రజినీ సినిమా ఒకే థియేటర్‌లో 890 రోజులు ఆడింది.. అది చిరంజీవికి బ్యాడ్‌లక్‌ అయింది!

సినిమా రంగంలో కొన్ని సినిమాలు అనుకోకుండానే సెట్‌ అవుతాయి. అలా సెట్‌ అయిన సినిమాలు కొన్ని చరిత్ర సృష్టించాయి కూడా. తమిళ్‌, తెలుగు భాషల్లో రజినీకాంత్‌ సినిమా ‘చంద్రముఖి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కావడం వెనుక ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. 1999లో కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రజినీ నటించిన ‘వడయప్పా’ సంచలన విజయం సాధించింది. ‘నరసింహ’ పేరుతో తెలుగులో రిలీజ్‌ అయి ఇక్కడ కూడా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమాలో రమ్యకృష్ణ, రజినీ పోటాపోటీగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సురేష్‌కృష్ణ డైరెక్షన్‌లో ‘బాబా’ చిత్రాన్ని చేశాడు రజినీ. అది అతని కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రెండేళ్ళపాటు ఏ సినిమా చెయ్యలేదు. ఆ సమయంలోనే శివాజీ గణేశన్‌ జయంతి వచ్చింది. అంతకుముందు రజినీని ఎన్నోసార్లు భోజనానికి ఆహ్వానించారు శివాజీ. కానీ, కుదరకపోవడం వల్ల ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఎవరికీ చెప్పకుండా జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు రజినీ. అందరూ షాక్‌ అయ్యారు. శివాజీకి నివాళులర్పించి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ శివాజీ ప్రొడక్షన్స్‌లో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రభు ఆనందాన్ని అవధుల్లేవు. అప్పటికే బాబాతో పెద్ద డిజాస్టర్‌ అందుకున్న రజినీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని డిసైడ్‌ అయ్యాడు.  2004 కన్నడలో విడుదలైన ‘ఆప్తమిత్ర’ చిత్రాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా వృద్ధుడి గెటప్‌లో  వెళ్ళి ప్రేక్షకులతో కలిసి చూశాడు. ఆ సినిమాకి ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఈ సినిమాని తప్పకుండా తమిళ్‌లో రీమేక్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. అయితే అప్పటికే కె.ఎస్‌.రవికుమార్‌తో ‘జగ్గుభాయ్‌’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ, ‘ఆప్తమిత్ర’ రీమేక్‌ చెయ్యడమే కరెక్ట్‌ అని డిసైడ్‌ అయ్యాడు. వెంటనే డైరెక్టర్‌ పి.వాసు, శివాజీ గణేశన్‌ తనయుడు ప్రభుకి ఫోన్‌ చేశాడు. మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. దానికి పి.వాసు.. మరి జగ్గుభాయ్‌ అన్నాడు. అది క్యాన్సిల్‌.. ఈ సినిమానే రీమేక్‌ చేస్తున్నాం అని చెప్పాడు.  ఇక సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. పి.వాసుకి రజినీ ఒకటే చెప్పాడు.. మణిచిత్రతాళు, ఆప్తమిత్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి అని. 1993లో మలయాళంలో మణిచిత్రతాళు వచ్చింది. ఆ సినిమాని ఫాజిల్‌ డైరెక్ట్‌ చేయగా మోహన్‌లాల్‌, సురేష్‌గోపి, శోభన నటించారు. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దాన్నే కన్నడలో పి.వాసు ‘ఆప్తమిత్ర’గా రీమేక్‌ చేశాడు. ఇప్పుడు అదే సినిమాని తమిళ్‌లో రీమేక్‌ చేసే బాధ్యత కూడా పి.వాసుకే అప్పగించాడు రజినీ. అంతకుముందు ఇదే కథతో వచ్చిన సినిమాల కంటే పెద్ద హిట్‌ అయ్యేందుకు అవసరమైన మార్పులు పి.వాసు చేస్తున్నాడు. ఓ పక్క రజినీ కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇస్తున్నాడు. ఆప్తమిత్రలో హీరో విష్ణువర్థన్‌ ‘హౌలా.. హౌలా’ అంటూ ఓ పదాన్ని వాడతాడు. అది రజినీకి నచ్చలేదు. దాన్ని మార్చాలి. తన చిన్నతనంలో ఓ మరాఠి నాటకంలో విలన్‌ ‘లకలకలక..’ అనడం రజినీకి గుర్తుంది. దాన్నే ఈ సినిమాలో పెట్టాలనుకున్నాడు. అన్ని విధాలా ఆ రెండు సినిమాలకంటే గొప్పగా స్క్రిప్ట్‌ రెడీ అయింది. టైటిల్‌ ‘నాగవల్లి’ అని పెడదామని పి.వాసు అన్నాడు. అది రజినీకి నచ్చలేదు. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి టైటిల్‌ ఇంకా హెవీగా ఉండాలని సూచించాడు. అప్పుడు అందరూ కలిసి ‘చంద్రముఖి’ అనే టైటిల్‌ని ఫైనల్‌ చేశారు.  ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల్ని ఎంపిక చేయాలి. రజినీ స్నేహితుడుగా ప్రభు నటిస్తాడు. రజినీకి పెయిర్‌గా కొత్తమ్మాయి నయనతార ఓకే అయింది. ‘చంద్రముఖి’ క్యారెక్టర్‌ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు స్నేహ, రీమాసేన్‌ పేర్లు అనుకున్నారు. కానీ, ఎవరూ ఆ క్యారెక్టర్‌కి సెట్‌ అవ్వలేదు. అప్పుడు సిమ్రాన్‌ను ఫైనల్‌ చేశారు. రెండు రోజులు షూటింగ్‌ కూడా జరిగింది. అప్పుడే టీమ్‌కి ఒక షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. అది సిమ్రాన్‌కి స్వీట్‌ న్యూసే. అదేమిటంటే సిమ్రాన్‌ ప్రెగ్నెంట్‌. దాంతో ఆ సినిమాను వదులుకుంది. అప్పుడా క్యారెక్టర్‌ చేసే అదృష్టం జ్యోతికకు దక్కింది. సినిమా ప్రారంభమైంది. ఎక్కువ శాతం షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది. కొంత భాగం తమిళనాడులో, రెండు పాటలు టర్కీలో షూట్‌ చేశారు. చాలా స్పీడ్‌గా షూటింగ్‌ పూర్తయింది. టోటల్‌గా సినిమాకి రూ.19 కోట్లు ఖర్చయింది.   2005 ఏప్రిల్‌ 14న ‘చంద్రముఖి’ తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసిన ఆడియన్స్‌కి దిమ్మ తిరిగిపోయింది. సినిమాలోని కంటెంట్‌, రజినీకాంత్‌, జ్యోతికల పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. ఇండియాలో రూ.45 కోట్లు కలెక్ట్‌ చెయ్యగా, వరల్డ్‌వైడ్‌గా రూ.75 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది ‘చంద్రముఖి’. తమిళనాడులోని చాలా కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. చెన్నయ్‌లోని శాంతి థియేటర్‌లో ఏకంగా 890 రోజులపాటు నిరంతరాయంగా ప్రదర్శింపబడి అందర్నీ ఆశ్చర్యపరచింది. ఈ సినిమాకిగాను రజినీకాంత్‌కు రెమ్యునరేషన్‌, లాభాల్లో వాటా మొత్తం కలిపి రూ.15 కోట్లు అందాయి. అప్పటికి అదే పెద్ద రెమ్యునరేషన్‌ అని చెప్పాలి.  ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. మలయాళంలో 1993లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘మణిచిత్రతాళు’ డివిడి మెగాస్టార్‌ చిరంజీవికి ఇచ్చి ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందని చెప్పాడు దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య. అయితే ఈ సినిమాను చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ‘చంద్రముఖి’ రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించిన తర్వాత వి.ఎన్‌.ఆదిత్యకు చిరంజీవి స్వయంగా ఫోన్‌ చేసి సినిమాపై అతనికి ఉన్న జడ్జిమెంట్‌ను మెచ్చుకున్నారు. 

ఆ ఇద్దరికీ ఇచ్చిన మాట కోసం.. 5 లక్షలు నష్టపోయిన రామానాయుడు!

