ఆ రోజుల్లోనే రాజ‌శేఖ‌ర్‌లో ఈ యాంగిల్ ఉంద‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

  చెన్నై (అప్పుడు మ‌ద్రాస్‌)లోని పార్క్ షెర‌టాన్ హోట‌ల్ సినీ ప్ర‌ముఖ‌ల‌తో, తార‌ల అభిమానుల‌తో కిట‌కిట‌లాడుతున్న వేళ అది. అక్క‌డ 'అల్ల‌రి ప్రియుడు' శ‌త‌దినోత్స‌వం జ‌రుగుతోంది. రాజ‌శేఖ‌ర్‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌ధుబాల కాంబినేష‌న్‌తో కె. రాఘ‌వేంద్రరావు తీర్చిదిద్దిన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆరోజు 'అల్ల‌రి ప్రియుడు' వేడుకలు ఆహ్లాద‌క‌రంగా, క్రికెట్ స్టార్స్ న‌డుమ ముగిశాయి. ఆటోగ్రాఫ్‌ల కోసం ఫ్యాన్స్ హీరో రాజ‌శేఖ‌ర్‌ని చుట్టుముట్టారు. అప్ప‌టికే బాలా ఆల‌స్య‌మైంది. అయిన‌ప్ప‌టికీ రాజ‌శేఖ‌ర్ ఓపిగ్గా వారి పేర్లు క‌నుక్కుంటూ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నారు. వీటి మ‌ధ్య ఓ మిడిల్ ఏజ్‌లో ఉన్న ఓ వ్య‌క్తి ఆయ‌న‌కు ఓ చీటీ అంద‌జేశాడు. రాజ‌శేఖ‌ర్ సంత‌కం పెట్ట‌బోయి ఆగి, ఆ చీటీ చ‌దివి, ఆ మ‌నిషి వైపు చూశాడు. ఒక తండ్రి త‌న కొడుక్కి జ‌ర‌గాల్సిన స‌ర్జ‌రీకై ఆర్థిక స‌హాయం కోసం చేసిన అభ్య‌ర్థ‌న అది. రాజ‌శేఖ‌ర్ ఆయ‌న్ని వివ‌రాల‌డిగి, ఆ పేప‌ర్ వెనుక త‌న అడ్ర‌స్ రాసిచ్చి, మ‌ర్నాడు ఉద‌యం త‌న త‌మ్ముడ్ని క‌లుసుకోమ‌ని చెప్పి సంత‌కం పెట్టారు. మ‌ర్నాడు రాజ‌శేఖ‌ర్ హైద‌రాబాద్‌లో ఉంటారా? అనే సందేహం ఆ వ్య‌క్తికి వ‌చ్చింది. "అన్నీ మా త‌మ్ముడు చూసుకుంటాడు. మీకే ఇబ్బంది ఉండ‌దు" అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌. అంత హ‌డావిడిలోనూ త‌మ్ముడు గుణ‌శేఖ‌ర్‌ను పిలిచి, ఆ వ్య‌క్తికి ప‌రిచ‌యం చేశారు. అప్పుడు ఆ వ్య‌క్తిలో తొణికిస‌లాడిన కృత‌జ్ఞ‌తా భావం మాట‌ల్లో చెప్ప‌లేనిది. శాటిస్‌ఫ్యాక్ష‌న్ అనేది ఒక క‌ళాకారుడిగా త‌న న‌ట‌న‌ను ప‌దిమందీ మెచ్చుకున్న‌ప్పుడు మాత్ర‌మే కాదు, ఇలాంటి సంద‌ర్భాల‌లోనూ అధికంగా క‌లుగుతుంద‌ని అనుకుంటారు రాజ‌శేఖ‌ర్ లాంటి యాక్ట‌ర్లు. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ చేసిన సాయంతో ఆ వ్య‌క్తి త‌న కొడుక్కి శ‌స్త్ర చికిత్స చేయించార‌ని వేరే చెప్పాలా!

ఒక చిరంజీవి పాట.. ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్లు!

  దివంగ‌త ద‌ర్శ‌క నిర్మాత విజ‌య బాపినీడు ఏది త‌ల‌పెట్టినా అది వైవిధ్యంగానే ఉంటుంది. మెగాస్టార్‌ చిరంజీవిని టైటిల్ రోల్‌లో చూపిస్తూ ఆయ‌న రూపొందించిన 'గ్యాంగ్ లీడ‌ర్' మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాల్లో ఆ సినిమా విజ‌యోత్స‌వాన్ని ఆయ‌న‌ నిర్వ‌హించారు. అలాగే ఏకంగా రెండు ల‌క్ష‌ల మంది చిరంజీవి అభిమానుల స‌మ‌క్షంలో 'బిగ్ బాస్' (1995) మూవీని ఆయ‌న ప్రారంభించారు. 'గ్యాంగ్ లీడ‌ర్‌'కు బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చిన బ‌ప్పీల‌హిరి 'బిగ్ బాస్‌'కు కూడా సంగీతం స‌మ‌కూర్చారు.  ఈ చిత్రంలోని పాట‌ల విషయంలో విజ‌య బాపినీడు చాలా శ్ర‌ద్ధ తీసుకున్నారు. వైవిధ్యంగా ఆ పాట‌ల‌ను చిత్రీక‌రించారు. రెండు పాట‌ల్ని ఊటీలో చిత్రీక‌రించారు. వాటిలో ఒక పాట‌ స‌గ‌భాగాన్ని చిన్నిప్ర‌కాశ్ కొరియోగ్ర‌ఫీలో తీసిన ఆయ‌న‌, మ‌రో స‌గ‌భాగాన్ని రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రించారు. పాట చిత్రీక‌ర‌ణ‌లో వైవిధ్యం చూపించేందుకే ఆ పాట‌ను ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్ల‌తో తీసిన‌ట్లు అప్ప‌ట్లో ఆయ‌న చెప్పారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'బిగ్ బాస్' ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా, పాట‌లు మాత్రం సూప‌ర్ హిట్ట‌వ‌డ‌మే కాకుండా, ఆడియో రైట్స్ అమ్మ‌కాల్లో ఆ సినిమా రికార్డ్ సృష్టించింది.

జ‌య‌ల‌లిత ఒక మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి, విడాకులు తీసుకున్నార‌ని మీకు తెలుసా?

  చూడ‌గానే ఆక‌ట్టుకునే రూప‌లావ‌ణ్యాలు, అభిన‌య సామ‌ర్థ్యం ఎంత‌గా ఉన్నా, కాలం క‌లిసిరాక వ్యాంప్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయిన తార‌.. జ‌య‌ల‌లిత‌. ఒక‌ప్పుడు క్లాసిక‌ల్ డాన్స‌ర్స్ అయిన‌ చ‌ల్లా సిస్ట‌ర్స్ అంటే బాగా ఫేమ‌స్‌. ఆ ఇద్ద‌రు సిస్ట‌ర్స్‌లో ఒక‌రు జ‌య‌ల‌లిత‌! ఆమె ఒక మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను వివాహం చేసుకొని, త‌ర్వాత విడిపోయార‌నే విష‌యం చాలా మందికి తెలీదు. అవును. జ‌య‌ల‌లిత వినోద్ అనే మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. మ‌ల‌యాళంలో ఆయ‌న బిగ్రేడ్ మూవీస్ ఎక్కువ‌గా చేశాడు. ఆ సినిమాల్లో జ‌య‌ల‌లిత న‌టించారు.  వినోద్ తండ్రి జ‌య‌దేవ‌న్ పేరుపొందిన ద‌ర్శ‌కుడు. ఆయ‌న సినిమాకూ,  డైరెక్ట‌ర్ క్రాస్‌బెల్ట్ మ‌ణి సినిమాకూ జ‌య‌ల‌లిత వాళ్ల నాన్న‌గారు ఒకే డేట్స్ ఇచ్చారు. ఆ విష‌యం జ‌య‌ల‌లిత‌కు తెలీదు. జ‌య‌దేవ‌న్ సినిమా షూటింగ్ సెట్స్ మీద జ‌య‌ల‌లిత ఉండ‌గా, క్రాస్‌బెల్ట్ మ‌ణి మ‌నుషులు వ‌చ్చి, "మీ నాన్న‌గారు మీ డేట్స్ మాకిచ్చారు. ఇక్క‌డ‌కు ఎలా వ‌స్తావు?" అంటూ రుబాబు చేయ‌బోయారు. వాళ్ల తీరు చూసి జ‌య‌ల‌లిత భ‌య‌ప‌డ్డారు. ఏం చేయాలో పాలుపోక ఆమె ఏడుస్తుంటే, హీరోలాగా వినోద్ అక్క‌డ‌కు వ‌చ్చి, "నేను నిన్ను కాపాడ‌తాను" అని ఆమెను ఒక రూమ్‌లో పెట్టి, క్రాస్ట్‌బెల్ట్ మ‌ణి మ‌నుషుల‌తో మాట్లాడి, వాళ్ల‌ను పంపించేశాడు.  ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంతో ఆమె క‌ళ్ల‌కు వినోద్ పెద్ద హీరోలా క‌నిపించాడు. 'న‌న్ను కాపాడేవాడు జీవితాంతం ఇత‌నే' అని ఆమె ఫిక్స‌యిపోయారు. ఏడేళ్లు అత‌ని ప్రేమ‌లో మునిగితేలారు జ‌య‌ల‌లిత‌. 'అత‌ను దొంగ‌కోళ్లు ప‌ట్టుకొనేవాడిలా ఉన్నాడు. నిన్ను సేవ్ చేసేవాడిలా క‌నిపించ‌డం లేదు. జాగ్ర‌త్త.' అని మేక‌ప్‌మేన్‌-ప్రొడ్యూస‌ర్ జ‌య‌కృష్ణ‌, చ‌ల‌ప‌తిరావు లాంటి వాళ్లు చెప్పారు. ఆమె విన‌లేదు. ఆ టైమ్‌లో ఆమెకు ఎన్నో సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా, త‌నే ఫోన్ లిఫ్ట్‌చేసి, వేరే గొంతుతో "జ‌య‌ల‌లిత‌గారు లేరు. సినిమా షూటింగ్‌లో ఉన్నారు" అని అబ‌ద్ధం చెప్పి, ఆ అవ‌కాశాల్ని పోగొట్టుకున్నారు. వినోద్‌తో ఆమె చాలా ఇబ్బందులు ప‌డ్డారు. వేధింపులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు ఆ బంధం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె, ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు.

ముచ్చ‌ర్ల అరుణ పెళ్లి ఎవ‌రితో, ఎలా జ‌రిగిందో తెలుసా?

  ముచ్చ‌ర్ల అరుణ అన‌గానే మ‌న‌కు మొద‌ట గుర్తొచ్చే సినిమా 'సీతాకోక చిలుక‌' (1981). భార‌తీరాజా డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్‌ మూవీ తెలుగులో ఆమె మొట్ట‌మొద‌టి సినిమా కూడా.  ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో నాయిక‌గానే కాకుండా, క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌ల‌ను చేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అరుణ‌. ఆమె వివాహం చండీగ‌ర్‌కు చెందిన వ్యాపార‌వేత్త మోహ‌న్‌ గుప్తాతో జ‌రిగింది. వారిది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి కాదు, అలాగ‌ని ప్రేమ వివాహం కూడా కాదు. ఆస‌క్తి క‌లిగించే ఆ క‌థ‌లోకి వెళ్తే... చెన్నైలో ముచ్చ‌ర్ల అరుణ ప‌క్కింటివాళ్ల ద‌గ్గ‌ర‌కు మోహన్ వ‌స్తుండేవారు. ఆయ‌న‌కు అరుణ క‌జిన్ బ్ర‌ద‌ర్‌ ఫ్రెండ‌య్యారు. అలా అరుణ వాళ్లింటికి కూడా ఆయ‌న వ‌స్తుండటంతో ఆమెకు కూడా ఆయ‌న ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎప్పుడైనా అరుణ షూటింగ్ నుంచి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న అక్క‌డ క‌లుస్తుండేవారు. "ఈరోజు నీ మేక‌ప్ చాలా సింపుల్‌గా బాగుంది", "ఈరోజు నీ డ్ర‌స్ బాగుంది", "యు లుకింగ్ నైస్‌".. ఇలా అనేసి వెళ్లిపోయేవారు. అరుణ‌తో మాట‌లు క‌ల‌పాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నించేవారు. ఆమె కూడా మాట్లాడుతుండేవారు.  ఒక రెండు వారాలు ఇలా గ‌డిచాక‌, ఒక‌సారి స‌డ‌న్‌గా "విల్ యు మ్యారీ మీ" అని మోహ‌న్‌ను అడిగేశారు అరుణ‌. నిజానికి అప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని ఆమె అనుకోలేదు. ఇంకా మంచి పాత్ర‌లు చెయ్యాలి, మంచి పొజిష‌న్‌లోకి రావాలి.. అని మ‌న‌సులో అనుకుంటూ ఉండేవారు. అరుణ అలా అడ‌గ‌డంతో ఒక్క‌సారిగా షాక‌య్యారు మోహ‌న్‌. వెంట‌నే ఏం చెప్పాలో ఆయ‌న‌కు తోచ‌లేదు. కొన్ని క్ష‌ణాలు గ‌డిచాక‌, "నాకు కొంత టైమ్ కావాలి" అని చెప్పి వెళ్లిపోయారు. మోహ‌న్‌ను పెళ్లి చేసుకొమ్మ‌ని త‌ను అడిగిన విష‌యం ఇంట్లోవాళ్ల‌కు అరుణ చెప్ప‌లేదు. అందుక‌ని వారికెవ‌రికీ ఈ విష‌యం తెలియ‌దు. మూడు రోజుల త‌ర్వాత మోహ‌న్ ఫోన్ చేశారు. "య‌స్, ఐ డిసైడెడ్‌. అయితే నేను నీతో మాట్లాడాలి" అన్నారు. "ఓకే. నేను త‌ర్వాత చెప్తాను" అని జ‌వాబిచ్చారు అరుణ‌. ఆయ‌న స‌రేన‌న్నారు. వారం రోజుల త‌ర్వాత "ఐ యామ్ రెడీ" అని చెప్పారు అరుణ‌. ఆ త‌ర్వాత ఇంట్లోవాళ్ల‌కు ఈ విష‌యం చెప్పారు. అలా 1987లో అరుణ‌, మోహ‌న్ దంప‌తులుగా మారారు. వారికి న‌లుగురు కుమార్తెలు. 1980లో భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలోనే 'క‌ళ్ల‌క్కుల్ ఈర‌మ్' అనే త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా వెండితెర‌పై కాలుపెట్టిన అరుణ‌, ప‌ద‌కొండేళ్ల పాటు వివిధ ర‌కాల పాత్ర‌లు పోషించి, 1990 త‌ర్వాత న‌ట‌న‌ను వ‌దిలేసి గృహిణిగా స్థిర‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం చెన్నైలోనే త‌న కుటుంబంతో ఆమె హ్యాపీగా జీవ‌నం సాగిస్తున్నారు.

