కేరళలో భార్యల మార్పిడి..సమాజం ఎటు పోతోంది..!
posted on May 14, 2016 @ 3:48PM
భారతీయ కుటుంబ వ్యవస్థ..భార్యాభర్తల సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయనడానికి కేరళలోని కొచ్చి నావల్ బేస్‌లో జరిగిన..జరుగుతున్న వ్యవహారమే పెద్ద నిదర్శనం. బైకులు..కార్లు..ఫోన్లు మార్చకున్నట్టు భార్యల్ని మార్చుకునే అనాగరికమైన కల్చర్ భారతదేశంలో సంచలనం సృష్టించింది. కేరళలోని కొచ్చి నావల్ కమాండ్‌లో పనిచేసే ఒక అధికారికి ఒక మహిళతో 2012 మార్చిలో వివాహం అయ్యింది. వీరిద్దరూ కొచ్చిలోనే కాపురం పెట్టారు. ఐతే ఆమె భర్త సహ అక్కడ పనిచేసే చాలామంది అధికారులకు వైఫ్ స్వాపింగ్ పార్టీలు చేసుకోవడం అలవాటు. అలాంటి పార్టీలో తనను పాల్గొనాల్సిందిగా సాక్షాత్తూ భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకు ఒప్పుకోనందుకు తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నట్లు 2013 ఏప్రిల్ 4న కొచ్చి హార్బర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు తన భర్త ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో సన్నిహితంగా ఉండటం చూశానని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సంఘటనతో సభ్య సమాజం ఉలిక్కిపడింది. మనం ఉంటుంది భారతదేశంలోనా లేక మరెక్కడైనా అని ప్రశ్నించుకుంటోంది. అసలేంటి ఈ వైఫ్ స్వాపింగ్.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జంటలు ముందుగా మాట్లాడుకుని భార్యల మార్పిడి చేసుకోవడం. ఒకరి భార్యతో ఇంకొకరి భర్త శారీరకంగా కలవడమే ఈ భార్యల మార్పిడి. వైఫ్ స్వాపింగ్, వైఫ్ షేరింగ్, వైఫ్ ఎక్స్చేంజ్ పేరేదైనా దీని సారాంశం ఒక్కటే. ఉన్నత వర్గాల్లో, విచ్చలవిడితనం మాత్రమే అలవాటు ఉన్న కుటుంబాల్లో ఈ భార్యల మార్పిడిల వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. కాని రాను రాను ఈ విష సంస్కృతి అన్ని వర్గాలకు పాకుతోంది. ప్రత్యకించి ఇలాంటి వ్యవహారం దేశ భద్రతలో కీలకంగా ఉన్న నేవీలో బయటపడటమే అన్నింటి కంటే ఆశ్చర్యకరం.
నేవిలో పనిచేసే వారి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. కుటుంబాల ఒంటరితనం, చిన్న చిన్న కుటుంబాలు, నెలల కొద్ది జీవిత భాగస్వాములను వదిలి ప్రయాణాలు చేయడం అందుకే గత కొద్ది సంవత్సరాలుగా ఈ విచ్చలవిడి లైంగిక క్రీడ ప్రారంభమైంది. ఇష్టపడి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అలాంటి వెధవ పనులకు మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో..భర్తతో కాకుండా వేరే మగాడితో కలవడానికి ఇష్టపడని మహిళలను సదరు భాగస్వామి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రపంచం మొత్తం కీర్తించే భారతీయ సమాజానికి ఇలాంటి సంఘటనలు మాయని మచ్చ తెస్తున్నాయి.
మన జీవన విధానం, సనాతన ధర్మాలు, ఆచారాలు స్త్రీలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించాయి. అనాదిగా పరాయి వ్యక్తి భార్యను అమ్మలా, అక్కలా, చెల్లిలా, వదినలా గౌరవించే గడ్డ మనది. ఇటువంటి వికృత క్రీడలు మనదేశంలో చెల్లవు. ఒప్పుకోవడం అటుంచి జనం దాన్ని అసహ్యించుకుంటారు. కానీ ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత భాగస్వామితో కాకుండా ఒకసారి మరోకరితో లైంగిక ఆనందాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి వల్ల కూడా పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుడితో సంబంధాల్ని ఏర్పరిచే ఈ స్వాపింగ్ పార్టీకు అలవాటు పడుతున్నారు.
ఈ దుష్ట సంప్రదాయం మీద సుప్రీం సీరియస్ అయ్యింది..ఈ కల్చర్‌ను తప్పుబడుతూ నేవీ ఆఫీసర్ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనం కనీసం ఊహించుకోవడానికి కూడా ఇబ్బంది పడే విషయం ఇది. దీనిని మొగ్గలోనే తుంచివేయకపోతే సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుంది, తరాలు నాశనం అయిపోతాయి.