అభిమానిని పెళ్లి చేసుకున్న విజ‌య్‌! ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

  ఒక‌రేమో యంగ్‌ హీరో.. ఇంకొక‌రేమో ఆయ‌న వీరాభిమాని. కానీ విధి ఆ ఇద్ద‌రి విష‌యంలో మ‌రో ర‌కంగా త‌ల‌చింది. తొలిసారి క‌ల‌యిక‌లోనే త‌న ఫిమేల్ ఫ్యాన్స్‌లో ఒక‌మ్మాయితో ఆ హీరో ప్రేమ‌లోప‌డి, పెళ్లిచేసుకుంటాడ‌ని ఎవ‌రు ఊహిస్తారు! త‌మిళ సూప‌ర్‌స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ విష‌యంలో అదే జ‌రిగింది. ఆయ‌న ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరు సంగీత సోర్ణ‌లింగ‌మ్‌. ఆమె శ్రీ‌లంక‌కు చెందిన ఓ త‌మిళ‌మ్మాయి!! సంగీత తొలిసారి క‌లిసిన‌ప్పుడు విజ‌య్ ఇంకా సూప‌ర్‌స్టార్ కాడు, కోలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ కోసం ప్ర‌య‌త్నిస్తోన్న యంగ్ హీరో. 1996లో 'పూవే ఉన‌క్కాగ‌' సినిమా స‌క్సెస్‌ను విజ‌య్ ఎంజాయ్ చేస్తున్న స‌మ‌యంలో తొలిసారి సంగీత‌ను చూశాడు. విజ‌య్‌కు మంచి పేరుతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న తొలి చిత్రం అదే. ఆ సినిమా విడుద‌ల‌య్యాక అత‌నికి యూత్‌లో మంచి క్రేజ్ వ‌చ్చింది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌మిళులంద‌రికీ ఆ సినిమా తెగ న‌చ్చేసింది. 'పూవే ఉన‌క్కాగ' సినిమా త‌ర్వాత విజ‌య్ త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో ఉండ‌గా, ఒక అంద‌మైన అమ్మాయి అత‌డిని అభినందించ‌డానికి వ‌చ్చింది. ఆమె శ్రీ‌లంక‌కు చెందిన ఒక త‌మిళ పారిశ్రామిక‌వేత్త కుమార్తె. వారు యు.కె.లో సెటిల్ అయ్యారు. 'పూవే ఉన‌క్కాగ‌' మూవీలో విజ‌య్ ప‌ర్ఫార్మెన్స్ చూసి, ఆయ‌న‌కు అభిమాని అయిన ఆమె, ఆయ‌న‌ను ఎలాగైనా క‌లుసుకోవాల‌ని డిసైడ్ చేసుకుంది. ఆయ‌న‌ను క‌లుసుకొని అభినందించింది. ఇద్ద‌రూ కొద్దిసేపు క‌బుర్లు చెప్పుకున్నారు. తొలిచూపులోనే సంగీత ఆయన హృద‌యాన్ని దోచుకుంది. ఆమెకు అంగీకార‌మైతే, ఓసారి త‌న ఇంటికి వ‌స్తే, త‌న త‌ల్లిదండ్రుల‌ను ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పాడు విజ‌య్‌. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లుసుకుంది విజ‌య్ ఇంట్లోనే. ఆమెను అమ్మానాన్న‌ల‌కు ప‌రిచ‌యం చేశాడు విజ‌య్‌. ఆమె చ‌క్క‌ద‌నం, సింప్లిసిటీ వారిని కూడా ఆక‌ట్టుకున్నాయి. అయితే ఆ అమ్మాయి రానున్న రోజుల్లో త‌మ కోడ‌లు అవుతుంద‌ని మాత్రం వార‌ప్పుడు ఏమాత్రం ఊహించ‌లేదు. ఈ విష‌యాన్ని త‌ర్వాత ఓ సంద‌ర్భంలో విజ‌య్ త‌ల్లి స్వ‌యంగా తెలిపారు. సంగీత ప‌ట్ల క్ర‌మేపీ విజ‌య్‌లో ప్రేమ పెరుగుతూ వ‌చ్చింది. ఆమె చెన్నైలో ఉండ‌గా, మ‌రోసారి త‌మ ఇంటికి ఆహ్వానించాడు విజ‌య్‌. అప్పుడు ఆయ‌న పేరేంట్స్‌కు అర్థ‌మైంది, కొడుకు ఆమెను ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని. మాట‌ల సంద‌ర్భంగా "విజ‌య్‌ను పెళ్లిచేసుకుంటావా?" అని ఆయ‌న తండ్రి సంగీత‌ను అడిగారు. సిగ్గుల మొగ్గ అయిన సంగీత ఆనందంగా అంగీక‌రించింది. విజ‌య్ తండ్రి అప్ప‌టికే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేరుపొందిన ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన ఎస్‌.ఎ. చంద్ర‌శేఖ‌ర్‌. 1999 ఆగ‌స్ట్ 25న విజ‌య్‌, సంగీత దంప‌తులుగా మారారు. సంగీత హిందు, విజ‌య్ క్రిస్టియ‌న్‌. ఆమె కోసం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆమెను పెళ్లాడాడు విజ‌య్‌. అట్ట‌హాసంగా జ‌రిగిన వారి వివాహానికి సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని అనేక‌మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. విజ‌య్‌, సంగీత దంప‌తులకు ఇద్ద‌రు పిల్ల‌లు.. జాస‌న్‌, దివ్య షాషా. ఈరోజు (జూన్ 22) విజ‌య్ 47వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు.

అర్జున్ భార్య ర‌మేశ్‌బాబు ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింద‌ని తెలుసా?!

  ఉద‌యం తొమ్మిది గంట‌లు.. బెంగ‌ళూరు సిటీ.. చ‌ల్ల‌గా, ప్ర‌శాంతంగా ఉంది. ఆ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌యాన‌గ‌ర్ ప్రాంతం మాత్రం కోలాహ‌లంగా ఉంది. అక్క‌డి బెళ‌గోడు క‌ల్యాణ మంట‌పం మంగ‌ళ‌తోర‌ణాల‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. మంగ‌ళ‌వాయిద్యాల ఘోష మార్మోగుతోంది. ముఖ‌ద్వారం ద‌గ్గ‌ర స్వాగ‌త బృందం అతిథుల‌కు పువ్వుల‌తో, ప‌న్నీటి జ‌ల్లుల‌తో, తీపి క‌ల‌కండ‌తో స్వాగ‌తం ప‌లుకుతోంది. ఆ బృందంలో సినీ రంగానికి చెందిన సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు.  క‌ల్యాణ మంట‌పం సంద‌డిని మించి వెలుప‌ల పోలీసుల హ‌డావిడి ఎక్కువ‌గా ఉంది. కార‌ణం.. అక్క‌డ జ‌రిగే వివాహానికి విచ్చేస్తున్న సెల‌బ్రిటీల‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమాన సందోహం! ఆ వివాహానికి వ‌చ్చిన తార‌ల్లో క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, రాధిక‌, శ‌ర‌త్‌బాబు, గిరిబాబు, రంగ‌నాథ్‌, గొల్ల‌పూడి మారుతీరావు, రాళ్ల‌ప‌ల్లి, కోట శ్రీ‌నివాస‌రావు, సుద‌ర్శ‌న్‌, జ‌యంతి, శ‌ర‌ణ్య‌, హేమా చౌద‌రి, ద‌ర్శ‌కులు కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, ర‌విరాజా పినిశెట్టి, రేలంగి న‌ర‌సింహారావు, నిర్మాత‌లు డి. రామానాయుడు, ఎస్పీ వెంక‌న్న‌బాబు, గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఇట్లా అనేక‌మంది ఉన్నారు. ప‌ది గంట‌ల‌కు క‌ల్యాణ మంట‌పం ఎటుచూసినా కిట‌కిట‌లాడుతోంది. హాలు ప‌ట్ట‌నంత జ‌నం. అతిథుల‌కు పురోహితులు అక్షింత‌లు అంద‌జేశారు. అంద‌రి దృష్టీ వ‌ధూవ‌రుల మీదే.. ముహూర్త స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో మంగ‌ళ‌వాయిద్యాల ఘోష మిన్నంటింది. ఆశీర్వ‌చ‌నాల అక్షింత‌ల మ‌ధ్య వ‌రుడు అర్జున్‌, వ‌ధువు నీతూ మెడ‌లో మూడుముళ్లు వేశాడు. ఆ విధంగా ర‌మేశ్‌బాబు 'కృష్ణ‌గారి అబ్బాయి' (1989) హీరోయిన్ నీతూ (క‌న్న‌డ న‌టుడు రాజేశ్ కుమార్తె) యాక్ష‌న్ కింగ్ అర్జున్ నిజ‌జీవిత హీరోయిన్ అయింది. అర్జున్ కూడా సుప్ర‌సిద్ధ క‌న్న‌డ న‌టుడు దివంగ‌త శ‌క్తిప్ర‌సాద్ కుమారుడు. 'డాక్ట‌ర్ గార‌బ్బాయి' (1988) చిత్రంలో క‌లిసి న‌టిస్తున్న స‌మ‌యంలో అర్జున్‌, నీతూ మ‌ధ్య ఏర్ప‌డిన స‌న్నిహిత‌త్వం ప్రేమ‌గా మారి, పెళ్లికి దారితీసింది. 1988 ఫిబ్ర‌వ‌రి 8న వారి వివాహం జ‌రిగింది. నీతూ అస‌లు పేరు నివేదిత‌. ఆ క్యూట్ క‌పుల్‌కు ఇద్ద‌రు అంద‌మైన కూతుళ్లు.. ఐశ్వ‌ర్య‌, అంజ‌న‌. 2013లో ఐశ్వ‌ర్య హీరోయిన్‌గా వెండితెర మీద‌కు వ‌చ్చింది.

'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట వెనుక క‌థ‌!

  సంగీతం విష‌యంలో స్వ‌ర‌బ్ర‌హ్మ కె.వి. మ‌హ‌దేవ‌న్‌కు ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలున్నాయి. చెవికి ఇంపుగా ఉండే ఏ పాటైనా సంగీత‌మే అనేవారు. 1960ల‌లో సాలూరు రాజేశ్వ‌ర‌రావు, పెండ్యాల‌, ఘంట‌సాల లాంటి లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు సాటిగా బాణీలు కూర్చిన మ‌హ‌దేవ‌న్‌, 1970ల‌లో చ‌క్ర‌వ‌ర్తి, స‌త్యం నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. 1980ల‌లో వృద్ధాప్యం మీద ప‌డినా కూడా చ‌క్ర‌వ‌ర్తి, ఇళ‌య‌రాజాతో త‌ల‌ప‌డ్డారు. మూడు ద‌శాబ్దాల పాటు అంద‌రి పోటీని త‌ట్టుకొని నిలిచిన ఏకైక సంగీత ద‌ర్శ‌కుడు మామ‌.  వ‌య‌సు పెరిగే కొద్దీ ప్ర‌తిభ త‌రిగిపోతుందంటారు. కానీ మ‌హ‌దేవ‌న్ అందుకు మిన‌హాయింపు. ఆయ‌న‌ది ఎంత త‌వ్వినా త‌ర‌గ‌ని స్వ‌రాల ఊట‌. ఎన్నో మెలోడీ సాంగ్స్‌కు ప్రాణం పోసిన ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ 'అడ‌వి రాముడు' (1977) సినిమాకు సంగీతం అందించిన పాట‌లు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో మ‌న‌కు తెలుసు. కుర్ర‌కారుని కుదిపేసిన ఆ పాట‌ల‌కు బాణీలు కూర్చే నాటికి ఆయ‌న వ‌య‌సు 59 ఏళ్లంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఆ వ‌య‌సులో అంత ఘాటైన పాట‌ల‌కు మ్యూజిక్ కంపోజ్ చేయ‌గ‌ల‌గ‌డం మ‌హ‌దేవ‌న్‌కే సాధ్యం! 'అడ‌వి రాముడు' సినిమాలో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ.." పాట ట్యూన్ ఒక్క‌టి చాటు ఆయ‌న నిత్య య‌వ్వ‌న‌వంతుడ‌ని చెప్ప‌డానికి. ఆ పాట రాసింది వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి. అప్ప‌టిదాకా ఆయ‌న ఈ త‌ర‌హా పాట‌లు రాయ‌లేదు. అంటే ఆయ‌న రాసిన తొలి ఫుల్ మాస్ సాంగ్ అదే. 'ద‌స‌రా బుల్లోడు' సినిమాలోని "అరెరె ఎట్టాగో ఉంటాది ఓల‌మ్మీ.." పాట త‌ర‌హాలో "అరెరె ఆరేసుకోబోయి.." అంటూ పాట చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన నెక్కంటి స‌త్య‌నారాయ‌ణ సూచించారు. "అలా చేయ‌కూడ‌దు.. అరెరెరెల‌ని చివ‌రికి పెట్టి చేయాలి." అని క‌చ్చితంగా చెప్పారు. చెబుతూనే ఆ పాట‌కు ట్యూన్స్ క‌ట్టి పాడారు మామ‌.  ఎన్టీఆర్‌, జ‌య‌ప్ర‌ద జంట‌పై చిత్రీక‌రించిన ఆ పాట సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో దాన్ని 'కోటి రూపాయ‌ల పాట' అని పిలిచేవారు. వాడ‌వాడ‌లా ఆ పాట మోగిపోయింది. కేవ‌లం ఆ పాట కోస‌మే ప‌దే ప‌దే 'అడ‌వి రాముడు'ను చూసిన వాళ్లున్నారంటే న‌మ్మాలి.

మ‌హాన‌టి సావిత్రి ఫ‌స్ట్‌ మేక‌ప్ స్టిల్‌!

