మేం ముగ్గురం అన్నదమ్ములం అని రామారావుగారు చెప్పడం నన్ను కదిలించింది : కాంతారావు

పాత తరం హీరోల్లో నటరత్న నందమూరి తారక రామారావుని క్రమశిక్షణకు, మంచితనానికి మారు పేరుగా చెబుతారు. దర్శకనిర్మాతల పట్ల, తోటి నటీనటుల పట్ల ఆయన కనబరిచే ప్రేమానురాగాలు ఎంత గొప్పగా ఉంటాయనే విషయాన్ని గతంలో ఎంతో మంది ప్రస్తావించారు. అలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన అలనాటి కథానాయకుడు కాంతారావు విషయంలోనూ జరిగింది. కాంతారావు చివరి రోజుల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ సంఘటన గురించి ఆయన మాటల్లోనే.. ‘భారతీయ సంస్కృతికి అద్దం పట్టే గొప్ప పౌరాణిక చిత్రం ‘లవకుశ’. ఈ చిత్రంలో రామారావుగారు శ్రీరాముడిగా, అంజలీదేవిగారు సీతగా, నేను లక్ష్మణుడిగా నటించాము. అయితే అప్పటికి ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌ ప్రారంభించే సమయానికి నాకు ఇస్నోఫీలియా వచ్చింది. దాంతో నా పర్సనాలిటీ బాగా వీక్‌ అయిపోయింది. షూటింగ్‌ ప్రారంభమైంది. అప్పుడు షాట్‌లో నటిస్తున్న వారందరికీ వారి క్యారెక్టర్ల పేరుతో డైలాగ్‌ పేపర్స్‌ ఇచ్చారు. నాకు మాత్రం కాంతారావు అని పేరు రాసి డైలాగ్‌ పేపర్‌ ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాల్సిన డైలాగ్‌ చెప్పి షాట్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని ఈ విషయం గురించి అడిగాను. ‘ముందు అనుకున్న లక్ష్మణుడి పాత్ర నుంచి మిమ్మల్ని తప్పించి మీకు శత్రుఘ్నుడి పాత్ర ఇవ్వబోతున్నారు. మీ పర్సనాలిటీ తగ్గిందని వారు భావిస్తున్నారు’ అని చెప్పారాయన.   ‘ఆ సాయంత్రం రామారావుగారి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పాను. వెంటనే తన తమ్ముడిని పిలిచి ‘శంకర్‌రెడ్డిగారికి ఫోన్‌ చేసి నా మాటగా చెప్పండి.. ఏ వేషానికి బుక్‌ చేసుకున్నారో ఆ వేషమే ఇవ్వమనండి. అలా వీల్లేకపోతే వారికి ఇచ్చిన అడ్వాన్స్‌ని ఇతర సినిమాలోకి మార్చుకోమని చెప్పండి. అంతేగానీ, ఆర్టిస్టుని అవమానపరచొద్దు’ అంటూ ఆయన చాలా పెద్ద మాట అన్నారు. అదేమిటంటే.. ‘మేం ఇద్దరు అన్నదమ్ములం కాము. ముగ్గురు అన్నదమ్ములం అని ఆయనకి చెప్పండి’ అన్నారు. అది నా జీవితంలో మరపురాని సంఘటన. ఎందుకంటే రామారావుగారికి నా యందు ఉన్న ఆప్యాయత, ఆ ప్రేమ అంత గొప్పది. ఇద్దరం కాదు, ముగ్గురం అన్నదమ్ములం అని చెప్పడంలోని ఆయన గొప్పతనం నన్ను కదిలించి వేసింది’ అన్నారు. 

దర్శకనిర్మాతలు వెంటపడి మరీ చేయించిన ఆ క్యారెక్టర్‌ జయచిత్ర కెరీర్‌లోనే ది బెస్ట్‌ అయ్యింది!

నటీనటులకు కొన్ని క్యారెక్టర్స్‌ అనుకోకుండా లభిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌ చేసిన తర్వాత వారి కోసమే అలాంటి క్యారెక్టర్స్‌ క్రియేట్‌ చేశారా అనిపిస్తుంది. వందల సినిమాల్లో నటించినా కొన్ని క్యారెక్టర్స్‌ ఆయా నటీనటులకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ప్రేక్షకుల మనసుల్లో కూడా ఆ క్యారెక్టర్‌ నిలిచిపోతుంది. అలాంటి ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ జయచిత్ర కెరీర్‌లో ఆమెకు లభించింది. వెంకటేష్‌, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాశి మూవీస్‌ నరసింహారావు నిర్మించిన చిత్రం ‘అబ్బాయిగారు’. ఈ చిత్రంలో జయచిత్ర చేసిన నాగమణి క్యారెక్టర్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది.  1975లో శోభన్‌బాబు హీరోగా నటించిన సోగ్గాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది జయచిత్ర. అంతకుముందే తమిళ్‌లో 40 సినిమాలకుపైగా నటించి అక్కడ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. తమిళ్‌లో, తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించినా ఎప్పుడూ నెగెటివ్‌ క్యారెక్టర్‌ చెయ్యని జయచిత్రకు ‘అబ్బాయిగారు’ చిత్రంలో నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది.  మొదట ఈ సినిమా గురించి నిర్మాత నరసింహారావు.. జయచిత్రను సంప్రదించి తమ సినిమాలోని క్యారెక్టర్‌ చెయ్యాల్సిందిగా అడిగారు. విని ఊరుకున్న జయచిత్ర ఆ తర్వాత దాని గురించి మరచిపోయారు. తెలుగులో జయచిత్రను హీరోయిన్‌గా పరిచయం చేసిన రామానాయుడు ఫోన్‌ చేసి ‘నరసింహారావు సినిమాలో క్యారెక్టర్‌ చెయ్యమంటే బెట్టు చేస్తున్నావట. చాలా మంచి క్యారెక్టర్‌. చేస్తే బాగుంటుంది’ అని చెప్పారు. ఆయన చెప్పిన మాట కూడా విని చేస్తాననిగానీ, చెయ్యను అని గానీ చెప్పలేదు. మరొకరోజు మురళీమోహన్‌ ఫోన్‌ చేసి అదే మాట చెప్పారు. ఇంతమంది చెబుతున్నారంటే ఆ క్యారెక్టర్‌లో ఏదో విశేషం ఉందని భావించిన జయచిత్ర సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది. ఇవివి చెప్పిన కథ అంతా విన్న ఆమెకు క్లైమాక్స్‌ బాగా కనెక్ట్‌ అయిందట. దాని కోసం సినిమా చేస్తానని అన్నారు.  అలా మొదలైన ‘అబ్బాయిగారు’లో జయచిత్ర క్యారెక్టర్‌ సినిమాకే హైలైట్‌ అయిపోయింది. సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది, నాగమణి క్యారెక్టర్‌ పోషించిన జయచిత్రకు చాలా మంచి పేరు వచ్చింది. వాణిశ్రీ, జమున వంటి సీనియర్‌ హీరోయిన్లు జయచిత్రను ప్రత్యేకంగా అభినందించారు. జయచిత్ర తప్ప ఆ క్యారెక్టర్‌లో మరొకరు సూట్‌ అవ్వరన్న ఉద్దేశంతో ఆమెతోనే చెయ్యాలని వెయిట్‌ చేసి ఆమె ఓకే అన్న తర్వాతే సినిమా స్టార్ట్‌ చేశామని ఓ సందర్భంలో ఇవివి చెప్పారు. అలా కొన్ని క్యారెక్టర్స్‌ కొంత మంది ఆర్టిస్టుల కోసమే అన్నట్టు ఉంటాయని జయచిత్ర చేసిన క్యారెక్టర్‌ చూస్తే అర్థమవుతుంది. 

ఆ కారణంతోనే మేనత్త కూతుర్ని కాదని బయటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అక్కినేని!

నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల్లో ఆయన పెళ్లి కూడా ఒకటి. అక్కినేని కుటుంబంలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఆయన సోదరులు కూడా చదువుకోలేదు. అప్పటికే పాతిక ఎకరాల భూమిని కలిగి వున్న ఆ కుటుంబంలో ఎఎన్నార్‌ చదువుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ, తమ కుటుంబంలో చదువుకున్నవారు లేరు కాబట్టి అక్కినేనిని కూడా చదివించడం వృధా అని భావించింది ఆయన తల్లి. చిన్న చిన్న నాటకాలు వేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి అందులోనే పేరు తెచ్చుకుంటాడేమోనని నాటకాలను ప్రదర్శించే వ్యక్తికి ఎఎన్నార్‌ను అప్పగించారు. అలా మొదటి నాటకం ద్వారా అర్థ రూపాయి సంపాదించారు అక్కినేని. ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్‌లో  ఘంటసాల బలరామయ్య.. అక్కినేని చూడడం.. సినిమాల్లో అవకాశం ఇస్తాను రమ్మనడం జరిగిపోయింది. మద్రాస్‌ ప్రయాణానికి రెడీ అవుతున్న సమయంలో అక్కినేని తల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెళ్లేది సినిమాల్లోకి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, తన బిడ్డ చెడు సావాసాలు పడతాడేమోనని భయపడి పెళ్లి చేసేసి పంపిస్తే మరో అమ్మాయి జోలికి వెళ్లడు అనుకుంది. అక్కినేని చిన్నతనం నుంచే అతని మేనత్త కూతుర్ని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారు. తన అన్నయ్య కూతురే కావడంతో విషయం అతనికి చెప్పింది అక్కినేని తల్లి.  అప్పటికి ఎఎన్నార్‌ వయసు 19 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. కొడుకు గురించి బాధ పడుతున్న తల్లిని చూసి ఆమె అన్నయ్య, అక్కినేని మేనమామ ఓ మాట అన్నాడు.. ‘అబ్బాయి తల్లివి అయి వుండి నువ్వే అంత భయపడితే.. సినిమా వాడికి పిల్లనివ్వాల్సిన నేనెంత ఆలోచించాలి’ అన్నాడు. ఆ సమయంలో అక్కినేని ‘అప్పుడే నాకు పెళ్లేంటి.. నేను జీవితంలో ఇంకా స్థిరపడలేదు. మద్రాసు వెళుతున్నాను.. అక్కడ అవకాశాలు వస్తాయో రావో కూడా నాకు తెలీదు. కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్లి తలపెట్టకండి’ అన్నారు. అంతలోనే తల్లి తన గురించి మనసులో ఏమనుకుంటుందో గ్రహించిన అక్కినేని ‘నీ మీద ఒట్టువేసి చెబుతున్నాను. ఎలాంటి చెడ్డ పనులు అక్కడ నేను చేయను. నన్ను నమ్ము’ అని తల్లికి మాట ఇచ్చారు.  1944లో ‘సీతారామ జననం’ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకుడిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు అక్కినేని. ఆ తర్వాత మరో ఐదు సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్లాడన్న కారణంతోనే మేనమామ తన కూతుర్ని ఇచ్చి చేసేందుకు ఇష్టపడలేదట. అందుకే బయటి అమ్మాయిని చేసుకున్నారు అక్కినేని. విశేషం ఏమిటంటే అక్కినేని కెరీర్‌లో గొప్ప సినిమాగా చెప్పుకునే ‘కీలుగుర్రం’ చిత్రం 1949 ఫిబ్రవరి 19న విడుదలైంది. అంతకుముందు రోజే అక్కినేని వివాహం జరిగింది.  తన కెరీర్‌లో 250కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ తల్లికి ఇచ్చిన మాటను అక్కినేని మరచిపోలేదు. ఏరోజూ హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎవరితోనూ ఎఫైర్లు పెట్టుకోలేదు. ‘సినిమాల్లో ఉన్నవారంతా చెడ్డవారు కాదు. ఒక్కరు తప్పు చేసినా సినిమా వాళ్ళందర్నీ తప్పుబడతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్‌ అటువంటిది ’ అనేవారు డా.అక్కినేని నాగేశ్వరరావు.  

