బ్ర‌హ్మానందం ఆ షో చెయ్య‌క‌పోతే జంధ్యాల కంట్లో ప‌డివుండేవారు కాదు!

  ఒక ప‌నిపై 1984 ప్రాంతంలో హైద‌రాబాద్ వ‌చ్చారు బ్ర‌హ్మానందం. అప్పుడాయ‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అత్తిలిలోని కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా చేస్తున్నారు. వీలు కుదిరిన‌ప్పుడల్లా నాట‌కాలు ఆడుతున్నారు. మిమిక్రీలు కూడా చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న‌కు ప్ర‌ముఖ ర‌చ‌యిత ఆదివిష్ణు ప‌రిచ‌య‌మ‌య్యారు. బ్ర‌హ్మానందంలోని హాస్య‌ప్రియ‌త్వాన్ని ఆయ‌న గ‌మ‌నించి దూర‌ద‌ర్శ‌న్‌లో 'ప‌క‌ప‌క‌లు' అనే కార్య‌క్ర‌మంలో చెయ్య‌మ‌న్నారు. బ్ర‌హ్మానందం చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి మంచి పేరు వ‌చ్చింది. ఇదే ప్రోగ్రామ్‌ను జంధ్యాల చూశారు. ఆయ‌న‌కు బ్ర‌హ్మానందం కామెడీ బాగా న‌చ్చింది. క‌బురు పంపారు. వెళ్లి కలిశారు బ్ర‌హ్మానందం. 'స‌త్యాగ్ర‌హం' అనే చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చారు జంధ్యాల‌. నేనేంటీ, సినిమాల్లో న‌టించ‌డ‌మేంట‌ని కాస్త భ‌య‌ప‌డ్డారు బ్ర‌హ్మానందం. "మ‌రేం ఫ‌ర్వాలేదు, నేనెలా చెబితే అలా చెయ్యి" అని జంధ్యాల భ‌రోసా ఇచ్చారు. అంత‌కుముందు డ్రామాలు, మిమిక్రీలూ చేసిన అనుభ‌వం ఉండ‌టం వ‌ల్ల కెమెరా ముందు న‌ట‌న అంటే ఆయ‌న‌కు భ‌యం వెయ్య‌లేదు. 'స‌త్యాగ్ర‌హం' సినిమా మొద‌లు కాక‌ముందే 'శ్రీ తాతావ‌తారం' అనే మ‌రో మూవీలో ఛాన్స్ వ‌చ్చింది. అప్ప‌టికి ఇంకా అత్తిలి కాలేజీలో ప‌నిచేస్తూనే ఉన్నారు. న‌టుడిగా తెర‌ప‌రిచ‌య‌మైన మూడో సంవ‌త్స‌రం జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో 'అహ నా పెళ్లంట' సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అందులో చేసిన 'అర‌గుండు' పాత్ర ఆయ‌న జీవితాన్నే మార్చేసింది. దాంతో బ్ర‌హ్మానందం పేరు మారుమోగిపోయింది. ఆ సినిమా చూడ్డానికి విజ‌య‌వాడ‌లోని ఓ థియేట‌ర్‌కు వెళ్లారాయ‌న‌. ఆ రోజుల్లో త‌న‌ను తాను తెర‌మీద చూసుకోవ‌డ‌మే ఆయ‌న‌కు ఓ అద్భుతం. అలాంటిది త‌న‌ను చూసి ప్రేక్ష‌కులు విర‌గ‌బ‌డి న‌వ్వుతుండ‌టం ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. అక్క‌డ్నుంచి ఆయ‌న‌ను ఎంతోమంది పెద్ద పెద్ద ద‌ర్శ‌కులూ, నిర్మాత‌లూ, న‌టులూ ఆయ‌న‌ను ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. అలా లెజెండ‌రీ క‌మెడియ‌న్ స్థాయికి ఎదిగారు.

మ‌ణిర‌త్నం 'అంజ‌లి' మూవీలో స‌సేమిరా న‌టించ‌న‌ని మొండికేసిన త‌రుణ్‌!

  'భ‌క్త ప్ర‌హ్లాద' చిత్రంలో టైటిల్ రోల్ పోషించ‌డం ద్వారా బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మైన రోజార‌మ‌ణి, తొలి చిత్రంతోటే త‌న ముద్ర‌ను వేశారు. బాల‌న‌టిగా అనేక సినిమాలు చేసి, యుక్త‌వ‌య‌సు వ‌చ్చాక హీరోయిన్‌గా మారారామె. స‌హ‌న‌టుడు చ‌క్ర‌పాణితో వివాహం త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్తిచెప్పిన రోజార‌మ‌ణి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా అనేక‌మంది హీరోయిన్ల‌కు గాత్ర‌ధార‌ణ చేశారు. ఆమె కుమారుడు త‌రుణ్ కూడా త‌ల్లిబాట‌లోనే బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చి, టీనేజ్‌లో 'నువ్వే కావాలి' సినిమాతో హీరో అయ్యాడు. అత‌ను బాలన‌టుడిగా న‌టించ‌గా పేరు తెచ్చిన సినిమాలో మ‌ణిర‌త్నం 'అంజ‌లి' ఒక‌టి. ఆ మూవీలో రేవతి, ర‌ఘువ‌ర‌న్ దంప‌తుల కొడుకు అర్జున్ క్యారెక్ట‌ర్‌లో సూప‌ర్బ్‌గా యాక్ట్ చేశాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. అయితే మొద‌ట ఆ సినిమాలో న‌టించ‌నంటే న‌టించ‌న‌ని త‌రుణ్ తెగ గొడ‌వ పెట్టాడంట‌. ఒక ఇంట‌ర్వ్యూలో రోజార‌మ‌ణి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చిన్న‌ప్పుడే న‌టిగా మార‌డం వ‌ల్ల పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం, స్కూలుకు వెళ్లి చ‌దువుకోవ‌డం లాంటి ఆనందాల‌ను.. వెర‌సి బాల్యాన్ని కోల్పోయారు రోజార‌మ‌ణి. అందుకే త‌రుణ్‌కు ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌ని రోజార‌మ‌ణి దంప‌తులు భావించారు. త‌రుణ్‌ను చూసి సినిమాల్లో చేర్పించ‌మ‌ని చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు. నేను, మావారు చ‌క్ర‌పాణి కూడా అంగీక‌రించ‌లేదు. చివ‌ర‌కు ఒత్తిళ్ల‌కు లొగిపోయి 'ముద్దుబిడ్డ' చిత్రానికి అంగీక‌రించాం. త‌రుణ్‌కు కూడా న‌టించ‌డం ఇష్టం లేనందున షూటింగ్‌కు వెళ్లాక నేను చేయ‌నంటే చేయ‌న‌ని మొండికేశాడు. షూటింగ్ లొకేష‌న్ నుంచి తిరిగి వ‌చ్చేశాడు." అని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత త‌రుణ్ న‌టించ‌డం గురించి ఆలోచించ‌డం మానేశారు. "ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నంగారు తీయ‌బోయే 'అంజ‌లి' సినిమా కోసం మ‌మ్మ‌ల్ని ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అడిగారు. వాడికి న‌టించే ఉద్దేశం లేద‌ని చెప్పాం. ఆయ‌న ప‌ట్టుప‌ట్టి, మీరు ఓకే అంటే త‌రుణ్‌ను నేను ఒప్పిస్తాన‌న్నారు. విష‌యం విన్న త‌రుణ్ స‌సేమిరా చేయ‌న‌ని అన్నాడు. అతి బ‌ల‌వంతం మీద మ‌ణిర‌త్నంగారి ద‌గ్గ‌ర‌కు త‌రుణ్‌ను ఆ స‌హాయ ద‌ర్శ‌కుడు తీసుకెళ్ల‌డం, అక్క‌డ త‌రుణ్ ఓకే అన‌డం జ‌రిగింది. 'అంజ‌లి' చిత్రంలో న‌టించాక త‌రుణ్‌కు న‌ట‌న మీద ఆస‌క్తి పెరిగింది." అని వెల్ల‌డించారు రోజార‌మ‌ణి.

సావిత్రి కాకుండా ఇతర తార‌ల‌ గురించి ఎందుకు గొప్పగా మాట్లాడ‌రు?

  ఒక టైమ్‌లో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి తెలుగు చిత్ర‌సీమ‌కు ఏలారు. గ్లామ‌ర్ విష‌యంలో శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద ముందు జ‌య‌సుధ ఆగ‌రు. జ‌య‌ప్ర‌ద‌ను అయితే స‌త్య‌జిత్ రే లాంటి లెజండ‌రీ డైరెక్ట‌ర్ 'ఇవాళ దేశం మొత్త‌మ్మీద జ‌య‌ప్ర‌ద లాంటి అంద‌మైన తార ఇంకొక‌రు లేరు' అనేశారు. ఆయ‌న అభిప్రాయం ఎలా ఉన్నా శ్రీ‌దేవి కోట్లాదిమంది క‌ల‌ల‌రాణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి సౌంద‌ర్య‌రాశుల‌తో పోలిస్తే జ‌య‌సుధ అంద‌గ‌త్తె కాదు. అయినా టాప్ యాక్ట్రెస్‌గా వాళ్ల‌తో పాటు ఆమె రాణించారు. స‌హ‌జ‌న‌టి అని అంద‌రిచేతా ప్ర‌శంస‌లు పొందారు. కాగా, తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌హాన‌టి అనే గొప్ప‌మాట‌ను సావిత్రికి మాత్ర‌మే ఆపాదిస్తూ అంద‌రూ మాట్లాడుతుంటారు. సావిత్రి త‌ర్వాత ఎంతోమంది న‌టీమ‌ణులు గొప్ప గొప్ప సినిమాలు, పాత్ర‌లు చేశార‌నీ, కానీ వారికి సావిత్రి లాంటి గుర్తింపు రాలేద‌నీ జ‌య‌సుధ బాధ‌ప‌డ‌తారు. ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "సావిత్రి గారి తర్వాత అంత గొప్పసినిమాలు వాణిశ్రీ చేశారు. కానీ ఎంతమంది వాణిశ్రీ గురించి చెబుతారు! శారదగారు సెకండ్ ఇన్నింగ్స్ అంటే హీరోయిన్ గా కాకుండా మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి చాలా పవర్ పుల్ పాత్రలు చేశారు. పరుచూరి బ్రదర్స్ ఆమెకు అలాంటి పాత్రలను సృష్టించారు. విమన్ ఇన్ తెలుగు సినిమా అని తీసుకుంటే సావిత్రి తర్వాత ఇంకెవరి గురించీ గొప్పగా మాట్లాడటం లేదు. ఆమె తర్వాత కూడా చాలా మంది చేశారు కదా.. వాళ్లకీ గౌరవం దక్కాలి కదా. వాణిశ్రీ, శారదల తర్వాత సీరియస్ రోల్స్ చేయడానికి నేను వచ్చాను. పెద్ద హీరోయిలతో చేస్తూ చిన్న హీరోలతో చేస్తావెందుకు అని నన్ను అన్నవారు కూడా ఉన్నారు. కేవలం పాత్రలు నచ్చే నేనవి చేశాను." అని ఆమె చెప్పారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి సినిమా రంగంలో ఉన్నా హీరోయిన్ గా జ‌య‌సుధ‌ తర్వాతే వచ్చింది. "నేనొచ్చిన ఏడాది తర్వాత అనుకుంటాను, జయప్రద వచ్చింది. అంత అందమైన శ్రీదేవి, జయప్రద లాంటి వారు ఉన్నపుడు జయసుధ అనే వ్యక్తి ఎలా మనగలుగుతుంది? అందుకే మంచి పాత్రలను ఎంచుకుని చేసేదాన్ని. అలాంటి పాత్రలు చేయబట్టే ఇన్నేళ్లు ఉండగలిగాను. మదర్ పాత్రలు చేసేటప్పుడు కూడా పర్‌ఫార్మెన్స్ కు అవకాశమున్నవాటినే ఎంచుకున్నాను. 'గోవిందుడు అందరివాడేలే', 'అమ్మా నాన్న తమిళ అమ్మాయి', 'ఎవడు'... ఇలా ఏ సినిమా  చేసినా నాకు పేరు తెచ్చే పాత్రే అయింది. ఆ పాత్రలు ఎవరైనా చేయవచ్చు... కానీ ఈమె చేస్తేనే ఈ పాత్ర పండుతుంది అనే భావనలో డైరెక్టర్లు కూడా ఉండేవారు." అని చెప్పుకొచ్చారు జ‌య‌సుధ‌.  

