కృష్ణ, శ్రీదేవి కాంబో లాస్ట్ ఫిల్మ్ కి 35 ఏళ్ళు.. ఆ సినిమా ఏంటో తెలుసా!

సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగునాట తిరుగులేని కాంబినేషన్ ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మ్యాజిక్ చేశాయి. వాటిలో 'మహారాజశ్రీ మాయగాడు' ఒకటి. ఈ సినిమా.. కృష్ణ, శ్రీదేవి కాంబోలో లాస్ట్ ఫిల్మ్ కావడం విశేషం.  కన్నడ చిత్రం 'భాగ్యద లక్ష్మి బారమ్మ' (రాజ్ కుమార్, మాధవి) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్, ప్రసాద్ బాబు, హరి ప్రసాద్, ఈశ్వర రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, పద్మనాభం, వంకాయల, మహారథి, బాలయ్య, శుభలేఖ సుధాకర్, రాజ్ భరత్, జయమాలిని, రోహిణి, తాతినేని రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, శైలజ, దుర్గ, కళ్యాణి, అనిత, కోట శంకర్రావు, థమ్, విజయ దుర్గ, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.   కైకాల సత్యనారాయణ అతిథి పాత్రలో అలరించారు. సింగీతం శ్రీనివాసరావు కథను అందించిన ఈ సినిమాకి కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు. రాజ్ - కోటి బాణీలకు వేటూరి, భువనచంద్ర సాహిత్యమందించారు. "సత్యభామలా బుంగమూతి పెట్టి నాకు గాలమెయ్యకు", "బొమ్మనిపిస్తావ్ ఓ సారి", "ఆనంద ఆనంద", "చిటుకు లటుకు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.  1988 సెప్టెంబర్ 9న విడుదలైన 'మహారాజశ్రీ మాయగాడు'.. శనివారంతో 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.   

నయనది ఏం లెగ్ రా నాయనా.. అడుగు పెడితే అంతే!

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు కేరళ కుట్టి నయనతార. 20 ఏళ్ళ కెరీర్ లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ.. ఇలా అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించి కథానాయికగా తనదైన ముద్ర వేశారు ఈ స్టార్ బ్యూటీ. ఇక తాజాగా 'జవాన్'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ హిందీ ఫిల్మ్ తోనే అక్కడి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అలాగే, తన ఖాతాలో మరో మెమరబుల్ హిట్ ని క్రెడిట్ చేసుకుంది.  ఇదిలా ఉంటే, నయనతారకి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తను ఏ భాషలో తొలిసారిగా నటించినా.. ఆ సినిమా హిట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. 2003లో నయన్ నటించిన తొలి మలయాళ చిత్రం 'మనస్సినక్కరే' అఖండ విజయం సాధించింది. అలాగే 2005లో 'అయ్య'తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. సదరు సినిమా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. ఇక 2006లో 'లక్ష్మి'తో తెలుగులో తొలి అడుగేస్తే.. స్క్రీన్స్ అన్నీ షేక్ అయ్యాయి. అలాగే 2010లో 'సూపర్'తో కన్నడ సీమలో అడుగు పెడితే.. అది కూడా ఓ సెన్సేషనే. కట్ చేస్తే.. 2023లో అంటే ఈ ఏడాది 'జవాన్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. విడుదలైన ప్రతీ చోట ఈ బొమ్మ బాక్సాఫీస్ ని దున్నేస్తోంది. మొత్తమ్మీద.. నయన్ బోణి ఎక్కడ జరిగినా బాక్స్ బద్ధలవ్వాల్సిందే అన్నమాట. ఈ ట్రాక్ ని గమనించిన వారంతా.. "నయనది ఏం లెగ్ రా నాయనా.. అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టరే" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తెలుగులో మమ్ముట్టి నేరుగా నటించిన సినిమాలివే..

నటుడిగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టిది 52 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో 400కి పైగా సినిమాల్లో సందడి చేశారాయన. ప్రధానంగా మలయాళ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన మమ్ముట్టి.. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ తనదైన ముద్రవేశారు. 13 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 3 జాతీయ పురస్కారాలతో పాటు ఏడు కేరళ స్టేట్ అవార్డ్స్ సైతం తన కైవసం చేసుకున్నారు.   ఇక తెలుగులో మమ్ముట్టి నేరుగా నటించిన సినిమాల విషయానికి వస్తే.. కేవలం నాలుగు తెలుగు చిత్రాల్లో మాత్రమే ఆయన కనిపించారు. 1991లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతి కిరణం' మమ్ముట్టికి తెలుగులో ఫస్ట్ స్ట్రయిట్ మూవీ. ఇందులో అనంత రామశర్మ పాత్రలో జీవించేశారాయన. సంగీతభరితంగా సాగే ఈ సినిమాకి ఆయన అభినయం ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఇక ఐదేళ్ళకు పైగా విరామంతో 1996లో 'సూర్య పుత్రులు' సినిమా చేశారు మమ్ముట్టి.  సి. ఉమామహేశ్వరరావు రూపొందించిన ఈ సినిమాలో సుమన్, నగ్మా, శోభన ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆనక సుదీర్ఘ విరామం అనంతరం 2019లో 'యాత్ర' చేశారు. మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాత్రలో అలరించారు. ఇక రీసెంట్ గా వచ్చిన 'ఏజెంట్' మూవీ తెలుగులో మమ్ముట్టి నాలుగో చిత్రం. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో.. మమ్ముట్టి ఓ స్పెషల్ రోల్ చేశారు. మరి.. భవిష్యత్ లోనూ తెలుగునాట మమ్ముట్టి విభిన్న పాత్రలతో పలకరిస్తారేమో చూడాలి.  (సెప్టెంబర్ 7.. మమ్ముట్టి పుట్టినరోజు సందర్బంగా..)

