హైదరాబాద్ పై మొదలయిన చిచ్చు

  హైదరాబాద్ పై రెండు ప్రాంతాలవారి పట్టుదలలు గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉన్నపటికీ, దానిపై సరయిన వివరణ ఈయకుండా, హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లుప్తంగా చెప్పి రాష్ట్ర విభజన ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం హైదరాబాద్ పై స్పష్టత ఈయకపోవడంతో దానిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు, వాదనలు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. కొంత మంది నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంటే, మరికొందరు దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మరో సరికొత్త రాజధానులు ఏర్పరచాలని వాదిస్తున్నారు.   చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న మంత్రి సి.రామచంద్రయ్య హైదరాబాద్ ను శాశ్వితంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మరో సరికొత్త ప్రతిపాదన చేసారు. అయితే, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి మధ్య తెలంగాణా ప్రాంతాలు ఉండటం వలన హైదరాబాదును శాశ్విత ప్రాతిపాదికన రాజధానిగా చేయడం అసాదయం. అయినప్పటికీ, అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నిన్న కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపివచ్చిన చిరంజీవి కూడా హైదరాబాద్ ను శాశ్విత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని కోరడం గమనిస్తే బహుశః కేంద్రం కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇటువంటి ప్రతిపాదనలు చేసినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదు.   రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే, ముందుగా రాజధాని హైదరాబాద్ పై రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న భయాలు, అపోహలు, అనుమానాలను తొలగించవలసి ఉంటుంది. హైదరాబాద్ మరియు ఇతర అంశాలను అధ్యయనంచేసి ఇరు ప్రాంతాల వారికి ఆమోధయోగ్యమయిన తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు నిన్ననే ప్రకటించింది.   అయితే, కేసీఆర్ వంటి అతివాదులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తుండటం వల్ల, అక్కడ స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల భయాందోళనలు మరింత పెరిగాయి. అనేక సంవత్సరాలుగా ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగులలో ఇటువంటివి చిచ్చు పెట్టి వారి మధ్య ఉద్రిక్తతలకు పెంచడం ఖాయం. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించడం ఖాయం. అందువల్ల కేంద్రం హైదరాబాద్ ను ముందు తన అధీనంలోకి తీసుకొని ప్రజల అపోహలు దూరం చేయడం మంచిది. లేకుంటే రెండు ప్రాంతాల అతివాదుల వాద ప్రతివాదాల కారణంగా ప్రజల మధ్య ఘర్షణ చెలరేగితే మరో కొత్త సమస్య మొదలవుతుంది. చేతులు కాలిన తరువాతనే ఆకులు పట్టుకొనే అలవాటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇకనయినా ఆ అలవాటు మానుకొని ముందుగానే మేల్కొంటే మంచిది.

మ‌జ్లీస్ తెలం'గానం'

  తెలంగాణ‌ ప్రాంతంలో ఉంటూ కూడా మొద‌టి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తున్న ఏకైక పార్టీ మ‌జ్లీస్ తెలంగాణ ఏర్పాటు అయితే త‌మ ప్రాభ‌వం త‌గ్గడంతో పాటు బిజెపి బ‌ల‌ప‌డుతుంద‌న్న అనుమానంతో తొలి నుంచి ఆ పార్టీ ప్యత్యేక రాష్ట్రన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తుంది. అయితే ఎవ‌రి వ‌త్తిళ్లుకు త‌లొగ్గని అధిష్టానం తెలంగాణ‌ను ప్రకటించేసింది. దీంతో ఇప్పుడు త‌రువాత రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎలా ఉండాలి అన్న అంశం పై దృష్టి పెట్టింది మ‌జ్లీస్‌. తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్రల‌ను సెటిల‌ర్స్ అని పిల‌వ‌కుండా వారి స్వేచ్చకు ఎలాంట భంగం క‌లుగ‌కుండా చూడాల‌ని మ‌జ్లీస్ పార్టీ నేత అస‌దుద్దీన్ ఒవైసీ కోరారు. అలా ఇక్కడి సీమాంద్రల‌కు ర‌క్షణ క‌ల్పించిన నేప‌ధ్యంలో తెలంగాణ‌కు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేసేందుకు సిద్దం అని ప్రక‌టించారు. విభ‌జ‌లన అనివార్యమైనందున తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి మ‌ద్దతు ప్రక‌టిస్తున్నామ‌న్నారు. తెలంగాణ‌తో పాటు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల డిమాండ్‌ల‌పై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టాల‌న్నారు. గ‌తంలో రాయ‌ల్ తెలంగాణ విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చిన మ‌జ్లీస్ భ‌విష్యత్తులో కూడా ఆ అంశం తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

తెగ‌దెంపులు అన్నంత సులువేనా

  కాంగ్రెస్ అన్నంత ప‌ని చేసింది. 50 ఏళ్లుగా న‌లుగుతున్న తెలంగాణ విష‌యాన్ని మూడు రోజుల్లో తేల్చేసింది.. 10 జిల్లాల‌తో కూడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు యుపిఏ స‌ర్కార్ కూడా స‌మ్మతిస్తూ ఏక వాఖ్య తీర్మానం చేసింది. నాలుగు నెల‌లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిచేస్తామ‌న్న కాంగ్రెస్ రాజధాని విష‌యంలో మెలిక పెట్టింది. గ‌తంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సంద‌ర్భంలో తీసుకొని విదంగా తెలంగాణ విష‌యంలో ఉమ్మడి రాజ‌ధాని విష‌యాన్ని తెలర‌పైకి తెచ్చింది. అది కూడా ప‌ది సంవత్సరాల సుధీర్ఘ కాలం హైద‌రాబాద్‌ను రెండు రాష్ట్రాల‌కు ఉమ్మడి రాజ‌ధానిక‌గా ఉంటుంద‌ని ప్రక‌టించింది. ఈ స‌మ‌యంలో చ‌ర్చించఉకోవాల్సి మ‌రో అంశం అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును 5 నెలల కాలంలో పూర్తిచేయ‌గ‌ల‌దా.. అసెంబ్లీ అభిప్రాయ సేక‌ర‌ణ‌, పార్లమెంట్‌లొ బిల్లు పెట్టడం, నీళ్లు గ‌నులు స‌రిహ‌ద్దులు లాంటి అనేక అంశాల ప‌రిష్కారం ఇలా ఎన్నో స‌మ‌స్యల‌తో ముడి ప‌డి ఉన్న ఈ విష‌యం అంత త్వర‌గా తేలుతుందా.. దీనికి తోడు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై సీమాంద్ర ప్రాంతం భ‌గ్గుమంది. అక్కడి ప్రజ‌ల‌ను ప్రజాప్రతినిధుల‌ను ఎలా బుజ్జగిస్తారు. ఇలా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో స‌వాల్లు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 200 రోజులుగా పైగా ప‌డుతుంద‌ని ప్రక‌టించిన కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు నెల‌లోనే రాష్ట్ర ఏర్పాటు చేస్తామ‌ని ఎలా ప్రక‌టించింది. ఇలాంటి ఎన్నో  ప్రశ్నల‌కు కాంగ్రెస్ అధినాయ‌కత్వం నుంచి స‌మాధానం రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ పై తేల్చిన కాంగ్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునంద‌నే చెప్పాలి.

