బ్రూస్‌ లీ చిన్న వయసులోనే చనిపోయాడు.. కొడుకు బ్రాండన్‌లీని షూటింగ్‌లో కాల్చి చంపారు!

బ్రూస్‌ లీ.. ఈ పేరు వినని వారు ప్రపంచంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినా.. బ్రూస్‌ లీ అనే వాడు మార్షల్‌ ఆర్ట్స్‌లో నిపుణుడు అని మాత్రం అందరికీ తెలుసు. అమెరికాలో జన్మించి, హాంకాంగ్‌లో పెరిగిన యోధుడు, నటుడు. అతని కుమారుడు కుమారుడు బ్రాండన్‌ లీ, కుమార్తె షానన్‌ లీ కూడా నటులే.  బ్రూస్‌ లీ అసలు పేరు లీ జాన్‌ ఫాన్‌. అతను తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించేవాడు. అందుకే చైనా వారికి బ్రూస్‌లీ అంటే ఎంతో అభిమానం. చైనీయుల సాంప్రదాయ క్రీడ కుంగ్‌ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్‌ (1950) అనే చిత్రంలో నటించాడు. ఇది ఒక కామిక్‌ క్యారెక్టర్‌ ఆధారంగా రూపొందించిన పాత్ర. అదే లీకి మొదటి సినిమా. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు.  వింగ్‌ చున్‌ విధానంలోని వన్‌ ఇంచ్‌ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్‌ బీచ్‌ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా వెనక్కి లాగి విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్‌ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్‌ ఇంచ్‌ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌లో వన్‌ ఇంచ్‌ పంచ్‌ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్‌ ఇంచ్‌ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్‌ లీ. బ్రూస్‌ లీ తన కెరీర్‌లో హీరోగా నటించిన సినిమాలు 5. అందులో చివరిది ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’. ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్‌ అవుతుందనగా బ్రూస్‌లీ చనిపోయాడు. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా బ్రూస్‌ లీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సరైన టైమ్‌లో ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగారు. ఆ తర్వాత 1973 జూలై 20న నిర్మాత రేమండ్‌ చోతో కలిసి బ్రూస్‌లీ, అతని భార్య డిన్నర్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే బ్రూస్‌లీ పడుకొని ఉన్నాడు. అతన్ని లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతన్ని బ్రతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ, పది నిమిషాల్లోనే బ్రూస్‌ లీ తుది శ్వాస విడిచాడు. 32 సంవత్సరాల అతి చిన్న వయసులో అతను చనిపోవడం అందర్నీ కలచివేసింది. ఇదిలా ఉంటే.. బ్రూస్‌ లీ కుమారుడు బ్రాండన్‌ లీ కూడా 28 సంవత్సరాల అతి చిన్న వయసులోనే చనిపోవడం మరింత బాధాకరం. 1993, మార్చి 31న ‘ది క్రో’ అనే సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. హీరో క్యారెక్టర్‌ తన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లోకి రాగానే తనకు కాబోయే భార్యను హింసించడమే కాకుండా అత్యాచారం చేస్తారు దుండగులు. అది చూసి తట్టుకోలేని హీరో ఆ దుండగులపై కలబడతాడు. అదే సమయంలో అతను రివాల్వర్‌తో హీరోను కాలుస్తాడు. అదీ సన్నివేశం. దీని కోసం తెచ్చిన డమ్మీ రివాల్వర్‌ను సరిగా పరీక్షించకపోవడం, టెక్నికల్‌గా అందులో కొన్ని లోపాలు వుండడంతో అది ఒరిజినల్‌ రివాల్వర్‌లాగే ఆ సమయంలో పనిచేసింది. ఆ సన్నివేశంలో విలన్‌ బ్రాండన్‌లీని కాల్చడంతో అతను వెనక్కి పడిపోయాడు. కట్‌ చెప్పిన తర్వాత కూడా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు గుర్తించిన యూనిట్‌ సభ్యులు బ్రాండన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతను తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.  బ్రూస్‌లీ తన కెరీర్‌లో చేస్తున్న ఐదో సినిమా ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా చనిపోయాడు. అతని కెరీర్‌లో అదే భారీ బడ్జెట్‌ సినిమా. అలాగే బ్రాండన్‌ లీ కూడా అప్పటివరకు హీరోగా ఐదు సినిమాల్లో నటించాడు. ఐదో సినిమా ‘ది క్రో’. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే అతను చనిపోయాడు. బ్రాండన్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో సినిమా ఇదే. తండ్రీకొడుకులు చనిపోయే సమయానికి ఐదో సినిమా షూటింగ్‌లో ఉండడం, అది కూడా భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. బ్రూస్‌లీ సమాధి పక్కనే బ్రాండన్‌ లీ సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 

హీరోహీరోయిన్లు లేరు.. ఫైట్లు లేవు.. అయినా శతదినోత్సవం జరుపుకున్న సినిమా అది!

సినిమా అంటే హీరో ఉండాలి, హీరోయిన్‌ ఉండాలి. వాళ్ళిద్దరికీ డ్యూయెట్లు ఉండాలి. హీరో తన హీరోయిజమ్‌ చూపించేందుకు ఓ విలన్‌ వుండాలి. ప్రేక్షకులకు మధ్య మధ్యలో రిలీఫ్‌నిచ్చేందుకు చక్కని కామెడీ ఉండాలి. ఇదీ రెగ్యులర్‌ సినిమా ఫార్మాట్‌. అలా కాకుండా ఈ అంశాలన్నీ లేకుండా విభిన్నంగా ఆలోచించే దర్శకనిర్మాతలు కూడా ఉంటారు. అప్పుడప్పుడు రెగ్యులర్‌ ఫార్మాట్‌ను బ్రేక్‌ చేస్తూ సినిమాలు తీస్తుంటారు. అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే చూస్తున్నాం. అలా కాకుండా 52 సంవత్సరాల క్రితమే అలాంటి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు.  సాహసాలకు మారుపేరుగా చెప్పుకునే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఎడారి నేపథ్యంలో ఇంగ్లీష్‌ సినిమాలను మరపించేలా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాను చూసిన పూర్ణచంద్రరావు ఆ క్షణమే తను కూడా ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. 1969లో సౌత్‌ ఆఫ్రికన్‌ మూవీగా రూపొందిన ‘లాస్ట్‌ ఇన్‌ ది డిజర్ట్‌’ చిత్రం ఇండియాలోనూ రిలీజ్‌ అయింది. ఈ సినిమా అట్లూరి పూర్ణచంద్రరావును బాగా ఆకర్షించింది. ఈ సినిమా గురించి రచయిత గొల్లపూడి మారుతీరావుకి చెప్పి కథ రెడీ చెయ్యమన్నారు. ఆ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో గొల్లపూడి ఒక అద్భుతమైన కథను రెడీ చేశారు. కథ విన్న పూర్ణచంద్రరావు కూడా ఎంతో శాటిస్‌ఫై అయ్యారు.  ఇక సినిమాను ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు పూర్ణచంద్రరావు. సినిమాలోని ప్రధాన పాత్ర కోసం మొదట మాస్టర్‌ రాముని ఎంపిక చేశారు. అయితే వయసులో చాలా చిన్నవాడిగా ఉన్న రాముని వద్దనుకొని మరొకరి కోసం ప్రయత్నించారు. చివరికి మాస్టర్‌ రామునే ఈ పాత్రకు ఎంపిక చేశారు. అతనికి తండ్రిగా ఎస్‌.వి.రంగారావు, తల్లిగా దేవికను తీసుకున్నారు. రాము మేనమామ క్యారెక్టర్‌ కోసం నగేష్‌ను సెలెక్ట్‌ చేశారు. అతని క్యారెక్టర్‌కి సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పారు. ఇక దర్శకుడిగా వి.రామచంద్రరావును ఫైనల్‌ చేశారు. సెంటిమెంట్‌ను పండిరచడంలో సిద్ధహస్తుడైన రామచంద్రరావు నేతృత్వంలో నటీనటుల ఎంపిక పూర్తయింది.  కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను మూడొంతులు ఎడారిలో, ఒక వంతు అడవిలో చేయాలి. ఎడారిలో షూటింగ్‌ చెయ్యాలంలే రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి ఒక్కటే ఆధారం. అక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అలాగే అడవికి సంబంధించిన సీన్స్‌ను ముదుమలై ఫారెస్ట్‌ చేశారు. అప్పట్లో యుద్ధ భయం కూడా ఉండడంతో ఎడారి ప్రాంతంలో షూటింగ్‌కి అనుమతి ఇచ్చే విషయంలో రక్షణశాఖ ఎంతో ఆలోచించింది. దానికి జైసల్మేర్‌ ఎమ్మెల్యే వారితో మాట్లాడి అనుమతులు ఇప్పించారు. ఎందుకైనా మంచిదని వీరి కోసం 12 మంది సభ్యులతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేసింది రక్షణశాఖ. 27 రోజులపాటు ఎడారికి సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. యూనిట్‌ సభ్యులు 35 మంది. ఆర్టిస్ట్‌ ఒక్కడే మాస్టర్‌ రాము. అతనికి తోడుగా టామీ అనే కుక్కపిల్ల. అగ్నిగుండాన్ని తలపించే ఎండ వల్ల రాము, టామీతోపాటు యూనిట్‌ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటలలోపు షూటింగ్‌ పూర్తి చేసి, తమతమ గుడారాల్లోకి వెళ్లిపోయేవారు. మళ్ళీ 4 గంటల తర్వాత షూటింగ్‌ చేసేవారు. యూనిట్‌ సభ్యులు భోజనానికి ఇబ్బంది పడకూడదని ఇద్దరు వంటవాళ్ళను కూడా తీసుకెళ్ళారు పూర్ణచంద్రరావు. ఎండ నుంచి, ఎడారిలో తిరిగే ఇసుక పాముల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఎలాంటి అపశృతి జరగకుండా షూటింగ్‌ని పూర్తి చేశారు. మార్చిలో ప్రారంభమైన ఈ సినిమాను సెప్టెంబర్‌ 29, 1972లో విడుదల చేశారు.  ‘పాపం పసివాడు’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పిల్లలు ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. దాంతో పెద్దవారు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రాష్ట్రంలోని ప్రధానమైన నగరాలకు మాస్టర్‌ రాముని తీసుకొని విజయయాత్ర నిర్వహించారు. అతన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా అతన్ని చూసి మురిసిపోయారు. అంతేకాదు, ఈ సినిమా పబ్లిసిటీ కోసం అప్పట్లోనే వినూత్న ప్రయోగం చేశారు. ఈ సినిమా వివరాలను తెలిపే కరపత్రాలను ముద్రించి హెలికాప్టర్ల ద్వారా పలు పట్టణాల్లో వాటిని వెదజల్లారు. ఆరోజుల్లో అలాంటి పబ్లిసిటీ గురించి ఎవరూ వినలేదు, చేయలేదు కూడా. ‘పాపం పసివాడు’ చిత్ర యూనిట్‌ అలాంటి పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.  మద్రాస్‌లో జరిగిన ఈ చిత్రం శతదినోత్సవ కార్యక్రమానికి నాగయ్య అధ్యక్షత వ్యహించారు. తెలుగులో శతదినోత్సవం జరుపుకున్న తర్వాత తమిళ్‌ వెర్షన్‌ను విడుదల చేశారు. తమిళ్‌లో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 

అలాంటి మంచి లక్షణాల వల్లే మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు!