భానుమతి 70 ఏళ్ళ క్రితం డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ.. ఏంటో తెలుసా!

తెలుగునాట 'బహుముఖ ప్రఙ్ఞాశాలి'గా గుర్తింపు పొందారు.. భానుమతి. నటీమణిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, గాయనీమణిగా, ఎడిటర్ గా, స్టూడియో ఓనర్ గా.. ఇలా చిత్ర పరిశ్రమలో పలు భూమికలు పోషించి 'అష్టావధాని'గా ప్రత్యేక గుర్తింపు పొందారు. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 70 ఏళ్ళ క్రితమే ఈ తరహా ప్రయత్నం చేశారు భానుమతి. తను ద్విపాత్రాభినయం చేస్తూ.. కథకురాలిగా, దర్శకురాలిగా 'చండీరాణి' పేరుతో ఓ సినిమా చేశారామె. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సమాంతరంగా తెరకెక్కి 1953 ఆగస్టు 28న ఈ మూవీ జనం ముందు నిలిచింది. నటరత్న నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన ఈ జానపద చిత్రం.. విజయపథంలో పయనించింది కూడా.  (సెప్టెంబర్ 7.. భానుమతి జయంతి సందర్భంగా..)

ఒకే రోజు రిలీజ్.. బాలయ్యకి బ్లాక్ బస్టర్.. శోభన్ బాబుకి నిరాశ.. కామన్ ఫ్యాక్టర్ అదే!

ఒకే రోజున రెండు ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ అవడం.. వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ కావడం.. మరొకటి నిరాశపరచడం.. చాలాకాలంగా చూస్తున్న వ్యవహారమే. సరిగ్గా 39 ఏళ్ళ క్రితం ఇదే సెప్టెంబర్ 7న వచ్చిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలోనూ అదే జరిగింది. నటభూషణ్ శోభన్ బాబు వర్సెస్ నటసింహం నందమూరి బాలక‌ృష్ణ అన్నట్లుగా సాగిన ఆ పోరులో.. బాలయ్యకి బ్లాక్ బస్టర్ దక్కితే, శోభన్ నిరాశపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన ఫ్యామిలీ డ్రామా 'అభిమన్యుడు'. ఇందులో శోభన్ కి జంటగా విజయశాంతి, రాధిక, సిల్క్ స్మిత నటించారు. యువచిత్ర కంబైన్స్ పతాకంపై కె. మురారి నిర్మించిన ఈ సినిమా 1984 సెప్టెంబర్ 7న రిలీజైంది. మ్యూజికల్ గా ఓకే అనిపించుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ పరంగా నిరాశపరిచింది. ఇక అదే రోజున కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించిన 'మంగమ్మ గారి మనవడు' కూడా జనం ముందు నిలిచింది. తమిళ్ చిత్రం 'మన్ వాసనై' ఆధారంగా భార్గవ్ ఆర్ట్స్ నిర్మించిన 'మంగమ్మ గారి మనవడు' పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు.. హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శితమై అప్పట్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అలాగే, సోలో హీరోగా బాలయ్యకి ఫస్ట్ హండ్రెండ్ డేస్, సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా నిలిచింది.  ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలతోనే తెరకెక్కాయి. "దంచవే మేనత్త కూతురా" సాంగ్ తో బాలయ్య సినిమా మాస్ ని మత్తెక్కిస్తే.. "ఆకేసి పప్పేసి" పాటతో క్లాస్ ఆడియన్స్ ని శోభన్ సినిమా పాటల పరంగా అలరించింది. 

'మైనరు బాబు'గా శోభన్ బాబు అలరించి 50 ఏళ్ళు.. ఛాలెంజ్ తో మనిషిగా ఎదిగే కుర్రాడి కథ!