  ఒక‌రోజు మార్నింగ్ ఒకాయ‌న ఒక అమ్మాయితో స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ ఆర్‌.ఎన్‌. నాగ‌రాజారావు ఇంటికి వెళ్లారు. "ఈ అమ్మాయి నా కూతురు. సినిమాల్లో న‌టించాల‌ని ఉవ్విళ్లూరుతోంది. మీరు ఈమె స్టిల్స్ తీస్తే నిర్మాత‌ల‌కు చూపించ‌డానికి సౌక‌ర్యంగా ఉంటుంది." అని చెప్పారు. ఆయ‌న పేరు చౌద‌రి. ఆయ‌న కోరిన‌ట్లే ఆ అమ్మాయిని నాగ‌రాజారావు వివిధ భంగిమ‌ల్లో ఫొటోలు తీశారు.  ఆ అమ్మాయికి ఆ త‌ర్వాత ఓ సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఆ చిత్రం 'సంసారం' (1950). ఎల్వీ ప్ర‌సాద్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాను రంగ‌నాథ దాస్ నిర్మించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నంద‌మూరి తార‌క‌రామారావు హీరోలుగా న‌టించారు. అయితే ఆ అమ్మాయికి ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది. ఆమె ముఖవ‌ర్ఛ‌స్సు బాగాలేద‌ని ఆ అమ్మాయిని 'సంసారం'లోంచి తీసేశారు. ఆ వేషాన్ని ల‌క్ష్మీరాజ్యంకు ఇచ్చారు. కానీ ఆ అమ్మాయి త‌ర్వాత కాలంలో తెలుగు, త‌మిళ చిత్రాల్లో తిరుగులేని నాయిక అయ్యింది. న‌ట‌న‌లో త‌న‌దైన బాణీని సృష్టించి ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కురాలు అయ్యింది. న‌ట‌నాప‌రంగా ఓ బెంచ్‌మార్క్ సృష్టించింది. 'సంసారం' మూవీ నుంచి తొల‌గించ‌బ‌డ్డ ఆ అమ్మాయే.. సావిత్రి! కాదు కాదు.. మ‌హాన‌టి సావిత్రి! ఇది నాగ‌రాజారావు తీసిన ఆమె తొలి మేక‌ప్ స్టిల్‌.

1988లోనే న‌రేశ్ హీరోగా ఓ టీవీ సీరియ‌ల్ వ‌చ్చిందని మీకు తెలుసా?!

  జంధ్యాల రూపొందించిన 'నాలుగు స్తంభాలాట' (1982)తో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌రేశ్‌.. అనంత‌ర కాలంలో కామెడీ హీరోగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన ముద్ర‌ను వేశారు. హీరోగా కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారారు. ప్ర‌స్తుతం ఆయ‌నంత బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ తెలుగు చిత్ర‌సీమ‌లో లేరంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి ఆయ‌న 1980ల‌లోనే చిన్నితెర‌పై న‌టించార‌నే విష‌యం నేటి త‌రంలో చాలామందికి తెలీదు. అవును. 1988లోనే ఆయ‌న 'సీతారాముల సినిమా గోల' అనే టీవీ సీరియ‌ల్‌లో న‌టించారు. ఇప్ప‌టి మాదిరిగా అప్ప‌ట్లో సీరియ‌ల్స్ సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి న‌డిచేవి కాదు. ముందుగా త‌యారుచేసుకున్న స్క్రిప్టుకు త‌గ్గ‌ట్లు కొన్ని ఎపిసోడ్లు మాత్ర‌మే చిత్రీక‌రించి, వాటిని దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం చేసేవారు. శాటిలైట్ చాన‌ల్స్ వ‌చ్చాక ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింద‌నేది వేరే సంగ‌తి. 'సీతారాముల సినిమాగోల‌'లో న‌రేశ్‌కు జోడీగా అప్ప‌ట్లో సినీ హీరోయిన్ అయిన సాగ‌రిక న‌టించారు. సీనియ‌ర్ సినీ డైరెక్ట‌ర్ ఎం.ఎస్‌. కోటారెడ్డి ఆ కామెడీ సీరియ‌ల్‌ను డైరెక్ట్ చేశారు. 13 ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సీరియ‌ల్‌ను హైద‌రాబాద్ దూర‌ద‌ర్శ‌న్ కేంద్రం ద్వారా 1988 ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నుంచి వారం వారం ప్ర‌సారం చేశారు. ఈ సీరియ‌ల్ క‌థాంశ‌మేమంటే.. ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసే రాము (న‌రేశ్‌) పెళ్లి చేసుకొని ప‌ట్నంలో కాపురం పెడ‌తాడు. అత‌ని భార్య సీత (సాగ‌రిక‌) ఏదైనా సినిమాకు తీసుకెళ్ల‌మ‌ని అడుగుతుంది. త‌ప్ప‌కుండా తీసుకెళ్తాన‌ని రాము చెప్తాడు. ప్ర‌తి ఎపిసోడ్‌లో సినిమాకు వెళ్ల‌డానికి వారు ప్ర‌యాణం అవ‌డం, అంత‌లోనే ఏదో అవాంత‌రం వ‌చ్చి వాయిదాప‌డ‌టం వినోదాత్మ‌కంగా ఉంటుంది.  ఈ సీరియ‌ల్‌లో రావి కొండ‌ల‌రావు, రాళ్ల‌ప‌ల్లి, పొట్టి ప్ర‌సాద్‌, కె.కె. శ‌ర్మ‌, శ్యామ్‌బాబు, డా. రాధాకృష్ణ‌, రాంబాబు, శ్రీ‌నివాస‌రావు, రాధాకుమారి, కృష్ణ‌వేణి లాంటి తార‌లు న‌టించారు. భ‌ర‌త్‌కుమార్ మాట‌లు రాయ‌గా, ఎ.ఎ. రాజ్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ సీరియ‌ల్‌ను చ‌ల్లా శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నిర్మించారు.

అభిమానిని నిర్మాత‌గా మార్చిన‌ సూప‌ర్‌స్టార్ కృష్ణ సినిమా 'నాయుడుగార‌బ్బాయి' క‌థ‌!

  సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరోగా బి.వి. ప్ర‌సాద్ డైరెక్ట్ చేసిన మూవీ 'నాయుడుగార‌బ్బాయి' (1981). అంబిక హీరోయిన్‌గా న‌టించ‌గా రావు గోపాల‌రావు, రంగ‌నాథ్ విలన్లుగా న‌టించారు. క‌విత ఓ కీల‌క పాత్ర చేసిన ఈ మూవీకి చ‌క్ర‌వ‌ర్తి సంగీతం స‌మ‌కూరిస్తే, ల‌క్ష్మ‌ణ్ గోరే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. రాజీవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌. రామ‌లింగేశ్వ‌ర‌రావు, బి.వి.పి.ఎ. గోపీనాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమంటే రామ‌లింగేశ్వ‌ర‌రావుకు ఊహ తెలిసిన‌ప్ప‌ట్నుంచీ కృష్ణ అంటే వీరాభిమానం. అంటే అభిమానికి ఈ సినిమా చేసిచ్చారు కృష్ణ‌. అప్పుడు రామ‌లింగేశ్వ‌ర‌రావు వ‌య‌సు కేవ‌లం 22 ఏళ్లు.  క‌థా ర‌చ‌యిత‌గా దాస‌రి నారాయ‌ణ‌రావు పేరు వేసినా, నిజానికి జితేంద్ర హీరోగా న‌టించిన హిందీ సినిమా 'కార‌వాన్' ప్రేర‌ణ‌తో ర‌చ‌యిత రాజ‌శ్రీ ఈ సినిమా క‌థ త‌యారుచేసి, సంబాష‌ణ‌లు రాశారు. ఈ సినిమా నుంచి కృష్ణ‌కు రామ‌లింగేశ్వ‌ర‌రావు రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్ అయిపోయారు. కృష్ణ కాల్షీట్లు అడ్జెస్ట్ అవ‌డం లేటైతే చిన్న హీరోల‌తో సినిమాలు తీశారు కానీ, మ‌రో స్టార్ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు రామ‌లింగేశ్వ‌ర‌రావు. ఈ సినిమా క‌థ‌ను బొమ్మ‌ల‌తో పాటు చ‌దువుకుందాం... ఒక ఊళ్లో రాఘ‌వ‌నాయుడు (కాంతారావు) అనే డ‌బ్బున్నాయ‌న ఉంటాడు. ఆయ‌న పెద్ద బంగ‌ళాలో మేనేజ‌ర్‌ కుటుంబ‌రావు (అల్లు రామ‌లింగ‌య్య‌), ఆయ‌న భార్య తాయార‌మ్మ (సూర్య‌కాంతం) కూడా ఉంటుంటారు. నాయుడుగారి భార్య అప్ప‌టికే చ‌నిపోయింది. అంతులేని సంప‌ద ఉన్న రాఘ‌వ‌నాయుడు త‌న కుమారుడు రాజ‌శేఖ‌ర్‌తో పాటు కుటుంబ‌రావు కొడుకు సూరిబాబును కూడా స‌మాన ప్రేమ‌తో చూస్తుంటాడు. ఊరి వాళ్లంద‌రికీ ఆయ‌నంటే ఎంతో గౌర‌వం, అభిమానం. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాగ‌రాజు (రావు గోపాల‌రావు) నేరుగా నాయుడుగారింట్లో ఉంటున్న త‌న అక్క తాయార‌మ్మ‌ను క‌లుసుకొని, అక్క‌డ ఆమె కుటుంబం అనుభ‌విస్తున్న రాజ‌భోగాలు చూసి మ‌తిపోగొట్టుకుంటాడు. నాయుడుగారిని చంపేస్తే ఆ ఆస్తి అంతా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అక్క‌ను ఒప్పించి, తెలివిగా నాయుడుగారిని చంపి, ఆయ‌న స‌హ‌జంగా చ‌నిపోయిన‌ట్లు ఊరిజ‌నాన్ని న‌మ్మిస్తాడు. ఆయ‌న అస్థిక‌ల‌ను అన్ని పుణ్య‌న‌దుల్లోనూ క‌లిపి వ‌స్తానంటూ అక్క తాయార‌మ్మ‌ను, చిన్న‌పిల్ల‌లైన రాజ‌శేఖ‌ర్‌, సూరిబాబును తీసుకొని తీర్థ‌యాత్ర‌ల‌కు బ‌య‌లుదేరి, దారిలో శ్రీ‌శైలం అడ‌వుల్లో ఓ పాడుబ‌డ్డ బావిలో నాయుడుగార‌బ్బాయి రాజ‌శేఖ‌ర్‌ను ప‌డేస్తాడు నాగ‌రాజు. సూరిబాబును ప‌ట్నంలోని ఓ కాన్వెంట్లో చేర్పించి, ఊరికి వ‌చ్చి సూరిబాబు చ‌నిపోయాడ‌నీ, రాజ‌శేఖ‌ర్ క్షేమంగా కాన్వెంట్‌లో చ‌దువుకుంటున్నాడ‌ని అంద‌ర్నీ న‌మ్మిస్తాడు. బావిలో ప‌డిన రాజ‌శేఖ‌ర్‌ను నాట‌కాలు ఆడే శ‌ర‌భ‌య్య కాపాడి ఆ అబ్బాయికి చంద్రం అని పేరుపెట్టుకొని పెంచుతాడు. చంద్రం (కృష్ణ‌) పెరిగి పెద్ద‌వాడై, ఆ నాట‌కాల కంపెనీకి య‌జ‌మాని అవుతాడు. ఎప్పుడూ ఉత్సాహం ఉర‌క‌లు వేస్తుండే చంద్రం అంద‌ర్నీ ఆనందింప‌జేస్తుండ‌ట‌మే కాకుండా, ఎక్క‌డ అన్యాయం జ‌రుగుతున్నా ప్రాణాల‌కు తెగించి న్యాయం వైపు నిలుస్తుంటాడు. చంద్రంతో పాటు ఆడుతూ పాడుతూ "బావా బావా" అంటూ వెంట తిరుగుతుంటుంది గౌరి (క‌విత‌). ఓసారి శ‌ర‌భ‌య్య‌కు జ‌బ్బుచేస్తే డాక్ట‌ర్‌ను తీసుకువెళ్ల‌డానికి త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అదే రోడ్డులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న మాధ‌వి (అంబిక‌) అనే అమ్మాయి కారును ఆపించి, ఆ కారులో డాక్ట‌ర్‌ను తీసుకుపోయి ట్రీట్‌మెంట్ ఇప్పించి శ‌ర‌భ‌య్య‌ను బ‌తికించుకుంటాడు చంద్రం. అలా చంద్రం, మాధ‌విల ప‌రిచ‌యం జ‌రుగుతుంది. అమెరికాలో పైచ‌దువులు ముగించుకున్న సూరిబాబు (రంగ‌నాథ్‌).. నాయుడుగార‌బ్బాయి రాజ‌శేఖ‌ర్‌గా ఇండియాకు తిరిగివ‌స్తాడు. ఒక‌ప్పుడు నాలుగురోడ్ల కూడ‌లిలో క‌ల్లుకొట్టు న‌డుపుకుంటూ బ‌తికిన నాగ‌మ్మ (సుకుమారి) ఇప్పుడు మ‌హిళామండ‌లి ప్రెసిడెంట్ నందివ‌ర్ధ‌నంగా మారి, త‌న కూతురు మాధ‌విని రాజ‌శేఖ‌ర్‌కు ఇచ్చి పెళ్లిచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోయినా, ఏమీచేయ‌లేక ఆమె చెప్పిన‌ట్లే న‌డుచుకుంటుంటాడు నందివ‌ర్ధ‌నం భ‌ర్త (మిక్కిలినేని). రాజ‌శేఖ‌ర్ ఇండియాకు వ‌చ్చిన శుభ‌సంద‌ర్భంగా చంద్రం బృందం నాట్య‌ప్ర‌ద‌ర్శ‌న ఇస్తారు. ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం చంద్రం మీద‌కు రాజ‌శేఖ‌ర్ మ‌నీ ప‌ర్స్ విసిరికొడితే, ఆ ప‌ర్సులో ఉన్న డ‌బ్బులో త‌న‌కు రావాల్సిన డ‌బ్బు మాత్ర‌మే తీసుకొని, మిగ‌తా డ‌బ్బు ఆ ప‌ర్సులోనే ఉంచి, దాన్ని తిరిగి రాజ‌శేఖ‌ర్ ముఖంమీద‌కు విసిరికొడ‌తాడు చంద్రం. ప్రోగ్రాం చూడ్డానికి వ‌చ్చిన మాధ‌విని చంద్రం నిజాయితీ ఆక‌ట్టుకుంటుంది. రాజ‌శేఖ‌ర్ కోసం నందివ‌ర్ధ‌నం ఏర్పాటుచేసిన ఓ పార్టీలో మాధ‌విని అత‌డు రేప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. చంద్రం అత‌డిని చిత‌క‌బాది మాధ‌విని క్షేమంగా వాళ్లింట్లో దిగ‌బెడ‌తాడు. చంద్రాన్ని నందివ‌ర్ధ‌నం అవ‌మానిస్తుంది. మాధ‌వి అత‌డిని క్ష‌మించ‌మంటుంది. ఇద్ద‌రి మ‌న‌సులు ఒక్క‌ట‌వుతాయి. మాధ‌విని చంద్రం ప్రేమిస్తున్న విష‌యం గ‌మ‌నించి "నాకెందుకు అన్యాయం చేశావ్?" అని చంద్రాన్ని నిల‌దీస్తుంది గౌరి. "నిన్నెప్పుడూ నేను ఆ దృష్టితో చూడ‌లేదు." అని చెప్తాడు చంద్రం. మాధ‌వి-చంద్రం ప్రేమ వ్య‌వ‌హారం తెలుసుకున్న నాగ‌రాజు, రాజ‌శేఖ‌ర్‌ చంద్రాన్ని చంపేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కానీ అత‌డిని గౌరి కాపాడుతుంది. గౌరి హృద‌యం చంద్రానికి అర్థ‌మ‌వుతుంది. మాధ‌వి పెళ్లి రాజ‌శేఖ‌ర్‌తో నిశ్చ‌యిస్తుంది నందివ‌ర్ధ‌నం. ముహూర్తం స‌మ‌యానికి చంద్రం, మాధ‌వి త‌ప్ప‌తాగి పాట‌పాడ‌తారు. దాంతో ఈ తాగుబోతు సంబంధం మాకొద్దంటూ రాజ‌శేఖ‌ర్‌ బంధువులు అత‌డిని తీసుకొని వెళ్లిపోతారు. చంద్రం చేసిన అవ‌మానానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ర‌గిలిపోయి గౌరిని రేప్ చేస్తాడు రాజ‌శేఖ‌ర్‌. గౌరి ఏడుస్తూ ఆ విష‌యం చంద్రంకు చెబుతుంది. చంద్రం ఆవేశంతో రాజ‌శేఖ‌ర్‌ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నీ చేత్తోనే గౌరిమెడ‌లో తాళి క‌ట్టిస్తాన‌ని శ‌ప‌థం చేస్తాడు. త‌న జీవితం బాగుప‌డాలంటే చంద్రం-మాధ‌వి పెళ్లి జ‌ర‌గాలంటుంది గౌరి. ఆమె ఇష్ట‌ప్ర‌కారం గుడిలో పెళ్లి చేసుకోబోతారు చంద్రం, మాధ‌వి. అంత‌కుముందే చంద్రానికి పెళ్లయ్యింద‌ని సాక్ష్యాల‌తో ప‌దిమందినీ న‌మ్మించి ఆ పెళ్లి చెడ‌గొడ‌తాడు నాగ‌రాజు. అత‌డి కుట్ర చంద్రానికి అర్థ‌మ‌వుతుంది. కుటుంబ‌రావు ద్వారా త‌నే నాయుడుగార‌బ్బాయిన‌నే నిజం తెలుసుకుంటాడు. అక్క‌డ రాజ‌శేఖ‌ర్‌ త‌న‌ను ఆయాలాగా, ప‌నిమ‌నిషిలాగా చూస్తుంటే ఆ బాధ‌ను భ‌రించ‌లేక‌పోతుంది క‌న్న‌త‌ల్లి అయిన తాయార‌మ్మ‌. ఈలోగా తానే సూరిబాబునంటూ ఆ ఇంట్లో మారువేషం వేసుకొని వ‌స్తాడు చంద్రం. మాధ‌వితో పెళ్లి జ‌రిపిస్తాన‌ని రాజ‌శేఖ‌ర్‌కు మాట‌యిచ్చి అత‌డి ఫ్రెండ్ అయిపోతాడు. "అస‌లు సూరిబాబు.. రాజ‌శేఖ‌ర్‌గా చ‌లామ‌ణీ అవుతుంటే ఈ న‌కిలీ సూరిబాబు గాడెవ‌డు?" అని గింజుకుంటాడు నాగ‌రాజు. మాధ‌విని రాజ‌శేఖ‌ర్‌తో పెళ్లికి ఒప్పుకొమ్మ‌ని చెప్పి, ముహూర్తం స‌మ‌యానికి తాను వ‌చ్చి తాళిక‌డ‌తాన‌ని చెప్తాడు చంద్రం. న‌కిలీ సూరిబాబు, నాట‌కాల చంద్రమేన‌ని తెలుసుకున్న నాగ‌రాజు దొంగ‌దెబ్బ‌తీసి అత‌డిని బంధిస్తాడు. త‌న నేస్తం గుర్రం చేసిన సాయంతో చంద్రం త‌ప్పించుకుని, రాజ‌శేఖ‌ర్‌కు బుద్ధివ‌చ్చేలా చేసి, గౌరి మెడ‌లో తాళి క‌ట్టిస్తాడు. తాను మాధ‌విని పెళ్లిచేసుకొని త‌నే నాయుడుగార‌బ్బాయిన‌నే నిజాన్ని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తాడు.