న‌గ్మా ఒక‌ప్పుడు పెళ్ల‌యిన‌ సౌర‌వ్ గంగూలీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని తెలుసా?

  ఒక‌ప్పుడు యాక్ట్రెస్‌గా పాపుల‌ర్ అయ్యి, ఇప్పుడు పొలిటీషియ‌న్‌గానూ రాణిస్తోంది న‌గ్మా. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న 'బాఘీ' మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన న‌గ్మా.. ఆ వెంట‌నే 'పెద్దింట‌ల్లుడు' సినిమాలో సుమ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కిల్ల‌ర్‌, ఘ‌రానా మొగుడు, మేజ‌ర్ చంద్ర‌కాత్‌, వార‌సుడు, అల్ల‌రి అల్లుడు లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. త‌మిళంలోనూ ఆమె అదే స్థాయిని ఎంజాయ్ చేసింది.  ఆ త‌ర్వాత సౌత్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డం, క్రేజ్ త‌గ్గ‌డంతో తిరిగి ముంబైకి వెళ్లి భోజ్‌పురి సినిమాల‌తో అక్క‌డ కూడా నంబ‌ర్ 1 హీరోయిన్ అనిపించుకుంది. ఆమె ఆ రేంజ్‌కు ఎద‌గడంలో గ్లామ‌ర్.. ముఖ్యంగా ఆమె క‌ళ్లు ఎస్సెట్‌గా నిలిచాయి. 46 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టికీ సింగిల్‌గానే ఉంటోన్న న‌గ్మా.. ఒక‌ప్పుడు మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయింద‌ని ఇప్ప‌టి యూత్‌లో చాలా మందికి తెలీదు. 2001లో గంగూలీతో ఆమె సీరియ‌స్ రిలేష‌న్‌షిప్‌లో ఉంది. అప్పుడు గంగూలీ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతే కాదు అత‌డికి పెళ్ల‌యింది కూడా. అయితే త‌మ మ‌ధ్య బంధాన్ని ఆ ఇద్ద‌రూ సీక్రెట్‌గానే ఉంచారు. ఒకానొక సంద‌ర్భంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఒక గుడిలో ఆ ఇద్ద‌రూ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది కూడా. దీన్ని వారు ఖండించారు. కొంత‌కాలం గాఢ ప్రేమ‌లో ఉన్న ఆ ఇద్ద‌రూ అనూహ్య‌మైన కార‌ణంగా విడిపోయారు. ఇండియా ఏ మ్యాచ్‌లో ఓడిపోయినా, దానికి న‌గ్మాయే కార‌ణ‌మంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సౌర‌వ్ లైఫ్‌ను ఆమె నాశ‌నం చేస్తోందంటూ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చేవి. భార‌త క్రికెట్ జ‌ట్టు చెత్త ఆట‌ను ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడ‌ల్లా న‌గ్మాతో సౌర‌వ్ బంధం వ‌ల్లే అలా జ‌రుగుతోందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో.. ఆ ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. సౌర‌వ్‌తో బంధానికి స్వ‌స్తి చెప్పిన న‌గ్మా త‌న కెరీర్‌పై దృష్టి పెట్టింది.

ద‌ర్శ‌కేంద్రుని త‌న‌యుడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

  ప్రకాశ్ కోవెలమూడి.. దిగ్దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు. మొద‌ట న‌టుడిగా ప‌రిచ‌య‌మై, లాభం లేద‌నుకొని డైరెక్ట‌ర్‌గా మారి 2004లోనే ‘బొమ్మలాట’ అనే బాలల చిత్రం రూపొందించాడు. దానికి 2005 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు వచ్చింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన మాస్టర్ సాయికుమార్ ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి పురస్కారం పొందాడు. అయితే ఆ సినిమాని అతి తక్కువమందే చూశారు. కమర్షియల్‌గా అది విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేయడానికి ఏడేళ్ల కాలం తీసుకున్నాడు ప్రకాశ్. ఈసారి భారీ బడ్జెట్ అవసరమయ్యే జానపద కథాంశాన్ని తీసుకొని శ్రుతి హాసన్‌ను తెలుగు ప్రేక్షకులకు నాయికగా, మంచు లక్ష్మీప్రసన్నను విలన్‌గా పరిచయం చేస్తూ, సిద్ధార్థ్ టైటిల్ రోల్‌లో ‘అనగనగా ఓ ధీరుడు’ తీశాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బోల్తా కొట్టింది. లక్ష్మీప్రసన్నకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు మాత్రం దక్కింది. ఆ సినిమా తర్వాత ప్రకాశ్ మళ్లా కొన్నాళ్లు మౌనం పాటించాడు. 2017లో ‘సైజ్ జీరో’ రూపొందించాడు. ఆ సినిమా కోసం అందాల తార అనుష్కను స్థూలకాయురాలిగా మార్చేశాడు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా తీరా విడుదల తర్వాత బాగా నిరాశపర్చింది. వాళ్లు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సాక్షాత్తూ కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొందించాడు. రాజ్‌కుమార్ రావ్ హీరోగా న‌టించిన ఆ మూవీ.. 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా'. 2019 జూలైలో వ‌చ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఆడింది. ఈ సినిమాకు ప్ర‌కాశ్ మాజీ భార్య క‌నికా థిల్లాన్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చింది. 2014లో పెళ్లాడిన ప్ర‌కాశ్‌, కనిక మూడేళ్ల త‌ర్వాత విడిపోయారు. ఆ త‌ర్వాతే 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా' వ‌చ్చింది. క‌నిక ఈ ఏడాదే రైట‌ర్‌ హిమాంశు శ‌ర్మను రెండో వివాహం చేసుకుంది. ప్ర‌కాశ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నాడు. 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా' మూవీ త‌ర్వాత అత‌ను ఏం చేస్తున్నాడనే విష‌యం ఇంత‌దాకా బ‌య‌ట‌కు రాలేదు. క‌నిక‌తో విడిపోయాక అనుష్కను అత‌ను పెళ్లాడ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని అనుష్క ఖండించింది.

ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌!

  మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు స‌ర‌స‌న రాధ నాయిక‌గా న‌టించిన సినిమా ఒకే ఒక్క‌టి. అదీ.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన చిత్రం, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన చిత్రం - 'చండ‌శాస‌నుడు'. ఆ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాక, షూటింగ్‌కు మూడు నెల‌ల ముందుగానే రాధ‌కు సంబంధించిన డైలాగ్స్ ఆమెకు ఇచ్చి ప్రాక్టీస్ చెయ్య‌మ‌న్నారు. ఆ తెలుగు డైలాగ్స్‌ను ఆమె మ‌ల‌యాళంలో రాసుకొని ప్రాక్టీస్ చేశారు. అంత‌కుముందు ఆమెకు ఎన్టీఆర్‌తో ప‌రిచ‌యం లేదు. ఎన్న‌డూ నేరుగా ఆయ‌న‌ను చూసే అవ‌కాశం కూడా ఆమెకు రాలేదు. అయితే ఆయ‌న పౌరాణిక చిత్రాలు చాలావాటిని ఆమె అప్ప‌టికే చూశారు. ఆయ‌నంటే రాధ‌కు ఒక‌విధ‌మైన భ‌క్తిభావం ఉండేది. 'చండ‌శాస‌నుడు' షూటింగ్‌కు వెళ్లే ముందే ఆమె 'బొబ్బిలిపులి' మూవీ చూశారు. 'చండ‌శాస‌నుడు' సినిమా షూటింగ్ ఎన్టీఆర్ సొంత స్టూడియో అయిన రామ‌కృష్ణ హార్టిక‌ల్చ‌ర‌ల్ స్టూడియోస్‌లో జ‌రిగింది. షూటింగ్ మొద‌టి రోజున ఎన్టీఆర్ మేక‌ప్ రూమ్‌కు వ‌చ్చి, రాధ‌కు మేక‌ప్ ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా ఉండాలి?.. లాంటి విష‌యాలు చెప్పి వెళ్లారు. ఆయ‌నంటే ఆమెకు భ‌యం భ‌యంగా ఉండేది. ప‌క్క‌న సీనియ‌ర్ న‌టి శార‌ద ఉండి ఆమెకు ధైర్యం చెప్పేవారు. డైలాగ్స్ విష‌యంలోనూ, ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలోనూ స‌ల‌హాలు ఇస్తూ రాధ‌కు స‌హాయం చేశారు శార‌ద‌. ఆ మూవీలో "ఏమీ.. ఏమేమీ.." అంటూ పౌరాణిక బాణీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ త‌న‌దైన బాణీలో డైలాగ్స్ చెబుతూ వుంటే, అవే డైలాగ్స్ రాధ రిపీట్ చేసి, ఆయ‌నను వెక్కిరిస్తూ చెప్పే స‌న్నివేశం ఉంది. ఆమెకు నోరు తిరిగేది కాదు. ఎన్టీఆర్ ఓపిగ్గా "ఏం ఫ‌ర్వాలేదు.. నిదానంగా చెప్పు" అంటూ ధైర్యం చెప్పి, ప్రోత్స‌హించేవారు. అలా ఆమెలో భ‌యంపోయి, స‌ర‌దాగా షూటింగ్ చేసేశారు.

