మెగాస్టార్‌ చిరంజీవి ఆదర్శం.. మొదట విలన్‌, ఆ తర్వాతే హీరో!

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం స్వయంకృషితో ఇండస్ట్రీలో హీరోగా ఎదిగినవారిలో శ్రీకాంత్‌ ఒకరు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించాడు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి హీరోల తరహాలోనే మొదట విలన్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోగా మారి ఫ్యామిలీ హీరోగా, యాక్షన్‌ హీరోగా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశాడు. మార్చి 23 శ్రీకాంత్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.  మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్న శ్రీకాంత్‌.. ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌పై ఎ.మోహనగాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’ చిత్రంలో నక్సలైట్‌గా తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత ‘మధురానగరిలో’ చిత్రంలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. ఆ తర్వాత విలన్‌, సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేస్తూ ఇండీస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ‘తాజ్‌మహల్‌’తో సోలో హీరోగా వెలుగులోకి వచ్చాడు.  కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లిసందడి’ చిత్రం శ్రీకాంత్‌ను టాప్‌ హీరోను చేసింది. ఆ సినిమా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ తరహా సినిమాలతోనే శ్రీకాంత్‌ ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. రొటీన్‌కి భిన్నంగా ఉండే ఖడ్గం, ఆపరేషన్‌ దుర్యోధన వంటి సినిమాలు నటుడిగా అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కంచడానికి తోడ్పడ్డాయి. హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలో కూడా చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, నాగార్జున వంటి టాప్‌ హీరోల సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.  టాలీవుడ్‌లో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉంటూ ఎలాంటి కాంట్రవర్సీ తన దగ్గరికి రాకుండా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. అలా కొత్త టాలెంట్‌ వచ్చిన తర్వాత తెలుగు సినిమా తీరు తెన్నులు మారింది. ఫ్యామిలీ డ్రామాల స్థానంలో ఎక్కువగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్సే వస్తున్నాయి. దాంతో సహజంగానే శ్రీకాంత్‌ వంటి హీరోలకు అవకాశాలు తగ్గాయి. అయినా తనకు తగిన క్యారెక్టర్స్‌ వచ్చినపుడు అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు శ్రీకాంత్‌. ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘కోటబొమ్మాళీ పిఎస్‌’లోని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అతని నట వారసుడుగా తనయుడు రోషన్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకోవడమే కాకుండా, కొడుకుని కూడా సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్న శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

అది నరేష్‌ చేసిన హిట్‌ సినిమా.. దానికి పనిచేసిన 17 మంది ఇప్పుడు మన మధ్య లేరు!

ఈమధ్యకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. పాతతరం నటీనటులు వయోభారం వల్ల చనిపోయిన వారు కూడా చాలా మందే ఉంటారు. తెలుగు సినిమా పుట్టిన తొలిరోజుల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో నటించిన వారెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఇది మనిషి జీవితంలో సహజంగా జరిగే పరిణామమే. ‘పుట్టక తప్పదు.. గిట్టకా తప్పదు అన్నట్టు.. అందరూ ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సినవారే. కాకపోతే వెనకా ముందు..’ అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేదిగానే ఉంటుంది. అదే అల్లరి నరేష్‌ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘కితకితలు’. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్‌ కావచ్చు దాదాపు 17 మంది ఇప్పుడు జీవించి లేరు అంటే నమ్మగలమా.. కానీ, ఇది నిజం.  2006లో అల్లరి నరేష్‌ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కితకితలు’ చిత్రంలో లెక్కకు మించిన హాస్యనటులు తమ పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ నవ్వించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా విడుదలై 18 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ, అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దాదాపు 17 మంది చనిపోయారు. ఒక సెలబ్రిటీ చనిపోయారంటే వారు అంతకుముందు ఏదో ఒక సినిమాకి పనిచేసి ఉంటారు. కానీ, ‘కితకితలు’ సినిమా రిలీజ్‌ అయి 20 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అంతమంది చనిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరు చనిపోయారో తెలుసుకుందాం.   ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌, జయప్రకాశ్‌రెడ్డి, కొండవలస లక్ష్మణరావు, మల్లిఖార్జునరావు, వేణుమాధవ్‌, లక్ష్మీపతి, మాడా వెంకటేశ్వరరావు, ఎం.ఎస్‌.నారాయణ, చలపతిరావు, గుండు హనుమంతరావు, శకుంతల,  డా.ఎన్‌.శివప్రసాద్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ వంటి నటీనటులు ఈ 18 సంవత్సరాల్లో కన్నుమూశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఇ.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా విడుదలైన 5 సంవత్సరాలకే అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఇ.వి.వి. డైరెక్ట్‌ చేసిన ప్రతి సినిమాకీ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌గా ఉండే ఆయన సోదరుడు ఇ.వి.వి.గిరి కూడా చనిపోయాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వి.జయరాం కూడా ఇటీవల చనిపోయారు. ఇలా ఒక సినిమాకి పనిచేసిన ఇంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఇంత తక్కువ కాలంలో మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడం అనేది నమ్మశక్యం కాని విషయమే. 

పెళ్లి వరకు వెళ్ళిన కృష్ణకుమారి ప్రేమకథ.. ఎన్టీఆర్‌పై కోపంతో 17 సినిమాలు క్యాన్సిల్‌ చేసుకుంది!

భారతదేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నా.. సినిమా తారల పెళ్ళిళ్ళు అన్నీ చాలా విచిత్రంగానే జరుగుతుంటాయి. సినిమా వారిని కాకుండా బయటి వారిని చేసుకున్న పెళ్లిళ్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వారినే చేసుకుంటే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. చాలా మంది హీరోలు వారికి గతంలోనే పెళ్ళయినా ఏదో ఒక హీరోయిన్‌పై మనసుపడి వారిని రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం. అయితే ఆ హీరోయిన్‌కి మాత్రం అదే మొదటి పెళ్లి అయి ఉంటుంది. మరి ఇలాంటి వార్తలు మీడియాలో తప్పకుండా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. ఈ తరహా పెళ్లిళ్లు టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఎక్కువగా జరిగాయని చెప్పొచ్చు. పెళ్లి వరకు వెళ్లి.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్‌.టి.రామారావు, కృష్ణకుమారి గురించి. ఎన్టీఆర్‌ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వారిలో ఎక్కువ సినిమాలు చేసిన క్రెడిట్‌ జమునకు దక్కుతుంది. ఎన్టీఆర్‌, జమున కలిసి 31 సినిమాలు చేశారు. సావిత్రితో 26, అంజలీదేవితో 26, కృష్ణకుమారితో 25 సినిమాల్లో జంటగా నటించారు ఎన్టీఆర్‌. అయితే వీరిలో కృష్ణకుమారి అంటే ఎన్టీఆర్‌కి స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ ఉండేది. వీరిద్దరికి సంబంధించిన అనేక అంశాలు అప్పట్లో ప్రచారంలో ఉండేవి. అందులో నిజానిజాలు ఎంత అనే విషయం గురించి కృష్ణకుమారి అక్క షావుకారు జానకి దగ్గర ప్రస్తావిస్తే.. ఆమె కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలియజేశారు.  ‘ఎన్‌.టి.రామారావుగారంటే నాకెంతో గౌరవం. ఆయనంటే ఒక గురు భావం మాత్రమే ఉండేది. అలాగే నేనంటే కూడా ఆయనకు ఎంతో అభిమానం. అలాంటి వ్యక్తి మా చెల్లెలు కృష్ణకుమారిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆరోజుల్లో బాగా వచ్చాయి. అయితే వారిద్దరికీ అంత పరిచయం ఉందనే విషయం నాకు కూడా తెలీదు. వారిద్దరూ పెళ్లి వరకు వెళ్లి కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గారని, అప్పుడు నేను వెళ్లి ఆయన్ని తిట్టానని.. ఇలా చెప్పుకున్నారు. కానీ, దాంట్లో నిజం ఎంతమాత్రం లేదు. మా చెల్లెలు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఉంటే మధ్యలో నేవెవర్ని కాదనడానికి, ఆయన పెళ్ళి చేసుకునే విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారని నేను ఏ హక్కుతో అడుగుతాను. కాబట్టి అప్పుడు అందరూ చెప్పుకున్నట్టుగా ఏమీ జరగలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడినా ఎంతో గౌరవంగా మాట్లాడుకునేవారు. వారిద్దరి ప్రేమ నడిచిందని, పెళ్లి విషయంలో ఇద్దరూ గొడవపడ్డారనేది బయట అందరూ చెప్పుకునే వరకు నాకు తెలీదు. అప్పటికే రామారావుగారికి పెళ్ళయింది, 13 మంది పిల్లలు. ఆయనతో కృష్ణకుమారి పెళ్లి అని తెలిసిన తర్వాత ఆ విషయాన్ని నేను డైరెక్ట్‌గా ఆమెతో డిస్కస్‌ చెయ్యలేదు. పెళ్లయిన వారిని చేసుకుంటే వచ్చే సమస్యలేమిటో తనకి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాను. అయితే కృష్ణకుమారి ఎక్కడో హర్ట్‌ అయింది. అందుకే ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి నేను షాక్‌ అయిపోయాను. హీరోయిన్‌గా మంచి స్వింగ్‌లో ఉన్న టైమ్‌ ఆది. ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారే 17 సినిమాలు ఫోన్‌ చేసి మరీ క్యాన్సిల్‌ చేసేసుకుంది. ఇక సినిమాల్లో నటించకూడదని డిసైడ్‌ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ అనే బిజినెస్‌ మేన్‌ని పెళ్ళి చేసుకుంది కృష్ణకుమారి. అది కూడా ప్రేమ వివాహమే. అజయ్‌కి ఆల్రెడీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పెళ్ళికి సంబంధించిన శుభలేఖ కూడా పంపింది. కానీ, నేను వెళ్ళలేకపోయాను’ అంటూ వివరించారు షావుకారు జానకి.  అజయ్‌ మోహన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత బెంగళూరులో స్థిరపడిపోయింది కృష్ణకుమారి. వారికి సంతానం కలగలేదు. అందుకే దీపిక అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. భారతదేశంలో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఎంటిఆర్‌ కంపెనీ అధినేతలైన మయ్యా ఫ్యామిలీకి చెందిన విక్రమ్‌ మయ్యాను పెళ్లి చేసుకున్న దీపిక బెంగళూరులోనే స్థిరపడింది

రామ్‌గోపాల్‌వర్మ సినిమాకు బయ్యర్లు కరవు.. రిలీజ్‌ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది!

ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది, ఆ సినిమా పెద్ద కళాఖండం, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అది.. ఒక సినిమా సూపర్‌హిట్‌ అయిన తర్వాత వినిపించే మాటలివి. ఆ తర్వాత అదే సినిమాని నంది అవార్డులు, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. అలాంటి కొన్ని సినిమాలకు సంబంధించిన కొన్ని విశేషాలను వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సినిమా షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు ఆయా దర్శకనిర్మాతలు పడని కష్టాలు ఉండవు, బయ్యర్ల కోసం లెక్కకు మించిన షోలు వేస్తారు. కానీ, ఏ డిస్ట్రిబ్యూటరూ ఆ సినిమాను తీసుకునేందుకు ముందుకు రారు. చివరికి నానా తంటాలు పడి నిర్మాత సినిమాను రిలీజ్‌ చేస్తారు. ఎంతో మంది బయ్యర్లు చూసి పెదవి విరిచిన ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు, ప్రభుత్వాలు అవార్డులతో సత్కరిస్తాయి. అలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్న సినిమాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. సినిమా రిలీజ్‌కి ముందు కనీసం 100 షోలు బయర్ల కోసం వేశారు. రిలీజ్‌ తర్వాత ఆ సినిమాకి ఎలాంటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి పరిస్థితే రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘మనీ’ చిత్రానికి కూడా వచ్చింది. శివనాగేశ్వరరావును దర్శకుడుగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.  ముదుమలై ఫారెస్ట్‌లో ‘క్షణక్షణం’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావుతో వర్మ ‘నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా.. సినిమాకి 5 లక్షలు ఇస్తాను’ అన్నారు. అప్పటికి శివనాగేశ్వరరావుకి అసోసియేట్‌గా సినిమాకి 75 వేలు ఇచ్చేవారు. వర్మ ఇచ్చిన ఆఫర్‌ని కాదన్నాడు శివనాగేశ్వరరావు. తాను డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. తాను ఒక బేనర్‌ పెట్టబోతున్నానని, అందులో డైరెక్టర్‌గా పరిచయం చేస్తానని వర్మ మాట ఇచ్చాడు. చెప్పినట్టుగానే కొన్ని రోజులకు తన బేనర్‌ వర్మ క్రియేషన్స్‌లో శివనాగేశ్వరరావుకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు వర్మ. ‘రూత్‌లెస్‌ పీపుల్‌’ అనే సినిమా చూడమని, ఆ కథ అయితే బాగుంటుందని సజెస్ట్‌ చేశాడు. ఆ సినిమా చూసిన శివనాగేశ్వరరావు దానికి తెలుగు నేటివిటీని జోడిరచి ఒక కథను సిద్ధం చేశాడు. వర్మకి కూడా అది బాగా నచ్చింది. దానికి ‘మనీ’ అనే టైటిల్‌ని కూడా వర్మే సూచించాడు.  జె.డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ ప్రధాన పాత్రలుగా అనుకున్నారు. దూరదర్శన్‌లో సురభి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రేణుకా సహాని హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్రకు ఎవరిని తీసుకుందామా అని ఆలోచించారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, దాసరి నారాయణరావు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. చివరికి క్షణక్షణం చిత్రంలో విలన్‌గా నటించిన పరేష్‌ రావల్‌ను సుబ్బారావు క్యారెక్టర్‌కి సెలెక్ట్‌ చేసుకున్నారు. క్షణక్షణం చిత్రంలో తన క్యారెక్టర్‌ తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు పరేష్‌. ‘మనీ’ సినిమాలోని క్యారెక్టర్‌కి అతను డబ్బింగ్‌ చెప్పుకోవడం కరెక్ట్‌ కాదని భావించి, సంగీత దర్శకుడు చక్రవర్తితో డబ్బింగ్‌ చెప్పించారు.  మొత్తానికి 1990లో ‘మనీ’ షూటింగ్‌ ప్రారంభమైంది. కొంతకాలం బాగానే జరిగింది. ఆ తర్వాత పరేష్‌ రావల్‌కు యాక్సిడెంట్‌ అవ్వడంతో మూడు నెలలు షూటింగ్‌కి బ్రేక్‌ పడిరది. మూడు నెలలు గడిచిన తర్వాత అతను కమిట్‌ అయి ఉన్న హిందీ సినిమాలు పూర్తి చెయ్యాల్సి వచ్చింది. అవి కూడా పూర్తి చేసి ‘మనీ’ సెట్స్‌కి వచ్చాడు. అలా 6 నెలలపాటు బ్రేక్‌ పడిరది. ఎలాగైతే సినిమాని పూర్తి చేసారు. సినిమా ఫుటేజ్‌ 9వేల అడుగులు వచ్చింది. సెన్సార్‌ నిబంధనల ప్రకారం ఒక సినిమా కనీసం 11వేల అడుగులు ఉండాలి. మిగతా రెండువేల అడుగులు ఏం తియ్యాలా అని శివనాగేశ్వరరావు, వర్మ ఆలోచిస్తున్నప్పుడు వారికి బ్రహ్మానందంతో ఒక ఎపిసోడ్‌ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలా వచ్చిన ఆలోచనే ఖాన్‌దాదా ఎపిసోడ్‌. ఎంతో హిలేరియస్‌గా ఉండేలా ఆ ఎపిసోడ్‌ని డిజైన్‌ చేశాడు శివనాగేశ్వరరావు. రెండున్నర రోజుల్లో ఈ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. మొదటి రోజు చేసిన షూటింగ్‌తో ఎంతో శాటిస్‌ఫై అయిన డైరెక్టర్‌ అప్పటికప్పుడు బ్రహ్మానందంపై ‘వారెవా ఏమి ఫేసు..’ అనే పాటను క్రియేట్‌ చేశారు. మొత్తానికి సినిమా పూర్తయింది. తెలుగు, హిందీ వెర్షన్లకు కలిపి రూ.55 లక్షలు ఖర్చయింది. ఇక  అసలైన కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎంతోమంది బయ్యర్లకు లెక్కకు మించిన షోలు వేశారు. ఆ సినిమాను చూడని బయ్యర్‌ లేడంటూ అప్పట్లో ఒక టాక్‌ ఉండేది. ఈ సినిమాతోపాటు స్టార్ట్‌ అయిన సినిమాలు, ఆ తర్వాత స్టార్ట్‌ అయిన సినిమాలు కూడా రిలీజ్‌ అయిపోతున్నాయి. ‘మనీ’ మాత్రం డబ్బాల్లోనే ఉండిపోయింది. అలా సినిమా రిలీజ్‌ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1990లో ప్రారంభమైన ఈ సినిమా 1993లో రిలీజ్‌ అయింది. మొదట్లో అంతగా కలెక్షన్లు లేకపోయినా.. ఆ తర్వాత ఊపందుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం ఖాన్‌ దాదా ఎపిసోడ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ‘ఖాన్‌తో గేమ్స్‌ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి’ అనే డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అలాగే జె.డి.చక్రవర్తి, చిన్నా, రేణుక, జయసుధ, పరేష్‌ రావల్‌ క్యారెక్టర్లు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్‌ అవ్వడానికే ఎన్నో కష్టాలు పడిన ‘మనీ’ చిత్రం 8 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని ఓడియన్‌ థియేటర్‌లో 130 రోజులు రన్‌ అయింది. రూ.55 లక్షలతో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ రన్‌లో రూ.3 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ‘గాయం’ 150 రోజుల ఫంక్షన్‌లోనే ‘మనీ’ శతదినోత్సవాన్ని కూడా జరిపారు. ఈ ఫంక్షన్‌కు శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘మనీ’ ప్రివ్యూ చూసి పెదవి విరిచిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి ఆ ఫంక్షన్‌లో శివనాగేశ్వరరావును సత్కరించి, భుజం తట్టి.. తాను పొరబడ్డానని చెప్పడం విశేషం. అంతేకాదు, ‘మనీ’ ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా శివనాగేశ్వరరావు, ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం నంది అవార్డులు గెలుచుకున్నారు. ‘మనీ’ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందంకి వర్మ మారుతి కారును బహుమతిగా అందించారు. 

అనుకోకుండా వచ్చిన అవకాశంతో.. మూడు భాషల్లో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన రామానాయుడు!

అన్నీ కలిసొచ్చాయి.. అదృష్టం.. రాసిపెట్టి ఉంటే అదే మన దగ్గరకు వస్తుంది.. ఇలాంటి మాటలు సర్వసాధారణంగా వింటూ వుంటాం. ఈ సెంటిమెంట్‌ సినిమా రంగంలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి నమ్మకాల వల్ల విజయాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. వారిలో మూవీ మొఘల్‌ డి.రామానాయుడు ఒకరు. 1964లో ఎన్టీఆర్‌ హీరోగా నిర్మించిన ‘రాముడు భీముడు’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన రామానాయుడు మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. అయితే ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఆయన్ని నష్టాల్లోకి నెట్టేశాయి. అంతకుముందు రకరకాల వ్యాపారాలు చేసి సినిమా రంగానికి వచ్చిన రామానాయుడు తనకు ఇక్కడ కూడా కలిసి రాదనే అభిప్రాయానికి వచ్చాడు. ఆ సమయంలోనే ‘ప్రేమనగర్‌’ సినిమా చేసే అవకాశం వచ్చింది.  వాస్తవానికి ప్రేమనగర్‌ నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి నిర్మించాల్సిన సినిమా. పాత రోజుల్లో నవలలకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. ఆ టైమ్‌లో కోడూరి కౌసల్యాదేవి రచించిన ప్రేమనగర్‌ నవలను విపరీతంగా చదివారు పాఠకులు. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని భావించిన శ్రీధర్‌రెడ్డి ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావుకు చెప్పారు. దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో ఆ నవల రైట్స్‌ తీసుకున్నారు శ్రీధర్‌రెడ్డి. సినిమా నిర్మాణానికి కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కినేని హీరో, హీరోయిన్‌ కె.ఆర్‌.విజయ. ఈ సినిమాకి అవసరమైన కాస్ట్యూమ్స్‌ కొనేందుకు కారులో బయల్దేరారు శ్రీధర్‌రెడ్డి, అతని భార్య. ఆ కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. దాన్ని అపశకునంగా భావించిన శ్రీధర్‌రెడ్డి భార్య మనకు ఈ సినిమా వద్దని చెప్పింది. దాంతో ఆ సినిమాను నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉన్న అక్కినేని... రామానాయుడికి విషయం చెప్పారు. హీరోయే అంత నమ్మకంగా చెప్పడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే రూ.60 వేలకు ప్రేమనగర్‌ రైట్స్‌ కొనేశారు.  అక్కినేని నాగేశ్వరరావుహీరో, వాణిశ్రీ హీరోయిన్‌, కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకుడు. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ కూడా ఫిక్స్‌ అయిపోయారు. సినిమా బడ్జెట్‌ రూ.15 లక్షలు. అప్పటికే నష్టాల్లో ఉన్న రామానాయుడు ప్రేమనగర్‌ కోసం అనుకున్న బడ్జెట్‌లో రూ.10 లక్షలు నవయుగ ఫిలింస్‌ వారిని పెట్టవలసిందిగా అడిగారు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో సినిమా ప్రారంభమైంది. సినిమా కోసం ప్యాలెస్‌ లాంటి సెట్‌ను వేశారు. అప్పట్లోనే దానికి రూ.5 లక్షలు ఖర్చయింది. దానికి మిగతా నిర్మాతలు ఆశ్చర్యపోయి ‘ఎందుకింత ఖర్చు పెడుతున్నారు?’ అని అడిగారు. దానికి రామానాయుడు ‘ఈసారి తాడో పేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా అటో ఇటో అయితే.. మా ఇద్దరు పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించి, నాకున్న 90 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను’ అన్నారు. 1970లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి 1971లో విడుదల చేశారు. 34 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తే మొదటి షోకే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా తండోపతండాలుగా ఈ సినిమాను చూశారు ప్రేక్షకులు. రోజురోజుకీ సినిమాకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. టోటల్‌గా రూ.50 లక్షలు వసూలు చేసింది ‘ప్రేమనగర్‌’.   ఇదే సినిమాను 1972లో శివాజీ గణేశన్‌, వాణిశ్రీలతో తమిళ్‌లో ‘వసంతమాళిగ’ పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని రూ.70 లక్షలు కలెక్ట్‌ చేసింది. అప్పటివరకు తమిళ్‌ హిట్‌ సినిమాలకు వచ్చిన కలెక్షన్‌ కంటే అది చాలా ఎక్కువ. ఆ తర్వాత 1974లో రాజేష్‌ ఖన్నా, హేమమాలిని జంటగా ‘ప్రేమ్‌నగర్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలా ఒక్కసారిగా రామానాయుడు టాప్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయారు. తమిళ్‌, హిందీ వెర్షన్లకు కూడా కె.ఎస్‌.ప్రకాశరావే దర్శకత్వం వహించారు. రామానాయుడు స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగేందుకు, ఆ తర్వాతికాలంలో మరెన్నో మరపురాని సినిమాలను రూపొందించేందుకు ‘ప్రేమనగర్‌’ చిత్రం ఎంతగానో దోహదపడింది.

ఫస్ట్‌ హాఫ్‌ వరకు డైలాగులు లేకుండా నటించిన ముగ్గురు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముగ్గురు టాప్‌ హీరోలకు మూడు అరుదైన సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఆ ముగ్గురు హీరోలు నటరత్న ఎన్‌.టి.రామరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి. ఈ ముగ్గురు హీరోలు వారి వారి జనరేషన్లలో టాప్‌ హీరోలుగా వెలుగొందారు. తెలుగు హీరోలలో ఈ ముగ్గురు మాత్రమే చేసిన ఆ క్యారెక్టర్‌ పేరు టార్జాన్‌. ఎన్‌.టి.రామారావు తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించగా, కృష్ణ 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇక చిరంజీవి 150కి పైగా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.  ఈ హీరోల్లో మొదట టార్జాన్‌గా నటించే అవకాశం కృష్ణకు దక్కింది. 1967 మార్చి 3న విడుదలైన ‘ఇద్దరు మొనగాళ్ళు’ చిత్రంలో కృష్ణ టార్జాన్‌ పాత్రను పోషించారు. బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాంతారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. కాంతారావు సరసన కృష్ణకుమారి, కృష్ణ సరసన సంధ్యారాణి హీరోయిన్లుగా కనిపిస్తారు. కృష్ణ నటించిన మొట్ట మొదటి జానపద చిత్రం ఇది. అలాగే బి.విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ చేసిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. కృష్ణ హీరోగా పరిచయమైన తర్వాత చేసిన నాలుగో సినిమా ఇది. కృష్ణకు హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ తర్వాత ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్‌ మొత్తం కృష్ణకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అయినా ‘ఇద్దరు మొనగాళ్ళు’ బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. 1978 జూలై 28న విడుదలైన సినిమా ‘రాజపుత్ర రహస్యం’. ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు టార్జాన్‌గా నటించారు. ఆయన సరసన జయప్రద హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా జానపద చిత్రంగానే రూపొందింది. ఈ సినిమాలో మొదటి 30 నిమిషాలు హీరో కనిపించడు. ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్‌హాఫ్‌ అంతా ఆయనకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అయినప్పటికీ  ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది.  మెగాస్టార్‌ చిరంజీవి, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన ‘అడవిదొంగ’ 1985 సెప్టెంబర్‌ 19న విడుదలైంది. చిరంజీవి హీరో అయిన తర్వాత కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా ఇదే. ఇందులో రాధ హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి టార్జాన్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. పై రెండు సినిమాలు జానపద సినిమాలుగా రూపొందితే.. ‘అడవిదొంగ’ మాత్రం సాంఘిక చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ ముందు మాత్రమే చిరంజీవికి డైలాగులు మొదలవుతాయి. ‘అడవిదొంగ’ చిరంజీవి కెరీర్‌లో పెద్ద హిట్‌ అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  తెలుగు చలనచిత్ర చరిత్రలో టార్జాన్‌ పాత్రను పోషించే అవకాశం ఎన్టీఆర్‌, కృష్ణ, చిరంజీవిలకు మాత్రమే దక్కింది. కృష్ణ సినిమా ‘ఇద్దరు మొనగాళ్ళు’ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందగా, ఎన్టీఆర్‌ సినిమా ‘రాజపుత్ర రహస్యం’ ఈస్ట్‌మన్‌కలర్‌లో చేశారు. చిరంజీవి సినిమా ‘అడవిదొంగ’ను కలర్‌లో తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడం విశేషం. 

భారతదేశం గర్వించదగ్గ నటి, డాన్సర్‌ శోభన.. ఆ హీరోల వల్లే సినిమాలకు గుడ్‌బై చెప్పింది!

శోభన చంద్రకుమార్‌ పిళ్ళై.. మనందరం శోభన అని పిలుచుకునే అందాల నటి. 1970 మార్చి 21న కేరళలో జన్మించింది. ఆమెకు నాట్యం అంటే ప్రాణం. అయినా నటన మీద మక్కువతో 1984లో మలయాళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి స్వింగ్‌లో ఉన్న టైమ్‌లోనే తాను ఇక తెలుగు సినిమాల్లో నటించను అని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఎనౌన్స్‌ చేసింది. అప్పటికే సంవత్సరానికి అరడజనుకు తక్కువ కాకుండా సినిమాలు చేస్తోంది. అంత బిజీ హీరోయిన్‌గా ఉన్న శోభన హఠాత్తుగా తెలుగు సినిమాలకు మాత్రమే గుడ్‌బై ఎందుకు చెబుతోంది అనే విషయం సామాన్య ప్రేక్షకులకు అర్థం కాలేదు. అయితే ఇండస్ట్రీలోని కొందరు సినీ ప్రముఖులకు మాత్రం ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందీ అనే విషయం తెలుసు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘గేమ్‌’. ఈ సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్‌కి రాలేదు శోభన. అయితే తమిళ్‌, మలయాళ భాషల్లో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేసింది. 2006 నుంచి 2020 వరకు ఆమె సెలెక్టివ్‌గా చేసిన సినిమాలు 5 మాత్రమే. అంటే సినిమా రంగానికి పూర్తిగా దూరమైంది. తనకెంతో ఇష్టమైన భరతనాట్యానికి బాగా దగ్గరైంది. నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ద్వారానే ఎంతో సంతృప్తి పొందుతున్నానని పలు సందర్భాల్లో ఆమె ప్రకటించింది. మార్చి 21 శోభన పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.  ఇకపై సినిమాల్లో నటించను అని శోభన తీసుకున్న నిర్ణయం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయపడతారు. వాటిలో ఒకటి మలయాళ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఒక టాప్‌ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత శోభనను కాదని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఆ హీరో. దీంతో మనస్తాపం చెందిన శోభన సినిమాలు తనకు సరిపడవని, తనకెంతో ఇష్టమైన నాట్యంలోనే తనకు సంతృప్తి ఉంటుందని భావించి సినిమాలకు గుడ్‌బై చెప్పిందనేది ఒక వాదన.  మరో వాదన ఏమిటంటే.. తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉంటూ ఎంతో మంది హీరోల సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన శోభనకు ఒక హీరో ప్రవర్తన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, అందుకే తెలుగు సినిమాల్లో నటించనని ప్రకటించిందని అంటారు. ఆ హీరో వల్ల లైంగిక వేధింపులకు గురైన శోభన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ హీరో వల్ల గతంలో దివ్యవాణి, మాళవిక వంటి హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం ఇండస్ట్రీలో చాలాకాలం ప్రచారం జరిగింది. ఈ రెండు అనుభవాలతో సినిమాలంటే విరక్తి కలిగి భరత నాట్యాన్ని ఆశ్రయించిందని కొందరి అభిప్రాయం. అంతేకాదు, 54 ఏళ్ళ శోభన పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అవివాహితగానే ఉండిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.   కారణాలు ఏవైనా ఒక మంచి నటిని సినీ పరిశ్రమ దూరం చేసుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐదు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన శోభన.. తన నటనకు అత్యున్నత అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2004లో కన్నడలో విడుదలైన ‘ఆప్తమిత్ర’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాతి సంవత్సరమే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలకు మూలం 1993లో విడుదలైన ‘మణిచిత్రతాళు’ అనే మలయాళ సినిమా. ఈ సినిమాలో శోభన ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని నటనకుగాను శోభన ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లీష్‌ చిత్రం ‘మిత్ర్‌.. మై ఫ్రెండ్‌’లో ఆమె నటనకు రెండోసారి ఉత్తమనటిగా జాతీయ అవార్డు లభించింది. ఇవి కాక ఆమె కెరీర్‌లో ఫిలింఫేర్‌, ఇతర అవార్డులు ఎన్నో ఉన్నాయి. పద్మశ్రీ, కలైమామణి అవార్డులు, గౌరవ డాక్టరేట్‌.. ఇలా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి.  సినిమాలకు దూరమైన తర్వాత ఆమె తన దృష్టినంతా భరతనాట్యం మీదే పెట్టింది. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి భరతనాట్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా నృత్య వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఎంతో మంది శోభన దగ్గర శిష్యరికం చేసి నాట్యంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. నాట్యంలోనే కాదు, నటనలోనూ పలువురికి శిక్షణ ఇస్తోంది శోభన. సినిమాలకు దూరమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది కళాభిమానులను తన నాట్యం ద్వారా అలరిస్తున్న శోభన మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని భారత దేశం గర్వించే స్థాయిలో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

నేడు పునీత్ జయంతి.. అంద‌మైన ప్రేమ‌జంటను విడ‌దీసిన క్రూర‌మైన విధి!

పునీత్ రాజ్‌కుమార్‌, అశ్వినీ రేవంత్‌ జంటను చూసి అందరూ 'మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్' అనేవాళ్ళు. కానీ క్రూర‌మైన విధి వారిని విడ‌దీసింది. క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ 1999 డిసెంబ‌ర్ 1న వైభ‌వంగా జ‌రిగిన వేడుక‌లో అశ్వినీ రేవంత్ మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. అంత‌కంటే ముందు, మూడేళ్ల క్రితం ఆ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు.  అదెలాగంటే.. పునీత్ చ‌దువు పూర్త‌య్యాక‌, 1996లో ఒక‌రోజు ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా అశ్విని ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత తాము ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నామ‌నే విష‌యం గ్ర‌హించారు. ఎనిమిది నెల‌ల త‌ర్వాత‌ త‌న జీవిత భాగ‌స్వామి అశ్విని అని డిసైడ్ అయ్యాడు పునీత్‌. ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. అశ్విని ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓకే చెప్పేసింది. కానీ, వారి వివాహానికి అశ్విని పేరెంట్స్ మొద‌ట ఒప్పుకోలేదు. ఆరు నెల‌ల పాటు వెయిట్ చేయించి, అప్పుడు స‌రేన‌న్నారు.  మ‌రోవైపు, త‌న ప్రేమ విష‌యం త‌ల్లితండ్రుల‌కు చెప్ప‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాడు పునీత్‌. ఒక‌రోజు తండ్రి రాజ్‌కుమార్ ద‌గ్గ‌ర త‌న‌కు వీరాభిమాని అయిన ఒక‌మ్మాయి ఉంద‌ని చెప్పాడు. కొడుకు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడో రాజ్‌కుమార్ వెంట‌నే గ్ర‌హించేశారు. "ఈ విష‌యం మీ అమ్మ‌తో చెప్పరా" అని ఆయ‌న చెప్పారు. అమ్మ పార్వ‌త‌మ్మ ఆశీర్వాదాలు కూడా పునీత్‌కు ల‌భించాయి. పెళ్ల‌య్యాక జాయింట్ ఫ్యామిలీలో భాగంగా అంద‌రితో క‌లిసుండాల‌నే విష‌యం అశ్వినిని మొద‌ట్లో ఇబ్బంది పెట్టింది. కానీ చాలా త్వ‌ర‌గానే రాజ్‌కుమార్ కుటుంబం పాటించే విలువ‌ల‌ను అర్థం చేసుకొని, ఆ కుటుంబంలో మ‌న‌స్ఫూర్తిగా భాగ‌మైంది. ప్ర‌తి వీకెండ్ తాను స్వీట్స్ చేస్తాన‌ని, వాటిని త‌న మామ‌య్య రాజ్‌కుమార్ బాగా ఇష్ట‌ప‌డేవార‌ని ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది అశ్విని. ఆమె సినిమాలు ఎప్పుడో కానీ చూసేది కాదు. అయితే చూస్తే మాత్రం, ఆ సినిమాలో త‌న‌కు న‌చ్చిన విష‌యాలు, న‌చ్చ‌ని విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పేసేది. అశ్విని త‌న బెస్ట్ క్రిటిక్స్‌లో ఒక‌ర‌ని ఒక‌సారి పునీత్ వెల్ల‌డించాడు. కొన్నేళ్ల క్రితం "పీఆర్‌కే" అనే బ్రాండ్‌ను నెల‌కొల్పాడు పునీత్‌. దానికి సంబంధించిన మెయిన్ డెసిష‌న్ మేక‌ర్స్‌లో అశ్విని ఒక‌రు. పునీత్‌-అశ్విని దంప‌తులకు ఇద్ద‌రు కుమార్తెలు.. ధ్రుతి, వందిత‌. ప్ర‌తిష్ఠాత్మ‌క రాజ్‌కుమార్ కుటుంబంలో ఎంతో చ‌క్క‌గా ఇమిడిపోయిన ప‌ర్ఫెక్ట్ కోడ‌లు అశ్విని. భ‌ర్త పునీత్ త‌ర‌హాలోనే ఆమె కూడా స‌హృద‌యురాలిగా, విన‌య‌శీలిగా అశ్విని పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతున్న ఆ జంట‌ను చూసి విధికి క‌న్ను కుట్టింది. అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో పునీత్ క‌న్నుమూశాడు. త‌న నిజ‌జీవిత హీరో మృతితో అశ్విని గుండెలు ప‌గిలాయి. (మార్చి 17- పునీత్ రాజ్ కుమార్ జయంతి)

