సింగ‌పూర్ వ్య‌క్తితో 'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా?

  తొలి సినిమా 'శంక‌రాభ‌ర‌ణం'ను ఇంటిపేరుగా మార్చుకొని 'శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి'గా పాపుల‌ర్ అయ్యారు రాజ్య‌ల‌క్ష్మి. ఆ సినిమా పూర్తి కాక‌ముందే, తొలి షెడ్యూల్ పూర్త‌య్యిందో లేదో, వెంట‌వెంట‌నే రెండు సినిమాల్లో నాయిక‌గా న‌టించే చాన్స్ ఆమెకు ద‌క్కింది. వాటిలో ఒక‌టి కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో ముర‌ళీమోహ‌న్‌తో న‌టించిన 'నిప్పులాంటి నిజం' కాగా, మ‌రొక‌టి బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించిన 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు' మూవీ. ప‌దేళ్ల కాలం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేనంత‌గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో హీరోయిన్‌గా, కీల‌క పాత్ర‌ధారిణిగా ఎడాపెడా సినిమాలు చేస్తూ, మ‌హాబిజీగా ఉంటున్న‌ప్పుడే సింగ‌పూర్ వ్య‌క్తిని పెళ్లిచేసుకొని అక్క‌డ‌కు వెళ్లిపోయారు రాజ్య‌ల‌క్ష్మి. త‌న కుటుంబంతో ఒక‌సారి చెన్నైలో ఒక డిన్న‌ర్‌కు వెళ్లారామె. ఆ డిన్న‌ర్‌కు ఒక యువ‌కుడు త‌న క‌జిన్స్‌తో వ‌చ్చాడు. తెలిసిన‌వాళ్లు ఇత‌ను సింగ‌పూర్‌లో ఉంటాడ‌ని ప‌రిచ‌యం చేశారు. అదే టైమ్‌లో రాజ్య‌ల‌క్ష్మి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సింగ‌పూర్ వెళ్లాల్సి ఉంది. ఆ విష‌య‌మే రాజ్య‌ల‌క్ష్మి చెప్పారు. "సింగ‌పూర్ వ‌స్తున్నారా! వీలైతే మా ఇంటికి రండి. మీకేదైనా అవ‌స‌రమైతే చెప్పండి, చేస్తాను." అని త‌న విజిటింగ్ కార్డ్ ఇచ్చాడ‌త‌ను. అలా ఆ ఇద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంది. అత‌ని పేరు కృష్ణ‌న్‌. అప్పుడత‌నికి ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారు. ఎవ‌రూ అత‌నికి న‌చ్చ‌ట్లేదు. వాళ్ల‌క్క‌య్య బొంబాయికి పిలిపించి, ఒక సంబంధం చూపించారు. ఆ సంబంధం కూడా అత‌నికి న‌చ్చ‌లేదు. చెన్నైలో రాజ్య‌ల‌క్ష్మిని క‌లిసిన రోజే అత‌ను బాంబేలో ఆ సంబంధం చూసి వ‌చ్చాడు. రాజ్య‌ల‌క్ష్మి తొలిచూపులోనే అత‌నిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత రాజ్య‌ల‌క్ష్మిని అత‌ను నేరుగా అడిగారు, "మీరు నాకు న‌చ్చారు. న‌న్ను పెళ్లిచేసుకుంటారా?" అని. అప్పుడు, "మా వాళ్ల‌తో మాట్లాడండి. వాళ్లు ఒప్పుకుంటే చేసుకోడానికి నాకిష్ట‌మే" అని చెప్పారు రాజ్య‌ల‌క్ష్మి. అప్ప‌టికే అత‌నికి తండ్రి లేరు. అందుక‌ని వాళ్ల‌న్న‌య్య చేత రాజ్య‌ల‌క్ష్మి అమ్మానాన్న‌ల‌తో మాట్లాడించాడు. వాళ్లు "మా అమ్మాయికి ఇష్ట‌మైతే మాకు అభ్యంత‌రం లేదు" అని చెప్పారు. అలా వాళ్ల పెళ్లి కుదిరింది. పెళ్లికి ఒక నెల టైమ్ తీసుకొని, ఈలోపు త‌న క‌మిట్ అయిన సినిమాల‌న్నింటినీ పూర్తి చేశారు రాజ్య‌ల‌క్ష్మి. మ్యారేజ్ జ‌రిగే రోజు తెల్ల‌వారుజాము 3 గంట‌ల దాకా ఆమె ప‌నిచేశారంటే.. న‌టిగా అప్పుడామె ఎంత బిజీగా ఉన్నారో ఊహించుకోవాల్సిందే. పెళ్ల‌య్యాక భ‌ర్త ఇంటికి సింగ‌పూర్ వెళ్లిపోయారామె. అయితే ఆమె న‌ట‌న‌ను పూర్తిగా వ‌దిలేయ‌లేదు. అక్క‌డ త‌మిళ టీవీ చాన‌ల్ కోసం సీరియ‌ల్స్‌లో న‌టించారు. 1999లో ఒక సీరియ‌ల్‌లో న‌ట‌న‌కు గాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ల‌భించింది. పెళ్లి త‌ర్వాత వెంటవెంట‌నే రోహిత్‌, రాహుల్ అనే ఇద్ద‌రు అబ్బాయిలు పుట్టారు. వాళ్ల ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం, స్కూలుకు రెడీ చేయ‌డం లాంటి ప‌నుల‌తో ఎక్కువ‌గా త‌న స‌మ‌యాన్ని కుటుంబానికి కేటాయిస్తూ వ‌చ్చారు. పిల్ల‌లు పెద్ద‌యి వాళ్ల ప‌నులు వాళ్లు చేసుకోవ‌డం మొద‌ల‌య్యాకే ఆమె చెన్నైకి వ‌చ్చి సినిమాల్లోకి రిఎంట్రీ ఇచ్చారు. కృష్ణ‌న్ మాత్రం సింగ‌పూర్‌లోనే ఉంటున్నారు. షూటింగ్‌లు లేన‌ప్పుడ‌ల్లా ఆమె భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఆమె పెద్ద కుమారుడు న‌టునిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడు.

నిన్న‌టి టాప్‌ ఐటమ్ గాళ్‌ ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది?

  హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై, ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన వాళ్లెంత‌మందో ఉన్నారు. అది అసాధార‌ణ‌మేమీ కాదు. కానీ ఐట‌మ్ గాళ్‌గా పేరు తెచ్చుకొని, సినిమా సినిమాకీ ఇమేజ్ పెంచుకుంటూ హీరోయిన్ రేంజికి ఎదిగిన తార‌లు అరుదు. తెలుగులో సిల్క్ స్మిత త‌ర్వాత ఆమె స్థానాన్ని భ‌ర్తీ చేసే తార ఇంత‌వ‌ర‌కూ రాలేదు. కానీ క‌నీసం ఆ స్థాయికి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం క‌లిగించిన తార ఒక‌రున్నారు. ఆమె తెలుగ‌మ్మాయి కాదు. క‌నీసం ద‌క్షిణాది తార కూడా కాదు. ఆమె ముంబై అమ్మాయి. ఆ మాట‌కొస్తే ఇండో పాకిస్తానీ. ఆమె తండ్రి భార‌తీయుడు కాగా, ఆమె త‌ల్లి పాకిస్తానీ. ఆమె.. ముమైత్ ఖాన్‌! కొన్నాళ్ల క్రితం కుర్ర‌కారు, వ‌య‌సు మీరిన వాళ్లు కూడా ఆమె నామం జ‌పించారు. ఫ‌లానా హీరోయిన్ పేరు తెలీద‌ని చెప్పే వాళ్లున్నారేమో కానీ, ముమైత్ అంటే తెలీని వాళ్లు లేరు అన్నంత‌గా అప్ప‌ట్లో ఆమె ఖ్యాతి తెలుగునాట విస్త‌రించింది. ప్ర‌తి నిర్మాతా త‌న సినిమాలో ముమైత్ ఉంటే సినిమాకి స‌గం బ‌లం వ‌చ్చిన‌ట్లుగా న‌మ్మేంత‌గా ఆమె త‌న ముద్ర‌ని వేసింది. టాలీవుడ్‌లో మొద‌ట 'స్వామి', 'ఛ‌త్ర‌ప‌తి' సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసినా.. అంద‌రికీ తెలిసింది మాత్రం 'పోకిరి' తోటే. "ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిందా ప‌ద‌హారే.." పాట‌తో ఆమె పేరు మారుమోగి, రాత్రికి రాత్రే ఐట‌మ్ స్టార్ అయిపోయింది. విల‌క్ష‌ణ‌మైన మ‌త్తు చూపులు, అణువ‌ణువూ శృంగారాన్ని చిందించే దేహంతో ఆమె యువ‌త‌రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అయితే రోజు రోజుకీ, సినిమా సినిమాకీ ఎదుగుతూ సినిమాకే హైలైట్ అయ్యే స్థాయికి చేరుకుంటుంద‌ని అప్పుడు చాలామంది ఊహించ‌లేదు. రాజ‌శేఖ‌ర్‌-స‌ముద్ర సినిమా 'ఎవ‌డైతే నాకేంటి', శ్రీ‌కాంత్‌-పోసాని మూవీ 'ఆప‌రేష‌న్ దుర్యోధ‌న' ముమైత్‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాయి. శివ‌నాగేశ్వ‌ర‌రావు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 'భూకైలాస్‌.. ఎక‌రం యాభై కోట్లు' లోనూ ఆమె స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. రెండు కోట్ల రూపాయ‌ల లోపు బ‌డ్జెట్‌తో త‌యారైన 'ఆప‌రేష‌న్ దుర్యోధ‌న' చిత్రం దానికి మూడింత‌ల క‌లెక్ష‌న్ రాబ‌ట్టిందంటే, అందులో ముమైత్ భాగ‌స్వామ్యం చాలానే ఉంది. అందుకే ఆ సినిమా డైరెక్ట‌ర్ పోసాని, "శ్రీ‌కాంత్ త‌ర్వాత నా సినిమాకి ముమైత్ హైలైట్‌. ప్రేక్ష‌కుల్ని మైమ‌ర‌పించే ల‌క్ష‌ణం ఆమెలో పుష్క‌లంగా ఉంది" అని ప్ర‌శంసించారు. అందుకు త‌గ్గ‌ట్లే ఇత‌ర పాత్ర‌ల నుంచి అతి స్వ‌ల్ప కాలంలో టైటిల్ రోల్స్ పోషించే స్థాయికి ఎదిగింది ముమైత్‌. ఆమె టైటిల్ రోల్ చేసిన 'మైస‌మ్మ ఐపీఎస్' పెద్ద హిట్ట‌యింది. భ‌ర‌త్ పారేప‌ల్లి డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను ప్ర‌పంచంలోనే అత్య‌ధిక చిత్రాల ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు అందించ‌డం విశేషం. దాని త‌ర్వాత 'మంగ‌తాయారు టిఫిన్ సెంట‌ర్' సినిమాతోనూ ఆమె అల‌రించింది. ఒక‌వైపు హీరోయిన్‌గా న‌టిస్తూనే, మ‌రోవైపు ఐట‌మ్ గాళ్‌గానూ ఆమె కొన‌సాగుతూ వ‌చ్చింది. పూరి జ‌గ‌న్నాథ్ మూవీ 'నేనింతే'లో త‌న నిజ జీవిత పాత్ర‌లోనే ఆమె క‌నిపించింది. ఒక‌ప్పుడు టాప్ డైరెక్ట‌ర్ అయిన ఎ. కోదండ‌రామిరెడ్డి అంత‌టాయ‌న ముమైత్‌ను డ్యూయ‌ల్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తూ 'పున్న‌మి నాగు' సినిమా తీశారు. య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన మాగ్న‌మ్ ఓప‌స్ 'మ‌గ‌ధీర' చిత్రంలో "బంగారు కోడిపెట్ట" రీమిక్స్ సాంగ్‌లో ముమైత్ అల‌రించిన తీరు ఇంకా మ‌న క‌ళ్ల ముందు మెదులుతూనే ఉంది. అలా 2016 దాకా సినిమాల్లో క‌నిపిస్తూ వ‌చ్చిన ముమైత్ హ‌ఠాత్తుగా వెండితెర‌పై క‌నుమ‌రుగైంది. చిన్న‌తెర‌పై అడ‌పా ద‌డ‌పా క‌నిపిస్తూ వ‌స్తోంది. డాన్స్ షో 'ఢీ'లోనూ, 'బిగ్ బాస్ 1' కంటెస్టెంట్‌గానూ ద‌ర్శ‌న‌మిచ్చిన ఆమె.. ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ 'డాన్స్ ప్ల‌స్' షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు క‌రోనా టైమ్‌లో సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌స్తోంది. లేటెస్ట్‌గా టాలీవుడ్ డ్ర‌గ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ‌కు హాజ‌రైంది. ద‌శాబ్దం క్రితం పోటీలేని ఐట‌మ్ గాళ్‌గా చ‌క్రం తిప్పిన ముమైత్ ముచ్చ‌ట్లు ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపించ‌క‌పోవ‌డం విచిత్రం!