సినిమా రంగంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నిర్మాత అయినా, డైరెక్టర్‌ అయినా వారు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల సాయాలు కోరతారు. కొందరికి నటించాలన్న కోరిక ఉంటుంది, కొందరికి డైరెక్షన్‌ చెయ్యాలన్న ఆశ ఉంటుంది. అలాంటి వారు అడిగినపుడు కాదనలేక ఛాన్స్‌ ఇస్తానని చెప్తారు. కానీ, అన్నీ అనుకూలించకపోవడం వల్ల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. ఇక కొందరు ఉంటారు.. చేస్తానని మాట ఇచ్చారంటే తప్పకుండా చేసి తీరతారు. అలాంటి వారిలో మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు ఒకరు. ఒకసారి అలా ఇద్దరికి మాట ఇవ్వడం వల్ల వారికి ఉపయోగం జరగకపోగా..  రామానాయుడికి రూ.5 లక్షలు నష్టం వచ్చింది. ‘సెక్రటరీ’ వంద రోజుల వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ అదే వేదికపై ఉన్న నిర్మాత రామానాయుడిని ప్రస్తావిస్తూ ‘రామానాయుడుగారి బేనర్‌లో నాలాంటి నటుడు హీరోగా నటించినా అది సూపర్‌హిట్‌ అవుతుంది’ అన్నారు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత ‘మీకు హీరోగా నటించాలని ఉంటే చెప్పండి సినిమా తీసాను’ అని కైకాలతో మాట వరసకి అన్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన మరచిపోయారు. సత్యనారాయణ మాత్రం దాన్ని మర్చిపోలేదు. పైగా పాత్రికేయులతో తాను సురేష్‌ ప్రొడక్షన్స్‌లో హీరోగా నటిస్తున్నానని చెప్పారు.  కొన్ని రోజుల తర్వాత రామానాయుడు ‘సావాసగాళ్ళు’ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ద్వారా బోయిన సుబ్బారావు దర్శకుడుగా పరిచయమయ్యారు. తమిళ హాస్య నటుడు నగేష్‌ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. బోయిన సుబ్బారావు డైరెక్షన్‌కి కొత్త కావడంతో అతనికి సలహాలు ఇవ్వడాన్ని గమనించిన రామానాయుడు.. ‘ఆయనకిది మొదటి సినిమా. కంగారు పెట్టకండి.. మీకు అంతగా ఇంట్రెస్ట్‌ ఉంటే చెప్పండి.. మీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తాను’ అని ఇక్కడ కూడా మాటవరసకే అన్నారు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నగేష్‌ రామానాయుడికి ఒక కథ వినిపించి దర్శకుడుగా అవకాశం ఇవ్వమని అడిగారు.   నటుడు సత్యనారాయణకు హీరోగా అవకాశం ఇస్తానని, నగేష్‌కి డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చినందుకు దానికి కట్టుబడి వారితో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు రామానాయుడు. ‘మొరటోడు’ పేరుతో సత్యనారాయణ హీరోగా, జయసుధ హీరోయిన్‌గా, నగేష్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టారు. 1977 డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. కానీ, విజయం సాధించలేదు. ఆ తర్వాత ‘ఆ ఇద్దరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నేను 5 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది’ అని ఓ సందర్భంలో సరదాగా అన్నారు రామానాయుడు. 

ఉత్తమనటి అవార్డు విషయంలో సావిత్రి, భానుమతి మధ్య తలెత్తిన వివాదం!

సినిమా రంగంలో అవార్డుల విషయంలో ఒక్కోసారి వివాదాలు ఏర్పడుతుంటాయి. ఆమధ్య కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అవార్డులను ఎనౌన్స్‌ చేసినపుడు వివిధ రాష్ట్రాల్లోని హీరోల అభిమానులు, హీరోల సన్నిహితులు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, అవార్డులు రాని కొన్ని భాషల నటులు టాలీవుడ్‌ హీరోలను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేసిన విషయం కూడా మనకు తెలుసు. అంతేకాదు, ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో కూడా టాలీవుడ్‌లో కొన్ని భిన్నాభిప్రాయలు వెలుగు చూశాయి.  అవార్డుల విషయంలో వివాదాలు ఏర్పడడం కొత్తేమీ కాదు. దానికి పాతతరం నటీనటులు కూడా అతీతులు కారు. 1950 దశకంలో ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరుతో మద్రాసులో ఓ సంఘం ఉండేది. ఆ సంఘం ప్రతి ఏటా సినిమా రంగంలోని వారికి అవార్డులు అందించేది. ఒక సంవత్సరం అవార్డులు ప్రకటించిన తర్వాత ఉత్తమ నటి అవార్డు విషయంలో వివాదం తలెత్తింది.  1953లో సెన్సార్‌ అయిన తెలుగు, తమిళ భాషా చిత్రాలను పోటీకి పంపారు. అందులో ‘దేవదాసు’, ‘చండీరాణి’ చిత్రాలు కూడా వున్నాయి. ఆ సినిమాలన్నీ చూసారు న్యాయ నిర్ణేతలు.  ఆ తర్వాత తెలుగులో ఉత్తమ నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు(దేవదాసు), ఉత్తమ నటిగా భానుమతి(చండీరాణి) ఎంపికైనట్టు ప్రకటించారు. అలాగే తమిళ్‌లో సావిత్రిని ఉత్తమనటిగా సావిత్రి(దేవదాసు)ని ఎంపిక చేశారు. దీంతో అందరూ షాక్‌ అయ్యారు. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మాణం జరుపుకున్నాయి.  రెండు భాషల్లో ఒకే సినిమా నిర్మాణం జరుపుకున్నప్పుడు తమిళ్‌లో మాత్రమే సావిత్రికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు తెలుగులో కూడా ఇవ్వాలిగా. ఇక భానుమతికి తెలుగులో మాత్రమే ఉత్తమనటి అవార్డు ఇవ్వడం ఏమిటి? తమిళ్‌లో కూడా ఇవ్వాలిగా. ఒకే అవార్డును ఇద్దరికి ఎలా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అలా అవార్డులను ఇద్దరికీ పంచారా? అంటూ పత్రికలు ఏకి పారేశాయి. వివిధ వార్తా పత్రికల్లో ఈ అవార్డులను ప్రస్తావిస్తూ వ్యాసాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ కథనాలకు అవార్డుల కమిటీ స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన అవార్డుల ప్రదానంలో వారు ప్రకటించిన విధంగానే అవార్డులను అందించారు. ఉత్తమనటిగా సావిత్రి అవార్డును అందుకున్నారు. ‘చండీరాణి’ చిత్రానికి ఉత్తమనటి అవార్డును అందుకోవడానికి భానుమతి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.

పోకిరి, బద్రి, చిరుత, ఆంధ్రావాలా.. వీటికి మొదట అనుకున్న టైటిల్స్‌ ఏమిటో తెలుసా?

పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్లు, డైలాగులు, కామెడీ ట్రాక్‌.. ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నింటినీ మించి అంతవరకు ఎవరూ పెట్టని టైటిల్స్‌ పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తాడు పూరి. అయితే ఇప్పటివరకు వచ్చిన పూరి సినిమాలకు మొదట వేరే టైటిల్స్‌ అనుకున్నారని, ఎన్నో డిస్కషన్స్‌ తర్వాత ఫైనల్‌గా బయటికి వచ్చిన టైటిల్స్‌ అవి అన్న విషయం చాలా మందికి తెలీదు. అలా అతని సినిమాలకు ముందు అనుకున్న టైటిల్స్‌ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. మహేష్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ రూపొందించిన ‘పోకిరి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన సినిమాగా ‘పోకిరి’ నిలిచింది. సినిమాకి ఆ రేంజ్‌ రావడానికి టైటిల్‌ కూడా ఒక కారణం అయింది. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్‌ ‘ఉత్తమ్‌సింగ్‌’.  పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయే సినిమా ‘బద్రి’. రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు ‘చెలి’. పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోకి ఆ టైటిల్‌ మరీ క్లాస్‌ అయిపోతుందని భావించిన పూరి దాన్ని ‘బద్రి’గా మార్చారు.  రామ్‌చరణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన సినిమా ‘చిరుత’. ఈ సినిమాకి మొదట ‘కుర్రాడు’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. అంతేకాదు, ‘లో క్లాస్‌ ఏరియా’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. ఈ టైటిల్‌ చిరంజీవి తనయుడికి సరిపోయేలా లేదని భావించి ‘చిరుత’నయుడు అని అర్థం వచ్చేలా ‘చిరుత’ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు.  ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నిరాశ పరచింది. ఈ సినిమాకి మొదట ‘కబ్జా’ అనే టైటిల్‌ అనుకున్నారు. చాలా రోజుల వరకు అదే టైటిల్‌తో కంటిన్యూ అయ్యారు. చివరికి ‘ఆంధ్రావాలా’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని మార్చారు.  పూరి జగన్నాథ్‌ ఎక్కువ సినిమాలు చేసింది రవితేజతోనే. ఇడియట్‌, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నేనింతే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.. ఇలా అన్నీ విభిన్నమైన టైటిల్స్‌తోనే వచ్చాయి. అయితే ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చిత్రానికి మొదట ‘జీవితం’ అనే టైటిల్‌ అనుకున్నారు. ఈ టైటిల్‌ ఎంతో నార్మల్‌ వుందని, టైటిల్‌లోనే నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ కనిపిస్తున్నాయని భావించిన పూరి దాన్ని ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’గా మార్చారు. 

నిర్మాత బంపర్‌ ఆఫర్‌.. వద్దన్న కృష్ణవంశీ.. చివరికి తను అనుకున్నదే చేశాడు!

కృష్ణవంశీ.. ఒక విలక్షణ దర్శకుడు. ఒక జోనర్‌కే పరిమితం కాకుండా రకరకాల జోనర్స్‌లో సినిమాలు తీసి మెప్పించగల సత్తా ఉన్న డైరెక్టర్‌. ‘గులాబి’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన కృష్ణవంశీకి విప్లవ భావాలతోపాటు దేశభక్తి కూడా ఎక్కువే. ఇవి ఆయన చేసిన సినిమాల్లో అక్కడక్కడా కనిపిస్తుంటాయి. తన మనసులోని భావాలతో ఒక సినిమా చెయ్యాలనే ఆలోచన అతనికి ఎప్పటి నుంచో ఉంది. గులాబి తర్వాత నిన్నేపెళ్లాడతా చిత్రాన్ని చేసి మరో సూపర్‌హిట్‌ ఇచ్చాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్‌ అవార్డు గెలుచుకుందీ చిత్రం. అలాగే ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు కృష్ణవంశీ.  తను చేయబోయే మూడో చిత్రంలోనే తన భావాలన్నీ బయటపెట్టాలని డిసైడ్‌ అయ్యాడు వంశీ. ‘సిందూరం’ పేరుతో సినిమా స్టార్ట్‌ చేశాడు. రవితేజ, బ్రహ్మాజీ హీరోలు. తన భావాలకు అనుగుణంగా ఆ సినిమాని తెరకెక్కించాడు. కానీ, ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. నిర్మాతకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాని కూడా అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్‌ అవార్డు, ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చెయ్యకుండా 5 సంవత్సరాలు గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో చంద్రలేఖ, సముద్రం, అంత:పురం, మురారి వంటి సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  2002లో మళ్లీ వంశీలోని విప్లవకారుడు, దేశభక్తుడు మేల్కొన్నాడు. ‘ఖడ్గం’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సిందూరం చిత్రానికి చేసిన పొరపాటు ఈ చిత్రానికి చెయ్యకూడదనుకున్నాడు. 1990 ప్రాంతంలో ముంబాయిలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సినిమా తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వంశీ ‘ఖడ్గం’తో అది నెరవేర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం ఎంతో అధ్యయనం చేశాడు. ఉగ్రవాదుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు జైలులో ఉన్న కొందరు ఖైదీలతో చర్చించాడు. ఈసారి తన భావాలతోపాటు కమర్షియాలిటీని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా జోడిరచి పక్కా స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు.  ఇక ఇందులోని నటీనటుల ఎంపికలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక ముస్లిం క్యారెక్టర్‌కి ప్రకాశ్‌రాజ్‌, సినిమాల్లో ఒక్క ఛాన్స్‌ కోసం పరితపించే క్యారెక్టర్‌లో రవితేజను ఎంపిక చేసుకున్నాడు. ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ కోసం శ్రీకాంత్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాడు. అయితే శ్రీకాంత్‌ను ఆ క్యారెక్టర్‌ కోసం తీసుకోవడం నిర్మాత మధుమురళికి ఇష్టంలేదు. అయినా శ్రీకాంత్‌ను ఆఫీస్‌కి పిలిపించాడు వంశీ. ‘ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ ఉంది. నిన్ను దాని కోసం తీసుకుందాం అనుకున్నాను. కానీ, మధుకి నిన్ను తీసుకోవడం ఇష్టం లేదు’ అని ఓపెన్‌గా చెప్పేశాడు. అక్కడే ఉన్న మధుమురళి ‘ఇప్పటివరకు మీరు చేసినవి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. మీకు ఈ క్యారెక్టర్‌ సూట్‌ అవ్వదని నా ఒపీనియన్‌’ అని శ్రీకాంత్‌కి చెప్పాడు. కృష్ణవంశీ మాత్రం తన పట్టు వదల్లేదు. దానికి నిర్మాత మధు ‘ఈ సినిమాలో శ్రీకాంత్‌ని తీసుకోకపోతే నీకు రెండు కోట్లు ఇస్తాను’ అని వంశీ ముందు బంపర్‌ ఆఫర్‌ ఉంచాడు. దానికి వంశీ లొంగలేదు. తను అనుకున్నదే చేశాడు. శ్రీకాంత్‌నే ఆ క్యారెక్టర్‌ కోసం తీసుకున్నాడు. సినిమా పూర్తయింది. అద్భుతంగా వచ్చింది. ‘ఖడ్గం’ సినిమాపై ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నాడు వంశీ. సినిమా రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయి అతని నమ్మకాన్ని నిలబెట్టింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు, ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు కృష్ణవంశీ.  వినడానికి చాలా చిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఏ హీరోకైనా, ఏ హీరోయిన్‌కైనా వారి తొలి సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వారి మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాధారణంగా కొత్త హీరోకి జంటగా మరో కొత్త హీరోయిన్‌ని తీసుకోవడం జరుగుతుంటుంది. లేదా ఆ హీరో కంటే రెండు మూడు సినిమాలు సీనియర్‌ అయి వుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ 100 సినిమాలు పూర్తి చేసిన హీరోయిన్‌తో నటించాల్సి వస్తే.. ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఇది హీరో కృష్ణంరాజు విషయంలో జరిగింది. ఆయన తొలి సినిమా ‘గువ్వా గోరింక’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు రెండు సంవత్సరాలు ఎంతో కృషి చెయ్యాల్సి వచ్చింది. ‘బావామరదళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో మద్రాస్‌ రైలెక్కిన కృష్ణంరాజు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు ప్రత్యగాత్మ అతనికి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, తాను సొంతంగా నిర్మించే సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. అయితే కృష్ణంరాజుకి అసలు నటనలో ప్రవేశం లేదు, నాటకాలు వేసిన అనుభవం లేదు. తను సినిమా చేసేందుకు కొంత టైమ్‌ పడుతుందని, అప్పటివరకు నాటకాలు వేసి అనుభవం సంపాదించమని సూచించారు ప్రత్యగాత్మ. ఆయన చెప్పినట్టుగానే నాటకాలు వేస్తూ మంచి అనుభవం సంపాదించారు కృష్ణంరాజు. అప్పుడప్పుడు షూటింగ్‌లకు వెళుతూ కెమెరా ముందు ఎలా నటించాలి అనే విషయాల్లో మెళకువలు తెలుసుకున్నారు.  1965 ఆగస్ట్‌ 6న ప్రత్యగాత్మ తన కొత్త సినిమా ‘గువ్వా గోరింక’ ప్రారంభించారు. కృష్ణంరాజు హీరో, కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ కాంబినేషన్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే కృష్ణకుమారి 100 సినిమాలు పూర్తి చేసిన సీనియర్‌ హీరోయిన్‌. అంతకుముందు ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అందుకే కొత్త హీరోతో అయినా నటించేందుకు ఆమె ఒప్పుకున్నారు. తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణంరాజుకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో కళాత్మక ధోరణి, వాపారాత్మక ధోరణి రెండూ ఉండడం వల్ల విజయం సాధించలేదు. అయితే ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందించింది. 

ఆ హీరోకి తొలి సినిమా.. ఆ హీరోయిన్‌కి మాత్రం అది 100వ సినిమా!

వినడానికి చాలా చిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఏ హీరోకైనా, ఏ హీరోయిన్‌కైనా వారి తొలి సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వారి మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాధారణంగా కొత్త హీరోకి జంటగా మరో కొత్త హీరోయిన్‌ని తీసుకోవడం జరుగుతుంటుంది. లేదా ఆ హీరో కంటే రెండు మూడు సినిమాలు సీనియర్‌ అయి వుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ 100 సినిమాలు పూర్తి చేసిన హీరోయిన్‌తో నటించాల్సి వస్తే.. ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఇది హీరో కృష్ణంరాజు విషయంలో జరిగింది. ఆయన తొలి సినిమా ‘చిలకా గోరింకా’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు రెండు సంవత్సరాలు ఎంతో కృషి చెయ్యాల్సి వచ్చింది. ‘బావామరదళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో మద్రాస్‌ రైలెక్కిన కృష్ణంరాజు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు ప్రత్యగాత్మ అతనికి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, తాను సొంతంగా నిర్మించే సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. అయితే కృష్ణంరాజుకి అసలు నటనలో ప్రవేశం లేదు, నాటకాలు వేసిన అనుభవం లేదు. తను సినిమా చేసేందుకు కొంత టైమ్‌ పడుతుందని, అప్పటివరకు నాటకాలు వేసి అనుభవం సంపాదించమని సూచించారు ప్రత్యగాత్మ. ఆయన చెప్పినట్టుగానే నాటకాలు వేస్తూ మంచి అనుభవం సంపాదించారు కృష్ణంరాజు. అప్పుడప్పుడు షూటింగ్‌లకు వెళుతూ కెమెరా ముందు ఎలా నటించాలి అనే విషయాల్లో మెళకువలు తెలుసుకున్నారు.  1965 ఆగస్ట్‌ 6న ప్రత్యగాత్మ తన కొత్త సినిమా ‘చిలకా గోరింకా’ ప్రారంభించారు. కృష్ణంరాజు హీరో, కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ కాంబినేషన్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే కృష్ణకుమారి 100 సినిమాలు పూర్తి చేసిన సీనియర్‌ హీరోయిన్‌. అంతకుముందు ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అందుకే కొత్త హీరోతో అయినా నటించేందుకు ఆమె ఒప్పుకున్నారు. తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణంరాజుకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో కళాత్మక ధోరణి, వాపారాత్మక ధోరణి రెండూ ఉండడం వల్ల విజయం సాధించలేదు. అయితే ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందించింది. 

చిరు, నాగ్‌, వెంకీలతో మల్టీస్టారర్‌ ప్లానింగ్‌.. బ్యాడ్‌లక్‌ డిజాస్టర్‌ అయింది!

ఒకప్పటి హీరోలు, వారి అభిమానుల ఆలోచనా ధోరణి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ఒకప్పుడు మల్టీస్టారర్‌ సినిమా చెయ్యాలంటే డైరెక్టర్లకు రిస్క్‌ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆయా హీరోల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చెయ్యాలి. సినిమా చేస్తున్నన్ని రోజులు వారిని అన్నివిధాలా శాటిస్‌ఫై చెయ్యాలి. అన్నింటినీ మించి సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మల్టీస్టారర్స్‌ చేసేవారు. పాతతరంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు.. వీళ్ళంతా మల్టీస్టారర్స్‌ చేశారు. కానీ, ఏరోజూ ఆయా హీరోల అభిమానులు గొడవ చేయలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు మల్టీస్టారర్‌ అనే మాటే లేకుండా సినిమాలు వచ్చాయి. మధ్యతరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో మల్టీస్టారర్‌ చేసే అవకాశం రాలేదు.  90వ దశకంలో కొందరు అగ్ర దర్శకనిర్మాతలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఒక మల్టీస్టారర్‌ చేసేందుకు ప్రయత్నించారు. 1989లో వచ్చిన ‘త్రిదేవ్‌’ అనే బాలీవుడ్‌ మల్టీస్టారర్‌ను సన్ని డియోల్‌, జాకీష్రాఫ్‌, నసీరుద్దీన్‌ షా హీరోలుగా రాజీవ్‌ రాయ్‌ రూపొందించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు, బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో చేస్తే బాగుంటుందని ఓ అగ్రనిర్మాణ సంస్థ విపరీతంగా ప్రయత్నించింది. ఈ కథ ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపోయేలా ఉండడం, ముగ్గురి పాత్రలకు కూడా సరైన ప్రాధాన్యం ఉండడంతో తెలుగులో కూడా సూపర్‌హిట్‌ అవుతుందని భావించారు ఆ నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌ గురించి ముగ్గురు హీరోలతో చర్చలు కూడా జరిగాయన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ మల్టీస్టారర్‌ చేసేందుకు ఆ ముగ్గురు హీరోలు అంగీకరించలేదా? లేక అలాంటి టాలెంట్‌ ఉన్న దర్శకుడు దొరకలేదో తెలీదుగానీ ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సుమన్‌, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌లతో ‘నక్షత్ర పోరాటం’  పేరుతో రీమేక్‌ చేశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ మల్టీస్టారర్‌ చెయ్యాలన్న ఆలోచన చేయలేదు. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్‌, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మల్టీస్టారర్‌ ట్రెండ్‌ స్ట్టార్ట్‌ అయింది. 

