నాలుగో క్లాస్‌లోనే లెజండ‌రీ యాక్ట‌ర్ల ముందు పాడి అద‌ర‌గొట్టిన 'వందేమాత‌రం' శ్రీ‌నివాస్‌!

  'వందేమాత‌రం' శ్రీ‌నివాస్ అంటే నేటి యంగ్ జ‌న‌రేష‌న్‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. ఆయ‌నా.. ఔట్‌డేటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని చ‌ప్ప‌రించేయ‌వ‌చ్చు. మూడు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, మూడు సార్లు బెస్ట్ సింగ‌ర్‌గా నంది అవార్డులు అందుకున్న వందేమాత‌రం శ్రీ‌నివాస్ అంటే.. ఒక‌ప్పుడు సింగింగ్ సునామీ! త‌న పాట‌తో సంగీత‌ప్రియుల ర‌క్తాన్ని స‌ల‌స‌లా మ‌రిగించిన విప్ల‌వ త‌రంగం! త‌న గొంతుతో వేలాది గొంతుల‌కు ప్రేర‌ణ‌నిచ్చిన ఒక మ‌హోద్వేగం! కాలేజీ కుర్ర‌వాడా.. (స్వ‌రాజ్యం), అత్తా పోదాము రావే స‌ర్కారు ద‌వాఖాన‌కి (నేటి భార‌తం), వందేమాత‌ర గీతం వ‌ర‌స మారుతున్న‌ది (వందేమాత‌రం), బండెల్లిపోతోందే సెల్లెలా.. (ఇదా ప్ర‌పంచం), అయ్యా నే స‌దివి బాగుప‌డ‌తా (రేప‌టి పౌరులు) , ల‌బోదిబో ల‌బ్జ‌న‌క‌ర (ప్ర‌జాస్వామ్యం), రాములమ్మో ఓ రాముల‌మ్మా (ఒసేయ్ రాముల‌మ్మా), మ‌ల్లెతీగ‌కు పందిరివోలె (ఒరేయ్ రిక్షా), ఎర్ర‌జెండెర్ర‌జెండ‌ర్ర‌జెండ‌న్నీయ‌లో (చీమ‌ల‌దండు) లాంటి పాట‌ల‌తో వందేమాత‌రం శ్రీ‌నివాస్ సృష్టించిన అల‌జ‌డి సామాన్య‌మైంది కాదు. ఆ రోజుల్లో శ్రీ‌నివాస్ పాడాడంటే శ్రోత‌లు మైమ‌ర‌చి పోవాల్సిందే. ప్రేక్ష‌కుల్లో థియేట‌ర్ల‌లో కుర్చీలు ఉద్వేగంతో ఊగిపోవాల్సిందే!. ఒంగోలులో సి.య‌స్‌.ఆర్‌. శ‌ర్మ కాలేజీలో బీఏ చ‌దివి, నెల్లూరులో బీఎల్ ప‌ట్టా పుచ్చుకున్న శ్రీ‌నివాస్ ప్ర‌జా నాట్య‌మండ‌లి ఆస్థాన గాయ‌కుడు. చిన్న‌త‌నంలోనే ప్రజానాట్య మండ‌లి గాయ‌కుడు కావ‌డానికీ, నెల్లూరులో బీఎల్ చ‌ద‌వ‌డానికీ, మ‌ద్రాసుకు సినిమాల్లో పాడేందుకు వెళ్ల‌డానికీ ఒక క‌థ ఉంది. ఆ క‌థ వెనుక ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి మొండిత‌నం ఉంది. అది.. 1975 న‌వంబ‌ర్‌. ఖ‌మ్మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానాట్య‌మండ‌లి శిక్ష‌ణా శిబిరం జ‌రుగుతోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌లుమూల‌ల నుంచీ దాదాపు 200 మంది ఔత్సాహిక క‌ళాకారులు పాట‌లు నేర్చుకోవ‌డానికి ఆ శిబిరానికి వ‌చ్చారు. ఖ‌మ్మం స‌మీపంలోని రామ‌కృష్ణాపురం అనే ఊళ్లో పుట్టిపెరిగిన శ్రీ‌నివాస్ అప్పుడు నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆ శిబిరం గురించి విన్నాడు. అక్క‌డ పాడాల‌ని అనుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వు, త‌మ ఊరి నుంచి ఖ‌మ్మంకు వెళ్లాడు. తానూ పాడ‌తాన‌ని అన్నాడు. కానీ అక్క‌డి కార్య‌క‌ర్త‌లు నిక్క‌రు తొడుక్కున్న ఈ బుడ‌త‌డు పాడ‌తాడా అన్న‌ట్లు చూసి, అత‌డిని ప‌ట్టించుకోలేదు. కానీ ప‌ట్టుద‌ల‌గా మూడు రోజులు అక్క‌డే ఉన్నాడు శ్రీ‌నివాస్‌.  మూడో రోజు ఉద‌యం అనుకోకుండా అత‌నికి అక్క‌డ పాడే అవ‌కాశం దొరికింది. ప్రోగ్రామ్‌లో కొంత ఖాళీ ఏర్ప‌డింది. దాన్ని భ‌ర్తీ చెయ్య‌డానికి "ఎవ‌రైనా పాడేవాళ్లుంటే రండి" అని నిర్వాహ‌కులు ఆహ్వానించారు. మ‌ళ్లీ ఈలోపు ఎవ‌రైనా వ‌స్తే ఆ చాన్స్ పోతుందేమో అనే కంగారుతో ప‌రుగెత్తుకుంటూ వెళ్లి మైక్ ప‌ట్టుకున్నాడు శ్రీ‌నివాస్‌. హై పిచ్‌లో ఆ పిల్లాడు పాడుతుంటే అక్క‌డున్న‌వాళ్లంతా ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌య్యారు. ప్రేక్ష‌కుల్లో నాగ‌భూష‌ణం, జ‌మున‌, అల్లు రామ‌లింగ‌య్య‌, రాజ‌బాబు లాంటి మ‌హామ‌హులున్నారు. అప్పుడు శ్రీ‌నివాస్‌ పాడిన పాట ఏమిటో తెలుసా? 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంలో శ్రీ‌శ్రీ రాసిన "తెలుగువీర లేవ‌రా.." పాట‌. దాన్నెలా పాడాలో అత‌నికెవ‌రూ నేర్పించ‌లేదు. ఆ సినిమాని 15 సార్లు చూసి, ఆ పాట నేర్చుకున్నాడు.  ప్ర‌జానాట్య‌మండ‌లి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లుకు శ్రీ‌నివాస్ వాయిస్ తెగ న‌చ్చేసింది. "నాతో వ‌స్తావా?" అన‌డిగారు. "నాకు పాట నేర్పిస్తానంటే త‌ప్ప‌కుండా వ‌స్తానండీ" అన్నాడు శ్రీ‌నివాస్‌. దివంగ‌తులు టి. కృష్ణ‌, మాదాల రంగారావు లాంటి వాళ్ల‌కే గురువైన న‌ల్లూరి అప్ప‌ట్నుంచీ శ్రీ‌నివాస్‌కూ గురువ‌య్యారు. శ్రీ‌నివాస్ చ‌దువు సంధ్య‌ల బాధ్య‌త‌లు చూసుకుంటూనే, అత‌డిని గాయ‌కుడిగా తీర్చిదిద్దారు. అందుకే, "నాకు జ‌న్మ‌నిచ్చింది నా త‌ల్లితండ్రులైనా, చ‌దువు చెప్పించిందీ, సంస్కారం నేర్పిందీ న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లుగారే." అని విన‌మ్రంగా చెబుతారు శ్రీ‌నివాస్‌. మాదాల రంగారావు న‌టించి, నిర్మించిన 'స్వ‌రాజ్యం' చిత్రంతో సినీ గాయ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు శ్రీ‌నివాస్‌. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ, త‌న‌దైన ప్ర‌త్యేక టిపిక‌ల్ వాయిస్‌తో గాయ‌క‌లోకంలో ఒక ప్ర‌భంజ‌న‌మే సృష్టించాడు. 'వందేమాత‌రం' సినిమాకు పాడిన పాట‌ల‌తో వ‌చ్చిన పేరుతో ఆయ‌న పేరు 'వందేమాత‌రం' శ్రీ‌నివాస్‌గా మారిపోయింది.

అన‌సూయ‌ నుంచి ప్ర‌దీప్ దాకా.. బాగా చ‌దువుకున్న ఆరుగురు టీవీ యాంక‌ర్స్!

  తెలుగు టెలివిజ‌న్‌పై చాలామంది యాంక‌ర్లు ప‌నిచేస్తున్నారు. వారిలో కొంత‌మందికి స్టార్ యాక్ట‌ర్ల‌తో స‌మాన‌మైన ఇమేజ్ వ‌చ్చిందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సుమ‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, ప్ర‌దీప్ మాచిరాజు, ర‌ష్మీ గౌత‌మ్, సుడిగాలి సుధీర్ లాంటివాళ్లు స్టార్ యాంక‌ర్స్‌గా రాజ్యం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వాళ్ల‌కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాళ్ల ఫాలోయ‌ర్స్‌తో పోలిస్తే, అనేక‌మంది హీరోల ఫాలోయ‌ర్స్ సోష‌ల్ మీడియాలో త‌క్కువ‌గా ఉండ‌టం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ యాంక‌ర్ల‌లో కొంత‌మంది ఉన్న‌త విద్యావంతులు కాగా, కొంత‌మంది ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఏ యాంక‌ర్ ఏం చ‌దువుకున్నారో ఓసారి చూద్దామా.. సుమ క‌న‌కాల‌ 'క‌ల్యాణ ప్రాప్తిర‌స్తు' (1996) సినిమాతో న‌టిగా కెరీర్ ఆరంభించిన సుమ త‌ర్వాత టీవీ రంగానికి మారారు. స్టార్ మ‌హిళ హోస్ట్‌గా స్టార్ యాంక‌ర్ స్టేట‌స్ పొందారు. స్వ‌రాభిషేకం షోకు ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రించిన ఆమె క్యాష్‌, భ‌లే చాన్స్ లే, జీన్స్‌, బిగ్ సెల‌బ్రిటీ చాలెంజ్‌, స్టార్ట్ మ్యూజిక్ లాంటి షోల‌తో తిరుగులేని యాంక‌ర్‌గా రాణిస్తున్నారు. ఆమె ఎంకామ్ చ‌దువుకున్నారు. ఝాన్సీ సినీ న‌టిగా కెరీర్ ఆరంభించిన ఝాన్సీ ఓవైపు టీవీ యాంక‌ర్‌గా, ఇంకోవైపు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. టాక్ ఆఫ్ ద టౌన్‌, సండే సంద‌డి, కో అంటే కోటి, ల‌క్కు కిక్కు, స్టార్ట్ మ్యూజిక్ లాంటి షోల‌తో వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఝాన్సీ వీఐటీ (వెల్లూర్‌) నుంచి బీటెక్ (కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌) చేశారు. ఉద‌య‌భాను 'ఎర్ర‌సైన్యం' (1994) సినిమాతోటే న‌టిగా కెరీర్ మొద‌లుపెట్టిన ఉద‌య‌భాను ఆ త‌ర్వాత అటు సినిమాలు, ఇటు టీవీ షోల‌తో పాపుల‌ర్ అయ్యారు. హృద‌యాంజ‌లి, ఒన్స్ మోర్ ప్లీజ్‌, తీన్‌మార్‌, రేలా రే రేలా, రంగం, ఢీ, పిల్ల‌లు పిడుగులు, నీతోనే డాన్స్ లాంటి షోలు ఆమెను టాప్ యాంక‌ర్ల‌లో ఒక‌రిని చేశాయి. ఆమె ఎంఏ చ‌దివారు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్  సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంట‌ర్‌గా కెరీర్ ఆరంభించిన అన‌సూయ 2013లో జ‌బ‌ర్ద‌స్త్ షోకు యాంక‌ర్‌గా మార‌డంతో ఆమె కెరీర్ స్వ‌రూప‌మే మారిపోయింది. మోడ్ర‌న్ మహాలక్ష్మి, ఎ డేట్ విత్ అన‌సూయ‌, జాక్‌పాట్‌, డ్రామా జూనియ‌ర్స్‌, రంగ‌స్థ‌లం లాంటి షోలతో మోస్ట్ గ్లామ‌ర‌స్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ ఆమె మంచి వేషాలు వేస్తున్నారు. ఆమె హైద‌రాబాద్‌లోని బ‌ద్రుకా కాలేజ్‌లో ఎంబీఏ ప‌ట్ట‌భ‌ద్ర‌రాలు. ప్ర‌దీప్ మాచిరాజు  'కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా' షోతో పాపుల‌ర్ అయిన ప్ర‌దీప్ ఇవాళ టాప్ మేల్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ సెల‌బ్రిటీ చాలెంజ్‌, అదుర్స్‌, ఢీ, పెళ్లిచూపులు, కిక్‌, డ్రామా జూనియ‌ర్స్‌, ల‌క్ష్మీదేవి త‌లుపుత‌డితే లాంటి షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌దీప్ ప‌దేళ్ల క్రితం నుంచే అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తూ వ‌స్తున్నాడు. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?'  సినిమాతో హీరోగా మారిన అత‌ను విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌లో బీటెక్ చేశాడు. యాంక‌ర్ లాస్య  ర‌వితో క‌లిసి చేసిన 'స‌మ్‌థింగ్ స్పెష‌ల్' షోతో పాపుల‌ర్ అయ్యింది లాస్య‌. మొండిమొగుడు పెంకిపెళ్లాం, ఢీ షోలు ఆమెకు పేరు తెచ్చాయి. కొన్ని సినిమాల్లోనూ న‌టించిన లాస్య కొంత కాలం విరామంతో మ‌ళ్లీ వ‌చ్చిన ఆమె మ‌రోసారి ర‌వితో క‌లిసి 'కామెడీ స్టార్స్‌'కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. సీబీఐటీ నుంచి ఆమె బీటెక్ చేసింది. మిగ‌తా యాంక‌ర్స్‌లో ర‌వి, ర‌ష్మీ గౌత‌మ్‌, ఓంకార్‌, హ‌రితేజ‌, శ్యామ‌ల‌, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ డిగ్రీ హోల్డ‌ర్లు కాగా, సుడిగాలి సుధీర్ మాత్రం ఫ్యామిలీకి స‌పోర్ట్‌గా ఉండాల‌ని ఇంట‌ర్మీడియేట్‌తోటే చ‌దువు ఆపేసి, ఉద్యోగంలో చేరిపోయాడు.

'వీరాభిమ‌న్యు'లో సెట్స్ మీదే శోభ‌న్‌బాబును తీసేద్దామ‌న్న నిర్మాత డూండీ!

  అందాల న‌టుడు దివంగ‌త శోభ‌న్‌బాబు కెరీర్‌లో తొలి మైలురాయిగా నిలిచిన చిత్రం 'వీరాభిమన్యు' (1965). వి. మ‌ధుసూద‌న‌రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని రాజ‌ల‌క్ష్మీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుంద‌ర్‌లాల్ న‌హ‌తా, డూండీ క‌లిసి నిర్మించారు. శ్రీ‌కృష్ణునిగా ఎన్టీఆర్‌, అర్జునునిగా కాంతారావు న‌టించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను శోభ‌న్‌బాబు, ఆయ‌న భార్య ఉత్త‌ర‌గా కాంచ‌న న‌టించారు. శోభ‌న్‌, కాంచ‌న‌ల‌కు జంట‌గా ఇదే తొలి చిత్రం. 'కాద‌లిక్క‌నేర‌మిల్లై' (త‌మిళం) చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన కాంచ‌న తొలి తెలుగు చిత్రం 'వీరాభిమన్యు' అయినా, ముందుగా విడుద‌లైంది మాత్రం అక్కినేని స‌ర‌స‌న న‌టించిన‌ 'ప్రేమించి చూడు' చిత్రం. 'వీరాభిమ‌న్యు' సినిమా ఏక కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మాణ‌మైంది. రెండు భాష‌ల్లోనూ ఉత్త‌ర పాత్ర‌ను కాంచ‌న పోషించారు. త‌మిళంలో అభిమన్యుడి పాత్ర‌ను ఎ.వి.ఎం. రాజ‌న్ చేశారు. అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహంలోకి ప్ర‌వేశించే ముందు ఒక కీల‌క స‌న్నివేశాన్ని శోభ‌న్‌బాబు మీద చిత్రీక‌రించ‌డానికి రెండు రోజులు ప‌ట్టింది. శోభ‌న్‌బాబు అప్పుడ‌ప్పుడే ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న ఎంతో శ్ర‌మ‌ప‌డి న‌టిస్తున్న‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ ఆశించిన ఎఫెక్ట్ రావ‌ట్లేదు. ఎప్ప‌టికీ టేక్ ఓకే అవ‌డం లేదు. పైగా ఆ టైమ్‌లో శోభ‌న్ జ్వ‌రంతో ఉన్నారు.  చివ‌ర‌కు నిర్మాత డూండీకి విసుగొచ్చేసింది. "మ‌రి లాభంలేదు. ఈ కుర్రాడు వ‌ద్దు.. చేయ‌లేడు. ఈ పాత్ర‌కు ఇంకెవ‌రిన‌న్నా వేసుకుందాం" అన్నారు. అప్పుడు అక్క‌డున్న‌వాళ్లంతా, "అయ్య‌య్యో పాపం.. అంత‌ప‌ని చేస్తే ఎలా.. కుర్రాడి భ‌విష్య‌త్తు దెబ్బ‌తింటుంది. అత‌ని లైఫ్ పోతుంది. మ‌రో చాన్స్ ఇచ్చి చూడండి" అని చెప్పారు. మ‌రుస‌టిరోజు మ‌ళ్లీ అదే స‌న్నివేశాన్ని శోభ‌న్ మీద చిత్రీక‌రించారు. ఈ సారి డైరెక్ట‌ర్ అనుకున్న ఎఫెక్ట్‌ను ఆయ‌న ఇవ్వ‌గ‌లిగారు. షాట్ ఓకే అయ్యింది. అంత‌గా శ్ర‌మ‌ప‌డి చేసినందుకు ఫ‌లితం ద‌క్కింది. ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, శోభ‌న్‌బాబుకు చాలా మంచి పేరొచ్చింది. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా కాంచ‌న పంచుకున్నారు.

జంధ్యాల సినిమాలో హీరోయిన్‌గా చెయ్య‌న‌ని తెగేసి చెప్పిన అమ్మాయి!

  ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కునిగా జంధ్యాల‌కు ఎంత పేరుందో, మంచి మ‌నిషిగా అంత‌కంటే ఎక్కువ పేరుంది. ఆయ‌నేమైనా ట్ర‌బుల్స్ ప‌డ్డారేమో కానీ, ఎవ‌రికీ ఎప్పుడూ ట్రబుల్స్ ఇచ్చిన దాఖ‌లాలు లేవు. రైట‌ర్‌గా ఎంతో గిరాకీ ఉన్న ఆయ‌న బోల్డ్ స్టెప్ తీసుకొని 'ముద్ద‌మందారం' (1981) చిత్రంతో ద‌ర్శ‌కునిగా మారారు. 'నాలుగు స్తంభాలాట' (1982) సినిమా ద‌ర్శ‌కునిగా ఆయ‌న‌ను ఓ మెట్టుపైకెక్కించింది. దాని త‌ర్వాత ఆయ‌న వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతూనే రైట‌ర్‌గానూ ప‌నిచేస్తూ వ‌చ్చారాయ‌న‌. సినిమాకి ఉన్న గ్లామ‌ర్ అంద‌రికీ తెలుసు. సినిమా ప్ర‌పంచంలోకి రావాల‌ని, ఎలాగో అలా తెర‌మీద త‌న పేరు ప‌డితే చాల‌ని, మొహం క‌నిపిస్తే చాల‌నుకొనేవాళ్లు కృష్ణాన‌గ‌ర్ ఏరియాలో కొల్ల‌లుగా క‌నిపిస్తారు. 'ముద్ద మందారం' చిత్రంలో హీరోయిన్ వేషం కోసం అమ్మాయిని సెల‌క్ట్ చేయ‌డానికి జంధ్యాల ఎన్నో ఊర్లు తిరిగారు. ఎంతోమందిని చూశారు. అలా తిరుగుతుండ‌గా ఓ ఊరిలో ఆయ‌న‌కు ఒక అమ్మాయి క‌నిపించింది. చూసీ చూడ‌గానే "ఈ అమ్మాయే నా ముద్ద మందారం" అనుకున్నారు. వెంట‌నే ఆ ఊళ్లోని కొంద‌రు పెద్ద‌మ‌నుషుల సాయంతో ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల్ని క‌లిశారు జంధ్యాల‌.  వాళ్లు త‌మ కూతుర్ని సినిమాల్లోకి పంప‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఎలాగైతేనేం వాళ్ల‌ను క‌న్విన్స్ చేసి ఒప్పించారు జంధ్యాల‌. కానీ అంత‌లోనే హ‌ఠాత్తుగా వాళ్ల మ‌ధ్య‌కు ఆ అమ్మాయి వ‌చ్చింది. "సార్‌.. న‌న్ను క్ష‌మించండి. నేను మీ సినిమా చేయ‌ను. అస‌లు నేను సినిమాల్లోకి రాను." అని చెప్పేసింది. జంధ్యాల ఆశ్చ‌ర్య‌పోయి, "ఫ‌ర్వాలేద‌మ్మా.. నీకేం కాదు, మీ అమ్మానాన్న‌లు కూడా ఒప్పుకున్నారు క‌దా." అని న‌చ్చ‌జెప్ప‌బోయారు. అయినా ఆ అమ్మాయి స‌సేమిరా అంది. పెద్ద‌మ‌నుషులు కూడా ఆమెను ఒప్పించాల‌ని చూశారు. "సార్‌.. మా అమ్మానాన్న‌లు తెచ్చిన సంబంధం చేసుకొని హాయిగా సంసారం చేసుకుందామ‌ని అనుకుంటున్నాను. అది మీకిష్టం లేదా?" అని అడిగింది ఆ అమ్మాయి. జంధ్యాల స‌హా అక్క‌డున్నవాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. జంధ్యాల ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని, అక్క‌డ్నుంచి వ‌చ్చేశారు. తిరిగి అన్వేష‌ణ‌లో ప‌డి, ఎట్ట‌కేల‌కు పూర్ణిమ‌ను 'ముద్ద‌మందారం'గా సెల‌క్ట్ చేశారు. ఇది ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా జంధ్యాల స్వ‌యంగా చెప్పిన విష‌యం.

రామానాయుడు, విజ‌య‌నిర్మ‌ల భార్యాభ‌ర్త‌లుగా న‌టించార‌ని మీకు తెలుసా?

