60 ఏళ్ల 'మంచి మ‌న‌సులు'.. జీవించి ఉన్న‌ది ఒక్క షావుకారు జాన‌కి!

  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా, సావిత్రి, షావుకారు జాన‌కి నాయిక‌లుగా దిగ్ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన 'మంచి మ‌న‌సులు' చిత్రం విడుద‌లై ఏప్రిల్ 11తో 60 ఏళ్లు పూర్త‌య్యాయి. బాబూ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. సుంద‌రం ఈ చిత్రాన్ని నిర్మించారు. 'న‌న్ను వ‌దిలి పోలేవులే', 'మావ మావ‌', 'శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు', 'ఓహో ఓహో పావురమా'.. పాట‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. త‌మిళంలో తాను రూపొందించిన 'కుముదం' చిత్రాన్నే తెలుగులో రీమేక్ చేశారు ఆదుర్తి. 1962 ఏప్రిల్ 11న రిలీజై మంచి విజ‌యం సాధించిన‌ ఈ సినిమాలో ఏఎన్నార్‌, సావిత్రి, జాన‌కిల‌తో పాటు ఎస్వీ రంగారావు, గుమ్మ‌డి, ర‌మ‌ణా రెడ్డి, నాగ‌భూష‌ణం, అల్లు రామ‌లింగ‌య్య‌, సూర్య‌కాంతం, వాసంతి, పొట్టి ప్ర‌సాద్, వంగ‌ర, చిడ‌త‌ల అప్పారావు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. వీళ్లంద‌రిలో ఇప్పుడు జీవించి ఉన్న‌ది ఒక్క షావుకారు జాన‌కి మాత్ర‌మే! ఇటీవ‌లే ఆమె ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్నారు. అటు త‌మిళ 'కుముందం', ఇటు తెలుగు 'మంచి మ‌న‌సులు'.. రెండింటిలోనూ ఆమె న‌టించారు. ఈ సినిమా గురించి తెలుగువ‌న్‌తో కొన్ని మాట‌లు పంచుకున్నారు జాన‌కి. "ఆదుర్తి గారికి నా మీద మంచి అభిమానం. అందుకే రెండు భాష‌ల్లోనూ ఆ పాత్ర‌ను నాచేత చేయించారు. సావిత్రిగారు లాయ‌ర్‌గా చేశారు. ఏఎన్నార్ గారు ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో త‌న చెల్లెలి కోసం న‌న్ను పెళ్లి చేసుకుంటారు. నాది గుడ్డి పాత్ర‌. నాకు మంచి పేరు తేవ‌డంతో పాటు, నాకు సంతృప్తినిచ్చింది. నేను చేసిన‌ 'ఓహో ఓహో పావుర‌మా', 'శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు' పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ సినిమా చూసి ఇంటికొచ్చాక కూడా ఆ క‌థ గురించి జ‌నం చెప్పుకున్నారు. అలాంటి క‌థ అది. 'మంచి కుటుంబం', 'డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి', 'అక్కా చెల్లెళ్లు' కోవ‌కు చెందిన సినిమా 'మంచి మ‌న‌సులు'. 'క‌న్యాశుల్కం'లోని బుచ్చ‌మ్మ క్యారెక్ట‌ర్ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. మీరు గ‌మ‌నిస్తే ఏ పాత్ర ప‌డితే ఆ పాత్ర చేయ‌కుండా, ఉన్న‌పేరు చెడ‌గొట్టుకోకుండా పాత్ర‌లు ఒప్పుకుంటూ చేశాను." అని జాన‌కి చెప్పారు.

కార‌వాన్‌లో కూర్చోవాలంటే చిరాకు అనిపించేది.. విజ‌య‌శాంతి మ‌న‌సులో మాట‌!

  లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి చాలా కాలం త‌ర్వాత మ‌హేశ్‌బాబు సినిమా 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో ఓ కీల‌క పాత్ర‌లో తెర‌మీద క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 2020లో సంక్రాంతికి వ‌చ్చిన ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. మ‌ళ్లీ ఆమె సినిమాలు రెగ్యుల‌ర్‌గా చేస్తారేమోన‌ని ఆశించిన అభిమానులను నిరుత్సాహ‌ప‌రుస్తూ ఇంత‌దాకా మ‌రో సినిమాని ఆమె ఒప్పుకోలేదు. తాను రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేయ‌న‌ని ఆమె తేల్చేశారు. ఎప్పుడ‌న్నా గొప్ప పాత్ర వ‌స్తే అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే చేస్తాన‌ని తెలుగువ‌న్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె స్ప‌ష్టం చేశారు. కాగా ఇవాళ హీరో హీరోయిన్ల‌తో పాటు పేరున్న ఆర్టిస్టుల‌కు కూడా నిర్మాత‌లు కార‌వాన్‌ను స‌మ‌కూరుస్తున్నారు. దానివ‌ల్ల వారి బ‌డ్జెట్ ఖ‌ర్చు పెరుగుతున్న మాట వాస్త‌వం. అయితే త‌న‌కు కార‌వాన్ అనేది న‌చ్చ‌లేద‌ని విజ‌య‌శాంతి చెప్పారు. "ఇదివ‌ర‌కు యూనిట్ అంతా లైట్‌బాయ్స్ ద‌గ్గ‌ర్నుంచి ఆర్టిస్టుల దాకా అంద‌రం చెట్టుకింద కూర్చొని లంచ్ చేసేవాళ్లం. అంతా ఒక కుటుంబ స‌భ్యుల్లా ఉండేవాళ్లం. మిగ‌తా వాళ్లు ఏం తినేవాళ్లో మేం కూడా అదే తినేవాళ్లం. ఇప్పుడు కార‌వాన్‌లో ఉండాలంటే చాలా చిరాకు అనిపించింది. ఏదో గుహ‌లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోబెట్టిన‌ట్లు అనిపించేది." అని ఆమె అన్నారు. బ‌య‌ట కూర్చుంటే చెట్లు, ప‌క్షులు, గాలి ఉంటాయ‌నీ, అంద‌రూ క‌న‌ప‌డ‌తారనీ విజ‌య‌శాంతి చెప్పారు. "మేక‌ప్ వేసుకోవ‌డానికో, డ్ర‌స్ చేంజ్ చేసుకోవ‌డానికో, వాష్ రూమ్‌కో అయితే ఓకే. కానీ గంట‌, రెండు గంట‌ల‌సేపు అదేప‌నిగా కార‌వాన్‌లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. అవ‌న్నీ నాకు న‌చ్చ‌లేదు. నాకు బ‌య‌ట కూర్చోవాల‌నిపించేది. భోజ‌నం చేసి, మేక‌ప్ అయ్యాక వెంట‌నే సెట్‌కు వ‌చ్చేసేదాన్ని." అని ఆమె తెలిపారు.

డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ త‌ల్లి అరుదైన కేన్స‌ర్‌తో చ‌నిపోయార‌ని తెలుసా?

  నిఖిల్ హీరోగా న‌టించిన 'యువ‌త‌'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై, ఇవాళ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుతో 'స‌ర్కారువారి పాట' చేసే దాకా ఎదిగిన ప‌ర‌శురామ్ పేట్ల డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు క‌జిన్‌. పూరి సొంత బాబాయ్ కొడుకే ప‌ర‌శురామ్‌. త‌ను పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊళ్లో అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. ప‌ర‌శురామ్ వాళ్ల‌ నాన్న కో-ఆపరేటివ్‌ బ్యాంకులో చిన్న ఉద్యోగి. వాళ్ల‌కు ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉండేది. దాని వ్య‌వ‌హారాల‌ను వాళ్ల‌మ్మ చూసుకొనేవారు. ఓసారి పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్‌ సోకి కోళ్లన్నీ చనిపోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పటివరకూ ప‌ర‌శురామ్‌తో పాటు వాళ్ల‌క్క కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నారు. సరిగ్గా డబ్బు పెట్టి పిల్ల‌ల్ని పైచదువులు చదివించాలని అమ్మ‌ ఆశపడ్డ సమయానికి అలా జరిగింది. దాంతో ఆమె కాస్త డీలా పడింది. ప‌ర‌శురామ్‌ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చదివేట‌ప్పుడు ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ పని చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ వస్తే వెళ్లాడు. డాక్టర్లు హెమోగ్లోబిన్‌ తక్కువగా ఉందన్నారు. స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి వచ్చాడు.  ఓ పదిరోజుల తరవాత మళ్లీ అమ్మకు నీరసంగా ఉందంటే వెళ్లాడు. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్‌ బ్లడ్‌ క్యాన్సరని తేలింది. రెండు మూడు నెలలకు మించి బతకడం కష్టమన్నారు. ఆ మాట వినగానే ప‌ర‌శురామ్‌ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏకంగా చనిపోయేంత జబ్బు అమ్మ‌కు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అక్కకు తెలిస్తే తనేదైనా చేసుకుంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. నాన్న దగ్గరా ఓ పదిరోజులు దాచిపెట్టాడు. నటుడు జోగినాయుడు వాళ్ల‌ పెద్దమ్మ కొడుకే. అప్ప‌టికి ఝాన్సీ, ఆయ‌నా క‌లిసే ఉన్నారు. ఆ ఇద్ద‌రూ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. జబ్బు బయటపడిన ఆర్నెల్లకు ప‌ర‌శురామ్ వాళ్ల‌మ్మ చ‌నిపోయారు. ఆమె పోయిన‌ ఏడాదిలోపే ఉన్న కొద్దిపాటి భూముల్ని అమ్మేసి వాళ్ల‌క్క‌ పెళ్లి చేశారు. తరవాత వాళ్ల నాన్న తెలీని నైరాశ్యంలోకి జారిపోయారు. అలానే గడిపితే త‌నూ డిప్రెషన్‌లోకి వెళ్తానేమోనని భయమేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్‌ వచ్చాడు ప‌ర‌శురామ్‌. అలా మొద‌ట‌ అన్న పూరి జ‌గ‌న్నాథ్ ద‌గ్గ‌ర, త‌ర్వాత ద‌శ‌ర‌థ్‌, వీరు పోట్ల‌, భాస్క‌ర్ లాంటి ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర రైట‌ర్‌గా, అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు.  'మంత్ర' నిర్మాత‌లు ముందుకు రావ‌డంతో నిఖిల్ హీరోగా న‌టించిన‌ 'యువ‌త' మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు ప‌ర‌శురామ్‌. ఆ సినిమా హిట్‌. త‌ర్వాత ఆంజ‌నేయులు, సోలో, సారొచ్చారు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, గీత గోవిందం సినిమాలు తీశాడు. వీటిలో 'సారొచ్చారు' ఒక్క‌టే డిజాస్ట‌ర్‌. మిగ‌తావ‌న్నీ నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిన‌వే. 'గీత గోవిందం' అయితే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ సినిమాయే ఇప్పుడు మ‌హేశ్‌తో 'స‌ర్కారువారి పాట‌'ను తీయ‌డానికి కార‌ణ‌మైంది. మే 12న రానున్న ఈ మూవీతో ప‌ర‌శురామ్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌నున్న‌డ‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.

నిన్న‌టి హీరోయిన్ ర‌జ‌ని టెన్త్ క్లాస్ కూడా చ‌ద‌వ‌లేదంటే న‌మ్ముతారా?

  తెలుగు, త‌మిళ భాష‌ల్లో 150 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించారు అందాల తార ర‌జ‌ని. ఆమె అస‌లు పేరు శ‌శిక‌ళ మ‌ల్హోత్రా. తెలుగులో త‌ను న‌టించిన కాలంలో ఒక్క చిరంజీవి మిన‌హా మిగ‌తా అంద‌రు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించారామె. ఒక‌ప్పుడు తీరిక లేకుండా కాలం వెంట ప‌రుగులు తీస్తూ షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపిన ఆమె ఇప్పుడు గృహిణిగా తన ముగ్గురు పిల్ల‌ల ఆల‌నా పాల‌నా ద‌గ్గ‌రుండి చూసుకుంటూ సంతృప్తిక‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. రెండు ద‌శాబ్దాలుగా హైద‌రాబాద్‌లోనే సినిమా వాతావ‌ర‌ణానికి దూరంగా కాలం గ‌డుపుతున్నారు. ఇంగ్లీష్‌లో అల‌వోక‌గా మాట్లాడే ర‌జ‌ని టెన్త్ క్లాస్ కూడా చ‌ద‌వ‌లేదంటే న‌మ్మాల్సిందే. ఆమె నైన్త్ పాస‌య్యారు. టెన్త్‌కి వెళ్ల‌డానికి ప్రిపేర‌వుతున్న స‌మ‌యంలోనే 1984లో ఆమెకు సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. అది త‌మిళ సినిమా. టైటిల్‌.. 'ఇళ‌మే కాలందు'. ఆ మూవీలో మోహ‌న్ హీరో. దానికి మ‌ణివ‌ణ్ణ‌న్ డైరెక్ట‌ర్‌. ర‌జ‌నిని ఎక్క‌డో చూసిన ఓ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ అమ్మాయి బాగుంద‌ని మ‌ణివ‌ణ్ణ‌న్‌కు చెప్పాడు. ఆయ‌న ర‌జ‌ని వాళ్ల‌నాన్న‌కు క‌బురు చేశారు. ఈ ఆఫ‌ర్ ఆమే కాదు, ఆమె త‌ల్లితండ్రులు కూడా ఊహించ‌నిది. టెన్త్ పూర్తిచెయ్య‌గానే ఆమెకు పెళ్లి చెయ్యాల‌నేది వాళ్ల ఆలోచ‌న‌. అందుకే, "అమ్మాయికి పెళ్లి చెయ్యాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నాం. మీరు అడుగుతున్నారు క‌నుక ఈ విష‌యాన్ని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఒక‌సారి మాట్లాడి చెప్తాను" అన్నారు ర‌జ‌ని వాళ్ల నాన్న‌. ఇంటికి వ‌చ్చి అంద‌ర్నీ కూర్చోపెట్టి విష‌యం చెప్పారు. ర‌జ‌ని వాళ్ల‌మ్మ ఓ మాట‌న్నారు. "ఏవండీ.. మ‌న‌మ్మాయికి పెళ్ల‌యి పిల్ల‌ల్ని క‌ని అమ్మ‌మ్మో, నాయ‌న‌మ్మో అయిన త‌ర్వాత మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌ను ప‌క్క‌న కూర్చోపెట్టుకొని త‌ను న‌టించిన సినిమా చూడ‌ట‌మ‌న్న‌ది ఓ అద్భుత‌మైన విష‌యం. అందుకే ఈ ఒక్క సినిమా ఒప్పుకుందాం. త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చినా, రాక‌పోయినా స‌రే." అని ఆమె చెప్ప‌డంతో ఆయ‌న స‌రేన‌న్నారు. అలా మోహ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా 'ఇళ‌మే కాలందు'తో సినిమా ఎంట్రీ ఇచ్చారు ర‌జ‌ని. (మార్చి 1 ర‌జ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా...)

బాల‌కృష్ణ - కోడి రామ‌కృష్ణ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ ఎందుకు బ్రేక్ అయ్యింది?

  బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌కు తిరుగులేద‌నే విష‌యం 'అఖండ' మూవీతో స్ప‌ష్ట‌మైంది. 'సింహా', 'లెజెండ్' లాంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లిసి చేసిన మూడో సినిమా 'అఖండ' మ‌రింత బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా వ‌సూళ్ల‌ను సాధించి, ఆ ఇద్ద‌రి కెరీర్‌లో టాప్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు బోయ‌పాటి లాగే గ‌తంలో కోడి రామ‌కృష్ణ‌తో బాల‌కృష్ణ కాంబినేష‌న్‌కు తిరుగులేద‌నే పేరు వ‌చ్చింది. బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ అన‌గానే 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు', 'ముద్దుల కృష్ణ‌య్య‌', 'మువ్వ‌గోపాలుడు', 'ముద్దుల మావ‌య్య' లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అయితే ఆ త‌ర్వాత‌ హ‌ఠాత్తుగా వారి కాంబినేష‌న్ ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికీ భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత యస్‌. గోపాల్‌రెడ్డి నిర్మాత‌. ఆ త‌ర్వాత కూడా ఈ ముగ్గురూ క‌లిసి ఓ జాన‌ప‌ద సినిమా మొద‌లుపెట్టారు కానీ, అనుకోకుండా అది స‌గం షూటింగ్ త‌ర్వాత‌ ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్‌రెడ్డి కానీ, కోడి రామ‌కృష్ణ కానీ మ‌న మ‌ధ్య లేరు. అయితే బాల‌కృష్ణను అగ్ర‌హీరోగా మార్చిన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన కోడి రామ‌కృష్ణ‌తో బాల‌య్య మ‌ళ్లీ ఎందుకు సినిమా చెయ్య‌లేద‌నే ప్ర‌శ్న చాలా మందిలో ఉండిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్ర‌శ్న‌కు కోడి రామ‌కృష్ణ జ‌వాబిచ్చారు. అన్నీ కుదిరితే త‌మ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ సినిమా వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తంచేస్తూ, "భార్గ‌వ్ ఆర్ట్స్‌లో బాల‌య్య‌తో నిజంగా గొప్ప సినిమాలే చేశాను. గోపాల్‌రెడ్డి గారికి కూడా బాల‌య్య అంటే విప‌రీత‌మైన అభిమానం. 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు' త‌ర్వాత బాల‌య్య టాప్ స్టార్ అయిపోయాడు. అందుకు త‌గ్గ‌ట్లే బాల‌య్య‌తో ఏ సినిమా తీసినా అడ‌క్కుండానే పారితోషికం పెంచేవారు గోపాల్‌రెడ్డి. 'ముద్దుల మావ‌య్య' త‌ర్వాత బాల‌య్య దాదాపు నంబ‌ర్‌వ‌న్ అయ్యారు. ఆయ‌న పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది. 'ఇప్పుడు మ‌నం బాల‌య్య‌తో సినిమా తీస్తే మ‌న‌కోసం ఆయ‌న పారితోషికం త‌గ్గించుకోవాలి. అలాంటి ప‌రిస్థితి మ‌న బాల‌య్య‌కు రాకూడ‌దు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మ‌నం చేరుకున్నాకే సినిమా తీద్దాం' అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మ‌ళ్లీ మా కాంబినేష‌న్‌లో సినిమాలు రాలేదు" అని ఆయ‌న చెప్పారు. త‌మ కాంబినేష‌న్‌లో మొద‌లై, ఆగిపోయిన జాన‌ప‌ద సినిమా గురించి కూడా కోడి రామ‌కృష్ణ తెలిపారు. "కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తుల కార‌ణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంత‌కుమించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్త‌యింది. రెడ్డిగారు బ‌తికుండే పూర్తి చేసేవాళ్లం" అని ఆయ‌న వెల్ల‌డించారు. ఏదేమైనా బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ‌, ఎస్‌. గోపాల్‌రెడ్డి కాంబినేష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ స‌క్సెస్ అయ్యిందనేది నిజం. కోడి రామ‌కృష్ణ 2019 ఫిబ్ర‌వ‌రి 22న‌ క‌న్నుమూయ‌గా, ఎస్‌. గోపాల్‌రెడ్డి అంత‌కంటే చాలా ముందుగా 2008లో మృతి చెందారు. (నేడు కోడి రామ‌కృష్ణ మూడో వ‌ర్ధంతి)

అల‌నాటి ముచ్చ‌ట‌.. జ‌య‌బాధురిని ఇంట‌ర్వ్యూ చేసిన చంద్ర‌క‌ళ‌!

  ఒక ప్రాంత ప్ర‌ముఖ‌తార‌, మ‌రో ప్రాంత ప్ర‌ముఖ న‌టిని క‌లుసుకొని, ఇంట‌ర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సంద‌ర్భాలు చాలా అరుదుగా సంభ‌విస్తుంటాయి. అలా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల ప‌ముఖ న‌టి చంద్ర‌క‌ళ‌, హిందీ సినిమాల పాపుల‌ర్ న‌టి జ‌య‌బాధురి (జ‌యా బ‌చ్చ‌న్‌) మీటింగ్ జ‌రిగింది. హిందీ సినిమా 'గాయ్ ఔర్ గౌరీ' షూటింగ్ నిమిత్తం అందులో హీరో హీరోయిన్లుగా న‌టించిన శ‌త్రుఘ్న సిన్హా, జ‌య‌బాధురి మ‌ద్రాస్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఒక‌ తెలుగు సినీ ప‌త్రిక జ‌య‌బాధురి, చంద్ర‌క‌ళ మీటింగ్‌ను ఏర్పాటుచేసింది. ప‌రిచ‌యాలు అయిన కొద్దిసేప‌టికే ఆ ఇద్ద‌రు తార‌లు ఒక‌రికొక‌రు బాగా స‌న్నిహిత‌మ‌య్యారు. సినిమాలు, అభిమానులు, విమ‌ర్శ‌లు, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌.. ఇలా అన్ని విష‌యాల‌ను గురించీ ఆ ఇద్ద‌రూ మ‌న‌సువిప్పి మాట్లాడుకున్నారు. "జ‌యాజీ.. నేను మీ అభిమానిని.. మీ మొద‌టి చిత్రం 'గుడ్డీ'తోనే నేను మీ ఫ్యాన్‌గా మారిపోయాను" అని చంద్ర‌క‌ళ చెప్పారు. ఆ త‌ర్వాత ఆమె అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌య‌బాధురి స‌మాధానాలిచ్చారు. బెంగాలీ త‌న మాతృభాష అనీ, స‌త్య‌జిత్ రే తీసిన బెంగాలీ సినిమా 'మ‌హాన‌గ‌ర్‌'లో న‌టించ‌డం ద్వారా న‌టిగా మారాన‌నీ ఆమె వెల్ల‌డించారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరి, ట్రైనింగ్ పూర్తి కాకుండానే 'గుడ్డీ' సినిమాలో హీరోయిన్‌గా డైరెక్ట‌ర్‌ హృషికేష్ ముఖ‌ర్జీ తొలి అవ‌కాశం ఇచ్చార‌నీ ఆమె చెప్పారు. Also read: చెల్లెలు చ‌నిపోయింద‌ని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుప‌ట్టిన హీరోయిన్‌! త‌న‌కు 'ఉప‌హార్‌లో' మీ న‌ట‌న మిగ‌తా అన్ని సినిమాల్లో న‌ట‌న కంటే త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చంద్ర‌క‌ళ అంటే, 'ఉప‌హార్‌'లో కంటే 'గుడ్డీ'లోనే తాను బాగా చేశాన‌ని అనుకుంటాన‌ని జ‌య‌బాధురి చెప్పారు. ఆ త‌ర్వాత ఆమె చంద్ర‌క‌ళ వివ‌రాలు చెప్ప‌మ‌ని అడిగారు. అప్పుడు తాను 'జేనుగూడు', 'ఒందే బ‌ల్లియ హొగ‌లు' అనే క‌న్న‌డ చిత్రాల్లో న‌టించ‌డం ద్వారా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ట్లు చంద్ర‌క‌ళ వెల్ల‌డించారు. 'ఒందే బ‌ల్లియ హొగ‌లు' సినిమా 'ఆడ‌ప‌డుచు' పేరుతో తెలుగులో రీమేక్ అయితే, అందులో న‌టించ‌డం ద్వారా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు తెలిపారు. Also read: ​ప్ర‌భాస్ 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు? మేక‌ప్ అంటే త‌న‌కు చాలా ఇబ్బందిగా ఉంటుంద‌నీ, మేక‌ప్ లేకుండా వాస్త‌వ ప్రపంచంలోనే ఉన్న‌ట్లు న‌టించ‌డ‌మే స‌రైన ప‌ద్ధ‌తి అనుకుంటాన‌ని జ‌య‌బాధురి అంటే, పాత్ర స్వ‌భావాన్ని బ‌ట్టి మేక‌ప్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త తీసుకోవాల‌ని చంద్ర‌క‌ళ అభిప్రాయ‌ప‌డ్డారు. అంతే కాదు, 'జ‌వానీ దీవానీ' సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో మీ మేక‌ప్ స‌రిగాలేద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశారు కూడా. ఈ ఇద్ద‌రు తార‌ల మ‌ధ్య స‌మావేశం జ‌రిగే నాటికి జ‌య‌బాధురి పెళ్లి కాలేదు. అయితే ఆ త‌ర్వాత ఐదు నెల‌ల‌కే 1973 జూన్ 3న అప్ప‌టి యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో జ‌య వివాహం జ‌రిగి ఆమె జ‌యా బ‌చ్చ‌న్‌గా మారిపోయారు.

