అనారోగ్యంతోటే 'ఆహుతి'లో అశోక్‌గా న‌టించి, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మారిన రాజ‌శేఖ‌ర్‌!

  'ప్ర‌తిఘ‌ట‌న‌', 'తలంబ్రాలు' సినిమాల త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు మంచి పేరు తెచ్చిన‌, ఆయ‌న‌ను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మార్చిన మూవీ 'ఆహుతి' (1987). 'తలంబ్రాలు' మూవీని నిర్మించిన ఎం. శ్యామ్‌ప్ర‌సాద్‌ రెడ్డి 'ఆహుతి'ని నిర్మించ‌డం, ఆ సినిమా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఈ సినిమానీ డైరెక్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 'ఆహుతి' క‌థ విన్న‌ప్పుడే మంచి చిత్రం అవుతుంద‌నీ, త‌ప్ప‌కుండా హిట్ట‌వుతుంద‌నీ అనుకున్నారు రాజ‌శేఖ‌ర్‌. కానీ అది అంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. ఊహించిన దానికి మించి ఆహుతికి ల‌భించిన ఆద‌ర‌ణ‌, ఆయ‌న పోషించిన అశోక్ పాత్ర‌కు ల‌భించిన ప్ర‌శంస‌లూ ఆయ‌న‌ను ఆనంద‌ప‌ర‌వ‌శుడ్ని చేశాయి. "ఈ సినిమా షూటింగ్‌కు ముందు కోడి రామ‌కృష్ణ రూపొందించిన అశోక్ పాత్ర‌ను పూర్తిగా అవ‌గాహ‌న చేసుకున్న త‌ర్వాత ఇంత మంచి పాత్ర‌కు ఏ విధంగా న్యాయం చేకూర్చ‌గ‌ల‌నా? అని నాలో నేనే ప్ర‌శ్నించుకొని ఎలా చేస్తే బావుంటుందో మ‌న‌సులోనే ఊహించుకున్నాను." అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌. ఆ మూవీలో అశోక్ పాత్ర‌కు గెట‌ప్ ఎలా ఉండాలో, బిహేవియ‌ర్ ఎలా ఉండాలో వివ‌రించి చెప్పారు కోడి రామ‌కృష్ణ‌. ఆద్యంతం ఆ పాత్ర చిత్రీక‌ర‌ణ‌పై ఎంతో శ్ర‌ద్ధ వ‌హించి, త‌ను ఏ విధంగా ఆ పాత్ర‌ను ఊహించుకున్నారో ఆ విధంగా రాజ‌శేఖ‌ర్ నుంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకొని సినిమా విజ‌యానికి ప్ర‌ధాన కార‌కుడ‌య్యారు. "న‌డ‌క‌లో, న‌డ‌వ‌డిక‌లో, మీస‌క‌ట్టులో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే నా మొహంలో ఒక విల‌క్ష‌ణ‌మైన మార్పు క‌లిగి నాలో రాజశేఖ‌ర్‌ను కాకుండా అశోక్‌నే ఆడియెన్స్ చూశారు. కాబ‌ట్టే నా క్యారెక్ట‌ర్ అంత‌గా అంద‌రి మ‌న్న‌న‌లూ పొందింద‌ని నా అభిప్రాయం." అంటారు రాజ‌శేఖ‌ర్‌. ఈ సినిమా షూటింగ్ జ‌రిగే రోజుల్లో ఆయ‌న ఆరోగ్యం అంత బాగోలేదు. దానికి తోడు అంత మంచి పాత్ర ల‌భించి కూడా తాను స‌రిగా ప‌నిచెయ్య‌డానికి లేకుండా ఈ అనారోగ్యం ఏమిటి? ఈ పాత్ర‌ను స‌రిగా పోషించ‌క‌పోతే పాత్ర దెబ్బ తింటుంది. దాంతో త‌న‌కు చెడ్డ పేరొస్తుంది అని త‌న‌లో తాను మ‌న‌సులో మ‌ధ‌న‌ప‌డుతూ ఉండేవారు. "ఆ సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్నాళ్లూ రాత్రిళ్లు నాకు నిద్ర‌ప‌ట్టేది కాదు. ఎప్పుడూ ఆ పాత్ర గురించే ఎక్కువ‌గా ఆలోచించేవాడ్ని. అయితే నాకు తెలీకుండానే ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించాను." అని ఆయ‌న వెల్ల‌డించారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో, కొన్ని కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కోడి రామ‌కృష్ణ ఓ డైరెక్ట‌ర్‌గా కాకుండా, ఒక స్నేహితుడిగా ఎప్ప‌టిక‌ప్పుడు, "రాజ‌శేఖ‌ర్‌.. నువ్వు రాజ‌శేఖ‌ర్‌వి కాదు, అశోక్‌వి." అని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తూ వ‌చ్చారు. "నిజం చెప్పాలంటే 'ఆహుతి' చిత్రం విజ‌యం సాధించ‌డానికి, నేను ధ‌రించిన అశోక్ పాత్ర‌కు అంత పేరు రావ‌డానికి కార‌ణం ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు నిర్మాత శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి, రెండ‌వ‌వారు డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌. ఆ త‌ర్వాత స‌హ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులూ." అని త‌న కృత‌జ్ఞ‌త వ్య‌క్తం చేశారు రాజ‌శేఖ‌ర్‌. ఈ మూవీలో ఫైట్స్ కానీ, ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీద‌కు దూకే స‌న్నివేశాల్లో కానీ ప్ర‌తి షాట్‌లోనూ ఆయ‌న డూప్ లేకుండా న‌టించారు. "సినిమా పూర్త‌య్యాక నా పాత్ర చూసుకుంటే ఎందుకో నాకు అంత సంతృప్తిక‌రంగా అనిపించ‌లేదు. ఇంత మంచి పాత్ర‌ను ఏమిటిలా చేశాను? ఇంకా బాగా చేసుండాల్సింది అనుకున్నాను. కానీ చూసిన‌వాళ్లంతా నేను బాగా న‌టించాన‌ని మెచ్చుకున్నారు. దాంతో నాలో కొంతవ‌ర‌కూ సంతృప్తి క‌లిగింది. అయినా ఇంకా బాగా చేసుండాల్సింది అనే ఫీలింగ్ మాత్రం ఇప్ప‌టికీ నాకు అనిపిస్తూ ఉంటుంది." అన్నారు రాజ‌శేఖ‌ర్‌. 1987 డిసెంబ‌ర్ 3న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఘ‌న విజ‌యం సాధించిన 'ఆహుతి' మూవీలో రాజ‌శేఖ‌ర్ జోడీగా జీవిత న‌టించ‌గా, ఇదే సినిమాతో విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన ప్ర‌సాద్‌, ఆ త‌ర్వాత నుంచీ 'ఆహుతి' ప్ర‌సాద్‌గా పాపుల‌ర్ అయ్యారు. గ‌ణేశ్ పాత్రో సంభాష‌ణ‌లు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అయ్యాయి.

తెలుగు పాట‌కు తొలి జాతీయ అవార్డు అందించిన శ్రీ‌శ్రీ‌.. ఆ పాట‌లో వ్యాక‌ర‌ణ దోషం!!

  1968లో జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డులు ప్రారంభ‌మైతే ఈ 53 సంవ‌త్స‌రాల్లో మూడండే మూడు సార్లు తెలుగు పాట‌కు సాహిత్య‌ప‌రంగా అవార్డులు ద‌క్కాయంటే ఒకింత బాధ క‌లిగించే విష‌య‌మే. అవార్డులు ప్రారంభ‌మైన ఏడ‌వ ఏట‌, అంటే 1974లో గేయ‌ర‌చ‌యిత‌గా మ‌హాక‌వి శ్రీ‌శ్రీ తొలి జాతీయ అవార్డును తెలుగు పాట‌కు అందించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంలో శ్రీ‌శ్రీ రాసిన "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.." పాట జాతీయ అవార్డును సాధించింది. ఆ త‌ర్వాత 1993లో 'మాతృదేవోభ‌వ' చిత్రానికి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి రాసిన గీతం "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.." రెండో జాతీయ అవార్డును, తిరిగి 2003లో సుద్దాల‌ అశోక్‌తేజ 'ఠాగూర్' సినిమా కోసం రాసిన "నేను సైతం ప్ర‌పంచాగ్నికి.." పాట మూడో అవార్డును సాధించిపెట్టింది.  'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంలో మ‌న్యం ప్ర‌జ‌ల‌ను తిరుగుబాట‌కు ప్రేరేపిస్తూ రామ‌రాజు పాడే మార్చింగ్ సాంగ్‌ను రాయాల్సిందిగా శ్రీ‌శ్రీ‌ని కోరారు కృష్ణ‌. ఉద్విగ్న‌భ‌రిత‌మైన ఆ స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లు అంతే ఉద్వేగ‌భ‌రితంగా "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.. దేశ‌మాత స్వేచ్ఛ‌కోరి తిరుగుబాటు చేయ‌రా.." అంటూ శ్రీ‌శ్రీ రాయ‌డంతో కృష్ణ‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు ఆదినారాయ‌ణ‌రావు కూడా సంబ‌ర‌ప‌డిపోయారు. ఆ పాట‌కు న్యాయం చేయ‌గ‌లిగేది ఘంట‌సాల గాత్ర‌మేన‌ని కృష్ణ త‌ల‌చారు. అయితే అప్పుడు ఘంట‌సాల చాలా అనారోగ్యంతో ఉన్నారు. పాడ‌టం కూడా బాగా త‌గ్గించేశారు. కృష్ణ ఆయ‌న ఇంటికి వెళ్లి మరీ ఈ పాట‌ను పాడాల్సిందిగా కోరారు. ఘంట‌సాల త‌న ప‌రిస్థితి చెప్ప‌గానే, "మీకోసం ఎన్ని నెల‌లైనా ఆగుతాను" అన్నారు కృష్ణ‌. దాంతో ఘంట‌సాల ఆయ‌న మాట‌ను మ‌న్నించి, కాస్త ఆరోగ్యం కుదుట‌ప‌డ‌గానే విజ‌యా గార్డెన్స్‌కు వ‌చ్చి ఆ పాట‌ను పాడారు.  'అల్లూరి సీతారామ‌రాజు' సినిమా విడుద‌ల‌య్యాక "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.." అంటూ తెలుగువాళ్లంతా ఊగిపోయారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆ పాట‌కు జాతీయ అవార్డు ద‌క్కింది. అప్ప‌టి రాష్ట్రప‌తి జాకిర్ హుస్సేన్ చేతుల‌మీదుగా ఆ అవార్డును అందుకున్నారు శ్రీ‌శ్రీ‌. అయితే ఈ పాట‌లో వ్యాక‌ర‌ణ‌ప‌రంగా ఓ దోషం చోటు చేసుకుంది. పాట బ‌య‌ట‌కు వ‌చ్చేదాకా దాన్ని శ్రీ‌శ్రీ‌తో పాటు చిత్ర బృందం కూడా ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. అదేమంటే.. చర‌ణంలో "ప్ర‌తి మ‌నిషి తొడ‌లుగొట్టి.." అంటూ "సింహాలై గ‌ర్జించాలి" అని రాశారు శ్రీ‌శ్రీ‌. ప్ర‌తి మ‌నిషి అనేది ఏక‌వ‌చ‌నం. సింహాలై అనేది బ‌హువ‌చ‌నం. నిజానికి అక్క‌డ ఉండాల్సింది.. "సింహంలా గ‌ర్జించాలి" అని. ఏదేమైనా తెలుగుపాట‌కు తొలిసారిగా జాతీయ అవార్డును సాధించిపెట్టిన క‌విగా శ్రీ‌శ్రీ చ‌రిత్ర‌లో నిలిచిపోయారు.

ఎన్టీఆర్ "ఈ రాళ్ల‌ల్లో ఏం క‌డ‌తావ్‌?" అన్న చోటే స్టూడియో క‌ట్టి చూపించిన రామానాయుడు!