  అవును. ఆ సినిమా పేరు 'పాప‌కోసం'. 1968లో వ‌చ్చిన ఆ సినిమాని రామానాయుడు స్వ‌యంగా నిర్మించారు. దొంగ‌ల్లోనూ మాన‌వ‌త్వం ఉంటుంద‌ని చెప్పే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌లో అదివ‌ర‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన జి.వి.ఆర్‌. శేష‌గిరిరావు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. జ‌మీందారు మోహ‌న‌రావు ఇంట్లో అర్ధ‌రాత్రి పూట ప్ర‌వేశించి, జ‌మీందారు స‌హా ఆ ఇంట్లో క‌నిపించిన వాళ్లంద‌ర్నీ కాల్చేసి, ఆ జ‌మీందారు నాలుగేళ్ల పాప‌ను త‌మ‌తో పాటు తీసుకువెళ్లిన ముగ్గురు దొంగ‌ల క‌థ ఈ సినిమా. మూడు భిన్న‌మ‌తాల‌కు చెందిన జోసెఫ్‌, కిష్ట‌య్య‌, హుస్సేన్ అనే ఆ ముగ్గురు దొంగ‌లుగా స‌త్య‌నారాయ‌ణ‌, త్యాగ‌రాజు, రామ‌దాసు న‌టించ‌గా, పాప‌గా బేబి రాణి న‌టించింది. ఈ పాపే సినిమా చివ‌ర‌లో పెద్ద‌దై పెళ్లి చేసుకుంటుంది. ఆ పాత్ర‌ను విజ‌య‌నిర్మ‌ల పోషించ‌గా, ఆమె పెళ్లాడే వ్య‌క్తిగా రామానాయుడు న‌టించారు. ఆ ఇద్ద‌రివీ అతిథి పాత్ర‌లే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకో నిజ‌మైన విశేష‌మేమంటే, విజ‌య‌నిర్మ‌ల తండ్రి పాత్ర‌ను ఆ త‌ర్వాత కాలంలో ఆమె భ‌ర్త అయిన సూప‌ర్‌స్టార్ కృష్ణ చేయ‌డం. కాక‌పోతే విజ‌య‌నిర్మ‌ల చిన్న‌ప్ప‌టి పాత్రకే ఆయ‌న స‌న్నివేశాలు ప‌రిమిత‌మ‌య్యాయి. జ‌మీందారు మోహ‌న‌రావు పాత్ర‌ను చేసింది ఆయ‌నే. ఒక పాట‌లో, త‌ర్వాత దొంగ‌ల చేతిలో హ‌త్య‌కు గుర‌య్యే స‌న్నివేశంలో మాత్ర‌మే ఆయ‌న క‌నిపిస్తారు. వీళ్ల‌తో పాటు జ‌గ్గ‌య్య‌, రాజ‌బాబు, వెన్నిరాడై నిర్మ‌ల‌, రేలంగి, గీతాంజ‌లి సైతం అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాలో పెండ్యాల సంగీతం స‌మ‌కూర్చ‌గా, ఆత్రేయ రాసిన "కొండ‌ల‌పైన కోన‌ల‌లోన.. గోగులుపూచే జాబిలి" పాట బాగా పాపుల‌ర్ అయ్యింది. హైద‌రాబాద్‌లోని క‌మ‌ల్ టాకీస్‌లో 'పాప‌కోసం' చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించి, వ‌చ్చిన రూ. 30 వేల‌ను పోలీసు కుటుంబాల సంక్షేమ‌నిధికి రామానాయుడు విరాళంగా ఇచ్చారు.

రోడ్ యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన ఈ నంద‌మూరి న‌టుడ్ని గుర్తుప‌డ‌తారా?

  నంద‌మూరి వంశానికి రోడ్ యాక్సిడెంట్లు ఓ శాపంలా మారాయ‌నిపిస్తుంది. అనేక సంద‌ర్భాల్లో ఆ వంశానికి చెందిన‌వారు యాక్సిడెంట్ల‌కు గుర‌య్యారు. కొద్దిమంది గాయాల‌తో ప్రాణాలు ద‌క్కించుకుంటే, కొంత‌మంది ప్రాణాలు అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. 2018లో నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతే, ఆయ‌న పెద్ద కుమారుడు జాన‌కిరామ్ ఆయ‌న కంటే ముందే 2014లో అదే త‌ర‌హా రోడ్ యాక్సిడెంట్‌లో మృత్యువాత ప‌డ్డారు. నంద‌మూరి తార‌క‌రామారావు పెద్ద కుమారుడు రామ‌కృష్ణ యాక్సిడెంట్‌లో చ‌నిపోగా, అదే పేరు పెట్టుకున్న మ‌రో కుమారుడు చావు చివ‌రి అంచుదాకా వెళ్లి బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. ఎన్టీఆర్ తండ్రి ల‌క్ష్మ‌య్య చౌద‌రి సైతం ప్ర‌మాదంలోనే మృతి చెందారు. బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ల‌కు గురైనా గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వీళ్లే కాదు ఎన్టీఆర్ త‌మ్ముడు త్రివిక్ర‌మ‌రావు కుటుంబం సైతం రోడ్ యాక్సిడెంట్ల బాధితులు కావ‌డం గ‌మ‌నార్హం. స్వ‌యంగా త్రివిక్ర‌మ‌రావు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డితే, అదే యాక్సిడెంట్‌లో ఆయ‌న చిన్న‌కుమారుడు హ‌రీన్ చ‌క్ర‌వ‌ర్తి మృతి చెందారు. అలాగే పెద్ద కుమారుడు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు పృథ్వీ చ‌క్ర‌వ‌ర్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌ర‌హాలోనే హ‌రీన్ చ‌క్ర‌వ‌ర్తి కూడా న‌ట‌న మీద ఆస‌క్తితో అన్న హీరోగా న‌టించిన 'మామాకోడ‌ళ్ల స‌వాల్' (1986) మూవీలో ఓ విభిన్న పాత్ర‌లో న‌టించాడు. నిజానికి ఎన్టీఆర్ 'మ‌నుషుల్లో దేవుడు' (1974) సినిమాలో క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు హ‌రీన్ కూడా బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌మైన‌వాడే. పెద్ద‌య్యాక రేలంగి న‌ర‌సింహారావు డైరెక్ట్ చేసిన 'పెళ్లికొడుకులొస్తున్నారు' చిత్రంతో హీరో అయ్యాడు. అందులో య‌మ‌ధ‌ర్మ‌రాజు గెట‌ప్ కూడా వేశాడు. జ్వ‌రంతోటే ఆ గెట‌ప్‌పై నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ మూవీలో ఆయ‌న స‌ర‌స‌న నాయిక‌గా సీత న‌టించారు. ఆ సినిమాతో పాటు మ‌రో మూడు నాలుగు సినిమాలు కూడా హ‌రీన్‌ హీరోగా ప్రారంభ‌మ‌య్యాయి. కానీ యాక్సిడెంట్‌తో అకాల మ‌ర‌ణం పాల‌య్యాడు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన ఏకైక హాలీవుడ్ ఫిల్మ్‌లో ఆయ‌నే డ‌బ్బింగ్ చెప్పారు!

  సౌతిండియ‌న్ ఫిల్మ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న నాలుగు ద‌శాబ్దాల సినిమా కెరీర్‌లో ఒకే ఒక్క అమెరిక‌న్ ఫిల్మ్‌లో న‌టించారు. ఆ సినిమా 'బ్ల‌డ్‌స్టోన్' (1988). ప‌లు హాలీవుడ్ సినిమాలు నిర్మించిన భార‌తీయుడు అశోక్ అమృత‌రాజ్ నిర్మించిన ఈ మూవీని డ్వైట్ హెచ్‌. లిటిల్ డైరెక్ట్ చేశారు. ఆ కాలంలో ఒక ద‌క్షిణాది న‌టుడు ఒక హాలీవుడ్ ఫిల్మ్‌లో, అందునా సినిమాకు ఆయువుప‌ట్టు లాంటి కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌డం చాలా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌, బెంగ‌ళూరు, ముదువ‌లై వంటి భార‌తీయ లొకేష‌న్ల‌లో జ‌రిగింది. 'బ్ల‌డ్‌స్టోన్‌'లో శ్యామ్ స‌బు అనే టాక్సీ డ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్ పోషించారు ర‌జ‌నీ. బ‌య‌టి ప్ర‌పంచానికి అత‌ను ఒక టాక్సీ డ్రైవ‌రే కానీ, అత‌నికంటూ ఒక బల‌గం ఉంటుంది. క‌థానుసారం అమూల్య‌మైన 'బ్ల‌డ్‌స్టోన్' అనే వ‌జ్రం విదేశం నుంచి మ‌న‌దేశానికి త‌ర‌లించ‌బ‌డుతుంది. అది ర‌జ‌నీ టాక్సీలోకి, త‌ద్వారా అత‌ని చేతికి వ‌స్తుంది. ఈ వ‌జ్రం హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని విల‌న్ ముఠా భ్ర‌మ‌ప‌డి ఆమెను కిడ్నాప్ చేస్తుంది. ఆమె కోసం హీరో శాండీ మెక్‌వే (బ్రెట్ స్టిమ్‌లీ) ఇండియాకు వ‌స్తాడు. ర‌జ‌నీ, అత‌ను స్నేహితుల‌వుతారు. బ్ల‌డ్‌స్టోన్‌ను కాపాడుకోవ‌డం కోసం ఆ ఇద్ద‌రూ ఏం చేశార‌నేది మిగ‌తా క‌థ‌. ఇప్పుడేమో కానీ, ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాల్లో న‌టించే న‌టులు డ‌బ్బింగ్‌కంటూ విడిగా డేట్స్ ఇవ్వ‌డం అనేది ఉండేది కాదు. షూటింగ్ టైమ్‌లోనే డైలాగ్స్‌ను రికార్డ్ చేసేవాళ్లు. ర‌జ‌నీ సైతం త‌న సొంతు గొంతుతోనే డైలాగ్స్ చెప్పారు. మేక‌ర్స్ "మీ డైలాగ్స్ మీరే చెప్పాలి." అన్న‌ప్పుడు ఆయ‌న భ‌య‌ప‌డ్డారు. ఎందుకంటే ఇంగ్లీష్‌ను ఆయ‌న గ్రామ‌ర్‌కు త‌గ్గ‌ట్లు మాట్లాడ‌లేరు. బెంగ‌ళూరులో కండ‌క్ట‌ర్‌గా బెల్ కొట్టుకొంటూ వ‌చ్చిన ఆయ‌నకు ఇంగ్లీష్ సినిమాలో మాట్లాడేంత‌గా ఆ భాష‌లో ప్రావీణ్యం లేదు. కానీ ప్రొడ్యూస‌ర్స్ ర‌జనీకి ఒక ట్యూట‌ర్‌ను పెట్టి, ధైర్యం చెప్పి చివ‌ర‌కు ఆయ‌న సంభాష‌ణ‌లు ఆయ‌నే మాట్లాడేట్లు చేశారు. ఆ త‌ర్వాతే ఆయ‌న ఇంగ్లీష్‌ను కాస్త బాగా మాట్లాడుతూ వ‌చ్చారు. విశేష‌మేమంటే ర‌జ‌నీ చెప్పిన‌ డైలాగ్స్‌, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ హీరో బ్రెట్ స్టిమ్‌లీ, స్టోరీ రైట‌ర్ నికో మాస్టోరాకిస్‌ల‌ను బాగా మెప్పించింది. ఆ ఇద్ద‌రూ ఆయ‌న‌ను తెగ మెచ్చుకున్నారు. దాంతో ర‌జ‌నీ చాలా ఆనంద‌ప‌డ్డారు. 'బ్ల‌డ్‌స్టోన్‌'ను ఒమెగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1988 అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేసింది. అయితే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమాని జ‌నం బాగానే చూశారు.

వియ్యంకుడు అక్కినేని హీరోగా డి. రామానాయుడు నిర్మించిన ఫ‌స్ట్ ఫిల్మ్ ఇదే!

  న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు వియ్యంకుల‌నే విష‌యం తెలిసిందే. నాగార్జున‌కు, రామానాయుడు కుమార్తె ల‌క్ష్మికి 1984లో వివాహం జ‌రిగింది. కానీ అభిప్రాయ భేదాల కార‌ణంగా ఆరేళ్ల‌లోనే ఇద్ద‌రూ విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీల మ‌ధ్య స‌న్నిహిత‌త్వం ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ రెండు కుటుంబాలూ ఒక్క‌టే అన్నంత‌గా మెల‌గుతూ వ‌స్తున్నాయి. వియ్యంకులు కాక‌ముందే ఏఎన్నార్ హీరోగా ప‌లు చిత్రాలు నిర్మించారు రామానాయుడు. ఈ రోజు (జూన్ 6) రామానాయుడు జ‌యంతి సంద‌ర్భంగా ఆ సినిమా విశేషాలు... ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'సిపాయి చిన్న‌య్య' (1969). ఇందులో అక్కినేని టైటిల్ రోల్ పోషించ‌డంతో పాటు, జ‌మీందార్ భాస్క‌ర్‌గా కూడా న‌టించారు. అంటే డ్యూయ‌ల్ రోల్ అన్న‌మాట‌. విశేష‌మేమంటే ఈ సినిమా కంటే ముందు రామానాయుడు నిర్మించిన 'రాముడు-భీముడు' సినిమాలోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేశారు. అది వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఇలా ఇద్ద‌రు టాప్ హీరోల‌తో నిర్మించిన తొలి చిత్రాల్లో వారిచేత డ్యూయ‌ల్ రోల్ చేయించిన అరుదైన రికార్డును రామానాయుడు సొంతం చేసుకున్నారు. 'సిపాయి చిన్న‌య్య' చిత్రానికి జి.వి.ఆర్‌. శేష‌గిరిరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ సినిమాని నిర్మించిన‌ప్ప‌టికీ ఓపెనింగ్ సీన్స్‌తో పాటు, క్లైమాక్స్ సీన్ల‌నూ, రెండు పాట‌ల్నీ క‌ల‌ర్‌లో చిత్రీక‌రించారు. చిన్న‌య్య పాత్ర‌కు జోడీగా కె.ఆర్‌. విజ‌య‌, భాస్క‌ర్ క్యారెక్ట‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా భార‌తి న‌టించారు.  అప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి, మంచి డాన్స‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి "ఒరే మావా.. ఏసుకోరా సుక్క" అనే ఆరుద్ర పాట‌కు డాన్స్ చేశారు. అది విశేషం కాదు. అదివ‌ర‌కే ఆమె పెళ్లి చేసుకొని, సినిమాల్లో న‌టించ‌నంటూ మ‌నీలా వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో బంధువుల ఇంట్లో జ‌రుగుతున్న వివాహ వేడుక‌కు ఆమె మ‌ద్రాసు వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసి, ఆమెను త‌మ సినిమాలో ఓ పాటలో న‌టించ‌మ‌ని రామానాయుడు కోరారు. ఆయ‌న మీదున్న గౌర‌వంతో ఆ పాట‌కు డాన్స్ చేశారు విజ‌య‌ల‌క్ష్మి. స‌త్య‌నారాయ‌ణ కాంబినేష‌న్‌తో ఆ పాట‌ను చిత్రీక‌రించారు. 

హీరోగా ఫ‌స్ట్ ఫిల్మ్ ఫ్లాప్.. జంషెడ్‌పూర్‌లో ఉద్యోగానికి వెళ్లిపోయిన ఎస్వీఆర్‌!

  ఆర్టిస్ట్ కావాల‌ని మ‌ద్రాస్ వెళ్లారు ఎస్వీ రంగారావు. తేనాంపేట‌లోని ఎల్డామ్స్ రోడ్ చివ‌ర‌న ఉన్న ఓ ప్రెస్‌లో కింద పేప‌ర్లు వేసుకొని ప‌డుకొని క‌ల‌లు కంటూ వ‌చ్చారు. ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతాయేమోన‌ని నిరాశ‌ప‌డ్డ రోజులున్నాయి. ఈ జీవితం ఇంతేనా అని కృంగిపోయిన సంద‌ర్భాలున్నాయి. తిన‌డానికి తిండి లేక ప‌స్తులుండి మంచినీళ్లు మాత్ర‌మే తాగి బ‌తికిన రోజులున్నాయి. ఈ బాధ‌లు ప‌డ‌లేక ఇంటికి వెళ్లిపోదామ‌ని రెడీ అయితే, ఆ త‌ర్వాత కాలంలో 'తాత మ‌న‌వ‌డు' లాంటి సినిమాలు తీసిన నిర్మాత కె. రాఘ‌వ వారించారు. ఎస్వీఆర్‌తో పాటు ఆయ‌నా సినీ రంగంలో ఏదో ఒక ఉపాధి చూసుకోవాల‌ని వ‌చ్చిన‌వారే. ఇద్ద‌రికి ఇద్ద‌రూ తోడ‌య్యారు. ఎస్వీఆర్‌కు నాట‌కాల ద్వారా కాకినాడ‌లో ప‌రిచ‌యం ఉన్న అంజ‌లీదేవి వాళ్ల బాధ‌లు చూసి, త‌న ఇంట్లోని అయ్య‌ర్‌కు చెప్పి, వాళ్లెప్పుడు భోజ‌నానికి వ‌చ్చినా లేద‌న‌కుండా పెట్ట‌మ‌ని పుర‌మాయించారు. అయినా అస్త‌మానూ అక్క‌డ‌కు ఏం వెళ్తారు! ఎలాగైతేనేం ఎస్వీఆర్ హీరో అయ్యారు. కానీ ఆయ‌న హీరోగా న‌టించిన ఆ సినిమా 'వ‌రూధిని' (1946) ఫ్లాప‌య్యింది. దాంతో లైఫ్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సినిమాలకు వేషాలు వెదుక్కుంటున్న‌ప్పుడు ప‌రిస్థితి వేరుగా ఉంటుంది కానీ, మొద‌టి సినిమాయే ఫ్లాపైతే ఆ ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. బాధ‌, అవ‌మానం.. రెండూ మ‌న‌సును మెలిపెడుతుంటాయి. ఆ టైమ్‌లో ఎస్వీఆర్ ఇంటికి వెళ్లిపోదామ‌ని నిర్ణ‌యించేసుకున్నారు. అప్పుడే ఊళ్లోని పెద్ద‌వాళ్లు కూడా పెళ్లి చేసుకోమ‌న్నారు. ఆయ‌న మేన‌కొడ‌లినిచ్చి పెళ్లి చేసేశారు. సంసార బాధ్య‌త కూడా మీద ప‌డ‌టంతో జంషెడ్‌పూర్‌లో ఉద్యోగం చేయ‌డానికి వెళ్లిపోయారు. ఆయ‌న అక్క‌డ ఉండ‌గానే డైరెక్ట‌ర్ బి.ఎ. సుబ్బారావు నుంచి పిలుపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నాలుగైదు సినిమాలు చేశాక 1951లో వ‌చ్చిన 'పాతాళ‌భైర‌వి'లో చేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర‌తో తారాజువ్వ‌లా పైకెగ‌శారు ఎస్వీఆర్‌. అది ఆయ‌న న‌టించగా విడుద‌లైన ఏడ‌వ చిత్రం. ఆ త‌ర్వాత చ‌నిపోయేంత వ‌ర‌కు 1974లో వ‌చ్చిన చివ‌రి చిత్రం 'ద‌క్ష య‌జ్ఞం' దాకా ఆయ‌న తిరుగులేని విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌కాశించారు.

ల‌క్ష్మ‌ణుడి పాత్ర ఇవ్వ‌మ‌ని అడిగిన శోభ‌న్‌బాబు.. ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే...

  మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌ధాన పాత్ర పోషించిన 'దైవ‌బలం' (1959) చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు శోభ‌న్‌బాబు. అందులో ఆయ‌న గంధ‌ర్వ‌కుమారుడిగా కొద్దిసేపు క‌నిపించే పాత్ర చేశారు. మూడంటే మూడు రోజుల్లో ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. ఆ సినిమా త‌ర్వాత దాన్ని నిర్మించిన పొన్న‌లూరి బ్ర‌ద‌ర్స్ 'మహామాయ' అనే సినిమాను శోభ‌న్‌బాబు హీరోగా తీద్దామ‌నుకున్నారు. కానీ 'దైవ‌బ‌లం' ఫ్లాప‌వ‌డంతో ఆ సినిమా అట‌కెక్కింది. దాని త‌ర్వాత చిత్ర‌పు నారాయ‌ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'భ‌క్త శ‌బ‌రి' (1960) చిత్రంలో శ‌బ‌రి పాత్ర‌ధారి పండ‌రీబాయి ద‌గ్గ‌రుండే క‌రుణ అనే మునికుమారుడిగా న‌టించారు శోభ‌న్‌బాబు. ఆ మూవీలో రామ‌ల‌క్ష్మ‌ణులుగా హ‌ర‌నాథ్‌, రామ‌కృష్ణ న‌టించారు. ఆ స‌మ‌యంలో పుట్టిన త‌న కుమారుడికి ఆ సినిమాలో త‌ను చేసిన పాత్ర పేరు "క‌రుణ" అని పెట్టుకున్నారు శోభ‌న్‌. రెండు సినిమాలు చేసినా అవ‌కాశాలు వాటంత‌ట‌వి ఆయ‌న‌కు రాలేదు. అప్ప‌టి పెద్ద న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో పాటు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌ను ఆయ‌న క‌లుస్తూ వ‌చ్చారు. 1960లో ఎన్టీఆర్ తొలిసారి ద‌ర్శ‌కత్వంలో 'సీతారామ క‌ల్యాణం' చిత్రాన్ని ప్రారంభించారు. అందులో ఆయ‌న రావ‌ణాసురుడి పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు, శ్రీ‌రామునిగా హ‌ర‌నాథ్‌ను ఎంపిక చేసిన‌ట్లు శోభ‌న్‌కు తెలిసింది. త‌న అదృష్టం ప‌రీక్షించుకుందామ‌ని ఎన్టీఆర్‌ను క‌లిశారు. అప్ప‌టికే 'దైవ‌బ‌లం' సెట్‌లో క‌లిసుండ‌టంతో శోభ‌న్‌ను గుర్తుప‌ట్టిన ఎన్టీఆర్ "రండి బ్ర‌ద‌ర్" అని ఆహ్వానించారు. "ఏ వేషం వేస్తారు?" అని ఆయ‌నే అడిగారు. శ్రీ‌రాముని పాత్ర‌కు హ‌ర‌నాథ్ ఎంపికై ఉన్నాడ‌ని తెలిసినందువ‌ల్లా, పైగా ఏదో వేషం ఆయ‌నే ఇవ్వ‌కుండా, ఏ వేషం వేస్తార‌ని ఆయ‌నే అడ‌గ‌డంతో, కంగారులో "ల‌క్ష్మ‌ణుడి పాత్ర ఇవ్వండి సార్" అని అడిగేశారు శోభ‌న్‌. ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించ‌కుండా "ఓకే బ్ర‌ద‌ర్‌. మా సినిమాలో మీరే ల‌క్ష్మ‌ణుడు" అని అభ‌య‌మిచ్చేశారు. అలా 1961 జ‌న‌వ‌రిలో విడుద‌లైన‌ 'సీతారామ క‌ల్యాణం'లో ల‌క్ష్మ‌ణుడిగా న‌టించారు శోభ‌న్‌. చెప్పాలంటే ఆ సినిమాలో ల‌క్ష్మ‌ణుని పాత్ర చిన్న‌దే. కానీ ఇత‌ర న‌టుల కాంబినేష‌న్‌లో సీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల 56 రోజుల పాటు ఆ సినిమాకు ప‌నిచేయాల్సి వ‌చ్చింది. ఆ సినిమా చేసిన వెంట‌నే 'భీష్మ' సినిమాలో పనిచేసే అవ‌కాశం కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అందులో అర్జునుని వేషం వేశారు శోభ‌న్‌. అలా కెరీర్ తొలినాళ్ల‌లో నంద‌మూరి తార‌క‌రామారావు ప్రోత్స‌హించ‌డంతో నెమ్మ‌దిగా నిల‌దొక్కుకొని 'వీరాభిమ‌న్యు' (1965)గా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు పొందారు తెలుగువారి అందాల న‌టుడు శోభ‌న్‌బాబు.

మ‌ర‌ణించే ముందు మ‌హాన‌టి సావిత్రి ఎక్క‌డ ఎలా కోమాలోకి వెళ్లారో తెలుసా?

  మ‌హాన‌టి సావిత్రి 1981 డిసెంబ‌ర్ 26 రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ అనిత‌ర సాధ్య‌మైన న‌ట‌న‌తో ఎప్ప‌టికీ తెలుగువారి ఆరాధ్య‌తార‌గా వారి గుండెల్లో స్థానం పొందారు. భౌతిక దేహాన్ని విడ‌నాడ‌టానికి 596 రోజుల ముందే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె ఆ స్థితిలోకి వెళ్లి ప్ర‌దేశం ఏదో తెలుసా?  క‌ర్నాట‌క‌లోని ఓ హోట‌ల్ గ‌దిలో! 'ఇది అర‌ద‌గాయ' అనే క‌న్న‌డ మూవీలో న‌టించ‌డం కోసం ఆమె బెంగ‌ళూరు వెళ్లారు. త‌న‌కు కేటాయించిన హోటల్ రూమ్‌లో ప‌డుకొంటే, అంత‌దాకా త‌న జీవిత‌మంతా సినిమా రీళ్ల‌లా క‌ళ్ల‌ముందు మెదిలింది. ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్ర‌లు వేసిన త‌ను.. చివ‌రికి బ‌తుకు తెరువు కోసం ఎలాంటి పాత్ర‌లు వేయాల్సి వ‌స్తున్న‌దో త‌ల‌చుకొని తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యారు. దుఃఖం త‌న్నుకువ‌చ్చింది. మంచంపై ప‌డి దొర్లారు. గుండెల్ని పిండేస్తున్న బాధ‌ను త‌ట్టుకోవ‌డం ఆమె వ‌శం కావ‌ట్లేదు. అప్ప‌టికే ఆమె మ‌ద్యానికి బానిస‌య్యారు. త‌ల్లి చ‌నిపోయాక సావిత్రికి స్వాంత‌న చేకూరుస్తోంది ఆ మ‌ద్య‌మే. అప్ప‌టికే రూమ్ బాయ్‌చేత తెప్పించుకొని ఉన్న మందు బాటిల్ తీసుకున్నారు. గ్లాసు త‌ర్వాత గ్లాసు వంపుకొని బాటిల్ మొత్తం తాగేశారు. తెల్లారి ఆమెను లొకేష‌న్‌కు తీసుకుపోవ‌డం కోసం కారొచ్చింది. డ్రైవ‌ర్ వ‌చ్చి ఎంత‌సేపు త‌లుపుకొట్టినా రెస్పాన్స్ లేదు. అత‌ను వెళ్లి రిసెప్ష‌న్‌లో చెప్పాడు. వాళ్లొచ్చి త‌మ ద‌గ్గ‌రున్న రెండో తాళంతో త‌లుపులు తెరిచారు. నేల‌మీద మందు బాటిల్‌, గ్లాసు, చింద‌ర‌వంద‌ర‌గా వ‌స్తువులు.. అక్క‌డే నేల‌మీదే ప‌డిపోయి ఉన్న.. మ‌హాన‌టి! ఎంత పిలిచినా, క‌దిపినా ప‌ల‌క‌లేదు, ఉల‌క‌లేదు. స్పృహ‌లో ఉంటేగా! ప్రొడ్యూస‌ర్‌కు ఫోన్ వెళ్లింది. వెంట‌నే కారులో ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. ఆమె స్థితి చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ చేర్చుకోలేదు. దాంతో గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ బెడ్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో నేల‌మీదే ప‌డుకోబెట్టారు. ఎలాంటి సావిత్రికి ఎలాంటి దుర‌వ‌స్థ‌!  సావిత్రిని హాస్పిట‌ల్‌లో చేర్చిన విష‌యం తెలియ‌గానే న‌టి ల‌క్ష్మి ఆగ‌మేఘాల మీద అక్క‌డ‌కు వ‌చ్చారు. ప‌సిపాప‌లా అమాయ‌కంగా నిద్ర‌పోతున్న‌ట్లున్న సావిత్రిని చూడ‌గానే గుండె ప‌గిలింది ల‌క్ష్మికి. "మా అమ్మ‌ను ఇలా కింద ప‌డేశారేమిటి? ఈమె ఎవ‌ర‌నుకుంటున్నారు? ద‌య‌చేసి మంచంపై ప‌డుకోబెట్టండి." అని హాస్పిట‌ల్ వాళ్ల‌ను వేడుకున్నారు. అప్పుడు ఆమెకు మంచం ఏర్పాటుచేసి, ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో త‌మ ఆరాధ్య తార‌ను చూడ్డానికి వంద‌లాదిగా జ‌నం త‌ర‌లి రావ‌డం మొద‌లైంది. క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి గుండూరావు, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స‌హా అనేక‌మంది సెల‌బ్రిటీలు అక్క‌డ‌కు వ‌చ్చి, మంచానికి అతుక్కుపోయి ఉన్న సావిత్ర‌మ్మ‌ను చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.  అప్ప‌టిదాకా ఆమెను స‌రిగా ప‌ట్టించుకోని జెమినీ గ‌ణేశ‌న్ వ‌చ్చి, ఆమెని చూసి గుండెలు బాదుకున్నాడు. ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఏడ్చాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌ద‌హారు రోజుల త‌ర్వాత సావిత్రిని తీసుకొని మ‌ద్రాసుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అన్నా న‌గ‌ర్‌లో ఆమె నివాసంలోనే ఆమెను ఉంచి, డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌. రాజ‌గోపాల్ బృందంతో చికిత్స చేయిస్తూ వ‌చ్చారు. అదివ‌ర‌కు క‌ళ్ల‌తోటే అన్ని ర‌కాల ఉద్వేగాల‌నూ ప‌లికించి మెస్మ‌రైజ్ చేసిన ఆ మ‌హాగొప్ప తార‌, అప్ప‌ట్నుంచి అక్క‌డే నిర్జీవంగా పుండైపోయిన శ‌రీరంతో, మూసుకుపోయిన క‌ళ్ల‌తో మంచంమీదే ఉండి, కోమాలోకి వెళ్లిన 596వ రోజు కొన‌ప్రాణాన్ని కూడా వ‌దిలేసి, అశేష అభిమానుల గుండెలు బ‌ద్ద‌లుచేసి వెళ్లిపోయారు. 

బాలు ఆర్కెస్ట్రాలో హార్మోనిస్టుగా ప‌నిచేసిన ఇళ‌య‌రాజా!

  డైరెక్ట‌ర్ భార‌తీరాజా మొద‌ట్నుంచీ ఎస్పీ బాలుకు ఫ్రెండ్‌. ఆయ‌న ద్వారా ఇళ‌య‌రాజా, ఆయ‌న ముగ్గురు అన్న‌ద‌మ్ములు బాలును క‌లిశారు. "కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ల‌కు మీ ఆర్కెస్ట్రాలో అవ‌కాశం ఇవ్వు" అని భార‌తీరాజా చెప్పారు. స‌రేన‌ని బాలు క‌ల‌వ‌మ‌న‌డంతో ఇళ‌య‌రాజా బ్ర‌ద‌ర్స్ క‌లిశారు. హార్మోనియం వాయించ‌మ‌ని బాలు చెబితే, రెండు చేతుల‌తో చాలా ఒడుపుగా వాయించారు ఇళ‌య‌రాజా. ఆశ్చ‌ర్య‌ప‌డి, "ఎక్క‌డ నేర్చుకున్నావు?" అన‌డిగారు బాలు. "విని నేర్చుకున్నా" అనేది రాజా స‌మాధానం. "సంగీతం నేర్చుకోకుండా ఎలా వాయిస్తావు?" అని మ‌ళ్లీ ప్ర‌శ్నించారు బాలు. "విని నేర్చుకుంటా" అని మ‌ళ్లీ చెప్పారు రాజా. అలా బాలు ఆర్కెస్ట్రాలో గిటారిస్ట్‌గా జాయిన‌య్యారు రాజా. కొంత కాలం త‌ర్వాత అంత‌దాకా బాలు ద‌గ్గ‌ర హార్మోనిస్టుగా ఉన్న అనిరుద్ర మానేయ‌డంతో, హార్మోనిస్టుగా రాజాకు ప్ర‌మోష‌న్ ఇచ్చారు బాలు. ఇళ‌య‌రాజా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాక‌, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో పాట‌ల్ని ఎక్కువ‌గా బాలుతోనే పాడించారు. నిజానికి బాలుతో రాజా పాడించిన‌న్ని పాట‌లు మ‌రే మ్యూజిక్ డైరెక్ట‌ర్ పాడించ‌లేద‌న‌డం అతిశ‌యోక్తి కాదు. మ‌ణిర‌త్నం రూపొందించిన 'ద‌ళ‌ప‌తి' చిత్రం కోసం "సుంద‌రీ నీవే నేనంట‌.." పాట‌ను ముంబైలో 126 మంది మ్యూజీషియ‌న్స్‌తో రికార్డ్ చేయించారు రాజా. ఆ పాట‌ను బాలు, జాన‌కి పాడారు. ఆ పాట రికార్డింగ్ చూసేందుకు ఎంతోమంది త‌ర‌లి వ‌చ్చారు.  బాలు ప‌ర‌మ‌ప‌దించేంత వ‌ర‌కూ ఇళ‌య‌రాజాతో ఆయ‌న స్నేహం, ఆత్మీయ బంధం అపూర్వంగా కొన‌సాగుతూ వ‌చ్చింది. కొంత కాలం క్రితం పాట కాపీరైట్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా చిన్న‌పాటి పొర‌పొచ్చాలు వ‌చ్చినా, త్వ‌ర‌గానే అవి స‌మ‌సిపోయాయి. క‌రోనా సోకి బాలు వెంటిలేట‌ర్ మీద‌కు వెళ్లిన‌ప్పుడు ఇళ‌య‌రాజా ఎంత భావోద్వేగానికి గుర‌య్యారో.. బాలు కోలుకుని తిరిగి రావాల‌ని ఎంత‌గా ఆకాంక్షించారో!.. కానీ అవి ఫ‌లించ‌లేదు. బాలు ఇక‌లేర‌నే వార్త తెలియ‌గానే రాజా దుఃఖానికి అంతులేకుండా పోయింది.