‘బాలనాగమ్మ’గా శ్రీదేవి న‌టించింద‌ని మ‌న‌లో ఎంత మందికి తెలుసు?

  సినిమాగా వచ్చిన నాటకాల్లో ‘బాలనాగమ్మ’ కూడా ఒకటి. ఎన్నో నాటక సమాజాలు, పరిషత్తులు ఈ నాటకాన్ని దేశం నలుమూలలా ప్రదర్శించి పాపులర్ చేశాయి. ఇంత ప్రజాదరణ పొందిన ఈ నాటకం ఐదు సార్లు సినిమాగా రూపుదిద్దుకుంది. కాంచనమాల, మిస్ చెలం, అంజలీదేవి, జమున, శ్రీదేవి ఆయా చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించారు.   ఇంతమందిలో ‘బాలనాగమ్మ’ అంటే గుర్తుకు వచ్చేది కాంచనమాలే. బాలనాగమ్మగా జమున నటించిన సినిమా అసలు విడుదలకు నోచుకోలేదు. ఇక శ్రీదేవి కూడా బాలనాగమ్మగా నటించిందనే విషయం తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది. మొదట ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా మొదలైనా, తర్వాత తెలీని కారణాల వల్ల తెలుగు వెర్షన్‌ను ఆపేసి తమిళ వెర్షన్ మాత్రమే నిర్మించారు. కార్యవర్ధి రాజుగా శరత్‌బాబు, మాయల ఫకీరుగా సుదర్శన్, సంగుగా మంజుభార్గవి ఆ సినిమాలో నటించారు. కె. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. కె.బి. క్రియేషన్స్ బేనర్‌పై ఎ. ఖాదర్ ఈ ‘బాలనాగమ్మ’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. రాజశ్రీ మాటలు, పాటలు రాశారు.   మొదట ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరకు 1982 ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదలైంది. అప్పటికే తెలుగులో శ్రీదేవి అగ్ర తారగా వెలుగొందుతున్నప్పటికీ ఈ సినిమా అట్టర్ ఫ్లాపైంది.

'బాండిట్ క్వీన్‌' ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

  అగ్ర‌వ‌ర్ణ ఠాకూర్ల చేతుల్లో లైంగిక వేధింపుల‌తో పాటు, కుల‌ప‌ర‌మైన వేధింపుల‌కూ గురై, వారికి ఎదురుతిరిగి, బందిపోటుగా మారి, ఠాకూర్ల గుండెల్లో నిద్ర‌పోయిన ఫూల‌న్ దేవి జీవితం ఆధారంగా రూపొందిన 'బాండిట్ క్వీన్' (1994) సినిమా ఓ సంచ‌ల‌నం. డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించిపెట్టిన ఈ మూవీలో ఫూల‌న్ దేవి పాత్ర‌ను అప్ప‌టివ‌ర‌కూ జ‌నానికి పెద్ద‌గా తెలీని సీమా బిశ్వాస్ అద్వితీయంగా పోషించి, జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకున్నారు. అనేక అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లోనూ ప్ర‌ద‌ర్శిత‌మైన 'బాండిట్ క్వీన్' అనంత‌ర కాలంలో క‌ల్ట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. 'బాండిట్ క్వీన్‌'తో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ రావ‌డంతో చాలామంది అదే ఆమె మొద‌టి సినిమా అని పొర‌బ‌డుతుంటారు. కానీ ఆ సినిమా కంటే ఆరేళ్ల ముందే 1988లో 'అంషిణి' అనే హిందీ సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మాతృభాష అస్సామీలోనూ న‌టించిన ఆమెకు ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్ తెచ్చిన సినిమా మాత్రం 'బాండిట్ క్వీన్‌'. 1996లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన 'ఖామోషి: ద మ్యూజిక‌ల్' మూవీలో నానా ప‌టేక‌ర్ జోడీగా ఫ్లావీ అనే ఒక బ‌ధిర స్త్రీగా అపూర్వ‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించిన సీమ బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా స్క్రీన్ అవార్డ్ అందుకున్నారు. దీపా మెహ‌తా ప్ర‌ఖ్యాత చిత్రం 'వాట‌ర్‌'లో శ‌కుంత‌ల అనే పాత్ర పోష‌ణ‌కు గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా జెనీ అవార్డును పొందారు. రామ్‌గోపాల్ వ‌ర్మ మూవీ 'కంపెనీ'లో రాణీబాయ్‌, చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేది సినిమా 'పింజార్‌'లో పింగ్లీ, శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ మూవీ 'ఏక్ హ‌సీనా థీ'లో ఏసీవీ మాల‌తీ వైద్య‌, సూర‌జ్ ఆర్ బ‌ర్‌జాత్య చిత్రం 'వివాహ్‌'లో ర‌మా మిశ్రా, దీపా మెహ‌తా మూవీ 'మిడ్‌నైట్ చిల్డ్ర‌న్‌'లో మేరీ, మోహిత్ సురి మూవీ 'హాఫ్ గాళ్‌ఫ్రెండ్‌'లో హీరో అర్జున్ క‌పూర్ త‌ల్లిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. గ‌త‌ ఏడాది జీ5లో స్ట్రీమింగ్ అయిన 'కోడ్ ఎం' వెబ్ సిరీస్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించిన సీమా బిశ్వాస్, ఇటీవ‌లే 'ద ఫ్యామిలీ మ్యాన్ '2లో ప్ర‌ధాన‌మంత్రి బ‌సు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌ల‌నే చేస్తూ, ప్ర‌తిభావంతురాలైన న‌టిగా త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు సీమ‌.

రాఘ‌వేంద్ర‌రావు లేక‌పోతే నేనేమైపోయేదాన్నో! ర‌మ్య‌కృష్ణ భావోద్వేగం!!

  1980ల‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి ప్ర‌ధానంగా దోహ‌దం చేసింది కె. రాఘ‌వేంద్ర‌రావు సినిమాలే. 'అల్లుడుగారు' సినిమాలో తొలిసారిగా రాఘ‌వేంద్రరావు డైరెక్ష‌న్‌లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. అందులో మూగ‌మ్మాయిగా, మోహ‌న్‌బాబు భార్య‌గా కొద్దిసేపు క‌నిపించే పాత్ర‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత 'అల్ల‌రి మొగుడు' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా మోహ‌న్‌బాబు జోడీగానే చాన్స్ ఇచ్చారు ద‌ర్శ‌కేంద్రుడు. ఆ రెండు సినిమాలూ సూప‌ర్ హిట్ట‌య్యాయి. ఆ త‌ర్వాత ర‌మ్య వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, అల్ల‌రి ప్రియుడు, ముగ్గురు మొన‌గాళ్లు, ముద్దుల ప్రియుడు, అల్ల‌రి ప్రేమికుడు, రాజ‌సింహం, ఘ‌రానా బుల్లోడు, అన్న‌మ‌య్య‌, ఇద్ద‌రు మిత్రులు త‌దితర రాఘ‌వేంద్ర‌రావు చిత్రాల్లో ర‌మ్య‌కృష్ణ నాయిక‌గా న‌టించారు. 'అల్లుడుగారు' సినిమాకు ముందు ర‌మ్య‌కృష్ణ‌కు ఫ్లాప్ హీరోయిన్‌గా, ఐర‌న్ లెగ్‌గా ఇండ‌స్ట్రీలో పేరు ఉండేది. కానీ త‌న‌కు కావాల్సిన హీరోయిన్ ర‌మ్య‌లో ఉన్న‌ద‌ని భావించిన రాఘ‌వేంద్ర‌రావుకు ఆమెకు అవ‌కాశాలు ఇస్తూ వ‌చ్చారు. ఆయ‌న సినిమాల‌తోటే ఆమె స్టార్ హీరోయిన్‌గా, మోస్ట్ గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు ర‌మ్య‌. 'అల్ల‌రి మొగుడు' వంద రోజుల వేడుక‌లో మైకు ముందు మాట్లాడ‌టానికి వ‌చ్చి, "వేదిక‌ను అలంక‌రిస్తున్న పెద్ద‌ల‌కు, మీ అంద‌రికీ నా న‌మ‌స్కార‌ములు. ఈరోజు ఇక్క‌డ ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే, చాలామంది న‌న్ను అన్‌ల‌క్కీ ఆర్టిస్టుగా చెప్పుకుంటున్న‌ప్పుడు, కొంత‌మంది ప్రొడ్యూస‌ర్లు న‌న్ను త‌మ సినిమాల‌కు తీసుకొని, తొల‌గించిన‌ప్పుడు.. ఈ సినిమా అవ‌కాశం రావ‌డం నాకు చాలా పెద్ద విష‌యం. అందుకు కె. రాఘ‌వేంద్ర‌రావు, నిర్మాత కృష్ణ‌మోహ‌నరావు, మోహ‌న్‌బాబుల‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా.." అని చెప్పి, ఆ త‌ర్వాత ఏదో చెప్ప‌బోయినా అప్ప‌టికే దుఃఖంతో ఆమె గొంతుకు పూడుకుపోయి, క‌ర్చీఫ్‌తో క‌ళ్లు, ముక్కు తుడుచుకుంటూ, మాట‌లు రాక‌.. "సెల‌వు తీసుకుంటున్నా" అని చెప్పి ఇవ‌త‌ల‌కు వ‌చ్చేశారు. అప్పుడు ఆమె ఎంత భావోద్వేగానికి గుర‌య్యారో ఆమెను చూస్తే తెలుస్తుంది! ఆమె కెరీర్ ఎదుగుద‌ల‌లో రాఘ‌వేంద్ర‌రావు ఎంత పెద్ద పాత్ర పోషించారో అర్థ‌మ‌వుతుంది. ఆ రోజు ఆమె మైకు నుంచి ఇవ‌త‌ల‌కు వ‌చ్చాక చాలామంది ఆమెను ప‌ట్టుకుని కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా, చాలాసేప‌టి దాకా మామూలు మ‌నిషి కాలేక‌పోయారు ర‌మ్య‌. రాఘ‌వేంద్ర‌రావుతో మొద‌టిసారి క‌లిసి ప‌నిచేసేట‌ప్పుడే అదివ‌ర‌కు త‌న‌ను కొంత‌మంది నిర్మాత‌లు హీరోయిన్‌గా బుక్ చేసుకొని, త‌ర్వాత తీసేసి వేరొక‌ర్ని తీసుకున్నార‌ని చెప్పేశారు ర‌మ్య‌. "ఇవాళ నిన్ను కాద‌నుకున్న‌వాళ్లు, నిన్ను రిమూవ్ చేసిన‌వాళ్లు మ‌ళ్లీ నువ్వే కావాల‌నుకునేట‌ట్లు చేస్తాను" అని ఆమె బ‌ర్త్‌డేకి మాటిచ్చారు రాఘ‌వేంద్ర‌రావు. త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నారు. "రాఘవేంద్ర‌రావు సినిమాలు లేక‌పోతే నేను ఓ సిస్ట‌ర్ క్యారెక్ట‌రో ఇంకొక‌టో చేసుకుంటూ ఉండేదాన్ని. లేదంటే ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయి, పెళ్లి చేసుకొని, ఎక్క‌డో ఏదో చేసుకుంటూ ఉండేదాన్ని. న‌టిగా, స్టార్‌గా నాకు రిక‌గ్నిష‌న్ వ‌చ్చిందంటే.. ఆ క్రెడిట్ మొత్తం ఆయ‌న‌దే. నా చివ‌రి శ్వాస దాకా ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను." అని రాఘ‌వేంద్ర‌రావు 'సౌంద‌ర్య‌ల‌హ‌రి' షోలో చెప్పారు ర‌మ్య‌కృష్ణ‌.

