డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాప్ 11 హిట్స్.. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి?

కమర్షియల్ సినిమాకి సరికొత్త మార్గం చూపించిన దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేసే నిర్దేశకుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అలాంటి పూరీ జగన్నాథ్ కెరీర్ లో టాప్ 11 హిట్స్ గా నిలిచిన మూవీస్ ఏంటో చూద్దాం.. 1. బద్రి: దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కిదే మొదటి సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం 2000 వేసవిలో రిలీజై ఘనవిజయం సాధించింది. పూరికి శుభారంభాన్నిచ్చింది. 2. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రమిది. 2001లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ స్టేటస్ ని చూసింది. 3. ఇడియట్: కన్నడంలో తను రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ అప్పుకి రీమేక్ గా.. ఇడియట్ ని తెరకెక్కించారు పూరి. రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమా 2002లో సందడి చేసింది. 4. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి: రవితేజతో పూరీ జగన్ హ్యాట్రిక్ మూవీ.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. 2003 వేసవిలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించింది.  5. శివమణి: కింగ్ నాగార్జునని సరికొత్తగా ఆవిష్కరించిన కాప్ డ్రామా ఇది. 2003లో తెరపైకి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 6. పోకిరి: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రం పోకిరి. కాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2006 సమ్మర్ లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వార్తల్లో నిలిచింది. 7. దేశముదురు: తెలుగుతెరకి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన సినిమా దేశముదురు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో పూరీ సక్సెస్ అయ్యారు. 2007 సంక్రాంతికి సందడి చేసిన దేశముదురు మంచి విజయం సాధించింది. 8. చిరుత: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్ తీర్చిదిద్దిన చిరుత.. 2007లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. 9. బిజినెస్ మేన్: పోకిరి తరువాత మహేశ్ తో పూరీ తీసిన సినిమా బిజినెస్ మేన్. 2012 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో యువతపై మంచి ప్రభావం చూపింది. కమర్షియల్ గానూ మెప్పించింది. 10. టెంపర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన కాప్ డ్రామా టెంపర్. 2015లో రిలీజైన ఈ సినిమా వాణిజ్యాత్మకంగానూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. 11. ఇస్మార్ట్ శంకర్: డబుల్ దిమాక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరీ తెరకెక్కించిన ఈ కాప్ డ్రామా.. 2019లో జనం ముందు నిలిచింది. (సెప్టెంబర్ 28.. పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్బంగా)

 గయ్యాళి అత్త సూర్యకాంతాన్ని రాళ్లతో కొట్టింది ఎవరు

తెలుగు సినిమా రంగాన్ని హీరోలు,హీరోయిన్ లు ,దర్శకులే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఏలగలరు అందులోను ఒక ఆడ క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా ఏలగలదని నిరూపించిన అలనాటి నటీమణి సూర్యకాంతం.ఆ రోజుల్లో సూర్యకాంతం అనే ఒక్క పేరు చాలు జనాన్ని థియేటర్స్ కి క్యూ కట్టించేలా చేసేది .క్యూ కట్టించడమే కాదు  జనం థియేటర్ నుంచి తమ ఇళ్ళకొచ్చాక కూడా తాను సినిమాలో పోషించిన క్యారక్టర్ ని  జనం కొన్ని రోజుల పాటు గుర్తుంచుకునేలా చేసింది. పైగా సినిమాలో సూర్యకాంతం పోషించిన క్యారెక్టర్ ని తిట్టుకుంటూనే జనం తమ రోజు వారి దిన చర్యని పూర్తిచేసే వాళ్ళంటే సూర్యకాంతం రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.సూర్యకాంతం అనే పేరున్న ఆడపిల్లలకి పెళ్లిళ్లు కూడా అయ్యేవి కావు. అసలు ఆ రోజుల్లో తమ ఇళ్లల్లోని ఆడపిల్లలకి తల్లి తండ్రులు సూర్యకాంతం అనే పేరునే పెట్టేవాళ్ళు కాదు.పొరపాటున అప్పటికే సూర్యకాంతం అనే పేరు తమ పిల్లలకి ఉన్న ఆ పేరుని మర్చి వేరేపేరు పెట్టేవాళ్ళు.అఫ్ కోర్స్ నేటికీ ఏ ఆడపిల్లలకి సూర్యకాంతం అనే పేరుని పెట్టలేదంటే సూర్యకాంతం నటనకి ఉన్న శక్తీ ఎంతటిదో  తెలుసుకోవచ్చు.మరి అంతటి నటీమణిని ఒక ఏరియాలో ని జనం రాళ్లు తీసుకొని కొట్టారనే విషయం ఎంతమందికి తెలుసు. అవి సూర్యకాంతం అప్రహతీతంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్న రోజులు. ఏ సినిమా రిలీజ్ అయినా అందులో సూర్యకాంతం ఉండవలసిందే .పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమా లో సూర్యకాంతం ఉంటే తమ  సినిమా కి హెల్ప్ అవుతుందని తద్వారా తాము కూడా ప్రేక్షకులకి దగ్గర అవుతామని భావించి ఆయా  చిత్ర నిర్మాతలతో సినిమాలో సూర్యకాంతం గారిని తీసుకోమని చెప్పే వాళ్ళు . కోడల్ని సూటిపోటిమాటలు అంటూ రాచి రంపాన పెట్టె పాత్రలో సూర్యకాంతం విజృభించి నటించేవాళ్ళు.అలాగే చాడీలు చెప్పి పచ్చని సంసారాలని విడగొట్టే పాత్రల్లో కూడా ఆవిడ వీరవిహారం చేసి నిజంగానే తాను అలా చేస్తుందనే భ్రమల్ని ప్రేక్షకులకి కలిగించే వాళ్ళు.ఒకసారి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సూర్యకాంతం అవుట్ డోర్ లో భాగంగా ఒక విలేజ్ కి వెళ్ళింది. ఆ మూవీ లో హీరో అక్కినేని నాగేశ్వరావు. పలనా గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న జనం తండో పతండాలుగా ఆ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న సూర్యకాంతాన్ని చూసి  ఒక్కసారిగా  కోపోద్రోక్తులయ్యి సూర్యకాంతాన్ని రాళ్లు తీసుకొని కొట్టారు. సూర్యకాంతంకి మాత్రం తనని ఎందుకు కొడుతున్నారో అర్ధం కాలేదు.అప్పుడు అక్కడే ఉన్న నాగేశ్వరరావు వాళ్ళని ఆపి ఎందుకు సూర్యకాంతాన్ని కొడుతున్నారని అడిగితే ఎంతో మంది ఆడవాళ్ళని ఏడిపించడమే కాకుండా ఎంతో మంది కాపురాలని కూల్చిందని చెప్పడం తో ఏఎన్ఆర్,సూర్యకాంతం ల తో సహా అక్కడున్న వాళ్లంతా షాక్ కి గురయ్యారు.ఆ తర్వాత అక్కినేని అక్కడున్న జనం తో సూర్యకాంతం కేవలం సినిమాలోనే తాను పోషించిన క్యారక్టర్ దృష్ట్యా అలా ప్రవర్తిస్తుందని నిజ జీవితం లో సూర్యకాంతం చాలా మంచిదని తన దగ్గరికొచ్చి ఎవరు ఏమి అడిగిన కాదనకుండా సహాయం చేస్తుందని అలాగే ఇంటి దగ్గర నుంచి రకాకల వంటకాలు వండుకొచ్చి యూనిట్ లోఉన్న అందరకి పెడుతుందని చెప్పటం తో జనం శాంతించి అక్కడనుంచి వెళ్లిపోయారు .అలాగే ఏఎన్ఆర్ ఆయన పక్కనే ఉన్న శాంత కుమారి గారిని చూపించి తాను సినిమాల్లో మాత్రమే తల్లి పాత్రలు వేస్తూ చాలా మంచిదానిలా కనపడుతుందని  నిజానికి శాంతకుమారి పరమ గయ్యాళి అని సరదాగా చెప్పాడు . జనం తనని రాళ్లతో కొట్టినందుకు సూర్యకాంతం వాళ్ళని ఏమి అనకుండా నేను పోషించిన పాత్రలో ఎంతగానో లీనమయ్యి నటించాను కాబట్టే జనం నన్ను రాళ్లతో కొట్టారని తన నటనకి ఉన్న శక్తీ ఎంతో అర్ధం అయ్యిందని చెప్పి సూర్యకాంతం ఆనందం తో కన్నీళ్ళు పెట్టుకుంది.

