సొంతగడ్డ నుంచే కేసీఆర్‌కు మంట పెట్టనున్న కోదండరామ్..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా..తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా పాలనాపరంగా..రాజకీయంగా తిరుగులేకుండా పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ రూపంలో పెద్ద విపత్తు ఎదురైంది. టీఆర్ఎస్ పాలన సంతృప్తికరంగా లేదని, హామీలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ నోరు తెరిచారో లేదో టీఆర్ఎస్ దండు ఆయనపై దాడికి దిగింది. స్వరాష్ట్రం సిద్ధించాక సైలెంట్ అయిన టీజేఏసీ యాక్టివ్ కావడానికి ఇంతకన్నా మంచి ముహూర్తం దొరకదని గ్రహించిన కోదండరామ్ ప్రజల తరపున పోరాడటానికి మరింత చురుగ్గా పనిచేస్తాం అంటూ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడి నుంచో గొడవ చేస్తే అది కేసీఆర్‌కు నేరుగా తగలదని భావించిన కోదండరామ్ అందుకోసం సీఎం సొంత నియోజకవర్గాన్ని వేదిక చేసుకున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతుల పక్షాన పోరాటం చేయాలని కోదండరామ్ డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రిజర్వాయర్ నిర్మాణానికి 21,441 ఎకరాలు సేకరించేందుకు అధికారులు భూమిని గుర్తించారు. ఈ భూములన్నీ తొగుట, కొండపాక మండలాల్లోని 18 గ్రామాలకు సంబంధించినవే. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయి. భూసేకరణ నిమిత్తం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి 123, 214 జీవోలను వర్తింపచేస్తున్నారు.   ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కేటాయించిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా 50 వేలు కూడా పలకని చోట 50 లక్షలకు పలుకుతోంది.  ప్రభుత్వం ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షలు చెల్లించి చేతులు దులుపుకునేందుకు చూస్తుండటంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. దీంతో వీరు ఆందోళనకు దిగారు..తమకు పరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షలు, భూమికి భూమి, పునరావాసం, జీవనోపాధి కల్పించాలని పోరుబాట పట్టారు. ఇక్కడ ఇంతపెద్ద ఆందోళన జరుగుతున్నా స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బయటవారికి కనిపించడం లేదు. పైగా మంత్రులు, అధికారులు రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఫోకస్ చేసిన కోదండరామ్ వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అసలు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదన్న కోదండరామ్ నిర్వాసితులకు జేఏసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అంశంలో అవసరమైతే మేధాపాట్కర్ సాయంతో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ సొంతగడ్డ నుంచే మంటపెట్టడానికి కోదండరామ్ రెడీ అయ్యారు.  

తీరని కడుపుకోతకు రెండేళ్లు...

మృత్యువు నీటి రూపంలో కబళించిన రోజు..విహారయాత్ర విషాదయాత్రగా మారిన రోజు.. ఉన్నత చదువుతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్న విద్యార్థుల కలలన్ని కల్లలైన రోజు..ఆ రోజుకి ఇవాళ్టీతో రెండేళ్లు. అదే బియాస్ నది దుర్ఘటన. హైదరాబాద్ వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు 2014 జూన్ 1వ తేదీన స్టడీటూర్‌కు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సందర్శనకు వెళ్లి లార్జీ డ్యామ్ వద్ద నదిలోకి దిగారు. నదిలో నీరు లేకపోవడంతో ప్రకృతి అందాలను చూస్తూ..తోటి వారిని ఆటపట్టిస్తూ..ఫోటోలు దిగుతున్నారు. పెద్ద బండరాయిపై నిలబడి ఫోజులిస్తున్నారు. అప్పుడు సూర్యుడు పశ్చిమాన వాలి చీకటి పడుతోంది. అప్పటి వరకు లేని నీరు నదిలోకి వస్తోంది. కేరింతలతో ఉన్న విద్యార్థులు నీటి శబ్ధాన్ని గమనించలేకపోయారు.   చూస్తుండగానే ప్రవాహం ఉధృతమైంది..ఆ వేగానికి ఒక్కొక్కరు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయారు. 24 మంది జలసమాధి అయ్యారు. అత్యాధునిక పరికరాలతో రెండు వారాల పాటు శ్రమిస్తే గానీ మృతదేహాలు లభించలేదు. మానవతప్పిదం వల్లే బియాస్ దుర్ఘటన జరిగింది. నీళ్లను కిందకు వదిలే ముందు నలుగురు సిబ్బంది నది మొత్తం పర్యవేక్షించాలి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడానికి వీళ్లు లేదు. గేట్లు ఎత్తినవారిది, పరిసరాలను గమనించని కళాశాల నిర్వాహకులది ఇద్దరిది తప్పే.   ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జరిగిన ప్రమాదానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, డ్యాం విద్యుత్ బోర్డు, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, దీనిలో 60 శాతం హిమాచల్‌ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యామ్ బోర్డు..10 శాతం హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం..మరో 30 శాతం కళశాల యాజమాన్యం భరించాలని ఆదేశించింది. ఎంత నష్టపరిహారం చెల్లించినా బిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపు శకోం తీరదు. పుస్తకాలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కాలేజీకి వెళ్లే ఏ పిల్లాడిని చూసినా తమ బిడ్డేనేమోనని బావురుమంటున్నారు. ఇది తీరని వేదన..వీరంతా కోరుకునేది ఒక్కటే ఇలాంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదు..దేశంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదన్నదే వీరి ఆకాంక్ష.

చరిత్ర చెబుతూ తప్పులో కాలేసిన మోడీ..నెటిజన్ల కామెంట్లు..!

భారత ప్రధాని నరేంద్రమోడీ భారతదేశ చరిత్ర చెబుతూ తప్పులో కాలేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారతీయ సాంస్కృతిక సంపద అప్పగింత సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోణార్క్ ఆలయం గురించి ప్రస్తావించారు. నేటి ఆధునిక యువతుల్లాగా మినీ స్కర్టులు ధరించిన పర్సులను పట్టుకున్న విగ్రహాలను రెండు వేల సంవత్సరాల క్రితమే మన కళాకారులు చెక్కారని మోడీ వివరించారు.   ఇక్కడ ప్రధాని మూడు తప్పులు మాట్లాడారు. కోణార్క్ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితంది కాదు. 13వ శతాబ్ధంలో అంటే 1250 ప్రాంతంలో నిర్మించింది. దానిని నిర్మించి నేటికి 766 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. రెండోది కోణార్క్ ఆలయంపై ఎక్కువగా స్త్రీ, పురుషుల నగ్న లైంగిక విగ్రహాలు ఉంటాయి. కొన్ని స్త్రీ విగ్రహాలకు మాత్రమే నడుముకు నగలు ధరించినట్లుంది. వాటిని ఆధునిక స్కర్టులతో పొల్చలేం. ముచ్చటగా మూడో తప్పు పర్సు గురించి మాట్లాడటం. పూర్తిగా నగ్నంగా ఉన్న స్త్రీ, పురుషుల లైంగిక అవయవాలు కనిపించకుండా అది పర్సులాగా కాకుండా బ్యాగులాంటి ఆకారం అడ్డుగా ఉంటుందంతే. మోడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కోణార్క్ ఆలయం అంటే మోడీ, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనుకున్నట్లున్నారంటూ జోకులేశారు. మోడీ గారు కోణార్క్ ఆలయంపైనున్న విగ్రహాలను పరికించి చూడకపోయి ఉండవచ్చు గానీ, ఆయనకు మాటలు అందించిన అధికారులకు చరిత్ర తెలియదేమో అంటూ మరోకరు ట్వీట్ చేశారు. ఏదైమైనా మీరు ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి గురూజీ అంటూ ఇంకోకరు ట్వీట్ చేశారు.  

