16 ఏళ్ళకే కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌!

ప్రభుదేవా... ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌.. ఇండియన్‌ సినిమాల్లోని డాన్సుల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొరియోగ్రాఫర్‌. మొదట అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను కనబరిచాడు. కొరియోగ్రాఫర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభుదేవాకి డాన్స్‌ మీద అస్సలు ఇంట్రెస్ట్‌ లేదు. అతనికి మంచి ఫుట్‌బాల్‌ ఆటగాడు అవ్వాలనేది గోల్‌గా ఉండేది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే పనిచేశాడు. చిన్నతనం నుంచి ఇప్పటివరకు అతని జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో వివాదాలు, వ్యక్తిగత జీవితంలో అపశృతులు, ఎన్నో అపనిందలు.. ఇన్ని అవరోధాల మధ్య తన కెరీర్‌కు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 30 సంవత్సరాలుగా సినిమాల్లోనే కొనసాగుతున్నాడు. ఏప్రిల్‌ 3 ప్రభుదేవా పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకుందాం. 1973 ఏప్రిల్‌ 3న సుందరం, మహదేవమ్మలకు మొదటి సంతానంగా ప్రభుదేవా మైసూరులో జన్మించాడు. స్కూల్‌కి వెళ్ళే ముందు, స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత కఠినమైన పద్ధతుల్లో ప్రభుదేవాకు నృత్యం నేర్పించారు. స్కూల్‌ స్టడీస్‌ పూర్తయిన తర్వాత తనతోపాటు షూటింగులకు తీసుకెళ్లేవారు సుందరం మాస్టర్‌. అలా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘తడి తడి తలపు.. తరగని వలపు’ అనే పాటలో ఫ్లూటు వాయిస్తూ కాసేపు కనిపించే కుర్రాడిగా తెరంగేట్రం చేశాడు ప్రభుదేవా. ఆ తర్వాత తండ్రి దగ్గరే అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. తండ్రి ప్రోత్సాహంతో 16 ఏళ్ళ వయసులోనే కమల్‌హాసన్‌ సినిమాకి కొరియోగ్రాఫర్‌గా తొలిసారి పనిచేశాడు. ఇండియన్‌ సినిమాల్లోని డాన్సుల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ప్రభుదేవాకే దక్కుతుంది. ఇప్పటివరకు 130 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా.  శరత్‌కుమార్‌, రోజా జంటగా పవిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యన్‌’ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న సమయంలో అతనిలో హీరో కనిపించాడు డైరెక్టర్‌కి. ఆ క్షణమే తన నెక్స్‌ట్‌ మూవీతో ప్రభుదేవాని హీరో చెయ్యాలనుకున్నాడు పవిత్రన్‌. అప్పటికే శంకర్‌ సినిమా ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంలోని ‘చికుబుకు రైలే..’ పాటతో బాగా పేరు తెచ్చుకున్నాడు ప్రభు. 1994లో ‘ఇందు’ పేరుతో పవిత్రన్‌ రూపొందిన సినిమాలో ప్రభుదేవా హీరో, రోజా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శంకర్‌ డైరెక్షన్‌లో ‘ప్రేమికుడు’ సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరం విడుదలై ఘనవిజయం సాధించాయి. ఆ తర్వాత హీరోగా పాతిక సినిమాల్లో నటించాడు. కానీ, ఇందు, ప్రేమికుడు తప్ప ఏదీ కమర్షియల్‌గా హిట్‌ అవ్వలేదు. అందులో ఎక్కువ శాతం నిర్మాతకు నష్టం రాని సినిమాలే ఉండడం విశేషం. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించాడు.  ప్రభుదేవాలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడని మొదట గమనించారు నిర్మాత ఎం.ఎస్‌.రాజు. అందుకే సిద్థార్థ్‌, త్రిష జంటగా రూపొందిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ వెంటనే ప్రభాస్‌ హీరోగా ‘పౌర్ణమి’ సినిమా కూడా ఇచ్చాడు. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. అలాగే చిరంజీవితో చేసిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ కూడా డిజాస్టర్‌ అయింది. తెలుగులో ప్రభుదేవా డైరెక్ట్‌ చేసిన సినిమాలు ఈ మూడే. డైరెక్టర్‌గా ప్రభు 15 సినిమాలు చేశాడు. అందులో 8 రీమేక్‌ సినిమాలే. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన పోకిరి చిత్రాన్ని తమిళ్‌లో విజయ్‌తో, హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో చేసి సూపర్‌హిట్‌ సాధించాడు.  1995లో రమాలత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా. వారికి ముగ్గురు మగపిల్లలు. పెద్ద కుమారుడు 13 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో 2008లో చనిపోయాడు. ఆ తర్వాత ప్రభుదేవా జీవితంలోకి నయనతార ప్రవేశించింది.  కొన్నాళ్ళు ఇద్దరూ సహజీవనం చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయంచుకున్న తర్వాత భార్య రమాలత్‌కు విడాకులు ఇచ్చాడు. నయనతార వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకుంది రమాలత్‌. ఆమెకు తోడుగా కొన్ని మహిళా సంఘాలు కూడా నిలిచాయి. ఆయా సంఘాలు నయనతారపై నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుదేవా, నయనతారల మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి ఇష్టప్రకారమే విడిపోయారు. ఆ తర్వాత నయనతార.. విఘ్నేష్‌ని వివాహం చేసుకుంది. భార్యకు విడాకులు ఇచ్చిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముంబాయిలోని ఫిజియోథెరపిస్ట్‌ హిమానిని 2020లో పెళ్ళి చేసుకున్నాడు ప్రభుదేవా. వీరికి ఒక కుమారుడు.  కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేసిన ప్రభుదేవాకు పురస్కారాలు లెక్కకు మించి లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అలాగే కొరియోగ్రాఫర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డును కూడా పొందాడు ప్రభుదేవా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది, ఫిలింఫేర్‌, జీ అవార్డ్స్‌ అందుకున్నాడు. పోకిరి తమిళ్‌ రీమేక్‌కి ఫేవరెట్‌ డైరెక్టర్‌గా విజయ్‌ సంస్థ ఇచ్చే అవార్డు గెలుచుకున్నాడు. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రభుదేవా పుట్టినరోజు ఏప్రిల్‌ 3. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ప్రభుదేవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

జయప్రద సినిమా జీవితం ఎంతో ఉజ్వలం.. వ్యక్తిగత జీవితం మాత్రం అంధకారమే!

అందం, అభినయం రెండూ సమపాళ్ళలో ఉంటేనే హీరోయిన్‌గా సినిమా రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఈ రెండూ ఉన్నప్పటికీ తారలుగా తారాస్థాయికి చేరుకున్నవారు అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అవకాశం జయప్రదకు దక్కింది. పెద్దయిన తర్వాత డాక్టరు కావాలని కలలు కన్న జయప్రద యాక్టర్‌గా తన ప్రతిభను వెండితెరపై చూపించే అవకాశం వచ్చింది. 14 ఏళ్ళ వయసులో స్కూల్‌ ఫంక్షన్‌లో ఆమె చేసిన నాట్యప్రదర్శన చూసి ముగ్ధుడైన నటుడు ప్రభాకరరెడ్డి.. చిత్ర పరిశ్రమకు ఆమెను పరిచయం చేశారు. 1976లో విడుదలైన ‘భూమికోసం’ చిత్రంలో ఒక పాటలో డాన్స్‌ చేయడం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జయప్రద. ఆ సినిమాకుగాను ఆమెకు లభించిన పారితోషికం కేవలం రూ.10. ఆ తర్వాతికాలంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి అత్యదిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.  1962 ఏప్రిల్‌ 3న రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది జయప్రద. ఆమె అసలు పేరు లలితారాణి. చిన్నతనంలోనే ఆమెకు నృత్యంలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. ‘భూమికోసం’ చిత్రంలో ఆమె చేసిన డాన్స్‌ చూసిన తెలుగు, తమిళ దర్శకనిర్మాతలు ఆమెకు వరస అవకాశాలు ఇచ్చారు. మొదట ఆమె హీరోయిన్‌గా తమిళ సినిమా ‘మన్మథలీలై’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కె.బాలచందర్‌ ‘అంతులేని కథ’ అనే ద్విభాషా చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు దర్శకుల్లో ఆమె మొదట కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘సిరిసిరిమువ్వ’ సినిమా చేసింది. అది కూడా ఘనవిజయం సాధించడంతో జయప్రదకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ‘అడవిరాముడు’ చిత్రంతో గ్లామర్‌ హీరోయిన్‌, కమర్షియల్‌ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సినీ పరిశ్రమకు వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ వంటి టాప్‌ హీరోలతో జోడీ కట్టారు. 1980కి ముందే ‘సిరిసిరిమువ్వ’ చిత్రం హిందీ రీమేక్‌ ‘సర్‌గమ్‌’ చిత్రంలో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా మెప్పించారు.  మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి భాషల్లో 300కు పైగా సినిమాల్లో  నటించింది జయప్రద. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి, కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి సౌత్‌ హీరోలతోపాటు బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, జితేంద్ర, రాజేష్‌ఖన్నా వంటి టాప్‌ హీరోల సరసన నటించింది. జయప్రద కెరీర్‌ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. అయితే వీరిద్దరికీ మాటలు ఉండేవి కాదు. సినిమాల్లో మాత్రం సొంత అక్కా చెల్లెళ్ళు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా వారి నటన ఉండేది. కానీ, బయట మాత్రం ఇద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కారణాలు ఎవరికీ తెలీదు. ఆమాటకొస్తే వారిద్దరూ ఎందుకు మాట్లాడుకోరో వాళ్ళకి కూడా తెలీదు.  వారిద్దరి మధ్య మాటలు లేకపోవడం అనేది చివరి వరకు అలాగే కొనసాగింది. తన కెరీర్‌ మొత్తాన్ని ఎక్కడా ఎక్స్‌పోజింగ్‌కి తావివ్వకుండా సినిమాలు చేస్తూ హోమ్‌లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు జయప్రద. 1994లో రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ సినిమాలను పక్కన పెట్టకుండా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆమె 2023లో ఒక మలయాళ చిత్రంలో చివరిగా నటించారు.  జయప్రద సినిమా కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా కొనసాగింది. అయితే వ్యకిగత జీవితంలో మాత్రం ఆమెకు మానసిక వ్యధే మిగిలింది. 1986లో బాలీవుడ్‌ నిర్మాత శ్రీకాంత్‌ నహతాను ప్రేమించి పెళ్ళి చేసుకుంది జయప్రద. అయితే అప్పటికే అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్‌. ఈవిషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేవి. అలా రావడానికి కారణం. వీరి పెళ్ళయిన తర్వాత శ్రీకాంత్‌ మొదటి భార్యకు మూడో సంతానం కలిగింది. అది ఆమెకు ఎంతో బాధ కలిగించిన అంశం. వాస్తవానికి శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకునే నాటికి అతనికి పెళ్ళయిందన్న విషయం ఆమెకు తెలియదు అంటారు. అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. పెళ్ళయిన తర్వాత కూడా మొదటి భార్యను వదిలిపెట్టకపోవడంతో ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్ళింది. అతని నుంచి విడిపోయిన తర్వాత మరొకరికి తన జీవితంలో స్థానం ఇవ్వలేదు జయప్రద. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఒక బిడ్డను దత్తత తీసుకొని పెంచుకున్నారు.  1994లో ఎన్‌.టి.రామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు జయప్రద. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షాన చేరి తెలుగుదేశం మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్‌లోని ములాయం సింగ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ నా జన్మభూమి, ఉత్తరప్రదేశ్‌ నా కర్మభూమి అనే నినాదంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైంది జయప్రద. 2019లో భారతీయ జనతాపార్టీలో చేరిన ఆమె ఆ పార్టీలోనే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు.  డాక్టర్‌ కావాలని కలలు కని ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్‌ అయిన జయప్రద భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అందాల తారగా అందరి మన్ననలు పొందారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగిన జయప్రదకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

ఆ పది తెలుగు సినిమాలు ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు.. ఎందుకో తెలుసా?

