13 సినిమాల్లో జంటగా నటించారు.. కానీ, ఒక్కసారి కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు!

సినిమా అనేది సహజంగా కనిపించే అసహజ ప్రక్రియ. మనం చూస్తున్నది నిజం కాదు అని తెలిసినా.. నిజంగా జరుగుతోందా అనే భ్రమను కలిగిస్తుంది సినిమా. అంటే సినిమాలో మనం చూసే ప్రేమలు కావచ్చు, పగ ప్రతీకారాలు కావచ్చు, ఒకరినొకరు చంపుకునే సన్నివేశాలు కావచ్చు. ఇవన్నీ అబద్దాలే. సినిమాల్లో హీరో, హీరోయిన్‌ ఎంతో క్లోజ్‌గా మూవ్‌ అవుతారు. భార్యాభర్తలుగా కనిపిస్తారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆయా క్యారెక్టర్ల నుంచి బయటికి వచ్చేసినా వ్యక్తిగతంగా స్నేహంగా ఉంటారని అందరూ భావిస్తారు. చాలా మంది నటీనటులు బయట కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, కుటుంబ సభ్యుల్లాగే మెలగడం మనం చూస్తుంటాం. అలా కాకుండా మరోలా ఉండే జంట ఒకటి ఉంది. అదే సూపర్‌స్టార్‌ కృష్ణ, వాణశ్రీ. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. రొమాంటిక్‌ సీన్స్‌ని కూడా పండిరచారు. కానీ, వారిద్దరూ పర్సనల్‌గా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదంటే మీరు నమ్ముతారా? ఇది నిజం.  స్వతహాగా తక్కువ మాట్లాడే కృష్ణ సహనటులతో మర్యాదగానే నడుచుకునేవారు, కాస్త క్లోజ్‌ అనిపించిన వారితో సరదాగా కూడా ఉండేవారు. అలాంటిది హీరోయిన్‌ వాణిశ్రీ విషయంలో అలా ఎందుకు ఉండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయినా ఇద్దరూ మాట్లాడుకునే వారు కాదు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు మీడియా అంతగా లేదు కాబట్టి ఈ విషయం గురించి బయటికి తెలియదు. ఆమధ్య వాణిశ్రీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిరచారు.  ‘నేను, కృష్ణగారు కలిసి 13 సినిమాల్లో నటించాం. అయితే ఆయనెప్పుడూ నాతో మాట్లాడేవారు కాదు. సెట్‌కి వచ్చినపుడు ఆయన నాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పేవారు కాదు, నేను ఆయనకు చెప్పేదాన్ని కాదు, షూటింగ్‌ టైమ్‌లో.. డ్యూయెట్లు, కౌగిలింతలు.. అన్నీ మామూలుగానే జరిగేవి. షాట్‌ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అసలు నా విషయంలో ఆయన అలా ఎందుకు ఉన్నారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఈ విషయం గురించి కొన్ని సినిమాల వరకు ఆలోచించాను. ఆ తర్వాత ఆలోచించడం అనవసరమనిపించింది. అతని తత్వమే అంతని సరిపుచ్చుకున్నాను. అయితే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వారు. ఆయనకి ఎంతో మెమరీ పవర్‌ ఉండేది. అప్పట్లో రిలీజ్‌ అయిన సినిమా కలెక్షన్స్‌ని పైసలతో సహా చెప్పేవారు. అయితే మా మధ్య వ్యక్తిగత ద్వేషాలు ఏవీ లేవు. అన్ని సినిమాలు కలిసి చేసినా మాట్లాడలేదు. కానీ, 30 సంవత్సరాల తర్వాత ఒకసారి నాకు ఫోన్‌ చేశారు. అది కూడా ఒక సినిమా కోసం. వెంకటేష్‌ చేసిన ‘అబ్బాయిగారు’ మొదట కృష్ణతో చేద్దామనుకున్నారు. అందులో తల్లి క్యారెక్టర్‌ నన్ను చెయ్యమని అడగడానికి ఫోన్‌ చేశారు. నేను షాక్‌ అయ్యాను. మీకు తల్లిగా నేను నటించాలా అని అడిగాను. సినిమా బాగుంటుంది చూడమన్నారు. తమిళ్‌లో భాగ్యరాజా చేసిన ఆ సినిమాను చూశాను. తనని ప్రాణంగా ప్రేమించే కొడుక్కి క్లైమాక్స్‌లో విషం పెట్టి చంపాలనుకుంటుంది సవతి తల్లి. అది చూసిన తర్వాత ఈ సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యాను. అదే విషయం కృష్ణగారికి చెప్పాను. అదే ఆయన నాతో మాట్లాడిన మొదటిసారి, చివరిసారి కూడా’ అని వివరించారు వాణిశ్రీ. 

హీరోయిన్‌గా జీవితను వద్దన్న రాజశేఖర్‌.. అప్పుడు ఆ దర్శకనిర్మాతలు ఏం చేశారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అది హీరోల విషయంలోనే జరిగితే మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి ఓ ఘటన డా.రాజశేఖర్‌ విషయంలో జరిగింది. రాజశేఖర్‌ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు సినిమాలే ఆయనకు ఎక్కువ పేరు తెచ్చాయి. తమిళ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలో ఒక సినిమాలో హీరోయిన్‌గా జీవితను ఎంపిక చేశారు. అప్పటికి వీరిద్దరూ కలిసి నటించలేదు. జీవిత డీగ్లామర్‌గా ఉండడంతో తన పక్కన హీరోయిన్‌గా సరిపోదని భావించిన రాజశేఖర్‌.. ఈ సినిమాలో హీరోయిన్‌ బబ్లీగా ఉంటే బాగుంటుందని, జీవిత దానికి విరుద్ధంగా ఉందని దర్శకనిర్మాతలతో వాదించాడట. వెంటనే హీరోయిన్‌ని మార్చమని చెప్పాడు రాజశేఖర్‌. అతను చెప్పినదంతా విన్న తర్వాత అలాగేనని చెప్పారు దర్శకనిర్మాతలు. మరో నాలుగు రోజుల్లో  ఆ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వాల్సి ఉంది. కానీ, చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి కబురు లేదు. దీంతో ఆ సినిమా ఆఫీస్‌కి ఫోన్‌ చేశారు రాజశేఖర్‌. కానీ, ఎవ్వరూ లిఫ్ట్‌ చెయ్యలేదు. ఆ తర్వాత పదిరోజులకు ఆ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. అయితే అందులో హీరో రాజశేఖర్‌ కాదు. వేరే హీరోతో ఆ సినిమా మొదలుపెట్టేశారు. హీరోయిన్‌ని మార్చమని అడిగినందుకు హీరోనే మార్చేశారు ఆ దర్శకనిర్మాతలు. ఆ తర్వాత రాజశేఖర్‌, జీవిత తెలుగు ఇండస్ట్రీకి రావడం, ఇద్దరూ కలిసి సూపర్‌హిట్‌ సినిమాలు చేసి హిట్‌ పెయిర్‌ అనిపించుకోవడం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడి పెళ్ళి చేసుకొని అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్‌, జీవిత. 

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ మధ్య దూరం పెరగడానికి గుమ్మడి ఒక కారణమని మీకు తెలుసా?

  తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు అంటూ ఉంటారు. అన్నదమ్ముల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. అలా ఎందుకు జరిగిందంటే.. చిత్ర పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ తరలి రావాలని అక్కినేని నాగేశ్వరరావు.. లేదు. పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండాలి.. సినిమా పరిశ్రమ కోసమే ఎంతో డబ్బు వెచ్చించి స్టూడియోలు కట్టారు. పరిశ్రమ హైదరాబాద్‌ వెళ్లిపోతే అక్కడి వాళ్ళు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్‌ అనేవారు. ఎలాగైతే ఎఎన్నార్‌ హైదరాద్‌ వచ్చేశారు. పరిశ్రమను హైదరాబాద్‌కి తెచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇది తెలిసిన ఎన్టీఆర్‌ ఆగ్రహించారు. తనని సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. వరదబాధితుల కోసం ఎన్టీఆర్‌ జోలె పట్టారు. ఆ సమయంలో తనకు చెప్పారా అని ఎఎన్నార్‌ ఎదురు ప్రశ్నించారు. అయితే ఈ వాగ్వాదం ప్రత్యక్షంగా జరిగేది కాదు. ఇద్దరికీ ఆప్తుడైన గుమ్మడి వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్యా వారధిగా ఉండేవారు. అక్కడి మాటలు ఇక్కడికి, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవారు. అలా వారి మధ్య దూరం మరింత పెరిగింది. దానికి గుమ్మడి కూడా ఒక కారణం అని భావించిన ఎన్టీఆర్‌.. ఆయన్ని దూరం పెట్టారు. ఓ నాలుగైదు సంవత్సరాలు అతనితో మాట్లాడలేదు. గుమ్మడి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా హాజరయ్యే ఎన్టీఆర్‌.. వారి అమ్మాయి పెళ్ళికి కూడా హాజరు కాలేదు.  గుమ్మడిని అలా దూరం పెట్టడానికి అదొక్కటే కారణం కాదు. గతంలో కూడా ఎన్టీఆర్‌, గుమ్మడి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత సొంత బేనర్‌ పెట్టి ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలకు మంచి పేరే వచ్చినా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఆ తర్వాత 1965లో గంగాధరరావు అనే నిర్మాత ‘కీలుబొమ్మలు’ అనే ఆఫ్‌ బీట్‌ సినిమా తీశారు. దానికి చాలా మంచి పేరు రావడమే కాకుండా ఉత్తమ చిత్రం కేటగిరిలో కాంస్య నంది అవార్డును పొందింది. అంతేకాదు, ఐర్లండ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఆ సినిమాను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎన్టీఆర్‌ కూడా పాల్గొన్నారు. అప్పుడు గుమ్మడి మాట్లాడుతూ గంగాధరరావుగారిని ఆదర్శంగా తీసుకొని మన నిర్మాతలు సినిమాలు తియ్యాలి అన్నారు. ముఖ్యంగా ఎన్‌.టి.రామారావుగారులాంటి వారు అని ప్రత్యేకంగా చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. స్టేజ్‌ మీదే గుమ్మడికి కౌంటర్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. ఇప్పటికే రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాం. మేం ఇంకా నష్టపోవాలని గుమ్మడి కోరుకుంటున్నట్టున్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే అలాంటి సినిమాలు తియ్యండి అని సలహా ఇచ్చారు. దానికి ఏదో వివరణ ఇచ్చేందుకు గుమ్మడి ప్రయత్నించినా ఎన్టీఆర్‌ వినిపించుకోలేదు.  ఇది జరిగిన చాలాకాలానికి చిత్ర పరిశ్రమను తరలించే విషయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ మధ్యలో గుమ్మడి ఇరుక్కున్నారు. ఒకసారి అనుకోకుండా ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలుసుకున్నారు. మంచి, చెడ్డ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో తమ ఇద్దరి మధ్య అగాధం పెరగడానికి కారణం గుమ్మడేనని తెలుసుకున్నారు. ఇద్దరూ శాంతించారు. ఆ తర్వాత గుమ్మడిపై కోపం తగ్గడంతో తను చేస్తున్న సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గుమ్మడిని పిలిచారు. ఆయన ఎంతో సంతోషంగా వెళ్లి ఆ సినిమాలో ఇచ్చిన వేషం వేశారు. అయితే సినీ పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ రాకుండా ఉండేందుకు ఎన్టీఆర్‌ ఎంతో ప్రయత్నించారు. కానీ, ఈ విషయంలో ఎఎన్నార్‌దే పైచేయిగా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లోనే స్టూడియో నిర్మించాల్సి వచ్చింది, ఇక్కడే షూటింగ్స్‌ చెయ్యాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలకు ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌కు మధ్యవర్తిగా ఉండడం వల్ల గుమ్మడి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారితో మాటలు కూడా పడాల్సి వచ్చింది. 

ఇండస్ట్రీ చేరదీసింది.. అవకాశాలిచ్చింది.. చెడు వ్యసనాలు అతన్ని వెనక్కి లాగేశాయి! 

సినిమా రంగంలో నటులుగా రాణించడం, మంచి పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, వచ్చిన ఆ మంచిపేరును నిలబెట్టుకోవడం మరో ఎత్తు. రంగుల ప్రపంచంగా కనిపించే సినిమా రంగంలో ఎంతో మంది నటీనటులు తమ భవిష్యత్తును నాశనం చేసుకొని చివరి రోజుల్లో దీనావస్థకు చేరుకున్నారు. అలాంటి వారిలో హీరో వారణాసి రామ్మోహన్‌రావు ఒకరు. అందరూ అతన్ని రామ్మోహన్‌ అని పిలిచేవారు. బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌ పోలికలు రామ్మోహన్‌లో ఉండడంతో అతన్ని ఆంధ్రా దేవానంద్‌ అనేవారు. ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చారన్న విషయం తెలిసిందే.  పాతతరం దర్శకనిర్మాతలు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచించేవారు. కొందరైతే అలాంటి సాహసానికి పూనుకునేవారు కాదు. అలాంటిది తను దర్శకత్వం వహించిన ‘తేనెమనసులు’ సినిమా ద్వారా 12 మంది ప్రధాన తారాగణాన్ని, 12 మంది సహనటీనటుల్ని పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. వారిలో కృష్ణ, రామ్మోహన్‌ ఉన్నారు. నంద్యాలకు చెందిన రామ్మోహన్‌కి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి అస్సలు లేదు. చిన్నతనంలో స్కూల్‌లో వేసిన ఒక నాటకంలో అతను లేడీ గెటప్‌లో నటించాడు. అది తప్ప అతనికి నటనలో అనుభవం లేదు. తన తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని తనపై వేసుకొని బెంగుళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌లో టెక్నీషియన్‌గా జాబ్‌లో చేరారు. ఆ సమయంలోనే ‘తేనెమనసులు’ చిత్రం కోసం కొత్త నటీనటులు కావాలనే ప్రకటన వచ్చింది. ఆ సినిమా యూనిట్‌లో రామ్మోహన్‌కు పరిచయం ఉన్నవారు ఉన్నారు. వారు బలవంతంగా రామ్మోహన్‌ని ఈ సినిమా కోసం ఫోటోలు పంపించమన్నారు. ఆ తర్వాత స్క్రీన్‌ టెస్ట్‌ కోసం మద్రాస్‌ పిలిపించారు. తాను సెలెక్ట్‌ అవుతానని నమ్మకం లేకపోయినా స్నేహితుల బలవంతం మీద స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత తిరిగి బెంగుళూరు వెళ్లిపోయాడు. తను సెలెక్ట్‌ అయినట్టు మద్రాస్‌ నుంచి కబురు వచ్చింది. ఏదో ఒక చిన్న క్యారెక్టర్‌ కోసం తనను పిలిచి ఉంటారులే అనుకొని మద్రాస్‌ వచ్చాడు రామ్మోహన్‌. అక్కడికి వచ్చాక తను, కృష్ణ హీరోలుగా సెలెక్ట్‌ అయ్యామని తెలిసి ఆశ్చర్యపోయాడు. తన ఉద్యోగానికి సెలవు పెట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. గత అనుభవం లేకపోవడంతో డైలాగులు ఎలా పలకాలి, ఎలా నటించాలి వంటి విషయాల్లో కో డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ అతనికి శిక్షణ ఇచ్చారు.  సినిమా పూర్తయి విడుదలైంది. రామ్మోహన్‌కి మంచి పేరు వచ్చింది. కృష్ణ కంటే రామ్మోహన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కృష్ణ అసలు హీరోగా పనికిరాడని అంతా అనుకున్నారు. వీరిద్దరితోనూ ఆదుర్తి సుబ్బారావు రెండో సినిమా ‘కన్నె మనసులు’ తీశారు. రామ్మోహన్‌ నటించిన మూడో చిత్రం ‘రంగుల రాట్నం’. ఈ చిత్రంలో అతనికి నెగెటివ్‌ రోల్‌ ఇచ్చారు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి. చంద్రమోహన్‌ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. రామ్మోహన్‌, చంద్రమోహన్‌ ఒకే రూమ్‌లో ఉండేవారు. అప్పటికే కృష్ణ, రామ్మోహన్‌ మంచి స్నేహితులు. అందుకే రామ్మోహన్‌ని కలిసేందుకు రూమ్‌కి వచ్చేవారు కృష్ణ. అలా ముగ్గురూ స్నేహితులయ్యారు. ఎక్కడికి వెళ్లాలన్నా ముగ్గురూ కలిసే  వెళ్ళేవారు.  ఆ తర్వాత ‘ప్రైవేట్‌ మాస్టారు’, ‘లక్ష్మీ నివాసం’, ‘ఉపాయంలో అపాయం’, ‘అన్నదమ్ములు’ వంటి సినిమాల్లో నటించారు రామ్మోహన్‌. ఇక్కడ ఓ విశేషం ఉంది. అదేమిటంటే.. ఈ సినిమాలన్నింటిలో కృష్ణ మరో హీరోగా నటించడం. ఆ తర్వాత ‘రతీమన్మథ’ చిత్రంలో రామ్మోహన్‌ నారదుడి పాత్ర పోషించారు. అది పౌరాణిక చిత్రం కావడంతో డైలాగులు చెప్పేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు రామ్మోహన్‌. అది గమనించిన ఎస్‌.వి.రంగారావు అతనికి డైలాగులు ఎలా చెప్పాలో నేర్పించారు. నటనలో ఎలాంటి అనుభవం లేకపోయినా పెద్దల సూచనలు, సలహాలతో హీరోగా ముందుకు సాగారు రామ్మోహన్‌. ఆ సమయంలోనే అతని జీవితం మలుపు తిరిగింది. వ్యసనాలకు బానిసయ్యాడు. అది అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. తన సహచరుడైన కృష్ణ సినిమాల్లో దూసుకుపోతుంటే రామ్మోహన్‌ మాత్రం ముందుకు వెళ్లలేకపోయాడు. శోభన్‌బాబు, హరనాథ్‌ వంటి హీరోల ధాటికి తట్టుకోలేకపోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు రామ్మోహన్‌ వెనకబడిపోవడానికి కారణాలయ్యాయి. అతనికి సినిమాలు తగ్గిపోయినపుడు తను నిర్మించే  సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు కృష్ణ. అంతేకాదు, ఆర్థికంగా కూడా రామ్మోహన్‌ను ఎన్నోసార్లు ఆదుకున్నారు. అలా 18 సంవత్సరాలు చెన్నయ్‌లోనే ఉన్నారు రామ్మోహన్‌. దాదాపు 40 సినిమాల్లో నటించిన ఆయన 1982లో తన స్నేహితులతో కలిసి ఒక సినిమా నిర్మించి మళ్ళీ నటుడిగా కొనసాగాలని అనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళలేదు. నటనలో ఓనమాలు రాని తనను ఇండస్ట్రీ చేరదీసిందని, అవకాశాలు ఇచ్చిందని, తనే తప్పటడుగు వేశానని అనేక సందర్భాల్లో రామ్మోహన్‌ చెప్పారు. 1979లో వచ్చిన ‘కోరికలే గుర్రాలైతే’ అతని చివరి సినిమా. ఒంటరి తనం, అనారోగ్యం కారణంగా 2005లో రామ్మోహన్‌ కన్ను మూశారు.

రాజేంద్రప్రసాద్‌కి ఒకేసారి 14 సినిమాలు ఇప్పించిన సూపర్‌స్టార్‌ కృష్ణ!

హాస్యనటుడిగా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి ఫుల్‌లెంగ్త్‌ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు రాజేంద్రప్రసాద్‌. మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌  మెడల్‌ అందుకొని నటుడిగా తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్న క్రమంలో అతనికి అవకాశాలు రాలేదు. తిరిగి తిరిగి విసిగిపోయిన సమయంలో అతనికి ‘మేలుకొలుపు’ అనే సినిమాలో హీరోకి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. అది ఎలా వచ్చింది, ఆ తర్వాత నటుడిగా సినిమాలో నటించే ఛాన్స్‌ ఎలా వచ్చింది అనే విషయాలు రాజేంద్రప్రసాద్‌ మాటల్లోనే తెలుసుకుందాం.  ‘ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నాకు సినిమాల్లో నటించే అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకంటే అప్పుడు నా వయసు అలాంటిది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చెయ్యలేను, హీరోగా నటించడానికి నేను అంత మెచ్యూర్డ్‌ కాదు. పైగా చాలా సన్నగా ఉండేవాడిని. దాంతో ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాను. ఊరి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి. ఉన్నవాటితోనే సర్దుకోవాలి. అందుకే ప్రతిరోజూ ఒక అరటి పండు, పాలు తీసుకునేవాడిని. నేను తృప్తిగా భోజనం చేసి నెలరోజులైంది. అప్పుడు పుండరీకాక్షయ్యగారి ఇంటికి వెళ్ళాను. ఆ టైమ్‌లో లోపల పెద్ద డిస్కషన్‌ జరుగుతోంది. అందరూ బయటికి వచ్చారు. పెద్దాయన నన్ను చూసి ఒక్కసారిగా ‘మనం ప్రసాద్‌ని మర్చిపోయాం. మనకి వాయిస్‌ దొరికేసింది’ అని సంతోషంగా అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు.  విషయం ఏమిటంటే... ‘మేలుకొలుపు’ అనే సినిమాలో రాజాకృష్ణ అనే ఆర్టిస్టు నటించాడు. అతనికి 15 సంవత్సరాలు ఉంటాయి. అతనికి డబ్బింగ్‌ చెప్పించడానికి వాయిస్‌ ఎవ్వరిదీ సెట్‌ అవ్వడం లేదు. అదీ అక్కడి డిస్కషన్‌. సడన్‌గా నేను కనిపించేసరికి నన్ను డబ్బింగ్‌ థియేటర్‌కి తీసుకెళ్ళి ఓ పేపర్‌ ఇచ్చి మైక్‌ ముందు నిలబెట్టి ఆ కుర్రాడికి డబ్బింగ్‌ చెప్పమన్నారు. అసలే కొత్త, పైగా ఆకలి. నిలబడే ఓపిక కూడా లేదు. అయినా ధైర్యంగా ఆ షాట్‌ వరకు డబ్బింగ్‌ చెప్పేశాను. అక్కడ ఉన్నవారంతా ఫుల్‌ హ్యాపీ. సినిమా మొత్తానికి నువ్వే డబ్బింగ్‌ చెప్పాలి అన్నారు పుండరీకాక్షయ్యగారు. దానికి నేను ‘భోజనం పెట్టిస్తే చెప్తాను’ అన్నాను. అప్పుడు నా పరిస్థితి తెలిసి ఆయన ఇంటికి రావచ్చు కదా అని తిట్టారు. అలా మొదటి సినిమాకి డబ్బింగ్‌ పూర్తి చేశాను. ఇక ఆ తర్వాత వరసగా డబ్బింగ్‌ అవకాశాలు వచ్చాయి. అప్పట్లో మణిరత్నం మౌనరాగం సినిమాలో మోహన్‌కి వాయిస్‌ ఇచ్చాను. రామ్‌జీ, రాంకీ..లాంటి వారికి కూడా నాదే వాయిస్‌. డబ్బింగ్‌ సినిమాలకు సంబంధించి కొత్త ఆర్టిస్ట్‌ ఎవరైనా ఉంటే నాతోనే డబ్బింగ్‌ చెప్పించేవారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాను. తర్వాత సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండానే వచ్చింది. కృష్ణగారు, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రామరాజ్యంలో భీమరాజు’ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అందులో నటించాల్సిన ఒక ఆర్టిస్ట్‌ సడన్‌ నేను చెయ్యను అంటూ వెళ్లిపోయాడట. ఎందుకంటే ఆ సీన్‌లో శ్రీదేవి కాళ్ళు పట్టుకోవాలి. అలా చెయ్యడం ఇష్టంలేని ఆ ఆర్టిస్ట్‌ షూటింగ్‌ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నారు నిర్మాత వెంకన్నబాబు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ సినిమా గురించి చెప్పారు. నేను డబ్బింగులు చెప్పుకుంటున్నాను. నేను నటించడం ఏమిటి అన్నాను. అలాకాదు, నువ్వు రావాల్సిందేనని పట్టుపట్టి కారు ఎక్కించారు. అలా ‘రామరాజ్యంలో భీమరాజు’ సినిమాలో తొలిసారి నటించాను. శ్రీదేవితో పెళ్లికి సిద్ధపడ్డ నా పక్కన చేరి కృష్ణగారు డైలాగులు చెప్పడం, అవి వింటూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ భయపడటం.. ఇదీ సీన్‌. షాట్‌ కంప్లీట్‌ అయింది. చాలా బాగా వచ్చింది. కృష్ణగారు నా పెర్‌ఫార్మెన్స్‌ చూసి తెగ నవ్వుకున్నారు. ఈ కుర్రాడెవరో చాలా బాగా చేస్తున్నాడు అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన నటిస్తున్న 14 సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. అలా ఒక్కసారిగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాను. అప్పుడు కృష్ణగారు నాలోని టాలెంట్‌ని గుర్తించి ఆ అవకాశాలు ఇప్పించకపోతే ఇప్పటికీ డబ్బింగులు చెప్పుకుంటూ వుండేవాడిని. ఈ విషయంలో కృష్ణగారు నాకు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంటూ వివరించారు. 