ఆనాటి సంగతి: అప్పటి చిన్న శాస్త్రి ఇప్పటి కళాతపస్వి!

  ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'కలిసొచ్చిన అదృష్టం' (1968) చిత్రంలో సీనియర్ నటి శాంతకుమారిని ఓ పాత్ర కోసం బుక్ చేసినప్పుడు "మీకు కథ వినిపించడానికి మా డైరెక్టర్‌ను ఎప్పుడు పంపించమంటారు?" అనడిగారు నిర్మాత మిద్దే జగన్నాథరావు. "డైరెక్టర్ గారు మా ఇంటికి రావడమా? నేనే మీ ఆఫీసుకు వచ్చి కథ వింటాను" అన్నారు శాంతకుమారి. కంపెనీ కారులో ఆఫీసుకు వెళ్లిన ఆమెకు అక్కడ చిన్న శాస్త్రి అనే యువకుడు "రండమ్మా" అంటూ నవ్వుతూ స్వాగతం పలికాడు. అతడిని చిన్న శాస్త్రి అని పిలిచేవాళ్లు.  ఆ చిన్న శాస్త్రి వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్‌గా ఎప్పుడూ ఖాకీ యూనిఫాంలో కనిపించేవాడు. ఇప్పుడు కూడా అవే దుస్తుల్లో ఉన్నాడు. "నువ్విక్కడున్నావేమిటి చిన్న శాస్త్రీ?" అనడిగారు శాంతకుమారి. "ఈ పిక్చర్‌కు నేనేనమ్మా డైరెక్టర్‌ను" అన్నాడతను. "నీ ఇల్లు బంగారం కానూ! నువ్వెప్పుడు డైరెక్టర్‌వి అయ్యావు నాయనా!" అని ఆశ్చర్యపోయారు శాంతకుమారి. ఆ చిన్న శాస్త్రే డైరెక్టర్ కె. విశ్వనాథ్.  ఆయ‌న‌ కథ వినిపిస్తుంటే, తన పాత్ర కాస్త విచిత్రంగా కొత్త తరహాలో ఉన్నట్లనిపించింది ఆమెకు. "నేనెప్పుడూ ఏవో ఏడ్చే పాత్రలే చేశాను కానీ, వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే ఈ హాస్య పాత్రను చేయగలనా?" అన్నారామె. "మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? రామారావు గారు కూడా ఆ పాత్రకు మీరే కరెక్టుగా సూటవుతారని చెప్పారు" అన్నారు విశ్వనాథ్. ఆ కామెడీ పాత్రలో తనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని శాంతకుమారి భయపడ్డారు. కానీ 'కలిసొచ్చిన అదృష్టం' సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రను అంతా మెచ్చుకున్నారు. అలాగే 'చిన్ననాటి స్నేహితులు' (1971) చిత్రంలో కూడా విశ్వనాథ్ ఆమె చేత మరో కొత్త పాత్రను అందరి మెప్పూ పొందేలా చేయించారు.

చిన్న‌న‌టి మంజుభార్గ‌విని 'శంక‌రాభ‌ర‌ణం' హీరోయిన్‌గా కె. విశ్వ‌నాథ్ ఎలా తీసుకున్నారు?

  మంజుభార్గ‌వి సుప్ర‌సిద్ధ నాట్య‌కార‌ణి. కూచిపూడిలో వెంప‌టి చినస‌త్యం మాస్టారు ఆమె గురువు. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన క్లాసిక్ ఫిల్మ్ 'శంక‌రాభ‌ర‌ణం'లో హీరోయిన్ తుల‌సి పాత్ర మంజుభార్గ‌వి న‌ట జీవితంలో మైలురాయిగా, ఒక క‌లికితురాయిలా నిలిచిపోయింది. అయితే ఆ సినిమాకు ముందు ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు.. ఆమె మాట‌ల్లోనే చెప్పాలంటే పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. అలాంటి ఆమెకు ఏకంగా 'శంక‌రాభ‌ర‌ణం' లాంటి సినిమాలో నాయిక‌గా అవ‌కాశం రావ‌డం అంటే మాట‌లు కాదు. అదెలా సాధ్య‌మైంది?  విశ్వ‌నాథ్ ఆమెనే ఎందుకు తుల‌సి పాత్ర‌కు ఎంచుకున్నారు? చెన్నైలో ఒక‌సారి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వారు ఏదో ఒక ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. ఆ ఫంక్ష‌న్‌లో గీత‌, మంజుభార్గ‌వి, మ‌రో న‌టి.. ముగ్గురిని వాకిట్లో నిల్చొని వ‌చ్చిన అతిథులంద‌రి మీదా ప‌న్నీరు చ‌ల్లి, వారికి పూలు ఇవ్వమ‌ని చెప్పారు. ఆ వ‌చ్చిన అతిథుల్లో విశ్వ‌నాథ్ కూడా ఉన్నారు. అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' క‌థ మీద ప‌నిచేస్తున్న ఆయ‌న‌ మంజుభార్గ‌విని చూడ‌గానే ఆయ‌నకు తుల‌సి పాత్ర‌ధారిణి దొరికేసింద‌ని అనిపించింది. Also read: ​25 వేల కోసం 15 కిలోల వెండిని తాక‌ట్టు పెట్టిన డైరెక్ట‌ర్‌! అయితే ఆమె ఆ పాత్ర‌కు స‌రిపోతుందో, లేదో తెలియాలి క‌దా! అందుక‌ని 'శంకరాభ‌ర‌ణం' కంటే ముందు తీసిన 'ప్రెసిడెంట్ పేర‌మ్మ' మూవీలో మంజుభార్గ‌వి చేత ఓ జావ‌ళి చేయించారు. ఆ సినిమాలో నూత‌న్‌ప్ర‌సాద్‌, క‌విత హీరో హీరోయిన్లు. స్టేజి మీద ఎలా చేస్తారో అలా మేక‌ప్‌, కాస్ట్యూమ్స్‌, ఆభ‌ర‌ణాలు ధ‌రింప‌జేసి అలా మంజుభార్గ‌వి చేత‌ చేయించారు. అలాగే రెండు సీన్లు కూడా ఆమెకు పెట్టారు. బ‌హుశా ఆమె ప‌ర్ఫార్మెన్స్‌ను చూసేదానికేమో! డ‌బ్బింగ్ కూడా ఆమెచేతే చెప్పించారు. అంత‌దాకా ఆమె త‌ను చేసిన ఏ సినిమాకీ డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. కార‌ణం.. ఆమెది బేస్ వాయిస్‌! ద‌గ్గ‌రుండి మంజుభార్గ‌వి చేత డ‌బ్బింగ్ చెప్పించారు విశ్వ‌నాథ్‌. ఆ డ‌బ్బింగ్ అయిపోయాక "నీ ఫొటో ఒక‌టి కావాలి" అన్నారాయ‌న‌. Also read: ​సింగ‌ర్ రాజ్ సీతారామ్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ ఎందుకు ఎంక‌రేజ్ చేశారు? స‌రేన‌ని చెప్పి, బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ సంగ‌తి మ‌ర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు మంజుభార్గ‌వి. నెల రోజులు గ‌డిచాక 'శంక‌రాభ‌ర‌ణం' యూనిట్ నుంచి ఎవ‌రో వ‌చ్చి ఫొటో కావాల‌ని అడిగారు. అప్పుడు పాండీబ‌జార్‌లోకి కృష్ణా ఫొటో స్టూడియోకు వెళ్లి లాంగ్‌షాట్‌, క్లోజ‌ప్‌, ప్రొఫైల్ ఫొటోలు తీయించుకొని అవి ఇచ్చారు. ఆ త‌ర్వాత జె.వి. సోమ‌యాజులు, మంజుభార్గ‌వికి క‌లిపి మేక‌ప్ టెస్ట్ చేయించారు విశ్వ‌నాథ్‌. అప్పుడు తీసిన ఫొటోల‌ను ఇండ‌స్ట్రీలో ప‌లువురికి చూపించారు. అప్ప‌టికే కొన్ని సినిమాల్లో ఏవేవో రోల్స్ చేసిన మంజుభార్గ‌విని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు. అలా 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రంలో నాయిక‌గా అడుగుపెట్టారామె. ఆ సినిమా ఆమెకు ఎంత‌టి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమా వేషాల మీద కంటే త‌న మ‌న‌సుకు ఇష్ట‌మైన‌ డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా త‌క్కువ సినిమాలు చేశారు. (ఫిబ్ర‌వ‌రి 19 కె. విశ్వ‌నాథ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా...)

చెల్లెలు చ‌నిపోయింద‌ని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుప‌ట్టిన హీరోయిన్‌!