నటభూషణ్ శోభన్ బాబు పేరు చెప్పగానే పలు కథాబలమున్న చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాంటి సినిమాల్లో 'మైనరు బాబు'ది ప్రత్యేక స్థానం. తండ్రి గారాబంతో, అంతులేని భోగభాగ్యాలతో 'మైనరు బాబు'గా  పిలవబడే రాము అనే ధనవంతుల బిడ్డ.. తండ్రి స్నేహితుడితో చేసిన ఛాలెంజ్ కారణంగా మనిషిగా ఎలా ఉన్నత స్థాయికి ఎదిగాడు అనేదే ఈ సినిమా. ఇందులో శోభన్ బాబుకి జంటగా కళాభినేత్రి వాణిశ్రీ నటించగా.. ఎస్వీఆర్, గుమ్మడి, అంజలీ దేవి, రాజబాబు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రమోహన్, మిక్కిలినేని, పొట్టి ప్రసాద్, కేవీ చలం, లీలా రాణి, రమణా రెడ్డి, హలం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. తాతినేని ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి.. ఆచార్య ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టి. చలపతి రావు బాణీలు కట్టిన 'మైనరు బాబు'కి శ్రీ శ్రీ, సి. నారాయణరెడ్డి, కొసరాజు, ఆత్రేయ సాహిత్యమందించారు. ఇందులోని "కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.." అంటూ సాగే గీతం విశేషాదరణ పొందగా.. "ఓ మనిషీ ఓహో మనిషీ", "అంగట్లో అన్నీ ఉన్నాయ్", "నేను నువ్వూ ఇలాగే ఉండిపోతే", "రమ్మంటే గమ్మునుంటాడందగాడు", "మనదే మనదేలే ఈ రోజు", "బేబీ బేబీ బేబీ నీ పేరేంటో చెప్పు బేబీ" అనే పాటలు కూడా రంజింపజేశాయి. 1973 సెప్టెంబర్ 7న విడుదలై ప్రజాదరణ పొందిన 'మైనరు బాబు'.. గురువారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.  

"గరం గరంపప్పు ఇది బరంపురం పప్పు".. ఈ పాట గల కృష్ణ సినిమాకి 50 ఏళ్ళు..!

అందమే జీవితమని కల కన్న ఓ అమ్మాయి.. ఓ ఘటన తరువాత జీవితమే కల అని అర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలో.. ఆమెకు అండగా నిలిచెందవరు? తిరిగి తన జీవితానికి పరిపూర్ణత తెచ్చిందెవరు? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా  'మమత'.  సూపర్ స్టార్ కృష్ణ సరసన కనువిందు చేసిన నాయికల్లో అందాల తార జమున ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ వచ్చాయి. ప్రేక్షకాదరణను సైతం చూరగొన్నాయి. అలా జనరంజకంగా నిలిచిన సినిమాల్లో 1973 నాటి 'మమత' ఒకటి. 'దేవుడు చేసిన మనుషులు' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కృష్ణ నుంచి వచ్చిన సినిమా ఇది. ఇందులో కృష్ణ, జమున వైద్యులుగా కనిపించడం విశేషం.  రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యనారాయణ, చంద్రమోహన్, పద్మశ్రీ నాగయ్య, మిక్కిలినేని, సాక్షి రంగారావు, సారథి, విజయలలిత, రమాప్రభ, హేమలత, రాధాకుమారి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి.. శాంతి పాత్రలో బాలనటిగా ఎంటర్టైన్ చేశారు. కేసీ శేఖర్ స్వయంగా కథను అందించి మరీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. పినిశెట్టి, అప్పలాచార్య సంభాషణలు సమకూర్చారు. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్ ప్లే సైతం సమకూర్చారు.  స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి ఆత్రేయ, అప్పలాచార్య సాహిత్యమందించారు. "మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపుని ఆపేదెవరు" (రెండు వెర్షన్స్), "గోవిందాహరి గోవిందా", "నిన్న దాకా నేను నేనే నువ్వూ నువ్వే.. నేటినుంచి నువ్వే నేను నేనే నువ్వు," "రారండమ్మా పేరంటాళ్ళు.. చూడండమ్మా పెళ్ళి సంబరాలు", "గరం గరం పప్పు ఇది బరంపురం పప్పు".. అంటూ మొదలయ్యే ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 1973 సెప్టెంబర్ 6న జనం ముందు నిలిచిన 'మమత'.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది. 

కృష్ణ 'నేనంటే నేనే'కి 55 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా!

    సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు వి. రామచంద్రరావు కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో 1968 నాటి 'నేనంటే నేనే' సినిమా ఒకటి. ఇందులో కృష్ణకి జంటగా అందాల తార కాంచన నటించింది. కృష్ణంరాజు, నాగభూషణం, చంద్రమోహన్, రావికొండలరావు, నెల్లూరు కాంతారావు, కేవీ చలం, సూర్యకాంతం, జూనియర్ శ్రీరంజని, రాధా కుమారి, మాస్టర్ బాబు, బేబీ శాంతికళ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. "ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావంటే.." అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోనిదే.  తమిళంలో విజయం సాధించిన 'నాన్' (రవిచంద్రన్, జయలలిత)కి రీమేక్ గా 'నేనంటే నేనే' రూపొందింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మసాలా సినిమా.. తమిళ వెర్షన్ తరహాలోనే కాసుల వర్షం కురిపించింది. ఎస్పీ కోదండపాణి సంగీతం, ఎస్. వెంకట రత్నం ఛాయాగ్రహణం.. 'నేనంటే నేనే'కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుజాత ఫిల్మ్స్ పతాకంపై పి.ఎన్. బాబ్జీ నిర్మించిన 'నేనంటే నేనే'.. 1968 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందు నిలిచింది. నేటితో ఈ జనరంజక చిత్రం 55 వసంతాలు పూర్తిచేసుకుంది.   

