చిరంజీవికి టైం బ్యాడ్!

 

 

 

మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ప్రతి విషయంలోనూ ఆయనకి చుక్కెదురే అవుతోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంచలనం సృష్టించాలనుకుంటే ఆ పార్టీ తనకే జలక్ ఇచ్చింది. ఆ పార్టీతో కొంతకాలం వేగిన తర్వాత చక్కగా కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి హోదాలో ప్రశాంతగా ఉండొచ్చని ఆయన భావించారు. కానీ అదేంటోగానీ, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా లేదు.. దాంతోపాటు ఆయనా ప్రశాంతంగా లేరు.

 

కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా హైదరాబాద్‌ని యు.టి. చేయాలన్న నేరానికి తెలంగాణ ప్రజలకి, పదవులకు రాజీనామా చేయని పాపానికి సీమాంధ్ర ప్రజలకి ఆయన దూరమైపోయారు. ఒకప్పుడు రాజాలా, తాను చెప్పిందే వేదంలా వెలిగిన ఆయన పాపం కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పినట్టు వినాల్సిన పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తానికి సీఎం అయిపోవాలని కలలు కన్న ఆయన ప్రస్తుతం సీమాంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఇందులో కూడా ఆయనకి పోటీ ఎక్కువగా వుంది. కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర సీఎం రేసులో వున్నవారిలో అందరికంటే వెనుకబడి వున్న వ్యక్తి చిరంజీవే!




ఈమధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా  శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి  ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడమే తప్ప చిరంజీవికి వరద బాధితులకు అధికారికంగా సాయం ప్రకటించే అవకాశం లేదు. నష్టపరిహారం అందేలా చేస్తాను, చూస్తాను అనే హామీలు మాత్రమే ఇస్తున్నారు. దాంతో వరద బాధితులు చిరంజీవి తమను పరామర్శించడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారు. దీనికితోడు చిరంజీవి ఎక్కడకి వెళ్ళినా ఆయనకి సమైక్య సెగ తగులుతోంది.



రాజాంలో విద్యార్థులు సమైక్య నినాదాలు చేస్తూ ఆయన మీద కంకర చిప్స్ విసిరారు. దరిద్రంలో అదృష్టమన్నట్టు ఆయనకి దెబ్బలేం తగల్లేదుగానీ, సెక్యూరిటీ సహకారంతో అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది.  మరోవైపు చిరంజీవి కారణంగా ఆయన కొడుకు రామ్‌చరణ్ కెరీర్ కూడా ప్రభావితం అవుతోంది. ‘ఎవడు’ సినిమా రిలీజ్‌కి రెడీ అయి చాలాకాలమైనా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. అటు విభజన వాదులు, ఇటు సమైక్య వాదులు ఆ సినిమా మీద కత్తికట్టి వున్నారు. చిరంజీవి పరిస్థితి ఇలా అయిపోవడం ఆయన అభిమానులకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది.