విలక్షణమైన, వైవిధ్యమైన నటనకు పెట్టింది పేరు చంద్రమోహన్‌!

తెలుగు చలనచిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్‌ శనివారం(నవంబర్‌ 11) హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1945 మే 23న చంద్రమోహన్‌ జన్మించారు.  1966లో విడుదలైన ‘రంగులరాట్నం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన చంద్రమోహన్‌ తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో ఆయన చేసిన విలక్షణమైన పాత్ర ప్రేక్షకులకు పదికాలాలపాటు గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో అతని నటనకు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. ఆయన సినిమా కెరీర్‌లో రెండు ఫిలింఫేర్‌ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 57 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 932 సినిమాలు చేశారు. అందులో 175 సినిమాల్లో హీరోగా కనిపించారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ సినిమాలే ఉండడం విశేషం. కొన్ని సంవత్సరాల పాటు యంగ్‌ హీరోలకు తండ్రి అంటే చంద్రమోహనే గుర్తొచ్చేంత పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 2002లో వచ్చిన ‘కోతలరాయుడు’.  కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో! చంద్రమోహన్‌ కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనే పేరు ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఏ హీరోయిన్‌ అయినా చంద్రమోహన్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు.. వారి దశ తిరిగిపోతుంది, టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతుంది అనే నమ్మకం బాగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో శ్రీదేవి, ‘సిరిసిరిమువ్య’ చిత్రంలో జయప్రద.. ఇంకా రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి వంటి మరి ొందరు హీరోయిన్లు తొలి నాళ్ళలో చంద్రమోహన్‌తో కలిసి నటించినవారే. చంద్రమోహన్‌ చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చంద్రమోహన్‌ చేసిన 932 సినిమాల్లో ఎక్కువ శాతం అందర్నీ ఆకట్టుకున్న సినిమాలే ఉంటాయి. అందులో కొన్ని ఆణిమ్యుతాల్లాంటి సినిమాల గురించి చెప్పాల్సి వస్తే.. సుఖదుఃఖాలు, జీవన తరంగాలు, కాలం మారింది, అల్లూరి సీతారామరాజు, ప్రాణం ఖరీదు, శంకరాభరణం, శుభోదయం, రాధాకళ్యాణం.. ఇలా లెక్కకు మించిన సినిమాలు తన కెరీర్‌లో చేశారు చంద్రమోహన్‌.  పాత్ర ఏదైనా.. దానికి జీవం పోస్తారు నవరసాలనూ అద్భుతంగా పలికించగలిగిన ఆనాటి నటుట్లో చంద్రమోహన్‌ ఒకరు. పాత్ర ఏదైనా, దాని స్వభావం ఏదైనా.. దాన్ని ఆకళింపు చేసుకొని ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని నూటికి నూరుశాతం పండిరచగల అద్భుతమైన నటుడు. ‘పదహారేళ్ళ వయసు’, ‘ప్రాణం ఖరీదు’, ‘రాధాకళ్యాణం’ వంటి సినిమాల్లో ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలకు చంద్రమోహన్‌ జీవం పోశారు. ఇక కామెడీ సినిమాల విషయానికి వస్తే.. హాస్యాన్ని పండిరచడంలో అతనికంటూ ఓ శైలి ఉంది. చక్కని డైలాగ్‌ డెలివరీతో, నవ్వు పుట్టించే బాడీ లాంగ్వేజ్‌తో ఆయా క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేసేవారు.  వృత్తిపట్ల అపారమైన గౌరవం పాతతరం నటీనటుల నుంచి పుణికిపుచ్చుకున్న క్రమశిక్షణను తన కెరీర్‌ మొత్తం కొనసాగించారు. ఏ సినిమాకైనా నిర్మాత తండ్రిలాంటివారు అని నమ్మే చంద్రమోహన్‌. నిర్మాతకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసేవారు. ‘మనసంతా నువ్వే’ చిత్రంలో హీరో ఉదయ్‌కిరణ్‌కి తండ్రిగా నటించారు చంద్రమోహన్‌. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఆయన తల్లి చనిపోయిందన్న వార్త తెలిసింది. సాధారణంగా తల్లి చనిపోయిందంటే ఎవరైనా ఉన్నపళంగా తల్లిని చూసేందుకు బయల్దేరతారు. షూటింగ్‌ మధ్యలో ఉన్న చంద్రమోహన్‌ ఆ పని చేయలేదు. దానివల్ల నిర్మాతకు ఎంత నష్టం వస్తుందో ఆయనకు తెలుసు. అందుకే ఆరోజు తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాతే తల్లిని చూసేందుకు వెళ్లారు. దీన్నిబట్ట వృత్తి పట్ల చంద్రమోహన్‌కు ఎంత గౌరవం ఉంది, నిర్మాత శ్రేయస్సు కోసం ఎంతగా ఆలోచిస్తారో అర్థమవుతుంది. 

వచ్చిన లాభాలను వారికే పంచిన గొప్ప నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌

ఒక సినిమా తియ్యాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. సినిమా అనగానే మనకు నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్‌ మాత్రమే కనిపిస్తారు. అంతకుమించి ఎంతో మంది సినిమా కోసం పనిచేస్తారు. సినిమా సూపర్‌హిట్‌ అయి లాభాలు వచ్చాయంటే అవి నిర్మాత జేబులోకే వెళ్తాయి. కొన్ని సంస్థల్లో ఎన్నో ఏళ్ళ తరబడి పనిచేసేవారు ఉంటారు. కానీ, వారికి రెమ్యునరేషన్‌ మినహా మరే ఇతర రాబడి ఉండదు. ఆయా సినిమాలకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌తోపాటు సినీ కార్మికులను కూడా దృష్టిలో ఉంచుకొని వారి కోసమే సినిమా తీసి, దాని ద్వారా వచ్చిన లాభాలను వారికే చెందేలా చేసిన సంస్థ జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌. జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన సినిమాలు, దర్శకత్వం వహించిన సినిమాలు మొత్తం 34. అందులో తెలుగు సినిమాలు 24. వాటిలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ 13 సినిమాలను డైరెక్ట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబులతో సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు రాజేంద్రప్రసాద్‌. శోభన్‌బాబు కెరీర్‌లో పెద్ద హిట్‌ సినిమాలన్నీ జగపతి సంస్థ తీసినవే. వాటిలో ‘పిచ్చిమారాజు’ అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం వి.బి.రాజేంద్రప్రసాద్‌ తీసిన సినిమా ఇది. ‘పిచ్చిమారాజు’ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. మంచి లాభాలు ఆర్జించింది. ఈ సినిమాకి వచ్చిన లాభాలను నయాపైసలతో సహా తమ సంస్థ సిబ్బందికే పంచిపెట్టారు రాజేంద్రప్రసాద్‌. తన సినిమాలకు పనిచేసినవారు, ఆఫీసు సిబ్బంది... తన నుంచి నెలనెలా జీతం తీసుకునే ప్రతి ఒక్కరికీ వచ్చిన లాభాలను పంచారు. అప్పటివరకు ఏ నిర్మాణ సంస్థ తమ సిబ్బంది సంక్షేమం కోసం అలా చెయ్యలేదు. ఆ తర్వాత కూడా ఎవ్వరూ దాన్ని ఫాలో అవలేదు. తమ సిబ్బంది కోసం సినిమా తీసిన ఏకైక నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిలిచారు. 

ఛోళులకు, పల్లవులకు పడదు కదా.. అందుకే పల్లవులు రాయలేకపోతున్నానంటూ ఛలోక్తి విసిరిన ఆత్రేయ!

ఏ సినిమాకైనా కథ, మాటలు, నటీనటులు ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. సినిమా విజయంలో పాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎన్నో సినిమాల విషయంలో రుజువైంది. అలాంటి పాటలు రూపొందడానికి దర్శకనిర్మాతలు ఎంత శ్రమించాల్సి వస్తుందో అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ఇది నిజం. సంగీత దర్శకుడి నుంచి మంచి ట్యూన్స్‌ రాబట్టడానికి, పాటల రచయితలతో మంచి పాటలు రాయించుకోవడానికి దర్శకనిర్మాతలు ఒక్కోసారి అష్టకష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా పాటల రచయితలు సినిమాకు అవసరమైన పాటలు ఇవ్వడంలో ఎంతో సమయం తీసుకుంటారు. ఈ విషయంలో కొంతమంది రచయితలు నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. అలాంటి వారిలో దివంగత ఆచార్య ఆత్రేయ ఒకరు. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది పడని దర్శకనిర్మాతలు లేరంటే అతిశయోక్తి కాదు.  ఈ విషయంలో దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన తీసిన సినిమాలకు ఎక్కువ శాతం ఆత్రేయ పాటలు రాశారు. అయితే ప్రతి సినిమాకీ ఆత్రేయ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఆయన తీసిన సినిమాల్లో మంచి మ్యూజిక్‌ ఉండేలా చూసుకునేవారు. ఆ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యేవి. కె.వి.మహదేవన్‌తో మ్యూజిక్‌ చేయించుకునేవారు, ఆత్రేయతో రాయించుకునేవారు. ఆత్రేయవల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా అన్నీ భరించి ఆయనతోనే రాయించుకునేవారు. ఆత్రేయ గురించి సూరపునేని హరి పురుషోత్తమరావు ఒక డైలాగ్‌ చెప్పారు ఆత్రేయ.. పాటలు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడు అని. ‘ఆరాధన’ సినిమా కోసం పాటలు రాసేందుకు హోటల్‌ ఛోళలో రూమ్‌ బుక్‌ చేసి ఆత్రేయను అక్కడ పెట్టారు రాజేంద్రప్రసాద్‌. వారం రోజులు గడిచిపోయింది. ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేదు. అప్పుడు రాజేంద్రప్రసాద్‌ ఆయన దగ్గరికి వెళ్లి ‘సార్‌.. చాలా డబ్బు ఖర్చయిపోతోంది. ఏమిటి పరిస్థితి’ అని అడిగారు. దానికి ఆత్రేయ ‘ఈ హోటల్‌ పేరేమిటి?’ అని అడిగారు. ‘ఛోళ’ అని చెప్పారు రాజేంద్రప్రసాద్‌. దానికి ఆత్రేయ ‘నువ్వు ఛోళలో రూమ్‌ బుక్‌ చెయ్యడం వల్ల పల్లవులు రావడం లేదు. ఛోళులకు, పల్లవులకు పడదు కదా. అందుకే నేను రాయలేకపోతున్నాను. హోటల్‌ మార్చు. ట్రై చేద్దాం’ అన్నారు. అలా పాటలు రాయకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. దాన్ని కూడా ఛలోక్తిగా చెప్పేవారు ఆత్రేయ.   

