మీ సభ ఏందిరో.. ఈ నరుకుడేందిరో!

 

 

 

ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో బలం తగ్గిపోయి, రెంటికీ చెడ్డ రేవడిలా జగన్ పరిస్థితి తయారైంది. తెలంగాణని వదిలేసినా, సీమాంధ్రలో అయినా పరువు నిలుపుకోవడానికి జగన్ నానా తంటాలూ పడుతున్నాడు. దాంట్లో భాగంగానే హైదరాబాద్‌లో శనివారం సమైక్య శంఖారావం సభ నిర్వహించబోతున్నాడు.

 

సీమాంధ్ర వరదల్లో కొట్టుకుపోతున్నా, హైదరాబాద్ తడిసి ముద్దవుతున్నా సభని వాయిదా వేసుకోకుండా తాను అనుకున్న రోజునే జరపాలని డిసైడయ్యాడు. సభ ఫెయిలైతే సీమాంధ్రులకు అవమానంగా వుంటుందన్న ఆలోచన కూడా లేకుండా సభ నిర్వహించబోతున్నాడు.  శనివారం జరగబోతున్న  ఈ సభ చుట్టూ అటు తెలంగాణవాదుల నుంచి ఇటు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలదన్నట్టు జగన్ మెప్పు పొందడం కోసం ఆయన పార్టీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్లు అభ్యంతరకరంగా వున్నాయి.



హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ జరపబోయే సమైక్య శంఖారావం సభకి ఎవరైనా అడ్డువస్తే నరికేస్తామని వైకాపా అధికార ప్రతినిధి రెహమాన్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి హెచ్చరికలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. హైదరాబాద్‌లో సమైక్య సభ జరపడం అల్లర్లు సృష్టించడానికే అని విభజన వాదులు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ ప్రశాంతంగా జరపడానికి కృషి చేయాలి. అలా కాకుండా నరికేస్తాం.. చంపేస్తాం లాంటి కామెంట్లు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



వైకాపా అధికార ప్రతినిధి చేసిన కామెంట్‌ని జగన్ గానీ, పార్టీలో ఇతర నాయకులు గానీ ఇంతవరకూ ఖండించలేదు. అంటే అధికార ప్రతినిధి చెప్పిన నరుకుడు కార్యక్రమం అధికారికంగానే నిర్వహిస్తారా? వైకాపా వాళ్ళు నరికేస్తూ వెళ్తుంటే నరికేయండి బాబూ అని ఎవరూ తలలు అప్పగించరు. నరుకుతామంటూ జరిపే సభ సమైక్య సభ ఎందుకవుతుంది? రాష్ట్రాన్ని రెండుగా నరికే సభే అవుతుంది.