మా అబ్బాయికి తొందరెక్కువ..(చదివి నవ్వుకోండి)

      అమ్మా! అందరూ నాకు కొంచెం దూకుడు ఎక్కువయింది అంటున్నారు. ఇంతకీ ఈ దూకుడంటే ఏమిటమ్మా? అదేరా కన్నా...నువ్వు నాన్నగారు అంత్యక్రియలు కూడా పూర్తవక మునుపే, ఆయన కుర్చీలో కూర్చోవాలనుకొన్నావే... దానినే దూకుడంటారురా. అదేమిటమ్మా.. నాన్నకుర్చీలో నేను గాకపోతే ఇంకెవరు కూర్చోంటారు. అది అందరూ చేసేదే..నువ్వు కూడా  దానిని దూకుడంటే ఎలా అమ్మా? నీకు కేంద్రమంత్రి పదవి ఇస్తామని చెపుతున్నా వినకుండా నాన్నకుర్చీ కోసమే మారం చేస్తూ సోనియమ్మ మంచిమాటను కూడా కాదని కాంగ్రెస్ లోనుండి బయటకి వచ్చేసి ఈ పార్టీ పెట్టావే దానినే దూకుడు అంటారనుకో పోనీ... ఏంటమ్మా నువ్వు మరీను... నాన్నగారి రాజ్యంలో బాగా సుఖం మరిగిన ప్రజలు కాంగ్రెస్ పాలనలో నానా ఇబ్బందులు పడిపోతుంటే, ఏదో పోనీ వారిని ఆదుకొందామని కదాని పార్టీ పెట్టేను. అటువంటప్పుడు నాన్నగారి కుర్చీలో కూర్చోకుండా వాళ్ళని పాలించడం ఎలా వీలవుతుంది? దానిని నువ్వు దూకుడు అంటే నేను ఒప్పుకోను. ఇంకేదయినా మంచి ఉదాహరణ చెప్పు ఏమిటోరా నీ జీవితమే పెద్ద దూకుడు...మళ్ళీ వాటిలోంచి ప్రత్యేకంగా ఉదాహరణలు వెతికి చెప్పాలంటే ఇదేమయినా రచ్చబండ కబుర్లా? ప్లీజ్ అమ్మా! పోనీ అందులోంచి ఒకే ఒక ఉదారణ చెప్పు పోనీ.. అదేరా నేను ఎంత వారిస్తున్నావినకుండా జనాలని ఓదార్చడానికి బయలుదేరావే దానినేరా దూకుడు అంటారు. ఫలితంగా ఏమయింది నువ్వే చూసావు గదా? నువ్వు ఒదార్చకపోతే జనాలేమయినా చచ్చిపోతారా చెప్పు? ఆ దూకుడే వద్దంటున్నా...కానీ నువ్వు వింటే కదా? నీ దూకుడువల్ల ఏనాడు ఎండ కన్నెరుగని నేను, చెల్లి ఎండనక, వాననక, రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఇకనయినా ణా మాట విని ఆ దూకుడు కొంచెం తగ్గించుకోరా బాబు. అదేమిటమ్మా...బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతూ ప్రతీ దానిని దూకుడు అంటావు. అసలు దూకుడు అంటే నీకు తెలియకనే నీకు తోచినవన్నీ చెపుతున్నావు. మరటువంటప్పుడు నన్నెందుకు అడగడం ఎందుకు? పోయి ఆ కొండా సురేఖనో, లేక సబ్బం హరినో లేక ఆ తెలంగాణా ప్రజలనో అడుగు వాళ్ళే చెపుతారు నీ దూకుడు గురించి.. అంటే నేను ముఖ్యమంత్రినవడానికే వాళ్ళని అందరినీ వదిలించుకొన్నానని నీ ఉద్దేశ్యమా? గల్లీ నుండి డిల్లీ దాక నిన్ను తిప్పుతున్నాకూడా నీకు ఇంకా రాజకీయాలు సరిగ్గా వంటబట్టలేదమ్మా! మనల్నిసీమాంధ్రలో, కేసీఆర్ ని తెలంగాణాలో చూసుకోమని మన హైకమాండ్ చెప్పిన తరువాతనే కదా మనం తెలంగాణాలో నుండి జంప్ అయిపోయి, సమైక్యరాగం అందుకొన్నది. అటువంటప్పుడు ఈ కొండలు, సబ్బాలు మనకెందుకమ్మా? అంటే అకస్మాత్తుగా తెలంగాణా నుండి జంప్ అయిపోవడం దూకుడు కాదంటావు. సరే! హైకమాండ్ ఆదేశంతోనే జంప్ అయిపోయావనే అనుకొంటాను. కానీ, నిన్ను అష్టకష్టాలు పడి మూడో కంటికి తెలియకుండా ఆ సోనియమ్మ కాళ్ళు పట్టుకొని బెయిలు మీద జైల్లోంచి విడిపించి తీసుకు వస్తే నువ్వు చేసిన పనేమిటి? పోయి ఆ నరేంద్ర మోడీని పొగుడుతావా? ఆయన మతం పక్కన బెడితే ఆయన పార్టీతో జత కడతానని అంటావా? నీ మాటలు మన హైకమాండ్ చెవిన పడితే మళ్ళీ నువ్వు అత్తారింటికి దారేది అని వెనక్కివెళ్లిపోక తప్పదు తెలుసా? దీనిని దూకుడు అనక ఏమంటారు? దూకుడు గురించి నువ్వు నాకు పాఠాలు చెపుతున్నావా? మీ నాన్నగారి కంటే నీ దూకుడు బాగా ఎక్కువయిపోయిందిరా అబ్బాయ్.. కొంచెం తగ్గించుకో...లేకపోతే మళ్ళీ చిక్కుల్లో పడతావు. అమ్మా... అసలు రాజకీయాలు తెలియని నీతో ఈ దూకుడు గురించి మాట్లాడటం నాదే బుద్ది తక్కువ. నీకు అన్ని విడమరిచి చెపితే తప్ప ఏదీ అర్ధం కాదు. అవతల పార్టీల వాళ్ళు అందరూ మనకీ, మన హైకామాండ్ కీ మధ్య ఏవో రహస్య ఒప్పందాలు జరిగాయని, అందుకే నన్ను జైలులోంచి బయటకు వదిలేసారని, ఎన్నికల ముందో, తరువాతో మన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తామని, లేకపోతే దానికి మద్దతు ఇస్తామని ఒకటే ప్రచారం చేస్తుంటే, అదంతా నిజమేనని మన పేపర్లో, టీవీలో ప్రకటన వేసేసుకోమంటావా? నేను మోడీని పొగిడితేనే కదా... కాంగ్రెస్ పార్టీకి మనకి అసలు పొసగదని, అది మన బద్ధ శత్రువని జనాలను నమ్మించగలుగుతాము. లేకుంటే వాళ్ళ ప్రచారంతో జనం కూడా మన ప్లాన్లు అన్నీ పసిగట్టేస్తే ఇక ఎవరియినా ఒటేస్తారంటావా? అప్పుడు ఇక జీవితంలో నేను నాన్న కుర్చీలో కూర్చోగలనా? నువ్వే చెప్పు. అయ్యో! దీనివెనుక ఇంత రాజకీయం ఉందా? నిజమేరా ఎంత ప్రయత్నించినా నాకు రాజకీయాలు అబ్బటం లేదు. నువ్వు ఇక్కడ మీ నాన్నగారి కుర్చీలో, అక్కడ మన రాహుల్ బాబు మన్మోహన్ కుర్చీలో కూర్చొంటే చూడాలని మా తల్లి మనసులు ఒకటే ఉవ్విళ్ళురుతున్నాయిరా.. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. అయితే ఇప్పుడు దూకుడుకి సరయిన డెఫినెషన్ చెప్పమంటావా? చెప్పమ్మా. అదేరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి చేసే ఏ పనినయినా దూకుడు అంటారురా. హ హ హా...  

కాంగ్రెస్ బండారం బయట పెడతా: లగడపాటి

  సీమంధ్ర కాంగ్రెస్ యంపీలలో కేవలం లగడపాటి రాజగోపాల్ మాత్రమే పట్టువదలని విక్రమార్కుడిలా తన రాజీనామా ఆమోదం కొరకు స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మంగళవారంనాడు కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళిన ఆయన అక్కడ స్పీకర్ కనబడకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె ఎక్కడ ఉన్నావెళ్లి కలిసి తన రాజీనామాను ఆమోదింపజేసుకొంటానని అన్నారు.   వేరే పార్టీలకి చెందిన యంపీలు రాజీనామాలు సమర్పిస్తే 24గంటలలోనే ఆమోదం తెలిపే స్పీకర్ తమ రాజీనామాలను రెండు నెలలయినా ఆమోదించకపోవడం చాలా బాధ, ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు సంక్లిష్టమయిన రాష్ట్రవిభజనను చెప్పట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్ద్యేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను కానీ, 25మంది యంపీలను గానీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం వేరేవారి భరోసాతోనో రాష్ట్ర విభజనకు సిద్దపడటం చూస్తే, ఇంత కాలం పార్టీని నమ్ముకొని సేవ చేసిన తమకు అధిష్టానం దృష్టిలో ఏమాత్రం విలువ, గౌరవం లేదని అర్ధం అవుతోందని అన్నారు. అటువంటప్పుడు పార్టీలో కొనసాగడం కూడా అనసరమని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన రాష్ట్ర విభజన కోసం తమ పార్టీ ఎవరెవరితో సంబందాలు పెట్టుకొన్నదీ బహిర్గతం చేస్తానని అన్నారు.   మరో యంపీ రాయపాటి మాట్లాడుతూ తను కూడా స్పీకర్ ను త్వరలో కలిసి రాజీనామా ఆమోదింపజేసుకొంటానని అన్నారు. యంపీ హర్షకుమార్ మాట్లాడుతూ తాము వ్యక్తిగతంగా స్పీకర్ ను కలిసి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించినప్పటికీ వాటిని ఆమోదించకుండా పక్కన బెట్టడం చాలా అనుచితమని అన్నారు. అవసరమయితే మరో మారు డిల్లీ వెళ్లి స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకొంటానని ఆయన అన్నారు.   వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరి మాత్రం తను తన యంపీ పదవికి రాజీనామా చేయదలచుకోలేదని, లోక్ సభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేయడానికి యంపీగా కొనసాగాలని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె రాష్ట్ర విభజన అనివార్యమని అందువల్ల ఇక సమైక్యంద్రా గురించి మాట్లాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెట్టే బదులు, సీమాంధ్ర ప్రాంతానికి, ప్రజలకి రాష్ట్ర విభజన సందర్భంగా న్యాయం జరిగేందుకు ఏమి చేయాలో ఆలోచిస్తే బాగుటుందని అన్నారు.   అయితే ఆమె సూచించిన సలహాకు ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్ధులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని గట్టిగా చెపుతున్న ఆమె రాబోయే ఎన్నికలలో వైజాగ్ నుండి గెలవడం కల్ల అని వారు హెచ్చరించారు. అంతే గాక ఆమె దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసారు.   స్పీకర్ కార్యాలయం మాత్రం యంపీలు రాజినామాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం లేదా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనే అంశాలు పూర్తిగా స్పీకర్ విచక్షణాదికారాలపై ఆధారపడి ఉంటాయని అందువల్ల స్పీకర్ ను ఎవరూ రాజినామాలకై ఒత్తిడి చేయలేరని నిర్ద్వందంగా ప్రకటించిది. అంటే ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు, వేరే ఇతర పార్టీల నుండి మద్దతు సంపాదించుకోనేవరకు సీమాంధ్ర యంపీల రాజీనామాలు ఆమోదించకపోవచ్చునేమో.

కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసిన పైలిన్ తుఫాన్

  ఇంతవరకు సమైక్య ఉద్యమాలతో హోరెత్తిపోయిన సీమంద్రాలో తుఫాను రాకతో ఒక్కసారిగా ప్రశాంత నెలకొంది. గత రెండు మూడు నెలలుగా సీమాంద్రాలో ఉద్యమాలు, రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ నేతలు చాకో, షిండే, దిగ్విజయ్ సింగ్ వంటి వారి డైలాగులు, వాటిపై స్థానిక నేతల ప్రతిస్పందనలు, ఉద్యోగుల సమ్మె వార్తలు వ్రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్న మీడియాకు పైలిన్ తుఫాన్ కొత్త టాపిక్ గా అందిరావడంతో, ‘ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తుఫానులు మరియు వాటి పూర్వపరాలు’ మొదలయిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన పైలిన్ తుఫాన్ గురించి, అది సృష్టించబోయే విద్వంసం గురించి ఒకటే ఎక్సయిట్ అయిపోతూ ప్రజలని కూడా అందులోకి లాక్కుపోయాయి.   అలలు ఏవిధంగా ఎగిసిపడతాయో, అప్పుడు ప్రజలు ఏవిధంగా భయపడతారో వంటి అనేక ఆశ్చర్యకరమయిన విశేషాలను కూడా మీడియా వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు తెలియజేస్తూ పైలిన్ తుఫానుకి వీడ్కోలు పలికి వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నమంత్రులు, శాసన సభ్యులు అందరూ కూడా తమను కాపాడేందుకు ఆ దేవుడే ఈ పైలిన్ తుఫానును పంపాడని భావిస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటూ, మళ్ళీ చాలా కాలం తరువాత తాము మంత్రులమనే సంగతిని గుర్తు తెచ్చుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.   కానీ పైలిన్ తుఫాన్ వాయుగుండంగా మారి బీహార్ వైపు కదిలిపోవడంతో, మళ్ళీ రాజకీయనేతలలో ఆందోళన మొదలయింది. అయితే టీ-డ్రాఫ్ట్ శాసనసభకు వచ్చేవరకు వారికి కొంచెం ఊపిరిపీల్చుకోనేందుకు వెసులుబాటు దొరికింది. అంతవరకు మీడియా కూడా వార్తల కోసం మళ్ళీ దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, శరత్ పవర్ వంటి వారు చెప్పే కబుర్లు వ్రాసుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.

లెఫ్ట్ పార్టీలు ఏ పార్టీతో అంటుకడతాయో

  రాష్ట్ర విభజన నిర్ణయంతో స్వయంగా కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలలో సీపీఐ రాష్ట్ర విభజనను సమర్దిస్తుంటే, సీపీఎం వ్యతిరేఖిస్తోంది. గనుక వాటికి ఇంత వరకు రాష్ట్ర విభజన వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయినా, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అవి ఇప్పుడు ఏ పార్టీతో అంటుకట్టాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమయింది.   ఎందుకంటే అవి రాష్ట్రంలో ఇంతవరకు స్వయంగా మనుగడ సాగించిన దాఖలాలు, పరిస్థితులు లేవు ఎన్నడూ లేవు గనుక, ఏదో ఒక పార్టీతో అంటు కట్టక తప్పదు. గతంలో ఆ రెండు తెదేపాతో కలిసిపనిచేసినప్పటికీ, ఇప్పుడు తెదేపా బీజేపీ వైపు అడుగులు వేస్తుండటంతో దానితో పొత్తులకి సంకోచిస్తున్నాయి.   ఇక సీపీఐ తెలంగాణాలో తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకొంటే, అది తన బద్ధ శత్రువయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపబోతోంది, గనుక తెరాసతో చేతులు కలుపలేదు. ఇక మిగిలింది మళ్ళీ తెదేపాయే. కానీ అది కూడా తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీతో పొత్తుపెట్టుకొంటే దానితోనూ కలవలేదు. అప్పుడు సీపీఐ ఎవరితో కలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.   ఇక సీపీఎం పార్టీకి కూడా ఇంచుమించు ఇదే సమస్య ఎదురవుతుంది. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీపీఎం నేతలను డిల్లీలో కలవడం, ఆ పార్టీతో పొత్తుకి ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తోంది. కానీ, జగన్ అటు మోడీని పొగుడుతూ, మరో వైపు యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని సంకేతాలు ఇస్తూ అనుసరిస్తున్న ద్వంద వైఖరి వలన వైకాపాతో ఆ పార్టీకి పొత్తులు సాధ్యం కాకపోవచ్చును. అంతే కాక వైకాపా మతతత్వ మజ్లిస్ పార్టీతో కూడా స్నేహానికి సిద్దమనే సంకేతాలు గతంలోనే పంపింది, గనుక ఆ పార్టీతో పొత్తులు అసలే కుదరక పోవచ్చును. పైగా కేవలం సీమాంద్రాకే పరిమితమయ్యే ఆ పార్టీతో పొత్తులవల్ల సీపీఎంకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.   తెదేపా రెండు ప్రాంతాలలో పోటీ చేస్తుంది గనుక, బీజేపీతో ఆపార్టీ పొత్తులు లేదా మద్దతుకి సిద్దపడినప్పటికీ, లెఫ్ట్ పార్టీలు అంతిమంగా మళ్ళీ తెదేపాకే చేరువ కావచ్చును. ఏమయినప్పటికీ, ఎన్నికలు దగ్గరపడితే గానీ, ఈ రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావు.

"తప్పులు చేశాం, అబద్ధాలూ చెప్పాం'' : జయపాల్!