  మ‌ద్రాసు నుంచి ఎలాగైనా సొంత రాష్ట్రానికి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న రోజుల‌వి. అంత‌దాకా మ‌ద్రాసులోనే ఉంటూ వ‌చ్చిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌టి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌ల‌గం వెంగ‌ళ‌రావు బంజారా హిల్స్‌లో స్థ‌లం కేటాయించారు. అప్పుడే సురేశ్ మూవీస్‌ అధినేత డి. రామానాయుడును కూడా ఆయ‌న "స్థ‌లం కావాలా?" అని అడిగారు. ఆయ‌న "వ‌ద్దు" అని చెప్పారు. ఎందుకంటే.. అప్ప‌ట్లో రామానాయుడుకు హైద‌రాబాద్ వ‌చ్చే ఆలోచ‌న లేదు. విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతల్లో ఒక‌రైన నాగిరెడ్డి గారి పిల్ల‌ల‌తో క‌లిసి ఉండ‌టం వ‌ల్ల వాహినీ స్టూడియోనే త‌న స్టూడియో అనుకొని ఆయ‌న సినిమాలు తీస్తూ వ‌చ్చారు.  అయితే అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం రామానాయుడు నిర్మించిన 'సెక్ర‌ట‌రీ' (1976). అప్పుడు అన్న‌పూర్ణ‌లో మ‌ద్రాస్ వాహినీ నుంచి కార్పెంట‌ర్ల‌ను, ఆర్ట్ డైరెక్ట‌ర్‌ను తెచ్చి సెట్ వేయించారు. ఆ సినిమా ప్రారంభానికి వ‌చ్చిన నాగిరెడ్డి, "ఈ కొండ‌ల్లో స్టూడియో క‌డితే బాగుంటుంది" అన్నారు రామానాయుడుతో. అప్పుడు ఆయ‌న‌లో స్టూడియో ఆలోచ‌న మెదిలింది. భ‌వ‌నం వెంక‌ట్రామ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రామానాయుడుకు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాలు కేటాయించారు.  ఎన్టీఆర్ ఓసారి రామానాయుడుకు ఇచ్చిన స్థ‌లం చూసి, "ఈ రాళ్ల‌ల్లో స్టూడియో ఏం క‌డ‌తావ్‌?" అన‌డిగారు. "వ్యూ చాలా బాగుంది" అన్నారు రామానాయుడు.  "వ్యాపారం చేస్తావా, వ్యూ చూసుకుంటూ కూర్చుంటావా? మంచి స్థ‌లం చూసుకోరాదా.." అని న‌వ్వారు రామారావు. రామానాయుడుకు ఆ స్థ‌లం న‌చ్చింది. రాళ్ల‌ను ఈజీగా ప‌గ‌ల‌గొట్టొచ్చు అనుకున్నారు. కానీ ఒక రాయిని ప‌గ‌ల‌గొట్ట‌డానికి ఆర్నెల్లు ప‌ట్టేస‌రికి ఆయ‌న‌లో చాలా నిరాశ క‌లిగింది. అప్ప‌టికే పెద్ద‌కొడుకు సురేశ్‌బాబు ఆయ‌న‌తో ఉండ‌టం.. చిన్న‌కొడుకు వెంక‌టేశ్ హీరో అవ‌డంతో.. స్టూడియో క‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల పెరిగింది. ఉన్న డ‌బ్బంతా రాళ్ల‌లో పోశారు. ఆ రాళ్ల‌తో రామానాయుడు ప‌డుతున్న శ్ర‌మ‌చూసి ప‌త్రిక‌ల‌వాళ్లు.. "ఇంత‌కీ మీ ఆశ‌యం ఏమిటండీ?" అని అడిగారు. "స్క్రిప్టు తీసుకొని నా స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత‌.. ప్రింట్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాలి. అన్ని సౌక‌ర్యాలు ఈ స్టూడియోలోనే క‌లిగించాల‌న్న‌దే నా ఆశ‌యం." అని చెప్పారు. ఆ ఆశ‌యాన్ని ఆయ‌న నిజం చేసుకున్నారు.

అమ‌ల అక్కినేని సినిమాల్లోకి రాక‌ముందే ఫేమ‌స్ డాన్స‌ర్! ఆమె కథ ఇదే!!

  న‌టి అమ‌ల‌ను అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. తెలుగు చిత్ర‌సీమ‌లోని పెద్ద కుటుంబాల్లో ఒక క్రేజీ హీరో వేరే భాష‌కు చెందిన తార‌ను పెళ్లాడ‌టం అదే ప్ర‌థ‌మం కావ‌డంతో అంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. నాగార్జునకు అమ‌ల రెండో భార్య‌. అదివ‌ర‌కు ఆయ‌న స్టార్ ప్రొడ్యూస‌ర్ డి. రామానాయుడు కుమార్తె ల‌క్ష్మిని పెళ్లాడి, అభిప్రాయ‌భేదాల కార‌ణంగా విడిపోయారు. నాగార్జున న‌టుడు కావ‌డం ఇష్టం లేనందువ‌ల్లే ల‌క్ష్మి ఆయ‌న నుంచి విడిపోయార‌నేది విరివిగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన అంశం. అమ‌ల‌ను 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు నాగార్జున‌. 1994లో వారికి అఖిల్ పుట్టాడు. అస‌లు అమ‌ల ఎవ‌రు? ఆమె కుటుంబ నేప‌థ్యం ఏమిటి? ఎక్క‌డ్నుంచి ఎలా సినిమాల్లోకి వ‌చ్చారు? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రం. అమ‌ల హీరోయిన్‌గా న‌టించిన తొలి తెలుగు చిత్రం 'కిరాయిదాదా' (1987). ఆ సినిమా హీరో నాగార్జునే. అప్ప‌టికే అమ‌ల‌ ప‌దిహేను దాకా త‌మిళ చిత్రాల్లో న‌టించారు. నిజానికి సినిమాల్లోకి రావాల‌నే ఆలోచ‌న మొద‌ట్లో ఆమెకు లేదు. ఆమె త‌ల్లిదండ్రుల‌కు కూడా లేదు. ఆమె త‌ల్లి ఐరిష్ వ‌నిత అయితే, తండ్రి బెంగాలీ బ్రాహ్మ‌ణుడు. ప్ర‌ఖ్యాత నాట్య‌కారుడు ఉద‌య్ శంక‌ర్ భార్య పేరు అమ‌ల‌. ఆ పేరే ఆమెకు పెట్టారు. బ‌హుశా అందువ‌ల్ల‌నేమో చిన్న‌వ‌య‌సులోనే అమ‌ల‌కు నాట్యంపై అభిరుచి ఏర్ప‌డింది.  ఒక‌వైపు నాట్యం, మ‌రోవైపు చ‌దువు కొన‌సాగేలా త‌ల్లిదండ్రులు అమ‌ల‌ను మ‌ద్రాసులోని 'క‌ళాక్షేత్ర‌'లో చేర్పించారు. అక్క‌డ ప్ర‌ఖ్యాత నాట్య‌కారిణి రుక్మ‌ణీదేవి అరండేల్ శిష్య‌రికం, ఆమె ప్రేమాభిమానాలు ల‌భించ‌డం త‌న‌కు ద‌క్కిన అదృష్టంగా అమ‌ల భావిస్తారు. క‌ళాక్షేత్ర త‌ర‌పున మ‌న‌దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటిలోనూ అమ‌ల బృందం భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది. యూర‌ప్ మిన‌హా మిగ‌తా పాశ్చాత్య‌దేశాల్లోనూ, చైనాలో కూడా ఆమె నాట్య‌ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డం విశేషం. అలా చ‌క్క‌ని డాన్స‌ర్‌గా ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ప్ల‌స్ టూ చ‌దువుతుండ‌గా అమ‌ల‌కు తొలి సినిమా అవ‌కాశం ల‌భించింది. అప్ప‌టికే డైరెక్ట‌ర్‌గా, యాక్ట‌ర్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరుపొందిన టి. రాజేంద‌ర్ ఆమె నాట్య ప్ర‌ద‌ర్శ‌న చూసి, ఆ అవ‌కాశం ఇచ్చారు. కానీ మొద‌ట అమ‌ల ఒప్పుకోలేదు. కార‌ణం, చ‌దువు పూర్తిచెయ్యాల‌ని. ఆ విష‌యం ఆమె చెప్ప‌గానే, "అయితే ప‌రీక్ష‌ల త‌ర్వాత‌నే షూటింగ్ పెట్టుకుందాం" అన్నాడాయ‌న‌. దాంతో స‌రేన‌న్నారు అమ‌ల‌. ఆమె ప‌రీక్ష‌లు రాయ‌డం ఆల‌స్యం, షూటింగ్ మొద‌లైంది. ఆ సినిమా 'మైథిలి ఎన్ కాద‌లి' (తెలుగులో 'మైథిలీ నా ప్రేయ‌సీ'). ఆ సినిమా హిట్ట‌వ‌డంతో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి.  సింగీతం శ్రీ‌నివాస‌రావు డైరెక్ష‌న్‌లో క‌మ‌ల్ హాస‌న్ జోడీగా చేసిన 'పుష్ప‌క విమానం' (1987) మూవీ అమ‌ల కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాకు ఆమె ఫ‌స్ట్ చాయిస్ కాదు. డైరెక్ట‌ర్ సింగీతం మొద‌ట ఆ పాత్ర‌కు శ్రీ‌దేవినీ, త‌ర్వాత హిందీ న‌టి నీల‌మ్‌ను అడిగారు. ఆ ఇద్ద‌రికీ వ‌రుస‌గా ఎక్కువ రోజులు కాల్షీట్లు ఇవ్వ‌డానికి వీల‌వ‌లేదు. దాంతో చివ‌ర‌కు అమ‌ల‌ను అడిగారు. అప్ప‌టికే ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, ఆ సినిమా స్క్రిప్టు గురించి అప్ప‌టికే విని ఉండ‌టంతో ఎలాగైనా దాన్ని చెయ్యాల‌ని కాల్షీట్లు స‌ర్దుబాటు చేశారు అమ‌ల‌. అందుకు త‌గ్గ అద్భుత ఫ‌లితాన్ని ఆమె అందుకున్నారు. భార‌తీయ సినిమాల్లోని క్లాసిక్స్‌లో ఒక‌టిగా నిలిచింది 'పుష్ప‌క విమానం'. ఆ త‌ర్వాత ఆమె 'నాయ‌క‌న్' హిందీ రీమేక్ 'ద‌యావాన్‌' (1988)లో వినోద్ ఖ‌న్నా కూతురి పాత్ర చేయ‌డం ద్వారా హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టారు.  తెలుగులో 'శివ' చిత్రం చేస్తున్న‌ప్పుడు నాగార్జున‌తో ఏర్ప‌డిన స‌న్నిహిత‌త్వం 'ప్రేమ‌యుద్ధం', 'నిర్ణ‌యం' సినిమాలు చేసేనాటికి బ‌ల‌మైన ప్రేమ‌గా మారింది. ఆ త‌ర్వాత 1992లో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె రాజ‌శేఖ‌ర్‌తో 'ఆగ్ర‌హం' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా 1993లో విడుద‌లైంది. 

బాలకృష్ణ-ఎన్టీఆర్ చేయాల్సిన 'య‌మ‌గోల‌'ను ఎన్టీఆర్‌-స‌త్య‌నారాయ‌ణ చేశారు!

  న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీ రామారావు, అందాల తార జ‌య‌ప్ర‌ద జంట‌గా న‌టించిన 'య‌మ‌గోల' (1977) చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. తాతినేని రామారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాని నిజానికి బాల‌కృష్ణ హీరోగా తియ్యాల‌ని నిర్మాత ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం అనుకున్నార‌ని మీకు తెలుసా? అవును. దాని వెనుక ఓ క‌థే ఉంది. అస‌లు 'య‌మ‌గోల' టైటిల్‌తో సినిమా తియ్యాల‌ని అనుకుంది ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు సి. పుల్ల‌య్య‌. అప్ప‌టికే ఆయ‌న ఎన్టీఆర్‌తో 'దేవాంత‌కుడు' మూవీని తీసి ఘ‌న‌విజ‌యం సాధించారు. తెలుగులో రూపొందిన తొలి సోషియో ఫాంట‌సీ ఫిల్మ్‌గా 'దేవాంత‌కుడు' పేరు తెచ్చుకుంది. అందులోనూ య‌మ‌ధ‌ర్మ‌రాజు పాత్ర కీల‌కం. ఆ పాత్ర‌ను విశ్వ‌న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు పోషించారు.  'దేవాంత‌కుడు' త‌ర‌హాలోనే మ‌రో సోసియో ఫాంట‌సీని రూపొందించాల‌నుకున్న సి. పుల్ల‌య్య 'య‌మ‌గోల' అనే సినిమా తియ్య‌నున్న‌ట్లు ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. దానికి ఆదుర్తి సుబ్బారావు త‌మ్ముడు న‌ర‌సింహ‌మూర్తితో ఓ క‌థ‌ను త‌యారు చేయించారు. కానీ తెలీని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా వాస్త‌వ‌రూపం దాల్చ‌లేదు. అనంత‌రం పుల్ల‌య్య కుమారుడు సి.య‌స్‌. రావు ఆ క‌థ‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేశారు. ఆ క‌థ‌ను నిర్మాత డి.ఎన్‌. రాజుకు చెప్పారు. అయితే అన్నింటా ప్ర‌ముఖ నిర్మాత డి.వి.ఎస్‌. రాజు స‌ల‌హాలు తీసుకొనే డి.ఎన్‌. రాజు ఈ క‌థ‌ను కూడా ఆయ‌న‌తో క‌లిసి చ‌ర్చించారు. డి.వి.ఎస్‌. రాజుకు క‌థ న‌చ్చ‌లేదు. దాంతో ఆ ప్రాజెక్టు అట‌కెక్కింది. అప్ప‌టికే 'య‌మ‌గోల' అనే టైటిల్ డి. రామానాయుడుకు న‌చ్చింది. ఆయ‌న ఈ స్క్రిప్టు గురించి వాక‌బుచేసి, దాని హ‌క్కులు కొన్నారు. కానీ త‌ర్వాత క‌థ ఆయ‌న‌కూ పూర్తిగా సంతృప్తినివ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న కూడా దాన్ని ప‌క్క‌న పెట్టేశారు. అయితే టైటిల్ మాత్రం ఆయ‌న ద‌గ్గ‌రే ఉంది. ఇది జ‌రిగిన ప‌దిహేడేళ్ల త‌ర్వాత ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి 'య‌మ‌గోల' టైటిల్‌ను సినిమాటోగ్రాఫ‌ర్‌-ప్రొడ్యూస‌ర్ అయిన ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం కొన్నారు. డి.వి. న‌ర‌స‌రాజు చేత క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయించి, మాట‌లు రాయించారు. 'దేవాంత‌కుడు' సినిమాని ఎన్టీఆర్ చేయ‌డం వ‌ల్ల‌, 'య‌మ‌గోల' సినిమాని ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ‌తో చేస్తే బాగుంటుంద‌నీ, ఆలాగే య‌ముడి పాత్ర‌ను ఎన్టీఆర్ చేత చేయించాల‌నీ ఆయ‌న అనుకున్నారు. అప్ప‌టికే రిలీజైన 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో అభిమ‌న్యుడిగా బాల‌కృష్ణ న‌ట‌న ఆయ‌న‌కు న‌చ్చింది. ఇదే విష‌య‌మై ఎన్టీఆర్‌ను సంప్ర‌దించారు వెంక‌ట‌రత్నం. అయితే అప్పుడు సొంత చిత్రాల‌లో త‌ప్పితే, బ‌య‌టి చిత్రాల్లో బాల‌కృష్ణ న‌టించ‌డానికి ఎన్టీఆర్ ఒప్పుకోవ‌డం లేదు. ఆ సంగ‌తి చెప్పి, త‌నే హీరో వేషం వేస్తాన‌నీ, య‌ముడి క్యారెక్ట‌ర్‌కు స‌త్య‌నారాయ‌న‌ణను తీసుకొన‌మ‌నీ సూచించారు ఎన్టీఆర్‌. స‌రేన‌ని ఆయ‌న చెప్పిన‌ట్లే చేశారు వెంక‌ట‌రత్నం. అలా తాతినేని రామారావు డైరెక్ష‌న్‌లో త‌యారైన 'య‌మ‌గోల‌' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. 