22 ఏళ్ళ 'నువ్వు నాకు నచ్చావ్'.. రిరిలీజ్ కి స్పెషల్ డేట్!?

తెలుగునాట కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. తను నటించిన ఫ్యామిలీ డ్రామాలెన్నో బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్'ది ప్రత్యేక స్థానం. 'నువ్వే కావాలి' వంటి ఘనవిజయం తరువాత దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన ఈ సినిమాకి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చారు. ఇందులో వెంకటేశ్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించింది. తనకిదే మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్, ఆశా షైనీ, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సుధ, హేమ, బేబి సుదీప, తనికెళ్ళ భరణి, సిజ్జు, శ్రీలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. శ్రీనివాస మూర్తి (ప్రకాశ్ రాజ్), శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రులు. మూర్తి కూతురు నందిని (ఆర్తి అగర్వాల్), శేఖరం కొడుకు వెంకటేశ్వర్లు (వెంకటేశ్). నిరుద్యోగి అయిన తన కొడుకుకి ఓ దారి చూపిస్తాడని వెంకీని మూర్తి ఇంటికి పంపిస్తాడు శేఖరం. అదే సమయంలో నందుకి నిశ్చితార్థం జరుగుతుంది. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వెంకీతో ప్రేమలో పడుతుంది నందు. వెంకీకి కూడా నందు అంటే ఇష్టమే అయినా.. పెద్దవారి స్నేహం తమ ప్రేమ వల్ల చెడకూడదు అని భావించి ఆమెకి దూరంగా ఉంటుంటాడు. చివరికి వీరి ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అన్నదే మిగిలిన సినిమా. సింపుల్ స్టోరీ లైనే అయినా.. ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు రచయిత, దర్శకులు. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం, సంగీతం, శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ విలువలు.. వెరసి 'నువ్వు నాకు నచ్చావ్' తెలుగునాట ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. 2001 సెప్టెంబర్ 6న జనం ముందు నిలిచిన 'నువ్వు నాకు నచ్చావ్'.. నేటితో 22 వసంతాలు పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రిరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో 'నువ్వు నాకు నచ్చావ్' రిరిలీజ్ పై ఆసక్తి నెలకొంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న 'నువ్వు నాకు నచ్చావ్'ని రిరిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. అదే గనుక నిజమైతే.. రిరిలీజ్ లోనూ ఈ క్లాసిక్ వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయమే.  

రామ్ చరణ్ డిజాస్టర్ కి పదేళ్ళు.. ఆ గాయం మరువలేనిదే

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మొదటి సినిమా 'చిరుత'(2007) తోనే బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేసిన చరణ్.. ఆపై రెండో చిత్రంగా వచ్చిన 'మగధీర'(2009)తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో 'రంగస్థలం'(2018), 'ఆర్ ఆర్ ఆర్' (2022)తో నటుడిగానూ భలేగా మెప్పించాడు. ఇదిలా ఉంటే, తన తండ్రి చిరంజీవి తరహాలోనే బాలీవుడ్ లోనూ నేరుగా అలరించే ప్రయత్నం చేశాడు రామ్ చరణ్.  1973 నాటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంచలన హిందీ చిత్రం 'జంజీర్'కి రీమేక్ గా రూపొందిన సదరు చిత్రమే 'జంజీర్'. తెలుగులో 'తుఫాన్'గా అనువాదమైన ఈ హిందీ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించగా.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ 2013 సెప్టెంబర్ 6న విడుదలైన 'జంజీర్' అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. చరణ్ పై విమర్శల వర్షం కురిపించింది. అంటే.. 'జంజీర్' అనే గాయం తెరపైకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్ళు అయిందన్నమాట.  ఏదేమైనా.. 'జంజీర్' చేసిన గాయాన్ని మరిపించేలా 'ఆర్ ఆర్ ఆర్' (2022)లోని రామరాజు పాత్రతో అక్కడి ప్రేక్షకులను తన అద్భుతాభినయంతో మెప్పించాడు చరణ్. నటుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. రాబోయే రోజుల్లో 'అంతకుమించి' అన్నట్లుగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతుండడం అభినందనీయ విషయమనే చెప్పాలి.  

బాలకృష్ణ వర్సెస్ బాలకృష్ణ.. 30 ఏళ్ళ క్రితం నటసింహం రేర్ రికార్డ్..