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     జ్ఞానులయిన కొందరు తాత్వికుల అభిప్రాయంలో "దేవుడికీ త్యాగాలూ, త్యాగశీలురంటేనే యిష్టం''! కాని ఆధునిక యుగంలోని పెక్కుమంది రాజకీయవేత్తలూ, కుహనా రాజకీయాలూ తాము త్యాగాలు చేయకుండా తమ పదవుల వేటలో భాగంగా సామాన్యప్రజల్ని తమకోసం త్యాగాలు, ప్రాణత్యాగాలూ చేసేందుకు పురిగొల్పడం సర్వసాధారణమైపోయింది. అవసరమైతే తమ స్వార్థంకోసం దేశ రాజ్యంగాన్నీ, చట్టాలనూ వక్రీకరించడానికి సహితం ఏమాత్రం వెనుదీయరని కేవలం పది-పదిహేను పార్లమెంటు సీట్లకోసం అంగలార్చడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్థితికి దిగజారిపోయారు. భారత రాజ్యాంగ నిబంధనలను అధ్యయనం చేసిన ఏ బుద్ధజీవీ ఈ పరిణామాన్ని సహించలేడు! కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నలలోనే, దాని ఆశీస్సులతోనే, ఒకేజాతి, భాషాప్రాతిపదికపైన తన ఉత్తర్వులు ఆధారంగానే తాను నియమించిన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం'' సిఫారసులు పునాదిగానే, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన నాటి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, దాని సభలూ పదేపదే ఆమోదించిన తీర్మానాల సాక్షిగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని - నిట్టనిలువునా చీల్చడానికి, తెలుగుజాతిని ముక్కలు చేయడానికి నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని హడావుడిగా ఆమోదించింది; దానికి అంతే ఆదరాబాదరాగా క్యాబినెట్ ఆమోదముద్ర వేయించింది.     రాష్ట్రానికి చెందిన తన సొంతపార్టీ ఎం.పి.లను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అకస్మాత్తుగా రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదానికి ముందు పచ్చి అబద్దాల ద్వారా రోజుకొక తీరుగా రాష్ట్రప్రజలను మభ్యపెట్టి మోసగించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండుసార్లు ఎన్నికల్లో అఖండ విజయం ద్వారా రాష్ట్రప్రజలు కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను అప్పనంగా చేతికి అందించినందుకు ప్రతిఫలం - కేవలం తన కొడుకు రాహుల్ ను ప్రధానమంత్రిగా ఎలాగోలా నిలపడంకోసం తెలుగుజాతినే విచ్చిన్నం చేయబోవటం! పైగా అది కూడా ఏ ప్రాతిపదికపైన? రాజ్యాంగంలోని "3వ అధికరణ'' చాటున అక్రమంగా దాగి కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రపన్నడం ద్వారా ఈ పనికి పూనుకుంది. ఆ "కుట్రలో భాగమే - తెలంగాణా విభజన సమస్యపై ముందుగా తన ప్రతిపాదన ఏమిటో కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించకుండా ప్రతిపక్షాలను ఇరికించడం! అందుకే సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పి.లు సహితం తమను అధిష్ఠానం పూర్తిగా చీకట్లోకి నెట్టేసి, మాటమాత్రంగా కూడా విభజన నిర్ణయాన్ని తమకు ముందుగా తెలపనేలేదని బయటపడి చెప్పవలసి వచ్చిందని చెప్పడం!   ఈ మొత్తం విషపూరితమైన ప్రయోగంలో ఆదినుంచీ పాల్గొన్న అధిష్ఠానంలోని ప్రధాన సభ్యులెవరూ? తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడుకోలేక 'ఛీ' కొట్టించుకుని ఆయా రాష్ట్రాల ప్రజలకు దూరమైపోయిన ముగ్గురు తెలుగేతర సభ్యులు - దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), అహ్మద్ పటేల్ (గుజరాత్), గులామ్ నబీ ఆజాద్ (జమ్మూ-కాశ్మీర్)! ఈ బాపతు తెలుగుజాతి భవిష్యత్తును దెబ్బతీయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశాలపైన ఆయాచితంగా అవతరించిన తీర్పకులయ్యారు! పైగా సుస్థిరత పొందిన రాష్ట్రాలను విభజించడం వల్ల కాంగ్రెస్ కు ప్రజలకూ ఎంత నష్టం వాటిల్లిందో స్వయాన తమ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో దిగ్విజయ్, ఆజాద్ లు బాహాటంగా ప్రకటనలు చేసినవారేనని, కలలో కూడా మరిచిపోరాదు! అయితే మధ్యలో, మన తెలంగాణా జాతీయంలో చెప్పాలంటే, కొందరు "బుడ్డర్ ఖాన్''ల [విదూషకుల]వల్ల రాష్ట్రానికి ఏర్పడిన సమస్యకు ఇండియన్ (దేశీయ) పరిష్కారం కాకుండా అర్థాంతరంగా వచ్చిపడిన 'ఇటాలియన్ సొల్యూషన్' మూలంగా రాష్ట్ర పరిస్థితులు మరింత జటిలమైపోయాయి! కాంగ్రెసేతర రాజకీయ పక్షాలలో పెక్కుమంది తాము ఆ 'ఇటాలియన్' పరిష్కారాన్ని తలదాల్చడంలో ఒకరికొకరు పోటాపోటీలు పది చివరికి 'ఇటాలియన్ సూత్రాని'కె కట్టుబానిసలై రాష్ట్ర పరిస్థితుల్ని మరింతగా కంపుకంపు చేసి కూర్చున్నాయి! ఈ తరుణంలో ఎక్కడ ఏ స్థాయిలో ఎలాంటి చర్చ లేదా ప్రస్తావన సాగిందోగాని నా ఆత్మీయ మిత్రులు, కాంగ్రెస్ నాయకులయిన సీనియర్ కాంగ్రెస్ మంత్రి జయపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి 'విభజన' సమస్యపైన వేర్వేరు దృక్పథాలనుంచే అయినా తెలుగుజాతి భవిష్యత్తుకు ఏర్పడిన సంకట స్థితిపైన ఆవేదనను, తమ పాలుపోని స్థితినీ దాచుకొనలేక తమ మనోగత బాధను వేర్వేరు ప్రకటనలో వెలిబుచ్చడం గమనార్హం! వీరిలో ఒకరు (జయపాల్) విభజనపై జరిగిన కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించకుండానే ఇరుప్రాంతాల సయోధ్యకు సమస్యకు "సామరస్య పరిష్కారాన్ని'' వెతకడానికి తద్వారా ఉభయప్రాంతాల మధ్య "పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుందామ''ని ప్రతిపాదించారు! ఈ ప్రతిపాదనకు పూర్వరంగంగా జయపాల్ ఒక బండసత్యాన్ని బయటపెట్టక తప్పలేదు : ఆయన మాటల్లోనే  "మానవమాత్రులం కాబట్టి తప్పులు చేశాం. అబద్ధాలూ చెప్పాం. వాటి లోతుల్లోకి నేను వెళ్ళదలచలేదు'' అని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు! అందుకు ఆయనను అభినందించాలి. కాని ఆ "తప్పులు', "అబద్ధాల''ద్వారా రాష్ట్రసమైక్యతకు, మొత్తం తెలుగుజాతికీ, ఇరుగుపోరుగులో మన గౌరవప్రతిష్ఠలకూ తక్షణం పూరించలేని నష్టం ఎంతటి భారీస్థాయిలో జరిగిందో జయపాల్, శశిధర్ లు గుర్తించాల్సివచ్చింది; ఈ క్రమంలోనే ఉభయులూ హైదరాబాద్ యింత బ్రహ్మాండమైన స్థాయిలో వివిధరంగాలలో ఎదగడానికి బహుభాషల, భిన్న సంస్కృతులలో దీపించడానికి అన్నిప్రాంతాల వారి చోదోడు, వాదోడు ఉందనీ గుర్తించగలిగారు. అయితే మరో "పెద్దమనుషుల ఒప్పందం'' కోసం జయపాల్ పెడుతున్న షరతు మాత్రం కథను మొదటికే తెస్తుంది! మొదట "పెద్దమనుషుల ఒప్పందం'' [రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కుదిరిన ఒప్పందం] పూర్తిగా అమలులోకి రాకపోవడానికి లేదా అమలులోకి తెచ్చుకోలేక పోవడానికి కారకులెవరో ప్రస్తావించకుండా, "విభజనపై 'నిర్ణయం' జరిగిపోయిందిగనుక మరోసారి రెండుప్రాంతాల మధ్య మరొక "పెద్దమనుషుల ఒప్పందం''ద్వారా సామరస్యం నెలకొల్పుకుందామని జయపాల్ చెప్పడం హాస్యాస్పదం కాదా? అంతేగాక, "విభజన రాజ్యాంగ హక్కు'' అని ఆయన చాటడం మరీ విడ్డూరం!   ఎందుకంటే, రాజ్యాంగంలోని ''3''వ అధికరణం ఏకభాషా సంస్కృతులు ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాలకు వర్తించదుగాక వర్తించదు! అందుకే భారతదేశ చరిత్రలో ఏనాడూ ఒకే భూభాగం పరిథిలో లేదా ఒకే రాష్ట్రంగా ఒకే గొడుగుకింద లేని హిందీ రాష్ట్రాలకు లేదా ప్రాంతాలకు మాత్రమే "3వ అధికరణ'' వర్తిస్తుందన్న సంగతి మరవరాదు! కాగా, అదే రాజ్యాంగ కింద కేంద్రప్రభుత్వమే సాధికారికంగా భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్''ను (ఎస్.ఆర్.సి.) ఏర్పరిచి వున్నందున, దాని సిఫారసులపైన ఏర్పడిన రాష్ట్రాలను విచ్చిన్నం చేయడానికి ఆ "3వ అధికరణ'' అవతరించాలేదని గమనించాలి! అంతేగాదు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చాలన్నా, ఉన్న రాష్ట్రంలోని ఒక భాగాన్ని మరో భాగంలో విలీనం చేసి, వేరే రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్రప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి నిరంకుశ రాచరికవ్యవస్థలో 'సామంతుల' ఇష్టారాజ్యాలలో మాత్రమే వీలుంటుందిగాని, ప్రజాస్వామిక వ్యవస్థలో [మనం అలాంటి దానిలోనే ఉన్నామన్న నమ్మకం ఉంటే గింటే] మాత్రమే వీలుపడదు! అందుకే, రాజ్యాంగంలో సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా వగైరా కొన్ని రాష్ట్రాల స్థిరత్వం కోసం "ప్రత్యేక నిబంధన''లను  అధికారాలను రాజ్యాంగం పొందుపరిచిందని మరచిపోరాదు.   18p/371 (డి) ప్రాధాన్యం అదే మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికీ, స్థిరత్వానికి, ఉద్యోగ, సద్యోగ విషయాలలో రాష్ట్రంల్ని మూడు ప్రాంతాలమధ్య [ఆంద్ర, రాయలసీమ, తెలంగాణా] సమానతా విలువలు ప్రాతిపదికగా సమన్యాయం పొందుపరచడానికి అనుగుణంగా, తూ.చ.తప్పకుండా పాటించడం కోసమే అవతరించిన ప్రత్యెక ప్రొవిజన్ (స్పెషల్ ప్రొవిజన్) 371[డి] అని మరవరాదు! రాజ్యాంగ సవరణద్వారా 1973 నాటికే 371 అధికరణకు సవరణ తెచ్చి దానిని 371[డి]గా 1974 జులై 1 నుంచి ఇందిరాగాంధీ హయాములోనే ఈ సవరణ పడద్బందీగా అమలులోకి వచ్చింది! తద్వారా ఆ సవరణ అధికరణను కేంద్రం అనుల్లంఘనీయం చేసింది!   ఈ ప్రత్యేక సవరణ ఆధారంగానే దాని వివరణాత్మకమైన కఠిన షరతుల పరిధిలోనే ఉద్యోగుల నియామకాలుగాని, బదిలీలుగానీ, ప్రమోషన్లుగానే జరగాలని శాసించింది! వారి అలాంటి ప్రత్యేక అధికరణను ఒకవేళ సక్రమంగా సమన్యాయంగా పరిగణించి, పాటించకుండా పదవుల కాలక్షేపంలో మునిగితేలుతూ వచ్చిన మంత్రులను కొరత వేయకుండా, వారు చట్టాన్ని చట్ట నిబంధనలనూ అమలు జరపని నేరానికి ప్రజలను శిక్షించ సాహసించడం కన్నా మించిన 'క్రిమినల్ చర్య' ఎలా రాజ్యాంగహితమైనదో మిత్రులు జయపాల్, శశిధర్ లు మనసు విప్పి చెప్పాలి! పైగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగుజాతి ఐకమత్యం కోసం, దాని బిడ్డలందరి సమష్టి అభ్యుదయం కోసం ఉద్దేశించిన ఆ ప్రత్యేక విశిష్ట సవరణతో కూడిన 371[డి] అధికరణకు రాజ్యాంగంలోని "3వ అధికరణ'' వాదిగా లోబడి ఉండాలేగాని అందుకు విరుద్ధమైన దిక్కులో అది ప్రయాణించడానికి వీలులేదు సుమా! అందుకే "371డి'' అధికరణ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో తెలియని దిగ్విజయ్ సింగ్ లాంటి కొందరు శంకా పీడుతుల కోసమే భారత సుప్రసిద రాజ్యంగా నిపుణుడూ, కలకత్తా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, కేంద్ర లా కమీషన్ మాజీ సభ్యుడు, ఠాగూర్ లా ప్రొఫెసర్, భారత రాజ్యాంగ చట్ట భాష్యాకారుడూ అయిన దుర్గాదాస్ బసు ఆ అధికరణ గురించి యిలా వివరించారు : "371[డి] అధికరణను తీసుకు రావడంలో మౌలికమైన ప్రయజనం ఏమంటే : (1) ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం, తద్వారా రాష్ట్రమంతటా సమతుల్యమైన అభివృద్ధిని సాదించడం; (2) విద్య, ఉపాధి, పబ్లిక్ సర్వీస్ లో పౌరుల కెరియర్ అవకాశాలను రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో సమతుల్యంగా కల్పించడం'' [జస్టీస్ బసు "కాన్ స్టిట్యూషన్ లా'' పేజీ:384]! ఈ 371[డి] అధికరణ అఆదారంగానే ఎన్టీఆర్ హయాములో 610 జీ.వో. వచ్చిందని మరవరాదు! అయినప్పుడు, ఈ "లక్ష్యాన్ని'' చేరుకునే ప్రయత్నంలో భాగంగానే జస్టీస్ శ్రీ కృష్ణ కమిటీ (2010) ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, 1956కు ముందున్న పరిస్థితికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాంతాలలో నెలకొంటూ వచ్చిన అభివృద్ధినీ అంచనావేసి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ఇప్పటికీ వెనుకబడిన ఉన్న ప్రాంతం ప్రధానంగా రాయలసీమ మాత్రమేనని అధ్యయనం అనంతరం తేల్చి చెప్పింది! అంటే, మిగతా రెండుప్రాంతాలూ అభివృద్ధిలో సహజమైనతరతమ భేదాలతో 1956కు ముందుకన్నా నిస్సందేహంగా వివిధరంగాలలో ప్రగతిని రిజిస్టర్ చేశాయని స్పష్టం చేసింది! ఈ సందర్భంగా, మూడుప్రాంతాలూ అనుకున్నంత స్థాయిలో మరింత గణనీయమైన అభ్యుదయాన్ని సాధించలేక పోవడానికి కనపడుతున్న అసలు కారణాన్ని శ్రీకృష్ణ కమిటీ చెప్పడానికి జంకింది! దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు దేశ "అభివృద్ధి''కి ఎంచుకున్న పెట్టుబడిదారీ-భూస్వామ్య వ్యవస్థలో అసమాభివృద్ధి అనేది ఒక ప్రత్యేక లక్షణం. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''ను బేషరతుగా ఆమోదించిన ఫలితంగా ప్రభుత్వరంగం ఉనికి ప్రశ్నార్థకమై దేశ, విదేశీ బడా గుత్తవర్గాల ప్రయివేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరచుకోవడంతో ప్రభుత్వానిది 'బ్రోకర్' పాత్రగా మారవలసి వచ్చింది! ఏ 371[డి] అధికరణ ద్వారా పబ్లిక్ సర్వీసులలో ఉపాధి సౌకర్యాలు మూడుప్రాంతాలలోనూ కల్పించి పెంచాలనుకున్నారో అది కాస్తా 'గుంటపూలు' పూయడం ప్రారంభమయింది. ఉపాధి వనరుల బాధ్యతా అనేది ప్రయివేట్ గుత్త కంపెనీల, విదేశీ గుత్త పెట్ట్టుబడి సంస్థలకు బలవంతంగా బదిలీ చేశారు!   ఇందుకు అనుగుణంగానే 1991 నాటి ప్రజావ్యతిరేక ఆర్ధిక సంస్కరణలలో భాగంగా అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, ఇటు చంద్రబాబు టి.డి.పి. పాలనలోనూ ప్రభుత్వ సర్వీసులలో ఏడాదికి దాదాపు 2 శాతం బొప్పున ఉద్యోగుల ఉద్వాసనకు వేటుపడిందని మరచిపోరాదు! అలా ఉపాధి రంగాన్ని ప్రయివేట్ రంగంలోని బడా తోడేళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలి కూర్చున్నారు. ఉపాధి సమస్యలపైన అన్ని చోట్లా ఆందోళనలకు ఇదే ప్రధాన కారణం సుమా!  అందువల్ల పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గ వ్యవస్థను కనీసం రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థదిశగా సమూలంగా మార్చుకుంటే తప్ప భారీస్థాయిలో ఉపాధికల్పనకు అవకాశాలుండవు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, తమ మనుగడకోసం అవిఆశాపెట్టే "తాయిలాలు'' మారుతుండవచ్చు, కాని అసంఖ్యాకంగా వనరులు చూపించగల తయారీ వస్తూత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్)రంగం, వ్యవసాయరంగాలను పండపెట్టడం వల్ల గ్రామసీమల్లో ఉపాధి సౌకర్యాలు ఎదగవుగాక ఎదగవు! అందుకే ఈ పరిణామాలను ముందుగానే పసికట్టిన కొలదిమందిలో ఒకరు - ఆంధ్రప్రదేశ్ అవతరణకు అసలు బీజాలు నాటి తెలుగుజాతిని ఒక్క గూడుకిందికి చేర్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటంగ నాయకులలో ఒకరైన దేవులపల్లి వెంకటేశ్వరరావు 1973 మార్చి 4 నాటికే "జాతుల సమస్య''పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంట్ లో యిలా స్పష్టం చేయవలసి వచ్చింది :   "తమ స్థానాన్ని బలపర్చుకోడానికి, ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్నరాష్ట్రాలు ఏర్పరచడానికి నేటి పాలకవర్గాలు వ్యతిరేకమనే అభిప్రాయం తప్పు! ప్రత్యేక ఆంద్ర, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కొన్ని పాలకవర్గ ముఠాలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాల నినాదాన్ని అభివృద్ధి నిరోధక ముఠాలే లేవనెత్తుతున్నారనేది గమనించాలి. ఈ నినాదాలలోని అభివృద్ధి నిరోధక స్వభావాన్ని మిలిటెంట్ శక్తులు బట్టబయలు చేసి, ఆ నినాదా స్వభావం నుంచి తమను తాము విడదీసుకోవాలి. బడా ధనికవర్గం, విదేశీ పెట్టుబడి, భూస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణం. స్వయం నిర్ణయ హక్కు అనేది జాతిలో ఒక భాగానికి కాదు. తెలంగాణా ప్రజలు ఆంద్రజాతిలో ఒక భాగమేగాని ప్రత్యేకజాతి కాదు. అందువల్ల స్వయం నిర్ణయ హక్కు వుండేది ఆంద్రజాతి మొత్తానికే గాని మన తెలంగాణా ప్రజలకు కాదు .... దానికితోడు దేశ సమస్యలనుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను విడదీసి చూడడం అవాస్తవికమవుతుంది. నేడు సమైక్య రాష్ట్రంలోప్రజలను పీడిస్తున్న సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజలను పీడిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు నినాదాలు కూడా ప్రుజల వకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపవు''   అందువల్ల చెప్పొచ్చేమంటే, రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ లో మూడుప్రాంతాలవారి సర్వీసుల భద్రతా కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371[డి] అధికరణ అమలులో ఉన్నంత కాలం రాష్ట్రాన్ని విభజించే అధికారం రాజ్యాంగంలోని "3వ అధికరణ'' క్రింద కేంద్రప్రభుత్వానికి ఉండదుగాక ఉండదు! ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని నిరంకుశంగా కాంగ్రెస్ పాలకులు నిలిపివేసినట్టుగా "371(డి) అధికరణను 'ఢీ'కొనడం ఆ అధికరణకు రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యపడదు! అలాన్గే ఈ అధికరణ కింద కేంద్రం అధికారాన్ని చలాయించగల ఆదేశిక సూత్రాలుగానీ, కార్యనిర్వాహక ఆదేశాలుగానీ లేవు; పార్టీ వర్కింగ్ కమిటీ దొంగచాటుగా చేసిన తీర్మానానికి, అంతే గూడుపుఠాణీతో క్యాబినెట్ వేసిన ముద్రకూ నేరచరితులయిన లెజిస్లేటర్ లు శిక్షార్హులని చారిత్రాత్మక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాన్ని పార్లమెంటులో చర్చించకుండానే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సుకూ తేడాలేదు! స్థిరంగా ఉన్నా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చాలన్నా, తద్వారా కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి ముందు ఎంతో కర్మకాండను విధిగా అనుసరించి తీరాలి! 371(డి) అధికరణ ఆసరాగానే ప్రభుత్వ ఉద్యోగులలో మూడుప్రాంతాలలోని ఉద్యోగుల, విద్యార్థుల ప్రయోజనాల ప్రత్యేక రక్షణ కోసమే  రాష్ట్రాన్ని జోనల్ పధ్ధతి ప్రకారం వర్గీకరించడమూ జరిగిందని మరవరాదు! 371(డి) ప్రకారం ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప ఇతర కోర్టులకుగానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్ళుకుగానీ ఉద్యోగ నియామకాలు, బదిలీలూ, ప్రమోషన్ల విషయాల్లో జోక్యం తగదని తీర్పులు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ కు వర్తించే 371(డి) అధికరణకు మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ వస్తేనేగాని 3వ అధికరణ ప్రకారం రాష్ట్ర విభజన చెల్లదు! ఈ విషయంలో మరొక రాజ్యాంగ నిపుణుడు,సాధికార వ్యాఖ్యాత అయిన పి.ఎం. బక్షీ పేర్కొన్న వివిధ తీర్పులు కూడా ధృవపరిచాయి! వీటిని తెలుసుకోకుండా "విడిపోతేనే వికాసం''అనటం తెలుగువారి అభ్యుదయానికి చేటు! ప్రజలను విడగొట్టడం తేలికేగాని కలపడమే కష్టం సుమా!