  న‌టి కె.ఆర్‌. విజ‌య కేర‌ళ న‌టో, లేదా త‌మిళ న‌టో అనుకుంటారు కానీ, అందులో సగం నిజ‌మే ఉంది. ఎందుకంటే ఆమె తండ్రి తెలుగాయ‌నే. ఆమె తండ్రి రామ‌చంద్ర‌న్‌ది చిత్తూరు. త‌ల్లి మ‌ల‌యాళీ. రామ‌చంద్ర‌న్ మిల‌ట‌రీలో ప‌నిచేసేవారు. ఒక స‌హోద్యోగితో కేర‌ళ వెళ్లిన‌ప్పుడు అక్క‌డ‌, అత‌ని చెల్లిని చూసి ఇష్ట‌ప‌డ్డారు. పెద్ద‌లు ఒప్పుకోవ‌డంతో వారి పెళ్లి జ‌రిగింది. కె.ఆర్‌. విజ‌య అస‌లు పేరు దైవ‌నాయ‌కి. ప‌ద‌కొండేళ్ల వ‌య‌సులోనే ఆమె స్టేజి నాట‌కాలు ఆడ్డం ప్రారంభించారు. 'క‌ర్ప‌గం' అనే త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై 'న‌వ్వుల రారాణి' అనే బిరుదు సంపాదించేశారు విజ‌య‌. ఏకంగా నంద‌మూరి తార‌క‌రామారావు స‌ర‌స‌న 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం'లో రుక్మిణిగా న‌టించడం ద్వారా తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టారు. అప్ప‌ట్నుంచీ ఆమె హీరోయిన్‌గా చాలా కాలం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. కాస్త వ‌య‌సు మ‌ళ్లాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారినా, దేవ‌త పాత్ర‌ల‌తో ఆమె ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా కొన‌సాగారు. అలాంటి ఆమె జీవితంలో చిన్న‌ప్పుడు జ‌రిగిన ఓ విషాద ఘ‌ట‌న ఆమెను ఇప్ప‌టికీ అమితంగా బాధ‌పెడుతూనే ఉంటుంది. చెల్లెలు చ‌నిపోయింద‌ని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుప‌ట్టిన ఘ‌ట్ట‌మ‌ది! అవును. ఇది సినిమా స‌న్నివేశం కాదు. నిజ జీవితంలో నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌! ఆ రోజు ఆమె చెల్లెలికి ఒంట్లో బాగాలేదు. అమ్మ‌కు కూడా అప్పుడు అనారోగ్య‌మే. చెల్లికి మందు తీసుకు రావ‌డం కోసం మూడు మైళ్ల దూరంలో ఉన్న డాక్ట‌ర్ ఇంటికి ప‌రిగెత్తుకుంటూ వెళ్లారు విజ‌య‌. రొప్పుతూ "ఒంట్లో బాగాలేదు" అని కంగారు కంగారుగా చెప్పారు. ఎవ‌రికి బాగాలేదో, ఎలా వివ‌రించాలో తెలీని చిన్న వ‌య‌సు ఆమెది. డాక్ట‌ర్ అశ్ర‌ద్ధ‌గా ఉంటూ ఆమె ఒంట్లో బాగా లేద‌ని చెప్పింది వాళ్ల‌మ్మ‌గారికి అనుకొని, "స‌రే.. నేనొచ్చి చూసుకుంటాలే" అన్నారు తేలిగ్గా. ఆల‌స్యంగా వ‌చ్చినా త‌న మందులు వేగంగా ప‌నిచేస్తాయ‌ని ఆయ‌న న‌మ్మ‌కం అయివుంటుంది. Also read: ప్ర‌కాశ్‌రాజ్ డైలాగ్ డెలీవ‌రీ చూసి బాల‌చంద‌ర్ ఏం చేశారంటే..! ఇంటికి వ‌చ్చారు విజ‌య‌. చెల్లెల్ని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. అమాయ‌కంగా క‌ళ్లు మూసుకొని ఉంది చెల్లెలు. పాలు ప‌డ‌దామ‌ని బుడ్డి తీసి ప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. చెల్లిలో ఏ క‌ద‌లికా లేక‌పోవ‌డంతో నిద్ర‌పోతోంది కాబోలు అనుకున్నారు. ఇంత‌లో పెద్ద‌వాళ్లు వ‌చ్చారు. విజ‌య పాలు ప‌ట్ట‌డ‌మూ, అవి చెల్లెలి నోట్లోంచి క్రింద‌ప‌డిపోతూ ఉండ‌టం చూశారు. ద‌గ్గ‌ర‌కొచ్చి చూసి గొల్లుమ‌న్నారు. అప్పుడే విజ‌య‌కు తెలిసింది.. చ‌నిపోయిన చెల్లెలికి పాలు ప‌డుతున్నాన‌ని! Also read: ​పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా? ఆరోజు త‌న చెల్లెలు తొడుక్కున్న చొక్కాను చాలా కాలం భ‌ద్రంగా దాచుకున్నారు విజ‌య‌. దానిని అప్పుడ‌ప్పుడూ చూసుకుంటూ అందులో త‌న చెల్లెల్ని ఊహించుకుంటూ వ‌చ్చారు. "ఆరోజు స‌మ‌యానికి వైద్య స‌హాయం ల‌భించివుంటే నా చెల్లెలు బ‌తికి ఉండేదేమో.. కానీ ఆ స్థోమ‌త అప్పుడు లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ పోయిన చెల్లెలు తిరిగిరాదు, రాలేదు." అని త‌న జ్ఞాప‌కాల‌లో రాసుకున్నారు కె.ఆర్‌. విజ‌య‌.

ఫొటో వెనుక క‌థ‌.. ముగ్గురు లెజెండ్స్ క‌లుసుకున్న వేళ‌..!

  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావు (కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ప్రేమ‌న‌గ‌ర్' చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. డి. రామానాయుడు నిర్మించ‌గా 1971 సెప్టెంబ‌ర్ 24న రిలీజైన ఈ సినిమా విడుద‌లైన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తుఫాను అల్ల‌క‌ల్లోలం సృష్టించింది. దాన్ని త‌ట్టుకొని 13 కేంద్రాల‌లో వంద రోజులు ఆడిన ఈ సినిమా రామానాయుడును మునుప‌టి క‌ష్టాల నుంచి, న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించింది. ఈ సినిమా విజ‌యోత్స‌వం 1972 జ‌న‌వ‌రి 10న మ‌ద్రాస్‌లో కోలాహ‌లంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు అప్ప‌టి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి క‌రుణానిధి, ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు ఎ.ఎల్‌. శ్రీ‌నివాసన్‌, న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్‌, త‌మిళ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ శివాజీ గ‌ణేశ‌న్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. Also read: ​విల‌న్‌గా భ‌య‌పెట్టి 50 ఏళ్ల వ‌య‌సులోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసిన త్యాగ‌రాజు! ఈ సంద‌ర్భంగా జాతీయ ర‌క్ష‌ణ నిధికి సురేశ్ మూవీస్ ఇచ్చిన రూ. 10 వేల‌ను క‌రుణానిధి అందుకున్నారు. ఇదే వేడుక‌లో విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత నాగిరెడ్డి ఇదివ‌ర‌కు తాను జాతీయ ర‌క్ష‌ణ‌నిధికి ఇచ్చిన 25 వేల రూపాయ‌ల‌కు అద‌నంగా మ‌రో 10 వేల రూపాయ‌లు అంద‌జేశారు. వాహిని స్టూడియో, ప్ర‌సాద్ ప్రాసెస్ సంస్థ‌లు, వాటి అనుబంధ సంస్థ‌ల సిబ్బంది క‌లిసి మ‌రో 10 వేల రూపాల‌య‌ను ర‌క్ష‌ణ నిధికి అంద‌జేశారు. వీటికి సంబంధించిన చెక్కుల‌ను క‌రుణానిధికి శివాజీ గ‌ణేశ‌న్ అంద‌జేశారు. త‌న‌కు అంద‌జేసిన షీల్డును జైహింద్ స‌త్యం వేలం వేయ‌గా, దాన్ని హిందీ న‌టుడు ప్రాణ్ రూ. 7 వేల‌కు కొన్నారు. దానికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి రూ. 8 వేల‌ను క‌రుణానిధి క‌లిపారు. ఈ మొత్తాన్ని ర‌క్ష‌ణ నిధికి స‌మ‌ర్పించారు. Also read: ​మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌! డి. రామానాయుడు స్వాగ‌తోప‌న్యాసం చేసిన ఈ కార్య‌క్రమాన్ని న‌వ‌యుగ ఫిలిమ్స్ ప్ర‌తినిధి కాట్ర‌గ‌డ్డ న‌ర‌స‌య్య నిర్వ‌హించారు. క‌రుణానిధి, నంద‌మూరి తార‌క‌రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, శివాజీ గ‌ణేశ‌న్‌, దాశ‌ర‌థి త‌దిత‌రులు మాట్లాడారు. 'ప్రేమ‌న‌గ‌ర్' సినిమా త‌మిళంలో శివాజీ గ‌ణేశ‌న్‌తో 'వ‌సంత మాళిగై' (1972) టైటిల్‌తో, హిందీలో రాజేశ్ ఖ‌న్నాతో 'ప్రేమ్‌న‌గ‌ర్' (1974) టైటిల్‌తో రీమేక్ అయ్యి, ఆ రెండు భాష‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది.

25 వేల కోసం 15 కిలోల వెండిని తాక‌ట్టు పెట్టిన డైరెక్ట‌ర్‌!

  శ్రీ‌ను వైట్ల‌, వి.వి. వినాయ‌క్‌, ర‌వికుమార్ చౌద‌రి లాంటి ద‌ర్శ‌కుల‌కు గురువుగా, స్టువ‌ర్ట్‌పురం దొంగ‌లు, ప‌బ్లిక్ రౌడీ, న‌క్ష‌త్ర పోరాటం, అమ్మ‌దొంగా, యాక్ష‌న్ నెం.1 లాంటి చిత్రాల ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాగ‌ర్ కెరీర్ మొద‌ట్లో చాలా ఇక్క‌ట్లు ప‌డ్డార‌నే విష‌యం చాలామందికి తెలీదు. 'రాకాసిలోయ' మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఆయ‌నకు రెండో సినిమా 'డాకు' క‌మ‌ర్షియ‌ల్ హిట్‌నిచ్చింది. అయితే మూడో సినిమా ఆయ‌న‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఆ సినిమా.. 'మావారి గోల‌'. ఈ సినిమాకు మొద‌లుపెట్టిన ప్రొడ్యూస‌ర్‌కు హిందీలో గోవిందా డేట్స్ దొర‌క‌డంతో, ఈ ప్రాజెక్టును వ‌దిలేసి, అక్క‌డ‌కు వెళ్లిపోయాడు.  ఆగిపోయిన సినిమా డైరెక్ట‌ర్ అంటారేమోన‌నే భ‌యంతో, త‌న సోద‌రుల స‌హ‌కారంతో ఆ నిర్మాత‌కు సెటిల్‌చేసి, త‌నే ఆ సినిమా నిర్మాణాన్ని టేక‌ప్ చేశారు సాగ‌ర్‌. న‌రేశ్‌, మ‌నోచిత్ర జంట‌గా ప్రారంభించి, దాదాపు 80 శాతం షూటింగ్ చేశాక సాగ‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు అయిపోయాయి. మిగిలిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేయ‌డానికి డ‌బ్బులేదు. అప్పుడు ఆయ‌న క‌న్ను త‌మ ఇంట్లోని బంగారం, వెండిమీద ప‌డింది. అది వాళ్ల‌కు త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయ సంప‌ద‌. 1870ల నాటి బంగ‌గారు నాణేలు, ఏడు వారాల న‌గ‌లు క‌లిపి ఒక‌టిన్న‌ర కేజీ బంగారాన్ని తీసుకువెళ్లి మార్వాడీ ద‌గ్గ‌ర కుదువ‌పెట్టారు. ఇంకోసారి సాంగ్స్ రికార్డింగ్‌కు డ‌బ్బులులేక 25 వేల రూపాయ‌ల కోసం 15 కిలోల వెండిని బ్యాగ్‌లో పెట్టుకొని, అలాగే తీసుకువెళ్లి మార్వాడీ కొట్లో తాక‌ట్టు పెట్టారు. ఎలాగో సినిమా పూర్తిచేశాక డిస్ట్రిబ్యూట‌ర్స్ దొర‌క‌లేదు. దాంతో 'మావారి గోల' చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేశారు సాగ‌ర్‌. మొద‌ట్లోనే ఫైనాన్షియ‌ల్ టెన్ష‌న్‌తో డైరెక్ష‌న్ మీద స‌రిగా దృష్టిపెట్ట‌లేక‌పోవ‌డంతో ఆ సినిమా స‌రిగా రాలేదు. అది ఫ్లాప్ అవుతుంద‌ని ఆయ‌న ముందుగానే గ్ర‌హించారు. అనుకున్న‌ట్లే ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆర్థికంగా షేక్ అయిపోయారు సాగ‌ర్‌. (ఫిబ్ర‌వ‌రి 17 సాగ‌ర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా...)