దాస‌రి ఎక్క‌డ‌? చిరంజీవి ఎక్క‌డ‌? గురువు ఉంటే 'మా' గోల ఇలా ఉండేదా?

  టాలీవుడ్‌లో గురువుగా అంద‌రి చేతా గౌర‌వ మ‌న్న‌న‌లు పొందిన వ్య‌క్తి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు. ప‌రిశ్ర‌మ‌లో ఏ క్రాఫ్ట్‌లో స‌మ‌స్య వ‌చ్చినా అంద‌రూ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేది దాస‌రి ద‌గ్గ‌ర‌కే. 99 శాతం ఆయ‌న వాటిని ప‌రిష్క‌రించేవారు. అందుకే దాస‌రి అంటే ప్ర‌తి ఒక్క‌రికీ భ‌క్తి, గౌర‌వం! నాలుగేళ్ల క్రితం 2017లో ఆయ‌న క‌న్నుమూయ‌డం టాలీవుడ్‌కు పెద్ద దెబ్బ‌. ఆయ‌న లేక‌పోవ‌డం చిత్ర‌సీమ‌కు ఎంత లోటుగా మారిందంటే, చుక్కాని లేని నావ‌గా త‌యారయ్యింది ప‌రిస్థితి. దాస‌రి స్థానాన్ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా క‌లిసి మెగాస్టార్ చిరంజీవికి పెద్ద‌దిక్కు బాధ్య‌త‌ల్ని క‌ట్ట‌బెట్టారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో క‌రోనా క్రైసిస్ చారిటీ పెట్టి కార్మికుల‌కు మూడు నాలుగు నెల‌ల‌పాటు నిత్యావ‌స‌రాల‌ను త‌న ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు చిరంజీవి. అప్పుడంతా ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద దిక్కుగా మారుతున్నార‌ని ఆశ‌ప‌డ్డారు. థియేట‌ర్లు మూత‌ప‌డి, షూటింగ్‌లు ఆగిపోయి ఇండ‌స్ట్రీ సంక్షోభంలో చిక్కుకొన్న‌ప్పుడు పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించిన చిరంజీవి.. ఇప్పుడు ఆ త‌ర‌హా పెద్ద‌రికాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి చొర‌వ చూపి, ప్ర‌భుత్వాల‌తో మాట్లాడిన ఆయ‌న ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రెసిడెంట్‌గా ఎల‌క్ష‌న్ల‌లో నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇండ‌స్ట్రీలోని న‌టులు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. తెలుగువాడు కాని ప్ర‌కాశ్‌రాజ్‌కు 'మా' పెత్త‌నాన్ని ఇవ్వ‌డ‌మేంట‌ని మోహ‌న్‌బాబు ఆధ్వ‌ర్యంలో ఓ వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. మోహ‌న్‌బాబు కుమారుడు విష్ణు స్వ‌యంగా ప్ర‌కాశ్‌రాజ్‌కు పోటీగా అధ్య‌క్ష బ‌రిలో నిల్చున్నాడు. అప్ప‌ట్నుంచీ రెండు ప్యాన‌ల్స్‌గా విడిపోయిన న‌టులు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ, ఆరోప‌ణ‌లు-ప్ర‌తి ఆరోప‌ణ‌ల‌తో ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌య‌ట ప‌డేస్తున్నార‌నే అభిప్రాయం నెల‌కొంది. చిరంజీవి ఓపెన్‌గా చెప్ప‌క‌పోయినా ఆయ‌న స‌పోర్ట్ ప్ర‌కాశ్‌రాజ్‌కు ఫుల్‌గా ఉంద‌ని తెలిసిపోయింది. ఆయ‌న పెద్ద త‌మ్ముడు నాగ‌బాబు డైరెక్టుగా ప్రకాశ్‌రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా, ఆయ‌న‌ను ఆకాశానికెత్తేస్తూ, మంచు విష్ణును కించ‌ప‌రుస్తూ మాట్లాడుతుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌కాశ్‌రాజ్ వ‌ర్గానికి నాగ‌బాబు ఒక ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతున్నారు.  ఏ విష‌యంలోనైనా సంయ‌మ‌నం కోల్పోకుండా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరున్న చిరంజీవి, 'మా' ఎన్నిక‌ల విష‌యంలో మౌనం వ‌హించ‌డం, నాగ‌బాబును కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో గ‌తంలో 'మా' ఎన్నిక‌ల విష‌యంలో ఎన్న‌డూ చూడ‌ని దారుణ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిరంజీవి ముందుకు వ‌చ్చి, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే అవ‌కాశం ఉన్నా ఆయ‌న ముందుకు రాలేదు. పాతికేళ్ల క్రితం ఏర్ప‌డిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌కు చిరంజీవి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు. అలాంటి వ్య‌క్తి త‌మ అసోసియేష‌న్ ప‌రువు గంగ‌లో క‌లుస్తున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం, 'మా' కుటుంబ పెద్ద‌గా జోక్యం చేసుకొని, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌కుల‌కు దారితీస్తోంది. ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీలోని వారంతా దాస‌రి నారాయ‌ణ‌రావునూ, చిరంజీవినీ పోల్చి పెద‌వి విరుస్తున్నారు. ట్రబుల్ షూట‌ర్ అయిన దాస‌రి ఎక్క‌డ‌, ట్రబుల్ టైమ్స్‌లో బ‌య‌ట‌కు రాని చిరంజీవి ఎక్క‌డ‌? అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

స‌మంత‌ను ఇదివ‌ర‌కటిలా టాలీవుడ్ ఆద‌రిస్తుందా? కోలీవుడ్‌కు త‌ర‌లిపోతుందా?

  ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు తాము భార్యాభ‌ర్త‌లుగా విడిపోతున్నామ‌నీ, స్నేహితులుగా కొన‌సాగుతామ‌నీ స‌మంత‌, నాగ‌చైత‌న్య ప్ర‌క‌టించ‌డంతో సినీ వ‌ర్గాల‌వారు, అభిమానులు మొద‌ట షాకైపోయి, త‌ర్వాత కొంత‌కాలంగా వింటూ వ‌స్తున్న‌దేగా అని సర్దుకున్నారు. ఇక ఇప్పుడు సామ్‌, చైతూ ఎవ‌రి జీవితాల‌ను వారు స్వ‌తంత్రంగా, స్వేచ్ఛ‌గా జీవించ‌నున్నారు. అయితే ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్ర‌శ్న‌లు.. మునుప‌టిలా తెలుగుచిత్ర‌సీమ స‌మంత‌ను ఆద‌రిస్తుందా? ఆమెకు మంచి మంచి అవ‌కాశాల‌ను అందిస్తుందా? అని.  నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకోక ముందు కంటే, చేసుకున్న త‌ర్వాత‌నే స‌మంత మ‌రింత స్వేచ్ఛ‌గా త‌న కెరీర్‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చింద‌నేది నిజం. ఒక‌వైపు ప‌ర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూనే, సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు, వీడియోల‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకుంటూ వ‌చ్చింది. 'ఓ బేబి', 'మ‌జిలీ' లాంటి సినిమాలు ఆమెకు న‌టిగా మ‌రింత పేరు తెచ్చాయి. అయితే 'ద ఫ్యామిలీమ్యాన్ 2' సిరీస్‌లో ఆమె చేసిన రాజీ క్యారెక్ట‌ర్ విమ‌ర్శ‌కుల్ని మెప్పిస్తే, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్ని డిజ‌ప్పాయింట్ చేసింది. అలాంటి బోల్డ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం ఇప్పుడు అవ‌స‌ర‌మా అంటూ సోష‌ల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు. అయితే దానికి మంచి ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత షేర్ చేసిన క్లీవేజ్ ఫొటోలు, బికినీ ఫొటోలు, అర్ధ‌న‌గ్న ఫొటోలు అక్కినేని ఫ్యామిలీని, వారి అభిమానుల్నీ బాగా ఇబ్బందిపెడుతూ వ‌చ్చాయంటారు. నాగ‌చైత‌న్య ఆమె స్వేచ్ఛ‌కు అడ్డురాక‌పోయినా, అభిమానుల నుంచీ, కుటుంబం నుంచీ వ‌చ్చిన ఒత్తిడుల‌తో అత‌ను కూడా క్ర‌మంగా ఆమెకు ఆంక్ష‌లు పెడుతూ వ‌చ్చాడంటారు. దాంతో ఇద్ద‌రూ విడిపోక త‌ప్ప‌లేదు. ఇలాంటి నేప‌థ్యంలో స‌మంత కెరీర్ ఎలా ఉండ‌నున్న‌ద‌నే చ‌ర్చ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. గుణ‌శేఖ‌ర్ మూవీ 'శాకుంతలం'ను ఆమె ఇటీవ‌ల పూర్తిచేసింది. పౌరాణిక చిత్రంగా రూపొందుతోన్న 'శాకుంత‌లం'లో ఆమె శ‌కుంత‌ల పాత్ర‌ను పోషించింది. ఇది త‌ప్పితే తెలుగులో ఆమెకు మ‌రో సినిమా లేదు. త‌మిళంలో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్‌లో 'కాదు వాకుల రెండు కాద‌ల్' మూవీని చేస్తోంది. అక్కినేని వారి కోడ‌లిగా ఆమెకు వ‌చ్చిన ఇమేజ్‌తో ప‌ర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్స్, లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌ ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవి. వాటిలో త‌న‌కు న‌చ్చిన వాటిని ఎంచుకునేది స‌మంత‌. ఇప్పుడు చైతూతో విడిపోయాక మునుప‌టిలా ఆమెకు డైరెక్ట‌ర్స్ అవ‌కాశాలు ఇస్తారా? అనే సందేహాన్ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.  స‌మంత మాతృభాష మ‌ల‌యాళం. చెన్నైలో పుట్టిపెరిగిన ఆమెకు అటు మ‌ల‌యాళం, ఇటు త‌మిళ చిత్ర‌రంగాల కంటే మిన్న‌గా తెలుగు చిత్ర‌రంగం బాగా ఆద‌రించి, స్టార్ హీరోయిన్‌ను చేసింది. ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ, త‌న‌కు అన్నీ ఇచ్చిన హైద‌రాబాద్‌లోనే ఉంటాన‌నీ, ఇంకెక్క‌డికీ వెళ్ల‌న‌ని స‌మంత చెప్పింది. టాలీవుడ్ నుంచి స‌రైన అవ‌కాశాలు రాక‌పోతే, స‌మంత ఏం చేస్తుంది? త‌మిళంలో అవ‌కాశాల‌ను వెతుక్కుంటుందా? అనే ప్ర‌శ్నలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి కొద్ది నెల‌ల త‌ర్వాత ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించ‌వ‌చ్చు.

సెన్సేష‌న‌ల్ యాక్ట్రెస్‌ దివ్య‌భార‌తి మృతి ఇప్ప‌టికీ ఒక మిస్ట‌రీ!