సెన్సేష‌న‌ల్ యాక్ట్రెస్‌ దివ్య‌భార‌తి మృతి ఇప్పటికీ మిస్టరీనే!

దివ్య ఓంప్ర‌కాశ్ భార‌తి అంటే ఎవ‌రా అని ఆలోచన‌లో ప‌డొచ్చు. అదే.. దివ్య‌భార‌తి అంటే ఠ‌క్కున మ‌న‌కు ‘బొబ్బిలి రాజా’, ‘అసెంబ్లీ రౌడీ’ హీరోయిన్ గుర్తుకొచ్చేస్తుంది. కేవ‌లం మూడంటే మూడు సంవ‌త్స‌రాల కెరీర్‌లో సౌత్‌, నార్త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అగ్ర తార‌గా రాణించి, జూనియ‌ర్ శ్రీ‌దేవిగా గుర్తింపు పొంది, పందొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సుకే.. త‌ను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కింద‌ప‌డిపోయి ఆక‌స్మికంగా అసువులు బాసి, దేశాన్నంతా బిగ్ షాక్‌కు గురి చేసింది దివ్య‌భార‌తి. ఆ వార్త‌తో ఎంత‌మంది కుర్ర‌కారు గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయో!  త‌న అందంతో, త‌న పాత్ర‌ల‌తో ఎంత‌గా మీడియా దృష్టిలో ప‌డిందో, అంత‌కంటే ఎక్కువ‌గా త‌న మ‌ర‌ణంతో ఆమె ఆ మీడియాలో నానింది. దివ్య‌భార‌తి వ్య‌క్తిగ‌త జీవితం గురించి అప్పుడే చాలామందికి తెలిసింది. అయిన‌ప్ప‌టికీ నేటి ప్రేక్ష‌కుల్లో ఎక్కువ‌మందికి ఆమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ సాజిద్ న‌దియ‌డ్‌వాలాను వివాహం చేసుకుంద‌నే విష‌యం తెలియ‌దు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని కుటుంబంలో 1974, ఫిబ్రవరి 25న జ‌న్మించింది దివ్య‌. సినీ హీరోయిన్ కావ‌డ‌మ‌నేది ఆమెకు సుదూర క‌ల‌. కానీ టీనేజ్‌లోకి అడుగు పెట్టిన ఏడాదికే, అంటే 14 ఏళ్ల వ‌య‌సులో ఆమె నిర్మాత నందు తొలానీ దృష్టిలో ప‌డింది. ఆమెను చూసీ చూడ‌గానే, వెంట‌నే త‌న సినిమాల్లోకి ఆమెను తీసుకోవాల‌ని ఆయ‌న అనుకున్నాడు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది కానీ ఇత‌ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డింది దివ్య‌. అదీ ఓ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దృష్టిలో. ఆయ‌న సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌ల్లో ఒక‌రైన డి. సురేశ్‌బాబు. వెంక‌టేశ్ స‌ర‌స‌న‌ ‘బొబ్బిలి రాజా’ (1990)లో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా తెరంగేట్రం చేసింది దివ్య‌. ఆమెలో శ్రీ‌దేవిని చూసుకున్నారు జ‌నం. త‌న అపురూప సౌంద‌ర్య విలాసంతో, ముచ్చ‌టైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేసింది ప‌ద‌హారేళ్ల ప‌డుచు దివ్య‌. ఆ త‌ర్వాత తెలుగులో చ‌క‌చ‌కా రౌడీ అల్లుడు, నా ఇల్లే నా స్వ‌ర్గం, అసెంబ్లీ రౌడీ సినిమాలు చేసింది. అప్పుడు స‌న్నీ డియోల్‌తో ‘విశ్వాత్మ’ (1992)లో హీరోయిన్‌గా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది ఆమె తొలి హిందీ చిత్రం. అది చెప్పుకోద‌గ్గ రీతిలో ఆడ‌క‌పోయినా, అందులో చేసిన “సాత్ స‌ముంద‌ర్” సాంగ్‌తో ఆమె అక్క‌డ సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. అప్ప‌ట్లో అది హిందీ ఆడియెన్స్ అందరి ఫేవ‌రేట్ సాంగ్‌. ఇప్ప‌టికీ ఆ పాట‌ను హ‌మ్ చేసుకుంటూనే ఉంటారు. 1992లోనే ఆమె 12 సినిమాలు చేసిందంటే ఆమె గిరాకీ ఏ రేంజిలో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. వాటిలో రెండు తెలుగు సినిమాలు.. ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధ‌ర్మ‌క్షేత్రం’ ఉన్నాయి. ఆ త‌ర్వాత ఆమె అనేక సినిమాల‌కు సంత‌కం చేసింది. కేవ‌లం మూడేళ్ల కాలంలోనే ఆమె 21 సినిమాలు చేస్తే, దాదాపు మ‌రో 30 సినిమాల‌కు ఆమె సంత‌కం చేసింద‌ని స‌మాచారం! హిందీలో దివ్యభార‌తి చేసిన రెండో సినిమా ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్‌’. దాని హీరో గోవిందా. సాజిద్ న‌దియ‌డ్‌వాలా అప్పుడే ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేక‌ర్‌గా త‌న బ్యాన‌ర్‌ను మొద‌లుపెట్టి, ‘జుల్మ్ కీ హుకుమ‌త్’ సినిమా నిర్మిస్తున్నాడు. అందులోనూ గోవిందానే హీరో. స‌హ‌జంగానే ఈ రెండు సినిమాల షూటింగ్‌లు క్లాష్ అయ్యాయి.   గోవిందాను క‌లుసుకోవ‌డానికి ఓసారి ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్’ సెట్స్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు సాజిద్‌. త‌న జీవితాన్ని ఆ రోజు మార్చేస్తుంద‌ని అత‌డు ఊహించ‌లేదు. అక్క‌డ దివ్య‌భార‌తిని చూడ‌గానే క‌ళ్లు తిప్పుకోలేక‌పోయాడు సాజిద్‌. 26 సంవ‌త్స‌రాల అత‌డు తొలిచూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డిపోయాడు.   ఆ రోజు ప‌రిచ‌యం త‌ర్వాత‌, ఇక ప్ర‌తిరోజూ ఆమె కోసం అక్క‌డికి రావ‌డం మొద‌లుపెట్టాడు. మొద‌ట స్నేహం కుదిరింది. రోజులు గ‌డిచేకొద్దీ గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకోవ‌డం సాధార‌ణ‌మైంది. దాంతో ఒక‌రిమీద ఒక‌రికి మ‌న‌సైంది. త‌మ మ‌ధ్య ప్రేమ కుదిరింద‌ని తెలుసుకున్నారు. కానీ దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. ఇద్ద‌రివీ భిన్న మ‌తాల నేప‌థ్యాలైన‌ప్ప‌టికీ, దివ్య కెరీర్ అప్పుడ‌ప్పుడే మొద‌లైన‌ప్ప‌టికీ, సాజిద్ ఇంకా పూర్తి స్థాయిలో నిల‌దొక్కుకోన‌ప్ప‌టికీ, 1992లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. నిజానికి దివ్య మేజ‌ర్ అవ‌డం కోసం వారు ఎదురు చూశారు. ఆమెకు ప‌ద్దెనిమిదేళ్లు నిండ‌గానే మే 10న మ్యారేజ్ చేసుకున్నారు. సాజిద్ కోసం దివ్య ఇస్లాం మ‌తంలోకి మారి, త‌న పేరును స‌న న‌దియ‌డ్‌వాలాగా పేరు కూడా మార్చుకుంది. పెళ్ల‌య్యాక కూడా వారు దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం మాత్రం కొన‌సాగుతూ వ‌చ్చింది. త‌ను ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో సాజిద్‌తో త‌న‌కు స‌న్నిహిత బంధం ఉంద‌ని చెప్తూనే పెళ్లయ్యింద‌నే విష‌యాన్ని చెప్ప‌కుండా దాట‌వేస్తూ వ‌చ్చింది దివ్య‌. కాక‌పోతే 1994లో ఓ బిగ్ న్యూస్ చెబుతాన‌ని మాత్రం హింట్ ఇచ్చింది.   కానీ ఆ బిగ్ న్యూస్‌ను అనౌన్స్ చేయ‌డానికి ఆమె బ‌తికి లేదు. ఎందుకంటే.. 1993 ఏప్రిల్ 5నే త‌న అపార్ట్‌మెంట్ నుంచి ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి తీవ్ర గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఆమె అర్ధంత‌ర మ‌ర‌ణం అనేక అనుమానాల‌కు, వివాదాల‌కు తావిచ్చింది. ఆ దుర్ఘ‌ట‌న వెనుక సాజిద్ ఉన్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ అవి ధ్రువీక‌ర‌ణ కాలేదు. ఇప్ప‌టికీ దివ్య‌భార‌తి మృతి ఒక మిస్ట‌రీ. దివ్య మ‌ర‌ణంతో సాజిద్ గుండె ప‌గిలింది. అప్ప‌ట్నుంచీ త‌ను నిర్మించిన సినిమాల‌ను ఆమెకు అంకితం ఇస్తూ వ‌చ్చాడు. వార్దా ఖాన్ అనే జ‌ర్న‌లిస్ట్‌ను మ్యారేజ్ చేసుకొనే దాకా అత‌డు ఆ అల‌వాటును కొన‌సాగించాడు. ఇప్ప‌టికీ సాజిద్ వాలెట్‌లో దివ్య‌భార‌తి ఫొటో ఉంటుంద‌ని వార్దా ఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించడం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. (ఫిబ్రవరి 25- దివ్య‌భార‌తి జయంతి)

జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని మొదట చెప్పిన హీరో ఎవరో తెలుసా?

జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే రాజకీయ నాయకురాలిగా సుపరిచితమే. అంతకుముందు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించి సినీరంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయలలిత మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. ఫిబ్రవరి 24 జయలలిత జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం.  హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో జయలలితకు రాజకీయాల పట్ల అవగాహన లేదు. అసలు రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక కూడా ఆమెకు లేదు. ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగింది. జయలలిత రాజకీయాల్లోకి వెళుతుంది అని అందాల నటుడు శోభన్‌బాబు ఓ సందర్భంలో అన్నారు. అసలు శోభన్‌బాబు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. శోభన్‌బాబు, జయలలిత ఎంతో అభిమానంగా ఉండేవారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరోజుల్లోనే జయలలిత ఒక కాస్ట్‌లీ గిఫ్ట్‌ని శోభన్‌బాబుకి ఇచ్చింది. అదేమిటంటే.. రూ.25 లక్షల విలువ చేసే డైమండ్‌ రింగ్‌. సరిగ్గా అలాంటి రింగే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కి కూడా ఆమె ఇచ్చారు. శోభన్‌బాబు అంటే జయలలితకు అంత ఇష్టం. అతనికి ఎలాంటి ఫుడ్‌ ఇష్టమో తెలుసుకొని అవన్నీ తెచ్చి పెట్టేది. అంత సన్నిహితంగా ఉండే జయలలిత, శోభన్‌బాబు ఓ సందర్భంలో ఓ పందెం వేసుకోవాల్సి వచ్చింది.  అదేమిటంటే.. నువ్వు నటి కాకపోయి ఉంటే ఏమై ఉండేదానివి అని శోభన్‌బాబు.. జయలలితను అడిగారు. దానికామె.. సరే మీరు చెప్పండి అని శోభన్‌బాబుని అడిగింది. దానికాయన ఏముంది అందరు చెప్పినట్టుగానే యాక్టర్‌ కాకపోతే డాక్టర్‌ అయివుండేదాన్ని అని చెబుతావు అన్నారు. అది కాదు, వేరే ఉంది అని చెప్పింది. అంతకుమించి ఏమీ ఉండదని శోభన్‌బాబు వాదించారు. అయితే వెయ్యి రూపాయలు పందెం అనుకున్నారు. ఓ మూడు రోజులు గడిచిన తర్వాత ఒక పుస్తకం తీసుకొచ్చారు జయలలిత. తను మూడో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ సావనీర్‌ అది. అందులో తను రాసిన మాటలని చూపించింది. అది చూసి శోభన్‌బాబు షాక్‌ అయ్యారు. అందులో.. నేను పెద్దయ్యాక రామ్‌ జెఠ్మలాని అంతటి పెద్ద పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అవుతాను అని రాసి ఉంది. అది చదివిన తర్వాత తాను ఓడిపోయానని ఒప్పుకున్నారు శోభన్‌. ఇది తీసుకొచ్చి చూపించడానికే ఆ సమాధానం నా నోటినుంచే చెప్పించావన్నమాట అంటూ సరదాగా అన్నారు. అంతటితో ఆగకుండా.. ‘నీది పెద్ద రాజకీయమే.. భవిష్యత్తులో రాజకీయ నాయకురాలు అయ్యేంత తెలివితేటలు నీకు ఉన్నాయి’ అని శోభన్‌బాబు అన్నారు. ఆయన అలా ఎందుకు అన్నారో తెలీదు గానీ, ఆ తర్వాతి రోజుల్లో జయలలిత రాజకీయాల్లో చక్రం తిప్పి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. 

ఒకే కథతో పి.పుల్లయ్య రెండు సినిమాలు చేస్తే హిట్‌.. అదే కథతో ఎన్టీఆర్‌ తీస్తే ఫ్లాప్‌!

1939లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా సీఎస్‌ఆర్‌, పద్మావతిగా శాంతకుమారి నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ పేరుతోనే మళ్ళీ రూపొందించారు పి.పుల్లయ్య. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా ఎన్‌.టి.రామారావు నటించగా, పద్మావతిగా సావిత్రి నటించారు. ఇక విశేషం ఏమిటంటే 1939లో వచ్చిన ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రంలో పద్మావతిగా నటించిన శాంతకుమారి ఈ సినిమాలో వకుళాదేవిగా తల్లి పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాలూ మంచి ఘనవిజయాన్ని సాధించాయి.  ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు 1979లో ఇదే సినిమాని మళ్లీ చెయ్యాలన్ని ప్రయత్నించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చేసిన ఆ రెండు సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. అదే కలర్‌లో చేసే ఇంకా బాగా ఆడుతుందని భావించిన ఎన్టీఆర్‌ తనే దర్శకనిర్మాతగా ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ పేరు అదే సినిమాను మళ్ళీ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు వేంకటేశ్వరుడిగా, పద్మావతిగా జయప్రద, లక్ష్మీదేవిగా జయసుధ నటించారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ నారదుడి పాత్ర పోషించారు. ఇంతటి భారీ తారాగణంతో రంగుల్లో నిర్మించిన ఈ సినిమా విజయం సాధించలేదు. అంతకుముందు వచ్చిన రెండు సినిమాలే ప్రేక్షకుల మదిలో ఉండడం వల్ల ఈ సినిమాకి ఆదరణ లభించలేదు. 

రావుగోపాలరావు చెయ్యాల్సిన క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుకి దక్కింది.. దశ తిరిగింది!

సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లు వారి కోసమే పుట్టాయా అన్నంత కరెక్ట్‌గా ఆయా నటీనటులకు సరిపోతాయి. ఇక కొన్ని క్యారెక్టర్స్‌ ఒక నటుడు చెయ్యాల్సి ఉంటే.. అటు తిరిగి ఇటు తిరిగి మరొకరికి ఆ అవకాశం దక్కుతూ ఉంటుంది. అలాంటి ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుని వరించింది. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహనా పెళ్ళంట’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమాలోని హాస్యం అంతగా ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. ముఖ్యంగా  లక్ష్మీపతిగా కోట శ్రీనివాసరావు, అరగుండుగా బ్రహ్మానందం పండిరచిన కామెడీ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. వీరిద్దరూ ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్‌ అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. ఈ సినిమా అంతటి ఘనవిజయం సాధించిందంటే దానికి కారణం కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  వాస్తవానికి లక్ష్మీపతి క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుకి ఒక వరంలా లభించిందనే చెప్పాలి. మొదట ఈ కథ అనుకున్నప్పుడు లక్ష్మీపతి క్యారెక్టర్‌ని రావుగోపాలరావుతో చేయించాలనుకున్నారు. అప్పటికే కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన ‘మండలాదీశుడు’ సినిమాను చూసి కోట అయితేనే క్యారెక్టర్‌కి న్యాయం జరుగుతుందని భావించారు జంధ్యాల. ఇదే విషయాన్ని నిర్మాత రామానాయుడుతో చెప్పారు. దానికాయన ఒప్పుకోలేదు. రావుగోపాలరావు అయితేనే బాగుంటుందని ఆయన భావించారు. జంధ్యాల మాత్రం కోటకే ఫిక్స్‌ అయ్యారు. మొత్తానికి రామానాయుడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ క్యారెక్టర్‌ను కోట శ్రీనివాసరావుతో చేయించేందుకు ఆయన్ని ఒప్పించారు. అయితే ఈ విషయాన్ని కోటకు వెంటనే చెప్పలేదు జంధ్యాల.  ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు స్వయంగా ఒకసారి ప్రస్తావించారు. ‘నేను చెన్నయ్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాను. అక్కడ ఓచోట రామానాయుడు కూర్చొని ఉన్నారు. అప్పటికి నటుడుగా నాకు అంత గుర్తింపు లేదు. అలాంటిది ఆయన ముందు కూర్చునేందుకు సంశయించాను. అప్పుడు ఆయనే నన్ను పిలిచి జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్‌ చేశామయ్యా. ఈరోజే ఫైనల్‌ అయింది. అందులో ఒక మంచి క్యారెక్టర్‌ ఉంది. అది వర్కవుట్‌ అయితే సినిమా చాలా పెద్ద హిట్‌ అయిపోతుంది. దాన్ని రావుగోపాలరావుతో చేయించాలనుకున్నాను. జంధ్యాల మాత్రం నీతోనే చేయిస్తానని పట్టుపట్టాడు. కాబట్టి నువ్వే ఆ క్యారెక్టర్‌ చేద్దువుగాని. నాకు నీ డేట్స్‌ 20 రోజులు కావాలి అని అడిగారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. సంతోషంగా చేస్తానని చెప్పాను. ఆ క్యారెక్టర్‌ను నాతోనే చేయించాలని జంధ్యాల ఎందుకు అనుకున్నారోగానీ, నా కెరీర్‌ని ఒక మలుపు తిప్పింది ఆ సినిమా’ అని గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు. 