ఆ దర్శకుడు కుదరదు అనడం వల్లే.. ‘దసరాబుల్లోడు’తో వి.బి.రాజేంద్రప్రసాద్‌ డైరెక్టర్‌ అయ్యారు

వి.బి.రాజేంద్రప్రసాద్‌.. ప్రముఖ నిర్మాత, దర్శకుడు. జగపతి సంస్థను స్థాపించి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తమ బేనర్‌లో తీసి మంచి అభిరుచిగల నిర్మాత, దర్శకుడు అనిపించుకున్నారు. ఈ సంస్థలో వచ్చిన సినిమాలు 90 శాతం విజయం సాధించాయి. ఈ సంస్థ నిర్మించిన సినిమాలు మొత్తం 34. అందులో 24 తెలుగు సినిమాలు ఉండగా, తమిళ, హిందీ భాషల్లో 10 సినిమాలు చేశారు. ఈ 34 సినిమాల్లో 13 సినిమాలకు వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకుడు. ‘అన్నపూర్ణ’ చిత్రంతో నిర్మాతగా మారి,  ఆ తర్వాత ‘దసరా బుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించి డైరెక్టర్‌గా కూడా సూపర్‌ సక్సెస్‌ సాధించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకుడిగా మారేందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే..  వి.బి.రాజేంద్రప్రసాద్‌ కుటుంబానిది ధాన్యం వ్యాపారం. మిల్లులు కూడా ఉండేవి. ఆయనకు ఆస్తమా ఉండేది. అందుకే మిల్లులు చూసుకోవడం సరిపడదని వేరే వ్యాపారం చేసుకోమని పంపించారు. ఆయన చదువుకున్నది కాకినాడ. పూర్ణోదయా క్రియేషన్స్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు... రాజేంద్రప్రసాద్‌ క్లాస్‌మేట్‌. వీళ్ళంతా కలిసి అక్కడ నాటకాటాడేవారు, ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావుగారితో పరిచయం ఏర్పడిరది. అప్పటికే అక్కినేని హీరో. నెమ్మదిగా సినిమాల్లోకి వెళితే ఎలా ఉంటుంది అనుకున్నారు రాజేంద్రస్రసాద్‌. అయితే నటుడిగా వెళ్లాలనే ఆయన ప్రయత్నం. అసలు నటుడు అవుదామనే ఆయన మద్రాస్‌ వెళ్లారు. రెండు, మూడు ప్రయత్నాలు కూడా చేశారు. అది  తన వల్ల కాదు అని డిసైడ్‌ అయ్యారు. సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందాయనకు. అప్పుడు నాగేశ్వరావు దగ్గరకు వెళ్లి మీరు నాకొక సినిమా చెయ్యాలి అని అడిగారు. దానికి నాగేశ్వరరావు ‘ముందు అనుభవం కోసం ఒక సినిమా చెయ్యండి. తర్వాత మనం కొనసాగుదాం’ అన్నారు. అప్పట్లో సదాశివబ్రహ్మం అనే రైటర్‌ ఉండేవారు. ఆయన ఇచ్చిన ‘అన్నపూర్ణ’ అనే కథతో సినిమా చేశారు రాజేంద్రస్రసాద్‌. దానికి వి.మధుసూదనరావు దర్శకుడు. జగయ్య, జమున ఆ సినిమాలో నటించారు. అప్పటి నుంచి జగపతి బేనర్‌లో మధుసూదనరావు ప్రయాణం మొదలైంది. ఆ తర్వాతి సినిమా ‘ఆరాధన’కు డేట్స్‌ ఇచ్చారు నాగేశ్వరరావు. అది ‘సాగరిక’ అనే బెంగాలి సినిమాకు రీమేక్‌. ఆ సినిమాతో జగపతి బేనర్‌లో నాగేశ్వరరావు ప్రయాణం కూడా మొదలైంది. అది నాగేశ్వరరావుకి పర్మినెంట్‌ బేనర్‌.  జగపతి బేనర్‌కి ‘అ’ అనే ఒక సెంటిమెంట్‌ ఉంది. అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు.. ఇలా ‘అ’తోనే టైటిల్స్‌ పెట్టేవారు. ఆ తర్వాత నాగేశ్వరరావుతో క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయించాలనుకొని ‘అదృష్టవంతులు’ అనే సినిమా వి.మధుసూదనరావు దర్శకత్వంలో చేశారు. అది సూపర్‌హిట్‌ అయింది. ఆ సినిమా తర్వాత ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చెయ్యాలనుకున్నారు. ఆరోజుల్లో నిర్మాతలు ముందుగా స్క్రిప్ట్‌ రెడీ చేయించేవారు. ఆ తర్వాత డైరెక్టర్‌ వచ్చి అందులో కరెక్షన్స్‌ చేయించేవారు. అది పూర్తయిన తర్వాతే హీరో దగ్గరికి కథ వెళ్లేది. ఈ ప్రాజెక్ట్‌ ప్రాసెస్‌లో ఉండగానే మధుసూదనరావు ‘ఈ సినిమా ఇప్పట్లో చెయ్యలేను, నాకు ఖాళీ లేదు’ అని చెప్పారు. అప్పుడు నాగేశ్వరరావునే డైరెక్ట్‌ చెయ్యమని రాజేంద్రప్రసాద్‌ అడిగారు. అప్పటికే ఎన్‌.టి.రామారావు డైరెక్ట్‌ చేస్తున్నారు. అందుకే నాగేశ్వరరావు కూడా డైరెక్ట్‌ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన్ని అడిగారు. దానికి నాగేశ్వరరావు ‘నేను డైరెక్షన్‌ చెయ్యను’ అని చెబుతూ ‘మధుసూదనరావు తీసిన సినిమాలకి నువ్వు వెనకే ఉండి అన్నీ నువ్వే చూసుకున్నావు. కాబట్టి నువ్వే మెగా ఫోన్‌ పట్టుకొని డైరెక్షన్‌ మొదలు పెట్టు. ఏమీ కాదు. ఏదైనా తేడా వస్తే చూసుకుందాం. మేమంతా ఉంటాం కదా’ అన్నారు. అలా రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘దసరాబుల్లోడు’. 1970లో ఈ సినిమా వచ్చింది. సంక్రాంతికి రిలీజ్‌ అయి దసరా వరకు ఆడిరదా సినిమా. విపరీతమైన కలెక్షన్లు సాధించిన ‘దసరాబుల్లోడు’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతోందంటే దానికి కారణం రాజేంద్రప్రసాద్‌ తయారు చేసుకున్న కథ, సినిమా తీసిన విధానం,  ఆత్రేయ మాటలు, పాటలు, చక్కని బ్యాక్‌డ్రాప్‌, మంచి మ్యూజిక్‌, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌... ఇవన్నీ కలగలసి ‘దసరాబుల్లోడు’ సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. 

‘పండంటి కాపురం’ షూటింగ్‌లో సంఘటన ఆర్టిస్టులంటే కృష్ణకు ఎంత గౌరవమో తెలియజేస్తుంది

సూపర్‌స్టార్‌ కృష్ణ తొలినాళ్ళల్లో చేసిన సినిమాల్లో ‘పండంటి కాపురం’ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. చక్కని కుటుంబకథా చిత్రంగా ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఆ సినిమాలోని సెంటిమెంట్‌ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో జయప్రద పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జి.హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి.  సూపర్‌స్టార్‌ కృష్ణ పర్సనల్‌ మేకప్‌మేన్‌గా పనిచేసిన సి.మాధవరావు ‘పండంటి కాపురం’ సినిమా నిర్మాణ సమయంలోని కొన్ని విశేషాలను తెలియజేస్తూ.. ‘కృష్ణగారు ఆర్టిస్టులను ఎంతో గౌరవించేవారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ సినిమాలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. అందులో ఎస్‌.వి.రంగారావుగారు మెయిన్‌. రంగారావుగారంటే కృష్ణగారికి ఎంతో ఇష్టం. ఈ సినిమాలోని ఓ పాటను శివాజీ గార్డెన్స్‌లో తియ్యాలని ప్లాన్‌ చేసారు. రంగారావుగారు అక్కడికి రావాలి. కానీ, ఆయన ఇంట్లో ఫుల్‌గా తాగి ఉన్నారు. ఆయన్ని ఎలాగైనా తీసుకొస్తానని ప్రభాకర్‌రెడ్డిగారు వెళ్లారు. బ్రతిమలాడి షూటింగ్‌ లొకేషన్‌కి తీసుకొచ్చారు. రంగారావుగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ‘నాకు చెవి నొప్పిగా ఉందిరా, కాలు నొప్పిగా ఉందిరా.. షూటింగ్‌ నావల్ల కాదురా. నన్ను వదిలెయ్‌రా..’ అని చిన్నపిల్లాడిలా  చెబుతూ ప్రభార్‌రెడ్డిగారిని బ్రతిమలాడుతున్నారు. రెడ్డిగారికి కోపం వచ్చింది. ‘చంపేస్తాను ఏమనుకుంటున్నావో.. ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌. వీళ్ళు మళ్ళీ దొరకరు. మేమంతా ఏమైపోవాలి’ అని రంగారావుగారి మీద కేకలేశారు రెడ్డిగారు. ‘నన్ను చంపుతావురా.. చంపెయ్‌.. గ్రేట్‌ రంగారావుని చంపెయ్‌’ అన్నారు రంగారావుగారు. అప్పుడు ప్రభాకరరెడ్డిగారు తేరుకొని ఇంత తప్పు మాట అన్నానే అని పశ్చాత్తాపపడి ఆయన రెండు కాళ్ళకు దండం పెట్టారు. తర్వాత రంగారావుగారి మేకప్‌ మేన్‌ కూడా ఆయన్ని షూటింగ్‌కి రెడీ అవ్వమని బ్రతిమలాడాడు. కానీ, లాభం లేకపోయింది. ఈరోజు ఎలాగోలా మేనేజ్‌ చెయ్యమని చెప్పి రంగారావుగారిని తీసుకెళ్ళిపోయారు రెడ్డిగారు. మిగిలిన ఆర్టిస్టులందరూ అక్కడే ఉన్నారు. ఆ టైమ్‌లో గుమ్మడిగారు ఠక్కున ఓ మాట అన్నారు. ‘హరనాథ్‌ తాగుబోతు అనే కదా మనం ఇండస్ట్రీలో అవాయిడ్‌ చేశాం. ఈయన తప్ప ఈ వేషం వేసేవాళ్ళు ఎవరూ లేరా కృష్ణ. మనకి ఈ అవస్థలు అవసరమా. ఇంత పెద్ద కాంబినేషన్‌లో షూటింగ్‌ ఉంటే తాగి పడుకోవడం ఏమిటి’ అన్నాడు. కృష్ణగారి గొప్పతనం ఏమిటో చూడండి.. ‘గుమ్మడిగారూ.. ఈ వేషం ఆయన తప్ప మరెవ్వరూ వెయ్యలేరు. నేను ఎన్ని కష్టాలైనా పడి ఆయనతోనే ఈ క్యారెక్టర్‌ చేయించుకుంటాను’ అని లేచి వెళ్లిపోయారు. ఈ మాటలు రంగారావుగారి మేకప్‌మేన్‌ విన్నాడు. అక్కడి నుంచి రంగారావుగారి ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేసరికి డ్రిరక్‌ చేస్తున్న రంగారావుగారితో ‘ఇలా జరిగింది. మీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కృష్ణగారు. మీరు చెయాల్సిన పని ఇదేనా’ అన్నాడు. దానికి రంగారావుగారు ‘మందు తీసెయ్‌’ అన్నారు. మరుసటిరోజు నేను కృష్ణగారి కోసం నేను వారి ఇంటిలో వెయిట్‌ చేస్తున్నాను. కృష్ణగారు మేకప్‌కి వచ్చే వరకు ఫోన్లు నేనే అటెండ్‌ చేసేవాడిని. రంగారావుగారు ఫోన్‌ చేసారు. ‘మాధవా.. మన సినిమా ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ రష్‌ చూద్దాం. ఎరేంజ్‌ చెయ్యమని కృష్ణకు చెప్పు’ అన్నారు. కృష్ణగారు రాగానే ఈ విషయాన్నే చెప్పాను. దానికి కృష్ణగారు ‘అలాగా అయితే వెంకన్నబాబుకి చెప్పి థియేటర్‌లో ఎరేంజ్‌ చెయ్యమను అందరం చూద్దాం’ అన్నారు. థియేటర్‌లో షో ఎరేంజ్‌ చేశారు. నేను, రంగారావుగారు, కృష్ణగారు, నిర్మలగారు, రంగారావుగారి మేకప్‌ మేన్‌ అందరం రష్‌ చూశాం. బయటికి వచ్చిన తర్వాత ‘కృష్ణా! ఈ సినిమా పూర్తయ్యే వరకు డ్రిరక్‌ ముట్టుకోను. నీకు ఇంకో విషయం చెబుతున్నాను. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు నా గురించి చెప్పుకుంటారు. ఇట్స్‌ ఏ ఛాలెంజ్‌’ అన్నారు. ఆయన అన్నట్టుగానే ఆ పాత్రకు జీవం పోశారు. తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. కృష్ణగారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక కమిట్‌మెంట్‌తో కంప్లీట్‌ చేశారు. కృష్ణగారు ఆర్టిస్టులతో అంత బాగా ఉండేవారు. ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్‌ వారికి ఇచ్చేవారు. ఎక్కడైనా నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకునేవారు’ అంటూ ‘పండంటి కాపురం’నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ పర్సనల్‌ మేకప్‌మేన్‌ సి.మాధవరావు. 