హాలీవుడ్ , బాలీవుడ్‌ను దెబ్బతీస్తోందా..?

హాలీవుడ్ సినిమాలనుద్దేశించి బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బి అమితాబ్ చేసిన వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో అలజడి రేపాయి. నిన్న ఆయన మాట్లాడుతూ హాలీవుడ్ సినిమాల దెబ్బకు భారతీయ సినిమాలు నష్టపోతున్నాయి. మనదేశం మాత్రమే కాదు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి చిత్రపరిశ్రమలపైనా హాలీవుడ్ తీవ్ర ప్రభావం చూపుతోందని..ఈ ప్రమాదం నుంచి మన చిత్రపరిశ్రమను కాపాడుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అమెరికాలో జరిగిన ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారు. నిజంగానే హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు భారతీయ సినిమాను నాశనం చేసేంత శక్తి ఉందా..? అంటే కొంతవరకు నిజమని ఒప్పుకోవాలి.   పెరిగిన సాంకేతికత, ప్రజల జీవన ప్రమాణస్ధాయి, అభిరుచుల్లో మార్పు రావడంతో మనవాళ్లకి సినిమాల పట్ల అవగాహన పెరిగింది. దానికి తోడు అతిపెద్ద దేశం కావడంతో భారతీయ మార్కెట్ స్థాయి విస్తృతమైనది. దీనిని గుర్తించిన హాలీవుడ్ దర్శక, నిర్మాతలు సినిమాలను డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం మొదలెట్టారు. కొన్ని సార్లు ఇతర దేశాల కంటే ముందుగానే మనదేశంలోని ప్రాంతీయ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం భారతీయ నటులను సినిమాలకు ఎంచుకోవడం, వారితో డబ్బింగ్ చెప్పించడం లాంటి వ్యూహాలను అమలు జరుపుతున్నారు. దీనికి తోడు కోట్ల రూపాయలకు వెనుకాడకుండా పబ్లిసిటీ చేస్తున్నారు. దీంతో భారతీయ చిత్రాలకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి హాలీవుడ్ చిత్రాలు వసూళ్లు రాబడుతున్నాయి. దానికి నిదర్శనంగా అవతార్, టైటానిక్, మమ్మీ, ద జంగిల్ బుక్, డెడ్‌ఫూల్, బ్యాట్‌మేన్ వర్సెస్ సూపర్‌మెన్ లాంటి చిత్రాలు భారతీయ అగ్రకథానాయకులు నటించిన చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాయి.   దీనికి కారణం మన స్వయంకృతమే.. భారతీయ సినిమా భారీ తనాన్ని సంతరించుకుంది కానీ తన మూస ధోరణిని వదల్లేకపోతోంది. రెండు ఫైట్లు, నాలుగు పాటలు, కాస్త కామెడీ.. సగటు భారతీయ సినిమా రూపమిదే. ఇలాంటి వాటిని చూసి చూసి జనానికి వెగటు పుట్టింది. పాత తరం వారు వినోదం కోసం వాటిని ఆదరించినా నేటి తరం..చదువుకున్నది, తెలివైనది కావడంతో మన సినిమాను ఆదరించడం లేదు. సహాజంగా కొత్తదనం కోరుకున్న నేటి తరం హాలీవుడ్ సినిమాల వైపు మళ్లీంది. సృజన, ఖర్చు, నాణ్యత, నవ్యత వంటి విషయాల్లో మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండవు.   వైవిధ్యమైన సబ్జెక్ట్‌లను టచ్ చేయడంలో మనోళ్లు గొప్ప స్థాయిలో ఉన్నారా? అంటే అదీ లేదాయె..! ఈ విషయంలోనూ ఇండియన్ సినిమాకు మైనస్ మార్కులే..! ఇన్ని లోపాలు ఉండటాన్ని గమనించిన హాలీవుడ్ ప్రముఖులు భారతీయ సినిమాపై రీసెర్చ్ చేసి ఏం చేస్తే భారతీయులకు నచ్చుతుందో కనిపెట్టారు. అందుకు తగ్గట్టుగా సినిమాలు రూపొందించి మన మీదకు వదులుతున్నారు, బాక్సాఫీసులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా మన దర్శక, నిర్మాతలు మేల్కోకుంటే భారతీయ సినిమా ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు..అమితాబ్ మాటలు నిజం కాక తప్పదు.  

కేరళ అమ్మాయిలు లుంగీలు కట్టడం వెనుక మర్మమేంటి..?

ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుషకాండ తర్వాత..దేశంలో మహిళల పట్ల పెరుగుతున్న అత్యాచారాల తర్వాత పెద్ద చర్చ మొదలైంది. సాంప్రదాయ భారతీయ వస్త్ర ధారణను పక్కనబెట్టి..పాశ్చాత్య వస్త్ర ధారణను అలవాటు చేసుకోవడం వల్లే స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని చాలా మంది పలు రకాల వాదాలను తెరపైకి తీసుకువచ్చారు. లోక్‌సభ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ కూడా భారతదేశ సంస్కృతిని నిలబెట్టుకునేందుకు..నా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు, బాలికలు హుందాగా ఉండే వస్త్రాలు ధరించాలని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలా కొంతకాలం పాటు సైలెంట్ అయిన ఈ వాదన కొత్తరకంగా మరోసారి బయటకు వచ్చింది. దేశంలోని వివిధ దేవాలయాల్లోకి ప్రవేశించే మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించే ఆలయాల లోపలికి ప్రవేశించాలని కొన్ని దేవాలయ పాలకమండళ్లు ఆదేశాలు జారీ చేశాయి. దీనిపై భూమాతా బ్రిగేడ్ లాంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గుడిలోకి వచ్చే వారు కల్మషం లేని మనసుతో, భక్తి భావంతో ఉండాలని దానికి వస్త్రధారణతో పనిలేదని భూమాతా బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తీదేశాయ్ వ్యాఖ్యనించారు.   ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న కేరళలో అమ్మాయిల వస్త్ర ధారణపై విధించిన ఆంక్షలు బయటపడ్డాయి. ఓ కళాశాల యాజమాన్యం అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకుని తరగతులకు హాజరవ్వకూడదని నిషేధం విధించింది. దీనిని నిరసిస్తూ అమ్మాయిలు లుంగీలు కట్టి, మగళ్లలా మోకాళ్లపైకి లుంగీని మడిచికట్టి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు కేరళలో అలాంటి నిషేధం ఏమి లేదని ఆ ఫోటోలు నిరసన తెలిపేందుకు కాదని శ్రీమంతుడు సినిమాలో మహేశ్ లుంగీని అనుకరించడానికే సరదాగా అమ్మాయిలు అలా చేశారని వాదన వినిపిస్తోంది. మరో వాదన ప్రకారం..గతేడాది మలయాళీ పండుగ ఓనంను పురస్కరించుకుని ఎర్నాకులంలోని ఓ కళాశాలలో అమ్మాయిలు లుంగీలు కట్టి డ్యాన్స్ చేసేముందు ఫోటో తీసుకున్నారని ఇలా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేరళలో అమ్మాయిల లుంగీ ఫోటో సంచలనాన్ని రేకిత్తిస్తోంది.

ఫోర్బ్స్‌లో ఇండియన్ "ఉమెన్" పవర్..

అధికారాన్ని హస్తగతం చేసుకుని దేశాన్ని శాసించినా..కార్పోరేట్ రంగాన్ని పరుగులు పెట్టించినా భారత మహిళలు ప్రపంచంలో ఎవరికి తీసిపోరు. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, బయోకాన్ ఛైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా, హెచ్‌టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, ఛైర్ పర్సన్ శోభనా భారతీయ చోటు దక్కించుకున్నారు. బిలియనీర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, రాజకీయాలు, ఎస్‌జీవోస్, టెక్నాలజీ రంగాల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభాపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింది.   దేశంలోనే అతిపెద్ద, పురాతన బ్యాంక్ అయిన ఎస్‌బీఐకు తొలి మహిళా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అరుంధతీ భట్టాచార్య ఎస్‌బీఐని వృద్ధిలోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా టెక్నాలజీకి అనుగుణంగా..డిజిటల్ బ్యాంకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్ బ్యాకింగ్ యాప్, ఈ-పే తదితర ఆధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్థికరంగంలో శక్తిమంతమైన మహిళల జాబితాలో అరుంధతీ 5వ స్ధానంలో నిలిచారు. గత సంవత్సరం 10వ స్థానంలో నిలిచిన ఆమె..ఈ సారి 5వ స్థానంలో నిలిచారు. ఇక చందాకొచ్చర్ విషయానికి వస్తే 22 సంవత్సరాల వయసులో ఐసీఐసీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా సీఎండీ స్థాయికి ఎదిగారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఐసీఐసీఐని కీలకంగా మార్చేశారు. కిరణ్ మజుందర్‌షా, శోభనా భారతీయలు కూడా తమ తమ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచారు. వీరంతా తమ శక్తియుక్తులతో, ప్రతిభా పాటవాలతో భారతీయ మహిళలంటే కేవలం వంటింటి కుందేళ్లని భావించే రోజుల్లోనే వ్యాపార రంగానికే వన్నె తెచ్చారు. ఎల్లలు లేని ప్రపంచంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ మహిళలు ఆదర్శం.  

తెలంగాణ రైలు ఏపీకి..

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు స్టేట్ మారింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించే ఈ రైలును ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వేరే రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి మరి సాధించుకున్న ఈ డబుల్ డెక్కర్ రైలుకు రైల్వే యంత్రాంగం ప్రణాళికాలోపం కారణంగా ఆదరణ కరువైంది. హైదరాబాద్ నుంచి వారంలో రెండు రోజులు తిరుపతి, మరో రెండు రోజులు గుంటూరుకు తిరుగుతున్న ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియా అతి తక్కువగా చూపెడుతోంది. అధికారులు ముందస్తు సర్వే లేకుండా రద్దీ లేని కాచిగూడ-గుంటూరు మార్గంలో దీనిని నడిపారు.   అలా కాకుండా ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ వయా వరంగల్ మార్గంలో దీనిని నడిపి ఉంటే ప్రజల ఆదరణ దక్కేది, రైల్వేకి కూడా ఆదాయం పెరిగేది. పైగా తిరుపతి వంటి దూరప్రాంతానికి రాత్రిపూట కూర్చోని ప్రయాణించలేరు. ఇన్ని ప్రతికూలతల మధ్య డబుల్ డెక్కర్‌ను ఏపీకి షిఫ్ట్ చేయాలని రైల్వే వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం-హైదరాబాద్, విశాఖపట్నం-తిరుపతి మధ్య నిత్యం విపరీతమైన రద్దీ ఉంటోంది. రోజువారి రైళ్లకు తోడు అదనంగా రైళ్లను ఏర్పాటు చేసినా జనానికి ఏమాత్రం చాలడం లేదు. బుకింగ్ ఓపెన్ చేస్తే చాలు నెల రోజుల ముందే వెయిటింగ్ జాబితా చాంతాడంత చూపెడుతోంది. దీంతో ఈ మార్గంలో అదనంగా రైళ్లను నడపాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.   అటు విశాఖ- విజయవాడ మార్గంలో డబుల్ డెక్కర్ నడపాలని ఆ ప్రాంత వాసులు రైల్వే శాఖకు వినతిపత్రాలు సమర్పించారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపు జన్మభూమి, సింహాద్రి, మాత్రమే ఉన్నాయి. తిరిగి మధ్యాహ్నాం వరకు ఎలాంటి రైళ్లు అందుబాటులో లేవు. తిరిగి మూడు గంటలు దాటిన తర్వాత అదే పరిస్థితి.. దీంతో ఈ మధ్య సమయాల్లో విశాఖ, గోదావరి, లింక్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే సూపర్‌స్టార్‌ ఎక్స్‌ప్రెస్‌లపై ప్రయాణికులు ఆధారపడుతున్నారు. ఈ రైళ్లలో ఉన్న జనరల్ కోచ్‌లు అక్కడి నుంచే కిక్కిరిసివస్తుండటంతో ఉభయగోదావరి, విశాఖ జిల్లా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.   ఇప్పుడు ఈ డబుల్ డెక్కర్‌ను విశాఖ నుంచి నడిపించడం ద్వారా ప్రజల కోరికను తీర్చినట్లే కాకుండా ఆక్యుపెన్సీని పెంచుకోవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ రైలును ఈ నెల 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు. తొలుత విశాఖ, దువ్వాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు డబుల్ డెక్కర్‌ను నడపనున్నారు. రూట్ సర్వే నిర్వహించిన తర్వాత రైలును ప్రతిరోజూ నడపాలా..లేదా వారంలో రెండు పర్యాయాలు నడిపాలా అనే దానిని నిర్ణయిస్తారు. ఇదంతా తర్వాత గాని ఈ డబుల్ డెక్కర్‌ను ఏపీకి తరలిస్తే తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. రైల్వేశాఖ ఈ విషయంపై కూడా దృష్టి పెడితే మంచిది.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాణం తీసింది...!