పెళ్లి తర్వాత ఊపందుకున్న కెరీర్‌.. ఇక‌ముందూ అభిమానిస్తారా ఆడియెన్స్‌?

  నాగ‌చైత‌న్య‌తో పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకోవ‌డం మ‌నం చూశాం. మొదట రాంచరణ్‌తో నటించిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. రామలక్ష్మి పాత్రలో సమంత నటన అందర్నీ ఆకట్టుకుంది. ‘మహానటి’లో సావిత్రి కథను చెప్పే జర్నలిస్టు మధురవాణిగా ఆకట్టుకుంది. ‘యు టర్న్’లో రచన కేరెక్టర్‌ను చాలా బాగా చేసిందనే పేరు తెచ్చుకుంది.   ఇక నాగచైతన్యకు మూడు ఫ్లాపుల తర్వాత దక్కిన విజయం ‘మజిలీ’లో సమంత పాత్ర ప్రాధ్యాన్యం ఏమిటో తెలిసిందే. ఆమె చేసిన మధ్యతరగతి గృహిణి శ్రావణి పాత్రలో స్త్రీ ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు. ఆ సినిమాకు ఘన విజయం సాధించి పెట్టారు. ఆ సినిమా సమయంలోనే తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలో సమంత నటనకు విమర్శకులు మూకుమ్మడిగా బ్రహ్మరథం పట్టారు. నందినీరెడ్డి డైరెక్ష‌న్‌లో చేసిన 'ఓ బేబీ' మూవీ న‌టిగా స‌మంత‌ను మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లింది. కొరియ‌న్ మూవీ 'మిస్ గ్రానీ'కి అఫిషియ‌ల్ రీమేక్ అయిన 'ఓ బేబీ'లో స‌మంత ప‌ర్ఫార్మెన్స్‌కు దాసోహం కాని వాళ్లు లేరు. త‌మిళ ఫిల్మ్ '96' రీమేక్ 'జాను' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, టైటిల్ రోల్‌లో స‌మంత న‌ట‌న విమ‌ర్శ‌కుల్ని బాగా మెప్పించింది. తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై హోస్ట్‌గా 'సామ్ జామ్' అనే టాక్ షోతో అల‌రించింది స‌మంత‌. అలాగే రాజ్ అండ్ డీకే రూపొందించిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో త‌మిళ్ ఈల‌మ్‌కు చెందిన టెర్ర‌రిస్ట్ రాజీగా గొప్ప‌గా రాణించింది. టాలీవుడ్‌లో ఒక నటి పెళ్లికి ముందు ఎంత డిమాండ్ కలిగి ఉందో, పెళ్లి తర్వాతా అంతే డిమాండ్ పొందడం మొదటిసారి చూశాం. క‌రెక్టుగా చెప్పాలంటే, పెళ్లికి ముందటి కంటే పెళ్లి త‌ర్వాతే నటిగా ఆమె కీర్తి మరింత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోయింది. అక్టోబ‌ర్ 2న తాము భార్యాభ‌ర్త‌లుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో స‌మంత కెరీర్ ఎలా ఉండ‌బోతోంద‌నే క్యూరియాసిటీ ఆమె అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆమె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంత‌లం' పూర్తిచేసింది. త‌మిళంలో విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో 'కాదు వాకుల రెండు కాద‌ల్' మూవీని చేస్తోంది. కాగా చైతూతో విడిపోయాక ఆమె రెండు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌ను అంగీరించింది. రెండూ తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రాలే. అయితే వైవాహిక బంధం విచ్ఛిన్న‌మ‌య్యాక స‌మంత‌ను ఆడియెన్స్ ఇదివ‌ర‌క‌టిలా ఆద‌రిస్తారా? ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ప‌ట్టించుకోకుండా, యాక్ట‌ర్‌గా ఆమెను ఇదివ‌ర‌క‌టిలా అభిమానిస్తారా? అనేవి ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ప్ర‌శ్న‌లు. కాల‌మే వీటికి జ‌వాబిస్తుంది.

సినిమాలో కొడుక్కి కొరివి పెట్టడాన్ని త‌ప్పించుకున్నారు కానీ..!

  విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు 2010లో ఫాదర్స్‌డే తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరు కొడుకులు ఫాదర్స్‌డే జరుపుకుంటుంటే కోట మాత్రం పుట్టెడు పుత్రశోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు కోట‌ ప్రసాద్ జూన్ 20 (ఫాద‌ర్స్ డే) హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యాపిల్లల్ని కారులో రమ్మని చెప్పి అంత‌కు కొద్ది రోజుల క్రిత‌మే కొనుగోలు చేసిన కొత్త స్పోర్ట్స్ బైక్‌పై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్‌కు లంచ్ చేసే నిమిత్తం వెళ్తున్న ఆయనను లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కోటకు ప్రసాద్ ఒక్కరే కొడుకు కాగా ఇద్దరు కుమార్తెలున్నారు.  అదివ‌ర‌కు రెండు సినిమాల్లో న‌టించిన ప్రసాద్, ఆ టైమ్‌లోమూడో మూవీ 'గాయం-2'లో నటిస్తున్నారు. జగపతిబాబు హీరోగా జె.డి. చక్రవర్తి డైరెక్ట్ చేసిన 'సిద్ధం' సినిమాలో సలీం అనే నెగటివ్ పాత్రతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రసాద్‌. ఆ పాత్ర పోషణతో ఆయన ప్రేక్షకుల అభినందనలే కాక విమర్శకుల ప్రశంసలూ చూరగొన్నారు. నిజానికి ఆయన మొదట ముఖానికి రంగేసుకున్నది 'వీడు వాడు ఇంకొకడు' అనే సినిమాకి. సీనియర్ రచయిత దివాకర్‌బాబు కుమారుడు శ్రీకర్‌బాబు నటించి, రూపొందించిన సినిమా అది.  'గాయం-2'లో నిజ జీవిత పాత్రల్నే కోట శ్రీనివసరావు, ప్రసాద్ పోషించ‌డం గమనార్హం. ఇందులోనూ హీరో జగపతిబాబే. ఆ సినిమాలో ప్ర‌సాద్‌ పాత్ర చనిపోతుంది. ఆ సందర్భంగా వచ్చే కొడుకు భౌతికకాయానికి తలకొరివి పెట్టే సన్నివేశాన్ని చేయడానికి కోట నిరాకరించారు. దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని తీశారు. అయితే సినిమాలో ఆ సన్నివేశాన్ని అభినయించడాన్ని తప్పించుకున్న కోట నిజ జీవితంలో మాత్రం ఆ సన్నివేశ‌ నుంచి తప్పించుకోలేకపోవడం విషాదంలో విషాదం.  దుర్ఘటన జరిగినప్పుడు కోట శ్రీ‌నివాస‌రావు బెంగళూరులో ఉన్నారు. వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన ఆస్పత్రిలో కుమారుడి పార్థివ శరీరాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక ఫిలింనగర్‌లోని ఆయన ఇల్లయితే శోకసంద్రంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమతో కోటకు ఉన్న అనుబంధం వల్ల ఆయనకు హితులు, స్నేహితులు, సన్నిహితులు లెక్కకు మించి ఉన్నారు. వారంతా కోట కుమారుడి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక సినిమాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబూమోహన్ సాయంత్రం నుంచి రాత్రివరకు కోటని ఓదారుస్తూ ఆయనని అంటిపెట్టుకునే ఉన్నారు. 

పూర్ణ హీరోయిన్‌గా ర‌విబాబు వ‌రుస‌గా మూడు సినిమాలు ఎందుకు చేశాడు?

  న‌టుడు ర‌విబాబు 'అల్ల‌రి'తో డైరెక్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న కొన్ని కామెడీ సినిమాలు, కొన్ని థ్రిల్ల‌ర్స్ డైరెక్ట్ చేశారు. పూర్ణ హీరోయిన్‌గా ఆయ‌న వ‌రుస‌గా మూడు సినిమాలు.. 'అవును', 'ల‌డ్డుబాబు', 'అవును 2' డైరెక్ట్ చేశారు. దీంతో ర‌విబాబు, పూర్ణ మ‌ధ్య ఏదో న‌డుస్తుందంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే తాను ప‌నిచేసిన ఏ న‌టితోనూ ఏ ఒక్క‌రోజు కూడా షూటింగ్ ప్యాక‌ప్ చెప్పాక కాల్ చేసి మాట్లాడ్డం అనేది జ‌ర‌గ‌లేద‌ని ఒక‌సారి ర‌విబాబు తేల్చి చెప్పారు. పూర్ణ‌తోటే కాదు, భూమిక‌తోనూ ఆయ‌న మూడు సినిమాలు.. 'అన‌సూయ‌', 'అమ‌రావ‌తి', 'ల‌డ్డుబాబు'.. తీశారు. ఆ విష‌య‌మే ప్ర‌స్తావిస్తూ, "నేను భూమిక‌తో మూడు సినిమాలు చేశాను. త‌ర్వాత పూర్ణ‌తో మూడు సినిమాలు చేశాను. నేనో రూల్ పెట్టుకున్నా. షూటింగ్‌కు పేక‌ప్ చెప్పాక ఏ రోజూ నేను నా సినిమాలో చేసిన ఏ హీరోయిన్‌కూ కాల్ చెయ్య‌లేదు. అంతే కాదు, ఆ టైమ్‌లో హీరో హీరోయిన్ల నుంచి కానీ, నా అసిస్టెంట్ ద‌గ్గ‌ర నుంచి కానీ ఫోన్లు వ‌స్తే రిసీవ్ చేసుకోను. ఈ రూల్‌ను నేను మొద‌ట్నుంచీ పాటిస్తూ వ‌స్తున్నా. నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. నేన‌లాంటి వాడ్న‌యితే, ఆ హీరోయిన్లు నాతో రెండో సినిమా చెయ్య‌రు క‌దా" అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు ర‌విబాబు. త‌ను ప్రొఫెష‌న‌ల్ ఎథిక్స్‌, రిలేష‌న్స్ పాటిస్తూ వ‌స్తున్న‌వాడ్ని కాబ‌ట్టి హీరోయిన్లు త‌న‌పై ఆస‌క్తి చూప‌ర‌ని ఆయ‌న అన్నారు. "నేను టాలెంట్‌ను చూస్తానే కానీ, గ్లామ‌ర్‌ను చూడ‌ను. పూర్ణ‌తో నేను మూడు సినిమాలు చేశానంటే, కేవ‌లం ఆమె అభిన‌యాన్ని దృష్టిలో పెట్టుకొనే" అని స్ప‌ష్టం చేశారు ర‌విబాబు. ఒక‌వైపు సినిమాల్లో న‌టిస్తూనే డాన్స్ షో ఢీకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ, ఆడియెన్స్‌ను అల‌రిస్తూ వ‌స్తున్నారు పూర్ణ‌.