మీకు తెలుసా: మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ నిర్మాత!

సూపర్ స్టార్ కృష్ణ, మెగా స్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్న మగధీరులు. ఎలాంటి పాత్ర అయినా సరే ఆ పాత్రలో అవలీలగా నటించే సత్తా ఆ ఇద్దరి హీరోల సొంతం. చిరంజీవి కంటే ముందే  స్టార్ డం ని సంపాదించిన కృష్ణ చిరంజీవి నటించిన ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడనే విషయం మీకు తెలుసా.. పైగా ఆ మూవీ  అలాంటి ఇలాంటి మూవీ కాదు తెలుగు చిత్ర పరిశ్రమ తీరు తెన్నులనే మార్చివేసిన సినిమా.. మరి ఆ సినిమా  ఏంటో తెలుసుకుందామా.. చిరంజీవి అప్పుడప్పుడే హీరో గా ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. తనకి ఇంకా పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ రాని పరిస్థితి. సరిగా ఆ టైం లో వచ్చింది ఖైదీ మూవీ. కోదండరామిరెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆ మూవీ చిరంజీవికి స్టార్ డం ని తీసుకురావడంతో పాటు  చిరంజీవి అంటే ఏమిటో అందరికి తెలిసేలా చేసింది. జెట్ స్పీడ్ వేగంతో చిరంజీవి చేసిన డాన్స్, ఫైట్స్ తెలుగు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసాయి.  మీరు ఏంటండీ.. చిరంజీవి సినిమాకి కృష్ణ నిర్మాతగా చేసిన సినిమా పేరు చెప్పకుండా  ఖైదీ సినిమా గురించి చెప్తారేంటని అనుకుంటున్నారా.. ఈ  ఖైదీ  సినిమాలోనే మీకు కావలసిన మ్యాటర్ అంతా ఉంది. చిరంజీవి హీరో గా 1983 లో వచ్చిన ఖైదీ మూవీ  1984 లో హిందీలో రీమేక్ అవ్వడం జరిగింది. ఈ హిందీ రీమేక్  ఖైదీ ని  పద్మాలయ స్టూడియో బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ నిర్మించారు. చిరంజీవి క్యారక్టర్ ని జితేంద్ర పోషించగా  తెలుగు లో హీరోయిన్ గా చేసిన మాదవి హిందీ లో కూడా  హీరోయిన్ గాను చేసింది. సుమలత పోషించిన పాత్రని హేమ మాలిని,  రంగనాధ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని శత్రుఘ్న సిన్హా లు పోషించారు. అలాగే రావు గోపాలరావు పోషించ పాత్రని ఖదీర్ ఖాన్ లు పోషించారు. ఎస్ ఎస్ .రవి చంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ హిందీ ఖైదీ మూవీ  కూడా ఘన విజయం సాధించి సూపర్ స్టార్ కృష్ణ కి కనక వర్షం కురిపించింది.  సో ఇలా కృష్ణ చిరంజీవి నటించిన  ఖైదీ సినిమా కి నిర్మాతగా వ్యవహరించారు. ఇక్కడ అసలు కొసమెరుపు ఏంటంటే రీమేక్ అంటే ఒరిజినల్ సినిమాలోని కథని తీసుకొని కొత్త రకం స్క్రీన్ ప్లే తో నిర్మిస్తారు. కానీ హిందీ  ఖైదీ మాత్రం తెలుగు ఖైదీ కి మక్కి మక్కి కాపీల ఉంటుంది.  

నేటితో శత జయంతి సంవత్సరంలోకి సూర్యకాంతం

తెలుగు సినిమా కళావైభవానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఎంతో మంది నటీమణుల్లో సూర్యకాంతం ఒకరు. నేడు తన పుట్టిన రోజు. ఈ రోజు తో శతజయంతి  సంవత్సరంలోకి ఆమె అడుగుపెట్టబోతుంది. అంటే 100 వ సంవత్సరంలో కి అడుగుపెట్టబోతుంది. అత్త పాత్రలకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన  నట శిఖామణి సూర్యకాంతం నేడు భౌతికంగా మన మధ్య లేక పోయినా తను నటించిన సినిమాల ద్వారా మన ముందే ఉన్నారు. 1924  అక్టోబర్ 28 న  కాకినాడలో ఒక సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో సూర్యకాంతం   జన్మించారు. సినిమాల్లో నటించాలనే కోరికతో  ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోయినా  చెన్నైలో అడుగుపెట్టారు. మొదట కొన్ని సినిమాల్లో డాన్సర్ గా చేసిన సూర్యకాంతం పర్లాకిమిడి జమిందారు రాజా గజపతిదేవ్‌  నిర్మాతగా సి .పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన నారద నారది అనే సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమయ్యారు. మూగ అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన  సూర్యకాంతం ఆ తర్వాత  పెళ్లి చేసి చూడు, ప్రేమ, అమ్మలక్కలు, దొంగ రాముడు, చంద్రహాసన్ కన్యాశుల్కం, అప్పుచేసి పప్పుకూడు, తోడికోడళ్లు ,మాయాబజార్మాం,మాంగల్యబలం ఇలా దాదాపు 30  సినిమాలకి పైనే నటించి మంచి నటీమణి అనే గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గుండమ్మ కథ సినిమా  సూర్యకాంతం కి ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. కాలక్రమేణా సూర్యకాంతంకి అత్త పాత్రలు రావడం జరిగింది. ఇక అంతే  తెలుగు సినిమా ని అప్పటిదాకా డామినేట్ చేసిన హీరో ,హీరోయిన్, దర్శకుల స్థానం లో అత్త పాత్ర కూడా వచ్చి చేరింది. సూర్య కాంతం అత్త పాత్రలో నటించే విధానానికి తెలుగు జనం ఎంతగా ప్రభావితమయ్యారంటే తమ ఇంట్లో పుట్టిన  ఆడపిల్లకి  సూర్యకాంతం అనే పేరునే పెట్టలేదు. అలాగే కొత్తగా కాపురానికి వెళ్లిన ఆడపిల్ల కూడా తమ అత్తలని చూసి భయపడేలా సూర్యకాంతం నట విజృంభణ సాగింది. ఎన్నో సినిమా లు ఆవిడ వలన ఆడాయి. జనం తెర మీద సూర్య కాంతం ని తిట్టుకుంటునే  తన సినిమా కి రిపీటెడ్ గా వెళ్లే వాళ్ళు.      50 వ దశకంలో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సూర్యకాంతం 90 వ దశకం దాకా ఎన్నో  సినిమాల్లో అద్భుతమైన పాత్రలని పోషించారు. కులగోత్రాలు, రక్తసంబంధం,చదువుకున్న అమ్మాయిలు.మూగమనసులు, రాముడు భీముడు ఆత్మ గౌరవం, నవరాత్రి,జమీందార్, ఆస్తిపాస్తులు,ఉమ్మడికుటుంబం,గృహ లక్ష్మి,పూల రంగడు,నిన్నే పెళ్లాడుతా,తిక్క శంకరయ్య, అత్తలు కోడళ్ళు ,కాలం మారింది, యమగోల,గోరంత దీపం, గయ్యాళి గంగమ్మ, ఉగ్ర నరసింహం, యముడికి మొగుడు,పల్నాటి సింహం, వన్ బై టూ ,గోవింద గోవింద ఇలా లెక్కకు పైగా చిత్రాల్లో నటించి అశేష తెలుగు ప్రజల  గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. చిరంజీవి ,శ్రీదేవి ల కాంబినేషన్ లో వచ్చిన  ఎస్.పి పరశురామ్ సూర్యకాంతం నటించిన చివరి చిత్రం. 70  సంవత్సరాల వయసులో 1994  డిసెంబర్ 18  న సూర్యకాంతం కన్నుమూశారు. సూర్యకాంతం గారు మీరు మా మధ్య లేకపోయిన  మీరు నటించిన సినిమాల రూపంలో మా మధ్యే ఉన్నారు.  మీకు మా తెలుగు వన్ మీడియా తరుపున  పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