ఎన్నికలలోగా రాష్ట్ర విభజన సాధ్యమేనా

  యుపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం మెల్లగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని నియమించడం, వారు నిన్నతొలి సమావేశం అవడం కూడా జరిగింది. అయితే మంత్రుల బృందం తమ పని పూర్తి చేయడానికి ఇప్పుడు నిర్దిష్ట కాల వ్యవధిని తొలగించడంతో, వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రవిభజన జరుగకపోవచ్చుననే ఒక సంకేతం వెలువడింది.   ఒకవేళ వారు చకచకా తమ పనులు చక్కబెట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ, అందులో వారు సూచించిన సలహాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ, సాధారణ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు.   సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే జరుగుతాయని అనుకొన్నా, దానికి రెండు లేదా మూడు నెలల ముందు ఎన్నికల షెడ్యుల్ మరియు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అప్పుడు బహుశః జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావచ్చును. అంటే ప్రభుత్వానికి ఉన్న సమయం ఇంకా కుచించుకుపోయి, మహా అయితే మరో రెండు లేదా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుందని అర్ధం అవుతోంది. ఒకసారి ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తరువాత, ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.   గనుకనే మంత్రుల బృందానికి కాలపరిమితి తొలగించినట్లు భావించవచ్చును. అందుకే షిండే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి సమాధానం చెప్పకుండా సమాధానం దాట వేసారు. తెలంగాణా రాష్ట్రం ఎన్నికల ముందు ఏర్పడుతుందో లేక తరువాత ఏర్పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఏఐసీసీప్రతినిధి పీ సీ చాకో అనడం కూడా అందుకే అయి ఉండవచ్చును.