జంతువులే ఆయన సినిమాల్లో హీరోలు.. వాటితోనే బ్లాక్‌బస్టర్స్‌ తీశారు!

పాత తరం నిర్మాణ సంస్థల్లో దేవర్‌ ఫిలింస్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. దేవర్‌ ఫిలింస్‌ అధినేత శాండో చిన్నప్పదేవర్‌. ఆయన సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. తన నిర్మాణ సంస్థలో తమిళ్‌, హిందీ, తెలుగు భాషల్లో 100కి పైగా సినిమాలను నిర్మించి మంచిపేరు తెచ్చుకున్నారు చిన్నప్ప దేవర్‌. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం జంతువులు ఉండేవి. ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేళ్లు... ఇలా అనేక జంతువులతో సినిమాలు నిర్మించారు. ప్రధాన పాత్రల్లో హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పటికీ జంతువుల కోసం ప్రత్యేకమైన పాత్రలు ఉండేలా చూసుకునేవారు. ఆయనకు జంతువులంటే అంత ప్రాణం. అందుకే తన ప్రతి సినిమాలోనూ జంతువులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.  తమ సినిమాల్లో ఎక్కువగా జంతువులు ఉండడానికి కారణం ఏమిటనే విషయాన్ని వివరిస్తూ ‘జంతువులను మచ్చిక చేసుకొని వాటితో నటింపజేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అందుకే నా సినిమాల్లో జంతువులకు ఎక్కువ స్థానం ఉండేది. అలా చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. వాటితో సినిమాలు చేయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. సినిమాలోని ప్రధాన పాత్రల్లో జంతువుల్ని పెడితే అవి కాల్షీట్లు ఎగ్గొట్టవు, అదికావాలి, ఇది కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరవు. మనం చెప్పింది చెప్పినట్టు చేస్తాయి’ అని చెప్పేవారు చిన్నప్ప దేవర్‌. తెలుగులో ఆయన ‘పొట్టేలు పున్నమ్మ’ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్‌లో నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించాయి. ఏనుగులు ప్రధాన పాత్రలో రజనీకాంత్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘అమ్మ ఎవరికైనా అమ్మ’ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతకుముందు ఇదే కథతో హిందీలో ధర్మేంద్ర హీరోగా ‘మా’ పేరుతో నిర్మించారు.  ఏనుగు ప్రధాన పాత్రలో దేవర్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా విడుదలై పెద్ద హిట్‌ అయింది. దేవర్‌ ఆయా జంతువుల్ని పలకరించే విధానం ఎంతో బాగుంటుంది. ఎంతో ప్రేమగా వాటిని పలకరిస్తారు. ఆవు ప్రధాన పాత్రలో ‘గాయ్‌ ఔర్‌ గౌరి’ అనే సినిమాను నిర్మించారాయన. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో దాని కోసం వాహిని స్టూడియోలో ప్రత్యేకంగా పెద్ద గదిని కట్టించారు. దాన్ని అందులోనే ఉంచేవారు. ఎండ, వాన తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. దానిపై దోమలు వాలకుండా పెద్ద ఫ్యాన్‌ను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. ఆ ఆవుని శుభ్రపరిచేందుకు ఇద్దరు పనివాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. పొద్దున్నే దాన్ని ఎంతో ప్రేమగా పలకరించేవారు. ‘ఇవాళ నీకు షూటింగ్‌ లేదురా.. హాయిగా విశ్రాంతి తీసుకో’ అని చెప్పి వెళ్ళేవారు. ఆయన ఏనాడూ పైన షర్ట్‌ వేసుకునేవారు కాదు, ఒళ్ళంతా చందనం పూసుకొని ఉండేవారు. విమానంలో ప్రయాణం చెయ్యాలన్నా అలాగే వెళ్ళేవారు. 

సిల్క్‌ స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఇదే!

సినిమా అనేది సామాన్య ప్రేక్షకులకు ఓ వినోద సాధనం.. వారికి సినిమారంగం ఓ అద్దాలమేడలా, రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అక్కడ ఉండేవారు సుఖసంతోషాలతో ఉంటారని అనుకుంటారు. సినిమా అనేది ఒక మాయ. బయటి నుంచి చూసేవారికి అలాగే కనిపిస్తుంది. కానీ, అందులోనే ఉన్నవారికి మాత్రమే అక్కడ ఉండే కష్టనష్టాల గురించి తెలుస్తుంది. తెరపై నవ్వులు చిందిస్తూ, కవ్విస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే కొందరు హీరోయిన్ల జీవితంలోని విషాదాల గురించి బయటి ప్రపంచానికి తెలీదు. ఒకప్పుడు మీడియా అనేది విస్తరించి లేకపోవడం వల్ల సినిమా రంగంలో ఏం జరిగినా అంత త్వరగా బయటికి తెలిసేది కాదు. అలా ఎంతో మంది తారల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. అలాంటి వారిలో సిల్క్‌ స్మిత ఒకరు. ఆమె కొన్ని వందల సినిమాల్లో నటించిందని, కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందని చివరి రోజుల్లో ఆస్తులు పోగొట్టుకొని అష్టకష్టాలు పడిరదని, ఆ బాధతోనే తన జీవితాన్ని అంతం చేసుకుందని అందరికీ తెలుసు. అయితే ఆమె జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించింది, ఆమె ఆత్మహత్య చేసుకునేంతగా ఆమెను ఎవరు ప్రభావితం చేశారు, నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది వంటి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గరలోని కొవ్వలి అనే గ్రామం. రెక్కాడితేనేగానీ డొక్కాడని కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించింది విజయలక్ష్మీ. ఆర్థిక స్తోమత లేని కారణంగా 4వ తరగతి వరకు మాత్రమే చదివించగలిగారు తల్లిదండ్రులు. ఆ సమయంలో పిల్లలు లేని విజయలక్ష్మీ పెద్దమ్మ అన్నపూర్ణ ఆమెను తనతోపాటు ఏలూరుకి తీసుకెళ్ళి తన దగ్గరే ఉంచుకుంది. విజయలక్ష్మీకి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో తను చూసిన డాన్సులను ఇంట్లో చేస్తుండేది. నటనపై ఆసక్తిని గమనించిన అన్నపూర్ణ... గుంటూరులో ఒక సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలుసుకొని అక్కడికి విజయలక్ష్మీని తీసుకెళ్లింది. సుగంబాబు దర్శకత్వంలో ‘భూదేవి’ అనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. డైరెక్టర్‌ని కలిసి విజయలక్ష్మీని విజయమాలగా పరిచయం చేసింది. విజయను చూసిన డైరెక్టర్‌ ‘నల్లగా ఉంది, బొద్దుగా ఉంది. పైగా నటనలో అనుభవం లేదు. అవకాశం ఇవ్వలేను’ అని చెప్పేసాడు. అయినా ఆ ఊరు వదిలి వెళ్ళకుండా మూడు రోజులు అక్కడే ఉండి రోజూ షూటింగ్‌కి విజయను తీసుకెళ్లేది. వాళ్ళు రోజూ రావడాన్ని గమనించిన సుగంబాబు ఒకసారి విజయను పరిశీలనగా చూశాడు, ఆమెతో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది విజయలో ఏదో ప్రత్యేకత ఉందని. మత్తెక్కించే కళ్ళు, మొహంలో ఆకర్షణ ఆయనకి అప్పుడు కనిపించాయి. అప్పటికప్పుడు ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేసి విజయతో చేయించాడు. ఆ తర్వాత విజయను తీసుకొని మద్రాస్‌ వచ్చేసింది అన్నపూర్ణ. ఆ సమయంలో ఆడదంటే అలుసా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత ‘వండిచక్కరం’ అనే సినిమాలో సిల్క్‌ అనే పాత్రను ఇచ్చాడు దర్శకుడు వినుచక్రవర్తి. ఆ సినిమాలో విజయ చేసిన సిల్క్‌ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. అప్పటికే స్మితగా పేరు మార్చుకున్న విజయ.. స్మితకు ముందు సిల్క్‌ని చేర్చి సిల్క్‌ స్మిత అయిపోయింది. వండిచక్కరంలో చేసిన సిల్క్‌ క్యారెక్టర్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా బిజీ ఆర్టిస్టుని చేసేసింది. కొన్ని వందల సినిమాల్లో వ్యాంప్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, గ్లామర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది. కోట్లు విలువైన ఆస్తులు కూడబెట్టింది. ఆరోజుల్లో సిల్క్‌ స్మిత లేని సినిమా ఉండేది కాదు. రిలీజ్‌ కాకుండా ఆగిపోయిన సినిమాల్లో స్మిత పాటని జోడిస్తే ఆ సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న స్మిత కొరికిన ఒక యాపిల్‌ను వేలం వేస్తే ఆరోజుల్లో పాతికవేలకు అమ్ముడుపోయింది. దీన్నిబట్టి స్మితకు ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థమవుతుంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా స్మిత పాట ఉండాలని, అలా అయితేనే సినిమాను తీసుకుంటామని చెప్పి సందర్భాలు కూడా ఉన్నాయి.  అప్పటివరకు ఒక వెలుగు వెలిగిన సిల్మ్‌స్మిత జీవితంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను వైజాగ్‌కి చెందిన రాధాకృష్ణ అనే డాక్టర్‌. ఎప్పుడూ సినిమాలు, షూటింగులతో అలిసిపోయే స్మితకు అతని పరిచయంతో కొంత మానసిక ప్రశాంతత ఏర్పడిరదని భావించింది. అతనితో సన్నిహితంగా మెలిగేది. అతన్ని పూర్తిగా నమ్మింది. తన ఆస్తి వ్యవహారాలు, సినిమా కాల్షీట్లు.. అన్నీ అతని చేతిలో పెట్టింది. అతనితో సహజీవనం చేస్తున్నప్పుడు తెలిసింది అతనికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని. అయినా సర్దుకుంది. తన భార్య, పిల్లలను తీసుకొచ్చి స్మిత ఇంట్లోనే ఉంచాడు రాధాకృష్ణ. అది కూడా సహించింది. ఆ తర్వాత నుంచి స్మితపై ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాడు రాధాకృష్ణ. స్మిత ఏమీ చేయలేని స్థితిలోకి నెట్టబడిరది. అన్ని వ్యవహారాలు అతని చేతిలో ఉన్నాయి. డబ్బు ఎంత వస్తుందో తెలీదు, వచ్చిన డబ్బు ఏమైపోతోందో తెలియని పరిస్థితి ఏర్పడిరది. ఎదురు తిరిగితే తనకు ఏమీ దక్కదని గ్రహించింది స్మిత. ఎంతో కష్టపడి అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్న స్మిత అలాంటి దయనీయ స్థితికి చేరుకోవడం అనేది స్వయంకృతాపరాధమనే చెప్పాలి. క్రమంగా ఆమెను మద్యానికి బానిస చేశాడు రాధాకృష్ణ. తన వికృత చేష్టలతో ఆమెను మానసికంగానే కాదు, శారీరకంగా కూడా హింసించేవాడు. అలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోయిన స్మిత తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించి ఉరి వేసుకొని తనువు చాలించింది.  కటిక పేదరికం నుంచి వచ్చిన స్మిత ఎదుటివారి కష్టాలను తన కష్టాలు భావించేది. అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు తనవంతు సాయం చేసేది. తనకు తొలిరోజుల్లో అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు అండగా నిలబడేది. ఆమె ఆస్తులు కరిగిపోవడానికి నిర్మాతగా ఆమె చేసిన సినిమాలు కూడా కారణమయ్యాయి. కొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ చేయడం, అవి వెనక్కి రాకపోవడం ఆమెను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఒక కాగితంపై రాసి మరీ చనిపోయింది. అయినా ఆమె ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు నిర్ధారించేలా రాధాకృష్ణ తన ప్రయత్నాలు చేశాడని చెప్పుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన స్మిత జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. 

బాలకృష్ణతో 7 సినిమాలు చేసిన టాప్‌ డైరెక్టర్‌.. ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేదు.. ఎవరో తెలుసా?

హీరోలను స్క్రీన్‌పై ఎలా ప్రజెంట్‌ చెయ్యాలి, వాళ్ల ఇంట్రడక్షన్‌ని ఎంత ఇంప్రెసివ్‌గా చూపించాలి, ఆడియన్స్‌తో ఎలా విజిల్స్‌ వేయించాలి అనే విషయం రాఘవేంద్రరావుకి తెలిసినంతగా అప్పటి తరం డైరెక్టర్లలో ఎవరికీ తెలీదు. అలాగే హీరోయిన్ల అందాలను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఎలా చూపించాలి అనేది కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. అలాంటి టాప్‌ డైరెక్టర్‌ మొదటి తరం, రెండో తరం హీరోలకు బ్లాక్‌బస్టర్స్‌, సూపర్‌హిట్స్‌ ఇచ్చి వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డారు. కానీ, ఈ విషయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏవరేజ్‌, హిట్‌ రేంజ్‌ వరకు మాత్రమే వెళ్ళాయి తప్ప ఒక్క సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ అవ్వలేదు, సూపర్‌హిట్‌ కూడా కాలేదు.  మొదటి తరం హీరోలైన ఎన్‌.టి.ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోల కాంబినేషన్‌లో రాఘవేంద్రరావు చేసిన కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి, కొన్ని సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలకు కూడా అదే పద్ధతిలో విజయాలు అందించారు. మొదటి తరం హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, రెండో తరం హీరోల్లో నందమూరి బాలకృష్ణలకు మాత్రం ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఏయే సినిమాలు వచ్చాయి, అవి ఏ రేంజ్‌ హిట్‌ అయ్యాయో తెలుసుకుందాం. వీరిద్దరి కాంబినేషన్‌లో 1980లో వచ్చిన మొదటి సినిమా ‘రౌడీ రాముడు కొంటెకృష్ణుడు’. రౌడీరాముడుగా ఎన్‌.టి.ఆర్‌., కొంటెకృష్ణుడుగా బాలకృష్ణ నటించారు. ఎన్‌.టి.ఆర్‌.కి జోడీగా శ్రీదేవి, బాలకృష్ణకు జంటగా రాజ్యలక్ష్మీ నటించారు. ఈ చిత్రాన్ని రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై ఎన్‌.టి.ఆర్‌. స్వయంగా నిర్మించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అయినప్పటికీ లాంగ్‌ రన్‌ లేకపోవడం వల్ల ఏవరేజ్‌ మూవీ అనిపించుకుంది.  రెండో సినిమా 1985లో విడుదలైన ‘పట్టాభిషేకం’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై నందమూరి హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి వారం రికార్డు స్థాయిలో రూ.96 లక్షలకు పైగా కలెక్ట్‌ చేసిన ఈ సినిమా ఆ తర్వాత రన్‌లో ఆ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించలేక జస్ట్‌ హిట్‌ అనిపించుకుంది.  1986లో వీరి కాంబినేషన్‌లో విడుదలైన మూడో సినిమా ‘అపూర్వ సహోదరులు’. బాలకృష్ణ తన కెరీర్‌లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇదే. ఇందులో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌.కె.అసోసియేట్స్‌ బేనర్‌లో కె.రాఘవేంద్రరావు సోదరుడు. కె.కృష్ణమోహనరావు ఈ సినిమాను నిర్మించారు. మొదటివారం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.80 లక్షలకు పైగా కలెక్ట్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో రన్‌ కొనసాగించలేక ఇది కూడా జస్ట్‌ హిట్‌ సినిమాగా నిలిచింది. నాలుగో సినిమా ‘సాహస సామ్రాట్‌’. దేవీకమల్‌ మూవీస్‌ బేనర్‌పై కె.సి.శేఖర్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987లో విడుదలైన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. ఇదే సంవత్సరం సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడు రమేష్‌బాబు హీరోగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన సినిమాకు ‘సామ్రాట్‌’ అనే పేరు పెట్టారు. బాలకృష్ణ సినిమాకి కూడా మొదట ‘సామ్రాట్‌’ అనే టైటిల్‌నే నిర్ణయించారు. తప్పని పరిస్థితుల్లో బాలకృష్ణ సినిమాకి ‘సాహస సామ్రాట్‌’ అనే పేరు మార్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.  ఐదో సినిమాగా గోపీ ఆర్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై చలసాని గోపి నిర్మించిన సినిమా ‘దొంగరాముడు’. ఈ సినిమాలో రాధ హీరోయిన్‌గా నటించింది. 1988లో విడుదలైన ఈ సినిమా మొదటివారం కోటి రూపాయలకుపైగా కలెక్ట్‌ చేసింది. రెండో వారం నుంచి కలెక్షన్లు పూర్తిగా పడిపోవడంతో ఈ సినిమా ఫ్లాప్‌ అయింది.  ఆరో సినిమా 1992లో వైజయంతి మూవీస్‌ బేనర్‌పై సి.అశ్వినీదత్‌ నిర్మించిన ‘అశ్వమేధం’. ఈ సినిమాలో శోభన్‌బాబు ఓ కీలక పాత్రలో నటించారు. బాలకృష్ణకు జోడీగా నగ్మా, మీనా నటించారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అనిపించుకుంది. నందమూరి బాలకృష్ణ, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన ఏడో సినిమా ‘పాండురంగడు’. 2008లో విడుదలైన ఈ సినిమాను ఆర్‌.కె.అసోసియేట్స్‌ బేనర్‌పై కె.కృష్ణమోహనరావు నిర్మించారు. 1986లో చేసిన ‘పట్టాభిషేకం’ తర్వాత బాలకృష్ణతో కృష్ణమోహనరావు నిర్మించిన రెండో సినిమా ఇది. ‘పాండురంగడు’ చిత్రంలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలు పోషించారు. బాలకృష్ణకు జంటగా స్నేహ, టబు నటించారు. ఎన్‌.టి.రామారావు నటించిన భక్తిరసాత్మక చిత్రం ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందినప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసింది.  1992లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అశ్వమేధం’ భారీ పరాజయం అందుకోవడంతో ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేసే ధైర్యం చేయలేదు. ఆ తర్వాత రాఘవేంద్రరావు అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీరామదాసు వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రాఘవేంద్రరావుతో ఆ తరహా సినిమా చేసేందుకు దాదాపు 16 సంవత్సరాల తర్వాత సిద్ధమయ్యారు బాలకృష్ణ. కానీ, ఫలితం లేకుండా పోయింది. బాలకృష్ణ కెరీర్‌లో రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన సినిమాలు ఏడు. వీటిలో మూడు మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ ప్రాజెక్ట్స్‌ అనిపించుకున్నాయి. మిగతా నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చి కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్‌ చేసిన రాఘవేంద్రరావు.. బాలకృష్ణకు మాత్రం ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. 

15 సంవత్సరాల్లో కృష్ణ, బాలకృష్ణ 21 సార్లు పోటీ పడ్డారు.. ఎవరు నెగ్గారు, ఎవరు తగ్గారు? 