రాష్ట్ర రాజకీయ నేతల వితండ వాదన

  నేడు కేంద్రం రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక సరికొత్త వితండ వాదన అందుకొన్నాయి. అదేమంటే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకొనే హక్కు ఉత్తరాది నేతలకు ఎవరిచ్చారు? అని. ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాదినేతలందరూ కలిసి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించడం ఏమిటని ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. నిజమే, వారి వాదన సహేతుకమే. అయితే వారికి ఆ అవకాశం ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించుకొంటే మన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలేనని చెప్పవలసి ఉంటుంది.   రాష్ట్ర విభజనపై ఉద్యమం మొదలయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే చూసుకోన్నాయి తప్ప, ఎ ఒక్క పార్టీ కూడా విజ్ఞత కనబరచి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మేధావులను సమావేశ పరచి సమస్యను రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నం చేయలేదు. నిజానికి రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనవలసిన ఈ సమస్యను కాంగ్రెస్, తెరాసలు తమ స్వలాభం కోసం సమర్ధంగా పెంచి పోషిస్తే, మిగిలిన రాజకీయ పార్టీలు తమవంతుగా తలో పుల్ల వేస్తూ ఆ మంటను మరింత ఎగదోసాయి. తత్ఫలితంగానే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాది నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందుకే నేడు వారు రాష్ట్ర విభజనపై సాధికారంగా మాట్లాడుతుంటే, మన రాజకీయపార్టీలు, వాటి నేతలు ఇప్పుడు మా రాష్ట్రం మీద ఉత్తరాదివారి బోడి పెత్తనం ఏమిటని మండి పడుతూ వితండ వాదనలు చేస్తున్నారు.   రాష్ట్ర సమస్యను రాష్ట్ర రాజకీయపార్టీలు పరిష్కరించుకొనే తెలివిడి, ఐక్యాత, శ్రద్ధ లేకపోవడం వలననే వారు ఇందులో వేలు పెట్టె అవకాశం కలిగింది. అందుకు వారిని నిందించడం కంటే మన తెలివి తక్కువతనాన్ని మనమే నిందించుకోవడం మేలు. రాష్ట్ర విభజన సమస్యతో యావత్ తెలుగుజాతి ఆత్మగౌరవం డిల్లీ నేతల కాళ్ళ ముందు పెట్టి పరువు తీసుకొన్నతరువాత ఇక పోయిన ఆత్మగౌరవం గురించి బాధపడటం ఎందుకు?   పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత ఉత్తరాది, దక్షినాది అంటూ మరో సరికొత్త వాదన మొదలుపెట్టడం వలన కొత్తగా ఒరిగేదేమీ లేకపోయినా వారికి మనపట్ల వారికేర్పడిన చులకన భావం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి వితండ వాదనలు చేయడం మానుకోని కనీసం ఇక మిగిలున్నపరువునైనా కాపాడుకోగలిగితే అదే పదివేలు.

వైసిపి రాజీనామాస్త్రం

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ రెడీ చేస్తుంది అనుకుంటున్న త‌రుణంలో రాష్ట్రంలోని మిగ‌తా పార్టీలు ఇరుకున ప‌డ్డాయి.. కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఎవ‌రికి అనుకూలంగా జ‌రుగుతున్నాయో తెలియ‌క పోయినా ఇన్నాళ్లు ఇరు పక్షాల‌వారు త‌మ‌కే అనుకూలంగా జ‌రుతున్నాయని చెపుతూ వ‌చ్చారు.. కాని ఇప్పుడు సీన్ మారింది కాంగ్రెస్ అడుగులు ప్రత్యేక రాష్ట్రం వైపే అన్న సంకేతాలు అంద‌డంతో మిగ‌తా పార్టీలు త‌మ అస్త్రాల‌కు ప‌దును పెడ‌తున్నారు..  శుక్రవారం కోర్ క‌మిటీ భేటి నేప‌ధ్యంలో రాష్ట్రంలో ప‌రిణామాలు వేగంగా మారాయి.. ఉద‌యాన్నే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వీర‌శివారెడ్డి త‌న ఎమ్మేల్యే ప‌ద‌వితోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామ చేశాడు.. ఇదే స‌మ‌యంలో రేసులో తాము వెన‌క ప‌డ‌కూడ‌దూ అని భావించిన వైసిపి నేత‌లు కూడా రాజీనామాస్త్రాల‌ను ప్రయోగించారు.. వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంభందించిన వైయ‌స్ విజ‌య‌మ్మ త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఎమ్మెల్యేలు రాజీనామాలు స‌మ‌ర్పించారు.. స్పీక‌ర్ ఫార్మెట్లో రాసిన రాజీనామ ప‌త్రాలను స్పీక‌ర్ కార్యాల‌యానికి ఫ్యాక్స్ చేశారు.. దీనితో పాటు రాష్ట్రం స‌మైఖ్యంగా ఉంచ‌డానికి ఎటువంటి త్యాగాల‌కైనా సిద్దమ‌ని ప్రక‌టించారు..తమ పదవులకు రాజీనామా చేస్తూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక పెద్ద రాజ‌కీయ వ్యూహ‌మే ఉంద‌టున్నారు విశ్లేష‌కులు.. తెలంగాణ‌లో కేడ‌రే లేని వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ క‌నీసం సీమాంద్రలో అయిన హీరోలు అనిపించుకోవాలి అనే ప్లాన్‌లో భాగంగానే ఆ పార్టీ నాయ‌కులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు..

రాష్ట్ర విభజన జరిగితే కిరణ్ పరిస్థితి ఏమిటి

  కోర్ కమిటీలో సమైక్యాంధ్ర కోసం వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపితే రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తను అటువంటి పనిచేయబోనని ఆయన స్వయంగా చెప్పారు. అంటే, అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకొంటానని అంగీకరించినట్లే భావించవచ్చును.   తెలంగాణా అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంటే, మరో వైపు సీమంధ్ర నేతలు సమైక్యాంధ్ర సభలు, సమావేశాలు అంటూ చాలా హడావుడి చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, శైలజానాథ్, గంట శ్రీనివాస రావు, టీజీ వెంకటేష్ తదితరులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. కానీ వారెవరూ కూడా అధిష్టానాన్ని దిక్కరించే పరిస్థితి లేదు. వారు ఎన్ని సభలు నిర్వహించుకొన్నపటికీ అంతిమంగా అందరూ కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడేవారే. మరయితే, ఈ సమైక్యాంధ్ర సభలు, హడావుడి ఆందోళనలు ఎందుకు అని ప్రశ్నిస్తే, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమేనని చెప్పక తప్పదు.   రేపు అధిష్టానం రాష్ట్ర విభజన చేసినప్పుడు, వారందరూ మళ్ళీ మరోమారు బహిరంగ సభలు పెట్టి ప్రజలకి తాము ఏఏ కారణాలచేత, విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగా అందుకు అంగీకరించవలసివచ్చిందో సంజాయిషీలు ఇచ్చుకోవడం ప్రజలు చూడవచ్చును. కానీ, ఆ తరువాత, ఇంత కాలంగా తాము చేస్తున్న సమైక్యాంధ్ర కోసం చేస్తున్న పోరాటాలవల్ల ఏర్పడిన ప్రత్యేక గుర్తింపుని (యన్కాష్) సద్వినియోగించుకొంటూ వారందరూ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, హోం, ఆర్ధిక, రెవెన్యు వంటి కీలక పదవుల కోసం పోటీలు పడవచ్చును.   మరటువంటి భుజకీర్తులు తగిలించుకొన్నవారితో కిరణ్ కుమార్ రెడ్డి పోటీపడి, మళ్ళీ తన ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి కేవలం కోర్ కమిటీలో తను చేసిన వాదనల గురించి మాత్రమే చెప్పుకోవడానికి ఉంటుంది. అయితే, ఆ ప్రాధమిక అర్హత రేసులో పాల్గొనడానికి సరిపోదు గనుక ఆయన ముందున్న రెండే రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటుంది.   మొదటి ఆప్షన్: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, అధిష్టానానికి విధేయుడిగా ఉంటూ మళ్ళీ ముఖ్యమంత్రి దక్కించుకోవడం. రెండవ ఆప్షన్: (అధిష్టానానికి తన పరిస్థితి అంతా సవినయంగా విన్నవించుకొని, సోనియమ్మఅనుమతితోనే) రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామా చేసేసి తను కూడా ఒక వీరత్రాడు వేసేసుకొని, రేసులో పాల్గొంటూ ఆనక అధిష్టానం దయతోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడం. ఈ రెండు మార్గాలలో దేనిని ఎంచుకొంటారనేది వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తరువాత తేలిపోతుంది.   అయితే ఆయన వినయ విదేయతలకు, సమర్ధతకు మెచ్చిఅధిష్టానం కేంద్రానికి ప్రమోట్ చేసినా చేయవచ్చును. అదేజరిగితే, కిరణ్ పని తంతే బూర్లె గంపలో పడినట్లే మరి!