చిరంజీవిని నిజంగానే చెంప‌మీద గ‌ట్టిగా కొట్టేసిన రాధిక‌!

  చిరంజీవితో రాధిక న‌టించిన తొలి చిత్రం 'ప్రియ' అయినా, విడుద‌లైన తొలి చిత్రం మాత్రం 'న్యాయం కావాలి' (1981). క్రాంతికుమార్ నిర్మించ‌గా, ఎ. కోదండ‌రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి హిట్ట‌యింది. ఆ త‌ర్వాత నుంచీ చిరంజీవి, రాధిక మంచి స్నేహితుల‌య్యారు. వాళ్ల కాంబినేష‌న్‌లో వ‌రుస‌గా సినిమాలొచ్చాయి. పెళ్ల‌య్యాక చిరంజీవి మ‌ద్రాస్ టి. న‌గ‌ర్‌లో హ‌బీబుల్లా రోడ్డు ద‌గ్గ‌ర ఉండేవారు. ఆయ‌న ఇల్లు, రాధిక ఇల్లు ప‌క్క‌ప‌క్క‌నే. దాంతో రాధిక త‌ర‌చూ చిరంజీవి ఇంటికి వెళ్లేవారు. అలా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారామె. 'న్యాయం కావాలి' సినిమాలో చిరంజీవి, రాధిక‌కు గ‌మ్మ‌త్తైన అనుభ‌వాలున్నాయి. ఆ సినిమాలో చిరంజీవి యాంటీ హీరోగా న‌టించారు. రాధిక‌ను ప్రేమించాన‌ని చెప్పి, శారీర‌కంగా అనుభ‌వించి, ఆ త‌ర్వాత మోసం చేసే పాత్ర ఆయ‌న‌ది. ఒక సంద‌ర్భంలో న‌న్నెందుకు మోసం చేశావ‌ని అడుగుతూ, ఆమె చిరంజీవి చెంప‌మీద కొట్టి భావోద్వేగ‌భ‌రితంగా సుదీర్ఘ‌మైన డైలాగులు చెప్పాలి. ఆ సీన్ కోసం త‌న‌ను చెంప‌మీద నిజంగానే కొట్టాల్సిందిగా చిరంజీవి చెప్పారు. ఆ షాట్ స‌రిగా రాక‌పోవ‌డంతో ప‌దే ప‌దే రిటేకులు చేయాల్సి వ‌చ్చింది. ఒక టేక్‌లో స‌న్నివేశంలో లీన‌మైపోయిన రాధిక ఆయ‌న‌ను గ‌ట్టిగా కొట్టేశారు. షాట్ ఓకే అయ్యింది. చూస్తే.. చిరంజీవి చెంప ఎర్ర‌గా కందిపోయింది. చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది రాధికే. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన చివ‌రి చిత్రం 'రాజా విక్ర‌మార్క' (1990). ఇక వాళ్ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాల్లో అభిమానుల‌కు అత్యంత ఇష్ట‌మైన చిత్రం 'అభిలాష‌'.

ఫ‌స్ట్ ఫిల్మ్‌లో చేసిన‌ప్పుడు ఓ బిడ్డ త‌ల్లి.. రెండో సినిమాకు మ‌రో బిడ్డ‌తో బాలింత‌!

  షావుకారు జాన‌కి.. తొలి చిత్రం 'షావుకారు'నే త‌న ఇంటిపేరుగా మార్చుకొని పాపుల‌ర్ అయిన గొప్ప న‌టి. తెలుగు చిత్ర‌సీమ గ‌ర్వంగా చెప్పుకొనే తార‌ల్లో ఒక‌రు. అలాంటి ఆమె ఫ‌స్ట్‌ ఫిల్మ్‌లో న‌టించే స‌మ‌యానికే ఓ బిడ్డ త‌ల్లి అనే విష‌యం మ‌న‌లో చాలామందికి తెలీదు. అవును. జీవితం గురించీ, వైవాహిక వ్య‌వ‌స్థ గురించీ స‌రైన అవ‌గాహ‌న‌లేని టీనేజ్‌లోనే పెళ్ల‌యింది. ప‌ద్దెనిమిదేళ్ల‌కే త‌ల్ల‌య్యారు. పాప సంర‌క్ష‌ణ చూసుకుంటూ, కుటుంబ భారాన్ని ఆమే నిర్వ‌హించుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. త‌ప్ప‌నిసరిగా ఆమె డ‌బ్బు సంపాదించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అప్పుడామెకు గ్లామ‌ర్ లేదు. పీల‌గా, పొట్టిగా ఉండేవారు. అలాంటి స్థితిలోనే ఆమెను 'షావుకారు' చిత్రంలో హీరోయిన్‌గా ఎంచుకొని ఆ రోజుల్లో సంచ‌ల‌నం సృష్టించారు విజ‌య ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌లు. న‌ట‌రత్న ఎన్టీ రామారావు హీరోగా న‌టించిన ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. జెమిని వారి 'ముగ్గురు కొడుకులు' జాన‌కి రెండో చిత్రం. అప్ప‌టికి ఒక్క సినిమాయే చేసినందువ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి బాగోలేదు. అప్ప‌ట్లోనే ఆమెకు రెండో సంతానంగా అబ్బాయి పుట్టాడు. బాలింత‌రాలుగా ఉండ‌గా స‌రైన పౌష్టికాహారం లేక బ‌ల‌హీనంగా, నీర‌సంగా ఉండేవారు. అయినా బ‌తుకుతెరువు నిమిత్తం సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డం మాన‌లేదు. ఆ రోజుల్లో జెమినీ గ‌ణేశ‌న్ జెమినీ సంస్థ‌లో యాక్ట‌ర్ల‌ను ఎన్నిక‌చేసే క్యాస్టింగ్ మేనేజ‌ర్‌గా ఉండేవారు. ఆయ‌న‌ను జాన‌కి "అన్నా" అని పిలిచేవారు. జెమినీలో న‌టించ‌డానికి జాన‌కి అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు, జెమినీ గ‌ణేశ‌న్ ఆమె ఫొటోలు తీసుకొని, త‌గిన సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌క క‌బురుపెడ‌తాన‌న్నారు. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు ఆర్‌. నాగేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో జెమినీవారు 'ముగ్గురు కొడుకులు' సినిమా ప్రారంభిస్తుండ‌గా, అందులోని కోడ‌లి పాత్ర‌లో జాన‌కి స‌రిపోతారేమోన‌ని చూడ‌డానికి క‌బురు పంపించారు. జెమినీ అధినేత ఎస్‌.ఎస్‌. వాస‌న్ ఆమెను చూడ‌గానే ఆ పాత్ర‌కు ఎంపిక చేసేశారు. 'ముగ్గురు కొడుకులు' షూటింగ్ మొద‌లైంది. స‌రైన తిండీతిప్ప‌లు లేక‌పోయినా, ఒక‌వైపు ఇద్ద‌రు పిల్ల‌ల సంర‌క్ష‌ణ చూసుకుంటూ రోజూ షూటింగ్‌కు హాజ‌ర‌వుతూ వ‌చ్చారు జాన‌కి. అయితే ఒక‌రోజు నీర‌సానికి త‌ట్టుకోలేక సెట్లోనే స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. అంద‌రూ కంగారుప‌డి, డాక్ట‌ర్‌ను పిలిపించి, ప్ర‌థ‌మ చికిత్స చేశారు. త‌ర్వాత వాస‌న్ అడిగిన‌ప్పుడు త‌న ప‌రిస్థితి ఉన్న‌దున్న‌ట్లు చెప్పారు జాన‌కి. ఆయ‌న ఎంతో సానుభూతి వ్య‌క్తంచేశారు. అంతేకాదు, ఆమెకు ఆ చిత్రం ద్వారా ల‌భించే పారితోషికం అంతా ఒకేసారి ఇవ్వ‌మ‌ని చెప్పారు. ఆమెనొక న‌ర్సింగ్ హోమ్‌లో చేర్పించి, వారం రోజుల‌పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కోలుకున్న త‌ర్వాత షూటింగ్ కొన‌సాగించ‌మ‌న్నారు. ఆ సినిమాలో ఆమె మ‌హాన‌టి క‌న్నాంబ‌కు కోడ‌లుగా న‌టించారు.

హాస్య చిత్రాల్లో నంబ‌ర్ వ‌న్ జంధ్యాల 'అహ నా పెళ్లంట' విశిష్ట‌త‌లు ఇన్నిన్ని కాద‌యా!