‘నల్లంచు తెల్ల చీర’ను వద్దన్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని హిమాలయ శిఖరాలకు చేర్చిన ఎన్నో సినిమాల్లో ఒక సినిమా దొంగమొగుడు.1987వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ అయిన దొంగమొగుడు మూవీలో మెగాస్టార్ పోషించిన డ్యూయల్ రోల్ కి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేడు.నేటికీ టీవీ ల్లో దొంగమొగుడు సినిమా వస్తుందంటే తమ పనులన్నీ ఆపి టీవీ ల ముందు అతుక్కొనిపోయి మరి చూస్తారు. ఆ రోజుల్లో ఆ సినిమాలో ఆయన చేసిన మాస్ అండ్ క్లాస్ యాక్షన్ ని చూడటానికి జనం థియేటర్ల ముందు బారులు తీరేవారు. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి చేసిన డాన్స్ ,ఫైట్స్,కామెడీ ని చూసి ఎంతో మంది చిరంజీవికి వీరాభిమానులుగా మారిపోయారు.మరి అంతటి సంచలనం సృష్టించిన దొంగమొగుడు మూవీకి చిత్ర బృందం మొదట అనుకున్న టైటిల్ వేరే అని ఎంతమందికి తెలుసు. అవి చిరంజీవి యంగ్ అండ్ డైనమిక్ హీరోగా ముందుకు దూసుకుపోతున్న రోజులు.ఒక్కో సినిమా తో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమా మీద తన ముద్ర ఉండేలా చిరంజీవి ముందుకు దూసుకుపోతున్న రోజులు.అప్పుడు రిలీజ్ అయ్యింది దొంగమొగుడు సినిమా. ఆ సినిమాలో స్టంట్ మాస్టర్ నాగరాజు అండ్ రవితేజ గా చిరంజీవి ఒక లెవెల్లో నటించాడు.అసలు డబ్బు కోసం ఏ పనైనా చేసే  స్టంట్ మాస్టర్ నాగరాజు క్యారక్టర్ లో నోట్లో బీడీ పెట్టుకొని మెడలో వయోలిన్ వేసుకొని చిరంజీవి పోషించిన క్యారక్టర్ ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. అలాగే భార్య నుంచి శత్రువుల నుంచి ఇబ్బదులు పడుతు వాళ్ళు చెప్పిందంతా చేసే రవితేజ టెక్స్ టైల్స్ కంపెనీ ఓనర్ రవితేజ క్యారెక్టర్ లో సెటిల్డ్ పెరఫార్మెన్సు ని ప్రదర్శించి అఖిలాంధ్ర ప్రజల చేత నీరాజనాలు అందుకున్నారు. స్టంట్ మాస్టర్ నాగరాజు క్యారక్టర్ లో హీరోయిన్ రాధిక తో చేసిన కామెడీ ఐతే సూపర్. అలాగే సినిమాలోని అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.చిరంజీవి చేసిన డాన్స్ కి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊగిపోయింది. దాదాపుగా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో శతదినోత్సవాన్నికూడా  జరుపుకుంది. అలాగే వీడియో క్యాసెట్స్ రాజ్యమేలుతున్న రోజుల్లో దొంగ మొగుడు సినిమా రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది దొంగ మొగుడు మూవీ క్యాసెట్ ని తెప్పించుకొని చూసేవారు. ఇంక అసలు విషయానికి వస్తే..కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన దొంగ మొగుడు మూవీని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నల్లంచు తెల్ల చీర అనే నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. దాంతో చిత్ర బృందం మొత్తం సినిమాకి నల్లంచు తెల్ల చీర అనే టైటిల్ నే పెట్టడానికి ఫిక్స్ అయ్యారు. కానీ చిరంజీవి మాత్రం సబ్జెక్టు చాలా మాస్ సబ్జెక్టు అని పైగా మాస్ క్యారక్టర్ అయిన స్టంట్ మాస్టర్ నాగరాజే కథ ని ఒక దారికి తీసుకొస్తాడు కాబట్టి మంచి మాస్ టైటిల్ ని పెడదాము అని అనడం తో చిత్ర బృందం అంతా చిరంజీవి నిర్ణయం తో ఏకీభవించింది. చివరికి చిరంజీవే దొంగ మొగుడు అని టైటిల్ ని పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ నల్లంచు తెల్ల చీర అనే పదం కుడా దొంగ మొగుడు సినిమా ఘన విజయం లో తన వంతు భూమిక ని పోషించింది.ఎలా అంటే నల్లంచు తెల్ల చీర అనే పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచి నేటికి చాల ఫంక్షన్స్ లో ,తిరునాళ్లలో మోత మోగిపోతూనే ఉంది.

