కొత్త మాఫియా...భక్తి మాఫియా పార్ట్-2
ఇంతక్రితం ఉదయం పూట టీవీ పెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతమో లేదా హనుమాన్ చాలీసానో వినిపించేవి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఉదయం ఎక్కడ చూసినా స్వామీజీల ప్రవచనాలు..సూక్తులు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఒక్కటే..! పబ్లిసిటి. అన్ని వ్యాపారాల్లో లాగే భక్తి వ్యాపారంలోనూ పోటి ఉంది. అందుకే జనాన్ని ఆకర్షించడానికి మంత్రాలు, తంత్రాలు చేసి వాళ్లను తమ ఆశ్రమాల దాకా రప్పిస్తున్నారు. అయినా సరిపోక కోట్ల రూపాయల డబ్బు కుమ్మరించి ఛానెళ్లలో కమర్షియల్ స్లాట్స్ బుక్ చేస్తున్నారు. కాని అందరికి ఒకటే టైం కావాలి. ఆ స్లాట్స్‌ని తమ సొంతం చేసుకోవడానికి అవసరమైతే సంవత్సరంలోని అన్ని ఏపిసోడ్స్‌కి ముందుగా అడ్వాన్స్ చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. అక్కడ కూడా పని జరగని పక్షంలో సొంతంగా ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడయితే ఉదయం నుంచి రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా డబ్బా కొట్టుకోవచ్చు.
ఇదివరకటి రోజుల్లో ఏ రాజకీయ పార్టీల నాయకులో..బడా వ్యాపార వేత్తలో..రియల్ ఎస్టేట్ కింగ్‌లో తమ వ్యక్తిగత అవసరాల కోసమో..లేక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడానికో సొంత ఛానెళ్లని ఏర్పాటు చేసుకునేవారు. కాని నోరు తెరిస్తే భౌతికమైనవి మేము ఆశించం. మాకు విశ్వమానవ శ్రేయస్సే ముఖ్యమంటూ పిచ్చి ప్రవచనాలు చెప్పే ఈ కుహనా స్వాములకు ఛానెళ్ల అవసరం ఎంటి? ఒక శాటిలైట్ టీవీ ఛానెల్ పెట్టాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్ధితుల్లో 200 నుంచి 300 కోట్లు కావాలి. సంచుల్లో బూడిద తప్ప ఇంకేమి లేదని కూసే ఈ స్వాములకు అంత డబ్బు ఎక్కడిది . ఇదంతా అవినీతి సంపాదన కాదా..? లేక ఏ వ్యాపారాలు చేయకుండానే అంత కూడబెట్టారా అంటే సమాధానం శూన్యం. ఇంతకు ముందు ఏ సత్యసాయి నిగమాగమంలోనో, లేదంటే ఏ తుమ్మ్లపల్లి వారి కళాక్షేత్రంలోనే సత్సంగాలు ఏర్పాటు చేసేవారు. అయితే తమ భక్తి వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే మరింత మంది జనానికి తమ గురించి తెలియాలి. కేవలం వ్యాపారం చేసే వారే ప్రజలకు తమ ప్రొడక్ట్ తెలియాలనుకుంటారు. అందుకే టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇస్తారు. మరి స్వామీజీలు స్లాట్స్ బుక్ చేయడం, ఛానెళ్లు పెట్టడం చూస్తే ఇదంతా వ్యాపారం కోసం చేస్తున్నారనుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రముఖ స్వామీజీ ఇటీవలే ఒక ఛానెల్‌లో కొంతవాటాను సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి "భారత్‌టుడే"అని సొంతంగా భక్తి ఛానెల్‌ను ప్రారంభించారు. వీటితో తమ గురించి డబ్బా కొట్టుకోవడంతో పాటు తమకు పోటి వస్తున్న వారికి వ్యతిరేకంగానూ ఉపయోగిస్తున్నారు. భూకబ్జాలు, డ్రగ్స్, లైంగిక ఆరోపణలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కల్కి లీలల గురించి అప్పట్లో ప్రతి టీవీ ఛానెళ్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తిప్పికొట్టాలంటే తనకు సొంత మీడియా ఉండాలని భావించిన కల్కి ఒక టీవీ ఛానెల్ ప్రారంభించాడు. దీని ద్వారా తనకు వ్యతిరేక వార్తలు రాసే వారి పనిపట్టే స్కెచ్ గీశాడు.