కాంగ్రెస్ నేతలా మజాకా

  ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో జేరారంటేనే వారు సహజంగా చాల తెలివనవారని అర్ధం. అయితే తెలంగాణా కాంగ్రెస్ నేతల కంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మరో రెండాకులు ఎక్కువే చదివారని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో వారి డ్రామా ముగుస్తుందని అక్కడి నేతలకి, ప్రజలకీ కూడా స్పష్టంగా తెలుసు. ముగింపులో సస్పెన్స్ కూడా ఏమీ ఉండదు. ఆ డ్రామాని పాపం వారు చాలా వ్యయప్రాయసలకోర్చి విజయవంతంగా పూర్తి చేసారు.   కానీ ఆ డ్రామాను అందిపుచ్చుకొన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఈ డ్రామా ముగింపు వేరే విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, అదేమి తెలియనట్లు చాలా అద్భుతంగా, అమాయకంగా టీ- నేతల కంటే కూడా చాలా బాగా నటించేస్తూ, ఎవరూ ఊహించని కొత్త మలుపులు ఇస్తూ, డ్రామాని మంచి రక్తి కట్టిస్తున్నారు. అది ఎలాగో చూద్దాము.   తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు ప్రజలు తమను తిట్టక మునుపే, వారే తమను తాము, తమ పార్టీని తిట్టుకొంటూ, ఇక తమని, తమ పార్టీని తిట్టే అవకాశం ప్రజలకి ఇవ్వరు. ఇక వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని ప్రజల చెప్పవలసిన మాటలని, వారి కంటే ముందే సీమంధ్ర కాంగ్రెస్ నేతలే చెపుకొంటారు. వాళ్ళని, వాళ్ళ పార్టీని వాళ్ళే తిట్టుకొంటూ, మేము ఓడిపోతామని వాళ్ళకి వాళ్ళే శాపనార్ధాలు పెట్టుకొంటూ తిరుగుతుంటే, ఇక వారినేమనాలో తెలియక ప్రజలు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.   ప్రజల నుండి తమను తాము కాపాడుకొనేందుకు వారు కనిపెట్టిన ఈ గొప్ప విరుగుడు మంత్రం ప్రభావంతో హిప్నటయిజ్ అయిపోయిన ప్రజలు “వాళ్ళని మనం నమ్ముకొంటే, వాళ్ళు వాళ్ళ పార్టీని నమ్ముకొన్నారు. కానీ వాళ్ళని వాళ్ళ పార్టీయే మోసం చేసింది. పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు?” అంటూ వారిని కోపగించుకోవడానికి వచ్చి, వారి పట్ల సానుభూతి చూపడం మొదలుపెడుతున్నారు కూడా.   ఇక మరి కొందరు నేతలు “రాష్ట్రాన్ని చీల్చిన మా పార్టీలో ఇక ఎట్టి పరిస్థితుల్లో కొనసాగలేము. మేము బాగా హార్ట్ అయిపోయాము,” అంటూ సమైక్యవాదం వినిపిస్తున్న వైకాపాలోకి దూకి తమని తాము కాపాడుకొంటున్నారు.   కుల సమీకరణాలు లేదా వేరే ఇతర కారణాల చేత ఆ పార్టీలోకి దూకలేని వారు కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యహస్తం పట్టుకొని కొత్త సమైక్యపార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల వైతరిణిని దాటాలని ఆలోచిస్తుంటే, మరి కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతూ సోనియమ్మ హస్తం పట్టుకొని ఈ గండం గట్టేకాలని ప్రయత్నిస్తున్నారు.   కాంగ్రెస్ నేతలు పార్టీలు మారినా,మారకున్నా, అభిప్రాయలు మార్చుకొన్నా, కొనకపోయినా, అధిష్టానాన్ని తిట్టిన్నా, పొగిడినా అన్నిటి పరమార్ధం ఒక్కటే. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవడం. పాత చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుకొన్నంత మాత్రాన్న అందులో మనిషి మారిపోడు. అతని ఆలోచనలు మారిపోవు. అలాగే కాంగ్రెస్ నేతలు ఏ రంగు కండువా కప్పుకొని తిరిగినా, ఏ మాటలు మాట్లాడినా వారు కాంగ్రెస్ నేతలు కాకపోరు. వారి ద్యేయం రానున్న ఎన్నికలలో గెలవడమే తప్ప సమైక్యము కాదు ఏ గుడ్డూ కాదు.

యు.పి లో అసలు ప్రభుత్వముందా ..... రాహుల్

  యు. పి లోని అలీగడ్ ర్యాలీలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యు.పి లోని ముజఫర్ నగర్ లో జరిగిన అల్లర్ల లో అనేక మంది హిదువులు,ముస్లిం లు చనిపోయారని,యువతకు ఉద్యోగాలు లేవని ఇదంతా చూస్తుంటే అసలిక్కడ ప్రభుత్వం పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఎస్. పి,బి.ఎస్.పి లు ఉత్తరప్రదేశ్ ను కాపాడలేక పోయాయని అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందోరాహుల్ చూపిస్తానని అన్నారు. పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. యు.పి లో ఎవరు ఆకలితో చావకూడదు అంటూ ఆకలి చావుల నిర్మూలనకే కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత బిల్లును ప్రవేసపెట్టిందని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కోన్నారని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన భూసేకరణ బిల్లు ద్వారా రైతులకు సముచిత న్యాయం చేకూరుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మిత్ర పక్షమైన అఖిలేష్ ప్రభుత్వం పైన అంత అకస్మాత్తుగా రాహుల్ ఎందుకు నిప్పులు చేరిగారో పలువురికి అర్ధం కాలేదు.

ముఖ్యమంత్రి ఉద్వాసనకి రంగం సిద్దం అయినట్లేనా

  మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలెలా ఉన్నపటికీ, అవి ముఖ్యమంత్రి ఉద్వాసనకు అవసరమయిన తగిన పరిస్థితులను సృష్టించగలిగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగినప్పటి నుండి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగిస్తే సీమంద్రాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయనే భయంతో ఇంత కాలంగా సంకోచిస్తున్నకాంగ్రెస్ అధిష్టానానికి, ఇప్పుడు ఆయనను తొలగించడానికి మార్గం సుగమం అయింది. అందువల్ల ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ‘హస్తం’ కూడా ఏమయినా ఉందా? అనే అనుమానాలున్నాయి.   అదేవిధంగా రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతున్నఒకరిద్దరు సీమంద్రా మంత్రులు కూడా ముఖ్యమంత్రికి దినేష్ రెడ్డి చేత కిరణ్ కుర్చీకి ఎసరు పెట్టిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి.   ఏమయినప్పటికీ, దినేష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కిరణ్ వ్యతిరేఖ వర్గాలన్నిటినీ ఒక త్రాటిపైకి తెగలిగాయి. రాష్ట్రవిభజనను అడ్డుకొంటున్నందుకు ఆగ్రహంగా ఉన్నతెరాస, టీ-కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, ఆయన సమైక్యవాదంతో హీరోగా ఎదుగుతూ తమను పెద్ద జీరోలను చేసినందుకు కోపంగా ఉన్న కొందరు సీమాంధ్ర మంత్రులు, గతంలో కిరణ్ దెబ్బకు బలయిన మంత్రులు, తన నిర్ణయాన్నే సవాలు చేస్తున్నదుకు ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పించవలసిన అవసరం ఉందని భావించేందుకు ఎవరి కారణాలు వారికున్నాయి.   కాంగ్రెస్ అధిష్టానం కూడా తన హస్తానికి బురద అంటకుండా కాగల కార్యం గందర్వులే పూర్తి చేసినట్లు ఈవిధంగా దినేష్ రెడ్డి ముఖ్యమంత్రిని తొలగించడానికి మార్గం సుగమం చేస్తున్నపుడు కాదనేందుకు ఏముంటుంది?ఇక భక్తులు భగవంతుడు ఒకటే కోరుకొంటున్నపుడు ఇంకా ఆలస్యం దేనికి?   బొత్సవత్సలమయిన కాంగ్రెస్ అధిష్టానం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, త్వరలోనే సమైక్య కిరణాన్ని ఆర్పివేసి ‘తన వీర భక్తుడి కోరిక’ తీరుస్తుందేమో?       

జగన్ కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా?