రాష్ట్ర విభజనలో హైదరాబాద్ పంచాయితీ

  రాష్ట్ర విభజనలో వేరే ఏ ఇతర అంశాల దగ్గరయినా పట్టు విడుపులు చూపుతున్న రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ అంశం వచ్చేసరికి అది తమకే చెందాలని బిగుసుకుపోతున్నారు. అందుకు కారణం హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధికరాజధానిగా నిలవడమే. హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం లేకపోతే రెండు ప్రాంతాలు కూడా మనుగడ సాగించడం కష్టం. భారీ పరిశ్రమలు, మెట్రో రైల్, విద్య వైద్య, సినీ, వ్యాపార సంస్థలు అన్నీకూడా హైదరాబాద్ లోనే నెలకొని ఉండటంతో రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అక్కడి నుండే వస్తోంది. అటువంటి హైదరాబాద్ ను వదులుకొంటే అటు తెలంగాణా అయినా, ఇటు సీమంధ్ర ప్రాంతమయిన ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు పుచ్చుకొన్నపటికీ మళ్ళీ ఆ స్థితికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టడం ఖాయం. ఒకవేళ దైర్యంచేసి ప్యాకేజీకి ఒప్పుకొన్నాఅవినీతికి ఆలవాలమయిన నేటి రాజకీయ వ్యవస్థలో అది సక్రమంగా వినియోగించబడుతుందనే నమ్మకం ప్రజలకి లేదు. అందుకే, రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ కోసం అంతగా పట్టుబడుతున్నారు.   ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఏపార్టీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టినా రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్ ని అభివృద్ది చేయడమేనని అపోహలోఉంటూ, కేవలం హైదరాబాద్ అభివృద్దిపైనే దృష్టి పెడుతూ, మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకి అతీతంగా తమ తమ ప్రాంతాలను సర్వతోముఖాభివృద్ధికి నిబద్దతగా కృషిచేసి ఉంటే నేడు హైదరాబాద్ గురించి ఈ గొడవలు ఉండేవే కావు.   అందువల్ల హైదరాబాద్ కోసం పట్టుబడుతున్న తెలంగాణా లేదా సీమంద్రా ఉద్యమకారులనో ఇందుకు నిందించవలసిన పని లేదు. తమ ప్రాంతాలను అబివృద్ధి చేసుకోవాలనే తపన లేని ప్రజాప్రతినిధుల వలననే నేడు ఈ సంకట పరిస్థితి ఏర్పడింది గనుక దానికి వారినే తప్పుపట్టవలసి ఉంటుంది.

జగన్‌ పోటికి అనర్హుడే

      అసెంబ్లీ రౌడీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ సినిమాలో హీరో జైలు నుంచే పోటి చేసి ఎలక్షన్స్‌లో గెలుస్తాడు.. ఎమ్మెల్యే అవుతాడు.. కాని ఇక పై అలాంటి సీన్స్‌ కనిపించక పోవచ్చు.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుతో ఇక జైలులో ఉన్న వ్యక్తులకు, వేరే ఏ ఇతర కారణాలతో అయినా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటిచేయడం కుదరదు..   పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల అనర్హతపై బుధవారం సంచలన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు మరో కేసులో ఈ తీర్పును ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలితే ఆ రోజు నుంచే వారు పదవులకు అనర్హులని జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన బెంచ్‌ రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. ఈ బెంచ్‌ గురువారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తికి మాత్రమే ఎన్నికల్లో పోటీ హక్కు ఉంటుందనని తెల్చి చెప్పింది.. జైలుకెళ్లడం, పోలీస్ కస్టడీ వల్ల ఓటు హక్కును కోల్పోయే వ్యక్తికి పోటీ చేసే అవకాశం కూడా ఉండదని చెప్పింది. అయితే ఏ చట్టం కిందనైనా ముందస్తు నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇప్పటికే కనీసం రెండేళ్ల శిక్ష పడిన వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక కస్టడీలో ఉన్న వారు కూడా పోటీ చేయడానికి వీల్లేదని తాజాగా పేర్కొంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఎలా ఉన్న రాష్ట్రరాజకీయలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపనుంది.. భావి ముఖ్యమంత్రి చెప్పుకుంటూ జైలు నుంచే చక్రం తిప్పుతున్న జగన్‌ ఎలక్షన్స్‌ లోపు బయటికి రానిపక్షంలో అతను ఇక ఎన్నికల్లో పోటి చేయడం కుదరదు..

రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు

  రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు కాంగ్రెస్ పార్టీ చర్చల పేరిట మళ్ళీ మరో మారు తెలంగాణా ప్రజలను మోసం చేయకపోతే రేపు జరగనున్న కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, వచ్చే ఎన్నికలలోగా విభజన ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల తరువాత మిగిలిన కార్యక్రమాన్ని తాపీగా పూర్తి చేయవచ్చును. అంటే, రేపు కాంగ్రెస్ గనుక తెలంగాణా అంశంపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసినట్లయితే, అన్ని రాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే సమాయత్తం కావలసి ఉంటుంది.   కేవలం తెలంగాణకే పరిమితమయిన తెరాస ఎన్నికలకి ఎప్పటి నుండో సిద్దంగానే ఉంది. అయితే, తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు మాత్రం రెండు రాష్ట్రాలలో పోటీ చేసేందుకు వీలుగా వ్యూహ రచన చేసుకోవడం కత్తి మీద సాము అవుతుంది. ముఖ్యంగా నాలుగు ప్రధాన పార్టీలకి మరింత తల నొప్పులు తప్పవు. రెండు ప్రాంతాలలో వాటికి బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, ఇప్పుడు వేర్వేరుగా ముఖ్యమంత్రి అభ్యర్ధులను నిర్ణయించుకోవడం, పార్టీ విధానాలు రూపొందించుకోవడం, రెంటి మద్య సరయిన సమన్వయం ఏర్పరుచుకోవడం వంటివి అనేక అంశాలు పార్టీలకు కొత్త సమస్యలు సృష్టించబోతున్నాయి.   రాష్ట్రం విడిపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డజన్ల కొద్దీ ఉన్న ముఖ్య మంత్రుల అభ్యర్ధుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని వారిలోంచి తగిన వారిని ఎంపిక చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం చాలా తల నొప్పులు భరించవలసి ఉంటుంది. ఇక తెదేపా విషయానికి వస్తే, సీమంధ్ర ప్రాంతానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావిస్తే, తెలంగాణా ప్రాంతానికి మరో అభ్యర్ధిని ఎంచుకోవడానికి కొంత శ్రమ పడకతప్పదు. వైకాపాకు కూడా ఇంచు మించు ఇదే సూత్రం వర్తిస్తుంది. బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు రెండు ప్రాంతాలలో కూడా ఆధిపత్యం సాధించడం అసాద్యం గనుక వాటికి ఇంత శ్రమ ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకి కూడా రెండు ప్రాంతాలలో తమ పార్టీలు, వాటి నేతలు తమ అధిష్టానానికి కట్టుబడి ఉండేలా చూసుకోవడం కూడా పెద్ద సవాలుగా మారవచ్చును.   వివిధ రాష్ట్రాలలో అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీకి ఈవిషయంలో కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోయినా తెదేపా, వైకాపాలకి ఇదొక కొత్త అనుభవమే అవుతుంది. ఇక రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్టీ విధి విధానాలు, మానిఫెస్టోలు, రాష్ట్ర నిర్మాణానికి తగిన ప్రణాళికలు వగైరా రచించుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే.   అయితే, ఏపార్టీకయినా రెండు ప్రాంతాలలో ఘన విజయం సాదించి అధికారం కైవసం చేసుకొంటే రెండు రాష్ట్రాల శాఖల మధ్య సమన్వయము చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ, కేవలం ఒక ప్రాంతంలో నెగ్గి మరొక ప్రాంతంలో ఓడిపోయినట్లయితే, పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు ప్రాంతాలలో ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు.   తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటే, సీమంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపా, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ తప్పదు. అయితే, కాంగ్రెస్ అటు తెరాసతో, ఇటు వైకాపాతో గనుక విలీనాలు లేదా ఎన్నికల పొత్తులు చేసుకోగలిగితే, తేదేపాకు గడ్డు సమస్యే అవుతుంది.

వైకాపాతో స్నేహానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ

  మొన్న దిగ్విజయ్ సింగ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గురించి రెండు మంచి ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత, అధిష్టానం మనసులో ఆలోచనలను పసిగట్టేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అందివచ్చిన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలని ఎంతో భక్తిశ్రద్దలతో చాలా ఘనంగా నిర్వహించేసారు. నిన్న మొన్నటి వరకు వారిలో చాల మంది ఏదో విధంగా ఆయనని తప్పుపట్టినవారే. కానీ డిల్లీ నుండి ప్రసారమవుతున్న సిగ్నల్స్ కి అనుగుణంగా తమ మైండ్ సెట్ కూడా వెన్వెంటనే మార్చేసుకొని, కొందరు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గొప్పదనం గురించి లెక్చర్లు ఇవ్వగా, మరి కొందరు అన్నదాన, రక్తదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.   కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా మళ్ళీ ఆయనపై ఇంత అభిమానం ఎందుకు పుట్టుకు వచ్చిందంటే దానికి కారణం ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. ఒకప్పుడు ‘రాజశేఖర్ రెడ్డి మా స్వంతం కానీ అతని కొడుకు మాత్రం మాకు శత్రువేనని’ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ కొడుకుది కూడా మా డీ.యన్.ఏ.నని చెప్పుకోవడం ఎందుకంటే, రానున్నఎన్నికలలోఅతనితో పొత్తులకోసమేనని చెప్పవచ్చును. రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణా అంశము, మరో వైపు జగన్, తెదేపాలు ఉన్నందున, రాష్ట్రంలో తాము మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలపక తప్పదనే చేదు నిజం గ్రహించిన్నందునే ఇప్పుడీ అవ్యాజమయిన ప్రేమ పుట్టుకొచ్చింది.   అయితే రాత్రికి రాత్రే పొత్తులు కుదుర్చుకోవడం వీలుపడదు గనుక, ఇప్పటి నుండే దానికి తగిన వాతావరణం కల్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ హైదరాబాదులో రెండు మంచిముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన దిగ్విజయ్ సింగ్, మళ్ళీ డిల్లీలో దిగిన తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుల గురించి మీడియాతో మరోసారి మాట్లాడారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలోని నేతృత్వంలోని సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని ఖరారు చేస్తుందని, అందులో భాగంగానే వైకాపా అంశాన్నీ పరిశీలించే అవకాశాలున్నాయని, అయితే తుది నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీయే తీసుకొంటారని ఆయన అన్నారు. ఈ విధంగా తరచూ జగన్ మోహన్ రెడ్డి పార్టీతో పొత్తుల గురించి మాట్లాడుతూ, ప్రజలు కూడా దానికి మానసికంగా అలవాటుపడిన తరువాత అప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తులో లేక విలీనం గురుంచో ఒక అవగాహనకు రావచ్చును.   అంటే అప్పటి నుండి ఇక ఒకరి తప్పులు మరొకరికి ఇంకా కనబడవన్నమాట. అయితే అంతవరకు షర్మిల, విజయమ్మ తదితర వైకాపా నేతలు కాంగ్రెస్ పార్టీని తిడుతూనే ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డిని తిడుతూనే ఉంటారు.

టీ-జేయేసీ నేతలని దువ్వుతున్నకాంగ్రెస్ అధిష్టానం

  కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై చేస్తున్న కసరత్తు గురించి, ఆ క్రమంలో ఎదురవుతున్న సాధక బాధకాల గురించి కేసీఆర్ కి తెలిసి ఉన్నపటికీ, అవేమి తెలియనట్లు అతను తమను నిందిస్తూ, తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నందున, కాంగ్రెస్ పార్టీ అతనిని వదిలించుకొని, ఇప్పుడు టీ-జేయేసీ నేతలని దువ్వుతోంది.   కేసీఆర్ తో పోలిస్తే టీ-జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్.కోదండరాంకి తెలంగాణా ప్రజలలో మంచి పేరుండటమే కాక, తెరాసకు ఎంత మాత్రం తీసిపోని స్థాయిలో ఆయన కుదురుకొనున్నారు. పైగా టీ-జేయేసీ నేతలు రాజకీయ పార్టీగా ఏర్పడనందున అటువంటి వారితో చేతులు కలిపినా వారి వల్ల ఎన్నికలలో తమకు ఎటువంటి నష్టము జరగదని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల వారికి తెలంగాణపై తను చేస్తున్న కృషిని వివరించి, వారి నుండి మరికొంత సమయం పొందే ఆలోచనలో ఉంది. వారిని గనుక ఒప్పించగలిగితే వారి ద్వారానే తెలంగాణా ప్రాంతంలో తనకనుకూల వాతావరణం సృష్టించుకోవాలని కాంగ్రెస్ ఆలోచన. తద్వారా తనకు తెలంగాణా విషయంలో మరికొంత వెసులుబాటు లబించడమే కాకుండా, తనపై తెరాస చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకొని తెరాసను రాజకీయంగా నిలువరించవచ్చని కాంగ్రెస్ ఆలోచన.   అందుకే, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం టీ-జేయేసీ సమావేశం అయ్యి, వారిని డిల్లీ రప్పించగలిగారు. అయితే, వారు డిల్లీ వచ్చీ రాగానే నేరుగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు మొదలుపెడితే, అక్కడ కేసీఆర్ మంటలు విరజిమ్మితే, అతనిని తట్టుకోవడం కష్టమని, వారు ముందుగా ప్రతిపక్ష నేతలందరితో రౌండ్ టేబిల్ సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం టీ-జేయేసీ నేతలు ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నపటికీ, వారు ఆ తరువాత తెలంగాణా కోసం వినతి పత్రం ఇచ్చే మిషతో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా వారితో సంప్రదింపులు జరిపేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది.   ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానానికి వారికి మధ్య సయోధ్య కుదురితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతల ద్వారా వారికి మరింత దగ్గిరయ్యే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం వారిని తనకనుకూలంగా మార్చుకొనగలిగితే, తెలంగాణాలో కేసీఆర్ ని, అతని తెరాస పార్టీని ఒంటరి చేసి తన టీ-కాంగ్రెస్ నేతలతోనే చెక్ పెట్టించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన.   త్వరలో రాజకీయపార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తానంటున్న ఉస్మానియా విద్యార్దుల సంఘం, టీ-జేయేసీ, రెండూ కూడా తెరాసకు వ్యతిరేఖంగా పనిచేసినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా లబ్ది చేకూరుస్తుది గనుక, ముందుగా కాంగ్రెస్ పార్టీ టీ-జేయేసీ నేతలని దువ్వడం మొదలుపెట్టింది.   ఇక, టీ-జేయేసీ నేతలకి కూడా ఇది ఊహించని అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చును. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో స్నేహ సబందాలు ఏర్పరచుకోగలిగితే, అది తమ రాజకీయ జీవితాలని మలుపు తిప్పి ఉన్నత శిఖరాలకి చేర్చుతుందని వారికి తెలుసు. అందువల్ల వారుకూడా అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకపోవచ్చును. వారి మధ్య సయోధ్య కుదిరితే ఇక కేసీఆర్ కి ముందున్నది ముసళ్ళ పండుగేనని భావించవచ్చును.