ఇంగ్లీష్‌లో డైలాగ్స్ చెప్ప‌డానికి భ‌య‌ప‌డ్డ ర‌జ‌నీకాంత్‌!

  సౌతిండియ‌న్ ఫిల్మ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న నాలుగు ద‌శాబ్దాల సినిమా కెరీర్‌లో ఒకే ఒక్క అమెరిక‌న్ ఫిల్మ్‌లో న‌టించారు. ఆ సినిమా 'బ్ల‌డ్‌స్టోన్' (1988). ప‌లు హాలీవుడ్ సినిమాలు నిర్మించిన భార‌తీయుడు అశోక్ అమృత‌రాజ్ నిర్మించిన ఈ మూవీని డ్వైట్ హెచ్‌. లిటిల్ డైరెక్ట్ చేశారు. ఆ కాలంలో ఒక ద‌క్షిణాది న‌టుడు ఒక హాలీవుడ్ ఫిల్మ్‌లో, అందునా సినిమాకు ఆయువుప‌ట్టు లాంటి కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌డం చాలా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌, బెంగ‌ళూరు, ముదువ‌లై వంటి భార‌తీయ లొకేష‌న్ల‌లో జ‌రిగింది. 'బ్ల‌డ్‌స్టోన్‌'లో శ్యామ్ స‌బు అనే టాక్సీ డ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్ పోషించారు ర‌జ‌నీ. బ‌య‌టి ప్ర‌పంచానికి అత‌ను ఒక టాక్సీ డ్రైవ‌రే కానీ, అత‌నికంటూ ఒక బల‌గం ఉంటుంది. క‌థానుసారం అమూల్య‌మైన 'బ్ల‌డ్‌స్టోన్' అనే వ‌జ్రం విదేశం నుంచి మ‌న‌దేశానికి త‌ర‌లించ‌బ‌డుతుంది. అది ర‌జ‌నీ టాక్సీలోకి, త‌ద్వారా అత‌ని చేతికి వ‌స్తుంది. ఈ వ‌జ్రం హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని విల‌న్ ముఠా భ్ర‌మ‌ప‌డి ఆమెను కిడ్నాప్ చేస్తుంది. ఆమె కోసం హీరో శాండీ మెక్‌వే (బ్రెట్ స్టిమ్‌లీ) ఇండియాకు వ‌స్తాడు. ర‌జ‌నీ, అత‌ను స్నేహితుల‌వుతారు. బ్ల‌డ్‌స్టోన్‌ను కాపాడుకోవ‌డం కోసం ఆ ఇద్ద‌రూ ఏం చేశార‌నేది మిగ‌తా క‌థ‌. ఇప్పుడేమో కానీ, ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాల్లో న‌టించే న‌టులు డ‌బ్బింగ్‌కంటూ విడిగా డేట్స్ ఇవ్వ‌డం అనేది ఉండేది కాదు. షూటింగ్ టైమ్‌లోనే డైలాగ్స్‌ను రికార్డ్ చేసేవాళ్లు. ర‌జ‌నీ సైతం త‌న సొంతు గొంతుతోనే డైలాగ్స్ చెప్పారు. మేక‌ర్స్ "మీ డైలాగ్స్ మీరే చెప్పాలి." అన్న‌ప్పుడు ఆయ‌న భ‌య‌ప‌డ్డారు. ఎందుకంటే ఇంగ్లీష్‌ను ఆయ‌న గ్రామ‌ర్‌కు త‌గ్గ‌ట్లు మాట్లాడ‌లేరు. బెంగ‌ళూరులో కండ‌క్ట‌ర్‌గా బెల్ కొట్టుకొంటూ వ‌చ్చిన ఆయ‌నకు ఇంగ్లీష్ సినిమాలో మాట్లాడేంత‌గా ఆ భాష‌లో ప్రావీణ్యం లేదు. కానీ ప్రొడ్యూస‌ర్స్ ర‌జనీకి ఒక ట్యూట‌ర్‌ను పెట్టి, ధైర్యం చెప్పి చివ‌ర‌కు ఆయ‌న సంభాష‌ణ‌లు ఆయ‌నే మాట్లాడేట్లు చేశారు. ఆ త‌ర్వాతే ఆయ‌న ఇంగ్లీష్‌ను కాస్త బాగా మాట్లాడుతూ వ‌చ్చారు. విశేష‌మేమంటే ర‌జ‌నీ చెప్పిన‌ డైలాగ్స్‌, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ హీరో బ్రెట్ స్టిమ్‌లీ, స్టోరీ రైట‌ర్ నికో మాస్టోరాకిస్‌ల‌ను బాగా మెప్పించింది. ఆ ఇద్ద‌రూ ఆయ‌న‌ను తెగ మెచ్చుకున్నారు. దాంతో ర‌జ‌నీ చాలా ఆనంద‌ప‌డ్డారు. 'బ్ల‌డ్‌స్టోన్‌'ను ఒమెగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1988 అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేసింది. అయితే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమాని జ‌నం బాగానే చూశారు.

నిన్నటి శృంగార‌తార అనూరాధ భ‌ర్త ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. గుండె త‌డ‌వుతుంది!

  అనూరాధ అన‌గానే మ‌న‌కు అనేక సినిమాల్లో క్ల‌బ్ సాంగ్స్‌లో, ఐట‌మ్ నంబ‌ర్స్‌లో ఆడిపాడిన తార వెంట‌నే గుర్తుకు వ‌చ్చేస్తారు. ఆమె అస‌లు పేరు సులోచ‌న‌. ఆమె కేవ‌లం డాన్స‌ర్ మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని న‌టి కూడా. కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్‌గానూ న‌టించారు. వాటిలో ఎక్కువ‌గా మ‌ల‌యాళం సినిమాలు ఉన్నాయి. చిరంజీవి హిట్ సినిమా 'మ‌గ మ‌హారాజు'లో భ‌ర్త‌ను బ‌తికించుకోవ‌డానికి ఒంటిని అమ్ముకోవ‌డానికి సిద్ధ‌ప‌డే గొప్ప మ‌న‌సున్న మ‌నిషిగా ఆమె ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం మ‌ర‌చిపోలేం. అలాంటి ఆమె ఒక‌సారి ఒక యువ‌కునితో లేచిపోయారంటూ ఇండ‌స్ట్రీలో గోల‌గోల అయ్యింది. అత‌ని పేరు స‌తీశ్ కుమార్‌. ప్ర‌తిభావంతుడైన కొరియోగ్రాఫ‌ర్‌. అత‌నంటే క‌మ‌ల్ హాస‌న్‌కు చాలా ఇష్టం. ఇండ‌స్ట్రీలో ఉండ‌టం, ఇద్ద‌రూ డాన్స‌ర్లు కావ‌డంతో స్నేహం ఏర్ప‌డింది. ఆడా మ‌గా సన్నిహితంగా మెల‌గుతుంటే ఎలాంటి ప్ర‌చారం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా! ఆ ఇద్ద‌రి గురించి కూడా అలాంటి ప్ర‌చార‌మే మొద‌లైంది. ఈ విష‌యం అనూరాధ వాళ్ల‌మ్మ చెవిని ప‌డింది. దాంతో ఆమె అనూరాధ‌ను కంట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. స‌తీశ్‌తో స‌న్నిహితంగా మెల‌గ‌వ‌ద్దంటూ హెచ్చ‌రించారు. ఇది అనూరాధ‌కు బాధ క‌లిగించింది. అప్ప‌టిదాకా స‌తీశ్ అంటే ఆమెకు స్నేహ‌భావ‌మే ఉండింది. కానీ అంద‌రితో పాటు త‌ను ఎంత‌గానో గౌర‌వించే అమ్మ కూడా ఈ ప్ర‌చారాన్ని న‌మ్మ‌డ‌మేంటి? న‌న్ను సందేహించ‌డ‌మేంటి? అని బాధ‌ప‌డ్డారు అనూరాధ‌. ఒక‌సారి స‌తీశ్ వాళ్లింటి ద‌గ్గ‌ర ఆ ఇద్ద‌రూ మాట్లాడుకుంటూ ఉండ‌టం చూసిన‌వాళ్లెవ‌రో ఆ విష‌యం అనూరాధ వాళ్ల‌మ్మ‌కు చెప్పారు. దాంతో ఆమె స‌తీశ్ వాళ్లింటికి ఫోన్‌చేసి, వారిపై కేక‌లు వేశారు. అప్పుడు అనూరాధ డిసైడ్ చేసుకున్నారు, స‌తీశ్‌నే పెళ్లిచేసుకోవాల‌ని. అనుకోవ‌డం ఆల‌స్యం.. అమ్మ అభీష్టానికి విరుద్ధంగా ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అత‌డిని పెళ్లి చేసేసుకున్నారు కూడా. తొమ్మిదేళ్లు వాళ్లు చాలా ఆనందంగా దాంప‌త్య జీవితం గ‌డిపారు. ఆ త‌ర్వాత ఒక బైక్ యాక్సిడెంట్‌లో స‌తీశ్ త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. డాక్ట‌ర్లు పెద‌వి విరిచేశారు. అయినా అనూరాధ ఆశ కోల్పోకుండా అప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లున్న (అభిన‌య‌శ్రీ‌, కాళీచ‌ర‌ణ్‌) ఆమె.. భ‌ర్త‌ను కూడా మ‌రో బిడ్డ అన్న‌ట్లు కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. అత‌డి వైద్యం కోసం త‌ను సంపాదించిందంతా దాదాపు ఖ‌ర్చుపెట్టేశారు. అలా ప‌ద‌కొండేళ్ల పాటు అత‌డిని ప‌సి పిల్లాడిని చూసుకున్న‌ట్లు చూసుకున్నారు. 2007లో ఒక‌రోజు భ‌ర్త‌కు అన్నం తినిపిస్తున్నారు అనూరాధ‌. అత‌నికి పొల‌మారింది. వెంట‌నే త‌ల‌వాల్చేశారు. అప్ప‌టిక‌ప్పుడే అత‌ని ప్రాణాలు పోయాయి. తెర‌పై మ‌న‌కు క‌నిపించే అనూరాధ‌ను చూసి, ఏవేవో మ‌నం ఊహించుకుంటాం. కానీ ఆమెలో ఎంత‌టి ద‌యామ‌యి, ప్రేమ‌మూర్తి దాగివుందో భ‌ర్త స‌తీశ్‌ను ఆమె చూసుకున్న విధానం మ‌న‌కు తెలియ‌జేస్తుంది.