ప్ర‌కాశ్‌రాజ్ డైలాగ్ డెలీవ‌రీ చూసి బాల‌చంద‌ర్ ఏం చేశారంటే..!

  ప్ర‌కాశ్‌రాజ్ మొద‌ట్లో నాట‌కాలు ఆడారు. క‌న్న‌డంలో సీరియ‌ల్స్ చేశారు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలొస్తున్న రోజుల్లో ఒక ఆర్ట్ సినిమా చేశారు. ఆ సినిమాతో న‌టి గీత ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆమెకు ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న బాగా న‌చ్చి, "ఇంత టాలెంటుంది. ఒక‌సారి బాల‌చంద‌ర్‌గారిని క‌లిస్తే బాగుంటుంది క‌దా" అని స‌ల‌హా ఇచ్చారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఓ స్నేహితుడి పెళ్లిక‌ని చెన్నై వెళ్లారు. ఎలాగూ ఇక్క‌డికి వ‌చ్చాం క‌దా, బాల‌చంద‌ర్‌గారిని క‌లిస్తే పోతుంది క‌దా అనుకున్నారు. ప్ర‌య‌త్నిస్తే అపాయింట్‌మెంట్ దొరికింది. ఆయ‌న్ను క‌లిశారు ప్ర‌కాశ్‌రాజ్‌. నాట‌కాల గురించీ, సాహిత్యం గురించీ మాట్లాడారు బాల‌చంద‌ర్‌. మొద‌ట ప‌ది నిమిషాలు టైమిచ్చిన ఆయ‌న ఏకంగా రెండున్న‌ర గంట‌ల‌సేపు మాట్లాడారు. ఉన్న‌ట్లుండి త‌న అసిస్టెంట్‌ను పిలిచి, అత‌నితో "వీడి క‌ళ్లు చూడ‌య్యా, ఆ క‌ళ్ల‌ల్లో ఫైర్ చూడ‌య్యా" అని ప్ర‌కాశ్‌రాజ్ వైపు తిరిగి, "ఇన్నిరోజులూ ఎక్క‌డున్నావురా?" అని చిరాకుప‌డ్డారు. 'జాజిమ‌ల్లి' అనే సినిమా చేస్తున్నాన‌నీ, అందులో వేష‌మిస్తాన‌నీ చెప్పారు. స‌రేన‌న్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. రెండు మూడు రోజుల త‌ర్వాత "లేదురా, ఆ క్యారెక్ట‌ర్‌కు మ‌రొక‌ర్ని తీసుకున్నాను. నిన్ను మ‌ళ్లీ పిలుస్తాను" అని చెప్పారు బాల‌చంద‌ర్‌. స‌రేన‌ని బెంగ‌ళూరు వెళ్లిపోయారు ప్ర‌కాశ్‌రాజ్‌. అలా ఏడాదిన్న‌ర గ‌డిచిపోయింది. ఒక‌రోజు పొద్దున్నే బాల‌చంద‌ర్ నుంచి ఫోనొచ్చింది. "కెన్ ఐ స్పీక్ టు మిస్ట‌ర్ ప్ర‌కాశ్ రాయ్?" అని అడిగారు. అటెన్ష‌న్ అయిపోయి, "నేనే సార్" అన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. "ఏం లేదు, ఓ వేషం ఉంది. వ‌స్తావేమోన‌ని చేశాను" అన్నారాయన‌. "వ‌స్తాను సార్" అన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. ఆ మ‌ధ్యాహ్న‌మే బ‌య‌ల్దేరి చెన్నై వెళ్లారు. అలా బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో తొలిసారిగా 'డ్యూయెట్' సినిమాలో న‌టించారు ప్ర‌కాశ్‌రాజ్‌. వైజాగ్‌లో ఆయ‌న ఫ‌స్ట్ షాట్ తీశారు. శ‌ర‌త్‌బాబు ఇంట్లో మెట్ల మీద‌నుంచి కిందికి దిగుతూ, ప్ర‌కాశ్‌రాజ్‌ను చూసి "ఎవ‌ర్నువ్వు?" అన‌డుగుతారు. "నా గురించి నీకు తెలీదా, పెద్ద న‌టుడ్ని" అని డైలాగ్ చెప్పారు ప్ర‌కాశ్‌రాజ్‌. అయితే ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ చూసి, అప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న డైలాగ్ మార్చేశారు బాల‌చంద‌ర్‌. "గాలిలేని చోట కూడా నా పేరుంటుంది. నా పేరు శిర్పి" అని రాశారు. "ఏంటి సార్‌, స‌డ‌న్‌గా డైలాగ్ మార్చేశారు?" అని అడిగితే, భుజంత‌ట్టి, "ఇదేరా నీ ఫ్యూచ‌ర్" అన్నారు బాల‌చంద‌ర్‌. డ్యూయెట్ రిలీజ్‌కు ముందు ప్రివ్యూ రోజున ప్ర‌కాశ్‌రాజ్‌ను పిలిపించారు బాల‌చంద‌ర్‌. "ఏమ‌నుకుంటున్నావురా నీ గురించి.. సినిమా అంతా నువ్వేనా?" అన్నారు చిరాకుప‌డుతున్న‌ట్లు. విష‌య‌మేంటంటే మొద‌టిరోజు ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న న‌చ్చి దాదాపు ప‌దిహేను సీన్లు అద‌నంగా షూట్ చేశారు. వాటి గురించే ఆయ‌న మాట్లాడారు. అయితే, "ఏం లేదురా.. సినిమాలో నీ సీన్లు కొన్ని తీసేశాం" అని చెప్పారు. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఏడుపొచ్చినంత ప‌న‌యింది. 'సీన్లు క‌ట్ చేయ‌డం ఏంటి' అనుకున్నారు. అయినా త‌మాయించుకొని, "ఇట్సాల్ ఇన్ ద గేమ్ సార్" అన్నారు. వెంట‌నే ప్రకాశ్‌రాజ్‌ను కౌగ‌లించుకొని "ఇదిరా స్పిరిట్‌. సినిమా ముఖ్యం, మ‌నం కాదు" అన్నారు బాల‌చంద‌ర్‌. ప్రివ్యూ అయిపోయి, థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, "ఎలా ఉందిరా సినిమా?" అన‌డిగారు బాల‌చంద‌ర్‌. "ఇది చాలు సార్ నాకు, బ‌తికేస్తాను" అని జ‌వాబిచ్చారు ప్ర‌కాశ్‌రాజ్‌. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లో వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. బ్ర‌హ్మాండంగా బ‌తికేస్తూ వ‌స్తున్నారు.

అంద‌రికీ న‌వ్వులు పంచి, బ్ల‌డ్ కేన్స‌ర్‌తో స‌డ‌న్‌గా వెళ్లిపోయిన 'బ‌ట్ట‌ల స‌త్యం'!