ఒక సినిమా పూర్తి కావడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషి ఏదో ఒక రూపంలో ఉంటుంది. వారి వారి శక్తిమేర సినిమా బాగా రావాలనే ప్రయత్నిస్తారు. ఇక నిర్మాత తను తీసే సినిమా విడుదలై మంచి లాభాలు రావాలని ఆశిస్తాడు. తద్వారా ఇండస్ట్రీలో నిర్మాత నిలదొక్కుకొని ఇంకా మంచి మంచి సినిమాలు నిర్మించాలనుకుంటాడు. డబ్బు, కృషి, పట్టుదల ఉన్నా.. అన్నీ కలిసి రావాలి అంటారు. అలా అన్నీ కలిసి వచ్చినపుడే నిర్మాత అనుకున్నది జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో సినిమా పూర్తయిన తర్వాత కూడా విడుదలకు నోచుకోదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్న సినిమాలైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల, రిలీజ్‌ సమయంలో ప్రమోషన్స్‌కి డబ్బు పెట్టలేక సినిమాను రిలీజ్‌ చేయకుండా వదిలేస్తారు. అలా కాకుండా కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పటికీ ల్యాబ్స్‌లోనే మగ్గిపోతున్నాయి. అలా ఏయే సినిమాలు రిలీజ్‌ కావాల్సి ఉన్నాయి, అవి ఎందుకు రిలీజ్‌ అవ్వలేదు అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. మెగాస్టార్‌ చిరంజీవి, మాధవి జంటగా బాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శాంతినివాసం’. ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకోవడమే కాకుండా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. సినిమా రిలీజ్‌ సమయంలో నిర్మాత హఠాత్తుగా మరణించడం వల్ల ఆ టైమ్‌లో రిలీజ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత ఎవ్వరూ ఆ సినిమాను రిలీజ్‌ చెయ్యాలని ప్రయత్నించలేదు.   ‘అన్నమయ్య’ వంటి భక్తిరసాత్మక చిత్రాన్ని రూపొందించిన కె.రాఘవేంద్రరావు ఆ తర్వాత ‘ఇంటింటా అన్నమయ్య’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా 2013 రిలీజ్‌ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిరది. ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యలేకపోయారు.  ‘7జి. బృందావన కాలని’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో రవికృష్ణ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత తన సోదరుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘జాదు’ అనే సినిమా చేశాడు రవికృష్ణ. తమిళ్‌లో ‘కేడీ’ పేరుతో విడుదలైంది. కానీ, తెలుగులో రిలీజ్‌కి నోచుకోలేదు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌. అప్పటికే దేవదాసు, పోకిరి వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన ఇలియానా ‘జాదూ’లో హీరోయిన్‌ అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు.  సీనియర్‌ నరేష్‌ కుమారుడు నవీన్‌ హీరోగా రామ్‌ప్రసాద్‌ రగుతు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల నిర్మించిన చిత్రం ‘అయినా ఇష్టం నువ్వు’. కీర్తి సురేష్‌కి ఇదే తొలి సినిమా. 2016లోనే ఈ సినిమా రిలీజ్‌ అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ రిలీజ్‌ అవ్వలేదు.  విక్రమ్‌కి తెలుగులో ఎంతటి పాలోయింగ్‌ ఉందో అందరికీ తెలిసిందే. అతనికి తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఏర్పడిన తర్వాత అంతకుముందు తమిళ్‌లో చేసిన కొన్ని సినిమాలను కూడా డబ్‌ చేసి తెలుగులో వదిలారు. 2008లో విక్రమ్‌, త్రిష కాంబినేషన్‌లో ఎన్‌.లింగుస్వామి రూపొందించిన ‘భీమ’ తమిళ్‌లో రిలీజ్‌ అయింది. తెలుగు వెర్షన్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ, ఈ సినిమాను విడుదల చెయ్యలేకపోయారు.  సందీప్‌ కిషన్‌, నిషా అగర్వాల్‌ జంటగా ఎ.ఎన్‌.బోస్‌ దర్శకత్వంలో ఆనంద్‌ రంగా, శేషురెడ్డి నిర్మించిన ‘డి.కె.బోస్‌’ 2013లోనే రిలీజ్‌ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ అవ్వలేదు. కోవిడ్‌ టైమ్‌లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేద్దామని కూడా ప్రయత్నించారు. కానీ, ఇప్పటికీ రిలీజ్‌ అవ్వలేదు.  రియల్‌స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ హీరోగా రూపొందిన సినిమా ‘కోతి కొమ్మచ్చి’. ‘శతమానం భవతి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని రూపొందించారు. 2020లోనే ఈ సినిమా రిలీజ్‌ అవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.  హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘క్వీన్‌’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో రూపొందిన సినిమా ‘దటీజ్‌ మహాలక్ష్మీ’. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటికీ రిలీజ్‌ అవ్వలేదు.  2013లో సూర్య హీరోగా స్వీయ దర్శకత్వంలో గౌతమ్‌ మీనన్‌ ‘ధ్రువనక్షత్రం’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. అయితే క్రియేటివిటీ డిఫరెన్సెస్‌ వల్ల సూర్య ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2015లో విక్రమ్‌ హీరోగా చిత్రాన్ని ప్రారంభించారు. ఏడు దేశాల్లో ఈ చిత్రాన్ని షూట్‌ చేశారు. ఆర్థికపరమైన, ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్‌ కాలేదు.  2014లో కార్తీ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ్‌ సినిమా ‘మదరాసి’. 2010లో సుశీంద్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘నాన్‌ మహాన్‌ అల్ల’ చిత్రాన్ని అదే సంవత్సరం ‘నాపేరు శివ’ పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. కార్తీ, పా.రంజిత్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘మదరాసి’ చిత్రాన్ని 2022లో ‘నా పేరు శివ2’ పేరుతో రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. డబ్బింగ్‌కి సంబంధించిన పనులన్నీ పూర్తయినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు. 

అప్పుడు హీరోయిన్‌గా ఒప్పుకోలేదు.. ఆ తర్వాత అదే హీరోతో స్పెషల్‌ సాంగ్‌ చేసింది!

ఒక సినిమాలో నటీనటుల ఎంపిక అనేది ఎంతో ప్రాధాన్యంతో కూడుకొని ఉంటుంది. తాను అనుకున్న కథలో హీరోగా ఎవరు సరిపోతారు, హీరోయిన్‌గా ఎవరైతే బాగుంటారు, మిగతా క్యారెక్టర్లు ఏ ఆర్టిస్టులు చేస్తే ప్రేక్షకులు మెచ్చుతారు అనే విషయంలో డైరెక్టర్‌కి ఒక క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్‌ ఆలోచనకి తగిన నటీనటులు దొరికితే సగం సక్సెస్‌ సాధించినట్టుగా భావిస్తారు. అలా ఒక హీరోని ఫిక్స్‌ అయిపోయి ఎవరెన్ని చెప్పినా వినకుండా అతనితో సినిమా చేసి సూపర్‌ సక్సెస్‌ సాధించిన డైరెక్టర్‌ ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఆ సినిమా ‘యమలీల’. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకున్న ఎస్వీకె.. అందులో హీరో ఎవరైతే బాగుంటుంది అని ఎంతో ఆలోచించిన తర్వాత అలీ తన కథలోని హీరో క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చెయ్యగలడు అనిపించింది. అనుకున్నదే తడవుగా అలీని తన సినిమాలో బుక్‌ చేసేసుకున్నాడు. అయితే అతని సన్నిహితులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఎస్వీకె నిర్ణయాన్ని ఖండిరచారు. అలీ హీరో ఏమిటి? అంటూ హేళన చేశారు. అవేవీ పట్టించుకోని కృష్ణారెడ్డి.. అలీతోనే సినిమా చెయ్యాలని ఫిక్స్‌ అయిపోయాడు.  ఇక హీరోయిన్‌ కోసం వేట మొదలుపెట్టారు. తను డైరెక్ట్‌ చేసిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెంబర్‌వన్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న సౌందర్య అయితే బాగుంటుందనిపించింది కృష్ణారెడ్డికి. సౌందర్యకు కథ వినిపించారు. ఆమెకు కూడా కథ బాగా నచ్చింది. అయితే అందులో అలీ హీరో అని తెలుసుకున్న సౌందర్య.. కృష్ణారెడ్డికి సారీ చెప్పి సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయంలో ఎంతో అప్‌సెట్‌ అయిన ఎస్‌వీకే ‘యమలీల’ చిత్రంలో హీరోయిన్‌గా ఇంద్రజను ఎంపిక చేశారు. ఆమె అంతకుముందే ‘జంతర్‌ మంతర్‌’ అనే సినిమాలో నటించింది. అయితే ‘యమలీల’ ముందుగా రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో ఇంద్రజ పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంది.  1994 ఏప్రిల్‌ 28న ‘యమలీల’ విడుదలైంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాలో చూపించిన నావెల్టీకి అందరూ ఫిదా అయిపోయారు. తల్లీకొడుకుల సెంటిమెంట్‌ అద్భుతంగా వర్కవుట్‌ అయింది. దానికి తగ్గట్టుగానే అలీ తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ అలరించాడు. ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కాదనుకుంది సౌందర్య. ఆ విషయంలో తాను బాధపడ్డానని ఆ తర్వాత ఓ సందర్భంలో చెప్పింది. ఆ తర్వాత తన తప్పును సరిదిద్దుకునేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో రూపొందిన ‘శుభలగ్నం’ చిత్రంలో  ‘చినుకు చినుకు.. అందెలతో..’ అనే పాటలో అలీతో కలిసి స్టెప్పులేసింది. అంతకుముందే ‘మాయలోడు’ చిత్రంలో ఇదే పాటను బాబూమోహన్‌, సౌందర్యలపై చిత్రీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు కృష్ణారెడ్డి. ‘శుభలగ్నం’లో మరోసారి అదే పాటను ఉపయోగించి మరోసారి ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన ఎస్వీకృష్ణారెడ్డిని నిజంగా అభినందించాల్సిందే. 

1400 సినిమాల్లో నటించి స్టార్‌ స్టేటస్‌ను చూసిన రమాప్రభ.. ఎందుకలా చేసింది?