  తెలుగులో రూపొందిన హాస్య చిత్రాల్లో జంధ్యాల రూపొందించిన 'అహ నా పెళ్లంట‌'కు సాటిరాగ‌ల మ‌రో హాస్య చిత్రం లేద‌ని నూత‌న ప్ర‌సాద్ చెప్తుండేవారు. ఆ మాట‌లో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. జంధ్యాల డైరెక్ట్ చేసిన 39 సినిమాల్లో టాప్ గ్రాస‌ర్ ఈ సినిమాయే. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత ఆదివిష్ణు రాసిన పాపుల‌ర్ న‌వ‌ల 'స‌త్యంగారి ఇల్లు' న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాక‌పోతే న‌వ‌ల‌లోని పిసినారి స‌త్యం పాత్ర‌ను సినిమాలో ల‌క్ష్మీప‌తిగా మార్చారు. ఆ పాత్ర‌లో కోట శ్రీ‌నివాస‌రావు చెల‌రేగిపోయి న‌టించారు. అంత‌కు రెండేళ్ల క్రిత‌మే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఆయ‌న‌కు ఈ సినిమాతో వెన‌క్కి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. ల‌క్ష్మీప‌తిగా పిసినారిత‌నాన్ని పీక్ స్టేజ్‌లో పోషించారు. ముఖ్యంగా బ‌తికున్న కోడిని ఎదురుగా చూరుకు వేలాడ‌దీసి, దాన్ని చూస్తూ ఒట్టి అన్నం తింటూ చికెన్ తింటున్న‌ట్లు ఆయ‌న ఇచ్చే ప‌ర్ఫార్మెన్స్ అద్భుత‌హ అన్నారు ప్రేక్ష‌కులు. ఆ త‌ర్వాత కాలంలో తెర‌పై ఎన్ని పిసినారి పాత్ర‌లు వ‌చ్చినా అవేవీ ల‌క్ష్మీప‌తి పాత్ర‌ను, కోట శ్రీ‌నివాస‌రావు న‌ట‌న‌ను మ‌రిపించ‌లేక‌పోయాయి. నిజానికి ఆ పాత్ర‌కు మొద‌ట అనుకున్న‌ది రావు గోపాల‌రావును. కానీ లుక్స్ ప‌రంగా, నేటివిటీ ప‌రంగా ఆయ‌న క‌రెక్ట్ కాద‌నుకొని కోట‌ను ఎంచుకున్నారు జంధ్యాల‌.  కోట‌తో పాటు మ‌రో న‌టుడికి కూడా ఈ సినిమా ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును ప్ర‌సాదించింది. ఆ న‌టుడు.. బ్ర‌హ్మానందం. కోట అసిస్టెంట్‌గా బ్ర‌హ్మానందం అద‌ర‌గొట్టేశాడంతే! ఆయ‌న కెరీర్‌కు బ‌ల‌మైన పునాది వేసింది అందులోని 'అర‌గుండు' పాత్రే. చాలా కాలం దాకా ఆయ‌న‌ను జ‌నం 'అర‌గుండు బ్ర‌హ్మానందం'గానే పిలుస్తూ వ‌చ్చారంటే.. ఆ పాత్ర ఎంత‌టి ముద్ర‌ను వారి గుండెల‌పై వేసిందో! ఆ సినిమా త‌ర్వాత ఒక్క‌సారిగా 14 సినిమాల అవ‌కాశాలు ఆయ‌న‌కు వ‌చ్చాయి. ఈ పాత్ర‌కు కూడా ఆయ‌న ఫ‌స్ట్ చాయిస్ కాదు. మొద‌ట సుత్తివేలును ఎంపిక‌చేస్తే, అప్ప‌ట్లో బాగా బిజీగా ఉన్న ఆయ‌న కాల్షీట్లు అడ్జెస్ట్ చేయ‌లేక‌పోయారు. దాంతో ఆ అవ‌కాశం ఓ వ‌రంలా బ్ర‌హ్మానందంకు ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ సుత్తివేలు అఖిల‌భార‌త పిసినారి సంఘం అధ్య‌క్షునిగా గెస్ట్ రోల్‌లో క‌నిపిస్తారు. ఆ సినిమాలో ఎలాగైనా క‌నిపించాల‌ని ఆయ‌న కోరుకోవ‌డం వ‌ల్లే ఆ రోల్ ఇచ్చారు. ఇక హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ కెరీర్‌లో 'అహ నా పెళ్లంట' మ‌ర‌పురాని చిత్రంగా, ఓ ఆణిముత్యంలా నిలిచింది. త‌న న‌ట‌జీవితాన్ని మ‌లుపుతిప్పిన టాప్ టెన్ సినిమాల్లో దీనికి నంబ‌ర్ వ‌న్ ప్లేస్ ఇస్తారాయ‌న‌. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా న‌టించిన తొలి చిత్రం, జంధ్యాల డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావ‌డం ఇంకో విశేషం. రాజేంద్ర‌ప్ర‌సాద్ అదివ‌ర‌కు ఆ బ్యాన‌ర్‌లో 'ముందడుగు' సినిమాలో ఓ కీల‌క పాత్ర చేశారు. అయితే ఆ సినిమా శ‌త‌దినోత్స‌వ షీల్డును ఆయ‌న అందుకోలేక‌పోయారు. అప్ప‌ట్నుంచి సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి ఎలాగైనా శ‌త‌దినోత్స‌వ షీల్డును అందుకోవాల‌ని త‌పిస్తూ వ‌చ్చారు. ఆయ‌న కోరిక‌ను 'అహ నా పెళ్లంట' తీర్చింది. అంతేనా.. ఏకంగా సిల్వ‌ర్ జూబ్లీ షీల్డును కూడా ఆయ‌న అందుకున్నారు. తెలుగు సినిమాల్లో జ‌బ్బుప‌డిన హాస్యానికి జంధ్యాల 'శ్రీ‌వారికి ప్రేమ‌లేఖ‌', 'అహ నా పెళ్లంట' సినిమాల‌తో మందువేసి సంపూర్ణ ఆరోగ్య‌వంతం కావించార‌ని నూత‌న్‌ప్ర‌సాద్ అనేవారు. హీరో తండ్రి పాత్ర‌లో ఆయ‌న జీవించారు. 'బామ్మ‌మాట బంగారుబాట‌' షూటింగ్‌లో యాక్సిడెంట్‌కు గురవ‌డానికి ముందు తాను చేసిన 365 సినిమాల్లో క‌ష్ట‌త‌ర‌మైన పాత్ర‌లు మూడో నాలుగో ఉంటే, వాటిలో ఈ సినిమాలోని పాత్ర ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. త‌న గురించి తెలియ‌ద‌న్న ప్ర‌తివారికీ త‌న ఆటోబయోగ్ర‌ఫీ చెబుతూ, వాళ్ల బుర్ర తినేసే పాత్ర‌ను ఆయ‌న అమోఘంగా పోషించారు. ఈ సినిమా చివ‌ర‌లో శుభం కార్డుకు బ‌దులు 'న‌వ్వండి - న‌వ్వించండి - న‌వ్వు ఆరోగ్య‌క‌రం' అని వేసి, హాస్యర‌సంపై త‌న మ‌క్కువ‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు హాస్య బ్ర‌హ్మ‌. 1987 న‌వంబ‌ర్ 27న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క‌వ‌ర్షం కురిపించి, పెట్టుబ‌డికి అనేక రెట్లు లాభాలు ఆర్జించింది. ద‌ర్శ‌కునిగా ఇది జంధ్యాలకు 23వ చిత్రం. ఈ జూన్ 19 ఆయ‌న 20వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసంతో నివాళుల‌ర్పిస్తున్నాం.

'జ‌గ‌మే తంత్రం' మూవీ రివ్యూ

  సినిమా పేరు: జ‌గ‌మే తంత్రం (ఒరిజిన‌ల్ 'జ‌గ‌మే తందిర‌మ్‌') తారాగ‌ణం: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్‌, కాలైయ‌ర‌స‌న్‌, శ‌ర‌త్ ర‌వి, సౌంద‌ర‌రాజా, దీప‌క్ ప‌ర‌మేశ్‌, వ‌డివుక్క‌ర‌సి, బాబా భాస్క‌ర్‌, మాస్ట‌ర్ అశ్వంత్ అశోక్‌కుమార్‌ మ్యూజిక్‌: సంతోష్ నారాయ‌ణ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: శ్రేయాస్ కృష్ణ‌ ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్ష‌న్‌ నిర్మాత‌లు: ఎస్‌. శ‌శికాంత్‌, చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర‌ ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజ్‌ బ్యాన‌ర్‌: వై నాట్ స్టూడియోస్‌ విడుద‌ల తేదీ: 2021 జూన్ 18 ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్ (ఓటీటీ) ధ‌నుష్ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ‌వుతోందంటే ఆయ‌న అభిమానులు అసంతృప్తికి లోన‌య్యారు. అభిమానులేమిటి, స్వ‌యంగా ఆయ‌నే త‌న అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేశాడు. కానీ థియేట‌ర్ల‌న్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని అయోమ‌య స్థితి కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్లు నిర్మాత‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైనే నేరుగా 'జ‌గ‌మే తందిర‌మ్' (జ‌గ‌మే తంత్రం)ను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఆయ‌న స‌రేన‌న‌క త‌ప్ప‌లేదు. స్వ‌ల్ప‌కాలంలోనే ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే... క‌థ‌ మ‌ధురైలో ఓ గ్యాంగ్‌ను వెంట‌పెట్టుకొని గూండాగా చ‌లామ‌ణీ అయ్యే సురుళి (ధ‌నుష్‌)కి ఓ ప‌రోటా హోట‌ల్ కూడా ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్‌తో గొడ‌వ‌లో హ‌త్య‌లు చేసి, కొన్ని రోజుల పాటు ఎక్క‌డికైనా వెళ్లాల్సిన స్థితిలో లండ‌న్‌లో ఒక గ్యాంగ్‌స్ట‌ర్ త‌ర‌పున కొద్ది రోజులు ప‌నిచేసే చాన్స్ వ‌స్తుంది. బాగా డ‌బ్బులు ముడ‌తాయ‌నే ఆశ‌తో లండ‌న్ వెళ్తాడు సురుళి. అక్క‌డ పీట‌ర్ (జేమ్స్ కాస్మో) అనే ఇంగ్లీష్ గ్యాంగ్‌స్ట‌ర్‌తో చేతులు క‌లిపి, అక్క‌డ శ‌ర‌ణార్థుల పాలిట ఆప‌ద్బాంధ‌వుడిలా ఉండే మ‌రో గ్యాంగ్‌స్ట‌ర్ శివ‌దాస్ (జోజు జార్జ్‌) చావుకు కార‌కుడ‌వుతాడు. అది కూడా శివ‌దాస్ వైపు చేరిన‌ట్లు న‌టించి, శాంతి చ‌ర్చ‌ల‌క‌ని పిలిపించి, పీట‌ర్ చేతిలో చ‌నిపోయేట్లు చేస్తాడు. అదివ‌ర‌కే అక్క‌డ ఓ ఏడేళ్ల పిల్లాడికి త‌ల్లి అయిన‌ అట్టిలా (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) అనే త‌మిళ‌మ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. శివ‌దాస్‌ను ద్రోహంతో చంపించావంటూ, ఇక శ‌ర‌ణార్ధుల‌కు దిక్కెవ‌రంటూ అట్టిలా నిల‌దీయ‌డంతో త‌న త‌ప్పు తెలుసుకుంటాడు సురుళి. త‌ల్లి (వ‌డివుక్క‌ర‌సి) కూడా నీ ద్రోహాన్ని స‌రిచేసుకుని వ‌చ్చిన‌నాడే మ‌ళ్లీ నీ ముఖం చూస్తానంటూ త‌మ ఊరికి వెళ్లిపోతుంది. సురుళి ఎలా పీట‌ర్‌కు బుద్ధి చెప్పి, త‌న త‌ప్పును స‌రిదిద్దుకున్నాడ‌నేది మిగ‌తా క‌థ‌. విశ్లేష‌ణ‌ ఈ క‌థ చ‌దివితేనే ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ఎలాంటి స‌బ్జెక్టును ధ‌నుష్‌తో చేయించాడో అర్థ‌మైపోతుంది. గ్యాంగ్‌స్ట‌ర్ల సినిమాలు మ‌న‌కు కొత్త కాదు. కాక‌పోతే ఈసారి నేప‌థ్యాన్ని లండ‌న్‌కు తీసుకువెళ్లాడు సుబ్బ‌రాజ్‌. దానికో శ‌ర‌ణార్ధి స‌మ‌స్య‌ను జోడించాడు. ఇండియాలో శ్రీ‌లంక శ‌ర‌ణార్ధుల‌ను గుర్తించ‌డం లేద‌ని, బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల‌కు త‌ల‌దాచుకోడానికి వారు వెళ్తాన్నారంటూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఓ స‌మ‌స్య‌ను ఎత్తిచూపాడు. ఆ స‌మ‌స్య మీద సినిమా తీసినా బాగుండేది. దానికి గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యాన్ని జోడించ‌డం, డ‌బ్బు కోసం ఎంత‌టి కిరాత‌కైనా తెగ‌బ‌డే మ‌నిషిగా ధ‌నుష్‌ను చూపించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోలేదు.  అయితే "నేను హీరోను కాను. నాకు విల‌న్‌గా ఉండ‌ట‌మే ఇష్టం" అని ధ‌నుష్ చేత చెప్పించ‌డం ఆ క్యారెక్ట‌ర్ వ్య‌క్తిత్వాన్ని తెలియ‌జేస్తుంది. శివ‌దాస్ ప‌క్క‌న చేరిన‌ట్లు న‌టించి, అత‌డిని ధ‌నుష్ చంపించ‌డం క‌థ ప్ర‌కారం క‌రెక్టే అయినా.. అది చేసింది ధ‌నుష్ కావ‌డంతో ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేని విష‌యం. అభిమానులైతే అస్స‌లు భ‌రించ‌లేరు. సురుళి చేసిన ద్రోహానికి బ‌దులు తీర్చుకోవాల‌ని శివ‌దాస్ మ‌నిషి అయిన‌ అట్టిలా అత‌నికి హాని త‌ల‌పెట్ట‌డం స‌మంజ‌స‌మేన‌నిపిస్తుంది. దీంతో హీరో క్యారెక్ట‌ర్ పాతాళానికి ప‌డిపోయిందన్న మాట‌. సురుళి త‌న త‌ప్పు తెలుసుకున్నా కూడా మ‌నం ఆ క్యారెక్ట‌ర్‌తో స‌హానుభూతి చెంద‌కుండా దానికి దూరంగా జ‌రిగిపోతాం. సినిమాని బాగా దెబ్బ‌తీసిన అంశం ఇదే. స్టోరీ ట్రీట్‌మెంట్‌లో ఈ నెగ‌టివ్ పాయింట్‌ను డైరెక్ట‌ర్ గుర్తించ‌లేక‌పోయాడా? అట్టిలా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను మాత్రం హృద‌యాన్ని పిండేసేలా చిత్రీక‌రించాడు సుబ్బ‌రాజ్‌. మ‌ధ్య మ‌ధ్య‌లో కామెడీ చ‌మ‌క్కులు ఉన్నా అవి పెద్ద‌గా సినిమాకి ప్ర‌యోజ‌నం చేకూర్చే స్థాయిలో లేవు. సంభాష‌ణ‌లు స‌న్నివేశానుసారం న‌డిచాయి. ఎప్ప‌ట్లా సంతోష్ నారాయ‌ణ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్‌లో ఉంది. శ్రేయాస్ కృష్ణన్ సినిమాటోగ్ర‌ఫీ ఎక్స‌లెంట్‌. కొన్ని కెమెరా యాంగిల్స్ సూప‌ర్బ్ అనిపిస్తాయి. సినిమా ఫేట్‌ను డిసైడ్ చేసిన పీట‌ర్‌, శివ‌దాస్ మీటింగ్ సీన్‌లో అయితే కెమెరా మ‌రింత‌గా రాణించింది. కానీ ఏం ప్ర‌యోజ‌నం? ఎడిటింగ్ ఓకే. గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ కాబ‌ట్టి ర‌క్త‌పాతానికీ, గ‌న్ ఫైట్స్‌కూ కొద‌వ‌లేదు. అవి యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రిస్తాయి. న‌టీన‌టుల అభిన‌యం ధ‌నుష్ సినిమాలో అత‌డిని త‌ప్ప మ‌నం ఇంకొక‌రి మీద మ‌న దృష్టి పోదు. అంత‌లా త‌న ఎన‌ర్జీతో, త‌న న‌ట‌నా విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటాడు ధ‌నుష్‌. ఈ సినిమాలోనూ త‌న సూప‌ర్బ్ ఎనర్జీని చూపించాడు. సురుళి క్యారెక్ట‌రైజేష‌న్‌ ప‌డిపోకుండా ఉన్న‌ట్ల‌యితే ధ‌నుష్ ఇంకా ఆక‌ట్టుకొనేవాడు ఇది ధ‌నుష్ చెయ్యాల్సిన పాత్ర కాద‌నిపిస్తుంది. గ్యాంగ్‌స్ట‌ర్ శివ‌దాస్‌గా జోజు జార్జ్ బాగా ఆక‌ట్టుకున్నాడు. ఆయ‌న లుక్స్ కానీ, ప‌ర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేయ‌డ‌మే కాకుండా, ఆ క్యారెక్ట‌ర్‌ను ప్రేమించేట్లు చేస్తాయి.  అట్టిలా పాత్ర‌లో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి సునాయాసంగా ఇమిడిపోయింది. ధ‌నుష్‌కు ధీటైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. విల‌న్ పీట‌ర్ రోల్‌లో హాలీవుడ్ పాపుల‌ర్ యాక్ట‌ర్‌ జేమ్స్ కాస్మో రాణించారు. య‌స్ ఆర్ నో అంటూ ఆయ‌న‌కు పెట్టిన మేన‌రిజం వ‌ర్క‌వుట్ అయ్యింది. శివ‌దాస్ అనుచ‌రులుగా కాలైయ‌ర‌స‌న్‌, దీప‌క్ ప‌ర‌మేశ్‌, సురుళిని లండ‌న్ తీసుకువెళ్లి, అత‌డికి ట్రాన్స్‌లేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే విక్కీగా శ‌ర‌త్ ర‌వి పాత్రోచితంగా న‌టించారు. వ‌డివుక్క‌ర‌సి, బాబా భాస్క‌ర్‌, సౌంద‌ర‌రాజ‌న్‌కు న‌టించేందుకు ఎక్కువ స్కోప్ ల‌భించ‌లేదు. తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌ 'అసుర‌న్‌', 'క‌ర్ణ‌న్' పాత్ర‌ల్లో ధ‌నుష్‌ను చూసిన క‌ళ్లు సురుళి పాత్ర‌లో ధ‌నుష్‌ను చూడ్డానికి ఇబ్బందిప‌డ్డాయి. 'జ‌గ‌మే తంత్రం' ను ర‌క్షించ‌గ‌లిగేది ఒక్క ధ‌నుష్ మాత్ర‌మే. ఓవ‌రాల్‌గా డిజ‌ప్పాయింట్‌మెంట్ క‌లిగించిన సినిమా. రేటింగ్‌: 2.5/5 - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