బాలు పాడిన శ్రీ‌కృష్ణ రాయ‌బారం ప‌ద్యాల్ని ప‌క్క‌న పెట్టేసిన ఎన్టీఆర్‌!

  ద‌క్షిణ భార‌త సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక నిడివి క‌లిగిన చిత్రం.. న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'దాన‌వీర‌శూర క‌ర్ణ‌'. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ మూవీ నిడివి 4 గంట‌ల 7 నిమిషాలు. దేశం మొత్తం చూసుకుంటే నిడివి ప‌రంగా ఈ సినిమాది రెండో స్థానం. రాజ్ క‌పూర్ సినిమా 'మేరా నామ్ జోక‌ర్' 4 గంట‌ల 24 నిమిషాల నిడివితో ప్ర‌థ‌మ స్థానం వ‌హిస్తుంది. 'దాన‌వీరశూర క‌ర్ణ‌'లో మొత్తం 35 ప‌ద్యాలు, 10 పాట‌లు ఉన్నాయి. మొద‌ట సాలూరి రాజేశ్వ‌ర‌రావు, త‌ర్వాత పెండ్యాల నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కులుగా ప‌నిచేశారు. టైటిల్స్‌లో పెండ్యాల గారి ఒక్క పేరే క‌నిపిస్తుంది. "ఏ త‌ల్లి నిను క‌న్న‌దో.. నేను నీ త‌ల్లిన‌యినానురా" పాట‌కు బాణీలు క‌ట్టి, రికార్డ్ చేసింది సాలూరివారు. ఈ సినిమాలో దుర్యోధ‌నుడిపై చిత్రీక‌రించిన డ్యూయెట్ ఎంత ఫేమ‌స్సో మ‌న‌కు తెలుసు. దుర్యోధ‌నుడు, భానుమ‌తి పాత్ర‌ధారులైన ఎన్టీఆర్‌, ప్ర‌భ‌ల‌పై ఆ పాట‌ను చిత్రీక‌రించారు. "చిత్రం భ‌ళారే విచిత్రం" అంటూ సాగే పాట‌ను సి. నారాయ‌ణ‌రెడ్డి రాయ‌గా, సుశీల‌, బాలు పాడారు. ఎన్టీఆరే ఆ పాట‌ను స్వ‌యంగా ఆల‌పించారా అన్నంత‌గా ఆయ‌న గొంతులాగా అనిపించేలా బాలు ఆల‌పించారు.  తిరుప‌తి వేంక‌ట‌క‌వుల రాయ‌బార ప‌ద్యాలు నాట‌క ప్రియుల్లో బాగా పాపుల‌ర్‌. వాటి హ‌క్కుల్ని 'శ్రీ కృష్ణావ‌తారం' తీసే స‌మయంలోనే కొన్నారు నిర్మాత అట్లూరి పుండ‌రీకాక్ష‌య్య‌. వాటిని ముందుగా ఎస్పీ బాలు చేత‌నే పాడించారు. కానీ ఎందుక‌నో ఎన్టీఆర్‌కు న‌చ్చ‌లేదు. త‌ర్వాత పీస‌పాటి ర‌ఘురామ‌య్య‌తో పాడించారు. అవీ న‌చ్చ‌లేదు. దాంతో ఘంట‌సాల ఆల‌పించిన 'శ్రీ‌కృష్ణ తులాభారం' ప‌ద్యాల్నే ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న భావించారు. అప్పుడు రామ‌కృష్ణ పేరు సూచించారు సాలూరి రాజేశ్వ‌ర‌రావు. స‌రేన‌ని రామ‌కృష్ణ‌ను పిలిపించి, ఆయ‌న చేత రాయ‌బారం ప‌ద్యాల్ని పాడించారు. రామ‌కృష్ణ కంఠంలో ఆ ప‌ద్యాలు ఎన్టీఆర్‌కు బాగా న‌చ్చాయి. దాని త‌ర్వాత రామ‌కృష్ణ‌తోటే భ‌గ‌వ‌ద్గీత‌ను పాడించారు. 'దాన‌వీర‌శూర క‌ర్ణ చిత్రం'తో రామ‌కృష్ణ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయారు.

న‌మ్మ‌లేని నిజం.. తెర‌మీద బాలుకు తెర‌వెనుక పాడిన 'క‌న్న‌డ కంఠీర‌వ' రాజ్‌కుమార్‌!

  గాన‌గంధ‌ర్వుడైన ఎస్పీ బాలుకే మ‌రొక‌రు నేప‌థ్య గానం అందించారంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. కానీ నిజంగా అది నిజం. ఒక క‌న్న‌డ సినిమాలో బాలుకు ఏకంగా 'క‌న్న‌డ' కంఠీర‌వ రాజ్‌కుమార్ పాట‌లు పాడారు. అదేమీ డ‌బ్బింగ్ సినిమా కాదు. స్ట్ర‌యిట్ క‌న్న‌డ ఫిల్మ్‌. ఆ సినిమా పేరు 'ముద్దిన‌మావ' (1993). తెలుగులో హిట్ట‌యిన దాస‌రి నారాయ‌ణ‌రావు సినిమా 'మామ‌గారు'కు అది రీమేక్‌. ఓం సాయిప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. ఒరిజిన‌ల్‌లో దాస‌రి చేసిన పాత్ర‌ను క‌న్న‌డంలో బాలు చేశారు. వినోద్ కుమార్ చేసిన హీరో క్యారెక్ట‌ర్‌ను తెలుగువాడైన శ‌శికుమార్ పోషించాడు. సినిమాలో బాలు పాత్ర‌కు రెండు పాట‌లు, శ‌శికుమార్ పాత్ర‌కు మూడు పాట‌లు ఉన్నాయి. ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాలు. త‌నపై పాట‌లు త‌ను పాడి, శ‌శికుమార్‌కు త‌న ద‌గ్గ‌ర ట్రాక్స్ పాడుతున్న రాజేశ్‌తో పాడించాల‌ని బాలు అనుకున్నారు. ఈ రాజేశ్ ఎవ‌రో కాదు.. నాగార్జున 'నిన్నే పెళ్లాడుతా' సినిమాలోని బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ "ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు"ను పాడిన‌వాడు. బాలు ఆలోచ‌న‌కు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు స‌రేన‌న్నారు. కానీ హీరో శ‌శికుమార్ మాత్రం త‌న పాత్ర‌కు బాలునే పాడాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. అటు హీరోకీ, ఇటు త‌న‌కూ త‌న గొంతే ఉంటే బాగుండ‌ద‌ని బాలు అభిప్రాయం. కానీ హీరో ఏమో మొండికేశాడ‌య్యే. దాంతో ఓ నిర్ణ‌యం తీసుకున్నారు బాలు. త‌న‌కు రాజ్‌కుమార్ పాడితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో చెప్పారు. వారు ఒప్పుకున్నారు. అయితే రాజ్‌కుమార్ దీనికి అంగీక‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌. త‌నే స్వ‌యంగా రాజ్‌కుమార్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అడిగారు బాలు. "అయ్య బాబోయ్‌.. నేను మీకు పాడ్డ‌మా? అంత సాహ‌సం చేయ‌లేను బాలుగారూ.. క్ష‌మించండి" అనేశారాయ‌న‌. బాలు ఎంత బ‌ల‌వంతం చేసినా ఆయ‌నది అదే మాట‌. "అన్న‌గారూ.. ఆ పాట‌ల‌కు ట్రాక్‌లు నేనే పాడుకుంటాను. షూటింగ్ కూడా ఆ ట్రాక్‌ల‌తోనే చేస్తాం. ఆ ట్రాకులు బెంగ‌ళూరు చాముండేశ్వ‌రి థియేట‌ర్‌లో ఉంటాయి. మీరు ఎప్పుడు కుదిరిదే అప్పుడు మిక్స్ చేసి ఇస్తే, ఆ త‌ర్వాత మీ వాయిస్‌తో నేను పోస్ట్ చేసుకుంటా." అని చెప్పి, ఆయ‌న స‌మాధానం కోసం వెయిట్ చేయ‌కుండా వ‌చ్చేశారు ఎస్పీ బాలు. అయినా కూడా "అలా కుద‌ర‌దు" అని బాలుకు చెప్పించారు రాజ్‌కుమార్‌. బాలు య‌థాప్ర‌కారం షూటింగ్ చేశారు. అప్పుడెందుకో రాజ్‌కుమార్ మ‌న‌సు మార్చుకున్నారు. వ‌చ్చి ఆ రెండు పాట‌లు పాడారు. "మీ అంత బాగా పాడ‌లేను. న‌చ్చ‌క‌పోతే తీసేయండి." అని కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ ఆయ‌న పాట‌ల‌నే సినిమాలో ఉప‌యోగించుకున్నారు. రాజ్‌కుమార్ చాలా బాగా పాడారు. క‌న్న‌డ కంఠీర‌వ లాంటి గొప్ప న‌టుడు గాన గంధ‌ర్వుడు బాలుకు గాత్రం ఇవ్వ‌డం ఓ మ‌ర‌పురాని అరుదైన ఘ‌ట్టం.

బాలు మీద కోపంతో రాజ్ సీతారామ్‌ను ఎంక‌రేజ్ చేసిన కృష్ణ‌!