సినిమా రంగంలో హిట్లు, ఫాపులు అనేది సహజం. ఒకసారి ఒక హీరో నటించిన సినిమా హిట్‌ అయితే, మరో హీరో సినిమా ఫ్లాప్‌ అవుతుంది. ఆయా హీరోల అభిమానులు మాత్రం సినిమా ఫలితాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అందుకే తమ హీరోకి ప్రధాన ప్రత్యర్థి అయిన హీరోతో ఎన్నిసార్లు పోటీపడ్డాడు, ఎన్నిసార్లు విజయం సాధించాడు అనే లెక్కలు వేసి మరీ చెబుతారు. అలా ఇద్దరు హీరోలు 21 సార్లు పోటీ పడ్డారు. అయితే ఆ ఇద్దరూ ఒకేతరం హీరోలు కాకపోయినా ఒక వారంలోనే వారిద్దరి సినిమాలు రిలీజ్‌ అవ్వడంతో దానికి ఓ ప్రత్యేకత ఏర్పడిరది. వారే సూపర్‌స్టార్‌ కృష్ణ, నటసింహ నందమూరి బాలకృష్ణ. పాతతరం హీరో కృష్ణ, అప్పటికి కొత్తతరంగా చెప్పుకునే బాలకృష్ణతో పోటీ పడడం అనేది చెప్పుకోదగ్గది కాకపోయినా దాదాపు 15 సంవత్సరాల వ్యవధిలో కొన్ని సినిమాలు ఒక వారం గ్యాప్‌లో, మరికొన్ని ఒకేరోజు, రెండు మూడు రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ అయ్యాయి. అలా 21 సార్లు పోటీ పడ్డారు ఈ ఇద్దరు హీరోలు. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో చూద్దాం.  1984లో కృష్ణ, బాలకృష్ణ మొదటిగా పోటీ పడ్డారు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన నాయకులకు సవాల్‌, తాతినేని ప్రసాద్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిస్కోకింగ్‌ ఒకేవారంలో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో నాయకులకు సవాల్‌ సూపర్‌హిట్‌ అవ్వగా డిస్కోకింగ్‌ ఫ్లాప్‌ అయింది.  పి.సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా ఉద్దండుడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మంగమ్మగారి మనవడు పోటీ పడగా ఉద్దండుడు సూపర్‌హిట్‌ అయ్యింది. మంగమ్మగారి మనవడు సెన్సేషనల్‌ హిట్‌ అయి బాలకృష్ణ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.  కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన దొంగలు బాబోయ్‌ దొంగలు, కె.మురళీమోహన్‌రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఘనవిజయాల్ని అందుకున్నాయి.  కృష్ణ, టి.కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన అందరికంటే మొనగాడు, బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్‌ కాంబినేషన్‌లో రూపొందిన భలే తమ్ముడు ఒకేవారం విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.  బాలకృష్ణ హీరోగా ఎన్‌.బి.చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన కత్తుల కొండయ్య, విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన సూర్యచంద్ర ఒకేసారి రిలీజ్‌ అయ్యాయి. ఇందులో కత్తుల కొండయ్య ఫ్లాప్‌ అవ్వగా, సూర్యచంద్ర చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది.  ఎన్‌.బి.చక్రవర్తి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నిప్పులాంటి మనిషి, జి.రామ్మోహన్‌రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం కొంత గ్యాప్‌తో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో బ్రహ్మాస్త్రం సూపర్‌హిట్‌ అవ్వగా, నిప్పులాంటి మనిషి ఎబౌ ఏవర్‌గా నిలిచింది.  కృష్ణ, కె.బాపయ్య కాంబినేషన్‌లో వచ్చిన జయం మనదే, బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో వచ్చిన సీతారామకళ్యాణం ఒకేవారం రిలీజ్‌ అయ్యాయి. జయం మనదే హిట్‌ అవ్వగా, సీతారామకళ్యాణం సూపర్‌హిట్‌ అయింది.  ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భార్గవరాముడు, ఎం.మల్లిఖార్జునరావు తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌ చిత్రాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అవ్వగా ఈ రెండు సినిమాలూ పెద్ద హిట్‌ అయ్యాయి.   కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన దొంగోడొచ్చాడు, బాలకృష్ణ, నందమూరి రమేష్‌ కాంబినేషన్‌లో రూపొందిన అల్లరి కృష్ణయ్య ఒకేవారం విడుదలయ్యాయి. ఇందులో దొంగోడొచ్చాడు సూపర్‌హిట్‌ అవ్వగా, అల్లరి కృష్ణయ్య ఫ్లాప్‌ అయింది.  కృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్‌ చేసిన సర్దార్‌ కృష్ణమనాయుడు భారీ ఫ్లాప్‌, బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ చేసిన మువ్వగోపాలుడు ఒకేవారం రిలీజ్‌ అయ్యాయి. ఇందులో సర్దార్‌ కృష్ణమనాయుడు భారీ ఫ్లాప్‌ అవ్వగా, మువ్వగోపాలుడు సెన్సేషనల్‌ హిట్‌ అయింది.  కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కలియుగ కర్ణు, బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఏవరేజ్‌గా నిలిచాయి.  బాలకృష్ణ, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన దొంగరాముడు, కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషనల్‌లో వచ్చిన చుట్టాలబ్బాయి ఒకే వారం విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి.  ఎస్‌.ఎస్‌.రవిచంద్ర దర్శకత్వంలో కృష్ణ నటించిన రౌడీ నెంబర్‌ 1, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన భారతంలో బాలచంద్రుడు చిత్రాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో కృష్ణ సినిమా హిట్‌ అయింది. బాలకృష్ణ సినిమా ఫ్లాప్‌ అయ్యింది.  బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన రక్తాభిషేకం, కృష్ణ హీరోగా దాసరి నారాయణరావు చేసిన ప్రజా ప్రతినిది ఒకేరోజు విడుదలయ్యాయి. ఇందులో రక్తాభిషేకం హిట్‌ సాధించగా, ప్రజాప్రతినిధి ఫ్లాప్‌ అయ్యింది.  జి.రామ్మోహన్‌రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన మంచి కుటుంబం, బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి రూపొందించిన భలేదొంగ ఒకేవారం విడుదలయ్యాయి. ఇందులో రెండు సినిమాలూ హిట్‌ అయినప్పటికీ కలెక్షన్లపరంగా భలేదొంగ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.  కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పార్థుడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో  వచ్చిన ముద్దుల మావయ్య. ఈ రెండు సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో పార్థుడు ఫ్లాప్‌ అవ్వగా, ముద్దుల మావయ్య సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది.  తాతినేని రామారావుతో బాలకృష్ణ చేసిన ప్రాణానికి ప్రాణం, కె.ఎస్‌.ఆర్‌.దాస్‌తో కృష్ణ చేసిన ఇన్‌స్పెక్టర్‌ రుద్ర.. ఈ రెండూ ఒకేరోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి.  ముప్పల నేని శివ, కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ఘరానా అల్లుడు,  బాలకృష్ణ కాంబినేషన్‌లో సింగీతం శ్రీనివాసరావు భైరవద్వీపం చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కృష్ణ హిట్‌ని అందుకోగా, బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది.  ఎం.రాధాకృష్ణన్‌ దర్శత్వంలో కృష్ణ నటించిన రియల్‌ హీరో, ఎ.కోదండరామిరెడి దర్శకత్వంలో రూపొందిన మాతో పెట్టుకోకు.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలై సూపర్‌ ఫ్లాప్‌గా పేరు తెచ్చుకున్నాయి. బాలకృష్ణ హీరోగా శరత్‌ దర్శకత్వంలో వచ్చిన వంశానికొక్కడు, కృష్ణ హీరోగా ఎస్‌.వి.కృష్ణారెడ్డి తర్శకత్వంలో రూపొందిన సంప్రదాయం చితాల్రు ఒకేరోజు విడుదలయ్యాయి. అందులో వంశానికొక్కడు పెద్ద హిట్‌ అయ్యింది. సంప్రదాయం మాత్రం సూపర్‌ ఫ్లాప్‌ అయింది.  చివరిగా బాలకృష్ణ, బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్‌లోనే సెన్సేషనల్‌ హిట్‌ కాగా, తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన సినిమా ఇది. ఇదే రోజు కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మానవుడు దానవుడు సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది. 

ఘంటసాల ఉండగా.. ఆయనలా పాడే మరో సింగర్‌ ఎందుకు.. విమర్శలు ఎదుర్కొన్న రామకృష్ణ!

మధురగానం అంటే ఘంటసాల, భక్తి పారవశ్యంలో ముంచెత్తాలంటే ఘంటసాల పాట, జీవితానికి అర్థం, పరమార్థం ఘంటసాల భగవద్గీత. పాతతరం ప్రేక్షకులు ఘంటసాల రాగాల సెలయేరులో సేద తీరారు. ఆరోజుల్లో ఘంటసాల పాట వినకుండా రోజు గడిచేది కాదు. అంతటి మహత్తు ఆయన గళంలో ఉంది. ఘంటసాల చివరి దశలో ఉండగా, ఆయన గళాన్ని తలపించే మరో గాయకుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అపర ఘంటసాలగా పేరు తెచ్చుకున్నాడు. అతని పాట వింటే ఘంటసాలే పాడుతున్నాడా అని భ్రమ కలిగించేంత జీవం అతని గాత్రంలో ఉంది. అతనే వి.రామకృష్ణ.  రామకృష్ణ సినిమా కుటుంబం నుంచి వచ్చినవారే. అతనికి పి.సుశీల పిన్ని అవుతుంది. ఆమెతో దగ్గరి బంధుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి రికమండేషన్లు, సిఫార్సులు లేకుండా కేవలం తన టాలెంట్‌తోనే సింగర్‌గా ఎదిగారు. చిన్నతనంలోనే మంచి సింగర్‌ అవ్వాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. సంగీతం, నృత్యం ఆడపిల్లలు నేర్చుకోవాలి, మగపిల్లలు చదవుకొని ఉద్యోగాలు చెయ్యాలి అనే మనస్తత్వం రామకృష్ణ తండ్రిది. తన చెల్లెళ్ళు సంగీతం నేర్చుకుంటూ ఉంటే ఇతను గమనిస్తూ ఉండేవారు. అతనిలోని సంగీత జ్ఞానాన్ని తర్వాత గమనించిన ఆయన తండ్రి నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలోని కొన్ని మెళకువలు నేర్పించారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో కొన్నాళ్లు లలిత గీతాలు పాడారు రామకృష్ణ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు ఆ పాటల్ని వినడం జరిగింది. అవి ఘంటసాల పాడినవే అనుకున్నారు అక్కినేని. తర్వాత రామకృష్ణ పాడాడని తెలుసుకొని అతన్ని పిలిపించి నాకు పాటలు పాడతావా అని అడిగారు. దానికి ఆశ్చర్యపోయిన రామకృష్ణ ఎటూ సమాధానం చెప్పలేకపోయాడు.  ఒకసారి రామకృష్ణ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాగేశ్వరరావుగారు ఫోన్‌ చేసారని చెల్లెలు చెప్పింది. మొదట అతను నమ్మలేదు. తర్వాత ఆయన మళ్ళీ కబురు చేశారు. రామకృష్ణ వెళ్ళి కలిసారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు నిర్మిస్తున్న ‘విచిత్ర బంధం’ సినిమాలో రెండు పాటలు పాడాలని చెప్పారాయన. ప్రస్తుతం తనకు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయని, ఇప్పుడు పాడలేనని చెప్పారు రామకృష్ణ. అయితే ఎగ్జామ్స్‌ పూర్తయిన తర్వాతే రికార్డింగ్‌ పెట్టుకుందామని అన్నారు అక్కినేని. ఆయన అనట్టుగానే పరీక్షలు అయిపోయిన వెంటనే ఆ రెండు పాటలు రామకృష్ణతో పాడించి రికార్డు చేయించారు. అవి ‘వయసే ఒక పూల తోట..’, ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’. ఈ రెండు పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయ్యాయి.  ఆ రెండు పాటలతో రామకృష్ణ అనే సింగర్‌ వచ్చాడని, ఘంటసాల లాగే పాడుతున్నాడు అని ఇండస్ట్రీకి తెలిసింది. అయితే అతని పాటలకు పేరు రావడం అటుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. రామకృష్ణ ఒరిజినల్‌ సింగర్‌ కాదని, ఘంటసాలను ఇమిటేట్‌ చేస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది. అయినా ఘంటసాట ఉండగా ఆయనలా పాడే మరో సింగర్‌ ఎందుకు అని రామకృష్ణను విమర్శించారు. దాంతో అతనికి అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు. రామకృష్ణ గురించి ఘంటసాల కూడా విని ఉన్నారు. ఒకసారి అతన్ని పిలిపించి తను పాడిన, తనకి ఇష్టమైన పాటలు పాడించుకున్నారు. ఆ పాటలు విన్న ఘంటసాల నిజంగానే ఆశ్చర్యపోయారు. అంత బాగా పాడుతున్నాడు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అని బాధ పడ్డారు. ఆ తర్వాత ఒక సభలో ‘రామకృష్ణ నా వారసుడు..’ అని ప్రకటించారు ఘంటసాల. దాంతో అప్పటివరకు విమర్శించిన వారు కూడా తమ తప్పు తెలుసుకొని రామకృష్ణకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికే ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సింగర్‌గా మంచి స్వింగ్‌లో ఉన్నారు. రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సహజంగానే బాలుకి అవకాశాలు తగ్గాయి. ఒక సందర్భంలో బాలు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.  ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడి అందర్నీ మెప్పించారు రామకృష్ణ. ఘంటసాలతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే పాట రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ పాటను పూర్తిగా పాడలేకపోయారు ఘంటసాల. వెంటనే రామకృష్ణకు ఫోన్‌ చేసి ‘ఆదినారాయణరావు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడురా.. నువ్వు ఒకసారి రా’ అని పిలిపించారు. అప్పుడు ఆ పాటలోని కొంత భాగాన్ని రామకృష్ణతో పాడించారు. ఆ మరుసటి సంవత్సరమే ఘంటసాల కన్నుమూసారు. ఘంటసాల వంటి గొప్ప గాయకుడు రామకృష్ణను తన వారసుడు అని ప్రకటించాడంటే మామూలు విషయం కాదని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆయన కెరీర్‌లో 200 సినిమాల్లో 5 వేల పాటలు పాడారు. అయితే అందులో 90 శాతం హిట్‌ సాంగ్సే ఉండడం విశేషం. రామకృష్ణ సినిమాల్లో కంటే ప్రైవేట్‌ సాంగ్సే ఎక్కువ పాడారు. కొన్ని వేల భక్తిగీతాలు ఆయన ఆలపించారు. జూలై 16, 2015లో క్యాన్సర్‌ వ్యాధి వల్ల 67 ఏళ్ళ వయసులో కన్నుమూశారు రామకృష్ణ.

