గుణశేఖర్‌ తిట్టడంతో సినిమా చేయనని మొండికేసిన ఎన్టీఆర్‌!

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌ ‘రామాయణం’ చిత్రంలోని తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎం.ఎస్‌.రెడ్డి నిర్మించిన ఈ సినిమా పిల్లలకి మంచి వినోదాన్ని అందించింది. ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దారు. దాంతో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డుకు ‘రామాయణం’ చిత్రాన్ని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.  తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లాంటి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి గుణశేఖర్‌ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే కేవలం పిల్లలు మాత్రమే నటించిన సినిమా ఇది. సాధారణంగా ఒక సినిమాలో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారిని కంట్రోల్‌ చేయడం కష్టం. అలాంటిది కేవలం పిల్లలతోనే సినిమా చెయ్యాలంటే ఆ దర్శకుడు ఎంత టెన్షన్‌ పడాల్సి వస్తుందో గుణశేఖర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ పిల్లల్ని కంట్రోల్‌ చేయడం చిత్ర యూనిట్‌కి పెద్ద సమస్యగా మారింది. ఒక్కరు కూడా కుదురుగా ఉండేవారు కాదట. ముఖ్యంగా రాముడి పాత్రధారి ఎన్టీఆర్‌ విపరీతమైన అల్లరి చేసేవాడట. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వానరసైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే.. ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగడం, మూతులు పీకడం చేసేవారట తారక్‌. అరణ్యవాసం సన్నివేశాలు తీయడానికి యూనిట్‌ మొత్తం చేలకుడి వెళ్లింది. ఆ సమయంలో అడవిలో విపరీతమైన చలి. పైగా పిల్లలు చొక్కాలు లేకుండా నటించడానికి వణికిపోతుంటే తారక్‌ వాళ్లని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట.  శివ ధనుర్భంగం సన్నివేశం కోసం ప్రత్యేకంగా కనిపించాలని ఓ విల్లును టేకుతో తయారు చేయించారట. దాంతోపాటు మరో డూప్లికేట్‌ విల్లును కూడా తయారు చేయించారు. ఈ సన్నివేశం కోసం యూనిట్‌ సిద్ధమవుతున్న సమయంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఎన్టీఆర్‌ డూప్లికేట్‌ విల్లును పైకి లేపడంతో అది సులభంగా పైకి లేచింది. ఆ తర్వాత టేకుతో చేసిన విల్లును ఎత్తడానికి అందరూ ప్రయత్నించారు. కానీ, ఎవరి వల్లా కాలేదు. చివరికి ఎన్టీఆర్‌ దాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్‌ చెయ్యలేక కింద పడేశాడు. అది విరిగిపోయింది. ఆ హఠాత్‌ పరిణామానికి ఎన్టీఆర్‌పై గుణశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చి తిట్టారట. దాంతో ‘ఇక నేను సినిమా చేయను.. వెళ్లిపోతాను’.. అంటూ ఒకటే మారాం చేశాడట. ఆ తర్వాత యూనిట్‌ సభ్యులందరూ అతన్ని సముదాయించి షూటింగ్‌కి సిద్ధం చేశారట. 

ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా హరికృష్ణ చేసిన సీన్.. షాక్‌ అయిన చౌదరి!

ఇది ఓ సినిమాలోని డైలాగ్‌, ఈ డైలాగ్‌ వెనుక ఓ కథ ఉంది. నందమూరి హరికృష్ణ తొలినాళ్ళలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తండ్రి ఎన్‌.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నటనకు స్వస్తి పలికి ఎన్టీఆర్‌ వాహనానికి సారథిగా మారారు. ఆయన జీవించి ఉన్నన్ని సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు. పాతికేళ్ళపాటు సినిమా రంగానికి దూరంగా ఉన్న హరికృష్ణ ‘శ్రీరాములయ్య’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో సత్యం పాత్రలో కనిపిస్తారు హరికృష్ణ. అది నక్సలైట్‌ క్యారెక్టర్‌ కావడంతో ఇండస్ట్రీలోని చాలామంది ఆ పాత్ర చేసేందుకు భయపడ్డారు. కానీ, హరికృష్ణ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చారు. ఆ క్యారెక్టర్‌ని అత్యద్భుతంగా పోషించి అందర్నీ మెప్సించారు. ఆ తర్వాత సీతారామరాజు, సీతయ్య, శివరామరాజు, టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, స్వామి వంటి సినిమాల్లో ఎంతో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వై.వి.యస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు హరికృష్ణ. ఎన్నో సంవత్సరాలపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. అయినప్పటికీ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో హరికృష్ణ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నటించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. తన ప్రత్యర్థి జయప్రకాష్‌రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా, ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండూ రైల్వే ట్రాక్‌పైకి వచ్చి సరిగ్గా మధ్యలో ఆగిపోతాయి. కొద్దిసేపటి వరకూ ఎవరూ వెనక్కి తగ్గరు. అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి పోనీయమని చెబుతాడు. అప్పుడు వెంటనే హరికృష్ణ కారు ముందుకు వెళ్లాలి. కానీ, కారు సడన్‌గా ఆగిపోయింది. స్టార్ట్‌ చేసినా అవ్వలేదు. ఓ పక్క ట్రైన్‌ వచ్చేస్తోంది. కానీ, హరికృష్ణ ఏమాత్రం భయపడకుండా మరో రెండుసార్లు స్టార్ట్‌ చెయ్యడానికి ట్రై చేశారు. మూడోసారి కారు స్టార్ట్‌ అయింది. వెంటనే ముందుకు దూకించారు హరికృష్ణ. అలాంటి టైమ్‌లో హరికృష్ణ భయపడి ఏమీ చెయ్యకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అప్పటివరకు టెన్షన్‌తో ఉన్న అక్కడి వాతావరణం.. ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హరికృష్ణ ధైర్యాన్ని చూసి దర్శకుడు వై.వి.యస్‌.చౌదరి షాక్‌లో ఉండిపోయారట. అలా కారును ముందుకు దూకించిన తర్వాత హరికృష్ణ చెప్పే డైలాగ్‌.. ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా.. చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి’ ఈ డైలాగ్‌ చెప్పిన తర్వాత అది సినిమా కోసం చెప్పినట్టు కాకుండా అక్కడి సిట్యుయేషన్‌కి అద్దం పట్టినట్టు ఉందని హరికృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు యూనిట్‌ సభ్యులు.

‘మనదేశం’ కంటే ముందే సినిమా ఛాన్స్‌ వచ్చినా ఎన్టీఆర్‌ చెయ్యలేదు.. ఎందుకో తెలుసా?

సినిమాలు అంతగా అందుబాటులోకి రాని రోజుల్లో నాటకాలే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేవి. అందులో రాణించడమే గొప్ప అచీవ్‌మెంట్‌గా అప్పటి కళాకారులు భావించేవారు. పాత తరం నటీనటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారే. ఆయన చదువుకునే రోజుల్లో లెక్కకు మించిన నాటకాల్లో తన ప్రతిభను ప్రదర్శించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘మనదేశం’ చిత్రంతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే ఎన్టీఆర్‌ సినిమాల్లోకి రావాల్సింది. కానీ, తను తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ‘మనదేశం’ ఆయన తొలి సినిమా అయింది. ‘మనదేశం’ కంటే ముందే ఎన్టీఆర్‌కి సినిమాలో ఛాన్స్‌ వచ్చిందని చాలామందికి తెలీదు. సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘వింధ్యరాణి’ చిత్రంతోనే ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం చెయ్యాల్సి ఉంది. తను డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో నటించాల్సిందిగా దర్శకుడు పుల్లయ్య.. ఎన్టీఆర్‌ను కోరారు. ఇంకా చదువుకుంటున్న కారణంగా దాన్ని ఎన్టీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు. అప్పటికి ఆయన డిగ్రీ చదువుతున్నారు. బి.ఎ. డిగ్రీ చేతిలో ఉంటే తప్ప సినిమాల కోసం ప్రయత్నాలు చెయ్యకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సినిమా రంగం అనేది స్థిరమైంది కాదనే అభిప్రాయం ఆయనకు ఉండేది. డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్‌ అవ్వకపోతే ఉద్యోగం చేసుకోవచ్చని ముందు జాగ్రత్తగా ఆలోచించారు ఎన్టీఆర్‌. అందుకే ‘వింధ్యరాణి’ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత సి.పుల్లయ్య మరోసారి తన సినిమా విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్‌కు ఉత్తరం రాశారు. ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్న ఎన్టీఆర్‌ ఆ ఉత్తరానికి బదులు కూడా ఇవ్వలేదు. సినిమా రంగం అంటే ఎంతో వ్యామోహంతో చదువు పూర్తి కాకుండానే ఇంట్లో వారికి కూడా చెప్పకుండా మద్రాస్‌ రైలెక్కినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో కూడా ఎన్టీఆర్‌ ఎంతో మందికి ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. 

చిరంజీవి, బాలకృష్ణ నా బిడ్డల్లాంటివారు.. అభిమానులకు హితబోధ చేసిన శోభన్‌బాబు!

సినిమా తారలంటే అందరికీ అభిమానమే. అది కొంతమందిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా హీరోల అభిమానులు తమ హీరోని ఆరాధ్యదైవంగా భావిస్తారు. తమ అభిమాన హీరో కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు. ఒక్కోసారి హీరోల అభిమానుల మధ్య వివాదాలు తలెత్తుతాయి, వాగ్వాదాలు జరుగుతాయి. కొట్లాటలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా అనేది తెలియని రోజుల్లో, అసలు మీడియా అంటేనే తెలియని రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనం కాబట్టి సినిమాలు ఎక్కువగా చూసేవారు. అలా ఆయా హీరోలకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉండేవారు. ప్రతి హీరోకి ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ ఉండేవి. ఒకేరోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అయ్యాయంటే ఇక ఆయా హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు, ముష్టియుద్ధాలు జరుగుతూ ఉండేవి. పరిస్థితి శృతి మించినపుడు తమ అభిమానులకు శాంతియుతంగా ఉండాలని, జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని హీరోలు తమ అభిమానులకు హిత బోధ చేసేవారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఆ మాటల తూటాలను సోషల్‌ మీడియాలో సంధించుకుంటున్నారు హీరోల అభిమానులు.  అభిమానులు సామరస్యంగా ఉండాలని శోభన్‌బాబు ఒక సందర్భంలో కోరారు. శోభన్‌బాబుకు సన్మానం చేసేందుకు ఆహ్వానించారు అభిమానులు. ఆ సన్మాన కార్యక్రమంలో పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. వారిని ఉద్దేశించి శోభన్‌బాబు మాట్లాడుతూ ‘మీరందరూ నా బిడ్డలతో సమానం అని చెప్తుంటాను. నేనెప్పుడూ ఆ మాటకు కట్టుబడి ఉంటాను. అలాగే చిరంజీవి, బాలకృష్ణ కూడా నా బిడ్డలతో సమానమే. ఎందుకంటే నాకు వారి వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఇంచుమించు ఒకే వయసు అయి ఉంటుంది. అందువల్ల ఎవరినీ విమర్శించవద్దు. మీకు సినిమా నచ్చితే సపోర్ట్‌ చెయ్యండి లేదంటే సైలెంట్‌గా ఉండండి. అంతేతప్ప ఆ హీరోలను, వారి అభిమానులను విమర్శించవద్దు. చిరంజీవి, బాలకృష్ణలతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. బిడ్డలతో తండ్రి పోటీ పెట్టుకుంటాడా.. పెట్టుకోడు. అలాగే మన సినిమాలతో వారి సినిమాలను కంపేర్‌ చెయ్యొద్దు. అందరు హీరోల అభిమానులతో స్నేహపూర్వకంగా ఉండమని సభాముఖంగా మీ అందర్నీ కోరుతున్నాను’ అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు శోభన్‌బాబు. 