  సినిమాల్లో తెర‌మీద కృష్ణ ఆడిపాడుతుంటే, తెర‌వెనుక ఎస్పీ బాలు గాత్ర‌మే వినిపించాలి. కృష్ణ హీరోగా ప‌రిచ‌య‌మైన కొద్ది కాలానికే బాలు కూడా గాయ‌కునిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌కు ఘంట‌సాల గాత్ర‌మిస్తుంటే కృష్ణ‌, శోభ‌న్‌బాబు లాంటివారికి బాలు గాత్రం స‌రిగ్గా స‌రిపోయింద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా కృష్ణ గొంతుకు బాలు గొంతు ప‌ర్ఫెక్టుగా సూట‌య్యింద‌నేది నిజం. అలాంటిది.. 'సూర్య‌చంద్ర' చిత్రంలో తెర‌మీద కృష్ణ ఆడుతుంటే, తెర‌వెనుక వినిపిస్తున్న గొంతు చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. 'ఎవ‌రిదీ గొంతు?  బాలుది కాదే.. ఈ కొత్త గొంతు ఎవరిది?' అనుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారుతూ 70 ఎంఎంలో కృష్ణ రూపొందించిన తొలి చిత్రం 'సింహాస‌నం'లోనూ అదే గొంతు. "ఆకాసంలో ఒక తార‌", "వ‌హ‌వా నీ య‌వ్వ‌నం", "ఇది క‌ల‌య‌ని నేన‌నుకోనా" లాంటి పాట‌లు వింటుంటే అచ్చు.. కృష్ణే ఆ పాట‌లు పాడుతున్నారా అనిపించింది. ఆ గొంతు బాలుది కాదు.. రాజ్ సీతారామ్ అనే ఓ యువ‌కుడిది.  అంద‌రూ హీరోల‌కూ పాడేస్తూ బాలు మంచి ఊపులో ఉన్న టైమ్‌లో కృష్ణ‌తో ఆయ‌న‌కు మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. ఎంత సాహ‌సికుడో అంత అభిమాన‌వంతుడు కూడా అయిన కృష్ణ ఎలాంటి అడుగు వేయ‌డానికైనా సంకోచించ‌రు. అప్ప‌టికే న‌రేశ్ హీరోగా న‌టించిన 'అగ్ని సమాధి'తో తెలుగుచిత్ర‌సీమ‌కు గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు త‌మిళుడైన‌ రాజ్ సీతారామ్‌. ఆయ‌న ఎస్పీ బాలు బృందంలోనివాడే. ఆయ‌న‌తో క‌లిసి ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నాడు కూడా. బాలుకు, కృష్ణ‌కు మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 'సూర్య‌చంద్ర' (1985) చిత్రంలోని పాట‌ల్ని రాజ్ సీతారామ్ చేత పాడించారు డైరెక్ట‌ర్ విజ‌య‌నిర్మ‌ల‌. మొద‌ట ఆ పాట‌ల్ని రాజ్ పాడిన‌ట్లు కృష్ణకు తెలీదు. ఆ పాట‌ల్ని కృష్ణ‌కు వినిపించి ఎలా ఉన్నాయ‌ని అడిగారు విజ‌య‌నిర్మ‌ల‌. బాగున్నాయ‌ని ఆయ‌న అన్న త‌ర్వాతే రాజ్ సీతారామ్‌ను కృష్ణ‌కు ఆమె ప‌రిచ‌యం చేశారు. అలా 'సూర్య‌చంద్ర' సినిమాతో కృష్ణ‌కు పాడ‌టం ప్రారంభించారు రాజ్. బాలుకు, త‌న‌కు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తొల‌గిపోయి, స‌యోధ్య కుదిరేంత‌వ‌ర‌కూ ఆయ‌న చేతే త‌న పాట‌ల‌న్నీ పాడించారు కృష్ణ‌. ఆయ‌న పెద్ద కుమారుడు ర‌మేశ్‌బాబు హీరోగా ప‌రిచ‌య‌మైన 'సామ్రాట్' సినిమాలోనూ పాట‌ల్ని రాజ్‌తోనే ఆయ‌న పాడించారు. కృష్ణ అంటే బాలు, బాలు అంటే కృష్ణ అన్నంత‌గా పేరుపొంద‌డంతో మొద‌ట్లో అభిమానుల‌కు రాజ్ గొంతు కొత్త‌గా అనిపించినా, త‌ర్వాత ఆ గొంతు కృష్ణ‌కు స‌రిగ్గా స‌రిపోయింద‌ని ఫ్యాన్స్‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా ఒప్పేసుకుంది. అలా మూడేళ్ల పాటు కృష్ణ‌కు రాజ్ సీతారామ్ పాడారు. ఆ త‌ర్వాత తిరిగి కృష్ణ‌కు బాలు చేరువయ్యారు. దాంతో 'రౌడీ నెంబ‌ర్ 1' (1988) సినిమా నుంచి బాలుతోనే మ‌ళ్లీ పాట‌లు పాడించుకుంటూ వ‌చ్చారు కృష్ణ‌. మిగ‌తా హీరోలెవ‌రూ ఎంక‌రేజ్ చేయ‌క‌పోవ‌డంతో గాయ‌కుడిగా రాజ్ సీతారామ్ క్ర‌మేపీ క‌నుమ‌రుగ‌య్యారు.

'శంక‌రాభ‌ర‌ణం'కు మ‌రో గాయ‌కుడ్ని చూసుకోమ‌న్న బాలు!

  'శంక‌రాభ‌ర‌ణం'.. తెలుగు సినిమానీ, తెలుగు సినిమా సంగీతాన్నీ దేశ‌వ్యాప్తం.. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచ‌వ్యాప్తం చేసిన చిత్ర‌రాజం. ఏమాత్రం ప‌రిచ‌యం లేని జె.వి. సోమ‌యాజులు అనే న‌టుడ్ని రాత్రికి రాత్రే గొప్ప‌న‌టుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిని చేసిన గొప్ప క‌ళాఖండం. ద‌ర్శ‌కుడిగా కె. విశ్వ‌నాథ్‌నూ, సంగీత ద‌ర్శ‌కుడిగా కె.వి. మ‌హ‌దేవ‌న్‌నూ శిఖ‌రాగ్ర‌స్థాయికి చేర్చిన 'శంక‌రాభ‌ర‌ణం'లో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాడిన ప్ర‌తి గీతం స‌మ్మోహ‌న‌కరం. అయితే మొద‌ట ఆ పాట‌ల‌ను తాను పాడ‌న‌నీ, మ‌రో గాయ‌కుడ్ని చూసుకొమ్మ‌న‌మ‌నీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్‌కు బాలు చెప్పార‌నే విష‌యం మ‌న‌లో ఎంత‌మందికి తెలుసు?  జూన్ 4 బాలు 75వ జ‌యంతి సంద‌ర్భంగా ఆ విష‌యాల‌ను ఓసారి చెప్పుకుందాం... శాస్త్రీయ సంగీతం నేర్చుకోక‌పోయినా మ‌హ‌దేవ‌న్‌, పుగ‌ళేంది లాంటి విద్వ‌త్ సంప‌న్నుల ద‌గ్గ‌ర దానిని సాధించి, పాడి మెప్పించిన సాధ‌కుడు బాలు. 'శంక‌రాభ‌ర‌ణం'తో ఆయ‌న చేత ఆ సాధ‌నను వారు చేయించి వుండ‌క‌పోతే బాలు మ‌హోన్న‌త స్థాయికి ఎదిగి వుండేవారు కాదేమో! 'శంక‌రాభ‌ర‌ణం'కు మ‌హ‌దేవ‌న్‌-పుగ‌ళేంది బాణీలు క‌ట్ట‌డం పూర్త‌యింది. భ‌ద్రాచ‌ల రామ‌దాసు, త్యాగ‌రాజు, మ‌హాక‌వి కాళిదాసు, మైసూర్ వాసుదేవాచార్యులు, స‌దాశివ‌బ్ర‌హ్మం కీర్త‌న‌లు, ప‌ద్యాలు మిన‌హా చిత్రంలోని నాలుగు పాట‌ల‌ను వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి రాయ‌డ‌మూ పూర్త‌యింది. వాటిని పాడేందుకు బాలుకు క‌బురుపెట్టారు విశ్వ‌నాథ్‌. ఆ కీర్త‌న‌లు, పాట‌ల ట్యూన్లు విని, "నావ‌ల్ల కాదు అన్న‌య్యా.. ఎవ‌రైనా మంచి గాయ‌కుడ్ని చూసుకోండి." అని విశ్వ‌నాథ్‌కు చెప్పారు బాలు. విశ్వ‌నాథ్‌, మ‌హ‌దేవ‌న్ ఒక‌రి ముఖం మ‌రొక‌రు చూసుకున్నారు. విశ్వ‌నాథ్ "నువ్వు పాడ‌గ‌ల‌వురా" అని భ‌రోసా ఇవ్వాల‌ని చూశారు. అయినా బాలులో సంకోచం. అవి గొప్ప పాట‌లుగా చ‌రిత్ర‌లో నిల‌బ‌డే పాట‌ల‌ని ఆయ‌న‌కు తెలుసు. కానీ వాటికి తాను న్యాయం చేయ‌గ‌ల‌నా.. అనే సందేహం. అందుకే పాడ‌లేన‌ని వెళ్లిపోయారు. అప్పుడు పుగ‌ళేంది, "వాడు హ‌నుమంతుని లాంటివాడు. వాడి ప్ర‌తిభ వాడికి తెలీదు. ఈ పాట‌లు వాడు పాడ‌తాడు. నేను పాడిస్తాను." అని విశ్వ‌నాథ్‌, మ‌హ‌దేవ‌న్‌ల‌కు హామీ ఇచ్చారు. వెంట‌నే బాలును క‌లిశారు. ఆయ‌న‌లో ఆత్మ‌స్థైర్యం నింపారు. చ‌రిత్ర‌లో నిలిచిపోతావ‌ని చెప్పారు. అంత‌కుముందు "ఆరేసుకోబోయి పారేసుకున్నాను", "ఆకుచాటు పిందె త‌డిసె" త‌ర‌హా పాట‌లు పాడివ‌చ్చిన బాలు నోరు పుక్కిళించుకున్నారు. తుల‌సి ఆకులు న‌మిలారు. వేటూరి రాసిన గీతం "దొర‌కునా ఇటువంటి సేవ‌"ను పాడ‌టం మొద‌లుపెట్టారు. అంతే.. ఒక్క వాణీ జ‌య‌రామ్ సోలో సాంగ్ మిన‌హా మిగ‌తా అన్ని పాట‌లూ, కీర్త‌న‌ల‌ను బాలు పాడేశారు.  సినిమా విడుద‌లైంది. ఆ పాట‌లు విని ముందుగా ఎవ‌రూ "ఓహో.." అన‌లేదు. కానీ ఇంటికి వెళ్తూ "శంక‌రా నాద శ‌రీరాప‌రా.." అంటూ పాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ పాట ఆయ‌న‌కు ఆ ఏడాది ఉత్త‌మ గాయ‌కుడిగా జాతీయ అవార్డును అందించింది. 'శంక‌రాభ‌ర‌ణం' పాట‌లు చ‌రిత్ర సృష్టించాయి, చ‌రిత్ర‌లో నిలిచాయి. 

చాలా మందికి తెలీని బాలు ఫ‌స్ట్ మ్యూజిక్ కంపోజిష‌న్‌!

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల స‌రిహ‌ద్దుప‌ల్లె కోనేటంపేట‌లో పుట్టిన శ్రీ‌ప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తెలుగువారికీ, త‌మిళుల‌కూ ఉమ్మ‌డి సినీ గాయ‌కుడు. త‌మిళాంధ్ర దేశాల‌ను బాలులాగ ఉర్రూత‌లూగించిన గాయ‌కుడు మ‌రొక‌రు లేరు. ఒక‌విధంగా ఘంట‌సాల తెలుగు రంగానికీ, టి.ఎం. సౌంద‌ర‌రాజ‌న్ త‌మిళ రంగానికీ ప‌రిమిత‌మైన‌వాళ్లు. కాని బాలు గ‌ళం ఈ రెండు రంగాల‌కే కాకుండా క‌న్న‌డ‌, హిందీ రంగాల‌కు కూడా వ్యాపించి తెలుగు గాయ‌క‌శ్రేణికి అఖండ‌మైన కీర్తి ఆర్జించి పెట్టింది. అయితే బాలు కేవ‌లం గాయ‌కుడు మాత్ర‌మే కాదు. ఆయ‌న‌లో గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు కొద్దే అయిన‌ప్ప‌టికీ, ఆ చిత్రాల‌లోని ప్ర‌తి పాటా ఒక మ‌ణిపూస. ఆయ‌న స్వ‌ర‌ర‌చ‌న అంతటి మ‌ధుర‌మైన‌ది, అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ది. ఆయ‌న 30 తెలుగు చిత్రాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు. నేటి త‌రంలో చాలా మందికి తెలీని విష‌యం ఆయ‌న ఇత‌ర భాషా చిత్రాల‌కూ సంగీత బాణీలు అందించార‌నేది. 9 క‌న్న‌డ సినిమాలు, 5 త‌మిళ సినిమాలు ఆయ‌న సంగీత ర‌చ‌న‌కు నోచుకున్నాయి. అంతే కాదు, 'నాచే మ‌యూరి' (1986) హిందీ సినిమాకూ ఆయ‌న బాణీలు కూర్చారు. 'హ‌మ్ పాంచ్' (1980) సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన చ‌రిత్ర బాలుది. నిజానికి ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందే స్వ‌ర‌కర్త అయ్యారు. ఆల్ ఇండియా రేడియో పోటీల కోసం తొలిసారిగా ఆయ‌న స్వ‌రాలు కూర్చారు. 1961-62 ప్రాంతంలో త‌న తండ్రిగారు రాసిన రెండు పాట‌ల‌కు బాలు స్వ‌యంగా స్వ‌రాలు కూర్చారు. వాటిలో 'పాడ‌వే ప‌ల్ల‌కీ..' అనేది ఒక పాట అయితే, 'ప‌చ్చ‌ని వెచ్చ‌ని ప‌చ్చిక సుడిలో..' అనేది మ‌రో పాట‌. విశేష‌మేమంటే అస‌లు సంగీత‌మే నేర్చుకోని ఆయ‌న ల‌లిత సంగీత ఛాయ‌ల‌తో వాటికి సంగీతం స‌మ‌కూర్చ‌డం.  ఆ త‌ర్వాత‌, 1963లో మ‌ద్రాసులోని క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్‌లో జ‌రిగిన పాట‌ల పోటీల కోసం 'రాగ‌మో అనురాగ‌మో..' పాట త‌నే రాసుకొని, స్వ‌రాలు అల్లారు బాలు. ఆ పాట‌తోనే త‌న గురువు ఎస్పీ కోదండ‌పాణి దృష్టిలో ప‌డ్డారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చింది న‌టుడు పేకేటి శివ‌రామ్‌. అయితే అది సినిమా కోసం కాదు, 'తెలుగు త‌ల్లి' అనే డాక్యుమెంట‌రీకి. దానికి నేప‌థ్య సంగీతం అందించారు బాలు. అందులో ఓ పాటకి కూడా సంగీతం స‌మ‌కూర్చారు. అలా మొద‌టిసారి తెర‌మీద సంగీత ద‌ర్శ‌కునిగా త‌న పేరు చూసుకున్నారు బాలు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడ్ని చేసింది దాస‌రి నారాయ‌ణ‌రావు. 1977లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'క‌న్యాకుమారి' సినిమాతో గాయ‌కుడు బాలు సినీ సంగీత ద‌ర్శ‌కుడిగా కూడా మారారు.

సినిమాల్లోకి రాక‌ముందు సుర‌భి నాట‌కాల్లో న‌టించిన 'క‌త్తివీరుడు' కాంతారావు!

  'క‌త్తివీరుడు'గా పేరుపొందిన దివంగ‌త న‌టుడు కాంతారావు.. ఒకానొక‌ప్పుడు జాన‌ప‌ద చిత్రాల విష‌యంలో జ‌గ‌ద్విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావుతో స‌మాన‌మైన పాపులారిటీ సంపాదించారు. కాల‌క్ర‌మంలో జాన‌ప‌ద చిత్రాల స్థానంలో ఎక్కువ‌గా సాంఘిక చిత్రాలు నిర్మాణం కావ‌డంతో ఆయ‌న ప్రాభ‌వం త‌గ్గిపోయి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారాల్సి వ‌చ్చింది. కాగా చాలామందికి తెలీని విష‌యం.. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న ప్ర‌ఖ్యాత నాట‌క స‌మాజం 'సుర‌భి'లో ప‌నిచేశాడ‌నేది! మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడే ఆయ‌న‌కు వార‌స‌త్వంగా 'మాలీ ప‌టేల్' ప‌ద‌వి ల‌భించింది. అంటే గ్రామ మున‌స‌బు అన్న‌మాట‌. ఆ టైమ్‌లో వారి ఊరికి సుర‌భి నాట‌క కంపెనీ వ‌చ్చింది. అప్ప‌ట్లోనే కాంతారావుకు న‌టుడు కావాల‌నే ఆకాంక్ష ఎక్కువ‌గా ఉండేది. మిత్రుల‌తో క‌లిసి 'బాల‌మిత్ర నాట‌క మండ‌లి' అనే నాట‌క స‌మాజాన్ని ఏర్పాటుచేసి, చిల‌క‌మ‌ర్తి ల‌క్ష్మీన‌ర‌సింహం పంతులుగారి 'గ‌యోపాఖ్యానం', పానుగంటివారి 'మ‌ధుసేవ' లాంటి నాట‌కాల‌ను ఆడేవారు. సుర‌భి నాట‌క కంపెనీ ఆ ఊరికి వ‌చ్చాక ఆ కంపెనీలో చేరాల‌నే కోరిక‌ను నిర్వాహ‌కుల ద‌గ్గ‌ర బ‌య‌ట‌పెట్టారు కాంతారావు.  వాళ్లు ఆయ‌న‌ను త‌మ స‌మాజంలోకి తీసుకోవ‌డానికి ఒప్పుకోలేదు. "మీ కులంలో నాట‌కాల్లో న‌టించ‌డం మ‌హాప‌రాధం. పైగా మీరు గ్రామాధికారి ప‌ద‌విలో ఉన్నారు. మిమ్మ‌ల్ని మా స‌మాజంలోకి తీసుకుంటే మీ ఊరి పెద్ద‌లు మ‌మ్మ‌ల్ని బ్ర‌త‌క‌నివ్వ‌రు. మీకు పుణ్యం ఉంటుంది. మ‌మ్మ‌ల్నిలా వ‌దిలేయండి." అని వారు కాంతారావును బ‌తిమ‌లాడారు. కానీ ఆయ‌న మొండిమ‌నిషి. "మీరు న‌న్ను మీ స‌మాజంలోకి తీసుకోక‌పోతే.. ఈ ఊళ్లోనే కాకుండా, చుట్టుప‌క్క‌ల ఊళ్ల‌ల్లో కూడా నాట‌కాలు వేయ‌కుండా చేస్తాను జాగ్ర‌త్త." అని బెదిరించారు. దాంతో గ‌త్యంత‌రం లేక వాళ్లు ఆయ‌న‌ను త‌మ నాట‌క స‌మాజంలోకి తీసుకున్నారు. ఆ స‌మాజంలో చేరాక కాంతారావు వేసిన తొలి పాత్ర 'శ్రీ‌కృష్ణ లీల‌లు' నాట‌కంలో బ్ర‌హ్మ పాత్ర‌. ఆ త‌ర్వాత 'మ‌ధుసేవ‌', 'క‌న‌క‌తార‌', 'తెలుగుత‌ల్లి' లాంటి నాట‌కాల‌ను ఆడారు కాంతారావు. అక్క‌డే 'గ‌యోపాఖ్యానం' నాట‌కంలో తొలిసారి నార‌ద పాత్ర ధ‌రించారు. ఆ నాట‌కానుభ‌వ‌మే అనంత‌ర కాలంలో ఆయ‌న‌కు 'సీతారామ క‌ల్యాణం', 'శ్రీ‌కృష్ణ తులాభారం' లాంటి సినిమాల్లో నార‌ద పాత్ర‌ను అమోఘంగా పోషించి, పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకోవ‌డానికి కార‌ణ‌మైంది.

సూప‌ర్‌స్టార్ సినిమాకు ఘోస్ట్ రైట‌ర్స్‌గా ప‌నిచేసిన ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌!

  సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, సూప‌ర్ రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కాంబినేష‌న్ సూప‌ర్ హిట్‌. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎక్కువ‌గా ర‌చ‌న చేసింది కృష్ణ హీరోగా న‌టించిన సినిమాల‌కే. ఏకంగా 43 చిత్రాల‌కు కృష్ణ‌తో క‌లిసి ప‌నిచేశారు ప‌రుచూరి సోద‌రులు. అయితే వారు మొద‌ట‌గా కృష్ణ న‌టించిన సినిమాకు ప‌నిచేసింది ఘోస్ట్ రైట‌ర్స్‌గా కావ‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమా 'బంగారు భూమి' (1982). శ్రీ‌దేవి హీరోయిన్‌గా న‌టించిన ఆ సినిమాకు పి. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి (పి.సి. రెడ్డి) డైరెక్ట‌ర్‌. ఆ సినిమాకు రైట‌ర్స్‌గా ప‌నిచేసింది మోదుకూరి జాన్స‌న్‌, అప్ప‌లాచార్య‌. వారికి ఘోస్ట్ రైట‌ర్స్‌గా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వ‌ర్క్ చేశారు. అందుకే ఆ సినిమా టైటిల్స్‌లో బ్ర‌ద‌ర్స్ పేరు క‌నిపించ‌దు. న‌వ‌భార‌త్ బాబూరావుకు ఒక సినిమా క‌థ రాసిచ్చి, మ‌ద్రాస్ నుంచి ఉయ్యూరుకు బ‌య‌లుదేర‌బోతున్నారు బ్ర‌ద‌ర్స్‌లో చిన్న‌వాడైన గోపాల‌కృష్ణ‌. అప్పుడు 'బంగారు భూమి' సినిమాకు కోడైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న మ‌న్నెం రాధాకృష్ణ క‌లిసి "రేపు 26 మంది ఆర్టిస్టుల కాంబినేష‌న్ ఉంది. రైట‌ర్స్ మోదుకూరి జాన్స‌న్‌, అప్ప‌లాచార్య గార్లు అందుబాటులో లేరు. ఆ ఒక్క సీన్ రాసి వెళ్లండి." అని రిక్వెస్ట్ చేశారు. అంత‌క‌ముందే ఆ సినిమా క‌థాచ‌ర్చ‌ల్లో గోపాల‌కృష్ణ పాల్గొని ఉన్నారు. చూస్తే.. స్క్రిప్టులో ఒక‌టి కాదు 16 సీన్లు రాయాల్సి ఉన్న‌ట్లు గ‌మ‌నించారు గోపాల‌కృష్ణ‌. ఆ రాత్రి నిద్ర‌ను ప‌క్క‌న పెట్టేసి ఏక‌బిగిన 16 సీన్లు రాసేశారు.  పొద్దున్నే ఆ సీన్లు డైరెక్ట‌ర్ పి.సి. రెడ్డితో పాటు విన్న నిర్మాత వెంక‌న్న‌బాబు ఆశ్చ‌ర్య‌పోయి, అప్ప‌టిక‌ప్పుడు తాంబూలం తెప్పించి, అందులో రూ. 1,116 పెట్టి గోపాల‌కృష్ణ‌కు ఇచ్చారు. ఇది తాను డ‌బ్బుల కోసం రాయ‌లేద‌నీ, పి.సి. రెడ్డిగారి కోసం రాశాన‌నీ ఆయ‌న ఎంత చెప్పినా విన‌కుండా త‌న హ‌స్త‌వాసి మంచిదంటూ బ‌ల‌వంతంగా ఆ డ‌బ్బు గోపాల‌కృష్ణ చేతిలో పెట్టారు వెంక‌న్న‌బాబు. దాని త‌ర్వాత పి.సి. రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ న‌టించిన మ‌రో చిత్రం 'భోగ‌భాగ్యాలు'లో ఓ పాట రాశారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. ఇంత‌దాకా వాళ్లు రాసిన దాదాపు 350 చిత్రాల‌లో ఒకే ఒక్క పాట మాత్ర‌మే రాసిన చిత్రం అదే. "ఇదిగిదిగో డింబ‌కా.. నీవు మెచ్చిన మేన‌క" అంటూ వారు రాసిన పాట‌కు చ‌క్ర‌వ‌ర్తి సంగీతం స‌మ‌కూర్చారు. సినిమాలో కృష్ణ‌, శ్రీ‌దేవి జంట‌పై ఆ పాట‌ను తీశారు. ఇక టైటిల్ కార్డ్స్‌లో ర‌చ‌యిత‌లుగా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అనే పేరు వ‌చ్చిన తొలి కృష్ణ సినిమా 'ఈనాడు'. అది కృష్ణ 200వ చిత్రం కావ‌డం, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అది చ‌రిత్ర సృష్టించ‌డం ఇంకో విశేషం.