ఈ జాగ్రత్తలు మానుకోండి
posted on Dec 30, 2016 9:11AM
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ పట్టా లేని వైద్యుడిగా మారిపోతున్నారు. ఆరోగ్యం పట్ల రకరకాల నమ్మకాలను ప్రోది చేసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం పేరుతో ఒకోసారి ఎలాంటి ఉపయోగమూ లేని అలవాట్లని సొంతం చేసుకుంటున్నామనీ, అనవసరమైన నమ్మకాలను పోగుచేసుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటిలో పెద్దగా పనికిరానివంటూ ఈ ఏడాది బయటపడిన అంశాలివిగో...
BMI
మన ఎత్తు ఆధారంగా బరువు ఎంత ఉండాలన్నది BMI (Body mass index) లెక్క చెబుతుంది. కానీ ఈ BMIని చూసుకుంటూ మురిసిపోవద్దంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. BMI అదుపులో ఉన్నంతమాత్రాన మనకి ఊబకాయం లేదని కానీ, ఉన్నంత మాత్రాన అనారోగ్యానికి చేరువలో ఉన్నామని కానీ లెక్కల కట్టవద్దంటున్నారు. శారీరిక శ్రమ చేసేవారు ఎత్తుకి మించిన బరువు ఉండవచ్చనీ, అలాగే డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు బరువు లేకపోయినా ఊబకాయంతో బాధపడవచ్చని హెచ్చరిస్తున్నారు.
లో ఫ్యాట్ ఆహారం
బరువు తగ్గాలనుకుంటే చాలు కొవ్వు తక్కువగా ఉన్న పదార్ధాల వెంట పడటం మనకి అలవాటు. కానీ దీని వలన మన బరువులో ఎలాంటి మార్పు రాకపోవడాన్ని గమనించారు. ఆరోగ్యకరమైన బలవర్ధకమైన ఆహారం, శరీరానికి తగిన వ్యాయామం ఉండాలే కానీ నెయ్యి, బాదం పప్పులు, చేపలు వంటి కొవ్వు పదార్థాల వల్ల కూడా శరీరానికి మేలు జరుగుతుందని తేల్చారు.
పళ్లరసాలు
ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒంట్లో నిస్సత్తువ పోవాలన్నా, బరువు తగ్గాలన్నా... పళ్లరసాలే దివ్వౌషధం అన్నది ఇప్పటి తరం ఆలోచన. కానీ పళ్లరసాలలో పీచు పదార్థాలు, పోషకాలు అన్నీ పోయి కేవలం పంచదారే మిగులుతుందన్నది నిపుణుల మాట. దీని వల్ల తాత్కాలికంగా సత్తువ కలిగినట్లు కనిపించినా, కండరాలు దెబ్బతింటాయని హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. తాగిన వెంటనే ఆకలి వేయడం, కాసేపటికే నీరసంగా తోచడంతో మరింత ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉందని తేల్చిపారేస్తున్నారు.
శానిటైజర్
ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమతో పాటుగా శానిటైజర్ వెంట పెట్టుకుని బయల్దేరుతున్నారు. శానిటైజర్ పులుముకుంటే చేతులు శుభ్రంగా ఉంటాయని మురిసిపోతున్నారు. నిజానికి సబ్బు, నీటితో పోల్చుకుంటే శానిటైజర్ అన్ని రకాల క్రిములనీ చంపలేదని తేల్చిచెబుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు శానిటైజర్‌ని పక్కన పెట్టి నీటితోనే చేతులు కడుక్కోమని సూచిస్తున్నారు.
సి విటమిన్
చలికాలం వచ్చిందంటే చాలు జలుబులు దగ్గులు దరిచేరకుండా ఉండటానికి సి విటమిన్ మాత్రలు తెగ చప్పరించేస్తుంటాము. ఈమధ్య కాలంలో ఈ అలవాటు మరీ పతాకస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి మనలోని రోగనిరోధకశక్తిని కాస్త ఉత్తేజపరిచేందుకు విటమిన్ సి అవసరమే కానీ రోజుకి 2000 మి.గ్రాములకి మించి సి విటమిన్‌ను తీసుకుంటే నానారకాల దుష్ప్రభావాలూ తప్పవని హెచ్చరిస్తున్నారు.
(ఇండిపెండెంట్ పత్రిక నివేదిక ఆధారంగా)
- నిర్జర.