ఒకే కథతో తెలుగులో నాలుగు, తమిళ్‌లో ఒకటి, హిందీలో రెండు సినిమాలు.. నిజంగా విచిత్రమే!

ఒక కథతో తీసిన సినిమా సూపర్‌హిట్‌ అయితే దాన్ని ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా ఒకే కథతో పలుమార్లు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ‘ఎంగ చిన్న రస’ చిత్రం ఒకటి. కన్నడ రచయిత బి.పుట్టస్వామయ్య రచించిన ‘అర్థాంగి’ అనే నవల ప్రేరణతో కె.భాగ్యరాజా తయారు చేసిన కథతో తమిళ్‌లో రూపొందింది ‘ఎంగచిన్న రస’. ఈ చిత్రానికి కె.భాగ్యరాజా దర్శకత్వం వహించారు. భాగ్యరాజా, రాధ జంటగా నటించారు. ఈ సినిమా తమిళ్‌లో పెద్ద హిట్‌ సినిమాగా నిలిచింది. ఈ చిత్రాన్ని ‘చిన్నరాజా’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఈ కథతో హిందీలో అనిల్‌కపూర్‌, మాధురి దీక్షిత్‌ జంటగా ‘బేటా’ పేరుతో రూపొందింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత ‘బేటా’ చిత్రం రైట్స్‌ తీసుకొని తెలుగులో వెంకటేష్‌, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘అబ్బాయిగారు’ పేరుతో రూపొందించారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ‘చిన్నరాజా’ చిత్రాన్ని చూసి పెద్ద హిట్‌ చేసినప్పటికీ అదే కథతో రూపొందిన ‘అబ్బాయిగారు’ చిత్రాన్ని కూడా పెద్ద హిట్‌ చేశారు. ఇదే కథతో కన్నడలో ‘అన్నయ్య’ పేరుతో డి.రాజేంద్రబాబు దర్శకత్వంలో రూపొందింది. కన్నడలో కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇలా ఒకే కథతో రూపొందిన ఈ సినిమాలన్నీ విజయం సాధించడం విశేషం.  అలాంటి ఓ విచిత్రం మరో సినిమా విషయంలోనూ జరిగింది. అదే వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’ చిత్రం. మాదిరెడ్డి సులోచన కథతో ఈ చిత్రం రూపొందింది. ఎఎన్నార్‌, జయలలిత, శారద ప్రధాన పాత్రల్లో నటించారు.  పెళ్ళయిన తర్వాత భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది భార్య. అదీ కథలోని ప్రధానాంశం. ఎఎన్నార్‌లాంటి హీరోని భార్య వదిలేసి వెళ్ళిపోవడం అనే పాయింట్‌ జనానికి నచ్చలేదు. దీంతో సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత ఇదే కథను ప్రేరణగా తీసుకొని రైట్స్‌ తీసుకోకుండా హిందీలో ‘అప్నా అప్నా’ అనే సినిమా చేశారు. ఆ పాయింట్‌ని హిందీలో బాగా రిసీవ్‌ చేసుకున్నారు. సినిమా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా రైట్స్‌ తీసుకొని అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగులో శోభన్‌బాబు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో ‘ఇల్లాలు’ అనే సినిమా తీశారు. అది చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ కథనే కొద్దిగా మార్పులు చేసి పంజు అరుణాచలం తమిళ్‌లో రజినీకాంత్‌తో తీశారు. ఆ సినిమా రైట్స్‌ తీసుకొని రాశి మూవీస్‌ నరసింహారావు ‘బావామరదళ్లు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఇదే సినిమాని నిర్మాత ఎం.అర్జునరాజు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సుహాగన్‌’ పేరుతో హిందీలో చేశారు. అక్కడ కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎస్‌.వి.కృష్ణారెడ్డి ‘బావామరదళ్ళు’ రైట్స్‌ తీసుకొని రాజశేఖర్‌, రమ్యకృష్ణ జంటగా ‘దీర్ఘ సుమంగళీభవ’ అనే సినిమా తీశారు. ఈ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది.  ఇలా ఒక కథను తీసుకొని పలు భాషల్లో పలు మార్లు సినిమాలు చేసినా దాదాపు అన్ని భాషల్లో సినిమా సూపర్‌హిట్‌ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. విచిత్రం ఏమిటంటే మాదిరెడ్డి సులోచన రాసిన కథ భాష భాషకీ మార్పులు చెందుతూ వెళ్లింది. అలా ఒకే కథతో తెలుగులో నాలుగు సినిమాలు, తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో రెండు సినిమాలు రూపొందాయి. నిజానికి ఇది మాదిరెడ్డి సులోచన కథే అయినా ఎన్నో మార్పులు చెందిన కారణంగా భాష భాషకూ రచయితల పేర్లు మారుతూ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒకే కథతో.. తీసిన భాషల్లోనే మళ్లీ మళ్లీ సినిమాలు తీయడం అనేది బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు. 

అన్నపూర్ణ స్టూడియోస్‌ను మోసం చేసి ‘శివ’తో డైరెక్టర్‌ అయిన రామ్‌గోపాల్‌వర్మ!

తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా ‘శివ’. టాలీవుడ్‌ని కొత్త పుంతలు తొక్కించిన ‘శివ’. డైరెక్టర్‌ అనే వాడికి క్రేజ్‌ని తీసుకొచ్చిన ‘శివ’. తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన ‘శివ’.. ఇలా రామ్‌గోపాల్‌వర్మ ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘శివ’ సినిమా గురించి గత 35 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సినిమా సాధించిన ఘనవిజయం తెలుగు సినిమాకి ఒక కొత్త దారిని చూపించింది. టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ గురించి సాధారణ ప్రేక్షకులు కూడా మాట్లాడుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ‘శివ’కి ముందు ‘రావుగారిల్లు’, ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు వర్మ. ఆ సమయంలోనే నాగార్జునతో సాన్నిహిత్యం ఏర్పడిరది. దర్శకుడిగా బ్రేక్‌ ఇస్తానని నాగార్జున పలుమార్లు వర్మతో చెప్పేవాడు. నాగార్జునతో త్వరగా సినిమా తీసెయ్యాలి.. రేపే షూటింగ్‌ మొదలు పెట్టెయ్యాలన్న ఉత్సాహం వర్మలో ఉండేది. కానీ, సరైన అవకాశం రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌ అధినేతలైన అక్కినేని వెంకట్‌, యార్లగడ్డ సురేంద్రలను మోసం చేయడం ద్వారా ‘శివ’ చిత్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు వర్మ. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా తెలియజేశాడు. మరి ‘శివ’ సినిమా ఎలా మొదలైంది.. ఈ ప్రాజెక్ట్‌ కోసం వర్మ ఎలాంటి ఎత్తులు వేశాడు అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం. ‘రావుగారిల్లు, కలెక్టర్‌ గారి అబ్బాయి సినిమాలకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండడం వల్ల అక్కినేని నాగేశ్వరరావుగారు, నాగార్జున, వెంకట్‌, సురేంద్ర.. వీళ్ళతో చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యేవాడిని. నేనంటే వాళ్ళకు మంచి ఇంప్రెషన్‌ ఉండేది. నాకు డైరెక్టర్‌గా బ్రేక్‌ ఇవ్వాలని ముగ్గురూ అనుకునేవారు. అయితే అది ఎప్పుడు, ఎన్నాళ్ళకు, ఎన్నేళ్ళకు అనేది తెలీదు. ఆ సమయంలో నేను ఒక అవకాశాన్ని క్రియేట్‌ చేసుకున్నాను. బి.గోపాల్‌ డైరెక్షన్‌లో నాగార్జున చేసిన కలెక్టర్‌గారి అబ్బాయి రిలీజ్‌ అయి హిట్‌ అయిపోయింది. ఆ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కి కోదండరామిరెడ్డిగారి డేట్స్‌ ఉన్నాయి. నాగార్జునతో నెక్స్‌ట్‌ సినిమా చెయ్యాలి. దాని కోసం నేను, గణేష్‌ పాత్రో, కోదండరామిరెడ్డి కలిసి స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొన్నాం. అప్పటికి కోదండరామిరెడ్డిగారు చాలా బిజీ. స్టోరీ వినే టైమ్‌ కూడా ఆయనకు లేదు. ఆ టైమ్‌ మేమే స్టోరీ ఫైనల్‌ చేశాం. దాన్ని నాగేశ్వరరావుగారికి వినిపించాలి. దానికి నన్ను పంపారు. నేను హైదరాబాద్‌ వచ్చి మేం అనుకున్న కథని యాజ్‌ ఇటీజ్‌గా చెప్పకుండా అటు, ఇటు మార్చి చెప్పాను. నా ఇంటెన్షన్‌ ఏమిటంటే ఆయనకు స్టోరీ నచ్చకూడదు అని. నేను అనుకున్నట్టుగానే ఆయనకు స్టోరీ నచ్చలేదు. అయితే అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. ల్యాండ్‌ లైన్‌ నుంచి ఫోన్‌ చేసి కోదండరామిరెడ్డికి నాగేశ్వరరావుగారు చెప్పే అవకాశం లేదు. అందుకే స్టోరీ నచ్చలేదని చెప్పమని నన్ను చెన్నయ్‌ పంపారు. నేను వెళ్లి నాగేశ్వరరావుగారికి స్టోరీ నచ్చలేదని సురేంద్రకి చెప్పాను. దీంతో చేద్దామనుకున్న సినిమాకి కథ లేకుండా అయిపోయింది. నాగార్జున డేట్స్‌ రెండు నెలలు ఖాళీగా ఉన్నాయి.  ఇదే మంచి టైమ్‌ అని భావించిన నేను. నాగార్జున దగ్గరికి వెళ్ళి నాగేశ్వరరావుగారికి కథ నచ్చలేదన్న విషయాన్ని చెప్పి.. ఎలాగూ నాకు బ్రేక్‌ ఇద్దామనుకుంటున్నావు కదా.. నా కథ ఆల్రెడీ విన్నావు. నీ డేట్స్‌ కూడా ఖాళీగా ఉన్నాయి. నాతోనే సినిమా చెయ్యొచ్చు కదా అని అడిగాను. అప్పుడే సురేంద్ర కూడా వచ్చాడు. రాముతో సినిమా చేసేద్దాం అని నాగ్‌ అనడంతో, ఆయన కూడా సరే అన్నారు.  సురేంద్ర, నాగార్జున ఇద్దరూ ఒప్పుకున్నారు. మిగిలింది వెంకట్‌. అతన్ని కూడా ఒప్పిస్తే.. సినిమా పట్టాలెక్కేసినట్టే. వెంకట్‌కి కూడా నామీద మంచి ఇంప్రెషనే ఉంది. ఆరోజు వెంకట్‌ లేరు. రాత్రికి గానీ రాలేదు. వచ్చిన తర్వాత నాతో సినిమా చేసేందుకు నాగార్జున, సురేంద్ర డిసైడ్‌ అయ్యారని చెప్పాను. అయినా సినిమా చెయ్యాలనుకున్నప్పుడు ముగ్గురూ కలిసి డెసిషన్‌ తీసుకోవాలి కాబట్టి ఆ ముగ్గుర్ని ఒకచోట చేర్చి నా ప్రాజెక్ట్‌ గురించి చెప్పాను. అందరూ ఓకే అన్నారు. అదే టైమ్‌లో కోదండరామిరెడ్డిగారికి సినిమా లేదనే విషయాన్ని చెప్పమని సురేంద్రకి చెప్పాను. ప్రస్తుతం కథ ఓకే కాలేదు కాబట్టి తర్వాత చేద్దాం అని కోదండరామిరెడ్డిగారికి చెప్పాడు సురేంద్ర. ఆయన కూడా సరేనన్నారు. అలా ‘శివ’ సినిమా స్టార్ట్‌ అయింది. అయితే మోసం చేయడం ద్వారా ఈ అవకాశం వచ్చిందని అందరూ అనుకోవచ్చు. కానీ, నేను ఆడిరది మైండ్‌ గేమ్‌.. దాన్ని లౌక్యం అనీ.. రకరకాలుగా అంటారు. కానీ, నాకు అది తప్ప వేరే దారిలేదు. ఎందుకంటే వారికి స్టోరీ చెప్పేసి కూర్చుంటే సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో తెలీదు. మూడేళ్ళు, నాలుగేళ్ళు పట్టొచ్చు. అప్పటికి ట్రెండ్‌ మారిపోవచ్చు. ఆ టైమ్‌లో నేను అలాంటి డెసిషన్‌ తీసుకోకపోతే ‘శివ’ అనే సినిమాయే వచ్చి ఉండేది కాదు.   ఇన్ని కారణాల దృష్ట్యా సినిమా చేసే అవకాశాన్ని నేనే క్రియేట్‌ చేసుకున్నాను’ అంటూ వివరించారు రామ్‌గోపాల్‌వర్మ. 