  కాంగ్రెస్-వైకాపాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం వల్లనే జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయటకి వచ్చి సమైక్యరాగం ఆలపిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. జగన్ కోసం కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ జీవితాన్ని, చివరికి పార్టీని కూడా పణంగా పెట్టిందని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం గురించి ప్రత్యక పరిశోధన మరవసరం లేదు.   కానీ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజుల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడటం చూస్తే ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.   మొన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటం అంటే అతను సమర్ధుడనే కదా లెక్క? మోడీ తన పార్టీని సెక్యులర్ పార్టీగా మలచగలిగితే, భవిష్యత్తులో బీజేపీకి అనేక పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది,” అని అన్నారు. అంటే వైకాపా బీజేపీతో జతకట్టే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.   అయితే కాంగ్రెస్ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు అతను బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఆయన జైలు నుండి విడుదలయిన రోజునే సీనియర్ కాంగ్రెస్ నేత పీసీ చాకో “వ్యక్తులు జైలులో ఉన్నపటికీ, బయట ఉన్నపటికీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఈయవలసి ఉంటుందని” అని స్పష్టంగా చెప్పారు. మరటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? పది చార్జ్ షీట్లు వెనకేసుకొన్నఆయన, తనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు మళ్ళీ జైల్లోకి పంపగలదని గ్రహించకనే ఈవిధంగా మాట్లాడుతున్నారా? అని ఆలోచిస్తే కాదనే చెప్పవచ్చును.   కాంగ్రెస్-వైకాపాల మధ్య అనైతిక బంధం, జగన్ బెయిలు కోసం సీబీఐని ఏవిధంగా నిర్వీర్యం చేసిన సంగతినీ తెదేపాతో సహా అన్ని ప్రతిపక్షాలు కోడై కూస్తుంటే, దానిని స్వయంగా అధికార కాంగ్రెస్ నేతలే రూడీ చేస్తుంటే, వీటి నుండి బయట పడేందుకే నరేంద్ర మోడీని పొగుడుతూ, బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడుతూ ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   “ఆయన సోనియాను విమర్శించిన మరు క్షణమే ఆయన బెయిలు రద్ధవుతుందని” తెదేపా చేసిన ఆరోపణలు తప్పని ఋజువు చేసేందుకే ఆయన ఇప్పుడు సోనియా గాంధీని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. అయితే బహుశః ఇది కూడా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టేందుకేనని చెప్పవచ్చును.   అయితే ఈవిధంగా వ్యవరించడం వలన మరో ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ రానున్నఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచలేక పోయినట్లయితే అప్పుడు ఇదే ప్రాతిపదికన బీజేపీతో పొత్తులు సాగించడానికి మార్గం సుగమం అవుతుంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, వైకాపా కోరుండి మద్దతిస్తామని ముందుకు వస్తుంటే ఎందుకు కాదంటుంది? అందువల్ల రానున్న ఎన్నికలలో ఎవరు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగితే వారికే వైకాపా మద్దతు ప్రకటించడం ఖాయం.

సీమంధ్ర కాంగ్రెస్ నేతల కొత్త డ్రామా

  ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో సరికొత్త డ్రామా మొదలయింది. సీమంధ్ర నేతలలో కొంత మంది పదవులకోసం ఆశపడుతూ రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించారని కొందరు ఆరోపిస్తుంటే, కాదు వారే మమ్మల్ని చివరి నిమిషం వరకు మభ్యపెడుతూ రాష్ట్ర విభజనకు కారకులయ్యారని మరికొందరు ఆరోపిస్తున్నారు.   ఈ కొత్త డ్రామా మొదటి అంకంలో ప్రధాన పాత్రదారులుగా లగడపాటి, బొత్స సత్యనారాయణ తెరపైకి వచ్చారు. త్వరలోనే మిగిలిన పాత్రదారులు కూడా ముందుకు రావచ్చును. లగడపాటి మీడియాతో మాట్లాడుతూ కొందరు మంత్రులు పదవులకు ఆశపడి సమైక్యఉద్యమానికి ద్రోహం చేసారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బహిర్గతం చేస్తానని అన్నారు.   జరుగుతున్న పరిణామాలు గమనిస్తే లగడపాటి బొత్సను ఉద్దేశ్యించే అని ఉంటారని అర్ధం అవుతుంది. రాష్ట్ర విభజన జరగడానికి బొత్స సత్యనారాయణే కారకుడని బలంగా నమ్ముతున్న సమైక్యవాదులు ఆయనకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఎనాడూ చిన్న సంఘటన కూడా ఎరుగని ప్రశాంత పట్టణంగా పేరుగాంచిన విజయనగరం నేడు యుద్దభూమిగా మారిపోయింది. చివరికి కర్ఫ్యూకూడా విదించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.   దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన బొత్స తనపై పార్టీలో కొందరు లేనిపోని ప్రచారం చేస్తూ తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడగానే అందరూ కలిసి కట్టుగా రాజీనామాలు చేసి రాజ్యంగ సంక్షోభం సృష్టించి, రాష్ట్రవిభజనను అడ్డుకొందామని చెప్పినప్పుడు పార్టీలో కొందరు పెద్దమనుషులు విభజనను అడ్డుకొనేందుకు తగిన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని భరోసా ఇస్తూ, చివరికి వారే రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరించి, ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులను, శాసనసభ్యులను, చివరికి యంపీలను కూడా రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి బొత్స ఈ మాటలు అని ఉంటారని అర్ధం అవుతోంది.   ముందు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించిన బొత్స, ఆ తరువాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చివచ్చారు. ఆ తరువాత తిరుపతి వెళ్లినప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దేవుడిని ప్రార్దించానని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. మళ్ళీ మొన్న కిరణ్-భాదిత మంత్రుల సంఘం సమావేశంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకొని, అదేమాట దిగ్విజయ్ సింగ్, షిండే చెవిలో వేసేందుకు డిల్లీలో వాలారు.   అంతవరకు టీ-నోట్ పై రకరకాల కధలు చెపుతూ వచ్చిన షిండే, దిగ్విజయ్ సింగ్, బొత్స తమ చెవిన వేసిన వార్త తరువాత కేవలం టేబిల్ నోట్ మాత్రమే క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు మీడియాకు లీకులిస్తూ, ఎప్పుడో తయారు చేసి సిద్దంగా ఉంచిన 22 పేజీల సమగ్రమయిన టీ-నోట్ ను క్యాబినెట్లో ప్రవేశపెట్టడం, వెంటనే దానిని మంత్రి మండలి ఆమోదించేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అందువల్ల ఇక టీ-నోట్ శాసనసభ ఆమోదం కోసం రావడం కూడా అనుమానమే.   ఇటువంటి నేపధ్యంలో ఇప్పుడు బొత్స తాను నిర్దోషినని సంజాయిషీలు ఇచ్చుకొంటూ, ఇతరులను నిందించడం విశేషం. నిజం చెప్పాలంటే తిలాపాపం తలోపిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపంలో మొత్తం సీమంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ భాగం ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టే పనిలో మళ్ళీ ఈ కొత్త డ్రామకి తెర తీసారు. దానిని ప్రజలు ఇంకా గుడ్డిగా నమ్ముతారని వారు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏది ఏమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీరందరూ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం.  

టీ-నోట్ పై దిగ్విజయ్ తిరకాసు సమాధానాలు

  ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది గనుక దానిపై ఈ రోజు సాయత్రంత్రం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించవచ్చని మీడియాకు తెలిపారు. ఈ రోజు క్యాబినెట్ లో టీ-నోట్ ప్రవేశపెడతారా అనే ప్రశ్నకు జవాబు చెపుతూ ఆవిషయం నాకు కూడా తెలియదు. ప్రవేశపెడుతున్నట్లు మీడియాలో వార్తలు చూసాను,” అని జవాబిచ్చారు. అయితే రాష్ట్రవిభజన నిర్నయమనేది అందరి ఆమోదంతో తీసుకోన్నదే గనుక దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే ఇది ముఖ్యమంత్రికి ఆయన మీడియా ద్వారా ఇస్తున్న సందేశమని భావించవచ్చును.   కానీ, హోంమంత్రి షిండే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే టీ-నోట్ ఎప్పుడో పూర్తిగా తయారయ్యి షిండే వద్ద సిద్ధంగా ఉందని మరో తాజా వార్త.   ఈ టీ-నోట్ వార్తలతో సీమాంధ్ర నేతలలో, మంత్రులలో, ఉద్యోగులు, ప్రజలలో ఒక్కసారిగా మళ్ళీఅలజడి మొదలయింది. ఉద్యోగులు కేంద్రమంత్రుల ఇళ్ళను ముట్టడించి ధర్నాలు చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలనినిజమో కాదో ఖచ్చితంగా దృవీకరించవలసిన కాంగ్రెస్ నేతలిద్దరూ చెరో రకంగా మాట్లాడటం భాద్యతా రాహిత్యమేనని చెప్పక తప్పదు. రాష్ట్రవిభాజనపై వెనకడుగు వేసేది లేదని గట్టిగా చెపుతున్న దిగ్విజయ్ సింగ్, మరి టీ-నోట్ పై అంతే ఖచ్చితంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో తెలియదు   కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం తనతో నేరుగా సంప్రదింపులు జరుపుతోందని ప్రకటించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ రెండు రోజుల క్రితమే టీ-నోట్ క్యాబినెట్ ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలిపారు. అందువల్ల ఈరోజు టీ-నోట్ క్యాబినెట్ ముందుకు రాకపోవచ్చును.   . .

కాంగ్రెస్ నష్టబోతున్నా ముందుకే ఎందుకు

  రాష్ట్ర విభజన అంశంతో ప్రతిపక్షపార్టీలను దెబ్బతీయబోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో చాలా దెబ్బతింది. అయినా కూడా వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెపుతూ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో జగన్ ద్వారా ఉద్యోగులలో, అనం, డొక్కావంటి మంత్రులద్వారా తన స్వంత పార్టీలో చీలికలు సృష్టించేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. దీనివలన పార్టీ రెండు ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇంత మొండిగా ముందు సాగుతోంది? ఇది ఆ పార్టీ అవివేకమా? లేకపోతే అతి తెలివితేటలనుకోవాలా?అని ఆలోచిస్తే రెండూ కాదు, చాలా దూరాలోచన అని అర్ధం అవుతుంది.   ఏవిధంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం కంటే కేంద్రంలో అధికారం సాధించడంపైనే ఎక్కువుంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ కేంద్రంలో కోల్పోతే మాత్రం ఆ తరువాత వచ్చే నరేంద్ర మోడీ ముందే హెచ్చరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కోలుకోని విధంగా ఘోరంగా దెబ్బ తీయడం ఖాయం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కలలు కంటున్నకాంగ్రెస్ అధిష్టానం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్నిమోడీకి వదులుకోలేదు. వదులుకొంటే అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానం.   అవసరమయితే రాష్ట్రాన్ని వదులుకోవచ్చు కానీ కేంద్రాన్ని మాత్రం కాదు. ఒకవేళ కేంద్రంలో ఓడిపోయి, రాష్ట్రంలో గెలిచినా దానివల్ల కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగ ఒరిగేదేమీ ఉండదు. గనుక కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పరిచేందుకు అవసరమయిన యంపీ సీట్లను తప్పనిసరిగా రాష్ట్రం నుండే పోగేసుకోక తప్పదు. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్నిఒక్కటిగా ఉంచినా, ముక్కలు చేసినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్లా గెలిచే అవకశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. గనుక కనీసం తనకు మద్దతునిచ్చే పార్టీలు వైకాపా, తెరాసలకు అధికారం దక్కినా అది తనకు దక్కినట్లేనని కాంగ్రెస్ భావన కావచ్చును.   అందుకే రాష్ట్రoలో పార్టీ సర్వనాశనం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గగ్గోలుపెడుతున్నా పట్టించుకోవట్లేదని లేదని చెప్పవచ్చును. అదేవిధంగా రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచితే ఇన్నిసీట్లు, విడదీస్తే ఇన్ని సీట్లు సాధించి ఇస్తామని చెపుతున్న మాటలని కూడా విశ్వసించకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో తన ఓటమి ఖాయమని అందుతున్నఇంటలిజన్స్ నివేదికలేనను కావచ్చును.   ఈ గొప్ప రహస్యం చెప్పేందుకు ఇంటలిజన్స్ నివేదికలే అవసరం లేదు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెపుతారు. అందుకే కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం రాష్ట్రంలో అధికారాన్ని వదులుకొనేందుకు కూడా సిద్దపడుతోందని చెప్పవచ్చును.   మరి కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఈ దూర దురాలోచానకు రాష్ట్ర ప్రజలు ఎందుకు భారీ మూల్యం చెల్లించాలన్నదే ప్రశ్న.