ఎంజీఆర్‌కు జాన‌కి మూడో భార్య అనీ, ఆమెకు ఆయ‌న రెండో భ‌ర్త అనీ మీకు తెలుసా?

  త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎంజీ రామ‌చంద్ర‌న్ క‌న్నుమూశాక మూడు వారాల పాటు త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని నిర్వ‌హించారు ఆయ‌న భార్య జాన‌కీ రామ‌చంద్ర‌న్‌. 1987 చివ‌ర‌లో ఎంజీఆర్ మృతిచెంద‌గా, జాన‌కి 1996లో మ‌ర‌ణించారు. మ‌న‌లో చాలామందికి తెలీని విష‌యం ఎంజీఆర్‌కు జాన‌కి మూడో భార్య అనీ, అలాగే జాన‌కికి ఎంజీఆర్ రెండో భ‌ర్త అనీ. జాన‌కి అస‌లు పేరు వైక్కం నారాయ‌ణియ‌మ్మ జాన‌కి. 1923లో కేర‌ళ‌లోని ఓ త‌మిళ నాయ‌ర్ కుటుంబంలో జ‌న్మించారు. ఆమె తండ్రి సినీ గేయ‌ర‌చ‌యిత కావ‌డం వ‌ల్ల చిన్న‌త‌నం నుంచే జాన‌కికి సినిమాలంటే మోజు ఉండేది. సినిమాల్లో న‌టించాల‌నే కోరిక‌తోటే మ‌ద్రాసుకు వ‌చ్చారామె. న‌వాబ్ రాజ‌మాణిక్యం నాట‌క సంస్థ నిర్మించిన 'ఇవ్వ‌సాగ‌రం' అనే సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. అప్పుడామె వ‌య‌సు ప‌ద‌మూడేళ్లు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ ఫిలిమ్ రీల్స్ అగ్నిప్ర‌మాదంలో ఆహుత‌య్యాయి. ఆ ఘ‌ట‌న జానకిని చాలా బాధ‌పెట్టింది. అయితే 'కృష్ణ‌న్ తూడు' సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఆ బాధ తాత్కాలిక‌మే అయ్యింది. సినీ రంగం మీద ఉన్న ఆపేక్ష కార‌ణంగా ఆమెకు ఆ రంగంలోని వ్య‌క్తినే వివాహం చేసుకోవాల‌నే కోరిక ఉండేది. అదీ నెర‌వేరింది. ప్ర‌గ‌తి స్టూడియోలో మేక‌ప్‌మేన్‌గా ఉంటూ స‌హాయ‌పాత్ర‌లు ధ‌రించిన గ‌ణ‌ప‌తి భ‌ట్‌ను ఆమె పెళ్లాడారు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. వివాహానంత‌రం కూడా జాన‌కి సినిమాల్లో న‌టిస్తూనే వ‌చ్చారు. 'కృష్ణ‌న్ తూడ్' త‌ర్వాత కొన్ని చిత్రాల్లో జాన‌కి న‌టించినా అవ‌న్నీ డాన్స‌ర్ రోల్సే. ఆ టైమ్‌లో డైరెక్ట‌ర్ కె. సుబ్ర‌మ‌ణ్య‌న్ ఆమెకు 'అనంత శ‌య‌న‌మ్' మూవీలో హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆమె ప్ర‌తిభ త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. ఆ త‌ర్వాత 'దేవ‌క‌న్య‌', 'రాజా భ‌ర్తృహ‌రి', 'మాన సంర‌క్ష‌ణ‌మ్' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. అప్పుడే ఆమె కె. సుబ్ర‌మ‌ణ్య‌న్ ఆధ్వ‌ర్యంలోని 'నృత్యోద‌య' నాట్య బృందంలో స‌భ్యురాలిగా ద‌క్షిణాది అంత‌టా నృత్య నాటిక‌లు ప్ర‌ద‌ర్శించారు. ఆ నాట‌కంలో ఆమె పురుష పాత్ర‌లు ధ‌రించేవారు.  సినీ రంగం మీద ఉన్న ఇష్టంకొద్దీ ఆమె ఆ నాట్య బృందం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, సినిమాల మీద దృష్టి పెట్టారు. 'త్యాగి', 'చంద్ర‌లేఖ‌', 'ఆయిర‌మ్ త‌లైవాంగి అపూర్వ చింతామ‌ణి' సినిమాలు సూప‌ర్ హిట్ట‌య్యాయి. అన్నాదురై ర‌చ‌న చేసిన 'వేలైకారి', ఎంజీఆర్ స‌ర‌స‌న న‌టించిన 'మోహిని',  'మ‌రుద‌నాట్టు ఇళ‌వ‌ర‌సిస', త్యాగ‌రాజ భాగ‌వ‌తార్‌తో న‌టించిన‌ 'రాజ‌ముక్తి' సినిమాలు సినీ రంగంలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఎంజీఆర్ అప్ప‌టికే మొద‌టి భార్య చ‌నిపోవ‌డంతో స‌దానంద‌వ‌తిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. 'మోహిని', 'మ‌రుద‌నాట్టు ఇళ‌వ‌ర‌సి' సినిమాల‌లో న‌టించే కాలంలో ఎంజీఆర్‌, జాన‌కి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఎంజీఆర్‌కు మృతురాలైన త‌న మొద‌టిభార్య తంగ‌మ‌ణి అంటే విప‌రీత‌మైన ప్రేమ‌. జాన‌కిలో మొద‌టిసారి చూసిన‌ప్పుడే ఆమెలో ఆయ‌న‌కు తంగ‌మ‌ణి పోలిక‌లు క‌నిపించాయనీ, వారిద్ద‌రూ క‌లిసి న‌టించిన‌ప్పుడు స‌హ‌జంగానే అది ప్రేమ‌గా మారింద‌నీ వారి స‌న్నిహితులు అంటుండేవారు. జ‌బ్బుప‌డిన రెండో భార్య స‌దానంద‌వ‌తి మ‌ర‌ణం త‌ర్వాత జాన‌కిని వివాహం చేసుకున్నారు ఎంజీఆర్‌. అప్ప‌టికే ఆమె త‌న మొద‌టి భ‌ర్త గ‌ణ‌ప‌తి భ‌ట్ నుంచి విడిపోయారు. ఆమె ఎంజీఆర్‌ను వివాహం చేసుకున్న కొంత కాలానికి ఆయ‌న చ‌నిపోయారు. ఎంజీఆర్‌తో పెళ్లైన త‌ర్వాత‌, అప్ప‌టికి ప‌దిహేను సినిమాల్లో న‌టించిన జాన‌కి చిత్ర‌రంగానికి గుడ్‌బై చెప్పి గృహిణిగా స్థిర‌ప‌డ్డారు. 1984లో ఎంజీఆర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ప్పుడు, ఆయ‌న‌తో పాటు ఆమెరికా వెళ్లిన‌ప్పుడు, ఆ త‌ర్వాత ఎంజీఆర్ బ‌హిరంగ స‌భ‌ల‌కు ఆయ‌న‌కు తోడుగా హాజ‌రైన‌ప్పుడు మాత్ర‌మే ఆమె వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఎంజీఆర్ లాగే ఆమె కూడా సినీ రంగంలో శ్ర‌మించి, త‌న‌కంటూ ఒక స్థానం ఏర్ప‌ర‌చుకున్నారు. ఆయ‌న‌తో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి, నిజ జీవిత భాగ‌స్వామి అయ్యి, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాడు నాలుగో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే ఆ రాష్ట్ర చ‌రిత్రంలో అతి త‌క్కువ కాలం అంటే కేవ‌లం 24 రోజులు మాత్ర‌మే ప్ర‌భుత్వాన్ని న‌డిపిన వ్య‌క్తిగా నిలిచారు. ఆమె ప్ర‌భుత్వం కూలిపోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర వ‌హించింది ఎంజీఆర్‌కు అత్యంత స‌న్నిహితురాలైన జ‌య‌ల‌లిత కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ పాట‌లో న‌టిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన అర్జున్‌-సౌంద‌ర్య‌!

  చిరంజీవిని పూర్తి పౌరాణిక పాత్ర‌లో ఆవిష్క‌రించిన తొలి చిత్రం 'శ్రీ మంజునాథ' (2001). కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఏక కాలంలో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మాణ‌మైన ఈ మూవీలో శివునిగా (శ్రీ మంజునాథునిగా) చిరంజీవి, పార్వ‌తిగా మీనా న‌టించ‌గా, భార్యాభ‌ర్త‌లుగా ప్ర‌ధాన పాత్ర‌ల్లో అర్జున్‌, సౌంద‌ర్య న‌టించారు. ఈ సినిమా ఆడియో సేల్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడ‌య్యాయి. క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు హంస‌లేఖ ఈ చిత్రంలోని పాట‌ల‌కు సంగీత బాణీలు స‌మ‌కూర్చారు. వేద‌వ్యాస‌, జె.కె. భార‌వి, భువ‌న‌చంద్ర‌, జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు, చంద్ర‌బోస్‌, సామ‌వేదం ష‌ణ్ముఖ‌శ‌ర్మ‌, విశ్వ‌నాథ శాస్త్రి సాహిత్యం అందించారు.  విశ్వ‌నాథ శాస్త్రి ర‌చించగా ఎస్పీ బాలు, నందిత ఆల‌పించిన‌ "ఆనందా ప‌ర‌మానందా" పాట చిత్రీక‌ర‌ణ అనుభ‌వాల‌ను ఆ సినిమా యూనిట్ అంత త్వ‌ర‌గా మ‌రచిపోలేదు. వేద పండితుల‌కు అర్జున్‌, సౌంద‌ర్య దంప‌తులు భోజ‌నం వ‌డ్డిస్తుండ‌గా వారి కొడుకు చ‌నిపోతాడు. ఆ విష‌యం ఆ కుటుంబ‌స‌భ్యుల‌కు మాత్ర‌మే తెలుసు. భోజ‌నం చేస్తున్న పండితుల‌కు తెలిస్తే విస్త‌ళ్ల ముందు నుంచి అంద‌రూ లేచి వెళ్లిపోతార‌ని అర్జున్‌, సౌంద‌ర్య‌, వారి కుటుంబ‌స‌భ్యులు అంతులేని బాధ‌ను దిగ‌మింగుకుంటూ ప‌దార్థాలు వ‌డ్డిస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో పండితులు "నీ గానామృతంతో మ‌మ్మ‌ల్ని ఆనంద‌ప‌ర‌వ‌శుల్ని చేయి నాయ‌నా" అని అర్జున్‌ను అడుగుతారు. క‌ళ్లు తుడుచుకొని, ముఖంలో ఆనందాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ "ఆనందా ప‌ర‌మానందా" అంటూ పాడ‌తాడు అర్జున్‌. సౌంద‌ర్య కూడా అందుకుంటుంది. కొండంత వేద‌న‌ను మ‌న‌సులో అణ‌చుకుంటూ పాట పాడుతూ పండితుల్ని ప‌ర‌వ‌శుల్ని చేసే ఆ హెవీ సీన్ చేస్తున్న‌ప్పుడు అంద‌రి మూడ్ పాడైపోయింది. ముఖ్యంగా అర్జున్‌, సౌంద‌ర్య త‌మ‌లో క‌లుగుతున్న ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకోలేక‌పోతున్నారు. ఆ పాట పూర్తిచేసి, ఇద్ద‌రూ మ‌రో మూవీ షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈలోగా సాంగ్ షూటింగ్ పూర్త‌య్యేలా లేదు. దాంతో ఆ రోజుకు వాళ్లిద్ద‌ర్నీ వెళ్లిమ‌ని చెప్పారు నిర్మాత నారా జ‌య‌శ్రీ‌దేవి.  స‌రేన‌ని, వేరే సినిమా షూటింగ్‌కు వెళ్లిన అర్జున్‌, సౌంద‌ర్య.. అక్క‌డ కూడా ఈ పాటే గుర్తుకువ‌స్తుంటే స‌రిగా న‌టించ‌లేక‌పోయారు. ఆ నిర్మాత‌కు చెప్పి, వాళ్ల షూటింగ్ పోస్ట్‌పోన్ చేయించి, తిరిగివ‌చ్చి "ఆనందా ప‌ర‌మానందా" పాట‌ను పూర్తిచేశారు. అందుకే ఇప్ప‌టికీ ఆ పాట విన్న‌ప్పుడ‌ల్లా.. అర్జున్ స‌హా ఆ పాట‌లో పాల్గొన్న యూనిట్ అంతా ఎమోష‌న‌ల్‌గా ఫీల‌వుతుంటారు.

మూడేళ్లు.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు వ‌రుస‌గా జాతీయ అవార్డులు సాధించారు!

  ద‌క్షిణాదిన ఉత్త‌మ న‌టుల ఫ్యామిలీ ఏదంటే హాస‌న్ ఫ్యామిలీనే చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ముగ్గురు జాతీయ ఉత్త‌మ న‌టీన‌టులున్నారు. అన్న‌ద‌మ్ములైన చారు హాస‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ ఉత్త‌మ న‌టులు కాగా, చారు హాస‌న్ కుమార్తె సుహాసిని సైతం జాతీయ ఉత్త‌మ న‌టే. వీళ్లంద‌రిలో ముందుగా జాతీయ అవార్డు సాధించింది క‌మ‌ల్‌. బాలూ మ‌హేంద్ర డైరెక్ట్ చేసిన 'మూండ్ర‌మ్ పిరై' (తెలుగులో 'వ‌సంత కోకిల‌')లో న‌ట‌న‌కు గాను 1982లో ఆయ‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ల‌భించింది. ఆ త‌ర్వాత మ‌రో రెండు సార్లు.. నాయ‌క‌న్‌, ఇండియ‌న్ సినిమాల‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.  క‌మ‌ల్ త‌ర్వాత ఆ కుటుంబంలో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు అందుకున్నారు సుహాసిని. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్ రూపొందించిన త‌మిళ చిత్రం 'సింధు భైర‌వి' (1985)లో సింధుగా చేసిన పాత్ర ఆమెకు ఆ అవార్డును సాధించి పెట్టింది. కుమార్తె అవార్డును సాధించిన మ‌రుస‌టి ఏడాదే చారు హాస‌న్ సైతం బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు. గిరీశ్ కాస‌ర‌వ‌ల్లి రూపొందించిన క‌న్న‌డ మూవీ 'త‌బ‌ర‌న క‌థే' (1986)లో ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌తో ఆ అవార్డును ఆయ‌న పొందారు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం.. అంటే 1987లో త‌న రెండో నేష‌న‌ల్ అవార్డును అందుకున్నారు క‌మ‌ల్‌. మ‌ణిర‌త్నం రూపొందించిన గ్రేట్ ఫిల్మ్ 'నాయ‌క‌న్‌'లో చేసిన టైటిల్ రోల్ ఆయ‌న‌కు అవార్డును అందించింది.  ఇలా వ‌రుస‌గా మూడేళ్లు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు న‌ట‌న‌లో జాతీయ అవార్డులు అందుకోవ‌డం అత్యంత అరుదైన విశేషంగా చెప్పుకోవాలి. కొన్నాళ్ల క్రితం చారు హాస‌న్‌తో ఒక‌రు, "మీరు ఉత్త‌మ‌న‌టులు, మీ కుమార్తె కూడా ఉత్త‌మ‌న‌టి. అదృష్ట‌వంతులు" అన్నారు. దానికి చారు హాస‌న్ స‌మాధానం.. "నా దృష్టిలో సంపూర్ణ న‌టుడు క‌మ‌ల్ ఒక్క‌డే." అదీ విష‌యం. క‌మ‌ల్, సుహాసిని ఇద్ద‌రూ తెలుగులోనూ గొప్ప గొప్ప పాత్ర‌లు చేశారు. 'స్వాతిముత్యం', 'సాగ‌ర సంగ‌మం' లాంటి చిత్రాల్లో క‌మ‌ల్ న‌ట‌న‌ను, 'సిరివెన్నెల‌', 'స్వాతి' లాంటి సినిమాల్లో సుహాసిని న‌ట‌న‌ను మ‌ర‌వ‌గ‌ల‌మా!

మొద‌ట అక్కినేని వ‌ద్ద‌న్న పాటే సినిమాకు హైలైట్‌గా, ఆయ‌న న‌ట‌న‌కు గీటురాయిగా నిలిచింది!

  శివాజీ గ‌ణేశ‌న్ డ్యూయ‌ల్ రోల్ చేసిన త‌మిళ చిత్రం 'ఎంగ‌వూర్ రాజా' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ట‌యింది. దాని తెలుగు రీమేక్ 'ధ‌ర్మదాత‌' (1970)లో ఆ పాత్ర‌ల్ని న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పోషించారు. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్ త‌మ్ముడు అక్కినేని సంజీవి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఎడిట‌ర్ అయిన సంజీవి 'అక్కా చెల్లెలు' మూవీతో డైరెక్ట‌ర్‌గా మారారు. ఆయ‌న రూపొందించిన రెండో సినిమా 'ధ‌ర్మ‌దాత‌'. మొద‌ట హీరోయిన్ రోల్‌కు వాణిశ్రీ‌ని తీసుకుందామ‌ని అనుకున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్‌లో ఓ పాట ఉండ‌టంతో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంచ‌న‌ను ఎంపిక చేశారు. తండ్రి పాత్ర‌కు జోడీగా షావుకారు జాన‌కి న‌టించారు. డైలాగ్స్ పినిశెట్టి రాయ‌గా, సి. నారాయ‌ణ‌రెడ్డి పాట‌లు రాశారు. టి. చ‌ల‌ప‌తిరావు సంగీతం స‌మ‌కూర్చారు.  ఈ సినిమాలోని పాట‌లు మంచి హిట్ట‌య్యాయి. అన్నింటిలోకీ హైలైట్‌గా నిలిచిన సాంగ్, అక్కినేని అభిన‌యానికి ప్రేక్ష‌కులు "ఓహో" అన్న సాంగ్ "ఎవ్వ‌రి కోసం ఎవ‌రున్నారు పొండిరా పొండి..". నిజానికి ఈ పాట పెట్ట‌డానికి మొద‌ట అక్కినేని ఒప్పుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌మిళ ఒరిజిన‌ల్‌లోనూ ఆ త‌ర‌హా పాట ఉంది. ఆ పాట‌లో శివాజీ గ‌ణేశ‌న్ ఓవ‌రాక్ష‌న్ చేశార‌నీ, అలాంటిది మ‌న‌కు న‌ప్ప‌ద‌నీ నిర్మాత త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తితో వాదించారు ఏఎన్నార్‌. కృష్ణ‌మూర్తి, డైరెక్ట‌ర్ సంజీవి క‌లిసి ఆయ‌న‌ను ఎలాగో క‌న్విన్స్ చేశారు. చివ‌ర‌కు ఆ పాట‌ను కొస‌రాజు చేత రాయించ‌మ‌ని సూచించారు అక్కినేని. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఆ పాట‌ను సూప‌ర్బ్‌గా రాశారు కొస‌రాజు. ఆ పాట‌కు ప్రాణం పోయ‌డానికీ, స‌హ‌జ‌త్వం తీసుకు రావ‌డానికీ ఏఎన్నార్ రెండు రోజులు భోజ‌నం మానేశారు. ముఖంలో డ‌ల్‌నెస్ వ‌చ్చేలా చూసుకున్నారు. తెర‌పై ఆ పాట‌కు ఆయ‌న అభిన‌యిస్తుంటే ప్రేక్ష‌కుల్లో క‌లిగిన ఇంపాక్ట్ అమోఘం. అంద‌రూ ఆ పాట గురించీ, ఆ పాట‌లో అక్కినేని అద్భుతాభిన‌యం గురించి మాట్లాడుకున్న‌వాళ్లే. ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే 'ధ‌ర్మదాత' కూడా సూప‌ర్ హిట్ట‌యి, 15 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.

అక్కినేని సినిమా షూటింగ్‌లో అనుకోని ప్ర‌మాదం.. నీటిలో కొట్టుకుపోయిన శార‌ద డూప్‌!

  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా వి. మ‌ధుసూద‌న‌రావు డైరెక్ట్ చేసిన హిట్ ఫిల్మ్ 'అమాయ‌కురాలు'. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను శార‌ద పోషించారు. అక్కినేని మేన‌మామ కూతురిగా ఆమె క‌నిపిస్తారు. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను కాంచ‌న చేశారు. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ఒక గగుర్పాటు క‌లిగించే ప్ర‌మాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌థ ప్ర‌కారం విల‌న్ ర‌మ‌ణ‌మూర్తి రెండో పెళ్లి చేసుకోవాల‌నే ప్లాన్‌తో భార్య అయిన శార‌ద‌కు మాయ‌మాట‌లు చెప్పి పిక్నిక్‌కు తీసుకువెళ్లి నీళ్ల‌లో నెట్టేస్తాడు. ఆమె కొన ఊపిరితో ఉండి, త‌న కూతుర్ని హీరో అక్కినేని చేతుల్లో పెట్టి చ‌నిపోతుంది. ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం కేర‌ళ‌లోని త్రివేండ్రం ద‌గ్గ‌ర‌లో ఉన్న అరువికెరా డ్యామ్‌కు వెళ్లారు. ఆ డ్యామ్ ద‌గ్గ‌ర ప్ర‌వాహం విప‌రీతంగా ఉంది. ఈత కొట్ట‌డానికి వీల్లేనంత‌గా రాళ్లున్నాయి. శార‌ద‌కు ఈత రాక‌పోవ‌డంతో నీళ్ల‌లోకి నెట్టివేసే స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ‌కు ఆమె బ‌దులు డూప్‌ను ఏర్పాటు చేశారు. ఆమె ఓ మ‌ల‌యాళీ అమ్మాయి. ఆమె న‌డుముకు ఒక తాడుక‌ట్టి బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఆ తాడును నీళ్ల‌లో వ‌దిలేశారు. ఇద్ద‌రు సెట్ బాయిస్ ఆ తాడును గట్టిగా ప‌ట్టుకొని ఉన్నారు. "స్టార్ట్ కెమెరా.. యాక్ష‌న్" అన్నారు డైరెక్ట‌ర్‌. వెంట‌నే డ్యామ్‌కున్న ఆరు లాక‌ర్స్ తెరుచుకున్నాయి. శార‌ద డూప్ నీళ్ల‌లోకి దూకింది. ఆమె న‌డుముకు క‌ట్టిన తాడును ప‌ట్టుకున్న కుర్రాళ్లు కెమెరా వ్యూలోకి వ‌స్తున్నార‌ని గ‌మ‌నించిన డైరెక్ట‌ర్ గ‌ట్టిగా అరిచారు. దాంతో కంగారుప‌డ్డ వాళ్లు తాడును వ‌దిలేశారు.  మ‌హోధృతంగా ప్ర‌వ‌హిస్తోన్న నీళ్ల‌లో ఆ అమ్మాయి కొట్టుకుపోతోంది. యూనిట్ మొత్తం ఆందోళ‌న‌తో ఒడ్డున ప‌రుగెత్తుతోంది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు నీళ్ల‌లోకి దూకి ఆమెను ప‌ట్టుకోవాల‌నుకున్నాడు. కానీ ఆయ‌న కూడా ప్ర‌వాహంలో కొట్టుకుపోయాడు. కాస్త దూరంలో భ‌యంక‌ర‌మైన సుడిగుండాలున్నాయి. వాళ్లు దాదాపు 200 గజాల దూరం కొట్టుకుపోయాక‌, స్థానికులైన ఇద్ద‌రు యువ‌కులు నీళ్ల‌లోకి దూకి, శార‌ద డూప్‌ను, శ్రీ‌నివాస‌రావును ర‌క్షించి, ఒడ్డుకు చేర్చారు. షూటింగ్ చూడ్డానికి వ‌చ్చిన జ‌నం యూనిట్ మెంబ‌ర్స్‌ను కొట్టినంత ప‌నిచేశారు. అయితే అప్ప‌టికే మ‌ల‌యాళంలో శార‌ద‌కు మంచి ఇమేజ్ ఉండ‌టంతో, ఆమె వాళ్ల‌ను శాంతింప‌జేశారు. ప్ర‌మాదానికి గురైన అమ్మాయిని, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావును హాస్పిట‌ల్‌లో చేర్పించారు. శార‌ద సూచ‌న మేర‌కు డైరెక్ట‌ర్ మ‌ధుసూద‌న‌రావును నిర్మాత దుక్కిపాటి మ‌ధుసూద‌న‌రావు కారులో త‌న‌వెంట పెట్టుకొని తీసుకుపోయారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణాలుగా త‌ర్వాత తేలిన విష‌యాలేమంటే.. నాలుగు లాక‌ర్స్ తెరిపించ‌డానికి బ‌దులు మొత్తం ఆరు లాక‌ర్స్‌ను డైరెక్ట‌ర్ మ‌ధుసూద‌న‌రావు తెరిపించ‌డం, డైరెక్ట‌ర్ కేక‌లు వేయ‌డంతో సెట్ బాయ్స్ తాడు వ‌దిలేయ‌డం, త‌న‌కు ఈత వ‌చ్చ‌ని శార‌ద డూప్ అబ‌ద్ధం చెప్ప‌డం. అక్క‌డి దేవాల‌యానికి నిర్మాత మ‌ధుసూద‌న‌రావుతో విరాళం ఇప్పించి, పూజ‌లు చేయించి మొత్తానికి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేశారు శార‌ద‌.