30 సంవత్సరాలపాటు ఉత్తమ నేపథ్య గాయకుడుగా అవార్డు అందుకున్న ఘంటసాల!

ఘంటసాల అంటే మధురగానం.. ఘంటసాల అంటే మహా సంగీతగని. సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు అది. ఎన్నిసార్లు విన్నా.. ఎంత ఆస్వాదించిన తనివి తీరని సంగీత మాధుర్యం. ఆ గొంతు మూగబోయినా, ఆ గానగంధర్వుడు మనమధ్య లేకపోయినా.. ఆయన పాటలు భూమి ఉన్నంత వరకు చిరస్మరణీయమే. కొన్ని దశాబ్దాలపాటు తన గాన మాధర్యంతో అందరికీ మధురానుభూతిని పంచిన ఘంటసాల వర్థంతి ఫిబ్రవరి 11. ఈ సందర్భంగా ఆ మహాగాయకుడ్ని స్మరించుకుంటూ.. ఘంటసాల 1922 డిసెంబరు 4న గుడివాడ దగ్గరలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి రత్నమ్మ. ఘంటసాల వెంకటేశ్వరావుపై చిన్నతనం నుంచి తండ్రి ప్రభావం ఉంది. ఆయన తండ్రి అప్పటికే గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన కుమారుడికి మృదంగం వాయించడంతో పాటు నాట్యం కూడా నేర్పించారు. ఘంటసాల నాట్యానికి మెచ్చి పలువురు ఆయనను బాలభరతుడనేవారు. ఘంటసాల తండ్రి సూర్యనారాయణ కాలం చేస్తూ.. తన వారసత్వాన్ని కొనసాగించమని కుమారుడి వద్ద నుండి మాట తీసుకున్నారు. అయితే తనకు తెలిసిన సంగీతం వేరు. ఆ కారణంతోనే పలు కచేరీల్లో పాల్గొని ఓటమి చవిచూశారు. సంగీతాన్ని శాస్త్రబద్ధంగా  నేర్చుకోవాలన్న పట్టుదలతో సంగీత కళాశాలలో చేరేందుకు తన దగ్గరున్న కొద్ది డబ్బుతో గుడివాడ నుండి విజయనగరం బయలుదేరారు. విజయనగరం చేరాక కళాశాల అధ్యాపకుల సహాయంతో వారాలు చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే విద్యనభ్యసించారు. విద్యార్థులతో ఏర్పడిన చిన్న గొడవ వల్ల ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అదే కళాశాలలో గాత్ర పండితులుగా పనిచేస్తున్న పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాలను చేరదీశారు. ఆయన కూడా పేదరికంలోనే ఉన్నారు. అందువల్ల శిష్యుడికి మాధుకరం (ఇంటింటికి వెళ్లి జోలె పట్టి బిచ్చం ఎత్తుకోవడం) చేయడం నేర్పించారు. అలా గురుసేవ చేసుకుంటూ సీతారామశాస్త్రి వద్ద సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కళాశాలలో చేరి.. నాలుగు సంవత్సరాల సంగీతం కోర్సుని రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులవి. అందులో ఘంటసాల కూడా చేరారు. ఆ ఉద్యమం తీవ్రతరం కావడంతో  ఎందరో ఉద్యమకారులతో పాటు ఘంటసాల కూడా అరెస్టు అయ్యారు. 1942 అరెస్ట్‌ అయిన ఘంటసాల రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.  1944లో జైలు నుండి తిరిగి వచ్చాక.. తన మేనకోడలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు ఘంటసాల. పెళ్లయ్యాక... సంగీత కచేరీలనే తన జీవనోపాధిగా చేసుకుంటూ అనేక ప్రాంతాలను సందర్శించారు ఘంటసాల. ఆ సమయంలోనే ఓ కచేరీలో ఘంటసాలను చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు.. ఆయన గాత్రానికి ముగ్ధులయ్యారు. చలనచిత్ర పరిశ్రమలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనే దర్శకులు బి.ఎన్‌.రెడ్డికి, చిత్తూరు నాగయ్యకి ఘంటసాలను పరిచయం చేశారు. ‘స్వర్గసీమ’ చిత్రంలో తొలిసారిగా ఘంటసాలకు నేపథ్యగాయకుడిగా అవకాశం ఇచ్చారు బి.ఎన్‌.రెడ్డి. ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయలను పారితోషికంగా అందించారు. ఆ తర్వాత నటి భానుమతి తీసిన ‘రత్నమాల’ సినిమాలో కొన్ని పాటలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.  పాతాళభైరవి,  మల్లీశ్వరి, అనార్కలి, మాయాబజార్‌, శ్రీ వెంకటేశ్వర మహత్యం వంటి సినిమాల్లోని పాటలు ఘంటసాలను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లోని పాటలను ఎంతో మధురంగా ఆలపించి ఆబాల గోపాలాన్ని అలరించారు. దాదాపు 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి పురస్కారం పొందిన ఘనత ఏకైక గాయకుడు ఘంటసాల.  ఘంటసాల తన చివరి రోజుల్లో భగవద్గీతను ఆలపించి ప్రజల గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నారు. ఘంటసాలకు నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, తుళు, హిందీ చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. 1970లో ఆయన సినీ సంగీత రంగానికి అందించిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అందించింది. భారతదేశంలోనే కాక అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీలాంటి దేశాలతోపాటు ఐక్యరాజసమితి వేదికపై కూడా సంగీత కచేరీ నిర్వహించిన అరుదైన ఘనత ఘంటసాలకు దక్కింది. అటువంటి మేటి గాయకుడు 11 ఫిబ్రవరి 1974 తేదీన తుది శ్వాస విడిచారు. 2003లో ఆయన గుర్తుగా స్టాంపును విడుదల చేసింది పోస్టల్‌ శాఖ. 2014లో అమెరికన్‌ పోస్టల్‌ డిపార్టుమెంటు కూడా ఆయన పేరు మీద స్టాంపు విడుదల చేసింది. 

హీరోల కొడుకులు స్టార్‌ హీరోలు అవ్వడం వెనుక అసలు సీక్రెట్‌ ఇదే!

బిజినెస్‌, రాజకీయం, సినిమా.. ఇలా ఏ రంగంలోనైనా వారసత్వం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే బిజినెస్‌కిగానీ, రాజకీయానికిగానీ అందచందాలతో పనిలేదు. తెలివితేటలు, ఆ రంగంలో రాణించడానికి కావాల్సిన కొన్ని లక్షణాలు ఉంటే సరిపోతుంది. ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి వెళతారు. కానీ, సినిమా రంగం విషయానికి అది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అందంతోపాటు టాలెంట్‌ కావాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేంత ఛరిష్మా ఉండాలి. ఇలాంటి లక్షణాలు హీరోలుగా ఎదగాలనుకునే చాలా మందిలో ఉంటాయి. కానీ, కొందరికే సినిమాల్లో రాణించే అవకాశం వస్తుంది, అలా కాకుండా ఇప్పుడు స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్న కొందరి విషయంలో వారసత్వమే ఎక్కువగా పనిచేస్తుందనే విషయాన్ని దివంగత డా. దాసరి నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. సినిమాల్లో వారసత్వాన్ని సమర్థిస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘సినిమాల్లో వారసత్వం గురించి చెప్పాలంటే ఆది కొంత వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే మొదటి సినిమా, రెండో సినిమా వరకే. ఆ హీరో తండ్రి పెద్ద హీరో కాబట్టి అతనికి ఉన్న ఫాలోయింగ్‌ వల్ల వీరి సినిమాలు కూడా చూస్తారన్న నమ్మకం ఆయా హీరోలకు ఉండవచ్చు. అయితే అది వారిని హీరోలుగా ఇంట్రడ్యూస్‌ చెయ్యడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సినిమా, రెండు సినిమాలతో ఆపేయడం లేదు. వారికి సినిమా తీసే శక్తి ఉంది కాబట్టి వరసగా సినిమాలు చేసేస్తున్నారు. అంటే ఆయా హీరోలు నిర్మాతలుగా వ్యవహరించకపోయినా వారి ఇన్‌ఫ్లుయెన్స్‌తో నిర్మాతలు వారి కొడుకులతో సినిమాలు చేస్తున్నారు. అలా వరసగా సినిమాలు చేసి ఆ హీరో ఫేస్‌ని ప్రేక్షకులకు బాగా అలవాటు చేసేస్తున్నారు. వారి ఫేస్‌ ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఆదరించడం తప్పడం లేదు. ఇప్పుడు స్టార్‌ హీరోలుగా చెప్పుకుంటున్న వారసులు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోలు నిలదొక్కుకోవాలంటే మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. నా శిష్యుడు మోహన్‌బాబు విషయాన్నే తీసుకుంటే అతను నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం లేదుగానీ టాలెంట్‌ ఉన్న ఎంతో మంది ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేక ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు, ఈ హీరోలకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టి స్టార్‌ హీరోలు కాగలిగారు అనేది మాత్రమే చెప్పదలుచుకున్నాను. ‘మీ అబ్బాయికి కూడా హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కదా.. మరి మీరెందుకు ఆయా హీరోల్లా కొడుకుని హీరోగా నిలబెట్టలేకపోయారు’ అని చాలా మంది అడిగారు. నేను ఆ విషయంలో మా అబ్బాయికి సపోర్ట్‌ చెయ్యలేదనే చెప్పాలి. మా అబ్బాయి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి చూస్తే నేను చేసింది తప్పే. అతనిలో టాలెంట్‌ ఉంది. హీరోగా సక్సెస్‌ సాధించాలనే కసి కూడా ఉంది. నేను అతన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడున్న హీరోలు నిలదొక్కుకొని స్టార్‌ హీరోలుగా వెలుగుతున్నారంటే వారి తండ్రి హీరో కావడం, వెనక ఉండి వారిని ముందుకు నడిపించడమే అసలు సీక్రెట్‌’ అంటూ వివరించారు డా. దాసరి నారాయణరావు. 

నేను ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఆ ఇద్దరు సింగర్సే

గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అంటే ఇష్టపడనివారు ఉండరు. ఆయన పాటను ఆస్వాదించని తెలుగు వారుండరు. దాదాపు 50 సంవత్సరాల పాటు తన గాన మాధుర్యంతో చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు అందర్నీ అలరించిన బాలు దాదాపు 40 వేల పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అయితే తను జీవితంలో ఎంతో నష్టపోయానని చెప్పేవారు. అది తన వ్యక్తిగత జీవితంలో, వృత్తిరీత్యా కూడా కొన్ని సందర్భాల్లో నష్టాల్ని చవి చూశారు బాలు. అవేమిటో ఒకసారి చూద్దాం.. 1966లో నటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ అనే చిత్రంలో పి.సుశీల, రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌లతో కలిసి ‘ఏమి ఈ వింత మోహం..’ అనే పాటను ఆలపించడం ద్వారా సినీ నేపథ్య గాయకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బాలసుబ్రహ్మణ్యం. అయితే 1969 నుంచి బాలుకి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రతిరోజూ పాటలు పాడేవారు. అయితే ఆయనకు ఉన్న ఒకే ఒక చింత.. తనకు సంగీతం రాదు, అందులో థియరీ తనకు తెలియదు, కేవలం ప్రాక్టికల్‌గా పాడగలడు తప్ప ఎక్కడా సంగీతాన్ని అభ్యసించలేదు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సింగర్స్‌ సంగీతం నేర్చుకున్నవారు. తనకు అందులో ఓనమాలు కూడా రావు. కానీ, సింగర్‌గా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎన్ని పాటలు పాడినా తనకు సంగీతం రాదు అనే భావన ఆయనకు చనిపోయే వరకు ఉంది. సందర్భం వచ్చినపుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావించేవారు బాలు. ఇక సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని నష్టపోయానని కూడా చాలాసార్లు చెప్పారు. తన పిల్లలు ఏం చదువుతున్నారో తెలీదు. తన భార్య కుటుంబాన్ని ఎలా నడిపించగలుగుతుందో తెలీదు. ఉదయం లేచిన దగ్గర నుంచి స్టూడియోల చుట్టూ తిరగడమే తన పనిగా ఉండేది.  తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో సింగర్‌గా బిజీ అయిపోయిన ఎస్‌.పి.బాలుకి సడన్‌గా వి.రామకృష్ణ రూపంలో ఒక షాక్‌ తగిలింది. బాలు కంటే ఒక సంవత్సరమే వయసులో చిన్నవాడైన రామకృష్ణ ఇండస్ట్రీకి మాత్రం బాలు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత వచ్చారు. ‘విచిత్రబంధం’ చిత్రంలోని ‘వయసే ఒక పూల తోట’ అనే పాటతో సినీ నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. రామకృష్ణకు అపర ఘంటసాలగా పేరుండేది. ఘంటసాల అంతటి సింగర్‌ అవుతాడని అందరూ అనుకున్నారు. రామకృష్ణ రావడంతో బాలసుబ్రహ్మణ్యంకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా ఇండస్ట్రీలోని నలుగురు టాప్‌ హీరోలకు రామకృష్ణే ప్లేబ్యాక్‌ పాడేవారు. బాలు మాత్రం హీరో కృష్ణకు మాత్రమే పరిమితమైపోయారు. ఆ సమయంలో బాలు బాధ వర్ణనాతీతం.  మరో పక్క తమిళ్‌లో అప్పటికే బాలు సింగర్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. ఎంజిఆర్‌కి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యేవి. అంతటి టాప్‌ పొజిషన్‌లో ఉన్న బాలుకి ఏసుదాస్‌ రెండో షాక్‌ ఇచ్చారు. బాలు ఇండస్ట్రీకి వచ్చేనాటికి ఏసుదాస్‌ నాలుగేళ్ళ సీనియర్‌. మంచి సంగీత విధ్వాంసుడు. అయినా తన పద్ధతిలో తాను పాటలు పాడుకుంటూ వెళ్తున్న బాలుకి ఏసుదాస్‌ షాక్‌ ఎలా తగిలిందంటే.. అప్పటివరకు ఎంజిఆర్‌కి పాటలు పాడుతున్న బాలుని తప్పించి ఏసుదాస్‌తో పాడిరచారు. ఆ వాయిస్‌ ఎంజిఆర్‌కి బాగా సూట్‌ అయిందని తమిళ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అలా అక్కడ కూడా బాలుకి దెబ్బ పడిరది. అయినా తనలోని టాలెంట్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకుని అవకాశాల్ని బాగా పెంచుకున్నారు.  ఇక తెలుగులో రామకృష్ణ వల్ల అవకాశాలు తగ్గినా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలంతా కమర్షియల్‌ సినిమాల్లో తమ జోరు చూపిస్తుండడంతో మళ్ళీ బాలుకి పూర్వ వైభవం వచ్చింది. అప్పటివరకు ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి చాలా తక్కువ పాటలు పాడిన బాలు ఆ తర్వాత వారి విషయంలో తిరుగులేని సింగర్‌ అనిపించుకున్నారు. రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొంతకాలంలోనే మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలా తక్కువ టైమ్‌లో 5,000 పాటలను పూర్తి చేశారు. తన కెరీర్‌ ముందుకు సాగడంలో ఎదురైన అవరోధాల్ని దాటుకొని ముందుకు సాగిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గానగంధర్వుడిగా అందరి మనసుల్లోనూ నిలిచిపోయారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలివే!

నటసింహ నందమూరి బాలకృష్ణ అంటే బాక్సాఫీస్‌ బొనాంజాగా పిలవబడే హీరో. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సినిమా ఏవరేజ్‌ అని టాక్‌ తెచ్చుకున్నా కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఇక బాలకృష్ణ సినిమాను తీసుకున్న బయ్యర్లు బాగా నష్టపోయిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. బాలనటుడుగా, సహనటుడుగా 10కి పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం’. దర్శకుడు పి.వాసు అతని మిత్రుడు భారతి కలిసి ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా మొదలుకొని నందమూరి అభిమానుల్ని అలరించే ఎన్నో సినిమాలు చేసిన బాలకృష్ణ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ సినిమాలేమిటో ఇప్పుడు చూద్దాం.  1986లో జంధ్యాల దర్శకత్వంలో ‘నటరత్న’ అనే సినిమా చెయ్యాలని అనుకున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున ఈ టైటిల్‌తో పేపర్‌లో ప్రకటన కూడా వచ్చింది. జంధ్యాలతో అంతకుముందు ‘రెండు రెళ్లు ఆరు’ చిత్రాన్ని నిర్మించిన జి.సుబ్బారావు ఈ చిత్రానికి నిర్మాత. ‘పడమటి సంధ్యారాగం’ సినిమాతోపాటు ‘నటరత్న’ చిత్రాన్ని కూడా అమెరికాలో షూట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు జంధ్యాల. అయితే వీసాలు రావడం ఆలస్యం అవడం వల్ల బాలకృష్ణ డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వలేదు. దీంతో సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ‘చిన్నికృష్ణుడు’ అనే టైటిల్‌ను పెట్టారు. సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి తన మిత్రుడు సుధాకర్‌రెడ్డితో కలిసి జంధ్యాల దర్శకత్వంలో ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణకు ఇది 20వ సినిమా. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అతనితోనే ‘శపథమ్‌’ అనే సినిమా చెయ్యాలని అనుకున్నారు గోపాలరెడ్డి, సుధాకర్‌రెడ్డి. 3డి సినిమాలు కొత్తగా వస్తున్న రోజులు కావడంతో ఆ ఫార్మాట్‌పై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. ఆ ఫార్మాట్‌లోనే సినిమా చెయ్యాలనుకున్నారు. కథ సిద్ధమైంది. క్రాంతికుమార్‌ను దర్శకుడుగా అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల క్లాప్‌ కొట్టకుండానే సినిమా ఆగిపోయింది.  బాలకృష్ణతో ‘అశోకచక్రవర్తి’ చిత్రాన్ని నిర్మించిన కోగంటి హరికృష్ణ మళ్ళీ అతనితోనే ‘బాలకృష్ణుడు’ అనే చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారు. అశోకచక్రవర్తి చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్‌.ఎస్‌.రవిచంద్రే ఈ సినిమాకి కూడా దర్శకుడు. కథ సిద్ధం చేశారు. అశోకచక్రవర్తి, ధ్రువనక్షత్రం చిత్రాల కథ ఇంచుమించు ఒకటే. అయితే ఈ రెండు సినిమాలూ ఒకేరోజు విడుదల కావడంతో ఆగ్రహించిన బాలకృష్ణ ‘బాలకృష్ణుడు’ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. 2002లో బాలకృష్ణతో వి.సముద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని ప్రారంభించారు. దేశభక్తి నేపథ్యంలో లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌ వంటి ఎలిమెంట్స్‌తో తయారు చేసిన కథ. ఇందులో బాలకృష్ణ కమాండో పాత్ర. పరుచూరి బ్రదర్స్‌ మాటలు రాశారు. మార్చి 8న అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. కొద్దిరోజులు షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా కూడా ఆగిపోయింది.  భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ గోపాలరెడ్డికి, బాలకృష్ణకి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. మాతో పెట్టుకోకు తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే బాలకృష్ణతో భారీ లెవల్‌లో ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాలరెడ్డి. ఈ సినిమాకి విక్రమసింహ భూపతి అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో మహారాజుగా, యోధుడుగా రెండు పాత్రలు పోషించారు బాలకృష్ణ. రోజా, పూజాభాత్రా ఈ సినిమాలో హీరోయిన్లు. ఈ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తయిన తర్వాత బాలకృష్ణ, గోపాలరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత గోపాలరెడ్డి జీవితంలో అంధకారం అలుముకుంది. మొదట అతని భార్య, ఆ తర్వాత గోపాలరెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు భార్గవ్‌ చిన్న వయసులోనే చనిపోయారు.  పౌరాణిక చిత్రాలన్నా, పౌరాణిక పాత్రలన్నా బాలకృష్ణకు ఎంతో మక్కువ అని అందరికీ తెలిసిందే. తండ్రి ఎన్‌టి రామారావు నటించిన ‘నర్తనశాల’ చిత్రాన్ని అదే పేరుతో తన దర్శకత్వంలో తియ్యాలని నిర్ణయించుకున్నారు బాలకృష్ణ. తను అర్జునుడుగా, సౌందర్య ద్రౌపదిగా నటించారు. వారం రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణకు యాక్సిడెంట్‌ అవ్వడం, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. అంతవరకు తీసిన సన్నివేశాలను ఎడిట్‌ చేసి 16 ఏళ్ళ తర్వాత దాన్ని ఒక షార్ట్‌ ఫిలింగా విడుదల చేశారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కాలేదు. 2011లో బాలకృష్ణ పుట్టినరోజున బి.గోపాల్‌ దర్శకత్వంలో ‘హర హర మహాదేవ’ మొదలైంది. ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. ఈ సినిమా ప్రారంభం రోజున అక్కడ పెట్టిన వినైల్స్‌  పెద్ద దుమారాన్ని రేపాయి. బాలకృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎందుకంటే ఆరోజుల్లోనే విడుదలైన కమల్‌హాసన్‌ సినిమా ‘దశావతారం’ చిత్రంలోని కమల్‌హాసన్‌ ఫోటోలను తీసుకొని దానికి బాలకృష్ణ తలను అడ్జస్ట్‌ చేసి పోస్టర్లు చేయడంతో పెద్ద గొడవే జరిగింది. చివరికి రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్ళకుండానే ఈ సినిమా ఆగిపోయింది. 

తను చెయ్యాల్సిన సినిమా అమల చేసిందని సీరియస్‌ అయిపోయిన మాధురీ దీక్షిత్‌!

భారతీయ సినిమా చరిత్రలో కొన్ని చెప్పుకోదగిన సినిమాల్లో ‘పుష్పక విమానము’ ఒకటి. కమల్‌హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి కారణం ఈ సినిమా మాటల్లేకుండా మూకీ సినిమాగా రూపొందడమే. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించేలా చేసిన సినిమా ఇది. 1987లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ కాకపోయినా యూనిట్‌లోని అందరికీ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకి కమల్‌హాసన్‌ నటన, ఎల్‌.వైద్యనాథన్‌ సంగీతం ప్రాణం అని చెబుతారు.  ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడమే కాదు, దర్శకత్వం వహిస్తూ నిర్మించారు సింగీతం శ్రీనివాసరావు. ఇందులో హీరోయిన్‌గా నటించే  అమ్మాయిని వెతకడం కోసం సింగీతం పెద్ద రిస్కే చేశారు. మొదట ఈ కథకు బాలీవుడ్‌ హీరోయిన్‌ నీలమ్‌ కొఠారి సరిపోతుందని భావించారు సింగీతం. ముంబాయి వెళ్లి కలిసి ఆమెను ఓకే చేశారు. అయితే ఆమె ఈ సినిమా చేసేందుకు కొన్ని షరతులు పెట్టింది. అవేమిటంటే తనతోపాటు ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీలమ్‌ చెప్పిందట. అయితే దానికి సింగీతం ‘ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. అందువల్ల మీరు అడిగిన ఫెసిలిటీస్‌ ఇవ్వలేం’ అని చెప్పారు. దాంతో నీలమ్‌ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అయితే అదే సమయంలో డైరెక్టర్‌ రమేష్‌ సిప్పీని కలిసి విషయం చెప్పారు సింగీతం. ‘ఒక అందమైన అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి ఐరన్‌లెగ్‌ అనిపించుకుంటోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె నటించిన నాలుగైదు సినిమాలు సగంలోనే ఆగిపోయాయి. అలాంటి సెంటిమెంట్లు మీకు లేకపోతే ఒకసారి ఆమెను కలవండి. ఆమె పేరు మాధురీ దీక్షిత్‌’ అని చెప్పారు రమేష్‌ సిప్పీ.  కొంచెం కష్టపడి మాధురీ దీక్షిత్‌ అడ్రస్‌ కనుక్కున్నారు సింగీతం. మొదట పిఎని కలిసి విషయం చెప్పారు. దానికా పీఏ ‘సినిమాలో డైలాగులే లేవు అని చెబుతున్నారు. మా హీరోయిన్‌ అలాంటి సినిమాలు చేయదు’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తనకు జరుగుతున్న సన్మానానికి అమల వచ్చారు. ఆమె గురించి వివరాలు సేకరించారు సింగీతం. శివాజీ గణేశన్‌తో ఒక సినిమా చేసిందని, నటించడం అసలు రాదని చెప్పారు కొందరు. తనకు మాత్రం ఆమె ముఖం చూస్తే అలా అనిపించలేదట. చాలా నేచురల్‌గా అనిపించడంతో ‘పుష్పకవిమానము’ చిత్రంలో అమలనే తీసుకున్నారు.  ఈ సినిమా తెలుగులో ‘పుష్పక విమానము’, హిందీలో ‘పుష్పక్‌’గా, అలాగే వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో మాటలు లేకపోవడంవల్ల అని ప్రాంతాలకు ఈ సినిమా వర్తించింది. ఆ తర్వాత మాధురీ దీక్షిత్‌కి ఈ సినిమా విషయం, తనని హీరోయిన్‌గా అడిగిన విషయం తెలిసింది. ‘మంచి ఛాన్స్‌ పోగొట్టావు’ అంటూ తన పీఏపై సీరియస్‌ అయిందట మాధురి.   

ఇళయరాజా అలా చేసినందువల్లే వంశీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాల్సి వచ్చింది!

వంశీ, ఇళయరాజా కాంబినేషన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయా సినిమాల్లోని మధురమైన పాటలు అందర్నీ అలరించాయి. వంశీ తన కెరీర్‌లో 26 సినిమాలను డైరెక్ట్‌ చేస్తే అందులో 12 సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇంత మంచి కాంబినేషన్‌ ఎందుకు విడిపోయింది? వంశీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఆ తర్వాత చక్రితో కాంబినేషన్‌ కంటిన్యూ చేస్తూ ఇళయరాజాను గుర్తు తెచ్చే పాటల్ని చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది వంశీ మాటల్లో తెలుసుకుందాం. ‘సితారతో మొదలైన మా ప్రయాణం ఎన్నో సంవత్సరాలు కొనసాగింది. ఆయన నన్ను ఎంతగానో ఆదరించారు. డైరెక్టర్‌గానే కాకుండా, బోయ్‌గా, కొడుకుగా..ఇలా నాపట్ల ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇళయరాజాగారు కొంచెం యారగెంట్‌గా ఉంటారు. కానీ, నా విషయంలో అలా ఎప్పుడూ లేరు. ఏ డైరెక్టర్‌కీ దక్కని మరో అద్భుతమైన అవకాశం ఏమిటంటే.. నాకు ఎన్ని ట్యూన్స్‌ కావాలంటే అన్ని ట్యూన్స్‌ ఇచ్చేవారు. సాధారణంగా ఏ డైరెక్టర్‌కి అయిన అతని సినిమాలు ఐదు పాటలు ఉన్నాయంటే.. ఐదు ట్యూన్లే ఇచ్చేవారు. కానీ, నా విషయంలో పూర్తి భిన్నంగా ఉండేది. ఎన్ని ట్యూన్లు కావాలంటే అన్ని ట్యూన్లు ఇచ్చేవారు. ఒక పాటకి 100 ట్యూన్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో నాకు కావాల్సింది సెలెక్ట్‌ చేసుకునేవాడిని. నామీద అంత ప్రేమాభిమానాలు చూపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ‘లేడీస్‌ టైలర్‌’లోని ‘గోపీలోల..’ పాటను షూట్‌ చెయ్యాలి. అది గ్రూప్‌ డాన్సర్స్‌తో కూడిన పాట. కానీ, ఇళయరాజాగారు ఆ పాటను ఇంకా రికార్డ్‌ చెయ్యలేదు. సౌండ్‌ లేకుండా నగారాలో ఉండే టెంపోతో ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసేశాను. ఈ విషయం ఆయనకి చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం ఆ పాటను రికార్డ్‌ చేశారు. మధ్యాహ్నం ఎడిటింగ్‌ స్టార్ట్‌ చేసి సాయంత్రానికి ఆయనకి పాట చూపించాను. ఇలా నా లైఫ్‌లో ఎప్పుడూ జరగలేదు. సౌండ్‌ లేకుండా పాటెలా తీశావు అని ఆశ్చర్యపోయారు. సినిమాల విషయం పక్కన పెడితే మేమిద్దరం కలిసి ట్రావెల్‌ చేసేవాళ్ళం. ఎంతో మంది స్వామీజీల దగ్గరకు, అడవుల్లోకి, ఆశ్రమాలకు నన్ను తీసుకెళ్ళేవారు. అలాంటి మా మధ్య దూరం పెరగడానికి కారణం.. ఒక పెద్ద ప్రొడ్యూసర్‌. నేను ‘జోకర్‌’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆ సినిమాకి మ్యూజిక్‌ చెయ్యడానికి భారీ రెమ్యునరేషన్‌ అడిగారు ఇళయరాజాగారు. అంత ఎమౌంట్‌ ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదు అని సీరియస్‌గా చెప్పారు. ఓపక్క నిర్మాత వెళ్ళిపోయేలా ఉన్నాడు. అందుకే ఆ సినిమాతో నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాను. అలా ఎందుకు అన్నారనే విషయం నాకు తర్వాత చెప్పారు. ఇళయారాజాగారు ఒక సినిమాకి మ్యూజిక్‌ చేశారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్‌ది ఆ సినిమా. రికార్డింగ్‌ మొత్తం పూర్తయిన తర్వాత ఆ నిర్మాతకు సంబంధించిన వ్యక్తి వచ్చి కొంత ఎమౌంట్‌ ఇచ్చి.. ‘మా ప్రొడ్యూసర్‌గారు మీకు ఇంతే ఇమ్మన్నారు. మా పాలసీ ప్రకారం అంతే ఇస్తామని చెప్పారు’ అన్నాడు. ‘నా రెమ్యునరేషన్‌ మీ ప్రొడ్యూసర్‌ డిసైడ్‌ చేస్తున్నాడా.. అయితే నాకూ ఓ పాలసీ ఉంది. ఈ డబ్బు తీసుకెళ్ళిపో. నాకు అవసరం లేదు’ అని పంపించేశారు. అందుకే తర్వాతి సినిమా విషయంలో అంత నిక్కచ్చిగా ఉన్నారు. ఆ ఎఫెక్ట్‌ నాపై పడిరది. అలా నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాను’ అని వివరించారు డైరెక్టర్‌ వంశీ. 

తెలుగు సినిమా స్టామినా ఏమిటో కలెక్షన్లపరంగా చూపిన మొదటి సినిమా ‘అడవి రాముడు’

డైరెక్టర్‌గా చేసింది రెండు సినిమాలు. ఆ రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. మరి మూడో సినిమాయే ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోతో చెయ్యాల్సి వస్తే ఆ దర్శకుడికి ఎలా ఉంటుంది? అప్పుడతని మానసిక స్థితి ఏమిటి? రెండు ఏవరేజ్‌ సినిమాలు చేసిన దర్శకుడిగా ఒక స్టార్‌ హీరోతో సినిమా చేసి సూపర్‌హిట్‌ చెయ్యాలంటే ఎంత గ్రౌండ్‌ వర్క్‌ చేసి ఉండాలి, ఎంతగా ఆలోచించి ఉండాలి. ఆ పరిస్థితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి వచ్చింది. ఆయన మూడో ప్రయత్నంగా చేసిన సినిమాయే ‘అడవి రాముడు’. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? ఎన్టీఆర్‌తో చేసిన మొదటి సినిమాని సూపర్‌హిట్‌ చేయడం కోసం ఏయే అంశాలపై ఆయన దృష్టి పెట్టారు? అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘నా మొదటి సినిమా ‘బాబు’. నేను డైరెక్టర్‌గా నా పేరు స్క్రీన్‌మీద చూసుకుంది ఆ సినిమాతోనే. అప్పటికి ఫామ్‌లో ఉన్న శోభన్‌బాబును హీరోగా పెట్టుకొని, వాణిశ్రీ, లక్ష్మీ, అరుణా ఇరాని హీరోయిన్లుగా చేసిన ‘బాబు’ చిత్రానికి అప్రిషియేషన్‌ వచ్చింది. మంచి సినిమా చేసావనే పేరు వచ్చింది. కానీ, కమర్షియల్‌గా ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత మురళీమోహన్‌, జయసుధ జంటగా రూపొందించిన సినిమా ‘జ్యోతి’. ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్‌ రావడమే కాదు, నంది అవార్డు కూడా లభించింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా కూడా ఏవరేజ్‌ అయ్యింది. ఈ రెండు సినిమాల అనుభవంతో మూడో సినిమాగా అవార్డు సినిమా చెయ్యాలా, కమర్షియల్‌ సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తుండగా, సత్యచిత్ర నిర్మాతలు నా దగ్గరకి వచ్చి ఎన్‌.టి.రామారావుగారితో మీరు ఓ సినిమా చెయ్యాలి అని అడిగారు. నేను షాక్‌ అయ్యాను. మొదట నేను నమ్మలేదు. ఆ తర్వాత ఈ విషయం రామారావుగారికి చెప్పారా అని అడిగాను. మీ పేరు చెప్పగానే ఆయన ఓకే అన్నారని చెప్పారు. దాంతో నాపై ఓ కొత్త బాధ్యత వచ్చి పడింది  ఈ ఆఫర్‌ నాకు వచ్చే నాటికి రామారావుగారికి 54 ఏళ్ళు. ఆ వయసులో ఉన్న ఆయనతో స్టూడెంట్‌ సినిమా చెయ్యలేను, లవ్‌స్టోరీ చెయ్యలేను. మరి ఎలాంటి సినిమా అయితే బాగుంటుంది అని ఆలోచించాను. దేవుడికి ప్రతి రూపంగా ఉండే క్యారెక్టర్స్‌ ఎన్నో చేశారాయన. ఆయన స్క్రీన్‌మీద కనిపిస్తే హారతులు ఇచ్చేవారు. ఆయనకి అది చాలా ప్లస్‌. దాన్ని డబుల్‌ ప్లస్‌ చెయ్యాలి. దాన్ని ఒక కమర్షియల్‌ సినిమాలో చెయ్యాలనుకున్నాను. రామారావుగారు ఏనుగు మీద కూర్చొని వస్తుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అలా చెయ్యాలంటే ఆ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ అయి ఉండాలి. ఆయనతో టార్జాన్‌లాంటి సినిమా చెయ్యలేము. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అయితే డిగ్నిఫైడ్‌గా ఉంటుందనిపించి ఆ దిశగా ఆలోచించాను. గెటప్‌ బాగుంటుంది అనిపించింది. ప్లస్‌ని, డబుల్‌ ప్లస్‌ చెయ్యగలిగాము. ఇక ఆయనలోని మైనస్‌ గురించి ఆలోచిస్తే డాన్సులు. అప్పటికి అక్కినేని నాగేశ్వరావుగారు తన స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. ఒక ఫారెస్ట్‌ ఆఫీసర్‌ హీరోయిన్‌తో డాన్సులు చేస్తే బాగోదు. అందుకని ఫస్ట్‌హాఫ్‌లో హీరోని ఒక సాధారణ వ్యక్తిగా పరిచయం చేసి సెకండాఫ్‌లో అతను ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అని రివీల్‌ చేస్తే.. ఫస్ట్‌హాఫ్‌లో కావాల్సిన రొమాన్స్‌, పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా చెయ్యొచ్చు అనిపించింది. అలా ఆయనలోని మైనస్‌ని ఈ సినిమాలోని పాటలతో ప్లస్‌ చెయ్యగలిగాం.  ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే... అప్పటికే రామారావుగారు ఎన్నో పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు ఇంకా అనేక మహానుభావుల పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్స్‌ని చూపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే అప్పటివరకు ఆయన వేయని వాల్మీకి, ఏకలవ్యుడి పాత్రలను ఒక పాటలో చూపించాం. ఇక ఆ పాటలోనే రామారావుగారిని రాముడిలా చూపించడానికి ఒక కారణం ఉంది. ఆయన్ని రాముడిగా ప్రత్యక్షంగా చూడాలనుకున్నాను. అందుకే అంతకుముందు ఆయన చేసిన క్యారెక్టరే అయినా ఇందులో పెట్టాము. ఆయన్ని రాముడిగా ప్రత్యక్షంగా చూశాక నా జన్మ ధన్యమైంది అనిపించింది. అదే సినిమాకి లాస్ట్‌ షాట్‌ అవ్వాలనుకున్నాను. అలాగే లాస్ట్‌ షాట్‌ రాముడితోనే చేశాము. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే యూనిట్‌లోని అందరూ ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఆయన కూడా ఇది చూసి ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.  ఇక ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్‌గా నాకు బంగారు బాట వేసిన సినిమా ‘అడవి రాముడు’. షూటింగ్‌ పూర్తయిన తర్వాత వెళుతూ వెళుతూ ‘నలభై రోజులు అడవిలో మీతో ప్రయాణం చేశాం బ్రదర్‌. ఇట్‌ ఈజ్‌ గ్రీన్‌ మెమరీ ఇన్‌ మై లైఫ్‌’ అన్నారు. ఆయన నాకిచ్చిన కాంప్లిమెంట్‌ ఆస్కార్‌ కంటే గొప్పదిగా ఫీల్‌ అవుతున్నాను. జన్మజన్మలకి ఆయన రుణం తీర్చుకోలేను. నా సక్సెస్‌కి, ఇప్పుడు నేనున్న పొజిషన్‌కి ముఖ్యంగా ఆయనే కారణం. ఒక స్టార్‌ హీరోతో సినిమా చెయ్యాలంటే ఇన్ని ఎలిమెంట్స్‌ గురించి ఆలోచిస్తేనే కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యే సినిమా చెయ్యగలం. ఆరోజుల్లో తెలుగు సినిమాకి ఇంత కలెక్షన్‌ వస్తుందా అని మొదటిసారి ప్రూవ్‌ చేసిన ‘అడవి రాముడు’ ఒక చరిత్ర సృష్టించింది. 4 సెంటర్స్‌లో 365 రోజులు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడడమే కాకుండా, నెల్లూరు కనకమహల్‌ థియేటర్‌లో ప్రతిరోజూ 5 ఆటలతో 100 రోజులు ఆడడం మరో విశేషం’ అంటూ వివరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.

‘ప్రేమించుకుందాం రా’లో ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది.. ఆ అవకాశం అంజలా జవేరికి దక్కింది!

వెంకటేష్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమించుకుందాం..రా’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. 1997లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి శతదినోత్సవ చిత్రమైంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు ఇందులో హీరోయిన్‌ ఎవరైతే బాగుంటుంది అనే విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి. చివరికి బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని అందరూ భావించారు. జయంత్‌కి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఐశ్వర్యారాయ్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాతతోపాటు చిత్ర యూనిట్‌ కూడా వ్యతిరేకించారట. ఎందుకంటే అప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఆమె చేసిన ‘ఇరువర్‌’ చిత్రం ఫ్లాప్‌ అయింది. దాన్ని సెంటిమెంట్‌గా భావించి ఐశ్వర్యను హీరోయిన్‌గా తీసుకోలేదు. అప్పుడా అవకాశం అంజలా జవేరికి దక్కింది. అయితే ఆ తర్వాత ఐశ్వర్యారాయ్‌ చేసిన సినిమాలు వరసగా సూపర్‌హిట్‌ అవ్వడంతో ఆమె బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. దాంతో ఆమెను తెలుగులో హీరోయిన్‌గా బుక్‌ చేసుకునే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు.  జయంత్‌ దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా ‘రావోయి చందమామ’ చిత్రంలోని ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఎవరైనా బాలీవుడ్‌ హీరోయిన్‌ చేస్తే బాగుంటుందని ప్రీతి జింటాను సంప్రదించేందుకు ముంబై వెళ్ళారు జయంత్‌. ఆ సమయంలో అతనికి ఐశ్వర్యారాయ్‌ తారసపడిరది. జయంత్‌ ముంబయి ఎందుకు వచ్చాడో తెలుసుకున్న ఐశ్వర్య ‘మీ సినిమాలో హీరోయిన్‌గా నటించమని ఎంతో మందిని అడుగుతారు. మరి నన్నెప్పుడూ అడగరు ఎందుకని’ ప్రశ్నించింది. చెప్పాలా వద్దా అనే మీమాంసతోనే ‘ప్రేమించుకుందాం..రా’ సినిమా విషయాన్ని ఆమెకు చెప్పాడు జయంత్‌. అర్థం చేసుకున్న ఐశ్వర్య ‘రావోయి చందమామ’ చిత్రంలో ఒక పాట చేయడానికి ఒప్పుకుంది. అలా తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ‘రావోయి చందమామ’. ఆ తర్వాత తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయలేదు. ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌’. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే ‘రావణన్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటించింది. ఇక శంకర్‌ దర్శకత్వంలో ‘జీన్స్‌’, ‘రోబో’ చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రం హీరోయిన్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు ఐశ్వర్య. 

ఆ హీరోయిన్‌ అందాలు ఎవరూ చూడకూడదని ఆమె భర్త ఏం చేశాడో తెలుసా?