టైమ్ వేస్ట్ అవుతుంద‌ని లంచ్ టైమ్‌లోనూ కిరీటం తీయ‌ని బాల‌కృష్ణ‌!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించిన కొన్ని సినిమాల‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. నిజానికి ఆయ‌న సినీరంగ ప్ర‌వేశం జ‌రిగింది 'మాయాబ‌జార్‌'తో. దిగ్ద‌ర్శ‌కుడు కె.వి. రెడ్డి శిష్యునిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సింగీతం సైతం లెజండ‌రీ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదిగారు. 'పుష్ప‌క విమానం' ఒక్క‌టి చాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలాంటిదో చెప్ప‌డానికి. అయితే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయ‌న‌కు జీవిత కాలంలో రాలేదు. కానీ ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణను మాత్రం మూడు సినిమాల్లో ఆయ‌న డైరెక్ట్ చేశారు. వాటిలో రెండు క్లాసిక్స్‌గా కాలానికి త‌ట్టుకొని నిల‌బ‌డ్డాయి.. అవి.. 'ఆదిత్య 369', 'భైర‌వ ద్వీపం'. అయితే మూడో సినిమా 'శ్రీ‌కృష్ణార్జున యుద్ధం' మాత్రం ఫ్లాప‌యింది. ఎన్టీఆర్‌లో ఉన్న దాదాపు అన్ని ల‌క్ష‌ణాలు బాల‌కృష్ణ‌లో ఉన్నాయంటారు సింగీతం. క్ర‌మ‌శిక్ష‌ణ‌, పెద్ద‌వారిని గౌర‌వించే ల‌క్ష‌ణాలు ఆయ‌న‌కు ఎస్సెట్స్‌గా చెబుతారు. పౌరాణిక చిత్రాలు చేసేట‌ప్పుడు ఒక‌సారి ఆభ‌ర‌ణాలు ధ‌రిస్తే, మ‌ళ్లీ షూటింగ్ ప్యాక‌ప్ చెప్పేట‌ప్పుడే వాటిని తీసేవారు ఎన్టీఆర్‌. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యంలోనూ వాటిని తీసేవారు కాదు, స‌మ‌యం వృథా అవుతుందని. అదే ల‌క్ష‌ణం బాల‌య్య‌కూ వ‌చ్చింది. 'ఆదిత్య 369' సినిమాలో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించే స‌మ‌యంలో త‌ల‌మీద కిరీటం ఇబ్బంది క‌లిగిస్తున్నా అలాగే ఉండేవారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో భ‌విష్య‌త్ కాలం షాట్స్ తీసేట‌ప్పుడు సింగీతంకూ, సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్‌కు ఎక్కువ ప‌ని ఉండేది. లైటింగ్ సెట్ చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది. అందువ‌ల్ల ఆర్టిస్టులు వ‌చ్చినా వృథాగా కూర్చోవాల్సి వ‌చ్చేది. అందుకే ఒక‌రోజు బాల‌కృష్ణ‌ను కాస్త ఆల‌స్యంగా ర‌మ్మ‌ని చెప్పారు సింగీతం. అలా ఆయ‌న ఇంటివ‌ద్దే ఉంటే, ఎన్టీఆర్ "షూటింగ్ లేదా?" అని అడిగారు. డైరెక్ట‌ర్‌గారే లేటుగా ర‌మ్మ‌న్నార‌ని బాల‌య్య చెప్పారు. "నిర్మాత మ‌న‌కు డ‌బ్బు ఇస్తున్న‌ది ఉద‌యం నుంచి సాయంకాలం దాకా వారికి అందుబాటులో ఉండ‌టానికి. ముందు మేక‌ప్ వేసుకొని షూటింగ్‌కు వెళ్లు." అని ఆర్డ‌ర్ వేశారు ఎన్టీఆర్‌. వెంట‌నే బాల‌కృష్ణ మేక‌ప్ వేసుకొని షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చారు. అదీ ఎన్టీఆర్ ప‌ద్ధ‌తి. దాన్ని బాల‌య్య అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో సింగీతం చెప్పుకొచ్చారు.

చాలా త‌క్కువ మందికి తెలిసిన భానుప్రియ వైవాహిక జీవితంలోని నిజాలు!

  ఒక‌ప్పుడు సినిమా హీరోయిన్ల‌లో 'విశాల‌నేత్రి' అనే మాట‌కు నిఖార్స‌యిన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు భానుప్రియ‌. చ‌క్క‌ని న‌టి, అంత‌కుమించిన డాన్స‌ర్ కావ‌డంతో క‌ళ్ల‌తోటి ఆమె ప‌లికించే భావాల‌ను ప్రేక్ష‌కులు ముచ్చ‌ట‌ప‌డుతూ చూసేవారు. అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఒక ద‌శాబ్దం పాటు రాణించిన భానుప్రియ వ్య‌క్తిగ‌త జీవితం అంత సాఫీగా సాగ‌లేద‌నే చెప్పాలి. మొద‌ట 'సితార‌'తో త‌నను హీరోయిన్‌ను చేసిన ద‌ర్శ‌కుడు వంశీతో ఆమె ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టికే పెళ్ల‌యిన వంశీ ఆమెను రెండో పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అన్నారు కూడా. కానీ భానుప్రియ త‌ల్లి గ‌ట్టిగా వారించ‌డ‌తో భానుప్రియ ఆగిపోయారు. ఆ త‌ర్వాత ఆమె సుప్ర‌సిద్ధ భ‌ర‌త‌నాట్య కళాకారిణి సుమ‌తీ కౌశ‌ల్ కుమారుడు ఆద‌ర్శ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయ‌న అమెరికాలో స్థిర‌ప‌డిన‌ పేరుపొందిన ఫొటోగ్రాఫ‌ర్‌. అందువ‌ల్ల న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పి భానుప్రియ అమెరికా వెళ్లిపోయారు. 2003లో అభిన‌య అనే పాప పుట్టిన త‌ర్వాత కొన్నాళ్ల‌కు భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయి. సామ‌ర‌స్యంగా వాటిని ప‌రిష్క‌రించుకుంటూనే కూతుర్ని తీసుకుని 2005లో భానుప్రియ చెన్నైకు వ‌చ్చేశారు. త‌న క‌మిట్‌మెంట్స్‌తో ఆద‌ర్శ్ ఎప్పుడూ బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌, ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయేవార‌నీ, దాంతో సెన్సిటివ్ అయిన‌ భానుప్రియ బాగా అప్‌సెట్ అయ్యార‌నీ, అందుకే ఇండియాకు తిరిగి వ‌చ్చేశార‌నీ అంతా అనుకున్నారు. ఏదేమైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టిస్తూ వ‌చ్చారు. అయితే భానుప్రియ భ‌ర్త‌తో విడిపోయార‌నీ, వారికి 2005లోనే విడాకులు కూడా మంజూర‌య్యాయ‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆద‌ర్శ్‌ను భానుప్రియ మాజీ భ‌ర్త అని కూడా ప‌త్రిక‌ల్లో రాస్తూ వ‌చ్చారు. అయితే 2016లో ఇచ్చిన ఒక‌ ఇంట‌ర్వ్యూలో తాము విడిపోలేద‌నీ, ప్ర‌తి సంసారంలో క‌ల‌త‌లు అనేవి సాధార‌ణ‌మేన‌నీ, త‌మ సంసారంలోనూ అవి వ‌చ్చాయ‌నీ ఆమె చెప్పారు. అత్త‌య్య సుమ‌తితో ఇప్ప‌టికీ త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. త‌న‌కు సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు ఆమె ఎంక‌రేజ్ చేశార‌ని ఆమె చెప్పారు. భ‌ర్త ఆద‌ర్శ్‌ నేష‌న‌ల్ జియోగ్రాఫిక‌ల్‌, డిస్క‌వ‌రీ చాన‌ల్స్‌కు వ‌ర్క్ చేస్తున్నార‌నీ, ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫొటోగ్రాఫ‌ర్ అనీ, సితార్ బాగా వాయిస్తార‌నీ అప్పుడు భానుప్రియ‌ తెలిపారు. ఆయ‌న అక్క‌డ‌, ఈమె ఇక్క‌డ అన్న‌ట్లు సుమారు ప‌దమూడు సంవ‌త్స‌రాల పాటు అలాగే విడివిడిగా జీవించారు ఆద‌ర్శ్‌, భానుప్రియ‌. 2018 ఫిబ్ర‌వ‌రి మొద‌ట్లో హ‌ఠాత్తుగా గుండెపోటుతో ఆద‌ర్శ్ మృతి చెందార‌నే వార్త తెలియ‌డంతో ఆమె గుండె బ‌ద్ద‌ల‌యింది. హుటాహుటిన అమెరికా బ‌య‌లుదేరి వెళ్లి, ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు భానుప్రియ‌. ప్ర‌స్తుతం భానుప్రియ కుమార్తె అభిన‌య‌తో క‌లిసి చెన్నైలో జీవ‌నం సాగిస్తున్నారు. లేటెస్ట్‌గా డాన్స్ బేస్డ్ ఫిల్మ్ 'నాట్యం'లో కీల‌క పాత్ర చేస్తున్నారు.

వియ్యంకుడు రామానాయుడుతో అక్కినేని చేసిన మొద‌టి సినిమా ఇదే!

  న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు వియ్యంకుల‌నే విష‌యం తెలిసిందే. నాగార్జున‌కు, రామానాయుడు కుమార్తె ల‌క్ష్మికి 1984లో వివాహం జ‌రిగింది. కానీ అభిప్రాయ భేదాల కార‌ణంగా ఆరేళ్ల‌లోనే ఇద్ద‌రూ విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీల మ‌ధ్య స‌న్నిహిత‌త్వం ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ రెండు కుటుంబాలూ ఒక్క‌టే అన్నంత‌గా మెల‌గుతూ వ‌స్తున్నాయి. వియ్యంకులు కాక‌ముందే ఏఎన్నార్ హీరోగా ప‌లు చిత్రాలు నిర్మించారు రామానాయుడు. ఈ రోజు (జూన్ 6) రామానాయుడు జ‌యంతి సంద‌ర్భంగా ఆ సినిమా విశేషాలు... ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'సిపాయి చిన్న‌య్య' (1969). ఇందులో అక్కినేని టైటిల్ రోల్ పోషించ‌డంతో పాటు, జ‌మీందార్ భాస్క‌ర్‌గా కూడా న‌టించారు. అంటే డ్యూయ‌ల్ రోల్ అన్న‌మాట‌. విశేష‌మేమంటే ఈ సినిమా కంటే ముందు రామానాయుడు నిర్మించిన 'రాముడు-భీముడు' సినిమాలోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేశారు. అది వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఇలా ఇద్ద‌రు టాప్ హీరోల‌తో నిర్మించిన తొలి చిత్రాల్లో వారిచేత డ్యూయ‌ల్ రోల్ చేయించిన అరుదైన రికార్డును రామానాయుడు సొంతం చేసుకున్నారు. 'సిపాయి చిన్న‌య్య' చిత్రానికి జి.వి.ఆర్‌. శేష‌గిరిరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ సినిమాని నిర్మించిన‌ప్ప‌టికీ ఓపెనింగ్ సీన్స్‌తో పాటు, క్లైమాక్స్ సీన్ల‌నూ, రెండు పాట‌ల్నీ క‌ల‌ర్‌లో చిత్రీక‌రించారు. చిన్న‌య్య పాత్ర‌కు జోడీగా కె.ఆర్‌. విజ‌య‌, భాస్క‌ర్ క్యారెక్ట‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా భార‌తి న‌టించారు. అప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి, మంచి డాన్స‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి "ఒరే మావా.. ఏసుకోరా సుక్క" అనే ఆరుద్ర పాట‌కు డాన్స్ చేశారు. అది విశేషం కాదు. అదివ‌ర‌కే ఆమె పెళ్లి చేసుకొని, సినిమాల్లో న‌టించ‌నంటూ మ‌నీలా వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో బంధువుల ఇంట్లో జ‌రుగుతున్న వివాహ వేడుక‌కు ఆమె మ‌ద్రాసు వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసి, ఆమెను త‌మ సినిమాలో ఓ పాటలో న‌టించ‌మ‌ని రామానాయుడు కోరారు. ఆయ‌న మీదున్న గౌర‌వంతో ఆ పాట‌కు డాన్స్ చేశారు విజ‌య‌ల‌క్ష్మి. స‌త్య‌నారాయ‌ణ కాంబినేష‌న్‌తో ఆ పాట‌ను చిత్రీక‌రించారు. 