ఒక అగ్ర కథానాయకుడు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజవడమే అరుదైన సంగతి. అలాంటిది ఆ రెండు చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకోవడమంటే మాములు విషయం కాదు. ఇలాంటి రేర్ రికార్డ్ ని తన సొంతం చేసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆ వివరాల్లోకి వెళితే.. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన యాక్షన్ డ్రామా నిప్పురవ్వ. చాలా కాలం పాటు నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా.. 1993 సెప్టెంబర్ 3న జనం ముందు నిలిచింది. ఇక అదే రోజు.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడు కూడా అనూహ్య పరిస్థితుల్లో థియేటర్స్ బాట పట్టింది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హిట్ టాక్ తో బంగారు బుల్లోడు పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటే.. యావరేజ్ టాక్ తెచ్చుకున్న నిప్పురవ్వ కూడా వంద రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది.  ఇక నిప్పురవ్వ తనకు హిట్ పెయిర్ గా నిలిచిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ లో బాలయ్యకి చివరి చిత్రం కాగా.. బంగారు బుల్లోడు ఏమో రమ్యకృష్ణ, రవీనా టాండన్ కాంబోలో తొలి సినిమా.  బంగారు బుల్లోడుకి రాజ్ కోటి సంగీతమందిస్తే.. నిప్పురవ్వకి బప్పీలహరి, రాజ్ కోటి (రండి కదలిరండి పాట), ఎ.ఆర్. రెహమాన్ (నేపథ్య సంగీతం) మ్యూజిక్ డైరెక్టర్స్ గా పనిచేశారు. అలాగే నిప్పురవ్వని యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎం.వి. శ్రీనివాస ప్రసాద్ నిర్మిస్తే.. బంగారు బుల్లోడుని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఏదేమైనా.. సరిగ్గా 30 ఏళ్ళ కిందట బాలకృష్ణ క్రియేట్ చేసిన ఈ రేర్ రికార్డుని తరువాతి కాలంలో మరే తెలుగు హీరో శతదినోత్సవం కోణంలో బీట్ చేయకపోవడం విశేషం.

కృష్ణ వర్సెస్ శోభన్ బాబు, రాధ వర్సెస్ అంబిక.. జయసుధకి డబుల్ ధమాకా..

సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు పలు మల్టిస్టారర్స్ లో నటించి ఆకట్టుకున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడు ఒకే రోజు తమ సినిమాలతో బాక్సాఫీస్ ముంగిట పోటీపడ్డారు. అలా ఒకేసారి బరిలోకి దిగిన తేదీల్లో.. 1983 సెప్టెంబర్ 2 ఒకటి. అంటే.. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం నాటి ముచ్చట ఇది. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన శక్తి సినిమాతో 1983 సెప్టెంబర్ 2న కృష్ణ పలకరిస్తే.. గుత్తా రామినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమార్ మూవీతో శోభన్ బాబు అదే రోజు సందడి చేశారు. ఈ రెండు చిత్రాల్లో కూడా సహజ నటి జయసుధ ఓ హీరోయిన్ గా నటించడం విశేషం. అంతేకాదు.. శక్తిలో రాధ మరో నాయికగా కనిపిస్తే.. రాజకుమార్ లో రాధ అక్క అంబిక సెకండ్ హీరోయిన్ గా దర్శనమిచ్చింది. అంటే.. ఒకే రోజు అక్కాచెల్లెళ్ళు నటించిన సినిమాలు క్లాష్ అయ్యాయన్నమాట. ఇక కృష్ణ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన స్ట్రయిట్ మూవీ శక్తికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా.. కన్నడ చిత్రం చళిసువ మోడిగలుకి రీమేక్ గా రూపొందిన రాజకుమార్ కి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. వీటిలో శక్తి ఘనవిజయం సాధించగా.. రాజకుమార్ మ్యూజికల్ హిట్ గా మన్ననలు పొందింది.

కృష్ణంరాజుకి భార్యగా, కూతురిగా రాధ.. 35 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమా ఏంటో తెలుసా

తెలుగువారిని విశేషంగా అలరించిన కథానాయికల్లో రాధ ఒకరు. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే.. అడపాదడపా అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. కొన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయంతోనూ మురిపించారు. అలా.. రాధ తల్లీకూతుళ్ళుగా ఓ సినిమాలో నటించి మెప్పించారు. ఆ చిత్రమే.. కృష్ణంరాజు కథానాయకుడిగా నటించిన ప్రాణ స్నేహితులు. హిందీ సినిమా ఖుద్ గర్జ్ (జితేంద్ర, శత్రుఘ్న సిన్హా) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వి. మధుసూదన రావు తెరకెక్కించగా.. టైటిల్ రోల్స్ లో కృష్ణంరాజు, శరత్ బాబు కనిపించారు. ప్రాణస్నేహితులైన ఇద్దరు మిత్రులు కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారడం, తిరిగి ఒకటవడం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమానే.. తరువాతి రోజుల్లో కొండపల్లి రాజా (వెంకటేశ్, సుమన్, నగ్మా)గా తెరకెక్కడం విశేషం. ఇక ఈ సినిమాలో కృష్ణంరాజుకి భార్యగా, కూతురిగా రెండు విభిన్న పాత్రల్లో తన అభినయంతో ఆకట్టుకున్నారు రాధ. రాజ్ కోటి సంగీతమందించిన ఈ చిత్రంలో స్నేహానికన్న మిన్నా అంటూ సాగే పాట విశేషాదరణ పొందింది. 1988 సెప్టెంబర్ 2న విడుదలై విజయం సాధించిన ప్రాణ స్నేహితులు.. శనివారంతో 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.