రాజేంద్రప్రసాద్ ని కాపీ కొట్టిన చిరంజీవి

ఆ నటుడు నటనకి సంబంధించి ఎన్ని కళలు ఉంటాయో వాటన్నింటిలోను తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఎదురులేని కథానాయకుడు. సిల్వర్ స్క్రీన్ మీద ఆ నటుడు కనపడితే చాలు ప్రేక్షకులు ఆనందంతో పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోతారు. ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు బ్లాక్ టిక్కెట్లు అమ్మే వాళ్ళకి పండగ రోజు. నెల జీతాన్ని ఒక్క రోజులనే సంపాదించేస్తారు. ఒకటి కాదు రెండు కాదు 40 సంవత్సరాల నుంచి ఆయన సినీ కళామ తల్లి ఒడిలో ఉంటూ ఎన్నో సామజిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రం ఆయన్ని చూసే పుట్టిందేమో అనుకునేలా  సినిమా ఇండస్ట్రీ లో ఆయన నడవడిక  ఉంటుంది. అలాగే ఎంతో మంది సినిమా రంగంలోకి రావటానికి ఇన్స్పిరేషన్ కూడా ఆయనే. ఆయనే మెగా స్టార్ చిరంజీవి. డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో  కొలువు తీరి ఉన్న చిరంజీవి తన తోటి నటుడికి చెందిన నటన యొక్క ఫార్ములాని కాపీ కొట్టి యాజ్ టీజ్ గా తన సినిమాల్లో ప్రదర్శించాడు. ఈ విషయాన్నీ చిరంజీవే  స్వయంగా  చెప్పాడు. మరి చిరంజీవి ఫాలో అయిన ఆ నటుడు ఎవరు? వెండితెర మీద చిరు ప్రదర్శించే నటనని చూసి ఆబాలగోపాలం మొత్తం ఆనందంతో పులకరించిపోతుంది. డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ లో నెంబర్ వన్ గా ఫర్ఫామెన్స్ ని  ప్రదర్శిస్తూ నేటికీ చిరు అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే చిరు కామెడీని కూడా సూపర్ గా చేస్తాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కామెడీలో వీరవిహారం చేస్తాడు. చిరంజీవి డాన్స్ లకి, ఫైట్స్ కి ఎంత మంది అభిమానులు ఉంటారో కామెడీకి కూడా అంతే మంది అభిమానులు ఉంటారు. కామెడీ ని పండించే విషయంలోనే  చిరంజీవికి తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పటి అగ్ర హీరో అయినటువంటి రాజేంద్రప్రసాద్ స్ఫూర్తిగా నిలిచాడు. ఏ నటుడైనా ఎక్కడా కూడా ఓవర్ డోస్ లేకుండా కామెడీ ని పండించినప్పుడే ఆ కామెడీ ప్రేక్షకులకి నచ్చుతుంది. చిరంజీవి కామెడీలో ఓవర్ డోస్ ఉండదు. ఆ ఓవర్ డోస్ లేకుండా కామెడీ ని పండించడం చిరు రాజేంద్రప్రసాద్ దగ్గరనుంచి నేర్చుకున్నాడు. ఇక రాజేంద్రప్రసాద్ గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తన కెరీర్ మొత్తం కామెడీ సినిమాలనే చేసినా కూడా ఎప్పుడు ప్రేక్షకులకి బోర్ కొట్టని నటుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజేంద్రప్రసాదే అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటాయి. ప్రజలు సంతోషంగా ఉండటం కోసం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తూనే ఉంటారు. మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహారావు అభిమాన హీరో అయిన రాజేంద్రప్రసాద్ నుంచి నేను నటనని నేర్చుకున్నానని చెప్పిన చిరంజీవి రియల్లీ గ్రేట్.

మహేష్‌బాబుని రిజెక్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.. ఎందుకో తెలుసా?

‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే పవన్‌కళ్యాణ్‌తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. మూడు సంవత్సరాల్లోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. రేణు నటించిన చివరి సినిమా 2003లో పవన్‌కళ్యాణ్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జాని’. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్‌ వేసుకుంది. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో కీలకమైన హేమలత లవణం పాత్రను పోషించింది.  ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్‌కి సంబంధించిన ఒక విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌బాబుని రిజెక్ట్‌ చేసిన రేణు దేశాయ్‌. మహేష్‌బాబు వంటి హీరో పక్కన నటించడం అంటే హీరోయిన్లకు బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. అలాంటిది అతన్ని రిజెక్ట్‌ చేసిందంటే కారణం ఏమిటి? బద్రి తర్వాత పవన్‌కళ్యాణ్‌తోనే జాని చేసింది. 2009లో రేణు పెళ్ళి చేసుకున్నప్పటికీ అంతకుముందు నుంచే అంటే 2003 నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఈ సమయంలోనే మహేష్‌బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మురారి’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు రేణు దేశాయ్‌ని సంప్రదించాడు పూరి జగన్నాథ్‌. కానీ, మహేష్‌తో నటించేందుకు రేణు ఇష్టపడలేదు. రిజెక్ట్‌ చేసింది. ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించలేదు. అది వేరే విషయం. 

లిప్ లాక్ పెట్టుకున్న మొదటి  హీరో హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమా హిస్టరీ లో  సిల్వర్ స్క్రీన్ మీద  ముద్దు పెట్టుకున్న  ఐ మీన్ 'లిప్ లాక్ కిస్' పెట్టుకున్న హీరో  హీరోయిన్ లు ఎవరో మీకు తెలుసా? పోనీ ఆ సినిమా పేరు అయిన మీకు తెలుసా? ఇప్పుడంటే స్క్రీన్ మీద ఆ లాంగ్వెజ్ సినిమా ఈ  లాంగ్వెజ్  సినిమా అనే  తేడాలేకుండా అన్ని లాంగ్వెజ్ సినిమాల్లో కూడా సన్నివేశం డిమాండ్ చేసినా  చెయ్యకపోయిన లిప్ లాక్ లు సాధారణమయిపోయాయి.  కానీ  హీరో  హీరోయిన్ లు మొదటి లిప్ లాక్ పెట్టిన కాలంలో అయితే లిప్ లాక్ లు కాదు కదా అసలు హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకున్నా దేశ ద్రోహం కింద లెక్కేసేవాళ్ళు. మరి అలాంటి  కాలంలో లిప్ లాక్ పెట్టుకొని డేర్ చేసిన ఆ పెయిర్ ఎవరో, ఆ సినిమా ఏంటో చూద్దాం. అది 1933  వ సంవత్సరం..అంటే ఇండియా కి ఇంకా స్వాతంత్రం రాని రోజులు. అప్పుడప్పుడే మెల్లగా హిందీ చిత్ర సీమలో  సినిమాలు  రూపుదిద్దుకోవడం జరుగుతుంది. కానీ అన్ని కూడా సైలెన్స్ సినిమాలే. అప్పటికే 1913 వ సంవత్సరం లో రాజా హరిచంద్ర, ఆ తర్వాత 1931 లో ఆలం ఆరా అనే సినిమాలు వచ్చాయి. వాటి తర్వాత 1933  వ సంవత్సరంలో కర్ణ అనే సినిమా వచ్చింది. హిమాన్షు రాయ్ హీరో గా దర్శకుడుగా ఈ సైలెన్స్ సినిమా వచ్చింది.  దేవిక  రాణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లోనే హిమాన్షు రాయ్ అండ్ దేవిక రాణి లు లిప్ లాక్ సన్నివేశం లో నటించారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఈ లిప్ లాక్ మొట్టమొదటి లిప్ లాక్ సన్నివేశం. ఈ సినిమా ని చూసిన అప్పటి ప్రేక్షకులు వామ్మో ఏంటి వాళ్లిద్దరూ ఇలా చేసారని సిగ్గుతో చచ్చిపోయారు. కొంత మంది అయితే హిమాన్షు రాయ్, దేవిక రాణిలు మన  సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోయి మన భారత దేశ పరువుని తీసారని ఆ ఇద్దరి అంతు చూడాలని కొన్ని ఉద్యమాలు లాంటివి కూడా చేసారు. కానీ ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే హిమాన్షు రాయ్, దేవిక రాణి లు నిజ జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్. పెళ్లి తర్వాతే  కర్ణ సినిమాలో ఇద్దరు లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.

ముఖ్యమంత్రి చేత కన్నీళ్లు పెట్టించిన సూర్యకాంతం

మనం ఎంత ఎదిగినా మనకి అన్నం పెట్టినవారిని, ఆప్యాయతను పంచినవారిని ఎప్పటికీ మరిచిపోకూడదు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితది కూడా అలాంటి మనస్తత్వమే. అది 1994వ సంవత్సరం.. తేదీ డిసెంబర్ 18. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుంది.  ఇంతలో ముఖ్యమంత్రి  కార్యదర్శి వచ్చి జయలలిత చెవిలో చిన్నగా ఏదో చెప్పారు. ఆ మాట వినగానే ఆమె లేచి నిలబడి విదేశీ ప్రతినిధులకి నమస్కరించి.. "ఒక ముఖ్యమైన వ్యక్తిగత విషయంపై బయటకు వెళ్తున్నాను. మరో 45 నిముషాల్లో వస్తాను. ఈ లోగా మీరు మా ఆతిధ్యాన్ని  స్వీకరించండి" అని చెప్పి వేగంగా వెళ్ళి కారు ఎక్కారు. కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే కొంతమంది అక్కడ వున్నారు. జయలలిత కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు. ఎదురుగా శవపేటిక ఉంది. చేతులు జోడించి శవపేటిక చుట్టూ మూడు సార్లు తిరిగారు. సెక్రటరీ అందించిన పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, నమస్కారం చేశారు. ఆమె కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకున్నారు. జయలలితను అలా చూసి సెక్రటరీ నివ్వెరపోయాడు. ఆమె జీవితం లో ఎన్నో కష్టాలను, ఘోర అవమానాలను చూశారు. ఎన్ని ఎదురైనా శిఖరంలా నిలబడ్డారు కానీ ఎప్పుడు కన్నీరు పెట్టింది లేదు. అలాంటిది ఆమె మొదటిసారి కంటతడి పెట్టుకున్నారు. కారు ఆ ఇంటి నుండి తిరిగి బయల్దేరింది. జయలలిత మొదటిసారి కంటతడి పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయిన సెక్రటరీ.. "ఆమె ఎవరు మేడం?" అని అడిగాడు. "ప్రేమగా, ఆప్యాయంతో అన్నం పెట్టి, ఆకలి తీర్చిన అమ్మ సూర్యకాంతమ్మ.. ఒక మహా నటి" అంటూ అంత బాధలోనూ గర్వంతో చెప్పారు జయలలిత. సెక్రటరీ మరింత ఆశ్చర్యంగా చూస్తున్నాడు.  సూర్యకాంతం గురించి జయలలిత మరింత గర్వంగా చెప్పడం మొదలుపెట్టారు. "సినిమా షూటింగ్ కు వచ్చినప్పుడు రకరకాల వంటలు చేసి, కారియర్ లో తెచ్చి సహనటులందరికీ కొసరి కొసరి వడ్డించి, తినిపించేవారు. ఆమె చేసిన పులిహార, మసాల వడలు అంటే నాకు చాలా ఇష్టం. స్టూడియోలో ఆమె షూటింగ్ జరుగుతుందని తెలిస్తే చాలు, వేరే ఫ్లోర్ లో పనిచేస్తున్న నేను భోజనానికి ఆమె దగ్గర వెళ్ళేదానిని. మా అమ్మ తరువాత అమ్మ వంటిది" అని జయలలిత చెప్పారు. సూర్యకాంతం అంటే తెరపై గయ్యాళి అత్తగానే ప్రేక్షకులకు తెలుసు. కానీ తెర వెనక ఒక అమ్మలా ఆమె చూపే ప్రేమ గురించి, ఆమె గొప్ప మనసు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా తెలిసిన వారిలో జయలలిత ఒకరు. సూర్యకాంతం ఎంత గొప్పవారో.. ఆమె పంచిన ప్రేమను గుర్తుపెట్టుకొని ఆమెని అమ్మగా భావించిన జయలలిత కూడా అంతే గొప్పవారు. ఆమెది అంత గొప్ప మనసు కాబట్టేనేమో.. తమిళ ప్రజలు ఆమెను అమ్మా  అని ఆప్యాయంగా పిలిచేవారు.