తిన‌డానికి తిండిలేని ఎస్వీఆర్ దీన‌స్థితి చూసి అంజ‌లీదేవి ఏం చేశారో తెలుసా?

  ఆర్టిస్ట్ కావాల‌ని మ‌ద్రాస్ వెళ్లారు ఎస్వీ రంగారావు. తేనాంపేట‌లోని ఎల్డామ్స్ రోడ్ చివ‌ర‌న ఉన్న ఓ ప్రెస్‌లో కింద పేప‌ర్లు వేసుకొని ప‌డుకొని క‌ల‌లు కంటూ వ‌చ్చారు. ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతాయేమోన‌ని నిరాశ‌ప‌డ్డ రోజులున్నాయి. ఈ జీవితం ఇంతేనా అని కృంగిపోయిన సంద‌ర్భాలున్నాయి. తిన‌డానికి తిండి లేక ప‌స్తులుండి మంచినీళ్లు మాత్ర‌మే తాగి బ‌తికిన రోజులున్నాయి. ఈ బాధ‌లు ప‌డ‌లేక ఇంటికి వెళ్లిపోదామ‌ని రెడీ అయితే, ఆ త‌ర్వాత కాలంలో 'తాత మ‌న‌వ‌డు' లాంటి సినిమాలు తీసిన నిర్మాత కె. రాఘ‌వ వారించారు. ఎస్వీఆర్‌తో పాటు ఆయ‌నా సినీ రంగంలో ఏదో ఒక ఉపాధి చూసుకోవాల‌ని వ‌చ్చిన‌వారే. ఇద్ద‌రికి ఇద్ద‌రూ తోడ‌య్యారు. ఎస్వీఆర్‌కు నాట‌కాల ద్వారా కాకినాడ‌లో ప‌రిచ‌యం ఉన్న అంజ‌లీదేవి వాళ్ల బాధ‌లు చూసి, త‌న ఇంట్లోని అయ్య‌ర్‌కు చెప్పి, వాళ్లెప్పుడు భోజ‌నానికి వ‌చ్చినా లేద‌న‌కుండా పెట్ట‌మ‌ని పుర‌మాయించారు. అయినా అస్త‌మానూ అక్క‌డ‌కు ఏం వెళ్తారు! ఎలాగైతేనేం ఎస్వీఆర్ హీరో అయ్యారు. కానీ ఆయ‌న హీరోగా న‌టించిన ఆ సినిమా 'వ‌రూధిని' (1946) ఫ్లాప‌య్యింది. దాంతో లైఫ్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సినిమాలకు వేషాలు వెదుక్కుంటున్న‌ప్పుడు ప‌రిస్థితి వేరుగా ఉంటుంది కానీ, మొద‌టి సినిమాయే ఫ్లాపైతే ఆ ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. బాధ‌, అవ‌మానం.. రెండూ మ‌న‌సును మెలిపెడుతుంటాయి. ఆ టైమ్‌లో ఎస్వీఆర్ ఇంటికి వెళ్లిపోదామ‌ని నిర్ణ‌యించేసుకున్నారు. అప్పుడే ఊళ్లోని పెద్ద‌వాళ్లు కూడా పెళ్లి చేసుకోమ‌న్నారు. ఆయ‌న మేన‌కొడ‌లినిచ్చి పెళ్లి చేసేశారు. సంసార బాధ్య‌త కూడా మీద ప‌డ‌టంతో జంషెడ్‌పూర్‌లో ఉద్యోగం చేయ‌డానికి వెళ్లిపోయారు. ఆయ‌న అక్క‌డ ఉండ‌గానే డైరెక్ట‌ర్ బి.ఎ. సుబ్బారావు నుంచి పిలుపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నాలుగైదు సినిమాలు చేశాక 1951లో వ‌చ్చిన 'పాతాళ‌భైర‌వి'లో చేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర‌తో తారాజువ్వ‌లా పైకెగ‌శారు ఎస్వీఆర్‌. అది ఆయ‌న న‌టించగా విడుద‌లైన ఏడ‌వ చిత్రం. ఆ త‌ర్వాత చ‌నిపోయేంత వ‌ర‌కు 1974లో వ‌చ్చిన చివ‌రి చిత్రం 'ద‌క్ష య‌జ్ఞం' దాకా ఆయ‌న తిరుగులేని విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌కాశించారు.

ఒంట‌రిగా హోట‌ల్ గ‌దిలో ఉండ‌ట‌మే మ‌హాన‌టి పాలిట శాప‌మైంది!

  మ‌హాన‌టి సావిత్రి 1981 డిసెంబ‌ర్ 26 రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ అనిత‌ర సాధ్య‌మైన న‌ట‌న‌తో ఎప్ప‌టికీ తెలుగువారి ఆరాధ్య‌తార‌గా వారి గుండెల్లో స్థానం పొందారు. భౌతిక దేహాన్ని విడ‌నాడ‌టానికి 596 రోజుల ముందే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె ఆ స్థితిలోకి వెళ్లి ప్ర‌దేశం ఏదో తెలుసా?  క‌ర్నాట‌క‌లోని ఓ హోట‌ల్ గ‌దిలో! 'ఇది అర‌ద‌గాయ' అనే క‌న్న‌డ మూవీలో న‌టించ‌డం కోసం ఆమె బెంగ‌ళూరు వెళ్లారు.  త‌న‌కు కేటాయించిన హోటల్ రూమ్‌లో ప‌డుకొంటే, అంత‌దాకా త‌న జీవిత‌మంతా సినిమా రీళ్ల‌లా క‌ళ్ల‌ముందు మెదిలింది. ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్ర‌లు వేసిన త‌ను.. చివ‌రికి బ‌తుకు తెరువు కోసం ఎలాంటి పాత్ర‌లు వేయాల్సి వ‌స్తున్న‌దో త‌ల‌చుకొని తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యారు. దుఃఖం త‌న్నుకువ‌చ్చింది. మంచంపై ప‌డి దొర్లారు. గుండెల్ని పిండేస్తున్న బాధ‌ను త‌ట్టుకోవ‌డం ఆమె వ‌శం కావ‌ట్లేదు. అప్ప‌టికే ఆమె మ‌ద్యానికి బానిస‌య్యారు. త‌ల్లి చ‌నిపోయాక సావిత్రికి స్వాంత‌న చేకూరుస్తోంది ఆ మ‌ద్య‌మే. అప్ప‌టికే రూమ్ బాయ్‌చేత తెప్పించుకొని ఉన్న మందు బాటిల్ తీసుకున్నారు. గ్లాసు త‌ర్వాత గ్లాసు వంపుకొని బాటిల్ మొత్తం తాగేశారు. తెల్లారి ఆమెను లొకేష‌న్‌కు తీసుకుపోవ‌డం కోసం కారొచ్చింది. డ్రైవ‌ర్ వ‌చ్చి ఎంత‌సేపు త‌లుపుకొట్టినా రెస్పాన్స్ లేదు. అత‌ను వెళ్లి రిసెప్ష‌న్‌లో చెప్పాడు. వాళ్లొచ్చి త‌మ ద‌గ్గ‌రున్న రెండో తాళంతో త‌లుపులు తెరిచారు. నేల‌మీద మందు బాటిల్‌, గ్లాసు, చింద‌ర‌వంద‌ర‌గా వ‌స్తువులు.. అక్క‌డే నేల‌మీదే ప‌డిపోయి ఉన్న.. మ‌హాన‌టి! ఎంత పిలిచినా, క‌దిపినా ప‌ల‌క‌లేదు, ఉల‌క‌లేదు. స్పృహ‌లో ఉంటేగా! ప్రొడ్యూస‌ర్‌కు ఫోన్ వెళ్లింది. వెంట‌నే కారులో ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. ఆమె స్థితి చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ చేర్చుకోలేదు. దాంతో గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ బెడ్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో నేల‌మీదే ప‌డుకోబెట్టారు. ఎలాంటి సావిత్రికి ఎలాంటి దుర‌వ‌స్థ‌! సావిత్రిని హాస్పిట‌ల్‌లో చేర్చిన విష‌యం తెలియ‌గానే న‌టి ల‌క్ష్మి ఆగ‌మేఘాల మీద అక్క‌డ‌కు వ‌చ్చారు. ప‌సిపాప‌లా అమాయ‌కంగా నిద్ర‌పోతున్న‌ట్లున్న సావిత్రిని చూడ‌గానే గుండె ప‌గిలింది ల‌క్ష్మికి. "మా అమ్మ‌ను ఇలా కింద ప‌డేశారేమిటి? ఈమె ఎవ‌ర‌నుకుంటున్నారు? ద‌య‌చేసి మంచంపై ప‌డుకోబెట్టండి." అని హాస్పిట‌ల్ వాళ్ల‌ను వేడుకున్నారు. అప్పుడు ఆమెకు మంచం ఏర్పాటుచేసి, ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో త‌మ ఆరాధ్య తార‌ను చూడ్డానికి వంద‌లాదిగా జ‌నం త‌ర‌లి రావ‌డం మొద‌లైంది. క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి గుండూరావు, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స‌హా అనేక‌మంది సెల‌బ్రిటీలు అక్క‌డ‌కు వ‌చ్చి, మంచానికి అతుక్కుపోయి ఉన్న సావిత్ర‌మ్మ‌ను చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అప్ప‌టిదాకా ఆమెను స‌రిగా ప‌ట్టించుకోని జెమినీ గ‌ణేశ‌న్ వ‌చ్చి, ఆమెని చూసి గుండెలు బాదుకున్నాడు. ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఏడ్చాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌ద‌హారు రోజుల త‌ర్వాత సావిత్రిని తీసుకొని మ‌ద్రాసుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అన్నా న‌గ‌ర్‌లో ఆమె నివాసంలోనే ఆమెను ఉంచి, డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌. రాజ‌గోపాల్ బృందంతో చికిత్స చేయిస్తూ వ‌చ్చారు. అదివ‌ర‌కు క‌ళ్ల‌తోటే అన్ని ర‌కాల ఉద్వేగాల‌నూ ప‌లికించి మెస్మ‌రైజ్ చేసిన ఆ మ‌హాగొప్ప తార‌, అప్ప‌ట్నుంచి అక్క‌డే నిర్జీవంగా పుండైపోయిన శ‌రీరంతో, మూసుకుపోయిన క‌ళ్ల‌తో మంచంమీదే ఉండి, కోమాలోకి వెళ్లిన 596వ రోజు కొన‌ప్రాణాన్ని కూడా వ‌దిలేసి, అశేష అభిమానుల గుండెలు బ‌ద్ద‌లుచేసి వెళ్లిపోయారు. 