'దేవ‌దేసు' నిర్మాణం మ‌ధ్య‌లోనే హ‌ఠాన్మ‌ర‌ణం పాలైన సంగీత ద‌ర్శ‌కుడు! కార‌ణం ఇదే..

  తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌నే కాకుండా యావ‌ద్భార‌త చ‌ల‌న‌చిత్ర రంగాన్ని ఒక్క‌సారిగా త‌న‌వైపు తేరిపార చూసేట్టు చేసిన సినిమా వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'దేవ‌దాసు'. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్ర న‌ట జీవితంలోను, ఘంట‌సాల‌, స‌ముద్రాల రాఘ‌వాచార్య గాన‌ సాహిత్య జైత్ర‌యాత్ర‌లోను అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకున్న ఈ చిత్రం 1953లో రిలీజ‌యింది. ఈ చిత్రానికి సంగీతం అందించింది సి.ఆర్‌. సుబ్బ‌రామ‌న్‌. 'దేవ‌దాసు' సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో ఉండ‌గానే కేవ‌లం త‌న 29వ ఏట‌నే సుబ్బ‌రామ‌న్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న మృతిపై అనేక ఊహాగానాలు రేకెత్తాయి. ఎందుకంటే ఆయ‌న 'దేవ‌దాసు' చిత్ర నిర్మాణ సంస్థ‌ వినోదా పిక్చ‌ర్స్‌లో వాటాదారు కూడా. ఈ నిజాన్ని ఆయ‌న ఆక‌స్మిక మృతి ఘ‌ట‌న‌కు జోడించి, వాళ్ల మ‌ధ్య వ్యాపార‌ప‌ర‌మైన విభేదాలు వ‌చ్చాయ‌నీ, కొంద‌రు గిట్ట‌నివాళ్లు చేసిన విష‌ప్ర‌యోగానికి ఆయ‌న బ‌లైపోయార‌నీ చెప్పుకుంటూ ఉంటారు. సుబ్బ‌రామ‌న్‌కు చిన్న‌త‌నం నుంచే ఫిట్స్ వ‌చ్చేవి. ఆ ఫిట్సే ఆయ‌న గుండెమీద ప‌నిచేసి ఆయ‌న క‌న్నుమూసేలా చేశాయి. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సినీన‌టులు, ర‌చ‌యిత‌, నాట‌క‌క‌ర్త అయిన రావి కొండ‌ల‌రావు తెలియ‌జేశారు.  సుబ్బ‌రామ‌న్‌కు అసిస్టెంట్ అయిన ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ గురువు ఒప్పుకున్న సినిమాల‌న్నింటినీ ఎంతో నిజాయితీతో, గురుభ‌క్తితో వ‌యొలినిస్ట్ అయిన టి.కె. రామ్మూర్తి స‌హాయంతో పూర్తిచేశారు. ఆ ఇద్ద‌రూ కొన్నాళ్ల‌పాటు 'విశ్వ‌నాథం-రామ్మూర్తి' పేరుతో జంట‌గా చాలా చిత్రాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు. 'దేవ‌దేసు' విష‌యానికి వ‌స్తే.. ఆ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు, "అందం చూడ‌వ‌యా", "జ‌గ‌మే మాయ" పాట‌ల‌కు విశ్వ‌నాథ‌మే బాణీలు అందించారు.

జ‌మున నాన్న‌గారి చాద‌స్తం.. 'క‌న్యాశుల్కం'లో మిస్స‌యిన బుచ్చ‌మ్మ పాత్ర‌!

  గుర‌జాడ అప్పారావు సుప్ర‌సిద్ధ నాట‌కం 'క‌న్యాశుల్కం' అదే పేరుతో 1955లో సినిమాగా వ‌చ్చింది. నాట‌కానికి భిన్నంగా ఉందంటూ ఫ‌స్ట్ రిలీజ్‌లో ప్రేక్ష‌కులు స‌రిగా ఆద‌రించ‌లేదు. కానీ సెకండ్‌, థ‌ర్డ్ రిలీజ్‌ల‌లో శ‌త‌దినోత్స‌వాలు జ‌రుపుకొని నిర్మాత‌ల‌కు కాసుల పంట కురిపించింది. పి. పుల్ల‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌ధుర‌వాణిగా సావిత్రి, గిరీశంగా ఎన్టీ రామారావు, రామ‌ప్పంతులుగా సీయ‌స్సార్ ఆంజ‌నేయులు, లుబ్దావ‌ధాన్లుగా గోవింద‌రాజుల సుబ్బారావు అద్భుతంగా న‌టించారు. కీల‌కమైన మ‌రో పాత్ర బుచ్చ‌మ్మ‌ను షావుకారు జాన‌కి అనిత‌ర‌సాధ్యంగా పోషించారు. బాల్య వివాహం కార‌ణంగా చిన్న‌తంలోనే భ‌ర్త‌ను కోల్పోయి వితంతువుగా మారినా అమాయ‌క‌త్వం తొణికిస‌లాడే ఆ పాత్ర‌లో జాన‌కి న‌ట‌న ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. నిజానికి బుచ్చ‌మ్మ పాత్ర‌కు ఫ‌స్ట్ చాయిస్ జాన‌కి కాదు, ప్ర‌జాన‌టి జ‌మున‌. అయితే తండ్రి చాద‌స్తం కార‌ణంగా ఆ పాత్ర ఆమెకు మిస్స‌యింది. అప్పుడ‌ప్పుడే జ‌మున ఇండ‌స్ట్రీలో పేరు తెచ్చుకుంటున్నారు. బుచ్చ‌మ్మ పాత్ర‌కు జ‌మున అయితే బాగుంటుంద‌నుకున్న 'క‌న్యాశుల్కం' నిర్మాత డి.ఎల్‌. నారాయ‌ణ, ఆమెను అడ‌గాల‌ని వారి ఇంటికి వ‌స్తున్న‌ట్లు క‌బురు చేశారు. అంత పెద్ద నిర్మాత స్వ‌యంగా మాట్లాడ్డానికి వ‌స్తున్నారంటే.. రావ‌ద్ద‌ని చెప్ప‌డం సంస్కారం కాదు. పైగా అలా అన్నారంటే.. "వ‌చ్చిన వేషాల‌న్నీ వ‌ద్దంటారు.. అస‌లెందుకు వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం." అని ప్ర‌చారాలు చేసి, అస‌లు వేషాలే రాకుండా చేయొచ్చు. ఇలాంటి బాధ‌లుంటాయి కాబ‌ట్టి, జ‌మున నాన్న‌గారు బాగా ఆలోచించి ఓ మంచిరోజు చూసుకొని రావ‌చ్చ‌ని డి.ఎల్‌. నారాయ‌ణ‌కు క‌బురు తెలియ‌జేశారు. డి.ఎల్‌. త‌మ ఇంటికి వ‌చ్చేరోజు జ‌మున నాన్న‌గారు ఆమెకు "అమ్మాయ్‌.. ఆ డి.ఎల్. చాలా డేంజ‌ర‌స్ మ‌నిష‌ట‌. మ‌న‌కు అలాంటి కంపెనీ వ‌ద్దు. నువ్వు మాత్రం ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూర్చొని, ప‌నుంద‌ని లోప‌లికి వెళ్లిపో." అని చెప్పారు. డి.ఎల్‌. వ‌చ్చారు. నాన్న చెప్పిన‌ట్టుగానే జ‌మున ఆయ‌న‌కు న‌మ‌స్కారం పెట్టి, ప‌ని ఉందంటూ లోప‌లికి వెళ్లిపోయారు. డి.ఎల్‌.కు జ‌మున నాన్న‌గారు కాఫీ తెప్పించి ఇచ్చి గౌర‌వంగానే ట్రీట్ చేశారు. కానీ ఆయ‌న వేషం విష‌యం చెప్ప‌గానే, "అమ్మాయి చాలా బిజీగా ఉంది. పైగా వితంతువు వేషం.. సెంటిమెంట‌ల్‌గా ఇష్టం లేదు." అని చెప్పేశారు. అలా బుచ్చ‌మ్మ వేషం జ‌మున‌కు మిస్స‌యింది. ఇదే కాదు, తండ్రి చాద‌స్తం వ‌ల్ల త‌ను ప‌లు వేషాలు కోల్పోయిన‌ట్లు త‌న జీవిత చ‌రిత్ర‌లో జ‌మున వెల్ల‌డించారు.

టాలీవుడ్‌లో ఆశ‌లురేపి అంత‌లోనే ఫేమ్ కోల్పోయిన‌ ప‌దిమంది యాక్ట‌ర్లు!

