టీడీపీ-బీజేపీల మధ్య "మాణిక్యాల" వారథి కాగలరా..?
సరిగ్గా 10 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చేసింది. దాని ప్రభావం తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. మిత్రపక్షంగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని టీడీపీకి ఇంటా బయటా విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కమలంతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జరిగింది. బీజేపీ కూడా దీని గురించే ఎదురు చూస్తొందన్న వార్తలు వినిపించాయి. అయితే టీడీపీ వల్ల జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకున్న బీజేపీకి లాభాలే ఎక్కువ కనిపించడంతో.. టీడీపీతో ఘర్షణ వైఖరికి బదులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వెళ్లాలని యోచిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ద్వారా జనంలోకి ఆ సందేశాన్ని పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయడం లేదని ఇప్పటికే ఢిల్లీ లెవల్లో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు పార్లమెంట్‌లో ఏపీ ప్రత్యేకహోదాపై తేల్చిసిన సందర్భం నుంచి మిత్రపక్షమైన టీడీపీ నేతల నుంచి బీజేపీకి విమర్శలు ఎక్కువయ్యాయి. బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదనట్టు టీడీపీపైనా, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా ఎదురుదాడికి దిగారు. ఏపీలో బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం సపోర్ట్ ఉండాలని భావించిన కమలనాథులు..టీడీపీతో సమరం కంటే సఖ్యతకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. రేసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి మాణిక్యాలరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన కంభంపాటి హరిబాబు, టీడీపీతో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నేత కోసమే బీజేపీ అన్వేషిస్తోంది.
వీర్రాజుకు అధ్యక్షపదవి ఇస్తే..టీడీపీతో నేరుగా బాహాబాహీకి సంకేతాలిచ్చినట్టే. పురంధేశ్వరికి, టీడీపీ అధినేతకు వున్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మాణిక్యాలరావు సంగతి చూస్తే వివాదరహితుడు, అందరిని కలుపుకు వెళ్లే వ్యక్తిత్వంతో పాటు చంద్రబాబు వద్ద వెయిటేజ్ ఉన్న వ్యక్తి. అన్నింటి కంటే ముఖ్యంగా కపు వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గాన్ని దరి చేర్చుకోవచ్చు ఇన్ని ప్లస్‌లు ఉండటంతో బీజేపీ పైడికొండల వైపే మొగ్గు చూపపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీని సంతృప్తి పరచడానికి కమలనాధుల వద్ద ఉన్న మరో అస్త్రం కేంద్రమంత్రి పదవి. ఇప్పటికే కేంద్రంలో టీడీపీకి రెండు పదవులిచ్చిన బీజేపీ, త్వరలో మరోక మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ రకంగా తమ మధ్య విభేదాలు లేవన్న సంకేతాలతో పాటు, మిత్ర పక్షమంటే తమకు ఎంత గౌరవమో ప్రపంచానికి చూపించాలనుకుంటోంది. మరి బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.