ఎన్టీఆర్‌, పూరి ఇద్దరూ అడిగినా ఆ క్యారెక్టర్‌ నారాయణమూర్తి ఎందుకు చెయ్యలేదో తెలుసా?

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్‌’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. 2004లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవలేదు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత 2015లో బండ్ల గణేష్‌ నిర్మాతగా ‘టెంపర్‌’ చిత్రం తెరకెక్కింది. ఒక డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా ఘనవిజయం సాధించి కలెక్షన్లపరంగా సంచలనం సృష్టించింది.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. అతని దగ్గర పనిచేసే కానిస్టేబుల్‌ క్యారెక్టర్‌ను పోసాని కృష్ణమురళి పోషించారు. రచయితగా, నటుడిగా ఎన్నో విజయాలను అందుకున్న పోసానికి తన కెరీర్‌లోనే గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమాలోని మూర్తి అనే పాత్ర. వాస్తవానికి ఈ క్యారెక్టర్‌ను పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తితో చేయించాలనుకున్నాడు పూరి జగన్నాథ్‌. తనకు ఎంతో ఇష్టమైన నటుడు నారాయణమూర్తి అని ఎన్నో సందర్భాల్లో పూరి జగన్నాథ్‌ చెప్పారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన తర్వాత ఆర్‌.నారాయణమూర్తి చేసిన సినిమాలన్నీ విప్లవ నేపథ్యం లేదా ప్రజా సమస్యల నేపథ్యంలో రూపొందినవే. ‘టెంపర్‌’ చిత్రంలోని మూర్తి క్యారెక్టర్‌ కూడా నారాయణమూర్తి మనస్తత్వాన్ని పోలి ఉంటుంది. అందుకే అతనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడని భావించిన పూరి.. నారాయణమూర్తిని సంప్రదించి విషయం చెప్పాడట. కానీ, తను ఆ క్యారెక్టర్‌ చెయ్యలేనని ఎంతో సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాడట. ఎన్టీఆర్‌ కూడా ఈ విషయంలో నారాయణమూర్తిని రిక్వెస్ట్‌ చేశాడట. కానీ, లాభం లేకపోయింది.  పూరి జగన్నాథ్‌లాంటి టాప్‌ డైరెక్టర్‌ చేస్తున్న సినిమా పైగా ఎన్టీఆర్‌ లాంటి టాప్‌ హీరో కాంబినేషన్‌లో చేసే క్యారెక్టర్‌ను ఎందుకు కాదన్నాడు అనేది పూరికి, ఎన్టీఆర్‌కి అర్థం కాలేదు. మూర్తి పాత్ర తను చేయకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆ తర్వాత ఓ సందర్భంలో వెల్లడిరచారు నారాయణమూర్తి. ‘‘టెంపర్‌’లోని మూర్తి క్యారెక్టర్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో డౌట్‌ లేదు. అంత మంచి క్యారెక్టర్‌ నాతో చేయించాలనుకున్న పూరికి నేను సెల్యూట్‌ చేస్తున్నాను. నాతో ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయించాలనే ఉద్దేశంతోనే పూరి నన్ను సంప్రదించారు. ఎన్టీఆర్‌ కూడా ఎంతో ప్రేమగా ఈ విషయాన్ని అడిగారు. అయినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే జూనియర్‌ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశాను. చివరికి హీరోని అయ్యాను. అందుకే ఇకపై మళ్ళీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే పూరి ఇచ్చిన ఆఫర్‌ను కాదన్నాను. అంతే తప్ప మరో కారణం ఏమీ లేదు’ అన్నారు నారాయణమూర్తి.  

డబ్బులిస్తేనే గానీ శోభన్‌బాబు షూటింగ్‌కి వచ్చేవారు కాదు. ఎందుకో తెలుసా?

  కొందరికి నటన హాబీ, మరికొందరికి అదే జీవనాధారం. కొంతమంది నటీనటులు కోటీశ్వరుల కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ నటనపై తమకు ఉన్న ఆసక్తి కారణంగానే సినిమా రంగంలో స్థిరపడుతుంటారు. సినిమాలే జీవనాధారంగా ఇండస్ట్రీకి వచ్చినవారు తొలినాళ్ళలో డబ్బుకు ఎంతో ఇబ్బంది పడేవారు. చాలీ చాలని డబ్బుతో జీవనం సాగించేవారు. ఆ తర్వాత నటుడిగానో, నటిగానో నిలదొక్కుకున్న తర్వాత కూడా అదే పద్ధతిని పాటించేవారు. అలాంటి కష్టాల గురించి తెలిసిన కొందరు మాత్రం తమ నిర్మాతల పట్ల, దర్శకుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించేవారు. అలాంటి వారు ఇండస్ట్రీలో తక్కువనే చెప్పాలి. ఎక్కువ శాతం డబ్బు దగ్గర ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. అలాంటి వారిలో శోభన్‌బాబు ఒకరు.  తొలినాళ్ళలో శోభన్‌బాబు కూడా డబ్బుకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అతను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత రెమ్యునరేషన్‌ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. డబ్బు చేతిలో పడితేనేగానీ షూటింగ్‌కి వచ్చేవారు కాదనే మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. నిర్మాత ఇస్తానన్న డబ్బు టైమ్‌కి అందకపోవడం వల్ల షూటింగ్‌కి వెళ్ళని సందర్భాలు కూడా శోభన్‌బాబు కెరీర్‌లో ఉన్నాయని చెబుతారు. అయితే ఆయన డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉండడానికి గల కారణం ఏమిటనే విషయం గురించి కొందరు సీనియర్‌ నటుల దగ్గర ప్రస్తావించినపుడు.. దానికి వారు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలగక మానదు.  శోభన్‌బాబు తన కెరీర్‌ స్టార్ట్‌ చేసిన దగ్గర నుంచి సంపాదించిన ప్రతి రూపాయిని భూమిపైనే పెట్టేవారనే విషయం చాలా మందికి తెలుసు.  అలా ఎంతో భూమిని ఆయన కొనుగోలు చేశారు. దానికి కూడా ఒక లెక్క ఉండేది. శోభన్‌బాబు ఒక సినిమా ఒప్పుకున్నారంటే.. దానికి ఎంత రెమ్యునరేషన్‌ వస్తుంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చెయ్యాలి, ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాలి అనే విషయాలని ఒక నోట్‌బుక్‌లో రాసుకునేవారు. షూటింగ్‌కి కూడా ఆ నోట్‌బుక్‌ తెచ్చుకునేవారు. షాట్‌ బ్రేక్‌లో తను రాసుకున్న వివరాలను పదే పదే చూసుకునేవారు. ఒక సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ అనుకున్న టైమ్‌కి, అనుకున్నంత వస్తేనే షెడ్యూల్‌ ప్రకారం తను కొన్న భూమికి డబ్బు చెల్లించగలుగుతారు. అందుకే ఆ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండేవారు. ఎవరేమనుకున్నా సరే.. తన పద్ధతిని మాత్రం చివరి వరకు మార్చుకోలేదు. అందుకే డబ్బు అందితేనే శోభన్‌బాబు షూటింగ్‌కి వస్తాడనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. 

స్టార్లు లేరు.. స్టోరీ మాత్రమే ఉంది.. అయినా సంవత్సరం ఆడిందా సినిమా!