క్రైమ్‌ సినిమాతో విజయనిర్మలను డైరెక్టర్‌ని చెయ్యాలనుకున్న కృష్ణ.. కానీ,!

విజయనిర్మల.. నటి, నిర్మాత, దర్శకురాలు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ దక్కని గౌరవాన్ని తను దర్శకత్వం వహించిన సినిమాలతో ఆమె పొందారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా డా.దాసరి నారాయణరావు పేరున గిన్నిస్‌ రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో గిన్నిస్‌ రికార్డు సాధించినవారు ఇద్దరూ తెలుగువారే కావడం మనకెంతో గర్వకారణం. ఫిబ్రవరి 20 విజయనిర్మల జయంతి. ఈ సందర్భంగా ఆమె సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం. బాల్యం నుంచే కళలపై మక్కువ మూడేళ్ళ చిరుప్రాయంలోనే విజయనిర్మల నాట్యాన్ని అభ్యసించడం ప్రారంభించారు. ఆమె మేనత్త కూతురైన రావు బాలసరస్వతీదేవి ప్రోత్సాహంతో నృత్యం నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. దర్శకుడు పి.పుల్లయ్య రూపొందించే తమిళ చిత్రం ‘మత్స్యరేఖ’ చిత్రంలో నటించేందుకు బాలనటి కోసం అన్వేషిస్తున్న సమయంలో రావు బాలసరస్వతి తన మేనకోడలు విజయనిర్మల గురించి డైరెక్టర్‌ పుల్లయ్యకు చెప్పారు. అలా ఆమెకు ‘మత్స్యరేఖ’ తొలి చిత్రం. ఈ సినిమాలో ఏడ్చే సన్నివేశం ఒకటి ఉంది. కానీ, ఆమె ఏడవకుండా నవ్వుతూ ఉండడంతో పుల్లయ్య ఆమెను తిట్టారు. వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. దాన్నే షూట్‌ చేసి సినిమాలో వాడారు. ఈ సినిమాలో విజయనిర్మల బాగా చేసిందని పేరు రావడంతో ఆ తర్వాత కొన్ని తమిళ్‌ సినిమాలు, ఒక బెంగాలీ సినిమాలో కూడా ఆమె బాలనటిగా చేసింది. 1957లో వచ్చిన ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంతో తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యారు. ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించిందామె. ‘జయ కృష్ణా ముకుందా మురారి..’ పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయనిర్మల కృష్ణుడిగా మెప్పించి అందర్నీ ఆకట్టుకుంది. బాలనటిగా ఆమెకు ఇది చివరి సినిమా. ఆ తర్వాత భరత నాట్యం నేర్చుకుంటూ చదువుపై దృష్టి పెట్టారామె.  మొట్టమొదటి దెయ్యం కథ ‘భార్గవి నిలయం’ 1964లో ప్రేమ్‌నజీర్‌ హీరోగా ఎ.విన్సెంట్‌ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘భార్గవి నిలయం’ విజయనిర్మలకు హీరోయిన్‌గా మొదటి సినిమా. దెయ్యం కథాంశంతో సినిమాలు రూపొందించడం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా తర్వాత బి.ఎన్‌.రెడ్డి రూపొందించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా విజయనిర్మల నటించారు. అయితే స్క్రీన్‌మీద తన పేరును నీరజగా వేయించుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఓ తమిళ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘షావుకారు’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఆ సినిమాలో ఎస్వీరంగారావు కాంబినేషన్‌లో మొదటి రోజు షూటింగ్‌. ఆయన విజయనిర్మలను చూసి నాలో సగం కూడా లేదు. ఈమెతో నా కాంబినేషన్‌ ఏమిటి.. వెంటనే అమ్మాయిని మార్చండి అని డైరెక్టర్‌ మీద అరిచారు. ఆ గొడవతో ఆరోజు షూటింగ్‌ జరగలేదు. రెండు రోజుల తర్వాత ఎస్వీ రంగారావుని ఆ పాత్ర నుంచి తప్పించి మరో నటుడితో ఆ సినిమా చేశారు. విజయనిర్మలనే హీరోయిన్‌గా కొనసాగించారు. ఈమె అసలు పేరు నిర్మల. అయితే విజయ సంస్థతో ఆమెకు ఎక్కువ అనుబంధం ఉండడం, అప్పటికే నిర్మల అనే మరో నటి ఉండడంతో తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు.  దర్శకత్వం వైపు అడుగులు.. బాపు బాటలో విజయనిర్మల! ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో కలిసి నటించారు విజయనిర్మల. ఆ సమయంలో బాపు వేసిన బొమ్మలు, ఆయన డైరెక్ట్‌ చేసే విధానం ఆమెకు బాగా నచ్చడంతో తను కూడా డైరెక్టర్‌ అవ్వాలని అనుకుంది. ఇదే విషయం కృష్ణతో చెబితే ఇప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నావు. డైరెక్టర్‌గా సక్సెస్‌ అవ్వకపోతే ఆ తర్వాత డైరెక్టర్‌గా, నటిగా రెండిరటిలోనూ అవకాశాలు కోల్పోతావు. అందుకే కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత డైరెక్షన్‌ చెయ్యమని కృష్ణ సలహా ఇచ్చారు. ఆ తర్వాత నాలుగైదు సంవత్సరాలు నటిగానే కొనసాగింది విజయనిర్మల. 100 సినిమాలు పూర్తి చేసింది. అప్పుడు డైరెక్షన్‌ చెయ్యాలనుకుంది. తెలుగులో అయితే బడ్జెట్‌ ఎక్కువ అవుతుందని మలయాళంలో చెయ్యమని కృష్ణ చెప్పారు. కొత్త దర్శకురాలు కావడంతో నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. దాంతో తనే సొంతంగా సంగం మూవీస్‌ పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి ‘కవిత’ అనే సినిమాను తీశారు. మూడు లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు రావడంతో తెలుగులో కూడా డైరెక్ట్‌ చెయ్యాలని నిర్ణయించుకుంది. యద్దనపూడి సులోచనా రాణి నవల ‘మీనా’తో తెలుగులో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఇక అక్కడి నుంచి డైరెక్టర్‌గా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆమెకు రాలేదు. ఆమె కెరీర్‌లో మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ఒకటి తమిళ్‌, ఒకటి మలయాళం ఉన్నాయి. మిగిలిన 42 తెలుగు సినిమాల్లో 22 సినిమాలు బయటి బేనర్‌లో చేశారు. 20 సినిమాలు సొంత బేనర్‌లో తీశారు. అందులో ఎక్కువ సినిమాల్లో హీరో కృష్ణ నటించారు.  క్రైమ్‌ సినిమాతో విజయనిర్మలను డైరెక్టర్‌ని చెయ్యాలనుకున్న కృష్ణ నిజానికి ‘మీనా’తో కాకుండా ఓ క్రైమ్‌ స్టోరీతో విజయనిర్మలను తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం చేయాలనుకున్నారు కృష్ణ. ఆయన అడగడంతో ఒక సీక్రెట్‌ ఏజెంట్‌ స్టోరీని రాశారు ఆరుద్ర. ఆ స్టోరీని కృష్ణ, ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావుకు వినిపించారు. అందరికీ కథ నచ్చింది. దాంతో డైలాగ్స్‌ కూడా రాయమనీ, ఆ కథతో విజయనిర్మల డైరెక్టర్‌ అవుతుందనీ అన్నారు కృష్ణ. అయితే ఆ అభిప్రాయంతో విభేదించారు ఆరుద్ర. క్రైమ్‌ స్టోరీతో డైరెక్టర్‌గా పరిచయమై, హిట్టయితే అలాంటి స్టోరీలనే ఆమె బాగా తీస్తుందనే ముద్ర పడుతుందనీ, అలా కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో డైరెక్టర్‌ అయితే ఆమె కెరీర్‌ రాణిస్తుందనీ ఆయన సూచించారు. ఇది సూచన మాత్రమేననీ, మీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి అని కూడా ఆరుద్ర చెప్పారు. ఆయన సూచన మేరకు ఆ క్రైమ్‌ స్టోరీని పక్కన పెట్టి ‘మీనా’ చిత్రాన్ని రూపొందించారు విజయనిర్మల.  తెలుగు సినిమాకి విజయనిర్మల చేసిన సేవలకుగాను 2008లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దిగ్గజ నటుడు శివాజీ గణేషన్‌ను డైరెక్ట్‌ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు.  ఆరేళ్ళ వయసులో తమిళ చిత్రం మత్స్యరేఖతో నటిగా పరిచయమైన విజయనిర్మల  తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు.   

కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల పెళ్లిని ముందే ఊహించిన టాప్ క‌మెడియ‌న్!

కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల జంట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అదివ‌ర‌కే వేర్వేరు వ్య‌క్తుల‌తో పెళ్ల‌యి పిల్ల‌లున్న ఆ ఇద్ద‌రూ రెండో వివాహం చేసుకొని ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు తెలుగువారంద‌రినీ షాక్‌కు గురిచేశారు. వివాహానంత‌రం ఇద్ద‌రూ క‌లిసి అనేక సినిమాల్లో జంట‌గా న‌టించారు. అయితే ఆ ఇద్ద‌రి వివాహాన్ని ముందుగా ఊహించిన వ్య‌క్తి ఒక‌రున్నారు.. ఆయ‌న అప్ప‌టి టాప్ క‌మెడియ‌న్ రాజ‌బాబు. కృష్ణ‌తో మీ పెళ్లి జ‌రుగుతుంద‌ని స్వ‌యంగా విజ‌య‌నిర్మ‌ల‌తో ఆయ‌నే చెప్పారు. ఆ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా వెల్ల‌డించారు విజ‌య‌నిర్మ‌ల‌. కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల క‌లిసి న‌టించిన తొలి చిత్రం 'సాక్షి'. ఆ సినిమాకు బాపు ద‌ర్శ‌కుడు. ఆ సినిమా ఆఫీసులో ఫ‌స్ట్ టైమ్ తాను కృష్ణగారిని చూశాన‌ని విజ‌య‌నిర్మ‌ల చెప్పారు. ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె, "బాపుగారే కృష్ణ‌గారికి న‌న్ను ప‌రిచ‌యం చేశారు. 'ఈమె విజ‌య‌నిర్మ‌ల‌. త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. తెలుగ‌మ్మాయే. మ‌న సినిమాలో హీరోయిన్‌గా బుక్ చేస్తున్నాం.' అని చెప్పారు. అలా మాకు ప‌రిచ‌యం జ‌రిగింది." అని విజ‌య‌నిర్మ‌ల వెల్ల‌డించారు. 'సాక్షి' సినిమా క్లైమాక్స్‌లో కృష్ణ‌తో విజ‌య‌నిర్మ‌ల తాళి క‌ట్టించుకొనే సీన్ ఉంది. అందులో కృష్ణ మీసాలు ఉంచుకొనే కృష్ణుడి వేషం వేస్తారు. ఆ సీన్ చేశాక రాజ‌బాబు, 'ఈ సినిమాలో నీకుండేది మీసాల కృష్ణుడు. ఈయ‌నేమో కృష్ణ‌. కాబ‌ట్టి మీ ఇద్ద‌రూ చాలా తొంద‌ర‌లో పెళ్లి చేసుకుంటారు.' అనేశారు. ఆయ‌న అన్న‌ట్లుగానే ఆ త‌ర్వాత రెండు నెల‌ల‌కే మేం తిరుప‌తి వెళ్లిపోయి, దేవుడి స‌న్నిధిలో అక్క‌డ పెళ్లి చేసుకున్నాం." అని ఆమె చెప్పారు. పెళ్ల‌యిన వెంట‌నే 'అమ్మ‌కోసం' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌. "ఆ సినిమాలో మేం జంట‌గా న‌టించాం. కృష్ణ‌గారి మ‌ద‌ర్ అంజ‌లీదేవి. నాగ‌య్య‌గారు సెట్‌లో ఉన్నారు. ఆయ‌న న‌న్నుచూసి, 'చాలా కామ్‌గా ఉంటారు నువ్వు, ఆ అబ్బాయి.. ఇలా చేశారేంటి?  మేం దిగ్భ్రాంతి చెందాం' అన్నారు." అని చెప్పుకొచ్చారు విజ‌య‌నిర్మ‌ల‌. (ఫిబ్రవరి 20 - విజయనిర్మల జయంతి)

డైరెక్టర్ గా విజయనిర్మల మొదటి సినిమా.. వద్దన్న ఆరుద్ర, భయపడిన య‌ద్ద‌న‌పూడి!

నేడు విజయనిర్మల జయంతి. ఈ సంద‌ర్భంగా ఆమె 'మీనా'తో తెలుగులో ఎలా డైరెక్ట‌ర్‌గా మారారో చెప్పుకోవ‌డం ఈ వ్యాసం ఉద్దేశం. విజ‌య‌నిర్మ‌ల నటించిన మూడో చిత్రం 'సాక్షి'. దానికి ద‌ర్శ‌కులు బాపు. డైరెక్ష‌న్‌లో ఆయ‌న తీసుకుంటున్న శ్ర‌ద్ధ‌, ఆయ‌న స్టోరీ బోర్డ్ విధానం అవీ చూసిన‌ప్పుడు ఓ చిత్రానికి ఎలాగైనా ద‌ర్శ‌క‌త్వం చెయ్యాల‌నే కోరిక క‌లిగింది విజ‌య‌నిర్మ‌ల‌కు. అయితే తొంద‌ర‌ప‌డ‌కుండా మెళ‌కువ‌ల‌న్నింటినీ ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టారు. ఆ విధంగా ప‌దేళ్లు సినిమాల్లో న‌టిస్తూనే, దూరంగా ఉండి ద‌ర్శ‌క‌త్వం గురించి స్ట‌డీ చేశారు. న‌టిగా నిల‌దొక్కుకుంటున్న స‌మయంలోనే డైరెక్ష‌న్ చేయాల‌నే కోరిక‌ను కృష్ణ‌కు చెప్పారు. ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం వ‌ద్దనీ, కొంత‌కాలం ఆగ‌మ‌నీ సూచించారు. అలా కొంత‌కాలం ఆగి, తొలిసారిగా ఓ సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు. అదీ.. 'క‌విత' అనే మ‌ల‌యాళ చిత్రంతో. పైగా అది యాంటీ సెంటిమెంట్ స్టోరీ. ఆ సినిమా విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, ద‌ర్శ‌కురాలిగా, న‌టిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో తొలిసారిగా య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి న‌వ‌ల 'మీనా'ను అదే పేరుతో రూపొందించడ‌మే కాకుండా టైటిల్ రోల్‌ను త‌నే పోషించారు. అది ఘ‌న విజ‌యం సాధించి ఆమెను గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించే సంఖ్య‌లో సినిమాలు డైరెక్ట్ చేయ‌డానికి దోహ‌దం చేసింది. నిజానికి 'మీనా'తో కాకుండా ఓ క్రైమ్ స్టోరీతో విజ‌య‌నిర్మ‌లను తెలుగులో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు కృష్ణ‌. ఆయ‌న అడ‌గ‌డంతో ఒక సీక్రెట్ ఏజెంట్ స్టోరీని రాశారు ఆరుద్ర‌. ఆ స్టోరీని కృష్ణ‌, ఆయ‌న సోద‌రులు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావుకు వినిపించారు. అంద‌రికీ క‌థ న‌చ్చింది. దాంతో డైలాగ్స్ కూడా రాయ‌మ‌నీ, ఆ క‌థతో విజ‌య‌నిర్మ‌ల డైరెక్ట‌ర్ అవుతుంద‌నీ అన్నారు కృష్ణ‌. అయితే ఆ అభిప్రాయంతో విభేదించారు ఆరుద్ర‌. క్రైమ్ స్టోరీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై, హిట్ట‌యితే అలాంటి స్టోరీల‌నే ఆమె బాగా తీస్తుంద‌నే ముద్ర ప‌డుతుంద‌నీ, అలా కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో డైరెక్ట‌ర్ అయితే ఆమె కెరీర్ రాణిస్తుంద‌నీ ఆయ‌న సూచించారు. ఇది సూచ‌న మాత్ర‌మేన‌నీ, మీ ఇద్ద‌రూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణ‌యం తీసుకోండి అని కూడా ఆరుద్ర చెప్పారు. ఆయ‌న సూచ‌న బాగుంద‌నుకున్న కృష్ణ ఒక ఫ్యామిలీ స్టోరీతోటే విజ‌య‌నిర్మ‌ల‌ను డైరెక్ట‌ర్ చేయాల‌నుకున్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర‌జ్యోతి వీక్లీలో సీరియ‌ల్‌గా వ‌స్తున్న య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి 'మీనా' బాగా పాపుల‌ర్ అయింది. ఆ క‌థ విజ‌య‌నిర్మ‌ల‌నూ ఆక‌ట్టుకుంది. అయితే ఆప్ప‌టికే ఆ న‌వ‌లను సినిమాగా తీసే ఉద్దేశంతో హ‌క్కులు కొన్నారు అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ అధినేత డి. మ‌ధుసూద‌న‌రావు. ఆయ‌న ద‌గ్గ‌ర ఆ హ‌క్కులు తీసుకున్నారు విజ‌య‌నిర్మ‌ల‌. అలా మ‌ల‌యాళంలో తీసిన 'క‌విత' త‌ర్వాత తెలుగులో 'మీనా'తో దర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అయ్యారామె. 1973 డిసెంబ‌ర్ 28న విడుద‌లైన ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా మెప్పించి, శ‌త‌దినోత్స‌వ చిత్రంగా విజ‌యం సాధించింది. "నా న‌వ‌ల‌ను పేరున్న ద‌ర్శ‌కులే సినిమాగా తీయాల‌నే అభిప్రాయం నాకుండేది. అందుకే విజ‌య‌నిర్మ‌ల ఈ న‌వ‌ల‌ని సినిమాగా తీస్తున్నార‌ని విని భ‌య‌ప‌డ్డాను. కానీ చిత్రంచూసి ఎంత ఆనందించానో చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు అన్నారు." య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి. (ఫిబ్రవరి 20 - విజయనిర్మల జయంతి)

జనం మధ్యలోనే ఉన్నా చార్లీ చాప్లిన్‌ని ఎవరూ గుర్తించలేదు.. ఎందుకంటే?

ప్రపంచంలో ఏ నటుడికీ లేని ప్రత్యేకత చార్లీ చాప్లిన్‌కి ఉంది. అదేమిటంటే అతను సినిమాల్లో వేసే గెటప్‌లో కాకుండా విడిగా మన ముందు నిలబడ్డా అతను చార్లీ చాప్లిన్‌ అని గుర్తించలేం. అంతగా ఆ క్యారెక్టర్‌ జనంలోకి వెళ్లింది.  ప్రపంచాన్ని నాలుగు దశాబ్దాలపాటు నవ్వుల్లో ముంచెత్తిన ఆయన్ని అభిమానించనివారు, ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హిట్లర్‌ని పోలిన వేషధారణతో అతను చేసిన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకోవడంతో ప్రేక్షకుల్లో చార్లీ చాప్లిన్‌ అంటే ఒక క్రేజ్‌ ఏర్పడింది.  అందరికీ విచిత్రంగా అనిపించే ఆ వేషధారణతోనే నవ్వులు పూయించేవాడు చాప్లిన్‌. ఇక తన హావభావాలతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టేవాడు. తలపై టోపీ, చేతిలో కర్ర, చిన్న మీసం, నల్ల సూటు ఇవి వుంటే చాలు ఎవరైనా చార్లీ చాప్లిన్‌ అయిపోవచ్చు అన్నట్టుగా ఆ వేషధారణ ఉండేది. మాటలు లేకుండా, కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో అతని సినిమాలు ఉండేవి. మాటలు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చే సబ్‌ టైటిల్స్‌తో సినిమా అందరికీ పూర్తిగా అర్థమైపోయేది.  చార్లీ చాప్లిన్‌కి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బెల్లింగ్‌హామ్‌ అనే ఊరిలోని లిబర్టీ థియేటర్‌ యజమాని ఒక వినూత్న ప్రయోగం చేశాడు. 1921లో ‘ది ఐడిల్‌ క్లాస్‌’ అనే సినిమా ఆ థియేటర్‌లో రిలీజ్‌ అయింది. ఈ సినిమాకి ముందు వచ్చిన ‘ది ట్రాంప్‌’ చిత్రంలోని చార్లీ చాప్లిన్‌ గెటప్‌ వేసుకొని ఎంతమంది వచ్చినా వారికి ‘ది ఐడిల్‌ క్లాస్‌’ సినిమాని ఉచితంగా చూపిస్తాం అని ప్రకటించాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది పెద్దవారు, పిల్లలు ఆ గెటప్‌ వేసుకొని థియేటర్‌కి వచ్చారు. అంతమంది చాప్లిన్స్‌ని చూసిన జనం విస్తుపోయారు. ఇది తన జీవితంలో ఒక స్వీట్‌ మెమరీగా మిగిలిపోతుందని ఆ థియేటర్‌ యజమాని వ్యాఖ్యానించాడు. సినిమా ప్రదర్శన తర్వాత అందర్నీ ఒక గ్రూప్‌ ఫోటో తీసి అప్పట్లో ఎంతో పాపులర్‌ అయిన స్పాన్‌ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.  అదే రోజు చార్లీ చాప్లిన్‌ గెటప్‌ విషయంలో మరో గమ్మత్తయిన విషయం జరిగింది. అక్కడికి వచ్చిన చాప్లిన్స్‌ అందర్నీ పరిశీలించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించాలని థియేటర్‌ యజమాని భావించాడు. ఆ సమయంలో అక్కడి వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ గుంపులో చార్లీ చాప్లిన్‌ కూడా ఉన్నాడు. అందర్నీ పరిశీలించిన న్యాయనిర్ణేతలు ఒక వ్యక్తిని విజేతగా ప్రకటించారు. పైగా అతను అచ్చు చార్లీ చాప్లిన్‌లాగే ఉన్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అలా రెండో బహుమతి, మూడో బహుమతి.. ఇలా ఆ గెటప్‌లో వచ్చిన వారందరికీ వరస క్రమంలో బహుమతులు అందజేశారు. విచిత్రం ఏమిటంటే చార్లీ చాప్లిన్‌కి 20వ స్థానం లభించింది. అక్కడికి వచ్చిన చాప్లిన్స్‌ మధ్యలోనే ఉన్న తనని ఎవరూ గుర్తించకపోవడం చార్లీ చాప్లిన్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో తాను కూడా లిబర్టీ థియేటర్‌కి వచ్చానని వెల్లడించారు చాప్లిన్‌. అప్పుడు ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అయింది. 