అలా చేసినందుకు.. ఆమె నా చెంప చెళ్ళుమనిపించింది!

తెలుగు క్లాసిక్‌ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అందులో ‘శంకరాభరణం’ తప్పకుండా ఉంటుంది. ఆ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కీ ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే శంకరశాస్త్రి కుమార్తెగా నటించిన రాజ్యలక్ష్మీకి కూడా ఆ సినిమా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అదే ఆమె నటించిన తొలి సినిమా. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కిపై సినిమాల్లో నటించింది. అంతేకాదు, పలు తమిళ్‌ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్‌లో కూడా తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.  ఇదిలా ఉంటే.. తన 40 ఏళ్ళ కెరీర్‌లో మర్చిపోలేని ఓ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచింది రాజ్యలక్ష్మీ. ‘అది ఒక మలయాళ సినిమా. నేను కూతురుగా, ఒక సీనియర్‌ నటి తల్లిగా నటించాం. తల్లి గతంలో ఎవరి వలనో మోసపోయింది. తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తుంది తల్లి. ఒకసారి ఆమె కూతురు పార్కులో ఒక కుర్రాడితో కబుర్లు చెబుతూ కనిపిస్తుంది. ఆ కోపంతోనే  ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కూతుర్ని ‘ఎక్కడి నుంచి వస్తున్నావు’ అని అడుగుతుంది. ఆ కూతురు కాలేజీ నుంచి వస్తున్నానని చెప్తుంది. చెంప ఛెళ్లుమనిపిస్తుంది తల్లి. అదీ సీన్‌. షాట్‌ రెడీ చెప్పారు. కెమెరా ట్రాలీలో రన్‌ అవుతోంది. యాక్షన్‌ చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఆమె అడిగింది. కాలేజి నుంచి అని నేను చెప్పాను. చెంప ఛెళ్ళుమనిపించింది. నేను షాక్‌ అయిపోయాను. నా కళ్ళ వెంట నీళొచ్చాయి. అంత గట్టిగా కొట్టింది. నన్ను ఎవరూ అంత గట్టిగా కొట్టలేదు. షూటింగ్‌లో కూడా అలాంటి సీన్‌ చెయ్యాల్సి వచ్చినపుడు ఆ ఆర్టిస్టులు ముందుగానే మమ్మల్ని ఎలర్ట్‌ చేస్తారు. చేతిని ఓవర్‌ లాప్‌ చేసి కొడతానని చెబుతారు. ఒక్కోసారి దెబ్బ కూడా తగలొచ్చు. దానికి ముందే ప్రిపేర్‌ అవుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ, ఆమె మాత్రం ఎలాంటి ఇండికేషన్‌ ఇవ్వకుండా లాగి కొట్టింది. ఆ తర్వాత సీన్‌ కంటిన్యూ అయింది. ఆమె తన డైలాగులు చెప్పేసింది. షాట్‌ ఓకే అయింది. సాధారణంగా ఇలాంటి పొరపాట్లు జరిగినపుడు, మనవల్ల ఎదుటివారు ఇబ్బంది పడినపుడు సారీ చెప్తాం. కానీ, ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళి కూర్చుంది. అప్పుడు డైరెక్టర్‌ అన్నారు.. ‘ఏమ్మా.. మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం’ అని. ‘మా మధ్య ఎలాంటి ప్ల్రాబ్లం లేదు. నావల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్‌ ఉండదు. మీకు తెలుసు కదా’ అన్నాను. ‘అదేదో తేల్చుకో మరి’ అని ఆయన నవ్వుతూనే చెప్పారు. మరుసటి రోజు షూటింగ్‌కి వచ్చాను. ఆమె సెట్‌లోనే ఉంది.. ‘గుడ్‌ మార్నింగ్‌ అక్కా’ అన్నాను. దానికామె ‘గుడ్‌ మార్నింగా.. ఇది నిన్న  ఏమైంది’ అన్నారు. నాకు అప్పుడు స్ట్రైక్‌ అయింది. అంతకుముందు రోజు ఆమెకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పలేదు. అందుకే ఆమె ప్రవర్తన అలా ఉందని అర్థమైంది. అలా షూటింగ్‌లో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది’ అని వివరించారు రాజ్యలక్ష్మీ.

కె.రాఘవేంద్రరావు బి.ఎ. వెనుక దాగి ఉన్న అసలు కథ ఇదీ!

సినిమా రంగంలోని హీరోలుగానీ, హీరోయిన్లుగానీ, డైరెక్టర్లుగానీ ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటారు. వాళ్ళ పేర్ల విషయంలో కావచ్చు, స్టైల్‌లో కావచ్చు, మరేదైనా కావచ్చు. అలాంటి వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారని, అవసరాన్ని బట్టి వారిపై పూలు, పండ్లు గుప్పిస్తారనే పేరు ఉంది. అన్నింటినీ మించి ఆయన పేరు పక్కన బి.ఎ. అని లేకుండా మనం ఎక్కడా కనిపించదు. ప్రతి సినిమాకీ ‘దర్శకత్వం.. కె.రాఘవేంద్రరావు బి.ఎ.’ అనేది తప్పకుండా ఉండాల్సిందే. పేరు పక్కన బి.ఎ. లేకపోతే ఆయన దర్శకేంద్రుడు కాదు అని అర్థం. తన పేరు పక్కన బి.ఎ. ఉండడం అనేది సెంటిమెంట్‌గా చెప్పుకుంటారు రాఘవేంద్రరావు.  బి.ఎ.ని అంత సెంటిమెంట్‌గా ఫీల్‌ అయ్యే రాఘవేంద్రరావు గతంలో డైరెక్ట్‌ చేసిన ఒక సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ సినిమా టైటిల్‌ కార్డులో తన పేరును కేవలం కె.రాఘవేంద్రరావు అని మాత్రమే వేశారు. పక్కన బి.ఎ. మిస్‌ అయింది. సాధారణంగా తన పేరును సినిమాలో ఎలా వేశారు అనేది పట్టించుకోని రాఘవేంద్రరావు ఆ సినిమా ఫ్లాప్‌ అయిన తర్వాత అతని సన్నిహితులు ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు రాఘవేంద్రరావు.. పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ దగ్గరకు వెళ్ళి తన పేరు పక్కన బి.ఎ. అనేది సెంటిమెంట్‌గా ఫీల్‌ అవుతానని, అందుకే అది మిస్‌ అవ్వకుండా చూడమని చెప్పారు.  ఇక బి.ఎ. వెనుక కూడా ఒక కథ ఉంది. రాఘవేంద్రరావు పేరు పక్కన బి.ఎ. అని ఉండడాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఎడ్యుకేషన్‌ పరంగా చూస్తే బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అయినప్పటికీ చాలా మంది అనుకునేది మాత్రం బి అంటే ‘బొడ్డు’, ఎ అంటే ‘యాపిల్‌’ అని. తన గురించి అలా అనుకుంటారని తెలిసినా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకునే రాఘవేంద్రరావు తను బి.ఎ. చేయడం వెనుక ఉన్న కథ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. టెన్త్‌ పాస్‌ అయిన తర్వాత ఆయన తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు ఒక మాట అన్నారట. అదేమిటంటే ‘నువ్వు దర్శకుడు అవ్వాలంటే చదవాల్సింది ఇది కాదు’ అని. అయితే రాఘవేంద్రరావు ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఒకవేళ డైరెక్టర్‌గా సక్సెస్‌ అవ్వకపోతే ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి డిగ్రీ అయినా ఉండాలి కదా అనే ముందు చూపుతో బి.ఎ. కంప్లీట్‌ చేశారట. బుక్స్‌ కొనుక్కోవడానికి తండ్రి ఇచ్చే డబ్బులతో సినిమాలు చూసేవారు రాఘవేంద్రరావు. తన ఫ్రెండ్‌ దగ్గర వున్న పుస్తకాలను ఎగ్జామ్స్‌కి ఐదు రోజులు ముందు చదవడం మొదలు పెట్టేవారు. అలా డిగ్రీ పూర్తి చేశారు. రాఘవేంద్రరావు ఫ్రెండ్‌ అతను కొనుక్కున్న పుస్తకాలతో మూడు సంవత్సరాలు కష్టపడి చదివి ఫెయిల్‌ అయ్యాడు. అందుకే ఈ బి.ఎ. విషయంలో తన ఫ్రెండ్‌కి ఎంతో రుణపడి ఉంటానని చెబుతారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. 

లైట్ల అద్దె కట్టలేక వైజాగ్‌లో మూతపడిన స్టూడియో గురించి విన్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా స్టూడియోలు అనగానే హైదరాబాద్‌లోని స్టూడియోలు మనకు గుర్తొస్తాయి. వాస్తవానికి మొట్ట మొదటి స్టూడియో రాజమండ్రిలో 1936వ సంవత్సరంలో దుర్గా సినీటోన్‌ పేరుతో ప్రారంభించారు. స్టూడియో పేరుతోనే ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని నిర్మించేందుకు ఆ స్టూడియో అధినేతలు సిద్ధమయ్యారు. కొంత భాగం ఆ స్టూడియోలోనే సెట్‌ వేసి షూట్‌ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. స్టూడియోను కూడా మూసేశారు. సినిమా షూటింగ్‌కి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ ఉంది. వాటిని బొబ్బిలి రాజావారు, చిక్కవరం జమీందారు తీసుకొని ఆంధ్రా సినీటోన్‌ పేరుతో విశాఖపట్నంలో స్టూడియోను ప్రారంభించారు.  ఆ స్టూడియోలో 1938లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘మోహిని భస్మాసుర’, హిరేన్‌బోస్‌ దర్శకత్వంలో ‘భక్త జయదేవ’, కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వంలో ‘పాశుపతాస్త్ర’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాల కోసం స్టూడియోకి కావాల్సిన లైట్లను ఓ కంపెనీ నుంచి అద్దెకు తెచ్చారు. ఆ మూడు సినిమాలను పూర్తి చేశారు. మరో పౌరాణిక సినిమా నిర్మాణ దశలో ఉంది. షూటింగ్‌ కోసం తెచ్చిన లైట్లకు అద్దె బకాయి పడింది స్టూడియో. ఆ డబ్బు వెంటనే చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా స్టూడియో యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ తర్వాత లైట్లు సప్లయ్‌ చేసిన కంపెనీవారు స్టూడియోలోకి ప్రవేశించి షూటింగ్‌ జరుగుతుండగా, వెలుగుతున్న లైట్లను తీసుకెళ్ళిపోయారు. ఆ కారణం వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. షూటింగ్‌ను కొనసాగించేందుకు కొత్త లైట్లను తెచ్చే ప్రయత్నం చెయ్యలేదు స్టూడియో యాజమాన్యం. బకాయిపడిన అద్దెను చెల్లించి లైట్లను తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని కూడా చెయ్యలేదు. దీంతో షూటింగులు లేక స్టూడియోను మూసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి అదే రీజన్‌!