11 సినిమాల‌కే టాలీవుడ్ టాప్ 2 డైరెక్ట‌ర్ కావ‌డ‌మంటే మాట‌లా.. త్రివిక్ర‌మ్‌!

  ఆయన డైరెక్ట్ చేసింది 11 సినిమాలు. వాటిలో మెగా కాంపౌండ్ హీరోలతో చేసినవే 6. రానున్న రెండు మూడేళ్లలో ఆయన ఆ హీరోలతో చేయబోతున్న సినిమాలు 3. దీన్నిబట్టే 'మెగా' హీరోలతో ఆయన 'ఎఫైర్' ఎలా నడుస్తూ ఉందో ఊహించుకోవచ్చు. ఆ డైరెక్టర్.. నన్ అదర్ ద్యాన్.. త్రివిక్రమ్. 1999లో కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన 'స్వయంవరం' మూవీతో డైలాగ్ రైటర్‌గా పరిచయమై, తొలి సినిమాతోనే.. 'ఎవరీ రైటర్? డైలాగ్స్ భలే రాశాడు' అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ తన గురించి మాట్లాడుకొనేలా చేసిన ఘనుడు త్రివిక్రమ్. ఆ తర్వాత మూడేళ్లకే.. అంటే 2002లోనే డైరెక్టర్‌గా మారి తరుణ్, శ్రియ జంటగా 'నువ్వే నువ్వే' అనే మూవీ తీసి విజయం సాధించాడు. అదివరకు రైటర్‌గా ఆరు సినిమాలకు డైలాగ్స్ రాసినా, వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్', 'నువ్వే కావాలి' లాంటి బ్లాక్‌బస్టర్ డైలాగ్ రైటింగ్ సినిమాలున్నా బెస్ట్ రైటర్‌గా నంది అవార్డు పొందలేకపోయిన త్రివిక్రమ్, తన తొలి డైరెక్టోరియల్ ఫిల్మ్ 'నువ్వే నువ్వే'తో బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నంది అవార్డ్ అందుకోవడం విశేషం. 'నువ్వే నువ్వే'తో మొదలుకొని ఇప్పటి 'అల.. వైకుంఠపురములో' వరకు త్రివిక్రమ్ క్రియేటివ్ మైండ్‌లోంచి 11 సినిమాలు పుట్టాయి. 'నువ్వే నువ్వే' మూవీని అతడు తీసిన విధానం చూసి, ముచ్చటపడిన మహేశ్.. వెంటనే తనను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా తన సెకండ్ సినిమానే మహేశ్‌తో తీశాడు త్రివిక్రమ్. అది 'అతడు' మూవీ. నందకిశోర్ అలియాస్ పార్థు క్యారెక్టర్‌లో మహేశ్‌ను త్రివిక్రమ్ చూపించిన విధానం, మహేశ్ నుంచి అతను రాబట్టిన అభినయం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అందుకే థియేటర్ల కంటే కూడా టీవీలో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ సినిమా విడుదలై 14 ఏళ్లు దాటగా, ఇప్పటికి ఎన్నిసార్లు ఆ సినిమా టెలికాస్ట్ అయ్యిందో లెక్కలేదు. అయినా విసుగులేకుండా ఆ మూవీని జనం చూస్తూనే ఉన్నారు. అదే మహేశ్‌తో మరోసారి జట్టుకట్టి 'ఖలేజా' తీశాడు త్రివిక్రమ్. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బిలో యావరేజ్‌గా నిలిచినా, ఆ సినిమాని చాలా స్టైలిష్‌గా తీశాడనీ, నటుడిగా మహేశ్‌లోని కామిక్ యాంగిల్‌ను బాగా ఎలివేట్ చేశాడనీ త్రివిక్రమ్ పేరు తెచ్చుకున్నాడు. యద్దనపూడి సులోచనారాణి నవల 'మీనా' ఆధారంగా అతను రూపొందించిన 'అ ఆ' సినిమా నితిన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టయిన ఆ సినిమా యుఎస్‌ టాప్ టాలీవుడ్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. అనసూయ అనే పాత్రలో సమంతను అతను చూపించిన విధానం, ఆనంద్ విహారిగా నితిన్‌తో ఆమె కెమిస్ట్రీని పండించిన విధానం ఆడియెన్స్‌ను బాగా అలరించింది. ఇదే నవల ఆధారంగా గతంలో కృష్ణతో విజయనిర్మల రూపొందించిన 'మీనా' సినిమాని మించి 'అ ఆ' ఘనవిజయం సాధించింది. 2018లో జూనియర్ ఎన్టీఆర్‌తో తొలిసారి జట్టుకట్టిన త్రివిక్రమ్, 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాని రూపొందించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో జగపతిబాబును అత్యంత కిరాతకుడైన ఫ్యాక్షనిస్టుగా చూపిస్తూ తీసిన ఈ మూవీ తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. పూజా హెగ్డేను అరవిందగా చూపిస్తూ, సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చెయ్యడానికి వీరరాఘవ పాత్రలో తారక్ ఏం చేశాడో తనదైన శైలిలో చూపించాడు త్రివిక్రమ్. ఇందులో అతను రాసిన డైలాగ్స్ కానీ, తారక్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం కానీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడిక మెగా హీరోలతో త్రివిక్రమ్ సాగిస్తూ వస్తున్న జర్నీ విషయానికి వద్దాం. మెగా హీరోల్లో అతను తొలిసారి డైరెక్ట్ చేసింది.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో. ఆ సినిమా 2008లో వచ్చిన 'జల్సా'. యాక్షన్ కామెడీ మూవీగా త్రివిక్రమ్ రూపొందించిన ఈ మూవీలో సంజయ్ సాహు క్యారెక్టరులో పవన్‌ను చూపించిన విధానం, ఆ పాత్రను పవన్ చేసిన తీరు, ఆయన చేత త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. అంతేనా.. పవన్, ఇలియానా మధ్య అతను తీసిన సన్నివేశాలు ఆహ్లాదాన్ని పంచాయి. అలా 'జల్సా' నుంచి మెగా హీరోలతో త్రివిక్రమ్ ఎఫైర్ మొదలైంది. ఆ తర్వాత పవన్‌తో అతను తీసిన 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్టవడం మనం చూశాం. గౌతం నందాగా పవన్, అతని మేనత్త సునందగా నదియా పాత్రల్ని అతను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్సులో వాళ్ల మధ్య తీసిన సీన్ ప్రేక్షకుల్ని అమితంగా అలరించి ఆ స్థాయి విజయాన్ని అందించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు అల్లు అర్జున్‌తో 'జులాయి' తీశాడు త్రివిక్రమ్. అది అప్పటికి బన్నీ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రవీంద్ర నారాయణ అలియాస్ రవి పాత్రలో బన్నీ, బిట్టు పాత్రలో సోను సూద్, మధు క్యారెక్టరులో ఇలియానా, ఏసీపీ సీతారం పాత్రలో రాజేంద్రప్రసాద్‌ను అతను చూపించిన తీరు, ఆ పాత్రల మధ్య సన్నివేశాలు ఆడియెన్సును అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బన్నీతో చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' భారీ విజయం సాధించకపోయినా అందులో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 2020 జ‌న‌వ‌రిలో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఏ రేంజి బ్లాక్‌బస్టర్ అయ్యిందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బన్నీ చేసిన బంటూ క్యారెక్టర్ ఆడియెన్సును అయస్కాంతంలాగా లాగేసింది. డైలాగ్స్ విపరీతంగా అలరించాయి. అతి త్వ‌ర‌లోనే అత‌ను మ‌హేశ్‌తో ముచ్చ‌ట‌గా మూడో సినిమాని రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా 'ఖ‌లేజా' మూవీ అసంతృప్తికి గురిచేయ‌డంతో దాన్ని మ‌ర్చిపోయేలా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నాడు. ఇప్ప‌టికే ఆ మూవీలో నాయిక‌గా పూజా హెగ్డేను తీసేసుకున్నాడు. పూజ‌తో త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా చేస్తున్న మూడో సినిమా ఇది. కేవ‌లం 11 సినిమాల‌కే టాలీవుడ్‌లో టాప్ 2 డైరెక్ట‌ర్‌గా నీరాజ‌నాలు అందుకోవ‌డం త్రివిక్ర‌మ్‌కే చెల్లింది.

లిప్‌స్టిక్‌తో ర‌జ‌నీ ముఖంపై పెయింటింగ్ వేసిన ల‌త‌!