  దివ్య ఓంప్ర‌కాశ్ భార‌తి అంటే ఎవ‌రా అని ఆలోచన‌లో ప‌డొచ్చు. అదే.. దివ్య‌భార‌తి అంటే ఠ‌క్కున మ‌న‌కు ‘బొబ్బిలి రాజా’, ‘అసెంబ్లీ రౌడీ’ హీరోయిన్ గుర్తుకొచ్చేస్తుంది. కేవ‌లం మూడంటే మూడు సంవ‌త్స‌రాల కెరీర్‌లో సౌత్‌, నార్త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అగ్ర తార‌గా రాణించి, జూనియ‌ర్ శ్రీ‌దేవిగా గుర్తింపు పొంది, పందొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సుకే.. త‌ను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కింద‌ప‌డిపోయి ఆక‌స్మికంగా అసువులు బాసి, దేశాన్నంతా బిగ్ షాక్‌కు గురి చేసింది దివ్య‌భార‌తి. ఆ వార్త‌తో ఎంత‌మంది కుర్ర‌కారు గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయో! త‌న అందంతో, త‌న పాత్ర‌ల‌తో ఎంత‌గా మీడియా దృష్టిలో ప‌డిందో, అంత‌కంటే ఎక్కువ‌గా త‌న మ‌ర‌ణంతో ఆమె ఆ మీడియాలో నానింది. దివ్య‌భార‌తి వ్య‌క్తిగ‌త జీవితం గురించి అప్పుడే చాలామందికి తెలిసింది. అయిన‌ప్ప‌టికీ నేటి ప్రేక్ష‌కుల్లో ఎక్కువ‌మందికి ఆమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ సాజిద్ న‌దియ‌డ్‌వాలాను వివాహం చేసుకుంద‌నే విష‌యం తెలియ‌దు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఏమాత్రం సంబంధంలోని కుటుంబంలో 1974లో జ‌న్మించింది దివ్య‌. సినీ హీరోయిన్ కావ‌డ‌మ‌నేది ఆమెకు సుదూర క‌ల‌. కానీ టీనేజ్‌లోకి అడుగు పెట్టిన ఏడాదికే, అంటే 14 ఏళ్ల వ‌య‌సులో ఆమె నిర్మాత నందు తొలానీ దృష్టిలో ప‌డింది. ఆమెను చూసీ చూడ‌గానే, వెంట‌నే త‌న సినిమాల్లోకి ఆమెను తీసుకోవాల‌ని ఆయ‌న అనుకున్నాడు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది కానీ ఇత‌ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డింది దివ్య‌. అదీ ఓ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దృష్టిలో. ఆయ‌న సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌ల్లో ఒక‌రైన డి. సురేశ్‌బాబు. వెంక‌టేశ్ స‌ర‌స‌న‌ ‘బొబ్బిలి రాజా’ (1990)లో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా తెరంగేట్రం చేసింది దివ్య‌. ఆమెలో శ్రీ‌దేవిని చూసుకున్నారు జ‌నం. త‌న అపురూప సౌంద‌ర్య విలాసంతో, ముచ్చ‌టైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేసింది ప‌ద‌హారేళ్ల ప‌డుచు దివ్య‌. ఆ త‌ర్వాత తెలుగులో చ‌క‌చ‌కా రౌడీ అల్లుడు, నా ఇల్లే నా స్వ‌ర్గం, అసెంబ్లీ రౌడీ సినిమాలు చేసింది. అప్పుడు స‌న్నీ డియోల్‌తో ‘విశ్వాత్మ’ (1992)లో హీరోయిన్‌గా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది ఆమె తొలి హిందీ చిత్రం. అది చెప్పుకోద‌గ్గ రీతిలో ఆడ‌క‌పోయినా, అందులో చేసిన “సాత్ స‌ముంద‌ర్” సాంగ్‌తో ఆమె అక్క‌డ సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. అప్ప‌ట్లో అది హిందీ ఆడియెన్స్ అందరి ఫేవ‌రేట్ సాంగ్‌. ఇప్ప‌టికీ ఆ పాట‌ను హ‌మ్ చేసుకుంటూనే ఉంటారు. 1992లోనే ఆమె 12 సినిమాలు చేసిందంటే ఆమె గిరాకీ ఏ రేంజిలో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. వాటిలో రెండు తెలుగు సినిమాలు.. ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధ‌ర్మ‌క్షేత్రం’ ఉన్నాయి. ఆ త‌ర్వాత ఆమె అనేక సినిమాల‌కు సంత‌కం చేసింది. కేవ‌లం మూడేళ్ల కాలంలోనే ఆమె 21 సినిమాలు చేస్తే, దాదాపు మ‌రో 30 సినిమాల‌కు ఆమె సంత‌కం చేసింద‌ని స‌మాచారం! హిందీలో దివ్యభార‌తి చేసిన రెండో సినిమా ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్‌’. దాని హీరో గోవిందా. సాజిద్ న‌దియ‌డ్‌వాలా అప్పుడే ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేక‌ర్‌గా అప్పుడే త‌న బ్యాన‌ర్‌ను మొద‌లుపెట్టి, ‘జుల్మ్ కీ హుకుమ‌త్’ సినిమా నిర్మిస్తున్నాడు. అందులోనూ గోవిందానే హీరో. స‌హ‌జంగానే ఈ రెండు సినిమాల షూటింగ్‌లు క్లాష్ అయ్యాయి.   గోవిందాను క‌లుసుకోవ‌డానికి ఓసారి ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్’ సెట్స్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు సాజిద్‌. త‌న జీవితాన్ని ఆ రోజు మార్చేస్తుంద‌ని అత‌డు ఊహించ‌లేదు. అక్క‌డ దివ్య‌భార‌తిని చూడ‌గానే క‌ళ్లు తిప్పుకోలేక‌పోయాడు సాజిద్‌. 26 సంవ‌త్స‌రాల అత‌డు తొలిచూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డిపోయాడు.   ఆ రోజు ప‌రిచ‌యం త‌ర్వాత‌, ఇక ప్ర‌తిరోజూ ఆమె కోసం అక్క‌డికి రావ‌డం మొద‌లుపెట్టాడు. మొద‌ట స్నేహం కుదిరింది. రోజులు గ‌డిచేకొద్దీ గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకోవ‌డం సాధార‌ణ‌మైంది. దాంతో ఒక‌రిమీద ఒక‌రికి మ‌న‌సైంది. త‌మ మ‌ధ్య ప్రేమ కుదిరింద‌ని తెలుసుకున్నారు. కానీ దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. ఇద్ద‌రివీ భిన్న మ‌తాల నేప‌థ్యాలైన‌ప్ప‌టికీ, దివ్య కెరీర్ అప్పుడ‌ప్పుడే మొద‌లైన‌ప్ప‌టికీ, సాజిద్ ఇంకా పూర్తి స్థాయిలో నిల‌దొక్కుకోన‌ప్ప‌టికీ, 1992లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. నిజానికి దివ్య మేజ‌ర్ అవ‌డం కోసం వారు ఎదురు చూశారు. ఆమెకు ప‌ద్దెనిమిదేళ్లు నిండ‌గానే మే 10న మ్యారేజ్ చేసుకున్నారు. సాజిద్ కోసం దివ్య ఇస్లాం మ‌తంలోకి మారి, త‌న పేరును స‌న న‌దియ‌డ్‌వాలాగా పేరు కూడా మార్చుకుంది. పెళ్ల‌య్యాక కూడా వారు దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం మాత్రం కొన‌సాగుతూ వ‌చ్చింది. త‌ను ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో సాజిద్‌తో త‌న‌కు స‌న్నిహిత బంధం ఉంద‌ని చెప్తూనే పెళ్లయ్యింద‌నే విష‌యాన్ని చెప్ప‌కుండా దాట‌వేస్తూ వ‌చ్చింది దివ్య‌. కాక‌పోతే 1994లో ఓ బిగ్ న్యూస్ చెబుతాన‌ని మాత్రం హింట్ ఇచ్చింది.   కానీ ఆ బిగ్ న్యూస్‌ను అనౌన్స్ చేయ‌డానికి ఆమె బ‌తికి లేదు. ఎందుకంటే.. 1993 ఏప్రిల్ 5నే త‌న అపార్ట్‌మెంట్ నుంచి ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి తీవ్ర గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఆమె అర్ధంత‌ర మ‌ర‌ణం అనేక అనుమానాల‌కు, వివాదాల‌కు తావిచ్చింది. ఆ దుర్ఘ‌ట‌న వెనుక సాజిద్ ఉన్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ అవి ధ్రువీక‌ర‌ణ కాలేదు. ఇప్ప‌టికీ దివ్య‌భార‌తి మృతి ఒక మిస్ట‌రీ. దివ్య మ‌ర‌ణంతో సాజిద్ గుండె ప‌గిలింది. అప్ప‌ట్నుంచీ త‌ను నిర్మించిన సినిమాల‌ను ఆమెకు అంకితం ఇస్తూ వ‌చ్చాడు. వార్దా ఖాన్ అనే జ‌ర్న‌లిస్ట్‌ను మ్యారేజ్ చేసుకొనే దాకా అత‌డు ఆ అల‌వాటును కొన‌సాగించాడు. ఇప్ప‌టికీ సాజిద్ వాలెట్‌లో దివ్య‌భార‌తి ఫొటో ఉంటుంద‌ని వార్దా ఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించడం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.

భానుమ‌తి వ‌ర్సెస్ మౌనిక‌.. సాయిప‌ల్ల‌వి బెస్ట్ క్యారెక్ట‌ర్ ఏది?

  అతి త‌క్కువ కాలంలో పాపుల‌ర్ అయిన తార‌ల్లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. మ‌ల‌యాళంలో న‌టించిన 'ప్రేమ‌మ్' మూవీతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ త‌న‌వేపుకు తిప్పుకుంది ప‌ల్ల‌వి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు 'ఫిదా' (2017) మూవీ ద్వారా ప‌రిచ‌య‌మై, భానుమ‌తి పాత్ర‌తో అంద‌రినీ ఫిదా చేసేసింది. అయితే అదివ‌ర‌కే 2009లో 'ఢీ.. అల్టిమేట్ డాన్స్ షో'లో కంటెస్టెంట్‌గా ఆమె పార్టిసిపేట్ చేసిన విష‌యం కొంత‌మందికి తెలుసు. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేసిన 'ఫిదా' మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ప‌ల్ల‌వి. 'ఫిదా'లో ఆరున్న‌ర అడుగుల వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న పొట్టిపిల్ల‌గా క‌నిపించిన‌ప్ప‌టికీ ఆ జోడీ ఆడియెన్స్‌ను అల‌రించింది. దాని త‌ర్వాత ఆమె నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో త‌న అస‌లు పేరు ప‌ల్ల‌వితోటే న‌టించి ఆక‌ట్టుకుంది. ముద్దు పేరు మాత్రం చిన్ని. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఎ.ఎల్‌. విజ‌య్ డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం 'క‌ణం' (త‌మిళంలో 'దియా')లో తుల‌సి అనే ఛాలెంజింగ్ రోల్ చేసింది సాయిప‌ల్ల‌వి. పెళ్లికి ముందే గ‌ర్భందాల్చి, బ‌ల‌వంతంగా అబార్ష‌న్ చేయించుకోవాల్సిన పాత్ర‌లో ప‌ల్ల‌వి సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే 'క‌ణం' ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా నిలించిందే కానీ, జ‌నాద‌ర‌ణ పొంద‌లేదు. శ‌ర్వానంద్ స‌రస‌న ప‌ల్ల‌వి న‌టించిన 'ప‌డిప‌డి లేచే మ‌న‌సు' కూడా స‌రిగా ఆడ‌లేదు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మెడికో వైశాలి పాత్ర‌ను పోషించింది ప‌ల్ల‌వి. త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేకూర్చింది. ఇతివృత్తం, క‌థ‌నం ప్రేక్ష‌కుల్ని ఇంప్రెస్ చేయ‌లేక‌పోవ‌డంతో ఆశించిన రీతిలో ఈ సినిమాని జ‌నం ఆద‌రించ‌లేదు. మూడేళ్ల గ్యాప్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు 'ల‌వ్ స్టోరి'లో చేసిన మౌనిక పాత్ర‌తో వ‌చ్చింది ప‌ల్ల‌వి. పెద్దింటి కుటుంబానికి చెంది, చిన్న‌త‌నం నుంచే లైంగిక వేధింపుల‌కు గురైన అమ్మాయిగా, త‌న కాళ్ల‌మీద త‌ను నిల‌బ‌డాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆర్మూర్ గ్రామం నుంచి హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన అమ్మాయిగా ప‌ల్ల‌వి ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం ప్రేక్ష‌కుల్ని మ‌రోసారి మెస్మ‌రైజ్ చేసింది. ఆమెకు తోడు హీరో రేవంత్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య ఇచ్చిన ప‌ర్ఫార్మెన్స్ 'ల‌వ్ స్టోరి'ని మెమ‌ర‌బుల్ మూవీగా నిలిపింది. ఈ మూవీలో ప‌లు సంద‌ర్భాల్లో ప‌ల్ల‌వి చేసిన డాన్స్ చూడ్డానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నిపించింది. టాలీవుడ్ సినిమాల వ‌ర‌కు చూసుకుంటే.. ఒక్క 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో చేసిన ప‌ల్ల‌వి పాత్ర మిన‌హాయిస్తే మిగ‌తా సినిమాల్లో సాయిప‌ల్ల‌వి చేసిన‌వ‌న్నీ అభిన‌యానికి ప్రాధాన్యం ఉన్న సినిమాలే కావ‌డం, అవ‌న్నీ కూడా సంఘ‌ర్ష‌ణ‌తో కూడిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ది బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్ట‌ర్‌ను ఎంచ‌డం క‌ష్ట‌మే కానీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ఆమెను బాగా ద‌గ్గ‌ర‌కు చేర్చిన‌వి మాత్రం 'ఫిదా' చిత్రంలోని భానుమ‌తి, 'ల‌వ్ స్టోరి' మూవీలోని మౌనిక పాత్ర‌ల‌నేది నిజం.

క‌మ‌ల్ హాస‌న్ న‌ట విశ్వ‌రూపం చూడాలంటే ఈ సినిమాలు చూడాలి!

