దరిద్రులం.. క్షమించు మహాత్మా!
posted on Oct 24, 2013 @ 6:34PM
భారత జాతిపిత మహాత్మాగాంధీ బ్రిటీష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేశారు. బ్రిటీషోళ్ళు మహాత్ముడికి చెందిన వస్తువులని వేలంలో పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రకంగా మహాత్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రం మహాత్ముడి వస్తువులను వేలంపాటల చెర నుంచి తప్పించలేనంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది.
గతంలో మహాత్ముడికి సంబంధించిన లేఖలు వేలానికి వచ్చాయి. ఎవరెవరో ఫారినోళ్ళు వాటిని వేలం పాటలో పాడుకుని వాటిని వ్యాపార వస్తువులుగా మార్చేశారు. భారత జాతి సంపదగా చెప్పుకోదగ్గ ఆ లేఖలను ఇండియాకి తిరిగి తెప్పించడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి గాంధీజీ ఉపయోగించిన వస్తువులు లండన్‌లో వేలానికి పెట్టారు. నవంబర్ 5న ఈ వేలం జరగనుంది.
ఎరవాడ జైలులో వున్న సమయంలో గాంధీజీ నూలు వడకడానికి ఉపయోగించిన చరఖాతోపాటు, గాంధీజీ ఉపయోగించిన మొత్తం 60 వస్తువులు ఈసారి వేలానికి పెట్టారు. గాంధీజీ చరఖా దాదాపు 60 లక్షలకు అమ్ముడయ్యే అవకాశం వుందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి వేలం వేసే వాటిలో గాంధీజికి సంబంధించిన ముఖ్యమైన నివేదికలు, పుస్తకాలు, ఫొటోలు కూడా ఉంటాయట. ఈసారి కూడా ప్రభుత్వం గాంధీజీకి సంబంధించిన ఈ వస్తువులను అవసరమైనంత డబ్బు ఖర్చుపెట్టి ఇండియాకి తెప్పిస్తుందన్న ఆశ కలగటం లేదు. తరతరాలుగా భారతీయులు అబ్బురంగా చూడాల్సిన గాంధీజీ జ్ఞాపక చిహ్నాలు ఇలా అంగడి వస్తువులుగా మారిపోవడం బాధాకరం. అందుకే... మహాత్ముడి జ్ఞాపకాల స్వాధీనం కోసం డబ్బు ఖర్చు పెట్టలేనంత దరిద్రంలో వున్న భారత ప్రభుత్వం తరఫున మహాత్ముడికి క్షమాపణలు!