అర‌కులోయ‌లో శ్రీ‌దేవి కాళ్ల‌మీద‌ప‌డ్డ కుర్రాడు!

  'ప్రేమ‌కానుక' (1981) సినిమా ఔట్‌డోర్ షూటింగ్ నిమిత్తం అక్కినేని హీరో హీరోయిన్లు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌దేవి స‌హా యూనిట్ మెంబ‌ర్స్ అర‌కులోయ‌కు వెళ్లారు. వాళ్లు వ‌స్తున్నార‌ని తెలిసి అక్క‌డున్న జ‌న‌మంతా వాళ్ల‌ను చూసేందుకు తండోప‌తండాలుగా వ‌చ్చారు. జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌సాధ్యంగా మారింది. అర‌కులోయంటే శ్రీ‌దేవికి చాలా ఇష్టం. ఎటుచూసినా ప‌చ్చ‌గా క‌నిపించే ఆ చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో ఆమె ఎంతో ఆనందాన్ని పొందుతుంది. శ్రీ‌దేవి కారులోంచి కాలు కింద‌కు పెట్టేస‌రికి జ‌న‌సందోహం మ‌రింత పెరిగింది. పోలీసులు ఎంత ప్ర‌య‌త్నించినా జ‌నాన్ని అదుపులో పెట్ట‌లేక‌పోతున్నారు.  అంత‌మందిని చూసి శ్రీ‌దేవి భ‌య‌ప‌డ్డారు. ఎలాగో త‌డ‌బ‌డే కాళ్ల‌తో ఆ జ‌నం మ‌ధ్య న‌డుచుకుంటూ వెళ్తున్నారామె. "శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి" అని జ‌నం కేక‌లు వేస్తున్నారు. అంద‌రికీ న‌మ‌స్కారాలు చేస్తూ వ‌డివ‌డిగా ఆమె న‌డుస్తున్నారు. హ‌ఠాత్తుగా ఒక అబ్బాయి గుంపును చీల్చుకొని ఆమె ముందుకు వ‌చ్చి, ఆమెకేసి క్ష‌ణ కాలం చూసి, చ‌టుక్కుమ‌ని ఆమె కాళ్ల‌మీద‌ప‌డి చేతుల‌తో ఆమె రెండు పాదాల్ని గ‌ట్టిగా ప‌ట్టుకొని పాదాభివంద‌నం చేశాడు. జ‌నంలో గ‌గ్గోలు మొద‌లైంది. కొంత‌మంది ఆ అబ్బాయిని పైకి లేవ‌నెత్త‌డానికి ప్ర‌య‌త్నించారు. కుద‌ర‌లేదు. ఆఖ‌రుకి పోలీసులు అత‌డ్ని బ‌ల‌వంతంగా పైకిలేవ‌దీసి కొట్ట‌బోయారు. శ్రీ‌దేవి మ‌న‌సు చివుక్కుమ‌నిపించింది. ఆమె గ‌బ‌గ‌బా పోలీసుల‌ను వారించి, "ప్లీజ్‌, అత‌డ్ని ఏమీ చెయ్య‌కండి" అని చెప్పారు. పోలీసులు ఆ కుర్రాడ్ని విడిచిపెట్టారు. శ్రీ‌దేవి రూమ్‌కు వెళ్లి, రెడీ అయ్యి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. వాతావ‌ర‌ణం అనుకూలంగా బాగుంది. ఎలాంటి అవాంత‌రాలు లేకుండా షూటింగ్ జ‌రుగుతోంది. షూటింగ్ చూడ్డానికి చాలామంది జ‌నం వ‌చ్చారు. దాంతో అక్క‌డ కోలాహ‌లంగా ఉంది. "సైలెన్స్" అన్నారు డైరెక్ట‌ర్ కె. రాఘ‌వేంద్ర‌రావు. వాతావ‌ర‌ణం నిశ్శ‌బ్దంగా మారింది. స‌డ‌న్‌గా నిశ్శ‌బ్దాన్ని చీల్చుకుంటూ "శ్రీ‌దేవిగారూ, నా జ‌న్మ ధ‌న్య‌మైంది." అన్న కేక వినిపించింది. ఆ కేక వినిపించిన వైపు శ్రీ‌దేవి స‌హా అంద‌రూ త‌ల‌లుతిప్పి చూశారు. దూరంగా చెట్టుపై నుంచి అంత‌కుముందు శ్రీ‌దేవి కాళ్ల‌పైప‌డిన అబ్బాయి ఆనందంతో చేయి చూపుతున్నాడు. అదిచూసి శ్రీ‌దేవి క‌ళ్లు చెమ‌ర్చాయి. 

'చ‌దువుకున్న అమ్మాయిలు'లో ఎత్తుగా క‌నిపించ‌డానికి సావిత్రి వేసిన ఎత్తు!

  సావిత్రి, కృష్ణ‌కుమారి, ఇ.వి. స‌రోజ్ టైటిల్ రోల్స్ పోషించిన చిత్రం 'చ‌దువుకున్న అమ్మాయిలు' (1963). డా. శ్రీ‌దేవి సుప్ర‌సిద్ధ న‌వ‌ల 'కాలాతీత వ్య‌క్తులు' ప్రేర‌ణ‌తో ఈ సినిమా క‌థ‌ను తయారుచేశారు. సావిత్రి, కృష్ణ‌కుమారి ఇద్ద‌రూ అక్కినేని నాగేశ్వ‌ర‌రావును ప్రేమిస్తారు. అక్కినేని మ‌న‌సులో ఉండేది మాత్రం కృష్ణ‌కుమారి. చివ‌ర‌కు పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ శోభ‌న్‌బాబు భార్య అవుతుంది సావిత్రి. ఆ విష‌యం అలా ఉంచితే, సావిత్రి కంటే కృష్ణ‌కుమారి, ఇ.వి. స‌రోజ కాస్త పొడ‌వు. ఆ ముగ్గురి కాంబినేష‌న్ సీన్ల‌లో త‌ను పొట్టిగా క‌నిపించ‌కుండా ఉండేందుకు సావిత్రి ఓ ప్లాన్ వేశారు. ఆ క‌థేమిటంటే... సావిత్రి తోడుగా దాక్షాయ‌ణి అనే అమ్మాయి ఎప్పుడూ ఆమెతోటే ఉండేది. సావిత్రి మేక‌ప్ వ‌గైరాలు శ్ర‌ద్ధ‌గా చూసేది. అంతేకాదు, ఆమె ఏ స‌న్నివేశంలో ఏ న‌గ‌లు పెట్టుకుందో, ఏ చీర క‌ట్టుకుందో, కేశాలంక‌ర‌ణ వివ‌రాలు స‌హా అన్నీ ఓ పుస్త‌కంలో రాస్తుండేది. ఆ స‌న్నివేశం త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశం వివ‌రాలు రాసేది. సొంత న‌గ‌లు వాడితే స‌హాయ ద‌ర్శ‌కుడికి ఆ వివ‌రాలు చెప్పేది. బాపాలాల్ నెక్లెస్‌, సింగ‌పూర్ చెయిన్‌, సిలోన్ గాజులు.. ఇలా ఉండేవి ఆ వివ‌రాలు. ఎప్పుడు మ‌ళ్లీ అవ‌స‌రం వ‌చ్చినా, స‌న్నివేశం చెబితే ఆ న‌గ‌ల‌న్నీ ఆ అమ్మాయి తీసుకువ‌చ్చేది. 'చ‌దువుకున్న అమ్మాయిలు' మూవీలో సావిత్రి, కృష్ణ‌కుమారి, ఇ.వి. స‌రోజ క‌లిసి వుండే షాట్స్ చాలా ఉన్నాయి. వాళ్లిద్ద‌రి కంటే త‌ను పొట్టి కాబ‌ట్టి, అప్ప‌టికే త‌ను సింగ‌పూర్ నుంచి తెప్పించుకున్న హైహీల్స్ వాడేవారు సావిత్రి. సెట్స్ మీద ఎప్ప‌టిక‌ప్పుడు సావిత్రికి సంబంధించిన షాట్స్ గ‌మ‌నించే దాక్షాయ‌ణి, ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా, మూడో కంటికి తెలీకుండా సావిత్రి కాళ్ల ద‌గ్గ‌ర‌కు ఆ చెప్పులు తీసుకువ‌చ్చేది. "అక్కా! అంద సెరుపు కొండువందెన్ (అక్కా! ఆ చెప్పులు తెచ్చాను)" అని చెవిలో చెప్పి వెళ్లిపోయేది. సావిత్రి వాటిని వేసుకొని, సినిమాలో ఎక్క‌డా పొట్టిగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

'అవే క‌ళ్లు' షూటింగ్‌లో భ‌య‌ప‌డ్డ‌ కృష్ణ‌.. ధైర్యం చెప్పి ప్రోత్స‌హించిన కాంచ‌న‌!

  సూప‌ర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ చిత్రం 'అవే క‌ళ్లు' (1967). అప్ప‌ట్లోనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ట‌వ‌డ‌మే కాకుండా అప్ప‌టికే 'గూఢ‌చారి 116'తో యాక్ష‌న్ హీరోగా ఆక‌ట్టుకున్న కృష్ణ‌ను మాస్‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. తెలుగులో డిటెక్టివ్ సినిమాల‌కు ఒక వేవ్ తెచ్చిన స్టార్‌గా కృష్ణ చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. 'అవే క‌ళ్లు' సినిమాలో హీరోయిన్‌గా కాంచ‌న న‌టించారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఆ త‌ర్వాత వారి క‌ల‌యిక‌లో వ‌చ్చిన 'వింత కాపురం', 'త‌ల్లీకొడుకులు', 'నేనంటే నేనే' లాంటి సినిమాలు వ‌చ్చి విజ‌యం సాధించాయి. ఎ.సి. త్రిలోక్ చంద‌ర్ డైరెక్ట్ చేసిన 'అవే కళ్లు' చిత్రాన్ని ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ ఏక కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మించింది. ఇందులోని "మావూళ్లో ఒక ప‌డుచుంది దెయ్య‌మంటే భ‌య‌మ‌న్న‌ది.." పాట ఆ రోజుల్లో ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో! ఈ మూవీ త‌మిళ వెర్ష‌న్‌లో హీరోగా ర‌విచంద్ర‌న్ న‌టించారు. రెండు భాష‌ల్లోనూ కాంచ‌నే హీరోయిన్‌. దాంతో ఆమె ఈ సినిమా చేసేట‌ప్పుడు చాలా అవ‌స్థ‌ప‌డ్డారు. కృష్ణ‌, ర‌విచంద్ర‌న్ ఇద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వ‌చ్చి షూటింగ్ ముగించుకొని వెళ్లిపోయేవారు. ఆమె మాత్రం ఇరుక్కుపోయారు. వేరే ఏ చిత్రం షూటింగ్‌లోనూ పాల్గొన‌డానికి వీల్లేకుండా పోయేది. అస్సులు రెస్ట్ ఉండేది కాదు.  "ఆ స‌మ‌యంలోనే నాకు జ్వ‌రం కూడా వ‌చ్చేసింది. అయినా రాత్రీ ప‌గ‌లూ షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. అప్ప‌ట్లో కృష్ణ కొంచెం భ‌య‌ప‌డేవారు. కొత్త క‌దా. నేనే ఆయ‌న‌కు ధైర్యంచెప్పి ప్రోత్స‌హించేదాన్ని. చాలా మంచివాడు. మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు ఎలా విజ‌యం సాధించాయో అంద‌రికీ తెలిసిందే క‌దా." అని ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె తెలిపారు.