కొత్త దర్శకులతో పవన్ మెమరబుల్ హిట్స్.. ఆ చిత్రాలేంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కొంతమంది నూతన దర్శకులకు అవకాశమిచ్చి ప్రోత్సహించారు. అంతేకాదు.. తనని తనే స్వయంగా డైరెక్ట్ కూడా చేసుకున్నారు. ఇలా.. డెబ్యూ డైరెక్టర్స్ తో పవన్ చేసిన కొన్ని ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం రాబట్టాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే.. 1. తొలిప్రేమ: ఒక కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రమిది. ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1998 జూలై 24న ఈ సినిమా రిలీజైంది. 2. తమ్ముడు: బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీతో.. పి.ఎ. అరుణ్ ప్రసాద్ కెప్టెన్ గా మొదటి అడుగేశారు. 1999 జూలై 15న ఈ సినిమా జనం ముందు నిలిచింది. 3. బద్రి: పవన్ కళ్యాణ్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రంతోనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. (సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా..)

డబుల్ హ్యాట్రిక్ హీరో పవన్.. ఆ ఆరు చిత్రాలివే

పవర్ స్టార్ గా తెలుగునాట జేజేలు అందుకున్నారు పవన్ కళ్యాణ్. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న పాత్రలతో ముందుకు సాగిన పవన్.. తన నట ప్రస్థానంలో పలు విజయాలు చూశారు. మరీముఖ్యంగా.. ఒక దశలో ఆరు వరుస విజయాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు పవర్ స్టార్. 1997లో వచ్చిన గోకులంలో సీత, 1998లో రిలీజైన సుస్వాగతం, తొలిప్రేమతో హ్యాట్రిక్ హీరోగా నిలిచిన పవన్.. ఆపై 1999లో విడుదలైన తమ్ముడు, 2000లో వచ్చిన బద్రి, 2001లో రిలీజైన ఖుషితో మరో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా..  తన తరంలో ఆరు వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు పవన్. కాగా, వీటిలో తొలిప్రేమ, తమ్ముడు మినహా మిగిలిన సినిమాలన్నీ రీమేక్స్ కావడం విశేషం.

టైగర్ హరికృష్ణ కెరీర్ లో టాప్ 10 మెమరబుల్ మూవీస్.. 

నటరత్న నందమూరి తారక రామారావు తొలి నటవారసుడు అనే ట్యాగ్ తో వెండితెరపై సందడి చేసిన నటుడు హరికృష్ణ. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. ఇటు బాలనటుడిగానూ, అటు కథానాయకుడు, సహాయనటుడిగానూ తనదైన ముద్రవేశారు హరి. అలాంటి హరికృష్ణ కెరీర్ లో టాప్ 10 మెమరబుల్ మూవీస్ ఏంటో చూద్దాం..  10. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్: మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో హరికృష్ణ.. టైటిల్ రోల్ లో అదరగొట్టారు. 2003లో వచ్చిన ఈ మూవీని వి. సముద్ర డైరెక్ట్ చేశారు. 9. శ్రీకృష్ణావతారం: హరికృష్ణ నటించిన మొదటి సినిమా ఇది. కమలాకర కామేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రంలో.. బాలకృష్ణుడి పాత్రలో కనిపించి అలరించారు హరి. 1967లో ఈ సినిమా జనం ముందు నిలిచింది. 8. శివరామరాజు: 2002లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. ఆనంద భూపతి రాజుగా అతిథి పాత్రలో మెరిశారు హరికృష్ణ. పాత్ర పరిధి తక్కువే అయినా.. సినిమా ఫలితంపై ప్రభావం చూపించారు హరి. ఈ చిత్రాన్ని వి. సముద్ర తెరకెక్కించారు. 7. తాతమ్మకల: తన తండ్రి ఎన్టీరామారావు స్వయంగా దర్శకత్వం వహించి మరీ నటించిన ఈ సినిమాలో వెంకటేశం పాత్రలో అలరించారు హరికృష్ణ. ఈ చిత్రం రిలీజ్ టైమ్ కి హరి.. టీనేజ్ లో ఉన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. 1974లో తాతమ్మకల జనం ముందు నిలిచింది.  6. తల్లా పెళ్ళామా: తన స్వీయదర్శకత్వంలో రూపొందించి మరీ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది. ఇందులో బాలనటుడిగా, కథకు ముఖ్యమైన వేషంలో ఆకట్టుకున్నారు హరికృష్ణ. 1970లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. 5. శ్రీరాములయ్య: 1998లో విడుదలైన ఈ సినిమాలో.. కామ్రేడ్ సత్యంగా అతిథి పాత్రలో దర్శనమిచ్చారు హరికృష్ణ. చిన్న వేషమే అయినా.. తన నటనతో శ్రీరాములయ్యకి ఓ ఎస్సెట్ గా నిలిచారాయన. మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన శ్రీరాములయ్యకి ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వం వహించారు. 4. సీతారామరాజు: అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ నాగార్జునకి అన్నగా అలరించారు హరికృష్ణ. సీతయ్య పాత్రలో హరి కనిపించగా.. రామరాజు వేషంలో నాగ్ దర్శనమిచ్చారు. వైవీఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం.. 1999లో జనం ముందు నిలిచింది.  3. లాహిరి లాహిరి లాహిరిలో: బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హరికృష్ణకి నంది పురస్కారాన్ని అందించిన చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కృష్ణమనాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు హరికృష్ణ. 2002లో రిలీజైన ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి తెరకెక్కించారు. 2. దాన వీర శూర కర్ణ: 1977 సంక్రాంతికి విడుదలై అఖండ విజయం సాధించిన సినిమా ఇది. ఇందులో అర్జునుడి పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు హరికృష్ణ. ఈ చిత్రాన్ని మహానటుడు ఎన్టీఆర్ డైరెక్ట్ చేయడమే కాకుండా.. కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు విభిన్న పాత్రలను పోషించారు. 1. సీతయ్య: సోలో హీరోగా హరికృష్ణకి అఖండ విజయాన్ని అందించిన చిత్రం సీతయ్య. టైటిల్ రోల్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా జీవించేశారాయన. అంతేకాదు.. పాటల్లో తన నృత్యాలతో రంజింపజేశారు. వైవీఎస్ చౌదరి రూపొందించిన ఈ కాప్ డ్రామా 2003లో రిలీజైంది.

