరెడ్డి మరణం కారణంగా తీవ్రంగా నష్టపోయింది తేదేపానే . రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటె 2014 ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వాడు. ఎందుకంటే మధ్యలో ఈ జగన్ రెడ్డి ఎపిసోడ్ వచ్చేదే కాదు.
కాని ఈనాడు ప్రజలు కూడా తినడానికి తిండి లేకపోయినా, కులాల కోసం, మతాల కోసం ప్రాకులాడి చచ్చిపోతున్నారు. అది ఈ రాజకీయ దళారులను గద్దెనెక్కించడానికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ముఖ్యమంత్రి పదవిని వాడుకోవటానికి మంచి అవకాశంగా మారింది.
మాటకు ముందు రాజకీయనాయకులని అవినీతిపరులని అంటున్నారే కాని వారి కన్నా ముందు చెడిపోతుంది ప్రజలే. నోటుకి ఓటు అమ్ముకోవడం తోనే లంచగొండితనం మొదలై, అది పెరిగి పెద్ద వృక్షమై, మహా వృక్షమై కూర్చున్నది. మరి తప్పెవరిది? ప్రజలదే కదా! ప్రజలలో ఐకమత్యం ఉండదు.... ఎలా ఉంటుంది కులాల కోసం కుమ్ముకుచస్తుంటే? కులమన్నది ఒక జాడ్యం. అది ఎయిడ్స్ కన్నా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధికి ఏ రాష్ట్రము మినహాయింపు కాదు.
చివరిగా చెప్పేది ఒక్కటే.... కర్ణాటక రాజకీయాల నుండి ప్రజలు తెలుసుకోవలసింది నాయకుడు ప్రజల మధ్యనుండి కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, వర్గాలకతీతంగా రావాలి. అలా రావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలి. ఏ కులం పేరుతో పదవి దక్కించుకున్నవాడు, వాడి కుటుంబం, వాడి బంధువర్గం మాత్రమే బాగుపడతారు. కాని పేదవాడు పేదవాడిగానే ఉంటాడు. వీలైతే మధ్యతరగతివాడు కూడా పేద వాడిగా మారిపోతాడు. ప్రజాసంక్షేమం ఉండదు, రాష్ట్రాభివృద్ధి ఉండదు. ఎందుకంటే అవి ఈ నేతలకు అవసరం లేదు. పధకాలను చూపించి మన సొమ్ము మనకే ఖర్చుపెడుతూ ఏవో ప్రగర్బాలు పలుకుతారు.
చైతన్యవంతుడైన ఓటరుమహాశయా, మేలుకో! మేలుకొని నీ భవితను నువ్వే దిద్దుకో! ప్రతి పనికిమాలినవాడు (గుండాలు, వీధి రౌడీలు, వ్యాపారవేత్తలు) గద్దెనెక్కుతాడు. నిన్ను మరింత అథః పాతాళంలోకి తోక్కుతాడు.