'అర్ధ శ‌తాబ్దం' మూవీ రివ్యూ - పువ్వు ర‌గిల్చిన రావ‌ణ కాష్ఠం!

  సినిమా పేరు: అర్ధ శ‌తాబ్దం తారాగ‌ణం: కార్తీక్ ర‌త్నం, కృష్ణ‌ప్రియ‌, సాయికుమార్‌, న‌వీన్ చంద్ర‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, అజ‌య్‌, ఆమ‌ని, ప‌విత్రా లోకేశ్‌, శ‌ర‌ణ్యా ప్ర‌దీప్‌, సుహాస్‌, రామ‌రాజు, రాజా ర‌వీంద్ర‌, దిల్ ర‌మేశ్‌, టీఎన్ఆర్‌, ద‌యానంద్‌, గౌతంరాజు సాహిత్యం: ల‌క్ష్మీ ప్రియాంక‌, క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ‌, సుంద‌ర్ మిట్ట‌ప‌ల్లి సంగీతం: నోఫెల్ రాజా సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట ఆర్‌.శాఖ‌మూరి ఎడిటింగ్‌: జె. ప్ర‌తాప్ కుమార్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సుమిత్ ప‌టేల్‌ నిర్మాత‌: చిట్టి కిర‌ణ్ రామోజు ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ర‌వీంద్ర పుల్లె బ్యాన‌ర్‌: రిషిత శ్రీ క్రియేష‌న్స్‌, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్‌ విడుద‌ల తేదీ: 11 జూన్ 2021 ప్లాట్‌ఫామ్‌: ఆహా (ఓటీటీ) మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ కార‌ణంగా రెండోసారి థియేట‌ర్లు మూత‌ప‌డిన త‌రుణంలో పెద్ద సినిమాలు కాక‌పోయినా, చిన్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను న‌మ్ముకుంటున్నాయి. థియేట‌ర్ల‌లో సొంతంగా రిలీజ్ చేసుకొని రిస్క్ చేసే బ‌దులు, సంతృప్తిక‌ర‌మైన ఆఫ‌ర్ వ‌స్తే, ఓటీటీకి త‌మ సినిమాల‌ను అమ్ముకుంటున్నారు నిర్మాత‌లు. అలా లేటెస్ట్‌గా ఆహా ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన మ‌రో చిన్న సినిమా, కొద్ది రోజులుగా ట్రైల‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తూ వ‌చ్చిన సినిమా 'అర్ధ శ‌తాబ్దం'. క‌థ‌ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్ల‌లో 2003 సంవ‌త్స‌రంలో జ‌రిగిన క‌థ‌గా అర్థ శ‌తాబ్దం మ‌న ముందుకొచ్చింది. చేనేత కుటుంబానికి చెందిన కృష్ణ (కార్తీక్ ర‌త్నం), ఎలిమెంట‌రీ స్కూలు రోజుల నుంచే త‌న‌తో చ‌దువుకున్న అగ్ర‌కుల‌పు అమ్మాయి పుష్ప (కృష్ణ‌ప్రియ‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు త‌న ప్రేమ‌ను తెలియ‌జేయ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ట్రై చేస్తుంటాడు కానీ, ధైర్యం చాల‌దు. టీ బంకు ద‌గ్గ‌ర ఉండే గులాబీ మొక్క‌కు పువ్వు కాస్తే, ఆ పువ్వు ఇచ్చి, త‌న ప్రేమ‌ను తెలియ‌జేయాల‌నుకుంటాడు. మొగ్గ వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు పొద్దున్నే ఎవ‌రో ఆ పువ్వును కోసేస్తారు. పుష్ప త‌ల‌లో గులాబీ పువ్వు క‌నిపిస్తే, త‌మ ప్ర‌త్య‌ర్థి గ్రూపుకు చెందిన కుర్రాడు అది ఇచ్చివుంటాడ‌ని ఊహించుకొని, కృష్ణ‌, అత‌ని స్నేహితులు దారికాచి, అత‌డిని చిత‌గ్గొడ‌తారు. వాడు వెళ్లి ఈ విష‌యం త‌మ పెద్ద‌ల‌కు చెప్తారు. ఊరు రావ‌ణ కాష్ఠం అవుతుంది. కృష్ణ ప్రేమ‌క‌థ ఏమైంది? ఒక పువ్వు ఎలాంటి విపరిణామాల‌ను సృష్టించింది? అనేది మిగ‌తా క‌థ‌. విశ్లేష‌ణ‌ స్వాతంత్ర్యం సాధించుకొని రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చి అర్ధ శ‌తాబ్దం గ‌డిచిపోయినా కులం అనేది ఎలా మ‌నుషుల్ని వేర్వేరుగా ఉంచుతుందో, నిమ్న కులాల‌వారిని అగ్ర‌కులాల వారు ఎలా అణ‌చివేస్తూనే ఉంటున్నారో 'అర్ధ శ‌తాబ్దం' క‌థ ద్వారా ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర పుల్లె చెప్పాల‌నుకున్నాడు. క‌థ ఎత్తుగ‌డ బాగానే ఉంది, మొద‌ట్లో క‌ల్పించిన స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఒక గులాబీ పువ్వు సీన్‌లోకి వ‌చ్చిందో, అప్పుడు క‌థ‌నంలో ఆస‌క్తి స‌న్న‌గిల్లింది. నిజానికి అప్పుడే ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా క‌ల్పించాలి. అందుకు భిన్నంగా హాస్యాస్ప‌ద‌మైన స‌న్నివేశాల‌తో క‌థ‌నాన్ని నీర‌సింప‌జేశాడు. ఓవైపు ఊళ్లో ఒక‌ర్నొక‌రు న‌రుక్కుంటుంటే, ఇంకోవైపు ప్ర‌ధాన పాత్ర‌ల ఇళ్ల‌ల్లో ఆ సంగ‌తేమీ తెలీద‌న్న‌ట్లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం క‌నిపిస్తుందెందుకో తెలీదు. ఊళ్ల‌ల్లో ఏ చిన్న‌గొడ‌వ జ‌రిగినా క్ష‌ణాల్లో ఆ వార్త ఊరంతా పాకిపోతుంది అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు విస్మ‌రించాడు.  అన్నింటికంటే ఆశ్చ‌ర్యం క‌లిగించేది ఊళ్లో రెండు గ్రూపులు హ‌త్యాకాండ సృష్టిస్తున్నాయ‌ని స్ప‌ష్టంగా తెలిసినా, తానే ఎవ‌రికంటా ప‌డ‌కుండా సందుగొందుల్లో త‌ప్పించుకుపోతూ వ‌చ్చిన కృష్ణ ఎలా పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ‌య‌ట‌కు తెస్తాడు? ఇంట్లో తల్లిదండ్రుల ద‌గ్గ‌ర సుర‌క్షితంగా ఉన్న ఆమెను స్వ‌యంగా అత్యంత ప్ర‌మాద‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణంలోకి ఎందుకు తీసుకువ‌స్తాడు?  పైగా ఆమె త‌న‌ను ప్రేమిస్తుందా, లేదా అనే విష‌యం అత‌డికే తెలీదు. ఒక నాట్య ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల్సిన ఆమె, దానికోస‌మే త‌న‌ను తీసుకువెళ్ల‌డానికి కృష్ణ‌ వ‌చ్చాడ‌ని ఎలా గుడ్డిగా న‌మ్ముతుందో, అత‌డితో పాటు బ‌య‌ట‌కు ఎందుకు వ‌స్తుందో అస్స‌లు అర్థం కాదు. ఈ లాజిక్‌లేని స‌న్నివేశాలు స్క్రీన్‌ప్లేను వీక్‌గా మార్చేశాయి. ఇష్టంలేక‌పోయినా ఎన్‌కౌంట‌ర్లు చేస్తున్న‌ట్లు క‌నిపించే ఎస్సై రంజిత్ (న‌వీన్ చంద్ర‌) ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌స్తూ వ‌స్తూ, ఇంటి ముందే బేడీలు వేసి నిల్చొని ఉన్న ఇద్ద‌రు రౌడీల‌ను భార్య క‌ళ్ల‌ముందే ట‌ప ట‌పా కాల్చేసి, జీపు ఎక్కి వెళ్లిపోతాడు. అప్పుడే వ‌చ్చిన ప‌నిమనిషి.. "అయ్య‌గారు ఇలా చేశారేమిట‌మ్మా?" అని ఎస్సై భార్య‌తో విడ్డూరంగా అంటుంది. ఎదురుగా ఉన్న ఆ రౌడీల శ‌వాల‌ను ఆమె ఏం చేసిందో? ఏమో? ఆ ఎస్సై సిరిసిల్ల‌లోని గొడ‌వ జ‌రుగుతున్న ప్రాంతానికి వ‌చ్చి గాల్లో తుపాకి పేల్చ‌డంతో ఇరు వ‌ర్గాలు అక్క‌డ్నుంచి పారిపోయి, వేరే సందుగొందుల్లో కొట్టుకుంటూ ఉంటాయి. ఎస్సైగారు జీపు బానెట్‌ మీద కూర్చొని ఎస్పీ (అజ‌య్‌)కి ఫోన్ చేసి, ఎప్ప‌టిక‌ప్పుడు ఊరి గొడ‌వ గురించి రిపోర్ట్ చేస్తూ కూర్చుంటాడు. ఆ ఎస్పీ ఏమో హోమ్ మినిస్ట‌ర్ (శుభ‌లేఖ సుధాక‌ర్‌)కు ఈ విష‌యం రిపోర్ట్ చేస్తుంటాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సంభాష‌ణ ఒక ఫార్స్‌లా న‌డుస్తుంటుంది. ఎస్పీకి రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగాన్ని మ‌నం ఎలా ఉల్లంఘిస్తున్నామనే దాని గురించి లెక్చ‌ర్లు దంచుతుంటాడు మినిస్ట‌ర్‌. రాజ్యాంగం అంద‌రికీ స‌మాన హ‌క్కులు ఇచ్చింద‌నీ, స‌మాజంలో ఎన్ని కులాలు ఉన్నా న్యాయం విష‌యంలో అంద‌రూ స‌మానులేన‌ని చెప్పింద‌నీ, కులాల పేరిట కొట్టుకు చావొద్ద‌నీ, త‌క్కువ కులాలవారూ మ‌నుషులేనీ, వాళ్ల ర‌క్తం కూడా అంద‌రి ర‌క్తంలాగే ఉంటుంద‌నీ చెప్పాల‌నేది ద‌ర్శ‌కుడి ఉద్దేశంగా క‌నిపిస్తుంది. కానీ బ‌ల‌మైన స‌న్నివేశాలు ఉన్న‌ప్పుడే మ‌నం చెప్పాల‌నుకున్న విష‌యం ప్రేక్ష‌కుడికి స‌రిగ్గా అందుతుంది. లెక్చ‌ర్ల వ‌ల్లా, బ‌ల‌హీన‌మైన స‌న్నివేశాల వ‌ల్లా ఆ మంచి ఉద్దేశం నీరుగారిపోయింద‌నే చెప్పాలి.  పెద్ద కులానికి చెందిన వ్య‌క్తి అయివుండి కూడా రామ‌న్న (సాయికుమార్‌) అభ్యుద‌య భావాలు క‌లిగిన వాడిగా క‌నిపిస్తాడు. న‌క్స‌లైట్ ఉద్య‌మంలోకి వెళ్లి, అక్క‌డ కూడా కుల‌మే ఆధిప‌త్యం వ‌హిస్తోంద‌ని తెలిసి, బ‌య‌ట‌కు వ‌స్తాడు. అంద‌రూ స‌మానులేన‌ని చెబుతూ, ఊళ్లో త‌మ కులానికే చెందిన మ‌రో వ‌ర్గానికి ప్ర‌త్య‌ర్థి అవుతాడు. అలాంటివాడు కూడా ఒక‌సారి ప్ర‌త్య‌ర్థి మ‌నిషిని ప‌ట్టుకొని "జాతి త‌క్కువ నా కొడ‌కా" అనేస్తాడు. డైలాగ్స్ రాసేప్పుడు ఎవ‌రికి ఏం రాస్తున్నామో చూసుకోవ‌క్క‌ర్లేదా? ఇంకో సీన్ మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. బ‌య‌ట త‌మవాళ్ల‌కు అపాయం పొంచివుంద‌ని తెలిసి కొత్త‌గా అప్పుడే పెళ్ల‌యిన జంట‌లో భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్లి, ఎంతసేపైనా రాక‌పోయేస‌రికి భార్య (శ‌ర‌ణ్య‌) అత‌డి కోసం బ‌య‌ట‌కు రావ‌డం, ఆ ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు చూసుకొని, ద‌గ్గ‌ర‌వుతున్నంత‌లో చ‌టుక్కున ఎవ‌డో వ‌చ్చి, "నేను నిన్ను ప్రేమిస్తే, నువ్వు వాడిని చేసుకుంటావా?" అని ఆమెతో అంటూ ఆ భ‌ర్త‌మీద పెట్రోల్ పోసి, త‌గ‌ల‌బెట్ట‌డం.. ఏంటిది?  నిర్మానుష్యంగా ఉండే రోడ్ల‌పైకి ఆ కొత్త‌జంట బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ముందే ఊహించి, పెట్రోల్‌తో రెడీగా ఉంటాడా వాడు? ఏంటిది డైరెక్ట‌రూ? క్లైమాక్స్ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకొనేలా లేవు. రామ‌న్న వ్య‌క్తిత్వం ఒక్క‌సారిగా ఊడ్చుకుపోయిన సంద‌ర్భం అది. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ రంజిత్ నిస్స‌హాయుడైన‌పోయిన స‌న్నివేశం అది. ఊళ్లలోని మ‌నుషులు మార‌ర‌ని తేల్చేసే సంద‌ర్భం అంది. అంత‌దాకా ఒక‌రకంగా ఉన్న పుష్ప‌కు అప్పుడే జ్ఞానోద‌యం క‌లిగిన కీల‌క స‌న్నివేశం అది.. అలాంటి సీన్‌ను ఇంకా బాగా తీసి ఉండాల్సింది. బ్యాగ్రౌండ్ సంగీతం, పాట‌ల‌కు ఇచ్చిన సంగీతం బాగానే ఉంది. బ‌ల‌హీన‌మైన స‌న్నివేశాల‌ను సినిమాటోగ్ర‌ఫీ కాపాడ‌లేక‌పోయింది. సినిమా ఒక గంటా 56 నిమిషాల నిడివే ఉన్న‌ప్ప‌టికీ ఎడిటింగ్ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టీన‌టుల అభిన‌యం సినిమాలో ఆక‌ట్టుకున్న అంశాలేమైనా ఉన్నాయంటే.. అది కృష్ణ‌, పుష్ప పాత్ర‌ల్లో కార్తీక్ ర‌త్నం, కొత్త‌మ్మాయి కృష్ణ‌ప్రియ న‌ట‌నే. ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. బ‌ల‌హీన‌మైన కృష్ణ పాత్ర‌ను, త‌మ ఊరు రావ‌ణ కాష్టం కావ‌డానికి కార‌ణ‌మైన పాత్ర‌ను కార్తీక్ బాగా చేశాడు. అత‌డి హావ‌భావ ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌శంస‌నీయం. పుష్ప పాత్ర‌లోని ముగ్ధ‌త్వాన్ని కృష్ణ‌ప్రియ బాగా ప్ర‌ద‌ర్శించింది. రామ‌న్న‌గా సాయికుమార్‌, ఎస్సైగా న‌వీన్ చంద్ర‌, ఊరి పెద్ద‌గా రంగ‌రాజు, ఈర‌న్న‌గా రాజా ర‌వీంద్ర పాత్ర‌ల ప‌రిధిలో ఒదిగారు. అజ‌య్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ఆమ‌ని, ప‌విత్రా లోకేశ్, దిల్ ర‌మేశ్ లాంటివాళ్లు ఓకే అనిపించారు. సుహాస్ ఒక సీన్‌లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్స్‌గా న‌టించిన స‌ద్దాం, మ‌రో ఇద్ద‌రు ఫ‌ర్వాలేదు. తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌ మంచి సీరియ‌స్ పాయింట్‌ను బ‌ల‌హీన‌మైన స‌న్నివేశాలు, క‌థ‌నంతో డిజ‌ప్పాయింట్‌మెంట్ క‌లిగించిన సినిమా 'అర్ధ శ‌తాబ్దం'.  రేటింగ్‌: 2/5 - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