  ర‌జ‌నీకాంత్‌, ల‌త ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు కుమార్తెలు.. ఐశ్వ‌ర్య‌, సౌంద‌ర్య‌. ర‌జ‌నీ ఎక్క‌డ‌కు వెళ్లినా వెంట భార్య కానీ కుమార్తెలు కానీ త‌ప్ప‌కుండా ఉంటారు. 1980లో ఒక సినిమా షూటింగ్ సెట్స్‌పై ర‌జ‌నీ ఉన్న‌ప్పుడు త‌న కాలేజీ మ్యాగ‌జైన్ కోసం ఇంట‌ర్వ్యూ నిమిత్తం ఆయ‌న‌ను తొలిసారి క‌లిశారు ల‌త‌. ఆ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌మ అభిరుచులు దాదాపు ఒక‌టే అని వారు గ్ర‌హించారు. ఇంట‌ర్వ్యూ అయ్యాక పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశారు ర‌జ‌నీ. ఊహించ‌ని ఆ ప్ర‌పోజ‌ల్‌కు మొద‌ట షాకై, ఆ త‌ర్వాత ఆనంద‌ప‌డి, త‌న పేరెంట్స్‌తో మాట్లాడాల‌ని చెప్పారు ల‌త‌. ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖుల చేత ల‌త త‌ల్లితండ్రుల‌తో మాట్లాడించారు ర‌జ‌నీ. చివ‌ర‌కు వారు అంగీక‌రించ‌డంతో 1981 ఫిబ్ర‌వ‌రి 26న తిరుప‌తిలో ల‌త మెడ‌లో మూడు ముళ్లు వేసి, త‌న‌దాన్నిగా చేసుకున్నారు. అంటే వారి పెళ్ల‌యి నాలుగు ద‌శాబ్దాలు దాటాయ‌న్న మాట‌. వారి పెళ్లిరోజు సంద‌ర్భంగా ఒక‌సారి పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య‌, త‌న త‌ల్లితండ్రుల‌కు సంబంధించిన ఒక మెమ‌ర‌బుల్ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫొటోలో ర‌జ‌నీ ముఖంపై త‌న రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌తో ల‌త పెయింటింగ్ వేస్తున్నారు. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ ఫొటో చూస్తే చాలు.. ర‌జ‌నీ, ల‌త ఎంత స‌ర‌దాగా, ఎంత అన్యోన్యంగా దాంప‌త్య జీవితాన్ని గ‌డుపుతున్నారో అర్థ‌మైపోతుంది.

చిరంజీవి మ‌రీ బిగ్ స్టార్ అవ‌డం వ‌ల్లే 'అంద‌రివాడు' క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్ప‌లేక‌పోయా!

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన 'అంద‌రివాడు' (2005) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన రీతిలో విజ‌యం సాధించ‌లేక కొంద‌రివాడు అనిపించుకుంది. ఆ మూవీలో తండ్రీ కొడుకులుగా చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ చేశారు. ఆ క‌థ న‌చ్చి శ్రీ‌ను వైట్ల‌కు డైరెక్ష‌న్ చాన్స్ ఇచ్చారాయ‌న‌. కానీ శ్రీ‌నుకు మాత్రం ఆ క‌థ న‌చ్చ‌లేదు. చిరంజీవిని డైరెక్ట్ చేసే చాన్స్ వ‌స్తే, త‌న‌కు న‌చ్చిన క‌థ‌తో సినిమా తియ్యాల‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. క‌థ న‌చ్చ‌కుండానే 'అంద‌రివాడు' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆయ‌న చాలా బిగ్ స్టార్ కావ‌డం వ‌ల్లే ఆ క‌థ బాగాలేద‌ని చెప్ప‌లేక‌పోయాడు. ఈ విష‌యాన్ని 'ఆలీతో స‌ర‌దాగా' షోలో బ‌య‌ట‌పెట్టాడు శ్రీ‌ను వైట్ల‌. "అంద‌రివాడు అంత స‌క్సెస్ కాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి?" అని అలీ ప్ర‌శించారు. "క‌థ రెడీగా ఉంది, డైరెక్ట్ చెయ్య‌మ‌ని అంటే నేను సూట్‌కాను. ఆ క‌థ నాది కాదు." అని చెప్పాడు శ్రీ‌ను. "సార్‌.. నేను మీ కోసం ఒక క‌థ త‌యారుచేసుకున్నాను, ఇది ప‌క్క‌న‌పెట్టి, నా క‌థ ఒక‌సారి వినండి అని చెప్పే సంద‌ర్భం రాలేదా?" అని అడిగారు అలీ. "అదెలా చెప్పాలంటే.. ఆయ‌న టూ బిగ్ అవ‌డ‌మే ప్రాబ్లెమ్" అని తేల్చి చెప్పాడు శ్రీ‌ను. దాన్ని బ‌ట్టి అంద‌రివాడు క‌థ న‌చ్చ‌కుండానే ఆ మూవీని శ్రీ‌ను డైరెక్ట్ చెయ్యాల్సివ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది. చిరంజీవికి న‌చ్చిన క‌థ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పే గ‌ట్స్ అప్పుడు శ్రీ‌నుకు లేవ‌ని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి శ్రీ‌ను వైట్ల ఇంకేమైనా విష‌యాలు చెప్పాడేమో చూడాలి. ఈ ఆలీతో స‌ర‌దాగా ఎపిసోడ్ న‌వంబ‌ర్ 8న ఈటీవీలో ప్ర‌సారం కానున్న‌ది.

ఒక జ‌ర్న‌లిస్టును క‌త్తితో బెదిరించి షారుక్ ఖాన్ జైలుకు వెళ్లాడని తెలుసా?

  షారుక్ ఖాన్ పెద్ద‌కొడుకు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్ కేసులో అరెస్ట‌యి, జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో భాగంగా మూడు వారాల పాటు ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో గ‌డిపి, బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. గ‌తంలో ఒక‌సారి షారుక్ ఖాన్ సైతం జైలులో ఊచ‌లు లెక్క‌పెట్టాడ‌ని మీకు తెలుసా? అవును. ఈ విష‌యాన్ని ఒక సంద‌ర్భంలో షారుక్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. తెహ‌ల్కా డాట్ కామ్ ఆర్గ‌నైజ్ చేసిన 'థింక్ 2012' ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న షారుక్, ఒక జ‌ర్న‌లిస్టును తాను క‌త్తితో చంపుతాన‌ని బెదిరించిన‌ట్లు చెప్పాడు. ఒక హీరోయిన్‌తో త‌న‌కు ఎఫైర్ ఉంద‌ని ఆ జ‌ర్న‌లిస్టు రాశాడ‌నీ, అప్పుడు గౌరీ ఖాన్‌ను పెళ్లి చేసుకొని రెండేళ్లే అయ్యింద‌నీ తెలిపాడు.  "నేన‌ప్పుడు చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశాను. జైలుకు వెళ్లాను. మా మామ‌య్య పంజాబీ. గౌరీతో పెళ్లి టైమ్‌లో ఆయ‌న నాకు ఓ ఖ‌డ్గం ఇచ్చారు. ఆయ‌న ఆర్మీ ఆఫీస‌ర్‌. 'బాబూ, నువ్వు నా కూతుర్ని కాపాడుతుండాలి' అని చెప్పారు. ఆ క‌త్తి తీసుకొని నా గురించి చెడుగా రాసిన ఆ జ‌ర్న‌లిస్ట్ ఇంటికి వెళ్లాను. గౌరీని ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ ఆ క‌త్తి నాకు ఇండియ‌న్ ఆర్మీ ఇచ్చిన ఆయుధంగా నేను భావించాను" అని ఆరోజు త‌న స్పీచ్‌లో చెప్పాడు షారుక్‌. జైలుకు వెళ్లినా ఆ జ‌ర్న‌లిస్టుపై షారుక్ ఆవేశం త‌గ్గ‌లేదు. జైలు నుంచి ఎవ‌రికైనా ఒక ఫోన్ చేసుకొనే అవ‌కాశం ల‌భించిన‌ప్పుడు ఆయ‌న ఆ జ‌ర్న‌లిస్టుకే ఫోన్ చేశాడు. "జైలు నుంచి వ‌చ్చాక నీ సంగ‌తి చూస్తా, నిన్ను న‌రుకుతా" అని అని బెదిరించాన‌ని షారుక్ వెల్ల‌డించాడు.

రీల్ స్టార్ టు రియ‌ల్ స్టార్‌.. పునీత్‌ రాజ్‌కుమార్ లైఫ్ స్టోరీ!

