బానిసత్వంలో "భారతం"..!
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు పోటినిస్తున్నా..చంద్రమండలంపై అడుగుపెట్టినా భారతదేశం సాంఘికంగా ఎదగలేకపోతుందనడానికి రోజుకోక ఉదాహరణలు బయటకొస్తున్నాయి. మనం ఎప్పుడో కనుమరుగైపోయిందనుకున్న "బానిసత్వం" అసలు కనుమరుగుకాలేదు..ఇంకో విషయం ఏంటంటే బానిసత్వం గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువైంది. "వాక్ ఫ్రీ ఫౌండేషన్" అనే సంస్థ బానిసత్వంపై చేసిన సర్వేలో నిగ్గుతేలే నిజాలు వెలుగుచూశాయి. 121 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో దాదాపు 18 లక్షల మంది బానిసలుగా బతుకుతున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో బాలకార్మికులు, లైంగికంగా దగాపడ్డవారు, బలవంతంగా వివాహం చేసుకున్నవారు, ప్రభుత్వేతర సాయుధ దళాల్లో చేరేవారు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బానిసలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలిపింది. అంతేకాకుండా భారత్‌లో బానిసత్వం ఒక తరం నుంచి మరో తరానికి పాకుతోందని సర్వే పేర్కొంది.
బానిసత్వం మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. బలవంతుడు బలహీనుణ్ణి చెరపట్టడం అనాది నుండీ ఉంది. భారత ఇతిహాసాల్లో, పురాణాల్లో దాసదాసీల గురించి ఉంది. కూతురికి పెళ్లి చేసినప్పుడు తనతో పాటు తన చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం, వజ్రవైఢూర్యాలతో పాటు దాసదాసీలను కానుకగా ఇవ్వడం ఉంది. యుద్ధాల్లో బందీలుగా చిక్కిన వారిని, ఓడిపోయిన రాజ్యానికి చెందిన ప్రజలను బానిసలుగా అమ్మేవారు. ఆ రోజుల్లో ఎంతమంది బానిసలను కలిగి ఉంటే అంత గొప్పవారుగా పరిగణించబడేవారు.
రాజులు పోయినా..రాజ్యాలు అంతరించినా బానిసత్వపు విష సంస్కృతి మాత్రం భారతీయుల్ని వీడటం లేదు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి గ్రామాల్లోని పిల్లలను, మహిళలను, యువకులను అక్రమ రవాణా చేసే ముఠాలు వేశ్యా గృహాల్లో, ఇటుక బట్టీల్లో, టెక్స్‌టైల్స్ యూనిట్లలో వారిని విక్రయిస్తున్నారు. ఇప్పటికీ చేసిన అప్పులు తీర్చలేక కొడుకునో, కూతురునో పనిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఏళ్లకేళ్లు పనిచేసినా వడ్డీ తీరని సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీవితాంతం బానిసగా పడివుండటం తప్ప వారి జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడో మీడియా ద్వారానో..స్వచ్ఛంధ సంస్థల ద్వారానో తెలిస్తే విముక్తి లభించడం తప్ప మిగిలిన వారు బానిసలుగా చావాల్సిందే.