ఎస్‌.పి.బాలు, యద్దనపూడి సులోచనారాణి జంటగా బాపు సినిమా!

గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. తన గాన మాధుర్యంతో అందరికీ మధురానుభూతిని పంచిన గాయకుడు.  యద్దనపూడి సులోచనారాణి.. తన రచనలతో వేలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న రచయిత్రి. ఆమె రచించిన నవలల ఆధారంగా తెలుగులో ఎన్నో సినిమాలు రూపొందాయి. పాత తరంలో యద్దనపూడి రచనలకు ఎంతో ఆదరణ ఉండేది.  ఈ ఇద్దరూ జంటగా సినిమా అనేది చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, దర్శకుడు బాపు ఆ ఆలోచన చేశారు. 1967లో ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన బాపు 1968లో తన రెండో సినిమాని ప్లాన్‌ చేశారు. 1967లో విడుదలైన ‘త్రీ బైట్స్‌ ఆఫ్‌ ది యాపిల్‌’ అనే అమెరికన్‌ కామెడీ సినిమా ప్రేరణతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌  మొదలుపెట్టారు. దానికి ‘బంగారు పిచిక’ అనే టైటిల్‌ని పెట్టి కొత్తవారిని హీరో, హీరోయిన్‌గా పరిచయం చెయ్యాలనుకున్నారు. హీరోయిన్‌ అనే స్పెషల్‌ లక్షణాలు లేకుండా సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని సంప్రదించారు. అయితే తనకు నటన తెలియదని, నటించే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు.  1966లో నేపథ్యగాయకుడిగా పరిచయమైన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఆ సమయంలో ‘మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలోని ఓ ఫంక్షన్‌లో పాట పాడే సన్నివేశం ఉంది. ఆ వేషాన్ని బాలసుబ్రహ్మణ్యంతోనే చేయించారు. పాట పాడుతూ తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు బాలు. దాంతో అతను హీరోగా నటించే అవకాశం కూడా ఉందని భావించిన బాపు ‘బంగారు పిచిక’ గురించి చెప్పారు. కానీ, బాలు ఆ సినిమాలో హీరోగా నటించేందుకు ఒప్పుకోలేదు.  అలా బాలు, సులోచనారాణి తిరస్కరించడంతో చంద్రమోహన్‌, విజయనిర్మలతో ‘బంగారు పిచిక’ చిత్రాన్ని రూపొందించారు. ఇదే సినిమాని 1994లో నరేష్‌, దివ్యవాణి జంటగా ‘పెళ్లికొడుకు’ పేరుతో తీశారు బాపు. కానీ, ఈ సినిమా విజయం సాధించలేదు. 

భార్య కోసం పోలీస్‌ గెటప్‌ వేసుకున్న ఈ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

ప్రతి మనిషికీ తన పెళ్ళి విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. తనకు కాబోయే జీవితస్వామి ఎలా ఉండాలి అనే దానిలో ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మనం అనుకున్నట్టుగా జీవితంలో ఏదీ జరగదు అని తెలిసినా మన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తాం. పెళ్లి విషయంలో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అని బాధపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సతీమణి కూడా ఉంది. పెళ్లికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఆమెకు కొన్ని అభిరుచులు ఉన్నాయి. వాటిలో ఒకటి తన భర్త పోలీస్‌ ఆఫీసర్‌ అయి ఉండాలని. కానీ, సంగీత దర్శకుడు భర్తగా వచ్చాడు.  ఒక సందర్భంలో కీరవాణి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘పోలీస్‌ ఆఫీసర్స్‌గా పనిచేసేవారంటే నా భార్యకు ఎంతో గౌరవం, ఇష్టం. పెళ్లికి ముందు ఒక పోలీస్‌ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఒకసారి మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ విషయంలో ఎంతో నిరాశగా ఉన్న నా భార్యకు కాస్తయినా సంతోషాన్ని కలిగించాలని నిర్ణయించుకున్నాను. నేను పోలీస్‌ ఆఫీసర్‌ని కాకపోయినా కనీసం ఆ గెటప్‌ వేసుకొని ఆమె మొహంలో సంతోషాన్ని చూడాలనుకున్నాను. వెంటనే ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్‌లో పనిచేసే మల్లికార్జునరావు అనే మేకప్‌మేన్‌కి విషయం చెప్పాను. ఆయన పోలీస్‌ డ్రెస్‌ కుట్టి ఇచ్చాడు. అంతేకాదు, ఆ యూనిఫామ్‌ వేసుకున్న తర్వాత మేకప్‌ కూడా చేశారు. ఆ గెటప్‌తో వెళ్ళి నా భార్యకు షాక్‌ ఇవ్వాలన్నది నా ఆలోచన. ఎలాగూ యూనిఫామ్‌ వేసుకున్నాను కదా అని పక్క గదిలోనే ఉన్న రాఘవేంద్రరావుగారి దగ్గరకు వెళ్లాను. నన్ను ఆ గెటప్‌లో చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఫోటోలు కూడా తీయించారు. ఆ గెటప్‌లో ఉన్న నాకు నటించాలని కూడా అనిపించి ఏదైనా పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ ఉంటే ఇవ్వమని ఆయన్ని అడిగాను. అప్పుడు నాకు ‘ఘరానా బుల్లోడు’ స్టోరీ చెప్పారు రాఘవేంద్రరావుగారు. అందులో ఇన్‌స్పెక్టర్‌ వేషం ఉందని, అది నన్నే చెయ్యమని చెప్పారు. అప్పుడు అదే గెటప్‌తో వెళ్ళి నా భార్యను సర్‌ప్రైజ్‌ చేశాను. ‘ఘరానా బుల్లోడు’ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే టైమ్‌కి నేను రికార్డింగ్స్‌తో బాగా బిజీ అయిపోయాను. రాఘవేంద్రరావుగారు ఇచ్చిన పోలీస్‌ వేషం వెయ్యలేకపోయాను’ అని తెలిపారు కీరవాణి. 

కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక అసలు సీక్రెట్.. ఎన్టీఆర్ కాస్ట్యూమర్‌ పనే!

వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ.. టాలీవుడ్ కి ఎన్నో మరపురాని హిట్లు ఇచ్చారు. కోడి రామకృష్ణ పేరు వినగానే 'దేవుళ్ళు', 'దేవి', 'అరుంధతి', 'అంకుశం', 'మంగమ్మ గారి మనవడు' ఇలా ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఆయన పేరు వినగానే ఆయన హిట్ సినిమాలు మాత్రమే కాదు మరొకటి కూడా గుర్తుకొస్తుంది. అదే ఆయన నుదుటిపై ఉండే బ్యాండ్. ఆయన ఎప్పుడూ బ్యాండ్ కట్టుకునే కనిపిస్తారు. అసలు ఆయనకు ఆ బ్యాండ్ కట్టుకోవడం ఎలా అలవాటు అయిందో తెలుసా?. ఆయన రెండో సినిమా 'తరంగిణి' షూటింగ్‌ కోవలం బీచ్‌ దగ్గర జరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ బాగా ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ కాస్ట్యూమర్‌ మోకా రామారావు అక్కడికి వచ్చి.. ‘మీ నుదురు విశాలంగా ఉంది. ఎండ ఎక్స్‌పోజర్‌ అవుతుంది.’ అంటూ ఒక జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమన్నారు. అలా కోడి రామకృష్ణ ఆరోజంతా రుమాలు కట్టుకొని ఉన్నారు.  మరుసటి రోజు షూటింగ్ ప్రారంభమైంది. మళ్ళీ మోకా రామారావు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి రుమాలుని బ్యాండ్‌లా తయారుచేసుకుని తెచ్చి.. "దీనికి మీకు ఏదో బంధం ఉందండి. అందరికీ మ్యాచ్‌ అవ్వదు. మీకు బాగా సూటయింది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు" అంటూ కోడి రామకృష్ణకు ఇచ్చారు. అప్పట్నుంచి షూటింగ్‌ టైమ్‌లో బ్యాండ్‌ కట్టుకోవడం ఆయనకు అలవాటు అయింది. తరువాత అదే సెంటిమెంట్‌ గా మారిపోయింది. (ఫిబ్రవరి 22 - కోడి రామకృష్ణ వర్ధంతి)

బాల‌కృష్ణ - కోడి రామ‌కృష్ణ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ ఎందుకు బ్రేక్ అయ్యింది?

ప్రస్తుతం నందమూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌కు టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. వీరి కలయికలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు బోయ‌పాటి లాగే గ‌తంలో కోడి రామ‌కృష్ణ‌తో బాల‌కృష్ణ కాంబినేష‌న్‌కు తిరుగులేద‌నే పేరు వ‌చ్చింది. బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ అన‌గానే 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు', 'ముద్దుల కృష్ణ‌య్య‌', 'మువ్వ‌గోపాలుడు', 'ముద్దుల మావ‌య్య' లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అయితే ఆ త‌ర్వాత‌ హ‌ఠాత్తుగా వారి కాంబినేష‌న్ ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికీ భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత యస్‌. గోపాల్‌రెడ్డి నిర్మాత‌. ఆ త‌ర్వాత కూడా ఈ ముగ్గురూ క‌లిసి ఓ జాన‌ప‌ద సినిమా మొద‌లుపెట్టారు కానీ, అనుకోకుండా అది స‌గం షూటింగ్ త‌ర్వాత‌ ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్‌రెడ్డి కానీ, కోడి రామ‌కృష్ణ కానీ మ‌న మ‌ధ్య లేరు. అయితే బాల‌కృష్ణను అగ్ర‌హీరోగా మార్చిన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన కోడి రామ‌కృష్ణ‌తో బాల‌య్య మ‌ళ్లీ ఎందుకు సినిమా చెయ్య‌లేద‌నే ప్ర‌శ్న చాలా మందిలో ఉండిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్ర‌శ్న‌కు కోడి రామ‌కృష్ణ జ‌వాబిచ్చారు. అన్నీ కుదిరితే త‌మ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ సినిమా వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తంచేస్తూ, "భార్గ‌వ్ ఆర్ట్స్‌లో బాల‌య్య‌తో నిజంగా గొప్ప సినిమాలే చేశాను. గోపాల్‌రెడ్డి గారికి కూడా బాల‌య్య అంటే విప‌రీత‌మైన అభిమానం. 'మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు' త‌ర్వాత బాల‌య్య టాప్ స్టార్ అయిపోయాడు. అందుకు త‌గ్గ‌ట్లే బాల‌య్య‌తో ఏ సినిమా తీసినా అడ‌క్కుండానే పారితోషికం పెంచేవారు గోపాల్‌రెడ్డి. 'ముద్దుల మావ‌య్య' త‌ర్వాత బాల‌య్య దాదాపు నంబ‌ర్‌వ‌న్ అయ్యారు. ఆయ‌న పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది. 'ఇప్పుడు మ‌నం బాల‌య్య‌తో సినిమా తీస్తే మ‌న‌కోసం ఆయ‌న పారితోషికం త‌గ్గించుకోవాలి. అలాంటి ప‌రిస్థితి మ‌న బాల‌య్య‌కు రాకూడ‌దు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మ‌నం చేరుకున్నాకే సినిమా తీద్దాం' అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మ‌ళ్లీ మా కాంబినేష‌న్‌లో సినిమాలు రాలేదు" అని ఆయ‌న చెప్పారు. త‌మ కాంబినేష‌న్‌లో మొద‌లై, ఆగిపోయిన జాన‌ప‌ద సినిమా గురించి కూడా కోడి రామ‌కృష్ణ తెలిపారు. "కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తుల కార‌ణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంత‌కుమించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్త‌యింది. రెడ్డిగారు బ‌తికుండే పూర్తి చేసేవాళ్లం" అని ఆయ‌న వెల్ల‌డించారు.  ఏదేమైనా బాల‌కృష్ణ‌, కోడి రామ‌కృష్ణ‌, ఎస్‌. గోపాల్‌రెడ్డి కాంబినేష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ స‌క్సెస్ అయ్యిందనేది నిజం. కోడి రామ‌కృష్ణ 2019 ఫిబ్ర‌వ‌రి 22న‌ క‌న్నుమూయ‌గా, ఎస్‌. గోపాల్‌రెడ్డి అంత‌కంటే చాలా ముందుగా 2008లో మృతి చెందారు. (ఫిబ్రవరి 22 - కోడి రామకృష్ణ వర్ధంతి)

అతను మ్యూజిక్‌ చేసిన సినిమాల్లో సగానికిపైగా ఆ ముగ్గురు డైరెక్ట్‌ చేసినవే!

రమేష్‌నాయుడు.. మధురమైన సంగీతాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన అందించే సంగీతం మరే ఇతర సంగీత దర్శకుడి పాటల్ని పోలి ఉండదు. తనకంటూ ఒక శైలి ఉంది. ఒక పాట విని.. అది రమేష్‌నాయుడు ట్యూన్‌ చేసిందే అని చెప్పేంతగా ముద్ర వేసేవారు. 1957 నుంచి 1987 వరకు 30 సంవత్సరాలపాటు తన మధురమైన సంగీతంతో అందర్నీ అలరించారు. వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న కొందరి జీవితాలను పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్థాయి నుంచి ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా రాగలిగారు అనిపిస్తుంది. సంగీత దర్శకుడు రమేష్‌నాయుడు జీవితంలో ఎన్నో మలుపుల  తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు.  సినిమాల మీద మోజుతో ఇంట్లో చెప్పకుండా ముంబాయి వెళ్లిపోయిన రమేష్‌నాయుడు అక్కడ ఫుట్‌పాత్‌లపైనే చాలా కాలం గడిపారు. ఆ తర్వాత ఓ సంగీత వాయిద్యాల షాపులో బోయ్‌గా చేరారు. అక్కడ వివిధ వాయిద్యాలను వాయించడంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. అక్కడికి వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులు వచ్చేవారు. వారితో పరిచయాల్ని పెంచుకున్నారు. అలా సంగీతంపై ఒక అవగాహన ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత 16 ఏళ్ళ చిరు ప్రాయంలోనే ‘బంద్వల్‌ పహీజా’ అనే మరాఠీ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించారు. 1957లో ‘దాంపత్యం’ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా టాలీవుడ్‌లో ఎంటర్‌ అయ్యారు. అయితే తెలుగులో ఐదారు సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందించి మళ్లీ కలకత్తా వెళ్లిపోయారు. అక్కడ పలు బెంగాలీ, నేపాలి, ఒరియా చిత్రాలకు సంగీతం అందించారు. అలా దాదాపు 10 సంవత్సరాలు టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు రమేష్‌నాయుడు. ఆ తర్వాత 1972లో వచ్చిన ‘అమ్మమాట’ చిత్రం కోసం రమేష్‌నాయుడుని టాలీవుడ్‌ రప్పించారు దర్శకుడు వి.రామచంద్రరావు. ఈ చిత్రం మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ‘మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు..’, ‘ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్‌..’, ‘ఎవరైనా చూశారా ఏమనుకుంటారు..’, ‘ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా..’ వంటి అద్భుతమైన పాటలతో రూపొందిన ఈ సినిమాతో తెలుగులో రమేష్‌నాయుడు సంగీతానికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఇక అక్కడి నుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా సినిమాలు చేస్తూ.. వీనుల విందైన పాటల్ని అందించారు.  ఆ మరుసటి సంవత్సరమే దర్శకరత్న దాసరి నారాయణరావు మొదటి సినిమా ‘తాతమనవడు’ విడుదలైంది. ఈ సినిమా కోసం రమేష్‌నాయుడు చేసిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అక్కడి నుంచి 1987లో వచ్చిన స్వయంకృషి వరకు రమేష్‌నాయుడు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి.  రమేష్‌నాయుడు చేసిన సినిమాల్లో సగానికి పైగా దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దర్శకత్వంలో వచ్చినవే ఉండడం విశేషం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మేఘసందేశం’ చిత్రానికిగాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు రమేష్‌నాయుడుని ఎంపిక చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమాకి  ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది అవార్డును అందించింది. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ చిత్రంలోని ‘తల్లి గోదారికే ఆటుపోటుంటే..’ అనే పాటకు ఉత్తమ నేపథ్యగాయకుడుగా రమేష్‌నాయుడు నంది పురస్కారాన్ని అందుకున్నారు.  రమేష్‌నాయుడు చివరగా సంగీతం అందించిన సినిమా చిరంజీవి, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వయంకృషి’. ఈ సినిమా సెప్టెంబర్‌ 4, 1987లో విడుదలైంది. అయితే అంతకుముందు రోజు అంటే సెప్టెంబర్‌ 3న రమేష్‌నాయుడు తుదిశ్వాస విడిచారు. 

'తరంగిణి' టు 'అరుంధతి'.. సంచలనం సృష్టించిన కోడి రామకృష్ణ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్!

శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరొందిన కోడి రామకృష్ణ.. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ విజయాలు చూస్తూనే, మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనూ తనదైన ముద్ర వేశారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వివరాల్లోకి వెళితే.. తరంగిణి:  1982లో వచ్చిన హిట్ మూవీ ఇది. శ్యామల గౌరి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుమన్, భానుచందర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. కోడి రామకృష్ణ కెరీర్ లో ఇదే మొదటి నాయికా ప్రాధాన్య చిత్రం. ముక్కు పుడక:  1983లో వచ్చిన ఈ సినిమాలో సుహాసినిది ప్రధాన పాత్ర. భానుచందర్, విజయశాంతి, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. తలంబ్రాలు:  "ఇది పాట కానే కాదు.. ఏ రాగం నాకు రాదు" అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉన్న 'తలంబ్రాలు'లో జీవితది ప్రధాన పాత్ర అయితే.. రాజశేఖర్ ది నెగటివ్ రోల్. 1987లో ఈ సక్సెస్ ఫుల్ మూవీ జనం ముందు నిలిచింది. మధురానగరిలో:  1991లో వచ్చిన ఈ సినిమాలో నిరోషాది ప్రధాన పాత్ర అయితే.. శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పెళ్ళాం చెబితే వినాలి:  టైటిల్ కి తగ్గట్టే ఇది మహిళల చుట్టూ తిరిగే సినిమా. మీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరీష్ కథానాయకుడు. కోవై సరళ, రాజీవి, వై.విజయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 1992లో ఈ మూవీ రిలీజైంది. పోలీస్ లాకప్:  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో వినోద్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. 1993లో ఈ సూపర్ హిట్ మూవీ రిలీజైంది. అమ్మోరు:  1995లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అభినేత్రి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆల్ రౌండర్ రమ్యకృష్ణది టైటిల్ రోల్. గ్రాఫిక్స్ గురించి తెలుగునాట పదే పదే మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది. దేవి:  ప్రేమ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో విజువల్స్ పరంగా టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. 1999లో వచ్చిన 'దేవి' అఖండ విజయం సాధించింది. అరుంధతి:  లేడీ సూపర్ స్టార్ అనుష్క దశ, దిశని మార్చివేసిన విజువల్ వండర్.. 'అరుంధతి'. జేజేమ్మగా అనుష్కని  ఆవిష్కరించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  (ఫిబ్రవరి 22 - కోడి రామకృష్ణ వర్ధంతి)

టాప్ స్టార్స్ తో కోడి రామకృష్ణ టాప్ హిట్స్.. ఆ సినిమాలేంటో తెలుసా!

తెలుగునాట వందకి పైగా సినిమాలు తెరకెక్కించిన దర్శకులు.. పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. వారిలో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒకరు. ఒక తరం అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ కి మంచి విజయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. కృష్ణ:  కృష్ణ - కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో 'పోరాటం' మంచి విజయం సాధించింది. 'గూండా రాజ్యం', 'గూఢచారి నెం 117' కూడా మెప్పించాయి. చిరంజీవి:  చిరంజీవి హీరోగా నటించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తోనే కోడి రామకృష్ణ దర్శకుడిగా తొలి అడుగేశారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా తరువాత చిరు, కోడి రామకృష్ణ కాంబోలో మరికొన్ని సినిమాలు వచ్చినా.. 'ఆలయ శిఖరం' మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. బాలకృష్ణ:  'మంగమ్మ గారి మనవడు' వంటి సంచలన చిత్రంతో మొదలైన బాలయ్య - కోడి రామకృష్ణ కాంబో.. ఆపై 'ముద్దుల కృష్ణయ్య', 'ముద్దుల మావయ్య', 'మువ్వ గోపాలుడు', 'ముద్దుల మేనల్లుడు' వంటి బ్లాక్ బస్టర్స్, హిట్ మూవీస్ ని క్రెడిట్ చేసుకుంది. నాగార్జున:  'మురళీ కృష్ణుడు' రూపంలో నాగార్జున, కోడి రామకృష్ణ కాంబోలో చెప్పుకోదగ్గ విజయం ఉంది. వెంకటేశ్:  'శత్రువు' రూపంలో వెంకీ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఘనవిజయం ఉంది. దీనికంటే ముందు వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. సుమన్:  'తరంగిణి' వీరి కాంబోలో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే '20వ శతాబ్దం' కూడా జనరంజక చిత్రంగా నిలిచింది. రాజశేఖర్:  రాజశేఖర్ తో  కోడి రామకృష్ణ రూపొందించిన సినిమాల్లో 'అంకుశం' సంచలన విజయం సాధించింది. అంతకంటే ముందు వచ్చిన 'తలంబ్రాలు', 'స్టేషన్ మాస్టర్', 'ఆహుతి' కూడా మంచి విజయం సాధించాయి. అర్జున్:  'మా పల్లెలో గోపాలుడు', 'మన్నెంలో మొనగాడు', 'మా వూరి మారాజు', 'పుట్టింటికి రా చెల్లి'.. ఇలా అర్జున్, కోడి రామకృష్ణ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి. జగపతి బాబు:  జగపతి బాబుతో కోడి రామకృష్ణ తీసిన సినిమాల్లో 'దొంగాట' ఘనవిజయం సాధించగా.. 'పెళ్ళి పందిరి' కూడా విజయపథంలో పయనించింది. (ఫిబ్రవరి 22 - కోడి రామకృష్ణ వర్ధంతి)

శ్రీదేవి, జయప్రదను ఒకే గదిలో పెట్టి తాళం వేసిన హీరో.. అలా గంటసేపు? 

మధ్యతరం హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రదలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకరిని మించి ఒకరు తమ అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాలో ఉన్నారంటే చాలు ఆ సినిమాకి జనం క్యూ కట్టేవారు. అంతటి పాపులారిటీ సాధించిన శ్రీదేవి, జయప్రద ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటారు. టాలీవుడ్‌లో అయినా, బాలీవుడ్‌లో అయినా ఇద్దరి మధ్యా ఎప్పుడూ పోటీ ఉండేది. అదే సమయంలో ఇద్దరి మధ్య తెలియని ఓ కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. అది ఎప్పుడు ఎలా స్టార్ట్‌ అయ్యిందో తెలీదుగానీ, ఇద్దరికీ మాటల్లేవు. ఎదురు పడినపుడు హలో అంటే హలో అనుకునేవారు. అంతకు మించి ఒక్క మాట కూడా ఇద్దరి నోటి నుంచి వచ్చేది కాదు. వాస్తవానికి ఇద్దరికీ ప్రత్యక్షంగా ఎలాంటి గొడవలు లేవు. అయినా వారి కెరీర్‌ మొత్తాన్ని అలాగే కొనసాగించారు. శ్రీదేవి, జయప్రదలలో సీనియర్‌ ఎవరంటే శ్రీదేవి అనే చెప్పాలి. ఎందుకంటే నాలుగేళ్ళ వయసు నుంచే ఆమె సినిమాల్లో నటిస్తోంది. 1975లో విడుదలైన ‘అనురాగాలు’ చిత్రంలో శ్రీదేవి మొదటిసారి హీరోయిన్‌గా నటించింది. అయితే అంతకు ఒక సంవత్సరం ముందే ‘భూమికోసం’ చిత్రంతో జయప్రద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ విధంగా చూస్తే శ్రీదేవి కంటే జయప్రద సీనియర్‌. హీరోయిన్‌గా జయప్రదకే మొదట స్టార్‌డమ్‌ వచ్చింది. 1977లో వచ్చిన ‘అడవిరాముడు’ చిత్రంతో ఒక్కసారిగా  టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. శ్రీదేవికి మాత్రం హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన మూడేళ్ళ తర్వాత ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంతో బ్రేక్‌ వచ్చింది. అందులో ఆమె గ్లామరస్‌ హీరోయిన్‌గా కనిపించలేదు. అయితే నటిగా ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘వేటగాడు’ చిత్రంతో శ్రీదేవి గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలతోనే స్టార్‌డమ్‌ రావడం విశేషం. అదే సంవత్సరం కృష్ణ హీరోగా వచ్చిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ చిత్రంలో  శ్రీదేవి హీరోయిన్‌గా ఎంపికైంది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట జయప్రదను హీరోయిన్‌గా అనుకున్నారు. 5 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. తర్వాత ఆ స్థానంలో శ్రీదేవిని తీసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రాజుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయి వుండొచ్చు.  ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్యా పోటీ పెరిగింది. సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మొదట జయప్రదే పరిచయం అయింది. 1979లో వచ్చిన ‘సర్‌గమ్‌’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది జయప్రద. శ్రీదేవి కూడా అదే సంవత్సరం ‘సోల్వా సావన్‌’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత నాలుగేళ్ళకు ‘హిమ్మత్‌వాలా’తో శ్రీదేవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో నిలబడిరది. ‘ఊరికి మొనగాడు’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవద్దని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేశారు. తెలుగులో హీరోయిన్‌గా నటించిన జయప్రదనే తీసుకోవాలని అన్నారు. కానీ, దర్శకనిర్మాతలు అవేవీ పట్టించుకోకుండా శ్రీదేవినే హీరోయిన్‌గా ఉంచారు. శ్రీదేవి, జయప్రద మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇలా ఇద్దరూ అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ అయిపోయారు.  ఇక ఇద్దరూ కలిసి తెలుగు, హిందీ భాషల్లో ఓ డజను సినిమాలు చేసినా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడలేదు. తెలుగులో వచ్చిన ‘దేవత’ చిత్రాన్ని చూస్తే అక్కా చెల్లెళ్ళుగా ప్రేక్షకుల్ని ఇద్దరూ ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. నిజజీవితంలో అక్కాచెల్లెళ్ళు కూడా అంత అన్యోన్యంగా ఉండరు అనేంత పేరు తెచ్చుకున్నారిద్దరూ. సినిమాల్లోని క్యారెక్టర్స్‌ చేసేటపుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునే ఇద్దరూ షాట్‌ అవ్వగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. నిజం చెప్పాలంటే ఇద్దరూ అంత విరోధులుగా మారడానికి చిన్న చిన్న కారణాలు వున్నాయి తప్ప బలమైన కారణం ఒక్కటి కూడా లేదనే చెప్పాలి.  ఈ విషయం గురించి జయప్రద ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఇద్దరం మాట్లాడుకోం. నిజం చెప్పాలంటే శ్రీదేవి కొంచెం యారగెంట్‌గా ఉండేది. ఇద్దరం షాట్‌లో పోటాపోటీగా నటించినా.. ఒక్కసారి లైట్స్‌ ఆఫ్‌ అయిపోతే ఆమె కుర్చీ అటు, నా కుర్చీ ఇటు ఉండేది. ఎందుకో మా ఇద్దరి ఫ్రీక్వెన్సీ కలవలేదు. సినిమాలు మాత్రం పోటాపోటీగా చేసేవాళ్ళం. ఆమె గ్లామర్‌ రోల్స్‌ చేస్తే.. నేను యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ చేసేదాన్ని. కానీ, ఒక నటిగా ఆ అమ్మాయంటే నాకెంతో గౌరవం. మా ఇద్దరినీ కలపాలని చాలా మంది ట్రై చేశారు. కానీ, కుదరలేదు. హిందీలో ‘మక్సద్‌’ అనే సినిమా ఇద్దరం కలిసి చేశాం. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో హీరో జితేంద్ర మమ్మల్ని కలిపేందుకు ట్రై చేశారు. మా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి బయట తాళం వేశారు. అలా గంట సేపు మమ్మల్ని ఒకే గదిలో ఉంచారు. కానీ, ఆ గంట సేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేదు’ అని వివరించారు.