ఒకప్పుడు మనుషుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండేవి. కుటుంబంలో బంధాలకు, అనుబంధాలకు విలువ వుండేది. రాను రాను అవి అంతరించిపోతూ ఉన్న తరుణం, తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకులు సమాజంలో వేళ్ళూనుకుంటున్న రోజులు, చివరి దశలో ఉన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి కూడా ఆలోచించే కొడుకులు పుట్టుకొస్తున్న రోజులు అవి.. ఈ పరిస్థితిని సరైన సమయంలో ఒడిసి పట్టుకొని ఓ కొత్త దర్శకుడు తీసిన సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. సినిమా చూసిన వారి ముఖాలు మాడిపోయాయి. ఎందుకంటే అప్పుడప్పుడే అలాంటి ఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వాటికి అద్దం పడుతూ తెరకెక్కించిన సినిమా అది. ఆ సినిమాయే ‘తాతమనవడు’.  ‘తాతమనవడు’ దర్శకనిర్మాతలది చాలా విచిత్రమైన ప్రయాణం. దర్శకుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓ వైపు కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తూనే మరో వైపు హిందీ, తెలుగు ట్యూషన్స్‌ చెప్పేవారు. మరోపక్క హైకోర్టు దగ్గర పార్ట్‌టైమ్‌ టైపిస్టుగా పనిచేసేవారు. మరోచోట పార్ట్‌ టైమ్‌ ఎకౌంటెంట్‌గా కూడా పనిచేశారు దాసరి. నిర్మాత కె.రాఘవ ట్రాలీ పుల్లర్‌, ఆఫీస్‌ బోయ్‌, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌, స్టంట్‌ అసిస్టెంట్‌, డాన్స్‌ కంపోజర్‌.. ఇలా సినిమాకి సంబంధించిన ఎన్నో శాఖల్లో ప్రావీణ్యం సంపాదించారు. కొంతమంది భాగస్వాములతో కలిసి జగత్‌ జెంత్రీలు, జగత్‌జెట్టీలు, జగత్‌కిలాడీలు వంటి కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత తనే సొంతంగా ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ను స్థాపించారు. అప్పటికే దాదాపు 50 సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కథకుడిగా, మాటల రచయితగా పనిచేసిన దాసరి నారాయణరావులోని ప్రతిభను గుర్తించిన రాఘవ.. మంచి కథ తెచ్చుకుంటే డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆరోజుల్లో దర్శకుడిగా ఛాన్స్‌ రావాలంటే నిర్మాతను మెప్పించడమే కాదు, డిస్ట్రిబ్యూటర్‌ని కూడా ఒప్పించాలి. అలా ఓ పంపిణీదారుడి ఆఫీస్‌కి వెళ్లి అక్కడి ఇన్‌ఛార్జ్‌కి కథ చెప్పారు. దర్శకుడు కొత్తవాడు కావడంతో ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకున్న ఆ పంపిణీదారుడు కథ నచ్చలేదని రాఘవకు చెప్పారు. ఆ తర్వాత మరో డిస్ట్రిబ్యూటర్‌ కథ విని ఓకే అన్నారు. ఇలా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని 1972లో ‘తాతమనవడు’ షూటింగ్‌ మొదలైంది.  తాత పాత్రకు ఎస్‌.వి.రంగారావును ఓకే చేసుకున్నారు. మనవడి పాత్రకు మొదట శోభన్‌బాబుని అనుకున్నారు. కానీ, చివరికి ఆ అవకాశం రాజబాబుకి దక్కింది. హాస్యపాత్రలు చేసే రాజబాబుకి సినిమాలోని ప్రధాన పాత్ర ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో నాగభూషణం కోసం ఓ క్యారెక్టర్‌ సృష్టించారు దాసరి. ఆ క్యారెక్టర్‌ని అతనితోనే చేయించాలనుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రాఘవకు చెప్పారు దాసరి. ఆయన దానికి ఓకే చెప్పారు. అయితే అతనికి ఇచ్చే రెమ్యునరేషన్‌ ఇదీ.. దానికి ఇష్టమైతే ఆయనతోనే చేయించు అన్నారు. నాగభూషణం అంతకుముందు ఒకే కుటుంబం అనే సినిమాను నిర్మించారు. దానికి దాసరి కో డైరెక్టర్‌గా పనిచేశారు. వాస్తవానికి దాసరి మొదటి సినిమా నాగభూణం నిర్మాతగానే చెయ్యాల్సింది. కానీ, అది సాధ్య పడలేదు. ఇక ‘తాతమనవడు’ సినిమాలో నాగభూషణంతో ఒక క్యారెక్టర్‌ చేయించుకోవాలని ఆశపడ్డ దాసరి కోరిక తీరలేదు. ఎందుకంటే రాఘవ ఇస్తానన్న రెమ్యునరేషన్‌ నాగభూషణంకి నచ్చలేదు. దాంతో ఆ క్యారెక్టర్‌ గుమ్మడికి దక్కింది. మరో క్యారెక్టర్‌ కోసం సూర్యకాంతంని అనుకున్నారు. అంతకుముందు మేనకోడలు అనే సినిమాకి దాసరి డైలాగ్‌ రైటర్‌గా వర్క్‌ చేశారు. అందులో సూర్యకాంతం తన వెర్షన్‌కి సంబంధించిన డైలాగ్స్‌లో ఓ డైలాగ్‌ను ఆమె మార్చేశారు. అది దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్‌ కోసం మంజుల అనే సీనియర్‌ నటిని ఎంపిక చేసుకున్నారు. ఇక కొడుకు పాత్ర కోసం కైకాల సత్యనారాయణను తీసుకున్నారు. అప్పటివరకు విలన్‌ పాత్రలు పోషిస్తూ ఎదుగుతున్న సత్యనారాయణ ఈ సినిమాలో ఓ విలక్షణమైన పాత్రతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవ నిర్మించిన సినిమాలన్నింటికీ ఎస్‌.పి.కోదండపాణి సంగీతాన్ని అందించారు. అయితే ‘తాతమనవడు’ చిత్రానికి మాత్రం రమేష్‌ నాయుడుని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు దాసరి. ఈ సినిమాలోని ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ ‘ఈనాడే బాబు నీ పుట్టినరోజు..’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.  ఈ సినిమాకి దాసరి నారాయణరావు అందుకున్న పారితోషికం నెలకు 200 రూపాయలు. ఈ సినిమాకి ఎస్‌.వి.రంగారావు అందుకున్న పారితోషికం 2,000 రూపాయలు. రూ.5 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను 35 రోజుల్లో పూర్తి చేశారు. డిసెంబర్‌ 27, 1972న ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని 1973 మార్చి 23న విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మొదటి వారం కలెక్షన్స్‌ లేవు. మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో రెండో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. అలా రజతోత్సవం జరుపుకునే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ఈ సినిమాను ప్రదర్శించారు. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతిలలో ఈ సినిమా శతదినోత్సవాన్ని నిర్వహించారు. మద్రాస్‌లోని సవేరా హోటల్‌లో రజతోత్సవాన్ని చేశారు. ‘తాతమనవడు’ చిత్రంతో దాసరి తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటివరకు స్టార్‌ వేల్యూతో ఉన్న తెలుగు సినిమా ‘తాతమనవడు’ చిత్రంతో స్టోరీ వేల్యూకి నీరాజనం పట్టింది. డైరెక్టర్‌కి స్టార్‌ హీరో ఇమేజ్‌ తీసుకొచ్చిన ఘనత దాసరి నారాయణరావుకే దక్కుతుంది. ఎన్టీఆర్‌ సినిమా, ఎఎన్నార్‌ సినిమా అని చెప్పుకున్నట్టుగానే ఇది దాసరి నారాయణరావు సినిమా అని చెప్పుకునే స్థాయికి వెళ్ళారు దాసరి. ‘తాతమనవడు’ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా దక్కాయి. ఉత్తమ ద్వితీయ చిత్రంగా వెండి నందిని గెలుచుకుందీ చిత్రం. ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడిగా దాసరి నారాయణరావు అవార్డులు అందుకోగా, ఉత్తమ నటుడిగా కైకాల సత్యనారాయణ ఎంపికయ్యారు. 

రామానాయుడు అప్పుడా నిర్ణయం తీసుకోకపోతే ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ అనేదే ఉండేది కాదు!

  తెలుగు సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని, మంచి సినిమాలు తీసి గొప్ప నిర్మాత అనిపించుకోవాలని వచ్చినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, సక్సెస్‌ అయిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు మూవీ మొఘల్‌ డా. డి.రామానాయుడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేని రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. తను ఎంతో వేగంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ఘనతను సాధించారు. ఆయన సినీ ప్రయాణంలో తీసుకున్న ఆ నిర్ణయాల వల్లే రామానాయుడు నిర్మాత అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు సురేష్‌బాబు అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నారు, చిన్న కుమారుడు వెంకటేష్‌ హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి రామానాయుడు తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం. రైతు కుటుంబంలో పుట్టిన రామానాయుడు ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండాలని కోరుకునేవారు. తన పక్క పొలం కంటే బస్తా ఎక్కువ పండిరచాలనే పట్టుదల ఉండేది. అప్పటికే వారి కుటుంబానికి 300 ఎకరాల పొలం ఉండేది. అంతేకాకుండా రైస్‌ మిల్లులు కూడా ఉండేవి. వ్యవసాయం చేసుకుంటూనే ఎంతో నిజాయితీగా రైస్‌ వ్యాపారం కూడా చేసేవారు. ఒకసారి రైస్‌ మిల్లుకు సంబంధించి బిల్లులు రాసి పెట్టే విషయంలో కాస్త జాప్యం జరిగిన కారణంగా అధికారులు ఆయనకు ఫైన్‌ వేసారు. అలా ఫైన్‌ వేసిన మరుసటిరోజే ఆ వ్యాపారం తనకు సరిపడదని రైస్‌ మిల్లుని మూసేశారు. ఆయన నిర్ణయానికి కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. ఆ తర్వాత మద్రాస్‌ వచ్చి ఇటుకల వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కూడా వ్యవసాయం లాగే బురదలో పని చెయ్యాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అది కూడా వద్దని చిటికెలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తన బంధువుల సలహాతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చెయ్యాలని తమిళనాడులోనే 90 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాన్ని పక్కన పెట్టి మరో వ్యాపారం ఏదైనా చేస్తే బాగుంటుందని హోటల్‌ వ్యాపారంలోకి దిగారు. స్నేహితులతో కలిసి కొంత పెట్టుబడి పెట్టి ఓ హోటల్‌ని తెరిచారు. మొదటి రోజే అది కూడా సరికాదని ఆరోజే ఆ వ్యాపారానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మద్రాసులోని ఆంధ్రా క్లబ్‌లో సినిమా వాళ్ళు కొందరు పరిచయమయ్యారు. ఏదైనా డబ్బింగ్‌ సినిమా ఉంటే తాను చేసుకుంటానని రామానాయుడు వారిని అడిగారు. అయితే కొందరు స్నేహితులు కలిసి ‘అనురాగం’ అనే సినిమా చేస్తున్నారని, అందులో భాగస్వామిగా చేరమని రామానాయుడికి స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే ఆ సినిమాకి భాగస్వామి అయ్యారు. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ డబ్బు రాలేదు. సినిమాకి పెట్టిన 50 వేల రూపాయలు పోగొట్టుకున్నారు నాయుడు.  ఎలాగైనా ఒక హిట్‌ సినిమా చెయ్యాలన్న కసి రామానాయుడులో పెరిగింది. ఎన్‌.టి.రామారావుతో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. ఆయన్ని తన ఉద్దేశాన్ని చెప్పారు నాయుడు. దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఎన్టీఆర్‌ అంతకుముందే విని వుండడంతో ఆయనకు కూడా నమ్మకం కుదిరింది. దాంతో ఓకే చెప్పారు. తన సినిమాకి తాపీ చాణక్యను దర్శకుడుగా సెలెక్ట్‌ చేసుకున్నారు నాయుడు. అయితే అప్పటికే చాణక్య చేసిన 9 సినిమాలు వరసగా ఫ్లాప్‌ అవ్వడంవల్ల చాణక్య డైరెక్టర్‌ అనగానే అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇచ్చిన మాట తప్పడం రామానాయుడికి అలవాటు లేకపోవడం వల్ల చాణక్యే తన సినిమాకి డైరెక్టర్‌ అని ఫిక్స్‌ అయిపోయారు.  మరి ఈ సినిమాకి కథ ఏమిటి? అనే విషయంలో రామానాయుడు, చాణక్య ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎన్నో కథలు విన్నారు. కానీ, ఏదీ వారికి నచ్చలేదు. అదే సమయంలో రచయిత డి.వి.నరసరాజు పరిచయమయ్యారు. 1959లో ‘స్కేప్‌గోట్‌’ అనే ఇంగ్లీషు నవల ఇన్‌స్పిరేషన్‌తో ‘రాముడు భీముడు’ కథను రాసుకున్నారు నరసరాజు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆ కథతో సినిమా చెయ్యాలని మిద్దె జగన్నాథరావు, మిద్దె రామకృష్ణరావు అనుకున్నారు. కానీ, కుదరలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేసారు నరసరాజు. ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు, చాణక్య ఆ కథ వినిపించమని అడిగారు. డ్యూయల్‌ రోల్‌ కథ అయిన ‘రాముడు భీముడు’ కథ వారిద్దరికీ నచ్చింది. అలాగే ఎన్టీఆర్‌కి కూడా కథ చెప్పారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. 1963 నవంబర్‌ 16న సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ‘రాముడు భీముడు’ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. రాముడి సరసన ఎల్‌.విజయలక్ష్మీ, భీముడి సరసన జమున హీరోయిన్లుగా నటించారు. అంతకుముందు ‘అనురాగం’ చిత్రానికి భాగస్వామిగా ఉన్న రామానాయుడు షూటింగ్‌ సమయంలో సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల ‘రాముడు భీముడు’ చిత్రాన్ని పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశారు. 1964 మే 21న ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాకి 6 లక్షల 30 వేల రూపాయలు ఖర్చయింది. ఆ డబ్బు మొదటి వారంలోనే తిరిగి వచ్చింది. 30 ప్రింట్లతో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ 10 వారాలపాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా శతదినోత్సవాన్ని మద్రాస్‌లో ఘనంగా నిర్వహించారు రామానాయుడు.  ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకున్న రామానాయుడు అనుకోకుండానే నిర్మాతగా మారారు. మొదట్లో రైస్‌ మిల్లు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప నిర్మాత పరిచయమయ్యారు. ఆయన ద్వారా సురేష్‌బాబు అనే అగ్ర నిర్మాత టాలీవుడ్‌కి రాగలిగారు. రామానాయుడు వల్లే వెంకటేష్‌ వంటి ప్యామిలీ హీరో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించగలిగారు. 