  భారతీయ చిత్రసీమలోని సమకాలీన నటుల్లో కమల్‌హాసన్ చేసినన్ని విలక్షణమైన, వైవిధ్యమైన పాత్రలు మరే నటుడూ చేయలేదనేది నిర్వివాదం. ఆయన వయసు అరవై ఐదేళ్లు అయితే, ఆయన సినీ కెరీర్ వయసు యాభై తొమ్మ‌దేళ్లు. బాలనటునిగా కేవలం ఆరేళ్ల వయసులో నటించిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఘన చరిత్ర ఆయనది. అప్పట్నించీ ఇప్పటిదాకా ఆయన పోషించిన ఎన్నో పాత్రలు మన హృదయల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమంటే ఏమిటో ఇప్పటి నటులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దక్షిణాదిన కానీ, ఉత్తరాదిన కానీ సూపర్‌స్టార్లు ఎంతోమంది ఉండోచ్చు కానీ, కమల్ వంటి గ్రేట్ యాక్టర్లు ఒకరిద్దరు కంటే కనిపించరు. నిజానికి కమల్‌కు సాటిరాగల నటుడు ఈ కాలంలో ఎవరున్నారనీ! జాతీయ ఉత్తమ నటుడు 1960లో వచ్చిన తమిళ చిత్రం 'కళత్తూర్ కన్నమ్మ' సినిమాతో ఆరేళ్ల వయసులో బాలనటునిగా పరిచయమయ్యారు కమల్. అందులో జంటగా నటించిన జెమినీ గణేశన్, సావిత్రి కొడుకు పాత్రను ఆయన పోషించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడిగా ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించి ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డు అందుకున్నారు కమల్. కథానాయకుడిగా ఎదిగాక ఆయన మరో మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. వాటిలో మొదటిది 'మూండ్రం పిరై' (1982). బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'వసంత కోకిల'గా అనువాదమైంది. రెండు భాషల ప్రేక్షకుల హృదయాలనూ పిండేసింది ఈ సినిమా. మతిస్థిమితం కోల్పోయిన శ్రీదేవికి అండగా నిలిచి, ఆమెకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడి, ఆమె మామూలు మనిషయ్యాక తనను గుర్తుపట్టకపోతే విలవిల్లాడిపోయిన స్కూల్ టీచర్‌గా కమల్ ప్రదర్శించిన అభినయం అపూర్వం. రైల్వే స్టేషన్‌లో శ్రీదేవికి తానెవరో స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో ఆమెకు ఇష్టమైన కోతి చేష్టలన్నీ చేస్తే, అతను మానసిక రోగి అయిన భిక్షగాడేమోనని ఆమె భావించే క్లైమాక్స్ సీన్ ఎంతటి కఠిన హృదయులనైనా కదిలించి వేస్తుంది. ఆ సన్నివేశం చూసి దు:ఖపడని వాళ్లు ఒక్కరూ లేరు. భారతీయ సినిమాలో ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న 'నాయకన్' (1987 - తెలుగులో 'నాయకుడు') ఆల్‌టైం 20 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఒకప్పటి బొంబాయి చీకటి సామ్రాజ్య చక్రవర్తి వరదరాజ మొదలియార్ జీవితం ప్రేరణతో మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో కథానాయకుడు వేలు నాయకర్ పాత్రలో కమల్ నటనా విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఈ పాత్రతో ఆయన మరోసారి ఉత్తమ నటునిగా జాతీయ అవార్డు అందుకునారు. ఆ అవార్డును ఆయన చివరిసారి అందుకున్న చిత్రం 'ఇండియన్' (1996 - తెలుగులో 'భారతీయుడు'). దేశంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ప్రధానంగా స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సేనాపతి అనే డెబ్భై ఏళ్ల వృద్ధుడి పాత్రను ఆయన పోషించిన తీరు అనన్యసామాన్యం. అమావాస్య చంద్రుడు కథానాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కూడా ఇమేజ్ అనేదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కమల్. ప్రధానంగా కె. బాలచందర్, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకులు ఆయనలోని నటుణ్ణి ప్రపంచం ముందు గొప్పగా ప్రదర్శింపజేశారు. వందో చిత్రమంటే ఏ నటుడికైనా మైలురాయే. అలాంటి వందో చిత్రంలో ఏ హీరో గుడ్డివాని పాత్రతో రిస్క్ చేస్తాడు, కమల్ తప్ప! ఆ సినిమా 'రాజా పార్వై' (1981 - తెలుగులో 'అమావాస్య చంద్రుడు'). సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రంలో ఓ అందమైన క్రిస్టియన్ యువతి (మాధవి) ప్రేమలో పడిన అంధ వయొలినిస్ట్‌గా నటించి, మెప్పించారు కమల్. ఇక అదే దర్శకుడు తీసిన 'పుష్పక విమానం' (1987) గురించి చెప్పేదేముంది. 1930ల కాలంలోని మూకీ సినిమాల తరహాలో ఎలాంటి సంభాషణలూ లేకుండా పాత్రల సైగలతోటే నడిచే నిశ్శబ్ద చిత్రమిది. ఇందులో కమల్ ప్రదర్శించే హావభావాలు ఔత్సాహిక నటులకు పాఠాలు. సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది ఈ చిత్రం. సింగీతమే రూపొందించిన 'అపూర్వ సహోదరగళ్' (1989 - తెలుగులో 'విచిత్ర సోదరులు') బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తను స్వయంగా నిర్మించిన ఇందులో తండ్రిగా, ఆయన ఇద్దరు కవల పిల్లలుగా త్రిపాత్రలు చేశారు  కమల్. ముఖ్యంగా తండ్రి మరణానికి కారకులైన వాళ్లపై పగతీర్చుకునే మరుగుజ్జు అప్పు పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు హైలైట్. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా మరుగుజ్జుగా కనిపిస్తూ నటించడానికి ఆయన పడిన విపరీతమైన కష్టం అనితర సాధ్యం. సాగర ముత్యం కె. విశ్వనాథ్, కమల్ కాంబినేషన్ గొప్పగా రాణించింది. అందుకు చక్కని ఉదాహరణలు 'సాగర సంగమం' (1983), 'స్వాతిముత్యం' (1986). సంగీత నృత్య దృశ్యకావ్యంగా రూపొందిన 'సాగర సంగమం' సీఎన్ఎన్-ఐబీఎన్ వంద గొప్ప భారతీయ చిత్రాల్లో స్థానం పొందింది. శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతుడైన బాలకృష్ణగా కమల్ అభినయం అసామాన్యం. నీళ్లబావిపై నిల్చుని ఆయన చేసే నాట్యం సినిమాకే హైలైట్. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చొని స్టేజిపై శైలజ నృత్యాన్ని చూస్తూ ఆయన చనిపోయే సన్నివేశం గుండెను బరువు చేసేస్తుంది. ఇక వయసు పెరిగినా, మెదడు ఎదగని శివయ్య అనే అమాయక గ్రామీణ యువకునిగా కమల్ నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. దేశంలోనే తానెందుకు అత్యుత్తమ నటుడో మరోసారి ఆయన ప్రపంచానికి నిరూపించిన పాత్ర శివయ్య. ఈ సినిమా తర్వాత నిష్కల్మష హృదయుణ్ణి 'వాడు స్వాతిముత్యంరా' అనడం పరిపాటి అయ్యింది. అది ఆ పాత్ర, ఆ పాత్ర పోషణలో కమల్ సాధించిన విజయం. మరో చరిత్ర కె. బాలచందర్ రూపొందించిన ప్రేమకావ్యం 'మరో చరిత్ర' (1978) టైటిల్‌కు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్రను సృష్టించింది. ఆ కాలం కుర్రకారు ఈ సినిమాను ఎన్నిసార్లు చూశారో! ఒక క్రిస్టియన్ మతానికి చెందిన తెలుగమ్మాయి ప్రేమలోపడ్డ తమిళ బ్రాహ్మణ యువకుడు బాలు పాత్రలో యువతరానికి ప్రతినిథిగా కమల్ అత్యుత్తమ నటన ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఇదే సినిమాను కమల్‌తోటే 'ఏక్ దూజే కే లియే'గా హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. ఈ రెండు చిత్రాలూ సీఎన్ఎన్-ఐబీఎన్ జాబితాలో స్థానం పొందడం విశేషం. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్ కనిపించే చిత్రం 'ఆకలి రాజ్యం' (1981). డెబ్భైల చివరి నాళ్లనుంచీ, ఎనిమిదో దశకం వరకు దేశంలోని యువతను నిరుద్యోగం ఎంతగా బాధించిందనే దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకుని భంగపడే నిరుద్యోగిగా కమల్ ప్రదర్శించిన అభినయాన్ని మరచిపోవడం కష్టం. అదివరకు కమల్‌తో తనే తీసిన తమిళ చిత్రం 'వారుమయిన్ నీరం శివప్పు'కు రీమేక్‌గా దీన్ని రూపొందించారు బాలచందర్. మహానది నటునిగా కమల్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో 'మహానది' (1994)ని ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసమగ్రం అవుతుంది. ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేసిన '25 గ్రేటెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా'లో ఈ చిత్రంలో కమల్ పోషించిన పాత్ర చోటు పొందిందంటేనే, ఆ పాత్రను ఆయన ఏ రీతిలో పోషించారో అర్థం చేసుకోవచ్చు. బీభత్స రస ప్రధానంగా దర్శకుడు సంతాన భారతి రూపొందించిన ఈ చిత్రంలో భార్యను కోల్పోయిన ఇద్దరు పిల్లల తండ్రి కృష్ణస్వామిగా కనిపిస్తారు కమల్. స్నేహితుని వంచనకు గురై జైలుపాలై, బయటకు వచ్చాక కనిపించకుండా పోయిన పిల్లల కోసం అన్వేషించే తండ్రిగా కమల్ ప్రదర్శించిన నటన వర్ణనలకు అందనిది. ముఖ్యంగా కలకత్తాలోని వ్యభిచారవాడ సోనాగచ్చిలో ఉన్న కూతురిని వెతుక్కుంటూ, అక్కడకు వెళ్లి మొదటిసారి ఆమెను కమల్ చూసే సన్నివేశం భారతీయ సినిమాలోని అత్యంత హృదయ విదారక సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. దానితో పాటు మరికొన్ని సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో కమల్ అభినయం మనల్ని చాలా కాలం వెంటాడుతూనే ఉంటాయి. ఇవే కాకుండా తమిళ చిత్రాలు 'అవల అప్పడిదన్' (1978), 'మైఖేల్ మదన కామ రాజన్' (1990), 'గుణ' (1991), 'అన్బే శివమ్‌' (2003), 'విరుమాండి' (2004), 'దశావతారం' (2008), తెలుగు చిత్రాలు 'ఇంద్రుడు చంద్రుడు' (1989), 'శుభసంకల్పం' (1995), హిందీ చిత్రాలు 'సాగర్' (1985), 'హే రామ్‌' (2000) వంటివి కూడా కమల్ విలక్షణ నటనా సామర్థ్యానికి మెచ్చు తునకలు.

అన్నాదురై అంతిమ సంస్కారంలో పాల్గొని, 'క‌థానాయ‌కుడు' షూటింగ్ పూర్తి చేసిన జ‌య‌ల‌లిత‌!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు టైటిల్ రోల్ చేసిన 'క‌థానాయ‌కుడు' (1969) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో జ‌య‌ల‌లిత నాయిక‌గా న‌టించారు. భ్ర‌ష్టుప‌ట్టిన రాజ‌కీయాల‌పై సెటైరిక‌ల్ మూవీగా ఈ సినిమా రూపొందింది. ప్యాచ్‌వ‌ర్క్ చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా అనుకోని అవాంత‌రం ఏర్ప‌డింది. 1969 ఫిబ్ర‌వ‌రి 3 నుంచి 6 వ‌ర‌కూ ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత కాల్షీట్లు ఇచ్చారు. అంత‌లో పిడుగులాంటి వార్త. అప్ప‌టికే అనారోగ్యంతో మ‌ద్రాస్‌లోని స్టాన్లీ హాస్పిట‌ల్‌లో ఉన్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత అన్నాదురై క‌న్నుమూశారు. త‌మిళ ప్ర‌జానీకంలో అన్నాదురైకు ఉన్న ఆద‌ర‌ణ అసామాన్యం. ఆయ‌న మృతితో త‌మిళ‌నాడు మొత్తం స్తంభించిపోయింది. అప్పుడు డీఎంకేలో ఎంజీఆర్ కూడా కీల‌క వ్య‌క్తిగా ఉన్నారు. అన్నాదురై మృతి చెందిన విషాదంలో ఉన్న జ‌య‌ల‌లిత కూడా 'క‌థానాయ‌కుడు' ప్యాచ్‌వ‌ర్క్ షూటింగ్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. అయితే ఎన్టీఆర్ కాల్షీట్లు 6వ తేదీ దాకే ఉన్నాయి. అది త‌ప్పితే ఆరు నెల‌ల దాకా ఆయ‌న కాల్షీట్లు లేవు. నిర్మాత కె. గోపాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు హేమాంబ‌ర‌ధ‌ర‌రావుకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 27న సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేసేశారు. అన్నాదురై పార్థివ దేహాన్ని రాజాజీ హాలులో ఉంచారు. ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు అంజ‌లి ఘ‌టించారు. మ‌ర్నాడు అంతిమ సంస్కారం. శ‌ర‌వేగంగా బీచ్‌లో స‌మాధిని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 6న మ‌ద్రాస్‌లోని సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు, త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌చ్చిన జ‌నం కాలిన‌డ‌క‌న అన్నాదురై స‌మాధికి అంజ‌లి ఘ‌టించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. జ‌య‌ల‌లిత కూడా టి. న‌గ‌ర్ నుంచి బీచ్ దాకా న‌డిచే వెళ్లారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ప‌దే ప‌దే ఫోన్ చేస్తూ వ‌చ్చారు. వారికి టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఆ రోజు దాటితే ఆర్నెల్ల దాకా ఎన్టీఆర్ మ‌ళ్లీ దొర‌క‌రు. అయితే ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌సాద్ స్టూడియోకి వ‌చ్చారు జ‌య‌ల‌లిత‌. అన్నాదురై స‌మాధికి అంజ‌లి ఘ‌టించి, శ్ర‌మ తీసుకొని ఆమె అదే రోజు షూటింగ్‌కు వ‌చ్చారు. అదీ.. ఆమె క‌మిట్‌మెంట్‌! అయితే తీయాల్సిన బిట్లు 52 దాకా ఉన్నాయి. ఆ రాత్రిలోగా వాటిని తియ్యాలి. నిర్మాత‌కు ఎంత కంగారుగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామికి ఎన్టీఆర్‌తో అదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఆయ‌న మీదే భార‌మంతా వేశారు నిర్మాత‌. రాత్రి 12 గంట‌ల‌లోగా షూటింగ్ పూర్తిచేయాల్సిందిగా బ‌తిమ‌లాడుతూ, అలా చేస్తే ఫియ‌ట్ కారు గిఫ్ట్‌గా ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. నేచుర‌ల్‌గానే స్వామి య‌మ స్పీడు. క్రేన్ ఉప‌యోగించే టైమ్ లేక‌పోవ‌డంతో ఒక ప‌క్క‌ రోప్ మీద నుంచి జారుతూ, ఇంకోప‌క్క ట్రాలీలు వాడుతూ, క్లోజ్ షాట్స్ తీస్తూ, ఎన్టీఆర్‌-జ‌య‌ల‌లిత కాంబినేష‌న్ సీన్స్ అన్నింటినీ స‌రిగ్గా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌క‌ల్లా తీసేశారు స్వామి. నిర్మాత గుమ్మ‌డికాయ కొట్టి స్థిమిత‌ప‌డ్డారు. ఆరోజు షూటింగ్‌కు జ‌య‌ల‌లిత రావ‌డం ఒక విశేష‌మైతే, సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామి మ‌హా స్పీడుతో చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌డం ఇంకో విశేషం. ముందుగా అనౌన్స్ చేసిన‌ట్లు 1969 ఫిబ్ర‌వ‌రి 27న విడుద‌లైన 'క‌థానాయ‌కుడు'కు జ‌నం నీరాజ‌నాలు ప‌ట్టారు. 15 కేంద్రాల‌లో ఈ సినిమా వంద రోజులు ఆడింది.