బాల‌య్య కాలు కాలినా ప‌ట్టించుకోకుండా నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌మ‌న్న ఎన్టీఆర్‌!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు పేరు చెబితే ఎవ‌రికైనా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మొద‌టగా గుర్తుకొచ్చేది క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఆయ‌న న‌ట‌వార‌సుడు బాల‌కృష్ణ‌కు సైతం అది బాగా అల‌వ‌డింది. షూటింగ్ టైమ్‌లో జ‌న‌ర‌ల్‌గా సినిమాటోగ్రాఫ‌ర్స్ లైటింగ్ సెట్ చేసే స‌మ‌యంలో సీనిక్ మూడ్‌ను బ‌ట్టి లైట్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు. అప్పుడు యాక్ట‌ర్లు ఎక్క‌డ నిల్చుంటే వారి ముఖాల‌పై ఎలా లైటింగ్ ప‌డుతుందో టెస్ట్ చేస్తుంటారు. ఈ త‌ర‌హా టెస్టింగ్ టైమ్‌లో ఎవ‌రో ఒక‌ర్ని నిల్చోబెట్టి వారిపై లైటింగ్ బ్యాలెన్స్ చేస్తుంటారు. కానీ అటు ఎన్టీఆర్ కానీ, ఇటు బాల‌కృష్ణ కానీ.. వారే స్పాట్‌లో నిల్చొని ఎంత‌సేపైనా టెక్నీషియ‌న్స్‌కు స‌హ‌క‌రించేవారు. ఎన్టీఆర్.. 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర' (1991) తీస్తున్న రోజుల‌వి. ఆ మూవీలో హ‌రిశ్చంద్రునిగా, దుష్యంతునిగా డ్యూయ‌ల్ రోల్ పోషించారు బాల‌కృష్ణ‌. హ‌రిశ్చంద్రుని కాటికాప‌రి సీన్‌లో శవం పైకిలేస్తే, దానిని నొక్కిపెట్టి న‌టించాలి. శ‌వం కాలుతున్న‌ట్లు మంట‌లు పైకి లేవాలి. ఆ రోజుల్లో మంట‌లు లేచేందుకు ఇప్ప‌టి టెక్నిక్స్ లేవు. దాంతో నిజంగానే యూనిట్ మంట‌లు రాజేసింది. అనుకోకుండా ఆ మంట‌లు బాల‌య్య కాలును అంటుకున్నాయి. ఆయ‌న కాలు క‌మిలిపోయింది. కాలు విప‌రీత‌మైన మంట‌లు పుడుతుంటే అల్లాడిపోయారు. ఎన్టీఆర్ మాత్రం షాట్ బాగా వ‌చ్చింద‌ని ఆనందిస్తూ బాల‌య్య‌ను నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌మ‌న్నారు. పంటిబిగువున బాధ భ‌రిస్తూ షాట్‌కు రెడీ అయ్యి వ‌చ్చి, నొప్పి బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా న‌టించారు బాల‌య్య‌. త‌న బాధ‌ను ఆయ‌న తండ్రికి చెప్పుకోలేదు. ఆ సినిమాకు ఛాయాగ్రాహ‌కునిగా ప‌నిచేసింది బాల‌య్య అన్న‌య్య నంద‌మూరి మోహ‌న‌కృష్ణ‌. ఈ ఉదంతానికి ప్ర‌త్య‌క్ష సాక్షి ఆయ‌నే.

నాలుగు ర‌కాల సినిమాలు.. ఎన్టీఆర్ త‌ర్వాత ఆ మొన‌గాడు బాల‌య్య ఒక్క‌డే!

  మ‌హాన‌టుడు ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక.. నాలుగు త‌ర‌హా చిత్రాల్లోనూ రాణించిన‌, మెప్పించిన ఏకైక న‌టునిగా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయాన్ని సృష్టించారు, చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఆయ‌న త‌రం నుంచి ఈ నాలుగు ర‌కాల సినిమాల్లో న‌టించిన మ‌రో హీరో ఒక్క‌రు కూడా లేరు. ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే 'వేముల‌వాడ భీమ‌క‌వి' (1976)లో భీమ‌క‌విగా న‌టించ‌డం ద్వారా తొలిసారి ఓ చారిత్ర‌క పాత్ర‌ను పోషించారు బాల‌కృష్ణ‌. ఆ సినిమా ద‌ర్శ‌కుడు స్వ‌యంగా ఎన్టీఆర్‌. అలా చిన్న‌నాటే తండ్రి శిక్ష‌ణ‌లో రాటుదేలిన బాల‌య్య అనేక త‌ర‌హా పాత్ర‌లు పోషించి, ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న స‌లీమ్ (అక్బ‌ర్ స‌లీమ్ అనార్క‌లి - 1978), సిద్ధ‌య్య (శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చ‌రిత్ర - 1976), శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు (ఆదిత్య 369 - 1991) లాంటి చారిత్ర‌క పాత్ర‌లు చేశారు.  చేసింది ఒక‌టే జాన‌ప‌ద చిత్ర‌మైనా.. అది చరిత్ర సృష్టించిన 'భైర‌వ ద్వీపం' (1994) కావ‌డం విశేషం. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు రూపొందించిన ఆ సినిమా న‌టునిగానూ బాల‌య్య‌కు గొప్ప పేరు తీసుకొచ్చింది. అందులో కురూపిగా మారిన‌ప్పుడు ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టుకుంది. ప‌దహారేళ్ల‌ వ‌య‌సులో తొలిసారి ఓ పౌరాణిక పాత్ర చేశారు బాల‌కృష్ణ‌. తండ్రి ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'దాన‌వీర‌శూర క‌ర్ణ' (1977) చిత్రంలో అభిమ‌న్యుని పాత్ర పోష‌ణ‌తో చిచ్చ‌ర‌పిడుగు అనిపించుకున్నారు. ఆ త‌ర్వాత అదే పాత్ర‌ను శ్రీ‌మ‌ద్విరాట ప‌ర్వ‌ము (1979)లో చేసిన బాల‌య్య.. నార‌ద (శ్రీ తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర క‌ల్యాణం - 1979), హ‌రిశ్చంద్ర‌, దుష్యంత (బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర - 1991), శ్రీ‌కృష్ణ‌, అర్జున (శ్రీ కృష్ణార్జున విజ‌య‌ము - 1996), శ్రీ‌రామ (శ్రీ‌రామ‌రాజ్యం - 2011) పాత్ర‌లు పోషించారు. 'పాండురంగ‌డు' (2008) చిత్రంలోనూ ఆయ‌న శ్రీ‌కృష్ణునిగా క‌నిపించారు. ఇక సాంఘికాల విష‌యానికొస్తే.. తండ్రి పోషించ‌ని త‌ర‌హా ప‌లు పాత్ర‌లు పోషిస్తూ వ‌చ్చారు. తెలుగునాట ఫ్యాక్ష‌నిజానికి కూడా హీరో ఇమేజ్ తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌దే. 'స‌మ‌ర‌సింహారెడ్డి', 'న‌ర‌సింహ‌నాయుడు' సినిమాల‌తో ఆయ‌న రికార్డులు సృష్టించ‌డంతో మిగ‌తా స్టార్లు కూడా ఆ త‌ర‌హా పాత్ర‌లు పోషించారు.

విజ‌య‌శాంతి ఫైట్‌ కాదు, కావాలంటే నా ఫైట్ తీసేయండి.. అని చెప్పిన 'రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్'!