కాలేజీలో కృష్ణకు ‘దేవుడు’ అనే నిక్‌నేమ్‌ ఎందుకు పెట్టారోగానీ నిజంగా ఇండస్ట్రీకి ఆయన దేవుడే

సినిమా ఇండస్ట్రీలో మంచివాళ్ళకు కొదవలేదు. అలాగే చెడ్డవాళ్ళకు కూడా కొదవలేదు. అయితే దేవుడులాంటి వారు అని చెప్పుకునే అర్హత ఉన్నవారు కొద్దిమందే ఉంటారు. వారిలో సూపర్‌స్టార్‌ కృష్ణ పేరును ముందు చెప్పుకోవాలి. ఈ మాట ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్‌ చెప్పడం కాదు, తోటి హీరోలు కూడా అదే మాట చెప్పడం కృష్ణలో ఉన్న గొప్పతనానికి నిదర్శనం. సూపర్‌స్టార్‌ కృష్ణ, మురళీమోహన్‌ క్లాస్‌మేట్స్‌. సినిమాల్లోకి రాకముందు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. కృష్ణ తనకి సినిమాల్లోకి రావాలని ఉందని మొట్ట మొదట చెప్పింది మురళీమోహన్‌కే. కృష్ణతో తనకు ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్‌ ప్రస్తావించారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే... ‘తను కోరుకున్న ఎంపిసి గ్రూప్‌ సీటు తెనాలిలో కృష్ణకు రాలేదు. దాంతో ఏలూరు వచ్చి నేను చదువుతున్న కాలేజీలో జాయిన్‌ అయ్యాడు. అతనికి ‘మల్లెపూవు’ నిర్మాత ముఖర్జీ తప్ప ఆ ఊరిలో తెలిసిన వారెవరూ లేరు. దీంతో ముఖర్జీగారు కృష్ణను నాకు పరిచయం చేసి మీరిద్దరూ ఓకే చోట కూర్చోండి అని నాకు అప్పగించారు. అలా మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం. అయితే తనకు సినిమాల్లో నటించాలనిగానీ, హీరోగా పేరు తెచ్చుకోవాలని గానీ అప్పుడు లేదు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావుగారు 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు కాలేజీలో వజ్రోత్సవం జరిగింది. అక్కినేని, పేకేటి ఆ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కినేనికి ఉన్న క్రేజ్‌, ఒక హీరో కోసం జనం ఎగబడుతున్న తీరు చూసిన కృష్ణకు మొదటిసారి సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగింది. మనం అందంగానే ఉన్నాం కదా. మనమెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అన్నారు. మనం అంటే తను ఆని ఆయన ఉద్దేశం. అందంగానే ఉన్నావు కదా ట్రై చెయ్యి, బాగుంటుంది అని చెప్పాను. ఆ తర్వాతి నుంచి తను పెద్ద హీరో అయిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఉండేవారు. వాళ్ళ ఊర్లో గెయిటీ అనే థియేటర్‌ ఉంది. దానంత పెద్ద థియేటర్‌ కట్టాలని, పడవలా ఉండే కారులో తిరగాలని.. చెబుతుండేవారు.  ఈ విషయాలన్నీ నాతోపాటు అతనికి ఫ్రెండ్లీగా ఉండే కొందరి దగ్గర మాత్రమే ప్రస్తావించేవారు. స్వతహాగా కృష్ణ మితభాషి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కాలేజీకి వచ్చినా మాలాంటి వారితో తప్ప ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తన సీట్లో అలా కూర్చొనేవారు. సాధారణం కాలేజీల్లో నిక్‌నేమ్స్‌ పెడుతుంటారు. అలా కృష్ణకి ‘దేవుడు’ అని నిక్‌నేమ్‌ పెట్టారు. ఎప్పుడూ ఒక విగ్రహంలా తన సీట్లో కూర్చుని వుండేవారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఏ వేళా విశేషంలో దేవుడు అని పేరు పెట్టారోగానీ, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిజంగానే దేవుడు అనిపించుకున్నారు. నిర్మాత శ్రేయస్సును కోరుకునే ఏకైక హీరో కృష్ణ. ఏ నిర్మాతయినా తనతో సినిమా తీసి నష్టపోయి ఆ తర్వాత కనిపించకపోతే, అతని గురించి వాకబు చేసేవారు. అలా ఓ నిర్మాత గురించి తమ్ముడు హనుమంతరావుగారిని పిలిచి అడిగారు. సినిమా ఫ్లాప్‌ అయింది కదా అందుకే రావడం లేదు అని ఆయన చెబితే వెంటనే మనిషిని పంపి ఆ నిర్మాతను పిలిపించారు. ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే తను చేసిన సినిమా వల్ల నష్టపోయానని, ఇప్పుడు సినిమా స్టార్ట్‌ చేస్తే కొబ్బరికాయ కొట్టడానికి కూడా తన దగ్గర డబ్బులేదని చెప్పారు. అవన్నీ వదిలేసి నువ్వు ముందు సినిమా మొదలుపెట్టు అని ఆ సినిమాకి ఫైనాన్స్‌ చేయించి, సబ్జెక్ట్‌ కూడా తనే సెలక్ట్‌ చేసి డైరెక్టర్‌ని కూడా తనే ఫిక్స్‌ చేసి తీయించారు. అలా చాలా మంది నిర్మాతల్ని ఆదుకున్నారు కృష్ణ. ఒకవేళ రిలీజ్‌ టైమ్‌లో డబ్బు కట్టాల్సి వస్తే దానికి కూడా తను సంతకం పెట్టేవారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అన్ని లెక్కలూ చూసి వచ్చిన లాభాన్ని అతనికే ఇచ్చేవారు. అలా ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవరూ అలా చేయరు. ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తంలో ఆయన తర్వాతే ఎవరైనా. నేను కూడా ఆయన తర్వాతే. మరో విషయం ఏమిటంటే డబ్బు ఇస్తేనేగానీ షూటింగ్‌కి రాను అని అతని కెరీర్‌లో ఎప్పుడూ ఏ నిర్మాతతోనూ అనలేదు. అలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ డబ్బు విషయం ప్రస్తావనకు వచ్చినా డబ్బుదేముంది ముందు సినిమా కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చెయ్యి అనేవారు. నేను కూడా ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే వచ్చాను కాబట్టి నాది కూడా అదే స్కూల్‌. నేను కూడా డబ్బులిస్తేనే షూటింగ్‌కి వస్తానని ఏరోజూ అనలేదు. నేను కూడా నిర్మాతల హీరోనే. మొదటి నుంచీ సినిమా డబ్బు పెట్టేది నిర్మాతే. చివరలో చిల్ల ఏరుకునేది కూడా నిర్మాతే. అతను చేసిన సినిమా సక్సెస్‌ నాలుగు రూపాయలు వస్తే మరో సినిమా తియ్యగలడు. నిర్మాత శ్రేయస్సును కోరుకునే హీరోల్లో ప్రథముడు కృష్ణ. అందుకే ఇండస్ట్రీ ఆయన్ని దేవుడు అంటుంది’ అని వివరించారు మురళీమోహన్‌. 

అక్కినేని, చిరంజీవిలతో దాసరి నారాయణరావు విభేదించడానికి అసలు కారణం ఇదే!

150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి నిజమైన దర్శకుడికి నిదర్శనంగా చెప్పుకునే దర్శకరత్న డా.దాసరి నారాయణరావు టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితో సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకి ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌ అందించారు దాసరి. ఇక మెగాస్టార్‌ చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ అనే ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం. తెలుగు తెరకు ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేసిన ఘనత కూడా దాసరిదే. అలాంటి దాసరినారాయణరావు కొందరితో విభేదాలు ఉన్నాయంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.  డా. అక్కినేనితో విభేదాలు వచ్చిన కారణంగా ఎన్నో సంవత్సరాలు ఇద్దరి మధ్యా మాటలు లేవు. ఇద్దరూ చనిపోయేంత వరకు ఒకరినొకరు పలకరించుకోలేదు. అంతగా వారి మధ్య అగాధం ఏర్పడడానికి కారణం ఏమిటి అనేది మొదట్లో తెలియదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు వారి మధ్య వివాదానికి కారణమైన అంశాన్ని ప్రస్తావించారు. తమ మధ్య ఎలాంటి ఛాలెంజెస్‌ లేవని, ఒక చిన్న మాట పట్టింపు వల్ల ఆ పరిస్థితి వచ్చిందని వివరించారు. ఒక విషయంలో తనకు సహకరించని కారణంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తన వరకు తనకు ఎంతో చేశాననే ఫీలింగ్‌ ఉంటుందని, దాన్ని దెబ్బ తీసేవిధంగా అక్కినేని ప్రవర్తించడం బాధ కలిగించిందని అన్నారు. వద్దు అనుకున్నానని, అందుకే తమ మధ్య మాటలు లేవని తెలిపారు. అంతే తప్ప మరో కారణం అంటూ ఏమీ లేదని, నిజానికి తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావేనని దాసరి పలు మార్లు చెప్పారు.  ఇక చిరంజీవితో చేసింది ఒకటే సినిమా. కానీ, ఆయనతోనూ అప్పట్లో విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చిన దాసరి.. ‘చిరంజీవి ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి పరోక్షంగా నా సహకారం ఎంత ఉందో అతనికి కూడా తెలుసు. ప్రతి విషయంలోనూ నేను అతనికి సపోర్ట్‌గానే ఉన్నాను. ఒకసారి ఒక సినిమా హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌లో 1 నుంచి 10 వరకు చిరంజీవే అని ప్రకటించాను. నిజానికి అది ఎంత తప్పు. ఒకటి నుంచి పది వరకు చిరంజీవే అంటే మిగతా వారు ఏమైపోవాలండీ. అలాంటి చిరంజీవికి, నాకు మధ్య విభేదాలు రావడానికి కారణం నేను ముఖ్య పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మేస్త్రి’ చిత్రం. ఆ సినిమాను చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే నేను తీసానని అందరూ విమర్శించారు. కానీ, అది నిజం కాదు.  ‘నేను ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నాను. ఎలక్షన్స్‌కి సంబంధించిన మీటింగ్స్‌ జరిగినపుడు ఇతర పార్టీలను విమర్శించడం సర్వసాధారణం. నేనూ అలాగే చేశాను. అంతకు మించి మరే ఉద్దేశమూ లేదు. టిడిపి పార్టీని విమర్శిస్తే.. చంద్రబాబును విమర్శించాలి, పిఆర్‌పిని విమర్శిస్తే చిరంజీవిని విమర్శించాలి. అందువల్ల అతని ప్రస్తావన వచ్చింది. అంతే తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అన్నారు. 

డైలాగ్స్‌ విని కుర్చీని కాలితో తన్నిన భానుమతి... ఆ సినిమా సిల్వర్‌ జూబ్లీ ఆడింది!

భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత ఎస్‌.గోపాలరెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణల అనుబంధం ఎలాంటిదో చిత్ర పరిశ్రమలో అందరికీ తెలుసు. ‘ముక్కుపుడక’ చిత్రంతో మొదలైన వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది. ఎస్‌.గోపాలరెడ్డి తన బేనర్‌లో చేసిన సినిమాలు 17. అందులో 13 సినిమాలు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే రూపొందాయంటే వారిద్దరి మధ్య ఎంత మంచి బాండిరగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముక్కు పుడక’ తర్వాత నందమూరి బాలకృష్ణతో ‘మంగమ్మగారి మనవడు’ వంటి సిల్వర్‌ జూబ్లీ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను బాలకృష్ణతో చెయ్యాలన్న ఆలోచన ఎవరిది, ఈ సినిమా ప్రారంభం కావడం వెనుక విశేషాలేమిటి అనే అంశాలను దివంగత కోడి రామకృష్ణ ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘గోపాలరెడ్డితో నా ప్రయాణం ‘ముక్కుపుడక’తో ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దామని కథ రెడీ చేసుకున్నాం. హీరో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై మేమిద్దరం చాలా డిస్కస్‌ చేసుకున్నాము. చివరికి అప్పుడే హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణతో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అయితే సినిమాల నిర్మాణంలో అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయం ఉంటూ ఉండేది. అందుకే ఈ కథను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌కి వినిపించడానికి నేను, గోపాలరెడ్డి వెళ్లాం. కథ విన్న ఆయన ఎవరితో చేద్దామనుకుంటున్నారు? అని అడిగాడు. బాలకృష్ణ పేరు చెప్పాం. మొదట ఆయన ఒప్పుకోకపోయినా తర్వాత ఓకే చెప్పారు. ఆ వెంటనే నాకు మరో ఆలోచన కూడా వచ్చింది. ఈ సినిమాలో బామ్మ క్యారెక్టర్‌ ఉంది కదా.. దానికి భానుమతిగారైతే బాగుంటుందని సలహా ఇచ్చాను. దానికి గోపాలరెడ్డి ఎంతో భయపడిపోయాడు. భానుమతిగారితో సినిమానా.. ఆవిడ్ని చూస్తేనే నాకు భయం అన్నాడు. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్‌కి కూడా చెప్పాం. దానికాయన వెంటనే.. భానుమతిగారితో సినిమానా.. ఈ ప్రాజెక్ట్‌ జరగదు అని తేల్చేశారు. ఒకసారి ఆమెను అడిగి చూద్దాం. తప్పేముంది అన్నాను. దానికి సరే అన్నాడు గోపాలరెడ్డి. ఇద్దరం కలిసి భానుమతి గారింటికి వెళ్లాం. కథ వినిపించి బాలకృష్ణతో చేద్దామనుకుంటున్నామని చెప్పాం. దానికామె.. ‘చాలా మంచి కుర్రాడు. తండ్రిలాగే డిసిప్లిన్‌ ఉంది’ అన్నారు. అందులో బామ్మ క్యారెక్టర్‌ మీరు చెయ్యాలి అని అడిగాము. ‘దానిదేముంది వాళ్ళ నాన్నకు కూడా నేను బామ్మగా నటించాను. తప్పకుండా చేస్తాను’ అన్నారు. గోపాలరెడ్డి మీ విషయంలో భయపడుతున్నాడు. మీరు టైమ్‌కి రారని, యారగెంట్‌గా ఉంటారని అందరూ చెబుతున్నారు అన్నాను. దానికి ‘గోపాల్‌ ఎందుకు భయపడుతున్నావు. నేను అలాంటి దాన్ని కాదు. డిసిప్లిన్‌ నుంచి వచ్చాను. నువ్వు ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చేస్తావు’ అని అడిగారు భానుమతి. 40 రోజుల్లో అవుతుంది’ అన్నాడు రెడ్డి. ‘నేను 35 రోజుల్లో పూర్తి చేస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను. నువ్వు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను.. ఇది చాలా’ అన్నారామె. దానికి రెడ్డి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి ‘ఇది చాలమ్మా’ అన్నాడు.  వారం రోజుల తర్వాత గణేష్‌ పాత్రో చేత ఆమె పోర్షన్‌ డైలాగ్స్‌ వినిపించాం. ఆ డైలాగులు విన్న వెంటనే కుర్చీని ఒక్కసారి కాలితో గట్టిగా తన్నారామె. సినిమా లేదు, ఏం లేదు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఈ డైలాగులు నేను చెప్పాలా? ఇలాంటి డైలాగులు భానుమతి చెబుతుందనుకున్నారా?’ అంటూ కోపంతో ఊగిపోయారామె. నేను, గోపాలరెడ్డి భయపడిపోయాం. డైలాగ్స్‌ మార్చి తీసుకొస్తాం అంటూ అక్కడి నుంచి వచ్చేశాం. ఈ ఘటన తర్వాత ‘ఆ డైలాగులు చెప్పకపోతే ఇక సినిమా ఏం ఉంటుంది’ అంటూ గోపాలరెడ్డి నీరసపడిపోయాడు. కంగారు పడొద్దు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. వారం తర్వాత పోరూర్‌లో షూటింగ్‌ మొదలు పెట్టాం. భానుమతిగారికి ఫాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, మద్రాస్‌ నుంచి జనం విపరీతంగా వచ్చారు. ఇంటి ముందు పనిమనిషితో సీన్‌. అయితే భానుమతిగారిలో ఉన్న మైనస్‌ ఏమిటంటే మొదటిరోజు షూటింగ్‌లో చాలా టెన్షన్‌ పడతారు. అదే మాకు ప్లస్‌ అయింది. ఆ టెన్షన్‌లోనే డైలాగ్‌ చెప్పేశారు. ‘ఓరి నీ భయం కూలిపోను. వెనకటికి నీలాంటి భయంగల బల్లి బట్టలిప్పేసి నీళ్లోసుకుంటూ బావగారొచ్చారని లేచి నిలబడిరదట’ అనే డైలాగ్‌ చెప్పారు. షాట్‌ ఓకే అయింది. అక్కడికి వచ్చిన జనం ఆ డైలాగ్‌ విని చప్పట్లు కొట్టారు, విజిల్స్‌ వేశారు. భానుమతిగారికి విషయం అర్థం కాక ‘ఎందుకు ఈ డైలాగ్‌కి అందరూ చప్పట్లు కొడుతున్నారు’ అని అడిగారు. మీరు ఇంతకుముందు డైలాగ్స్‌ చెప్పనని అన్నారు కదా అందులో డైలాగే ఇది అని చెప్పాను. దానికామె ఆశ్చర్యపోయారు. ఒక్క డైలాగ్‌కే ఇంత రెస్పాన్స్‌ వచ్చిందంటే సినిమా మొత్తం గణేష్‌ పాత్రో రాసిన డైలాగ్స్‌ చెబితే ఎంత రెస్పాన్స్‌ వస్తుంది? అని ఆమెను రిక్వెస్ట్‌ చేస్తూ అన్నాను. దానికామె పాజిటివ్‌గా స్పందిస్తూ ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంతకుముందు సినిమాకి అనుకున్న డైలాగుల్నే చెప్పి సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే’ అంటూ వివరించారు కోడి రామకృష్ణ.

ఆత్మహత్యకు భయపడి రెండో పెళ్లి చేసుకొని నరకం అనుభవించిన ఘంటసాల!

సినిమా రంగంలో ఒక భార్యకు మించి ఉన్నవారు చాలా మందే కనిపిస్తారు. అలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది చిత్ర పరిశ్రమలో. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి పలువురు సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిందే. రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నవారు కొందరు సఖ్యతగా, సంతోషంగా ఉంటే మరికొందరికి అది నరకప్రాయంగా ఉండేది. దీనికి ఉదాహరణగా మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును తీసుకోవచ్చు.  ఘంటసాల మొదటి భార్య పేరు సావిత్రి. ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆయన రెండో భార్య పేరు సరళ. ఆమెకు ముగ్గురు సంతానం. అయితే ఘంటసాలకు రెండో భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేది సావిత్రి. ఒకవైపు ఘంటసాల తన రెండో భార్యను, పిల్లల్ని మొదటి భార్య దగ్గరకు తీసుకురావాలని, అందరూ కలిసి మెలిసి ఉంటే చూడాలని ఆశపడేవారు. కానీ, దానికి సావిత్రి ఒప్పుకునేది కాదు. ఈ విషయంలో ఘంటసాలకు ఎంతో మానసిక క్షోభను కలిగించేది సావిత్రి. ఘంటసాల రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక విధంగా మొదటి భార్య సావిత్రే కారణం. సరళ తమ పక్క వాటాలో నివసించే కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒకరోజు సరళను ఘంటసాలకు పరిచయం చేసింది సావిత్రి. ఎప్పుడూ ఇంటికి వస్తూ పోతున్న తరుణంలో ఘంటసాల ఆమెకు దగ్గరయ్యారు. వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఘంటసాలను కోరింది సరళ. అంతకుముందు అలాంటి ఘటనే ఘంటసాల జీవితంలో జరిగింది. ఒక యువతి ఘంటసాలను ప్రేమించింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. దానికి ఘంటసాల ఒప్పుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.   ఇప్పుడు సరళ కూడా అదే కోరిక కోరుతోంది. కాదంటే ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయపడి పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఘంటసాల జీవితంలోని విశేషాలను తెలియజేస్తూ ఆయన కుమార్తె డా.శ్యామల ఒక ఆన్‌లైన్‌ పత్రికలో సీరియల్‌గా రాస్తుండగా, దానిపై ఆమె తల్లి సావిత్రే కోర్టుకెక్కింది. సీరియల్‌ ఆపించేసింది. జీవిత కథలనేవి నిజాయితీగా వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని వాదించి ఆ కేసులో గెలుపొందారు శ్యామల. ఆ తర్వాత తను ఘంటసాల గురించి తెలియజేయాలనుకున్న అంశాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘నేనెరిగిన నాన్నగారు’ పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఘంటసాల జీవితంలో మనశ్శాంతి కరువైందని, ఇద్దరు భార్యలతో ఆయన నరకం అనుభవించారని డా.శ్యామల తన రచనలో పేర్కొన్నారు. 