బర్త్ డే మంత్ లో అట్లీ హిట్స్.. ఏంటో తెలుసా?

ఇటు కోలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు అట్లీ. సరిగ్గా పదేళ్ళ క్రితం కెప్టెన్ గా తొలి అడుగేసిన అట్లీ.. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాడు. వాటిలో నాలుగు తమిళ చిత్రాలుండగా.. ఒక హిందీ ఫిల్మ్ ఉంది. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి.  ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 21 అట్లీ పుట్టినరోజు. విశేషమేమిటంటే.. అట్లీ తొలి చిత్రమైన 'రాజా రాణి' 2013 సెప్టెంబర్ నెలలోనే జనం ముందు నిలిచింది. ఆర్య, నయనతార, నజ్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చింది. కట్ చేస్తే.. మళ్ళీ పదేళ్ళ అనంతరం అదే సెప్టెంబర్ నెలలో అట్లీ మొదటి హిందీ సినిమా 'జవాన్' రిలీజైంది. 2023 సెప్టెంబర్ 7న ఈ సినిమా తెరపైకి వచ్చింది. ఇందులో షారుక్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణె ముఖ్య పాత్రల్లో సందడి చేశారు. మొత్తమ్మీద.. బర్త్ డే మంత్ లో అట్లీకి 'రాజా రాణి', 'జవాన్' వంటి మెమరబుల్ హిట్స్ ఉన్నాయన్నమాట. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నయన్ నే హీరోయిన్. మరి.. మున్ముందు కూడా బర్త్ డే మంత్ లో అట్లీ ఘనవిజయాలు అందుకుంటాడేమో చూడాలి. (సెప్టెంబర్ 21.. అట్లీ బర్త్ డే సందర్భంగా)

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. టాప్ 10 క్లాసిక్స్

వైవిధ్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్దేశకుడిగా తనదైన ముద్రవేసిన సింగీతం.. తన కెరీర్ లో పలు విజయాలను చూశారు. అలాగే అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు.  అలాంటి సింగీతం కెరీర్ లో టాప్ 10 క్లాసిక్స్ ఏంటో చూద్దాం.. 1. పంతులమ్మ: నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం సొంతం చేసుకున్న మ్యూజికల్ హిట్ ఇది. రంగనాథ్, లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా 1978లో తెరపైకి వచ్చింది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ సాగే పాపులర్ గీతం ఇందులోనిదే. 2. సొమ్మొకడిది సోకొకడిది: లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సింగీతం రూపొందించిన తొలి చిత్రమిది. జయసుధ, రోజా రమణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1979లో సందడి చేసింది. అబ్బో నేరేడు పళ్ళు అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోదే. ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. 3. మయూరి: ఏకంగా 14 నంది పురస్కారాలు కైవసం చేసుకున్న క్లాసిక్ మూవీ ఇది. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో.. సుధా చంద్రన్ తన పాత్రను తనే స్వయంగా పోషించడం విశేషం. 1985లో రిలీజైన ఈ సంచలన చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఇటు నంది, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు సింగీతం.  4. పుష్పక విమానం: మాటల్లేకుండా సింగీతం రూపొందించిన బ్లాక్ కామెడీ మూవీ ఇది. కమల్ హాసన్, అమల జంటగా నటించిన ఈ సినిమా ఒక జాతీయ పురస్కారంతో పాటు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకుంది. 1987లో ఈ క్లాసిక్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పలు రకాల టైటిల్స్ తో  జనం ముందు నిలిచింది. 5. విచిత్ర సోదరులు: కమల్ హాసన్ త్రిపాత్రాభినయంలో సింగీతం తెరకెక్కించిన క్లాసిక్ ఇది. ఇందులో మరగుజ్జు పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. అపూర్వ సగోదరగళ్ పేరుతో ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగులో విచిత్ర సోదరులు పేరుతో అనువాదమై అలరించింది. 1989లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులను సైతం సొంతం చేసుకుందీ సినిమా. 6. మైఖేల్ మదన కామ రాజు: కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా రికార్డులకెక్కిన ఈ మూవీ.. అప్పట్లో ఓ సంచలనం. సింగీతం మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ క్లాసిక్ 1990లో రిలీజైంది. 7. ఆదిత్య 369: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఓ విభిన్న ప్రయత్నం. మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. 1991లో ఈ క్లాసిక్ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసింది. 8. బృందావనం: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన మ్యూజికల్ హిట్ ఇది. ఈ సినిమాకి గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు సింగీతం. 1992లో ఈ క్లాసిక్ విడుదలైంది. 9. మేడమ్: రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో భలేగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రెండు విభాగాల్లో నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. 1994లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. 10. భైరవ ద్వీపం: తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం సృష్టించిన జానపద చిత్రం.. భైరవద్వీపం. బాలకృష్ణ, రోజా జంటగా నటించిన ఈ క్లాసిక్.. అప్పట్లో విశేషాదరణ పొందింది. 1994లో ఈ జనరంజక చిత్రం సందడి చేసింది.  (సెప్టెంబర్ 21.. సింగీతం శ్రీనివాసరావు బర్త్ డే సందర్భంగా..)