  మ‌ల్లికార్జున‌రావు అనే పేరు కంటే 'బ‌ట్ట‌ల స‌త్తి' లేదా 'బ‌ట్ట‌ల స‌త్యం' అంటే ఎక్కువ‌మంది క‌నెక్ట‌యిపోతారు. అవును. వంశీ సినిమా 'లేడీస్ టైల‌ర్‌'లో చేసిన బ‌ట్ట‌ల స‌త్తి పాత్ర మ‌ల్లికార్జున‌రావుకు తెచ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు అలాంటివి. ల‌క్ష‌లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో న‌వ్వించిన మ‌ల్లికార్జున‌రావు 2008లో హ‌ఠాత్తుగా క‌న్నుమూసి, వారింద‌రి హృద‌యాల్నీ త‌డిచేశారు. 375 సినిమాల్లో ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేసి, అత్య‌ధిక పాత్ర‌ల‌తో మ‌న ముఖాల‌పై న‌వ్వులు పూయించిన ఆయ‌న‌, అనారోగ్యంతో హాస్పిట‌ల్ పాలైన మూడోరోజే మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పుడే ఆయ‌న ప్రాణాంత‌క లుకేమియా (బ్ల‌డ్ కేన్స‌ర్‌)తో బాధ‌ప‌డుతున్నార‌నే విష‌యం ప్ర‌పంచానికి తెలిసింది. త‌న‌కు ఆ వ్యాధి ఉంద‌నే విష‌యం అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఫ్యామిలీకి త‌ప్ప మ‌రెవ‌రికీ తెలీదు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో 1951 డిసెంబ‌ర్ 13న జ‌న్మించిన మ‌ల్లికార్జున‌రావుకు చ‌దువు అంత‌గా అబ్బ‌లేదు. నాట‌కాల మీద చిన్న‌ప్ప‌ట్నుంచీ ఇష్టం పెంచుకున్నారు. వంశీ సినిమా 'సితార' (1983)లో ఒక చిన్న పాత్ర చేశాక‌, సినీ న‌టుడిగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే 'లేడీస్ టైల‌ర్' (1985)లో బ‌ట్ట‌ల స‌త్తి పాత్ర చేసే అవ‌కాశం ద‌క్కింది. అప్ప‌ట్నుంచీ అంద‌రూ ఆయ‌న‌ను 'బ‌ట్ట‌ల స‌త్యం' అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. అంత‌లా ఆ క్యారెక్ట‌ర్ జ‌నాన్ని అల‌రించింది. రెండున్న‌ర ద‌శాబ్దాల సినిమా కెరీర్‌లో ఆయ‌న ఎంతోమంది స్నేహితుల్నీ, అభిమానుల్నీ సంపాదించుకున్న ఆ న‌టుడు ఒక్క శ‌త్రువునీ సంపాదించ‌లేక‌పోయారు. వ్య‌క్తిగా అదీ.. మ‌ల్లికార్జున‌రావు అంటే! తెర‌పై క‌మెడియ‌న్‌గా ఎన్ని ర‌కాల వేషాలు వేసినా, నిజ జీవితంలో మాత్రం ఎంతో హుందాగా ఆయ‌న మెలిగేవారు. వివాదాల‌కు, కోప‌తాపాల‌కు దూరంగా ఉండేవారు. Also read: మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌! మ‌ల్లికార్జున‌రావుకు బ్ల‌డ్ కేన్స‌ర్ అనే విష‌యం తెలియ‌గానే, సినిమావాళ్లంతా షాక్‌కు గుర‌య్యారు. స్నేహితులు కూడా త‌మ‌కు ఇంత‌దాకా ఆ విష‌యం తెలియ‌లేదే అని బాధ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు షుగ‌ర్ ఉంద‌నే విష‌యం మాత్రం చాలామందికి తెలుసు. అయినా త‌న‌కెలాంటి అనారోగ్యం లేద‌న్న‌ట్లే అంద‌రిలో మెస‌లేవారు. ఆయ‌న‌కు త‌న ఊరంటే ప్రేమ చాలా ఎక్కువ‌. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అన‌కాప‌ల్లికి వెళ్లి, బంధుమిత్రులతో గ‌డిపేవారు. హైద‌రాబాద్‌లో కొంత‌మంది పేద సినీ ఆర్టిస్టుల‌కు ఆయ‌న రెగ్యుల‌ర్‌గా సాయం చేస్తూ వ‌చ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసేట‌ప్పుడు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించారు. Also read: ర‌మేశ్‌బాబు, జుహీ చావ్లా జంట‌గా న‌టించార‌ని మీకు తెలుసా? తెర‌పై స‌ర‌దాగా క‌నిపించే మ‌ల్లికార్జున‌రావు నిజ జీవితంలో రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటార‌నే విష‌యం ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెల‌గిన‌వారికి తెలుసు. ఆయ‌న నోరు తెరిచి అడిగితే ఇంకెన్నో పాత్ర‌లు ఆయ‌న‌కు వ‌చ్చి ఉండేవి. కానీ ఆయ‌నెప్పుడూ ఏ నిర్మాత‌నీ, ద‌ర్శ‌కుడినీ త‌న‌కు వేషం కావాల‌ని అడ‌గ‌లేదు. "నేను సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది న‌న్ను నేను అమ్ముకోవ‌డానికి కాదు. నాలో విష‌యం ఉంద‌ని న‌మ్మిన‌వాళ్లు నాకు వేషం ఇస్తారు" అని ఆయ‌న అనేవారు. అలాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన న‌టుడైన మ‌ల్లికార్జున‌రావు అలియాస్ బ‌ట్ట‌ల స‌త్యం 57 సంవ‌త్స‌రాల వ‌య‌సుకే బ్ల‌డ్ కేన్స‌ర్ బారిన‌ప‌డి త‌న‌ను అభిమానించే వారంద‌రినీ బాధ‌పెడుతూ 2008 జూన్ 24న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. 

ల‌తా మంగేష్క‌ర్ వంద‌ల కోట్ల ఆస్తికి వార‌సులెవ‌రు?

  గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ క‌రోనా మ‌హ‌మ్మారితో హాస్పిట‌ల్ పాలై, 92 సంవ‌త్స‌రాల పండు వ‌య‌సులో ఫిబ్ర‌వ‌రి 6న‌ క‌న్నుమూసి, కోట్లాదిమంది అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేశారు. 1942లో గాయ‌నిగా కెరీర్‌లో ఆరంభించిన ల‌త‌, 'మ‌హ‌ల్' మూవీలో పాడిన "ఆయేగా ఆనే వాలా" పాట‌తో పాపులారిటీ ద‌క్కించుకున్నారు. ఎనిమిది ద‌శాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 భాష‌ల్లో 50 వేల‌కు మించి పాట‌లు పాడారు ల‌త‌. ఈ సంద‌ర్భంగా ఆమె ఎంతో సంప‌ద‌ను కూడ‌బెట్టారు. ఒక అంచ‌నా ప్ర‌కారం ల‌తా మంగేష్క‌ర్ నిక‌ర ఆస్తుల విలువ 50 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే, రూ. 368 కోట్లు! త‌ను పాడిన పాట‌ల‌కు సంబంధించిన రాయ‌ల్టీల ద్వారా, ఇత‌ర పెట్టుబ‌డుల ద్వారా ఆమెకు ఈ ఆస్తులు స‌మ‌కూడాయి. Also read: ​హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివ‌ర‌కు మ‌రొక‌రితో స‌హ‌జీవ‌నంలో ఉంది! తొలి పాట‌కు ఆమె అందుకున్న పారితోషికం రూ. 25. అలాంటి ఆమె చ‌నిపోయేనాటికి వంద‌ల కోట్లు విలువ చేసే ఆస్తుల‌కు య‌జ‌మాని అయ్యారు. మ‌ర‌ణించే నాటికి ఆమె నెల సంపాద‌న రూ. 40 ల‌క్ష‌లు పైనే. వార్షికాదాయం రూ. 5 కోట్లు. త‌న కెరీర్‌లో ఆమె శ్ర‌మించిన తీరుకు ఫ‌లిత‌మే ఈ సంపాద‌న‌. Also read: ​ఓటీటీలో రిలీజైతే క‌లెక్ష‌న్లు రావ‌నే అభిప్రాయాన్ని తుత్తునియ‌లు చేసిన 'పుష్ప‌' సౌత్ ముంబైలోని పెద్ద‌ర్ రోడ్‌లో ల‌త‌కు ప్ర‌భు కుంజ్ భ‌వ‌న్ అనే పేరుతో భ‌వ‌నం ఉంది. అక్క‌డే ఆమె నివాసం ఉన్నారు. ఆ భ‌వ‌నం కొన్ని కోట్ల రూపాయ‌ల విలువు చేస్తుందంటున్నారు. ఆమె ద‌గ్గ‌ర చెవ‌ర్లెట్‌, బూయిక్‌, క్రిస్ల‌ర్ కార్లున్నాయి. 'వీర్ జారా' పాట‌ను పాడాక‌, ఆమెకు డైరెక్ట‌ర్ య‌శ్ చోప్రా ఒక మెర్సిడెస్ బెంజ్‌ను బ‌హూక‌రించారు. క‌డ‌దాకా అవివాహిత‌గా జీవించారు ల‌త‌. ఈ నేప‌థ్యంలో, ఆమె కోట్లాది రూపాయ‌ల ఆస్తుల‌కు వార‌సులెవ‌రు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఆమెకు చెల్లెల్లు, త‌మ్ముడు ఉన్నారు. త‌మ్ముడు హృద‌య్‌నాథ్ మంగేష్క‌ర్‌కు ఆమె ఆస్తులు ద‌క్క‌నున్నాయ‌ని వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెల్ల‌డి కావాల్సి ఉంది.

విల‌న్‌గా భ‌య‌పెట్టి 50 ఏళ్ల వ‌య‌సులోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసిన త్యాగ‌రాజు!

  విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఉన్న‌త స్థాయిలో రాణించి, వాటిపై త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన న‌టుడు త్యాగ‌రాజు. సినీ రంగంలో అడుగుపెట్టి తొలి సినిమాలోనే మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావును ఢీకొట్టే విల‌న్ పాత్ర‌ను చేసి, మెప్పించారాయ‌న‌. 1964లో వ‌చ్చిన ఆ సినిమా 'మంచి మ‌నిషి'. ఆ త‌ర్వాత రెండున్న‌ర ద‌శాబ్దాల కెరీర్‌లో ఎన్నో సాంఘిక‌, జాన‌ప‌ద‌, పౌరాణిక‌, చారిత్ర‌క‌, కౌబాయ్ చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో గొప్ప‌గా రాణించి, వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించారు. త్యాగ‌రాజు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలో టి.ఆర్‌. నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించారు. ఈయ‌న‌ పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌లో చ‌దువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఒక‌వైపు స్టేజిపై న‌టిస్తూనే, మ‌రోవైపు క్రికెట్ ఆట‌గాడిగా రాణించారు. త‌న కాలేజీ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు కూడా. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ నాట‌కోత్స‌వాల్లో ఉస్మానియా యూనివ‌ర్సిటీ త‌ర‌పున ప్ర‌ద‌ర్శించిన 'ప‌గిలిన గోడ‌లు' నాట‌కానికి ప‌లు అవార్డులు ల‌భించాయి. ఉత్తమ నాటకం, ఉత్తమ స్క్రిప్టు, ఉత్తమ నటుడు బహుమతులతో పాటు త్యాగరాజు పోషించిన రిక్షావాడి పాత్రకు ఉత్తమ సహాయనటుడి బహుమతి వచ్చింది. నాటకాలపై ఉన్న ఆసక్తితో వరంగల్‌లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించారు త్యాగ‌రాజు. ఈ సంస్థ పక్షాన చాలా నాటకాలు వేశారు. సినిమాల్లో న‌టించాల‌నే కోరిక‌తో మద్రాసు వెళ్లి దర్శకుడు ప్రత్యగాత్మను కలిశారు. త్యాగ‌రాజును ఆయ‌న నిరుత్సాహ‌ప‌ర‌చ‌లేదు. తాను దర్శకత్వం వహించిన 'మంచి మనిషి' చిత్రంలో విలన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే గుత్తా రామినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'పల్నాటి యుద్ధం' (1966)లో వీరభద్రుడి వేషం, బి.ఎన్‌. రెడ్డి రూపొందించిన 'రంగుల రాట్నం' (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. అత్యంత దుర్మార్గుడైన‌ విలన్‌ వేషాలు వేయడంలో తనకు తానే సాటి రాగలడనే పేరు తెచ్చుకున్న త్యాగరాజు 'పాప కోసం', 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' వంటి చిత్రాల్లో సాత్విక పాత్ర‌లు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందారు కూడా. Also read: మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌! విల‌న్‌గా ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో గండికోట రహస్యం, కొరడా రాణి, మంచివాళ్ళకు మంచివాడు, చిక్కడు దొరకడు, మహా బలుడు, పంచ కళ్యాణి - దొంగల రాణి, జాతకరత్నం మిడతంబొట్లు, సీతా కళ్యాణం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్‌బాండ్‌ 777 వంటివి ఉన్నాయి. 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాలో కరడుగట్టిన బ్రిటీష్‌ పోలీసాఫీసర్‌ బాస్టన్‌ దొరగా త్యాగరాజు న‌ట‌న‌ను మ‌ర‌చిపోగ‌ల‌మా! Also read: ​పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా? 27 సంవ‌త్స‌రాల సినిమా కెరీర్‌లో ఏడాదికి స‌గ‌టున ప‌దికి మించిన చిత్రాలలో నటించిన త్యాగరాజు 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే అకాల మ‌ర‌ణం పొందారు. 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో ఉన్న తన సోదరుని ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న న‌టించ‌గా విడుద‌లైన చివ‌రి చిత్రం ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ప్రేమ‌ఖైదీ' (1991). తెలుగు సినీ చరిత్రలో విలక్షణ విలన్‌గా త్యాగరాజు స్థానం సుస్థిరం.

జ‌య‌ల‌లిత‌ను క‌న్న‌డ స్త్రీగా ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు!