ఇదంతా పక్కన బెడితే స్వాములకు , స్వాములకు మధ్యే పడటం లేదు. బుధవారం నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాయిబాబా భక్తుడు సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రచించిన "నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా" అనే గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వార్త తెలుసుకున్న స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వాగ్వివాదానికి దిగారు. "సాయిబాబానే అవమానిస్తారా" అని ఒకరు "ఆదిశంకరాచార్యులనే అవమానిస్తారా" అని ఒకరు తీవ్రవాగ్వాదానికి దిగారు. ఇదే రమణానందకు తెలుగునాట ప్రవచనాల సామ్రాట్‌గా పేరొందిన చాగంటి సోమయాజీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
తాను షిరిడీ సాయిపై చెప్పిన మాటకు విరుద్ధంగా చాగంటి ప్రవచనాలున్నాయని రమణానంద కక్ష పెంచుకున్నారు. రమణానంద తన చేతిలో ఉన్న శివశక్తిసాయి అనే టీవీ ఛానెళ్లో చాగంటి మీద దుష్ప్రచారం చేయించడం, కొంతమంది తన అనుచరుల చేత చాగంటికి వ్యతిరేకంగా రోడ్లెక్కించడం చేశారు. రాగద్వేషాలు వదిలించుకోవాలని మనకి చెప్పే స్వాములే వాటికి లొంగిపోతే ఎలా? ఇంతకీ స్వామీజిల ప్రేమ దేని మీద హిందూ మతం మీదా.. హిందూ మతాన్ని నమ్మే ప్రజల మీద..లేక ప్రజల డబ్బు మీదా.? రాజకీయ నాయకులో, పారిశ్రామికవేత్తలో కోట్లకు కోట్లు అవినీతి చేశారంటూ గోల గోల చేసే రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య సంస్థలకు భక్తి ముసుగులో స్వామిజీలు కూడబెడుతున్న కోట్లు కనిపించడం లేదా..? ఒక వేళ ప్రశ్నిస్తే ఏమైనా పాపం చుట్టుకుంటుందని భయమా? అలా భయపడుతున్నంత కాలం మార్కెట్‌లోకి రోజుకొక కొత్త బాబా పుట్టుకొచ్చి వేల కోట్లకు అధిపతి అవుతాడు.
దేశంలో వేలకోట్లకు అధిపతులైన స్వామీజీలు:
నిత్యానంద:
తమిళ సినీనటి రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని ఫుల్ ఫేమస్ అయిన నిత్యానంద కొన్ని కోట్లకు అధిపతి. ఆయన వద్ద సుమారు 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏకంగా సీఐడీ దర్యాప్తులో తేలింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 100 ఎకరాల స్థలంతో పాటు, అమెరికా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. మహిళా భక్తులపై అత్యాచారాలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
స్వామి రాంపాల్ బాబా:
హర్యానాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రాంపాల్. డిప్లోమా వరకు చదివి కొంతకాలం ప్రభుత్వంలో ఉద్యోగం వెలగబెట్టాడు. దానిని వదిలిపెట్టి బాబా అవతారమెత్తి.. తనను తాను కబీర్ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. హిస్సార్‌లో మనోడీకి 12 ఎకరాల్లో సువిశాల సామ్రాజ్యం ఉంది. మొన్నటి మొన్న లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన ప్రైవేట్ సైన్యం చేత అడ్డగించాడు. వారిని చేధించుకుని కోటలోకి అడుగుపెట్టిన పోలీసులకు స్వామి వారి వైభోగం చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఇంధ్ర భవనాల్ని తలపించే ఆశ్రమాలు, బంగారు సింహాసనాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే.
ఆశారాం :
మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో అరెస్టై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు ఆశారాం బాపూజీ. భక్తుల వద్ద వసూలు చేసిన విరాళాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు...అమెరికాలోని కొన్ని సంస్థల్లో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈయనగారి వ్యక్త్తిగత ఆస్తులు 350 కోట్లుకాగా, అతని పేరిట బినామీ ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ ఉండవచ్చని ఈడీ అంచనా.