పాతతరం నటీమణుల్లో రమాప్రభకు ప్రత్యేక స్థానం ఉంది. తన హాస్యనటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రమాప్రభ అసలు పేరు రమాదేవి. పిల్లలు లేని రమాప్రభ మేనత్త నెలరోజుల వయసులోనే ఆమెను దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి నటనపై ఎంతో ఆసక్తి కనబరిచేది రమాప్రభ. మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాల్లోకి రాకముందు తమిళ నాటక రంగంలో నాలుగు వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత తమిళ సినిమాలోనే మొదట నటించింది. తమిళ్‌లో 30 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది. తెలుగులో రమాప్రభ నటించిన తొలి చిత్రం ‘చిలకా గోరింకా’. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 1400కి పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్‌ చేసింది. అన్ని వందల సినిమాల్లో నటించిన రమాప్రభ పాఠశాలకు వెళ్ళలేదు, చదువుకోలేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తర్వాత కూడా చదవడం రాయడం ఆమెకు రాదు. డైలాగులు ఒక్కసారి చదివి వినిపిస్తే చాలు, వాటిని గుర్తు పెట్టుకొని సింగిల్‌ టేక్‌లోనే షాట్‌ ఓకే చేసేది. అంతటి మెమరి పవర్‌ రమాప్రభకు ఉంది. హాస్యనటిగానే కాకుండా ఇతర పాత్రలు కూడా చెయ్యాలని ఆమెకు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్య పాత్రలే వచ్చేవి. వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా హాస్యనటిగానే ఎక్కువ సినిమాలు చేశారామె.   ముఖ్యంగా రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి అప్పట్లో చాలా క్రేజ్‌ ఉండేది. వీరిద్దరూ కలిసి 100 సినిమాల్లో నటించారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇద్దరూ కలిసి మూడు షిఫ్టుల్లో పనిచేసి సినిమాలు పూర్తి చేసేవారు. ఒక సినిమాకి కథ రెడీ అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్‌లను ఎంపిక చేయకముందే రాజబాబు, రమాప్రభ డేట్స్‌ను బ్లాక్‌ చేసేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా రాజబాబు, రమాప్రభ ఉన్నారా అని చూసేవారు. కొన్ని సినిమాల్లో వీరి కాంబినేషన్‌ సీన్స్‌కి రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చేవారు. వారి సీన్స్‌ పూర్తికాగానే థియేటర్‌ నుంచి బయటికి వెళ్లిపోయేవారు. ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన రాజబాబు, రమాప్రభ ఎంతో స్నేహంగా ఉండేవారు. అలాంటిది హైదరాబాద్‌లో రాజబాబు చనిపోతే.. బెంగళూరులో చలం సినిమా షూటింగ్‌లో ఉన్న రమాప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది.  తన జీవితంలో జరిగిన పెద్ద నష్టం రాజబాబు మరణం అని చెప్పేవారు రమాప్రభ. తర్వాత మరో పెద్ద నష్టం శరత్‌బాబు నుంచి విడాకులు తీసుకోవడం. తనకంటే ఏడేళ్ళు చిన్నవాడైన శరత్‌బాబును ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు రమాప్రభ. ఎన్నో సినిమాల్లో వాణిశ్రీ స్నేహితురాలిగా నటించిన రమాప్రభ ఒక దశలో స్టార్ట్‌ స్టేటస్‌ను చూశారు. డబ్బు బాగా సంపాదించారు. క్రమంగా రమాప్రభ ఆస్తులు కరిగిపోవడానికి, శరత్‌బాబు ఆస్తులు పెరిగిపోవడం వెనుక అసలు కారణాలు ఎవ్వరికీ తెలియవు. సినిమా రంగానికి దూరమవ్వాలన్న ఉద్దేశంతో భక్తి మార్గం వైపు వెళుతున్న రమాప్రభకు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో అవకాశం ఇచ్చి మళ్ళీ చిత్రరంగంవైపు మరలేలా చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆ తర్వాత నటిగా మళ్ళీ బిజీ అయిపోయారు రమాప్రభ. తొలిసారి అయ్యప్ప మాల వేసుకున్న తెలుగు నటి రమాప్రభ. 1985లో శరత్‌బాబు అయ్యప మాల వేసుకోవడంతో తను కూడా మాల వేసుకుంది.  నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రమాప్రభ. రాజేంద్రప్రసాద్‌ హీరోగా ‘గాంధీనగర్‌ రెండవ వీధి’, ‘అప్పుల అప్పారావు’ చిత్రాలు నిర్మించారు రమాప్రభ. తన అక్క కూతురు విజయఛాముండేశ్వరిని ఇచ్చి పెళ్ళి చేసి రాజేంద్రప్రసాద్‌తో బంధుత్వం కలుపుకున్నారు. ప్రస్తుతం రమాప్రభ తను జన్మించిన చిత్తూరు జిల్లా, మదనపల్లిలోని వాయల్పాడులో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

550 సార్లు రీ రిలీజ్‌ అయి రికార్డుల్లోకి ఎక్కిన సినిమాలో ఎన్నో విశేషాలు, మరెన్నో వివాదాలు!

పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్‌ అయిన కొన్నాళ్ళకు సెకండ్‌ రిలీజ్‌ అంటూ మళ్ళీ విడుదల చేసేవారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాలను రీ రిలీజ్‌ పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చేవారు. ఇప్పుడదే ట్రెండ్‌గా మారింది. ఈమధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్‌ అయ్యాయి, అవుతున్నాయి. సాధారణంగా ఒక సినిమాను రెండుసార్లు లేదా మూడు సార్లు రీరిలీజ్‌ చేస్తారు. కానీ, 550 సార్లు రీ రిలీజ్‌ అయిన సినిమా ఉందనే విషయం మీకు తెలుసా? ఇద్ది ఎవ్వరూ నమ్మలేని నిజం. అదే కన్నడలో రూపొందిన ‘ఓం’ సినిమా. శివరాజ్‌కుమార్‌ హీరోగా, ప్రేమ హీరోయిన్‌గా ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 19 మే, 1995లో విడుదలై సంచలనం సృష్టించింది. అప్పటివరకు కన్నడలో ఆ తరహా చిత్రం రాలేదు. కథ, కథనం, క్యారెక్టర్లు.. ఇలా అన్ని విషయాల్లో ఉపేంద్ర కొత్తదనం చూపించాడు. దాంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని రికార్డులు సృష్టించింది. 20 సంవత్సరాల్లో అంటే 2015 వరకు ఈ సినిమా 550 సార్లు రీరిలీజ్‌ అయింది. ఏ విధంగా చూసినా ఇది నమ్మశక్యం కాని విషయం. అందుకే ఈ రికార్డును లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పొందుపరిచారు.   ఈ సినిమా రూపొందడం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. అలాగే సినిమా నిర్మాణంలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడు ఉపేంద్ర ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అతని సినిమా చూసేవారందరికీ తెలుసు. అప్పటివరకు ఎవరూ అటెమ్ట్‌ చెయ్యని అంశాన్ని తీసుకొని సినిమాలు తీస్తూ ఘనవిజయాలు అందుకుంటాడు. ‘ఓం’ చిత్రం విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అయ్యాడు. అతని కాలేజ్‌ డేస్‌లోనే ఈ కథను రాసుకున్నాడు. ఎవరో రాసిన ఒక ఉత్తరాన్ని అతని స్నేహితుడు కాలేజికి తీసుకురావడంతో అదొక సంచలనంగా మారింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ‘ఓం’ చిత్రం ప్రథమార్థాన్ని రాసుకున్నాడు. సెకండాఫ్‌ని ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌, మాఫియాలోని కొన్ని యదార్థ ఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు. అయితే ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ విడుదలైంది. ఉపేంద్ర రాసిన కథ కూడా ఇంచుమించు అలాగే ఉండడంతో డిజప్పాయింట్‌ అయి కొన్ని మార్పులు చేర్పులతో మరో కొత్త కథను చేసుకున్నాడు.  ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. యదార్థంగా అండర్‌వరల్డ్‌లో పనిచేసిన ఎంతో మంది నేరస్తులు, నిందితులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటింపజేయడానికే కొందరిని బెయిల్‌పై బయటికి తీసుకు రావడం విశేషం. అప్పట్లో కర్ణాటకలో పేరు మోసిన రౌడీషీటర్లు కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్‌ వంటి వారు ‘ఓం’ చిత్రంలో నటించారు. ఈ విషయాలన్నీ బయటికి రావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ‘ది వీక్‌’ మ్యాగజైన్‌ ‘ఓం’ చిత్రంపై ఒక కవర్‌ స్టోరీని రాసింది. దేశవ్యాప్తంగా లెజండరీ నటుడిగా రాజ్‌కుమార్‌కి ఎంతో పేరుంది. అలాంటి నటుడి బేనర్‌లో ఇలాంటి సినిమా నిర్మించకుండా ఉంటే బాగుండేదని ఆ కథనంలో రాసుకొచ్చారు.  మొదట ఈ సినిమా క్లైమాక్స్‌ చూసిన సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. క్లైమాక్స్‌లో భారీగా మార్పులు చేస్తే తప్ప సర్టిఫికెట్‌ ఇవ్వం అని స్పష్టం చేసింది. వారు చెప్పినట్టుగానే కొన్ని మార్పులు చేసి సర్టిఫికెట్‌ పొందారు. రూ.70 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పంపిణీ హక్కులను హెచ్‌.డి. కుమారస్వామి సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.  1996 కర్ణాటక స్టేట్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్‌, ఉత్తమ నటిగా ప్రేమ, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్‌లు అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌(సౌత్‌)ను శివరాజ్‌కుమార్‌ సొంతం చేసుకున్నారు. బెంగళూరులోని కపిల్‌ థియేటర్‌లో ‘ఓం’ చిత్రాన్ని అత్యధికంగా 30సార్లు రీ రిలీజ్‌ చేశారు. ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మరో రికార్డు ఏమిటంటే.. ఈ సినిమా రిలీజ్‌ అయిన 20 ఏళ్ళ తర్వాత 2015లో డిజిటల్‌ రైట్స్‌కి విక్రయానికి పెట్టగా రూ.10 కోట్లకు ఉదయ్‌ టీవీ కొనుగోలు చేసింది.  ఈ చిత్రాన్ని తెలుగులో డా.రాజశేఖర్‌ హీరోగా, ప్రేమ హీరోయిన్‌గా ‘ఓంకారమ్‌’ పేరుతో 1997లో నిర్మించారు. తెలుగు వెర్షన్‌కి కూడా ఉపేంద్రే దర్శకత్వం వహించాడు. అయితే ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. హిందీలో లవ్‌స్టోరీ, బేతాబ్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన దర్శకుడు రాహుల్‌ రావైల్‌ 1999లో ‘ఓం’ చిత్రాన్ని ‘అర్జున్‌ పండిట్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. సన్నిడియోల్‌, జుహీ చావ్లా హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్‌ చేసింది. 

ఎంతో వేగంగా స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు.. అంతే వేగంగా అతని జీవితం ముగిసిపోయింది!

సినీ పరిశ్రమలో బలవన్మరణానికి పాల్పడ్డవారు చాలా మంది ఉన్నారు. వారిలో హీరోయిన్లే ఎక్కువ కనిపిస్తారు. ఆత్మహత్య చేసుకున్న హీరోలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో ఉదయ్‌కిరణ్‌ ఒకరు. హీరోగా పరిచయమైన తక్కువ కాలంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం, హీరోగా బిజీ అయిపోవడం, యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ రావడం, అమ్మాయిల పాలిట డ్రీమ్‌బాయ్‌గా మారడం.. ఇలా అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. అంతే వేగంగా అతని జీవితం కూడా ముగిసిపోవడం ఎంతో బాధాకరం. ఉదయ్‌కిరణ్‌ మరణవార్త విని బాధపడని వారు లేరు. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలోని వారితోపాటు సామాన్య ప్రేక్షకుల్ని కూడా కలచివేసింది. ఈ విషయం అతని అంతిమ యాత్రను చూస్తే అర్థమవుతుంది. ఎవరూ ఊహించని విధంగా వేలల్లో అభిమానులు ఉదయ్‌కిరణ్‌ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  ఉదయ్‌కిరణ్‌ గురించి చెప్పమని అతని సన్నిహితుల్ని అడిగితే తమకి ఉన్న అనుబంధం గురించి చెబుతారు, అతని మనస్తత్వం ఎలాంటిది అనే విషయం చెబుతారు. అన్నింటినీ మించి ఉదయ్‌కిరణ్‌ ఒక మంచి వ్యక్తి అనే మాట ప్రతి ఒక్కరూ చెబుతారు. అతనితో ఇండస్ట్రీలో ఎంతో మంది సన్నిహితంగా ఉండేవారు. వారిలో నటుడు, నిర్మాత మురళీమోహన్‌ ఒకరు. ఉదయ్‌కిరణ్‌ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, ఒక శ్రేయోభిలాషిగా మురళీమోహన్‌ అతని గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘ఉదయ్‌కిరణ్‌ నన్ను తరచూ కలుస్తూ ఉండేవాడు. అతనికి హైపర్‌ టెన్షన్‌ ఉంది. ఏ విషయాన్ని సులువుగా తీసుకోలేడు. వెంటనే టెన్షన్‌ అయిపోతాడు. ఆ టైమ్‌లో కంట్రోల్‌లో ఉండడు. ఇది గమనించి అతనితో సన్నిహితంగా ఉండే మేము ఒక లేడీ డాక్టర్‌ని రిఫర్‌ చేశాం. దానికి సంబంధించిన కౌన్సిలింగ్‌ కోసం ఆ డాక్టర్‌ దగ్గర జాయిన్‌ చేశాం. ఆమె ఉదయ్‌ని సొంత తమ్ముడిలా ట్రీట్‌ చేసింది. టెన్షన్‌కి గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను అతనికి అర్థమయ్యేలా చెప్పింది. చెప్పినట్టే నడుచుకుంటానని అనేవాడు. కానీ, ఏదైనా సంఘటన అతన్ని డిస్ట్రబ్‌ చేస్తే మళ్ళీ ఆవేశపడిపోయేవాడు.  సినిమాల పరంగా అతనికి మంచి అవకాశాలే వచ్చేవి. వరస విజయాలు అందుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్‌. ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ అయిన కొత్తవారిని స్వయంగా ఫోన్‌ చేసి అభినందించే అలవాటు చిరంజీవికి ఉంది. అలాగే ఉదయ్‌కి కూడా ఫోన్‌ చేసి అభినందించారు. ఆ సమయంలోనే ‘సార్‌.. మిమ్మల్ని ఒకసారి కలవాలి’ అని అడగడం, ఆ తర్వాత వెళ్లి కలవడం జరిగింది. ఆ పరిచయంతోనే చిరంజీవిని తరచూ కలిసేవాడు. తన లైఫ్‌లోని గుడ్‌ మూమెంట్‌ని చిరంజీవితో షేర్‌ చేసుకునేవాడు. దీంతో చిరంజీవికి ఉదయ్‌పై మంచి అభిప్రాయం కలిగింది. తమ ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌తో డిస్కస్‌ చేసిన తర్వాత ఆ శుభవార్తని ఎనౌన్స్‌ చేశారు. అది తెలుసుకొని మేమంతా ఎంతో హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. ఉదయ్‌కిరణ్‌ లాంటి మంచి కుర్రాడు చిరంజీవిగారి ఫ్యామిలీతో కలవడం శుభసూచకంగా భావించాం. ఆ సమయంలోనే ఒకసారి మా ఇంటికి వచ్చాడు ఉదయ్‌. ‘ఇది నీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్‌ మూమెంట్‌. మంచి సంబంధం. జాగ్రత్తగా చూసుకో’ అని సలహా ఇచ్చాను. కారణం తెలీదుగానీ, ఈ సంబంధం క్యాన్సిల్‌ అయిపోయింది. ఈ విషయంలో ఉదయ్‌ బాగా అప్‌సెట్‌ అయ్యాడు. అది అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. ఆ తర్వాత అతను చేసిన సినిమాలు చాలా వరకు ఆడలేదు. వీటన్నింటివల్ల అతనికి టెన్షన్‌ మరింత పెరిగిపోయింది. అప్పటికే హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న ఉదయ్‌ దానివల్లే అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో. అతని మరణవార్త విని మా కుటుంబంలోని సభ్యుడ్ని కోల్పోయాను అన్నంత బాధ పడ్డాను. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధ కలుగుతుంది’ అన్నారు మురళీమోహన్‌. 