పంచాయతి నగారా దేనికోసం?

....సాయి లక్ష్మీ మద్దాల       పంచాతి ఎన్నికలకు రంగం సిద్దమయింది. రెండేళ్ళ తరువాత జరుగనున్న ఎన్నికలు ప్రజలలో ఆద్యంతం ఉత్కంఠతను రేపుతోంది. మరి ముఖ్యంగా 50%మహిళలకు రిజర్వేషన్ కల్పించి మరింతగా మహిళలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు పోటీదారులు. బి. సి లు మాత్రం ఈసారి ఎన్నికలలో తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. ముందు M.P.T.C. లకు , Z..P.T.C లకు ఎన్నికలు నిర్వహించి అప్పుడు గ్రామ పంచాయతి ఎన్నికలకు వెళ్ళటం అనే సాంప్రదాయాన్ని ఎందుకు మార్చారు. ఇహ గ్రామాల విషయానికి వస్తే గత రెండేళ్లుగా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేక గ్రామీణ ప్రాంతాలు వెల వెల బోతున్నాయి.   నేడు గ్రామాలలో వీధిదీపాలు,తాగునీరు,రోడ్లు,పాఠశాలలు,ఆసుపత్రులు లేక అక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇవి కేవలం రెండేళ్లుగా ఉన్న సమస్యలు కావు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇది ప్రజలను ఏలుతున్న ప్రభుత్వాల నిర్వాకం. ఇప్పటికైనా ఈపరిస్థితులు చక్కబడాలంటే చిత్తశుద్ధి గల సర్పంచ్ లు కావాలి. 4,000కోట్ల పంచాయతి నిధులు ఈ ఎన్నికల అనంతరం విడుదల కానున్నాయి. కాని ఈ నిధులు సక్రమంగా ఖర్చయ్యేనా !          ముఖ్యంగా రిజర్వేషన్ పేరుతో కొన్ని ప్రాంతాలను ఆయా కేటగిరిల కిందకు తెస్తున్నారు. అది ఎలా ఉందంటే కొన్ని ప్రాంతాలను S.C,S.T రిజర్వేషన్ చేసి ఆయాప్రాంతాలకు ఒక్క S.C అభ్యర్ధి,ఒక్కS.T అభ్యర్ది ఉంటె వారినే ఏకగ్రీవంగా ఎన్నుకొని అగ్రవర్ణాల వారి పెత్తనమే సాగుతుంది. మహిళా రిజర్వేషన్ కింద తమ బంధువర్గంలో ని అభ్యర్ధులకు ఇప్పించుకొని వేలంపాట ద్వారా పదవులు పొందుతున్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితులలో సర్పంచులకు స్వతంత్ర నిర్ణయాధికారం ఎలాఉంటుంది?దీనిని ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించి,అరికట్టే ప్రయత్నం చేయాలి,లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు గాక తప్పదు. భారతదేశ ఆత్మ పల్లెలలోనే ఉన్నదని గాంధీజి అన్నారు. కాని నేటి పల్లెల పరిస్థితి నానాటికి దిగాజారిపోతున్నది. వ్యవసాయం మొక్కుబడిగా మారింది. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం ఎవరు,ఏమిటి ?అక్కడ కోరవడుతున్న ఉపాధి అవకాశాలు,కనుమరుగవుతున్న కులవృత్తులు.              ఎన్నికల వేళ నేతలందరూ గ్రామాభివ్రుద్దే తమ ధ్యేయమని,వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని,దానికోసం హరితవిప్లవమని పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఎన్నికల అనంతరం అవన్నీ గాలిలో కలిసిపోతాయి. ఫలితం ఏళ్లుగా గ్రామ సౌభాగ్యం అలా వెనుకబడే ఉంటున్నది. గ్రామాలలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా,మద్యం సౌకర్యం పుష్కలంగా ఉంటోంది. అన్నిటికి మించి ఈనాటి ఈపంచాయతి ఎన్నికలను అన్ని పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సహకార ఎన్నికల బావుటాను మళ్లి ఎగురవేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ గెలుపునే రానున్న 2014 ఎన్నికల నగారగా మ్రోగించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. కానీ ఈరోజున ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించే అన్ని పార్టీలు ముఖ్యంగా T.R.S,Y.S.R.C.P లు వారి వారి పంతాలతో తెచ్చిన ఉపఎన్నికల కారణంగా కూడా పంచాయతి ఎన్నికలు ఆలస్యమైనాయి.అన్నిటికి మించి ఒకేసారి ఉద్యోగాల ప్రకటన విడుదల చేసి,వివిధ శాఖలలో 24,078పోస్టుల భర్తీకి సంభందించి ప్రకటన జారీ చేసింది.వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లను,డైరెక్టర్లను నియమించింది. పలువురు I.A.S,I.P.S అధికారులను బదిలీ చేసింది సర్కారు.                 మొత్తం మీద అన్ని రకాల తాయిలాలను చేతబూని ,అన్నిటికి మించి తెలంగాణ అంశాన్ని అరచేతిలో ఊరిస్తూ పంచాయతి ఎన్నికల బరిలో నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంత వాసులు ఎదురుచూసేది తమ బ్రతుకుల్లో వెలుగు కోసం. నాయకులను అందలం ఎక్కించటానికి కాదు . కానీ ఇక్కడ నాయకులు కోరుకుంటున్నది గ్రామీణాభివృద్ధి కాదు రానున్న ఎన్నికలకు తమ దారిని సుగమం చేసుకోవటానికి. ఇంకెప్పుడు ఈ దేశం బాగుపడేది.