బాబా రాందేవ్:
దేశంలో ప్రముఖ యోగా గురువుగా పేరుగాంచిన బాబా రాందేవ్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. యోగా, ప్రవచనాలు చెప్పుకునే బాబాకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రధాన అనుచరుడు ఆచార్య బాలకృష్ణన్ ప్రకటించిన లెక్కల మేరకు రాందేవ్ వ్యాపార సామ్రజ్యం విలువ 1,100 కోట్ల రూపాయలుగా వెల్లడైంది. ఈయన గారికి సొంత టీవీ ఛానెల్ ఉంది దాని పేరు ఆస్థా.
కల్కిభగవాన్:
కల్కి భగవాన్ ఆలియాస్ "విజయ్ కుమార్". డ్రగ్స్, భూదందాలు ఇలా ఈయనగారి ఆశ్రమంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు , నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆశ్రమం ప్రక్కల ఉన్న భూమిని కల్కి ఆక్రమించాడని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. వివిధ దర్శనాలు, పూజల పేరుతో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నట్టు మీడియా కథనాలు ప్రచురించింది. తనపై వచ్చే ఆరోపణలను తిప్పికొట్టడానికి కల్కిభగవాన్ ఓ టీవీ ఛానెల్‌ని స్థాపించాడు.
బాబా గుర్మీత్ రామ్ రహీమ్:
బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా. సిక్కు మతంలోని ఒక శాఖ" డేరా సచ్చా సౌదా"కు ఈయన అధిపతి. భక్తులు యిబ్బడిముబ్బడిగా విరాళాలు ఇవ్వడంతో వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు అబ్బో బాబాగారి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. డేరా తన సంపదతో ప్రభుత్వాలను సైతం శాసించగలుగుతున్నాడు. 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్:
మనిషి ఒత్తిడిని తగ్గిస్తామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించిన పండిట్ రవిశంకర్ తన శక్తి, సామర్థ్యాలతో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎఓఎల్ ఫౌండేషన్ ఒక ప్రభుత్వేతర సంస్థ. విదేశాల నుంచి వచ్చే నిధులు దీనికి ప్రధాన తైలం. 156 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాల ద్వారా దాదాపు 1,000 కోట్ల ఆస్తులను రవిశంకర్ ఫౌండేషన్ కూడబెట్టిందని అంచనా.
మేము భగవంతుడికి, భక్తులకు మధ్య అనుసంధానకర్తలం మాత్రమే, మాకు భార్య, పిల్లలు, ఆస్తి, పాస్తి ఏమి లేవంటారు. అలాంటి వారికి బంగారు సింహాసనాలెంటి..? హంస తూలికా తల్పాలెంటి..? సంసారాన్ని, బంధుమిత్రుల్ని త్యజించాం..మాకున్న తోడు దేవుడొక్కడే అని చెప్పే స్వాముల్లో ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో "బంధాన్ని" కొనసాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మనకి మాత్రం ముక్తి పొందాలంటే బంధాలన్ని వదిలిపెట్టాలని శ్రీరంగనీతులు వల్లిస్తారు. అయితే ఇలాంటి స్వాముల్లో కూడా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వ్యక్తులున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైందవ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. సింహాసనాల మీద కాకుండా పేడతో అలికిన నేల మీదే ఆయన దినచర్య సాగుతోంది. ఆఖరికి కారులో బయటకు వెళ్లేటప్పుడు కూడా చెక్క పీట మీదే కూర్చునేవారు.
మంచికి రోజులు లేనట్టు జయేంద్ర సరస్వతి మీద కూడా కేసులు మోపి, ఆయన్ను జైలుకి పంపారు. కాని నిజం దాస్తే దాగేది కాదు అందుకే న్యాయస్థానం కూడా ఆయనపై నమోదైన అభియోగాలు నిరాధారమైనవని నిర్దోషిగా విడుదల చేసింది. దీనిని బట్టి మతం, రాజకీయం సమ్మిళతమైపోయాయని అర్థం చేసుకోవచ్చు. జనానికి, రైతుకు మధ్య దళారులు, కార్యాలయాల్లో దళారులు, ఇలా ప్రతి పనికి దళారులున్నట్లే మనకి..దేవుడికి మధ్యలో స్వామీజీలు, బాబాలు అనే దళారులు ప్రవేశించారు. అయినా భగవంతుణ్ణి అందుకోవడానికి మనకు కావాల్సింది నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండు ఆయుధాలతో చరిత్రలో ఎంతోమంది దేవుణ్ణి చేరుకున్నారు. కాబట్టి మనకు దళారులు అవసరం లేదు.
సశేషం
కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1