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ రూపొందించిన కళాఖండాలలో టాప్‌ 10 మూవీస్‌ ఇవే!

తెలుగు సినిమాకు కొత్త అందాలను అద్దిన దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన మహానుభావుడు. తెలుగుదనం ఉట్టి పడే కథలతో సినిమాలు చేస్తూనే ఆచారాల పేరుతో అజ్ఞానంలోకి జారిపోతున్న వారిని మేల్కొలుపుతూ వారిలో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయనే కళాతపస్వి కె.విశ్వనాథ్‌. సంగీత ప్రధాన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే నృత్య ప్రధాన చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి సంగీతం, నృత్యంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఎంతో మంది కళాకారులు తయారు కావడానికి దోహదపడ్డారు. కాశీనాథుని విశ్వనాథ్‌ 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. విశ్వనాథ్‌ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1965లో అక్కినేని కథానాయకుడిగా రూపొందిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా కళాఖండమే. ఫిబ్రవరి 19 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జయంతి సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 51 కళాఖండాలలో టాప్‌టెన్‌గా పేర్కొనదగిన సినిమాలు ఇవే. 1. శంకరభరణం సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. 1980లో విడుదలైన ఈ సినిమాను చూసి ఎంతోమంది సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. సంగీతాన్ని అభ్యసించడానికి ఉత్సాహం చూపించారు. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే ఈ సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు ప్రధాన పాత్ర పోషించగా, మంజుభార్గవి కీలక పాత్రలో నటించారు. చంద్రమోహన్‌, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. కె. వి. మహదేవన్‌ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్‌ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. గోవాలో 2022 నవంబరు 20 నుండి 28 వరకు జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపిక అయి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.   2. సిరివెన్నెల శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం గురించి చాటి చెప్పే సినిమా ఇది. సర్వదమన్‌ బెనర్జీ, సుహాసిని, మూన్‌ మూన్‌ సేన్‌, మీనా, రోహిణి,  జె.వి.రమణమూర్తి, శుభ, సాక్షి రంగారావు, సుభలేఖ సుధాకర్‌, వరలక్ష్మి, నిత్య రవింద్రన్‌ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్‌, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలోని పాటలన్నీ ఆదరణ పొందాయి.  అన్ని పాటల్ని  సీతారామశాస్త్రి రచించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రిగా కీర్తినార్జించారు.  3. సాగర సంగమం నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా సాగర సంగమం. కమల్‌ హాసన్‌, జయప్రద, శరత్‌బాబు, ఎస్‌.పి.శైలజ, చక్రి తోలేటి, గీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన 10వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఈ చిత్రాన్ని ఏడాదిన్నరపాటు ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత నృత్యంపై మక్కువ పెంచుకున్న ఎందరో నృత్యాన్ని అభ్యసించి కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు.  4. స్వాతిముత్యం  దైవ సమానుడైన ఒక అమాయకుడి కథతో రూపొందిన సినిమా ఇది. భర్త చనిపోయిన ఒక యువతిని అమాయకంగా పెళ్లి చేసుకొని ఆమె జీవితానికి ఎలా అండగా నిలిచాడు అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. కమల్‌హాసన్‌, రాధిక, జె.వి.సోమయాజులు గొల్లపూడి మారుతీరావు సుత్తి వీరభద్రరావు, నిర్మలమ్మ, శరత్‌ కుమార్‌, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఘనవిజయం సాధించాయి.  5. శ్రుతిలయలు సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. డా.రాజశేఖర్‌, సుమలత, అంజలీదేవి, కైకాల సత్యనారాయణ, జయలలిత, ముచర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. సంగీతంలోని విశిష్టతను తెలియజేసే చిత్రంగా ఇద రూపొందింది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది.  6. సిరిసిరిమువ్వ సంగీత నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. హైమ మూగ పిల్లకు నృత్యం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమె సవతి తల్లి ఆమెను చిన్న చూపు చూస్తుంది. అదే ఊరిలోని సాంబయ్య అనే పేద యువకుడికి హైమ అంటే ఎంతో అభిమానం. హైమ బంధువుల దురాగతాల నుంచి ఎన్నోసార్లు ఆమెను రక్షిస్తాడు సాంబయ్య. ఆ తర్వాత పట్టణం వెళ్లిపోయిన హైమ అక్కడ నృత్యకారిణిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. హైమను ఆ స్థాయికి తీసుకొచ్చిన రాంబాబును పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సాంబయ్య అనుకుంటాడు. కానీ, ఆమె సాంబయ్యను ఇష్టపడుతుంది. చివరికి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. చక్కని సెంటిమెంట్‌తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.  7. స్వయంకృషి చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సాంబయ్య కథే స్వయంకృషి. చిరంజీవి, విజయశాంతి, సుమలత, చరణ్‌రాజ్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. రమేష్‌ నాయుడు సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.  8. స్వర్ణకమలం నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. వెంకటేష్‌, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. వెంకటేష్‌ నటన, భానుప్రియ నటన, నృత్యం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ఆదరణ పొందాయి.  9. స్వాతికిరణం సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. గురువు అహంకారానికి శిష్యుడు ఎలా బలయ్యాడన్నదే ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో  రాధిక, మాస్టర్‌ మంజునాథ్‌, సాక్షి రంగారావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు  ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ అందించిన శాస్త్రీయ సంగీతం అందరికీ మధురానుభూతిని అందించింది.  10. ఆపద్బాంధవుడు ప్రేమ, సెంటిమెంట్‌, త్యాగం.. వంటి అంశాలతో రూపొందిన సినిమా ఇది. చక్కని ఫ్యామిలి డ్రామాగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, సుత్తి వేలు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. యం.యం.కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఘనవిజయం సాధించాయి. 

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ గురించి మీకు తెలీని నిజాలు!

దిగ్ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి నిర్దేశ‌క‌త్వంలో జూనియ‌ర్ శ్రీ‌రంజ‌ని టైటిల్ రోల్ పోషించిన‌ 'గుణ‌సుంద‌రి క‌థ' (1949) సినిమా నిర్మాణ స‌మ‌యంలో కె. విశ్వ‌నాథ్ మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. స‌రిగ్గా ఆ టైమ్‌లోనే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు 'షావుకారు' సినిమాకు బుక్ అయ్యారు. అంటే వారంతా దాదాపు ఒకేసారి త‌మ కెరీర్‌ను ప్రారంభించార‌న్న మాట‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ అయిన బి.ఎన్‌. రెడ్డికి విద్యావంతులైన యువ‌కుల‌ను చేర‌దీసి, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్ష‌ణ ఇచ్చి, ఆ త‌ర్వాత వారిలో టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ను త‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని ఉండేది. ఆ విధంగానే విశ్వ‌నాథ్‌ను వాహినీ సంస్థ‌లో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. సినీ రంగంలోని చాలా మందికి కూడా తెలీని విష‌య‌మేమంటే, వాహినీ పిక్చ‌ర్స్‌లో విశ్వ‌నాథ్ తండ్రి కాశీనాథుని సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ప‌నిచేశారు. ఆయ‌న బి.ఎన్‌. రెడ్డికి స‌మ‌కాలికులు. 1938 నుంచి అంటే 'వందేమాత‌రం' చిత్రంతో వాహినీ సంస్థ ఆరంభ‌మైన‌ప్ప‌ట్నుంచీ ఆ సంస్థ‌లో సుబ్ర‌హ్మ‌ణ్యం ఉన్నారు. ఈ అనుబంధం కార‌ణంగానే విశ్వ‌నాథ్‌ను బి.ఎన్‌. రెడ్డి మొద‌ట టెక్నీషియ‌న్‌గా ఎంచుకొని, త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని అనుకున్నారు. 'బంగారు పాప‌', 'మ‌ల్లీశ్వ‌రి' లాంటి క్లాసిక్స్ నిర్మిస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి వ‌ద్ద‌, ఛాయాగ్రాహ‌కుడు మార్క‌స్ బార్‌ట్లీ వంటి వారి సాహ‌చ‌ర్యంలో విశ్వ‌నాథ్ ప‌నిచేశారు.  సౌండ్ రికార్డింగ్ అన్న‌ది సినిమా నిర్మాణంలో ఒక విభాగం. కానీ, డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు రీరికార్డింగ్‌ను కూడా ధైర్యంగా విశ్వ‌నాథ్‌కు అప్ప‌గించి వెళ్లేవారు. ఆయ‌న‌కు డైరెక్ష‌న్ మీద ఉత్సాహం ఉంద‌నే అభిప్రాయంతోనే ఆదుర్తి ఆ ప‌నిచేసేవారు. 'స్వ‌ప్న‌సుంద‌రి', 'లైలా మ‌జ్ను', 'తోడికోడ‌ళ్లు' లాంటి సినిమాల‌కు సౌండ్ రికార్డిస్ట్‌గా ప‌నిచేయ‌డంతో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో ప‌రిచ‌యం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. అన్న‌పూర్ణా పిక్చ‌ర్స్ వాళ్ల 'తోడికోడ‌ళ్లు', 'మాంగ‌ల్య బ‌లం', 'ఇద్ద‌రు మిత్రులు' సినిమాల‌ను వాహినీలోనే తీశారు. దాంతో అక్కినేని, విశ్వ‌నాథ్ బాగా స‌న్నిహితుల‌య్యారు. ఇక ఆదుర్తికి విశ్వ‌నాథ్ ఎంత ద‌గ్గ‌ర‌య్యారంటే.. వాహినీలో రికార్డిస్టుగా ఉన్న‌ప్పుడు ఆదుర్తి సొంత చిత్రం 'మూగ‌మ‌న‌సులు' స్క్రిప్టు డిస్క‌ష‌న్స్‌లో ప్ర‌తిరోజూ ఆఫీసు అవ‌గానే సాయంత్రం పూట పాల్గొనేవారు విశ్వ‌నాథ్. ఆ త‌ర్వాత ఆదుర్తికి అసోసియేట్‌గా అన్న‌పూర్ణ సంస్థ‌లో చేరారు. అందులో నాలుగేళ్లు వ‌ర్క్ చేశారు విశ్వ‌నాథ్‌. అప్పుడు 'చ‌దువుకున్న అమ్మాయిలు', 'డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి' లాంటి సినిమాల‌కు ప‌నిచేశారు. 'మూగ‌మ‌న‌సులు'కు సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా చేశారు. 'తేనె మ‌న‌సులు' చిత్రానికి ఎంపికైన కృష్ణ‌, రామ్మోహ‌న్‌, సుక‌న్య‌, సంధ్యారాణి త‌దిత‌ర‌ న‌టుల‌కు ట్రైనింగ్ ఇవ్వ‌డంలో పాల్గొన్నారు. 1966లో అక్కినేని హీరోగా అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన 'ఆత్మ‌గౌర‌వం'తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు విశ్వ‌నాథ్‌. ఆ త‌ర్వాత క‌థ చాలా మందికి తెలిసిందే. తెలుగు సినిమా గ‌ర్వించే ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా, లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌గా కాశీనాథుని విశ్వ‌నాథ్ పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు. (ఫిబ్రవరి 19 - కె. విశ్వనాథ్ జయంతి)

వియ్యంకుడు అక్కినేని హీరోగా రామానాయుడు నిర్మించిన మొద‌టి సినిమా ఇదే!