పవన్ నటించిన రీమేక్ మూవీస్ ఇవే.. గెస్ట్ రోల్స్ తో సహా లిస్ట్ ఇదే

తెలుగునాట రీమేక్ మూవీస్ కి చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అతిథి పాత్రలతో కలుపుకుని మొత్తం 28 సినిమాల్లో నటించారు పవన్. విశేషమేమిటంటే.. వీటిలో 15 చిత్రాలు వేరే భాషల్లో తెరకెక్కిన సినిమాలకు రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం. ఇక పవన్ నటించిన రీమేక్ మూవీస్ విషయానికి వస్తే.. తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. హిందీ మూవీ ఖయామత్ సే ఖయామత్ కి రీమేక్. ఇక రెండో సినిమా గోకులంతో సీత.. తమిళ చిత్రం గోకులత్తిల్ సీతైకి రీమేక్. మూడో సినిమా సుస్వాగతం కూడా కోలీవుడ్ ఫిల్మ్ లవ్ టుడేకి రీమేక్. ఇక ఐదో చిత్రమైన తమ్ముడు.. హిందీ పిక్చర్ జో జీతా వోహీ సికందర్ కి తెలుగు వెర్షన్. అలాగే ఏడో సినిమా ఖుషి.. అదే పేరుతో తెరకెక్కిన తమిళ్ మూవీకి రీమేక్. అదేవిధంగా 13వ చిత్రమైన అన్నవరం కూడా కోలీవుడ్ సినిమా తిరుప్పాచ్చికి తెలుగు వెర్షన్. ఇక 17వ చిత్రమైన తీన్ మార్ ఏమో హిందీ పిక్చర్ లవ్ ఆజ్ కల్ కి, 19 సినిమా అయిన గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ ఫిల్మ్ దబాంగ్ కి రీమేక్స్.  అదేవిధంగా 22వ చిత్రం గోపాల గోపాల కూడా హిందీ మూవీ ఓ మై గాడ్ కి, 24వ సినిమా కాటమరాయుడు తమిళ చిత్రం వీరమ్ కి తెలుగు రూపాలు. అలాగే, 26వ చిత్రం వకీల్ సాబ్ బాలీవుడ్ పిక్చర్ పింక్ కి, 27వ సినిమా భీమ్లా నాయక్ ఏమో మాలీవుడ్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి, 28వ చిత్రం బ్రో ఏమో తమిళ సినిమా వినోదాయ సిత్తమ్ కి రీమేక్ వెర్షన్స్. వీటితో పాటు పవన్ అతిథి పాత్రలో మెరిసిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సంగతి తీసుకుంటే.. ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ సిరీస్ మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్ కి తెలుగు రీమేక్స్. కాగా, ఈ మొత్తం రీమేక్స్ లో తొమ్మిది సినిమాలు విజయపథంలో పయనించడం విశేషం. (సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా)