  ప‌వ‌ర్‌స్టార్‌గా క‌న్న‌డిగుల గుండెల్లో స్థానం పొందిన పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 46 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కేవ‌లం క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాకుండా, మొత్తం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ షాక్‌కు గురైన సంద‌ర్భం అది. ఆ వార్త బ‌య‌ట‌కు పొక్కిన మ‌రుక్ష‌ణ‌మే, ఆ హాస్పిట‌ల్ ఉన్న ప్ర‌దేశం జ‌న‌స‌ముద్రాన్ని త‌ల‌పించింది. ఆయ‌న అంత్య‌క్రియ‌లు అక్టోబ‌ర్ 31న బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టేడియంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిగాయి. ఒక్కసారి ఆయ‌న క‌థ‌లోకి వెళ్తే... లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌న్న‌డ కంఠీర‌వ డాక్ట‌ర్ రాజ్‌కుమార్‌, పార్వ‌త‌మ్మ దంప‌తుల‌కు క‌డ‌ప‌టి సంతానంగా చెన్నైలో పునీత్ జ‌న్మించారు. పునీత్‌కు ఆరేళ్లు నిండాక‌, ఆయ‌న కుటుంబం చెన్నై నుంచి మైసూరుకు త‌ర‌లి వెళ్లింది. పునీత్‌కు ఇద్ద‌రు అన్న‌లు.. శివ రాజ్‌కుమార్‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, ఇద్ద‌రు అక్క‌లు.. ల‌క్ష్మి, పూర్ణిమ‌. పునీత్‌కు సినిమా వ‌ర‌ల్డ్ కొత్త‌కాదు. ప‌సివాడుగా ఉన్న‌ప్పుడు తండ్రి రాజ్‌కుమార్‌, అన్న‌య్య‌ల‌తో క‌లిసి సినిమా సెట్స్‌కు వెళ్లేవారు. చిన్న‌ప్పుడే తండ్రి సినిమాలోనే ఆయ‌న‌తో క‌లిసి తొలిసారిగా న‌టించారు. బాల‌న‌టుడిగానే నేష‌న‌ల్ అవార్డ్ సాధించారు. ఆ త‌ర్వాత క‌ర్నాట‌క స్టేట్ అవార్డ్స్‌ను అందుకున్నారు పునీత్‌. ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సు నాటికి బాల‌న‌టుడిగా 14 సినిమాలు చేశారు. 2002లో 'అప్పు' మూవీతో హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయ్యారు పునీత్‌. ఆ మూవీని డైరెక్ట్ చేసింది.. మ‌రెవ‌రో కాదు, ఇవాళ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యి, అప్ప‌ట్నుంచే ఆయ‌న‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఫ్యాన్స్ ఆయ‌న‌ను 'అప్పు' అని పిల‌వ‌డం ప్రారంభించారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్‌తో కాల‌క్ర‌మంలో మాస్‌లో మ‌రింత క్రేజ్‌, ఇమేజ్ సంపాదించుకున్న పునీత్‌కు ఫ్యాన్స్ 'ప‌వ‌ర్‌స్టార్' అనే బిరుదు ఇచ్చేశారు. నిజానికి పాపులారిటీలో అన్న‌య్య‌లు శివ రాజ్‌కుమార్‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌ల‌ను దాటేశారు పునీత్‌. ఆయ‌న‌కు సంబంధించి న‌ట‌న అనేది క్యారెక్ట‌ర్‌ను అర్థం చేసుకొని, అందులోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డ‌మే. ఆయ‌న మంచి న‌టుడు మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని డాన్సర్ కూడా. బాక్సాఫీసును దృష్టిలో పెట్టుకొంటే ఆయ‌న ప‌లు రికార్డుల‌ను సృష్టించారు. ఆయ‌న 49 సినిమాల్లో న‌టిస్తే, వాటిలో 40 సినిమాలు వంద రోజులు ఆడాయంటే.. యాక్ట‌ర్‌గా ఆయ‌న స‌క్సెస్ రేట్ ఎలాంటిదో ఊహించుకోవాల్సిందే. 90 శాతం స‌క్సెస్ రేట్‌తో 'ప‌వ‌ర్‌స్టార్' అనే మాట‌కు అస‌లైన అర్థంగా నిలిచారు పునీత్‌. హీరోగా ఆయ‌న న‌టించిన‌వి 29 సినిమాలు. వాటిలో 23 సినిమాలు థియేట‌ర్ల‌లో శ‌త దినోత్స‌వం జ‌రుపుకున్నాయి. ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో అప్పు, అభి, వీర క‌న్న‌డిగ‌, మౌర్య‌, ఆకాశ్‌, మిలాన.. లాంటివి ఉన్నాయి. 'బెట్టాడ హూవు' సినిమాలో చేసిన రాము పాత్ర‌తో ఉత్త‌మ బాల‌న‌టునిగా నేష‌న‌ల్ అవార్డ్ పొందిన పునీత్‌, 'చ‌లిసువ మొడ‌గ‌ళు', 'యేరాడు న‌క్ష‌త్ర‌గ‌ళు' సినిమాల‌తో బెస్ట్ చెల్డ్ ఆర్టిస్టుగా క‌ర్నాట‌క స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. విశేష‌మేమంటే పునీత్ ప్లేబ్యాక్ సింగ‌ర్ కూడా. త‌ను న‌టించిన కొన్ని సినిమాల్లో ఆయ‌న స్వ‌యంగా పాట‌లు పాడారు. రెండు సార్లు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌కు నామినేష‌న్ పొందారు. హీరోగా న‌టించిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'అప్పు'లోనే పాడిన ఆయ‌న ఆ త‌ర్వాత‌, 'వంశీ', 'జాకీ' సినిమాల్లోనూ, త‌న అన్న శివ రాజ్‌కుమార్ సినిమాలు 'ల‌వ కుశ‌', 'మైల‌రి'ల‌లోనూ ఆయ‌న పాట‌లు పాడారు. వెండితెర‌పైనే కాకుండా టీవీతెర‌పై కూడా త‌నదైన ముద్ర వేశారు పునీత్‌. 2017లో 'క‌న్న‌డాడ కోట్యాధిప‌తి' సీజ‌న్ 1 హోస్ట్‌గా ఆయ‌న బుల్లితెర‌పై అడుగుపెట్టారు. అది అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి' షో ఆధారంగా రూపొందించిన షో. ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌, నాలుగో సీజ‌న్‌కు కూడా ఆయ‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. అలాగే క‌ల‌ర్స్ క‌న్న‌డ చాన‌ల్‌లో ప్ర‌సార‌మైన‌ 'ఫ్యామిలీ ప‌వ‌ర్‌', ఉద‌య టీవీలో ప్ర‌సార‌మైన 'నేత్రావ‌తి' షోల‌కు ఆయ‌న హోస్ట్‌గా ఉన్నారు. న‌టుడు, నిర్మాత కాకుండా పునీత్ గొప్ప మాన‌వ‌తావాదిగా పేరు పొందారు. త‌న తండ్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ త‌ర‌హాలోనే అభిమానుల‌ను క‌లుసుకొని, వారితో గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డేవారు. ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న బ‌ర్త్‌డే అయిన మార్చి 17న ఫ్యాన్స్‌ను క‌లుసుకొని, వారితో గంట‌ల‌కొద్దీ గ‌డిపేవారు. అనేక సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న నిర్వ‌హించేవారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. క‌ర్నాట‌క సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 ల‌క్ష‌లు డొనేట్ చేసిన ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన ప‌లువురు ఆర్టిస్టుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. అంతే కాకుండా, పునీత్ 26 అనాథ శ‌ర‌ణాల‌యాల‌కు, 16 వృద్ధాశ్ర‌మాల‌కు, 19 గోశాల‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తూ వ‌చ్చారు. అలాగే త‌న ట్ర‌స్ట్ ద్వారా 1800 మంది పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందించారు. ఇక‌నుంచీ వారి బాధ్య‌త‌ల‌ను త‌ను చూసుకుంటాన‌ని ఇటీవ‌ల హీరో విశాల్ ప్ర‌క‌టించారు. పునీత్ భార్య పేరు అశ్వినీ రేవంత్‌. ప‌రిచ‌య‌మైన మూడేళ్ల‌కు ఆమెను 1999 డిసెంబ‌ర్‌లో ప్రేమ‌వివాహం చేసుకున్నారు పునీత్‌. ఆ ఇద్ద‌రిదీ అన్యోన్య దాంప‌త్యం. వారికి ధ్రుతి, వందిత అనే ఇద్ద‌రు కుమార్తెలు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ జంట‌ను చూసి విధికి క‌న్ను కుట్టింది. అక్టోబ‌ర్ 29న త‌న నిజ‌జీవిత హీరో మృతితో అశ్విని గుండెలు ప‌గిలాయి. పునీత్ పార్థివ‌దేహం మీద ప‌డి ఆమె విల‌పించ‌డం చూసిన వాళ్లకు క‌న్నీళ్లు ఆగ‌లేదు.

వాట్ ఎ విజువ‌ల్ వండ‌ర్‌.. 'ఆర్ఆర్ఆర్' గ్లిమ్స్‌!

  'ఆర్ఆర్ఆర్‌'.. ఇప్ప‌టిదాకా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్లను విడివిడి టీజ‌ర్ల‌తో చూపించిన య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి తొలిసారి ఆ ఇద్దరినీ ఒకే వీడియోలో చూపించి వారి అభిమానుల‌కు దీపావ‌ళి పండ‌గ‌ను ముందే తెచ్చేశాడు. 'ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్' పేరిట సోమ‌వారం ఉద‌యం మేక‌ర్స్ 45 సెక‌న్ల వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా అంటే ఏమిటో ఇప్ప‌టికే 'బాహుబ‌లి' సిరీస్ ద్వారా ప్ర‌పంచానికి రుచి చూపించిన రాజ‌మౌళి.. ఇప్పుడు దానికి మించిన రేంజ్‌లో 'ఆర్ఆర్ఆర్‌'ను ప్రెజెంట్ చేస్తున్నాడ‌ని ఆ చిన్న‌ వీడియో ద్వారా అర్థ‌మ‌వుతోంది. రాజ‌మౌళి సినిమాల్లో యాక్ష‌న్ సీన్స్ వేరే లెవ‌ల్లో ఉంటాయ‌ని మ‌న‌కు తెలుసు. 'ఆర్ఆర్ఆర్'లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ మ‌రింత పీక్స్‌లో ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ గ్లిమ్స్‌లో అటు రామ్‌చ‌ర‌ణ్‌, ఇటు జూనియ‌ర్ ఎన్టీఆర్ రొమాలు నిక్క‌బొడిచేలా చేసే యాక్ష‌న్ సీన్స్‌లో వీర‌విహారం చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆ ఇద్ద‌రితో పాటు హీరోయిన్లు అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్‌, క్రూషియ‌ల్ రోల్ చేసిన అజ‌య్ దేవ్‌గ‌ణ్ కూడా క‌నిపించారు.  ఒక ఉరికొయ్య బ్యాక్‌డ్రాప్‌లో ఈ వీడియోను రూపొందించారు. ఎవ‌రి కోసం ఆ ఉరికొయ్య‌ను సిద్ధం చేశార‌నేది స‌స్పెన్స్‌. ఉరి తీసే జైలు ద‌గ్గ‌ర‌కు జ‌నం తండోప‌తండాలుగా ఎడ్ల బళ్ల‌పై వ‌చ్చిన‌ట్లు వీడియో మొద‌ట్లో మ‌నం చూడ‌వ‌చ్చు. జ‌నం ఇనుప కంచెను నెట్టివేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే వారిపై గుళ్ల‌వ‌ర్షాన్ని కురిపించారు బ్రిటిష్ సైనికులు. అడ‌విలో ఒక వ్య‌క్తిని పులి వెంటాడ‌టం, తార‌క్ నెత్తి మీద నుంచి కంటిపైకి నెత్తురు ధార‌గా కార‌డం, అజ‌య్ దేవ్‌గ‌ణ్ తుపాకిని పేల్చ‌డం, చ‌ర‌ణ్ గుర్రంపై, తార‌క్ బైక్‌పై క‌లిసి ఒక చెరువు ప‌క్క నుంచి దౌడు తీస్తుండ‌టం, ఉరికొయ్య ద‌గ్గ‌ర‌కు సైనికులు ప‌రుగున రావ‌డం, అలియా ఆశ్చ‌ర్య‌పోతూ చూడ్డం, బ్రిడ్జిపైన భ‌యాన‌క వాతావ‌ర‌ణం, తార‌క్‌-చ‌ర‌ణ్ యాక్ష‌న్ మోడ్‌, బ్రిటీష్ సైనికుడి పైకి భీక‌రంగా గ‌ర్జిస్తూ పులి దూక‌డం.. లాంటి స‌న్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. ఈ వీడియోలో మ‌న‌కు ఒక్క డైలాగ్ కూడా వినిపించ‌లేదు. అయితేనేం.. ఈ చిన్న వీడియో చూస్తుంటే తెలిసిపోతోంది.. రాజ‌మౌళి మ‌న ముందుకు ఒక విజువ‌ల్ వండ‌ర్‌ను తీసుకు వ‌స్తున్నాడ‌ని, ఒక ఫాంట‌సీ వ‌ర‌ల్డ్‌లోకి మ‌న‌ల్ని తీసుకువెళ్ల‌నున్నాడ‌ని! వీఎఫ్ఎక్స్ స‌హాయంతో అద్భుత‌మ‌నిపించే విజువ‌ల్స్‌తో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంద‌నేది స్ప‌ష్టం. ఇండియ‌న్ సినిమా గ్లోరీని మ‌రోసారి ప్ర‌పంచానికి చాటిచెప్ప‌డానికి అన్ని ర‌కాలుగా సిద్ధ‌మ‌వుతున్న 'ఆర్ఆర్ఆర్' జ‌న‌వ‌రి 7న, సంక్రాంతి పండ‌గ‌కు వారం రోజుల ముందు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స‌మేత రాజ‌మౌళి సైన్యం సృష్టించే ప్ర‌భంజ‌నం ఎలా ఉంటుందో చూడ్డ‌మే మిగిలుంది.