నా శిష్యుడికి దర్శకుడిగా ఛాన్స్ ఇస్తేనే సినిమాకి దర్శకత్వం చేస్తా: రాఘవేంద్రరావు 

    సినిమా దర్శకుడు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒక దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేరతారు. తన గురువు దగ్గర దర్శకత్వ శాఖ కి సంబంధించిన అన్ని విద్యలు నేర్చుకొని తాను కూడా దర్శకుడిగా ట్రై చేస్తుంటాడు. కాని ఆ దర్శకుడే తన దగ్గర కొచ్చిన ఒక నిర్మాతతో నా శిష్యుడికి డైరెక్టర్ గా అవకాశం ఇస్తేనే మీ సినిమాకి దర్సకత్వం చేస్తానని ఖరాకండిగా చెప్పాడు. అలా అని ఆ దర్సకుడేమి ఆషామాషి దర్సకుడేమి కాదు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఆ దర్శకుడి చరిత్ర ప్రస్తుతం నడుస్తున్న కాలానికి  తీపి గుర్తు...తెలుగు సినిమా వైభవానికి కూడా తీపి గుర్తు..అప్పటి దాకా ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా వచ్చినా జనం ఆ సినిమా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు. కాని ఆయన సినిమా వచ్చాక జనం ధియేటర్ లో తెర ముందు డాన్సులు వెయ్యడం తో పాటు తెర మీద డబ్బులు వేయడం మొదలు పెట్టారు. తనకి మాత్రమే సాధ్యమయ్యే కమర్షియల్ ఫార్మేట్ తో సినిమా తీసి ప్రేక్షకుల చేత డాన్సులు వేయించాడు. అంతటి ఘనత ఆయన సొంతం. ఆయనే  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అలాంటి ఆయన ఎవరికోసం తన నిర్మాతతో మాట్లాడాడు? మాములు హీరో అగ్ర హీరో గా మారాలంటే రాఘవేంద్ర రావే దిక్కు. తన దర్శకత్వ ప్రతిభ తో తెలుగు సినిమా తీరు తెన్నులనే మార్చివేసిన లెజండరీ డైరెక్టర్ అయన. అలాంటి రాఘవేంద్ర రావు తన నిర్మాతతో ఎవరికీ దర్శకుడిగా అవకాశం ఇవ్వమని మాట్లాడారో తెలుసా? ది గ్రేట్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గురించి. తన సినిమా కెరీర్ మొదట్లో కోదండ రామిరెడ్డి చాలా సినిమాలకి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ దగ్గర పని చేసాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వ శాఖ లో ఎంత బిజీ గా ఉన్నా తన దగ్గర పని చేసే వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అలా రాఘవేంద్ర రావు మొదటి నుంచి కోదండ రామిరెడ్డి ని కనిపెడుతూనే ఉండేవారు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు కి కోదండరామి రెడ్డి టాలెంట్ గురించి పూర్తిగా అర్ధమయ్యి సినిమాకి సంబంధించిన పూర్తి పనులు మొత్తం కోదండరామి రెడ్డి కే అప్పచెప్పేవారు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి సొంతంగా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండు సినిమాలు ఆయన దర్సకత్వంలో నిర్మాతలు ప్రకటించి కూడా ఆ తర్వాత సినిమా ని ఆపేసారు. దీంతో కోదండ రామిరెడ్డి ఏడ్చిన  సందర్బాలు కూడా ఉన్నాయి. కోదండ రామిరెడ్డి కి దర్శకుడిగా అవకాశాలు వచ్చి పోతున్నాయనే  విషయం రాఘవేంద్ర రావుకి తెలిసింది. దీంతో రాఘవేంద్రరావు తన దగ్గరకొచ్చిన ఒక నిర్మాతతో నేను మీ సినిమా చెయ్యాలంటే మీరు కోదండరామి రెడ్డి కి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అన్నాడు. ఈ విషయాలన్నీ స్వయంగా కోదండ రామి రెడ్డే ఒక ఇంటర్వ్యూ లో  చెప్పాడు. ఆ తర్వాత కోదండ రామి రెడ్డి 96 సినిమాలకి దర్శకత్వం వహించమే కాకుండా వాటిల్లో ఎక్కువ శాతం  సినిమాలని విజయవంతం చేసి నెంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి కల్లెక్షన్ల వర్షాన్ని కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి తో ఎన్నో సూపర్  హిట్ సినిమాలుని  కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. అలాగే తన గురువు రాఘవేంద్ర రావు సినిమాలకి పోటిగా కోదండరామి రెడ్డి సినిమాలు వచ్చి విజయం సాధించాయి. అలా కోదండరామిరెడ్డి అనే ఒక అద్భుత దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండేలా  చేసిన రాఘవేంద్ర రావుకి హాట్స్ ఆఫ్.

సినీ రంగమా ఎల్లవేళలా వర్థిల్లు!

భారతీయుల వినోదంలో సినిమాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. కోట్లాదిమందికి సినిమాలే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇలా దేశవ్యాప్తంగా వివిధ భాషల సినిమా ఇండస్ట్రీలు ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భారతీయులను ఇంతగా అలరిస్తున్న చలనచిత్రాలకు ‘జాతీయ సినిమా దినోత్సవం’ ఉంది. అక్టోబర్ 13 న జాతీయ సినిమా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే జాతీయ సినిమా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?, ఎప్పుడు మొదలైంది? దాని విశేషాలను తెలుసుకుంటే.. జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించాలని 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) నిర్ణయించింది. కొవిడ్-19 మహమ్మారి విపత్కాలంలో సినిమా థియేటర్లు దీర్ఘకాలంపాటు మూతపడ్డాయి. ఆ తర్వాత సినిమా హాళ్లను తిరిగి తెరిచిన సందర్భాన్ని పురష్కరించుకొని జాతీయ సినిమా దినోత్సవాన్ని ఎంఏఐ ప్రారంభించింది. కరోనా సమయంలో భారీ నష్టాలు చవిచూసిన సినిమా హాళ్ల  యజమానులకు దన్నుగా నిలిచేందుకు సినీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా ప్రోత్సహించే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సినిమా దినోత్సవ నిర్వహణ వెనుక మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రూపంలో ముప్పు పెరగడం కూడా ఒక కారణం. ముఖ్యంగా కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సినిమా దినోత్సవం రోజున టికెట్ల రేట్లపై డిస్కౌంట్ అందిస్తే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భావించింది. ఏ తేదీన నిర్వహిస్తారు? జాతీయ సినిమా దినోత్సవం నిర్వహణకు ప్రత్యేక తేదీ అంటూ ఏదీ నిర్ణయించలేదు. గతేడాది కొన్ని తేదీలను మార్చి చివరకు సెప్టెంబర్ 23న నిర్వహించారు. టికెట్ రేట్లపై మంచి డిస్కౌంట్ అందించడంతో గతేడాది జాతీయ సినిమా దినోత్సవం సక్సెస్ అయ్యింది. తగ్గింపుతో కేవలం రూ.75కే టికెట్లు అందుబాటులో ఉంచడంతో రికార్డ్ స్థాయిలో ఒకే రోజు లక్షలాది టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది  అక్టోబర్ 13న సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసారి కూడా థియేటర్ యజమానులు డిస్కౌంట్‌పై సినిమా టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.99లకే టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ సంవత్సరం పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, ఏసియాన్‌తోపాటు పలు మల్టీప్లెక్స్‌లు ఆఫర్లు ప్రకటించాయి. ఇక ఎంఏఐనిప్రముఖ సినిమా ఆపరేటర్లు 2002లో ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) కింద పనిచేస్తుంది. ఎంఏఐలో 11 కంటే ఎక్కువ సినిమా చైన్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు లేదా కంపెనీలు దేశవ్యాప్తంగా 500కి పైగా మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్నాయి. దాదాపు 2500పైగా స్ర్కీన్‌లను నిర్వహిస్తున్నాయి. భారత్‌లోని సినిమా థియేటర్లలో ఈ మల్టీప్లెక్స్‌ల వాటా దాదాపు 75 శాతంగా ఉంది. కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా రంగం ఎల్లవేళలా వర్ధిల్లి ఆ రంగాన్ని నమ్ముకున్నవారికి ఎల్లప్పుడూ ఉపాధి కల్పించాలని జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఆకాంక్షిద్దాం..

తన సినిమాలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన దర్శక మణిహారం.. టి.కృష్ణ 