బీజేపీ వైపు మళ్ళిన రాష్ట్ర రాజకీయాలు

  రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్ననేపధ్యంలో దీనికంతటికీ మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరగవలసిన రాజకీయాలు,ఇప్పడు అకస్మాత్తుగా బీజేపీ చుట్టూ తిరగడం మొదలయింది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలేవీ కూడా ఆ పార్టీని అసలు లెక్కలోకే తీసుకోలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పరిస్థితి మారింది.   మొదట, నరేంద్ర మోడీ తేదేపాతో స్నేహాసంకేతాలు పంపడంతో ఈ మార్పు మొదలయింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా అందుకు సానుకూలత చూపుతునట్లు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో మిగిలిన పార్టీలు ఉలిక్కిపడ్డాయి. రేపు ఢిల్లీలో ‘సిటిజన్ కౌన్సిల్ ఫర్ అకౌంటబులిటి గవర్నన్స్’ నిర్వహిస్తున్న ఓ సమావేశంలో చంద్రబాబు, మోడీ ఒకే వేదికపై కలువనున్నారు. ఇది ఆ రెండు పార్టీలు క్రమంగా దగ్గరవుతున్నాయని సూచిస్తోంది.   ఇక ఇంతకు ముందు బీజేపీతో అసలు పొత్తుల ఆలోచనే ఉండదని నిర్ద్వందంగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ చంద్రబాబులా మాటిమాటికి ‘యూ’ టర్న్ తీసుకోదని చెపుతూనే, తమ పార్టీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందని గట్టిగా చెపుతూనే, నరేంద్ర మోడీని మంచి పరిపాలనాధ్యక్షుడని పొగడటం, ఆయన అన్నిరాజకీయ పార్టీలను సెక్యులర్ వేదికపైకి వచ్చేలా కృషిచేయాలని కోరడం, రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలోఏ కూటమిని సమర్ధించాలానే విషయంలో తమ లెక్కలు తమకున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన మార్పు(యూ టర్న్?)గా చెప్పవచ్చును.   ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ‘బీజేపీ బూచి’ని చూపిస్తూ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనేలా చేయగలిగాడు. మళ్ళీ మొన్న హైదరాబాదులో జరిగిన సకలజన భేరి సభలో కూడా కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉండనే ఉందని మరో మారు ప్రకటించారు.   ఈవిధంగా రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ఒకేసారి బీజేపీ వైపు చూడటం చాలా ఆశ్చర్యకర పరిణామమే. బహుశః రానున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ అద్వర్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలున్నట్లు భావించడంవల్లనే మూడు పార్టీలు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయని భావించవవచ్చును.   అయితే ఈ మూడు పార్టీలకు మళ్ళీ వేటి కారణాలు వాటికున్నాయి. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే బీజేపీ ద్వారా సాధించుకోవాలని తెరాస, జగన్మోహన్ రెడ్డిపై ఉన్నసీబీఐ కేసుల దృష్ట్యా బీజేపీకి మద్దతు ఈయవలసిన అవసరం గుర్తించిన వైకాపా, ఒకవేళ కాంగ్రెస్ తెరాస, వైకాపాలతో జత కట్టినట్లయితే, రెండు ప్రాంతాలలో తన బలం పెంచుకొనేందుకు తెదేపా, బీజేపీ వైపు చూస్తున్నాయని చెప్పవచ్చును. అంతే గాక జాతీయ స్థాయిలో ఈ మూడు పార్టీలు చక్రం తిప్పాలనే కోరిక కూడా ఆ పార్టీ వైపు ఆకర్షింపజేస్తోందని చెప్పవచ్చును.   ఏమయినప్పటికీ ఇది బీజేపీకి చాలా కలిసివచ్చే అంశం. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు వాటివాటి అవసరాల కోసం మద్దతు ఇస్తే, బీజేపీ మాత్రం ఎందుకు కాదంటుంది? అయితే, రాష్ట్రంలో పొత్తుల విషయంలో బీజేపీ ఏ పార్టీ తనకు మంచి ఆఫర్ ఇస్తుందో దానికే ప్రాధాన్యం ఈయవచ్చును. అయినప్పటికీ, ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి ఏర్పడితే, ఈ మూడు పార్టీల సహాయం తీసుకోవచ్చును.   అయితే మోడీ ఈ మూడు కత్తులను ఒకే ఒరలో ఇముడ్చుకొని నేర్పుగా తన పని చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మోడీకి అది వెన్నతో పెట్టిన విద్యే.

కిరణ్ సమైక్య వాదన: తెరాసకు కిక్కునిచ్చే టానిక్కు

  కేంద్రం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత తెరాస భవిష్యత్ అయోమయంలో పడింది. కాంగ్రెస్ లో విలీనం కావాలా లేక ఆ పార్టీతో ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయంపై తీవ్ర ఆలోచనలు చేసిన తరువాత, విలీనం కంటే పొత్తులే ఇరు పార్టీలకి ఎక్కువ లాభదాయకమని నిర్ణయం అయింది. నాటి నుండి కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంచెం వెనకేసుకు వస్తూ, ఇద్దరికీ కొత్త ప్రత్యర్ధిగా మారిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంద్ర కాంగ్రెస్ నేతలపై బాణాలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టాడు.   కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇస్తానని చెపుతోంది గనుక టీ-కాంగ్రెస్ నేతలు ఇక రంకెలు వేయననవసరం లేదు. కానీ, తెరాస కూడా చేతులు కట్టుకొని కూర్చొంటే అది ఆ పార్టీకే నష్టం. గనుకనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించిన వెంటనే కాంగ్రెస్ నేతల కంటే ముందే తెరాస నేతలు ఆయనపై రంకెలు వేస్తూ టీ-కాంగ్రెస్ నేతలకు కర్తవ్యం ఉపదేశిస్తున్నారు.   తెరాస నేతలందరూ మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి చేస్తున్నపటికీ, ఆయన చేస్తున్నసమైక్యవాదన వలనే వారికి తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ఈ సదవకాశం దొరుకుతోందని చెప్పవచ్చును. తద్వారా ఇంతవరకు తెలంగాణా సాధించిన ఘనతను తమ ఖాతాలో వ్రాసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ, తామే ఏకైక తెలంగాణా రక్షకులమని డంకా బజాయించి చెప్పుకొనే సదవకాశం తెరాస నేతలు పొందుతున్నారు. ఇందుకు వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతయినా ఋణపడి ఉండాలి. రానున్న ఎన్నికల వరకు లేదా తెలంగాణా రాష్ట్రo ఏర్పడే వరకు ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు ప్రజలు రాష్ట్రవిభజనను ఎంతగా వ్యతిరేఖిస్తే అంతగా తెరాస బలపడుతుంది.   ఈరోజు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరుగబోయే సకలజన భేరి సభకు ఊహించన దానికంటే చాలా ఎక్కువ ప్రజలు తరలి వస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బూచిగా చూపించి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే. ఈ రోజు జరిగే సభలో తెలంగాణకు వ్యతిరేఖంగా జరుగుతున్నా కుట్రల గురించి మరింత వివరంగా మాట్లాడుతానని కేసీఆర్ చిన్నసస్పెన్స్ కూడా సృష్టించారు.

సమైఖ్యాంద్ర ఇంటి దొంగలు

    .... సాయి లక్ష్మీ మద్దాల   ఆంధ్రరాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ అధిష్టానానికి కోరి తెచ్చుకున్న కొరివిగ తయారయింది. ఆంద్ర ప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజనపై ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి కోరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో విభజన తీర్మానాన్ని గెలిపించుకోవటానికి కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తు గడలను జాగ్రత్తగా గమనించవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ తీర్మానం నెగ్గటం అసంభవం. ఎందుకంటె సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక. ఈ ఎత్తుగడలలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానంతో వై.ఎస్.ఆర్.సి.పి కుమ్మక్కు అయి తన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదింప చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు బట్టబయలు ఐన కారణంగా వై.ఎస్.ఆర్.సి.పి వ్యూహం మార్చి శాసనసభలో సమైఖ్యాంద్ర తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాలని ప్రకటించటం మొదలుపెట్టింది. ఈ తీర్మానం వలన కూడా తొందరగా విభజన చేపట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది ఉంటె జె.ఎ.సి ద్వారా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను రికార్డు చేసి ప్రధానికి,రాష్ట్రపతికి పంపించవచ్చు.                  వై.ఎస్.ఆర్.సి.పి రాజీనామా ఎత్తుగడలు విఫలం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం తన సొంత ఎమ్మెల్యేలని సమైఖ్యాంద్ర  కు అనుకూలంగా రాజీనామా చేయించి తద్వారా విభజన తీర్మానాన్ని గెలవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే బొత్స సత్యనారాయణ లాంటి తనకు అనుకూలురైన కొంతమంది ఎమ్మెల్యేలు,మంత్రులు చేత రాజీనామా చేయించి తద్వారా సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించి తెలంగాణ తీర్మానాన్ని గెలవాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఎత్తుగడగా కనిపిస్తోంది. రాజకీయనేతలు తమ పదవులను అడ్డం పెట్టుకుని ఎన్ని అవినీతులకు,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రజలు సహించారు,భరించారు,చూస్తూ ఊరుకున్నారు. కాని నేడు  ప్రజలు తమ జీవితాలు,తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే మాత్రం సహించబోరని నేడు జరుగుతున్న ఉద్యమాల ద్వారా బొత్సకు,జగన్ కు బోధ పడటక పోవటం విచారకరం.                   సమైఖ్యాంద్ర నినాదాన్ని భుజాన ఎత్తుకుంటూనే సమైఖ్యాన్ద్రకు ద్రోహం చేస్తున్న నేతల పట్ల సీమాంధ్రులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కై సమైఖ్యాంద్ర కు ద్రోహం చేస్తే సీమాంద్రలో సంఘ బహిష్కారానికి గురికాక తప్పదు. 