కోటీ రూపాయల డబ్బు పొయినా పెద్దగా పట్టించుకోని నేటి యువత, తలలోంచి ఒక్క వెంట్రుక రాలితే మాత్రం తెగ బాధపడిపోతోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో చిన్నవయసులోనే చాలా మంది యువతకు బట్టతల వచ్చేస్తుంది. నిద్రలేని రాత్రులు, జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి ఇలా కారణాలేవైతేనేం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది హెయిర్‌లాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ అందం చెడిపోకుండా ఉండాలని కొందరు..పెళ్లి కాకుండానే బట్టతల అయితే పిల్లనెవరిస్తారని మరి కొందరు ఇలా యువత హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ వీవింగ్ తదితర చికిత్సల వెంట పడుతున్నారు.   ఈ నేపథ్యంలో ఇలాగే జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్ వికటించి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మెడికోకు చిన్న వయసులోనే బట్టతల వచ్చింది. దీంతో అతను హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే మద్రాస్ నున్‌గంబాకమ్‌లోని ఒక సెలూన్‌ను సంప్రదించాడు. మే 17న అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్, వైద్యుడు వినీత్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అయిన దగ్గరి నుంచి ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవ్వడంతో మళ్లీ హాస్పిటల్‌కే చేరుకున్నాడు. మళ్లీ ఏదో ట్రీట్ మెంట్ చేసి పంపించేశారు వైద్యులు. కాని ఒంట్లో తెలియని నలత, ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్ధి మరణించాడు.   అయితే ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అతనికి సర్జరీ జరిగిందని..కాని ఆ సర్జరీ సరిగా జరపలేదని చెప్పారు. దీంతో చనిపోయిన విద్యార్థి స్నేహితుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆపరేషన్ జరిగిన రోజు అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ సర్జరీ మొదలైన కాసేపటికే వెళ్లిపోయాడు. ఒక అనస్థిస్ట్ సర్జరీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఇచ్చిన అనస్థిషీయా విద్యార్థి శరీర తత్వానికి సరిపోలేదని, అందువల్లే శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో అతను మరణించాడు. ఇక ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడు వినీత్ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే, సర్జన్ కాదు. దీంతో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ ఇద్దరు డాక్టర్లకు నోటీసులు పంపించారు. సర్జరీ చేయడానికి అర్హత లేకపోయినప్పటికి ఎందుకు సర్జరీ చేశారో చెప్పాలని నోటీసులో ప్రశ్నించారు. అలాగే సర్జరీ చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌కు కేవలం సెలూన్ పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. అక్కడ సర్జరీ చేయడంపై కూడా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ సెలూన్‌ను సీజ్ చేసింది. జుట్టు వస్తుంది కదా అని అర్హత లేని వైద్యుల్ని ఆశ్రయించే యువతకు ఈ ఘటన ఒక గుణపాఠం .  జుట్టు దువ్వుకోవాలంటే ముందు ప్రాణముండాలి కదా..! అని ఒక్కసారి ఆలోచించండి.

ఊరకే డబ్బిస్తే వద్దన్న స్విస్ జనం..మీకు సలాం..!

డబ్బు ఎవరికి చేదు చెప్పండి..మనిషి ఎంత కష్టపడినా డబ్బుకోసమే అలాంటిది ఫ్రీగా డబ్బులిస్తామంటే ఎవరు వద్దంటారు..! మన దగ్గరైతే ఎగిరి గంతేసి మరీ తీసుకుంటారు. కానీ స్విట్జర్లాండ్ ప్రజలు మాత్రం మాకు ఉచితంగా వచ్చే డబ్బు వద్దని తిరస్కరించారు. దేశంలో పేదరికం నిర్మూలించేందుకు ప్రతి పౌరుడికి జీవించేందుకు సరిపడా డబ్బు చెల్లించాలని స్విస్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన తెచ్చింది. నిరుద్యోగం, స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, పేదరికం పెరిగిపోతుండటం వంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే ఈ పథకాన్ని అమలు చేయాలని కోరింది. కనీస ఆదాయాన్ని సమకూర్చడం వల్ల ప్రజలకు కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపింది.   దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం "యూనివర్శిల్ ఇన్‌ కమ్ బేస్ ప్రపోజల్‌"ను అమలు జరపాలని స్విస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద పెద్దలకు 2500 స్విస్ ప్రాంక్‌లు అంటే మన కరెన్సీలో లక్షా 70 వేలు, పిల్లలకు 625 ఫ్రాంక్‌లు అంటే 42.5 వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలో "రెఫరెండం" నిర్వహించింది. 76.9 శాతం మంది ప్రజలు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయగా..అనుకూలంగా కేవలం 23.1 శాతం మంది ఓటేశారు. ఫ్రీగా ఇచ్చి తమని బద్ధకస్తులుగా మార్చవద్దంటున్నారు. అటు మేధావులు, ఆర్థిక నిపుణులు మొదటి నుంచి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.   ఇలా ఉచితంగా అన్నీ ఇస్తే ధరలకు రెక్కలు వస్తాయని, ప్రజలు సామూహికంగా ఉద్యోగాలు వదిలేస్తారని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీని ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందన్నారు. అటు ఈ పథకం అమలైతే ఖజానాపై ఎంత భారం పడుతుందో ప్రజలు ముందుగానే అంచనా వేశారు. ఆ భారాన్ని మోయడానికి అదనపు ట్యాక్సులు వడ్డించడం, ప్రస్తుతం సంక్షేమ రంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ముందుగానే అంచనా వేసిన ప్రజలు ప్రతిపాదనను తిరస్కరించినట్లున్నారు. స్విస్ ప్రజల తీర్పును మనం అక్షరాల ఆచరించాలి. ఎన్నికల్లో నాయకులు ఎరగా వేసే ఆల్‌ఫ్రీకి లొంగిపోయి గొర్రెల మందల్లా ఉచితం అంటే చాలు ఎగిరి గంతేసి పట్టం కడతాం. మాఫీ అంటే చాలు సదరు నేతే మా మహారాజు అని చెప్పేస్తాం. జనాన్ని బట్టే నాయకులు నడుచుకుంటారు. మనం ఫ్రీకి ఆశ పడితే..ఫ్రీగా మనల్ని వాడిపారేస్తారు. కాదని సతాయిస్తే చచ్చినట్లు మన దారికొస్తారు. 