అంతటి అరుదైన ఘనత సాధించిన యుగపురుషుడు నటరత్న ఎన్‌.టి.రామారావు!

66 సంవత్సరాల క్రితం మద్రాస్‌లో ఒక సినిమా విషయంలో అందరూ చర్చించుకున్నారు. సి.పులయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ చిత్రాన్ని తియ్యబోతున్నారు. అది కూడా రంగుల్లో... ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ సినిమా కోసం అంత విశేషంగా మాట్లాడుకోవడానికి కారణం. అప్పటివరకు తెలుగులో రంగుల చిత్రం అనే మాట లేదు. సౌత్‌ ఇండియాలో మొట్ట మొదటి కలర్‌ సినిమా తమిళ్‌లో వచ్చింది. ఎం.జి.ఆర్‌., భానుమతి జంటగా ఆలీబాబా 40 దొంగలు కథతో ఆ సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు తొలి కలర్‌ సినిమా తనే అందించాలని ఎ.శంకరరెడ్డి నిర్ణయించుకున్నారు. 1958 మార్చి 5న వాహిని స్టూడియోలో ‘లవకుశ’ చిత్రం ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామపట్టాభిషేకం సన్నివేశాన్ని ఓపెనింగ్‌ షాట్‌గా తీశారు. ఉత్తర రామాయణం ఆధారంగా 1934లోనే ‘లవకుశ’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి కూడా సి.పుల్లయ్యే దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సీనియర్‌ శ్రీరంజని సీతగా నటించారు. ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్‌ అయిన 24 సంవత్సరాల తర్వాత చేసే ఈ ‘లవకుశ’లో ఏం ప్రత్యేకత చూపిస్తాం అని ఆలోచించిన దర్శకుడు పుల్లయ్య, శంకరరెడ్డిలకు రంగుల్లో తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. కలర్‌లోనే సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు శంకరరెడ్డి. అప్పటికి దేశంలోకి ఈస్ట్‌మన్‌కలర్‌ రాలేదు. గేవా కలర్‌ఫిల్మ్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. దానితోనే సినిమాను ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి చేద్దామని స్టార్ట్‌ చేస్తే ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ ఐదేళ్ళలో బడ్జెట్‌ పరంగా వచ్చిన సమస్యల వల్ల కొంతకాలం షూటింగ్‌ ఆగిపోయింది. తిరిగి ప్రారంభించడానికి శంకరరెడ్డి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనకడుగు వేయకుండా విజయవంతంగా సినిమా పూర్తి చేశారు శంకరరెడ్డి. భూకైలాస్‌, సీతారామకళ్యాణం చిత్రాల్లో రావణాసురుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎన్‌.టి.రామారావు ఈ సినిమాలో రాముడిగా అవతారమెత్తారు. అయితే సీత పాత్రకు అంజలీదేవిని ఎంపిక చేయడాన్ని అందరూ వ్యతిరేకించారు. నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం కూడా శంకరరెడ్డి, పుల్లయ్యలను కలిసి.. డాన్సులు చేసే అమ్మాయిని సీతగా చూపిస్తే ఏం బాగుంటుంది, వేరే అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చింది. కానీ, పుల్లయ్య ఆ మాటలు పట్టించుకోకుండా అంజలీదేవితోనే సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అలా ఎన్నో విమర్శలు ఎదుర్కొని సీత పాత్ర పోషించారు అంజలి. ఆ తర్వాత ‘లవకుశ’ ప్రివ్యూ చూసి అంజలి దగ్గరకు వెళ్లి ‘అమ్మా సీతమ్మ తల్లీ! తప్పయిపోయింది. క్షమించు అంజమ్మా’ అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు లక్ష్మీరాజ్యం.  ఉత్తర రామాయణాన్ని తీసుకొని పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ‘లవకుశ’గా తెరకెక్కించారు సి. పుల్లయ్య, ఆయన తనయుడు సి.ఎస్‌.రావు. 3 గంటల 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో 1 గంట 45 నిమిషాలపాటు 36 పాటలు, పద్యాలతో వీనుల విందు చేశారు ఘంటసాల. ఈ సినిమాలో ఎంతో పాపులర్‌ అయిన ‘వల్లనోరి మామా నీ పిల్లను..’ అనే పాట మొదట సినిమాలో లేదు. పంపిణీదారులకు ఈ సినిమాను చూపిస్తే వారు ఒక సలహా చెప్పారు. సినిమా చాలా బాగుంది. అయితే వినోదం కోసం రేలంగి, గిరిజలపై ఒక పాట పెడితే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు ఆ పాటను వారిద్దరిపై చిత్రీకరించి జత చేశారు. ఇంత మంచి సినిమాలో నటించడం మహాభాగ్యంగా భావిస్తున్నామంటూ రేలంగి, గిరిజ ఈ సినిమాలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదు. సినిమా చివరి దశలో ఉన్నప్పుడే సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయన తనయుడు సి.ఎస్‌.రావు దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సినిమాను పూర్తి చేశారు.  1963 మార్చి 29న ‘లవకుశ’ విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకొని మరీ వచ్చి సినిమా చూశారు. ఎ, బి, సి అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ‘లవకుశ’ అలరించింది. 62 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శితమైంది. 18 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. ఆరోజుల్లో 75 వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ఘనత ‘లవకుశ’ చిత్రానికే దక్కింది. ఈ సినిమా కంటే ముందు ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్‌’ చిత్రాలదే కలెక్షన్లపరంగా రికార్డు ఉండేది. ఆ రికార్డును ‘లవకుశ’ క్రాస్‌ చేసింది. తమిళ్‌ వెర్షన్‌ కూడా సూపర్‌హిట్‌ అయింది. అక్కడ కూడా 40 వారాలు ఈ సినిమాను ప్రదర్శించారు. హిందీలోకి డబ్‌ చేసే అక్కడ కూడా 25 వారాలు నడిచింది. భారతదేశ సినీ చరిత్రలో ఒక హీరో నటించిన పాతాళభైరవి, లవకుశ చిత్రాలు మూడు భాషల్లో ఘనవిజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్‌ విషయంలోనే జరిగింది. అలాగే ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, తమిళ చిత్రం కర్ణన్‌ వంటి అవార్డు చిత్రాల్లో నటించినందుకు రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ప్రశంసా పత్రం అందుకున్నారు ఎన్టీఆర్‌.  ఇక ‘లవకుశ’ సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే.. అప్పట్లో టిక్కెట్‌ ధర కేవలం పావలా నుంచి రూపాయి వరకు ఉండేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనాభా 3 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన సినిమా ‘లవకుశ’. అలాగే 100 కేంద్రాల్లో ఉన్న జనాభాకి దాదాపు నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దీన్ని బట్టి సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ ఎలా వచ్చేవారో అర్థమవుతుంది. అంతటి ఆదరణ ఇప్పటి సినిమాలకు వస్తే  కలెక్షన్లు వేల కోట్ల రూపాయల్లో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఈ సినిమాలో నటించిన వారంతా మహామహులే. ముఖ్యంగా శ్రీరాముడిగా ఎన్టీఆర్‌, సీతగా అంజలీదేవి నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరికీ పాదాభివందనం చేసి హారతులు ఇచ్చి వారిని దైవసమానులుగా భావించేవారు జనం. దాదాపు 49 సంవత్సరాల తర్వాత ఎన్‌.టి.రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతగా బాపు దర్శకత్వంలో ఇదే కథను ‘శ్రీరామరాజ్యం’గా తెరకెక్కించారు. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుందీ చిత్రం. 

తెలుగులో అతిపెద్ద ఫ్లాప్‌ సినిమా 70 ఏళ్ళ క్రితమే వచ్చింది... దాన్ని ఏ సినిమా బీట్‌ చెయ్యలేదు!