ప్రపంచంలో రకరకాల పిచ్చి పనులు మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఇలాంటి ఓవరాక్షన్‌ విదేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే ఇక చెప్పక్కర్లేదు. అలాంటి ఓ విచిత్రమైన సంఘటన హాలీవుడ్‌లో జరిగింది. ఆమె పేరు హెడీ లామర్‌. అతిలోక సుందరిని తలపించే తన అంద చందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించేది. ఆమె అందాన్ని చూసి ముగ్దుడైన అలెగ్జాండర్‌ మండీ అనే ధనవంతుడు ఆమెను ప్రాధేయ పడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అతని వయసు 33 సంవత్సరాలు. అప్పటికి హెడీ వయసు 19 ఏళ్ళు. 21 సంవత్సరాల వయసులోనే తొలిసారి పెళ్లి చేసుకున్న మండీ సంవత్సరం తిరక్కుండానే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. దాదాపు 12 ఏళ్ళు ఒంటరిగానే ఉన్న మండీని హెడీ అందం కదిలించింది. ఎన్నో సినిమాల్లో అర్థనగ్నంగానూ, నగ్నంగానూ నటించింది హెడీ. ఆమె గ్లామర్‌ని చూసి అందరూ ఆమెను హెడీ గ్లామర్‌ అని పిలిచేవారు. అంతటి అందగత్తె అయిన తన భార్య అందాన్ని మరొకరు చూడకూడదు అనుకున్నాడు. 1933లో ఆమె నటించిన ‘ఎక్స్‌టసీ’ అనే చిత్రంలో హెడీ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఆమె అందాన్ని తెరపై ఆస్వాదించారు అందరూ. అయితే ఇకపై తన భార్య అందాలను ఎవరూ చూడకూడదని డిసైడ్‌ అయిన మండీ ఆ సినిమాకి సంబంధించిన ప్రింట్స్‌ అన్నింటినీ తెప్పించి వాటిని తగలబెట్టేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ ఏ ప్రింట్‌ వచ్చిన దాన్ని ఎంతో డబ్బు చెల్లించి కొని తగలబెట్టేవాడు.  పిచ్చి ఎప్పటికైనా పరాకాష్టకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఎక్స్‌టసీ’ చిత్రం విడుదలైన సంవత్సరమే హెడీని పెళ్లి చేసుకున్నాడు మండీ. వారి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్ళయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మరో ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంది హెడీ. ఆమె చివరి పెళ్లి 1963లో జరిగింది. 1965లో తన ఆరో భర్తకు విడాకులిచ్చింది. 2000 సంవత్సరంలో చనిపోయిన హెడీ 1965 తర్వాత మరో పెళ్లి చేసుకోలేదు. హెడీ నుంచి విడిపోయిన తర్వాత మండీ మరో నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతని ఐదో భార్య 1977లో చనిపోయింది. అదే సంవత్సరం మండీ కూడా చనిపోవడం గమనార్హం. 

‘గ్యాంగ్‌ లీడర్‌’ కథకి ‘నో’ చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్‌తో ‘ఎస్‌’ అనిపించడానికి ఏం చేశారు?

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటివరకు 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ వాటిలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్స్‌లో ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఒకటి. చిరంజీవిని మెగాస్టార్‌ని చేసిన సినిమా కూడా అదే. విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా సంచలనం సృష్టించింది. చిరంజీవి ఫ్యాన్స్‌ సంఖ్యని రెట్టింపు చేసిన సినిమా కూడా ఇదే.  అప్పటివరకు వచ్చిన చిరంజీవి సినిమాలకు భిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి మేనరిజం కూడా కొత్తగా ఉండడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఆడియోపరంగా కూడా ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిరంజీవి, విజయశాంతి మధ్య కెమీస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కవుట్‌ అయింది. ఈ సినిమాలోని పాటల కోసమే రిపీట్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కి వెళ్ళే వారంటే అందులో అతిశయోక్తి లేదు. ఇంతటి సంచలనం సృష్టించిన సినిమా వెనుక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్‌’ కథ విన్న చిరంజీవి మొదట ‘నో’ చెప్పాడంటే అందరూ ఆశ్చర్యపోకతప్పదు. ఒక మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న విజయ బాపినీడు సినిమా మీద ఉన్న ఆసక్తితో ‘డబ్బు డబ్బు డబ్బు’ చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం చిరంజీవి హీరోగా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘హీరో’, ‘మగధీరుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. మెగాస్టార్‌తో ఓ విభిన్నమైన చిత్రాన్ని తీయాలని భావించిన బాపినీడు ‘గ్యాంగ్‌లీడర్‌’ కథ రాసి చిరుకి వినిపించారు. అయితే బాపినీడు చెప్పిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఎలాంటి మొహమాటం లేకుండా చేయనని చెప్పేశారు. చిరంజీవి నో చెప్పడంతో ఎంతో నిరుత్సాహపడిన బాపినీడు ఆ కథను అనుకోకుండా పరుచూరి బ్రదర్స్‌కి వినిపించారు. కథ విన్న తర్వాత అందులోని లోపాన్ని కనిపెట్టిన పరుచూరి బ్రదర్స్‌.. కథను మార్చి తీసుకు రావడానికి మూడు రోజులు టైమ్‌ అడిగారు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పారు బాపినీడు. పరుచూరి బ్రదర్స్‌పై ఉన్న అపార నమ్మకంతో ఆయన కూడా సరే అన్నారు. మూడు రోజుల తర్వాత కథకు కొన్ని ఆసక్తికర విషయాలను జోడిరచి చిరంజీవికి వినిపించారు గోపాలకృష్ణ. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పారు చిరంజీవి. డేట్స్‌ విషయం చూసుకోమని అల్లు అరవింద్‌కి పురమాయించారు. అయితే కథపై అంత నమ్మకం లేని అరవింద్‌.. గోపాలకృష్ణను మద్రాస్‌ పిలిపించుకున్నారు. గోపాలకృష్ణ కథ చెబుతున్నప్పుడు అరవింద్‌ రికార్డ్‌ చేసుకున్నారని ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్‌ తెలిపారు. ‘ఎందుకు రికార్డ్‌ చేసుకుంటున్నారు’ అని గోపాలకృష్ణ అడగగానే.. ‘మీరు మాటలతో మాయాజాలం చేసేస్తారు. కాబట్టి ఇంటికి వెళ్లాక ఒక్కసారి ఈ కథను విని ఎలా ఉందో చెబుతాను’ అని అరవింద్‌ అన్నారని గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాపినీడు రాసిన ‘గ్యాంగ్‌లీడర్‌’ కథలో మురళీమోహన్‌తోపాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి మృతి చెందుతారు. ఈ కథను బాపినీడు చెప్పగానే.. ‘అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏం ఉంటుంది. గ్యాంగ్‌ లేకుండా అసలు గ్యాంగ్‌లీడర్‌కు అర్థం ఏం ఉంటుంది’ అనే పాయింట్‌ ఆ కథలో నెగెటివ్‌గా అనిపించి పరుచూరి బ్రదర్స్‌ కొన్ని మార్పులు చేశారు. అలాగే విజయశాంతి, రావుగోపాలరావు పాత్రల రూపు రేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన తర్వాత కథకు ఒక కొత్త షేప్‌ వచ్చింది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ రావడం వెనుక ఇంత ఆసక్తికరమైన కథ ఉంది. 

అమితాబ్‌ బచ్చన్‌ ఆ క్యారెక్టర్‌ చెయ్యడానికి రజినీకాంత్‌ ఒప్పుకోలేదు.. ఏ సినిమాలోనో తెలుసా?

ఇప్పుడు స్టార్‌ హీరోలుగా వెలుగొందుతున్న వారు తొలిరోజుల్లో ఎలాంటి క్యారెక్టర్‌ చెయ్యడానికైనా సిద్ధపడేవారు. నటుడుగా నిలదొక్కుకునే ప్రయత్నంలో అలాంటి నిర్ణయం తీసుకునేవారు. కొందరు విలన్‌గానే పరిచయమై ఆ తర్వాత హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్యకాలంలో ఒక భాషలో హీరో అయినప్పటికీ మరో భాషలో విలన్‌గా నటించేందుకు వెనుకాడడం లేదు. నటుడు అన్న తర్వాత అన్ని తరహా క్యారెక్టర్లు చెయ్యాలనేది వారి ఆలోచన. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ నుంచి అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ అలీఖాన్‌ వంటి హీరోలు టాలీవుడ్‌లో విలన్స్‌గా నటించారు. అలాగే తమిళ్‌ నుంచి ఆర్య, విజయ్‌సేతుపతి వంటి హీరోలు ఇక్కడ విలన్స్‌గా రాణించారు. అయితే కొందరు హీరోలు మాత్రం తమ కెరీర్‌లో హీరోలుగానే నటించారు తప్ప విలన్స్‌గా చేయలేదు. కనీసం నెగెటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్స్‌ కూడా చేయలేదు. అలాంటివారిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని కెరీర్‌లో కొన్ని వందల సినిమాలు చేసినా ఎప్పుడూ విలనీ జోలికి వెళ్ళలేదు. అయితే అమితాబ్‌ని విలన్‌ చెయ్యాలని డైరెక్టర్‌ శంకర్‌ ప్రయత్నించారు.  2010లో వచ్చిన ‘రోబో’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక విశేషం ఉంది. అదేమిటంటే ఈ సినిమాలో విలన్‌గా డ్యానీ నటించారు. మొదట ఈ క్యారెక్టర్‌ని అమితాబ్‌ బచ్చన్‌కి ఆఫర్‌ చేశాడు శంకర్‌. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేని అమితాబ్‌.. రజినీకాంత్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ‘సర్‌, మిమ్మల్ని ప్రేక్షకులు విలన్‌గా అంగీకరించలేరు. ఈ పాత్ర చేయకుండా ఉంటేనే మంచిది’ అని సూచించారు రజినీ. ఆ మాటతో ‘రోబో’ సినిమా చేయడానికి అమితాబ్‌ ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని అమితాబ్‌ స్వయంగా ఒక సందర్భంలో వెల్లడిరచారు. ఆ తర్వాత ‘2.0’లో అమితాబ్‌ విలన్‌గా నటించబోతున్నాడని సోషల్‌ మీడియాలో రూమర్‌ వచ్చింది. అక్షయ్‌కుమార్‌ అందులో విలన్‌గా నటించడంతో అది రూమరేనని తెలిసింది.  అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌ కలిసి గతంలో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి చేసినవి హిందీ సినిమాలే కావడం విశేషం. ‘అంధా కానూన్‌’, ‘గిరఫ్‌తార్‌’, ‘హమ్‌’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ‘హమ్‌’ 1991లో వచ్చింది. దాదాపు 33 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.   

45 ఏళ్ల క్రితం ఆ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ కలిసి హ్యాట్రిక్‌ కొట్టారు.. మరి ఆ తర్వాత! 