కేసీఆర్‌కు "సరైనోడు " కోదండరామేనా..?

కేసీఆర్..టీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పార్టీని, ప్రభుత్వాన్ని చక్రవర్తిలా ఏలుతున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమాన్ని తన శక్తియుక్తులతో నడిపి..ఎప్పటికి సాకారం కాదనుకున్న తెలంగాణ కలను సాకారం చేసిన ధీశాలి. దీంతో తమ తొలి అధినేతగా ఆయనకే పట్టం కట్టింది తెలంగాణ పౌర సమాజం. అప్పటి నుంచి బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తూ..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేకుండా చేస్తూ విజయవంతంగా దూసుకుపోతున్నారు గులాబీ బాస్. ఆయన తీసుకున్న నిర్ణయాలను కాదనేవారు అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ ఇప్పుడు ఎవరు లేరు. దీంతో కేసీఆర్ ఆడింది ఆట..పాడింది పాటగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్‌పై విమర్శల వర్షాన్ని కురిపించారు, తెలంగాణ పోలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరామ్.   టీఆర్ఎస్ రెండేళ్ల పాలన సందర్భంగా కోదండరామ్, కేసీఆర్‌ పాలన తమకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని, చేతకాకుంటే, తప్పుకోవాలని, అభివృద్ధిని తాము చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజలు బాగుండాలన్న కారణంగానే జేఏసీ ఇంకా పనిచేస్తోందని, లేకుంటే ఎప్పుడో టీఆర్ఎస్‌లో  కలిపేవారమన్నారు. అంతే కేసీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది..అప్పటి దాకా పార్టీ శ్రేణుల్ని కోదండరామ్ విషయంలో సంయమనం పాటించాలని సూచించిన ఆయన..ఇప్పుడు తనమీదకే దూసుకొస్తుండటంతో పార్టీ శ్రేణుల్ని ఊసిగొలిపారు. దాని పర్యవసానమే నిన్న టీఆర్ఎస్ మంత్రులు, నేతల మాటల దాడి. కాంగ్రెస్ విమర్శించినా..టీడీపీ విమర్శించినా, బీజేపీ విమర్శించినా ఎవరిపైనా ఈ స్థాయిలో టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగలేదు. కానీ కోదండరాంపై ఇంతలా విరుచుకుపడటానికి కారణమేంటి..?   తెలంగాణలో టీఆర్ఎస్ అనంతరం మంచి పట్టున్న శక్తి టీజేఏసీ అనే చెప్పాలి. ఉద్యమం సమయంలో మాజీ మంత్రి జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన కోదండరామ్‌ని, కేసీఆర్ టీజేఏసీ ఛైర్మన్‌గా నిలబెట్టడంతో ఆయన చెలరేగిపోయారు. కోదండరాం ఛైర్మన్ గనుక ఆయన పిలుపుకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఇలా మొత్తంగా తెలంగాణ సమాజం కట్టుబడి ఉండేది. ఫాలోయింగ్‌లో, తన దైన వ్యూహాలతో ఓ దశలో కోదండరామ్, కేసీఆర్‌ను మించిపోయారు. ఇలా గ్రామగ్రామన తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశారు కోదండరామ్. దీంతో తెలంగాణ  కల సాకారమయ్యింది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేశారు. అప్పటి నుంచి కోదండరామ్ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమంలో వాడుకుని, ఆయనంటే ఏ పార్టీకీ గిట్టని విధంగా మార్చేశారు కేసీఆర్.   అయితే సరైన సమయం కోసం వేచి చూసిన కోదండరామ్,  రెండేళ్లపాలన సంబరాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహం రచించారు. కోదండరామ్‌కు జనంలో మంచి క్రేజ్ ఉంది..ఆయన మాటలు నమ్మి జనం తిరగబడితే గులాబీ బాస్ అడ్రస్ గల్లంతే. జనం ఎదురుతిరిగితే ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా నామరూపాల్లేకుండా పోతుంది. మేధావులు వాస్తవాలు జనం ముందు పెడితే, పాలకులకి కష్టకాలమే. ఇది గ్రహించిన కేసీఆర్, కోదండరామ్ గొంతు నొక్కాలని భావించి తన దండును ఫ్రోఫెసర్‌ మీదకు పంపారు. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టగల సరైనోడు..సత్తావున్నోడు ఎవడొస్తాడా..? అని ఎదురూచూసిన ప్రతిపక్షాలకు ఆ సరైనోడు కోదండరామ్‌ అని అర్థమైంది. ఈ మాటల దాడితో ఎక్కడో పాతాళంలో ఉన్న కోదండరామ్‌కు ఎవరెస్ట్‌లాంటి పబ్లిసిటీ వచ్చింది. 

కన్నడనాట పార్టీలను జాగ్రత్తపరచిన స్ట్రింగ్..!

రాజ్యసభ నోటీఫికేషన్ వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మించిన రాజకీయాలు నడుస్తున్నాయి కన్నడ నాట. అయితే చివరి నిమిషంలో ఆంధ్ర రాజకీయ పార్టీలు కాస్త తగ్గడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అటు కర్ణాటకలో మాత్రం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీల బలాబలాల రీత్యా కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున ఆస్కార్ ఫెర్నాండేజ్, జైరాం రమేశ్, కేసీ రామమూర్తి, బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, జేడీఎస్ తరపున బీఎస్ ఫరూఖ్ నామినేషన్లు వేశారు. ఉన్న స్థానాల కంటే పోటీ చేసేవారు ఎక్కువ కావడంతో పోలింగ్ తప్పనిసరైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకునేందుకు ఎంత కావాలంటే అంత చెల్లించేందుకు వెనుకాడటం లేదు.   అటు  ఎమ్మెల్యేలు కూడా రూ.5 కోట్లు ఇస్తామంటే చెప్పండి..మా ఓటు మీకే అంటున్నారు. ఒక టీవీ ఛానెల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మల్లిఖార్జున ఖూబా, జీటీ దేవేగౌడ, కర్ణాటక జనతా పార్టీ ఎమ్మెల్యే బీఆర్‌పాటిల్‌ను కలవగా..వారు ఒక్కో ఓటుకు రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన వీడియో లీకైంది. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డబ్బు కోసం ఎమ్మెల్యేలు ఆశపడే అవకాశం ఉండటంతో దీంతో వివిధ పార్టీలు తమ తమ ఎమ్మెల్యేలను జాగ్రత్త పరచుకుంటున్నారు. దాంతో పాటు ఇటు అధికార కాంగ్రెస్‌కు గానీ, అటు ప్రతిపక్ష జేడీఎస్‌కు గానీ అదనపు స్థానం గెలుచుకోవడంలో కీలకంగా మారిన 14 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముంబైకి తరలించినట్టు తెలుస్తోంది. వారందరిని కమ్యూనికేషన్‌కు దూరంగా ఓ ఆజ్ఞాత ప్రదేశంలో ఉంచినట్టు సమాచారం. 