రాష్ట్ర రాజకీయాలలో క్విడ్-ప్రోలు

  జగన్మోహన్ రెడ్డి కేసుల పుణ్యమాని ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా న్యాయ సంబందమయిన అంశాల పట్ల కొంత అవగాహన ఏర్పడింది. జగన్ కేసుల్లో ఎక్కువగా వినబడే ‘క్విడ్-ప్రో’(నీకు ఇది-నాకు అది) సిద్ధాంతాన్నికాంగ్రెస్-వైకాపాలు ఇప్పుడు రాజకీయాలలోకి కూడా ప్రవేశపెట్టాయని, అందువలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా వాదన. అందుకు ప్రతిగా రానున్న ఎన్నికలలో వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా మద్దతు ఇస్తుందని చంద్రబాబు అంచనా.   ఈ ఫార్ములాను విజయవంతంగా అమలు చేసేందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెవిలో వేసి, వ్యూహాత్మకంగానే వైకాపా శాసనసభ్యుల చేత సమైక్యాంధ్రకి మద్దతుగా రాజీనామాలు చేయించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తద్వారా సీమాంధ్రలోతెదేపాను దెబ్బతీసి, వైకాపా రానున్నఎన్నికలలో పైచేయి సాధిస్తే, ఎన్నికల తరువాత పరిస్థితిని బట్టి ముందు నిర్ణయించుకొన్న‘క్విడ్-ప్రో’ నియమావళి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం పంచుకోవాలని కాంగ్రెస్-వైకాపాలు ఎత్తు వేశాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాలతో ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలు చేసుకొని, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణా లో కేసీఆర్ ని ముందుంచి తెదేపాను దెబ్బ తీయాలని వ్యూహం పన్నిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.   చంద్రబాబు ఆరోపణలలో వాస్తవం ఉండవచ్చుగాక, కానీ ప్రత్యర్ధ రాజకీయపార్టీలు తమ మనుగడ కోసం, అధికారం కోసం ఎటువంటి ఎత్తులు వేసినా వాటిని తట్టుకొని విజయం సాధించడంలోనే రాజకీయ నేతల గొప్పదనం తెలిసేది.   కాంగ్రెస్-వైకాపాలు ‘క్విడ్-ప్రో’ ఒప్పందం చేసుకొన్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో అదే ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న ఎన్నికలు తెదేపా-బీజేపీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఎన్నికలలో గెలిచేందుకు తెదేపా-బీజేపీలు చేతులు కలిపితే అప్పుడు అది కూడా క్విడ్–ప్రోగానే భావించాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెదేపా సహాయపడితే, తెదేపా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయపడే అవకాశం ఉంది.   అయితే ఈ నాలుగు పార్టీల మధ్య జరుగబోయే ఈ రాజకీయ ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలలో ఏ ఒప్పందం ఎవరికీ అధికారం కట్టబెడుతుందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.   ఈ సారి ఎన్నికలలో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మరియు కేసీఅర్ లు ప్రజలపై ఎంత ప్రభావం చూపగాలరనే అంశంపైనే వార్వారి పార్టీల విజయావకాశాలు ఆధారపడవచ్చును. ఈ సారి ప్రజలు వీరిలో సరయిన కాంబినేషన్స్ ను ఎంచుకోవలసి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో దేశంలో స్థిరమయిన ప్రభుత్వాలు ఏర్పడి పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. లేకుంటే ప్రజలకి ‘ఇన్-ఫ్రంట్, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్’ తప్పదు.

జగనన్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్

      ఎప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల సొంత పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. సీమాంధ్రలోని 13 జిల్లాలు, తెలంగాణలో రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల సమైక్య ఉద్యమంలో అధ్యక్షుడి లక్ష్యాన్ని చేరుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.     తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఏకంగా సదస్సులు నిర్వహిస్తూ, నేతలు నిరాహార దీక్షలకు దిగుతూ ముందుకు వెళ్లగలుగుతున్నారని వివరించారు. చంద్రబాబు కన్నా ఎక్కువ దూరం పాదయాత్ర, ఆయనకు దీటుగా బస్సుయాత్ర చేసి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని ఆమె అన్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు పదవులకు రాజీనామా చేసి నిరాహారదీక్షకు కూర్చున్నా నియోజకవర్గాల్లో తగినంత ఫలితాన్ని రాబట్టలేకపోయామని పెదవి విరిచినట్లు తెలిసింది. ఇకపై సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పార్టీకి మైలేజ్ తీసుకురావాలని, గాంధీ జయంతి నుంచి ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం వరకూ ప్రజల్లోకెళ్లి కార్యక్రమాలు చేపట్టాలని పది కార్యక్రమాలతో కూడిన టైంటేబుల్ అందజేశారు. సమావేశానికి హాజరైన కో ఆర్డినేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పలువురు అసంతృప్తితో వెనుదిరిగారు.

'హస్తం' పడగలో ప్రజల భవిష్యత్తు

    ......సాయి లక్ష్మీ మద్దాల   నేటి ఆంద్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం ఎవరు అని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం అన్ని రాజకీయ పార్టీల నాయకులు అని. దీనిలో మొదటగా చెప్పుకోవలసింది సోనియాగాంధీ. తన కొడుకు రాహుల్ ను ప్రధానిని చేయటానికి రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాంగ్రెస్ పార్టీ వారు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజన ప్రక్రియ చేపట్టామని చెబుతున్నారు. మరి సోనియా గాంధీ అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకోవటానికి శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ చదివారా?చదివినతరువాత కూడా ఆమె ఆ నిర్ణయం తీసుకుంటే తెలుగు వారి పట్ల ఆమెకు ఎంత ద్వేష భావం ఉందొ తెలుసుకోవచ్చు. ఇక చరిత్ర చూసినా ఇందిరాగాంధీ కుటుంబానికి తెలుగువారంటే ఎటువంటి అభిప్రాయం ఉందొ వేరుగా చెప్పనవసరం లేదు. నాటి బ్రహ్మానందరెడ్డి,నీలం సంజీవరెడ్డి నుంచి మొదలు నేటి తరానికి తెలిసిన పి.వి.నరసింహా రావు,  ఎన్.టి.రామారావు, రాజశేఖరరెడ్డి,  చంద్రబాబునాయుడు లాంటి తెలుగు నేతల సత్త వారికి బాగా తెలుసు. అందుకే విభజించి పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నారు.     ఇంతకు ముందు  తెలంగాణ కోసం  తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగితే,నేడు సమైక్యాంధ్ర కోసం సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. వీటన్నిటి నేపధ్యంలో విభజన జరుగుతుందా అంటే జరగదు అనే విశ్లేషణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.  విభజన దిశగా కేంద్రం ముందుకు వెళ్తే సీమాంద్ర మంత్రులకు,ఎంపి లకు ఈ పరిస్థితులలో కేంద్రంలో ఉన్న మైనార్టీ  ప్రభుత్వాన్ని గద్దె దించటం తప్ప మరొక అవకాశం లేదు. ఇక విభజనను సమర్ధిస్తున్న బి.జె.పి లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడి హైదరాబాదులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ టి.డి.పి ని పొగడటం,సమైఖ్య వాది ఐన రామారావుని ప్రసంసించటం లాంటివి చేసినా, నిన్న విజయవాడలో జరిగిన సేవ్ ఆంద్రప్రదేస్ సభకు సీమాంద్ర బి.జె.పి  నేతలు సంఘీభావం తెలపటాన్ని చూసినా  వారు నెమ్మదిగా రాష్ట్ర విభజన విషయంలో యు టర్న్ తీసుకుంటున్నారని అర్ధమవుతుంది.                         ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సాధ్యం కాదు. 2014 లో సమైఖ్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. పైన ఉదాహరించుకున్న పరిణామాల నేపధ్యంలో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు కూడా రావు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వివిధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రెండు ఉప ప్రాంతీయ పార్టీలైన టి. ఆర్.ఎస్,వై.ఎస్.ఆర్.సి.పి లను బలోపేతం చేసి,టి.డి.పి ని బలహీన పరచి ఈ రెండు ఉప ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో తిరిగి 2014 ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కలలుకంటోంది. 2004లోను 2009లోను రెండుసార్లు కేంద్రం లోను రాష్ట్రం లోను కాంగ్రెస్ ను అధికార పీఠం మీద కూర్చోబెట్టిన తెలుగువారిపట్ల వారు అనుసరిస్తున్న వైఖరికి తగిన బుద్ధి చెప్పే అవకాశం తెలుగు ప్రజలకు ఈ ఎన్నికలలో కలుగనున్నది.                         మళ్ళి ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. దేశాన్ని ప్రగతి పధం వైపు నడిపించగల తగిన సత్తా,సామర్ధ్యం గల నేత కోసం దేశం నేడు ఎదురు చూస్తోంది. అలాంటి నేతను ఎన్నుకోవటానికి ప్రజలకు మళ్ళి ఒక బంగరు అవకాశం వచ్చింది. కులమతాల కతీతంగా,ప్రాంతాలకు,వర్గాలకు అతీతంగా అవినీతి మరకలు లేని,సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగిన,దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించ గలిగిన సమర్ధుడైన నేతను ఎన్నుకొనే బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ప్రజలు ఇప్పుడు కనుక చైతన్య వంతులు కాకపోతే, అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ నే అనాలోచితంగా గెలిపిస్తే ఈ దేశాన్ని రక్షించటం ఆ భగవంతుడి వల్ల  కూడా కాదు.