  తెలుగు చిత్ర‌సీమ‌లో ప‌లువురు న‌టులు.. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. కొంత‌మంది సంచ‌ల‌నాలు సృష్టించి, భ‌విష్య‌త్తుపై ఆశ‌లు రేపారు. ఇంకొంత‌మంది సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా, త‌ర్వాత కొన్ని క్రేజీ సినిమాల‌తో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. వారిలో వార‌సులుగా రంగ‌ప్ర‌వేశం చేసిన వారున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేక‌పోయినా ఎన్నో క‌ల‌ల‌తో న‌టులుగా వెలిగిపోవాల‌ని వ‌చ్చిన వాళ్లున్నారు. కానీ కొంత‌మంది న‌టుల విష‌యంలో ఘ‌న‌మైన వార‌సత్వం కూడా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. క్ర‌మేపీ వారు అవ‌కాశాల‌ను, త‌ద్వారా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌నూ కోల్పోయి తెర‌మ‌రుగైపోయారు. స్వ‌యంకృషితో ఎదుగుదామ‌ని వ‌చ్చిన మ‌రికొంత‌మందికి స‌రైన అవ‌కాశాలు ఇచ్చేవారు లేక కాల‌క్ర‌మంలో కెరీర్‌లో కింద‌కు ప‌డిపోయారు. అలాంటి ఓ ప‌దిమంది న‌టులెవ‌రో ఓ లుక్కేసేద్దాం... ర‌మేశ్‌బాబు సూప‌ర్‌స్టార్ కృష్ణ వార‌సుడిగా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టి 'సామ్రాట్' మూవీతో యాక్ష‌న్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ర‌మేశ్‌బాబు. 'బ‌జార్ రౌడీ', 'క‌లియుగ క‌ర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' లాంటి హిట్ సినిమాల్లో న‌టించిన ఆయ‌న తండ్రితో క‌లిసి న‌టించిన 'ఎన్‌కౌంట‌ర్' (1997) త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. న‌ట‌న మీద ఆస‌క్తి స‌న్న‌గిల్ల‌డం, సోలో హీరోగా క్రేజ్ కోల్పోవ‌డం, స‌రైన ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్య‌క‌పోవ‌డం ఆయ‌న తెర‌మ‌రుగు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు. వ‌డ్డే న‌వీన్‌ 'పెళ్లి' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో హీరోగా న‌టించి ఆక‌ట్టుకున్న స్ఫుర‌ద్రూపి వ‌డ్డే న‌వీన్.. 'ప్రియా ఓ ప్రియా', 'చాలా బాగుంది', 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది', 'నా ఊపిరి' లాంటి చ‌క్క‌ని సినిమాల్లో న‌టించాడు. కానీ త‌ర్వాత కాలంలో క‌రిష్మాను, త‌ద్వారా అవ‌కాశాల‌నూ కోల్పోయాడు. ఆయ‌న తెర‌మీద క‌నిపించి నాలుగేళ్లు పైనే అయ్యింది. జె.డి. చ‌క్ర‌వ‌ర్తి 'శివ' మూవీలో నెగ‌టివ్ రోల్ చేయ‌డం ద్వారా అంద‌రి దృష్టిలో ప‌డిన జె.డి. చ‌క్ర‌వ‌ర్తి, మ‌నీ, గులాబీ, అన‌గ‌న‌గా ఒక‌రోజు, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావుర‌మా లాంటి హిట్ మూవీస్‌లో హీరోగా న‌టించి యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్జీవీ రూపొందించిన 'స‌త్య' సినిమా ఆయ‌న ఇమేజ్‌ను ప‌దిరెట్లు పెంచింది. కానీ త‌ర్వాత కాలంలో ఆ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు స‌బ్జెక్టులు ఎంచుకోక‌పోవ‌డంతో త్వ‌ర‌గానే హీరోగా ఫేడ‌వుట్ అవుతూ వ‌చ్చాడు. చివ‌ర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. జె.డి. ఇప్ప‌టి ప‌రిస్థితి ఆయ‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే అనేది విమ‌ర్శ‌కుల మాట‌. త‌రుణ్‌ చైల్డ్ ఆర్టిస్‌గా న‌టించిన తొలి చిత్రం 'మ‌న‌సు మ‌మత' (1990) తోటే ఉత్త‌మ బాల‌న‌టుడిగా నంది అవార్డు, అదే ఏడాది న‌టించిన మ‌ణిర‌త్నం చిత్రం 'అంజ‌లి'తో ఉత్త‌మ బాల‌న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న ఘ‌న‌మైన చ‌రిత్ర త‌రుణ్‌ది. ఇక 2000 సంవ‌త్స‌రంలో 'నువ్వే కావాలి'తో హీరోగా ప‌రిచ‌య‌మై సంచ‌ల‌నం సృష్టించాడు. 'ప్రియ‌మైన నీకు', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' లాంటి హిట్ సినిమాలు చేశాక ఫ్లాపుల ప‌రంప‌ర కొన‌సాగ‌డంతో లేచిప‌డిన కెర‌టంలా మారాడు. 2003 నుంచి అత‌డు న‌టించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్‌ను గెల‌వ‌లేదంటే స‌బ్జెక్టుల ఎంపిక‌లో అత‌డు చేసిన పొర‌పాట్లేన‌ని చెప్పాలి. దానికి తోడు కాంట్ర‌వ‌ర్సీస్ కూడా అత‌డి కెరీర్‌ను ప్ర‌భావితం చేశాయి. వేణు 'స్వ‌యంవ‌రం' లాంటి హిట్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు వేణు. చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, గోపి గోపిక గోదావ‌రి లాంటి సినిమాల‌తో అల‌రించిన ఆయ‌న ఆ త‌ర్వాత అనూహ్యంగా అటు అవ‌కాశాలు, ఇటు ప్రేక్ష‌కాద‌ర‌ణ కోల్పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. 'ద‌మ్ము' సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ‌గా క‌నిపించాక, 'రామాచారి' (2013) సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మై బిజినెస్ రంగంలో స్థిర‌ప‌డ్డాడు. రాజా శేఖ‌ర్ క‌మ్ముల సినిమా 'ఆనంద్‌'తో వెలుగులోకి వ‌చ్చి ఆక‌ట్టుకున్న రాజా.. క్రేజీ హీరోగా నిల‌దొక్కుకుంటాడ‌ని అంతా ఆశించారు. 'ఆ న‌లుగురు', 'వెన్నెల' లాంటి సినిమాలు చేశాక‌.. హీరోగా అత‌డు ఎంచుకున్న స‌బ్జెక్టులు, చేసిన పాత్ర‌లు అత‌డికి క‌లిసి రాలేదు. క్ర‌మేణా క‌రిష్మా కోల్పోతూ వ‌చ్చిన అత‌ను 2013 త‌ర్వాత మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. రెండు మూడు ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాక ఆగిపోవ‌డంతో సినిమాల‌పై విముఖ‌త ఏర్ప‌డిన రాజా, చివ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే పాస్ట‌ర్‌గా స్థిర‌ప‌డ్డాడు. తార‌క‌ర‌త్న‌ నంద‌మూరి వంశ వార‌సుడిగా 2002లో ఎంట్రీ ఇచ్చి, ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రారంభించి అంద‌రి దృష్టినీ త‌న‌వేపుకు తిప్పుకున్నాడు తార‌క‌ర‌త్న‌. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే సెట్స్ మీద‌కు వెళ్లాయి. ఆ వెళ్లిన‌వి కూడా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఎంత ఆర్భాటంగా ఎంట్రీ జ‌రిగిందో, అంతే అనూహ్యంగా కెరీర్‌లో వెన‌క‌బ‌డి పోయాడు. 20 సినిమాలు చేసినా ఒక్క హిట్టూ ద‌క్క‌ని హీరోగా బ్యాడ్ రికార్డ్ పొందాడు తార‌క‌ర‌త్న‌. నెగ‌టివ్ రోల్ చేసిన 'అమ‌రావ‌తి' మాత్ర‌మే అత‌డికి సంతృప్తినిచ్చింది. నాలుగేళ్లుగా అత‌ను తెర‌పై క‌నిపించ‌లేదు. వ‌రుణ్ సందేశ్‌ డ్రీమ్ స్టార్టింగ్ అంటే వ‌రుణ్ సందేశ్‌దే. తొలి రెండు చిత్రాలు హ్యాపీ డేస్‌, కొత్త బంగారులోకం హిట్ల‌తో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అనిపించుకున్నాడు వ‌రుణ్‌. కానీ ఆ త‌ర్వాత 20 సినిమాలు చేసినా అత‌డికి ద‌క్కింది ఏమైంది ఈవేళ అనే ఒక్క హిట్టే. ఆదిలో వ‌చ్చిన క్రేజ్‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో ఫెయిలై, స‌బ్జెక్టుల ఎంపిక‌లో అత‌ను త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. ఆరంభంలో మెరుపులా మెరిసిన అత‌ను క్ర‌మేపీ, వెలుగును త‌గ్గించుకుంటూ వ‌చ్చాడు. ఇప్పుడ‌త‌నికి క‌నీస మార్కెట్ లేదు. నారా రోహిత్‌ 'బాణం' మూవీతో స‌ర్‌ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకుని, రెండో సినిమా 'సోలో'తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించాడు నారా రోహిత్‌. ఆ త‌ర్వాత కొన్ని ఆస‌క్తిక‌ర సినిమాలు చేసినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌క‌పోవ‌డంతో, క్ర‌మేపీ ప్రేక్ష‌కుల ఆస‌క్తిని కోల్పోయాడు. త‌ర్వాత కాలంలో అత‌డు ఎంచుకున్న స‌బ్జెక్టులు కూడా రోహిత్ కెరీర్‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. నారా వారి ఫ్యామిలీ నుంచి వ‌చ్చి, అద్భుతాలు సృష్టిస్తాడ‌నుకున్న రోహిత్ నిరాశ‌ప‌రిచాడు. త‌నీష్‌ చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల్ని అల‌రించిన త‌నీష్.. 'న‌చ్చావులే' లాంటి హిట్ సినిమాతో హీరోగా మారాడు. 'రైడ్‌', 'మేం వ‌య‌సుకు వ‌చ్చాం' లాంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాల త‌ర్వాత క్ర‌మేపీ కెరీర్‌లో డౌన్‌ఫాల్ అవుతూ వ‌చ్చాడు. 'న‌క్ష‌త్రం' మూవీలో చేసిన నెగ‌టివ్ రోల్ కూడా అత‌డికి ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డి చేతిలో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు.

న‌మ్ముతారా? 150 రూపాయ‌ల‌కే బంగ్లా కొన్న హీరోయిన్‌!

  నిన్న‌టి త‌రంలో బాలీవుడ్‌లోని మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ల‌లో నందా ఒక‌రు. మూడు ద‌శాబ్దాల కెరీర్‌లో చోటీ బ‌హెన్‌, ధూల్ కా ఫూల్‌, భాభీ, కాలా బ‌జార్‌, కానూన్‌, హ‌మ్ దోనో, జ‌బ్ జ‌బ్ ఫూల్ ఖిలే, గుమ్‌నామ్, ఇత్తేఫ‌ఖ్‌, ద ట్రైన్‌, ప‌రిణీత‌, ప్రేమ్ రోగ్ లాంటి సినిమాలు ఆమెను ప్రేక్షకుల ఆరాధ్య తార‌గా మార్చాయి. కేవ‌లం ప‌ద‌కొండ‌వ ఏట 'కుల దైవ‌త్' అనే మ‌రాఠీ చిత్రంలో ముప్పై ఏళ్ల యువ‌తి పాత్ర‌ను పోషించ‌డం ద్వారా ఆమె హీరోయిన్‌గా మారిందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అంతేకాదు, త‌న 14వ ఏట ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ వారి 'భాభీ' మూవీలో బాల‌వితంతువు పాత్ర‌ను పోషించారు నందా. ఆ సినిమా స‌క్సెస్ అవ‌డ‌మూ, ఆ త‌ర్వాత వ‌చ్చిన 'చోటీ బ‌హెన్' స్వ‌ర్ణోత్స‌వం జ‌రుపుకోవ‌డంతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నారు. అప్పుడే ఆమె త‌న మొద‌టి కారు, బంగ‌ళా కొన్నారు. ఇంత‌కీ ఆ బంగ‌ళాను ఆమె ఎంత ధ‌ర‌కు కొనుగోలు చేశారో తెలుసా? అక్ష‌రాలా 150 రూపాయ‌ల‌కు! నమ్మ‌శ‌క్యం కావ‌ట్లేదు క‌దూ!! 1950ల‌లో ఆ ఇల్లు కొన్న‌ప్ప‌టికి అది అత్యంత చ‌వ‌కే.  అంత త‌క్కువ‌కు య‌జ‌మానులు ఎందుకు అమ్మిన‌ట్లు?  ఆ బిల్డింగ్‌కు 'భూత్ బంగ్లా' అనే పేరు ప‌డ‌టంతో ఎవ‌రూ కొన‌డానికి ముందుకు రాలేదు. దాంతో ఎంతో కొంత‌వ‌చ్చినా చాల్ల‌నుకున్నారు దాని య‌జ‌మానులు. 150 రూపాయ‌లే మ‌హాభాగ్య‌మ‌నుకొని అమ్మేశారు. అది భూత్ బంగ్లా అని స‌న్నిహితులు చెప్పినా, ద‌య్యం ఉన్నా లేక‌పోయినా ఆ రేటుకు కొనేద్దాం అని చెప్పి కొనుగోలు చేశారు నందా. అదీ విష‌యం! జీవిత‌మంతా అవివాహిత‌గా ఉండిపోయిన నందా, 75 సంవ‌త్స‌రాల వ‌య‌సులో హార్ట్ ఎటాక్‌తో 2014లో ముంబైలోని త‌న నివాసంలో మృతి చెందారు.

ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ 'బొబ్బిలిపులి' షూటింగ్ ఎలా జ‌రిగిందంటే..

  మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు టైటిల్ పాత్ర‌ధారిగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన 'బొబ్బిలి పులి' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా 70 ప్రింట్ల‌తో 1982 జూలై 9న విడుద‌లైన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ ఎలా జ‌రిగిందో.. మ‌చ్చుకు ఒక సీన్‌... చుట్టూ విశాల‌మైన కాంపౌండ్ వాల్‌. మ‌ధ్య రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో అత్య‌ద్భుతంగా వేసిన 'బొబ్బిలిపులి' స్థావ‌రం సెట్‌. రోడ్డు మీద నుంచి క‌నిపిస్తున్న ఆ సెట్‌ను చూస్తుంటే ఎలాగైనా లోప‌లికి వెళ్లి, అదెలా ఉంటుందో చూడాల‌న్న త‌ప‌న క‌లుగుతుంది చూసేవాళ్ల‌కు. షూటింగ్‌కు ముందు రెండు రోజులు భోరున వ‌ర్షం కుర‌వ‌డంతో, సెట్ లోప‌ల మోకాలి లోతు నీరు నిలిచింది. షూటింగ్ త‌ప్ప‌దు కాబ‌ట్టి, 20 కిలో మీట‌ర్ల దూరం నుంచి వంద లారీల ఇసుక‌ను తెచ్చి, సెట్‌లో నిలిచిన నీటిని మాయం చేసేస‌రికి యూనిట్ వాళ్ల త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. సెట్‌లో క‌ల్కి అవ‌తారం దాల్చిన విష్ణుమూర్తి విగ్ర‌హం ప‌ద‌డుగుల ప‌రిమాణం ఎత్తులో ఉంది. విగ్ర‌హం పాదాల వ‌ద్ద కుంకుమ‌, పువ్వులు చెల్లాచెదురుగా ప‌డివున్నాయి. విగ్ర‌హం ప‌క్క‌నే కుర్చీలో బందిపోటు నాయ‌కుడి వేషంలో ఎన్టీ రామారావు క‌ళ్లు మూసుకొని, గంభీర‌ముద్ర దాల్చి ఉన్నారు. ఆయ‌న గెట‌ప్ సూప‌ర్బ్‌గా ఉంది. బుర‌ద‌గా ఉన్న సెట్‌లో ఒక ప‌క్క‌గా కుర్చీలో కూర్చొని తీయ‌బోయే స‌న్నివేశానికి సంభాష‌ణ‌లు రాస్తున్నారు ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు. రాసిన దాన్ని పైకి చ‌దువుతూ అక్క‌డ‌క్క‌డా మార్పులు, చేర్పులు చేస్తుండ‌గా సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణి వ‌చ్చి షాట్ రెడీ అన్నారు. "వ‌స్తున్నా" అని రాసిన డైలాగ్‌ల‌తో స‌న్నివేశాన్ని వివ‌రించ‌డం కోసం ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు దాస‌రి. ఎప్పుడొచ్చారో, ఏమో.. జ‌గ్గ‌య్య పోలీస్ ఆఫీస‌ర్ వేషంలో ఎన్టీఆర్ ద‌గ్గ‌ర కూర్చొని క‌బుర్లు చెబుతూ ఒక‌వైపు త‌న మేక‌ప్ స‌రిదిద్దుకుంటున్నారు. దాస‌రి షాట్‌ను ఆ ఇద్ద‌రికీ వివ‌రిస్తుండ‌గా, ఆ వైపు ఎవ‌రినీ రానీయ‌కుండా సెక్యూరిటీ గార్డుల్లా నిల్చున్నారు ఆయ‌న అసిస్టెంట్స్‌. విశాల‌మైన ఆ కొండగుహ సెట్లో దాదాపు 20 మంది బందిపోటు దొంగ‌లు ఖాకీ దుస్తుల్లో తుపాకులు ధ‌రించి ఒక్కొక్క‌రూ ఒక్కొక్క మెట్టుద‌గ్గ‌ర చేత‌నైనంత గంభీరంగా నిల్చొని ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఉన్న‌వి నిజానికి క‌ర్ర తుపాకులు. ఇంత‌లో ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య, దాస‌రి ముగ్గురూ కెమెరా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. "సైలెన్స్‌.. సైలెన్స్" అని అరిచారు అసిస్టెంట్స్‌. గుహ‌లో ఒక గోడ‌కు జ‌గ్గ‌య్య‌ను గొలుసుల‌తో బంధించారు. ఎన్టీఆర్ మెట్ల మీదుగా దిగుతూ జ‌గ్గ‌య్య‌ను చూసి, క‌ట్లు విప్ప‌మ‌ని అనుచ‌రుల‌కు పుర‌మాయించి మాట్లాడాలి.. అదీ సీన్‌. "ఆల్ లైట్స్‌".. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణి కేక వేశారు. క్ష‌ణంలో సెట్ లైట్ల‌తో వెలిగిపోయింది. లైట్ల‌తో పాటు పాతిక కాగ‌డాలు వెలిగాయి. "య‌స్‌.. రెడీ" అన్నారు దాస‌రి. ఎన్టీఆర్ మెట్ల‌పైకి వెళ్లి నిల్చున్నారు. అసిస్టెంట్ క్లాప్ కొట్టాడు.  అంతా నిశ్శ‌బ్దం. బ‌రువుగా అడుగులు వేస్తూ, గంభీరంగా మెట్లు దిగుతున్నారు ఎన్టీఆర్‌. అనుచ‌రులంద‌రూ ఆయ‌న‌కేసి ఆత్రుత‌గా చూస్తున్నారు. ఇంకా మూడు మెట్లు ఉన్నాయ‌న‌గా ఆగి, గొలుసుల‌తో బంధించి ఉన్న జ‌గ్గ‌య్య‌ను చూసి, గొలుసుల్ని విప్ప‌మ‌న్న‌ట్లు సైగ చేశారు. అతి క‌ష్టంమీద ఆయ‌న బంధ‌నాల్ని తొల‌గించాడు అనుచ‌రుడు. వెంట‌నే జ‌గ్గ‌య్య ముందుకు ఒక్క దూకు దూకారు.  "బొబ్బిలిపులిని ప‌ట్టుకోడానికి వ‌చ్చిన‌వాడివి క‌ట్టుదిట్టాల‌తో రావాలి కానీ, ఇలా వ‌చ్చి ప‌ట్టుబ‌డిపోయావేంటి గోపీనాథ్." అన్నారు ఎన్టీఆర్ హేళ‌న‌గా. "నువ్వు ప‌ట్టుకుంటావ‌ని నాకు తెలుసు. అందుకే వ‌చ్చాను".. ఏమాత్రం తొణ‌క్కుండా చెప్పారు జ‌గ్గ‌య్య‌. "గుడ్‌.. న‌న్ను ప‌ట్టుకుందామ‌ని నువ్వెందుకు బ‌య‌లుదేరావ్‌?"  చేతులు క‌ట్టుకొని అడిగారు ఎన్టీఆర్‌. "నువ్వు చేస్తున్న‌ది అన్యాయం క‌నుక‌." జ‌గ్గ‌య్య ప్ర‌శాంతంగా చెప్పారు. "నేను చేస్తున్న‌ది అన్యాయం అని ఎలా నిర్ణ‌యించావ్‌?" ఎన్టీఆర్ ప్ర‌శ్న‌. "ఎంద‌రో అమాయ‌కుల్ని చంపావ్ క‌నుక‌." స్థిరంగా చెప్పారు జ‌గ్గ‌య్య‌. దాంతో బొబ్బిలిపులి గ‌ర్జించింది. ఆ గ‌ర్జ‌న‌కు క్ష‌ణ‌కాలం గుహ కంపించింది. "మిస్ట‌ర్ గోపీనాథ్‌.. నీకు తెలిసిన ప‌రిధిలో నేను ఏ ఒక్క‌.. ఒక్క మ‌నిషిని హ‌త్య చేశానో చెప్పు. నీకు ప‌ట్టుబ‌డి, నీ మాట‌ప్ర‌కారం నీ వెంట వ‌స్తాను." అని చెప్పారు ఎన్టీఆర్‌. "క‌ట్" అన్నారు దాస‌రి. ఆ వెంట‌నే "వెరీ గుడ్" అని కూడా అన్నారు. అనుకున్న దానిక‌న్నా ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఆ సీను వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.

చిరంజీవి విష‌యంలో 30 ఏళ్ల‌యినా నెర‌వేర‌ని దాస‌రి కోరిక!

  కార‌ణాలేమైనా మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కాంబినేష‌న్‌లో ఒకే ఒక్క సినిమా వ‌చ్చింది. అది.. 'లంకేశ్వ‌రుడు' (1989). ఆ సినిమా దాస‌రికి వందో సినిమా కావ‌డం ఒక విశేషం. చిరంజీవి అంటే దాస‌రికి ప్ర‌త్యేకాభిమానం. ప‌లు సంద‌ర్భాల్లో ఆ అభిమానాన్ని ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. చిరంజీవిని ఆయ‌న ఏక‌వ‌చ‌నంతోనే సంబోధించేవారు. చిరంజీవి జాతీయ ఉత్త‌మ‌న‌టుడి అవార్డు అందుకుంటే చూడాల‌ని ఆయ‌న కోరుకున్నారు. అవును. 1991లో జ్యోతిచిత్ర సినీ వార‌ప‌త్రిక కోసం చిరంజీవిని దాస‌రి ఇంట‌ర్వ్యూ చేశారు. అంటే దాస‌రి ప్ర‌శ్న‌లు అడుగుతుంటే చిరంజీవి స‌మాధానాలు చెప్పార‌న్న మాట‌. ఆ ఇంట‌ర్వ్యూలో దాస‌రి, "అతి త‌క్కువ కాలంలో తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగంలో ఏ క‌థానాయ‌కుడూ పొంద‌నంత స్టార్‌డ‌మ్ పొందావు. కానీ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఉత్త‌మ‌న‌టునిగా గుర్తింపును పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నావా? నువ్వు జాతీయ న‌టుని అవార్డును తీసుకుంటే చూడాల‌ని ఉంది. నా కోరిక నెర‌వేరుతుందా?" అని అడిగారు. దానికి చిరంజీవి, "మీరు ఏమైనా అనుకోండి. అవార్డులు పొందాలి, అవార్డులు సంపాదించుకోవాలి అనే త‌ప‌న నాలో చాలా త‌క్కువ‌. ఇంకా చెప్పాలంటే ఆ ధ్యాసే నాలో ఉండ‌దు. దానంత‌ట అదిగా అవార్డు వ‌స్తే నిజంగా అది ఆనందంగానూ, గ‌ర్వంగాను ఉంటుంద‌న్న‌మాట వాస్త‌వం. అయితే అవార్డుల‌కంటూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలి, ప్ర‌త్యేక‌మైన సినిమాల్లో న‌టించాల‌నే ఆలోచ‌న నాకు లేదు. కార‌ణం, అవార్డు కంటే ఎంతో విలువైన ప్ర‌జాభిమానాన్ని ఇంత‌కు అంత సంపాదించాల‌ని, దానిని ఎలా నిల‌బెట్టుకోవాలి.. అని మాత్రం ఎల్ల‌వేళ‌లా ఆలోచిస్తూ, దానికి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను. నేను జాతీయ అవార్డు తీసుకోవాల‌ని మీలాంటి పెద్ద‌లు అంత బ‌ల‌మైన కోరిక‌తో ఉన్నందుకు ఏదో ఒక‌నాటికి, అది ఆశీస్సులై నెర‌వేరుతుందేమో." అని స‌మాధాన‌మిచ్చారు. ఇది జ‌రిగి 30 ఏళ్ల‌వుతోంది. కానీ ఇంత‌దాకా దాస‌రి కోరిక నెర‌వేర‌లేదు. ఆ ఇంట‌ర్వ్యూ చేసే నాటికే 'ఆరాధ‌న‌', 'స్వ‌యంకృషి', 'రుద్ర‌వీణ' లాంటి అభిన‌యానికి మంచి స్కోప్ ఉన్న సినిమాలు చేసి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు చిరంజీవి. ఆ త‌ర్వాత ఆయ‌న ఆ త‌ర‌హా పాత్ర చేసింది 'ఆప‌ద్బాంధ‌వుడు' (1992) చిత్రంలోనే. అయినా ఆయ‌న‌కు జాతీయ అవార్డు ద‌క్క‌లేదు. 2019లో తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల్లో ఒక‌రిగా పరిగ‌ణ‌న పొందిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌ను ఉన్న‌త స్థాయిలో పోషించినా జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఆయ‌న‌ను గుర్తించ‌లేదు.  నిజానికి 1967 నుంచి ఉత్త‌మ న‌టుడి అవార్డులు ఇస్తుండ‌గా, ఇంత‌దాకా ఏ ఒక్క తెలుగు సినిమాకూ ఆ అవార్డు రాక‌పోవ‌డం శోచ‌నీయం. ద‌క్షిణాది మిగ‌తా మూడు ప్ర‌ధాన భాషా చిత్ర న‌టులూ ఆ అవార్డును స‌గ‌ర్వంగా త‌మ రాష్ట్రాల‌కు అందించ‌గా, తెలుగు న‌టులు ఇప్ప‌టికీ వాటికి నోచుకోలేదు. అంటే, జాతీయ అవార్డును అందుకొనే స్థాయిలో మ‌న ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు క‌థానాయ‌కుల పాత్ర‌ల‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. లేదూ.. ఆ స్థాయిలో మ‌న‌న‌టులు అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. ధ‌నుష్ లాంటి యంగ్ యాక్ట‌ర్ సైతం త‌మిళ‌నాడుకు రెండు జాతీయ ఉత్త‌మ‌న‌టుడి అవార్డులు అందించ‌గ‌లిగాడు. త‌న కెరీర్‌లో చిరంజీవి ఆ అవార్డును సాధించ‌గ‌ల‌రా?  దాస‌రి కోరిక‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌ర‌మైనా నెర‌వేర్చ‌గ‌ల‌రా? 

హిందీ సినీ సీమ‌ను ఏలిన ఈ తెలుగ‌మ్మాయిని గుర్తుప‌ట్టారా?