  మ‌హాన‌టుడు ఎన్టీఆర్ వార‌సుడు కావ‌డం బాల‌కృష్ణ‌కు ఓ అదృష్టం అయితే, ఎన్టీఆర్ ఇమేజ్ ఆయ‌న‌కు ఓ పెద్ద బ‌రువు. ఎన్టీఆర్ ఎన్నో ర‌కాల పాత్ర‌ల‌ను అవ‌లీల‌గా చేశారు. న‌వ‌ర‌సాల‌ను అవ‌లీల‌గా పోషించారు. దాంతో ఆయ‌న న‌ట‌న‌తో బాల‌య్య న‌ట‌న‌ను తూచేవారు. బాల‌య్య ఏ పాత్ర చేసినా, ఇంత‌కు ముందు ఇది ఎన్టీఆర్ చేసిందే క‌దా అనేవారు. ఇలాంటి ప‌రిస్థితి ఇత‌ర న‌ట‌వార‌సుల‌కు లేద‌నే చెప్పాలి. అయినా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ ఇప్ప‌టిదాకా నంద‌మూరి తార‌క‌రామారావు లెగ‌సీని కంటిన్యూ చేస్తూ వ‌చ్చారంటే తేలిగ్గా తీసేయ‌ద‌గ్గ విష‌యం కాదు.  సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన వెంట‌నే కొంత‌మంది స్టార్లు అమాంతం రెమ్యూన‌రేష‌న్ పెంచేస్తుంటారు. కానీ బాల‌య్య సినిమా కోసం నిర్మాత పెట్టే డ‌బ్బును దృష్టిలో వేసుకొని న‌టిస్తూ వ‌స్తున్నారు త‌ప్పితే, ఎప్పుడూ డ‌బ్బు కోసం ఆయ‌న ప‌నిచేస్తున్న‌ట్లు మ‌నం చూడ‌లేదు. అంతేకాదు, ఇత‌ర పాత్ర‌ల‌కు పేరొస్తుంద‌ని భావిస్తే కొంత‌మంది హీరోలు ద‌ర్శ‌కుల‌పై ఒత్తిడి తెచ్చి, ఆ పాత్ర‌ల నిడివిని త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. బాల‌య్య అలాంటి ప‌నులకు బ‌హు దూరం.  ఉదాహ‌ర‌ణ‌కు 'రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్' (1992) సినిమా ఉదంత‌మే తీసుకోవ‌చ్చు. ఆ మూవీలో హీరోయిన్ విజ‌య‌శాంతికి కూడా రెండు ఫైట్లు ఉన్నాయి. ఎడిటింగ్ సంద‌ర్భంలో వాటిలో ఓ ఫైట్‌ను తీసేయాల‌ని డైరెక్ట‌ర్ బి. గోపాల్ అనుకున్నారు. ఆ విష‌యం బాల‌య్య‌కు చెబితే, ఆయ‌న ఒప్పుకోలేదు. "ఆ అమ్మాయి అంత క‌ష్ట‌ప‌డి ఫైట్ చేస్తే తీసేయ‌డం న్యాయం కాదు, కావాలంటే నా ఫైట్స్‌లో ఒక‌టి తీసేయండి." అని చెప్ప‌డంతో గోపాల్ గ‌తుక్కుమ‌న్నారు. అదీ బాల‌య్య అంటే! ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.  దాన్ని త‌మిళంలో విజ‌య‌శాంతి క్యారెక్ట‌ర్‌ను హైలైట్ చేస్తూ 'ఆటోరాణి' పేరుతో రిలీజ్ చేసినా, బాల‌కృష్ణ ఏమాత్రం ఫీల‌వ‌లేదు. అలాగే హిందీలోనూ డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. విశేష‌మేమంటే ఈ మూడు భాష‌ల్లోనూ ఈ సినిమా సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకుంది. ఆ సినిమా త‌ర్వాత మ‌రే సినిమా ఈ రికార్డును సాధించ‌లేదు.

"అప్ప‌లు క‌ప్ప‌ల‌గును.. అన్న‌ము సున్న‌మ‌గును".. అంద‌రినోటా బాల‌య్య మాట‌!

  అన్ని విష‌యాల్లోనూ త‌న‌కు తండ్రి నంద‌మూరి తార‌క‌రామారావు ఆద‌ర్శ‌మ‌ని త‌ర‌చూ బాల‌కృష్ణ చెబుతుంటారు. తొమ్మిదో త‌ర‌గతి చ‌దువుతూ తొలిసారిగా 'తాత‌మ్మ క‌ల' సినిమాతో కెమెరా ముందుకు వ‌చ్చిన బాల‌య్య‌, ఆ త‌ర్వాత ఎన్టీఆర్ చిత్రాల్లోనే న‌టించారు. బాల‌కృష్ణ‌తో సినిమాలు చేయ‌డానికి బ‌య‌టి నిర్మాత‌లు ఎంతో ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించినా, చ‌దువు పాడ‌వుతుంద‌నే ఉద్దేశంతో ఎన్టీఆర్ అంగీక‌రించ‌లేదు. ఒక‌వైపు చ‌దువుకుంటూనే తీరిక ల‌భించిన‌ప్పుడ‌ల్లా సొంత సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చారు బాల‌య్య‌.  ఆ విధంగా వేముల‌వాడ భీమ‌క‌వి, దాన‌వీర‌శూర క‌ర్ణ‌, అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి, శ్రీ‌మ‌ద్విరాట‌ప‌ర్వం, శ్రీ తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర క‌ల్యాణం, అనురాగ‌దేవ‌త‌, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సింహం న‌వ్వింది చిత్రాల్లో తండ్రితో క‌లిసి న‌టించారు. 'సాహ‌స‌మే జీవితం'తో సోలో హీరోగా మార‌క ముందు ఆయ‌న బ‌య‌టి నిర్మాత‌ల‌కు చేసింది రెండే సినిమాలు. ఒక‌టి బాల‌న‌టుడిగా ఉన్న‌ప్పుడు అన్న‌య్య హ‌రికృష్ణ‌తో న‌టించిన 'రామ్‌-ర‌హీమ్‌', ఇంకొక‌టి ఎన్టీఆర్ త‌మ్మునిగా న‌టించిన 'అన్న‌ద‌మ్ముల అనుబంధం'. 1975, 76 ప్రాంతాల్లో సంయుక్త రాష్ట్రంలో ప్ర‌త్యేక రాష్ట్ర నినాదాలు మారుమోగుతున్న సంద‌ర్భంలో తెలుగువార‌మంతా ఒక్క‌టే అనే భావం జ‌నంలో క‌లగ‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఎన్టీఆర్ మ‌న‌సులో 'వేముల‌వాడ భీమ‌క‌వి' క‌థ మెదిలింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మ‌హాక‌వి వేముల‌వాడ భీమ‌క‌వి. ఆయ‌న చ‌రిత్ర‌ను అధ్య‌య‌నం చేసి, త‌నే క‌థ‌, స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చి, యోగానంద్ డైరెక్ష‌న్‌లో ఆ సినిమాని తీశారు. తాను ప్ర‌త్యేక పాత్ర పోషించి, బాల‌కృష్ణ‌తో టైటిల్ రోల్‌ను పోషింప‌జేశారు ఎన్టీఆర్‌.  న‌టునిగా అది బాల‌కృష్ణ‌కు కేవ‌లం నాలుగో చిత్రం. ప‌దిహేనేళ్ల వ‌య‌సులో భీమ‌క‌వి పాత్ర‌ను చ‌క్క‌గా పోషించారు బాల‌య్య‌. ఆ సినిమాలో "అప్ప‌లు క‌ప్ప‌ల‌గును.. అన్న‌ము సున్న‌మ‌గును.." అంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్‌కు థియేట‌ర్లో చ‌ప్ప‌ట్లు మిన్నుముట్టాయి. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా జ‌నం ఆ డైలాగ్‌ని చాలా కాలం చెప్పుకుంటూ వ‌చ్చారంటే, దాని ప్ర‌భావం ఎంత‌గా పడిందో ఊహించుకోవాల్సిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'వేముల‌వాడ భీమ‌క‌వి' ప‌రాజ‌యం పాల‌యినా, బాల‌కృష్ణ న‌ట‌న‌, ఆయ‌న చెప్పిన డైలాగులు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి.

బాల‌కృష్ణ‌ ల‌వ‌ర్ బాయ్‌గా అల‌రించిన‌ 'సీతారామ క‌ల్యాణం' విశేషాలెన్నో!

  నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లోని చ‌క్క‌ని చిత్రాల్లో 'సీతారామ క‌ల్యాణం' ఒక‌టి. ఆయ‌న న‌టించిన అతికొద్ది ప్రేమ‌క‌థాచిత్రాల్లో ఇదొక‌టి. జూన్ 10 బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆ సినిమా విశేషాల‌ను చెప్పుకుందాం. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో ఇది ఆయ‌న న‌టించిన రెండో చిత్రం. ఇదివ‌ర‌కు వారి క‌ల‌యిక‌లో 'బాబాయ్ అబ్బాయ్' లాంటి హాస్య చిత్రం వ‌చ్చింది. 'సీతారామ‌ క‌ల్యాణం' సినిమాలో బాల‌కృష్ణ‌, ర‌జ‌ని జోడీ చాలా ముచ్చ‌ట‌గా ఉంద‌నే పేరు వ‌చ్చింది. ల‌వ‌ర్ బాయ్‌గా బాల‌య్య అల‌రించారు. నిజానికి హీరోయిన్‌గా మొద‌ట అనుకున్న పేరు భానుప్రియ‌. కానీ చివ‌రి నిమిషంలో ఆ పాత్ర ర‌జ‌నికి ద‌క్కింది. వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఓ వార్త ఆధారంగా ఈ సినిమా క‌థ‌ను అల్లారు. సీతారాముల విగ్ర‌హాల‌కి సంబంధించి రెండు గ్రామాల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తే, క‌లెక్ట‌ర్ మీడియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి ఆ రెండు గ్రామాల మ‌ధ్య గుడి క‌ట్టించి, సీతారాముల విగ్ర‌హాల‌ను అందులో ప్ర‌తిష్ఠించార‌నేది ఆ వార్త‌లోని ప్ర‌ధానాంశం. క‌థాచ‌ర్చ‌లు ఐదారు నెల‌ల పాటు నిర్మాత మురారి ఆఫీసులో జ‌రిగాయి. మురారి, జంధ్యాల‌తో పాటు ర‌చ‌యిత భ‌మిడిపాటి రాధాకృష్ణ సైతం ఆ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. త‌న గ‌త చిత్రాల‌కు భిన్నంగా జంధ్యాల ఈ చిత్రాన్ని రూపొందించారు. అదివ‌ర‌కు ఆయ‌న సీరియ‌స్ డ్రామాతో ప్రేమ‌క‌థ‌ను తియ్య‌లేదు. అంతేకాదు, త‌న మునుప‌టి చిత్రాల‌కు డైలాగ్స్‌ను వేరే ర‌చ‌యిత‌ల‌తో క‌లిసి రాస్తూ వ‌చ్చిన ఆయ‌న ఈ చిత్రానికి పూర్తి సంభాష‌ణ‌ల‌ను త‌నే రాశారు. బాల‌కృష్ణ‌కు ఆయ‌న రాసిన డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని బాగా అల‌రించాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీక‌రించింది జంధ్యాల కాదు, ఆయ‌న ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌. గురువు ప్రోత్స‌హించ‌డంతో ఆయ‌న ఆ క్లైమాక్స్‌ను చ‌క్క‌గా తీసి, భ‌విష్య‌త్తులో గురువు పేరును నిల‌బెట్టిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కె.వి. మ‌హ‌దేవ‌న్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ర‌స‌గుళిక‌లే. ప్ర‌ధానంగా ఆత్రేయ రాసిన పాట‌లు ఇప్ప‌టికీ జ‌నం నోళ్ల‌లో నానుతూనే ఉంటాయి. "రాళ్ల‌ల్లో ఇసుక‌ల్లో రాశాను ఇద్ద‌రి పేర్లు", "వీళ్లూ వాళ్లూ ఎవ‌రంట నువ్వూ నేనూ ఒక‌టంట‌", "క‌ల్యాణ వైభోగ‌మే శ్రీ సీతారాముల క‌ల్యాణ‌మే", "ఎంత నేర్చినా ఎంత చూసినా" పాట‌ల‌ను ఆత్రేయ రాశారు. "ఎంత నేర్చినా" అనేది త్యాగ‌రాజ కృతి. దాని ఆధారంగా ఈ సినిమాలో "ఎంత నేర్చినా ఎంత చూసినా" పాట‌ను రాశారు ఆత్రేయ‌. ర‌జ‌నీని క‌లుసుకోవ‌డానికి సంగీతం మేస్టారు వేషంలో ఆమె ఇంటికి వ‌చ్చిన బాల‌కృష్ణ ఆమెకు పాట నేర్పే స‌న్నివేశంలో ఈ పాట వ‌స్తుంది. ఈ పాట‌లో సీతారాములు, పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రులు గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు బాల‌కృష్ణ‌, ర‌జ‌ని.  "క‌ల్యాణ వైభోగ‌మే" పాట‌ను గోదావ‌రి మ‌ధ్య‌లో ఉండే ఇసుక లంక‌ల‌పై ఎల‌క్ట్రిక‌ల్ బ‌ల్బులు అమ‌ర్చి 5 రాత్రుళ్లు బాల‌య్య‌, ర‌జ‌ని జంట‌పై చిత్రీక‌రించారు. 140 మంది ఎల‌క్ట్రీషియ‌న్లు ఈ పాట సెట్టింగ్‌ల కోసం ప‌నిచేశారంట‌.  ప‌ద్నాలుగు సంవ‌త్స‌రాల క్రితం విడిపోయిన సీతారాముల విగ్ర‌హాలతో పాటుగా హీరో హీరోయిన్లు క‌లుసుకోవ‌డం అనే పాయింట్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చేసి, 'సీతారామ క‌ల్యాణం'కు ఘ‌న విజ‌యం చేకూర్చిపెట్టారు. 1986 ఏప్రిల్ 18న విడుద‌లైన‌ ఈ సినిమా 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.