  త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, ఒక‌ప్ప‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ దివంగ‌త జ‌య‌ల‌లిత ప్రాంతీయ‌త గురించి వాదాలు, వివాదాలు ఉన్నాయి. ఆమెను క‌న్న‌డ వ‌నిత‌గా చాలామంది భావిస్తుంటారు. ఆరోజు ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు బి.ఆర్‌. పంతులు మైసూరులోని ప్రీమియ‌ర్ స్టూడియోలో తీస్తున్న 'గంగా గౌరి' త‌మిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు జ‌య‌ల‌లిత‌. షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఉన్న‌ట్లుండి స్టూడియో బ‌య‌ట ఏదో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఎవ‌రో రెచ్చ‌గొట్టి త‌రిమిన‌ట్లుగా కొంత‌మంది స్టూడియో లోప‌లికి దూసుకువ‌చ్చి ఆమె ఉన్న ఫ్లోర్ ద‌గ్గ‌ర ఆమెతో మాట్లాడాల‌ని గొడ‌వ చేయ‌డం ప్రారంభించారు. "నేను త‌మిళ‌నాడుకు చెందిన‌దాన్ని కాదు, క‌ర్నాట‌క‌కు చెందిన దాన్ని" అని వాళ్ల‌తో చెప్పాల‌ట‌. అదీ వాళ్ల కోరిక‌! 'ఇదేమిటీ విప‌రీతం.. అస‌లిది ప్రాధాన్యం ఇవ్వ‌ద‌గ్గ విష‌య‌మేనా?  ప్రాధాన్య‌త సంగ‌తి ఎలా ఉన్నా, వాళ్ల మాట‌ల్లో ఎంత‌మాత్రం న్యాయం లేదు' అని ఆమెకు అనిపించింది. "ఎందుక‌లా చెప్పాలి?" అని ఆమె ప్ర‌శ్నించారు. "మీరు మైసూరులోనే క‌దా పుట్టారు?" అని వాళ్ల‌లో కొంద‌రు తీవ్ర‌మైన ధోర‌ణిలో అడిగారు. "అవును" అన్నారు జ‌య‌ల‌లిత‌. "ఐతే మీరు మైసూరుకు చెందిన‌వారే క‌దా.. 'నేను క‌న్న‌డ యువ‌తినే' అని మీరు అంగీక‌రించాలి" అని వార‌న్నారు. "అలా ఐతే.. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం మ‌న భార‌తీయులు ఎంతోమంది ఆఫ్రికా దేశాల‌కు వెళ్లి అక్క‌డే త‌మ నివాసాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. అక్క‌డ వాళ్ల‌కు సంతానం క‌లిగితే వాళ్ల‌ను ఆఫ్రికా వాళ్ల‌ని మ‌నం అన‌డం లేదే, భార‌తీయుల‌నే అంటున్నాం. అలాగే మా బంధువులు కొంద‌రు అమెరికాలో ఉన్నారు. వాళ్ల‌కు పుట్టిన పిల్ల‌ల‌ను అమెరిక‌న్స్ అని ఎలా అంటాం? అలాగే నేను మైసూరులో పుట్టాను కానీ మా తాత ముత్తాత‌లు అంతా త‌మిళ‌నాడులోని శ్రీ‌రంగానికి చెందిన‌వారు. అంచేత నేను త‌మిళ‌నాడుకు చెందిన‌దాన్నే" అని చెప్పారు జ‌య‌ల‌లిత‌. Also read: జ‌య‌ల‌లిత క్రికెట్ పిచ్చి క‌థ‌! ఆమె అభిమాన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా? ఆమె స‌మాధానం తృప్తి క‌లిగించిందో లేదో తెలియ‌దు కానీ వాళ్లు అక్క‌డ‌నుంచి వెళ్లిపోయారు. త‌మిళ‌నాడులోనూ ప‌లువురు జ‌య‌ల‌లిత కర్నాట‌క‌కు చెందిన‌వాళ్ల‌ని భావించే వాళ్లున్నారు. కానీ అది నిజం కాదు. ఏదో ఒక గుర్తింపుకు త‌ప్ప‌, ఈ ప్రాంతీయ భేదాల‌వీ అన‌వ‌స‌ర‌మ‌ని జ‌య‌ల‌లిత అభిప్రాయం. Also read: రావ‌ణుడిని హీరోగా ఎన్టీఆర్ ఎందుకు చూపించారు? నిజానికి ఆమె తాత ముత్తాత‌ల‌ది శ్రీ‌రంగ‌మే అయినా, ఆమె కుటుంబంలోని వారు కొన్ని కొన్ని శాఖ‌లుగా విడిపోయి, ఒక కుటుంబం వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులోనూ, ఇంకొక కుటుంబం వారు నెల్లూరులోనూ, మ‌రొక శాఖ‌వారూ మైసూరులోనూ స్థిర‌ప‌డ్డారు. జ‌య‌ల‌లిత అమ్మ సంధ్య తాత‌గారి ఊరు నెల్లూరు. అక్క‌డ వాళ్ల‌కు చాలా భూములూ అవీ ఉన్నాయి. అక్క‌డి ఊరి పెద్ద‌ల్లో ఆయ‌నా ఒక‌రిగా గౌర‌వానికి నోచుకున్నార‌ని జ‌య‌ల‌లిత త‌న బ‌యోగ్ర‌ఫీలో రాసుకున్నారు.

'య‌ముడికి మొగుడు'కు ఆధారం హాలీవుడ్ ఫిల్మ్ 'హెవెన్ కెన్ వెయిట్‌'!

  చిరంజీవి హీరోగా ర‌విరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన 'య‌ముడికి మొగుడు' (1988) ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. విజ‌య‌శాంతి, రాధ హీరోయిన్లుగా న‌టించిన ఆ సినిమాలో య‌మునిగా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. చిరంజీవి స్నేహితులు, న‌టులు జి.వి. నారాయ‌ణ‌రావు, సుధాక‌ర్‌, హ‌రిప్ర‌సాద్ ఆ సినిమాని నిర్మించారు. ఆ సినిమా స్క్రిప్టులో తాను కూడా పాలుపంచుకున్న‌ట్లు నారాయ‌ణ‌రావు వెల్ల‌డించారు. తెలుగువ‌న్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని కూడా పంచుకున్నారు. అది.. 'య‌ముడికి మొగుడు'కు ఆధారం హాలీవుడ్‌లో వ‌చ్చిన 'హెవెన్ కెన్ వెయిట్' (1978) అనే సినిమా అని! ఆ మూవీని వారెన్ బీట్టీ, బ‌క్ హెన్రీ సంయుక్తంగా డైరెక్ట్ చేయ‌గా, హీరోగా వారెన్ బీట్టీ న‌టించాడు. "య‌ముడికి మొగుడు క‌థ‌ను నేను, స‌త్యానంద్ క‌లిసి త‌యారుచేశాం. టైటిల్స్‌లో స‌త్యానంద్‌గారి పేరు వేసినా, స్క్రిప్టులో నేను కూడా ఇన్‌వాల్వ్ అయ్యాను. య‌మ‌లోకం పాయింట్‌ను చెప్పింది నాగ‌బాబు. 'హెవెన్ కెన్ వెయిట్' అనే ఇంగ్లీష్ పిక్చ‌ర్‌ను ఆయ‌న స‌జెస్ట్ చేశారు. అది బాగానే ఉంద‌నిపించి తీద్దామ‌నుకున్నాం." అని  నారాయ‌ణ‌రావు చెప్పారు. అలాంటి క‌థ‌లు ఆయ‌న బాగా రాస్తార‌నే ఉద్దేశంతో స్క్రిప్టు రాయ‌డానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు ద‌గ్గ‌ర‌కు వెళ్లామ‌ని తెలిపారు. "అయితే ఇప్ప‌టికే త‌ను ఆరుసార్లు అలాంటి క‌థ‌ల‌ను రాశాన‌నీ, ఆ స‌బ్జెక్టు బాగానే ఉంటుంద‌నీ ఆయ‌న‌ అన్నారు. ఆయ‌న‌తో క‌థాచ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ప్పుడు స‌త్యానంద్ ఓ పాయింట్ చెప్పారు. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఈ ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌నీ, ఒక‌ మ‌నిషి త‌న‌లాగే ఉన్న ఇంకో మ‌నిషిలోకి రావ‌డ‌మ‌నే పాయింట్ ఆయ‌న చెప్పారు. దాంతో స‌త్యానంద్ గారిని స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా తీసుకున్నాం. అలా ఆయ‌నే ఆ సినిమాకి రాశారు." అని చెప్పుకొచ్చారు నారాయ‌ణ‌రావు. ఆ సినిమాతో నిర్మాత‌లుగా ఆర్థికంగా తాము బాగా సెటిల్ అయ్యామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌!