నేషనల్, నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన ఏయన్నార్ మూవీ.. ఏంటో తెలుసా

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు సినిమాలు.. 'ఉత్తమ చిత్రం' విభాగంలో ఎంపికై పురస్కారాలు అందుకున్నాయి. వాటిలో సింహభాగం విజయం సాధించినవే.  ఇదిలా ఉంటే, ఏయన్నార్ కథానాయకుడిగా నటించిన ఓ సినిమా.. 'ఉత్తమ చిత్రం' కేటగిరిలో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ సొంతం చేసుకుంది.  ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ పురస్కారంతో పాటు రాష్ట్రప్రభుత్వం తరపున బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నంది అవార్డుని కైవసం చేసుకుంది . అలాగే ఫిల్మ్ ఫేర్ (సౌత్) పురస్కారం సైతం పొందింది.  ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. 'సుడి గుండాలు'. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి ఏయన్నార్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ఇది. జడ్జ్ చంద్రశేఖరంగా ఏయన్నార్ జీవించిన ఈ సినిమాకి ఆదుర్తి దర్శకత్వం వహించగా.. కళా తపస్వి కె. విశ్వనాథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. 1968 జూన్ 28న ఈ సినిమా జనం ముందు నిలిచింది. ఈ కల్ట్ క్లాసిక్ లో కింగ్ నాగార్జున బాలనటుడిగా కాసేపు దర్శనమివ్వడం మరో విశేషం.  (సెప్టెంబర్ 20.. అక్కినేని శతజయంతి సందర్భంగా)

ఏయన్నార్ ఖాతాలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. ఎన్నో తెలుసా!

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. తన కెరీర్ లో పలు పురస్కారాలు పొందారు. మరీ ముఖ్యంగా.. ప్రతిష్ఠాత్మక 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను వివిధ విభాగాల్లో ఆయన సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడుగా, ఉత్తమ నిర్మాతగా.. అలాగే లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ కేటగిరిలోనూ ఆయన అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. 1968లో విడుదలైన 'సుడిగుండాలు' కోసం ఆదుర్తి సుబ్బారావుతో కలిసి తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు అక్కినేని. అయితే, ఇది నిర్మాతగా దక్కిన పురస్కారం కావడం విశేషం. ఇక ఉత్తమ నటుడు విభాగంలో 'మరపురాని మనిషి' (1973), 'ఆత్మ బంధువులు' (1987), 'సీతారామయ్య గారి మనవరాలు' (1991) సినిమాలకి గానూ కైవసం చేసుకున్నారు. ఇక ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ విషయానికి వస్తే 1988 సంవత్సరంలో ఆయన ఈ పురస్కారాన్ని పొందారు.  (సెప్టెంబర్ 20.. ఏయన్నార్ శతజయంతి సందర్భంగా)

'పద్మ' పురస్కారాల్లో ఏయన్నార్ రేర్ రికార్డ్!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందారు. వాటిలో 'పద్మ' పురస్కారాలకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పద్మ పురస్కారాలను మూడు విభాగాల్లోనూ ఆయన కైవసం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. 1968లో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆ గౌరవం పొందిన 20 ఏళ్ళ తరువాత అంటే 1988లో 'పద్మభూషణ్'కి ఎంపికయ్యారు. కట్ చేస్తే.. 23 ఏళ్ళ అనంతరం అంటే 2011 సంవత్సరంలో 'పద్మవిభూషణ్' పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అంటే.. 'పద్మ' పురస్కారాలకు సంబంధించి మూడు వేర్వేరు విభాగాల్లోనూ (పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్) ఏయన్నార్ కి గౌరవం దక్కిందన్నమాట. ఒక రకంగా.. ఇది అరుదైన రికార్డు అనే చెప్పాలి.  (సెప్టెంబర్ 20.. ఏయన్నార్ శతజయంతి సందర్భంగా..)

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. టాప్ 10 ఆల్ టైమ్ క్లాసిక్స్!

తెలుగునాట తిరుగులేని కథానాయకుడిగా రాణించిన వైనం.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సొంతం. ఎలాంటి పాత్రకైనా జీవం పోసి.. మహానటుడు అనిపించుకున్నారాయన. 70 ఏళ్ళ అభినయపర్వంలో ఆయన ధరించని పాత్ర లేదు. పొందని పురస్కారం లేదు. చూడని విజయం లేదు. అలాంటి ఏయన్నార్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచిన 10 మెమరబుల్ మూవీస్ ఏంటో చూద్దాం..  1. బాలరాజు: జానపద చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు ఏయన్నార్. ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన ఈ చిత్రం.. తెలుగులో తొలి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ కావడం విశేషం. అంతేకాదు.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గానూ రికార్డులకెక్కింది బాలరాజు. 2. దేవదాసు: ఏయన్నార్ కెరీర్ లో మరపురాని చిత్రం దేవదాసు. టైటిల్ రోల్ లో తన అద్భుతాభినయంతో మెప్పించారు. అభిమానగణాన్ని మరింతగా పెంచుకున్నారు. వేదాంతం రాఘవయ్య రూపొందించిన ఈ క్లాసిక్.. అక్కినేని నటజీవితంలో ఓ మేలిమలుపు. 3. మాయాబజార్: తెలుగువారికి అత్యంత ఇష్టమైన చిత్రాల్లో మాయాబజార్ ఒకటి. హేమాహేమీలు కలిసి నటించిన ఈ సినిమాలో అభిమన్యుడుగా భలేగా ఆకట్టుకున్నారు ఏయన్నార్. ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులు కూడా ముఖ్య పాత్రల్లో అలరించారు.  4. సువర్ణ సుందరి: వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ జానపద చిత్రం.. అప్పట్లో అఖండ విజయం సాధించింది. ఇదే సినిమా హిందీ వెర్షన్ లోనూ తన అభినయంతో రంజింపజేశారు ఏయన్నార్.  5. గుండమ్మ కథ: తెలుగువారిని విశేషంగా అలరించిన సాంఘీక చిత్రాల్లో గుండమ్మ కథది ప్రత్యేక స్థానం. టైటిల్ రోల్ లో సూర్యకాంతం నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అక్కినేని. కమలాకర కామేశ్వరరావు ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దారు. 6. మూగ మనసులు: పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ క్లాసిక్.. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో గోపి పాత్రలో తన నటనతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు అక్కినేని. ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేశారు.  7. దసరా బుల్లోడు: వీబీ రాజేంద్ర ప్రసాద్ రూపొందించిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో.. టైటిల్ రోల్ లో మురిపించారు ఏయన్నార్. "పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల" పాటలో తన చిందులతో కనువిందు చేశారు. 8. ప్రేమ నగర్: ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన అక్కినేని నుంచి వచ్చిన అద్భుత ప్రణయగాథ.. ప్రేమ నగర్. సురేశ్ ప్రొడక్షన్స్ స్థాయిని పెంచిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ ని కె.యస్. ప్రకాశ రావు రూపొందించారు. 9. ప్రేమాభిషేకం: 527 రోజుల పాటు ప్రదర్శితమైన క్లాసిక్ లవ్ స్టోరీ.. ప్రేమాభిషేకం. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ విషాదాంత ప్రేమకథలో.. తనదైన అభినయంతో విశేషంగా అలరించారు అక్కినేని. ఈ సినిమాని దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించారు. 10. సీతారామయ్య గారి మనవరాలు:  తెలుగు ప్రజలను విశేషంగా అలరించిన కుటుంబ కథా చిత్రమిది. ఇందులో ఎలాంటి విగ్గు లేకుండా.. తాతయ్య పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నారు ఏయన్నార్. క్రాంతి కుమార్ తీర్చిదిద్దిన ఈ క్లాసిక్ లో సీతారామయ్యగా అక్కినేని అలరించగా.. మీనా టైటిల్ రోల్ లో ఆకట్టుకుంది.  (సెప్టెంబర్ 20.. నటసామ్రాట్ ఏయన్నార్ జయంతి సందర్భంగా)