జగన్ ను డీ కొనలేకనే వైకాపాతో దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోందా

  నిన్న దిగ్విజయ్ సింగ్ జగన్, రాజశేఖర్ రెడ్డిల గురించి చేసిన వ్యాక్యలతో కలవరపడిన కాంగ్రెస్ నేతలు వాటి పరమార్ధం వెతికే పనిలోపడ్డారు. జగన్, రాజశేఖర్ రెడ్డిల ప్రభావం తెలంగాణా కంటే సీమంధ్రాలోనే అధికంగా ఉండటంతో సీమంధ్ర నేతలలో ఈ విషయంపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. తాము జగన్ మోహన్ రెడ్డిని, అతని పార్టీని తమ ప్రాంతంలో నిలవరించగలమని గట్టిగా చెప్పకపోవడం వలననే, దిగ్విజయ్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో జగన్ పార్టీతో పొత్తులు తప్పవని హెచ్చరించారని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.   సీమంధ్రా ప్రాంతంలో, జగన్ చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అధిష్టానం గుర్తించినందునే, అయిష్టంగానయినా అతని పార్టీతో పొత్తులకు సిద్దపడి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. తద్వారా కొంత మేరయినా పార్టీకి నష్టం తగ్గించాలని భావించినందునే, దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా అని ఉండవచ్చునని కొందరు సీమంద్రా నేతలు అభిప్రాయ పడ్డారు.   ఇటువంటి నేపద్యంలో, తెలంగాణా అంశం మరింత కాలం సాగదీయడం వలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా మారుతుందనే ఆందోళనతోనే పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చేసేందుకు సిద్దపడుతోందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఈయకుంటే తెరాస చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి గట్టిగా చెప్పినందునే తెలంగాణా ప్రకటనకి సరికొత్త గడువు ప్రకటించారని భావిస్తున్నారు. పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు, అటు తెలంగాణా ప్రకటనకి, ఇటు జగన్ మోహన్ రెడ్డితో దోస్తీకి పార్టీ సిద్దం అవుతోందని వారు అబిప్రాయపడ్డారు.   దిగ్విజయ్ సింగ్ కేవలం పది రోజుల్లో రాష్ట్ర విభజనపై స్పష్టమయిన ప్రకటన చేస్తానని చెప్పడంతో, తాము ఈలోగానే జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొని పార్టీకి సీట్లు సాధించగలమని గట్టిగా చెప్పాలని సీమంధ్రా నేతలు ఆలోచిస్తున్నారు. లేకుంటే, ఈసారి కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన తరువాత మరిక వెనక్కి తగ్గే అవకాశం ఎంత మాత్రం ఉండదని వారు భావిస్తున్నారు. అందువల్ల మళ్ళీ వెంటనే మరో సమావేశమయ్యి జగన్ మోహన్ రెడ్డిని తాము ఏవిధంగా నిలువరించగలమో ఒక పధకం ఆలోచించుకొని డిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి వివరించి తెలంగాణాను, జగన్తో దోస్తీని ఎలాగయినా అడ్డుకోవాలని వారు నిశ్చయించుకొన్నట్లు సమాచారం.   క్రిందటి ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తే, ఈసారి జైల్లో ఉన్నపటికీ జగన్ మోహన్ రెడ్డి ఆపని చేయడం విశేషం.

కోదండరామ్ కి డిల్లీలో పనేమిటో

  ఒకవైపు టీ-కాంగ్రెస్ నేతలు నేడోరేపో తెలంగాణా ప్రకటన ఖాయం అంటూ ఒకటే హడావుడి పడిపోతుంటే, మరో పక్క తెరాస నేతలు మరియు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మాత్రం ఇదంతా కాంగ్రెస్ మార్క్ ఎన్నికల డ్రామా అని తేలికగా తీసిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం తమకు లేదని అంటున్నారు. తన పదేళ్ళ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోతుందేమోననే బెంగతో ఉన్న తెరాస నేతలు ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినప్పటికీ, తనకు తెలంగాణా సాధన తప్ప రాజకీయాలు ముఖ్యం కాదంటున్న కోదండరామ్ కూడా ఆవిధంగానే మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.   కేసీఆర్ ప్రోద్బలంతో, తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని పైకి ఎదిగిన అనేక మంది నాయకులలో ఆయన కూడా ఒకరు. ఆయనకు కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంచి పలుకుబడి ఏర్పడింది. గనుక, దానిని ఉపయోగించుకొని పూర్తి స్థాయి రాజకీయాలలో ప్రవేశించి, చక్రం తిప్పాలని ఆయన కూడా సిద్దపడుతునట్లున్నారు. అందుకే తెలంగాణా ఏర్పాటు గురించి మాట్లాడుతున్నటీ-కాంగ్రెస్ నేతలను కాదని, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కూడా పక్కనబెట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణా సాధనకి ఏమాత్రం ఉపయోగపడని జాతీయ నాయకులయిన జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బిశ్వాస్‌లతో జూలై 4న డిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. తద్వారా తెలంగాణా సాధన సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన కేంద్ర స్థాయిలో నేతలతో పరిచయాలు పెంచుకొని మరింత బలపడే అవకాశం ఉంది. బహుశః ఈ పరిచయాలు స్నేహాలు, తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకొనేందుకు కోదండరామ్ కి బాగా ఉపయోగపడవచ్చును.   ఆయన కేవలం తెలంగాణా సాధనే తనకు ముఖ్యమని భావిస్తున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణా ఈయదని ధృడంగా విశ్వసిస్తున్నపుడు, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కలవకుండా, తెలంగాణా ఈయలేని ఇతర పార్టీల నేతల్నికలవడం చూస్తే, కోదండరామ్ కి రాజకీయ ఆలోచనలున్నాయని అర్ధం అవుతోంది. ఆయన రాజకీయ నాయకుడు కాడు గనుక, బీజేపీని మతతత్వ పార్టీ అనే వంకతో ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పడానికి లేదు.   తెలంగాణా సాధనకోసం అవసరమయితే బొంత పురుగుని కూడా ముద్దు పెట్టుకొంటానని కేసీఆర్ చెపుతుంటే, కోదండరామ్ జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను కాదని, ఇతరపార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకోవడం కేవలం తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవేనని అర్ధం అవుతోంది. ఈవిధంగా తెలంగాణా అంశం ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ సోపానంగా మారిపోవడం చాల దురదృష్టకరం.

నిలదీసే హక్కు ప్రజలకు లేదా?