విధి క్రూరంగా విడ‌దీసిన అంద‌మైన ప్రేమ‌జంట పునీత్-అశ్విని!

  పునీత్ రాజ్‌కుమార్‌, అశ్వినీ రేవంత్‌ను చూసిన‌వాళ్లు వెంట‌నే అనేస్తారు.. 'మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్' అని. కానీ క్రూర‌మైన విధి వారిని విడ‌దీసింది. క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ 1999 డిసెంబ‌ర్ 1న వైభ‌వంగా జ‌రిగిన వేడుక‌లో అశ్వినీ రేవంత్ మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. అంత‌కంటే ముందు, మూడేళ్ల క్రితం ఆ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు.  అదెలాగంటే.. పునీత్ చ‌దువు పూర్త‌య్యాక‌, 1996లో ఒక‌రోజు ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా అశ్విని ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత తాము ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నామ‌నే విష‌యం గ్ర‌హించారు. ఎనిమిది నెల‌ల త‌ర్వాత‌ త‌న జీవిత భాగ‌స్వామి అశ్విని అని డిసైడ్ అయ్యాడు పునీత్‌. ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. అశ్విని ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓకే చెప్పేసింది. కానీ, వారి వివాహానికి అశ్విని పేరెంట్స్ మొద‌ట ఒప్పుకోలేదు. ఆరు నెల‌ల పాటు వెయిట్ చేయించి, అప్పుడు స‌రేన‌న్నారు.  మ‌రోవైపు, త‌న ప్రేమ విష‌యం త‌ల్లితండ్రుల‌కు చెప్ప‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాడు పునీత్‌. ఒక‌రోజు తండ్రి రాజ్‌కుమార్ ద‌గ్గ‌ర త‌న‌కు వీరాభిమాని అయిన ఒక‌మ్మాయి ఉంద‌ని చెప్పాడు. కొడుకు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడో రాజ్‌కుమార్ వెంట‌నే గ్ర‌హించేశారు. "ఈ విష‌యం మీ అమ్మ‌తో చెప్పరా" అని ఆయ‌న చెప్పారు. అమ్మ పార్వ‌త‌మ్మ ఆశీర్వాదాలు కూడా పునీత్‌కు ల‌భించాయి. పెళ్ల‌య్యాక జాయింట్ ఫ్యామిలీలో భాగంగా అంద‌రితో క‌లిసుండాల‌నే విష‌యం అశ్వినిని మొద‌ట్లో ఇబ్బంది పెట్టింది. కానీ చాలా త్వ‌ర‌గానే రాజ్‌కుమార్ కుటుంబం పాటించే విలువ‌ల‌ను అర్థం చేసుకొని, ఆ కుటుంబంలో మ‌న‌స్ఫూర్తిగా భాగ‌మైంది. ప్ర‌తి వీకెండ్ తాను స్వీట్స్ చేస్తాన‌ని, వాటిని త‌న మామ‌య్య రాజ్‌కుమార్ బాగా ఇష్ట‌ప‌డేవార‌ని ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది అశ్విని. ఆమె సినిమాలు ఎప్పుడో కానీ చూసేది కాదు. అయితే చూస్తే మాత్రం, ఆ సినిమాలో త‌న‌కు న‌చ్చిన విష‌యాలు, న‌చ్చ‌ని విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పేసేది. అశ్విని త‌న బెస్ట్ క్రిటిక్స్‌లో ఒక‌ర‌ని ఒక‌సారి పునీత్ వెల్ల‌డించాడు. కొన్నేళ్ల క్రితం "పీఆర్‌కే" అనే బ్రాండ్‌ను నెల‌కొల్పాడు పునీత్‌. దానికి సంబంధించిన మెయిన్ డెసిష‌న్ మేక‌ర్స్‌లో అశ్విని ఒక‌రు. పునీత్‌-అశ్విని దంప‌తులకు ఇద్ద‌రు కుమార్తెలు.. ధ్రుతి, వందిత‌. ప్ర‌తిష్ఠాత్మ‌క రాజ్‌కుమార్ కుటుంబంలో ఎంతో చ‌క్క‌గా ఇమిడిపోయిన ప‌ర్ఫెక్ట్ కోడ‌లు అశ్విని. భ‌ర్త పునీత్ త‌ర‌హాలోనే ఆమె కూడా స‌హృద‌యురాలిగా, విన‌య‌శీలిగా అశ్విని పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతున్న ఆ జంట‌ను చూసి విధికి క‌న్ను కుట్టింది. అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో పునీత్ క‌న్నుమూశాడు. త‌న నిజ‌జీవిత హీరో మృతితో అశ్విని గుండెలు ప‌గిలాయి.

రెండు సార్లూ కొడుక్కి స‌రైన స్క్రిప్టు ఇవ్వ‌లేక‌పోయిన పూరి జ‌గ‌న్నాథ్‌!

  తెలుగునాట హీరోయిజానికి స‌రికొత్త డైమ‌న్ష‌న్ ఇచ్చిన డైరెక్ట‌ర్ గా పూరీ జ‌గ‌న్నాథ్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. త‌న మొద‌టి సినిమా `బ‌ద్రి` (2000) మొద‌లుకుని `ఇడియ‌ట్` (2002), `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి` (2003), `శివ‌మ‌ణి` (2003), `పోకిరి` (2006), `దేశ‌ముదురు` (2007), `చిరుత‌` (2007), `బిజినెస్ మేన్` (2012), `ఇస్మార్ట్ శంక‌ర్` (2019) వ‌ర‌కు పూరీ సొంతంగా త‌యారుచేసుకున్న స్క్రిప్ట్ ల‌న్నీ ఆయా చిత్రాల్లో క‌థానాయ‌కుల‌ను స‌రికొత్తగా ఆవిష్క‌రించిన‌వే. అయితే, ఇదంతా నాణేనికి ఒక‌వైపు. మ‌రోవైపు ఏంటంటే.. త‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌థానాయ‌కులుగా పెట్టి సినిమాలు తీసేట‌ప్పుడు మాత్రం పూరీ త‌డ‌బ‌డుతూనే ఉన్నారు. 17 ఏళ్ళ క్రితం త‌న త‌మ్ముడు సాయిరామ్ శంక‌ర్ ని `143`(2004)తో హీరోగా ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భంలోనూ.. మూడేళ్ళ క్రితం త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని `మెహ‌బూబా` (2018)తో హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసిన సంద‌ర్భంలోనూ పూరి `స్క్రిప్ట్స్` బాక్సాఫీస్ ముంగిట కాసుల జ‌ల్లు కురిపించ‌లేక‌పోయాయి. ర‌వితేజ లాంటి స్ట్ర‌గులింగ్ హీరోని స్టార్ గా మ‌లిచినా - పునీత్ రాజ్ కుమార్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ కిడ్స్ ని సెన్సేష‌న‌ల్ డెబ్యూస్ తో ప‌రిచ‌యం చేసి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించినా.. మ‌హేశ్ బాబు ని సూప‌ర్ స్టార్ గా మ‌ల‌చ‌డంలో కీల‌క పాత్ర పోషించినా.. అది ఒక్క పూరీకే ద‌క్కింది. అలాంటిది.. త‌న త‌మ్ముడు, త‌న‌యుడికి సూట‌బుల్ స్టోరీస్ ని వండ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోతున్నారు జ‌గ‌న్. ఇక త‌న శిష్యుడు, డెబ్యూ డైరెక్ట‌ర్ (అనిల్ పాడూరి) చేతిలో త‌న త‌న‌యుడు ఆకాశ్ ని అప్ప‌జెప్పి.. త‌నే స్వ‌యంగా క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, నిర్మాణం బాధ్య‌త‌లు చేప‌ట్టిన `రొమాంటిక్` కూడా సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకోలేక‌పోతోంది. ఇంకా మీసాలు కూడా స‌రిగ్గా మొల‌వ‌ని ఓ సాధార‌ణ కుర్రాడు.. డాన్ అయిపోవ‌డం, ఓ గ్యాంగ్ ని మెయింటెన్ చేయ‌డం - ఇలాంటి స్క్రిప్ట్ తో `రొమాంటిక్`ని టైటిల్ కి భిన్న‌మైన ఇంకో కోణంలోనూ తీర్చిదిద్ద‌డం అంత‌గా రుచించ‌ని వ్య‌వ‌హార‌మే అంటున్నారు చూసిన జ‌నాలు. అయితే, రొమాంటిక్ సీన్స్ మాత్రం టార్గెట్ ఆడియ‌న్స్ అయిన యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసాయంటున్నారు.  మొత్తంగా..  ఆకాశ్ లో పూరి మార్క్ `క‌థానాయ‌కుడు` ఉన్నా.. అత‌నికి రైట్ స్క్రిప్ట్ ఇవ్వ‌డంలో మాత్రం పూరి త‌డ‌బ‌డుతున్నార‌న్న‌ది `రొమాంటిక్` చూసిన‌వాళ్ళ టాక్. మ‌రి.. భ‌విష్య‌త్ లోనైనా త‌న త‌న‌యుడి అభిన‌య సామార్థ్యానికి త‌గ్గట్టుగా అన్ని ర‌కాల అంశాలు మేళ‌వించిన క‌థ‌ని అందించి టాలీవుడ్ కి త‌న మార్క్ `స్టార్`ని పూరి ప్ర‌జెంట్ చేస్తారేమో చూడాలి.  

చ‌క్ర‌వ‌ర్తి మృతివార్త తెలిసి ఎస్పీ బాలు ఎంత హృద‌య‌విదార‌కంగా రోదించారో!

  సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తెలుగు చిత్ర‌సీమ‌ను కొన్నేళ్ల‌పాటు మ‌కుటంలేని మ‌హారాజుగా ఏలేశారు. వారానికి ఏడు రోజులూ రిలాక్స‌నేది ఎరుగ‌కుండా ప‌నిచేసిన మ‌నిషాయ‌న‌. ముగ్గురు కొడుకుల్లో ఒక‌త‌ను మ‌ర‌ణించ‌డం, ఆ త‌ర్వాత కొద్దికాలానికే భార్య కూడా మృతిచెంద‌డంతో చ‌క్ర‌వ‌ర్తి మాన‌సికంగా బాగా కుంగిపోయారు. క్ర‌మేణా ప‌ని త‌గ్గించుకుంటూ వ‌చ్చి, సంగీతానికి దూర‌మయ్యారు. అయితే టీవీ సీరియ‌ల్స్ రైట‌ర్‌గా య‌మ‌బిజీగా ఉండే ఓంకార్ ఆయ‌న‌ను ఆ సీరియ‌ల్స్‌లో న‌టించ‌మ‌ని ఒత్తిడి చేశారు. అలా అయినా చ‌క్ర‌వ‌ర్తి న‌లుగురి మ‌ధ్య మెస‌లుతూ మామూలు మ‌నిష‌వుతార‌ని ఆయ‌న భావించారు. అలా బాలాజీ టెలీ ఫిలిమ్స్ నిర్మించిన 'క‌లిసుందాం రా!' సీరియ‌ల్‌లో హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ అనే మెయిన్ క్యారెక్ట‌ర్‌ చేశారు.  ఆ సీరియ‌ల్‌లో న‌టించేట‌ప్పుడే ఒక‌రోజు రేస్ కోర్సు క్ల‌బ్‌లో లంచ్ చేసి, ఇంటికి వ‌చ్చారు చ‌క్ర‌వ‌ర్తి. ఒంట్లో అనీజీగా ఉంద‌ని చెప్తే వాళ్ల‌బ్బాయి శ్రీ (మ్యూజిక్ డైరెక్ట‌ర్‌) ఆయ‌న‌ను చెన్నైలోని విజ‌యా హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు మొద‌ట తేడా ఏమీ లేద‌న్నారు. అయితే ఎందుకైనా మంచిద‌ని ఒక‌రోజు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉన్న‌ట్లు ఉంటుంద‌ని హాస్పిట‌ల్‌లో ఉండ‌మ‌న్నారు. అలాగే ఉన్నారు చ‌క్ర‌వ‌ర్తి. సాయంత్రం నాలుగు దాటాక ఆయ‌న ఆరోగ్య స్థితిలో మార్పు వ‌చ్చింది. డాక్ట‌ర్లు ఆందోళ‌న‌తో మ‌రోసారి టెస్టులు చేశారు. రాత్రి ఏడున్న‌ర‌కు చ‌క్ర‌వ‌ర్తి ఇక‌లేరు అనే వార్త గుప్పుమంది. అభిమానులు, ఇండ‌స్ట్రీ జ‌నాలు షాకైపోయారు. కాసేప‌ట్లో విజ‌య హెల్త్ సెంట‌ర్‌కు ఓ కారు వ‌చ్చి ఆగింది. అందులోంచి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం దిగారు. అక్క‌డే బ‌య‌ట నిల్చొనివున్న శ్రీ‌ని చూసి, అత‌డిని ప‌ట్టుకొని, "అరేయ్ శ్రీ‌గా, ఏమ‌య్యిందిరా" అంటూ కారు డోరుకు త‌ల‌కొట్టుకున్నారు. "అరేయ్ చ‌క్ర‌వ‌ర్తీ.. ఏమ‌య్యావురా?" అని చేతులు పైకెత్తి అక్క‌డున్న వాళ్లంద‌రి క‌ళ్లు నీళ్ల‌తో నిండిపోయేలా రోదించారు. ఓంకార్ వ‌చ్చి బాలును ఓదార్చ‌డానికి ప్ర‌య‌త్నించారు. "ఏడండీ.. వాడేడండీ.. ఎక్క‌డ వాడు" అంటూ అరుస్తుంటే, "ఫారిన్ నుంచి వాళ్ల‌బ్బాయి రావాలి. అందుక‌ని బాడీని మార్చురీలో ఉంచాం" అని ఓంకార్‌ చెప్పారు. చ‌క్ర‌వ‌ర్తి, బాలు మ‌ధ్య స్నేహ‌బంధం మామూలుది కాదు. ఆ ఇద్ద‌రి కెరీర్ స‌మాంత‌రంగా సాగుతూ వ‌చ్చింది. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌రాలు కూర్చిన వేలాది పాట‌లు బాలు గ‌ళంలో జీవం పోసుకొని, సంగీత ప్రియుల నాలుక‌ల‌పై న‌ర్తిస్తూ వ‌చ్చాయి. ఇద్ద‌రూ "ఒరేయ్.. ఒరేయ్" అని పిలుచుకునేంత గాఢ స్నేహితులు. మూడు రాత్రులు విజ‌యా హాస్పిట‌ల్ మార్చురీలో చ‌క్ర‌వ‌ర్తి పార్థివ‌దేహం ఉంది. మూడో రోజు అమెరికా నుంచి వాళ్ల‌బ్బాయి వ‌చ్చాక ఏవీయం స్టూడియో ప‌క్క‌నున్న శ్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. శోభ‌న్‌బాబు, చంద్ర‌మోహ‌న్‌, సంగీత ద‌ర్శ‌కుడు కోటి వంటి కొద్దిమంది మాత్ర‌మే ఆ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. అలా చ‌క్ర‌వ‌ర్తి క‌థ భౌతికంగా స‌మాప్త‌మైంది. కానీ త‌ను సంగీతం స‌మ‌కూర్చిన పాట‌ల‌తో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌న‌తోనే ఉన్నారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ పెళ్లెలా జ‌రిగిందో తెలుసా?

  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సూప‌ర్ హిట్ కావ‌డంతో చాలా కాలం త‌ర్వాత‌ స‌క్సెస్ రుచిని ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌. అఖిల్, పూజా హెగ్డే జంట‌గా అత‌ను రూపొందించిన ఈ మూవీ ఇంటా, బ‌య‌టా విజ‌య దుందుభి మోగిస్తోంది. నాలుగు సినిమాలు చేసిన అఖిల్‌కు ఫ‌స్ట్ హిట్‌ను అందించిన డైరెక్ట‌ర్‌గా కూడా భాస్క‌ర్ పేరు సంపాదించుకున్నాడు. మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న క‌థ‌ను అత‌ను తెర‌కెక్కించిన తీరు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ అమితంగా ఆక‌ట్టుకుంటోందని క‌లెక్ష‌న్లు నిరూపిస్తున్నాయి. స్వ‌త‌హాగా త‌మిళుడైన భాస్క‌ర్ ఒక తెలుగు అమ్మాయిని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడ‌నే విష‌యం కొంత‌మందికే తెలుసు. డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'బొమ్మ‌రిల్లు' బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో భాస్క‌ర్ పేరు మారుమోగిపోయింది. బొమ్మ‌రిల్లు అనేది అత‌ని ఇంటిపేరుగా మారిపోయింది. రెండో సినిమా చెయ్య‌డానికి రెడీ అవుతున్న‌ప్పుడు ఇంట్లోవాళ్లు అత‌నికి పెళ్లి సంబంధాలు చూడ్డం మొద‌లుపెట్టారు. అప్ప‌టికే అత‌ను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. స‌రైన స‌మయం చూసి నాన్న‌కు చెప్పాల‌ని అనుకుంటున్నాడు. ఓసారి వాళ్ల‌నాన్న భాస్క‌ర్ జాత‌కం ప‌ట్టుకొని కూర్చున్నారు. ఏంట‌ని అడిగితే, "నీకు ఈ వారం ప‌ది రోజుల్లో పెళ్లికాక‌పోతే, జాత‌కం ప్ర‌కారం చాలా ఆల‌స్య‌మైపోతుంది" అని చెప్పారు. అయితే అయింది, తొంద‌రేముంది అన్నాడు భాస్క‌ర్‌. ఆ మ‌రుస‌టి రోజే ఓ అమ్మాయితో అత‌నికి పెళ్లి ఫిక్స్ చేసేశారు. "ఓ వారంలో నీకు పెళ్లి" అని కూడా చెప్పారు. దాంతో భాస్క‌ర్ ఆందోళ‌న‌లో ప‌డ్డాడు. త‌న ల‌వ్ మేట‌ర్ ఇంట్లో చెప్ప‌కుండా త‌ప్పు చేశాన‌నుకున్నాడు. వెంట‌నే వాళ్ల నాన్న‌కు ఫోన్ చేశాడు. "నాన్నా.. ఈ విష‌యం నీకు ఇదివ‌ర‌కే చెబుదామ‌నుకున్నా, తొంద‌రేముంద‌ని ఆగాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. అర‌స‌వెల్లిలో పెళ్లి చేసుకుందామ‌ని అనుకుంటున్నా. మీరంతా బ‌య‌లుదేరి వ‌చ్చేయండి" అని చెప్పాడు. దాంతో వాళ్ల నాన్న షాకైపోయాడు. ఇంట్లో వాళ్ల‌కు ఆయ‌న ఈ విష‌యం చెప్ప‌గానే వాళ్లంతా షాకు. భాస్క‌ర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకున్నా స‌రైన‌దే తీసుకుంటాడ‌నేది వాళ్ల నాన్న న‌మ్మ‌కం దాంతో ఆయ‌న త‌న కుటుంబాన్నంతా తీసుకొని అర‌స‌వెల్లికి వ‌చ్చేశారు. అలా భాస్క‌ర్ వివాహం అర‌స‌వెల్లిలో జ‌రిగింది. అత‌ని భార్య పేరు గౌరి శ్రీ‌విద్య‌. విజ‌య‌న‌గ‌రం అమ్మాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భాస్క‌ర్‌, గౌరి ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ ప‌రిచ‌యం కొద్ది రోజుల‌కు స్నేహంగా, మ‌రికొద్ది రోజుల‌కు ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకున్నారు. వాళ్ల‌మ్మాయి పేరు హాసిని. 'బొమ్మ‌రిల్లు'లో త‌న క‌థానాయిక పేరునే కూతురికి పెట్టుకున్నాడు భాస్క‌ర్‌. మ్యారీడ్ లైఫ్ అంటే ఏమిటో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో అత‌ను చూపించిన దానికీ, అత‌ని మ్యారీడ్ లైఫ్‌కూ క‌నెక్ష‌న్ ఉంద‌న‌డంలో సందేహ‌మే లేదు.