అప్పటి మాటలు ఏమయ్యాయి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ దాదాపు 100 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలలో ఉద్యమ స్పూర్తిని రగిలించిన వారు ఉద్యోగులేనని చెప్పాలి. తీరా సీమాంధ్రుల మనోభావాలకు ఏమాత్రం విలువ లేకుండా హడావుడిగా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాష్ట్ర రాజధానిని త్వరగా డిసైడ్ చేయండి..లేదంటే చెట్టుకిందైనా పనిచేస్తాం..హైదరాబాద్లో అవమానాలు భరించలేకపోతున్నాం. మన రాష్ట్రంలో మన పరిపాలన చేసుకుందాం అని డైలాగులు కొట్టారు సచివాలయ ఉద్యోగులు. తీరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులంతా భాగ్యనగరానికి తలాక్ చెప్పి గుంటూరు, విజయవాడలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.   మరి పరిపాలనలో అత్యంత కీలకమైన సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ వదిలిరావడానికి ఇష్టపడటం లేదు. పైగా ప్రభుత్వానికి ఏదోటి చెబుతూ స్వపరిపాలనను మరింత ఆలస్యం చేస్తున్నారు. రాజధాని ఎక్కడో తేల్చాలని ఒకసారి..తమ పిల్లలకు స్థానికత అడ్డొస్తోందని చెబితే వెంటనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కోరుకున్న చోట స్థానికత ఇవ్వడానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. దీని తర్వాత వాళ్లకి దొరికిన సాకు బెజవాడలో అద్దెలు. గుంటూరు, విజయవాడలలో హైదరాబాద్‌ను మించిన అద్దెలున్నాయని చెప్పి తప్పించుకున్నారు. అయితే బెజవాడ, గుంటూరుల్లో అంత ఎక్కువ అద్దెలు లేవని స్వయంగా గృహ యజమానులు చెప్పారు. చంద్రబాబు అద్దెలు తగ్గించాలని స్థానికులను అభ్యర్థించడంతో వారు కూడా ముందుకు వచ్చారు. దానికి తోడు ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చడానికి వారంలో ఐదు రోజుల పనిదినాలు, హెచ్‌ఆర్ఏ పెంపు, రాజధాని ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఇలా కోరినవి, కోరనవి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.   కాని హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పలువురు సీనియర్ అధికారులు ఏపీకి తరలివెళ్లడానికి చిన్నపిల్లల్లా మారాం చేస్తున్నారు. తీరా ప్రభుత్వం చెప్పిన జూన్ 27 వచ్చే సరికి ఉద్యోగులకు పీకల మీద కత్తిపెట్టినట్లైంది. అమరావతికి ఉద్యోగులు తరలివెళ్లకుండా స్వయంగా ఉన్నతాధికారులే మోకాలు అడ్డుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులు వెళితే తాము కూడా వెళ్లక తప్పదన్నది ఉన్నతాధికారుల బాధ. వీరికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా జతకలవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.  అమరావతిలో సరైన వసతులు లేవని తరలింపును మరికొంత కాలం వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి చెట్టుకిందైనా పనిచేస్తాం అన్న వారికి సదుపాయాలతో పనేంటి..? అంటే అప్పుడు చెప్పిన మాటలు నీటిమీద రాతలేనన్న మాట. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రితో కలిసి రావాల్సింది పోయి ఉద్యోగులు సహాయనిరాకరణ చేయడం ఎంతవరకు సమంజసం.  

టీకాంగ్రెస్ నేతల్లో "అసహనం" పెరిగిందా..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా సరిగా ప్రచారం చేసుకోలేక బొక్కబొర్లాపడింది కాంగ్రెస్ పార్టీ. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సరైన నాయకులు ఉన్నా నడిపించే నాయకుడు లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. రాష్ట్రాన్నిచ్చినా ప్రజలెందుకు తిరస్కరిస్తున్నారో అర్థంకాక..వరుస ఓటములతో కోలుకోలేకుండా ఉన్న టీకాంగ్‌ నేతలకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ సమయంలో వారిలో  "ఆసహనం " పెరిగిపోయి ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టాల్సింది పోయి తమవారిపైనే నిందలు వేసుకొంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారు. రోజుకొక నేత తమలోని అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు.   మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు తన అసంతృప్తిని ఎవరి మీద చూపించాలో తెలియలేదు. అందుకే మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు. మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలు తమను పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిణామంతో మీడియా కాంగ్రెస్‌కు మరింత దూరమైంది. కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సీఎల్పీ నేత జానారెడ్డిని దుర్భషలాడారు. ఇక నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ అధినాయకత్వం మీదే దాడికి దిగారు. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.     ఆ తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా రాజకీయాలంటే పెద్దగా తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేశారన్నారు. కేసీఆర్ ముందు ఏమాత్రం నిలబడలేని ఉత్తమ్‌కుమార్ వల్ల రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కోమటిరెడడ్డి విమర్శించారు. అక్కడితో ఆగకుండా నేనే పీసీసీ అధ్యక్షుణ్ణి అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాణ్ణి..లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాయకుల అసందర్భ ప్రేలాపనలు కార్యకర్తలకు చీరాకు తెప్పిస్తున్నాయి. ఐకమత్యంగా ఉండి పార్టీని బతికించుకోవాల్సింది పోయి మీలో మీరే తన్నుకుంటున్నారని సగటు కాంగ్రెస్ కార్యకర్త తల బాదుకుంటున్నాడు. మరి టీకాంగ్ నేతలు ఇక్కడితో ఆగుతారా..? లేదంటే తమ విమర్శల జడివానలో తమ వారినే తడుపుతారా ..? అన్నది వేచి చూడాలి.

మాయని మచ్చ..