సురేఖ‌ను చిరంజీవి చేతుల్లో పెడుతూ అల్లు రామ‌లింగ‌య్య ఏం చెప్పారో తెలుసా?

  స్టార్ యాక్ట‌ర్ కాక‌మునుపే స్టార్ క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ మెడ‌లో మూడుముళ్లు వేశారు చిరంజీవి. ఆ త‌ర్వాతే ఆయ‌న స్టార్‌, ఆపైన మెగాస్టార్ అయ్యారు. ఆయ‌న అల్లు వారింటి అల్లుడు కావ‌డంలో నిర్మాత‌గా మారిన మేక‌ప్‌మ్యాన్ జ‌య‌కృష్ణ పెద్ద పాత్ర పోషించారు. మ‌న‌వూరి పాండ‌వులు సినిమాలో త‌న స్నేహితుల‌తో క‌లిసి అల్లు రామ‌లింగ‌య్య‌ను ఏడిపించే స‌న్నివేశం సంద‌ర్భంలో తొలిసారిగా త‌న భ‌విష్య‌త్ మావ‌గారిని క‌లిశారు చిరంజీవి. ఆ త‌ర్వాత త‌న మిత్రుడు ఒక‌రితో క‌లిసి రామ‌లింగ‌య్య ఇంటికి వెళ్లారు చిరంజీవి. కానీ ఆ టైమ్‌లో ఆయ‌న ఇంట్లో లేరు. ఆయ‌న భార్య బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌ల‌క‌రించి కాఫీ పంపించారు. పెళ్లైన త‌ర్వాత తెలిసింది ఆ కాఫీ పెట్టింది సురేఖ అని. "న‌న్ను చూశావా? అని సురేఖ‌ను పెళ్ల‌య్యాక అడిగాను. అయ్యో లేదండీ.. నేను లోప‌లే ఉన్నాను. బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే నాన్న‌గారు చంపేసేవారు అని చెప్పింది." అని ఆ రోజును గుర్తుచేసుకున్నారు చిరంజీవి. త‌ర్వాత కాలంలో నిర్మాత‌గా మారి ఎన్నో చ‌క్క‌ని చిత్రాలు తీసిన జ‌య‌కృష్ణ మొద‌ట్లో మేక‌ప్‌మ్యాన్‌. ఆయ‌న చిరుకు బాగా స‌న్నిహితులు, రామ‌లింగ‌య్య‌కు స్నేహితుడు. ఆయ‌నే రామ‌లింగ‌య్య ద‌గ్గ‌ర ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడ‌ట‌మే కాకుండా, ఆయ‌న‌ను ఒప్పించారు. చిరు త‌ల్లిదండ్రులూ ఆనందంగా ఒప్పుకున్నారు. మొద‌ట రామ‌లింగ‌య్య త‌న కుమార్తెకు సినిమా సంబంధం కాకుండా బ‌య‌టి సంబంధం చూడాల‌నుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణికి మాత్రం చిరంజీవిని చూడ‌గానే మంచి అభిప్రాయం క‌లిగింది. కైకాల స‌త్యనారాయ‌ణ‌తో చిరు గురించి వాక‌బు చేశారు రామ‌లింగ‌య్య‌. జ‌య‌కృష్ణ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో 1980 ఫిబ్ర‌వ‌రి 20న‌ పెళ్లి జ‌రిగింది. సురేఖ‌ను చిరంజీవి చేతుల్లో పెట్టేట‌ప్పుడు "చూడు బాబూ.. నువ్వేమో కాస్త స్పీడు. మా ఇంట్లో పిల్ల‌లంద‌రూ కాస్త గ‌ట్టివారే. అర‌వింద్‌, భార‌తి, వ‌సంత అంద‌రూ కాస్త క‌చ్చితంగా మాట్లాడ‌గ‌లిగిన‌వారే. కానీ ఇప్ప‌టిదాకా నోరుమెదిపి ఇది కావాలి అని ఏ రోజూ అడ‌గ‌ని నెమ్మ‌ద‌స్తురాలు సురేఖ‌. బాగా చూసుకోవాల‌య్యా." అని చెప్పారు రామ‌లింగ‌య్య‌. ఆయ‌న చెప్పార‌ని కాదు కానీ, ఆయ‌న ఊహించిన దానికి మించి అప్ప‌ట్నుంచీ కూడా సురేఖ‌ను త‌న కంటిరెప్ప‌లా చూసుకుంటూ వ‌స్తున్నారు చిరు.

ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే సుమ‌ల‌త అందాల పోటీల్లో గెలిచార‌ని మీకు తెలుసా?

  సుమ‌ల‌త‌ను చూడ‌గానే మ‌న ప‌క్కింటమ్మాయి అన్న‌ట్లుగా ఉంటారు. ఆమెది నాచుర‌ల్ బ్యూటీ. అందం శ‌ర‌ణం గ‌చ్ఛామి అనే పాట ఆమె కోస‌మే పుట్టింది మ‌రి. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నాయిక‌గా న‌టించిన ఘ‌న‌త ఆమె సొంతం. సుమ‌ల‌త అమ్మానాన్న‌లు ఇద్ద‌రిదీ గుంటూరు. తండ్రి చెన్నైలో ప‌నిచేస్తూ అక్క‌డ ఉన్న‌ప్పుడు సుమ‌ల‌త అక్క‌డే పుట్టారు. ఆమెకు రెండు మూడేళ్ల వ‌య‌సులో ఆయ‌న‌కు బొంబాయి ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌డంతో, అక్క‌డ కొన్నేళ్లు ఉన్నారు. హ‌ఠాత్తుగా తండ్రి మృతి చెంద‌డంతో త‌ల్లి ఆమెను గుంటూరుకు తీసుకొచ్చేశారు. అక్క‌డ‌ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చ‌దువుకున్నారు. చిన్న‌త‌నం నుంచీ ఆమె గాళ్స్ స్కూల్స్‌లోనూ చ‌దువుకుంటూ వ‌చ్చారు. టెన్త్ క్లాస్ అయ్యాక బ్యూటీ కాంటెస్ట్ జ‌రుగుతోంద‌ని, మ‌న స్కూల్ నుంచి ఈ అమ్మాయిని పంపిస్తే బాగుంటుంద‌ని కొంత‌మంది ఫ్రెండ్స్ బ‌ల‌వంత‌పెట్టి, వాళ్ల‌మ్మ‌ను క‌న్విన్స్ చేసి, ఒప్పించి, సుమ‌ల‌త‌ను ఆ పోటీల‌కు పంపించారు. నిజానికి సుమ‌ల‌త‌కు అలాంటి వాటిమీద అస‌లేమాత్ర‌మూ ఆస‌క్తి లేదు. అయిష్టంగానే ఆ పోటీలో పార్టిసిపేట్ చేశారు. అది స్టేట్ లెవల్ థ‌మ్స‌ప్ బ్యూటీ కాంటెస్ట్‌. ఆ కాంటెస్ట్ కోసం లైఫ్‌లోనే ఫ‌స్ట్ టైమ్ చీర క‌ట్టుకున్నారు సుమ‌ల‌త‌. నిజం చెప్పాలంటే ఆమె క‌ట్టుకోలేదు. వాళ్ల‌మ్మే ఆమెకు చీర క‌ట్టారు. అదివ‌ర‌కెన్న‌డూ ఆమె చీర క‌ట్టుకోలేదు. జ‌డ్జిలు స్టేజ్ మీద అటూ ఇటూ ఓసారి న‌డ‌వ‌మ‌న్నారు. స‌రేన‌ని న‌డిచారు. ఆ త‌ర్వాత త‌న ప‌నైపోయిందని, ఇక ఇంటికి వెళ్లిపోవ‌చ్చున‌ని, త‌న సిస్ట‌ర్‌తో మాట్లాడుతున్నారు సుమ‌ల‌త‌. స‌డ‌న్‌గా నిర్వాహ‌కులు ఎనౌన్స్ చేశారు.. "ది విన్న‌ర్ ఈజ్ సుమ‌ల‌త" అంటూ. స‌ర్‌ప్రైజ్ అయిపోయారామె. ఆ ఈవెంట్‌కు ప్ర‌జాన‌టిగా పేరుపొందిన జ‌మున చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. ఆమె త‌న చేతుల‌తో సుమ‌ల‌త త‌ల‌కు కిరీటం పెట్టి, ఆశీర్వ‌దించారు. ఏవ‌నో తెలుసా.. "నీకు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంది, సినిమాల్లోకి రావాలి" అని. అప్ప‌టికి సుమ‌ల‌త‌కు సినిమాల్లోకి వెళ్లాల‌నే ఆలోచ‌నే లేదు. జ‌మున ఆశీర్వాద బ‌ల‌మో, ఏమో.. అది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆమెకు సినిమా ఛాన్స్ ల‌భించింది. ఆ ఈవెంట్‌ను మేగ‌జైన్స్ క‌వ‌ర్ చేయ‌డం, కొన్ని మేగ‌జైన్స్ క‌వ‌ర్ పేజీపై ఆమె ఫొటోను వేయ‌డం, అది మూవీ మొగ‌ల్ డి. రామానాయుడు దృష్టికి వెళ్ల‌డం, ఆయ‌న సినిమా ఆఫ‌ర్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. చెన్నైకి వెళ్లి మొట్ట‌మొద‌ట డి. రామానాయుడు సినిమాకు సంత‌కం చేశారు సుమ‌ల‌త‌. అప్పుడాయ‌న‌ అడ్వాన్స్‌గా ఆమెకు వెయ్యి రూపాయ‌లిచ్చారు. అయితే ఆమెతో రెండేళ్ల త‌ర్వాత సినిమా తీశారు రామానాయుడు. ఈలోగా ఆమెకు వేరే సినిమాల అవ‌కాశాలు రావ‌డంతో అవి చేస్తూ వ‌చ్చారు. తొలిసారి ఆమె తెర‌మీద క‌నిపించిన సినిమా విజ‌య‌చంద‌ర్ 'క‌రుణామ‌యుడు'. ఆ సినిమా నుంచే ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు.

అనిల్ క‌పూర్‌, సునీత ప్ర‌గాఢ ప్రేమ‌గాథ గురించి మీకు తెలీని నిజాలు!