  ఏడో ద‌శ‌కం మొద‌ట్లో సీనియ‌ర్ న‌టి పుష్ప‌వ‌ల్లి (జెమినీ గ‌ణేశ‌న్ భార్య‌) భానురేఖ అనే త‌న కూతుర్ని స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ ఆర్‌.ఎన్‌. నాగ‌రాజారావు ఇంటికి తీసుకెళ్లారు ఫొటోలు తియ్య‌మ‌ని. అప్ప‌ట్లో భానురేఖ చాలా చిలిపిగా, పెంకిగా ఉండేది. అందుచేత‌నే పుష్ప‌వ‌ల్లి ఆమెను నేరుగా నాగ‌రాజారావు ద‌గ్గ‌ర‌కు తీసుకురాకుండా, ఆటోలోనే కూర్చోబెట్టి, ముందుగా త‌ను వెళ్లారు. "మా అమ్మాయి భానురేఖ‌ను సినిమాల్లో చేర్పించాల‌నుకుంటున్నాను. మీతోటే స్టిల్స్ తీయించాల‌ని వ‌చ్చాను" అన్నారు. ఆయ‌న స‌రే అన్నారు. ఆ త‌ర్వాత ఆ అమ్మాయిని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చారు పుష్ప‌వ‌ల్లి. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో క‌ల‌ర్‌లోనూ, బ్లాక్ అండ్ వైట్‌లోనూ ఫొటోలు తీశారు నాగ‌రాజారావు. క‌ల‌ర్‌లో తీసిన ఫొటోలు ఫేడ్ అయిపోవ‌డంతో, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్ర‌మే పుష్ప‌వ‌ల్లి చేతికిచ్చారు. ఇది జ‌రిగిన ఆరు నెల‌ల త‌ర్వాత ఓరోజు పుష్ప‌వ‌ల్లి మ‌ద్రాస్ మౌంట్ రోడ్‌లోని 'స్పెన్స‌ర్స్‌'లో నాగ‌రాజారావుకు క‌నిపించారు. ఆమె ఆయ‌న‌ను ప‌ల‌కరించి, "మీరు తీసిన ఫొటోల‌ను తీసుకొని మేం బొంబాయి వెళ్లి అక్క‌డ నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు చూపించాం. అమ్మాయి ప‌ది హిందీ చిత్రాల‌లో బుక్ అయ్యింది." అని చెప్పారు. అలాంటి ఆ భానురేఖ హిందీ చిత్ర‌సీమ‌లో 'రేఖ‌'గా మారి ఎన్నో చిత్రాల్లో ఇటు గ్లామ‌ర‌స్‌, అటు ప‌ర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ పోషించి, టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. మొద‌ట ఆమె స్టిల్స్ తీసి, పుష్ప‌వ‌ల్లి చేతికి ఇచ్చిన నాగ‌రాజారావు త‌ర్వాత రేఖ హీరోయిన్‌గా న‌టించిన 'జుదాయి' మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. అప్పుడు ఫొటోలు తీశాక రేఖ‌ను ఆయ‌న క‌లుసుకుంది ఆ సినిమా షూటింగ్‌లోనే. నిజానికి హిందీ చిత్ర‌సీమ‌ను ఏల‌క ముందు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా 'ఇంటిగుట్టు', 'రంగుల రాట్నం' చిత్రాల్లో న‌టించిన రేఖ‌, 'అమ్మ కోసం' (1970) చిత్రంలో ఓ నాయిక‌గా న‌టించారు. రేఖ త‌ల్లి పుష్ప‌వ‌ల్లిది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పెంట‌పాడు గ్రామం. అంటే రేఖ మ‌న తెలుగ‌మ్మాయే. మ‌ద్రాసులో పుట్టి పెరిగినా, బొంబాయి వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డిపోయినా, తెలుగు చాలా చ‌క్క‌గా మాట్లాడతారు. 66 ఏళ్ల వ‌య‌సులోనూ ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీగా మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు.

జంధ్యాల 'నాలుగు స్తంభాలాట' పాట‌ల రికార్డింగ్ ఎలా జ‌రిగిందంటే...

  స‌మ‌యం ఉద‌యం తొమ్మిది గంట‌లు కావ‌స్తోంది. మ‌ద్రాస్ జెమినీ స్టూడియోలో పూజ‌కు త‌గిన ఏర్పాట్లు క‌నిపిస్తున్నాయి. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ బ‌ట్ట‌ల్లో మెరిసిపోతుండే నిర్మాత న‌వ‌తా కృష్ణంరాజు ఆహ్వానితులంద‌ర్నీ సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. ఇద్ద‌రు పురోహితులు పాతిక కొబ్బ‌రికాయ‌ల్ని కొట్టి, మంత్ర పారాయ‌ణం మొద‌లెట్టారు. అయ‌ప్ప‌మాల ధ‌రించిన ద‌ర్శ‌కుడు జంధ్యాల చేతులు జోడించి పూజ ద‌గ్గ‌ర నిల్చొని ఉన్నారు. అప్ప‌టికే 'ముద్ద మందారం' చిత్రంతో అంద‌ర్నీ మంత్ర‌ముగ్ధుల్ని చేసినందుకు కాబోలు ఆయ‌న ముఖం క‌ళ‌క‌ళ‌లాడుతోంది. హార్మొనీ పెట్టె ముందేసుకొని సంగీత ద‌ర్శ‌కుడు రాజ‌న్ (రాజ‌న్‌-నాగేంద్ర‌) "సా.. పా.. సా.." అంటూ ట్యూన్ క‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. "త్యాగ‌రాజ పూజ్యాం క‌రిష్యే" అంటూ క‌ర్పూరాన్ని వెలిగించి, గంట గ‌ణ‌గ‌ణ‌లాడించాడు పూజారి. రికార్డింగ్ పూజ ముగిసేలోగా గాయ‌ని సుశీల కూడా వ‌చ్చారు. మ‌ల్లెమాల సుంద‌ర‌రామిరెడ్డి పూజ‌కు వ‌చ్చి, అది పూర్తికాగానే నిర్మాత‌కు బెస్ట్ విషెస్ చెప్పి, అర్జంటు ప‌నులున్నాయంటూ హ‌డావిడిగా వెళ్లిపోయారు. రాజ‌న్‌-నాగేంద్ర ప‌దిహేనుమంది మ్యుజీషియ‌న్స్‌తో స్వ‌ర‌ర‌చ‌న‌కు పూనుకున్నారు. స‌మ‌యం గ‌డిచింది. చ‌క్క‌టి రాగం ఉద‌యించింది. వేటూరి అమృత లేఖిని నుంచి అమృతం వొలికింది. రిహార్స‌ల్ పూర్త‌యింది. రికార్డింగ్‌కు అంద‌రూ సిద్ధ‌మ‌య్యారు. పి. సుశీల త‌న క‌మ్మ‌టి కంఠాన్ని విప్పారు.  "దొర‌లనీకు క‌నుల నీరు.. దొర‌ల‌దీ లోకం మ‌గదొర‌ల‌దీ లోకం.. క‌నుల‌లోనే దాచుకోవే క‌డ‌లిలా శోకం క‌న్నెప‌డుచులా శోకం.." అంటూ సుశీల పాడుతుంటే.. ఆ జోల‌పాట‌కు మ‌గ‌త‌గా క‌ళ్లుమూత‌లు ప‌డుతున్న‌ట్లే అనిపించింది అక్క‌డివాళ్ల‌కు. (త‌ర్వాత ఈ పాట‌ను హీరోలు న‌రేశ్‌, ప్ర‌దీప్‌, హీరోయిన్లు పూర్ణిమ‌, తుల‌సి త‌దిత‌రుల‌పై చిత్రీక‌రించారు.) మూడు రోజుల్లో (1981 డిసెంబ‌ర్ 7, 8, 9 తేదీల్లో) 'నాలుగు స్తంభాలాట' చిత్రంలోని పాట‌ల‌న్నింటినీ రికార్డు చేశారు.  మొద‌ట హీరోలుగా ప్ర‌దీప్‌, సురేశ్‌ల‌ను అనుకున్నారు. త‌ర్వాత సురేశ్ ప్లేస్‌లో విజ‌య‌నిర్మ‌ల కుమారుడు న‌రేశ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశారు. 1982 మే 15న విడుద‌లైన 'నాలుగు స్తంభాలాట' చిత్రం అటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌నూ, ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నూ పొందింది. తొలి చిత్రంతోటే న‌రేశ్ ఆక‌ట్టుకున్నాడు. 

'దాన‌వీర‌శూర క‌ర్ణ‌'లో న‌టించేవాళ్లు 'కురుక్షేత్రం'లో చేయ‌కూడ‌ద‌ని ఆంక్ష పెట్టిన ఎన్టీఆర్‌!

  కృష్ణ 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమా చేయ‌డంతో, ఆ సినిమా చేయాల‌నే సంకల్పంతో ఉన్న న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు ఆగ్ర‌హించారు. కృష్ణ త‌న అభిమాని అయినా, ఆయ‌న‌తో దాదాపు ప‌దేళ్ల‌పాటు మాట్లాడ‌కుండా ఉండిపోయారంటే ఎన్టీఆర్ ఎంత‌టి అభిమాన‌వంతులో ఊహించుకోవ‌చ్చు. ఆ కాలంలోనే ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంతో త్రిపాత్ర‌లు పోషిస్తూ 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రాన్ని త‌ల‌పెట్టారు. సాహ‌స‌వంతునిగా పేరుపొందిన కృష్ణ త‌గ్గేదేలే అన్న‌ట్లు దాదాపు అదే క‌థాంశంతో 'కురుక్షేత్రం' ప్రారంభించారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లయింది. కృష్ణ‌పై ఎన్టీఆర్ మ‌రింత కినుక వ‌హించారు. అప్పుడే ఆయ‌న త‌న 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో న‌టించేవాళ్లెవ‌రూ 'కురుక్షేత్రం'లో న‌టించ‌రాద‌ని ఆంక్ష పెట్టారు. దీంతో యాక్ట‌ర్లు కూడా రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు కృష్ణ‌తో చేరిపోయారు. అయితే ఎన్టీఆర్ పెట్టిన ఆంక్ష‌కు భిన్నంగా ఒక న‌టుడు రెండు సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆయ‌న.. న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ కైకాల స‌త్యనారాయ‌ణ‌. 'దాన‌వీర‌శూర క‌ర్ణ‌'లో భీమునిగా, 'కురుక్షేత్రం'లో దుర్యోధ‌నునిగా ఆయ‌న న‌టించారు. అదెలా సాధ్య‌మైంది? ఎన్టీఆర్ ఎలా ఆయ‌న‌ను ఉపేక్షించార‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ముందుగా స‌త్య‌నారాయ‌ణ‌ను 'కురుక్షేత్రం' నిర్మాత‌లు బుక్ చేశారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో న‌టించాల‌నే కోరిక ఆయ‌న‌కు ఉంటుంది క‌దా.. అందుకే ఒప్పుకున్నారు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు ఎన్టీఆర్ ఆయ‌న‌ను పిలిచి, "మ‌న సినిమాలో నువ్వు భీముడు వేషం వెయ్యాలి బ్ర‌ద‌ర్‌. అయితే ఒక కండిష‌న్‌. ఆ సినిమాలో నువ్వు న‌టించ‌కూడ‌దు. అందులో న‌టించేవాళ్లు ఇందులో ఉండ‌కూడ‌ద‌ని నా నియ‌మం. ఎవ‌రూ వెయ్య‌డం లేదు. నువ్వు కూడా వెయ్య‌డానికి వీల్లేదు." అని చెప్పారు. "అదికాదు అన్న‌గారూ.. వాళ్లు న‌న్ను మొద‌ట బుక్ చేశారు. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు చేయ‌న‌ని అన‌డం బాగుండ‌దు క‌దా. అందుకే మీరు అనుమ‌తిస్తే రెండు సినిమాల్లో న‌టిస్తాను." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. "లేదు లేదు.. అలా చేయ‌డానికి వీల్లేదు." అన్నారు రామారావు. "అయితే ఒక‌ప‌ని చేయండ‌న్న‌గారూ.. దుర్యోధ‌నుడి వేషం నాకు ఇవ్వండి. ఆ వేషం వ‌దిలేస్తా." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆ మాట ఆయ‌న ఎందుక‌న్నారంటే "త‌ను వెయ్యాల‌నుకుంటున్న దుర్యోధ‌నుడి వేషాన్ని రామారావుగారు త్యాగంచేసి నాకు ఇచ్చార‌య్యా. అందుకే మీ సినిమా చేయ‌డం లేదు." అని కృష్ణ‌కు చెప్పుకొనే అవ‌కాశం త‌న‌కు ఉంటుందని. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. "దుర్యోధ‌నుడి పాత్ర‌కు నేనిచ్చే ట్రీట్‌మెంట్ వేరేగా ఉంటుంది. ఒక డ్యూయెట్ కూడా పెట్టాం. నేనే ఆ పాత్ర చెయ్యాలి." అన్నారాయాన‌. "మ‌రి న‌న్నేం చేయ‌మంటారు అన్న‌గారూ.. దుర్యోధ‌నుడి పాత్ర పోషించాల‌నే కోరిక నాకు కూడా ఉంటుంది క‌దా. ఆ సినిమాలో అంద‌రికంటే మొద‌ట న‌న్నే బుక్ చేశారు. ఇప్పుడు నేను చేయ‌నంటే బ్యాడ్ అవుతాను క‌దా." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. ఎన్టీఆర్ ఓ నిమిషం ఆలోచించి, "స‌రే పో.. రెండు సినిమాలు చేసుకో." అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అట్లా ఒక్క స‌త్య‌నారాయ‌ణకు మాత్ర‌మే ఆ రెండు సినిమాల్లోనూ న‌టించే చాన్స్ ద‌క్కింది. ఈ విష‌యాల‌ను స‌త్య‌నారాయ‌ణ స్వ‌యంగా వెల్ల‌డించారు.