ఆపరేషన్ బ్లూస్టార్...స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యయం. ఉక్కు మహిళగా కీర్తి శిఖరాలు అధిరోహించిన ఇందిరాగాంధీ ప్రాణాలను తీసుకున్న యమపాశం. ఈ ఘటనకు నేటితో 32 సంవత్సరాలు. 1970వ దశకంలో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆరంభమైన ఈ ఉద్యమానికి పంజాబ్ యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ ఉద్యమానికి నాయకుడు బింద్రేన్‌వాలే. రోజు రోజుకి వీరి ఆగడాలు మీతిమీరడంతో పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. వీరంతా అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని అడ్డాగా చేసుకుని ఉద్యమాన్ని మరింత వ్యాపింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశించారు.   ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన భారత సైన్యం స్వర్ణదేవాలయాన్ని చుట్టు ముట్టి కాల్పులు జరిపింది. ఈ దాడిలో తీవ్రవాదులు సహా 400 మంది మృతి చెందారు. ఎంతో మంది అమాయకులు గాయపడ్డారు. అనంతరం జరిగిన ప్రతీకార హత్యాకాండతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం ప్రతి సిక్కు మదిలో మెదిలి ప్రతీకార జ్వాలగా మారి ప్రధాని ఇందిర హత్యకు దారి తీసింది. ఈ ఆపరేషన్ జరిగి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ గాయం సిక్కులను వెంటాడుతూనే ఉంది. అందుకే ఈ రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణలు చేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా కొన్ని రాడికల్ గ్రూపులు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో స్వర్ణదేవాలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్‌లు ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అప్పుడే తన మార్క్‌ చూపెడుతున్న కిరణ్ బేడి

కొందరు ఎక్కడున్నా తన మార్క్ చూపెడుతూ మిగిలిన వారికి భిన్నమని నిరూపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కిరణ్ బేడి. భారత తొలి మహిళ ఐపీఎస్‌గా అసాంఘిక శక్తుల, రౌడీల భరతం పట్టారు కిరణ్‌బేడీ. ఉద్యోగ విరమణ తర్వాత కూడా సామాజిక సేవ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పొరాడారు. ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన మార్క్ చూపిస్తున్నారు.   మొన్నటికి మొన్న పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని, రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతిపరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆమె వ్యవహరశైలి రాజకీయంగా కలకలం రేపుతోంది.   ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరిలోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు వీలుంటుందన్నారు. ముఖానికి ముసుగు, చేతి గ్లవ్స్, పసుపు రంగు టోపీ ధరించిన బేడీ..లాల్ బహదూర్ శాస్త్రి వీధీ, జింజీ సలయ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వ్యర్థాలను తొలగించారు. కేవలం తన ప్రచారం కోసం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అంతా కలిసి ఇలాగే శ్రమిస్తే త్వరలోనే పుదుచ్చేరి పరిశుభ్ర నగరంగా అవతరిస్తుందని కిరణ్ బేడీ ఆశాభావం వ్యక్తం చేశారు..మరి ఇలాంటి ప్రవర్తనతో రానున్న రోజుల్లో ఆమె ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచిచూడాలి.

పాకిస్తాన్‌ ప్రాణాల్ని తీసుకుంటే... భారత్‌ బతుకునిచ్చింది

    ఆఫ్ఘనిస్తాన్‌! ఈ దేశం గురించి ఇప్పుడు తెలియనివారుండరు. తాలిబాన్‌ మూకల పుణ్యమా అని ఆఫ్ఘనిస్తాన్‌ ఓ స్మశానంలా మారిపోయింది. సెప్టెంబరు 11న అమెరికా మీదే కనుక తాలిబాన్‌ దాడి చేసి ఉండకపోతే, యావత్ ప్రపంచమూ ఆ దేశంలో జరిగే మారణకాండని చూసీ చూడనట్లు ఊరుకునేదే. మత చట్టం పేరుతో అక్కడ జరిగే దారుణాలని పట్టించుకోకుండా సాగిపోయేదే. కానీ సెప్టెంబరు దాడులకు ప్రతీకారంగా అమెరికా మిత్ర రాజ్యాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ పాలనని అంతం చేశాయి. ప్రస్తుతానికి అక్కడ తాలిబాన్‌ పాలన లేకపోవచ్చు. కానీ బతికేందుకు వనరులు కూడా ఏమీ మిగల్లేదు. మరో పక్క మొదటి నుంచీ తాలిబాన్లకు పాలు పోసి పెంచుతున్న పాకిస్తాన్‌... వారి ముఖ్య నేతలను తమ దేశంలో సకల సౌకర్యాలనూ అందిస్తూ శరణు కల్పించింది. తిరిగి వారిని ఆఫ్ఘనిస్తాన్‌ మీదకి ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో తాలిబాన్‌ తిరిగి పడగ విప్పుతోంది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు అడపాదడపా తాలిబాన్‌ దాడులు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.   కానీ భారత్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రేమతో అయితేనేం, పాకిస్తాన్‌ మీద ద్వేషంతో అయితేనేం... అంతర్యుద్ధంతో చితికిపోయిన ఆ దేశంలో బతుకు చిగురించేందుకు మొదటి నుంచీ సాయం చేస్తూ వస్తోంది. గత ఏడాది ప్రపంచంలోనే అద్భుతమైన పార్లమెంటుని ఆప్ఘనిస్తాన్‌కు కానుకగా ఇచ్చిన మన దేశం ఇప్పుడు 1700 కోట్లతో ఒక ఆనకట్టను నిర్మించి ఇచ్చింది. అమెరికా వంటి సంపన్న దేశాలు సైతం చేతులు దులుపుకొని వెళ్లిపోయిన చోటుని సస్యశ్యామలంగా మార్చేందుకు ఈ ఆనకట్ట ఉపయోగపడనుంది. హేరత్‌ ప్రాంతంలోని చిష్ట్‌-ఏ-షరీఫ్‌ అనే నది మీద నిర్మించిన ఈ ఆనకట్టతో 75 వేల హెక్టార్లకు సాగునీరు అందడంతో పాటుగా 42 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి కానుంది. అయితే ఈ ఆనకట్ట నిర్మాణం ఏమంత తేలికగా పూర్తికాలేదు. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని అడుగడుగునా తాలిబాన్‌ మూకలు అడ్డుకుంటేనే ఉన్నాయి. ఇక్కడ రక్షణ విధులను నిర్వహిస్తూ 50 మంది సైనికులు చనిపోయారంటే పరిస్థితులు ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు అటు తాలిబాన్‌, ఇటు పాకిస్తాన్ మొహాలు చిన్నబోయేలా, మనసులు చురుక్కుమనేలా... ఆఫ్ఘన్‌-భారత్‌ దేశాలు కలిసి ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఆనకట్టను సగర్వంగా ప్రారంభించారు.