సినిమా రంగంలో ఎవరి అండా లేదు. కేవలం స్వయంకృషితోనే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యారు అని అందరూ చెబుతుంటారు. అయితే ఆయన ఆ స్థానానికి రావడానికి స్వయంకృషే కాదు, మంచితనం, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతల పట్ల ఉండే అపారమైన గౌరవం, ఎదుటివారికి ఇచ్చే మర్యాద.. ఇలాంటి లక్షణాలు కూడా ఆయనలో ఉండడం వల్ల మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు. ఆయన తన దర్శకనిర్మాతల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో తెలిపే ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి మొదట నటించిన సినిమా ‘పునాది రాళ్ళు’. అయితే ‘ప్రాణం ఖరీదు’ మొదట విడుదలైన సినిమా. ఆయన నటించిన ఆరు సినిమాల తర్వాత ‘పునాదిరాళ్ళు’ విడుదలైంది. 1980 వరకు దాదాపు 15 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు చిరంజీవి. అప్పట్లో చిరు కుటుంబం నెల్లూరులో నివాసం ఉండేది. అప్పటికే సినిమాల్లో నటిస్తున్న చిరంజీవిని తమ ఊరి ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో 1980 ఆగస్ట్‌ 21న నెల్లూరులో ఒక ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని భావించారు చిరు తండ్రి. ఆగస్ట్‌ 22 చిరంజీవి బర్త్‌డే. ఒకరోజు ముందు ఆ ప్రెస్‌మీట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని మద్రాస్‌లో ఉన్న చిరంజీవికి చెప్పారు. ఆగస్ట్‌ 21 ఉదయం 10 గంటలకు బయల్దేరతాను అని చెప్పారు చిరు. ఈలోగా చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. 1980లో వచ్చిన ‘జాతర’ సినిమాలో ఆయన హీరో. ఆ సినిమాలో ధరించిన ఒక కాస్ట్యూమ్‌ అంటే అతనికి చాలా ఇష్టం. తెల్ల ప్యాంట్‌, బ్లూ షర్ట్‌. ఆ డ్రెస్‌లో ప్రెస్‌మీట్‌కి వెళితే బాగుంటుందనిపించి ‘జాతర’ నిర్మాత రుద్రరాజు సీతారామరాజుకి ఫోన్‌ చేసి కాస్ట్యూమ్‌ విషయం చెప్పారు. దానికా నిర్మాత ఆ కాస్ట్యూమ్స్‌ అన్నీ జాగ్రత్త పెట్టామని, ఆ కాస్ట్యూమ్‌ని బయటికి తీసి వాష్‌ చేయించి రెడీగా పెడతానని, ఉదయమే వచ్చి తీసుకోమని చెప్పారు. ఆగస్ట్‌ 21 ఉదయం నిర్మాత సీతారామరాజు ఆఫీస్‌కి వెళ్లారు చిరు. అప్పటికే చిరంజీవికి ఒక ఫియట్‌ కారును కొనిచ్చారు ఆయన తండ్రి. ఆ కారులోనే సినిమా ఆఫీసులకు వెళ్లేవారు చిరు. ఆ కారులోనే నెల్లూరుకి బయల్దేరుతూ సీతారామరాజు ఆఫీస్‌కి వచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఆ కాస్ట్యూమ్‌ను సిద్ధం చేసి ఉంచారు సీతారామరాజు. అప్పటికే ఆ ఆఫీస్‌లో ముగ్గురు, నలుగురు నిర్మాతలు ఉన్నారు. అప్పట్లో సీతారామరాజు ఆఫీస్‌లో ఉదయమే రుచికరమైన మంచి టిఫిన్‌ పెట్టేవారనే పేరు ఉంది. దాంతో కొందరు నిర్మాతలు అక్కడికి వచ్చి టిఫిన్‌ చేసి వెళ్లేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అప్పుడప్పుడు అక్కడ టిఫిన్‌ చేసేవారు. దాంతో ఎప్పుడూ దర్శకనిర్మాతలతో సీతారామరాజు ఆఫీసు కళకళలాడుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ ఉన్న నిర్మాతల్లో చిరంజీవితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత కూడా ఉన్నారు. ఆయన్ని చిరంజీవి ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుస్తారు. ఆ నిర్మాత చిరంజీవి కొత్త కారును చూసి ముచ్చటపడ్డాడు. పది నిమిషాల్లో ఒక రౌండ్‌ వేసుకొని వస్తానని చెప్పడంతో కారు కీస్‌ ఇచ్చారు చిరంజీవి. అలా వెళ్లిన ఆ నిర్మాత రెండు గంటలు గడిచినా రాలేదు. మద్రాస్‌లో 10 గంటలకు బయల్దేరితేనే 3 గంటలకు నెల్లూరు చేరుకోవచ్చు. కనీసం 12 గంటలకు బయల్దేరినా ప్రెస్‌మీట్‌ టైమ్‌కి చేరుకోవచ్చు. కానీ, ఆ నిర్మాత రాలేదు. ఆయన కోసం ఓపికగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. చివరికి నాలుగున్నరకు ఆ నిర్మాత వచ్చారు. ‘సారీ తమ్ముడూ.. ఎవరో సైట్‌ చూద్దామంటే బీచ్‌ రోడ్‌కి వెళ్లాము’ అని కారు కీస్‌ ఇచ్చాడు. ఆయన చేసిన పనికి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ‘ఫర్వాలేదు.. అన్నయ్యా.. నో ప్రాబ్లమ్‌’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు చిరంజీవి. సాయంత్రం ఐదు గంటలకు మిత్రుడు, నటుడు హరిప్రసాద్‌, నిర్మాత రుద్రరాజు సీతారామరాజుతో కలిసి నెల్లూరు బయల్దేరారు చిరంజీవి. ఆరోజు ప్రెస్‌ మీట్‌ మిస్‌ అయిపోయింది. తనతోపాటు వచ్చిన నిర్మాత సీతారామరాజుకి మంచి హోటల్‌లో రూమ్‌ తీసి ఆ రాత్రికి అక్కడే ఉండే ఏర్పాటు చేశారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు, అభిమానులు, హరిప్రసాద్‌, సీతారామరాజులతో కలిసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు చిరంజీవి. తన నిర్మాతలంటే చిరంజీవికి ఎంత గౌరవమో, వారి పట్ల ఎంత మర్యాదగా నడుచుకుంటారు అనే విషయం ఈ సంఘటన తెలియజేస్తుంది. ఆ నిర్మాత వల్ల తనకు కలిగిన అసౌకర్యాన్ని మనసులో పెట్టుకోకుండా తను ముందుగా కమిట్‌ అయిన విధంగానే అతనికి ఒక సినిమా చేశారు చిరంజీవి. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.  

రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకున్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా?

ఆలిండియా స్టార్‌గా శ్రీదేవికి ఎంత పాపులారిటీ వుండేదో అందరికీ తెలిసిందే. ఎక్కువ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గ్లామర్‌ హీరోయిన్‌కి నిర్వచనం నిలిచిన శ్రీదేవి.. రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకుంది. ఎందుకు అలా చేసింది అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.2,300 కోట్లు కలెక్ట్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌ ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషీ ఉంది. అయితే డైరెక్టర్‌ ఈజ్‌ కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు కాబట్టి ఎక్కువ క్రెడిట్‌ రాజమౌళికే దక్కింది. 2017లో ‘బాహుబలి’ రెండో భాగం రిలీజ్‌ అయిన తర్వాత రాజమౌళి ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ శ్రీదేవిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలిలోని శివగామి క్యారెక్టర్‌ కోసం మొదట శ్రీదేవిని అనుకున్నామని, ఆమె ఒప్పుకోకపోవడమే మాకు కలిసొచ్చిందని అన్నాడు. అంతటితో ఆగకుండా ఆమె ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రెమ్యునరేషన్‌ రూ.8 కోట్లు డిమాండ్‌ చేసిందని, 10 ఫ్లైట్‌ టికెట్స్‌ కావాలని, తన కోసం హోటల్‌లోని ఒక ఫ్లోర్‌ మొత్తం తీసుకోవాలని, ఈ సినిమా హిందీ వెర్షన్‌లో లాభాల్లో వాటా అడిగిందని, అందుకే శ్రీదేవిని తీసుకోలేదని చెప్పాడు.  రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది, కంటతడి పెట్టుకుంది. ఈ విషయం గురించి తన స్పందన తెలియజేస్తూ ‘ఈ విషయం గురించి నన్ను చాలా మంది అడిగారు. కానీ, నేనెప్పుడూ దీని గురించి మాట్లాడలేదు. నేను కొన్ని కారణాల వల్ల చాలా సినిమాలు చెయ్యలేకపోయాను. అవి చాలా పెద్ద హిట్‌ అయ్యాయి కూడా. ఆ సినిమాలు చెయ్యాలని నాకు రాసిపెట్టి లేదు అనుకునేదాన్ని తప్ప మరోలా బాధపడేదాన్ని కాదు. ఆ సినిమాల గురించి ఆ సినిమాల డైరెక్టర్లుగానీ, నిర్మాతలుగానీ, నేను గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు బాహబలి విషయానికి వస్తే నేను ఆ క్యారెక్టర్‌ చెయ్యలేదు.. ఎవరో చేశారు. పార్ట్‌ 1, పార్ట్‌ 2 రెండూ రిలీజ్‌ అయిపోయాయి. దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఈ విషయం గురించి ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. అసలు మాట్లాడకూడదనే అనుకున్నాను. కానీ, దీన్ని క్లియర్‌ చెయ్యాల్సిన బాధ్యత నాకు ఉంది. రాజమౌళిగారు చెప్పినంత అన్యాయంగా నేను డిమాండ్‌ చేసి ఉంటే 50 సంవత్సరాల్లో 300కి పైగా సినిమాలు చేసి ఉండేదాన్నా. నన్ను ఎప్పుడో ప్యాక్‌ చేసి పంపించేసేవారు. ఈ మిస్‌ అండర్‌స్టాండిరగ్‌ ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. నన్ను ఆ సినిమా నుంచి తప్పించడానికి నిర్మాతే రాజమౌళిగారికి అలా చెప్పి ఉంటారా అని తర్వాత ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తోంది. రాజమౌళిగారు డైరెక్ట్‌ చేసిన ‘ఈగ’ సినిమా చూశాను. నాకు ఎంతో నచ్చింది. ఆయన డైరెక్ట్‌ చేసే సినిమాలో నటించడం నాకూ ఇష్టమే. కానీ, అంత గొప్ప డైరెక్టర్‌ నా గురించి అలా మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. ఇన్ని సంవత్సరాల నా కెరీర్‌లో నా గురించి నెగెటివ్‌గా మాట్లాడినవారు రాజమౌళి ఒక్కరే. ‘బాహుబలి’ సినిమా గురించి డైరెక్ట్‌గా ఆయన మాతో మాట్లాడలేదు. నా భర్త బోనీకపూర్‌తోనే మాట్లాడారు. ఆయన కూడా చాలా పెద్ద నిర్మాత. ప్రొడ్యూసర్స్‌కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం ఆయనకి కూడా తెలుసు. డెఫినెట్‌గా ఆయన అలాంటి డిమాండ్స్‌ చెయ్యరు. ఆ సినిమా చేయకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. నేను దీని గురించి ఏం మాట్లాడాననే వివరాలు కూడా తెలుసుకోకుండా నిర్మాత చెప్పిందే నమ్మి.. ఒక పెద్ద ఛానల్‌లో పబ్లిక్‌గా నాపై విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌? నేను ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేశాను. కానీ, ఏ ఒక్క డైరెక్టర్‌ నన్ను ఇలా బాధ పెట్టలేదు. ఇప్పటివరకు రాజమౌళితో కలిసి నేను పనిచేయలేదు. అయినా నా గురించి పూర్తిగా తెలిసినట్టు నాపై నిందలు మోపడం నిజంగా నన్ను బాధించింది’ అన్నారు. 

ఆ ఇద్దరూ హీరోలే.. తండ్రి చిన్న వయసులో చనిపోయాడు.. కొడుకుని షూటింగ్‌లో కాల్చి చంపారు!