న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు వియ్యంకుల‌నే విష‌యం తెలిసిందే. నాగార్జున‌కు, రామానాయుడు కుమార్తె ల‌క్ష్మికి 1984లో వివాహం జ‌రిగింది. కానీ అభిప్రాయ భేదాల కార‌ణంగా ఆరేళ్ల‌లోనే ఇద్ద‌రూ విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీల మ‌ధ్య స‌న్నిహిత‌త్వం ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ రెండు కుటుంబాలూ ఒక్క‌టే అన్నంత‌గా మెల‌గుతూ వ‌స్తున్నాయి.  వియ్యంకులు కాక‌ముందే ఏఎన్నార్ హీరోగా ప‌లు చిత్రాలు నిర్మించారు రామానాయుడు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'సిపాయి చిన్న‌య్య' (1969). ఇందులో అక్కినేని టైటిల్ రోల్ పోషించ‌డంతో పాటు, జ‌మీందార్ భాస్క‌ర్‌గా కూడా న‌టించారు. అంటే డ్యూయ‌ల్ రోల్ అన్న‌మాట‌. విశేష‌మేమంటే ఈ సినిమా కంటే ముందు రామానాయుడు నిర్మించిన 'రాముడు-భీముడు' సినిమాలోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేశారు. అది వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఇలా ఇద్ద‌రు టాప్ హీరోల‌తో నిర్మించిన తొలి చిత్రాల్లో వారిచేత డ్యూయ‌ల్ రోల్ చేయించిన అరుదైన రికార్డును రామానాయుడు సొంతం చేసుకున్నారు. 'సిపాయి చిన్న‌య్య' చిత్రానికి జి.వి.ఆర్‌. శేష‌గిరిరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ సినిమాని నిర్మించిన‌ప్ప‌టికీ ఓపెనింగ్ సీన్స్‌తో పాటు, క్లైమాక్స్ సీన్ల‌నూ, రెండు పాట‌ల్నీ క‌ల‌ర్‌లో చిత్రీక‌రించారు. చిన్న‌య్య పాత్ర‌కు జోడీగా కె.ఆర్‌. విజ‌య‌, భాస్క‌ర్ క్యారెక్ట‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా భార‌తి న‌టించారు. అప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి, మంచి డాన్స‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి "ఒరే మావా.. ఏసుకోరా సుక్క" అనే ఆరుద్ర పాట‌కు డాన్స్ చేశారు. అది విశేషం కాదు. అదివ‌ర‌కే ఆమె పెళ్లి చేసుకొని, సినిమాల్లో న‌టించ‌నంటూ మ‌నీలా వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో బంధువుల ఇంట్లో జ‌రుగుతున్న వివాహ వేడుక‌కు ఆమె మ‌ద్రాసు వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసి, ఆమెను త‌మ సినిమాలో ఓ పాటలో న‌టించ‌మ‌ని రామానాయుడు కోరారు. ఆయ‌న మీదున్న గౌర‌వంతో ఆ పాట‌కు డాన్స్ చేశారు విజ‌య‌ల‌క్ష్మి. స‌త్య‌నారాయ‌ణ కాంబినేష‌న్‌తో ఆ పాట‌ను చిత్రీక‌రించారు. (ఫిబ్రవరి 18న రామానాయుడు వర్ధంతి)

13 ఏళ్ళ వయసులో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడా కమెడియన్‌ 200 కోట్లకు అధిపతి 

జానీ లివర్‌.. ఈ పేరు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయిస్తుంది. హిందీ కమెడియన్స్‌ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు మెహమూద్‌, అస్రాని, జానీ వాకర్‌, జగదీప్‌, కెష్టో ముఖర్జీ. వీరంతా బాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్స్‌గా కొనసాగుతున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన జానీ లివర్‌.. తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాదాపు 350కిపైగా సినిమాల్లో తన కామెడీతో అలరించాడు. తెలుగువాడైన జానీ లివర్‌ తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. తినడానికి తిండి కూడా లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు రూ.200 కోట్లకు అధిపతి అయ్యాడు. అతను ఈ స్థితికి రావడానికి పడిన కష్టం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.  జానీ లివర్‌ అసలు పేరు జనుమల జాన్‌ ప్రకాశరావు. 14 ఆగస్టు 1957, ఆంధ్రప్రదేశ్‌లోని కనిగిరిలో జన్మించాడు. తండ్రి హిందుస్థాన్‌ యునీలివర్‌లో ఉద్యోగం చేసేవాడు. అందుకే వారు ముంబాయిలోని ధారావిలో నివసించేవారు. అయితే తాగుడికి బానిస అయిన తండ్రి.. పిల్లలను, వారి భవిష్యత్తు పట్టించుకోకపోవడంతో కుటుంబంలో దరిద్రం తాండవించేది. దీంతో 13 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైల్వే ట్రాక్‌పై నిలబడ్డాడు జాని. రైలు సమీపిస్తున్నప్పుడు కళ్లు మూసుకున్న జానీకి అతని ముగ్గురు చెల్లెళ్ళు మనసులో మెదిలారు. వారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో వెంటనే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని, ముగ్గురు చెల్లెళ్ళకు బంగారు భవిష్యత్తునివ్వాలని  నిర్ణయించుకున్నాడు. అయినా అప్పుడప్పుడు కలిగే మానసిక ఆందోళన వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తూ వుండేదట. ఆ ఆలోచనల నుంచి తనని సంగీతం కాపాడిరదని చెబుతాడు జానీ.  ఒకరోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేవగానే దగ్గరలో ఉన్న బార్బర్‌ షాప్‌కి వెళ్ళాడు. అక్కడ ఒక పాట వినిపిస్తోంది. ఆ షాప్‌ వెనుకే ఉన్న బెంచ్‌పై కూర్చొని ఆ పాట విన్నాడు. 1962లో వచ్చిన ‘మన్‌ మౌజీ’ సినిమాలోని ‘మై తో తుమ్‌ సంగ్‌ నైనా మిలా కే హార్‌ గయీ సజ్నా’ పాట అది. ఆ పాటలో ఏముందోగానీ అలా వింటూ ఉండిపోయాడు. తన మనసులోని ఆందోళన అంతా ఒక్కసారి మాయమైందన్న విషయాన్ని గ్రహించాడు. అప్పటి నుంచి పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. సంగీతం ద్వారా ఎంతో హాయిని పొందానని, అదే తనకు జీవిత పాఠాలు నేర్పిందని చెబుతాడు జాని.  కుటుంబ బాధ్యతను తీసుకున్న జానీ ఎన్నో రకాల పనులు చేశాడు. ముంబాయిలోని వీధుల్లో కొన్నాళ్ళు పెన్నులు, నోట్‌బుక్స్‌ అమ్మాడు. హైదరాబాద్‌లోని యాకత్‌పూరలోని తన బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అక్కడ అతనికి చాలా మంది ఫ్రెండ్స్‌ అయ్యారు. ఆ సమయంలోనే మిమిక్రీ నేర్చుకున్నాడు. ముంబాయి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మిమిక్రీ షోలు చేసేవాడు. ఆ తర్వాత హిందుస్థాన్‌ లివర్‌లో 6 సంవత్సరాలపాటు చిన్న ఉద్యోగం చేశాడు. లంచ్‌ టైమ్‌లో అక్కడి వారికి కాలక్షేపం కోసం తన మిమిక్రీతో వారిని నవ్వించేవాడు. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తన పై అధికారులను సైతం అనుకరించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. అప్పటినుంచి కంపెనీకి సంబంధించిన ఏ ఫంక్షన్‌లోనైనా జానీ షో తప్పనిసరిగా ఉండేది. క్రమంగా అతను మిమిక్రీ షోలతో బిజీ అయిపోయాడు. విదేశాల్లో కూడా పెర్‌ఫార్మ్‌ చేసేందుకు వెళ్లేవాడు. వివిధ షోల ద్వారా సంపాదన బాగానే ఉండడంతో హిందుస్థాన్‌ లివర్‌లో జాబ్‌ని వదిలేశాడు. అతనిలో ఉన్న టాలెంట్‌కి సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని స్నేహితులు అనేవారు. అప్పుడే అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అలా 1981లో ‘యే రిష్తా న టూటే’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు జానీ. ఆ సినిమా తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చేవి. 1987లో నసీరుద్దీన్‌ షా, అర్చనా పురాన్‌ సింగ్‌ జంటగా వచ్చిన ‘జల్వా’ చిత్రం అతని లైఫ్‌ని మార్చేసింది. ఆ సినిమాలో అతను చేసిన ముత్తు క్యారెక్టర్‌కి విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు జానీ. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 10 సినిమాలకు తగ్గకుండా చేస్తూ వచ్చాడు. ఒక్క సంవత్సరంలో 20 సినిమాలు చేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఒక దశలో బాలీవుడ్‌లో తిరుగులేని కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు. జానీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటాడు. అతనికి బ్రహ్మానందం అంటే ఎంతో అభిమానం. అతనెప్పుడు హైదరాబాద్‌ వచ్చినా బ్రహ్మానందంని కలవకుండా వెళ్ళడు. ఎంతో దయనీయమైన పరిస్థితి నుంచి కోట్లకు అధిపతిగా ఎదిగిన జానీ లివర్‌ తెలుగు వాడు కావడం మనందరం గర్వించదగిన విషయం. 

హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి.. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించారు!