బాక్సింగ్‌ ఆలీ ఇక లేడు!

  ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ క్రీడాకారునిగా గుర్తింపు పొందిన మహమ్మద్‌ ఆలీ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో ఆలీ శ్వాసకోస సంబంధ వ్యాధులతో ఇవాళ కన్నుమూశారు. బాక్సింగ్ ఆలీగా పేరు పొందిన ఆలీ జీవితం ఏ సినిమాకూ తీసిపోదు. ఆఫ్రికా మూలాలు కలిగిన ఆలీ, అమెరికాలో పుట్టినా, అక్కడి జాతి వివక్షను కూడా ఎదుర్కొన్నాడు. 12 ఏళ్ల వయసులో తన సైకిల్‌ను ఎవ్వరో కొట్టేయడంతో ఇక నుంచి అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు బాక్సింగ్‌ నేర్చుకుంటానంటూ పట్టుబట్టాడు ఆలీ. అలా బాక్సింగ్‌ పోటీల్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఆలీది ప్రభంజనమే! అదే సమయంలో టెలివిజన్లలో ప్రసారాలు కూడా వేగం పుంజుకోవడంతో... ప్రతి ఇంట్లోనూ ఆలీ బాక్సింగ్‌కు సంబంధించిన ప్రసారాలే కనిపించేవి. అలా ఆటను ఇంటింటి వినోదంగా మార్చిన ఘనత ఆలీదే! అలాగని ఆలీ ఏమీ హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే... వియత్నాంతో అమెరికా యుద్ధానికి దిగినప్పుడు సైన్యంలో పాల్గొనకుండా యుద్ధాన్ని నిరాకరించాడు. దాంతో బాక్సింగ్‌ కెరీర్ దాదాపు నాశనమైపోయినా కూడా తన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గనేలేదు.   ఆలీ క్రైస్తవుడే అయినప్పటికీ తరువాత కాలంలో ఇస్లాం మతం పట్ల ఆకర్షితుడయ్యాడు. తాను స్వయంగా ఇస్లాం మతాన్ని పుచ్చుకోవడమే కాకుండా, ఇస్లాంను స్వీకరించమంటూ మత ప్రచారాన్ని సైతం చేసేవాడు. ఆలీ తన కెరీర్లో 56 గెలుపులతో, కేవలం ఐదంటే ఐదు సార్లు ఓటమిని చవిచూశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలంటూ ఆలీ బలవంతంగా కాచుకున్న దెబ్బలే అతని ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. గత ముప్ఫై ఏళ్లుగా ఆలీ పార్కిన్‌సన్స్‌ అనే నరాల వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. శత్రువుల మీద ముష్టిఘాతాలను కురిపించిన ఆ చేతులు తరువాత కాలంలో వణికిపోయేవి. అతని సింహగర్జనలు కాస్తా గుసగుసల స్థాయికి చేరుకున్నాయి. ఏది ఏమైనా చివరి వరకూ కూడా బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు పొందాడు ఆలీ. ఆలీ లేకున్నా మానవ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని మిగిల్చి వెళ్లాడు.

జగన్ చంద్రబాబుకు క్షమాపణలు చెబుతాడా..?

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తరువాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నట్టు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ.. దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే.. ఇప్పుడు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రకు కూడా అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఎప్పుడూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడే జగన్ ఎప్పటి లాగే రెండు రోజుల క్రితం జరిగిన ఒక సభలో ఆయనపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పులతో కొట్టాలనే పదజాలం వాడుతూ ఆయనను విమర్శించారు. ఇక అంతే ఈ మాటలు విన్న తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా ఇప్పుడు వైఎస్ జగన్ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు.   ఈ నేపథ్యంలోనే ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రను అడ్డుకుంటున్నారు. నిన్న అనంతపురం జిల్లా యాడికిలో యాత్ర నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. అనంతపురం తమ కోటగా భావించే జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటాడా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కార్లతో జగన్ యాత్రను అడ్డుకోవడానికి వెళ్లారు. ఇక జేసీ నోటి గురించి చెప్పక్కర్లేదు. ఏది అనాలనిపిస్తే అది ముఖం మీద చెప్పేయడం.. తిట్టాలనిపిస్తే తిట్టేయడం వారి నైజం. ఈ క్రమంలోనే ఆయన జగన్ పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడు. రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈరోజు కదిరిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఆయన యాత్రను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణలు చెబితే కాని యాత్ర చేయడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నారు.   ఇక టీడీపీ సీనియర్ నేతలైతే జగన్ పై మండిపడుతున్నారు.  జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో జగన్‌కు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ప్రజలు రాళ్లతో కొట్టి ఇంటికి పంపుతారని అంటున్నారు. జగన్ ను ప్రజలు చెప్పులతో కొడతారు అని అంటున్నారు. మరి టీడీపీ తమ్ముళ్లు కోరినట్టు జగన్ క్షమాపణలు చెబుతారో లేదా చూడాలి.

పక్కా ప్లాన్ ప్రకారమే మథుర అల్లర్లు.. !

  మథురలో జరిగిన హింసాత్మక ఘటనలో ఎస్పీ సహా 24 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మథురలోని జవహార్ భాగ్ ప్రాంతంలో అక్రమణదారులు ఆక్రమించిన 200 ఎకరాలకు పైగా భూమిని తొలగించడానికి అహ్మదాబాద్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు అక్రమణ దారులను తొలగించేందుకు వెళ్లారు. దీంతో పోలీసులపై వారు విచక్షణారహితంగా దాడి చేయడంతో చాలామంది మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.   అయితే ఈ అలర్లు వెనుక అసలు కారణాలు మాత్రం చిన్నగా బయటపడుతున్నాయి. అక్రమణదారులు పక్కా ప్లాన్ తోనే పోలీసులపై దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వస్తారని ముందే పసిగట్టిన అక్రమణదారులు వారిపై దాడి చేయడానికి అన్ని ముందుగానే సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకనుగుణంగా భారీ కసరత్తే చేశారంట. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నారంట.. అంతేకాదు వెయ్యి గ్యాస్ సిలిండర్లు, 200 గ్రనేడ్లను సిద్ధం చేసుకున్నారు. తుపాకులు, పదునైన కత్తులను తెచ్చిపెట్టుకున్నారట. ఇక ఎప్పుడైతే పోలీసులు వారిపై దాడి చేయడానికి వచ్చారో.. మూడు వేలకు మంది పైగా విధ్వంసకారులు వారిపై దాడి చేశారు. అయితే వీరి వ్యూహాలను పసిగట్టలేని కారణంగానే పోలీసులకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సహా విధ్వంసకారుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయని చెప్పడం గమనార్హం. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 400 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.