కేబినెట్ బెర్త్‌పై గుంటూరు నేతల కన్ను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో తనయుడు లోకేష్, బావమరిది బాలయ్యలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ రోజుకోక వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ అటు మీడియాలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మంత్రివర్గంలో మార్పులేంటి? చేర్పులేంటి? ఎవర్ని ఉంచుతున్నారు? ఎవర్ని ఊడబీకుతున్నారో తెలియక పచ్చ కండువాలు జుట్టుపీక్కుంటున్నాయి. ఇవన్నీ అటుంచితే తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలంటూ చాలా మంది ఆశావహులు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరిలో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు రేసులో ముందున్నారు. తొలి విడతలో తమకు అవకాశం రాకపోవడం, కొత్తగా వైసీపీ నుంచి వలసలు రావడంతో ఈసారైనా చంద్రబాబు తమను కరుణిస్తారో లేదోనన్న అనుమానంతో ఎలాగైనా మంత్రిగా ప్రమాణం చేయాలని చూస్తున్నారు గుంటూరు నేతలు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్ర రాజకీయాల్లోనూ గుంటూరు గడ్డది కీరోల్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ 12 స్థానాలు కైవసం చేసుకుని టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచింది ఈ జిల్లా. జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు మంత్రులుగా , కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా ఇంతవరకు అమాత్య పదవి దక్కించుకోని ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు ఈసారి ఎలాగైనా బుగ్గకారు ఎక్కాలని డిసైడ్ అయ్యారు. అందుకనే ఎవరి స్టైల్లో వారు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం, ఇంతవరకు మంత్రిగా అవకాశం రాకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటైన జవాబివ్వడం ద్వారా థూళిపాళ్ల బాబు వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఈ కారణాలతో ఈసారి ఆయనకి కేబిన్‌ట్‌లో బెర్త్ కన్ఫామ్ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరొ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంగతి చూస్తే తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. కష్టకాలంలో కార్యకర్తలు పార్టీని వదలకుండా కాపాడారు. అందుకే చంద్రబాబు వద్ద తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. మరో సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో వైసీపీని థీటుగా ఎదుర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం ట్రై చేస్తున్న మరో లీడర్ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్. సొంత డబ్బు ఖర్చుపెట్టి మరి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించిన వ్యక్తిగా...పిలిస్తే పలికే నేతగా ప్రజల్లో ఈయన పట్ల సదాభిప్రాయం ఉంది. వీరంతా సీనియర్లు కావడంతో పాటు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు.
అయితే ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రత్తిపాటి, రావెల కిశోర్ బాబు పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉండటంతో వీరికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. దీంతో దళితుల కోటాలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌లు విజ్ఞప్తి చేశారు. ఆనందబాబు సీనియర్ అయినప్పటికి అమరావతి ప్రాంతంలో రైతులను ఒప్పించి ల్యాండ్‌పూలింగ్‌కి సహకరించిన శ్రవణ్ కుమార్‌కు రావెల స్థానంలో బెర్త్ దక్కే అవకాశముందని ట్రస్ట్ భవన్ టాక్. ఇలా ఎవరికి తోచినట్లు వారు అనాలిసిస్ చేస్తున్నప్పటికి చంద్రబాబు లెక్కలు ఆయనకుంటాయి. ఒకరిని కాదని ఒకరికి మంత్రి పదవి ఇస్తే రాజకీయ రచ్చ తప్పదని..ప్రతిపక్షంలో ఉండగా..పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని వేరే వారికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పార్టీలో కుదుపు ఖాయమని సీఎం భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాను ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.