తెలుగు పాట ఉన్నంత వరకు నిత్య స్మరణీయుడు వేటూరి సుందరరామ్మూర్తి!

సినీ సాహిత్య రంగంలో వేటూరి సుందరరామ్మూర్తిది ఒక శకం. 70వ దశకం నుంచి సినిమా పాటను పలురకాలుగా పరవళ్ళు తొక్కించిన ఘనత వేటూరిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు.. ఒకవైపు సాహిత్య విలువలున్న సంప్రదాయమైన పాటలు అందిస్తూనే మరో వైపు మసాలాలు దట్టించిన మాస్‌ పాటలతో విజిల్స్‌, స్టెప్పులు వేయించారు. జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ రంగ ప్రవేశం గురించి, రాసిన వేల పాటల్లోని కొన్ని మచ్చుతునకల గురించి మెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.  ఒక దశలో ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా..’ అనీ, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ అనీ, ‘ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా’, ‘ఆకుచాటు పిందె తడిసే.. కోకమాటు పిల్ల తడిసె’  అంటూ ఆయన కలం నుంచి హుషారెక్కించే పాటలు వచ్చాయి. ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము..’, ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’, ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ ‘రాగాల పల్లకిలో కోయిలమ్మా..’, ‘మానసవీణా మధుగీతం.. మన సంసారం సంగీతం..’ అంటూ మనసును హత్తుకునే మధురగీతాలు మనల్ని పలకరించాయి. ‘ఈ దురోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..’, ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులౌతారు..’, ‘రా.. దిగిరా దివి నుంచి భువికి దిగిరా..’ అంటూ ఆలోచన రేకెత్తించే పాటలు, ఆవేశభరితమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. వేటూరి వారు రాసిన వేల పాటల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. ఆయన రాసిన పాటల గురించి ప్రస్తావించడానికి సమయాన్ని వెచ్చించడం అనేది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు.  1956 నుంచి 16 ఏళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన వేటూరిని నందమూరి తారక రామారావు ఆయనలోని ప్రతిభను గుర్తించి సినిమా రంగానికి ఆహ్వానించారు. తాను సినిమా రంగానికి పనికిరానని ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు వేటూరి. అయినా పట్టు వదలని ఎన్టీఆర్‌ ‘దీక్ష’ చిత్రం కోసం ఓ పాటను రాయించారు. అయితే అప్పటికే పాటల పర్వం ముగియడంతో వేటూరి తొలి సినిమా పాట వెలుగు చూడలేకపోయింది. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ తన దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రానికి ‘భారతనారీ చరితము’ అనే హరికథను రాయించుకున్నారు. ఈ హరికథతోనే సినీ రంగ ప్రవేశం చేశారు వేటూరి. అక్కడి నుంచి వేటూరి కలం ఆగలేదు. కొన్ని వేల పాటలతో తెలుగు వారిని అలరించారు. శంకరాభరణము, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం వంటి తెలుగుదనం ఉట్టిపడే పాటలతో పాటు మాస్‌ పాటలను కూడా తనదైన శైలిలో రాసి ఆబాలగోపాలాన్ని అబ్బురపరిచారు. తన కెరీర్‌లో  8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు వేటూరి సుందరరామ్మూర్తి. 1936 జనవరి 29న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించిన వేటూరి మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు.  వేటూరి పదవిన్యాసాల గురించి బోలెడు కథలు చెబుతారు. ఒకసారి ‘అడవిరాముడు’ నిర్మాతలు.. ‘పాట రాయకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా’ అని అడిగితే, ‘ఆ.. రేసుకు పోయి పారేసుకున్నాను’ అన్నారట. అంతే.. అదే పల్లవిగా పాట రాయమని దర్శకుడు కోరడంతో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అనే పాట ఆవిర్భవించింది. ప్రేక్షకులను థియేటర్లలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేసిందా పాట. పాటల రచయితలు సమయానికి పాటలు ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రతి రచయిత జీవితంలోనూ ఉంటాయి. దానికి వేటూరి కూడా అతీతుడు కాదు. ‘ఆలుమగలు’ చిత్రం కోసం ఇవ్వాల్సిన పాటలు ఆలస్యం కావడంతో ఆ చిత్ర నిర్మాత ఎ.వి.సుబ్బారావు ‘పాట ఎప్పుడిస్తావయ్యా..’ అని అడిగారు. దానికి వేటూరి ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ అంటూ చమత్కారంగా అన్నారట. అంతే.. ఆ సినిమాలోని ఓ పాటకు పల్లవి రెడీ అయిపోయింది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలకు ప్రభుత్వ అవార్డులే కాదు, ప్రజల రివార్డులు ఎన్నెన్నో లభించాయి. ఆయన పాటలతోనే పలు చిత్రాలపై వసూళ్ళ వర్షం కురిసింది. ఆయన పాటలతోనే నాటి వర్ధమాన కథానాయకులు తారాపథం చూడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి పాటల మహత్తుతో వెలిగిన వైభవాలు అనేకం కనిపిస్తాయి. అందుకే తెలుగు మాట ఉన్నంత వరకు వేటూరి పాట కూడా వెలుగొందుతూనే ఉంటుంది.

దీన స్థితిలో ఉన్న హరనాథ్‌ను అక్కున చేర్చుకున్న సూపర్‌స్టార్‌.. రెండో రోజే కబళించిన మృత్యువు! 

సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెడతారు. కొందరు హీరోలు కావాలనుకుంటే, మరికొందరు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. మరికొందరు టెక్నీషియన్స్‌గా తమ టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకోవాలని ఆశపడతారు. అయితే టాలెంట్‌తోపాటు అదృష్టం కూడా తోడైతేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలా ఉన్నత శిఖరాలను చేరుకున్న వారిలో కొంతమంది తమ జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ముందు జాగ్రత్త లేక పాతాళానికి తోసి వేయబడతారు. దీనావస్థలో జీవితాన్ని ముగిస్తారు. అలాంటి వారిలో పాతతరం హీరో హరనాథ్‌ ఒకరు.  ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి గొప్ప నటుల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరో హరనాథ్‌. ఎంతో అందగాడైన హరనాథ్‌ను రొమాంటిక్‌ హీరో అని పిలిచేవారు. తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్‌ హీరో అనే పిలుపు హరనాథ్‌తోనే మొదలైంది. అప్పట్లోనే లేడీ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక హీరో హరనాథ్‌. ‘మాయింటి మహాలక్ష్మీ’ చిత్రంతో నటుడిగా పరిచయమైన హరనాథ్‌ ఆ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం, గుండమ్మ కథ, లేత మనసులు, పెళ్లిరోజు, మురళీకృష్ణ వంటి సినిమాలో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఎన్టీరామారావు దర్శకత్వంలో వచ్చిన సీతారామకళ్యాణం చిత్రంలో వేసిన రాముడి పాత్ర హరనాథ్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత భీష్మ చిత్రంలో కృష్ణుడిగా నటించారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 130 సినిమాల్లో నటించారు హరనాథ్‌. అప్పట్లో హరనాథ్‌ అంటే లగ్జరీకి మారు పేరుగా చెప్పుకునేవారు. అదే అతని పాలిట శాపంగా మారింది. కెరీర్‌ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే జాగ్రత్త పడకుండా మద్యానికి బానిసయ్యారు. తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నారు. అవకాశాలు కూడా తగ్గాయి. సెట్స్‌కి వెళితే పిచ్చివాడిని చూసినట్టు చూసేవారు. స్టూడియో నుంచి బయటికి గెంటేసిన  అనుభవాలు కూడా హరనాథ్‌కి ఎదురయ్యాయి. క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది. అప్పటివరకు హరనాథ్‌ను తమ చుట్టూ తిప్పుకున్న హీరోయిన్లు కూడా అతని పరిస్థితి చూసి మొహం చాటేసారు. ఒకసారి హైదరాబాద్‌ వచ్చినపుడు పద్మాలయా స్టూడియో గేటు దగ్గర ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు హరనాథ్‌. మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో బిచ్చగాడిలా కనిపించిన అతన్ని సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. అదే సమయంలో నటుడు థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వి దూరదర్శన్‌ కోసం ఓ సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొనడానికి అక్కడికి వచ్చాడు. హరనాథ్‌ని గుర్తుపట్టి పలకరించాడు. కృష్ణను కలిసేందుకు వచ్చానని చెప్పడంతో అతన్ని కృష్ణ దగ్గరికి తీసుకెళ్లాడు పృథ్వి.  తన స్నేహితుడు హరనాథ్‌ను ఆ స్థితిలో చూసిన సూపర్‌స్టార్‌ కృష్ణ కంటతడి పెట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా వ్యసనాలకు బానిసైన హరనాథ్‌ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు కృష్ణ. తన కాస్ట్యూమర్‌ని పిలిచి హరనాథ్‌ను పెళ్లికొడుకులా ముస్తాబు చెయ్యాలని చెప్పారు. వెంటనే హరనాథ్‌కు స్నానం చేయించి అందంగా తయారు చేశారు. అలా తన దగ్గరే వారం రోజుల పాటు ఉంచుకొని నిజమైన స్నేహితుడు అనిపించుకున్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ. ఆ తర్వాత  అవసరమైన డబ్బు ఇచ్చి హరనాథ్‌ను మద్రాస్‌ పంపించారు. అలా వెళ్లిన రెండో రోజే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు హరనాథ్‌. ఆ వార్త విన్న కృష్ణ భోరున విలపించారట. తన దగ్గర ఉంచుకున్నా బాగుండేది అని బాధ పడ్డారట. అలా ఓ గొప్ప నటుడి జీవితం అత్యంత దీనావస్థలో ముగిసింది. 