హరికృష్ణకి హ్యాట్రిక్ ఇచ్చిన దర్శకులు.. ఎవరో తెలుసా

నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు నందమూరి హరికృష్ణ.  తన కెరీర్ మొత్తమ్మీద 14 సినిమాల్లో నటించారు హరి. వాటిలో సింహభాగం మంచి విజయం సాధించడం విశేషం. అంటే.. హరికృష్ణ ఉంటే సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవడం పక్కా అన్నమాట. ఇదిలా ఉంటే, ఇద్దరు దర్శకులు హరికృష్ణతో ముచ్చటగా మూడేసి సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు ఇచ్చారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. ఎన్టీఆర్, వైవీఎస్ చౌదరి. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో హరికృష్ణ నటించిన తల్లా పెళ్ళామా(1970), తాతమ్మ కల(1974), దాన వీర శూర కర్ణ (1977) సక్సెస్ అయ్యాయి. వీటిలో దాన వీర శూర కర్ణ అయితే ఓ సంచలనమనే చెప్పాలి. ఇక వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. హరికృష్ణలోని నటుడ్ని సరిగ్గా వాడుకుని.. మూడు గుర్తుండిపోయే విజయాలు ఇచ్చారు. ఈ కాంబోలో తొలి ప్రయత్నమైన సీతారామరాజు (1999) చెప్పుకోదగ్గ విజయం సాధించగా.. రెండో చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో (2002) సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండింటిలోనూ హరికృష్ణ ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఇక మూడో చిత్రమైన సీతయ్య (2003) సంగతికి వస్తే.. సోలో హీరోగా హరికృష్ణకి బ్లాక్ బస్టర్ ని అందించిన మూవీ ఇది. మొత్తమ్మీద.. ఎన్టీఆర్, వైవీఎస్ చౌదరి కాంబోలో హరికృష్ణకి గుర్తుండిపోయే హ్యాట్రిక్స్ దక్కాయన్నమాట.

పవన్ 'బాక్సాఫీస్ పవర్' ఏంటో చూపించిన టాప్ 10 హిట్స్ ఇవే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, స్మైల్, యాక్టింగ్ అన్నింటికి మించి సింప్లిసిటీ.. పవన్ ని అప్పట్లో యూత్ ఐకాన్ గా నిలిపాయి. పాతికేళ్ళకి పైగా కెరీర్ లో ఇప్పటివరకు 28 సినిమాలతో సందడి చేశారు పవన్. వీటిలో సగానికిపైగా విజయపథంలో సాధించాయి. ఇక పవన్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ విషయానికి వస్తే.. 10. గోకులంలో సీత: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ హిట్ మూవీ గోకులంలో సీత.  టైటిల్ రోల్ లో రాశి నటించిన ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. 1997లో ఈ మూవీ రిలీజైంది.   9. భీమ్లా నాయక్: పవన్ ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసిన సినిమాల్లో భీమ్లా నాయక్ ది ప్రత్యేక స్థానం. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శక్తివంతమైన పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా కనిపించారు పవన్. 2022లో ఈ సినిమా విడుదలైంది.  8. జల్సా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా ఇది. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీలో సంజయ్ సాహుగా విభిన్న కోణాలున్న పాత్రలో మెప్పించారు పవర్ స్టార్. 2008లో ఈ చిత్రం జనం ముందు నిలిచింది.  7. అత్తారింటికి దారేది: పవన్ ని కుటుంబ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో లీకైనా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. 2013లో ఈ ఫ్యామిలీ డ్రామా తెరపైకి వచ్చింది.  6. గబ్బర్ సింగ్: 2012లో వచ్చిన గబ్బర్ సింగ్.. ఆ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన మూవీ. ఇందులో టైటిల్ రోల్ లో చెలరేగిపోయారు పవన్. ఈ కాప్ డ్రామాని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. 5. తమ్ముడు: నటుడిగా పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుబ్బు, సుభాష్ గా తన అద్భుతాభినయంతో ఆకట్టుకున్నారు పవన్. 1999లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజైంది. పి.ఎ. అరుణ్ ప్రసాద్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 4. బద్రి: నువ్వు నందవైతే.. నేను బద్రి బద్రినాథ్.. అంటూ సరికొత్త హీరోయిజాన్ని ఆవిష్కరించిన సినిమా బద్రి. పవన్ కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీగా నిలిచిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. 2000లో ఈ సినిమా రిలీజైంది.  3. సుస్వాగతం: కెరీర్ ఆరంభంలో పవన్ ని యువతకు చేరువ చేసిన సినిమా సుస్వాగతం. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో గణేశ్ అనే ప్రేమికుడు పాత్రలో జీవించేశారు పవన్. మరీముఖ్యంగా.. పతాక సన్నివేశాల్లో పవన్ నటన చూసి ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1998లో వచ్చిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాస రావు తెరకెక్కించారు.  2. తొలిప్రేమ: పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా చేసిన సినిమా తొలిప్రేమ. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇటు యువతరాన్ని, అటు కుటుంబ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఇందులో బాలు పాత్రలో ఎంతో సహజంగా నటించారు పవన్. 1998లో తెరపైకి వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీని ఎ. కరుణాకరన్ రూపొందించారు.  1. ఖుషి: ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఖుషిది ప్రత్యేక స్థానం. సరదా ప్రేమకథగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ సెన్సేషన్ లో బెంగాల్ టైగర్  సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ గా పవన్ విజృంభించారు. ఎస్.జె. సూర్య రూపొందించిన ఖుషి.. 2001లో థియేటర్స్ లోకి వచ్చింది.