సినిమా ఇండస్ట్రీలో అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. కొందరు హీరోగా రాణించాలని వస్తారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతను డైరెక్టర్‌ అయిపోతాడు. మరికొందరు డైరెక్టర్‌ అవ్వాలని వస్తే... అతను హీరోగా సెటిల్‌ అయిపోతాడు. సినిమా రంగానికి చెందిన చాలా మంది విషయంలో ఇలాంటి విచిత్రాలు జరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత కె.వి.మహదేవన్‌ విషయంలో ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. అతని తండ్రి గోటు వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఇక తాత ఒక దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడుగా ఉండేవారు. అలాంటి సంగీత కుటుంబంలో పుట్టిన మహదేవన్‌ చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకున్నప్పటికీ అందులో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆలోచన ఉండేది కాదు. ఇక చదువు మీద కూడా శ్రద్ధ లేదు. ఎంతసేపూ నాటకాల వైపే ఆయన మొగ్గు చూపించేవారు. ఏడవ తరగతితోనే చదువుకి స్వస్తి పలికారు. నాటకాలు వేస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కునేవారు. సినిమాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలన్న కోరికతో మద్రాస్‌ రైలెక్కేశారు. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘మాతృభూమి’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఊరికి వెళ్లే ఉద్దేశంలేని మహదేవన్‌ నాటకాల్లో వివిధ పాత్రలు పోషించేవారు. ఆడవేషంలో కూడా అందర్నీ మెప్పించేవారు. కొన్ని సినిమాలకు జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా వెళ్లేవారు. అవకాశాలు ఏవీ లేనపుడు హోటల్‌లో సర్వర్‌గా కూడా పనిచేశారు మహదేవన్‌.  అలా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన బాధ చూసి ఒక తమిళ హాస్యనటుడు ఎస్‌.వి.వెంకట్రామన్‌ అనే సంగీత దర్శకుడికి తీసుకెళ్ళి ‘ఈ అబ్బాయికి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. కానీ, సినిమాల్లో నటిస్తానంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. మీ దగ్గర ఉంటే బాగుపడతాడని తీసుకొచ్చాను’ అని చెప్పాడు. అప్పుడు మహదేవన్‌ను తన అసిస్టెంట్‌గా తీసుకున్నారు వెంకట్రామన్‌. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం కొత్త మలుపు తిరిగింది. సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన మహదేవన్‌కి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. ఇక నటన జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. సంగీతంలోనే పేరు తెచ్చుకోవాలనే కృతనిశ్చయానికి వచ్చారు. పాటను ఎలా ట్యూన్‌ చేయాలి, ఆర్కెస్ట్రాను ఎలా కండక్ట్‌ చేయాలి, రికార్డింగ్‌ ఎలా చేయాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. అతనిలో ఉన్న సంగీత జ్ఞానాన్ని చూసి కొన్ని పాటలు ట్యూన్‌ చేయించుకున్నారు. కానీ, అవి అంతగా సెట్‌ అవ్వలేదు. 1957 వరకు అలా అసిస్టెంట్‌గానే పనిచేస్తూ అన్నీ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌, శివాజీ హీరోలుగా నటించిన సినిమాకి సంగీతం చేసే అవకాశం వచ్చింది. అప్పుడు అందరి దృష్టీ మహదేవన్‌పై పడిరది. ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఓ చిన్న బడ్జెట్‌ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మహదేవన్‌కి కూడా పేరు రాలేదు.  ఆ తర్వాత జగ్గయ్య, షావుకారు జానకి జంటగా నటించిన ‘ముందడుగు’ చిత్రానికి సంగీతం చేసే అవకాశం వచ్చింది. అందులో ఆయన ట్యూన్‌ చేసిన ‘కోడెకారు చిన్నవాడా’ అనే పాట చాలా పెద్ద హిట్‌ అయింది. ఇక అక్కడి నుంచి మహదేవన్‌కు అవకాశాలు రావడం మొదలైంది. ఆ సమయంలోనే 1962లో ‘మంచి మనసులు’ సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళ్‌ సినిమాకి రీమేక్‌. తమిళ్‌లో మహదేవన్‌ సంగీతం అందించారు. కాబట్టి తెలుగుకి కూడా ఆయన్నే తీసుకున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమా తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంతో బిజీ అయిపోయారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో 680కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయన కెరీర్‌లో అవార్డులకు కొదవలేదు. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎన్నోసార్లు అవార్డు అందుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్‌ అవార్డు అందుకోవడం తను ఎప్పటికీ మరచిపోలేనని చెబుతుండేవారు మహదేవన్‌. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా బాపు దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. ఈ సినిమా సమయంలోనే ఆయనకు పక్షవాతం రావడం, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో లేకపోవడంతో ఆయన శిష్యుడు పుహళేంది ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అలా పది సంవత్సరాలపాటు మంచం మీదే వున్న మహదేవన్‌ 2001లో తుదిశ్వాస విడిచారు.  

1967లో ఎన్టీఆర్‌ సినిమాలు 12 రిలీజ్‌ అయ్యాయి. అందులో ఏది హిట్‌.. ఏది ఫట్‌! 

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ హీరోలుగా చలామణి అవుతున్న హీరోలు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లో పాత తరం హీరోలు సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. వారిలో ఎన్‌.టి.రామారావు ఒకరు. 1967 సంవత్సరంలో ఆయన నటించిన 12 సినిమాలు విడుదల కావడం విశేషం. ఈ 12 సినిమాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌గా నటించిన సినిమాలు 5 కాగా, దేవిక హీరోయిన్‌గా నటించిన సినిమాలు 4. ఇక దర్శకుల్లో సి.పుల్లయ్య 2 సినిమాలు, వి.దాదామిరాసి 2 సినిమాలు అత్యధికంగా దర్శకత్వం వహించారు. ఆ 12 సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అయ్యాయి, ఎలాంటి ఫలితాల్ని పొందాయి అనేది పరిశీలిద్దాం.  జనవరి 14న విడుదలైన ‘గోపాలుడు భూపాలుడు’ చిత్రానికి జి.విశ్వనాథం దర్శకత్వం వహించారు. జయలలిత, రాజశ్రీ హీరోయిన్లుగా నటించారు. భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయిందీ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. మార్చి 2న ‘నిర్దోషి’ చిత్రం రిలీజ్‌ అయింది. వి.దాదామీరాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సావిత్రి, అంజలి ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏవరేజ్‌ సినిమా అనిపించుకుంది. ఈ సినిమా విడుదలైన 20 రోజులకే అంటే మార్చి 22న ‘కంచుకోట’ రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించారు. ఇందులో సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 30 కేంద్రాల్లో మొదటివారం రూ.7 లక్షలు కలెక్ట్‌ చేసింది. అప్పటికి అది రికార్డుగా చెప్పొచ్చు. కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా విజయవాడ విజయ టాకీస్‌లో 105 రోజులు ప్రదర్శింపబడింది. జూన్‌ 29న ఈ సినిమా శతదినోత్సవాన్ని విజయ టాకీస్‌లో నిర్వహించారు. ఇదే సినిమాను 1975లో రీ రిలీజ్‌ చేస్తే హైదరాబాద్‌లోని శోభన థియేటర్‌లో రోజూ 3 ఆటలతో 105 రోజులు రన్‌ అయింది.  ఏప్రిల్‌ 7న ‘భువనసుందరి కథ’ విడుదలైంది. ఈ చిత్రానికి సి.పుల్లయ్య దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత రెండు వారాలకే ఏప్రిల్‌ 20న ‘ఉమ్మడి కుటుంబం’ రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి డి.యోగానంద్‌ దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ సినిమా ఘన విజయం సాధించింది. 15 కేంద్రాల్లో 100 రోజులు  ప్రదర్శింపబడింది. విజయవాడ దుర్గా కళామందిర్‌లో డైరెక్ట్‌గా 197 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్లుగా నటించిన సావిత్రి, ఎస్‌.వరలక్ష్మీ ఈ సినిమాలో వదిన పాత్రల్లో కనిపిస్తారు. అలాగే 1954లో విడుదలైన ‘తోడుదొంగలు’ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా నటించిన హేమలత ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో ఎన్టీఆర్‌కు తల్లిగా నటించారు.  జూన్‌ 29న విడుదలైన ‘భామావిజయం’ చిత్రానికి సి.పులయ్య దర్శకత్వం వహించారు. దేవిక హీరోయిన్‌. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్‌ ‘గొల్లభామ’. సినిమాకి ఈ టైటిల్‌ పెట్టడం అప్పట్లో వివాదాస్పదం కావడంతో ‘భామా విజయం’గా పేరును మార్చారు. ఎబౌ ఏవరేజ్‌ అనిపించుకున్న ఈ సినిమా రాజమండ్రి వెంకట నాగదేవి థియేటర్‌లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఆగస్ట్‌ 10న విడుదలైన ‘నిండు మనసులు’ చిత్రానికి ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వం వహించారు. దేవిక హీరోయిన్‌. ఏవరేజ్‌ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా విజయవాడలో సింగిల్‌ షిప్ట్‌పై 100 రోజులు ఆడింది. ఆగస్ట్‌ 31న విడుదలైన సినిమా ‘స్త్రీ జన్మ’. ఈ చిత్రానికి కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ సరసన కృష్ణకుమారి, కృష్ణ సరసన ఎల్‌.విజయలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. మొదట ఈ సినిమా టైటిల్‌ ‘స్త్రీ’ అనుకున్నారు. ఆ తర్వాత ‘స్త్రీజన్మ’గా మార్చారు. ఈ సినిమా 7 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. అక్టోబర్‌ 12న విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన దేవికతోపాటు ఏడుగురు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ తొలిసారి నటించడం విశేషం. కమర్షియల్‌గా సక్సెస్‌ అయిన ఈ సినిమా విజయవాడ జైహింద్‌ థియేటర్‌లో 105 రోజులు ప్రదర్శితమైంది. లేట్‌ రన్‌లో బెంగళూరు మినర్వా థియేటర్‌లో 18 వారాలు ప్రదర్శింపబడి షిఫ్టులపై 175 రోజులు నడిచింది. శోభన్‌బాబు ఈ సినిమాలో నారదుడిగా నటించారు.  నవంబర్‌ 3న విడుదలైన ‘పుణ్యవతి’ చిత్రానికి వి.దాదామిరాసి దర్శకత్వం వహించారు. కృష్ణకుమారి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో భానుమతి కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో శోభన్‌బాబు కూడా ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నవంబర్‌ 30న విడుదలైన ‘ఆడపడుచు’ చిత్రానికి కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన కృష్ణకుమారి, శోభన్‌బాబు సరసన వాణిశ్రీ, హరనాథ్‌ సరసన చంద్రకళ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించిన ఈ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులు  ప్రదర్శింపబడింది. డిసెంబర్‌ 21న విడుదలైన ‘చిక్కడు దొరకడు’ చిత్రానికి బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, కాంతారావు కవల సోదరులుగా నటించారు. ఎన్టీఆర్‌ సరసన జయలలిత, కాంతారావు సరసన కృష్ణకుమారి నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది.  

కేవలం 5 సెంటర్స్‌లో రిలీజ్‌ అయి.. కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించిన సినిమా!

ఒక సినిమా చెయ్యాలనుకోవడం, దానికోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకోవడం, దాన్ని ఎవరితో చెయ్యాలి అని డిసైడ్‌ చేసుకోవడం ఒక ఎత్తయితే, దాన్ని ఒక హీరోకి వినిపించి అతనితో ఓకే అనిపించుకోవడం మరో ఎత్తు. కొంతమంది హీరోలు రిజెక్ట్‌ చేసిన కథను మరో హీరోతో చేసినపుడు సూపర్‌హిట్‌ అయిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక సూపర్‌హిట్‌ సినిమా వెనుక ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. అలాంటి ఓ అనుభవం సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కెరీర్‌లో జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా మీద ప్యాషన్‌తో, ఏదో సాధించాలి అనే తపనతో ఇండస్ట్రీకి వచ్చారు శేఖర్‌ కమ్ముల. తన కుటుంబం, స్నేహితుల సపోర్ట్‌తో ‘డాలర్‌ డ్రీమ్స్‌’ అనే సినిమాను తీసి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ చిత్రానికిగాను ఉత్తమ నూతన దర్శకుడుగా శేఖర్‌ కమ్ములకు జాతీయ అవార్డు లభించింది.  ఇక తన రెండో ప్రయత్నంగా ‘ఆనంద్‌’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. ఈ స్క్రిప్డును తీసుకొని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో.. ఇంకా కొందరు హీరోల చుట్టూ తిరిగాడు శేఖర్‌ కమ్ముల. కానీ, ఆ స్క్రిప్ట్‌ ఎవ్వరికీ నచ్చలేదు. తను ఏం తియ్యాలనుకుంటున్నాడో వారికి అర్థం కావడం లేదు అని భావించిన శేఖర్‌ తనే సొంతంగా ‘ఆనంద్‌’ చిత్రాన్ని నిర్మించడానికి సన్నద్ధమయ్యాడు. ఎన్‌ఎఫ్‌డిసితో కలిసి సినిమాను ప్రారంభించాడు. ఎన్‌ఎఫ్‌డిసికి రూ.40 లక్షలు మాత్రమే పరిమితి ఉంది. కొన్నాళ్ళకే ఆ డబ్బు అయిపోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌ సాయంతో మొత్తానికి సినిమాను పూర్తి చేశాడు. అంతకుముందు డాలర్‌ డ్రీమ్స్‌ వంటి అవార్డు సినిమా తీసి ఉండడం వల్ల ‘ఆనంద్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తనే సొంతంగా రిలీజ్‌ చెయ్యాలని భావించి అప్పటికి ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 5 థియేటర్లలో మాత్రమే సినిమాను రిలీజ్‌ చేశాడు. రిలీజ్‌ అయిన రెండో రోజు నుంచే లోకల్‌గా ఉండే డిస్ట్రిబ్యూటర్స్‌ తమకు కూడా సినిమా ఇవ్వమని ఆఫీస్‌కి వచ్చి చుట్టుమూగారు. ఆ సమయంలో బిజినెస్‌పరంగా అంత అవగాహన లేని శేఖర్‌ కమ్ముల వారు ఎంత ఇస్తే అంతే తీసుకొని సినిమాను ఇచ్చేశాడు. కేవలం కొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు విపరీతంగా పెరిగాయి. సినిమా చాలా పెద్ద హిట్‌ అయిపోయింది. ఈ సినిమాను కొనుక్కున్న వారు ఎక్కువ లాభపడ్డారు.  శేఖర్‌ కమ్ములకు సినిమా బడ్జెట్‌ 2 కోట్ల 30 లక్షలు పోను కోటి రూపాయలు లాభం వచ్చింది. ‘ఆనంద్‌’ చిత్రం రిలీజ్‌ అయినరోజే ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’ కూడా రిలీజ్‌ అయింది. మెగాస్టార్‌ సినిమాను తట్టుకొని ‘ఆనంద్‌’ ఘనవిజయం సాధించడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.  