  ఆ ఇద్ద‌రి ల‌వ్ స్టోరీ మీడియా దృష్టిని పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌చ్చు గాక‌, కానీ సినిమా ల‌వ్ స్టోరీకి వారి క‌థ ఏ మాత్రం త‌క్కువ కాదు. ఆ ఇద్ద‌రు.. అనిల్ క‌పూర్‌, ఆయ‌న భార్య‌ సునీత‌! వాళ్ల‌ది అసాధార‌ణ ప్రేమ‌గాథ‌. ఇవాళ ఆ జంట ముగ్గురు అంద‌మైన పిల్ల‌ల‌ను (సోన‌మ్ క‌పూర్‌, రియా క‌పూర్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్‌) చూసుకొని గ‌ర్వ‌ప‌డే త‌ల్లిదండ్రులు. ఇండ‌స్ట్రీలోని తొలినాళ్ల‌లో ప‌గ‌లు ప‌నికోసం చూసేవాడు అనిల్‌. రాత్రివేళ‌ల్లో ఆయ‌నా, ఫ్రెండ్స్ క‌లిసి కూర్చొని అనిల్‌కు త‌గిన జోడీని క‌నిపెట్ట‌డం కోసం ప్లాన్లు వేసేవారు. మ‌రోవైపు సునీత స‌క్సెస్‌ఫుల్ మోడ‌ల్‌. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న‌త స్థాయి హోదాలో ప‌నిచేస్తున్నారు. ఆ ఇద్ద‌రూ తొలిసారి క‌లుసుకొన్న త‌ర్వాత‌, మ‌ళ్లీ ఆమెను కాంటాక్ట్ చేయ‌డానికి అనిల్‌కు మార్గం క‌నిపించ‌లేదు. అయితే త‌న ఫ్రెండ్ ద్వారా ఆమె ఫోన్ నంబ‌ర్ సంపాదించాడు. అలా ఆ ఇద్ద‌రూ ఫోన్‌లో మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. కొన్ని వారాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నాక‌, ఇద్ద‌రం క‌లుసుకుందామ‌ని అడిగాడు అనిల్‌. ఆమె య‌స్ చెప్పింది. 1980లో ఓ ఆహ్లాద‌క‌ర‌మైన సాయంత్రం వేళ తొలిసారి ప్రేమికులుగా క‌లిశారు. అప్ప‌ట్నుంచీ ఒక‌రిపై ఒక‌రికి అనురాగం మ‌రింత పెరుగుతూ వ‌చ్చింది. త‌ర‌చూ క‌లుసుకోసాగారు. ఇద్ద‌రూ క‌లుసుకుంటున్న తొలినాళ్ల‌లో, ఆయ‌న బ‌స్‌లో వ‌స్తే, ఆమె క్యాబ్‌లో వ‌చ్చేది. ప్ర‌తిసారీ ఆయ‌న‌కు ఆమె ఏదో ఒక‌ గిఫ్ట్ ఇచ్చేది.   అనిల్‌, సునీత సాధ్య‌మైనంత ఎక్కువ స‌మ‌యం క‌లిసి గ‌డుపుతూ వ‌చ్చారు. ఆమెకు ఫొటోషూట్‌లు ఉంటే, అక్క‌డ‌కు కూడా వెళ్లేవాడు అనిల్‌. ఆయ‌న‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఆమె తన ఫొటోషూట్ల‌ను కేన్సిల్ చేసుకున్న సంద‌ర్భాలెన్నో. స‌క్సెస్‌ఫుల్ మోడ‌ల్ అవ‌డంతో మోడ‌లింగ్ అసైన్‌మెంట్స్ కోసం ఆమె అబ్రాడ్‌కు ట్రావెల్ చేసేది. ఒక‌సారి సునీత‌ను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయ‌డానికి అనిల్‌తో పాటు ఆయ‌న జిగ‌రీ దోస్త్ గుల్ష‌న్ గ్రోవ‌ర్ కూడా వెళ్లాడు. “ఆమె 20 నుంచి 25 రోజుల పాటు ఉండేందుకు అబ్రాడ్‌కు ప్ర‌యాణం క‌ట్టింది. ఆమెను ఎంత‌గా మిస్స‌వుతున్నాడో మాట‌ల్లో చెప్ప‌డానికి బ‌దులు, ఆమె భుజంపై త‌ల‌పెట్టుకొని ప‌డుకున్నాడు” అనిల్ అని చెప్పాడు గుల్ష‌న్‌. దాన్నిబ‌ట్టి ఆయ‌న విష‌యంలో సునీత ఎంత కేరింగ్‌గా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. అనిల్‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కు సౌక‌ర్యంగా ఉంచేందుకు ఆమె ప్ర‌య‌త్నించేది. ఆయ‌న‌పై ఆమె కోపం తెచ్చుకున్న సంద‌ర్భాలు చాలా చాలా త‌క్కువ‌.   ఆమె త‌న అసైన్‌మెంట్స్ కోసం విదేశాల్లో ఉన్న‌ప్పుడు ముంబైలో సినిమా చాన్సుల కోసం ఆడిష‌న్స్‌కు హాజ‌ర‌య్యేవాడు అనిల్‌. కానీ అదృష్టం ఆయ‌న‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. అట్లా టాలీవుడ్‌లో బాపు డైరెక్ష‌న్‌లో హీరోగా ‘వంశ‌వృక్షం’ సినిమా కూడా చేశాడు అనిల్‌. బాలీవుడ్‌లో కొన్ని సైడ్ రోల్స్ చేశాక‌, ఎట్ట‌కేల‌కు ‘వో సాత్ దిన్’ (1983) మూవీ ఆయ‌న‌ను లైమ్‌లైట్‌లోకి తెచ్చింది. ఈ సినిమా రిలీజ‌య్యాక ఆయ‌న ప్ర‌తిభ‌నూ, ఆయ‌న‌లోని చార్మింగ్‌నూ పెద్ద ద‌ర్శ‌కులూ, నిర్మాత‌లూ గ్ర‌హించారు. ఆయ‌న‌కు అవ‌కాశాలు మొద‌ల‌య్యాయి. అయితే అనిల్ దృష్టి త‌న ప్రేయ‌సిని ఎప్పుడు పెళ్లాడ‌దామా అనే దానిపైనే ఉంది.   బాలీవుడ్‌లో స్ట్ర‌గుల్ పీరియ‌డ్ ముగిసిపోయింద‌ని ఆనంద‌ప‌డేంత‌లో, పెళ్లి విష‌యంలో స్ట్ర‌గుల్ ఎదురైంది అనిల్‌కు. వారి ప్రేమ వ్య‌వ‌హారం సునీత త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. వారు అభ్యంత‌ర‌పెట్టారు. వాళ్ల‌ను క‌న్విన్స్ చేయ‌డానికి అనిల్ నానా తంటాలు ప‌డ్డాడు. ఆయ‌న‌తోటే త‌న జీవితం అని త‌ల్లిదండ్రుల‌కు గ‌ట్టిగా చెప్పేసింది సునీత‌. దాంతో వాళ్లు ఒప్పుకోక‌త‌ప్ప‌లేదు. కానీ ఇండ‌స్ట్రీ వ్య‌క్తులు అప్పుడే పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని అనిల్‌ను డిస్క‌రేజ్ చేస్తూ వ‌చ్చారు. ‘మ‌షాల్’ (1984) మూవీ సూప‌ర్ హిట్ కావ‌డంతో అనిల్ సెన్సేష‌న‌ల్ హీరోగా మారాడు. అప్పుడాయ‌న అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. అలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుంటే కెరీర్ అంత‌మైపోతుంద‌ని చాలామంది ఆయ‌న‌ను హెచ్చ‌రించారు. వాళ్ల స‌ల‌హాలు పాటించి రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు అనిల్‌. ఎట్ట‌కేల‌కు ఐదేళ్ల ప్రేమ‌బంధం త‌ర్వాత అన్ని అడ్డంకుల్నీ, న‌మ్మ‌కాల్నీ అధిగ‌మించి అనిల్‌, సునీత 1984 మే 19న పెళ్లి చేసుకున్నారు. ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఓ ఆడ‌ది ఉంటుంద‌నే నానుడి వారి విష‌యంలో ముమ్మాటికీ నిజం. అనిల్ కోసం సునీత త‌న కెరీర్‌ను శాక్రిఫైజ్ చేసింది. అయితే ఆయ‌న‌తో క‌లిసి ఓ అంద‌మైన జీవితాన్ని ఆమె నిర్మించింది. సినిమాల ఎంపిక విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆమె సాయప‌డేది. చ‌క్క‌గా ఎలా డ్ర‌స్ చేసుకోవాలో ఆయ‌న‌కు నేర్పించింది. ఆయ‌న కాస్ట్యూమ్స్‌ను ఆమె డిజైన్ చేసేది. ఔట్‌డోర్ షూటింగ్‌ల‌ను ఆయ‌న‌తో పాటు వెళ్లేది. ఆమె త‌న ద‌గ్గ‌ర ఉండ‌టాన్ని ఆయ‌న బాగా ఇష్ట‌ప‌డేవాడు. బ‌హుశా అందువ‌ల్ల‌నేమో, పెళ్లి త‌ర్వాత ఓ స్టార్‌గా మ‌రింత స‌క్సెస్ అయ్యాడు అనిల్‌. తెర‌పై మాధురీ దీక్షిత్‌తో అనిల్ కెమిస్ట్రీ సూప‌ర్‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం, వారిది హిట్ పెయిర్ కావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం న‌డిచింది. ఆ త‌ర్వాత శిల్పా శిరోద్క‌ర్‌తో లింక్ పెట్టారు. కానీ అవి రూమ‌ర్స్‌గానే మిగిలాయి. అనిల్‌, సునీత మ‌ధ్య బంధం చెక్కుచెద‌ర‌లేదు. ఆ ఇద్ద‌రి ప‌ర‌స్ప‌ర అనురాగం చూసి బాలీవుడ్ మొత్తం వారిని ప్ర‌శంసిస్తుంటుంది. ద‌టీజ్ ట్రూ ల‌వ్ ఆఫ్ అనిల్ అండ్ సునీతా క‌పూర్‌!

మూడు ద‌శాబ్దాల క్రిత‌మే కార్టూన్ క్యారెక్ట‌ర్స్‌తో ర‌జ‌నీ ఆటా పాటా!

  ఇప్పుడంటే యానిమేష‌న్ మూవీస్ స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో యానిమేష‌న్ విభాగం ఒక ప్ర‌ముఖ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే మూడు ద‌శాబ్దాల క్రితం ద‌క్షిణాది వెండితెర‌పై లైవ్ క్యారెక్ట‌ర్స్‌తో కార్టూన్ క్యారెక్ట‌ర్స్ క‌నిపించ‌డం అనేది ఒక అద్భుతం! అందుకే ర‌జ‌నీకాంత్ హీరోగా ఎస్‌.పి. ముత్తురామ‌న్ డైరెక్ట్ చేసిన 'రాజా చిన్నరోజా' (1989) విడుద‌లైన‌ప్పుడు ఆడియెన్స్ ఆశ్చ‌ర్యంగా చూశారు. ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ సినిమాలో ఓ పాట‌లో ర‌జనీకాంత్‌, హీరోయిన్ గౌత‌మితో కొన్ని కార్టూన్ క్యారెక్ట‌ర్స్ ఆడిపాడ‌తాయి. ఆ సీన్ల‌ను ఎలా చిత్రీక‌రించార‌ని చాలామంది బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. ఆ రోజుల్లో అదొక వినూత్న ప్ర‌యోగం. ఎస్‌.పి. ముత్తురామ‌న్ తెలుగులో 'సంసారం ఒక చ‌ద‌రంగం', 'గురుశిష్యులు' లాంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పిల్ల‌ల‌కు వినోదాన్ని క‌లిగించే ప్ర‌ధాన ఉద్దేశంతో 'రాజా చిన్న‌రోజా' మూవీని తీశారు. ఆ సినిమా నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్న‌ప్పుడు ముత్తురామ‌న్‌తో నిర్మాత శ‌ర‌వ‌ణ‌న్‌ పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్ చేసే కార్టూన్ బొమ్మ‌లు, హీరో హీరోయిన్ల‌తో పాల్గొన్న‌ట్లుగా ఓ పాట తీస్తే ఎలా ఉంటుందో చూడ‌మ‌న్నారు. బొంబాయిలో కార్టూన్ క్యారెక్ట‌ర్ల‌ రూప‌క‌ల్ప‌న‌లో మంచి పేరున్న రామ్మోహ‌న్‌ను సంప్ర‌దించారు ముత్తురామ‌న్‌. ఆయ‌న ఇచ్చిన స‌ల‌హామేర‌కు మొద‌ట‌, హీరో హీరోయిన్లు, కార్టూన్ బొమ్మ‌లు క‌లుసుకునేలా సీన్లు ప్లాన్ చేసి, పాట రికార్డ్ చేయ‌మ‌న్నారు. అంటే ఫ‌లానా చోట రాబిట్ బొమ్మ వ‌స్తుంద‌నీ, మ‌రోచోట ఎలిఫెంట్ కార్టూన్ వ‌స్తుంద‌నీ.. అప్పుడు ఎలాంటి మ్యూజిక్ రావాలో అనుకొని, దానికి అనుగుణంగా పాట రూపొందించాలి.  సంగీత ద‌ర్శ‌కుడు చంద్ర‌బోస్ (మ‌న గేయ‌ర‌చ‌యిత చంద్ర‌బోస్ కాదు, త‌మిళ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌), కొరియోగ్రాఫ‌ర్ పులియార్ స‌రోజ‌ను పిలిపించి ఎలాంటి సంగీతం ఎక్క‌డ రావాలో, ఎప్పుడెప్పుడు హీరో హీరోయిన్లు డాన్స్ చేయాలో, ఆ మూవ్‌మెంట్స్ అన్నీ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత పాట‌ను రికార్డ్ చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు పాట‌లో ఒక‌చోట ర‌జనీకాంత్‌కు కుందేలు ఓ పుష్ప‌గుచ్ఛాన్ని స్తే, అది గౌత‌మి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి అక‌స్మాత్తుగా ఒక ప‌క్షిలా మారిపోయి, ఎగిరిపోతుంది. మ‌న‌కు సినిమాలో అలా క‌నిపిస్తుంది. కానీ చిత్రీక‌ర‌ణ విష‌యానికి వ‌చ్చేస‌రికి, ఒక న‌ల్ల‌ని దారానికి వేలాడుతున్న పుష్ప‌గుచ్ఛాన్ని ర‌జ‌నీకాంత్ అందుకొని, దాన్ని గౌత‌మికి ఇచ్చేలా తీశారు. అప్పుడు కుందేలు లేదు, ప‌క్షీ లేదు! ఇలా లేనిదాన్ని ఉన్న‌ట్లు చూప‌డం చాలా శ్ర‌మ‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. దాన్ని యానిమేట‌ర్ రామ్మోహ‌న్ సుసాధ్యం చేశారు. ఓ రాబిట్ కార్టూన్ న‌డుస్తున్న‌ట్లు తీయ‌డానికి 500 బొమ్మ‌లు వేశారు. ఆ విధంగా ఈ పాట‌లో వివిధ జంతువుల కార్టూన్ల చిత్రీక‌ర‌ణ‌కు 31,000 బొమ్మ‌లు వేసి, వాటిని ఒక్కొక్క‌టే ఎక్స్‌పోజ్ చేశారు. అంటే మొత్తం 31 వేల ఎక్స్‌పోజ‌ర్స్ అన్న‌మాట‌! ర‌జ‌నీకాంత్‌, గౌత‌మి, బాల‌తార‌ల‌తో పాట‌ను చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు ఏయే ఘ‌ట్టాల్లో కార్టూన్ బొమ్మ‌లు వ‌స్తాయో చెప్పి, అప్పుడు ఎలాంటి రియాక్ష‌న్స్ ఇస్తే బావుంటుందో వివ‌రించారు. అంటే బొమ్మ‌ల‌ను ఊహించుకుంటూ, యాక్ట‌ర్లు రియాక్ష‌న్ ఇవ్వాలి. ఈ ప్ర‌యోగం యాక్ట‌ర్ల‌కు థ్రిల్లింగ్‌గా తోచింది. అంద‌రూ ఎంతో ఉత్సాహంగా ఆ పాట చిత్రీక‌ర‌ణ‌లో స‌హ‌క‌రించారు. ఈ పాట తీయ‌డానికి వారం రోజుల టైమ్ ప‌డితే, విడిగా తీసిన కార్టూన్ బొమ్మ‌ల‌ను పాత్ర‌ధారుల‌తో క‌లిపే వ్య‌వ‌హారానికి 3 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది! ద‌క్షిణాది వెండితెర‌పై స‌రికొత్త ప్ర‌యోగంగా పేరు తెచ్చుకున్న ఆ పాట‌ను చూడ్డానికి జ‌నం మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చారు!