  ఎనిమిదేళ్ల‌ క్రితం - "నాకు కేన్సర్. నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు" అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం ఆచరించి, మరి కొద్ది రోజుల్లో మరణం తప్పదని తెలిసినా, గుండె చిక్కబట్టుకొని, 'మనం' చిత్రంలో 'చైతన్య' అనే ముదుసలి పాత్రను అభినయించి, నవ్వుతూ వెళ్లిపోయిన అసాధారణ 'మనీషి'.. అక్కినేని నాగేశ్వరరావు. జ‌న‌వ‌రి 22 ఆయన వ‌ర్ధంతి. భౌతికంగా ఆయన మనకు దూరమై ఎనిమిదేళ్లు గ‌డిచినా, ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పడం లేదంటే.. అదీ ఆయన ముద్ర! తెలుగు సినీ గగనాన వెలసిన ధ్రువ నక్షత్రం.. ఏఎన్నార్!! తెలుగు సినిమాకు సంబంధించి 'ఎవర్‌గ్రీన్ హీరో' అనే మాటను అక్కినేనిని ఉద్దేశించే ఎవరైనా అనేవారు. తెరమీద ఆయన ముఖం అలా వెలిగింది. ఆ ముఖం అసంఖ్యాక ప్రజల్ని ఆకర్షించింది. ఎనభై ఏళ్లు దాటిన వయసులోనూ ఆయన కెమెరా ముందు పాతికేళ్ల కుర్ర హీరోలకు ఉత్సాహం కలిగించే విధంగా నటించారు. ఆయనను మామూలు నాగేశ్వరరావుగా రోజూ చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోయేవిధంగా తెరపై తన చలాకీతనాన్ని ప్రదర్శించారు. అంతకంటే ముందు తనకంటే వయసులో పాతిక, ముప్పై ఏళ్లు చిన్నవాళ్లయిన హీరోయిన్లు - జయసుధ, జయప్రద, శ్రీదేవి, రాధిక, రాధ, సుహాసిని వాంటి వాళ్లతో సమానంగా పరుగులు తీస్తూ, హుషారుగా డాన్సులేస్తూ నటించారు. అప్పుడాయన అరవై పదులు దాటిన మనిషంటే ఎవరూ నమ్మేవాళ్లు కాదు. అక్కినేని మన ఎవర్‌గ్రీన్ హీరో మాత్రమే కాదు, మన మొదటి గ్లామర్ హీరో కూడా. ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి దానికి పదమూడేళ్ల స్వల్ప చరిత్రే ఉంది. 1931లో తొలి టాకీ 'భక్త ప్రహ్లాద' వచ్చినదనుకుంటే.. ఇప్పుడు తెలుగు సినిమా వయసు 90 ఏళ్లు. అందులో 70 ఏళ్లు అక్కినేనివి. ఒక నటుడు 70 సంవత్సరాల పాటు తెరపై కనిపించడం ఏ రకంగా చూసినా అసాధారణం, అపురూపం, అరుదైన ఘనకార్యం. ఆయన టైటిల్ రోల్ చేసిన 'బాలరాజు' 1948లో విడుదలైంది. అంతకు ముందు మన సినిమా రంగంలో చిత్తూరు నాగయ్య లాంటి ప్రసిద్ధ నటులున్నారు కానీ, వారిలో ఎవరూ 'గ్లామరస్ హీరో' అనిపించుకోలేకపోయారు. మొదటిసారిగా సినిమా ఎలాగైనా ఉండనీ, నాగేశ్వరరావు కోసం దాన్ని చూడాలనిపించే విధంగా ఆ సినిమాతో ఆయన జనాన్ని మంత్రముగ్ధులను చేశారు. Also read: బ‌ర్త్‌డే స్పెష‌ల్ స్టోరీ: సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో టాప్ టెన్ హిట్స్‌! తెరపై కనిపించింత సేపు ఏఎన్నార్ జుట్టు ఎలా దువ్వుకున్నాడు, వేషం ఎలా వేసుకున్నాడు, మీసం ఎలా ఉంది, పక్కవాడితో మాట్లాడేప్పుడు తల ఎలా పక్కకి వంచుతాడు, ఎలా నడుస్తాడు, ఎలా డాన్సులేస్తాడు, ఎలా నవ్వుతాడు.. వంటి ప్రతి చిన్న వివరాన్నీ ప్రేక్షకులు శ్రద్ధగా గమనించి, జ్ఞాపకం పెట్టుకొని, మనం కూడా అలా ఉంటే, అలా చేస్తే ఎంత బావుంటుంది.. అనిపించిన తొలి హీరో అక్కినేని. Also read: "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి! నటుడిగా ఆయన చాలా త్వరగా ఎదిగారు. 1948 నాటి 'బాలరాజు'తో పోలిస్తే, 1953లో వచ్చిన 'దేవదాసు' నాటికే ఆయన నటనా వైదుష్యంలో ఉత్తుంగ శిఖరాలు అందుకున్నారు. ఎన్ని భాషల్లో, ఎన్ని దేవదాసు సినిమాలొచ్చినా అక్కినేనిలా ఎవరూ 'దేవదాసు' పాత్రని రక్తి కట్టించలేకపోయారు. "నటనకు ఇది పరాకాష్ఠ. ఇంతకంటే మళ్లీ నాగేశ్వర్రావైనా బాగా అభినయించలేడు" అని ప్రేక్షకులు అనుకునేటంత ఔన్నత్యాన్ని ఆయన 'దేవదాసు'లో అందుకున్నారు. కాని వారి అంచనాలను తలకిందులు చేస్తూ 'విప్రనారాయణ', 'మహాకవి కాళిదాసు', 'బాటసారి', 'ధర్మదాత', 'ప్రేమనగర్', 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం', 'సూత్రధారులు', 'సీతారామయ్యగారి మనవరాలు'.. ఇంకా మరెన్నో చిత్రాలలో ఆయన మరింత ఉన్నతిని సాధించారు. ఇక అందుకోవడానికి ఉన్నత శిఖరాలు లేవని ప్రేక్షకులు అనుకున్నప్పుడల్లా వాళ్లను ఆశ్చర్యపరుస్తూ కొత్తవాటిని సృష్టించారు. ఈ శిఖరాలలో 'సీతారామయ్యగారి మనవరాలు' ఒకటి అని ప్రేక్షక లోకం వేనోళ్ల ప్రశంసించింది. ఆయన తాను మామూలుగా నటించే ధోరణి సినిమాల నుంచి బయటకు వచ్చి 'సూత్రధారులు', 'సీతారామయ్యగారి మనవరాలు' వంటి సినిమాలు చెయ్యడం విశేషం. డెబ్బై ఎనిమిదేళ్ల‌ క్రితం - ఏఎన్నార్ చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటనను వృత్తిగా, తపస్సుగా స్వీకరించారు. అప్పట్లో ఆయన హాబీలేమిటో తెలియదు కానీ, ఆ తర్వాత నుంచి ఆయనకు రెండు హాబీలయ్యాయి. చివరి దాకా ఆ హాబీలు పోలేదు. ఒక హాబీ - శత దినోత్సవాలు చేసుకోబోయే చిత్రాల్లో తరచుగా నటించడం, రెండో హాబీ - ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి పురస్కారం, దాదాసాహెబ్ పురస్కారం నుంచి ప్రేక్షకులందించే పురస్కారాల వరకు సత్కార పరంపరను స్వీకరించడం. చివరగా తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నాగేశ్వరరావు 'మనం' అంటూ తెరపై మన ముందుకు వచ్చారు. కానీ అంతకు కొద్ది రోజుల ముందే తెరవెనుక నిష్క్రమించారు. 'ఏఎన్నార్ లివ్స్ ఆన్' అని ఆ సినిమాని ఆయనకు అంకితమిచ్చింది కుటుంబం. నిజమే. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నటికీ తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో జీవించే ఉంటారు. (నేడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా..) - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

జ‌య‌ల‌లిత క్రికెట్ పిచ్చి క‌థ‌! ఆమె అభిమాన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

  త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, ఒక‌ప్ప‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ దివంగ‌త జ‌య‌ల‌లిత మొట్ట‌మొద‌ట అభిమానించేది ఏమిటంటే.. క్రికెట్‌! అవును. ఆ ఆట అన్నా, అది ఆడేవాళ్ల‌న్నా ఆమెకు చిన్న‌ప్ప‌ట్నుంచీ ఎంతో ఇష్టం. ఆమె క్రికెట్ పిచ్చి చూసి, ఆమె త‌మ్ముడు అనేవాడు, "ఆ.. మీ ఆడ‌వాళ్లు ఈ ఆట‌లో ఇంట్రెస్ట్ చూప‌డ‌మేంటి? ఇది మ‌గ‌వాళ్లు ఆడే ఆట" అని. కొన్నాళ్ల త‌ర్వాత క్రికెట్‌కు సంబంధించిన ఒక పుస్త‌కం చ‌దువుతూ ఉంటే అప్పుడు జ‌య‌ల‌లిత‌కు తెలిసింది, త‌న త‌మ్ముడు ప‌ప్పులో కాలు వేశాడ‌ని! ఎంచేతంటే అస‌లు క్రికెట్ ఆట‌ను క‌నిపెట్టిందే ఆడ‌వాళ్ల‌ని ఆ పుస్త‌కంలో వివ‌రంగా రాశారు. సినిమాలు చూసి యాక్ట‌ర్ల‌ను అభిమానిస్తున్న‌ట్లుగా, ఆ రోజుల్లో క్రికెటర్లంటే జ‌య‌ల‌లిత‌కూ, ఆమె స్నేహితురాళ్ల‌కూ చాలా పిచ్చి ఉండేది. వాళ్ల పిన్ని విద్య‌కు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మ‌ద్రాసులో జ‌రిగే టెస్ట్ మ్యాచ్‌ల‌కు వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా వెళ్లేవారు. ఒక‌వేళ వీలుకాక‌పోతే మ్యాచ్‌కు సంబంధించిన ర‌న్నింగ్ కామెంట‌రీని వ‌దిలిపెట్టేవాళ్లు కాదు. Also read: ఎన్టీఆర్ న‌టించగా రూ. 4.5 ల‌క్ష‌ల‌తో త‌యారైన‌ టాలీవుడ్‌ ఫ‌స్ట్ స‌స్పెన్స్ ఫిల్మ్ ఇదే! మ్యాచ్ అయిపోయాక అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌ను అభిమానించే ఆట‌గాళ్ల వ‌ద్ద‌కు వెళ్లి వాళ్ల ఆటోగ్రాఫ్ తీసుకునేవారు జ‌య‌ల‌లిత‌. అప్ప‌ట్లో వాళ్లింటికి 'స్పోర్ట్ అండ్ పాస్ట్ టైమ్' అనే మ్యాగ‌జైన్ వ‌స్తుండేది. అది వ‌చ్చిన రెండో గంట‌లో అందులోని పేజీలు క‌త్తిరింపుల‌తో క‌నిపించేవి. ఒక‌వైపు ఎవ‌రిలా చేసింది అని ఇంట్లో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతూ ఉంటే, మ‌రోవైపు అప్ప‌టికే క‌త్తిరించి త‌న ఆల్బ‌మ్‌లో అంటించి పెట్టుకున్న ఆ క్రికెట‌ర్ల బొమ్మ‌ల‌ను చూసుకుంటూ ఉండేవారామె. అస‌లు సంగ‌తి తెలిశాక ఇంట్లోవాళ్లు చివాట్లు పెట్టేవారు. జ‌య‌ల‌లిత లెక్క‌చేసేవారు కాదు. ఆమె స్కూల్లో చ‌దువుకునేట‌ప్పుడు వాళ్ల క్రికెట్ పిచ్చి క‌నిపెట్టిన ఒక ఫొటోగ్రాఫ‌ర్ అప్పుడ‌ప్పుడు క్రికెట్ ప్లేయ‌ర్స్ ఫొటోలు ప‌ట్టుకొని జ‌య‌ల‌లిత బ్యాచ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాడు. ఎవ‌రికి ఏ ఆట‌గాడు ఇష్ట‌మైతే వాళ్లు ఆ ఫొటో అత‌ని ద‌గ్గ‌ర్నుంచి కొనుక్కునేవారు. ఒక్కో ఫొటోకు ఆ ఫొటోగ్రాఫ‌ర్ ఐదు రూపాయ‌లు వ‌సూలు చేసేవాడు. అన్న‌ట్లు.. జ‌య‌ల‌లిత ఎవ‌రి ఫొటో తీసుకొనేవారో తెలుసా? అప్ప‌టి ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ ఫొటో! Also read: ర‌మేశ్‌బాబు, జుహీ చావ్లా జంట‌గా న‌టించార‌ని మీకు తెలుసా? ఆ రోజుల్లో హిందీ హీరో రాజేశ్ ఖ‌న్నాను చూసి ఎంత‌మంది అమ్మాయిలు మోజుప‌డేవారో, జ‌య‌ల‌లిత బృందం టైగ‌ర్ ప‌టౌడీని అంత‌గా అభిమానించేవారు. స్కూల్స్‌లో 'ప‌టౌడీ ఫ్యాన్ క్ల‌బ్' అని ఉండేవి కూడా. ఇక ఆయ‌న‌ను ప్రేమించ‌డంలో ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. ఒక‌రోజున ప‌టౌడీ.. ప్ర‌ముఖ న‌టి ష‌ర్మిలా ఠాగూర్ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే! ఎవ‌రి ప్రేమ వాళ్ల ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉండిపోయింది. ఈ విష‌యాల‌ను త‌ను హీరోయిన్‌గా ఒక వెలుగుతూ ఉన్న కాలంలో ఒక ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో రాసుకొచ్చారు జ‌య‌ల‌లిత‌.