  ఎర్రటి సూర్యుడు ఉదయాన్నే ప్రపంచాన్ని ఎలా నిద్రలేపుతాడో ఆయన కూడా తన సినిమాల ద్వారా  నిద్రపోతున్న ప్రపంచాన్ని  నిద్రలేపాడు.మనుషులంతా సమానమే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని చెప్పాడు. కులం అనేది ఒక అబద్దం అని రాజకీయనాయకుడు తన స్వార్ధం కోసం కులాల్ని రెచ్చగొట్టి ఎలా అధికారం లో  కూర్చుంటున్నాడో  చెప్పాడు.పేదవాడి కడుపు నిండనప్పుడు ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందుకు వచ్చినట్టో చెప్పాడు.పేదవాడు కూడా ఒక మనిషే అని   కార్మిక,పీడిత,బహుజన బలహీన వర్గాల కోసం సినిమాలు తీసాడు. ఇలా తను పుట్టిన సమాజాన్ని నిరంతరం తన సినిమాల ద్వారా జాగృతి వైపు మళ్లించిన  గొప్ప దర్శకుడు ఆయన. ఆయన ఎవరో కాదు కేవలం ఏడుఅంటే ఏడూ సినిమాలతో హిమాలయ శిఖరం అంత కీర్తిని సంపాదించిన  దర్శక శిఖరం టి.కృష్ణ.. పూర్తి పేరు తొట్టెం పూడి కృష్ణకుమార్. ఆయన ఈ రోజు మన మధ్య లేక పోయినా ఆయన సినిమా లు నిరంతరం తెలుగు ప్రేక్షకుల రక్తంలో ప్రవహిస్తూనే ఉన్నాయి.  టి. కృష్ణ గారి గురించి 1980 వ దశకంలో  తెలియని తెలుగు వాడు లేడు. నేటికీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్, ఫిడరేల్ క్యాస్ట్రో ,చేగువేరా గురించి తెలిసినట్లే టి.కృష్ణ గారి గురించి కూడా అందరికి తెలుసు.అంతటి పేరుని ఆయన తన సినిమాల ద్వారా సంపాదించాడు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన మూడు సంవత్సరాలకి అంటే 1950  ఆగస్టు 1 న టి.కృష్ణ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు కి దగ్గరలో ఉన్న కాకుటూరివారి పాలెం లో జన్మించారు. ఆయన  విద్యాబ్యాసం అంతా  తన ఊరి తో పాటు ఒంగోలు లో జరిగింది. మొదటి నుంచి వామ పక్షజాల భావాల్ని కలిగి ఉండే అయన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రజానాట్య మండలిలో  కొన్ని నాటకాలు కూడా వేశారు. టి కృష్ణ గారికి మొదటి నుంచి కూడా ఈ సమాజంలోని మనుషులకి  ఏదైనా  చెప్పాలని వారు సన్మార్గంలో నడిచేలా చెయ్యాలని అనుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే పేద వారి పై భూస్వామ్య వర్గాల వారి దౌర్జన్యాన్ని కూడా ఆయన సహించేవారు కాదు. అలాగే యువత తన లక్షాన్ని తెలుసుకోలేక చెడు మార్గంలో నడుస్తుందని అలాగే కొంత మంది రాజకీయనాయకులు ఎలా ఈ దేశాన్ని దోచేస్తున్నారు పైకి పెద్ద మనుషుల్లా  కనపడుతూ ఈ దేశాన్ని ఎలా పట్టి పీడిస్తున్నారో అలాగే  ఆడవారి పట్ల  ఎందుకు కొంత మంది మగవాళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు నీ తల్లి కూడా ఒక ఆడదే కదా తదితర విషయాలన్నింటిని చిన్నప్పటినుంచే నర నరాన  జీర్ణించుకున్న వాడిలా తాను తీసిన ఏడు సినిమాల్లోనూ కృష్ణ గారు వాటిగురించే చెప్పాడు. ఇంక తన అన్వేషణని ప్రారంభించి   సినిమా అనే పవితమైన కళ ద్వారానే చెప్పాలని తన ప్రాంతానికే చెందిన ప్రఖ్యాత నటులు దర్శకులు అయినటువంటి మాదాల రంగారావు దగ్గర కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. మాదాల రంగారావు ప్రజానాట్యమండలిలో సభ్యులు కూడా  ఆ పరిచయం తోనే ఆయన దగ్గర చేరారు .సుమారు ఐదు సినిమా లకి కృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు  ఇక సమాజం కోసం రంగంలోకి దిగి  1983  వ సంవత్సరం లో నేటి భారతం అనే సినిమా ని తెరకెక్కించారు. అసలు ఆ రోజుల్లో ఆ పేరు పెట్టడమే పెద్ద సంచలనం అయ్యింది. సినిమా విడుదల అయ్యింది. జనం తండోప తండాలుగా  తిర్నాలకి వెళ్లినట్టుగా ఆ సినిమాకి వెళ్లారు. దాంతో అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా అనే పేరు పోయి సామజిక సినిమా కూడా అవ్వగలదని నిరూపించింది. చట్టాన్ని గౌరవంచి తన సర్వస్వాన్ని కోల్పోయి ఆ తర్వత చట్టం డబ్బున్నవాడికి చుట్టం అని తెలుసున్న మహిళ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని  సంఘవిద్రోహ శక్తులని చంపుతుంది. ఈ పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకే హైలట్. ఈ సినిమా ఎన్నో కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకోవడం తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకొంది. అలాగే నంది అవార్డ్స్ తో పాటు ఎన్నో ఇతర అవార్డు లు కూడా ఈ సినిమాకి వచ్చాయి. అలాగే బెస్ట్  స్క్రీన్ ప్లే లో కృష్ణ గారు అవార్డు అందుకున్నారు . ఆ  తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత 1985 లో వరుసగా నాలుగు సినిమాలు ఆయన నుండి వచ్చాయి .అవి  దేశంలో దొంగలు పడ్డారు,దేవాలయం,వందేమాతరం,ప్రతిఘటన సినిమాలు ఇలా వరుసగా వచ్చాయి. ఇక అంతే 1985 వ సంవత్సరం టి.కృష్ణ గారి నామ సంవత్సరం అయ్యింది. తన మొదటి సినిమా హీరో హీరోయిన్ అయిన విజయ శాంతి ,సుమన్ లనే  దేశంలో దొంగలు పడ్డారు సినిమాకి తీసుకున్నారు. ప్రజలు వ్యవస్థలోని లోపల వళ్ళ అలాగే న్యాయం జరుతుందనే నమ్మకం లేక ఎలా దొంగలుగా మారతారు అనే కాన్సెప్ట్ తో ఆ సినిమాని తెరకెక్కించి సమాజంలో పరిస్థితుల్ని చాల క్లియర్ గా చూపించారు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా వచ్చిన దేవాయలం మూవీ అయితే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా పోకడల్ని పూర్తిగా మార్చివేసింది. ఒక బ్రాహ్మణుడే నాస్తికుడైతే ఎలా ఉంటుంది మనిషే దేవుడు అని అతను ఎలా చెప్తాడు అనే లైన్ తో ఆ సినిమా తీసి చరిత్ర సృష్టించారు.ఆ సినిమా చూసి తమలో ఉన్న అహాన్ని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఆ తర్వాత రాజశేఖర్ హీరో గా వచ్చిన వందే మాతరం మూవీ కూడా ఒక సంచలనం సృష్టించింది .ఆ సినిమాలోని వందే మాతరం,వందే మాతరం,వందే మాతర  గీతం తరం మారుతున్నది అనే సాంగ్ నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంది.ఈ పాట పాడిన శ్రీనివాసే ఆ తర్వాత వందేమాతరం శ్రీనివాస్ గా నిలబడిపోయారంటే ఆ పాట కెపాసిటీ అర్ధం చేసుకోవచ్చు. పచ్చని పల్లెటూళ్ళు రాజకీయనాయకుల అధికార స్వార్ధం  వల్ల ఎలా కులమతాల గొడవలతో తగలబడిపోతున్నాయనే కధాంశం తో తెరకెక్కిన ఆ మూవీ విడుదలయిన అన్ని కేంద్రాల్లో విజయవంతమైంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిఘటన మూవీ అయితే తెలుగు సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. సమాజాన్ని మంచి దారిలో నడిపించాలనుకునే ఒక టీచర్ ఎందుకు హంతకురాలిగా మారిందనే లైన్ తో తీసిన ఆ సినిమా లో విజయ శాంతి నట విశ్వరూపాన్ని చూడవచ్చు. క్లైమాక్స్ లో విలన్ చరణ్ రాజ్ ని విజయ్ శాంతి చంపటం ఆ సినిమా మొత్తానికే హైలెట్. అలాగే ఆ  సినిమా లోని సాంగ్స్ అన్ని కూడా ఒక ఊపు ఊపాయి .అలాగే నీ తల్లి శరీరంలో ఏమైతే ఉంటాయో వేరే ఆడదాని శరీరం లో కూడా అవే ఉంటాయి అని విజయశాంతి ఒక పాట రూపం లో చెప్పటం నిజంగా చాలా గొప్పగా ఉంటుంది .ఆ తర్వాత  వచ్చిన రేపటి పౌరులు మూవీ కుడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.రేపటి సమాజానికి ఇప్పటి పిల్లలే పునాది మీరే ఈ దేశ భావి పౌరులు అనే కధ తో ఆ సినిమా తెరకెక్కింది.ఇతర బాషలో ఒక సినిమా కి కృష్ణ గారు దర్సకత్వం వహించారు. ఆయన తెలుగులో తెసిన ఆరు సినిమాల్లోనూ విజయ శాంతే కధానాయిక. ఆయన దురదృష్టశాతవాతు అనారోగ్యంతో 35 ఏళ్ళ వయసులోనే చనిపోయారు. ఆయన ఉండి ఉంటే ఎప్పుడో దారి తప్పిపోయిన ఈ సమాజాన్ని ఆయన సినిమాల ద్వారా బాగుచేసేవాళ్ళేమో. ఓటు విలువు తెలియకుండా ఓటుని అమ్ముకొని రాక్షసులని ,నరహంతకులని, దోపిడీదారుల్ని ఎన్నుకునే ఈ సమజాన్ని మర్చేవారేమో, తమ కులం వాడని మతం వాడని అవినీతి పరులకి ఓట్లు వేసే జనాన్నిమర్చేవాడేమో అలాగే టి.కృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి  ఇప్పుడున్న దర్శకులు అయినా సినిమా అంటే ఏమిటో అర్ధం తెలుసుకొని టి.కృష్ణ గారిలా సామజిక విలువలతో  సినిమాలు తీసి సమాజాన్ని బాగు చెయ్యాలని కోరుకుంటున్నాం. టి.కృష్ణ గారి వారసుడి గా  సినిమా పరిశ్రమలో ఆయన కుమారుడు గోపీచంద్ హీరోగా రాణిస్తూ ఉన్నారు.  

పుట్టిన 38 ఏళ్ళకు దాసరి మొదటి బర్త్ డే వేడుకలు.. ఎన్టీఆర్ దగ్గరుండి కేక్ కట్ చేయించారు 

ఎవరి జీవితంలో అయినా మొదట జరుపునే  నిజమైన పండగ ఏంటి అంటే అది వారి పుట్టిన రోజు పండగ మాత్రమే. తమ పుట్టిన రోజు పండగ వస్తుందంటే చాలు ఆ ముందు రోజు  రాత్రి నుంచే వాళ్ళ ఉత్సాహం ఒక లెవెల్లో ఉంటుంది. ఉదయాన్నే లేచి  స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తల్లి తండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫ్రెండ్స్ కి స్వీట్స్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అలాగే ఆ రోజు మొత్తం షికార్లు కూడా చేస్తుంటారు. కానీ తెలుగు సినిమాని శాసించిన ఒక వ్యక్తి, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం తన కీర్తి అజరామరంగా ఉండేలా చేసుకున్న ఒక మహా శక్తీ, ఎంతో మంది సినిమా వాళ్ళకి గురువు అయిన ఒక  వ్యక్తి తను పుట్టిన 38 సంవత్సరాల దాకా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఇది నిజం. స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పిన పచ్చి నిజం. దాసరి నారాయణ రావు పుట్టుక,జన్మస్థలం,ఆయన చదువు ,నాటకరంగం లో ఆయన సాధించిన విజయాలు, సన్మానాలు తో పాటు హైదరాబాద్ లో అయన చేసిన ఉద్యోగం, పద్మ గారితో పరిచయం, ఆ తర్వాత నటుడు అవ్వాలని మద్రాస్ చేరడం,కుదరకపోవడం, ఆ తర్వాత రచయితగా పనిచెయ్యడం, అక్కడనుంచి దర్శకుడిగా మారి చరిత్ర సృష్టించే సినిమా లు చెయ్యడం లాంటి దాసరి చరిత్ర మొత్తం అందరికి తెలిసిందే. బహుశా భారతీయ సినీ చరిత్రలో హీరోల పూర్తి జీవితం గురించి  తెలుసుకొనే జనం దాసరి చరిత్ర గురించి కూడా తెలుసుకున్నారంటే దాసరి కెపాసిటీ అర్ధం చేసుకోవచ్చు. అలాగే భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక దర్శకుడికి అభిమాన సంఘాలు ఉండటం దాసరితోనే స్టార్ట్ అయ్యింది. హీరోలతో పాటు సమానంగా ఆయనకి అభిమాన సంఘాలు ఉండేవి.   ఇంతటి ఘన చరిత్ర ఉన్న దాసరి తనకి 38 సంవత్సరాలు వచ్చే వరకు పుట్టిన రోజు జరుపుకోలేదు. దాసరి నోటివెంట ఆ మాట విన్న ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు.ఆయన చెప్పిన మాటల్ని బట్టే దాసరి గారికి ఒక వయసు వచ్చిన దగ్గర  నుంచి నా పుట్టిన రోజు పలానా తారీఖున అని ఆయనకీ తెలుసు కానీ పేదరికం వలన ఆయన పుట్టిన రోజుకి కొత్త బట్టలు వేసుకోవడం కేకు కొయ్యడం చాక్లెట్ లు పంచడం లాంటివి చెయ్యలేదు. అసలు ఆయన పసి పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా దాసరి పుట్టిన రోజుని ఇంట్లో వాళ్ళు చెయ్యలేదు. అలాంటిది దాసరి సినిమాల విజృంభణ కొనసాగుతున్న రోజుల్లో ఆయన నుంచి కటకటాల రుద్రయ్య అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో చెన్నై లోని ఆయన ఆఫీస్ ఎప్పుడు కిటకిట లాడుతూ ఉండేది. ఒక రోజు దాసరి ఆ సినిమా షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత దాసరి తన ఆఫీస్ కి వెళ్ళాడు. లోపల ఒక పెద్ద కేక్ ఉండటంతో పాటు ఇళ్ళు మొత్తం ఫుల్ గా డెకరేషన్ కూడా చేసి ఉంది. దాసరికి ఏమి అర్ధం కాలేదు. అక్కడే ఉన్న ఆయన సతీమణి పద్మ, ఆయన శిష్యులు ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే దాసరి నారాయణ రావు గారు అని అనడంతో దాసరికి విషయం అర్ధం అయ్యింది. ఇక్కడే ఇంకో అద్భుతమైన విషయం కూడా జరిగింది. దాసరి ఇంటికి ఎదురుగా నందమూరి తారక రామారావు ఇల్లు ఉంటుంది. ఒక షూటింగ్ నుంచి ఎన్టీఆర్ తన ఇంటికి వెళ్తుంటే దాసరి ఇంటి దగ్గర హడావిడి చూసి విషయం తెలుసుకొని లోపలకి వెళ్లి దాసరితో "ఏం దాసరి గారు మమ్మల్ని పిలవకుండా పుట్టిన రోజు జరుపుకుంటారా" అని అంటే అప్పుడు దాసరి ఎన్టీఆర్ తో "సార్ నా లైఫ్ లో ఇంతవరకి పుట్టిన రోజు జరుపుకోలేదు పైగా ఈ హంగామా అంత కూడా నాకు తెలియదు. సుమారు 38 ఏళ్ళ తర్వాత ఈ రోజే  పుట్టిన రోజు జరుపుకుంటున్నాను" అని చెప్పారు. ఆ తర్వత ఎన్టీఆరే దగ్గరుండి మరి దాసరి చేత కేకు కోయించి తినిపించారు. ఏ ముహూర్తాన ఎన్టీఆర్ దాసరి చేత కేకు కోయించారో గాని అప్పటినుంచి దాసరి పుట్టిన రోజు వేడుకలు ఆయన చనిపోయే వరకు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు తెలుగు సినీ పరిశ్రమకి పండగ రోజు అయ్యింది. అలాగే  ఆయన ప్రతి పుట్టిన రోజుకి భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు తెలుగు చిత్రరంగం నుంచే కాకుండా భారతీయ సినీ రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్ లు అలాగే ఆల్ టెక్నిషియన్స్ దాసరిని కలిసి ఆయనకీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. దాసరి ప్రతి పుట్టిన రోజుకి సుమారు 15 వేల మందికి  తగ్గకుండా భోజనం  ఏర్పాటు చేసేవారు. అన్నట్టు దాసరి పుట్టిన రోజు మే 4. ఆ రోజున తెలుగు చలన చిత్ర దర్శకుల డే కూడా. దాసరి మీద గౌరవంతో మే 4న దర్శకుల దినోత్సవం గా జరుపుకుంటారు.