ఒక సినిమా నిర్మాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని లక్షల రూపాయలు వెచ్చిస్తేగానీ ఒక సినిమా పూర్తి కాదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి టెక్నీషియన్స్‌కి కలిగే ఇబ్బందులు తక్కువనే చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాలకు అవి కూడా ఎక్కువే. ఏ నిర్మాత అయినా డబ్బు సంపాదించాలనే సినిమా తీస్తాడు, పోగొట్టుకోవాలని ఎవ్వరూ సినిమా తియ్యరు. సినిమా కోసం నిర్మాత ఖర్చుపెట్టే డబ్బుకి ఎంతో కొంత లాభం వస్తే నిర్మాత సంతోషిస్తాడు. అలా కాకుండా పెట్టిన ఖర్చు మాత్రమే వెనక్కి వచ్చినా అతనికి సంతోషమే. ఎందుకంటే ఆ డబ్బుతో మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెట్టిన డబ్బులో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోతే ఆ నిర్మాత పరిస్థితి ఏమిటి? ఇదంతా సినిమానే నమ్ముకొని, సినిమాయే జీవితంగా ఉండే నిర్మాతలకు వర్తిస్తుంది. కానీ, కొందరు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా డబ్బు ఉంది కదా అని సినిమా నిర్మాణంలోకి దిగితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే 70 సంవత్సరాల క్రితం విడుదలైన ‘ప్రపంచం’ అనే సినిమా.  1953లో విడుదలైన ‘ప్రపంచం’ సినిమా రూ.30 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. ఆరోజుల్లో ఒక సినిమాకి రెండు, మూడు లక్షలకు మించి బడ్జెట్‌ ఉండేది కాదు. అలాంటిది రూ.30 లక్షలు ఒక్క సినిమాకే ఖర్చు చేశారంటే అది మామూలు విషయం కాదు. సాధారణంగా పౌరాణిక సినిమాలు, జానపద చిత్రాలకు కొంత బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో సెట్టింగ్స్‌ ఉంటాయి. కానీ, ‘ప్రపంచం’ అనే సినిమా పూర్తి సాంఘిక చిత్రం. అయినా 50కి పైగా సెట్టింగ్స్‌ వేశారు. ఈ సినిమాకు 160 మంది నటీనటులు పనిచేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ వారు తీసుకునే పారితోషికానికి ఎన్నో రెట్లు అధికంగా చెల్లించారు. ఈ సినిమా పూర్తి కావడానికి 2,50,000 అడుగుల ఫిలింను ఖర్చు చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని రీ షూట్లు జరిగాయో లెక్కే లేదు. అప్పట్లోనే 101 థియేటర్లలో రిలీజ్‌ అయిన సినిమా ఇది. ఈ సినిమా పబ్లిసిటీని హెలికాప్టర్ల ద్వారా చేసి సినిమా ప్రమోషన్‌లో అప్పట్లోనే కొత్త పుంతలు తొక్కారు. ఇంకా ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలాంటి సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? అసలు ఈ సినిమా ఎలా మొదలైంది అనే వివరాల్లోకి వెళితే..  అతని పేరు మునాస్‌. 1915లో శ్రీలంకలోని కొలంబోలో పుట్టాడు. అతని పూర్వీకులు అందరూ రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు. మునాస్‌కి చిన్నప్పటి నుంచి చదువు కంటే రాజకీయాలంటేనే ఎక్కువ ఇష్టం. అతను పెద్ద వాడైన తర్వాత బిజినెస్‌ రంగంలో బాగా రాణించాడు. అప్పట్లోనే లక్షలు సంపాదించాడు. అతనికి ఇంగ్లీష్‌, తమిళ సాహిత్యాలు బాగా ఇష్టం. అతను చూసిన తొలి తమిళ సినిమా ‘సావిత్రి సత్యవాన్‌’. ఆ సినిమాను 79 సార్లు చూశాడు. అతనికి అంతగా నచ్చిందా సినిమా.  దాంతో తను కూడా ఒక మంచి సినిమా తియ్యాలనుకున్నాడు. ఈ విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె సినిమా కోసం కథ రాస్తానని చెప్పింది. ఆ కథ మునాస్‌కి బాగా నచ్చింది. సినిమా తియ్యడం కోసం భార్య, పిల్లలతో మద్రాస్‌ చేరుకున్నాడు. ఒక పెద్ద డైరెక్టర్‌ని పిలిపించి కథ చెప్పాడు. ఆ డైరెక్టర్‌కి కథ నచ్చలేదు. అందులో చాలా పాత్రలు ఉన్నాయి. చాలా సెట్స్‌ వెయ్యాల్సిన అవసరం ఉంది. కథ మారుద్దాం అన్నాడా డైరెక్టర్‌. కానీ, మునాస్‌ వినలేదు. ఇదే కథను చాలా మంది డైరెక్టర్లకు వినిపించాడు. ఎవరికీ నచ్చలేదు. చివరికి దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి శిష్యుడు రామచంద్రన్‌ ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు. తెలుగులో ‘ప్రపంచం’ పేరుతో, తమిళ్‌లో ‘ఉళగం’ పేరుతో ద్విభాషా చిత్రంగా ప్రారంభమైంది. తమిళ్‌ వెర్షన్‌కు మునాస్‌ డైలాగులు రాశాడు. తెలుగు వెర్షన్‌కు శ్రీశ్రీ మాటలు రాశారు. సినిమాలో 16 పాటలు ఉన్నాయి. అందులో ఆరుద్ర ఒక పాట రాయగా, మిగతా పాటలన్నీ శ్రీశ్రీ రాశారు.  ఈ సినిమాలో కాంచన, జి.వరలక్ష్మీ, వల్లం నరసింహారావు, షావుకారు జానకి, రామశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగయ్య అతిథి పాత్ర పోషించారు. రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న నాగయ్యకు రూ.25వేలు పారితోషికం ఇచ్చారు. అప్పటికి అది చాలా చాలా ఎక్కువ. వీరు కాక మరెన్నో పాత్రలు సినిమాలు ఉన్నాయి. వేలల్లో జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టుల పారితోషికాలకే కొన్ని లక్షలు ఖర్చయింది. షూటింగ్‌ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఆ బాధ్యతను హాలీవుడ్‌కి చెందిన కిమర్‌ కంపెనీకి అప్పగించారు. మొట్టమొదటిసారి హెలికాప్టర్‌ ద్వారా పబ్లిసిటీ చేసిన సినిమా ఇదే. ఇవన్నీ జనాన్ని బాగా ఆకర్షించాయి. 1953లో ఈ సినిమా రిలీజ్‌ అయింది. థియేటర్లకు జనం తరలి వచ్చారు. కానీ, సినిమా మొదలైన పది నిమిషాలకే ప్రేక్షకులకు పరిస్థితి అర్థమైంది. ఏ సీన్‌ ఎందుకు వస్తుందో, ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాక జనానికి పిచ్చెక్కింది. అది 5 తరాలకు సంబంధించిన కథ కావడంతో అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. దీంతో జనానికి చిర్రెత్తుకొచ్చింది. సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూశారు. సినిమా పూర్తయి థియేటర్‌ డోర్స్‌ తియ్యగానే ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. మరుసటి రోజు ఒక్కరు కూడా సినిమా చూసేందుకు రాలేదు. అలా నిర్మాత మునాస్‌ పెట్టిన లక్షల్లో ఒక్క రూపాయి కూడా అతనికి తిరిగి రాలేదు. అయినా అతను బాధ పడలేదు. ఆ తర్వాత దేవసుందరి అనే మరో సినిమాను 5 భాషల్లో నిర్మించారు. ఇది పూర్తి కావడానికి 9 ఏళ్ళు పట్టింది. ఈ సినిమా కూడా డిజాస్టర్‌ అయింది. ఈ రెండు సినిమాల కోసం 14 సంవత్సరాలు మద్రాస్‌లోనే ఉండిపోయిన మునాస్‌ ఆ తర్వాత శ్రీలంక వెళ్లిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఫ్లాప్‌ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘ప్రపంచం’ చిత్రానికి ఉన్న రికార్డును బ్రేక్‌ చేసే సినిమా ఎప్పటికీ రాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

భార్యకిచ్చిన మాట కోసం 14 ఏళ్ళు ఎన్టీఆర్‌తో కలిసి నటించని ఎఎన్నార్‌!

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు అంటుంటారు. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి, అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి దోహదపడ్డారు. అప్పట్లో ఇద్దరూ టాప్‌ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా మసలేవారు. ఇద్దరూ హీరోలుగా మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ కలిసి నటించేందుకు సంశయించేవారు కాదు. అలా వారిద్దరూ కలిసి 14 సినిమాల్లో నటించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా వారి సినిమా బంధానికి బ్రేక్‌ పడిరది. దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ. ఎన్‌.టి.రామారావుతో కలిసి నటించవద్దని అక్కినేని దగ్గర మాట తీసుకుంది. ఆమెకిచ్చిన మాట కోసం 14 సంవత్సరాలపాటు ఒక్క సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించలేదు. అన్నదమ్ముల్లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడడానికి కారణం ఏమిటి? ఎన్టీఆర్‌తో కలిసి నటించకూడదని ఎఎన్నార్‌ ఎందుకు నిర్ణయించుకున్నారో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.  1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చెయ్యడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు. 1944లో ‘సీతారామ జననం’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్‌.టి.రామారావు చిత్ర రంగ ప్రవేశం చేశారు. వీరిద్దరూ తొలిసారి 1950లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఇద్దరూ కథానాయకులుగా నటించి మెప్పించారు. 1963లో వచ్చిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రంతో వీరి కాంబినేషన్‌కి బ్రేక్‌ పడిరది. ఇద్దరూ టాప్‌ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు కాదు. అలాంటిది ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రం వారిని విడదీసింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడుగా, ఎఎన్నార్‌ అర్జునుడుగా నటించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావడానికి నాలుగేళ్ళ ముందే దర్శకుడు కె.బి.తిలక్‌ ‘కృష్ణార్జున’ అనే సినిమాను స్టార్ట్‌ చేశారు. ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడుగా, జగ్గయ్య అర్జునుడుగా అనుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి నటించిన ‘గుండమ్మకథ’ విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత కె.బి.తిలక్‌కి ఒక ఆలోచన వచ్చింది. అర్జునుడుగా అక్కినేని అయితే బాగుంటుంది అనిపించింది. ఈ విషయాన్ని జగ్గయ్యకు చెప్పి అతన్ని బలరాముడి క్యారెక్టర్‌ చెయ్యమన్నారు. జగ్గయ్య ఓకే చెప్పారు. ఆ తర్వాత అర్జునుడుగా నటించమని అక్కినేనిని అడిగారు. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్‌ పక్కన చెయ్యడానికి ఇష్టపడని అక్కినేని దానికి ఒప్పుకోలేదు. ఆర్టిస్టుల ఎంపికతోపాటు మరికొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికే ఆపేశారు.  1963లో అక్కినేని నాగేశ్వరరావుకి మరోసారి అర్జునుడుగా నటించాల్సిన అవసరం వచ్చింది. కె.వి.రెడ్డి స్వీయ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రం నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడుగా, ఎఎన్నార్‌ అర్జునుడుగా నటించారు. ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి మొదట ఎఎన్నార్‌ అయిష్టంగా ఉన్నప్పటికీ తమ సొంత సినిమా అయిన ‘దొంగరాముడు’ చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడుగా నటించేందుకు ఒప్పుకున్నారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు అందర్నీ అలరించాయి. ఒక అప్పుడే ఒక సమస్య తలెత్తింది. మహాభారత కథ కావడంతో అందులో శ్రీకృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది. ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది. ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణకు చేరవేశారు అభిమానులు. సినిమా చూసిన తర్వాత ఆమెకు కూడా అదే భావన కలిగింది. ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అక్కినేనికి చెప్పింది. ఇకపై ఎన్టీఆర్‌తో కలిసి ఎఎన్నార్‌ నటించకూడదు అనేదే ఆ నిర్ణయం. ఈ విషయంలో అక్కినేని నుంచి హామీ కూడా తీసుకున్నారు అన్నపూర్ణ. అప్పటి నుంచి 14 సంవత్సరాలు ఎన్టీఆర్‌, అక్కినేని కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. 1977లో వచ్చిన ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ మళ్లీ కలిసి నటించారు. ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరేందుకు ఎన్టీఆర్‌ స్వయంగా ఎఎన్నార్‌ ఇంటికి వెళ్ళారు. ఆయనే స్వయంగా వచ్చి అడగడంతో కాదనలేకపోయారు అక్కినేని. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తర్వాత 1978లో ‘రామకృష్ణులు’, 1981లో ‘సత్యం శివం’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత రెండేళ్ళకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. 

రజినీకాంత్‌ రిజెక్ట్‌ చేసిన రెండు కథలతో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన శంకర్‌!