బ్రూస్‌ లీ.. ఈ పేరు వినని వారు ప్రపంచంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినా.. బ్రూస్‌ లీ అనే వాడు మార్షల్‌ ఆర్ట్స్‌లో నిపుణుడు అని మాత్రం అందరికీ తెలుసు. అమెరికాలో జన్మించి, హాంకాంగ్‌లో పెరిగిన యోధుడు, నటుడు. అతని కుమారుడు కుమారుడు బ్రాండన్‌ లీ, కుమార్తె షానన్‌ లీ కూడా నటులే.  బ్రూస్‌ లీ అసలు పేరు లీ జాన్‌ ఫాన్‌. అతను తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించేవాడు. అందుకే చైనా వారికి బ్రూస్‌లీ అంటే ఎంతో అభిమానం. చైనీయుల సాంప్రదాయ క్రీడ కుంగ్‌ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్‌ (1950) అనే చిత్రంలో నటించాడు. ఇది ఒక కామిక్‌ క్యారెక్టర్‌ ఆధారంగా రూపొందించిన పాత్ర. అదే లీకి మొదటి సినిమా. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు.  వింగ్‌ చున్‌ విధానంలోని వన్‌ ఇంచ్‌ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్‌ బీచ్‌ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా వెనక్కి లాగి విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్‌ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్‌ ఇంచ్‌ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌లో వన్‌ ఇంచ్‌ పంచ్‌ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్‌ ఇంచ్‌ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్‌ లీ. బ్రూస్‌ లీ తన కెరీర్‌లో హీరోగా నటించిన సినిమాలు 5. అందులో చివరిది ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’. ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్‌ అవుతుందనగా బ్రూస్‌లీ చనిపోయాడు. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా బ్రూస్‌ లీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సరైన టైమ్‌లో ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగారు. ఆ తర్వాత 1973 జూలై 20న నిర్మాత రేమండ్‌ చోతో కలిసి బ్రూస్‌లీ, అతని భార్య డిన్నర్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే బ్రూస్‌లీ పడుకొని ఉన్నాడు. అతన్ని లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతన్ని బ్రతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ, పది నిమిషాల్లోనే బ్రూస్‌ లీ తుది శ్వాస విడిచాడు. 32 సంవత్సరాల అతి చిన్న వయసులో అతను చనిపోవడం అందర్నీ కలచివేసింది. ఇదిలా ఉంటే.. బ్రూస్‌ లీ కుమారుడు బ్రాండన్‌ లీ కూడా 28 సంవత్సరాల అతి చిన్న వయసులోనే చనిపోవడం మరింత బాధాకరం. 1993, మార్చి 31న ‘ది క్రో’ అనే సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. హీరో క్యారెక్టర్‌ తన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లోకి రాగానే తనకు కాబోయే భార్యను హింసించడమే కాకుండా అత్యాచారం చేస్తారు దుండగులు. అది చూసి తట్టుకోలేని హీరో ఆ దుండగులపై కలబడతాడు. అదే సమయంలో అతను రివాల్వర్‌తో హీరోను కాలుస్తాడు. అదీ సన్నివేశం. దీని కోసం తెచ్చిన డమ్మీ రివాల్వర్‌ను సరిగా పరీక్షించకపోవడం, టెక్నికల్‌గా అందులో కొన్ని లోపాలు వుండడంతో అది ఒరిజినల్‌ రివాల్వర్‌లాగే ఆ సమయంలో పనిచేసింది. ఆ సన్నివేశంలో విలన్‌ బ్రాండన్‌లీని కాల్చడంతో అతను వెనక్కి పడిపోయాడు. కట్‌ చెప్పిన తర్వాత కూడా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు గుర్తించిన యూనిట్‌ సభ్యులు బ్రాండన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతను తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.  బ్రూస్‌లీ తన కెరీర్‌లో చేస్తున్న ఐదో సినిమా ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా చనిపోయాడు. అతని కెరీర్‌లో అదే భారీ బడ్జెట్‌ సినిమా. అలాగే బ్రాండన్‌ లీ కూడా అప్పటివరకు హీరోగా ఐదు సినిమాల్లో నటించాడు. ఐదో సినిమా ‘ది క్రో’. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే అతను చనిపోయాడు. బ్రాండన్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో సినిమా ఇదే. తండ్రీకొడుకులు చనిపోయే సమయానికి ఐదో సినిమా షూటింగ్‌లో ఉండడం, అది కూడా భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. బ్రూస్‌లీ సమాధి పక్కనే బ్రాండన్‌ లీ సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబులను దాటుకొని వచ్చిన సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ!

కొన్ని సినిమాలను చూస్తే అందులోని ప్రధానమైన క్యారెక్టర్‌ ఆ హీరో కోసమే పుట్టిందా? అనిపిస్తుంది అతన్ని తప్ప ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా ముద్రపడిపోతుంది. అలాంటి సినిమాలు చేసే అవకాశం రావడం చాలా అరుదు. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయా హీరోలు సద్వినియోగం చేసుకున్నప్పుడే చరిత్ర సృష్టించే సినిమాలు తయారవుతాయి. అలాంటి అరుదైన, అపురూపమైన అవకాశం అల్లూరి సీతారామరాజు రూపంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన చూపించిన తెగువ సాధారణమైంది కాదు. 1 మే, 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలైంది. ఇది సూపర్‌స్టార్‌ కృష్ణ 100వ సినిమా. 1962లోనే నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ మూడు సినిమాల్లో చాలా చిన్న క్యారెక్టర్స్‌ చేశారు. 1965లో ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కేవలం 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు కృష్ణ.    అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎక్కడ బీజం పడిరదంటే.. 1968లో అసాధ్యుడు చిత్రంలోని ఒక నాటకంలో అల్లూరి సీతారామరాజు గెటప్‌ వేశారు కృష్ణ. అప్పుడే డిసైడ్‌ అయ్యారు ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు సినిమా చెయ్యాలని. అంతకుముందు 1958లో వచ్చిన ఆలుమగలు చిత్రంలో జగ్గయ్య కూడా అల్లూరిగా నటించారు. దాన్ని కూడా స్ఫూర్తిగానే తీసుకున్నారు కృష్ణ. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు.. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను అక్కినేని నాగేశ్వరరావుతో తియ్యాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు.  ఎన్‌.టి.రామారావుకి కూడా ఈ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు తయారు చేయించారు. ఇది కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత శోభన్‌బాబు వంతు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. అల్లూరి సినిమాను తియ్యాలనుకున్నారు. దాని కోసం కొంత ప్రయత్నం కూడా చేశారు. కానీ, అది జరగలేదు. కొన్ని క్యారెక్టర్స్‌ కొంతమంది కోసమే రాసి ఉంటాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. చివరికి కృష్ణ వంతు వచ్చింది.  హీరోగా నిలదొక్కుకొని దాదాపు 100 సినిమాల వరకు చేసిన తర్వాత అప్పటివరకు కృష్ణ మనసులో ఉన్న అల్లూరి సీతారామరాజు పాత్ర మరోసారి తెరరూపం దాల్చుకునే న్రయత్నం చేసింది. త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించడానికి సిద్ధమయ్యారు కృష్ణ. అప్పటికి మహారథి బాగా బిజీ రచయిత. ఒక అద్భుతమైన సినిమాకు స్క్రిప్టు తయారుచేసే బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయన అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్‌ చేసుకున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేశారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో ‘అల్లూరి సీతారామరాజు’ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా హార్సిలీ హిల్స్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. సినిమా కొంతభాగం షూటింగ్‌ అయిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో షూటింగ్‌ కొన్నిరోజులు ఆగింది. మిగిలిన సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించమని సన్నిహితులు సలహా ఇవ్వడంతో మళ్ళీ షూటింగ్‌ ప్రారంభించారు కృష్ణ. కొన్ని పోరాట దృశ్యాలను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ చిత్రీకరించారు. 1 మే, 1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ పాత్ర చేసిన కృష్ణను ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా అభినందించారు.    

ఇప్పటికీ.. ఎప్పటికీ ఆ సినిమా రికార్డును క్రాస్‌ చెయ్యడం ప్రపంచంలోని ఏ హీరో వల్లా కాదు!

ప్రస్తుతం వస్తున్న స్టార్‌ హీరోల సినిమాలు, పాత రోజుల్లో విడుదలైన స్టార్‌ హీరోల సినిమాలను కంపేర్‌ చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి సినిమాల విషయాన్నే తీసుకుంటే ఒక స్టార్‌ హీరో చేసిన సినిమా రిలీజ్‌ అయిన మొదటి షో నుంచే హడావిడి మొదలవుతుంది. ఫస్ట్‌ రివ్యూ అంటూ, పబ్లిక్‌ టాక్‌ అంటూ జనాన్ని ఊదరగొట్టేస్తుంటారు. ఇక రెండో రోజు పబ్లిసిటీలో మొదటి రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్‌ చేసింది అనేది యాడ్స్‌ ద్వారా మీడియా అంతా స్ప్రెడ్‌ చేసేస్తారు. ఫస్ట్‌ డే కలెక్షన్‌లో కొత్త రికార్డు అంటారు, లేదా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది అంటారు. అలా రెండోరోజు, మూడో రోజు కలెక్షన్స్‌.. ఇలా ప్రతిరోజూ కలెక్షన్స్‌ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. ఇక మొదటి వారం పూర్తి కాగానే ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌లో రికార్డు క్రియేట్‌ చేసిందంటూ మళ్లీ మొదలు పెడతారు. ఇలా ఒక సినిమా కాదు, స్టార్‌ హీరోల సినిమాలన్నీ దాదాపు ఇదే పద్దతిలో పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక సినిమాని మించి మరో సినిమా రికార్డులు సాధించిందంటూ ప్రచారం చేస్తారు. ఒక సినిమా టోటల్‌గా 600 కోట్లు కలెక్ట్‌ చేస్తే.. మరో సినిమా 1000 కోట్లు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది అంటారు..  తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా సాధించిన రికార్డును గతంలో ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు. ఇక భవిష్యత్తులో దాన్ని బ్రేక్‌ చేసే అవకాశం ఎలాంటి సినిమాకైనా లేదు అనే విషయం మీకు తెలుసా? ఎన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా, ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో రిలీజ్‌ చేసినా ఆ రికార్డును క్రాస్‌ చెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. అదేమిటో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం అది. ఫిబ్రవరి 16, 1981లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సినిమాలోని కొత్తదనం, అద్భుతమైన పాటలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌, దాసరి నారాయణరావు రాసిన మాటలు, టేకింగ్‌.. ఇవన్నీ అప్పటి ప్రేక్షకులు నావెల్టీగా ఫీల్‌ అయ్యారు. అందుకే సినిమాకి బ్రహ్మరథం పట్టారు.  ‘ప్రేమాభిషేకం’ చిత్రం రిలీజ్‌ అయిన అన్ని సెంటర్లలో 100 రోజులు రన్‌ అయింది. అన్ని సెంటర్లలో సిల్వర్‌ జూబ్లీకి కూడా వెళ్లింది. దాదాపు 20 సెంటర్లలో సంవత్సరంపాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఒకప్పుడు వినోదం అనేది సినిమా ద్వారానే ప్రేక్షకులకు అందేది. వినోదం కావాలంటే థియేటర్‌కే వెళ్ళాలి. అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాలపాటు రన్‌ అయ్యేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎంత పెద్ద హిట్‌ సినిమా అయినా 50 రోజులు రన్‌ చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. నెలరోజుల్లో ఓటీటీలో ఎంత పెద్ద సినిమా అయినా ప్రత్యక్షమవుతోంది. అలాంటప్పుడు 100 రోజులు, సిల్వర్‌ జూబ్లీ వరకు ఒక సినిమా వెళ్లడం అనేది ఎప్పటికీ సాధ్యపడే విషయం కాదు.

రౌడీలా ఉన్నాడు.. సినిమా తియ్యగలడా.. అనుకున్న ఎన్టీఆర్‌ని స్టార్‌ హీరోని చేసిన వినాయక్‌!

సినిమారంగంలో అనుకోకుండా ఎన్నో జరుగుతాయి. కొన్ని సక్సెస్‌ని తెచ్చేవి అయితే, మరికొన్ని అపజయాల్లోకి నెట్టేసేవి. అలా అనుకోకుండా కుదిరిన కొన్ని సినిమాలు చరిత్ర సృష్టించిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలా జరిగాయి. అలాంటి వాటిలో ఎన్టీఆర్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన బాక్లస్‌బస్టర్‌ ‘ఆది’ ఒకటి. ‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ స్విట్జర్లాండ్‌కి వెళ్ళింది. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇండియాకి బయల్దేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు ‘నన్ను గుర్తుపట్టారా.. నా పేరు బుజ్జి.. నిన్ను చూడాలని సినిమా మార్నింగ్‌ షో చూసి గుంటూరు నుంచి మీకు ఫోన్‌ చేశాను’ అని గుర్తు చేశాడు. ఆ తర్వాత పక్కనే వున్న వ్యక్తిని పరిచయం చేస్తూ ‘ఇతని పేరు వి.వి.వినాయక్‌.. సాగర్‌గారి దగ్గర అసోసియేట్‌గా చేశాడు. ప్రస్తుతం చంద్రమహేష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి పనిచేస్తున్నాడు. పాటల కోసం ఇక్కడికి వచ్చాం. మీకు కరెక్ట్‌గా సరిపోయే కథ ఒకటి మా దగ్గర ఉంది. వింటారా’ అని అడిగాడు బుజ్జి. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కలవమని చెప్పాడు ఎన్టీఆర్‌. చెప్పినట్టుగానే ఎన్టీఆర్‌ను కలిసారు బుజ్జి, వినాయక్‌. చూడటానికి రౌడీలా ఉన్నాడు.. ఇతను సినిమా తియ్యగలడా అనుకున్నాడు ఎన్టీఆర్‌. వినాయక్‌ మాత్రం కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు.  ‘కథ మొత్తం చెపక్కర్లేదు. ఇండ్రక్షన్‌, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ చెబితే చాలు’ అన్నాడు ఎన్టీఆర్‌. అప్పుడు వినాయక్‌ ‘ఇంట్రో ఒక్కటే చెబుతాను. మీకు నచ్చితే మిగతా కథ వినండి’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అలా రెండు గంటల పాటు కథ విన్న తర్వాత ’మనం ఈ సినిమా చేస్తున్నామన్నా’ అన్నాడు ఎన్టీఆర్‌. దాంతో ఎన్టీఆర్‌తో వినాయక్‌ సినిమా చెయ్యబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో స్ప్రెడ్‌ అయిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వినాయక్‌కి కబురొచ్చింది. వినాయక్‌ వెళ్ళి ఎన్టీఆర్‌ను కలిసాడు. ‘కథ బాగానే ఉంది గానీ లవ్‌ స్టోరీ చెయ్యొద్దంటున్నాడు కొడాలి నాని. మంచి మాస్‌ కథ ఏదైనా ఉంటే చెయ్యమన్నాడు. అలాంటి కథ ఏదైనా ఉంటే చెప్పండి’ అన్నాడు ఎన్టీఆర్‌. అప్పటికప్పుడు మాస్‌ కథ అంటే ఎలా వస్తుంది అనుకుంటూ ఉన్న వినాయక్‌కి తను ఎప్పుడో అనుకున్న రెండు సీన్లు గుర్తొచ్చాయి. అవే చెప్పాడు వినాయక్‌. అవేమిటంటే.. ఒక చిన్న పిల్లాడు బాంబులు వేయడం, బ్లాస్ట్‌లో సుమోలు గాల్లోకి లేవడం.. ఈ రెండు చెప్పాక ‘ఫ్యాక్షన్‌ కథ నాకు హెవీ అయిపోతుందేమో’ అన్నాడు. ఎలాగైనా తనని వదిలించుకోవాలని అలా చెబుతున్నాడని వినాయక్‌కి అర్థమైంది. అయినా ‘ఒక వారం టైమ్‌ ఇవ్వండి. కథ రెడీ చేస్తాను. అది కూడా నచ్చకపోతే డేట్స్‌ ఎవరికైనా ఇచ్చెయ్యండి అని చెప్పాడు.  తిండి, నిద్ర మీద ధ్యాస పెట్టకుండా ప్రతిక్షణం స్క్రిప్‌ రెడీ చెయ్యడానికే ఉపయోగించాడు. ఫలితంగా 58 పేజీల స్క్రిప్ట్‌ రెడీ అయిపోయింది. కథ విన్న ఎన్టీఆర్‌ ఎగిరి గంతేశాడు. సినిమా చెయ్యడానికి ఒక కండిషన్‌ పెట్టాడు ఎన్టీఆర్‌. బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తారు అని చెప్పారు. దానికి వినాయక్‌ అభ్యంతరం చెబుతూ బుజ్జి ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు. నేను అతనికి మాట ఇచ్చాను అన్నాడు. వినాయక్‌లోని మాటకు కట్టుబడే గుణం ఎన్టీఆర్‌కి నచ్చింది. అందుకే వినాయక్‌ చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు. బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో నాగలక్ష్మీ నిర్మాతగా, బుజ్జి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది. అలా ‘ఆది’ సినిమా ప్రారంభమైంది. డైరెక్టర్‌కి, హీరోకి ట్యూనింగ్‌ బాగుంటే సినిమాలు ఎంత త్వరగా పూర్తవుతాయనికి నిదర్శనంగా ‘ఆది’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌, వైజాగ్‌, విజయనగరం ప్రాంతాల్లో 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు.  2002 మార్చి 28న ‘ఆది’ రిలీజ్‌ అయి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 19 ఏళ్ళ వయసులో స్టార్‌ హీరో అయిపోయాడు ఎన్టీఆర్‌. ఇక వి.వి.వినాయక్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.2.35 కోట్లు. అన్నిచోట్టా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. రూ.25 కోట్లకు పైగా కలెక్షన్‌ సాధించి సంచలనం సృష్టించింది. 

ఇద్దరు అగ్ర దర్శకుల పోటీ వల్ల చరిత్ర సృష్టించే సినిమాలు చేసిన ఎన్టీఆర్‌!

1976 వరకు పౌరాణిక, జానపద చిత్రాలు, కుటుంబ కథలతో కూడిన సాంఘిక చిత్రాలు, యాక్షన్‌ మూవీస్‌.. ఇలా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఎన్‌.టి.రామారావుకి ఒక కొత్త ఇమేజ్‌ని తీసుకొచ్చేందుకు, ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా ఇద్దరు దర్శకులు వచ్చారు. వారే దర్శకరత్న దాసరి నారాయణావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఎన్టీఆర్‌తో పోటాపోటీగా సినిమాలు తీసి ఒక దాన్ని మించి మరొకటి హిట్‌ అయ్యే విధంగా సినిమాలను రూపొందించారు. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంతో ప్రారంభమైన వీరి విజయపరంపర పదేళ్ళపాటు కొనసాగింది.  1976లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన డిఫరెంట్‌ మూవీ ‘మనుషులంతా ఒక్కటే’. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్‌ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ తర్వాత 1977లో ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ చిత్రాన్ని చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ లుక్‌ను, ఇమేజ్‌ను మార్చేయడమే కాకుండా ఒక కమర్షియల్‌ హీరోగా ఆయన్ని ప్రజెంట్‌ చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ‘సింహబలుడు’, ‘కేడీ నెం.1’, ‘డ్రైవర్‌ రాముడు’ వంటి సినిమాలతో ఎన్టీఆర్‌ రేంజ్‌ని మరింత పెంచారు రాఘవేంద్రరావు. డ్రైవర్‌ రాముడు తర్వాత పూర్తి పౌరాణిక చిత్రంగా శ్రీమద్‌విరాటపర్వం చిత్రాన్ని చేశారు ఎన్టీఆర్‌. ఆ సినిమా తర్వాత పూర్తి కమర్షియల్‌ సినిమాగా ‘వేటగాడు’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. ఇలా కేవలం రెండు సంవత్సరాల్లో ఎన్టీఆర్‌ హీరోగా 5 సినిమాలు చేశారు రాఘవేంద్రరావు.  ‘మనుషులంతా ఒక్కటే’ తర్వాత 4 సంవత్సరాలకుగానీ మళ్ళీ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు దాసరికి. 1980లో ‘సర్కస్‌ రాముడు’ పేరుతో ఓ కమర్షియల్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. కానీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత వెంటనే అద్భుతమైన సబ్జెక్ట్‌తో ‘సర్దార్‌ పాపారాయుడు’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. దాన్ని మించిన విజయం సాధించేలా రాఘవేంద్రరావు ‘గజదొంగ’ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో ‘సత్యం శివం’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తర్వాత దాసరి ఓ విభిన్నమైన కథాంశంతో ఎన్టీఆర్‌ని ఎంతో డిగ్నిఫైడ్‌గా చూపిస్తూ ‘విశ్వరూపం’ అనే చిత్రాన్ని చేశారు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు, దాసరికి చాలా మంచి పేరు తెచ్చింది.  ఆ మరుసటి సంవత్సరం అంటే 1981లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కొండవీటి సింహం’, 1982లో వచ్చిన ‘జస్టిస్‌ చౌదరి’ చిత్రాలు సాధించిన విజయంతో ఎన్టీఆర్‌ రేంజ్‌ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్‌గా సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు ధీటుగా ఉండేలా ఒక అద్భుతమైన కథతో సినిమా తియ్యాలని ఆలోచించిన దాసరి అదే సంవత్సరం ‘బొబ్బిలిపులి’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎంతో వేగంగా చిత్రాన్ని పూర్తి చేసి అదే సంవత్సరం విడుదల చేశారు. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకుల్లోకి బాణాల్లా దూసుకెళ్ళాయి.  నందమూరి తారక రామారావుతో ఒకరిని మించి ఒకరు సినిమాలు తీసి హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఎంతో స్పోర్టివ్‌గా సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించడంలో ఇద్దరూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఎన్టీఆర్‌తో వీరిద్దరి విజయ పరంపర ‘బొబ్బిలిపులి’తో ముగిసింది. 1982లో ఎన్టీఆర్‌తో ‘జస్టిస్‌ చౌదరి’ చిత్రాన్ని చేసిన రాఘవేంద్రరావు దాదాపు 11 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రాన్ని చేసి మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ‘బొబ్బిలిపులి’ తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చెయ్యలేదు దాసరి.  ఒకే హీరోతో ఇద్దరు విభిన్న స్వభావాలు, విభిన్న తరహా సినిమాలు చేసే అగ్ర దర్శకులు పోటీ పడి మరీ సినిమాలు చేసి ఘనవిజయాలు అందుకోవడం అనేది సినిమా చరిత్రలో అరుదుగా జరుగుతుంది. అది ఎన్‌.టి.రామరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు విషయంలోనే జరిగింది. ఒక సినిమాని మించి మరో సినిమా హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో సినిమాలు చేసిన ఈ ఇద్దరు దర్శకులు ఏ దశలోనూ వివాదాలకు తావు ఇవ్వలేదు. వారిద్దరి మధ్య చిన్న మనస్పర్థ కూడా రాలేదు. అంతటి స్పోర్టివ్‌నెస్‌తో సినిమాలు తీసిన ఈ అగ్ర దర్శకుల నుంచి ఈతరం దర్శకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 

ఆ సినిమా రిలీజ్‌ అవ్వడానికి 18 ఏళ్ళు పట్టింది... ఎన్టీఆర్‌ను చూసి అందరూ షాక్‌ అయ్యారు!

నటరత్న ఎన్‌.టి.రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర పోషించినా అందులో జీవించే ఎన్టీఆర్‌ తన నటజీవితంలో 300కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలాంటి ఎన్టీఆర్‌ చేసిన 300 సినిమాల్లో రెండు సినిమాలకు మాత్రం తను డబ్బింగ్‌ చెప్పలేదు. వేరే వారితో డబ్బింగ్‌ చెప్పించారు. వాటిలో మొదటిది ‘సంపూర్ణ రామాయణం’. ఈ చిత్రాన్ని తమిళ్‌లో రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా నటించారు. ఈ సినిమాలో తెలుగు నటీనటులు కూడా ఉండడంతో తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమాలోని శ్రీరాముడి పాత్రకు వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు. అది చూసిన తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక రెండో సినిమా ‘ఎర్రకోట వీరుడు’. ఈ సినిమా 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1955లో దర్శక పితామహుడు హెచ్‌.ఎం.రెడ్డి.. ఎన్‌.టి.రామారావు కథానాయకుడిగా ‘గజదొంగ’ పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు. వై.ఆర్‌.స్వామి దర్శకుడు. సావిత్రి, బి.సరోజాదేవి హీరోయిన్లు. రాజనాల, ఆర్‌.నాగేశ్వరరావులను విలన్లుగా తీసుకున్నారు.  ఈ చిత్రాన్ని ఏ వేళా విశేషంలో ప్రారంభించారో తెలీదుగానీ, అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యేవి. సినిమా సగానికిపైగా పూర్తయిన తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాను పూర్తి చేసేందుకు కొందరు ముందుకు వచ్చారు. కొంతకాలానికి మళ్ళీ షూటింగ్‌ మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత నటుడు ఆర్‌.నాగేశ్వరరావు మరణించారు. దీంతో మళ్ళీ షూటింగ్‌ ఆగిపోయింది. ఆర్‌.నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్‌ను ఎంపిక చేశారు. మళ్ళీ షూటింగ్‌ ప్రారంభించే నాటికి దర్శకుడు కూడా మారిపోయారు. వై.ఆర్‌. స్వామి స్థానంలో పార్థసారథి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సినిమా టైటిల్‌ను కూడా ‘ధర్మవిజయం’గా మార్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా షూటింగ్‌ను కొనసాగించి మొత్తానికి సినిమాని పూర్తి చేశారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించే సమయానికి అనుకోని ఇబ్బందులు ఎదురు కావడంతో మళ్ళీ సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్‌, సావిత్రి, బి.సరోజాదేవి నటించిన సినిమా కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్‌ చేద్దామని కొందరు ప్రయత్నించారు. కానీ, ఆ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు ఆ సాహసం చేయలేకపోయారు.  అలా ఆగిపోయిన సినిమా గురించి 18 ఏళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. 1973లో ఈ సినిమాని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత టి.గోపాలకృష్ణ. ఈ సినిమాకి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అక్కడే మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాకి ఎన్టీఆర్‌తో డబ్బింగ్‌ చెప్పించాలి. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పమని ఆయన్ని ఎలా అడగాలి అనేది పెద్ద సమస్య. ఒకవేళ ధైర్యం చేసి అడిగినా ఆయన దాన్ని ఎలా తీసుకుంటారో తెలీదు. అందుకే ఎన్టీఆర్‌ను ఈ విషయం గురించి అడగలేదు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ దశరథరామిరెడ్డితో డబ్బింగ్‌ చెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా డబ్బింగ్‌ పూర్తి చేశారు. సినిమా పేరును మరోసారి మార్చారు. ఈసారి ‘ఎర్రకోట వీరుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తమిళ్‌లో ‘తిరుడదే తిరుడన్‌’ అని పేరు పెట్టారు. 1973 డిసెంబర్‌ 14న ఈ సినిమా తెలుగులో విడుదలైంది. అప్పటికే ఎన్టీఆర్‌ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వాడే వీడు’ చిత్రాలు విడుదలై విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదలైన ‘ఎర్రకోట వీరుడు’  చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఎన్టీఆర్‌ పాత్ర ప్రవేశిస్తుంది. చప్పట్లు, ఈలలతో ఎన్టీఆర్‌కు స్వాగతం పలికిన ప్రేక్షకులు మరుక్షణం షాక్‌ అయ్యారు. ఎన్టీఆర్‌కు వేరొకరి వాయిస్‌ పెట్టడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఎన్టీఆర్‌తోనే డబ్బింగ్‌ చెప్పించి ఉంటే మంచి విజయం సాధించేదని  అప్పట్లో ప్రేక్షకులు, కొందరు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా 18 సంవత్సరాలు సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించి ఎట్టకేలకు రిలీజ్‌ చేసినా ఆ సినిమా వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూశారు ఆయా నిర్మాతలు. 

ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించిన కొరియోగ్రాఫర్‌ జీవితం అలా ముగిసింది!

మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పాటలను అందంగా తెరపై ఆవిష్కరించడంలో కొరియోగ్రాఫర్‌ పాత్ర ఎంతో కీలకం. కొన్ని సినిమాల్లోని పాటలు ఎంత బాగున్నా ఆ పాటలకు సరైన నృత్యరీతులు కుదరకపోవడం వల్ల అందర్నీ ఆకట్టుకోలేవు. కొన్ని సినిమాల్లోని పాటలకు వేసే స్టెప్పుల వల్ల రిపీట్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. పాటలకు అలాంటి స్టెప్స్‌ కంపోజ్‌ చేసి ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన కొరియోగ్రాఫర్‌ సలీమ్‌ మాస్టర్‌. ఈ మూడు భాషల్లో ఏ హీరో అయినా, ఏ హీరోయిన్‌ అయినా తమకు సలీమ్‌ మాస్టరే కావాలి అని పట్టుపట్టేవారు.  అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఒక కారణం ఉందని చెప్పేవారు సలీమ్‌. సాధారణంగా డాన్స్‌ మాస్టర్లు తమకు వచ్చిన విద్యను ప్రదర్శించేందుకు, తమకు ఎంత టాలెంట్‌ ఉందో నలుగురికీ చెప్పేందుకు కష్టమైన స్టెప్పులతో పాటలు కంపోజ్‌ చేసేవారు. ఇతను డాన్స్‌ మాస్టర్‌ కాబట్టి ఆ స్టెప్పులు అవలీలగా వేయగలడు. సినిమా కోసం అప్పటికప్పుడు చెప్పింది చెప్పినట్టు చేసే హీరోహీరోయిన్లకు అది  చాలా కష్టంగా ఉండేది. ఒక పాట పూర్తి చేయడానికి నానా కష్టాలు పడేవారు. హీరోహీరోయిన్లు తనను మాత్రమే ఎందుకు కోరుకునేవారు అనే విషయాన్ని తెలియజేస్తూ ‘ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా బాడీ లాంగ్వేజ్‌ అనేది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలకు స్టెప్పులు కంపోజ్‌ చేస్తాను. ఎలాంటి స్టెప్పులైతే వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా అందంగా చెయ్యగలరో గమనించి దానికి తగ్గట్టుగా కంపోజ్‌ చేస్తాను. దాంతో ఏమాత్రం శ్రమ తెలియకుండా పాటలు పూర్తి చేసేవారు. అందుకే ప్రతి సినిమాకీ నన్నే పిలిచేవారు’ అంటూ అసలు విషయం చెప్పారు సలీమ్‌.  తెలుగులో ఎన్‌.టి.రామారావు, తమిళ్‌లో ఎం.జి.రామచంద్రన్‌, జయలలిత.. ఈ ముగ్గురూ ఒకప్పుడు స్టార్సే.. ఆ తర్వాత ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే ఈ ముగ్గురు నటించిన చాలా సినిమాలకు సలీమ్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించిన ఘనత సలీమ్‌ మాస్టర్‌కి దక్కింది. అయితే విధి బలీయమైనది. ఎంతటి స్టేటస్‌ ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఒక్క ఘటనతో జీవితాలు తారుమారు అవుతాయి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.. ఈ ఉదాహరణ సలీమ్‌ మాస్టర్‌కి కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న సలీమ్‌ ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. కడుపునిండా భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేశాడు.  వివరాల్లోకి వెళితే.. డాన్స్‌ మాస్టర్‌గా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన సలీమ్‌ మద్రాస్‌ టి.నగర్‌లోని నార్త్‌ ఉస్మాన్‌ రోడ్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌ను కట్టించాడు. దాని గృహ ప్రవేశానికి ఎన్‌.టి.రామారావు హాజరయ్యారు.  బిల్డింగ్‌ కిందే షాపులు కూడా ఉండేవి. అందులోని ఒక షాప్‌లో ఇద్దరు సోదరులు హార్డ్‌వేర్‌ బిజినెస్‌ చేసేవారు. వారికి ఆ షాప్‌ బాగా కలిసొచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల షాప్‌ ఖాళీ చెయ్యాల్సిందిగా వారిని కోరాడు సలీమ్‌. వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్లి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో తన మనుషులతో వారిపై దాడి చేయించాడు. ఆ దాడిలో ఇద్దరు సోదరుల్లో ఒకరు చనిపోయారు. ఈ కేసులో సలీమ్‌తోపాటు పది మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సలీమ్‌కి జైలు శిక్ష పడిరది. సినిమా ఇండస్ట్రీకి కొత్త డాన్స్‌మాస్టర్స్‌ రావడం అప్పుడే మొదలైంది. దీంతో సలీమ్‌కి అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో అతను మర్డర్‌ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి తిరిగి వచ్చేసరికి అతని కుటుంబం చెల్లా చెదురైపోయింది. ఉన్న ఆస్తిని అమ్మేసి అతని భార్య.. పిల్లలతో సహా కేరళ వెళ్లిపోయింది. ఏం చెయ్యాలో తోచక సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలోనే తాగుడికి బానిస అయ్యాడు. పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చేసింది కాబట్టి ఇక్కడే ప్రయత్నాలు చెయ్యాలని హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాడు. కృష్ణానగర్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ, లాభం లేకపోయింది. మరో ప్రయత్నంగా ‘సినిమా డాన్సులు నేర్పబడును’ అని బోర్డు పెట్టుకొని స్టూడెంట్స్‌ కోసం ఎదురుచూశాడు. అతని పరిస్థితి చూసిన కొందరు హీరోలు అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేసేవారు. ఆ డబ్బు కొన్నిరోజుల్లో ఖర్చయిపోయేది. మళ్ళీ పరిస్థితి మామూలే. డాన్స్‌ స్కూల్‌ కోసం తీసుకున్న రూమ్‌కి కూడా అద్దె కట్టలేకపోవడంతో దాన్ని కూడా మూసేశాడు.  ఆ తర్వాత పొట్ట కూటి కోసం ఒక అపార్ట్‌మెంట్‌లో చాలా కాలం వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా ఉండలేక తిరిగి చెన్నయ్‌ వెళ్లిపోయాడు. అక్కడ ఒక స్లమ్‌ ఏరియాలో రేకులతో కట్టిన చిన్న రూమ్‌లో బతుకు వెళ్లదీశాడు. ఆ స్థితిలో ఉన్న సలీమ్‌ని గుర్తుపట్టిన ఒక సినిమా రిపోర్టర్‌ అతన్ని చేరదీసి కడుపునిండా భోజనం పెట్టించాడు. అంతేకాదు, అతనికి ఏదైనా సాయం చెయ్యాలని తనకు చేతనైనంత వరకు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఓ వెలుగు వెలిగిన సలీమ్‌ చివరికి అత్యంత దీనావస్థకు చేరి 2011లో కన్నుమూశారు. 

‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టింది.. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని మీకు తెలుసా?

సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు ఒక పట్టాన సెట్‌ అవ్వవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అవాంతరం వల్ల అనుకున్న ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లిపోతుంటుంది. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాకి కూడా అలాగే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్‌లో 2005లో ‘ఛత్రపతి’ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది. అయితే ఆ కాంబినేషన్‌ వెనుక కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఉంది. రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ 2001లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. అప్పటికే ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతనితో సినిమా చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ, అది జరగలేదు. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘ఈశ్వర్‌’ ప్రారంభమైంది. ఆ తర్వాత 2003లో రాజమౌళి ‘సింహాద్రి’ చేశాడు. దాని తర్వాతైనా ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకున్నాడు. అప్పుడూ కుదరలేదు. ప్రభాస్‌ 5 సినిమాలు హీరోగా చేసిన తర్వాతగానీ రాజమౌళి వంతు రాలేదు.  నిర్మాత భోగవల్లి ప్రసాద్‌.. రాజమౌళి కుటుంబానికి చాలా సన్నిహితుడు. డైరెక్టర్‌గా మెల్లగా ఎదుగుతున్న రాజమౌళితో సినిమా చెయ్యాలనుకున్నాడు. ఒక పక్క ప్రభాస్‌తో రాజమౌళి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో భోగవల్లి ప్రసాద్‌కి ఈ సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ఆమధ్యకాలంలో తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్‌తో సినిమా రాలేదు. అలాంటి కథ ఒకటి రెడీ చెయ్యమని తండ్రి విజయేంద్రప్రసాద్‌తో చెప్పాడు రాజమౌళి. ఆ సెంటిమెంట్‌తో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు విజయేంద్రప్రసాద్‌. ఒకరోజు రాత్రి నిద్రపట్టక అలా ఆలోచిస్తున్నాడు. 1988లో అతను ఒక వీడియో క్యాసెట్‌ ద్వారా చూసిన ‘స్కార్‌ఫేస్‌’ సినిమా గుర్తొచ్చింది. అందులోని సెంటిమెంట్‌ అతనికి బాగా నచ్చింది. ప్రభాస్‌, రాజమౌళి సినిమాకి ఓ స్టోరీ ఐడియా వచ్చింది. వెంటనే నిద్రపోతున్న భార్యను లేపి తను అనుకున్న కథని వినిపించి పడుకున్నాడు. అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. అతని భార్య మాత్రం ఆ స్టోరీ గురించే ఆలోచిస్తోంది. అందులోని సెంటిమెంట్‌ ఆమెకు కన్నీళ్ళు తెప్పించింది. మరుసటి రోజు ఆఫీస్‌లోని వారికి ఈ కథను వినిపించాడు విజయేంద్రప్రసాద్‌. పద్మాలయా స్టూడియోలో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న గోపి అక్కడే ఉన్నాడు. ఆ స్టోరీ విన్నాడు. ‘భలే స్టోరీ సార్‌.. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టండి బాగుంటుంది’ అని సలహా ఇచ్చాడు.  ఛత్రపతి శివాజీకి అతని తల్లి ధైర్యాన్ని నూరిపోసి వీరుడిగా నిలబెట్టింది. విజయేంద్రప్రసాద్‌ చెప్పిన కథలో కూడా తల్లే కొడుకుకి ఛత్రపతి గురించి, అతని సాహసాల గురించి చెబుతుంది. అది కొడుకు మనసులో ఓన్‌స్పిరేషన్‌గా నిలిచింది. రాజమౌళికి కూడా కథ నచ్చింది. సినిమా ప్రారంభించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సెట్‌ అయ్యారు. ఓ పక్క మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ‘ఎ వచ్చి ’బి‘పై వాలే..’ పాటను బాలీవుడ్‌ సింగర్‌ అద్నన్‌ సామితో పాడిరచాలనుకున్నారు. దానికి తగ్గట్టు ట్యూన్‌ కూడా చేశారు. కానీ, ఆ టైమ్‌లో అద్నన్‌ అమెరికాలో ఉండడంతో కీరవాణి పాడిన ట్రాక్‌నే ఉంచేశారు. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌ రూ. 12.5 కోట్లకు చేరుకుంది. సినిమా రిలీజ్‌ అయింది. మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా మెల్లగా పుంజుకొని సిల్వర్‌ జూబ్లీ మూవీగా రికార్డు క్రియేట్‌ చేసి 54 కేంద్రాల్లో ‘ఛత్రపతి’ 100 రోజులు ప్రదర్శితమైంది.  ఈ కథ విని ఒక్కమాటలో ‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టండి బాగుంటుంది అని చెప్పిన గోపి ‘ఛత్రపతి’ రిలీజ్‌ కావడానికి ముందే చనిపోయాడు. ఒక మంచి కథకు అద్భుతమైన టైటిల్‌ చెప్పిన గోపికి కొంత ఆర్థిక సాయం చెయ్యాలనుకుంది ‘ఛత్రపతి’ యూనిట్‌. కానీ, అతను చనిపోయాడని తెలుసుకొని షాక్‌ అయ్యారు విజయేంద్రప్రసాద్‌. అతని కుటుంబానికైనా సాయం చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ, అతని కుటుంబం ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటివరకు తెలియలేదట. 

చిన్న వయసులో టాప్‌ హీరోయిన్‌ అయింది.. చిన్న వయసులోనే మృత్యువు ఒడి చేరింది!

ఆర్తీ అగర్వాల్‌.. అందం, అభినయం కలగలిసిన అమ్మాయి. గుజరాతీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ లంగా, ఓణీ వేస్తే అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆమెను హీరోయిన్‌గా స్వీకరించారు. ఆమె నటించిన సినిమాలను ఆదరించారు. అతి చిన్న వయసులోనే అంటే 17 సంవత్సరాల వయసులోనే 2001లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘పాగల్‌పన్‌’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీలో నటించిన ఒకే ఒక చిత్రం అది. 2015 వరకు కొనసాగిన ఆమె సినీ ప్రయాణంలో 26 సినిమాల్లో నటించింది. అందులో ఒక తమిళ సినిమా ఉంది. మిగతా 24 సినిమాలు తెలుగులో చేసినవే. అంటే తెలుగు ప్రేక్షకులు ఆమెను అంతగా ఓన్‌ చేసుకున్నారని చెప్పొచ్చు.  గ్లామర్‌ ప్రపంచంలో పైకి ఎదగాలన్న ఆశతో..! అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ కుటుంబంలో 1984 మార్చి 5న న్యూజెర్సీలో ఆర్తి అగర్వాల్‌ జన్మించింది. వీమా అగర్వాల్‌, కౌశిక్‌ అగర్వాల్‌ ఆమె తల్లిదండ్రులు. 14 సంవత్సరాల వయసులోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఆర్తీ. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్‌ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్‌ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ.. ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్‌ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని ఆర్తీ తండ్రిని ఒప్పించారు. దాంతో ముంబాయి చేరుకున్న ఆర్తీ ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. 2001లో ‘పాగల్‌పన్‌’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. అదే సంవత్సరం వెంకటేశ్‌ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆర్తీకి వరస అవకాశాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి టాలీవుడ్‌లోనే ఉండి పోయింది తప్ప మరో భాషలో నటించలేదు. మధ్యలో ఒక తమిళ్‌ సినిమా మాత్రం చేసింది. 2000 దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి టాప్‌ హీరోల సరసన నటించింది. అంతేకాదు, మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ రవితేజ, ఉదయ్‌కిరణ్‌, తరుణ్‌ వంటి యంగ్‌ హీరోల పక్కన కూడా హీరోయిన్‌గా నటించిన ఘనత సాధించింది ఆర్తీ.  రెండు సంవత్సరాలు కూడా నిలవని వైవాహిక జీవితం! వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్‌, వసంతం, సంక్రాంతి చిత్రాల్లో నటించిన ఆర్తీ చిరంజీవితో నటించిన ఇంద్ర ఆమెను టాప్‌ హీరోయిన్‌ని చేసింది. మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు, రవితేజతో వీడే, నాగార్జునతో నేనున్నాను,  ప్రభాస్‌తో అడవిరాముడు, ఎన్టీఆర్‌తో నరసింహుడు, సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్‌తో గోరింటాకు, వేణుతో దీపావళి వంటి సినిమాల్లో నటించి తక్కువ సమయంలో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. 2007లో సికింద్రాబాద్‌ రాణీగంజ్‌లోని ఆర్య సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉజ్వల్‌ విక్రమ్‌ను ఆర్తీ పెళ్లి చేసుకుంది. అయితే వారి కాపురం రెండు సంవత్సరాలకు మించి కొనసాగలేదు. 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.  కెరీర్‌పరంగా ఎదగాలన్న పట్టుదలే ఆమె ప్రాణం తీసింది! ఒక దశలో బాగా బరువు పెరిగిపోవడం వల్ల అవకాశాలు కూడా తగ్గాయి. బరువు తగ్గి కెరీర్‌ పరంగా ఇంకా ఎదగాలని, తన మునుపటి స్టార్‌డమ్‌ను తిరిగి తెచ్చుకోవాలన్న పట్టుదల ఆమెలో పెరిగింది. ఒక సినిమాలోని పాత్ర కోసం బరువు తగ్గాలని మేకర్స్‌ సూచించారు. అప్పటికే 89 కేజీల బరువు వున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గేందుకు లైపోసక్షన్‌ చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత ఆమెకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆపరేషన్‌ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్‌ 2015 జూన్‌ 6న కన్ను మూసింది. అయితే అంతకుముందు 2005లో క్లీనింగ్‌ కెమికల్‌ తాగడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో హీరో తరుణ్‌తో తనకు సంబంధం ఉందన్న వార్త బాగా ప్రచారంలోకి రావడంతో ఆత్మహత్యా యత్నం చేసానని చెప్పింది. ఆ తర్వాత 2006లో అనుమానాస్సద పరిస్థితిలో హాస్పిటల్‌లో జాయిన్‌ అయింది. మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల గాయాలైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చి, చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ చూసి, అదే చిన్న వయసులోనే ఆర్తీ అగర్వాల్‌ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడం ప్రేక్షకులను, ఆమె అభిమానులను కలచివేసింది. 

300కి పైగా సినిమాల్లో నటించినా... ఇద్దరు భర్తలతో నానా ఇబ్బందులు పడిన హీరోయిన్‌!

సినిమా రంగంలో పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం. ఆరోజుల్లో ఇలా ఉండేవారు కాదు, మా రోజుల్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు అని చెప్పడానికి సినిమా రంగంలో అవకాశం లేదు. ఎందుకంటే సినిమా పుట్టినప్పటి నుంచి నటీనటులు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోవడం జరుగుతూనే ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. పాత తరం హీరోయిన్లలో రాజసులోచనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆరోజుల్లో మహిళలు నాటక రంగంలో, సినిమా రంగంలో ప్రవేశించేందుకు పెద్దవారు ఒప్పుకునేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో రాజసులోచన నాటక రంగంలో, నృత్య ప్రదర్శనలోనే కాకుండా కార్‌ డ్రైవింగ్‌, బోట్‌ రైడిరగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మార్చి 5 రాజసులోచన వర్థంతి.  ఈ సందర్భంగా ఆమె జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు, తన సినీ జీవితాన్ని ఎలా కొనసాగించారు అనే విషయాలు తెలుసుకుందాం.  1934 ఆగస్ట్‌ 15న విజయవాడలో జన్మించారు రాజసులోచన. ఈమె అసలు పేరు రాజీవలోచన. అయితే స్కూల్‌ రిజిస్టర్‌లో రాజసులోచన అని పొరపాటున రాయడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఆమెకు నాట్యంపై ఆసక్తి ఏర్పడడానికి కారణం ఆమె మేనమామ. సుగుణ విలాస సభ అనే సంగీత మండలిని నెలకొల్పి నాటక, నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారాయన. ఆ ప్రదర్శనలు చూసి వచ్చిన తర్వాత వారు ఎలా పాడారో, ఎలా నృత్యం చేశారో ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చూపించేది రాజసులోచన. ఏడేళ్ళ వయసులో సంగీతం నేర్చుకోవడానికి పంపించారు తల్లిదండ్రులు. అయితే సంగీతం కంటే నృత్యంపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు గమనించి అప్పటి నుంచే నృత్యం నేర్పించారు. యుక్తవయసు రావడంతో మూడో ఫారంలోనే చదువు మాన్పించేశారు. తన 13వ ఏట తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు రాజసులోచన. తనకు తెలిసిన విద్యను నలుగురికీ నేర్పాలన్న ఉద్దేశంతో తమ చుట్టుపక్కల అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేవారు. అలా ఓ యువతికి నృత్యం నేర్పించేందుకు వాళ్ళ ఇంటికి తరచూ వెళ్లేది. అక్కడ పరమశివం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్ళు మిలటరీలో పనిచేసిన అతను ప్రగతి స్టూడియోలో స్టోర్‌ కీపర్‌గా పనిచేసేవాడు. అతను చెప్పే మాటలకు పడిపోయింది రాజసులోచన. పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో పరమశివాన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా కూతురి మాట కాదనలేక 1951 సెప్టెంబర్‌ 11న మద్రాస్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాల్‌లో కరుణానిధి సమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదికి వారికి ఒక బాబు పుట్టాడు. అతనికి శ్యామ్‌ అని పేరు పెట్టారు. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది రాజసులోచన. తొలుత నటిగా నిలదొక్కుకునేందుకు తెలుగు, తమిళ్‌ సినిమాల్లో వ్యాంప్‌ వేషాలు వేసినా ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన సొంత ఊరు సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ అయింది రాజసులోచన. అది ఆమెకు సంతోషం కలిగించినా ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. భర్త పరమశివం తరచూ ఆమెను వేధిస్తుండడంతో అది భరించలేక భరించలేక అతనికి విడాకులు ఇచ్చేసింది.  భర్త నుంచి విడిపోయిన తర్వాత కెరీర్‌ పరంగా కొన్ని ఆటుపోట్లకు గురయ్యారు రాజసులోచన. తన బాధలు చెప్పుకునేందుకు ఒక మనిషి ఉంటే బాగుండేది అనుకుంటున్న సమయంలో దర్శకుడు సి.ఎస్‌.రావులోని మంచితనం ఆమెను ఆకర్షించింది. తన బాధలు అతనితో చెప్పుకొని సేద తీరేది. ఆమె నటించిన చాలా సినిమాలకు సి.ఎస్‌.రావు దర్శకుడు. షూటింగ్‌ సమయంలో రాజసులోచన అతనితో చనువుగా ఉండడం చూసి పరిశ్రమలో వీరి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి తెరదించేందుకు రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సి.ఎస్‌.రావు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజసులోచన కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. 1963లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1966 జూలై 27న వీరికి కవల పిల్లలు పుట్టారు. ఆరోజుల్లో కవల పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదు. అందుకే ఈ వార్త అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శోభన్‌బాబు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె చిన్నప్పటి పాత్రలను రాజసులోచన కూతుళ్ళు పోషించారు.  రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పెళ్ళయిన తొలి రోజుల్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న సి.ఎస్‌.రావు, రాజసులోచన దంపతులు పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వారిలో సఖ్యత లోపించింది. అభిప్రాయ భేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆమె జీవితంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు ఆమెకు కలిసి రాలేదు. తొలిరోజుల్లో మొదటి భర్త పరమశివంతో, చివరి రోజుల్లో రెండో భర్త సి.ఎస్‌.రావుతో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి 2013 మార్చి 5 తెల్లవారుజామున అనారోగ్య కారణాల వల్ల తన నివాసంలో తుది శ్వాస విడిచారు రాజసులోచన. 

అర్థరాత్రి ఒంటిగంటకు ‘మెహబూబా.. మెహబూబా’... అదే ‘ముక్కాలా.. ముకాబ్‌లా’ అయ్యింది!

ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌కు, సింగర్‌ నాగూర్‌బాబుకి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఎ.ఆర్‌.రెహమాన్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి అతను మ్యూజిక్‌ చేసిన సినిమాల్లోని పాటలు పాడుతున్నాడు. రెహమాన్‌ సంగీత సారధ్యంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కంటే ఎక్కువ పాటలు పాడిన ఘనత నాగూర్‌బాబుకే దక్కుతుంది. అతనంటే రెహమాన్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతో నాగూర్‌బాబు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్క సినిమా ‘సోంబేరి’ ఆడియో ఫంక్షన్‌కి ప్రత్యేకంగా హాజరయ్యాడు రెహమాన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో ‘ముక్కాలా.. ముకాబ్‌లా..’ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాట రికార్డింగ్‌ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.   శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా రూపొందిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని ఆ పాట విశేషాలను నాగూర్‌బాబు తెలియజేస్తూ ‘నేను ఎప్పటిలాగే పలు స్టూడియోలకు వెళ్లి రికార్డింగ్స్‌లో పాల్గొని సాయంత్రం ఇంటికి వెళుతున్నాను. ఆ సమయంలో రెహమాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక పాట పాడాల్సి ఉంది రమ్మన్నారు. రెహమాన్‌ జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. రాత్రంతా పనిచేసి పగలు నిద్రపోతారు. అందుకే సాయంత్రం ఫోన్‌ చేశారు. నేను రాత్రి 11 గంటలకు స్టూడియోకు వెళ్లాను. అప్పటికి నేను పాడాల్సిన పాటకు లిరిక్స్‌ రెడీ అవ్వలేదు. నన్ను వెయిట్‌ చెయ్యమన్నారు. స్టూడియోకి దగ్గరలో ఉన్న ఓ హోటల్‌కి వెళ్లి టిఫిన్‌ చేసి వచ్చి సోఫాలో కూర్చున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. అర్థరాత్రి ఒంటిగంటకు రెహమాన్‌ నుంచి పిలుపొచ్చింది. నాకు నిద్ర మత్తు వదల్లేదు. అలాగే స్టూడియోలోకి వెళ్లాను. అది మెక్సికన్‌ స్టైల్‌లో ఉండే పాటని, చాలా డిఫరెంట్‌గా పాడాల్సి ఉంటుందని చెప్పారు రెహమాన్‌. ఆ పాటను రకరకాలుగా పాడి వినిపించాను. కానీ, ఏదీ అతనికి నచ్చలేదు. పైగా ఆ పాటకు ఒక కండిషన్‌ కూడా పెట్టారు. ‘మీరు పాట పాడేటపుడు అరిచినట్టు ఉండాలి.. అదే సమయంలో అరిచినట్టు కూడా ఉండకూడదు. మరి ఆలోచించండి ఎలా పాడతారో’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ‘నాకు కొంచెం టైం ఇస్తే టీ తాగి ఆలోచిస్తాను’ అన్నాను.  బయటికి వచ్చి ఓ హోటల్‌లో టీ తాగుతుండగా దూరం నుంచి ‘షోలే’లో ఆర్‌.డి.బర్మన్‌ పాడిన ‘మెహబూబా.. మెహబూబా’ పాట వినిపించింది. నాకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. స్టూడియోకి వెళ్లి ఆర్‌.డి.బర్మన్‌ని అనుకరిస్తూ గొంతు మార్చి ‘ముక్కాలా.. ముకాబ్‌లా’ పాట పాడాను. అది రెహమాన్‌కి బాగా నచ్చింది. మ్యూజిక్‌ లేకుండా 20 నిమిషాల్లో ఆ పాట పాడేశాను. పది రోజుల తర్వాత ఆ పాట ఫైనల్‌ వెర్షన్‌ వినిపించారు రెహమాన్‌. నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఏం మేజిక్‌ చేశారో తెలీదు. వింటున్నప్పుడు అంత అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆ పాట వెనుక ఉన్న కథను వివరించారు నాగూర్‌బాబు. 

అలా చేసినందుకు దిల్‌రాజు నన్ను తిట్టారు : సుకుమార్‌

1998లో ఓ పెద్ద కళాశాలలో మేథమెటిక్స్‌ లెక్చరర్‌. జీతం నెలకు. రూ.75 వేలు పైమాటే. అప్పట్లో ఆ జీతం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆ ఉద్యోగం రుచించలేదు. చిన్నతనం నుంచి సినిమా రంగంపై ఉన్న మక్కువ ఆ ఉద్యోగాన్ని స్థిరంగా చెయ్యనివ్వలేదు. తండ్రితో మాట్లాడి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట ఎడిటర్‌ మోహన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. 2004లో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడుగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేశాడు. అతనే.. ఇప్పుడు ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న సుకుమార్‌.   తొలి సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో తనమీద తనకే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. ఎవరు ఏం చెప్పినా వినకపోవడం అనే అలవాటు అబ్బింది. ఆ సమయంలోనే దిల్‌రాజుతో మనస్పర్థలు వచ్చాయి. తన రెండో చిత్రాన్ని మహేష్‌తోగానీ, అల్లు అర్జున్‌తోగానీ చేద్దామని డిసైడ్‌ అయ్యాడు సుకుమార్‌. ఈ విషయంలో నిర్మాత దిల్‌రాజు సహకరించకపోవడంతో దాన్ని తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. ఆ కోపంతోనే హీరో రామ్‌ దగ్గరకు వెళ్లి కథ చెప్పి రాత్రికి రాత్రే సినిమా కన్‌ఫర్మ్‌ చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే తన రెండో సినిమాను స్టార్ట్‌ చేసేశాడు సుకుమార్‌.  ఈ వ్యవహారం గురించి ఓ సందర్భంలో సుకుమార్‌ స్వయంగా తెలియజేస్తూ ‘నేను పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు బొత్తిగా తెలిసేవి కావు. సొసైటీలోని వారంతా నాలాగే ఉంటారు అనుకునేవాడ్ని. నా తొలి సినిమా ‘ఆర్య’ పెద్ద హిట్‌ అవ్వడంతో ఇక మనకు తిరుగులేదు అనుకున్నాను. రెండో సినిమాగా బన్నితోనే ‘జగడం’ చెయ్యాలనుకున్నాను. ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ అయిపోయింది. ఆ సమయంలోనే దిల్‌రాజుతో సమస్య వచ్చింది. అందుకే వెంటనే రామ్‌తో ‘జగడం’ స్టార్ట్‌ చేశాను. ఓపెనింగ్‌కి అల్లు అర్జున్‌ని, దిల్‌రాజుని పిలిచాను. అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు ‘నీకు బుద్ధుందా? ఏంటి ఇలా చేశావ్‌. కోపం వస్తే, కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్‌ చేసేస్తావా’ అని తిట్టారు. నేను అమాయకుడినని ఆయనకు తెలుసు. అయితే అలా చేయడం నా గొప్పతనం అనుకున్నాను. ‘మీరు కథలో ఆ మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలి’ అంటున్నారు అసలు కుదరదు అని చెప్పేశాను. మొదటి సినిమా హిట్‌ కావడంతో నా జడ్జిమెంట్‌ను ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేసేది. వాస్తవానికి ‘జగడం’లో రామ్‌ చేసిన పాత్ర మహేష్‌ లేదా బన్ని చేస్తే బాగుండేది. తమ్ముడి పాత్రలో రామ్‌ నటించి ఉంటే సరిపోయేది.  అందుకే ‘జగడం’ ఫ్లాప్‌ అయింది. ఈ సినిమా నేర్పిన గుణపాఠంతో నాలోనూ మార్పు వచ్చింది. ఆరోజు నుంచి ఎవరేం చెప్పినా ఓపికగా వినడం అలవాటు చేసుకున్నాను’ అంటూ ‘ఆర్య’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ‘జగడం’ సినిమా ఫ్లాప్‌ అవ్వడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి వివరించారు సుకుమార్‌. 

‘పదహారేళ్ళ వయసు’ క్లైమాక్స్‌ విషయంలో దర్శకుడు, నిర్మాత మధ్య వివాదం.. చివరికి ఏమైంది?

కొన్ని సినిమాలను ఎవర్‌గ్రీన్‌ అంటారు. అలాంటి ఎవర్‌గ్రీన్‌ సినిమాల్లో తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘16 వయతినిలే’ ఒకటి. ప్రముఖ దర్శకుడు భారతీరాజాకు ఇది తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడుగా తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు భారతీరాజా. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, శ్రీదేవిలతో ఆయన చేసిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’గా, హిందీలో ‘సోల్వా సావన్‌’గా రీమేక్‌ చేశారు. హిందీ వెర్షన్‌ని కూడా భారతీరాజేయే రూపొందించారు. తెలగు వెర్షన్‌ని మాత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్‌ చేశారు. తెలుగు వెర్షన్‌ నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.  ‘16 వయతినిలే’ చిత్రానికి నిర్మాత ఎస్‌.ఎ.రాజ్‌కన్ను. అతను ఓ లారీ ఓనర్‌. సినిమా మీద ఇంట్రెస్ట్‌తో రూ.6 లక్షల బడ్జెట్‌లో అతని లారీని కూడా అమ్మేసి సినిమా చేశాడు. ఆ తర్వాత రిలీజ్‌ చెయ్యడానికి డబ్బు లేక కేవలం 6 థియేటర్లలోనే సినిమాను రిలీజ్‌ చేశారు. మొదటి రెండు వారాలు సినిమాకి ఎలాంటి టాక్‌ లేదు. మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. ఆ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తే అద్భుతంగా ఉంటుందని భావించిన మిద్దే రామారావు రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నించారు. ఆరోజుల్లో ఎలాంటి సినిమాకైనా రీమేక్‌ రైట్స్‌కి 30, 40 వేల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. కానీ, ఈ సినిమాకి మాత్రం లక్షన్నర డిమాండ్‌ చేశారు. నిర్మాత లక్ష ఇస్తానన్నాడు. చివరికి రూ.1,17,500కి రైట్స్‌ తీసుకున్నారు. ఒక్కసారిగా అంత రేటు పెట్టి రైట్స్‌ తీసుకుంటే మిగతా వారు కూడా పెంచేస్తారు అని కొందరు నిర్మాతలు గొడవ చేశారు. అవేవీ పట్టించుకోని మిద్దే రామారావు తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  దర్శకుడుగా కె.రాఘవేంద్రరావును ఎంపిక చేసుకున్నారు. అప్పటికే ‘అడవి రాముడు’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమా చేసిన ఆయన ఇలాంటి చిన్న సినిమా చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విశేషంగానే చెప్పుకోవచ్చు. ఆయనకు రూ.55 వేలు రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేశారు. ఆ తర్వాత తమిళ్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవినే తెలుగులోనూ తీసుకున్నారు. మొదట ఆమెకు రూ.1 లక్ష రెమ్యునరేషన్‌ అడిగారు శ్రీదేవి తల్లి. చివరికి రూ.30 వేలకి ఫైనల్‌ చేసుకున్నారు. ఇక తమిళ్‌లో కమల్‌హాసన్‌ చేసిన క్యారెక్టర్‌ని తెలుగులో చంద్రమోహన్‌ చేశారు. అతని రెమ్యునరేషన్‌ రూ.12,500. రజినీకాంత్‌ క్యారెక్టర్‌ను మోహన్‌బాబు చేశారు. అతని రెమ్యునరేషన్‌ రూ.10,000. శ్రీదేవి తల్లిగా నిర్మలను తీసుకున్నారు. ఆమె రెమ్యునరేషన్‌ రూ.5 వేలు. ఇలా అన్నీ సెట్‌ చేసుకొని కోటిపల్లిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. మూడో షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పుడు చిక్కంతా అక్కడే వచ్చింది.  తమిళ్‌ వెర్షన్‌ క్లైమాక్స్‌లో హత్య కేసులో జైలుకెళ్ళిన హీరో తిరిగి ఎప్పుడొస్తాడో తెలీదు. అప్పటివరకు తాను ఎదురుచూస్తానంటుంది హీరోయిన్‌. హీరో తిరిగి వచ్చాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వకుండా సినిమాని ఎండ్‌ చేశారు. తెలుగులో కూడా అలాగే చేద్దామని రాఘవేంద్రరావు అంటే.. అలా కాదు, హ్యాపీ ఎండిరగ్‌ ఉండాలని నిర్మాత పట్టుపట్టారు. క్లైమాక్స్‌ని మార్చి చేస్తే చెడ్డ పేరు వస్తుందేమోనని రాఘవేంద్రరావు భయపడ్డారు. నిర్మాత మాత్రం హ్యాపీ ఎండిరగే కావాలన్నారు. అది రాఘవేంద్రరావుకి ఇష్టం లేదు. అప్పుడు నిర్మాత ఓ ఆలోచన చేశాడు. రెండు క్లైమాక్స్‌లు తీద్దాం. ఏది బాగుంటే దాన్నే ఉంచుదాం అని డైరెక్టర్‌తో చెప్పారు. దానికి రాఘవేంద్రరావు సినిమా మీది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని నిర్మాతకే వదిలేశారు. సినిమా సెన్సార్‌కి వెళ్లింది. అప్పుడు సెన్సార్‌ సభ్యులకు హ్యాపీ ఎండిరగ్‌ని కూడా చూపించారు. అయితే వారంతా హ్యాపీ ఎండిరగ్‌కే ఓటేశారు. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోని వారి కోసం దాదాపు 20 ప్రొజెక్షన్స్‌ వేశారు. అందరూ హ్యాపీ ఎండిరగ్‌ కావాలని అడిగారు. అందరూ కోరినట్టుగానే సినిమాని హ్యాపీ ఎండిరగ్‌తో రిలీజ్‌ చేశారు. మొదటి మూడు వారాలు కలెక్షన్లు లేవు. నాలుగో వారం నుంచి పుంజుకొని రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతూ వెళ్లాయి. అలా ‘పదహారేళ్ళ వయసు’ ఒక ప్రభంజనం సృష్టించింది. సిల్వర్‌ జూబ్లీ దాటిపోయినా సినిమా రన్‌ అవుతూనే ఉంది. ఈ సినిమా 200 రోజుల ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. 275 రోజుల ఫంక్షన్‌ను మద్రాస్‌లో చేశారు. ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో నటించిన చంద్రమోహన్‌, శ్రీదేవి, మోహన్‌బాబులకు చాలా మంచి పేరు వచ్చింది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. 

సావిత్రి.. మహానటే కాదు.. మహామనీషి అని రుజువు చేసిన సంఘటన!

సినిమా నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో, మరెంతో శ్రమతో కూడుకున్న పని. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించి వారిని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా పాతతరం నిర్మాతలు ఉండేవారు. వ్యాపార ధోరణి కంటే ఒక మంచి ఉద్దేశమే వారికి ఉండేది. అయితే అలాంటి నిర్మాతలు సైతం ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పాతతరం నటీనటులు కూడా నిర్మాతల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారు. రెమ్యునరేషన్ల విషయంలో కూడా వారికి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. నిర్మాత బాగుంటే మళ్ళీ సినిమా తీసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే నటీనటులు కూడా నిర్మాతకు సహకరించేవారు. అలాంటి ఓ సంఘటన 1972లో వచ్చిన ‘కన్నతల్లి’ సినిమా విషయంలో జరిగింది. మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కేవలం 20 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు రుద్రరాజు సీతారామరాజు. ఆయన తన తొలి ప్రయత్నంగా ‘కన్నతల్లి’ చిత్రాన్ని ప్రారంభించారు. టి.మాధవరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు సీతారామరాజు. మహానటి సావిత్రి, శోభన్‌బాబు, చంద్రకళ, రాజబాబు, నాగభూషణం, ప్రభాకరరెడ్డి వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలోని తారాగణం. షూటింగ్‌ ప్రారంభమైంది. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది  అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా సావిత్రి అనారోగ్యానికి గురయ్యారు. దానివల్ల సినిమాలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే 15 రోజుల మేజర్‌ షెడ్యూల్‌ ఆగిపోయింది. ఆ షెడ్యూల్‌లో చెయ్యాల్సి ఆర్టిస్టుల కాల్‌షీట్స్‌ మళ్ళీ ఒకేసారి దొరకాలంటే చాలా కష్టం. ఆ సమయంలో ఈ సినిమాతోపాటు మరో నాలుగు సినిమాల నిర్మాతలు కూడా ఇబ్బందులు పడ్డారు.  తర్వాత కొన్నాళ్ళకు సావిత్రి కాస్త కోలుకున్న తర్వాత ఆమెను సీతారామరాజు కలిసి పరిస్థితి చెప్పారు. దానికామె మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏమిటి అనేది కనుక్కొని తనకు చెప్పమని అన్నారు. అప్పుడు శోభన్‌బాబుని కలిసి విషయం చెప్పడంతో వేరే నిర్మాతలకు ఇచ్చిన డేట్స్‌ని ఎడ్జస్ట్‌ చెయ్యడం అంటే కొంచెం కష్టమే. సావిత్రిగారు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేం కూడా సినిమాని పూర్తి చెయ్యడానికి కష్టపడతాం అని శోభన్‌బాబు చెప్పారు. మూడు రోజుల తర్వాత సావిత్రిని కలిసిన నిర్మాత విషయం చెప్పడంతో మీరు అధైర్య పడవద్దు. సినిమా పూర్తి చేద్దాం. కాకపోతే నేను 15 రోజుల్లో చెయ్యాల్సిన సీన్స్‌ను వారం రోజుల్లో కంప్లీట్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోమని నిర్మాతకు చెప్పడంతో.. ఆమె సూచించిన విధంగానే చేసి మొత్తానికి షూటింగ్‌ పూర్తి చేశారు. ఇక డబ్బింగ్‌ చెప్పాల్సిన టైమ్‌ వచ్చినపుడు సావిత్రి.. నిర్మాత సీతారామరాజును తన రెమ్యునరేషన్‌ గురించి అడిగారు. రూ.40 వేలకు మాట్లాడుకున్నామని, ఆల్రెడీ రూ.30 వేలు ఇచ్చానని, ఇంకా రూ.10 వేలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దానికామె ‘మీరు ఆ పదివేలు ఇవ్వాల్సిన పనిలేదు. నేను డబ్బింగ్‌ కంప్లీట్‌ చేస్తాను’ అన్నారు.  చెప్పిన విధంగానే డబ్బింగ్‌ పూర్తి చేశారు. సాధారణంగా శోభన్‌బాబు తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ ఇస్తేనేగానీ డబ్బింగ్‌ చెప్పరు. కానీ, ఆ విషయాలేవీ మాట్లాడకుండా డబ్బింగ్‌ చెప్పేసి వెళ్లిపోయారు. సినిమా రిలీజ్‌కి ముందు నిర్మాత సీతారామరాజు ఆయనకు అమౌంట్‌ ఇవ్వడానికి వెళితే..‘మీరు ఫర్వాలేదా..’ అని అడిగారు. నిర్మాత ఇచ్చిన డబ్బును కూడా తీసుకోవడానికి 10 నిమిషాలు ఆలోచించి మరీ తీసుకున్నారు. అలాగే సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో కోఆపరేట్‌ చెయ్యడం వల్ల నిర్మాతకు కలిగే నష్టంలో కొంత తగ్గింది. అయితే సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. ఆ 15 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేయడానికి 8 నెలలు పట్టింది. 1972 ఆగస్ట్‌ 26న ఈ సినిమా రిలీజ్‌ అయింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా ‘కన్నతల్లి’కి పేరు వచ్చింది. 

ఒకే కథతో ఒకేరోజు రెండు సినిమాలు.. ఎన్టీఆర్‌ ముందు నిలబడలేకపోయిన కృష్ణ!

ఒకే కథతో ఒకటికి మించి సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొంత గ్యాప్‌తో తీస్తారు కాబట్టి వాటిని మనం రీమేక్స్‌ అంటుంటాం. అలా కాకుండా ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రూపొందితే ఎలా ఉంటుంది? అలా టాలీవుడ్‌లో చాలా సార్లు జరిగింది. 1933లో కృష్ణ ఫిలింస్‌ ‘సావిత్రి’, ఈస్ట్‌ ఇండియా ‘సతీ సావిత్రి’, 1933లోనే ఇంపీరియల్‌ ‘రామదాసు’, ఈస్ట్‌ ఇండియా ‘రామదాసు’ , 1938లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, ‘ద్రౌపది మానసంరక్షణం’, 1942లో జెమిని వారి ‘బాలనాగమ్మ’, శాంత వారి ‘బాలనాగమ్మ’,   1950లో ‘లక్ష్మమ్మ’, ‘శ్రీలక్ష్మమ్మ కథ’.. ఇలా ఒకే కథతో పోటాపోటీగా సినిమాలు నిర్మించారు. తెలుగు సినిమా పుట్టిన తొలినాళ్ళలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాల గురించి అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. ఆ తర్వాత అంటే 26 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి వచ్చింది. నటరత్న ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ‘దానవీరశూర కర్ణ’ చిత్రాన్ని ప్రారంభించే సమయంలోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ రెండు సినిమాలూ మహాభారత యుద్ధం నేపథ్యంలోనే రూపొందడం విశేషం. ఈ రెండు సినిమాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో ఎన్టీఆర్‌ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. నందమూరి హరికృష్ణ అర్జునుడుగా, నందమూరి బాలకృష్ణ అభిమన్యుడుగా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన కథా విస్తరణలో సహకరించడానికి, సంభాషణలు రాయడానికి కొండవీటి వేంకటకవిని ఎంచుకున్నారు ఎన్టీఆర్‌. అయితే ఆ బాధ్యతను నిర్వహించేందుకు ఆయన అంగీకరించలేదు. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా ఆయన్ని కలిసి సినిమా చేయడానికి ఒప్పించారు. 1976 జూన్‌ 7న ఈ సినిమా షూటింగ్‌తోనే హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌ ప్రారంభమైంది. తమిళ్‌ సూపర్‌స్టార్‌ ఎం.జి.రామచంద్రన్‌ ‘దానవీరశూర కర్ణ’ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రానికి మొదట ఎస్‌.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు అనుకున్నారు. ఈ సినిమాలో మొదట వచ్చే ‘ఏ తల్లి నిను కన్నదో..’ పాటను కంపోజ్‌ చేసింది ఎస్‌.రాజేశ్వరరావే. ఆ తర్వాత ఆయన స్థానంలోకి పెండ్యాల నాగేశ్వరరావు వచ్చారు.   ‘పాండవవనవాసము’ చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు నిర్మాణ భాగస్వామిగా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా, ఎస్‌.రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కృష్ణతోపాటు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్‌,  కైకాల సత్యనారాయణ, విజయనిర్మల, జయలలిత, జయప్రద ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు వివిధ పాత్రలు పోషించారు.  ఈ రెండు సినిమాలు పోటాపోటీగా షూటింగ్‌ జరుపుకున్నాయి. ఇలా ఇద్దరు టాప్‌ హీరోల సినిమాలు ఒకే కథతో ఒకే సమయంలో రూపొందడం, చివరికి  ఒకేరోజు అంటే 1977 జనవరి 14న రిలీజ్‌ అవ్వడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే తొలిసారి, చివరిసారి కూడా. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నన్ని రోజులూ ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుకునేవారు. ఇక పత్రికల్లో ఈ రెండు సినిమాల గురించే వార్తలు వచ్చేవి. ఇక వారపత్రికల్లో ఒకవారం ‘దానవీరశూర కర్ణ’ కవర్‌పేజీ వేస్తే, మరోవారం ‘కురుక్షేత్రం’ కవర్‌పేజీ వేసేవారు. రెండోది బ్యాక్‌పేజీకి వెళ్లేది. అలా చాలాకాలం ఈ రెండు సినిమాలు వార్తల్లో నిలిచాయి. ఒకవిధంగా చూస్తే కృష్ణ కంటే ఎన్‌.టి.రామారావుకే ఈ సినిమా చేయడం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే సినిమాలో మూడు పాత్రలు ధరించడమే కాదు, దర్శకత్వం, నిర్మాణం వంటి బాధ్యతలు ఆయనపై ఉన్నాయి. అయినా ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 43 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాకి రూ.10 లక్షలు బడ్జెట్‌ అయింది.  అందరూ ఈ సినిమాల రిలీజ్‌ కోసం ఎదురుచూశారు. 1977 జనవరి 14న ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. పౌరాణిక పాత్రలు పోషించడంలో ఎనీఆర్‌కి ఉన్నంత అనుభవం కురుక్షేత్రం చిత్రంలో నటించిన హీరోలకు లేదు. దీంతో ‘దానవీరశూర కర్ణ’ ముందు ‘కురుక్షేత్రం’ నిలబడలేకపోయింది. ఎన్టీఆర్‌ ధాటిని తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. దీంతో ‘కురుక్షేత్రం’ పరాజయం పాలైంది. అయితే ఇదే సినిమాను హిందీలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే అక్కడ ఘనవిజయం సాధించింది. ఇక ‘దానవీరశూర కర్ణ’ ఘనవిజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘లవకుశ’ తర్వాత కోటి రూపాయలు కలెక్ట్‌ చేసిన చిత్రంగా ‘దానవీరశూర కర్ణ’ రికార్డు సృష్టించింది. 1994లో ఈ సినిమా ఆంధ్రా, సీడెడ్‌ రీరిలీజ్‌ రైట్స్‌ను రూ.65 లక్షలకు అమ్మారు. అప్పుడు కూడా ఈ సినిమా 1 కోటి రూపాయలు కలెక్ట్‌ చేసింది.