పెద్దలను తప్పించడానికే కులంపై దర్యాప్తు జరిపారా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల కులం వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రోహిత్ దళితుడు కాదని వడ్డెర కులస్తుడని సైబరాబాద్ పోలీసులు ఉమ్మడి హైకోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న గచ్చిబౌలి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమేశ్ కుమార్ హైకోర్టుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారం మొత్తం అతని కులం చుట్టూనే తిరిగాయి. అతను దళితుడు కావడం వల్లే అతనితో పాటు మరో నలుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఏఎస్‌ఏ విద్యార్ధులు ఆరోపించారు. అయితే రోహిత్ తండ్రి తాము వడ్డెర కులానికి చెందిన వారమని చెప్పడంతో కేసులో కొత్త వాదన మొదలైంది. దానికి స్పందించిన రోహిత్ తల్లి తాను మాల కుటుంబంలో జన్మించానని, కానీ తనను పెంచి పోషించింది మాత్రం వడ్డెర కులానికి చెందిన కుటుంబమని తెలిపింది.
రోహిత్ ఆత్యహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానికన్నా..అతని కులం చుట్టూనే వివాదం ముసురుకుంది దీంతో పోలీసులు జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లా గురజాలలో ఉన్న రోహిత్ తండ్రి నాగమణికుమార్, తండ్రి తరపున బంధువులు, గ్రామ సర్పంచ్, రోహిత్ తల్లి రాధిక బంధువులు, రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు తహసీల్దార్ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం ఆధారంగా రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. గుంటూరులోని రోహిత్ చదివిన పాఠశాల రికార్డుల్లో కులం గురించిన ఆధారాలు లభించలేదని, ఇంటర్, డిగ్రీ రికార్డుల్లో మాత్రం ఎస్సీ మాలగా నమోదై ఉందన్నారు. రోహిత్ తల్లి రాధికను దత్తత తీసుకున్నట్లు అంజనీ దేవి చెప్పిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందన్నారు.
1989 జనవరి 30న పుట్టినట్టు ఎస్సీ కులానికి చెందిన వాడని పేర్కొంటూ గురజాల ఎమ్మార్వో రోహిత్‌కు సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే గతంలో మిగిలిన వారి సర్టిఫికేట్లలో వడ్డెర కులాన్నే ప్రస్తావించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక, మణికుమార్ బంధువులు, రోహిత్ సోదరుడు, రోహిత్ అమ్మమ్మల వివరణలతో పాటు నీటిపారుదల శాఖలో తండ్రి గతంలో సమర్పించిన పత్రాలను సైతం సేకరించి వాస్తవాలను తెలుసుకుంటున్నారు. మొత్తం మీద రోహిత్ తండ్రి నాగమణి కుమార్, తల్లి రాధిక ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోనికి తీసుకుని రోహిత్‌ను వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా తేల్చినట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.
మరోవైపు ఆత్మహత్యకు పురిగొలిపారనే ఆరోపణలపై హెచ్‌సీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రోహిత్ అసలు దళితుడే కానప్పుడు కేంద్రమంత్రి, వీసీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదని వారిపై కేసులు తొలగించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయినా పోలీసులు ఆత్మహత్యకు కారణాలు వదిలివేసి అతని కులంపై దర్యాప్తు చేసింది కేవలం పెద్దలను తప్పించడానికేనా?