.....సాయి లక్ష్మీ మద్దాల       ఓట్లు అడిగేవాళ్ళు ఓటర్లకు తమను నిలదీసే హక్కు లేదంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు తమను నిలదీసే హక్కు ఇవ్వబోరట. ప్రజాస్వామ్యంలో వ్యవస్థను నడిపించేది రాజకీయ పార్టీలే. ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసి,మేనిఫెస్టో ప్రకటించి అందలమెక్కుతాయి. ఆ తరువాత వాటిలో అమలు కానివే ఎక్కువగా ఉంటాయి. వీటిపై ఆయా పార్టీలను నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. అది ఇపుడు చట్టబద్డంకూడా అయ్యింది. కాని సమస్యల్లా సమాచార కమిషన్ ముందు జనానికి సమాచార హక్కు ఇవ్వటం చట్ట వ్యతిరేకమని ప్రధాన పార్టీలు వాదిస్తున్నాయి. అధికారంకోసం అబద్ధపు వాగ్ధానాలు చేసి వాటిని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఏం చేయాలి?ఆయా పార్టీలను నిలదీయటం తప్పంటే ఎలా ?    ఏ  పార్టీ అయిన సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది చేసే విరాళాలు,వసూళ్లు, ఆయా పార్టీలలో ఉన్న అభ్యర్ధులు పాల్పడిన అవినీతి,దానికి సంబంధిత పార్టి వారిపై తీసుకొనే చర్యలు, ఎన్నికల సంస్కరణలకు సంబందించి ఆయా పార్టీలు చేసే సూచనలు...... తదితర వివరాలతో ఏవైనా సరే ప్రజలు అడిగిన తక్షణం సమాచారం ఇవ్వటానికి పార్టీలు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వివరాలకు సుభాష్ చంద్ర అగర్వాల్ బి.జె. పి,కాంగ్రెస్,సి . పి ఐ, సి. పి.ఎమ్,బి . ఎస్ . పి ,ఎన్. సి. పి  లను లిఖిత పూర్వకంగా అడిగారు. దానికి ఆయా పార్టీలు తాము ఆర్ . టి . ఐ  కిందికి రామని,తాము పబ్లిక్ అధారిటీలము కాదు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమని జవాబిచ్చాయి.                  ఇది ఎంతవరకు సమంజసం?ప్రజల విరాళాలతో,వివిధ సంస్థల విరాళాలతో నడిచే స్వచ్చంద సంస్థలు ఆర్ . టి . ఐ  పరిధిలో ప్రజలకు సమాధానం చెప్పటానికి సిధంగా ఉన్నపుడు ప్రజాధనం తో నడిచే ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పరు?ప్రజాస్వామ్యం లో ఆయా రాజకీయపార్టీలు వారి పారసర్సాకతను నిరూపించు కోవాలంటే ప్రజలకు ఎప్పుడు జవాబుదారిగానే ఉండాలి. వారసత్వ సంప్రదాయమే నేటికి భారత రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నపుడు ఆ పార్టీల ఆర్ధిక వ్యవహారాలు ఆ పార్టీలోని సభ్యులకైన ఎంతవరకు తెలిసే అవకాశం ఉంది. అటువంటపుడు ప్రజలకు తెలిసే అవకాశం ఇంకెక్కడుంది?ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోనికి అన్ని రాజకీయ పార్టీలు వస్తేనే నేడు వినబడుతున్న క్విట్ ప్రోకో పద్ధతి మాటున ఎంత అవినీతి జరుగుతుందనేది ప్రజలకు అర్ధమవుతుంది. ఎందుకంటే నేడు ఏ పార్టీ ఐనా ఒక వ్యక్తి నాయకత్వం లోనే నడుస్తోంది కనుక.  కోట్ల రూపాయల ఆదాయం ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వం నుండి ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతూ,సదరు పార్టీల  m.l.a,m.p లు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ,ప్రజల నుండి పార్టీ నిధులు వసూలు చేస్తూ,అధికారం ప్రజల కోసమే వినియోగిస్తున్నామంటూ,పబ్లిక్ అధారిటి కాదంటున్నారు. ప్రజలకు జవాబుదారి కాదంటున్నారు. రాజకీయ పార్టీలు,లెజిస్లేచర్ పార్టీలు అన్ని కూడా పబ్లిక్ అధారిటీలె అని సుప్రీం కోర్టు అంగీకరిస్తూ  c.i.c  తీర్పును సమర్ధించినా,పబ్లిక్ అధారిటి నిర్వచనానికి లోబడి ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు ఏ ప్రభుత్వానికి కాని,ఏ పార్టీకి కాని ధైర్యం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నటికి పబ్లిక్ అధారిటీలు కావని c.i.c చట్టాన్ని సవరించే ప్రమాదము లేకపోలేదు.  

ఉద్యమాల నుండి ఎన్నికలల వరకు తెలంగాణాయే సోపానం

  క్రమంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యమ పార్టీ తెరాసతో సహా అన్నీరాజకీయ పార్టీలు కూడా ఎన్నికలే ధ్యేయంగా ఎత్తులు వేస్తూ వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆవిధంగా ప్రవర్తించడం వింతేమి కాకపోయినా, ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస, ఉద్యమంలో పాల్గొన్నఇతర నేతలు కూడా ఇప్పుడు ఎన్నికలలు కనడం విశేషం.   ఉద్యమాన్నివదిలి ఎన్నికల బాట పట్టిన కేసీఆర్ దానిని సమర్దించుకోవడమే కాకుండా, నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్నవారికి కూడా ఎన్నికలలో పోటీ చేయాలనే ఆశ పుట్టించడంలో సఫలమయ్యాడు. అందువల్ల, ఇప్పుడు తెలంగాణా ఉద్యమకారులు ఇతరుల దృష్టిలో పలుచనవడమే కాకుండా, వారి ఉద్యమ నిబద్దతపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.   ఉజ్వల భవిష్యత్తు ఉన్నదాదాపు వెయ్యి మంది యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేస్తే, అందుకు బహుమానంగా కేసీఆర్ మరియు కొందరు ఉద్యమకారులు ఉద్యమాన్ని పక్కనపడేసి, ఎన్నికలలో గెలవడమే వారికి ఘన నివాళిగా భావిస్తున్నారు. కేసీఆర్ తమని ఉద్యమంలో పూర్తిగా వాడుకొని ఇప్పుడు తమకి టికెట్స్ఇవ్వట్లేదని కొందరు ఉద్యమకారుల అలకల గురించి వార్తలు చదవుతుంటే, వారిని ఆవిధంగా తప్పుదోవ పట్టించినందుకు కేసీఆర్ ని నిందించాలా? లేక తమ కర్తవ్యం మరిచి కేసీఆర్ ను నిందిస్తున్న ఉద్యమ నేతలను తప్పుబట్టాలా? అనే అనుమానం కలుగక మానదు.   కేసీఆర్ తనను తానూ ఏవిధంగానయినా సమర్ధించుకోగల సమర్ధుడు, గనుక తన లక్ష్య సాధనకు ఎన్నికలను ఒక మార్గంగా ఎంచుకొన్నానని ఆయన చాలా బాగానే చెప్పుకొస్తున్నాడు. అయితే గతంలోనే ఎన్నికలలో పోటీ చేసిన తెరాస ఇప్పుడు కొత్తగా ప్రజలకి ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీగా, అయిపోగానే వెంటనే ఉద్యమపార్టీగా రంగులు మార్చుకొంటుందని ప్రజలకీ అర్ధం అయిపోయింది. అయితే, ఉద్యమంలో ఉన్నవారు, తెరాసకు ‘బై-ప్రోడక్ట్’ గా పుట్టుకొచ్చిన టీ-జేయేసీ నేతలు, అనేక ఇతర జేయేసీ నేతలు కూడా ఎన్నికలలు కనడం మొదలుపెట్టడంతో ‘డిమాండ్ అండ్ సప్లై’ సమస్య ఏర్పడింది. ‘నోట్లు, సీట్లు, ఓట్లు’ అంటూ కేసీఆర్ మూడు ముక్కల్లో తన ‘ఎన్నికల విధానం’ ప్రకటించడంతో, ఆ రేంజిలోకి రాలేనివారు సహజంగానే అసంతృప్తికి గురయ్యారు. అందుకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకోవడానికో లేక స్వతంత్ర అభ్యర్దిగానయినా నిలబడి ఎన్నికలలో పోటీ చేయాలనో ఆరాటపడుతున్నారు.   రానున్న ఎన్నికలలో తెలంగాణాలో మరింత బలపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఇదంతా గమనించి టీ-జేఏసీ నేతలు ఉద్యమంలో ఉంటారో, లేక రాజకీయ పార్టీల్లో చేరుతారో తేల్చుకోవాలని తాజాగా ఒక అల్టిమేటం జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ‘టీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం ఉద్యమానికి నష్టం చేస్తుందని’ అంటూనే వారు తెరాస వైపు కాకుండా బీజేపీ వైపు వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.   ఈవిధంగా నేడు అందరికీ తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తుకి ఒక సోపానంగా మారిపోవడం చాల విచారకరం.

ఢిల్లీ సాక్షిగా ఆంధ్ర పరువు గంగ పాలు

...సాయి లక్ష్మీ మద్దాల       ఉత్తరాఖండ్ వరదలు రాజకీయ నేతలు కావలసినంత రాజకీయం చేసుకోవటానికి ఆటవస్తువుగా వినియోగించుకుంటున్నారు. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడి విపత్తు సంభవించిన తక్షణం స్పందించిన తీరు,దేశ ప్రజలందరిని అబ్బుర పరచింది. దానికి సదరు కాంగ్రెస్ నేతలు మోడీ హెలికాఫ్టర్లో తీసుకెళ్తున్నది వరద బాధితులను కాదు,ఓటర్లను అని విమర్శలు గుప్పించారు,వారు తమ భాద్యత విస్మరించారు. ఏదో ఇహ అవకాశం దొరికినపుడు దానినెందుకు జారవిడుచుకోవాలని భావించిన చంద్రబాబు ఢిల్లీ ఎ.పి భవన్ లో ధర్నాలని, ప్రత్యేక విమానమని ,ఎన్.టి.ఆర్ ట్రస్ట్ భవన్ నుండి డాక్టర్లని, వరద బాధితులకు రూ॥ 10,000/- పరిహారమని, మళ్లి ఇక్కడ హైదరాబాదు నుండి వారి వారి స్వస్థలాలకు కొడుకు లోకేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులని ఏవో ఆయన తంటాలు ఆయన పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు,సరే బాబుని చూసి బుద్ధి తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలు తమ వంతు బాధ్యత తాము బుద్ధిగా నిర్వహించకుండా నిన్న ఎ.పి భవన్ లో బాహాబాహికి దిగిన తీరు చూస్తే,వరద బాధితులు సహితం అసహ్యించుకుంటున్నారు. అసలే తెలుగు వారిని ఉత్తరాది వారు చాలా చులకనగా చూశారని యాత్రికులు ఒక పక్కన వాపోతుంటే మళ్ళి డిల్లీలో  ఏ. పి  భవన్ సాక్షిగా ఈ ముష్టి యుద్ధాలు,బూతు పురాణాలు,శవ రాజకీయాలు ఏమిటి? నేడు చంద్రబాబు ఉత్తరాఖండ్  వరద బాధితులైన తెలుగువారి విషయంలో చేసిన సహకారం కొని యాడ దగినదే,అయితే గత 9సం॥ లు గా ఆయన ప్రతిపక్షనేత గా ఉన్నపుడు ఐల తుఫాన్,లైలా తుఫాన్ అని చాలా రకాల ప్రకృతి వైపరీత్యాలు ఆంధ్ర ప్రదేశ్ లో ను సంభవించాయి. అపుడు కూడా చాలా మంది నిరాశ్రయులైనారు. ఇదేవిధంగా చంద్రబాబు వారికి కూడా తన వంతు సహాయాన్ని,సహకారాన్ని అందించి నట్లైతే చాలా బాగుండేది. పాదయాత్ర మానుకుని మరీ ఒకసారి వెళ్లి సదరు బాధితుల్ని మొక్కుబడిగా పేపర్లో ఫోటోల కోసం పరామర్శించి వచ్చేశారు గాని,వారికి కావలసిన తక్షణ సహాయాన్ని ఏనాడు అందించలేదు,ఇపుడు డిల్లీలో చేస్తున్న మాదిరిగా. అలాగే సదరు టి.డి.పి  ఎం.పి  లు కూడా చంద్రబాబు అమెరికా నుండి వచ్చేవరకు బాధితులను పట్టించుకోకుండా ఏమిచేస్తున్నారో తెలియలేదు. అంతేకాదు నేడు రాష్ట్రం లో చాలా సమస్యలు గత 9సం॥ లు గా రాజ్యమేలుతున్నాయి. వాటి మీద కూడా తగు రీతిలో శాసనసభలో పోరాటం చేసి ఉంటే బాగుండేది. అసలు సభకే హాజరవ్వకుండా అమెరికా యాత్ర ఒక సారి,పాద యాత్ర ఒకసారి.ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. ఇంకా వాటిని డిల్లి సాక్షిగా ఉత్తర భారతదేశం వారికి కూడా వాసన చూపించటం దేనికి?ఏది ఏమైనా ఈ రెండు పార్టీల పుణ్యమా అని నేడు డిల్లి సాక్షిగా గంగలో కలిసిన పరువుని ఎవరు బయటకు తీస్తారు?

తాగుడు ప్రభుత్వం

  కొత్త మద్యం విధానంలో పర్మిట్ రూమ్ లకు అనుమతి నిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దీంతో ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన బార్లు ఇప్పుడు గ్రామాల్లోను దర్శన మివ్వ నున్నాయి. 2లక్షల లైసెన్స్ ఫీజు సంత్సరానికి చెల్లించాలి. ఇప్పటివరుకు లైసెన్సు ఉన్న దుకాణాలు 5,979. ఈ సంత్సరం కొత్తగా లైసెన్సు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నవి 617. ఇప్పటికే లైసెన్సు ఉన్నవాటికి మరో సంత్సరం పాటు పోడిగిస్తుండగా,లైసెన్సు పొందనివాటిని మరోప్రాంతానికి మార్చి అక్కడ కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మినీ బార్ల సాంప్రదాయం జులై 1నుండి అమలులోకి రానుంది. ఈ లైసెన్సింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1700కోట్లు.   ఓట్ బ్యాంకు రాజకీయాలతో పనికిమాలిన సంక్షేమ పధకాల అమలుకోసం ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి ఇలా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఏవిధమైన చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. ఈ కొత్త మద్యం విధానం పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ రక్షణ పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగదు బదిలీ పధకం ద్వారా ప్రజలను సోమరి పోతులుగా చేసి ఇప్పుడిలా మద్యం దుకాణాలకు సిట్టింగ్ అనుమతులు జారీ చేయటం మూలంగా అసాంఘీక కార్యకలాపాలు చెలరేగిపోవా?మహిళాభ్యున్నతే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మహిళకు పొంచి ఉన్న అభద్రత పట్ల ఏమని సమాధానం చెపుతారు?   ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలను ప్రోత్సహించాలనే ఆలోచన ముఖ్యమంత్రి పరిపాలనా సామర్ధ్యాన్ని సంకించటం లేదా?ఒక పక్క ఉచిత విద్యుత్తు అని మరోపక్క విద్యుత్ కోతలని అటు రైతాంగాన్ని,ఇటు పారిశ్రామిక రంగాన్ని తీవ్ర నష్టాల పాల్జేసి,అన్ని ఉత్పత్తులు గణనీయంగా పడిపోవటానికి ప్రధాన కారణమైన కిరణ్ కుమార్ నిర్ణయ రాహిత్యాన్ని ఏమనాలి?బెల్టు షాపులు నిర్మూలించాల్సిన ముఖ్య మంత్రి ఈనాడు సిట్టింగ్ షాపులకు అనుమతి నిస్తుంటే ఇహ మహిళల భద్రత గాలిలో దీపమే కదా!నేతలు వారి వారి వ్యాపారాలను పెంచుకోవటానికి చేస్తున్న కుట్రలో ప్రజలు బలై పోవలసిందేనా?ఈమాత్రానికి ఇంకా ఎక్సైజ్ శాఖ ఎందుకు?తాగి వాహనాలను నడిపే వారిని అరెస్టులు చెయ్యటమెందుకు?