పరులను ప్రేమిస్తే ఆయుష్షు పదిలం
posted on Dec 24, 2016 @ 10:13AM
‘‘Thou shalt love thy neighbour as thyself," నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమించు- అన్నది క్రైస్తవంలోని ప్రధాన సూక్తులలో ఒకటి. ఈ మాటను కనుక అంతా పాటిస్తే ప్రపంచశాంతి సాధ్యమన్నది పెద్దల ఆశ. అంతేకాదు! పరులను ప్రేమిస్తే ఆయుష్షు కూడా పెరుగుతుందన్నది ఇప్పుడు పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
మూడు దేశాలు
ఇతరులకు సాయం చేయడానికి ఆయుష్షుకీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పరిశోధకులు కొందరు ఒక్క తాటి మీదకు వచ్చారు. తమ ప్రయోగం కోసం వారు 1990 నుంచి 2009 వరకు Berlin Aging Study పేరుతో సాగిన ఓ అధ్యయనాన్ని పరిశీలించారు. వీరిలో ఒక 500 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ 500 మంది కూడా 70 నుంచి 103 ఏళ్ల వయసులోపువారే! వీరి వయసుతో పాటుగా ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలన్నింటినీ కూడా పరిశోధకులు పరిగణలోకి తీసుకున్నారు.
మూడు రకాలు
తాము పరిశీలిస్తున్న వృద్ధులను వీరు మూడు రకాలుగా విభజించారు. ఒకటి- పిల్లలతోనూ, మనవళ్లతోనూ గడుపుతూ వారికి సాయపడేందుకు ఇష్టపడేవారు. రెండు- పిల్లలు, మనవలు ఉన్నా కూడా వారికి దూరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. మూడు- సొంత పిల్లలు కానీ మనవలు కానీ లేకపోయినా కూడా, తమ సమీపంలో ఉన్న ఎవరో ఒకరికి సాయపడుతూ ఉండేవారు.
మూడు ఫలితాలు
ఇంట్లో పెద్దలు చేదోడువాదోడుగా ఉంటూ కష్టసుఖాలను గమనించుకుంటూ ఉంటే... అది ఇంట్లోవారికి లాభం చేకూరుస్తుందన్న విషయం తెలిసిందే! కానీ ఆశ్చర్యంగా ఆ పెద్దల ఆయుష్షుకి కూడా బలం చేకూరుతుందని ఈ ఫలితాలు తేల్చాయి. తమ పిల్లలకి, మనవలకి చేదోడువాదోడుగా ఉన్న పెద్దలు ఏకంగా ఐదేళ్లు ఎక్కువకాలం బతుకుతారని బయటపడింది. అంతేకాదు! తమ సొంతవారు కాకపోయినా పరులకు సాయపడుతూ ఉండేవారు కూడా ఓ మూడేళ్లు ఎక్కువకాలం జీవిస్తారనీ ఈ పరిశోధన తేల్చింది.
ఇతరులకు చేదోడువాదోడుగా ఉండాలనే మనస్తత్వం మన హార్మోన్ల మీదా, నాడీ వ్యవస్థ మీదా సానుకూల ప్రభావం చూపుతుందట. అందుకే ఇలాంటి తత్వం ఉన్నవారు తమకి నా అన్నవారు లేకపోయినా కూడా ఎవరో ఒకరికి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారట. అయితే ఒక స్థాయికి మించి అవతలవారి జీవితాలలోకి చొచ్చుకుపోతే మాత్రం ఒత్తిడి తప్పదని హెచ్చరిస్తున్నారు.
- నిర్జర.