ఒక్క ఫ్లాప్‌ కూడా ఇవ్వకుండా వరసగా హిట్‌ సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. మన రాజమౌళి సాధ్యమని నిరూపించాడు. కానీ, ఎంత టాలెంటెడ్‌ డైరెక్టర్‌కైనా అది సాధ్యం కాదు.. ఈ విషయాన్ని డైరెక్టర్‌ శంకర్‌ ప్రూవ్‌ చేశాడు. ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో చలనచిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకున్న శంకర్‌ ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో టాప్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. అప్పట్లో ‘జెంటిల్‌మెన్‌’ ఒక సెన్సేషన్‌. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు జీన్స్‌, ఒకేఒక్కడు.. ఇలా వరసగా అన్నీ బ్లాక్‌బస్టర్స్‌ చేశాడు. అప్పటివరకు శంకర్‌ చేసిన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తూ వచ్చిన ఎ.ఎం.రత్నం ‘భారతీయుడు’ చిత్రాన్ని ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మించి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌, తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒకేఒక్కడు’ చిత్రాన్ని తమిళ్‌లో శంకర్‌, మాదేష్‌ కలిసి నిర్మించారు. తెలుగులో ఎప్పటిలాగే ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమాని హిందీలో చేస్తే వరల్డ్‌ మార్కెట్‌ను అందుకోవచ్చనే ఆలోచన వచ్చింది రత్నంకి. వెంటనే అనిల్‌ కపూర్‌ హీరోగా ఒకే ఒక్కడు చిత్రాన్ని హిందీలో నాయక్‌ పేరుతో నిర్మించారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాతో నష్టాల్లో కొట్టుకుపోయాడు. శంకర్‌కు మొదటి ఓటమిని రుచి చూపించింది నాయక్‌. ఆ దెబ్బతో పెద్ద హీరోలెవరూ శంకర్‌తో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలోనే అందరూ కొత్త కుర్రాళ్లతో బోయ్స్‌ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ద్వారా నిర్మాత ఎ.ఎం.రత్నంని నష్టాల నుంచి బయటపడేద్దామనుకున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని శంకర్‌ తన శిష్యుడు బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వంలో ఒక యదార్థ ఘటన ఆధారంగా ‘కాదల్‌’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విజయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ ఒక కథని సిద్ధం చేసుకున్నాడు. అదే ‘అపరిచితుడు’. ఒకే వ్యక్తికి మూడు రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదే మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌. ఈ రకమైన వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో మార్పు తీసుకొస్తాడు. అదే కథ. ఈ కథని తీసుకొని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ దగ్గరకు వెళ్లాడు. కథ వినిపించాడు. కానీ, రజినీకి అది నచ్చలేదు. తను చేయలేనని తిరస్కరించాడు. శంకర్‌ చెప్పిన కథను రజినీ రిజెక్ట్‌ చేయడం అది రెండోసారి. మొదట ‘ఒకే ఒక్కడు’ కథను రజినీకే వినిపించాడు. అది అతనికి అంతగా రుచించలేదు. ‘అపరిచితుడు’ కథను విక్రమ్‌కి చెప్పాడు. ఒకే వ్యక్తి మూడు రకాలుగా ప్రవర్తించడం అనేది విక్రమ్‌కి బాగా నచ్చింది. ఆ మూడు రకాల క్యారెక్టర్లకు సంబంధించి ఎంతో హోం వర్క్‌ చేశాడు విక్రమ్‌. అతని నుంచి శంకర్‌ ఏం ఆశిస్తున్నాడో గ్రహించి దానికి తగ్గ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో మొదట ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత సిమ్రాన్‌ని కూడా అనుకున్నారు. అదీ వర్కవుట్‌ కాలేదు. ఆప్పుడా అదృష్టం సదాకి దక్కింది. ఇది భారీ బడ్జెట్‌ సినిమా అని శంకర్‌ ముందే ఎనౌన్స్‌ చేశాడు. ఎంత బడ్జెట్‌ అయినా నిర్మించేందుకు ఆస్కార్‌ రవిచంద్రన్‌ సిద్ధపడ్డాడు. 2003లో సినిమా ప్రారంభమైంది. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానని సినిమా ఓపెనింగ్‌లో చెప్పాడు శంకర్‌. కానీ, ఆరు నెలల్లో షూటింగ్‌ పార్ట్‌ కూడా పూర్తవ్వలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2005లో చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి రూ.26 కోట్లు బడ్జెట్‌ అయింది. తమిళ్‌లో ‘అన్నియన్‌’ పేరుతో, తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో, హిందీలో ‘అపరిచిత్‌’గా రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ‘నాయక్‌’, ‘బోయ్స్‌’ ఫ్లాపులతో వెనకపడిపోయిన శంకర్‌ ‘అన్నియన్‌’ ఒక్కసారిగా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు. విక్రమ్‌ తన అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో తన రేంజ్‌ని మరింత పెంచుకున్నాడు. 

అక్కినేనికి కమల్‌హాసన్‌ స్టెప్పులు నేర్పించిన సినిమా ఏదో తెలుసా?

భారతదేశం గర్వించదగిన నటుల్లో కమల్‌హాసన్‌ ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న కమల్‌ మూడున్నర ఏళ్ళ వయసులోనే కెమెరా ముందుకు వచ్చి సావిత్రి, జెమినీ గణేశన్‌ వంటి ఆర్టిస్టులతో కలిసి పనిచేశాడు. 1960లో విడుదలై ‘కలత్తూర్‌ కన్నమ్మ’ చిత్రంలో బాలనటుడిగా కెరీర్‌ని స్టార్ట్‌ చేసిన కమల్‌ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 65 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యం కలగక మానదు. అరడజనుకి పైగా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన కమల్‌ ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చాలా సినిమాలకు పనిచేశాడు. ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమాకి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు.  1970లో ‘శ్రీమంతుడు’ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు కమల్‌హాసన్‌. ఆ సినిమాకి తంగప్ప డాన్స్‌మాస్టర్‌. అప్పటికే భరతనాట్యం, కథక్‌లలో మంచి శిక్షణ పొందిన కమల్‌ని అసిస్టెంట్‌గా తీసుకున్నారు తంగప్ప. ఈ సినిమాలోని కొన్ని పాటలకు ఆయన నృత్యరీతుల్ని సమకూర్చారు. వాటిని ఆర్టిస్టులకు చేసి చూపించడం, వారికి తర్ఫీదు ఇవ్వడం కమల్‌హాసన్‌ పని. అప్పటికి కమల్‌ వయసు 16 సంవత్సరాలు. ఆ వయసులో అక్కినేని నాగేశ్వరరావులాంటి టాప్‌ హీరోకి స్టెప్పులు నేర్పించడం తన అదృష్టమని ఆ తర్వాత ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కమల్‌. ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్‌ సమయంలోనే అక్కినేనికి, కమల్‌కి మంచి అనుబంధం ఏర్పడిరది. ఎందుకంటే అక్కినేని నాస్తికుడు. అలాగే కమల్‌ కూడా నాస్తికుడే. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో వారి మధ్య స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగింది. కమల్‌ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా అక్కినేనిని కలవకుండా వెళ్ళరు. అక్కినేని 90వ ఏట కూడా ఆయన్ని కలిసి ఫోటో తీయించుకున్నారు కమల్‌. 

చిరంజీవి డాన్స్‌పై విమర్శ.. అప్పుడు మెగాస్టార్‌ తీసుకున్న నిర్ణయం ఏమిటి?

డాన్స్‌ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డాన్స్‌.. డాన్సుల్లో చిరు ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌. అతనిలా స్టెప్పులు వేయాలని, మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఎందుకంటే సినిమా డాన్సుల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చింది చిరంజీవే. అప్పటివరకు హీరోలు ఏదో డాన్స్‌ చేస్తున్నామంటే చేస్తున్నాం అనేలా చేసేవారు. కానీ, చిరు మాత్రం డాన్స్‌ని ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకున్నారు. అదే ఆయనకు మంచి డాన్సర్‌ అనే పేరు తీసుకొచ్చింది. డాన్స్‌ని అంత ఓన్‌ చేసుకొని చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. తన డాన్స్‌పై వచ్చిన ఓ విమర్శ వల్లే తనను తాను మార్చుకున్నారు చిరు. ఇది నిజం.  కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించిన తర్వాత సోలో హీరోగా తన కెరీర్‌ని ప్రారంభించిన తొలి రోజుల్లో ఒక సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన ఇది. చిరంజీవి, గ్రూప్‌ డాన్సర్లతో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత అందరూ చిరు డాన్స్‌ని మెచ్చుకుంటూ క్లాప్స్‌ కొట్టారు. కానీ, ఒక్కరు మాత్రం చిరు పెర్‌ఫార్మెన్స్‌కి స్పందించకుండా అలా చూస్తున్నారు. దానికి ఆశ్చర్యపోయిన చిరు ఆయన దగ్గరకు వెళ్ళి ‘ఎలా ఉంది డాన్స్‌?’ అని అడిగారు. ‘నీ వెనక ఉన్న డాన్సర్లు ఏం చేశారో, నువ్వు కూడా అదేగా చేసింది. అందులో నీ స్పెషాలిటీ ఏం ఉంది?’ అని అన్నాడు. అతని పేరు వెంకన్నబాబు. ఆ సినిమాకి మేనేజర్‌గా పనిచేశాడు. ఆయన మాటలతో ఆలోచనలో పడ్డారు చిరంజీవి. ‘నేను ఆ పాటకు చేసిన డాన్స్‌పై ఆయన చేసిన కామెంట్స్‌ నన్ను పూర్తిగా మార్చాయి. డాన్స్‌మాస్టర్లు చెప్పింది చెయ్యడం కాదు, నేను చేసేది దానికి కాస్త భిన్నంగా ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి డాన్స్‌ని ఓన్‌ చేసుకొని ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకున్నాను’ అంటూ తన కెరీర్‌ తొలిరోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు చిరు.  ఆ తర్వాతి రోజుల్లో చిరంజీవి డాన్స్‌కి ఎంత క్రేజ్‌ వచ్చిందో అందరికీ తెలిసిందే. యూత్‌తోపాటు పిల్లలు కూడా చిరు డాన్స్‌ని ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా చిరు డానన్స కోసమే సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత చిరంజీవిని ఇమిటేట్‌ చేస్తూ డాన్స్‌ చేసిన హీరోలు కూడా ఉన్నారు. తన డాన్స్‌ గురించి వచ్చిన విమర్శని నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా ఆలోచించి తనని తాను మార్చుకున్నారు కాబట్టే ఆడియన్స్‌ని తన స్టెప్పులతో మెస్మరైజ్‌ చెయ్యగలిగారు చిరు. 

తెలుగులో తొలిసారి శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకొని రికార్డు సృష్టించిన సినిమా!

ఒకప్పుడు సినిమా విజయం సాధించింది అంటే ఎన్ని సెంటర్లలో వందరోజులు ప్రదర్శించారు, ఎన్ని సెంటర్లలో 175 రోజులు రన్‌ అయింది.. అనే విషయాల గురించి చర్చించుకునేవారు. అలా విజయం సాధించిన సినిమాలు తర్వాత మళ్ళీ మళ్ళీ రిలీజ్‌ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపించేవి. అలాంటి సినిమాల్లో ‘పాతాళభైరవి’ ఒకటి. ఈ సినిమా 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అలాగే నాలుగు కేంద్రాల్లో 25 వారాలు ప్రదర్శించారు. తెలుగులో 100 రోజులు ప్రదిర్శింపబడిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే తొలి రజతోత్సవం జరుపుకొని రికార్డు సృష్టించిన సినిమా కూడా ఇదే. అంతేకాదు ఈ సినిమాను ఆ తర్వాత 500 ప్రింట్లు వేశారు. ఒరిజినల్‌ ప్రింటు చెరిగిపోతే రెండు నెగెటివ్‌ డూప్లికేట్స్‌ను కూడా తీశారు. ఇన్నిరకాలుగా ప్రింట్లు వేసిన సినిమా ఇది ఒక్కటే కావడం విశేషం. ‘పాతాళభైరవి’ సినిమాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అప్పట్లోనే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారానే మహానటి సావిత్రి చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం ‘రమ్మంటే రానే రాను...’ అనే పాటలో నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించింది. అప్పటికి సావిత్రి వయసు కేవలం 15 సంవత్సరాలే. ఈ సినిమాలో హీరోగా మొదట అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే బాలరాజు వంటి జానపద చిత్రాల్లో నటించిన అక్కినేని అయితే కరెక్ట్‌గా సరిపోతాడని భావించారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. కానీ, దానికి భిన్నంగా దర్శకుడు కె.వి.రెడ్డి ఆలోచించారు. ఎన్‌.టి.రామారావు ఈ సినిమాలోని తోట రాముడు పాత్రకు సరిపోతాడని, అతనైతేనే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యగలడని నిర్మాతలను ఒప్పించారు. అలాగే మాంత్రికుడి పాత్రకు మొదట ముక్కామలను అనుకున్నారు. హీరోని ఎలాగూ మార్చాం కాబట్టి విలన్‌ పాత్రకు కూడా వేరే వారిని తీసుకోవాలనుకున్నారు కె.వి.రెడ్డి. అప్పుడు ఎస్‌.వి.రంగారావును ఎంపిక చేవారు. 1950 ఫిబ్రవరి 5న షూటింగ్‌ ప్రారంభించారు. 1951 ఫిబ్రవరి 18 నాటికి షూటింగ్‌ పూర్తయింది. 1951 మార్చి 15న సినిమాను విడుదల చేశారు.  ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని రిలీజ్‌కి ముందే విజయవాడ దుర్గా కళామందిర్‌లో సత్యనారాయణ అనే పంపిణీదారుడు డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రదర్శించారు. సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత ఇది నాలుగు వారాల కంటే ఎక్కువ ఆడదు అని తేల్చేశారు. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పారు. దాంతో నిర్మాత చక్రపాణి సత్యనారాయణపై మండిపడ్డారు. సినిమాను చూసి తీర్పు చెప్పాల్సింది మీరు కాదు, ప్రేక్షకులు. వారి కోసమే నేను సినిమా తీసింది అంటూ సినిమా మీద ఎంతో నమ్మకంగా చెప్పారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆయా డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టుగానే ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి నీరసపడిపోయారు. కానీ, రెండు వారాల తర్వాత నుంచి సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. రోజురోజుకీ కలెక్షన్లు పెరిగాయి. దాంతో ప్రింట్లు, థియేటర్లు కూడా పెంచాల్సి వచ్చింది. అలా ‘పాతాళభైరవి’ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. అప్పట్లో విజయ సంస్థలో సినిమా చేస్తే హీరో నుంచి టెక్నీషియన్స్‌ వరకు అందరికీ నెల జీతమే ఇచ్చేవారు. అంతేకాదు, ముఖ్యమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ ఆ సంస్థకు నాలుగు సినిమాలు చెయ్యాలనే షరతు కూడా పెట్టేవారు. ‘పాతాళభైరవి’ పెద్ద హిట్‌ అవ్వడంతో సినిమాకి పనిచేసిన యూనిట్‌ సభ్యులందరికీ మూడు నెలల జీతం బోనస్‌ ప్రకటించింది విజయ సంస్థ. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతో విజయ వాహిని స్టూడియోలను మరింత అభివృద్ధి చేశారు. 