ముసి ముసి నవ్వుల మీనా.. టాప్ 10 తెలుగు మూవీస్ 

అటు బాలనటిగా, ఇటు కథానాయికగా తెలుగునాట తనదైన అభినయంతో మెప్పించారు అందాల తార మీనా. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అగ్ర తారగా వెలుగొందిన మీనా.. హిందీలోనూ మెరిశారు. అలాంటి మీనా కెరీర్ లో టాప్ 10 తెలుగు సినిమాలేంటో చూద్దాం.. 1. సీతారామయ్య గారి మనవరాలు: కథానాయికగా మీనాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రమిది. క్రాంతికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సీతారామయ్య నటించగా, మనవరాలి పాత్రలో మీనా అలరించారు. మీనా కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా సీతారామయ్య గారి మనవరాలుకి ప్రత్యేక స్థానం ఉంది. 1991లో ఈ హిట్ మూవీ రిలీజైంది. 2. చంటి: మీనా కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ చంటి. ఇందులో విక్టరీ వెంకటేశ్ కి జంటగా కనువిందు చేశారు మీనా. 1992లో రిలీజైన ఈ మూవీకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. తెలుగునాట అపజయమెరుగని జంటగా నిలిచిన వెంకీ, మీనాకి ఇదే ఫస్ట్ కాంబో ఫిల్మ్. 3. అల్లరి మొగుడు: మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మీనా ఓ నాయికగా సందడి చేశారు. 1992లో జనం ముందు నిలిచిన ఈ జనరంజక చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  4. సుందరకాండ: చంటి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత వెంకీ, మీనా కాంబోలో వచ్చిన మూవీ సుందరకాండ. 1992లోనే రిలీజైన ఈ సక్సెస్ ఫుల్ మూవీకి  కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  5. ప్రెసిడెంటు గారి పెళ్ళాం: శివ తరువాత సరైన విజయం లేని కింగ్ నాగార్జునకి విజయాన్ని కట్టబెట్టిన సినిమా ప్రెసిడెంటు గారి పెళ్ళాం. 1992లో రిలీజైన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు మీనా. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.  6. అబ్బాయిగారు: వెంకీ, మీనా కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ.. అబ్బాయి గారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ లో.. మీనా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. 1993లో ఈ హిట్ మూవీ సందడి చేసింది.  7. బొబ్బిలి సింహం: మాయదారి పిల్లడా.. చేయి వేయకక్కడ.. అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణని మీనా కవ్వించిన చిత్రం బొబ్బిలి సింహం. 1994లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.  8. సూర్యవంశం: వెంకటేశ్ కి జోడీగా మీనా నటించిన నాలుగో సినిమా సూర్యవంశం. హ్యాట్రిక్ హిట్స్ తరువాత వెంకీ, మీనా కాంబోలో వచ్చిన ఈ మూవీ కూడా విజయపథంలో పయనించింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సెన్సేషనల్ మూవీ 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9. స్నేహం కోసం: మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది మీనా. 1999లో విడుదలైన ఈ హిట్ మూవీకి.. కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. 10. మా అన్నయ్య: రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. మీనా నటన ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2000లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. (సెప్టెంబర్ 16.. మీనా బర్త్ డే సందర్భంగా)

రమ్యకృష్ణ కెరీర్ లో టాప్ 10 పాత్రలివే.. ఇందులో మీ ఫేవరెట్ రోల్ ఏంటి?

ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. 40 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేస్తున్న రమ్య.. తన కెరీర్ లో పలు విభిన్న పాత్రలు ధరించారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన టాప్ 10 పాత్రలేంటో చూద్దాం.. 1. రేవతి: అల్లుడుగారు సినిమాలో రమ్య చేసిన మూగమ్మాయి పాత్ర ఇది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ లో తన హావభావాలతో ఆకట్టుకుంది. కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా కనిపించింది రమ్య. 2. మోహన: అల్లుడు గారు తరువాత మోహన్ బాబు, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రమ్య చేసిన సినిమా.. అల్లరి మొగుడు. ఇందులో మోహన పాత్రలో భలేగా అలరించింది. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది రమ్య. 3. లలిత: ఇది కూడా రాఘవేంద్రరావు డిజైన్ చేయించిన పాత్రనే. రాజశేఖర్ టైటిల్ రోల్ లో నటించిన అల్లరి ప్రియుడు కోసం పోషించిన ఈ పాత్ర.. రమ్యకృష్ణకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఇందులో స్నేహితురాలి కోసం ప్రేమనే త్యాగం చేసే అమ్మాయిగా జీవించేసింది రమ్య. 4. హేమ: మహానటుడు నందమూరి తారక రామారావు టైటిల్ రోల్ లో నటించిన మేజర్ చంద్రకాంత్ లో.. రమ్య పోషించిన హేమ పాత్ర కూడా కీలకమే. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబుతో ఆడిపాడింది. నీకావాల్సింది నా దగ్గరుంది అంటూ కవ్విస్తూనే.. విషాదాంతంగా ముగిసే పాత్రలో గుర్తుండిపోయింది రమ్య. 5. మంగ: రమ్యకృష్ణలోని కామెడీ కోణాన్ని భలేగా ఆవిష్కరించిన పాత్ర ఇది. నాగార్జున ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన హలో బ్రదర్ కోసం ఈ అల్లరల్లరి క్యారెక్టర్ చేసింది రమ్య. ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. 6. అమ్మోరు: అప్పటివరకు రమ్యలోని గ్లామర్ కోణాన్నే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు.. అమ్మోరులో పోషించిన టైటిల్ రోల్ బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో అమ్మోరుగా విశ్వరూపం ప్రదర్శించింది రమ్యకృష్ణ. 7. రాజేశ్వరి: ఆహ్వానం సినిమాలో రమ్యకృష్ణ చేసిన రాజేశ్వరి పాత్రని అంత సులువుగా మరచిపోలేం.  ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఆహ్వానంలో శ్రీకాంత్ కి జోడీగా కనిపించింది రమ్య.  8. తిమ్మక్క: తెలుగువారికి ఎంతో ఇష్టమైన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. ఇందులో అన్నమయ్య భార్యల్లో ఒకరైన తిమ్మక్క పాత్రలో కనిపించింది రమ్య. సినిమాలో ఉన్నంతసేపు తన మార్క్ అభినయంతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాకి కూడా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  9. నీలాంబరి: రమ్యకృష్ణ కెరీర్ బెస్ట్ రోల్స్ లో నీలాంబరిదే అగ్ర స్థానం. తమిళ చిత్రం పడయప్పాలో పోషించిన ఈ పాత్ర రమ్యకృష్ణకి నటిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ధీటుగా రాణించి అప్పట్లో సంచలనం సృష్టించింది. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. తెలుగులో నరసింహగా అనువాదమై ఇక్కడా అఖండ విజయం సాధించింది. 10. శివగామి: రమ్యకృష్ణకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన పాత్ర ఇది. బాహుబలి సిరీస్ లో పోషించిన ఈ రాజమాత పాత్ర.. రమ్యకృష్ణ కోసం మరిన్ని పవర్ ఫుల్ రోల్స్ డిజైన్ చేసుకోవడానికి దోహదపడింది.  (సెప్టెంబర్ 15.. రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా..)

వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్..  టాప్ 10 మూవీస్ ఇవే!!

భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచే ఈ తరహా సినిమాలతో పరిశ్రమ దృష్టిని విశేషంగా అలరించారాయన. అశ్వనీదత్ బర్త్ డే సందర్భంగా.. బాక్సాఫీస్ ని షేక్ చేసిన వైజయంతీ మూవీస్ వారి టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.. 1. ఎదురులేని మనిషి: నటరత్న నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కె. బాపయ్య రూపొందించిన ఈ సినిమాతోనే సి. అశ్వనీదత్ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. 1975లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.  2. అడవి సింహాలు: సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్ లో కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన సినిమా ఇది. 1983లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ చూసింది.  3. అగ్ని పర్వతం: సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. 1985 సంక్రాంతికి సందడి చేసిన ఈ మూవీని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీర్చిదిద్దారు. 4. ఆఖరి పోరాటం: 1988 హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఆఖరి పోరాటం ఒకటి. కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. 5. జగదేక వీరుడు అతిలోక సుందరి: మెగాస్టార్ చిరంజీవి, ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి టైటిల్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. 1990 వేసవిలో విడుదలై సంచలన విజయం సాధించిందీ సినిమా.  6. చూడాలని వుంది: మెగాస్టార్ చిరంజీవి, అభినేత్రి సౌందర్య కాంబినేషన్ లో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా.. 1998 సంవత్సరంలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 7. రాజకుమారుడు: సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమిది. కె. రాఘవేంద్రరావు తీర్చిదిద్దిన ఈ మూవీ.. 1999లో జనం ముందు నిలిచింది. ఇందులో మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. 8. ఆజాద్: నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు. 2000లో వచ్చిన ఈ చిత్రం.. మంచి విజయం సాధించింది.  9. ఇంద్ర: చిరంజీవి కాంబినేషన్ లో సి. అశ్వనీదత్ హ్యాట్రిక్ మూవీ 'ఇంద్ర'. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. 10. చిరుత: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ సి. అశ్వనీదత్ నిర్మించిన సినిమా ఇది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట ఘనవిజయం సాధించింది.  వీటితో పాటు వైజయంతీ మూవీస్ సమర్పణలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1', 'మహానటి', 'సీతారామం' కూడా అఖండ విజయం సాధించాయి. అలాగే సి. అశ్వనీదత్ సహ నిర్మాణంలో వచ్చిన 'శుభలగ్నం', 'పెళ్ళి సందడి', 'పెళ్ళాం ఊరెళితే', 'గంగోత్రి', 'మహర్షి' కూడా వసూళ్ళ వర్షం కురిపించాయి.   (సెప్టెంబర్ 15.. సి. అశ్వనీదత్ పుట్టినరోజు సందర్భంగా)

"అయ్యో అయ్యో అయ్యయ్యో".. అప్పుడే 33 ఏళ్ళయిందా!?

విక్టరీ వెంకటేశ్ నటజీవితంలో పలు ఘనవిజయాలు ఉన్నాయి. వాటిలో 'బొబ్బిలి రాజా'ది ప్రత్యేక స్థానం. వెంకీ కెరీర్ లో ఇదే తొలి సిల్వర్ జూబ్లీ హిట్ కావడమే అందుకు ఓ కారణం. ఇక.. "అయ్యో అయ్యో అయ్యయ్యో" అంటూ ఇందులో వెంకటేశ్ చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే అందాల తార దివ్యభారతి తెలుగువారికి పరిచయమైంది. దివ్యభారతికి తల్లిగా కళాభినేత్రి వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, సత్యనారాయణ, బ్రహ్మానందం, సుమిత్ర, శివాజీ రాజా, బాబూ మోహన్, ప్రదీప్ శక్తి, జయప్రకాశ్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు బొబ్బిలి రాజాకి ప్రధాన బలంగా నిలిచాయి. "బలపం పట్టి భామ ఒళ్ళో", "కన్యాకుమారి", "వద్దంటే వినడే", "అయ్యో అయ్యో", "చెమ్మ చెక్క".. ఇలా ఇందులోని ఐదు పాటలూ అప్పట్లో ఉర్రూతలూగించాయి. అంతేకాదు.. ఈ సినిమాకి గానూ ఇళయరాజా ఖాతాలో ఓ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా చేరడం విశేషం. 1990 హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన 'బొబ్బిలి రాజా'.. 3 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించిన 'బొబ్బిలి రాజా'.. 1990 సెప్టెంబర్ 14న జనం ముందు నిలిచింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. 33 వసంతాలు పూర్తిచేసుకుంది. 

వంశీ ‘అన్వేషణ’ కి హ్యాండిచ్చిన యండమూరి. ఎందుకో తెలుసా?

డైరెక్టర్‌ వంశీ కెరీర్‌లో ‘అన్వేషణ’ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక చిన్న సినిమాగా వచ్చిన ‘అన్వేషణ’ పెద్ద విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అందులో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. తనకెంతో ఇష్టమైన సినిమా అది అని వర్మ చెబుతారు. ఆ ఇష్టంతోనే వంశీ డైరెక్షన్‌లో వర్మ ఓ సినిమా నిర్మించాడు కూడా. అయితే అన్వేషణ అనే సినిమా రూపొందడానికి వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అప్పటికే మంచుపల్లకి, ఆలాపన చిత్రాలు తీసి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న వంశీతో ఓ సినిమా చెయ్యాలనుకున్నాడు నిర్మాత కామినేని ప్రసాద్‌. నీకు ఏ కథ ఇష్టమైతే దానితోనే సినిమా చేద్దాం ఆలోచించు అన్నారు ప్రసాద్‌.  వంశీ కెరీర్‌లో కొన్ని సెన్సిబుల్‌ మూవీస్‌, కామెడీ మూవీస్‌ చేశాడు. కానీ, స్వతహాగా ఆయనకి సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఇష్టమట. సినిమా కథ విషయం తనకు వదిలేయడంతో తనకిష్టమైన సినిమా చేద్దామనుకుని సిద్ధమయ్యాడు. అప్పట్లో కన్నడలో  కాశీనాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘అపరిచితులు’ తెలుగులోనూ విడుదలై ఘనవిజయం సాధించింది. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక కథ రెడీ చెయ్యాలనుకున్నాడు. అయితే తెలుగులో అప్పట్లో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ తరహా స్క్రిప్టు రాసే రచయితలు లేరు. దర్శకులే అలాంటి స్క్రిప్ట్‌ను రాసుకోవాలి. అయినా కొంతమంది రచయితలు ‘అన్వేషణ’ స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఎవ్వరి వల్లా కాలేదు. కొందరు మధ్యలోనే స్క్రిప్ట్‌ వదిలి వెళ్ళిపోయారు. అందులో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ కూడా ఉన్నారు. ఆ కథను పూర్తి చేయడం యండమూరి వల్ల కూడా కాలేదు. అయినా ‘ఈ సినిమాకి ఒక వెర్షన్‌ రాసి ఇచ్చేందుకు ప్రయత్నించిన యండమూరి వీరేంద్రనాథ్‌గారికి కృతజ్ఞతలు’ అని టైటిల్స్‌లో వేశారు. ఎవరు ఎన్ని రకాలుగా రాసినా వంశీ అనుకున్నట్టు కథ తయారవ్వలేదు. చివరకు తనే ఆ కథను పూర్తి చేశాడు.  ఇక షూటింగ్‌కి వెళ్దామనుకుంటూ వుండగా ఇందిరాగాంధీ చనిపోవడం, ఆ తర్వాత తుపాను రావడం వంటి కారణాల వల్ల షూటింగ్‌ డిలే అయిపోయింది. ఈలోగా తను రాసుకున్న కథని నవలగా అచ్చు వేయించాడు వంశీ. ఆ నవల చదివిన నిర్మాత చాలా బాగుందని మెచ్చుకోవడం, షూటింగ్‌ ప్రారంభించడం జరిగిపోయాయి. తిరుపతి దగ్గరలోని తలకోన ఫారెస్ట్‌లో తోట తరణి వేసిన సెట్‌లో షూటింగ్‌ ప్రారంభించారు వంశీ. కార్తీక్‌, భానుప్రియ, శరత్‌బాబు, సత్యనారాయణ, రాళ్ళపల్లి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి ఇళయరాజా అందించిన సంగీతం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 

టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచిన.. చైతూ, సామ్ పోరుకి ఐదేళ్ళు!

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో నాగచైతన్య, సమంతది ప్రత్యేక స్థానం. 'ఏ మాయ చేసావె' వంటి విజయవంతమైన సినిమాతో మొదలైన ఈ హిట్ పెయిర్ జర్నీ.. ఆపై 'మనం', 'ఆటోనగర్ సూర్య', 'మజిలీ' వరకు సాగింది. వీటిలో ఆటోనగర్ సూర్య మినహా మిగిలిన చిత్రాలన్నీ విజయపథంలో పయనించాయి. ఇక మజిలీ కంటే ముందే రియల్ లైఫ్ దంపతులైన చైతూ, సామ్ .. పెళ్ళయ్యాక 2018లో ఒకే రోజు వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ ముంగిట పోటీ పడ్డారు.  ఆ వివరాల్లోకి వెళితే.. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' 2018 సెప్టెంబర్ 13న జనం ముందు నిలిచింది. కట్ చేస్తే.. అదే రోజు సమంత హీరోయిన్ గా పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూటర్న్' కూడా రిలీజైంది. ఇలా భార్యాభర్తలైన చైతూ, సామ్ ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగడం అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. అయితే, వీటిలో శైలజా రెడ్డి అల్లుడు ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకున్నప్పటికీ తరువాత రాణించలేకపోయింది. ఇక యూటర్న్ విషయానికి వస్తే.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఏదేమైనా.. చైతూ, సామ్ బాక్సాఫీస్ వార్ కి ఈ బుధవారం(సెప్టెంబర్ 13)తో ఐదేళ్ళు పూర్తవుతున్నాయి.  

"వాన కాదు వాన కాదు వరదరాజా".. ఎన్టీఆర్ 'భాగ్యచక్రము'కి 55 ఏళ్ళు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే నిర్దేశకుల్లో దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కలకయికలో పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో 'భాగ్యచక్రము' ఒకటి. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా బి. సరోజాదేవి నటించగా రాజనాల, పద్మనాభం, ముక్కామల, లింగమూర్తి, పీజే శర్మ, పేకేటి శివరామ్, సురభి బాలసరస్వతి, గీతాంజలి, రుష్యేంద్రమణి, జ్యోతిలక్ష్మి, కనకం, ప్రభావతి, బేబి మల్లిక ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పింగళి నాగేంద్రరావు మాటలు, పాటలు సమకూర్చారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేశారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతమందించిన 'భాగ్యచక్రము'లో పాటలన్నీ ఆకట్టుకున్నాయి. మరీముఖ్యంగా.. "వాన కాదు వాన కాదు వరదరాజా" విశేషాదరణ పొందింది. అలాగే "ఆశ నిరాశను", "నీవు లేక నిముసమైన", "కుండ కాదు కుండ కాదు చినదానా" అంటూ మొదలయ్యే పాటలు కూడా అలరించాయి. జయంతి పిక్చర్స్ పతాకంపై పి.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1968 సెప్టెంబర్ 13న జనం ముందు నిలిచిన 'భాగ్యచక్రము'.. బుధవారంతో 55 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

నాగ్ తో అమల ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా.. !