‘తెలుసా.. మనసా..’ ట్యూన్‌ని కీరవాణి ఎక్కడి నుంచి కాపీ చేసారో తెలుసా?

మన సినిమాల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా మన సినిమాల్లో పాటలు తప్పనిసరిగా ఉండాలి. అయితే వాటిని వీనుల విందుగా అందించేందుకు సంగీత దర్శకులు ఎంతో కృషి చేస్తారు. ఒక్కోసారి వారికి ట్యూన్‌ నచ్చితే ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. తమ కెరీర్‌లో ఇతర భాషల నుంచి సంగీతాన్ని దిగుమతి చేసుకున్న సందర్భాలు లేని మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ కూడా ఉన్నారు. వారిలో ఇళయరాజా ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన ట్యూన్స్‌ అన్నీ స్వంతంగా చేసినవే. అయితే కొన్ని సందర్భాల్లో దర్శకుల అభిరుచి మేరకు వారికి నచ్చిన ట్యూన్స్‌ను కొందరు సంగీత దర్శకులు దిగుమతి చేసుకుంటారు. అలా జర్మనీ నుంచి దిగుమతి అయిందే ‘తెలుసా.. మనసా’ పాట ట్యూన్‌.  వివరాల్లోకి వెళితే.. నాగార్జున హీరోగా మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘క్రిమినల్‌’ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని ‘తెలుసా.. మనసా..’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. హిందీలో కూడా ఈ పాట చాలా పాపులర్‌ అయింది. అయితే ఈ పాట ‘ఎనిగ్మా’ అనే ఓ జర్మన్‌ బ్యాండ్‌ ట్యూన్‌ చేసింది. ‘ఏజ్‌ ఆఫ్‌ లోన్లీనెస్‌’ అనే ఈ పాట లిరిక్‌ లేకుండా కేవలం హమ్మింగ్‌తో, మ్యూజిక్‌తో సాగుతుంది. దీన్ని యధాతథంగా కీరవాణి కాపీ చేశారు. అయితే లిరిక్‌తో వచ్చే ట్యూన్‌ని మాత్రం ఆయన సొంతంగా ట్యూన్‌ చేశారు. ఎనిగ్మా ట్యూన్‌ చేసిన ఆ హమ్మింగ్‌ను, మ్యూజిక్‌ను కాపీ చేసినప్పటికీ ఆ పాటలో ఓ ఫ్రెష్‌నెస్‌ని తీసుకొచ్చారు కీరవాణి. అది మన పాటే అన్నంత అందంగా మొత్తం పాటని కంపోజ్‌ చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అప్పట్లో ఈ పాట పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంది.  ఈ పాటను ‘క్రిమినల్‌’ సినిమాలో పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మొదట ఈ ట్యూన్‌ను జగపతిబాబు హీరోగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి ప్రేమికుడు’ కోసం చేశారు. సినిమాలోని ఓ సిట్యుయేషన్‌ చెప్పి దానికి తగిన పాట కావాలని కీరవాణిని కోరడంతో కొన్ని ట్యూన్స్‌ వినిపించారు. అందులో ‘తెలుసా మనసా’ ట్యూన్‌ ఒకటి. ‘కలికి చిలక ముద్దు తాంబూలం ఇమ్మందని’ అంటూ సాగే సాహిత్యంతో ఆ ట్యూన్‌ వినిపించారు. అయితే తాను అనుకున్న సన్నివేశానికి అది సరిపోదని భావించిన రాఘవేంద్రరావు ‘చిలిపి చిలక ఐ లవ్‌ యు అన్న వేళలో..’ అంటూ సాగే ట్యూన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ‘క్రిమినల్‌’కి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కీరవాణి ‘తెలుసా.. మనసా’ ట్యూన్‌ను వినిపించారు. దాన్ని మహేష్‌ భట్‌ వెంటనే ఓకే చేశాడు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎంతో మధురంగా ఆలపించారు. 

ప్రేయసిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్‌!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన హీరో. కేవలం స్వయంకృషితోనే ఈ స్థాయికి వచ్చిన రజినీకాంత్‌ జీవితంలో ఓ ప్రేమకథ కూడా ఉందని మీకు తెలుసా.. మలయాళ నటుడు, రజినీ స్నేహితుడు దేవన్‌.. రజినీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిచారు. ఒక సినిమా షూటింగ్‌ కోసం చెన్నయ్‌లో ఉన్నప్పుడు దేవన్‌ను డిన్నర్‌కి రావాల్సిందిగా తన రూమ్‌కి ఆహ్వానించారు రజినీ. అప్పుడు ఆయన గదికి వెళ్లారు దేవన్‌. డిన్నర్‌కి కావాల్సినవి అన్నీ తెప్పించారు. అప్పటికి కాస్త మద్యం సేవించి ఉన్న రజినీ ‘నీకు తొలి ప్రేమ ఉందా?’ అని దేవన్‌ని అడిగారు. అతను తన లవ్‌స్టోరీని వినిపించాడు. అది విన్న రజినీ ఎమోషనల్‌ అయ్యారు. తన లవ్‌స్టోరీని చెప్పడం మొదలుపెట్టారు.  ‘బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బెంగళూర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న నిర్మలతో పరిచయం ఏర్పడిరది. ఆమె బస్సు ఎక్కినప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. ఓరోజు నేను ప్రధాన పాత్ర పోషించబోతున్న నాటకాన్ని చూడటానికి నిర్మలను పిలిచాను. నాటకం చూసింది. ఆపై కొన్ని రోజులకు మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్‌ వచ్చింది. నేను దాని కోసం దరఖాస్తు చేసుకోలేదు. అయినా ఆ లెటర్‌ రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాటకంలో నా నటన ఆమెకు బాగా నచ్చడంతో, నా తరఫున మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో అప్లికేషన్‌ వేసింది. నేను పెద్ద స్టార్‌ కావాలని ఆమె కోరుకుంది. ఆ సమయంలో బెంగళూరు నుంచి చెన్నయ్‌ వెళ్లడానికి కూడా నా దగ్గర డబ్బులేదు. నా పరిస్థితి గురించి తెలిసిన నిర్మల రూ.500 ఇచ్చి చెన్నయ్‌ పంపించింది. మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన కొన్నాళ్లకు బెంగళూరు వెళ్లాను. అక్కడ నిర్మల కనిపించలేదు. ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల ఎంక్వయిరీ చేస్తే వారి కుటుంబం మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అయ్యారని తెలిసింది. ఆ తర్వాత కూడా నిర్మల కనిపించలేదు. నేను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా నిర్మల కనిపిస్తుందేమోనని చూస్తాను. నా దృష్టిలో ఆమె గొప్ప మహిళ. అందుకే ఎవరినీ బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు నన్ను చూసేందుకు కూడా రాలేదు. ఆమెను నేను మర్చిపోయానని అనుకుందో ఏమో’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు రజినీకాంత్‌. చాలా సేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయారు. తన లవ్‌స్టోరీ చెప్పి ఎంతో ఎమోషనల్‌ అయిన రజినీని ఓదార్చారు దేవన్‌.  ఏదో ఒక రోజు నిర్మల కనిపిస్తుందని రజినీకి ధైర్యం చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత రజినీ సాధారణ స్థితికి వచ్చారు. రజినీకాంత్‌ జీవితంలో జరిగిన ఈ విశేషాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు దేవన్‌.  

గుణశేఖర్‌ తిట్టడంతో సినిమా చేయనని మొండికేసిన ఎన్టీఆర్‌!

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌ ‘రామాయణం’ చిత్రంలోని తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎం.ఎస్‌.రెడ్డి నిర్మించిన ఈ సినిమా పిల్లలకి మంచి వినోదాన్ని అందించింది. ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దారు. దాంతో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డుకు ‘రామాయణం’ చిత్రాన్ని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.  తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లాంటి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి గుణశేఖర్‌ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే కేవలం పిల్లలు మాత్రమే నటించిన సినిమా ఇది. సాధారణంగా ఒక సినిమాలో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారిని కంట్రోల్‌ చేయడం కష్టం. అలాంటిది కేవలం పిల్లలతోనే సినిమా చెయ్యాలంటే ఆ దర్శకుడు ఎంత టెన్షన్‌ పడాల్సి వస్తుందో గుణశేఖర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ పిల్లల్ని కంట్రోల్‌ చేయడం చిత్ర యూనిట్‌కి పెద్ద సమస్యగా మారింది. ఒక్కరు కూడా కుదురుగా ఉండేవారు కాదట. ముఖ్యంగా రాముడి పాత్రధారి ఎన్టీఆర్‌ విపరీతమైన అల్లరి చేసేవాడట. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వానరసైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే.. ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగడం, మూతులు పీకడం చేసేవారట తారక్‌. అరణ్యవాసం సన్నివేశాలు తీయడానికి యూనిట్‌ మొత్తం చేలకుడి వెళ్లింది. ఆ సమయంలో అడవిలో విపరీతమైన చలి. పైగా పిల్లలు చొక్కాలు లేకుండా నటించడానికి వణికిపోతుంటే తారక్‌ వాళ్లని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట.  శివ ధనుర్భంగం సన్నివేశం కోసం ప్రత్యేకంగా కనిపించాలని ఓ విల్లును టేకుతో తయారు చేయించారట. దాంతోపాటు మరో డూప్లికేట్‌ విల్లును కూడా తయారు చేయించారు. ఈ సన్నివేశం కోసం యూనిట్‌ సిద్ధమవుతున్న సమయంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఎన్టీఆర్‌ డూప్లికేట్‌ విల్లును పైకి లేపడంతో అది సులభంగా పైకి లేచింది. ఆ తర్వాత టేకుతో చేసిన విల్లును ఎత్తడానికి అందరూ ప్రయత్నించారు. కానీ, ఎవరి వల్లా కాలేదు. చివరికి ఎన్టీఆర్‌ దాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్‌ చెయ్యలేక కింద పడేశాడు. అది విరిగిపోయింది. ఆ హఠాత్‌ పరిణామానికి ఎన్టీఆర్‌పై గుణశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చి తిట్టారట. దాంతో ‘ఇక నేను సినిమా చేయను.. వెళ్లిపోతాను’.. అంటూ ఒకటే మారాం చేశాడట. ఆ తర్వాత యూనిట్‌ సభ్యులందరూ అతన్ని సముదాయించి షూటింగ్‌కి సిద్ధం చేశారట.