చిరంజీవి రిజెక్ట్ చేసాడు..మోహన్ బాబు కెరీర్ కి అదే ప్లస్ 

  ఒక్క సినిమా విజయం... అప్పటివరకు వరుస ప్లాప్ సినిమాలతో విసుగెత్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న ఆయన్ని ఆపింది. అంతే కాదు ఆ సినిమా విజయానికి  ముందు కోట్ల విలువ చేసే ఆస్తులని సైతం  అమ్ముకున్న ఆయన చేత తిరిగి అవే ఆస్తులని ఆ సినిమా కొనుక్కునేలా చేసింది.అంతే కాదు ఇంక సినీ పరిశ్రమలో ఆ నటుడ్ని అగ్ర హీరో గా చేసి సినీ పరిశ్రమలో శాశ్వత స్థానాన్ని కూడా ఆ సినిమా  కల్పించింది. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. ఆయనకి అన్ని ఇచ్చిన ఆ సినిమా అసలు ఆయన  చెయ్యాలసిన సినిమా కాదు. ఇంకో అగ్ర హీరో చెయ్యాలసిన సినిమా. కానీ ఆయన  కథ తనకి సూట్ అవదని చెప్పడం తో ఆ నటుడి వీర విహారం స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? హీరో ఎవరు? వద్దన్న హీరో ఎవరు ? 1990 వ దశకంలో నటప్రపూర్ణ ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఏ ముహూర్తాన మోహన్ బాబు అల్లుడు గారు మూవీ చేసాడో గాని అక్కడి నుంచి సినిమా రంగంలో ఆయన విజయ పరంపర  ఒక  రేంజ్ లో కొనసాగింది. అది ఎంతలా అంటే  తీసిన ప్రతి సినిమా ఆల్ సెంటర్స్ లో సెంచరీ  కొట్టింది. సెంచరీ కొట్టడమే కాదు చాలా సెంటర్స్ లో అప్పటి వరకు ఇతర హీరోల పేరు మీద ఉన్న రికార్డ్స్ అన్నిటిని తుడిపేసాయి. అలా కాలక్రమంలో మోహన్ బాబు అల్లుడుగారు  విజయం ఇచ్చిన ఉత్సాహం తో అంచలంచలుగా ఎదిగి  విద్యాసంస్థలని  నెలకొల్పే  స్థాయికి  వెళ్ళాడు..ఇక అసలు విషయంలోకి వస్థే మోహన్ బాబు హీరోగా  రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు మూవీని  మొదట చిరంజీవితో చెయ్యాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. అనుకున్నదే తడువుగా చిరంజీవిని సంప్రదించడం చిరంజీవి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది  ఇంక సినిమా పరిశ్రమ మొత్తం ఒకటే చర్చ చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేయబోతున్నాడని  హిట్ కాంబినేషన్ మళ్ళి రెడీ అవుతుందని ఒకటే చర్చ.ఎందుకంటే అప్పుడే చిరంజీవి,రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో అప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ వచ్చి తెలుగు సినిమాకి రికార్డులు అంటే ఎలా ఉంటాయో రుచి చూపించింది. తిరిగి ఆ రికార్డులని  అల్లుడుగారు మూవీ తో బ్రేక్ చెయ్యాలని రాఘవేంద్రరావు అనుకుంటుండగా చిరంజీవి నుంచి కబురు వచ్చింది .అల్లుడు గారు సినిమా చెయ్యనని  అందుకు చిరంజీవి కారణాన్ని కూడా చెప్పారు.కథ క్లైమాక్స్ లో ఉరిశిక్షకి తాను జైలుకి వెళ్తే ఫాన్స్ కి నచ్చదని అనడం తో  చిరంజీవి నిర్ణయం తో ఏకిభవించిన రాఘవేంద్రరావు  క్లైమాక్స్ లో చేంజ్ లు చెందామని  అనుకున్న అసలు సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి వుంది కదా అని అనుకున్నారు. ఇంక ఆ తర్వాత రాఘవేంద్రరావు మోహన్ బాబుని హీరో గా ఎంచుకొని అల్లుడుగారు సినిమా  చెయ్యడం జరిగింది. మూగ వాడైన తన కొడుకు మాట్లాడాలంటే  ఆపరేషన్ చెయ్యాలని  ఆ డబ్బు కోసం జైల్లో ఉన్న మోహన్ బాబు తప్పించుకుంటాడు  ఇంకో పక్కన కోటిశ్వరాలు  అయిన శోభన అమెరికా నుంచి వస్తున్న తన తండ్రి ఆరోగ్యం కోసం తన భర్తగా నటించేవాడి కోసం చూస్తుంటుంది . ఈ క్రమంలో ఒకరి అవకాశం కోసం ఒకరు మోహన్ బాబు శోభనలు  భార్య భర్తలు గా నటిస్తుంటారు  ఈ క్రమంలో ఇద్దరి మధ్య శోభన తండ్రికి తెలియకుండా గొడవలు జరుగుతుంటాయి .ఆ తర్వాత నిజంగానే శోభన మోహన్ బాబు ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది .కానీ మోహన్ బాబు తన గత జీవితం గురించి శోభన కి చెప్తాడు.ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని అనుకోకుండా తన చేతులతో తానే ఎలా చంపుకున్నాడో చెప్పి తన కొడుకుని శోభనకి అప్పచెప్పి మోహన్ బాబు ఉరిశిక్ష ని అనుభవించడానికి వెళ్లడంతో చిత్రం ముగుస్తుంది. సినిమా ప్రారంభం అయిన గంటన్నర దాకా ఫుల్  కామెడీ జోన్ లో సాగుతూ  చివరి అర్ధగంట మాత్రం ప్రేక్షకులకి కన్నీళ్లు తెప్పిస్తుంది.అసలు క్లైమాక్స్ సీన్ లో మోహన్ బాబు ని చూసి కన్నీళ్ళు పెట్టుకొని వారు ఉండరు. అలాగే సినిమా లో ని అన్ని పాటలు కూడా సూపర్ హిట్.ఈ సినిమా లో మోహన్ బాబు శోభన,సత్యనారాయణ ,చంద్రమోహన్ ల నట విశ్వరూపాన్ని చూడవచ్చు.అల్లుడు గారు చిత్రాన్ని మోహన్ బాబే తన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మోహన్ బాబు కి అంతటి మంచి సినిమా రావటానికి మెగాస్టార్ చిరంజీవే కారణం కదా..  

భానుమతి ఆ సినిమా చేసుంటే సావిత్రి మహానటి అయ్యేదేనా?