అటు రీల్ లైఫ్ లోనూ, ఇటు రియల్ లైఫ్ లోనూ.. కింగ్ నాగార్జున, అమల అక్కినేనిది సక్సెస్ ఫుల్ జోడీ. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ సినిమాలు చేసిన అమల.. తెలుగులో ఎక్కువగా నాగార్జున కాంబినేషన్ లోనే సినిమాలు చేశారు. ఇంకా చెప్పాలంటే.. అమల మొదటి తెలుగు చిత్రమే.. నాగ్ తో చేసిన సినిమా కావడం విశేషం. నిజజీవితంలో భార్యాభర్తలైన నాగ్, అమల.. పెళ్ళికి ముందు అరడజను చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. 'కిరాయి దాదా' (1987)తో మొదలైన ఈ హిట్ పెయిర్ ప్రస్థానం.. ఆపై 'చినబాబు' (1988), 'శివ' (1989), 'ప్రేమ యుద్ధం' (1990), 'షివ' (హిందీ - 1990), 'నిర్ణయం' (1991) వరకు సాగింది. అంటే.. ఇద్దరు కలిసి ఆరు సినిమాల్లో సందడి చేశారన్నమాట. వీటిలో 'శివ' సంచలన విజయం సాధించగా.. 'కిరాయి దాదా', 'షివ' సూపర్ హిట్ అయ్యాయి. ఇక 'చినబాబు', 'నిర్ణయం' యావరేజ్ కాగా.. 'ప్రేమ యుద్ధం' మ్యూజికల్ గా మెప్పించింది. మరి.. భవిష్యత్ లోనూ ఈ కాంబినేషన్ లో సినిమాలు వస్తాయేమో చూడాలి. (సెప్టెంబర్ 12.. అమల అక్కినేని పుట్టినరోజు సందర్భంగా..)

వడివేలు తెలుగులో నటించిన ఏకైక సినిమా.. ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలుసా!

వడివేలు.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. అంతలా.. తన హాస్యంతో నవ్విస్తారాయన. స్వతహాగా తమిళ నటుడైన వడివేలు.. 1988 నుంచి కోలీవుడ్ లో కమెడియన్ గా కొనసాగుతున్నారు. అంటే.. 35 ఏళ్ళ అభినయపర్వం వడివేలు సొంతం అన్నమాట. తెలుగులో మనకు బ్రహ్మానందం ఎలాగో.. అలా అక్కడివారికి వడివేలు కామెడీ కింగ్.  'ప్రేమికుడు', 'ప్రేమదేశం', 'ఒకే ఒక్కడు', 'చంద్రముఖి'.. ఇలా పలు తమిళ అనువాద చిత్రాలతో తెలుగువారికి ఎంతో చేరువయ్యారు వడివేలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తెలుగులోనూ వడివేలు ఓ సినిమాలో నటించారు. అదే.. 'ఆరోప్రాణం'.  వినీత్, సౌందర్య జంటగా వీరు కె దర్శకత్వంలో రూపొందిన ఈ 1997 నాటి రొమాంటిక్ డ్రామాలో.. కథానాయకుడి స్నేహితుడి పాత్రలో దర్శనమిచ్చారు వడివేలు. కాగా, వడివేలు పోషించిన పాత్రకి మరో ప్రముఖ హాస్య నటుడు అలీ డబ్బింగ్ చెప్పారు. అంటే.. ఒక రకంగా ఒకే పాత్రలో ఇద్దరు ప్రముఖ హాస్యనటులు ఎంటర్టైన్ చేశారన్నమాట. ఇదిలా ఉంటే, వడివేలు తాజా చిత్రం 'చంద్రముఖి 2'.. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. (సెప్టెంబర్ 12.. వడివేలు పుట్టినరోజు సందర్భంగా..)

వడ్డే నవీన్, రాశి 'స్నేహితులు'కి పాతికేళ్ళు.. ఏయే భాషల్లో రీమేక్ అయ్యిందో తెలుసా!

వడ్డే నవీన్, రాశిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో 'స్నేహితులు' ఒకటి. 'సెంటిమెంట్ సినిమాల స్పెషలిస్ట్' ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మరో హీరోయిన్ గా సాక్షి శివానంద్ సందడి చేసింది. ఆనంద్, సుధాకర్, ఆహుతి ప్రసాద్, నర్రా వెంకటేశ్వరరావు, చలపతి రావు, సత్య ప్రకాశ్, రంగనాథ్, వేణుమాధవ్, తిరుపతి ప్రకాశ్, బండ్ల గణేశ్, కళ్ళు చిదంబరం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అనుమానపు భర్త (ఆనంద్) కారణంగా వేధింపులకు గురైన మహాలక్ష్మి (రాశి) ఓ అమ్మాయికి.. మురళి (వడ్డే నవీన్) అనే యువకుడు ఎలా అండగా నిలిచాడు? మురళి, మహాలక్ష్మి గతమేంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కథాబలమున్న చిత్రంగా జననీరాజనాలు అందుకున్న ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటి సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మల్లికవో మేనకవో", "పూచే పువ్వుకి ఎన్నో ఘుమఘుమలు", "ఓ గజ్జెల గుమ్మా", "ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా", "ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు.. అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు.." ఇలా అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. బద్వేల్ శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన 'స్నేహితులు'.. 'ఆశయిల్ ఒరు కడిదమ్' (ప్రశాంత్, కౌసల్య, చాందిని) పేరుతో తమిళంలో, 'స్నేహ' (వి. రవిచంద్రన్, రాశి, రమ్యకృష్ణ) పేరుతో కన్నడంలో రీమేక్ అయింది. 1998 సెప్టెంబర్ 11న జనం ముందు నిలిచిన 'స్నేహితులు'.. నేటితో 25 ఏళ్ళు పూర్తిచేసుకుంది.