1978 సంవత్సరం నాటికి హీరో కృష్ణ టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్‌ అప్పుడు అప్‌కమింగ్‌ హీరో. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ కలిసి హ్యాట్రిక్‌ కొట్టారు. అయితే వారి స్నేహబంధం మాత్రం నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగింది. రజినీకాంత్‌కు కృష్ణ అంటే అపారమైన గౌరవం. కృష్ణను తొలిసారి కలిసినప్పుడు ఎంత గౌరవించారో అదే గౌరవం తను సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా కనబరిచేవారు. వీరిద్దరూ కలిసి నటించిన మూడు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలుసుకుందాం.  సూపర్‌స్టార్‌ కృష్ణ, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కలిసి నటించిన తొలి చిత్రం ‘అన్నదమ్ముల సవాల్‌’. కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సారథీ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ‘సహోదర సవాల్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. కన్నడలోనూ ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ఆర్‌.దాసే రూపొందించారు. విశేషం ఏమిటంటే కన్నడ వెర్షన్‌కి పనిచేసిన టెక్నీషీయన్స్‌ అందరూ తెలుగు వెర్షన్‌కి కూడా పనిచేశారు. ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం  కురిపించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే కృష్ణ, రజినీకాంత్‌ల స్నేహం ఎంతో బలపడిరది. ఈ సినిమా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఔట్‌డోర్‌ షూటింగ్‌ ఉన్నప్పుడు తన సొంత కారులోనే వెళ్ళడం కృష్ణకు మొదటి నుంచీ అలవాటు. అందుకే మద్రాస్‌ నుంచి తన కారును హైదరాబాద్‌ తెచ్చుకున్నారు. ఒకరోజు షూటింగ్‌కి బయల్దేరుతుండగా రజినీకాంత్‌ వచ్చి కృష్ణను కలిసి ‘అన్నయ్యా.. లొకేషన్‌కి మీ కారులో రావచ్చా..’ అని ఎంతో వినయంగా, మరికొంత భయంగానూ అడిగారు. అప్పటికే టాలీవుడ్‌లో కృష్ణ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. రజినీకాంత్‌ అప్‌కమింగ్‌ హీరో. అంత పెద్ద హీరో తనని కారులో తీసుకెళ్తారా అనే సందేహంతోనే లిఫ్ట్‌ అడిగారు. అడగాలే గానీ, దేన్నీ కాదనని కృష్ణ ఒక నవ్వు నవ్వేసి రజినీని తన కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ‘అన్నయ్యా.. జీవితంలో నేను ఇలాంటి కారు కొనగలనా..’ అన్నారు రజినీ. దానికి కృష్ణ ‘నీ టాలెంట్‌ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచి హీరోగా ఎదుగుతావు. డబ్బు, పేరు సంపాదిస్తావు’ అని భుజం తట్టి ప్రోత్సహించారు. కృష్ణది ఎంత గొప్ప మనసో అప్పుడు రజినీకాంత్‌కి అర్థమైంది. అందుకే ఆనాటి నుంచి కృష్ణను తన సొంత అన్నయ్యలాగే భావించేవాడు రజినీ. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘అన్నదమ్ముల సవాల్‌’ ఘనవిజయం సాధించింది. రజినీకాంత్‌కు హీరోగా మంచి పేరు వచ్చింది. ఇందులోని పాటలు అప్పట్లో సూపర్‌హిట్‌ అయ్యాయి.  ‘అన్నదమ్ముల సవాల్‌’ ఘనవిజయం సాధించడంతో ఇదే కాంబినేషన్‌లో ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రాన్ని రూపొందించారు. అన్నదమ్ముల సవాల్‌ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌తోనే సారథీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో కృష్ణ, రజినీకాంత్‌ బావబావమరుదులుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ఆదరణ పొందాయి. ఇలా కృష్ణ, రజినీ నటించిన రెండు సినిమాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అదే సమయంలో కె.వాసు దర్శకత్వంలో మహేంద్ర ‘తోడుదొంగలు’ అనే సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యం ఉండడంతో హీరోలుగా కృష్ణ, రజినీకాంత్‌ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. దానికి కృష్ణ ఓకే చెప్పారు. అయితే రజినీకాంత్‌ డేట్స్‌ మాత్రం దొరకలేదు. దీంతో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చిరంజీవిని ఎంపిక చేశారు.  ఇక కృష్ణ, రజినీ కలిసి నటించిన మూడో సినిమా ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా, రిషి కపూర్‌ హీరోలుగా రూపొందిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమా ప్రారంభమయ్యే సమయానికి రజినీకాంత్‌ తమిళ్‌లో స్టార్‌ హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్నారు. రజినీకాంత్‌ అంటే కృష్ణకు వున్న అభిమానం కొద్దీ ఈ సినిమాలో రజినీకాంత్‌ని ఓ హీరోగా బుక్‌ చేయమని నిర్మాత సూర్యనారాయణబాబుకి సూచించారు. నిర్మాత రజినీని సంప్రదించి విషయం చెప్పారు. దానికి రజినీ వెంటనే ఒప్పుకున్నారు. హిందీ వెర్షన్‌కి మన్‌మోహన్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించగా, తెలుగు వెర్షన్‌ని విజయనిర్మల డైరెక్ట్‌ చేశారు. ఇందులో రామ్‌గా రజినీకాంత్‌, రాబర్ట్‌గా కృష్ణ, రహీమ్‌గా చంద్రమోహన్‌ నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధించి కృష్ణ, రజినీకాంత్‌లకు హ్యాట్రిక్‌ మూవీ అయింది.  ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానప్పటికీ రజినీకాంత్‌ హీరోగా పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌లో ‘మా వీరన్‌’ అనే సినిమాను తమిళ్‌లో నిర్మించారు కృష్ణ. 1986లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ చిత్రం శతనోత్సవానికి రజినీకాంత్‌ ముఖ్యఅతిథిగా హాజరై యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. కృష్ణ బంగారం లాంటి మనిషని, ఆయనతో కలిసి మూడు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించడం తన జీవితంలో మరచిపోలేని గొప్ప విషయమని ఇప్పటికీ చెబుతుంటారు రజినీకాంత్‌. 

చిన్న‌న‌టిని 'శంక‌రాభ‌ర‌ణం' హీరోయిన్‌గా కె. విశ్వ‌నాథ్ ఎలా తీసుకున్నారు?

మంజుభార్గ‌వి సుప్ర‌సిద్ధ నాట్య‌కార‌ణి. కూచిపూడిలో వెంప‌టి చినస‌త్యం మాస్టారు ఆమె గురువు. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన క్లాసిక్ ఫిల్మ్ 'శంక‌రాభ‌ర‌ణం'లో హీరోయిన్ తుల‌సి పాత్ర మంజుభార్గ‌వి న‌ట జీవితంలో మైలురాయిగా, ఒక క‌లికితురాయిలా నిలిచిపోయింది. అయితే ఆ సినిమాకు ముందు ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు.. ఆమె మాట‌ల్లోనే చెప్పాలంటే పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. అలాంటి ఆమెకు ఏకంగా 'శంక‌రాభ‌ర‌ణం' లాంటి సినిమాలో నాయిక‌గా అవ‌కాశం రావ‌డం అంటే మాట‌లు కాదు. అదెలా సాధ్య‌మైంది?  విశ్వ‌నాథ్ ఆమెనే ఎందుకు తుల‌సి పాత్ర‌కు ఎంచుకున్నారు? చెన్నైలో ఒక‌సారి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వారు ఏదో ఒక ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. ఆ ఫంక్ష‌న్‌లో గీత‌, మంజుభార్గ‌వి, మ‌రో న‌టి.. ముగ్గురిని వాకిట్లో నిల్చొని వ‌చ్చిన అతిథులంద‌రి మీదా ప‌న్నీరు చ‌ల్లి, వారికి పూలు ఇవ్వమ‌ని చెప్పారు. ఆ వ‌చ్చిన అతిథుల్లో విశ్వ‌నాథ్ కూడా ఉన్నారు. అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' క‌థ మీద ప‌నిచేస్తున్న ఆయ‌న‌ మంజుభార్గ‌విని చూడ‌గానే ఆయ‌నకు తుల‌సి పాత్ర‌ధారిణి దొరికేసింద‌ని అనిపించింది. అయితే ఆమె ఆ పాత్ర‌కు స‌రిపోతుందో, లేదో తెలియాలి క‌దా! అందుక‌ని 'శంకరాభ‌ర‌ణం' కంటే ముందు తీసిన 'ప్రెసిడెంట్ పేర‌మ్మ' మూవీలో మంజుభార్గ‌వి చేత ఓ జావ‌ళి చేయించారు. ఆ సినిమాలో నూత‌న్‌ప్ర‌సాద్‌, క‌విత హీరో హీరోయిన్లు. స్టేజి మీద ఎలా చేస్తారో అలా మేక‌ప్‌, కాస్ట్యూమ్స్‌, ఆభ‌ర‌ణాలు ధ‌రింప‌జేసి అలా మంజుభార్గ‌వి చేత‌ చేయించారు. అలాగే రెండు సీన్లు కూడా ఆమెకు పెట్టారు. బ‌హుశా ఆమె ప‌ర్ఫార్మెన్స్‌ను చూసేదానికేమో! డ‌బ్బింగ్ కూడా ఆమెచేతే చెప్పించారు. అంత‌దాకా ఆమె త‌ను చేసిన ఏ సినిమాకీ డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. కార‌ణం.. ఆమెది బేస్ వాయిస్‌! ద‌గ్గ‌రుండి మంజుభార్గ‌వి చేత డ‌బ్బింగ్ చెప్పించారు విశ్వ‌నాథ్‌. ఆ డ‌బ్బింగ్ అయిపోయాక "నీ ఫొటో ఒక‌టి కావాలి" అన్నారాయ‌న‌. స‌రేన‌ని చెప్పి, బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ సంగ‌తి మ‌ర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు మంజుభార్గ‌వి.  నెల రోజులు గ‌డిచాక 'శంక‌రాభ‌ర‌ణం' యూనిట్ నుంచి ఎవ‌రో వ‌చ్చి మంజుభార్గ‌విని ఫొటో కావాల‌ని అడిగారు. అప్పుడు పాండీబ‌జార్‌లోకి కృష్ణా ఫొటో స్టూడియోకు వెళ్లి లాంగ్‌షాట్‌, క్లోజ‌ప్‌, ప్రొఫైల్ ఫొటోలు తీయించుకొని అవి ఇచ్చారు. ఆ త‌ర్వాత జె.వి. సోమ‌యాజులు, మంజుభార్గ‌వికి క‌లిపి మేక‌ప్ టెస్ట్ చేయించారు విశ్వ‌నాథ్‌. అప్పుడు తీసిన ఫొటోల‌ను ఇండ‌స్ట్రీలో ప‌లువురికి చూపించారు. అప్ప‌టికే కొన్ని సినిమాల్లో ఏవేవో రోల్స్ చేసిన మంజుభార్గ‌విని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు. అలా 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రంలో నాయిక‌గా అడుగుపెట్టారామె. ఆ సినిమా ఆమెకు ఎంత‌టి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమా వేషాల మీద కంటే త‌న మ‌న‌సుకు ఇష్ట‌మైన‌ డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా త‌క్కువ సినిమాలు చేశారు. (ఫిబ్ర‌వ‌రి 2 కె. విశ్వ‌నాథ్ వర్ధంతి సంద‌ర్భంగా...)