ఎన్నో సూపర్‌హిట్స్‌ అందించిన అన్నపూర్ణ బేనర్‌ అక్కినేనిది కాదా?

చిరకాల మిత్రులు... సినిమా రంగంలో ఈ మాట మనం ఎక్కువగా వింటూ వుంటాం. సమాజంలో చిరకాల స్నేహితులు అనేవారు చాలా మంది వుంటారు. కానీ, సినిమా రంగంలో అలాంటి పేరు తెచ్చుకున్న స్నేహితుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ చిరకాల మిత్రుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఒకరు హీరో, మరొకరు నిర్మాత.. వీరిద్దరి ప్రయాణం దశాబ్దాలపాటు కొనసాగింది. వీరి నుంచి ఎన్నో అపురూపమైన, అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు పెద్ద విజయాల్ని అందుకున్నాయి. వారే నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ పిక్చర్స్‌ దుక్కిపాటి మధుసూదనరావు. వీరి కాంబినేషన్‌కి ఒక ప్రత్యేకత ఉంది.  అన్నపూర్ణ పిక్చర్స్‌ అంటే అక్కినేని.. అక్కినేని అంటే అన్నపూర్ణ పిక్చర్స్‌.. ఈ బేనర్‌లో అక్కినేని ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అది అక్కినేని సొంత బేనర్‌ అని, అన్నపూర్ణ.. అక్కినేని భార్య పేరు అనుకునేవారు. కానీ, అది దుక్కిపాటి మధుసూదనరావు తల్లిపేరు. వాస్తవానికి దుక్కిపాటి తల్లి పేరు గంగాజలం. ఆమె చనిపోయిన తర్వాత సవతి తల్లి అన్నపూర్ణ తల్లి కంటే ప్రేమగా దుక్కిపాటిని పెంచి పెద్ద చేసింది. ఆమెపై ఉన్న ప్రేమతోనే తన సంస్థకి అన్నపూర్ణ పిక్చర్స్‌ అనే పేరు పెట్టారు. ఆ సంస్థకు అక్కినేనిని ఛైర్మన్‌గా చేసి భాగస్వామ్యం ఇచ్చారు.  గుడివాడ దగ్గర పెయ్యేరులో జన్మించిన మధుసూదనరావు.. మచిలీపట్నంలోని నోబుల్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే ఎక్సెల్షియర్‌ అనే నాటక సంస్థ స్థాపించారు. ఆత్రేయ, బుధ్ధరాజు, అక్కినేని అందులో సభ్యులుగా ఉండేవారు. అక్కినేని అప్పటికే 1941లో ‘ధర్మపత్ని’ చిత్రంలో చిన్న పాత్రలో నటించి వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత నాటకాల్లో స్త్రీ పాత్రలు వేస్తున్న సమయంలో ఘంటసాల బలరామయ్య ‘సీతారామ జననం’తో బ్రేక్‌ ఇచ్చారు. అక్కినేని తప్పకుండా పెద్ద హీరో అవుతాడని నమ్మినవారిలో దుక్కిపాటి మొదటివారు. అందుకే అప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ అక్కినేని వెన్నుదన్నుగా నిలిచారు. అక్కినేని హీరోగా ఎదిగేందుకు ఎన్నో రకాలుగా కృషి చేశారు. తన అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌లో చేసిన సినిమాలన్నీ దాదాపు అక్కినేనితోనే నిర్మించారంటే వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగానే కాకుండా మంచి కథకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఒక మంచి కథను అంతకంటే మంచి స్క్రీన్‌ప్లేతో దాన్ని డెవలప్‌ చేయడంలో సిద్ధహస్తుడనే పేరు తెచ్చుకున్నారు దుక్కిపాటి.   అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌పై తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా ‘దొంగరాముడు’. 1955లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే బేనర్‌లో తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్‌ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. నిర్మాతగా రాణించాలనే వారికి సినిమాలపై మంచి అవగాహన ఉండాలి. తనకంటూ ఒక అభిరుచి ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించగలుగుతారు. దుక్కిపాటి అభిరుచి, అక్కినేని అభినయం వెరసి.. అద్భుతమైన సినిమాలను ఆవిష్కరించే అవకాశం ఇద్దరికీ లభించింది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి దర్శకుడుగా ‘ఆత్మగౌరవం’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు దుక్కిపాటి.  కథ, కథనాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారో.. పాటల విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించేవారు. తమ బేనర్‌లో వచ్చే సినిమాల్లోని పాటలు మధురంగా ఉండేందుకు పాటల రచయితలకు, సంగీత దర్శకులకు ఎంతో స్వేచ్ఛనిచ్చేవారు. వారి నుంచి మంచి పాటలు రావడానికి ఎంతో కృషి చేసేవారు. ‘పాడవేల రాధికా..’, ‘పాడెద నీ నామమే గోపాలా..’, ‘పాడమని నన్నడగ తగునా..’, ‘నీవు రావు నిదుర రాదు..’, ‘మదిలో వీణలు మ్రోగే..’ వంటి పాటలు ఆబాల గోపాలన్నీ అలరించాయి. ఈ పాటలన్నీ పి.సుశీల ఆలపించడం విశేషం.  అన్నపూర్ణ పిక్చర్స్‌ అనే సంస్థ నుంచి సినిమా వస్తోందంటే.. అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూసేవారు. ఆ సంస్థలో సినిమాలు చెయ్యాలని నటీనటులు ఉవ్విళ్ళూరే వారు. ఎందుకంటే ఆ బేనర్‌లో ఒక్క సినిమా చేసినా ఎంతో పేరు వచ్చేది. అలాంటి కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో సంస్థకు అంత మంచి పేరు వుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు సినిమాలకు వివిధ శాఖల్లో అవార్డులు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అలా 1964లో విడుదలైన ‘డాక్టర్‌ చక్రవర్తి’ మొట్టమొదటి నంది అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుందీ చిత్రం.  అన్నపూర్ణ బేనర్‌లో నిర్మించిన తోడి కోడళ్లు, మాంగల్య బలం, డాక్టర్‌ చక్రవర్తి జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. అలాగే ఆత్మ గౌరవం, ఆత్మీయులు,  అమాయకురాలు చిత్రాలు నంది అవార్డులు సాధించాయి. అంతేకాదు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవను గుర్తించి రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది ప్రభుత్వం.  చదువుకునే రోజుల నుంచే అక్కినేని, దుక్కిపాటి మధ్య స్నేహం మొదలైంది. కలిసి నాటకాలు వేశారు, కలిసి సినిమాలు తీశారు. ఒకరు హీరోగా, ఒకరు నిర్మాతగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. చివరి శ్వాస వరకు తమ స్నేహంలో ఎలాంటి అపశృతులకు, అపార్థాలకు తావు ఇవ్వలేదు అక్కినేని, దుక్కిపాటి. అక్కినేని కెరీర్‌ ప్రారంభం నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడానికి మూల కారణం దుక్కిపాటి. సొంత అన్నదమ్ముల కంటే మిన్నగా తమ స్నేహాన్ని కొనసాగించిన అక్కినేని, దుక్కిపాటి ధన్యులనే చెప్పాలి. 

శివశంకర్‌ మాస్టర్‌కి ఛాలెంజ్‌గా మారిన ఆ రెండు పాటలు.. ఒకటి 32 రోజులు పట్టింది, మరొకటి 22 రోజులు!

కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి, ఆడియో పరంగా చూస్తే వీక్‌గా ఉంటుంది. అలా కాకుండా కొన్ని సినిమాలు, అందులోని పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయి. కొన్ని పాటలు తెరపై చూసినపుడు ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. పాటల కోసమే సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేవారు. అప్పట్లో పాటలను ఎంతో ఈజీగా చిత్రీకరించేవారు. ఒక పాటను ఒక్క పూటలో షూట్‌ చేసినవారు కూడా ఉన్నారు. ఆ తర్వాతి రోజుల్లో పిక్చరైజేషన్‌ పరంగా పాటలకు ప్రాధాన్యం పెరిగింది. పాటల చిత్రీకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఉండే డ్యూయెట్‌లను సైతం ఎక్కువ రోజులు చిత్రీకరిస్తున్నారు. అలా కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్‌ ప్యాట్రన్‌ సాంగ్స్‌ ఉంటాయి. వాటిని షూట్‌ చెయ్యడానికి ఒక కాన్సెప్ట్‌ అనుకుంటారు. దాని ప్రకారమే పాటను తియ్యాల్సి ఉంటుంది. అలాంటి పాట కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి అనుభవం శివశంకర్‌ మాస్టర్‌ కెరీర్‌లో జరిగింది. ‘అరుంధతి’ చిత్రంలోని ‘భూ భూ భుజంగ..’ పాటను 32 రోజులు తియ్యాల్సి వచ్చింది. అలాగే ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర’ సాంగ్‌ను చిత్రీకరించేందుకు 22 రోజులు పట్టింది.  అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో పశుపతిగా నటించిన సోనూ సూద్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా క్లైమాకన్సలో హీరోయిన్‌తో బలవంతంగా డాన్స్‌ చేయిస్తాడు పశుపతి. ఈ పాట చిత్రీకరణ శివశంకర్‌ మాస్టర్‌కి ఒక ఛాలెంజ్‌గా మారింది. పాట ఏ ప్యాట్రన్‌లో వుండాలో దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్‌ప్రసాదనరెడ్డి ఒక ఊహాచిత్రాన్ని గీయించి శివశంకర్‌ మాస్టర్‌కి ఇచ్చారు. మామూలు పాటలకు డాన్స్‌ చేయడం కూడా రాని అనుష్కతో ఇలాంటి పాటకు డాన్స్‌ చేంయించాలంటే ఎంతో కష్టంతో కూడుకునన్న పని. అయితే శివశంకర్‌ ఎంతో ఓపికగా అనుష్కకు కొన్ని నృత్యరీతులు, భంగిమలు నేర్పించారు. అలా చాలాకాలం ప్రాక్టీస్‌ చాలా రోజులు కొనసాగింది. ప్రాక్టీస్‌ పూర్తయిన తర్వాత ఆ పాటకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ వేసి చూసుకోవడానికే దాదాపు 10 రోజులు పట్టంది. ఇక దర్శకనిర్మాతలు కోరిన ప్యాట్రన్‌లో పాటను పూర్తి చేయడానికి మొత్తం శివశంకర్‌ మాస్టర్‌కి 32 రోజులు పట్టింది.  ఇక ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర..’ పాట చిత్రీకరణకు 22 రోజులు పట్టింది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లోని పాటలు కూడా కొంత డిఫరెంట్‌గానే కనిపిస్తాయి. ఈ పాటను కూడా కొత్తగా ఉండేలా చూడమని శివశంకర్‌ని అడిగారు రాజమౌళి. ఒక పాటను పూర్తి చేయడానికి రెండు మూడు రోజులు టైమ్‌ తీసుకునే శివశంకర్‌ ‘ధీర ధీర’ పాటను కంప్లీట్‌ చెయ్యడానికి 22 రోజులు పట్టింది. ఈ పాటను కొంత భాగం రాజస్థాన్‌లో తీశారు. మరో ప్రాంతంలో ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ కొంతభాగం చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెట్‌ వేసి డాన్సర్లతోపాటు రామ్‌చరణ్‌, కాజల్‌లపై 15 రోజులపాటు ఈ పాటను తీశారు. ఇదే పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శివశంకర్‌ మాస్టర్‌కి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

కమెడియన్‌ అలీ కూతుర్ని అలా చూసి భయంతో వణికిపోయిన చంద్రమోహన్‌!