సిగరెట్స్‌ కోసం లొల్లి.. షూటింగ్‌కి రానని భీష్మించుకు కూర్చున్న ఎన్‌.టి.రామారావు!

1964లో ఎన్‌.టి.రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘గుడిగంటలు’. వి.మధుసూదనరావు దర్శకత్వంలో డూండీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ‘ఆలయమణి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో శివాజీ గణేశన్‌ చేసిన పాత్రను తెలుగులో ఎన్‌.టి.రామారావు పోషించారు. ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు ఎన్టీఆర్‌. ఆయన క్యారెక్టర్‌లో శాడిజం ఉంటుంది. అయితే అలాంటి పాత్రకు సిగరెట్‌ తాగడం వంటి వ్యసనం కూడా ఉంటుంది. సాధారణంగా ఎన్టీఆర్‌ సిగరెట్‌ కాల్చరు. ఆయన ఎక్కువగా చుట్ట కాలుస్తారని చాలా మందికి తెలుసు. అయితే సినిమా కోసం సిగరెట్లు తాగాల్సి వచ్చింది. అలాంటి క్యారెక్టర్‌ చెయ్యాల్సి వచ్చినపుడు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే ఫారిన్‌ బ్రాండ్‌ సిగరెట్లు కాల్చేవారు. ‘గుడిగంటలు’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు రోజుకి రెండు డబ్బాలు ఖాళీ చేసేవారు. ఆరోజుల్లో గుండ్రటి డబ్బాలో 20 సిగరెట్లు ఉన్న ప్యాక్‌ లభించేది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఒక డబ్బా, లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఒక డబ్బా ఎన్టీఆర్‌కి అందించాలి. ఒకరోజు యధావిధిగా షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌తో సహా యూనిట్‌లోని వారంతా లంచ్‌ ముగించుకున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు రాసిన ముళ్లపూడి వెంకటరమణకు సిగరెట్‌ కావాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ కోసం తెప్పించిన సిగరెట్స్‌ డబ్బా సీల్‌ తీసి అందులో నుంచి రెండు సిగరెట్లు తీసుకొని ముళ్ళపూడి, పక్కనే ఉన్న నిర్మాత డూండీ చెరొకటి ఊది పారేశారు. లంచ్‌ తర్వాత రెస్ట్‌ తీసుకొని సిగరెట్‌ డబ్బా కోసం కబురు పెట్టారు ఎన్టీఆర్‌. ప్రొడక్షన్‌ బోయ్‌ వెళ్లి సిగరెట్‌ డబ్బాను ఆయనకు అందించాడు. సీల్‌ తీసి ఉన్న సిగరెట్‌ డబ్బాను చూసిన ఎన్టీఆర్‌ ఉగ్రుడైపోయారు. బోయ్‌ మీద కేకలు వేసి తిప్పి పంపారు. నిర్మాతకు విషయం చెప్పాడు బోయ్‌. సీల్‌ తీస్తే ఏమైందట.. ప్రొడ్యూసర్‌, రైటర్‌ రెండు సిగరెట్లు తాగారని చెప్పమని బోయ్‌ని మళ్ళీ ఎన్టీఆర్‌ దగ్గరకు పంపించారు. బోయ్‌ చెప్పిన మాట విని మరింత కోపంతో ఊగిపోయారాయన. సీల్డ్‌ డబ్బా తెచ్చి ఇస్తేనే సెట్‌కి వచ్చేది. లేకపోతే లేదు అన్నారు.  సిగరెట్ల కోసం గొడవెందుకని భావించిన డూండీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ని పిలిచి అతనికి కారు ఇచ్చి పంపారు. అవి ఫారిన్‌ సిగరెట్స్‌ కావడంతో ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. కొన్ని కిలోమీటర్లు తిరిగి ఎలాగైతే సిగరెట్లు సంపాదించాడు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌. వెంటనే ఆ డబ్బాను ఎన్టీఆర్‌కు అందించేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది. ఈ విషయమై ముళ్ళపూడి, డూండీ.. ఎన్టీఆర్‌కు సారీ చెప్పారు. ‘సిగరెట్‌ కోసం కాదు బ్రదర్‌. ప్రిన్సిపల్‌ ఇంపార్టెంట్‌. దానికి నేను కూడా అతీతుడ్ని కాదు’ అంటూ సెట్‌వైపు అడుగులు వేశారు ఎన్‌.టి.రామారావు. 

ఆ రికార్డు విషయంలో  టైటానిక్ తర్వాత శ్రీ రాములయ్యనే 

1997 వ సంవత్సరంలో విడుదలైన టైటానిక్ అనే మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్ని  ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా  ప్రపంచ సినిమాని ఏకం కూడా  చేసింది. ఆ రోజుల్లో టైటానిక్  సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు నగరాల్లోని ప్రధాన  ఏరియాల్లో హండ్రెడ్ డేస్ ని కూడా జరుపుకుంది. పైగా ఇప్పటివరకు  వరల్డ్ మొత్తం మీద వచ్చిన బెస్ట్ లవ్ మూవీ కూడా అదే. టైటానిక్  వచ్చిన రెండు సంవత్సరాలకి అంటే 1999 లో పేద,బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన పోరాటయోధుడు శ్రీ రాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీ రాములయ్య మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఒక విషయంలో టైటానిక్ తర్వాత సినిమాగా నిలబడి   చరిత్రలో తన కంటు ఒక రికార్డు ని పదిలంగా ఉంచుకుంది.ఇంతకీ ఆ రికార్డు ఏంటో చూద్దాం..       ఒక సినిమాకి ఎంత అధ్బుతమైన కథ సమకూరినా కూడా కెమెరా బాగుంటేనే ఆ చిత్రం యొక్క ఉద్దేశం ప్రేక్షకుడికి చేరుతుంది. ఇదే విధంగా టైటానిక్ మూవీలోని ప్రతి షాట్ కూడా ఎంతో వైవిధ్యంతో  కూడుకొని  ఉంటుంది.అలాగే ప్రతి సీన్ ని కూడా మన కళ్ళ ముందు జరుగుతుందేమో అనే విధంగా కెమెరా కట్టిపడేస్తుంది.ఇక  ఆ మూవీ క్లైమాక్స్ లో   టైటానిక్ షిప్  కూలిపోయే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని షాట్స్ పరంగా చూపించే క్రమంలో టాప్ యాంగిల్ లో కూడా చూపిస్తారు. ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే ఆ షాట్స్ ని అకేలా క్రేన్ సాయంతో  తీశారు. ప్రపంచ సినిమా యవనిక మీద అ కేలా క్రేన్ పరిచయం అవ్వడం అదే మొదటి సారి. షిప్ కూలిపోవడాన్ని ఆకాశంలో నుంచి చూపించే  ఆ షాట్ ఆ రోజుల్లో  ఒక పెద్ద సంచలనం. అంతే కాకుండా ఆ షాట్ ప్రేక్షకులని సంబ్రమాశ్చర్యాలకి  కూడా  గురి చేసింది.అలాగే  ఆ మూవీలోని చాలా షాట్స్ కొత్త దర్శకుడు అవుదామనుకునే వారికి ఒక పాఠ్య పుస్తకం అని కూడా చెప్పవచ్చు.  ఆ మూవీ తర్వాత అకేలా క్రేన్ తో షాట్ తీసిన రెండవ  సినిమాగా శ్రీ రాములయ్య చరిత్ర పుటల్లో  నిలిచింది. మూవీ ప్రారంభంలో టైటిల్స్ పడుతుండగానే  మేకర్స్  శ్రీరాములయ్య సమాధిని చూపించడం జరుగుతుంది. ఈ సీన్ నే రక రకాల షాట్స్ ల్లో టాప్ యాంగిల్ లో చూపించడం జరుగుతుంది. ఒక హెలికాఫ్టర్ కి అకేలా క్రేన్ కట్టి ఆ షాట్ తీశారు. ఆ షాట్  చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు పుట్టించేలా ఉంటుంది. ఈ విధంగా టైటానిక్ సినిమా తర్వాత అకేలా క్రేన్ వాడిన సినిమాగా శ్రీరాములయ్య రికార్డుని సృష్టించింది. ప్రముఖ  దివంగత నేత పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీ రాములయ్య  తెరకెక్కింది. ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ  మూవీ టైటిల్ రోల్ లో మోహన్ బాబు ఆయన భార్యగా  సౌందర్య నటించింది. అలాగే శ్రీ రాములయ్య కొడుకు రవి గా కూడా మోహన్ బాబే నటించాడు. దివంగత నందమూరి హరికృష్ణ కూడా ఒక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీలోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. పరిటాల రవినే  నిర్మాతగా వ్యవహరించాడు.  

5 రోజుల్లో 5 పాటలు పూర్తి.. ఇప్పటి డైరెక్టర్లకు ఇది సాధ్యమేనా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం, షూటింగ్‌ జరిగే రోజుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాస్తవానికి టెక్నాలజీ పెరిగితే బడ్జెట్‌, షూటింగ్‌ టైమ్‌ ఈ రెండు తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం అలా జరగడంలేదు. ఒకప్పుడు ఫిల్మ్‌తో సినిమా చేసేవారు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది కాబట్టి ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా తీసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా డిజిటలే కాబట్టి ఎన్ని షాట్స్‌ అయినా తీసుకోవచ్చు అన్న ధీమా పెరిగి జాగ్రత్త తగ్గింది. డిజిటల్‌ వల్ల షాట్‌ క్వాలిటీగా రావచ్చు. కానీ, ఆ సీన్‌లో క్వాలిటీ కనిపించడం లేదు. దాంతో రోజుల తరబడి షూటింగ్‌ చేస్తూనే ఉంటారు. పాటల విషయానికి వస్తే ఒక పాట తియ్యాలంటే నాలుగైదు రోజులు, ఒక్కోసారి వారం రోజుల టైమ్‌ కూడా తీసుకుంటున్నారు. పాత రోజుల్లో పాటలు ఎలా తీసేవారో తెలుసుకుంటే ప్రేక్షకులతోపాటు ఇప్పటి దర్శకులు కూడా ఆశ్చర్యపోక తప్పదు.  ఎన్‌.టి.రామారావు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1981లో రూపొందిన ‘గజదొంగ’ చిత్రాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చలసాని గోపి, కె.నాగేశ్వరరావు, జి.వెంకటరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ జరిగిన విధానం గురించి నిర్మాతల్లో ఒకరైన కె.నాగేశ్వరరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘రామారావుగారు ఏ నిర్మాతకైనా నెలకి 10 రోజుల చొప్పున 30 రోజులు డేట్స్‌ వచ్చేవారు. ఆ 30 రోజుల్లోనే ఆయనకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలోనే ‘గజదొంగ’ చిత్రానికి కూడా డేట్స్‌ ఇచ్చారు. టాకీ పార్ట్‌ పూర్తయింది. 5 పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉంది. ఆ సమయంలోనే మరో షూటింగ్‌లో రామారావుగారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన చేయి ఫ్యాక్చర్‌ అయింది. 6 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆరు వారాలపాటు షూటింగ్‌ చేయకపోతే నిర్మాతకు ఎంత నష్టం జరుగుతుందో ఆయనకు తెలుసు. పైగా ఆ తర్వాత హీరోయిన్ల డేట్స్‌ కూడా దొరకవు. ఆ ఉద్దేశంతోనే 4 వారాలకే గాయాన్ని కూడా లెక్క చేయకుండా షూటింగ్‌ పెట్టుకోమన్నారు. బ్యాలెన్స్‌ ఉన్న ఐదు పాటల్ని రోజుకొకటి చొప్పున తీస్తేనే అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తవుతుంది, అనుకున్న డేట్‌కి సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇదే విషయాన్ని రామారావుగారికి రాఘవేంద్రరావుగారు చెప్పారు. దానికి ఆయన కూడా సరేనన్నారు. అలా మా సినిమాలోని 5 పాటల్ని ఐదు రోజుల్లో చిత్రీకరించడం జరిగింది. ఆ సినిమాలోని పాటలు ఎంత సూపర్‌హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే’ అని వివరించారు.  దీన్నిబట్టి అప్పట్లో షూటింగ్‌ ఎంత వేగంగా పూర్తి చేసేవారో అర్థమవుతుంది. రోజుకొక పాట చొప్పున ఐదు రోజులపాటు ఐదు పాటల్ని నిర్విరామంగా షూట్‌ చెయ్యడం అనేది మామూలు విషయం కాదు. దీనికి హీరో, హీరోయిన్ల సహకారం ఉండాలి, డైరెక్టర్‌కి ఆ పాటల చిత్రీకరణ పట్ల ఒక విజన్‌ ఉండాలి, టెక్నీషియన్స్‌ అంతా కలిసికట్టుగా పనిచేయాలి. అలా చేశారు కాబట్టే హీరోలు, డైరెక్టర్లు ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేయగలిగేవారు. 