1989లో వచ్చిన ‘శివ’ చిత్రంతో టాలీవుడ్‌ లుక్‌నే మార్చేసిన రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం, రంగీలా వంటి సినిమాలతో ఒక విభిన్నమైన శైలి ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు రామ్‌గోపాల్‌వర్మతో సినిమాలు చేసేశారు. అదే తరం హీరో అయిన చిరంజీవి కూడా ఆర్జీవీతో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. వైజయంతీ మూవీస్‌ అధినేత సి.అశ్వినీదత్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ విషయం వర్మకు చెప్పారు. చిరంజీవికి సూట్‌ అయ్యే ఒక కథను రెడీ చేసి వినిపించాడు వర్మ. చిరుకి కథ నచ్చింది. కానీ, అందులో చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అయితే వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. సినిమా స్టార్ట్‌ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చిరంజీవికి సర్దిచెప్పారు నిర్మాత అశ్వినీదత్‌.  ఒక శుభ ముహూర్తాన చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అయింది. సినిమా పేరు ‘వినాలని ఉంది’. టబు హీరోయిన్‌. అప్పట్లో చాలా మంది డైరెక్టర్లు టాకీ కంటే ముందే పాటలు చిత్రీకరించేవారు. అలా ఈ సినిమా కోసం రెండు పాటల్ని చిత్రీకరించారు. చిరంజీవి మాత్రం స్క్రిప్ట్‌ విషయంలో శాటిస్‌ఫై అవ్వలేదు. ఆ విషయాన్ని షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే క్లియర్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో వర్మతో ఈ విషయం డిస్కస్‌ చేశారు. తను అనుకున్న స్క్రిప్ట్‌ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వర్మ ఇష్ట పడడు అన్న విషయం చిరంజీవికి, అశ్వినీదత్‌కి తెలిసినా మరోసారి ఆ విషయాన్ని వర్మ దగ్గర ప్రస్తావించారు. కానీ, స్క్రిప్ట్‌ని మార్చడానికి వర్మ ఇష్టపడలేదు. దీంతో సినిమా ఆగిపోయింది. ఒక టాప్‌ హీరో, ఒక టాప్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో రూపొందే సినిమా సడన్‌గా ఆగిపోవడంతో ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ సినిమా కోసం మణిశర్మ స్వరపరిచిన పాటల్ని చిరంజీవి, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో అశ్వినీదత్‌ నిర్మించిన ‘చూడాలని వుంది’ సినిమాలో వాడారు. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో తెలిసిందే. సాధారణంగా ఒక కథ సెట్‌ అవ్వకపోతే మరో కథతో ముందుకెళ్తారు. కానీ, ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మళ్ళీ చిరు, వర్మ కాంబినేషన్‌లో మరో సినిమా ఎనౌన్స్‌ చెయ్యలేదు, అసలు ఆ ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యలేదు. 

ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య పదేళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఆ సినిమానే!

సినిమా రంగంలో కొన్ని సంఘటనలు చిత్రంగాను, విచిత్రంగానూ ఉంటాయి. ఒక్కోసారి హీరోల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల గురించి వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్‌.టి.రామారావు, సూపర్‌స్టార్‌ కృష్ణల మధ్య జరిగింది. తన నెక్స్‌ట్‌ మూవీ ఎన్టీఆర్‌తో తీస్తానని ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఎనౌన్స్‌ చేశారు కృష్ణ. ఆ తర్వాత ఒకరోజు కృష్ణకు ఎన్టీఆర్‌ ఫోన్‌ చేసి ‘బ్రదర్‌ నాతో సినిమా తీస్తాను అన్నారు.. కాల్‌షీట్స్‌ ఇస్తాను చేస్తారా?’ అని అడిగారు. అప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమాను చేసేందుకు కృష్ణ సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చెయ్యాలనే ఉద్దేశంతో ఆ కథ రెడీ చేయించారు. ఎన్టీఆర్‌ చేస్తానని అన్నారు కాబట్టి ఆ కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్‌తో తీశారు.  ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేనితో దేవదాసు చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని శోభన్‌బాబుతో చేస్తానని ప్రకటించారు. మరో సినిమా కోసం కృష్ణ దగ్గరకు వచ్చారు డి.ఎల్‌. ఆ సందర్భంలో మరో సినిమా చెయ్యడం ఎందుకు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నాతోనే చెయ్యొచ్చు కదా అని అడిగారు కృష్ణ. దానికి డి.ఎల్‌...‘ఆ సినిమా చేద్దామనుకున్న మాట వాస్తవమే కానీ, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు. కావాలంటే ఆ స్క్రిప్ట్‌ ఇస్తాను. మీరు చేసుకోండి’ అన్నారు. వెంటనే రచయిత మహారథిని పిలిపించి ఆ కథను సిద్ధం చేయమని చెప్పారు కృష్ణ. కానీ, మహారథి.. ‘ఆ స్క్రిప్ట్‌ వద్దు. నేను రీసెర్చ్‌ చేసి కథ రెడీ చేస్తాను’ అని చెప్పారు. ఆ మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చెయ్యబోతున్నాను అని ప్రకటించారు కృష్ణ. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్‌.. కృష్ణను పిలిపించారు. ‘అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నారట. అది మేం చెయ్యాలనుకున్నాం’ అన్నారు. దానికి కృష్ణ.. ‘మీరు చేస్తానంటే నేను మానేస్తాను’ అని చెప్పారు. కానీ, దానికి ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. ‘నేను చేద్దామనుకున్నాను. కానీ, చెయ్యడం లేదు. మీరు కూడా చెయ్యొద్దు’ అన్నారు. అలా అనడానికి రీజన్‌ ఏమిటంటే.. కాషాయ వస్త్రాలు కట్టుకొని అడవుల్లో తిరిగే క్యారెక్టర్‌ అది. ఆ సినిమా ఆడదు అని ఆయన ఉద్దేశం. ఎన్టీఆర్‌ అలా చెప్పిన తర్వాత కూడా కృష్ణ సినిమాను ప్రారంభించారు. అది ఆయనకు కోపం తెప్పించింది. దాంతో కృష్ణతో మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత జరిగిన దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు.  అల్లూరి సీతారామరాజు రిలీజ్‌ అయిన పదేళ్ళ తర్వాత పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి.. ఆ సినిమాను తాను చెయ్యాలనుకుంటున్నట్టు వారికి చెప్పారు ఎన్టీఆర్‌. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌.. ‘కృష్ణగారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మీరు ఒకసారి చూడండి’ అని సలహా ఇచ్చారు. అప్పటికే పదేళ్ళ నుంచి మాట్లాడుకోని ఎన్టీఆర్‌, కృష్ణ ఒకసారి స్టూడియోలో ఎదురు పడ్డారు. ఆయన ఎలాగూ మాట్లాడరు కదా అని కృష్ణ మొహం తిప్పుకొని వెళ్లిపోతుండగా.. ‘బ్రదర్‌ ఒకసారి ఇలా రండి’ అని పిలిచి ‘మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మాకు చూపించండి. మీరు నా పక్కనే ఉండాలి’ అన్నారు. ఆ మరుసటి రోజే ఒక డబ్బింగ్‌ థియేటర్‌లో సినిమా వేసి దగ్గరుండి ఆయనకు చూపించారు కృష్ణ. ఫస్ట్‌హాఫ్‌ పూర్తయిన తర్వాత సినిమా బాగుంది అన్నారు ఎన్టీఆర్‌. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణ భుజం తట్టి చాలా అద్భుతంగా చేశారు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాతి రోజు పరుచూరి బ్రదర్స్‌ని పిలిచి మనం అల్లూరి సీతారామరాజు చెయ్యడం లేదు. కృష్ణ చేసిన తర్వాత ఆ సినిమా ఎవరు చేసినా అంత ఇంపాక్ట్‌ రాదు అన్నారు. అయితే సీతారామరాజు క్యారెక్టర్‌ చెయ్యాలన్న తపన ఆయనలో ఉండడం వల్ల ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన కొన్ని సినిమాల్లో ఆ గెటప్‌లో కాసేపు కనిపించి తృప్తి పడేవారు. 

రెండు హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా రూపొందిన బాలీవుడ్‌ సినిమా ఇదే!

ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన కొన్ని సినిమాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని భారతీయ భాషల్లో సినిమాలు రూపొందిస్తుంటారు కొందరు దర్శకులు. మరికొంతమంది డైరెక్టర్లు మక్కీకి మక్కీ కాపీ చేసి తాము సొంతంగా చేసినట్టు బిల్డప్‌ ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏకంగా రెండు హాలీవుడ్‌ సినిమాలు కాపీ చేసి ఒక సినిమాను రూపొందించారన్న విషయం మీకు తెలుసా? ఇది బాలీవుడ్‌లో జరిగింది. 1983లో విడుదలైన ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ చిత్రాన్ని రెండు హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా రూపొందించారు.  భారతదేశం గర్వించదగ్గ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్‌ మూడో కుమారుడు రాజీవ్‌ కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజీవ్‌ మెహ్రా ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో దివ్యా రాణా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలోని ఫస్ట్‌హాఫ్‌ అంతా 1979లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ ‘గోయింగ్‌ స్టడీ’ ఆధారంగా చేశారు. సెకండాఫ్‌కు ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ అనే హాలీవుడ్‌ మూవీ ఆధారం. అప్పట్లో ‘ది బ్లూ లగూన్‌’ అనే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బ్రూక్‌ షీల్డ్స్‌ ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మార్టిన్‌ హెవిట్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇప్పుడు టాప్‌ హాలీవుడ్‌ హీరో అయిన టామ్‌ క్రూజ్‌ ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్‌ చేయడం ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు.  ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు ‘గోయింగ్‌ స్టడీ’ చిత్రాన్ని తీసుకున్నారు. సెకండాఫ్‌ను ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ చిత్రంతో పూర్తి చేశారు. రెండు సినిమాలను కాపీ చేసి తీసినప్పటికీ అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. మ్యూజికల్‌గా రికార్డులు క్రియేట్‌ చేసింది. అను మాలిక్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘యాద్‌ తేరీ ఆయేగీ.. ముజ్‌కో బడా సతాయేగి..’, ‘ఆస్మా పే లిఖ్‌దూ నామ్‌ తేరా..’, ‘బోలో కుచ్‌తో బోలో..’ వంటి పాటలు అప్పట్లో మారుమోగిపోయాయి. ఈ చిత్రంలో హీరోగా నటించిన రాజీవ్‌ కపూర్‌ ఆ తర్వాత తండ్రి రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్‌ మూవీ ‘రామ్‌ తేరి గంగా మైలి’ చిత్రంలో హీరోగా నటించాడు. ఆ తర్వాత నటుడుగా, నిర్మాతగా, ఎడిటర్‌గా పలు బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కపూర్‌ 2021లో కన్ను మూశారు.