'శంక‌రాభ‌ర‌ణం'కు పాడ‌టం త‌న‌వ‌ల్ల కాదంటూ బాలు వెళ్లిపోయార‌ని మీకు తెలుసా?

  'శంక‌రాభ‌ర‌ణం'.. తెలుగు సినిమానీ, తెలుగు సినిమా సంగీతాన్నీ దేశ‌వ్యాప్తం.. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచ‌వ్యాప్తం చేసిన చిత్ర‌రాజం. ఏమాత్రం ప‌రిచ‌యం లేని జె.వి. సోమ‌యాజులు అనే న‌టుడ్ని రాత్రికి రాత్రే గొప్ప‌న‌టుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిని చేసిన గొప్ప క‌ళాఖండం. ద‌ర్శ‌కుడిగా కె. విశ్వ‌నాథ్‌నూ, సంగీత ద‌ర్శ‌కుడిగా కె.వి. మ‌హ‌దేవ‌న్‌నూ శిఖ‌రాగ్ర‌స్థాయికి చేర్చిన 'శంక‌రాభ‌ర‌ణం'లో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాడిన ప్ర‌తి గీతం స‌మ్మోహ‌న‌కరం. అయితే మొద‌ట ఆ పాట‌ల‌ను తాను పాడ‌న‌నీ, మ‌రో గాయ‌కుడ్ని చూసుకొమ్మ‌న‌మ‌నీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్‌కు బాలు చెప్పార‌నే విష‌యం మ‌న‌లో ఎంత‌మందికి తెలుసు?  జూన్ 4 బాలు 75వ జ‌యంతి సంద‌ర్భంగా ఆ విష‌యాల‌ను ఓసారి చెప్పుకుందాం... శాస్త్రీయ సంగీతం నేర్చుకోక‌పోయినా మ‌హ‌దేవ‌న్‌, పుగ‌ళేంది లాంటి విద్వ‌త్ సంప‌న్నుల ద‌గ్గ‌ర దానిని సాధించి, పాడి మెప్పించిన సాధ‌కుడు బాలు. 'శంక‌రాభ‌ర‌ణం'తో ఆయ‌న చేత ఆ సాధ‌నను వారు చేయించి వుండ‌క‌పోతే బాలు మ‌హోన్న‌త స్థాయికి ఎదిగి వుండేవారు కాదేమో! 'శంక‌రాభ‌ర‌ణం'కు మ‌హ‌దేవ‌న్‌-పుగ‌ళేంది బాణీలు క‌ట్ట‌డం పూర్త‌యింది. భ‌ద్రాచ‌ల రామ‌దాసు, త్యాగ‌రాజు, మ‌హాక‌వి కాళిదాసు, మైసూర్ వాసుదేవాచార్యులు, స‌దాశివ‌బ్ర‌హ్మం కీర్త‌న‌లు, ప‌ద్యాలు మిన‌హా చిత్రంలోని నాలుగు పాట‌ల‌ను వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి రాయ‌డ‌మూ పూర్త‌యింది. వాటిని పాడేందుకు బాలుకు క‌బురుపెట్టారు విశ్వ‌నాథ్‌. ఆ కీర్త‌న‌లు, పాట‌ల ట్యూన్లు విని, "నావ‌ల్ల కాదు అన్న‌య్యా.. ఎవ‌రైనా మంచి గాయ‌కుడ్ని చూసుకోండి." అని విశ్వ‌నాథ్‌కు చెప్పారు బాలు. విశ్వ‌నాథ్‌, మ‌హ‌దేవ‌న్ ఒక‌రి ముఖం మ‌రొక‌రు చూసుకున్నారు. విశ్వ‌నాథ్ "నువ్వు పాడ‌గ‌ల‌వురా" అని భ‌రోసా ఇవ్వాల‌ని చూశారు. అయినా బాలులో సంకోచం. అవి గొప్ప పాట‌లుగా చ‌రిత్ర‌లో నిల‌బ‌డే పాట‌ల‌ని ఆయ‌న‌కు తెలుసు. కానీ వాటికి తాను న్యాయం చేయ‌గ‌ల‌నా.. అనే సందేహం. అందుకే పాడ‌లేన‌ని వెళ్లిపోయారు. అప్పుడు పుగ‌ళేంది, "వాడు హ‌నుమంతుని లాంటివాడు. వాడి ప్ర‌తిభ వాడికి తెలీదు. ఈ పాట‌లు వాడు పాడ‌తాడు. నేను పాడిస్తాను." అని విశ్వ‌నాథ్‌, మ‌హ‌దేవ‌న్‌ల‌కు హామీ ఇచ్చారు. వెంట‌నే బాలును క‌లిశారు. ఆయ‌న‌లో ఆత్మ‌స్థైర్యం నింపారు. చ‌రిత్ర‌లో నిలిచిపోతావ‌ని చెప్పారు. అంత‌కుముందు "ఆరేసుకోబోయి పారేసుకున్నాను", "ఆకుచాటు పిందె త‌డిసె" త‌ర‌హా పాట‌లు పాడివ‌చ్చిన బాలు నోరు పుక్కిళించుకున్నారు. తుల‌సి ఆకులు న‌మిలారు. వేటూరి రాసిన గీతం "దొర‌కునా ఇటువంటి సేవ‌"ను పాడ‌టం మొద‌లుపెట్టారు. అంతే.. ఒక్క వాణీ జ‌య‌రామ్ సోలో సాంగ్ మిన‌హా మిగ‌తా అన్ని పాట‌లూ, కీర్త‌న‌ల‌ను బాలు పాడేశారు. సినిమా విడుద‌లైంది. ఆ పాట‌లు విని ముందుగా ఎవ‌రూ "ఓహో.." అన‌లేదు. కానీ ఇంటికి వెళ్తూ "శంక‌రా నాద శ‌రీరాప‌రా.." అంటూ పాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ పాట ఆయ‌న‌కు ఆ ఏడాది ఉత్త‌మ గాయ‌కుడిగా జాతీయ అవార్డును అందించింది. 'శంక‌రాభ‌ర‌ణం' పాట‌లు చ‌రిత్ర సృష్టించాయి, చ‌రిత్ర‌లో నిలిచాయి.

ఆ పాట రికార్డింగ్ టైమ్‌లో బాలు వ‌ల్ల జాన‌కి ప్రాణం పోయినంత ప‌నైంది!

  క్లాసిక‌ల్ అయినా, మాస్ అయినా, ఏడుపుగొట్ట‌యినా, హుషారైనా.. అది ఏ త‌ర‌హా పాటైనా స‌రే య‌స్‌. జాన‌కి కంఠం ముందు దాసోహం అనాల్సిందే. ఐదున్న‌ర‌ ద‌శాబ్దాల కెరీర్‌లో 17 భాష‌ల్లో వేలాది సినిమా పాట‌లు పాడి కోట్లాదిమంది సంగీత ప్రియుల‌ను త‌న గానామృతంలో ఓల‌లాడించారు జాన‌కి. అయితే బ్రీతింగ్ ప్రాబ్ల‌మ్‌తోటే ఆమె నాలుగున్న‌ర‌ ద‌శాబ్దాల కాలం పాట‌లు పాడారంటే న‌మ్మాల‌నిపించ‌దు కానీ, అది నిజం. 1962లో ఆమె శ్వాస స‌మ‌స్య మొద‌లైంది. ఆయాసం కామ‌న్‌గా వ‌చ్చేస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోయినంత ప‌న‌వుతుంది కూడా. పాట పాడే స‌మ‌యాల్లోనూ ఆమె ఆ త‌ర‌హా స‌మ‌స్య ఎదుర్కొన్నారు. "అలాంట‌ప్పుడు నాకు న‌రాల్లోకి డెకాడ్ర‌న్ ఇంజ‌క్ష‌న్ వేసేవారు. ఆ కాలంలోనే.. 'పూజాఫ‌లం'లో "శివ‌దీక్షా ప‌రురాల‌నురా" అనే పాటుంది. ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి డాన్స్ చేస్తుంది. ఈ పాట పాడేప్పుడు నాకు ఆయాసం. మీరు న‌మ్మ‌రు.. గుండె బిగిసిపోయిన‌ట్ల‌యింది. బ‌య‌ట‌కు ఎవ‌రికీ తెలీదు. ఎంత బిగించుకొని పాడానో ఆ పాట‌ను. కానీ ఆ పాట వింటే నాకు ఆయాసం ఉంద‌ని మీర‌నుకోరు." అని ఆమె చెప్పారు. ఇక 'శంక‌రాభ‌ర‌ణం'లో "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న" పాట పాడేప్పుడు మ‌రింత బాధ‌ప‌డ్డారు జాన‌కి. "ఆ పాట రికార్డింగ్ రోజు నాకు కొంచెం క‌డుపునొప్పిగా ఉండింది. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఏం చేశాడూ.. బెరాల్గ‌న్ టాబ్లెట్‌ ఇచ్చాడు. 'ఇది వేసుకోండి, క‌డుపునొప్పి పోతుంది' అన్నాడు. అంత‌కుముందే మా ఆయ‌న ఇప్పుడే వ‌స్తాన‌ని బ‌య‌ట‌కు వెళ్లాడు. నాకు కొన్ని మందులు ఎల‌ర్జీ. ప‌డ‌వు. ఆ విష‌యం అంటే, 'ఎల‌ర్జీ లేదు, ఏం లేదు, వేసుకోండి' అని ఒక‌టే గొడ‌వ చేశాడు. స‌రే చూద్దామ‌ని ఆ మాత్ర మింగేశా. అంతే! ఐదు నిమిషాల్లో గుండె అణిచేసిన‌ట్ల‌యింది. ఊపిరాడ‌లేదు. క‌ళ్లు ఇంత లావున‌ ఉబ్బిపోయాయ్‌. అట్లాగే బిగించుకొని పాడాను. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం భ‌య‌ప‌డిపోయాడు. ఇంజ‌క్ష‌న్ వేస్తే.. ఓ ప‌దిహేను, ఇర‌వై నిమిషాల్లో ఊపిరొస్తుంది. కానీ క‌ళ్ల ఉబ్బులు మాత్రం నాలుగైదు రోజులు అట్లాగే ఉంటాయ్‌. అట్లా ఎన్ని పాట‌లు పాడానో." అని చెప్పుకొచ్చారు జాన‌కి. 1957లో 'విధియిన్ విలయాట్టు' అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఆ మ‌హాగాయ‌ని 2016 సెప్టెంబ‌ర్‌లో తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దానికంటే ముందు దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో సరియైన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడం ఆమెకే చెల్లింది.