కురచ దుస్తులు..మగాడి మైండ్ సెట్ మారదా..?
posted on May 10, 2016 @ 12:06PM
బాలయ్య హీరోగా వచ్చిన" సింహా" సినిమాలో ఒక డైలాగ్ ఉంది.."పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోయ్యారా..రేప్ చేయ్యారా..అని ఒకడంటే అందుకు బాలకృష్ణ అతడి చెంప పగలగొట్టి, పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోస్తావా..తప్పు మగాడి మైండ్ సెట్ మారాలంటూ" హితబోధ చేస్తారు. ఇలా ఎన్ని సినిమాల్లో చూపించినా సగటు మగాడి మైండ్ సెట్ మారడం లేదు. మహిళల్ని దేవాలయాల్లోకి పురుషులతో సమానంగా ప్రవేశించేలా చేసుకున్న మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.
కురచ దుస్తులు వేసుకుందని..అబ్బాయిలతో తిరుగుతోందని ఓ యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేసారు. స్నేహితుడి పెళ్లిలో సంగీత్ కార్యక్రమానికి హాజరై మే 1 తెల్లవారుజామున ఓ యువతి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అడ్డగించి, కురచ దుస్తులు ఎందుకు వేసుకున్నావని..ఈ సమయంలో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఎలా వెళ్తున్నావంటూ ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఇలాంటి వాటికి పుణెలో అనుమతి లేదని హెచ్చరించారు. అనంతరం ఆమెను కారులోంచి బయటకు లాగి దాడి చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వారం తర్వాత తీరిగ్గా నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇదే మహారాష్ట్రలో గతంలో మరో ఘటన జరిగింది. దేశ ఆర్థిక రాజధాని, మోడ్రన్ హాబ్ ముంబై లో అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళా ప్యాసింజర్ కురచ దుస్తులు ధరించిందని ఎయిర్ ఇండిగో సిబ్బంది ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆమె మోకాలి పైకి ఫ్రాక్ ధరించిందని, అందుకే ఆమెను అడ్డుకున్నామని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని ఆమె ట్రౌజర్ ధరించి వేరే విమానంలో తన గమ్యస్థానానికి చేరుకుంది.
నాగరిక ప్రపంచంలో మనుషులందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. స్త్రీలకు కూడా అవే హక్కులున్నాయి-వారికి నచ్చిన ఏ దుస్తులనైనా వారు ధరించవచ్చు. చరిత్ర, వారసత్వం, సంస్కృతి పేర్లు చెప్పి స్త్రీల స్వేచ్ఛను కబళించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరోకటి ఉంది కురచ దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలు పెరిగిపోయాయని కాని రెచ్చగొట్టే దుస్తులు అన్నది ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. అంటే చీర కట్టిన వాళ్ల మీద..అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఏ అఘాయిత్యాలు జరగలేదా? మిడ్డి వేసుకునే అమ్మాయిని చూసి సంస్కారంగా ప్రవర్తించే అబ్బాయిలు ఉన్నారు, చీర కట్టుకున్న కూడా వంకర బుద్ధితో చూసే అబ్బాయిలున్నారు. మారాల్సింది వాళ్ల బుద్ధి.
చివరిగా మనం చెప్పుకోవాల్సింది, ముళ్లుంటాయని తెలిసీ చెప్పులు లేకుండా తిరగాలనుకోవడం సాహసం అనిపించుకోదు. వస్త్ర ధారణ అయినా మరోకటి అయినా ఫ్యాషన్‌ని అనుకరించే ముందు ఎవరికి వారు దానిలోని మంచి చెడులు ఒకసారి ఆలోచించాలి. మనం జీవిస్తున్న సామాజిక పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న వారి ఆలోచనా ధోరణినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ధరించేంది మోడ్రన్ డ్రస్స్ అయినా, సాంప్రదాయ వస్త్రాలయినా వాటిని ధరించిన వ్యక్తికి వాటి వల్ల అందం, హుందాతనం పెరగాలి. శతాబ్దాలు ఇంట్లోనే ఉండిపోయిన ఆడది బయటకు వచ్చాక, రప్పించబడ్డాక ఇక చీర, ప్యాంటు ఏది కడితే ఏంటట సమాజానికి? ఎందుకీ అనవసర అభ్యంతరాలు?