ర‌జ‌ని అంటే రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఇంట్రెస్ట్‌.. ఎందుకంటే..!

  తెలుగు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించిన సినీ జంట‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ర‌జ‌ని జోడీ ప్ర‌ముఖ‌మైంది. జంధ్యాల సినిమా 'అహ నా పెళ్లంట' (1987)లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీని, రొమాన్స్‌ను అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోగ‌ల‌మా! ఆ సినిమాతో పాటు భ‌లే మొగుడు, గుండ‌మ్మ‌గారి కృష్ణులు, భామా క‌లాపం, జీవ‌న గంగ‌, చిక్క‌డు దొర‌క‌డు, బంధువులొస్తున్నారు జాగ్ర‌త్త‌, చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు పెళ్లాం, గ‌డుగ్గాయి లాంటి సినిమాల‌తో హిట్ పెయిర్‌గా పేరుపొందారు. ఇప్ప‌టి మాదిరిగా అప్ప‌ట్లో సెట్స్ మీద హీరో హీరోయిన్లు క‌ల‌సి మాట్లాడుకోవ‌డం అనేది ఉండేది కాదు. షాట్ అయితే ఎవ‌రి రూమ్‌లోకి వారు వెళ్లిపోయేవారు. అయితే సెట్స్‌పై రజ‌నితో రాజేంద్ర‌ప్ర‌సాద్ కాస్త స‌న్నిహితంగా మెలిగేవారు. దాంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఉంద‌ని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో వ‌దంతులు షికార్లు చేసేవి. కొన్ని ప‌త్రిక‌లు కూడా వారి మ‌ధ్య రిలేష‌న్‌షిప్ ఉందంటూ ఉన్న‌వీ, లేనివీ క‌ల్పించి రాసేవి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఆరోగ్యం గురించిన శ్ర‌ద్ధ ఎక్కువ‌. "ర‌జ‌నీ నువ్వింత తెల్ల‌గా ఎలా ఉన్నావ్‌?" అని అడిగేవారు. "ఒక డిటెక్టివ్ లాగా ఆయ‌న న‌న్ను ఫాలో అవుతుంటారు. ఆ డిటెక్టివ్ డ్ర‌స్ వేసుకోరంతే. ఈమె ఏదో తింటుంది, ఏమో చేస్తుంది అనేది ఆయ‌న అనుమానం. మా మ‌ద‌ర్‌కు ఆయ‌న చాలా క్లోజ్‌. మా మ‌ద‌ర్ చేసే వంట‌ల‌న్నీ ఆయ‌న‌కు చాలా ఇష్టం. 'ర‌జ‌నీ ఏం తింటుంది?' అని ఆమెను అడిగారు. 'లేదు బాబూ.. ప్ర‌త్యేకంగా త‌నేమీ తిన‌దు.' అని ఆమె చెప్పేది. నా డైట్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఆయ‌న క్యూరియాసిటీ." అని ఓ ఇంట‌ర్వ్యూలో ర‌జ‌ని చెప్పారు. చాలామంది హీరోయిన్లు రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో న‌టించ‌మ‌ని చెప్పిన సంద‌ర్భంలో ర‌జ‌ని వ‌చ్చి ఆయ‌న‌తో క‌లిసి న‌టించారు. అప్ప‌టికే ఆమె బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, అర్జున్ లాంటి హీరోల‌తో క‌లిసి న‌టిస్తున్నారు. "ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డానికి న‌న్ను వ‌చ్చి అడిగిన‌ప్పుడు నేను చెప్పిందొక్క‌టే.. 'నాకు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఒక‌ప్పుడు నేనూ కొత్తే, నేనూ చిన్నే. చేస్తాన‌'ని చెప్పి చేశాను. అందువ‌ల్ల నేన‌న్నా, మా ఫ్యామిలీ అన్నా ఆయ‌న‌కు ప్ర‌త్యేక అభిమానం. మ‌రోవైపు ఆరోగ్యం గురించిన శ్ర‌ద్ధ‌తో నేను భోజ‌నం చేస్తుంటే, నా ప‌క్క‌న వ‌చ్చి కూర్చోవ‌డం, భోజ‌న‌మ‌య్యాక 'బీడా తింటావా?' అన‌డిగేవారు. మేం అట్లా ద‌గ్గ‌ర‌గా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే చూసేవాళ్ల‌కు ఎవ‌రికైనా అనిపిస్తుంది, ఏదో ఉంద‌ని. అందుకే అప్ప‌ట్లో మా మ‌ధ్య ఏదో ఉంద‌ని రాసేవారు." అని చెప్పుకొచ్చారు ర‌జ‌ని.

నాగ్ 'ఆఖ‌రి పోరాటం'లో చెయ్య‌మ‌ని సుహాసినికి చెప్పింది చిరంజీవి అని తెలుసా?

  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సుహాసిని 'మంచిదొంగ‌', 'ఆఖ‌రి పోరాటం' చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించారు. 'మంచిదొంగ‌' మూవీలో చిరంజీవి స‌ర‌స‌న ఆమె చేశారు. ఆ సినిమాలో ఆమెది లాయ‌ర్ పాత్ర‌. మ‌రో హీరోయిన్ విజ‌య‌శాంతిది ఇన్‌స్పెక్ట‌ర్ రోల్‌. ఇక 'ఆఖ‌రి పోరాటం' సినిమాలో నాగ్ జోడీగా చేశారు సుహాసిని. మెయిన్ హీరోయిన్ రోల్‌ను శ్రీ‌దేవి చేశారు. ఆ మూవీలో సుహాసినిని న‌టించ‌మ‌ని అడిగింది చిరంజీవి కావ‌డం విశేషం. "రాఘ‌వేంద్ర‌రావు నిన్ను ఆ క్యారెక్ట‌ర్‌కు రిక‌మెండ్ చేశారు. నువ్వు పూర్తిగా యారొగెంట్ అని ఆయ‌న‌కు తెలీదు. నువ్వు ఏం చేయాల‌నుకుంటే అది చేస్తావ‌ని నాకు తెలుసు. నువ్వెందుకు క‌థ విన‌కూడ‌దు?" అన‌డిగారు. నిజానికి ఈ రెండు సినిమాల్లో మొద‌ట మొద‌లైంది 'ఆఖ‌రి పోరాటం' కాగా, మొద‌ట విడుద‌లైంది 'మంచి దొంగ‌'. 'ఆఖ‌రి పోరాటం'లో సునాద‌మాల‌గా సుహాసిని న‌టించారు. అది చాలా చ‌క్క‌ని పాత్ర‌. ఆ క్యారెక్ట‌ర్‌కు రాఘ‌వేంద్ర‌రావు మొద‌టి చాయిస్ రేవ‌తి. కానీ రైట‌ర్ జంధ్యాల ఆ పాత్ర‌కు సుహాసిని అయితే బాగుంటుంద‌ని సూచించారు. రాఘ‌వేంద్ర‌రావును సుహాసిని క‌లిసిన‌ప్పుడు, "నువ్వు చెయ్య‌నంటే, నువ్వే రేవ‌తితో మాట్లాడి, ఆమెను ఫిక్స్ చెయ్యి" అని చెప్పారాయ‌న‌. "ఈ క్యారెక్ట‌ర్ నువ్వు చెయ్యాలి, లేదంటే రేవ‌తి చెయ్యాలి. నువ్వు చెయ్య‌నంటే, రేవ‌తి నీ ఫ్రెండే క‌దా, త‌న‌ని ఫిక్స్ చెయ్యి" అని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని సుహాసిని స్వ‌యంగా చెప్పారు. 'ఆఖ‌రి పోరాటం' ఫ‌స్ట్ డే షూటింగ్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. "మొద‌ట నేను కింద‌ప‌డిపోతే, త‌ర్వాత నాగార్జున నామీద ప‌డిపోతాడు. మా ఇద్ద‌రి మీదా ఓ పిల్ల‌ర్ ప‌డిపోతుంది. చాలాసేపు అలాగే ప‌డిపోయి ఉన్న‌ట్లు చేయాల్సి వ‌చ్చింది." అని చెప్పారు. నిజానికి ఆ సీన్‌లో రొమాన్స్ బాగా పండింది. నాగ్‌-సుహాసిని మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. 

కొడుకు డైరెక్ట‌ర్ అవ‌డం చూసింది కానీ.. అత‌డి విజ‌యాన్ని చూడ‌లేక‌పోయింది!

  ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించి, మంచి హిట్ట‌యిన సినిమాల‌కు క‌థ‌లు, మాట‌లు రాసిన కొర‌టాల శివ, 'మిర్చి' మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై, తొలి సినిమాతోటే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. త‌ల్లి చావుకు కార‌ణ‌మైన ఆగ‌ర్భ శ‌త్రువును జై అనే యువ‌కుడు మంచివాడిగా మార్చ‌డ‌మ‌నే పాయింట్ ప్రేక్ష‌కుల‌కు అమితంగా న‌చ్చేసి, దానికి ఘ‌న విజ‌యం చేకూర్చిపెట్టారు. తొలి సినిమా అందించిన అద్భుత విజ‌యంతో కొర‌టాల వెన‌క్కి తిరిగిచూడ‌కుండా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి, ఒక‌దాన్ని మించి ఒక‌టిగా.. మ‌రో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్.. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. తీశాడు. ఇప్పుడు చిరంజీవితో 'ఆచార్య' మూవీ తీస్తున్నాడు. అయితే ద‌ర్శ‌కుడిగా కొడుకు సాధించిన విజ‌యాన్ని చూడ‌కుండానే శివ త‌ల్లి చ‌నిపోయారు. ఇది అత‌డి జీవితంలోనే అత్యంత బాధాక‌ర ఘ‌ట‌న‌. శివ‌కు ప‌దేళ్ల వ‌య‌సులో, 1985లోనే తండ్రి చ‌నిపోయారు. త‌ల్లే పిల్ల‌ల ఆల‌నా పాల‌నా చూసుకుంటూ, వాళ్ల‌ను పెంచి పెద్ద‌వాళ్ల‌ను చేసింది. రైట‌ర్‌గా శివ స‌క్సెస్‌ను చూసిన ఆమె, అత‌డి పెళ్లిని కూడా చూసింది. అత‌డు ద‌ర్శ‌కుడిగా మారిన‌ప్పుడు కొడుకు కెరీర్ ప‌రంగా మ‌రో మెట్టు ఎదిగాడ‌ని సంతోషించింది. అయితే ద‌ర్శ‌కుడిగా అత‌డు సాధించిన విజ‌యాన్ని క‌ళ్లారా చూసి, ఆనందించ‌కుండానే ఆ త‌ల్లి క‌న్నుమూసింది. అవును. 'మిర్చి' సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లోనే ఆమె అనూహ్యంగా తుదిశ్వాస విడిచారు. "ఆమె నా ఫ‌స్ట్ సినిమా స‌క్సెస్ చూడ‌లేదు. అది నా జీవితంలో పూడ్చ‌లేని న‌ష్టం. నాన్న నా చిన్న‌త‌నంలోనే చ‌నిపోయినా, అమ్మ ఉండ‌టంతో ఆ లోటు తెలియ‌లేదు. జీవితంలో అమ్మ చాలా పోరాడింది. చ‌దువు చెప్పించి, మ‌మ్మ‌ల్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. ఆమె ఉన్న‌ట్ల‌యితే నా విజ‌యాన్ని అంద‌రికంటే ఆమె ఎక్కువ‌గా ఎంజాయ్ చేసేది. నా స‌క్సెస్‌ను అమ్మ చూడ‌క‌పోవ‌డం ఒక్క‌టే నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన విష‌యం." అని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు కొర‌టాల‌.

'సీతారామ క‌ల్యాణం'లో వేషం కోసం ఎన్టీఆర్‌ను క‌లిసిన శోభ‌న్‌బాబు!

  మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌ధాన పాత్ర పోషించిన 'దైవ‌బలం' (1959) చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు శోభ‌న్‌బాబు. అందులో ఆయ‌న గంధ‌ర్వ‌కుమారుడిగా కొద్దిసేపు క‌నిపించే పాత్ర చేశారు. మూడంటే మూడు రోజుల్లో ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. ఆ సినిమా త‌ర్వాత దాన్ని నిర్మించిన పొన్న‌లూరి బ్ర‌ద‌ర్స్ 'మహామాయ' అనే సినిమాను శోభ‌న్‌బాబు హీరోగా తీద్దామ‌నుకున్నారు. కానీ 'దైవ‌బ‌లం' ఫ్లాప‌వ‌డంతో ఆ సినిమా అట‌కెక్కింది. దాని త‌ర్వాత చిత్ర‌పు నారాయ‌ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'భ‌క్త శ‌బ‌రి' (1960) చిత్రంలో శ‌బ‌రి పాత్ర‌ధారి పండ‌రీబాయి ద‌గ్గ‌రుండే క‌రుణ అనే మునికుమారుడిగా న‌టించారు శోభ‌న్‌బాబు. ఆ మూవీలో రామ‌ల‌క్ష్మ‌ణులుగా హ‌ర‌నాథ్‌, రామ‌కృష్ణ న‌టించారు. ఆ స‌మ‌యంలో పుట్టిన త‌న కుమారుడికి ఆ సినిమాలో త‌ను చేసిన పాత్ర పేరు "క‌రుణ" అని పెట్టుకున్నారు శోభ‌న్‌. రెండు సినిమాలు చేసినా అవ‌కాశాలు వాటంత‌ట‌వి ఆయ‌న‌కు రాలేదు. అప్ప‌టి పెద్ద న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో పాటు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌ను ఆయ‌న క‌లుస్తూ వ‌చ్చారు. 1960లో ఎన్టీఆర్ తొలిసారి ద‌ర్శ‌కత్వంలో 'సీతారామ క‌ల్యాణం' చిత్రాన్ని ప్రారంభించారు. అందులో ఆయ‌న రావ‌ణాసురుడి పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు, శ్రీ‌రామునిగా హ‌ర‌నాథ్‌ను ఎంపిక చేసిన‌ట్లు శోభ‌న్‌కు తెలిసింది. త‌న అదృష్టం ప‌రీక్షించుకుందామ‌ని ఎన్టీఆర్‌ను క‌లిశారు. అప్ప‌టికే 'దైవ‌బ‌లం' సెట్‌లో క‌లిసుండ‌టంతో శోభ‌న్‌ను గుర్తుప‌ట్టిన ఎన్టీఆర్ "రండి బ్ర‌ద‌ర్" అని ఆహ్వానించారు. "ఏ వేషం వేస్తారు?" అని ఆయ‌నే అడిగారు. శ్రీ‌రాముని పాత్ర‌కు హ‌ర‌నాథ్ ఎంపికై ఉన్నాడ‌ని తెలిసినందువ‌ల్లా, పైగా ఏదో వేషం ఆయ‌నే ఇవ్వ‌కుండా, ఏ వేషం వేస్తార‌ని ఆయ‌నే అడ‌గ‌డంతో, కంగారులో "ల‌క్ష్మ‌ణుడి పాత్ర ఇవ్వండి సార్" అని అడిగేశారు శోభ‌న్‌. ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించ‌కుండా "ఓకే బ్ర‌ద‌ర్‌. మా సినిమాలో మీరే ల‌క్ష్మ‌ణుడు" అని అభ‌య‌మిచ్చేశారు. అలా 1961 జ‌న‌వ‌రిలో విడుద‌లైన‌ 'సీతారామ క‌ల్యాణం'లో ల‌క్ష్మ‌ణుడిగా న‌టించారు శోభ‌న్‌. చెప్పాలంటే ఆ సినిమాలో ల‌క్ష్మ‌ణుని పాత్ర చిన్న‌దే. కానీ ఇత‌ర న‌టుల కాంబినేష‌న్‌లో సీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల 56 రోజుల పాటు ఆ సినిమాకు ప‌నిచేయాల్సి వ‌చ్చింది. ఆ సినిమా చేసిన వెంట‌నే 'భీష్మ' సినిమాలో పనిచేసే అవ‌కాశం కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అందులో అర్జునుని వేషం వేశారు శోభ‌న్‌. అలా కెరీర్ తొలినాళ్ల‌లో నంద‌మూరి తార‌క‌రామారావు ప్రోత్స‌హించ‌డంతో నెమ్మ‌దిగా నిల‌దొక్కుకొని 'వీరాభిమ‌న్యు' (1965)గా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు పొందారు తెలుగువారి అందాల న‌టుడు శోభ‌న్‌బాబు.

మూడున్న‌రేళ్ల నుంచీ త‌రుణ్ ఏం చేస్తున్నాడు?

  త‌రుణ్ చివ‌రి సినిమా 'ఇది నా ల‌వ్ స్టోరీ' వ‌చ్చి మూడున్న‌రేళ్ల‌యిపోయింది. ఆ సినిమా కంటే ముందు నాలుగేళ్ల పాటు అత‌ను విరామం తీసుకున్నాడు. అప్పుడే అత‌ని కెరీర్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 'ఇది నా ల‌వ్ స్టోరీ' సినిమా చేస్తున్న‌ప్పుడు అత‌ను సినిమాల‌కు దూర‌మ‌వ్వ‌లేద‌నీ, మ‌ళ్లీ వ‌స్తున్నాడ‌నీ ఇండ‌స్ట్రీవాళ్లే కాకుండా, సాధార‌ణ ప్రేక్ష‌కులూ అనుకున్నారు. ఆ సినిమా ఎలా వ‌చ్చిందో, అలాగే పోయింది. నాలుగేళ్ల త‌ర్వాత త‌మ ముందుకు వ‌చ్చాడ‌ని ప్రేక్ష‌కులు అత‌డికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌లేదు స‌రిక‌దా, క‌నీసం అత‌డికి ఒక మామూలు విజ‌యాన్ని అందిద్దామ‌ని కూడా అనుకోలేదు. ఆ సినిమా ఫ్లాపైపోయింది. మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. తరుణ్ తాజా స‌మాచార‌మేదీ మ‌న‌కు తెలీడం లేదు. అత‌ను మ‌ళ్లీ న‌టిస్తున్నాడా, లేక త‌న వ్యాపారం చేసుకుంటూ అదే ఉత్త‌మ‌మ‌ని అందులో మునిగిపోయాడా?  బాల‌న‌టుడిగా 'తేజ' రూపంలో అల‌రించి, 'నువ్వే కావాలి' లాంటి సంచ‌ల‌న చిత్రంతో హీరోగా కెరీర్‌ను ఆరంభించిన త‌రుణ్ త‌ర్వాత కాలంలో టాప్ స్లాట్‌లోకి వెళ్ల‌డం అనివార్య‌మ‌ని అత‌ని త‌ల్లి రోజార‌మ‌ణి స‌హా చాలామంది భావించారు. 'ప్రియ‌మైన నీకు', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' సినిమాలు అత‌డిని యువ ప్రేక్ష‌కుల‌కు స‌న్నిహితం చేశాయి. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. మ‌నిషి పొట్టివాడైనా స్ఫుర‌ద్రూపం, చ‌క్క‌ని న‌ట‌న‌, డాన్సుల‌తో అత‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇక స్టార్ హీరో స్టేట‌స్ ఖాయ‌మ‌ని అనుకునే త‌రుణంలో ఒక్క‌సారిగా అత‌ని కెరీర్ తిరోగ‌మించింది. స‌బ్జెక్టులు, క్యారెక్ట‌ర్ల విష‌యంలో అత‌ను వేసిన త‌ప్ప‌ట‌డుగులే దీనికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. 'నిన్నే ఇష్ట‌ప‌డ్డాను', 'ఎలా చెప్ప‌ను', 'స‌ఖియా', 'సోగ్గాడు', 'ఒక ఊరిలో' లాంటి సినిమాలు అందుకు నిద‌ర్శ‌నం. ఇవ‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. కెరీర్‌లో 'న‌వ వ‌సంతం' కోసం ఎదురుచూస్తూ ఆ సినిమా చేశాడు. ఫ‌ర్వాలేద‌ని జ‌నం చెప్పారు. ఆ త‌ర్వాత బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'బంటీ ఔర్ బ‌బ్లీ' రీమేక్ 'భ‌లే దొంగ‌లు', కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో 'శ‌శిరేఖా ప‌రిణ‌యం' చేశాడు. ఈ రెండూ నిజానికి సూప‌ర్ హిట్ కావాలి. కానీ ఆశించిన రీతిలో ఆడ‌లేదు. అంతే.. ఆ త‌ర్వాత త‌రుణ్ కెరీర్ అనూహ్యంగా నెమ్మ‌దించింది. 'చుక్క‌లాంటి అమ్మాయి చ‌క్క‌నైన అబ్బాయి' సినిమా ప‌దే ప‌దే వాయిదా ప‌డుతూ 'శ‌శిరేఖా ప‌రిణ‌యం' వ‌చ్చిన నాలుగేళ్ల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ష‌రా మామూలే.. జ‌నం ఆద‌రించ‌లేదు. అయినా ఆ వెంట‌నే 'యుద్ధం', 'వేట' సినిమాలు వ‌చ్చాయి ఫ‌లితం శూన్యం. రెండూ డిజాస్ట‌ర్లే. ఆపైన నాలుగేళ్ల‌కు వ‌చ్చిన 'ఇది నా ల‌వ్ స్టోరీ'కి అదే ఫ‌లితం. ఇలా ఏమాత్రం ప్రోత్సాహ‌క‌రంగా లేని సినీ కెరీర్‌కు త‌రుణ్.. కామా మాత్ర‌మే పెట్టాడా?  ఫుల్‌స్టాప్ పెట్టేశాడా? అని చాలామంది సందేహ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అనేక‌మంది స్టార్లు టాలీవుడ్‌ను ఏలుతుండ‌గా, అనేక‌మంది యువ హీరోలు దూసుకుపోవ‌డానికి ట్రై చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కెరీర్‌లో వెన‌క‌ప‌డిపోయిన తరుణ్ పూర్వ వైభ‌వం సాధించ‌డం అసాధ్య‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త‌రుణ్ మ‌న‌సులో ఏముందో మ‌రి? ఇప్పుడైతే టాలీవుడ్ డ్ర‌గ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌ను ఎదుర్కోవ‌డానికి రెడీ అవుతున్నాడు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ విచార‌ణ‌ను ఎదుర్కొని బ‌య‌ట‌ప‌డిన అత‌ను, ఇప్పుడు డ్ర‌గ్ కేసులో మ‌నీ లాండ‌రింగ్ కోణంలో ఈడీ చేప‌ట్టిన విచార‌ణ‌లో భాగంగా సెల‌బ్రిటీల లిస్టులో అంద‌రికంటే చివ‌ర‌గా ఈనెల 22న  ఈడీ అధికారుల ఎదుట హాజ‌రు కానున్నాడు.

శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక 6 రోజుల పాటు కారులోనే గ‌డిపార‌ని తెలుసా?!

  క‌మ‌ల్ హాస‌న్ మాజీ భార్య‌, శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ఓసారి చూస్తే న‌మ్మ‌లేని నిజాలు మ‌న‌కు కొన్ని క‌నిపిస్తాయి. ఆమె జీవితం చాలా క్లిష్టంగా కొన‌సాగిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఆమె చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రులు విడిపోయారు. నాలుగేళ్ల ప‌సి వ‌య‌సులోనే ఆమె ప‌నిచేయ‌డం ప్రారంభించింది. స్కూలుకు వెళ్ల‌డానికి బ‌దులుగా ఆమె ఫిల్మ్ స్టూడియోల చుట్టు చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చింది. 21 సంవ‌త్స‌రాల యువ‌తిగా ఉండ‌గా, చేతిలో డ‌బ్బులు లేకుండా, ఒంటి మీద బ‌ట్ట‌ల‌తోటే ఆమె త‌న త‌ల్లి ఇంటిని విడిచిపెట్టింది. ఆ త‌ర్వాత ఏం చేయాలో తెలీక‌, ఆలోచిస్తూ త‌న కారులోనే ఆమె ఆరు రోజుల పాటు గ‌డిపిందనే విష‌యం వింటే ఎవ‌రికైనా ఒళ్లు జ‌ల‌ద‌రించ‌కుండా ఉంటుందా!  1988లో 28 ఏళ్ల వ‌య‌సులో సౌత్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన క‌మ‌ల్ హాస‌న్‌ను వివాహం చేసుకున్న ఆమె, న‌ట‌న‌ను వ‌దిలేసింది. 43 ఏళ్ల వ‌య‌సులో మెట్టింటిని విడిచిపెట్టిన సారిక‌, త‌న ఇద్ద‌రు కూతుళ్లు శ్రుతి, అక్ష‌ర‌ను వెంట‌పెట్టుకొని ముంబైకి వెళ్లిపోయి, అప్పుడెప్పుడో వ‌దిలేసిన న‌ట‌న‌ను తిరిగి మొద‌లుపెట్టింది. ఈ విష‌యాలు చాలు.. సారిక జీవితం గాలిప‌టంలా ఎటు బ‌లంగా గాలివీస్తే, అటు మ‌ళ్లింద‌నీ, కొన్నిసార్లు తెగిన గాలిప‌టంలా ఆమె జీవితం వ‌ణికిపోయింద‌నీ తెలుసుకోవ‌డానికి! నాలుగేళ్ల వ‌య‌సులో బాల‌న‌టిగా ఆమె కెరీర్ ప్రారంభించిన సినిమా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బి.ఆర్‌. చోప్రా రూపొందించిన‌ 'హ‌మ్‌రాజ్‌' (1967). చిన్న‌త‌నంలో ఎక్కువ‌గా మాస్ట‌ర్ సూర‌జ్ పేరుతో అబ్బాయి పాత్ర‌లు చేసింద‌ని మ‌న‌లో ఎంత‌మందికి తెలుసు! ఆ ప‌సి వ‌య‌సులో ప‌నిచేయ‌డం మంచిదా, కాదా అనే విష‌యం ఆమెకు ఎలా తెలుస్తుంది. ఆమెకు తెలిసింద‌ల్లా షూటింగ్ ఉన్న‌ప్పుడు స్టూడియోకు వెళ్లి కెమెరా ముందు న‌టించ‌డం, ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చేయ‌డం. నిజం చెప్పాలంటే ఆమెకు వేరే ఆప్ష‌న్ కూడా లేదు. మిగ‌తా అంద‌రు పిల్ల‌ల్లా స్కూలుకు వెళ్లే అవ‌కాశం ఆమెకు ల‌భించ‌లేదు. క‌మ‌ల్ హాస‌న్‌తో పెళ్ల‌య్యాక రెండు కార‌ణాల‌తో ఆమె న‌ట‌న‌కు దూర‌మైంది. ఒక‌టి.. బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభించిన త‌ను ఇంత దాకా న‌టించింది చాల‌ని అనుకోవ‌డం, కెమెరా ముందు న‌టించీ న‌టించీ అల‌సిపోవ‌డం. రెండు.. న‌టిగా ఉంటే అందంగా క‌నిపించాలి కాబ‌ట్టి రోజూ త‌ల‌స్నానం చేసి, చ‌క్క‌గా ముస్తాబ‌వ్వాలి. అదే టెక్నీషియ‌న్‌గా ఉంటే, అంత‌గా ముస్తాబ‌వ్వాల్సిన ప‌నిలేదు. అందుక‌ని కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా మారింది. క‌మ‌ల్ సినిమా 'హే రామ్' మూవీతో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ సైతం పొందిందామె. చెన్నైను వ‌దిలేసి, ముంబైకి తిరిగి వెళ్లిపోవ‌డం చాలా క్లిష్ట‌మైన ప‌నే అయిన‌ప్ప‌టికీ ఆమె భ‌రించింది. పైగా అప్పుడామెతో ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నారు. సింగిల్ మ‌ద‌ర్‌గా వారి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం అంత ఈజీ కాదు. ఆ ఇద్ద‌రూ పెద్ద‌యి, ఇద్ద‌రూ కెరీర్‌ను స్టార్ట్ చేశాకే ఆమె రిలాక్స్ అయ్యింది.  ముంబైకి వెళ్లిపోయాక ఆమె టెక్నీషియ‌న్ ప‌నిని కాకుండా తిరిగి యాక్ట‌ర్‌గా కెరీర్‌ను పునఃప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. కార‌ణం.. న‌టిగా ఎక్కువ డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టం. ఇద్ద‌రు పిల్ల‌ల్ని పెంచ‌డానికి ఆమెకు డ‌బ్బు అవ‌స‌ర‌మైంది. అప్ప‌టికి ఆమెకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదంటే న‌మ్మ‌శ‌క్యం కాదు కానీ అది ప‌చ్చి నిజం. అట్లా రాహుల్ ధొలాకియా డైరెక్ష‌న్‌లో న‌టించిన 'ప‌ర్జానియా' మూవీలో న‌ట‌న‌కు గాను ఏకంగా ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును సాధించిందామె.

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ర‌మ్య‌కృష్ణ గురించి చాలా త‌క్కువ‌మందికి తెలిసిన‌ నిజాలు!

  అందాల తార‌ ర‌మ్య‌కృష్ణ, ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ 2003లో పెళ్లి చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్ మొద‌ట్లో గ్లామ‌ర‌స్ రోల్స్ చేసి, ప్రేక్ష‌కుల ఆరాధ్య‌తార‌గా పేరు తెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పిన సినిమా.. ర‌జ‌నీకాంత్ 'న‌ర‌సింహ' (త‌మిళ ఒరిజిన‌ల్ 'ప‌డ‌య‌ప్పా'). అందులో నీలాంబ‌రి అనే నెగ‌టివ్ రోల్‌లో ఆమె చేసిన న‌ట‌న‌ను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు. వ‌య‌సుకు అనుగుణంగా హీరోయిన్ పాత్ర‌లు త‌గ్గిపోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారారు ర‌మ్య‌కృష్ణ‌. 'బాహుబ‌లి'లో చేసిన శివ‌గామి పాత్ర ఆమెకు దేశ‌వ్యాప్తంగా కీర్తిని తెచ్చింది. అలాంటి ర‌మ్య‌కృష్ణ కెరీర్ ఆరంభంలో టెలీప్లేల‌లో కూడా న‌టించార‌నే విష‌యం చాలామందికి తెలీదు. నేటి త‌రానికి తెలీని ఆమె కెరీర్ తొలినాళ్ల నిజాలేవంటే... ర‌మ్య‌కృష్ణ 1983లోనే న‌టిగా చిత్ర‌రంగంలో అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక‌ముందే ఆమె నాట్య‌కారిణి. సినిమాల్లోకి వ‌చ్చాక కూడా ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ వ‌చ్చారు. అలాగే టీవీ నాట‌కాల‌లో (టెలీప్లేలు) న‌టించారు. అలా మూడు విధాలుగా కూడా ఆమె రాణించారు. నాట్యం అంటే ఆమెకు ఎంతో అభిమానం. వెంప‌టి చిన‌స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడిలో అక్ష‌రాభ్యాసం చేసుకున్నారామె. ధ‌నంజ‌య వ‌ద్ద భ‌ర‌త‌నాట్యంలో తొలి అడుగు వేశారు. మ‌న‌దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల్లో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. అందుకే నృత్యం మీద ఉన్న అభిమానం కొద్దీ త‌న పాత్ర‌లు నృత్య ప్ర‌ధానంగా ఉంటే బావుంటుంద‌ని ఆమె అనుకొనేవారు. తెలుగులో 'భ‌లే మిత్రులు' ఆమె మొద‌టి చిత్రం. అందులో న‌గేశ్ కుమారుడు ఆనంద్‌బాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. ఆ సినిమా విజ‌యం సాధించింది. అయితే ఆమెలోని న‌ర్త‌కికి న్యాయం చేసిన 'సంకీర్త‌న' (నాగార్జున హీరో) చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం ఆమెకు నిరాశ‌ను క‌లిగించింది. 'అక్షింత‌లు' చిత్రంలో ఆమె న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ను సైతం మెప్పించింది. అలాంటి పాత్ర‌లు కావాల‌ని ఏ న‌టి మాత్రం కోరుకోదు! ఒక వైపు గ్లామ‌ర్‌, మ‌రోవైపు కామెడీ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు ఆమె చేసుకుంటూ వ‌చ్చారు. సినిమాల్లో న‌టిస్తూనే 'అంబికాప‌తి', 'సిలందివ‌లై' అనే రెండు త‌మిళ టీవీ నాట‌కాల్లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. 'అంబికాప‌తి' హాస్య‌ప్ర‌ధాన నాట‌కం. అందులో ఆమెకు జోడీగా వై.జి. మ‌హేంద్ర న‌టించారు. 'సిలందివ‌లై' నాట‌కంలో బాగా డాన్స్ చేసే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన అతికొద్ది మంది తార‌ల్లో ఒక‌రిగా ర‌మ్య‌కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆమెకు విన‌య అనే చెల్లెలు కూడా ఉంది. విన‌య‌కు స్పోర్ట్స్ అంటే ఇష్టం. టేబుల్ టెన్నిస్‌లో ఎన్నో బ‌హుమ‌తులు కూడా గెల్చుకున్నారామె. 'ప‌డ‌య‌ప్పా' (న‌ర‌సింహ‌) చిత్రంలో ప్ర‌తినాయిక పాత్ర‌ను బీభ‌త్సంగా పోషించి, త‌న‌కు ఇష్ట‌మైన డాన్స్‌ను కూడా అంతే బీభ‌త్సంగా చేసి ప్రేక్ష‌కులపై చెర‌గ‌ని ముద్ర‌వేసిన ర‌మ్య‌కృష్ణ చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమెతో త‌ల్లిదండ్రులూ క‌లిసుంటున్నారు.

ప్ర‌కాశ్‌రాజ్ మొద‌టి భార్య ఎవ‌రో తెలుసా?

  ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌తిభావంతుడైన న‌టుడ‌న‌టంలో సందేహం లేదు. ఆయ‌న కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు, ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో న‌టిస్తోన్న బ‌హుభాషా న‌టుడు. దేశంలోని సినిమా ప్రియుల్లో ఆయ‌న పేరు తెలీనివాళ్లు త‌క్కువ‌. ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందించిన 'కాంచీవ‌రం' చిత్రంలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. స్వ‌త‌హాగా క‌న్న‌డిగుడైన ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన న‌టీన‌టుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడిగా ఎన్నిక కావాల‌నే ఆశ‌యంతో ఉన్నాడు. ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ స‌పోర్ట్ సాధించి, ప‌లువురు న‌టుల‌ను త‌నతోడు చేసుకొని త‌న‌ ప్యాన‌ల్‌ను కూడా ప్ర‌కటించాడు. గ‌డ‌చిన ఆదివారం 'మా' మెంబ‌ర్స్‌తో ఆయ‌న విందు మీటింగ్ పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న విందు రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. యంగ్ జ‌న‌రేష‌న్‌లో చాలామందికి తెలీని విష‌యం.. ఒక‌ప్పుడు ఆయ‌న‌, శ్రీ‌హ‌రి తోడ‌ల్లుళ్లు! అవును. ప్ర‌కాశ్‌రాజ్ మొద‌టి భార్య పేరు ల‌లిత‌కుమారి. ఆమె ఎవ‌రో కాదు, రియ‌ల్ స్టార్‌ శ్రీ‌హ‌రి భార్య శాంత‌కుమారి అలియాస్ డిస్కో శాంతికి స్వ‌యానా చెల్లెలు. త‌మిళంలో ఆమె కొన్ని సినిమాల్లో న‌టించారు. అప్పుడు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో 1994లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే కొడుకు సిద్ధు నాలుగేళ్ల వ‌య‌సులో గాలిప‌టం ఎగ‌రేస్తూ, ప్ర‌మాద‌వ‌శాత్తూ ఒక టేబుల్ మీద నుంచి ప‌డి తీవ్ర గాయాల‌కు గురై, కొన్ని రోజుల త‌ర్వాత మ‌ర‌ణించాడు. అత‌డి మృతి త‌ర్వాత దంప‌తుల మ‌ధ్య క‌ల‌త‌లు చెల‌రేగాయి. అవి తీవ్ర‌రూపం దాల్చి, విడాకులు తీసుకొనేదాకా వెళ్లాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని శ్రీ‌హ‌రి, శాంతి దంప‌తులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. కానీ విడిపోవ‌డానికే ప్ర‌కాశ్‌రాజ్ మొగ్గుచూపాడు. దాంతో ల‌లిత‌కుమారి కూడా విడాకుల‌కు అంగీక‌రించారు. అలా 2009లో వారికి విడాకులు మంజూర‌య్యాయి.  అప్ప‌టికే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ పోనీ వ‌ర్మ‌తో ప్ర‌కాశ్‌రాజ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం, ప్రేమ‌గా మారింది. ల‌లిత‌కుమారికి విడాకులు ఇచ్చిన త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే.. 2010లో పోనీవ‌ర్మ‌ను రెండో వివాహం చేసుకున్నాడు ప్ర‌కాశ్‌రాజ్‌. ల‌లిత‌కుమారి ఇద్ద‌రు కుమార్తెలను కూడా పోనీవ‌ర్మ ఆద‌ర‌ణ‌గా చూసుకుంటార‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. పోనీవ‌ర్మ‌, ప్రకాశ్‌రాజ్ దంప‌తుల‌కు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.

మంజుల‌ను "ముందు చీర స‌రిగా క‌ట్టుకో" అన్న ఎంజీఆర్‌!

  గ్లామ‌ర‌స్‌ హీరోయిన్‌గా ఒక‌ప్పుడు మంజుల ఓ వెలుగు వెలిగారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర నాయిక‌గా రాణించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు లాంటి టాప్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించారు. అయితే హీరోయిన్‌గా ఆమె ప‌రిచ‌య‌మైన చిత్రంలో హీరో ఎవ‌రో తెలుసా? ఎంజీఆర్‌! అవును. త‌మిళ చిత్ర‌సీమ‌లో తిరుగులేని క‌థానాయ‌కుడిగా రాణించిన‌ ఎంజీఆర్ సినిమా 'రిక్షాకార‌న్‌'లో ఆమె తొలిసారి హీరోయిన్‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆ సినిమాలో మంజుల‌కు అవ‌కాశం ల‌భించ‌డం చాలా చిత్రంగా జ‌రిగింది. ఒక ప‌త్రిక కోసం మ‌ద్రాసులోని విజ‌యా గార్డెన్స్‌లో ఫొటోగ్రాఫ‌ర్ కె.ఆర్‌.వి. భ‌క్త ఆమె స్టిల్స్ తీస్తున్న‌ప్పుడు, అక్క‌డే ఎంజీఆర్ సినిమా 'న‌మ్‌నాడు' షూటింగ్ జ‌రుగుతోంది. మంజుల‌ను ఆయ‌న గ‌మ‌నించి, ఆమెను పిలుచుకుర‌మ్మ‌ని త‌న‌ మేక‌ప్‌మ్యాన్ పీతాంబ‌రంను పంపారు. ఆయ‌న‌ వ‌చ్చి, "ఎంజీఆర్ గారు అక్క‌డ‌ షూటింగ్‌లో ఉన్నారు, నిన్ను పిలుచుకు ర‌మ్మ‌న్నారు" అని చెప్పారు. అంతే.. ఫ‌స్ట్ టైమ్ చీర క‌ట్టుకొని ఉన్న మంజుల‌, చీర జారిపోతున్నా ప‌ట్టించుకోకుండా ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతూ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తారు. త‌న ద‌గ్గ‌ర‌కు ఆయాస‌ప‌డుతూ వ‌చ్చిన ఆమెను చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఎంజీఆర్‌, "ముందు చీర స‌రిగా క‌ట్టుకో" అని చెప్పారు. కానీ ఆమె ఆయ‌న చేతిని గిల్లుతూ, "క‌లా, నిజ‌మా! మీరు ఎంజీఆర్ గారేనా!" అని సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో మునిగిపోయారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు ఆయ‌న మ‌రింత ఆశ్చ‌ర్య‌పోయి, "ముందు మీ అమ్మ‌గారిని ర‌మ్మ‌ను, మాట్లాడ‌దాం" అన్నారు. ఆ త‌ర్వాత మంజుల అమ్మ‌గారితో మాట్లాడిన ఎంజీఆర్‌, త‌న బ్యాన‌ర్‌లో ఆర్టిస్టుగా మంజుల చేత‌ ఐదేళ్లు ఒప్పందం రాయించుకున్నారు. అలా ముందుగా 'రిక్షా కార‌న్' సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో ఆయ‌న స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు మంజుల‌. ఆయ‌న సంస్థ‌లో ఉన్న ఐదేళ్ల‌లోనూ న‌ట‌న‌, నృత్యం, సంభాష‌ణోచ్ఛార‌ణ లాంటి అంశాల్లో ఆమెకు శిక్ష‌ణ ఇప్పించారు ఎంజీఆర్‌. తాను స్వ‌యంగా కూడా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె తొలిసారి హీరోయిన్‌గా న‌టించిన 'రిక్షాకార‌న్‌'లో న‌ట‌న‌కు గాను ఎంజీఆర్‌కు ఉత్త‌మ న‌టునిగా భ‌ర‌త్ అవార్డు ల‌భించ‌డం విశేషం.

మొద‌ట హోట‌ల్ రిసెప్ష‌నిస్ట్.. ఆ త‌ర్వాత 'శుభ‌లేఖ' సుధాక‌ర్‌!

  కామెడీ న‌టుడిగా ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్వించిన శుభ‌లేఖ సుధాక‌ర్, ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో సినిమాల్లో ర‌క‌ర‌కాల పాత్రలు చేశారు. క‌మ‌ల్ హాస‌న్‌ 'ద్రోహి' సినిమాలో అయితే నెగ‌టివ్ రోల్ పోషించారు కూడా. యాక్ట‌ర్ కావ‌డానికి ముందు బ‌త‌క‌డానికి ఆయ‌న ఓ పెద్ద హోట‌ల్‌లో రిసెప్ష‌నిస్టుగా ప‌నిచేశారు. సుధాక‌ర్ ఇంట్లో వాళ్ల నాన్న‌గారికి కానీ, తాత‌గారికి కానీ సినిమాలంటే గిట్ట‌దు. వాళ్లు సినిమాలు చూసేవాళ్లు కాదు. అలాంటిది సుధాక‌ర్‌లో సినిమాల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ క‌ల‌గ‌డానికి కార‌ణం అమితాబ్ బ‌చ్చ‌న్‌. త‌న‌కు ఊహ తెలిశాక ప‌న్నెండు-ప‌ద‌మూడేళ్ల వ‌య‌సులో చూసిన మొట్ట‌మొద‌టి సినిమా - 'దీవార్‌'. ఆ సినిమాలో అమితాబ్ న‌ట‌న చూసిన ద‌గ్గ‌ర్నుంచీ ఆయ‌న‌లా న‌టుడ్ని కావాల‌ని క‌ల‌లు కంటూ వ‌చ్చారు. మొత్తానికి ఇంట్లోవాళ్ల‌ను ఒప్పించి, మ‌ద్రాసుకు వ‌చ్చి, మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో డిప్లొమా తీసుకున్న త‌ర్వాత వైజాగ్ వెళ్లారు సుధాక‌ర్‌. అప్పుడు కె. విశ్వ‌నాథ్ గారు వైజాగ్‌లో 'స‌ప్త‌ప‌ది' షూటింగ్ చేస్తున్నారు. ఆయ‌న‌ను క‌లిసి, త‌న వివ‌రాలు చెప్పారు సుధాక‌ర్‌. కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. మ‌ద్రాసులో ఉండి సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాలంటే డ‌బ్బు కావాలి. అందుక‌ని తాజ్ కోర‌మాండ‌ల్‌లో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే, రిసెప్ష‌నిస్ట్‌గా చేర‌మ‌న్నారు. అక్క‌డ ఆ ఉద్యోగం చేస్తుండ‌గా విశ్వ‌నాథ్ గారి నుంచి క‌బురు వ‌చ్చింది. వెళ్లి క‌లిశారు సుధాక‌ర్‌. చిరంజీవి హీరోగా త‌ను తీస్తున్న సినిమాలో ఓ వేషం ఇచ్చారు విశ్వ‌నాథ్‌. ఆ సినిమా 'శుభ‌లేఖ‌'. అలా ఆ సినిమా నుంచి శుభ‌లేఖ సుధాక‌ర్ అయిపోయారు. తాజ్ కోర‌మాండ‌ల్‌లో దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు ప‌నిచేశారాయ‌న‌. అది చాలా విలాస‌వంత‌మైన హోట‌ల్‌. సంప‌న్నులు త‌ప్ప మామూలు వాళ్లు అందులో బ‌స చేయ‌రు. మ‌ద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పొందేట‌ప్పుడు, ఆ త‌ర్వాత అటువేపు న‌డుస్తూ వెళ్తున‌ప్పుడ‌ల్లా ఈ హోట‌ల్‌లో రూమ్ తీసుకొని ఉంటే బాగుండునని, ఆ స్థాయికి త‌ను ఎద‌గగ‌ల‌నా అని ఆయ‌న అనుకొనేవారు. కానీ అదే హోట‌ల్‌లో రిసెప్ష‌నిస్టుగా చేస్తాన‌ని ఆయ‌న ఊహించ‌లేదు.