అలనాటి అపురూప దృశ్యం.. రాముడి రూపంలో ఎన్టీఆర్ ని చూసి రేలంగి చెప్పిన మాట!

అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీంతో భారతదేశవ్యాప్తంగా శ్రీరాముని పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా రామ నామమే వినిపిస్తోంది. ఈ సందర్భంగా పలువురు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగువారికి రాముడైనా, కృష్ణుడైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎన్.టి. రామారావు. దేవుడి రూపంలో ఉన్న ఆయన చిత్రపటాలు.. ఎందరో తెలుగువారి ఇళ్లలో పూజలు అందుకుంటాయి. అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకుంటారని ఎప్పుడో 60 ఏళ్ళ క్రితమే ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఊహించారు. అది 'లవకుశ' చిత్రం ముహూర్తం రోజు. అక్కడ కోలాహలంగా ఉంది. ఆరోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య. రాముని పాత్ర ధారి ఎన్టీఆర్ కు అలంకరణ చేశారు. లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్  అన్నారు దర్శకుడు. ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నడచి వస్తున్నారు. కట్ అన్నారు దర్శకుడు. ఫ్లోర్ అంతా చప్పట్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందం చెప్పనలవి కాదు. గబ గబ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కౌగలించుకొని… " సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడిలా ఉన్నావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నీకిక ఎదురులేదు. పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు.." అని హస్త సాముద్రికంలో ప్రవేశం వున్న రేలంగి.. " ఏదీ చెయ్యి చూపు. అబ్బో! నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు. అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో."  అన్నారు. దర్శకుడు పుల్లయ్య, నటి అంజలీదేవి ఏక కంఠంతో "తథాస్తు" అన్నారు. అదే ఈ అపురూప దృశ్యం. ఇప్పుడు ఈ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, "నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు" అని రేలంగి చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ కి దాదాపు 40 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 'లవకుశ'లో నటించారు. అప్పటికే ఆయనకి తిరుగులేని క్రేజ్ ఉండగా.. ఏళ్ళు గడిచే కొద్దీ మహా శిఖరంలా ఎదిగారు. కథానాయకుడిగా, మహానాయకుడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. తెలుగువారి ఆరాధ్యదైవంగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

తెలుగు సినిమా సామ్రాజ్యానికి చక్రవర్తి నందమూరి తారక రామారావు!

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనిషి ఎన్టీఆర్. తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలికాయి. 1942 మేలో పందొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామె కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్. శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు. ఆయన కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే బీయే పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా! సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు. కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ రూపొందించగా 1949లో విడుదలైన 'మనదేశం' చిత్రంలో చేసిన పోలీస్ సబిన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌తో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో, అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్య తారగా వెలుగొందుతాడని! 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళభైరవి' సినిమా ఎన్టీఆర్ నటజీవితాన్ని మలుపు తిప్పింది. తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు. తన రూపం, వాచకం, అభినయం, ఖడ్గచాలనంతో వారిని సమ్మోహితుల్ని చేసేశాడు. ఆయన నటన ఒక ఎత్తు, నడక మరో ఎత్తు.  ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తారాకరాముని తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు.. ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు.. ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు.. ఆయనే భీముడు, ఆయనే బృహన్నల.. అన్నీ ఆయనే! తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయా పాత్రలే. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లు. 'లవకుశ' చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు ఆయనే అయిపోయారు. అంతకంటే ముందుగానే 'మాయాబజార్' సినిమాతో శ్రీకృషునిగా నీరాజనాలు అందుకున్నారు. ఆ కాలంలో శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు.. అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో! తారకరాముడు కేవలం తెరపై గొప్పనటుడు మాత్రమే కాదు, తెరవెనుక మహాగొప్ప దర్శకుడు కూడా! 1961లో వచ్చిన 'సీతారామ కల్యాణం' దర్శకునిగా ఆయన తొలి సినిమా. అయితే సొంత బేనర్ ఎన్ఏటీపై తీసిన ఆ సినిమా టైటిల్స్‌లో దర్శకుని పేరు వేయకుండా రిలీజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఆయన రావణాసురుని పాత్రను పోషించారు. దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. 1977లో విడుదలైన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు. పౌరాణిక పాత్రలతో తెలుగువారి అవతార పురుషునిగా రాణించిన ఎన్టీఆర్ జానపద, చారిత్రక చిత్రాల ద్వారానూ అమితంగా ఆకట్టుకున్నారు. 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లోనే పూర్తయినా, సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత 1984లో విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిన నందమూరి తారకరామారావు.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు. 'మనదేశం'తో మొదలైన మహానటప్రస్థానం 'మేజర్ చంద్రకాంత్' వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తనకెంతో ఇష్టమైన 'శ్రీనాథ కవిసార్వభౌమ' పాత్ర కూడా పోషించి సంతృప్తిపడ్డారు. నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి, తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం. (జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతి)

సంక్రాంతి నాగార్జునదే.. ప్రూఫ్స్ తో సహా మీ ముందు ఉంచిన నిజం

సంక్రాంతి..  ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటు తెలుగు వాళ్ళందరు కలిసి కట్టుగా జరుపునే ఒక ముఖ్యమైన పండగ. అలాగే తమ మధ్య ఉన్న ఈర్ష్య ,అసూయ, రాగ ద్వేషాలని పోగొట్టి తామందరం కలిసి మెలిసి ఉండేలా చూడమని తమకి నచ్చిన దైవాన్ని వేడుకునే పండగ కూడా సంక్రాంతినే. ఆ పండగ యొక్క ఔన్నత్యాన్ని పరమార్ధాన్నితెలుపుతు అదే టైటిల్ తో  వెంకటేష్ హీరోగా వచ్చిన మూవీ సంక్రాంతి. మరి ఈ మూవీకి మొదట అనుకున్న హీరో వెంకటేష్ కాదని మీకు తెలుసా? విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చాలా చిత్రాల్లో సంక్రాంతి మూవీ కూడా ఒకటి. 2005 లో వచ్చిన ఆ  మూవీ సంచలన విజయాన్ని సాధించడంతో పాటుగా చాలా సెంటర్స్ లో సరికొత్త రికార్డు లని నెలకొల్పింది. హిట్ చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన సంక్రాంతిలో   మొదట హీరోగా మొదట యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ని అనుకున్నారు. ఈ మేరకు చిత్ర కథ మొత్తాన్ని నాగార్జున కి శివ చెప్పడం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం  జరిగింది.  దీంతో ఆర్ బి చౌదరి నిర్మాతగా నాగ్ ముప్పలనేని శివ కాంబోలో సంక్రాంతి మూవీ ప్రారంభం అవుతుందని అందరు భావించారు.కానీ నాగార్జున  తనకున్న మాస్ ఇమేజ్ కి అన్నదమ్ముల సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవదని బావించాడో ఏమో సంక్రాంతి  సినిమా ప్లేస్ లో వేరే సినిమాని చేసాడు. నాగార్జున నే సంక్రాంతి కి మొదటి అనుకున్న హీరో అని స్వయంగా ముప్పలేని శివే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆ తర్వాత సంక్రాంతి సినిమా వెంకటేష్ హీరోగా తెరకెక్కడం జరిగింది.ఇంటి బాగోగులు చూసే ఇంటి పెద్దగా తమ్ముళ్ల మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అన్నయ్యగా వెంకటేష్ నటన నభూతో న భవిష్యత్తు అనే రీతిలో ఉంటుంది. తమ్ముళ్లు గా శ్రీకాంత్, శర్వానంద్, శివ బాలాజీ లు నటించారు. వీళ్ళకి జోడిలుగా స్నేహ, సంగీత, రతి లు నటించగా ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించింది. చంద్రమోహన్, శారద లు వెంకటేష్ తల్లి తండ్రులుగా నటించారు. అలాగే మిగతా పాత్రల్లో ప్రకాష్ రాజ్, సుధాకర్, తనికెళ్ళ భరణి లు తమ పాత్రల్లో అధ్భుతంగా నటించి సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.అన్న దమ్ముల మద్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కి అయితే కంటి తడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. పరుచూరి బ్రదర్స్ మాటలు సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.  70 కి పైగా  కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకున్న సంక్రాంతి మూవీ కనుక వెంకటేష్ కాకుండా నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో గాని నేటికి ఈ మూవీ టీవీ లో వస్తుంటే ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారు.అలాగే ఈ మూవీలో వేణు మాధవ్, ఏవిఎస్ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి నేటికి యు ట్యూబ్ లో ఆ కామెడీ సీన్స్ చూస్తు చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల ఆవశ్యతని తెలిపిన సంక్రాంతి మూవీ చూసి విడిపోయిన అన్నదమ్ముల కుటుంబాలు మళ్ళీ కలిసిన సందర్బాలు ఉన్నాయి.