తెరపై మనం చూసే నటీనటుల నిజ జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు మనకు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. వారి జీవితాల్లో ఎదురైన కొన్ని అనుభవాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. అలాంటి విచిత్రమైన సంఘటన నటుడు చంద్రమోహన్‌ విషయంలో జరిగింది. ఆమధ్య కమెడియన్‌ అలీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరైన చంద్రమోహన్‌ ఓ సరదా సంఘటనను షేర్‌ చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్‌ అలీ కూతురికి సంబంధించింది కావడం విశేషం.  చంద్రమోహన్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వారిని దగ్గరకు పిలిచి చెవి మీద వేలుతో గట్టిగా తట్టి వారు ఏడుస్తుంటే ఆనందించేవారు. అలా ఎంతో మంది పిల్లలను చంద్రమోహన్‌ ఏడిపించేవారు. కమెడియన్‌ అలీ కూడా తన చిన్నతనంలో చంద్రమోహన్‌ బాధితుడే. అతను కనిపిస్తే చాలు రెండు చెవుల మీద చేతులు పెట్టుకొని దూరంగా పరిగెత్తేవాడు అలీ. ఈ విషయంలో చంద్రమోహన్‌ అంటే పిల్లలందరికీ భయమే. దీన్నే స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు వంశీ ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాలో ఒక క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేశారు. అందులో శుభలేఖ సుధాకర్‌ ఎవరైనా వ్యక్తి వెనక నుంచి అతని చెవిమీద వేలితో గట్టిగా తట్టడం, వాళ్ళు కెవ్వుమని అరవడం జరుగుతుంది. అది ఒక్కోసారి రివర్స్‌ అయి కొందరు వెంటపడి కొట్టడానికి రావడం లాంటి ఇన్సిడెంట్స్‌ని ఆ సినిమాలో చూపించారు. అప్పట్లో ఆ సీన్స్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేసారు. ఇక చంద్రమోహన్‌ విషయానికి వస్తే. తను చేసిన పని రివర్స్‌ కావడంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.  ఒక సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ఒక పార్కులో జరుగుతోంది. అలీ అందులో కమెడియన్‌గా యాక్ట్‌ చేస్తున్నాడు. షూటింగ్‌ చూడడానికి వస్తానంటే వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి ఆరేడు సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయితోపాటు అలీ కజిన్‌ కొడుకుని కూడా తీసుకొచ్చాడు. అతనికి ఓ పదేళ్ళు ఉంటాయి. అలీ సెట్‌లో షూటింగ్‌లో ఉండగా బయట పార్కులో కూర్చున్న చంద్రమోహన్‌ ఆ కుర్రాడిని దగ్గరికి పిలిచి ఎప్పటిలాగే చెవి మీద వేలితో గట్టిగా ఒక్కటిచ్చాడు. అంతే.. ఆ అబ్బాయి ఏడుపు మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న అలీ కూతురు దగ్గరలో ఉన్న ఓ బండరాయిని తీసుకొని చంద్రమోహన్‌ దగ్గరికి వచ్చి ‘ఇప్పుడు కొట్టు చూస్తా..’ అంటూ అతని మీదకు వచ్చింది. ఆ రాయి తనమీదకు ఎక్కడ విసిరేస్తుందోనని చంద్రమోహన్‌ భయంతో వణికిపోయాడట. ఆ అమ్మాయిని ఎవరైనా ఆపండ్రా అంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు. రాయిని చేత్తో పట్టుకున్న అలీ కూతురు చంద్రమోహన్‌ వెంటపడిరది. అలా చంద్రమోహన్‌ని పార్కంతా పరిగెత్తించింది. విషయం తెలుసుకున్న అలీ తర్వాత తన కూతురికి సర్ది చెప్పాడు.  తను చేసిన పని ఇలా రివర్స్‌ అవుతుందని ఊహించని చంద్రమోహన్‌ చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడట. ఆ అమ్మాయి అలా బండరాయి చేత్తో పట్టుకొని వెంటపడుతుంటే భయంతో వణికిపోయానని అలీతో చెప్పాడు. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ భయపడతానని ఆ షోలో మరోసారి దాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రమోహన్‌. 

షూటింగ్‌లో ప్రమాదం.. మరణం అంచుకి వెళ్ళి తిరిగొచ్చిన హీరోయిన్‌!

సినిమాల్లో మన కళ్ళకు కనిపించేదంతా నిజం కాదని చూస్తున్న మనకు తెలుసు. అయినా అక్కడ నిజంగా అది జరుగుతోందా అనే భ్రమ కలిగించడమే సినిమా సహజ లక్షణం. కొంతమంది దర్శకులు సినిమాను సినిమాగా కాకుండా నేచురల్‌గా తీసే ప్రయత్నం చేస్తారు. ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్‌ ఫీల్‌ అవ్వాలి అనుకుంటారు. అందుకే కొన్ని సన్నివేశాలు మనకు ఎంతో సహజంగా అనిపిస్తాయి. అలాంటి సీన్స్‌ తీసే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అలా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. కొందరు గాయాలతో బయటపడ్డవారూ ఉన్నారు. అలా ఒక హీరోయిన్‌ మృత్యువు దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఆమే హీరోయిన్‌ రాజ్యలక్ష్మీ. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించిన రాజ్యలక్ష్మీ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని టెలివిజన్‌ సిరీస్‌లలో కూడా నటించింది. ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న రాజ్యలక్ష్మీ కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని ఘటన జరిగింది. అది తలుచుకొని ఇప్పటికీ ఆమె భయపడుతుంటారు. దాదాపు మరణానికి దగ్గరగా వెళ్ళి వచ్చిన ఆ ఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘అది గుంటూరు తాడికొండలోని ఒక టెంపుల్‌. ఎన్నో మెట్లు ఎక్కిన తర్వాత గుడి ఉంటుంది. కింద మెట్లకి ముందు ఒక మండపం ఉంటుంది. అక్కడ షూటింగ్‌. సినిమా పేరు ‘చెవిలో పువ్వు’. ఇ.వి.వి.సత్యనారాయణగారి మొదటి సినిమా. అశోక్‌కుమార్‌గారు నిర్మాత. నేను ఆ మండపానికి ఉరి వేసుకునే సీన్‌. దాన్ని లాంగ్‌ షాట్‌గా తీసేందుకు ఇ.వి.వి. ప్లాన్‌ చేశారు. నా మెడకు ఉరితాడు కట్టి ఉంది. నాకేమైనా అయితే హెల్ప్‌ చేయడానికి ఆ మండపం స్తంభాల వెనుక కెమెరాకి కనబడకుండా ఇద్దరు ఉన్నారు. యూనిట్‌ వాళ్ళంతా షాట్‌ రెడీ చేస్తున్నారు. కెమెరామెన్‌ ప్రతాప్‌గారు లాంగ్‌ నుంచి క్లోజప్‌ షాట్‌ తియ్యాలని కెమెరాలో నుంచి చూసేటపుడు నాలో ఏదో తేడా గమనించారు. నేను కళ్ళు తేలేస్తున్నట్టు కెమెరాలో కనిపించింది. ఈ అమ్మాయికి ఏదో అయిందని  అక్కడి నుంచే ఆయన అరవడం పెట్టడం మొదలుపెట్టారు. చాలా దూరంగా ఉండడం వల్ల నా దగ్గర ఉన్నవాళ్ళకి ఆ కేకలు వినిపించలేదు. అప్పుడు ఆయనే పరిగెత్తుకు వచ్చి అందరి సాయంతో నన్ను కాపాడారు. అప్పటికే నేను స్పృహ తప్పాను. అప్పుడు నా మొహం మీద నీళ్ళు జల్లితే కాస్త తేరుకున్నాను. పది నిమిషాల పాటు నేను ఆ షాక్‌ నుంచి కోలుకోలేదు. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ షాట్‌ పూర్తి చేశారు. అయితే నా మెడకు కుడిపక్క పొడుగ్గా తాడు కోసుకుపోయిన గాటు పడిపోయింది.  మరుసటి రోజు రాజ్యలక్ష్మీకి ప్రమాదం అని అన్ని పేపర్లలో న్యూస్‌ వచ్చేసింది. అది చూసి మా అమ్మమ్మ వాళ్ళు ఒకటే ఏడుపు.. ఎందుకే నీకిలాంటి సినిమాలు అని. మా ఆయన కూడా పెళ్లి చూపుల్లో ఆ గాటుని చూసి ఏమైందని అడిగారు. నేను చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను అని చెప్పాను. దాని గురించి ఆయన అప్పుడప్పుడు చెబుతుంటారు. ‘నన్ను పెళ్లి చేసుకోవాలని రాసి ఉంటే అది ఎందుకు చస్తుంది’ అని సరదాగా అంటుంటారు. ఆ సినిమా షూటింగ్‌లో జరిగిన ఆ ఇన్సిడెంట్‌ నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను అలా బ్రతికి బయటపడడానికి కెమెరామెన్‌ ప్రతాప్‌గారే కారణం’ అంటూ పాత జాప్ఞకాలను గుర్తు చేసుకున్నారు రాజ్యలక్ష్మీ.

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు చేసిన కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలకు మోహన్‌లాలే ఆధారం!

సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌లో మోహన్‌లాల్‌కు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తను చేసిన సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 1978లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్‌ 45 ఏళ్ళ కెరీర్‌లో 400కి పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్‌ చేశాడు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలు ఈ సినిమాల్లో హీరోలుగా నటించారు. ఆమధ్య వెంకటేష్‌ హీరోగా రూపొందిన దృశ్యం, దృశ్యం2 చిత్రాలకు మూలం మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన సినిమాలనే విషయం తెలిసిందే. అలా మోహన్‌లాల్‌ కెరీర్‌లో చేసిన సినిమాలను తెలుగులో ఎవరెవరు రీమేక్‌ చేశారో చూద్దాం.  1988లో విడుదలైన ‘ఆర్యన్‌’ చిత్రం మలయాళంలో చాలా పెద్ద హిట్‌ అయింది. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేశారు. 1989లో విడుదలైన ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌.రవిచంద్ర దర్శకత్వం వహించారు. మోహన్‌ బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం 1990లో వచ్చిన ‘అల్లుడుగారు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆధారం మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రమ్‌’. ఈ సినిమా 1988లో విడుదలైంది.  మోహన్‌లాల్‌ నటించిన సినిమాలకు రీమేక్‌గా తెలుగులో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం నాగార్జునే హీరోగా నటించడం విశేషం. వాటిలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ ఒకటి. మలయాళంలో ‘వందనం’ పేరుతో రూపొందిన సినిమా తెలుగు రీమేక్‌లో నాగార్జున హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘స్పటికం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వజ్రం’ రూపొందింది. ఈ చిత్రానికి ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ‘చంద్రలేఖ’ పేరుతో మలయాళంలో రూపొందిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ సినిమాని కృష్ణవంశీ డైరెక్ట్‌ చేశారు. అలాగే నాగార్జున, మోహన్‌బాబు కాంబినేషన్‌లో రూపొందిన ‘అధిపతి’ చిత్రానికి మోహన్‌లాల్‌ మలయాళంలో చేసిన ‘నరసింహం’ ఆధారం. ‘అధిపతి’ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. చిరంజీవి, మోహన్‌రాజా కాంబినేషన్‌లో రూపొందిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి ఆధారం మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ అనే విషయం తెలిసిందే.  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబే కాకుండా రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు వంటి హీరోలు కూడా మోహన్‌లాల్‌ సినిమాలను తెలుగులో రీమేక్‌ చేశారు. ఇక తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘ముత్తు’ చిత్రం కూడా మోహన్‌లాల్‌ చేసిన సినిమాకి రీమేక్‌ అనే విషయం చాలా మందికి తెలీదు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘తెన్మవిన్‌ కొంబత్‌’ చిత్రాన్ని కె.ఎస్‌.రవికుమార్‌ తమిళ్‌లో ‘ముత్తు’గా రీమేక్‌ చేశారు.