ఈ విశ్వం లో ఎన్ని మార్పులు సంభవించినా,మనుషుల్లో  విభిన్నమైన పోకడలు ఎన్ని వచ్చినా,చరిత్ర తన తాలూకు యొక్క రూపం మార్చుకున్నా సరే సినిమా అనేది మాత్రం ఎప్పుడు శాశ్వతంగానే  ఉంటుంది. సినిమాలో నటించిన నటులు, నటీమణులు,సాంకేతిక నిపుణులు కూడా శాశ్వతం గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.అలా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సినిమా మిస్సమ్మ అయితే శాశ్వతంగా నిలిచిపోయిన నటీమణి సావిత్రి. మిస్సమ్మ సినిమా తో స్టార్ డమ్ ని అందుకొని  రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన సావిత్రి  మొదట మిస్సమ్మ సినిమా లో హీరోయిన్ కాదని మీకు తెలుసా? అప్పటికే టాప్ కథానాయికగా వెలుగొందుతున్న భానుమతి మిస్సమ్మ కధానాయకని ఆ తర్వాత భానుమతిని తీసేసి సావిత్రిని తమ సినిమా లో కథానాయకిగా నిర్మాతలు ఎంచుకున్నారని, ఆ సినిమాతోనే సావిత్రి ప్రభంజనం స్టార్ట్ అయ్యిందని మీలో ఎంతమందికి తెలుసు?  సావిత్రి కి మిస్సమ్మ ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.తన అందంతో ,తన మాట మాత్రమే గెలవాలనే పట్టుదలతో వచ్చే కోపం తో అద్భుతమైన నటనని ప్రసాదించి మిస్సమ్మ  సినిమా ఈ రోజు వరకు జనాల గుండెల్లో కొలువుతీరి ఉండేలా చేసింది.అంతటి గొప్ప పాత్ర రావటానికి ఏ ఆర్టిస్ట్ కి అయిన నిర్మాతో దర్శకుడో కారణం అవుతారు..కానీ సావిత్రి కి మిస్సమ్మ సినిమా రావటానికి ఆ సినిమా తో సావిత్రి తెలుగు సినిమా ని శాసించి కోట్లాది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరడానికి భానుమతి కారణం అనే విషయం మీకు తెలుసా? అది 1955 వ సంవత్సరం..విజయా ప్రొడక్షన్ పై మిస్సమ్మ అనే పేరుతో  బి.నాగిరెడ్డి ,చక్రపాణిలు నిర్మాతలుగా సినిమాని ప్రారంభించారు.ఆ రోజుల్లో విజయా బ్యానర్ లో నటించాలంటే పెట్టి పుట్టాలని అనే వాళ్ళు. అప్పటికే ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా ముందుకు దూసుకు పోతున్న భానుమతిని టైటిల్ రోల్ గా తీసుకొని ఎన్టీఆర్,నాగేశ్వరావు ల తో పాటుగా ఇంకో ముఖ్య పాత్రలో విశ్వ విఖ్యాత నటన సార్వభౌమ ఎస్.వి రంగారావు ని తీసుకొని  నిర్మాతలు మిస్సమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం భానుమతికి సంబంధించిన  కొన్ని కీలక సన్నివేశాలని కూడా దర్శకుడు ఎల్.వి ప్రసాద్ చిత్రీకరించడం జరిగింది. కానీ ఆ తర్వాత భానుమతికి చిత్ర నిర్మాతలైన చక్రపాణి,నాగిరెడ్డి లకి మధ్య గొడవ జరగడంతో భానుమతి సినిమా లో నటించానని చెప్పింది.మొదటి నుంచి ముక్కుసూటి తత్వానికి మారుపేరైన  చక్రపాణి ,నాగిరెడ్డిలు భానుమతి ని బతిమాలాడకుండా భానుమతి మీద చిత్రీకరించిన సన్నివేశాలకి సంబందించిన రీల్స్ మొత్తాన్ని తగలబెట్టి  ఇంకో కథానాయకి కోసం అన్వేషణ ప్రారంభించారు. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన భానుమతి  నిర్మాతలతో మీ మిస్సమ్మ సినిమాలో కధానాయిక బాగా నటిస్తానే  మీ సినిమా హిట్ అవుతుంది లేదా ఢమాల్ అంటుంది  నాలాగా నటించే నటి మీకు దొరకదు కాబట్టి మీరు ఈ సినిమా  ఇంక తియ్యకుండా ఉంటే మంచిది అని అంది. దాంతో నిర్మాతలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని భానుమతి లాగ నటించే నటి కోసం అన్వేషణ చేస్తున్నారు .అప్పుడప్పుడే  నటనలో ఓనమాలు దిద్దుకుంటున్న సావిత్రికి మిస్సమ్మ క్యారక్టర్ ఉందని తెలిసి నిర్మాతలని సంప్రదించింది.వాళ్ళు అనుమానంగానే సావిత్రి మీద ముందు కొన్ని సన్నివేశాలు తియ్యడం వాటి రషెస్ చూసుకొని  సావిత్రి కి మిస్సమ్మ సినిమా లో అవకాశం ఇవ్వడం జరిగింది.  ఇంక చెన్నై ఫిలిం సర్కిల్స్ లో ఎక్కడ చూసిన ఒకటే చర్చ. మిస్సమ్మ టైటిల్ రోల్ లో భానుమతి గారిలా సావిత్రి నటించి ఆ పాత్రకి న్యాయం చెయ్యలేదని.  అలాగే భానుమతి కూడా మిస్సమ్మలో తన బదులు ఎవరో కొత్త అమ్మాయి సావిత్రిని పెట్టుకున్నారంట సినిమా ప్లాప్ అవుతుందని  తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గర అంటూ ఉండేది .సినిమా కంప్లీట్ అయ్యింది. చెన్నైలో సినీ ప్రముఖుల కోసం డిస్ట్రిబ్యూటర్ల  కోసం షో వేసారు. ఇంక అంతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు సావిత్రి నటనకి ముగ్ధులయ్యిపోయి భానుమతి గారు కూడా ఇంత బాగా చేసేవారు కాదు అనే పేరుని పొందింది. మిస్సమ్మ సినిమాలో సావిత్రి నట విశ్వరూపాన్ని చేసేటందుకు మన రెండు కళ్ళు చాలవు. కళ్ళ కపటం ఎరుగని బడి పంతులమ్మగా తన మాటే నెగ్గాలని లేకపోతే వాళ్ళ అంతు చూస్తానని బుంగమూతి పెట్టి తన నటనతో  సావితి ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ ,ఎస్ వి ఆర్ లాంటి  నటులకి ధీటుగా నటించి సావిత్రి రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమని శాసించే స్థాయికి ఎదుగుతుంది అనేలా చేసుకుంది.ఆ తర్వాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో భానుమతి కి సావిత్రి  కనపడితే మిస్సమ్మ సినిమాలో చాలా బాగా చేసావు నేను కూడా ఆంత బాగా నటించివుండేదాన్ని కాదు అని అంది .భానుమతి కనుక మిస్సమ్మ సినిమా చేసి ఉంటే సావిత్రి అగ్ర కథానాయకిగా ఎదిగేది కాదేమో?  

చిరంజీవిని తన సినిమాలో వద్దన్న దాసరి 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ బతికి ఉన్నంత కాలం దాసరి నారాయణ రావు  అనే పేరు మాత్రం ఎప్పటికి  చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది.ఎన్నో మంచి సినిమాలు ఆయన నుండి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో రంజింప చేసాయి.అలాగే ఎంతో మంది కొత్తవాళ్ళకి తన సినిమాలో అవకాశాలు ఇచ్చి వాళ్ళ సినిమా కెరియర్ కి ఎంతగానో తోడ్పాటుని అందించారు. అలాగే తెలుగు చిత్ర సీమలో చిరంజీవి కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. తనకి మాత్రమే సాధ్యమయ్యే డాన్సులు ఫైట్స్ ,యాక్టింగ్ తో తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతూ వస్తున్నారు.మరి  చిరంజీవిని  దాసరి నారాయణ రావు తన సినిమాలో వద్దన్నాడన్న విషయం మీకు తెలుసా? కొత్త వాళ్ళని  ప్రోత్సహించి  తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు సుస్థిర  స్థానాన్ని పొందేలా వాళ్ళకి నటనలో మెరుగులు దిద్హేలా చేసే దాసరి చిరంజీవిని తన సినిమాలో ఎందుకు వద్దన్నాడు. అవి దాసరి నారాయణ రావు దర్శకత్వం లో సినిమా వస్తే చాలు జనం థియేటర్స్ కి ఎగబడి  వెళ్తున్న రోజులు. వరుస హిట్ లతో నెంబర్ వన్ డైరెక్టర్ గా దాసరి అప్రహాతీతంగా ముందుకు  దూసుకుపోతూ సినిమా హీరోయిన్ కధాంశంతో శివ రంజని అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీలో టైటిల్ రోల్ పాత్రలో జయసుధని దాసరి ఫిక్స్ చేసారు. ఇంక తాను రాసుకున్న కథ ప్రకారం జయసుధ సరసన నటించబోయే  హీరో కోసం దాసరి అన్వేషణలో పడ్డారు.కథ డిమాండ్ ప్రకారం హీరో క్యారక్టర్ కి కొత్త కుర్రోడు కావాలని దాసరి ఫిక్స్ అయ్యాడు.హీరో కి సంబంధించి అన్వేషణలో పడిన దాసరికి  తెలిసిన వాళ్ళ ద్వారా ముగ్గురు కొత్త  కుర్రోళ్ళు సినిమాల కోసం ప్రయతిస్తు ఉన్నారని తెలిసింది .దీంతో దాసరి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి కబురు పెట్టారు. ఇంక ఆ ముగ్గురు కుర్రోళ్ళ విషయాన్ని వస్తే ఆ ముగ్గురు కూరోళ్ళు ఎవరో కాదు. ఒకరు మెగా స్టార్ చిరంజీవి ఐతే ఇంకొకరు కామెడీ యాక్టర్ సుధాకర్ అలాగే హరి ప్రసాద్ .ఈ హరి ప్రసాదే  తర్వాత రోజుల్లో చిరంజీవితో యముడికి మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ని నిర్మించాడు.ఇంక అసలు విషయంలోకి వస్తే దాసరి తన శివరంజని సినిమా కోసం ముగ్గురు కురాళ్ళ ఉన్నారని తెలిసి చిరంజీవి వాళ్ళకి కబురు పంపాడు.ఆ సమయం లో చిరంజీవి ,సుధాకర్ లు రూమ్ లో  లేరు. హరిప్రసాద్  ఒక్కడే ఉన్నాడు. దాసరి నుంచి కబురు వచ్చిందని తెలిసి హరిప్రసాద్ దాసరి దగ్గరకి వెళ్ళాడు.హరి ప్రసాద్ ని  చూసిన దాసరి తన సినిమా హీరోగా హరి ప్రసాద్ ని ఫిక్స్ చేసుకున్నాడు  ఆ తర్వాత  చిరంజీవి దాసరి నుంచి కబురు వచ్చిన విషయం తెలుసుకొని దాసరి ని  కలిస్తే దాసరి చిరంజీవి తో హరిప్రసాద్ ని తీసుకున్నానని  చెప్పటంతోచిరు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు .ఇలా దాసరి చిరంజీవిని  తన సినిమాకి వద్దని అన్నాడు.    

లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలివే.. కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా

లతా మంగేష్కర్.. సంగీత ప్రియులకు ఈ పేరే ఓ మధురగీతం విన్న భావన కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరాదికి చెందిన లత ప్రధానంగా హిందీలోనే పాటలు పాడినప్పటికీ.. బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, నేపాలీ, ఒడియా, పంజాబీ, సింహళ, తమిళ్, తెలుగు, బహస, భోజ్ పురి, సింధీ, ఉర్దూ, కొంకణి, తుళు, మరాఠీ భాషల్లోనూ పలు గీతాలు ఆలపించి తన గాత్రంతో శ్రోతలను పరవశింపజేశారు.  ఇక తెలుగు గీతాల విషయానికి వస్తే.. ఆమె రెండే రెండు సినిమాల్లో పాటలు పాడారు. అవి కూడా.. అక్కినేని కాంపౌండ్ హీరోల చిత్రాలు కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే పాటని రెండు వెర్షన్స్ లో ఆలపించారు లతాజీ. అందులో ఒకటి సోలో సాంగ్ కాగా.. మరొకటి మధుర గాయకుడు ఘంటసాల మాస్టర్ తో కలిసి పాడిన వెర్షన్.  ప్రముఖ స్వరకర్త సుసర్ల దక్షిణామూర్తి ఈ గీతాలకి సంగీతమందించారు. ఇక రెండో చిత్రం విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున హీరోగా నటించిన ఆఖరి పోరాటం కోసం లత మరోసారి తెలుగు పాట గానం చేశారు. తెల్లచీరకు తకధిమి అంటూ సాగే ఈ యుగళగీతాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతాజీ. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ పాటకు ట్యూన్ కట్టారు. మొత్తమ్మీద.. లతా మంగేష్కర్ పాడిన రెండు పాటలు కూడా అక్కినేని కాంపౌండ్ వే కావడం విశేషం.  (సెప్టెంబర్ 28.. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా)