సుస్వాగతం, అన్నమయ్య, అతడు.. చిత్రాల్లో నటించేందుకు ‘నో’ చెప్పిన శోభన్‌బాబు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా హీరోగా వందల సినిమాల్లో నటించిన వారికి కూడా తర్వాత సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. హీరోగా నటించేందుకు వారికి వయసు సహకరించదు, అలాగే ప్రేక్షకులు కూడా వారిని హీరోగా స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి కనబరచరు. అలాంటి సమయంలో కీలక పాత్రల్లో, సహాయ నటుడిగా సినిమాల్లో కనిపిస్తుంటారు ఆ హీరోలు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా నటించే చాలామంది గతంలో హీరోలుగా వెలుగొందినవారే. తమ క్యారెక్టర్‌కి ఎంతటి ప్రాధాన్యం ఉంది అనేది పక్కన పెట్టి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ నటనలోనే సంతృప్తి చెందుతారు. కానీ, నటభూషణ శోభన్‌బాబు దానికి విరుద్ధం. హీరోగా వందల సినిమాల్లో నటించారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించారు. శోభన్‌బాబు నో చెప్పిన ఆ క్యారెక్టర్లు ఏమిటో ఒకసారి చూద్దాం.  నాగార్జున ప్రధాన పాత్రలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నమయ్య’ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట శోభన్‌బాబుని సంప్రదించింది చిత్ర యూనిట్‌. కానీ, ఆయన ఆ పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపించలేదు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిన ‘సుస్వాగతం’ చిత్రంలో హీరో తండ్రిగా నటించిన రఘువరన్‌కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ క్యారెక్టర్‌ కోసం మొదట శోభన్‌బాబునే సంప్రదించారు. కానీ, ఆయన అది చేయడానికి కూడా ఒప్పుకోలేదు.  ఆ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘అతడు’ చిత్రంలో నాజర్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్‌ని అడిగారు. అంతకుముందు అన్నమయ్య, సుస్వాగతం చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుసుకున్న నిర్మాత మురళీమోహన్‌ ఈసారి శోభన్‌బాబుకి ఒక బ్లాంక్‌ చెక్కు ఇచ్చి ఆ క్యారెక్టర్‌ చెయ్యమని అడిగారు. అయినా ససేమిరా అన్నారు శోభన్‌బాబు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్‌’ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో శోభన్‌బాబుతో రీమేక్‌ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్‌.బి.చౌదరి. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తప్పకుండా చేస్తారని భావించారు చౌదరి. కానీ, దానికి కూడా శోభన్‌ ‘నో’ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇన్ని సినిమాలకు నో చెప్పిన శోభన్‌బాబు చివరికి ఓ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఓ మల్టీస్టారర్‌ నిర్మించాలనుకున్నారు. కృష్ణ, శోభన్‌బాబు, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, ఈ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది.  ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందాల నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్‌బాబు తనకు వచ్చిన ఈ అవకాశాలను తిరస్కరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. ‘నేను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాను. నన్ను ప్రేక్షకులు హీరోగానే తమ గుండెల్లో పదిలపరుచుకున్నారు. వారి మనసుల్లో ఆ స్థానం అలాగే వుండాలన్నది నా కోరిక. నా జీవితం హీరోగానే ముగిసిపోవాలి తప్ప సహాయనటుడిగా తెరపై కనిపించాలని నేను అనుకోవడం లేదు’ అంటూ తను కొన్ని క్యారెక్టర్లు ఎందుకు చెయ్యకూడదు అనుకున్నారో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

700 సినిమాల్లో.. 200 తాగుబోతు క్యారెక్టర్లు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్న ఎం.ఎస్‌.!

సినిమాల్లోని తాగుబోతు క్యారెక్టర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా తాగుబోతు క్యారెక్టర్లు చేసేవాళ్ళ నటనలో కొంత ఓవరాక్షన్‌ ఉంటుంది. నిజజీవితంలో తాగుబోతులు ఇలా చేయరు కదా అనిపిస్తుంది. కానీ, అలాంటి అపవాదులు రాకుండా తను చేసే తాగుబోతు క్యారెక్టర్‌లో ఎంతో వైవిధ్యాన్ని, విభిన్నత్వాన్ని చూపించిన నటుడు ఎం.ఎస్‌.నారాయణ. ఆయన కెరీర్‌లో చేసిన 700 సినిమాల్లో 200కి పైగా తాగుబోతు క్యారెక్టర్లే చేశారంటే ఆ పాత్రలను ఎంత అద్భుతంగా పోషించారో అర్థం చేసుకోవచ్చు. నటనలో, డైలాగ్‌ డెలివరీలో, బాడీ లాంగ్వేజ్‌లో ఎవరినీ ఇమిటేట్‌ చెయ్యకుండా తన సొంతంగా ఏర్పరచుకున్న శైలిలో ఆయా పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు ఎం.ఎస్‌.నారాయణ. ఏప్రిల్‌ 16  కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.   ‘రుక్మిణి’ చిత్రంలో తొలిసారి తాగుబోతు క్యారెక్టర్‌ పోషించారు ఎం.ఎస్‌. ఆ సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఆ తరహా క్యారెక్టర్లే ఆయనకు ఎక్కువగా వచ్చేవి. 200 సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్లే చేసిన ఎమ్మెస్‌కి వాటి మీద మోజు పోలేదు. ఒకే క్యారెక్టర్‌ను మళ్ళీ మళ్ళీ చూసినా ప్రేక్షకులకు కూడా బోర్‌ కొట్టలేదు. తాగుబోతుగా ఎమ్మెస్‌ చెప్పే డైలాగ్స్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. ఆడియన్స్‌ దాన్ని ఎప్పుడూ మొనాటనీగా ఫీల్‌ అవ్వలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ ఘనత ఒక్క ఎం.ఎస్‌.నారాయణకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎమ్మెస్‌. తల్లి ప్రోత్సాహంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు. ఆరోజుల్లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశాడు. అది తను రచయితగా స్థిరపడేందుకు ఎంతో దోహదం చేసిందంటారు ఎమ్మెస్‌. తన క్లాస్‌మేట్‌ కళాప్రపూర్ణను ప్రేమించారు. పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వారికి పెళ్లి చేయడం విశేషం. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దగ్గర ఎం.ఎస్‌.నారాయణ రచయితగా చేరారు. ఆయనలోని నటుడిని మొదట గుర్తించింది రవిరాజే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ చిత్రంలో మొదటిసారి నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసారు ఎమ్మెస్‌. స్టోరీ డిస్కషన్స్‌లో అతని బాడీ లాంగ్వేజ్‌, ఏదైనా పార్టీలో డ్రిరక్‌ చేస్తున్నప్పుడు అతను మాట్లాడే విధానం రవిరాజాకు బాగా నచ్చాయి. అందుకే ‘రుక్మిణి’ చిత్రంలో నాగబాబు పక్కనే ఓ తాగుబోతు క్యారెక్టర్‌ను ఎమ్మెస్‌తో చేయించారు. తను ఆ క్యారెక్టర్‌ చెయ్యగలనా అనే సందేహం వచ్చింది ఎమ్మెస్‌కి. నువ్వు తప్పకుండా చెయ్యగలవు అని అతనిలో కాన్ఫిడెన్స్‌ను నింపారు రవిరాజా. మొదటిసారి ఎమ్మెస్‌ చేసిన తాగుబోతు క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది.  ఇక్క అప్పటి నుంచి తాగుబోతు క్యారెక్టర్‌ చెయ్యాలంటే ఎమ్మెస్‌నే పెట్టుకోవాలి అని దర్శకనిర్మాతలు భావించేవారు. ఆ తర్వాత ఎం.ఎస్‌.కి బాగా పేరు తెచ్చిన సినిమా ‘మా నాన్నకు పెళ్లి’. ఈ చిత్రంలో తాగుబోతుగా ఆయన చేసిన కామెడీని ఆడియన్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేశారు. ఈ సినిమాలోని 400 అడుగుల సీన్‌ని సింగిల్‌ షాట్‌లో చేసి సెట్‌లో అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. రచయిత అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి తర్వాత నటుడిగా స్థిరపడిన ఎమ్మెస్‌ కొన్ని వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాగుబోతు క్యారెక్టర్‌ చేయడం, దానితోనే కామెడీని పండిరచడంలో తనకెవరూ సాటిలేరని అప్పట్లోనే నిరూపించారు ఎమ్మెస్‌. 

చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో గొల్ల‌పూడి ఎలా న‌టుడ‌య్యారో తెలుసా?

న‌టుడు కాక‌ముందు గొల్ల‌పూడి మారుతీరావు ర‌చ‌యిత‌గా సుప్ర‌సిద్ధులు. చిరంజీవి, మాధ‌వి జంట‌గా న‌టించిన‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టి, న‌టుడిగా తొలి సినిమాలోనే ప్రేక్ష‌కుల నుంచి అభినంద‌న‌లు అందుకున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ ఆయ‌న పాత్ర‌మీద పెట్టిందే. ఆ సినిమాలో న‌టించ‌క ముందే రంగ‌స్థ‌లంపై ఆయ‌న చాలా నాటిక‌లు, నాట‌కాల్లో న‌టించారు. విద్యార్థి జీవితంలో స‌గ‌భాగం స్టేజిమీదే గ‌డిపారు. నాట‌కాలు రాయ‌క‌ముందు ఆయ‌న న‌టుడే. త‌ర్వాతే ర‌చ‌యిత‌య్యారు. సినిమాల్లో ర‌చ‌యిత‌గా అడుగుపెట్టాక ఆయ‌న‌లోని న‌టుడు వెన‌క‌ప‌డ్డాడు. జీవితంలో స‌గం ఉద్యోగానికీ, త‌క్కిన స‌గం సినిమా ర‌చ‌న‌కీ అంకితం అయిపోయింది. ఇంత‌కీ ఉన్న‌ట్లుండి ఆయ‌న‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో కీల‌క పాత్ర‌లో ఎలా న‌టించారు?  ప్ర‌తాప్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె. రాఘ‌వ తీసిన 'త‌రంగిణి' సినిమా క‌థ గొల్ల‌పూడి రాసిందే. త‌న‌కున్న నాట‌కానుభ‌వంతో స్క్రిప్టు చ‌దివేట‌ప్పుడు, పాత్ర‌ప‌రంగా చ‌ద‌వ‌డం ఆయ‌న‌కున్న అల‌వాటు. అందులోని ఓ పాత్ర తీరును చెప్పిన‌ప్పుడు, చ‌దివిన‌ప్పుడూ 'ఈ వేషం మీరు వెయ్యాలి' అన్నారు రాఘ‌వ‌. న‌వ్వేసి ఊరుకున్నారు గొల్ల‌పూడి. కొన్ని కార‌ణాల వ‌ల్ల 'త‌రంగిణి' షూటింగ్ వాయిదా ప‌డింది. 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' షూటింగ్‌కు ముందు గొల్ల‌పూడి ఇంటికి డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ వ‌చ్చారు. 'మీరొక వేషం వెయ్యాలి' అన్నారు. 'అలాగే, చూద్దాం' అన్నారు గొల్ల‌పూడి. వెంట‌నే రాఘ‌వ‌కు ఫోన్‌చేసి, 'మారుతీరావు గారు ఒప్పుకున్నారు' అని చెప్పేశారు రామ‌కృష్ణ‌. సుబ్బారావు అనే ముఖ్య‌పాత్ర త‌న‌చేత ధ‌రింప‌చెయ్య‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు తీర్మానించుకున్నార‌ని గొల్ల‌పూడికి అర్థ‌మైంది. టైటిల్ రోల్‌, కొత్త ద‌ర్శ‌కుడు (కోడి రామ‌కృష్ణ‌), ఒక ముఖ్య‌పాత్ర‌లో కొత్త‌న‌టుడు.. గొల్ల‌పూడికి భ‌య‌మేసింది. కానీ వాళ్లిద్ద‌రికీ ఏ భ‌య‌మూ లేదు. అప్పుడు గొల్ల‌పూడి, 'వేస్తాను. మీకు ఎప్పుడు కానీ, ఏ క్ష‌ణాన కానీ తృప్తిగా క‌నిపించ‌క‌పోయినా.. న‌న్ను మార్చేసి, ఇంకొక‌ర్ని పెట్టుకోండి' అన్నారు. వాళ్లు కూడా 'మొహ‌మాట‌ప‌డం' అని చెప్పారు. అట్లా 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో సుబ్బారావు అనే ప్ర‌ధాన పాత్ర పోషించి, ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల మెప్పును పొందారు గొల్ల‌పూడి. ఆ సినిమా చూసిన క్రాంతికుమార్‌కు గొల్ల‌పూడి న‌ట‌న తెగ న‌చ్చేసి, త‌ను అప్పుడే తీస్తున్న 'ఇది పెళ్లంటారా?'  సినిమాలో మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ త‌ర్వాత కాలంలో న‌టుడిగా య‌మ బిజీ అయిపోయి, ర‌చ‌యిత‌గా త‌క్కువ సినిమాల‌కు రాశారు గొల్ల‌పూడి మారుతీరావు. (ఏప్రిల్ 14 - గొల్ల‌పూడి మారుతీరావు జయంతి)

6 భాషల్లో రీమేక్‌ అయిన రెండో భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన తెలుగు సినిమా!

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేవి. దర్శకులు కూడా అలాంటి కథల్లోనే వైవిధ్యం చూపిస్తూ సినిమాలు రూపొందించేవారు. గత 30 సంవత్సరాలుగా అలాంటి కథలతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో వెంకటేష్‌ ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ పక్క యాక్షన్‌ మూవీస్‌ చేస్తూ.. ఫ్యామిలీ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు వెంకటేష్‌. అతను చేసిన ఫ్యామిలీ సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ అయినవే ఉండడం విశేషం. అలాంటి సినిమాల్లో ప్రథమంగా చెప్పుకోదగిన సినిమా ‘పవిత్రబంధం’.  వెంకటేష్‌ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్‌ చేశారు. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని పాటలు, మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యూత్‌ని ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌, మహిళలకు నచ్చే కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌ ఈ సినిమాలో లెక్కకు మించి ఉంటాయి. భూపతిరాజా ఈ సినిమాకి కథను అందించారు. ఈ కథ విన్న ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి కాస్తయినా ఆలోచిస్తారు. కానీ, వెంకటేశ్‌ ఇలాంటి విభిన్నమైన కథలతోనే ఎన్నో సూపర్‌హిట్స్‌ సాధించారు. అందుకే మొదటి సిట్టింగ్‌లోనే కథను ఓకే చేసేశారు.  విదేశాల్లో పెరిగి అక్కడి కల్చర్‌కి అలవాటు పడిన ఓ యువకుడి కథ ఇది. జీవితం, ప్రేమ అనే మాటలకు అర్థం తెలియని ఆ యువకుడికి అవేమిటో, వాటి ప్రాధాన్యం ఏమిటో తెలియజెప్పిన సినిమా ఇది. స్థూలంగా కథ గురించి చెప్పాలంటే.. విజయ్‌(వెంకటేష్‌)కి పెళ్లి, సంసారం వంటి విషయాల మీద అస్సలు నమ్మకం లేదు. తండ్రి విశ్వనాథ్‌ (ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం) పోరు పడలేక తమ ఆఫీసులోనే పనిచేసే రాధ(సౌందర్య) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే సంవత్సరం మాత్రమే ఆమెతో కాపురం చేస్తానని, దాని కోసం అగ్రిమెంట్‌ చేసుకుంటానని తండ్రితో చెబుతాడు. రాధలాంటి అమ్మాయితో సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఆమె మంచితనాన్ని చూసి తప్పకుండా జీవితాంతం ఆమెను భార్యగా అంగీకరిస్తాడన్న నమ్మకంతో అగ్రిమెంట్‌ విషయం రాధకు చెప్పకుండా విజయ్‌ని పెళ్లి చేసుకోమని రాధను అడుగుతాడు విశ్వనాథ్‌. సంతోషంగా అంగీకరిస్తుంది రాధ. ఆ తర్వాత అగ్రిమెంట్‌ విషయం తెలసుకొని విజయ్‌ని, విశ్వనాథ్‌ని అసహ్యించుకుంటుంది. అయితే ఆ తర్వాత తన కుటుంబ పరిస్థితుల వల్ల తప్పనిసరై పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ ఏడాది కాలంలో విజయ్‌ని రాధ మార్చగలిగిందా? వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అనేది ఎంతో అర్థవంతంగా, మరెంతో వైవిధ్యంగా తెరకెక్కించారు దర్శకులు ముత్యాల సుబ్బయ్య.  ఈ తరహా కథతో సినిమా చేసి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న ముత్యాల సుబ్బయ్య ఎంతో పకడ్బందీగా స్క్రిప్‌ని సిద్ధం చేసుకున్నారు. దానికి ఆర్టిస్టుల అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ తోడై సినిమాని సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందించింది. అంతేకాదు, ఉత్తమనటిగా సౌందర్య, ఉత్తమ సహాయనటుడిగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా నంది అవార్డులు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో రీమేక్‌ చెయ్యడం అనేది అన్నింటికంటే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, తమిళ్‌, బెంగాలీ భాషల్లో రీమేక్‌ అయిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్‌హిట్‌ కావడం మరో విశేషం. కన్నడ చిత్రం ‘అనురాగ అరలితు’ చిత్రం తర్వాత ఆరు భాషల్లో రీమేక్‌ అయిన రెండవ భారతీయ చిత్రంగా ‘పవిత్రబంధం’ రికార్డు సృష్టించింది. 

పవన్‌కళ్యాణ్‌ చేతిలో గన్‌ చూసి.. కథ నచ్చకపోతే కాల్చేస్తాడేమోనని భయపడిన డైరెక్టర్‌.!

ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతున్న హీరోల కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేసి ఉంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం వారి మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి అత్యంత ఇష్టమైన సినిమా, ఆయన అభిమానులు సైతం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ‘తొలిప్రేమ’. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఆ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తూనే ఉంది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ఇష్టంగా వింటున్నారంటే ‘తొలిప్రేమ’ చిత్రానికి వారి మనసుల్లో ఎలాంటి స్థానం ఇచ్చారో అర్థమవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలను కరుణాకరన్‌ తెలియజేశారు.  1996లో కదిర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిన కరుణాకరన్‌ ఒక్క ఏడాదిలోనే కోడైరెక్టర్‌ అయిపోయాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఒక మేగజైన్‌లో పవన్‌కళ్యాణ్‌ ఫోటో చూసి తన కథకు అతనే హీరో అనుకున్నాడు. పవన్‌ని కలిసి కథ చెప్పేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. అతని అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి ఏడు నెలలు పట్టింది. మొత్తానికి ఒకరోజు సాయంత్రం 7 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయింది. కరుణాకరన్‌ బయల్దేరిన కాసేపటికే అతని కారుకి ప్రాబ్లమ్‌ రావడంతో గంటన్నర ఆలస్యంగా పవన్‌ని కలిసాడు. అప్పటికే పవన్‌ కోపంగా ఉన్నారు. చేతిలో గన్‌ కూడా ఉంది. ‘అన్నయ్యా.. మీకు కథ నచ్చకపోతే కాల్చేయరు కదా’ అన్నారు. ఆ మాటతో పవన్‌ కోపం మొత్తం పోయింది. హాయిగా నవ్వేశారు.  పవన్‌కి కథ చెప్పడం మొదలు పెట్టాడు కరుణాకరన్‌. తను రాసుకున్న ప్రతి సీన్‌కి స్టోరీబోర్డ్‌ వేయడం కరుణకు అలవాటు. దాని ప్రకారమే అన్నీ చూపిస్తూ కథ చెప్పాడు. పవన్‌కు కథ విపరీతంగా నచ్చేసింది. కరుణను అప్రిషియేట్‌ చేసి సినిమా చేస్తున్నాం అన్నారు. నిర్మాత జి.వి.జి.రాజును పరిచయం చేశారు. అంతా ఓకే అయిపోయింది. షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. డైరెక్టర్‌గా మొదటి సినిమా కావడంతో ఎంతో టెన్షన్‌ పడుతున్న కరుణాకరన్‌కి ధైర్యం చెప్పారు పవన్‌. సినిమా పూర్తయ్యే వరకు తను చేసే సీన్స్‌ లేకపోయినా సెట్‌లోనే ఉండి కరుణాకరన్‌కి సపోర్ట్‌ చేశారట పవన్‌. పవన్‌కళ్యాణ్‌కి సినిమా అంటే ఎంత ప్యాషన్‌ ఉందో ఆ సమయంలో కరుణాకరన్‌కి అర్థమైంది.  పవన్‌కళ్యాణ్‌ డెడికేషన్‌ కరుణాకరన్‌కి బాగా నచ్చింది. తను చేసే సీన్స్‌గానీ, పాటలుగానీ ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవడానికి పవన్‌ ఎంత క్యూరియాసిటీతో ఉంటారో తెలిపే ఓ సంఘటన గురించి చెప్పారు కరుణాకరన్‌. సినిమాకి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఎడిటింగ్‌ వర్క్‌లో పూర్తిగా బిజీ అయిపోయాడు కరుణ. అందులో భాగంగానే సినిమాలో వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ ‘నీ మనసే..’ పాటను ఎడిట్‌ చేస్తున్నారు. ఆ పాటంటే పవన్‌కు ఎంతో ఇష్టం. ఆ పాటకు సంబంధించిన ఎడిటింగ్‌ జరుగుతోందని తెలుసుకొని రామానాయుడు స్టూడియోకి సాయంత్రం 8 గంటలకు వచ్చారు పవన్‌. ఆ పాటను చూడాలని ఉంది. ఒకసారి చూపిస్తావా అని కరుణను అడిగారు పవన్‌. ‘అన్నయ్యా.. ఇంకా ఎడిటింగ్‌ జరుగుతోంది కొంచెం వెయిట్‌ చెయ్యండి’ అని చెప్పారు కరుణ. ఆ పాట ఎడిటింగ్‌ పూర్తయ్యేసరికి అర్థరాత్రి 2 అయింది. బయటకు వచ్చి చూసేసరికి పవన్‌ అక్కడే ఓ బల్లపై కూర్చొని కనిపించారు. అది చూసి షాక్‌ అయిన కరుణ ‘మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అన్నయ్యా’ అని అడిగాడు. ‘ఆ పాట చూసి వెళ్దామని ఉన్నాను’ అన్నారు పవన్‌. వెంటనే ఆ పాటను చూపించారు కరుణ. అది చూసిన పవన్‌ సంతోషానికి అవధుల్లేవు. కరుణను గట్టిగా హగ్‌ చేసుకొని చాలా బాగా చేశావు అని మెచ్చుకున్నారు.  తను చేసే సినిమాలకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలియజేస్తూ ‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోని సీన్స్‌ ఎక్కువ శాతం రియల్‌ లైఫ్‌ నుంచి తీసుకున్నవి లేదా వాటి నుంచి స్ఫూర్తి పొందినవి అయి ఉంటాయి. సినిమాటిక్‌గా ఉండే సీన్స్‌ కంటే నిజజీవితంలోని సంఘటనలే నా సినిమాలో ఉంటాయి. ‘తొలిప్రేమ’ చిత్రంలో హీరోయిన్‌ కీర్తిరెడ్డి ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్‌ అయింది. అది నా జీవితంలో జరిగింది. దీపావళి పండగకు చెన్నయ్‌ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు.. ఆ రాత్రివేళ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అటు తిరిగి చూస్తే చిచ్చుబుడ్డి వెలుగులో ఒక్కసారిగా ఆ అమ్మాయి ముఖం కనిపించి ఆ తర్వాత అంతా చీకటైపోయింది. అది నా మనసులో చెరగని ముద్ర వేసింది. వెంటనే ఆ సీన్‌ను పేపర్‌పై భద్రపరుచుకున్నాను. దాన్ని ఛోటా కె.నాయుడు అద్భుతమైన లైటింగ్స్‌తో ఎక్స్‌లెంట్‌గా తీశారు. నా స్కూల్‌ డేస్‌లో ఓ అమ్మాయి ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌కి ఏంజెల్‌లా రెడీ అయి స్కూటర్‌పై వెళుతూ కనిపించింది. అదే సీన్‌ని ‘డార్లింగ్‌’ చిత్రంలో కాజల్‌తో చేశాను’ అని వివరించారు కరుణాకరన్‌. 

ఎన్‌.టి.ఆర్‌., చిరంజీవి కాంబినేషన్‌ అనగానే ఇండస్ట్రీ షాక్‌.. రంగంలోకి దిగిన మోహన్‌బాబు.!

ప్రేమకథా చిత్రాలు, సెంటిమెంట్‌ సినిమాలు రూపొందుతున్న రోజుల్లో ‘అడవిరాముడు’ చిత్రంతో కమర్షియల్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టారు ఎన్‌.టి.ఆర్‌, కె.రాఘవేంద్రరావు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో కేడీ నెం.1, డ్రైవర్‌రాముడు, వేటగాడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, గజదొంగ, తిరుగులేని మనిషి, సత్యం శివం చిత్రాలు వచ్చాయి. ‘వేటగాడు’ 1979లో రిలీజ్‌ అయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన అర్జునరాజు, శివరామరాజు మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌తో సినిమా చెయ్యడానికి రెండేళ్ళు ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మళ్ళీ సినిమా చేద్దామని, మంచి కథ రెడీ చేసుకోమని ఎన్టీఆర్‌ చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమిళ్‌లో శివాజీ గణేశన్‌ మూడు పాత్రల్లో నటించిన ‘దైవమగన్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందని రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్టీఆర్‌ దానికి ఒప్పుకోలేదు. శివాజీ గణేశన్‌ కెరీర్‌లో అదో మైలురాయిలాంటి సినిమా అనీ, ఆ పాత్రలు పోషించడం శివాజీకే సాధ్యమనీ, దాన్ని టచ్‌ చేయడం తనకి ఇష్టం లేదని చెప్పారు ఎన్టీఆర్‌.   1974లో శివాజీగణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘తంగపతకం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలని అల్లు రామలింగయ్య హక్కులు తీసుకున్నారు. దాన్ని ఎన్టీఆర్‌తో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, దానికి శివాజీ గణేశన్‌ ఒప్పుకోలేదు. ‘తంగపతకం’ చిత్రాన్నే ‘బంగారు పతకం’ పేరుతో డబ్‌ చేయించారు. తమిళ్‌లో, తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అలా ఎన్టీఆర్‌ తెలుగులో చెయ్యాల్సిన ఈ సినిమా మిస్‌ అయింది. ఆ సినిమాలోని కొన్ని అంశాలను తీసుకొని ‘కొండవీటి సింహం’ కథను సిద్ధం చేశారు . మంచివాడైన తండ్రి, చెడ్డవాడైన కొడుకు మధ్య జరిగే కథ ఇది. అప్పుడు ఒకే హీరో తండ్రీకొడుకులుగా నటించడం అనే ట్రెండ్‌ నడుస్తోంది. ఎన్టీఆర్‌ ఆ రెండు క్యారెక్టర్లు చెయ్యడం కరెక్ట్‌ కాదని భావించి కొడుకు క్యారెక్టర్‌ కోసం చిరంజీవిని తీసుకున్నారు. ఎన్టీఆర్‌ కోసం మరో యంగ్‌ హీరో క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేశారు. చిరంజీవి, గీతలపై ఒక పాటను కూడా ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఈ వార్త విని ఇండస్ట్రీలోని వారు షాక్‌ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తిరుగులేని మనిషి’ చిత్రం వచ్చింది. దాన్ని కూడా రాఘవేంద్రరావే డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఫ్లాప్‌ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా చెయ్యకూడదన్న సెంటిమెంట్‌తో చిరంజీవిని ‘కొండవీటి సింహం’ చిత్రం నుంచి తప్పించారు. ఆ స్థానంలో మోహన్‌బాబుని తీసుకున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.  1969లో విడుదలైన ఎం.జి.ఆర్‌. సినిమా ‘అడిమై పెన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘కొండవీటి సింహం’ పేరుతో విడుదల చేశారు. అదే టైటిల్‌ను ఈ సినిమాకి ఖరారు చేశారు. ‘తంగపతకం’ చిత్రంలో చెడ్డవాడైన కొడుకును సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన తండ్రి చంపేస్తాడు. అది ఆ సినిమా క్లైమాక్స్‌. వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం ఆ తండ్రికి బంగారు పతకం బహూకరిస్తుంది. ‘కొండవీటి సింహం’ చిత్రం క్లైమాక్స్‌ని కూడా మొదట అలాగే తీశారు. అయితే కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే సెంటిమెంట్‌ మరింత పండుతుందని  భావించారు రాఘవేంద్రరావు. అప్పటికే ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ అయిపోయాయి. అయినా రాఘవేంద్రరావు అభ్యర్థన మేరకు మరో వారం రోజులు డేట్స్‌ ఇచ్చారు. కొత్త క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. అయిపోయిన సినిమాని మళ్ళీ షూట్‌ చేస్తున్నారని తెలియడంతో ఇండస్ట్రీలో అనుమానాలు మొదలయ్యాయి. సినిమా బాగా రాకపోవడంవల్లే రీషూట్‌ చేశారని ప్రచారం జరిగింది. ఈ సినిమాను 1981 అక్టోబర్‌ 7న విడుదల చేశారు. అందరి అనుమానాల్ని పక్కన పెడుతూ సినిమా ఘనవిజయం సాధించింది. ‘అడవిరాముడు’ 50 రోజులకు రూ.81 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ‘వేటగాడు’ 50 రోజులకు రూ.96 లక్షలు కలెక్ట్‌ చేసింది. ‘కొండవీటి సింహం’ 1 కోటి 25 లక్షల రూపాయలు వసూలు చేసి అంతకుముందు రికార్డులను క్రాస్‌ చేసింది. అప్పటికి అది ఇండస్ట్రీ రికార్డు. 

పోలీస్‌ జీపులో షూటింగ్‌కి వచ్చిన బాలయ్య.. షాక్‌ అయిన యూనిట్‌.!

కొందరు హీరోలు తాము చేసే పాత్ర విషయంలో ఎంతో కేర్‌ తీసుకుంటారు. ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యేందుకు కృషి చేస్తారు. సినిమా జరుగుతున్నన్ని రోజులూ అదే ట్రాన్స్‌లో ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌, లారీ డ్రైవర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌లో బాలకృష్ణ క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు బాలకృష్ణకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చి టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలలో ఒకడిగా నిలబెట్టాయి. బాలకృష్ణ క్యారెక్టర్‌ను ఎలా డిజైన్‌ చేస్తే ఆడియన్స్‌కి నచ్చుతుందో గోపాల్‌కి తెలుసు. అలాగే ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఏ రేంజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వాలో బాలకృష్ణకు తెలుసు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండిరగ్‌తో చేసిన ఆ సినిమాలన్నీ అంతటి ఘనవిజయం సాధించాయంటే దాని వెనుక బాలకృష్ణ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.  1992లో నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ అప్పట్లో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలోని ఇన్‌స్పెక్టర్‌ క్యారెక్టర్‌కి బాలకృష్ణ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్‌ అలా రావడం వెనుక ఎంతో హోమ్‌ వర్క్‌ ఉంది. నిజమైన పోలీసులు ఎలా నడుస్తారు, వారి బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది వంటి విషయాలను సునిశితంగా పరిశీలించేవారు బాలకృష్ణ. జీపులో కూర్చొని వెళుతున్నప్పుడు వారి స్టైల్‌ ఎలా ఉంటుంది అనే దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. వీటన్నింటిపైనా కమాండ్‌ వచ్చిన తర్వాత ఒకరోజు బి.గోపాల్‌కి ఫోన్‌ చేసి తాను షూటింగ్‌కి రావాలంటే జీపు పంపించాలని చెప్పారు. దానికి గోపాల్‌ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య ఈరోజు జీపు ఎందుకు పంపించమన్నాడు అనే విషయం అతనికి అర్థం కాలేదు. బాలయ్య చెప్పినట్టుగానే జీపు పంపించారు. పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకొని ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్న బాలయ్య.. జీపు రాగానే అందులోకి ఎక్కి ఒక కాలు బయటపెట్టి స్టైల్‌గా లాఠీ ఊపుతూ కూర్చున్నారు. ఓపెన్‌గా అందరికీ కనిపించేలా జీపులో సెట్స్‌కి వచ్చారు.  ఆరోజుల్లో వచ్చిన పోలీస్‌ స్టోరీస్‌ సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన సినిమా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. ఈ సినిమా అంత పెద్ద హిట్‌ అవ్వడానికి బాలకృష్ణ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు కూడా కారణమయ్యాయి. పోలీస్‌ యూనిఫామ్‌లో బాలకృష్ణను చూసి అభిమానులు మురిసిపోయారు. ఇన్‌స్పెక్టర్‌గా బాలకృష్ణ తన పవర్‌ఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశారు. తను చేసే ప్రతి క్యారెక్టర్‌ని ఓన్‌ చేసుకుని నటించే బాలయ్య.. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ అలా పోలీస్‌ జీపులో యూనిఫామ్‌తోనే వచ్చేవారట. ఈ విశేషాలన్నీ దర్శకుడు బి.గోపాల్‌ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

హీరోయిన్‌ మృతదేహాన్ని ఎత్తుకుపోయిన దొంగలు.. ఇప్పటికీ అది మిస్టరీనే!

పాతతరం నటీమణులకు నటనతోపాటు సంగీతంలోనూ ప్రవేశం ఉండేది. కొందరు హీరోయిన్లు సినిమాల్లోని తమ క్యారెక్టర్లకు సంబంధించిన పాటలను కూడా తామే పాడుకునే వారు. అలాంటి వారిలో ఎస్‌.వరలక్ష్మీ, భానుమతి, కన్నాంబ ముఖ్యులు. వీరంతా నటనలో, సంగీతంలో మేటి అనే పేరు తెచ్చుకున్నారు. వారిలో కన్నాంబ జీవితం ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత మరెంతో విషాదంగా మారింది.  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ 13 సంవత్సరాల వయసులో బాలనటిగా రంగస్థలం మీద తన ప్రతిభను చాటుకున్నారు. ఆ అనుభవంతోనే 1935లో ‘హరిశ్చంద్ర’ చిత్రంలో చంద్రమతిగా, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చిత్రంలో ద్రౌపదిగా అధ్బుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్ళు, కృష్ణ కుచేల ఆమె కెరీర్‌లో చేసిన ముఖ్యమైన సినిమాలు. ఎం.జి.రామచంద్రన్‌, ఎన్‌.ఎస్‌.రాజేంద్రన్‌, శివాజీగణేశన్‌, నాగయ్య, పి.యు.చిన్నప్ప, నందమూరి తారక రామారావు వంటి ప్రముఖ హీరోలతో కలిసి 150కి పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు కన్నాంబ.  కడారు నాగభూషణంని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళ భాషల్లో 22 చిత్రాలు నిర్మించారు. సుమతి, పాదుకాపట్టాభిషేకం, సౌదామిని, పేదరైతు, లక్ష్మి, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం, నాగపంచమి మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేది ఆ కంపెనీ. ఆరోజుల్లో కన్నాంబ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించినా ఆమెకు గ్లామర్‌లో ఎవరూ సాటి వచ్చేవారు కాదు. హీరోయిన్‌లాగే వుండేవారు. సినిమాల్లో హీరోయిన్లు ధరించే చీరలను, ఇతర వస్తువులను ప్రస్తుతం వారి పేర్లతో, వారు నటించిన సినిమాల పేర్లతో సేల్‌ చేస్తున్నారు. ఈ తరహాలో 60 సంవత్సరాల క్రితమే ’కాంచనమాల గాజులు’, కన్నాంబ లోలాకులు‘ అంటూ అమ్మేవారు. నటిగా, నిర్మాతగా కన్నాంబ ఎన్నో ఆస్తులు సంపాదించారు. అయితే ఆమె మరణం తర్వాత ఆమె స్థాపించిన కంపెనీ, ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. అవి ఎలా పోయాయో ఎవ్వరికీ అర్థం కాలేదు. కన్నాంబ మరణం తర్వాత ఆమె భర్త నాగభూషణం చివరిరోజుల్లో ఒక చిన్న గదిలో కాలక్షేపం చేసేవారట.  అన్నింటినీ మించి కన్నాంబకు సంబంధించిన ఒక విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. వారి కులాచారం ప్రకారం భార్య చనిపోతే మృతదేహానికి నగలు ధరింపజేసి యధాతథంగా పూడ్చి పెట్టాలి. ఆ ప్రకారమే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇది జరిగిన రెండు రోజులకే పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి ఆ నగలన్నీ కాజేశారు దొంగలు. అంతేకాదు, ఆమె మృతదేహాన్ని కూడా మాయం చేశారు. ఆ తర్వాత పోలీసులు దీని గురించి విచారణ చేపట్టారు. కానీ, కన్నాంబ మృతదేహం ఏమైపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 

ఎగతాళి చేసిన ఫ్రెండ్‌తో ఛాలెంజ్‌ చేసి హీరో అయ్యాడు.. 400 సినిమాల్లో నటించాడు!

సినిమాలు చేయాలని, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అవకాశాల కోసం పడరాని పాట్లు పడతారు. ఏదో ఒకరోజు వారిని అదృష్టం వరిస్తుంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా రాణిస్తారు. ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలు చేస్తారు. నటుడిగా లేదా నటిగా టాప్‌ పొజిషన్‌కి వచ్చిన తర్వాత ‘నేను యాక్టర్‌ కావాలని అనుకోలేదు.. యాక్సిడెంటల్‌గా జరిగింది’ అని చెప్పడం మనం చూస్తుంటాం. అయితే ఆ మాటల్లో నిజమెంత ఉంది అనే విషయంలో మనకు సందేహం కలుగుతుంది. కానీ, కొందరి విషయంలో అది నిజమేననిపిస్తుంది. అలాంటి వారిలో నటుడు చరణ్‌రాజ్‌ ఒకరు.  కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చరణ్‌రాజ్‌ అసలు పేరు బ్రహ్మానంద. స్కూల్‌ డేస్‌ నుంచి కల్చరల్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. పాటలు పాడేవాడు, డాన్సులు చేసేవాడు. కానీ, అతనికి సినిమాల్లో నటించాలన్న కోరిక అసలు ఉండేది కాదట. ఒకసారి కాలేజీలో జరిగిన కల్చరల్‌ కాంపిటీషన్‌లో నాలుగు బహమతులు గెలుచుకున్నాడు చరణ్‌ రాజ్‌. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉండగా, అతని స్నేహితుల్లో ఒకరు ‘నువ్వు అందంగానే ఉన్నావు, డాన్సులు కూడా బాగా చేస్తున్నావు. సినిమాల్లో హీరోగా ట్రై చెయ్యొచ్చు కదా’ అన్నాడు. దానికి చరణ్‌ ‘మనకి సినిమాలెందుకు రా. మా కుటుంబం పరిస్థితి తెలుసు కదా’ అన్నాడు. ఆ మాటలు విన్న గురురాజ్‌భట్‌ అనే స్నేహితుడు చరణ్‌రాజ్‌ని ఉద్దేశించి ‘ఒరేయ్‌.. నువ్వు హీరో అవుతావా? మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా?’ అంటూ ఎగతాళి చేశాడు. ఎందుకంటే గురురాజ్‌ అనే కుర్రాడు చాలా అందంగా ఉంటాడు. ఆ ఉద్దేశంతో చరణ్‌రాజ్‌ని అలా అన్నాడు. ఆ మాటలు విన్న చరణ్‌కి విపరీతమైన కోపం వచ్చింది. ‘ఒరేయ్‌.. తప్పుగా మాట్లాడొద్దు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. నేను హీరోని కాలేను అనుకున్నావా?’ అన్నాడు. ‘అది నీవల్ల కాదు..’ అని కొట్టిపారేశాడు గురురాజ్‌. దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్న చరణ్‌ ‘నువ్వు చూస్తూ ఉండు. తప్పకుండా హీరో అవుతాను.. ఇట్సే ఛాలెంజ్‌’ అంటూ శపథం చేశాడు.  ఆలోచన రావడమే ఆలస్యం.. ఇంట్లో కూడా చెప్పకుండా తండ్రి వ్యాపారం కోసం పెట్టుకున్న కొంత డబ్బు తీసకొని బెంగళూరు ట్రైన్‌ ఎక్కేశాడు. పగలంతా సినిమా అవకాశాల కోసం తిరగడం.. రాత్రయ్యేసరికి హోటల్స్‌లో పాటలు పాడడం.. ఇదీ అతని దినచర్య. అలా ఎనిమిది సంవత్సరాలపాటు విసుగు లేకుండా ప్రయత్నించి ‘పరాజిత’ అనే కన్నడ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయాడు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయి 100 రోజులు ఆడింది. ఆ సినిమా తర్వాత పది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ హీరోగా మంచి పొజిషన్‌కి వచ్చాడు. చరణ్‌రాజ్‌ హీరోగా నటించిన ఏడు సినిమాలు వరసగా హిట్‌ అయ్యాయి. అప్పుడు చరణ్‌రాజ్‌ బెల్గాంకు చెందినవాడని అందరికీ తెలిసిపోయింది. అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆ టైమ్‌లో చరణ్‌రాజ్‌కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని కోసం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో వస్తున్న చరణ్‌రాజ్‌ని చూసి అతని స్నేహితుడు గురురాజ్‌భట్‌ హార్ట్‌ఫుల్‌గా కంగ్రాట్యులేట్‌ చేశాడు. అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెబుతాడు చరణ్‌రాజ్‌. ‘నువ్వు గొప్పవాడివా.. నీ ఫ్రెండ్‌ గురురాజ్‌భట్‌ గొప్పవాడా?’ అని ఎవరైనా అడిగితే.. తను అంత పెద్ద నటుడు అవ్వడానికి, అంత పేరు తెచ్చుకోవడానికి కారణం అతనే కాబట్టి తనకంటే గురురాజ్‌ గొప్పవాడని చెప్తాడు చరణ్‌రాజ్‌. అలా ఒక ఫ్రెండ్‌తో ఛాలెంజ్‌ చేసి హీరో అయి, ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 400 సినిమాల్లో నటించాడు చరణ్‌రాజ్‌. 

తథాస్తు దేవతలు ఆయన మాట విన్నారు.. ఒక మంచి నటుడికి అన్యాయం చేశారు!

ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న వారే సినిమాల్లో బాగా రాణిస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వారిలో నూతన్‌ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవ్వరినీ అనుకరించకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న నూతన్‌ప్రసాద్‌ జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విశేషాలతో కూడుకున్నది. పైన ‘తథాస్తు దేవతలు ఉంటారు.. మన నోటి నుంచి వచ్చే మాటలు కొన్నిసార్లు నిజం అవుతాయి’ అని పెద్దలు అంటుంటారు. అది నూతన్‌ ప్రసాద్‌ విషయంలో అక్షరాల నిజమైంది.  నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు తాడినాడ సత్యదుర్గా వరప్రసాద్‌. 1945 డిసెంబర్‌ 12న కైకలూరులో జన్మించారు. ఆయన తండ్రి సుబ్బారావు కైకలూరు సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారు. ఆర్థికంగా అంత ఉన్నతమైన కుటుంబం కాకపోవడంతో ప్రసాద్‌ తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని నడిపించేది. 1965లో వరప్రసాద్‌  ఐటిఐ పూర్తి చేసి ఇరిగేషన్‌ డిపార్డ్‌మెంట్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి హెచ్‌ఎఎల్‌ సంస్థలో చేరారు. అక్కడే రంగస్థల నటుడు, దర్శకుడు భాను ప్రకాష్‌ పరిచయమయ్యారు. ఆయన ద్వారానే నాటకరంగంలో ప్రవేశించారు. సాధారణంగా చిన్నతనం నుంచి సినిమాల్లోకి వెళ్ళాలనే కుతూహలం తమకు ఉందని నటీనటులు చెబుతుంటారు. కానీ, వరప్రసాద్‌ మాత్రం 20 సంవత్సరాలు దాటిన తర్వాతే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకాల్లో వరప్రసాద్‌ నటన చూసి అతని తల్లి ఎంతో పొంగిపోయేది. నటుడుగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని అతన్ని ప్రోత్సహించేది. దాదాపు పదేళ్లు రంగస్థలాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు వరప్రసాద్‌. అతని నాటకం చూసిన పినిశెట్టి శ్రీరామ్మూర్తి.. అతని ఫోటోలు తీసుకొని ‘నీడలేని ఆడది’ చిత్రంలో అవకాశం ఇప్పించారు. అయితే మొదట విడుదలైన సినిమా మాత్రం ‘అందాల రాముడు’. వరప్రసాద్‌ నటించిన మూడో సినిమా ‘ముత్యాలముగ్గు’. ఈ సినిమాలో అతను చేసిన నిత్య పెళ్లికొడుకు పాత్ర అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఆరోజుల్లో ప్రసాద్‌ చాలా సన్నగా ఉండేవాడు. బీరు తాగితే బుగ్గలు వస్తాయని మిత్రులు సలహా ఇవ్వడంతో  తాగడం అలవాటైంది. తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదన్న బాధతో కాస్త ఎక్కువ తాగడం మొదలెట్టాడు. మందు తాగకపోతే చేతులు వణికే స్థితి వరకూ వెళ్లిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా అతను ఇహలోకంలోకి వచ్చాడు వరప్రసాద్‌. తన ఆరోగ్యం ఎలా ఉందో టెస్టు చేయించుకోవాలనుకున్నాడు. ఆరోగ్యం బాగుందని డాక్టరు చెబితే మందు మానేద్దాం.. ఏదైనా జబ్బు ఉంది అంటే ఇంకా తాగి చచ్చిపోదాం అని డిసైడ్‌ అయ్యాడు. అన్ని టెస్టులు చేసిన డాక్టరు అతనికి ఏ జబ్బూ లేదని చెప్పాడు. అంతే. వరప్రసాద్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి మందు మానేశాడు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి తన పేరును నూతన్‌ప్రసాద్‌గా మార్చుకున్నాడు.  ‘చలిచీమలు’ చిత్రంలో నూటొక్క జిల్లాల అందగాడుగా, ‘రాజాధిరాజు’ చిత్రంలో సైతానుగా, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలో ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు’ అంటూ డైలాగులు చెప్పే పోలీస్‌ పాత్రలో జీవించాడు నూతన్‌ప్రసాద్‌. చలిచీమలు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రాల్లోని డైలాగులు అప్పట్లో గ్రామఫోన్‌ రికార్డులలో వచ్చి ఎంతో పాపులర్‌ అయ్యాయి. డైలాగ్‌ మాడ్యులేషన్‌, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌, నటనలో కొత్తదనం ఆయన్ని నటుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.  1989 ఫిబ్రవరి 1 నూతన్‌ప్రసాద్‌కి దుర్దినం. తథాస్తు దేవతలు ఉంటారు అని అతనికి తెలిసొచ్చిన రోజు అది. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘బామ్మమాట బంగారు బాట’ చిత్రంలో భానుమతికి భర్తగా నటించాడు నూతన్‌ప్రసాద్‌. ఒకరోజు ‘అబ్బా చచ్చానురా.. నా వెన్నుపూస విరిగింది’ అనే డైలాగుతో షూటింగ్‌ మొదలైంది. ఆ డైలాగు చెప్పిన వేళా విశేషం ఏమిటోగానీ, నిజంగా ఆరోజు అలాగే జరిగింది. గాలిలో ఉన్న కారులో రాజేంద్రప్రసాద్‌, నూతన్‌ ప్రసాద్‌ ఉన్నారు. ప్రమాదవశాత్తూ కొన్ని అడుగుల ఎత్తు నుంచి కారు కింద పడిపోయింది. నూతన్‌ప్రసాద్‌ వెన్నుపూస విరిగిపోయి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన ఆ ప్రమాదంతో వీల్‌చైర్‌కే పరిమితమైపోయారు. అయినా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ‘కర్తవ్యం’ చిత్రం నుంచి కూర్చొని నటించడం మొదలుపెట్టారు. ఈ ప్రమాదానికి ముందు 365 సినిమాల్లో నటించిన నూతన్‌ప్రసాద్‌ యాక్సిడెంట్‌ తర్వాత 110 సినిమాల్లో నటించారంటే నటనను ఆయన ఎంత దైవంగా భావించారో, ఎంతగా ఆరాధించారో అర్థం చేసుకోవచ్చు.  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూతన్‌ప్రసాద్‌ను రవీంద్రభారతికి సెక్రటరీగా నియమించారు. 1964లో నూతన్‌ప్రసాద్‌ నటనకు శ్రీకారం చుట్టింది రవీంద్రభారతిలోనే. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2011 మార్చి 30న నూతన్‌ప్రసాద్‌ తుదిశ్వాస విడిచారు.

ఆ విషయంలో రజినీని ఎవ్వరూ బీట్‌ చెయ్యలేరు.. అది సూపర్‌స్టార్‌కే సాధ్యం!

హీరోగారు వస్తున్నారంటే ఒక బిల్డప్‌.. చుట్టూ కొంతమంది అనుచరులు,  ఆయన రావడానికి లైన్‌ క్లియర్‌ చేసేందుకు కొందరు వ్యక్తులు.. ఇలా కొన్ని సందర్భాల్లో హీరోలకు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈమధ్యకాలంలో హీరోలు కూడా అలాంటి సంప్రదాయానికి స్వస్తి పలికి సాధారణంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పద్ధతిలో ఇప్పటి హీరోలు కూడా వెళుతున్నారు. ఎంత ఒదిగి ఉన్నా.. ఒక స్టార్‌ హీరోకి మాత్రం ఆ విషయంలో ఎవ్వరూ పోటీకి రాలేరు. ఆయనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. సినిమాలను పక్కన పెడితే.. బయట ఎంతో సాదా సీదా జీవితాన్ని గడుపుతారని, ఎంతో సింపుల్‌గా కనిపిస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఆ సింప్లిసిటీ ఎలా ఉంటుంది?  ఆ విషయంలో రజినీకాంత్‌ని ఎవరూ ఎందుకు బీట్‌ చెయ్యలేరు అనే విషయాలు తెలుసుకుందాం. సూపర్‌స్టార్‌ రజిని, మమ్ముట్టి కలిసి నటించిన చిత్రం ‘దళపతి’. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటన.. రజినీ సింప్లిసిటీని తెలియజేస్తుంది. ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమైన అరవింద్‌ స్వామి షూటింగ్‌ విరామంలో తెలీక రజినీకాంత్‌ రూమ్‌కి వెళ్లారు. అప్పటికే ఎసి ఆన్‌ చేసి ఉంది. అక్కడ బెడ్‌పై పడుకున్నాడు అరవింద్‌. అతనికి తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి అదే గదిలో రజినీ నేలమీద పడుకొని కనిపించారు. కంగారు పడ్డ అరవింద్‌ ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులకు చెప్పాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత రజినీ.. రూమ్‌కి వచ్చారని, ఆ సమయంలో మంచి నిద్రలో ఉన్న అరవింద్‌ని లేపవద్దని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి తను నేలపై పడుకున్నారని తెలుసుకున్నాడు. ఈ విషయంలో అరవింద్‌ సారీ చెప్పేందుకు ప్రయత్నించగా, రజినీ అతన్ని వారించి ఓ చిరునవ్వు నవ్వారట.  రజినీ తొలిరోజుల్లో బెంగళూరులో సిటీ బస్‌ కండక్టర్‌గా పనిచేసేవారన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఎంతో సాదా సీదాగా బెంగళూరు వెళ్లిపోవడం రజినీకి అలవాటు. అలా ఓసారి అక్కడ ఓ గుడి దగ్గర కూర్చొని ఉండగా, అతని డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూసి బిచ్చగాడు అనుకున్న ఓ మహిళ చేతిలో పది రూపాయలు పెట్టి చకచకా వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత కారు ఎక్కుతూ కనిపించిన రజినీని గుర్తు పట్టిన ఆ మహిళ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. ‘స్టార్‌డమ్‌, మేకప్‌ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తుచేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను’ అంటారు రజనీ. అలాగే ‘ఏ తల్లయినా తన బిడ్డకు మంచి బట్టలు వేసి, అందంగా తయారు చేసిన తర్వాత చూసి మురిసి పోతుంది. అలా ప్రేక్షకులు నా తల్లివంటి వారు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఉండేందుకు సినిమాల్లో ఆర్భాటంగా, రకరకాల గెటప్స్‌లో కనిపిస్తాను తప్ప, బయట నేను నాలా ఉంటాను’ అంటారు రజినీ. సాధారణంగా ఆయన ధోతీ, కుర్తా, ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పుల్లోనే కనిపిస్తారు. మేకప్‌, నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి ఆయన ఇష్టపడరు.  సాధారణంగా హీరోల పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా, ఎంత సందడిగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు రావడం, పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం. ఇది పాత తరం హీరోల్లో బాగా ఎక్కువ. ఒకప్పుడు రజనీకాంత్‌ కూడా చెన్నయ్‌లో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన రజినీ ఆలోచనా ధోరణిని మార్చేసింది. ఎప్పటిలాగే రజినీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో చెన్నయ్‌ చేరుకున్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఆ ఘటన రజినీని ఎంతో బాధించింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు తన పుట్టినరోజును జరుపుకోలేదు రజినీ.  రజినీకాంత్‌ కుమార్తెలు కూడా సినిమా రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె ఐశ్వర్య ‘త్రీ’ చిత్రాన్ని చేసినపుడు, చిన్న కుమార్తె ‘కొచ్చడయాన్‌’ తీసినపుడు ఆ సినిమాల కోసం రజినీ ఎలాంటి ప్రచారం చెయ్యలేదు. సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సినిమా చేస్తే హీరోలు ఆ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రచారం కూడా అదే స్థాయిలో చేస్తారు. ‘వారికి సినిమా తీయడం తెలుసు. అలాగే దాన్ని మార్కెట్‌ ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఇందులో నా ప్రమేయం అవసరం లేదనేది నా అభిప్రాయం’ అంటారు రజినీ.  ఒక సినిమా హీరో జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ సిలబస్‌లో ఆరో తరగతి పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఒక సినిమా నటుడి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా అందించడం అనేది ఒక్క రజినీకాంత్‌ విషయంలోనే జరిగింది. అలా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కిన ఏకైక భారతీయ నటుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. 

ఆ మూడు విషయాలే.. ఆ అగ్రహీరో పతనానికి కారణమయ్యాయి!

సినిమాల్లో హీరో అంటే ఎలా ఉండాలి? ఆరడుగుల ఎత్తు ఉండాలి, ఆకర్షణీయమైన రూపం ఉండాలి. తన నటనతో అందర్నీ ఆకట్టుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే హీరోగా రాణిస్తారు, అందరి అభిమానాన్ని పొందుతారు. ఎత్తు విషయంలో హీరోలకు కొంత మినహాయింపు ఉంది అని కొందరు హీరోలు నిరూపించారు. పాతతరం హీరోల్లో పైన చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్న హీరో హరనాథ్‌. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన హరనాథ్‌ జీవితంలో ఎన్నో ఆసక్తిరమైన విశేషాలు, మరెన్నో విషాదపూరిత అంశాలు ఉన్నాయి. కాకినాడలో కాలేజీలో చదువుతున్న రోజులవి. అప్పటికే కాలేజీలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు హరనాథ్‌. ఎప్పుడూ 10, 15 మందితో గ్యాంగ్‌ మెయిటెయిన్‌ చేసేవాడు. గొడవలకు వెళ్ళడం, తనని ఎదిరించిన వారిని కొట్టడం వంటివి చేస్తూ ఉండేవాడు. మంచి అందగాడు, హీరో లక్షణాలు ఉన్నవాడు కావడంతో అతనంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడేవారు. కాలేజ్‌ డేస్‌లోనే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడు ఎన్నో నాటకాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. అప్పటికే స్టార్స్‌గా ఉన్న ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లను చూసి తను ఎందుకు హీరో కాకూడదు అనుకున్నాడు. ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ‘మా యింటి మహాలక్ష్మీ’ చిత్రంలో తొలి అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ ‘సీతారామకళ్యాణం’ చిత్రాన్ని ఎన్‌.ఎ.టి. బేనర్‌లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కె.వి.రెడ్డి దర్శకుడు. తను రావణ పాత్ర పోషిస్తానని చెప్పారు ఎన్టీఆర్‌. డైరెక్టర్‌ కె.వి.రెడ్డితోపాటు ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు కూడా షాక్‌ అయ్యారు. ‘మాయాబజార్‌’లో నువ్వు కృష్ణుడుగా ఎంత అందంగా ఉన్నావు? ఈ సినిమాలో రావణాసురుడు క్యారెక్టర్‌ చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రాముడిగా అయితేనే బాగుంటావు’ అని కె.వి.రెడ్డి చెప్పారు. కానీ, ఎన్టీఆర్‌ వినలేదు. దీంతో కె.వి.రెడ్డి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆరే స్వయంగా ఆ సినిమాను డైరెక్ట్‌ చేశారు. కానీ, డైరెక్టర్‌గా తన పేరు వేసుకోలేదు. రాముడిగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా, అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హరనాథ్‌ గురించి తెలిసింది. అతనితో రాముడి క్యారెక్టర్‌ చేయించాలని డిసైడ్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ఇది తెలిసి చాలామంది సన్నిహితులు వారించారు. ‘అతనితో మీరు పడలేరు. కాలేజ్‌ డేస్‌లోనే అతను పెద్ద రౌడీ. సిగరెట్‌, మందు, అమ్మాయిలు.. ఇన్ని అలవాట్లు అతనికి ఉన్నాయి’ అని చెప్పారు. ఎన్టీఆర్‌.. హరనాథ్‌ని పిలిపించారు. రాముడు క్యారెక్టర్‌ గురించి చెప్పి, షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ అన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని కండిషన్‌ పెట్టారు. ఆరోజుల్లో హరనాథ్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎంతో మంది అమ్మాయిలు షూటింగ్‌ స్పాట్స్‌కి వస్తుండేవారు. దీన్ని కంట్రోల్‌ చెయ్యడానికి హరనాథ్‌కి ఫైట్‌మాస్టర్స్‌ రాజు, సాంబశివరావులను సెక్యూరిటీగా పెట్టారు ఎన్టీఆర్‌. ఎన్ని కండిషన్స్‌ పెట్టినా, ఎన్టీఆర్‌కి తెలియకుండా హరనాథ్‌ మధ్య మధ్య సిగరెట్స్‌ కాలుస్తూనే వుండేవాడు. మొత్తానికి ‘సీతారామ కళ్యాణం’ చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీరాముడిగా హరనాథ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్‌ ఎంతో సంతోషించారు. హరనాథ్‌ను సొంత తమ్ముడిలా భావించి ఎన్నో సినిమాలు అతనికి ఇప్పించారు.  ఈ సినిమా తర్వాత హరనాథ్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. అప్పట్లో కొన్ని వివాదాల వల్ల జమునతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ నటించ కూడదని నిర్ణయించుకున్నారు. అది హరనాథ్‌కి బాగా కలిసొచ్చింది. హరనాథ్‌, జమున జంటకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఇద్దరూ దాదాపు 30 సినిమాల్లో కలిసి నటించారు. హరనాథ్‌ అంటే జమున ఎంతో అభిమానం చూపించేది. కొన్ని సందర్భాల్లో హరనాథ్‌కి సినిమా ఇస్తే తను ఆ సినిమాలో ఫ్రీగా నటిస్తానని చెప్పేది జమున. అలా ఎన్నో సినిమాలు చేసింది. అతనికి ఉన్న దురలవాట్లను మాన్పించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ, హరనాథ్‌ వినలేదు.  పాతతరం నటీనటుల్లో ఎస్‌.వి.రంగారావు, హరనాథ్‌, సావిత్రి.. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలయ్యారు. లొకేషన్స్‌కి కూడా మద్యం తాగే వచ్చేవారు. ఇక హరనాథ్‌ ప్రతిరోజూ రాత్రి అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్‌ చేసేవాడు. అతన్ని అందగాడు, ఆజానుబాహుడు అంటూ ఆకాశానికి ఎత్తేసిన అమ్మాయిల వల్లే తన కెరీన్‌ను, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతను తన పద్ధతులు మార్చుకోకపోవడం వల్ల అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ అతన్ని మందలించారు, మంచి మార్గంలో నడుచుకోమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్‌ చెప్పిన మాటల్ని విని కొంతకాలం తన కార్యక్రమాలను కొంతవరకు తగ్గించాడు. తర్వాత కొన్నాళ్ళకు మళ్లీ యధావిధిగా మందులో మునిగి తేలేవాడు.  ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత మూడో స్థానం హరనాథ్‌దేనని అందరూ ఫిక్స్‌ అయిపోయిన తరుణంలో ఇలా వ్యసనాలకు బానిసగా మారడంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనే వచ్చిన కృష్ణ, శోభన్‌బాబులను ఎంకరేజ్‌ చేశారు. మంచి క్రమశిక్షణతో నడుచుకుంటూ హీరోలుగా ఇద్దరూ ఉన్నత స్థాయికి ఎదిగారు. హీరోగా నటిస్తూ సంపాదించిన డబ్బును తన జల్సాలకు ఖర్చు చేయడంతో అంతా హరించుకుపోయింది. చివరి రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపేందుకు కూడా ఇబ్బందులు పడ్డాడు హరనాథ్‌. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అతని జీవితం చివరికి విషాదాంతం అయ్యింది.  

రెండు పెళ్లిళ్ళు, ఒక సహజీవనం.. ఆ హీరో చివరి రోజులు ఎంతో దుర్భరం!

సినిమా రంగంలో ఆర్టిస్ట్‌గా రాణించి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నవారిలో కొందరు ఎంతో త్వరగా లైమ్‌లైట్‌లోకి వస్తారు.  మంచి పేరు, డబ్బు సంపాదించుకుంటారు. వాటిని కాపాడుకునేందుకు కొన్ని త్యాగాలు చేస్తారు. వ్యసనాలను దగ్గరికి రానివ్వరు. నిగ్రహంతో తమ జీవితాన్ని లీడ్‌ చేస్తారు. అయితే అంత నిబద్ధతతో ఉండేవారు ఇండస్ట్రీలో తక్కువనే చెప్పాలి. తమని తాము ఎంత కంట్రోల్‌ చేసుకున్నా ఏదో ఒక సమయంలో అదుపు తప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారి జీవితం ఎన్నో మలుపులు తిరిగి విషాదాంతంగా ముగుస్తుంది. నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ‘ఆంధ్రా దిలీప్‌’ అని పృథ్విరాజ్‌ కపూర్‌ వంటి దిగ్గజ నటుడు, దర్శకుడితో పిలిపించుకున్న గొప్ప నటుడు చలం. సహజ నటుడుగా చలంకు చాలా మంచి పేరు వుంది.  1952లో ‘దాసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన చలం హీరోగా, సెకండ్‌ హీరోగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు సినిమాల్లో నటించేవారంతా నాటకరంగం నుంచి వచ్చినవారే. తాము నటిస్తున్నది సినిమాల్లోనే అయినా అప్పుడప్పుడు రంగస్థల ప్రభావం వారి బాడీ లాంగ్వేజ్‌లో, డైలాగులు చెప్పడంలో, హావభావాల్లో కనిపించేది. దానివల్ల వారి నటనలో సహజత్వం అనేది లోపించేది. కానీ, చలం విషయంలో మాత్రమే అలాంటి పోకడలు కనిపించేవి కావు. ఎందుకంటే అతని నటన ఎంతో సహజంగా ఉండేది. దానితోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పాతతరం నటులైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి మహానటులతో కలిసి నటించిన చలం ఆ విషయంలో వారితో పోటీపడేవాడు.  చలం అసలు పేరు సింహాచలం. ఆయన రమణకుమారిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత తన పేరును రమణాచలంగా మార్చుకున్నాడు. 1961లో విడుదలైన ‘తండ్రులు కొడుకులు’ చిత్రంలో చలం, శారద కలిసి నటించారు. చలం అప్పటికే మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. శారద అప్పుడప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడిరది. ఇద్దరూ ఎంతో సరదాగా ఉండేవారు. అలా జరుగుతున్న క్రమంలోనే 1964లో చలం భార్య రమణకుమారి ఆత్మహత్య చేసుకుంది. అప్పటివరకు చలంపై అందరికీ మంచి అభిప్రాయం ఉండేది. సినిమాల్లో అతను పోషించిన పాత్రలన్నీ ఎంతో అమాయకంగా, మంచికి మారు పేరులా ఉండేవి. అతని భార్య మరణమే అతనికి సంబంధించి జనం విన్న తొలి చెడు వార్త.  అయితే అతని భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ తెలీదు. కాకతాళీయమే అయినా చలంకి శారద పరిచయమైన మూడు సంవత్సరాలకు అతని భార్య చనిపోయింది. శారద విషయంలోనే చలం, అతని భార్య మధ్య మనస్పర్థలు వచ్చి ఉంటాయని అప్పట్లో చెప్పుకున్నారు.  భార్య చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న చలం.. శారదకు దగ్గరయ్యాడు. తన మాటలతో ఆమె సానుభూతిని పొందాలని చూశాడు. తన బాధల్ని ఆమెతో చెప్పుకునేవాడు. అలా ఇద్దరూ దగ్గరయ్యారు. 1972లో వీరు వివాహం చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు. అప్పటివరకు నటుడుగా మంచి ఫామ్‌లో ఉన్న చలంకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. శారద నటిగా బాగా బిజీ అయిపోయింది. ఇంటిని, చలంని పట్టించుకునే పరిస్థితి కూడా లేనంత బిజీ. ఆమెకు బాగా అవకాశాలు రావడం, తన ఇంటికి వచ్చేవారు కూడా ఆమె కోసమే వస్తుండడంతో చలం అసూయతో రగిలిపోయాడు. ఏదో ఒక కారణంతో చీటికి మాటికీ గొడవ పడేవాడు. శారీరకంగా, మానసికంగా శారదను హింసించేవాడు. ఆ క్రమంలోనే మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఆ సమయంలోనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి కొన్ని సినిమాలు నిర్మించాడు. ఆ సినిమాల వల్ల చాలా నష్టపోయాడు. సినిమాలు నిర్మించేందుకు, తన సొంత ఖర్చులకు అంతా శారద డబ్బునే వినియోగించాడు. సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టడంతో మరింత డిప్రెషన్‌కి వెళ్లిపోయాడు. చలంతో కలిసి ఎక్కువ సంవత్సరాలు ఉండలేకపోయింది శారద. ఒకరోజు అతనికి చెప్పకుండా తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లాయర్‌ ద్వారా నోటీసులు పంపించింది. కొన్నాళ్ళు కేసు కోర్టులో నడిచింది. 1984లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.  ఇక అప్పటి నుంచి చలం జీవితం మరింత దుర్భరంగా మారింది. సినిమాల కోసం చేసిన అప్పులు మరింత పెరిగిపోవడంతో కోట్లల్లో ఉన్న తన ఆస్తిని లక్షలకు అమ్మి అప్పులు తీర్చాడు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక డాన్సర్‌ పరిచయమైంది. ఆమెతో సహజీవనం చేశాడు. చివరి రోజుల్లో పర్వర్టెడ్‌గా మారిన చలం ఆమెతో కూడా గొడవలు పడేవాడు. తను చనిపోతానని ముందే తెలిసిందో ఏమో.. తనతో సహజీవనం చేస్తున్న ఆమె జీవితంలోకి మరో మగాడు రాకూడదు అనుకున్నాడు. ఒకరోజు ఆమె నిద్రిస్తుండగా రుబ్బురోలు వంటి రాయిని ఆమె నడుం మీద వేశాడు. దాంతో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతింది. నడవలేని పరిస్థితికి వచ్చేసింది. ఇది జరిగిన నెలరోజుల్లోనే 1989లో చలం మరణించాడు. 

పెళ్లికి అంతా సిద్ధం.. నెక్స్‌ట్‌ మినిట్‌లోనే ఆ పెళ్లి క్యాన్సిల్‌.. ఎందుకలా?

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. యువతీ యువకుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేది పెళ్లి. ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే ఎంతో ఆర్భాటంగా, మరెంతో ఆడంబరంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి విషయంలో పెద్దలదే నిర్ణయం ఉండేది. పెద్దల అంగీకారంతో, పెద్దల సమక్షంలోనే పెళ్లిళ్లు జరిగేవి. కాలం మారుతూ వస్తోంది. పెళ్లి విషయంలో యువతీ యువకుల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. తన జీవిత భాగస్వామని ఎంపిక చేసుకొని, కొన్నాళ్ళు ప్రేమలో విహరించి, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు పెద్దలు ఒప్పుకోకపోతే ధైర్యంగా బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకోలేని కొన్ని జంటలు విడిపోతున్నాయి. మరికొందరు పెళ్లి వరకు వచ్చి, నిశ్చితార్థం కూడా చేసుకొని తర్వాత వాటిని రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు సామాన్యుల్లోనే కాదు, సెలబ్రిటీలలో కూడా ఈమధ్య ఎక్కువయ్యాయి. సినిమా సెలబ్రిటీస్‌కి పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం, ఆ తర్వాత విడాకుల పేరుతో విడిపోవడం సర్వసాధారణమైన విషయం. కానీ, పెళ్లి వరకూ వచ్చి క్యాన్సిల్‌ చేసుకోవడం కూడా ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అలా పెళ్లి వరకూ వచ్చి తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న తన కెరీర్‌ ప్రారంభంలోనే సహనటుడు రక్షిత్‌శెట్టిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ, తమ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడిపోయారు. తెలుగు, తమిళ, హిందీలో భాషల్లో పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న మెహరీన్‌ వివాహం భవ్యబిష్ణోయ్‌తో జరగాల్సి ఉంది. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి కూడా క్యాన్సిల్‌ అయింది. హీరోయిన్‌ త్రిష, బిజినెస్‌ మేన్‌ వరుణ్‌ ప్రేమించుకున్నారు. ప్రేమ విహారాలు చేసారు. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని ఇద్దరూ అనుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ అయింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించాలా, వద్దా అనే విషయంలో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో వీరు కూడా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత త్రిష సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. వరుణ్‌ మాత్రం హీరోయిన్‌ బిందు మాధవితో డేటింగ్‌ చేస్తున్నాడు. ఇక హీరో గోపీచంద్‌ వివాహం హైదరాబాద్‌కి చెందిన హరితతో ఫిక్స్‌ అయింది. 2012లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఆ పెళ్ళికి ఆగిపోయింది. ఎందుకో తెలీదుగానీ హరిత సూసైడ్‌ ఎటెమ్ట్‌ చేసిందనే వార్త అప్పట్లో గుప్పుమంది. ఇది జరిగిన ఏడాదికి రేష్మా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు గోపీచంద్‌. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని వివాహం శ్రీయా భూపాల్‌తో జరగాల్సింది. ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ను పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే కొన్ని విషయాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. హీరో ఉదయ్‌ కిరణ్‌.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. 2003లో ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. సుష్మిత.. విష్ణుప్రసాద్‌ను పెళ్లి చేసుకోగా, ఉదయ్‌కిరణ్‌.. బిషితను వివాహం చేసుకున్నాడు.  ఇక ప్రేమలో మునిగి తేలుతూ పెళ్ళికి దగ్గరగా వెళ్లి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న జంటలేవో చూద్దాం. ‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలో తరుణ్‌, ఆర్తీ అగర్వాల్‌ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ళపాటు ఎడతెరిపి లేకుండా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రభుదేవా, నయనతారల ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికీ అందరికీ విచిత్రంగానే అనిపిస్తాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాని కోసం మతం మార్చుకోవడానికి కూడా నయనతార సిద్ధపడిరది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ఎవరూ ఊహించని విధంగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నారు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. నయనతార.. దర్శకుడు విఘ్నేష్‌ను వివాహం చేసుకోగా, ప్రభుదేవా ముంబాయికి చెందిన హిమానిని పెళ్లి చేసుకున్నాడు.  బాలీవుడ్‌ నుంచి సౌత్‌కి వచ్చిన హన్సిక కూడా ప్రేమలో పడిరది. తమిళ్‌ హీరో శింబుని ప్రేమించింది. ఇద్దరూ కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారు. అతన్ని పెళ్ళి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పాలని డిసైడ్‌ అయింది హన్సిక. కానీ, ఒక్కసారిగా ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడిరది. ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలు పెట్టారు. అలా వీరిద్దరూ విడిపోయారు. ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి, అక్షయ్‌కుమార్‌ ప్రేమించుకున్నారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు కూడా. కానీ, సీన్‌ రివర్స్‌ అయింది. డిరపుల్‌ కపాడియా కూతురు ట్వింకిల్‌ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్‌. వ్యాపార వేత్త రాజ్‌ కుంద్రాను వివాహం చేసుకుంది శిల్పాశెట్టి. 

తెలుగులో బ్లాక్‌బస్టర్‌.. మరో నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తే.. అక్కడా బంపర్‌హిట్‌!

కొన్ని బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ వెనుక ఎన్నో కథలు ఉంటాయి, మరెన్నో విశేషాలు ఉంటాయి. అలాంటి ఒక సినిమా సెట్‌ కావడం వెనుక, స్టార్ట్‌ అవ్వడం వెనుక ఎదురైన అవాంతరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ కలిసొస్తేనే ఒక బ్లాక్‌బస్టర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2006లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సూపర్‌స్టార్‌ మహేష్‌, పూరి జగన్నాథ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా క్రేజ్‌ పరంగా, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్‌ అంశాలు ఉన్నాయి. అవేమిటో, ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అవ్వడానికి ఎంత కాలం పట్టిందో తెలుసుకుందాం.  ‘బద్రి’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన పూరి జగన్నాథ్‌ ఆ తర్వాత నాలుగైదు సూపర్‌హిట్‌ సినిమాలు చేసి డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసే డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వరస విజయాలతో దూసుకెళ్తున్న పూరికి ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్‌ అవ్వడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బద్రి టైమ్‌లోనే రాసుకున్న ఓ స్క్రిప్ట్‌ని బయటికి తీశాడు. దానికి ‘ఉత్తమ్‌సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ’ అనే టైటిల్‌ పెట్టుకున్నాడు. ఆ కథ విన్న రవితేజ చాలా ఎక్సైట్‌ అయ్యాడు. చేసేద్దాం అన్నాడు ఉత్సాహంగా. ఈ సినిమా చేసేందుకు నిర్మాత నాగబాబు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే అదే టైమ్‌లో రవితేజకు ‘ఆటోగ్రాఫ్‌’ చేసే మంచి ఛాన్స్‌ వచ్చింది. ఈ విషయం పూరికి చెప్పి ఆ ప్రాజెక్ట్‌కి షిప్ట్‌ అయిపోయాడు. ఈ గ్యాప్‌లో పూరి తన తమ్ముడు సాయిరామ్‌శంకర్‌తో ‘143’ చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా రిలీజ్‌ అయింది. కానీ, రవితేజ మాత్రం ఖాళీగా లేడు. ఒక దశలో బాలీవుడ్‌ యాక్టర్‌ సోనుసూద్‌తో ఉత్తమ్‌సింగ్‌ సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ, కుదరలేదు. 2004లో ఒకసారి తాజ్‌ హోటల్‌లో పూరి, మహేష్‌ కలిశారు. అంతకు మూడేళ్ళ క్రితం మహేష్‌కి ‘ఇడియట్‌’ కథ చెప్పాడు పూరి. అది మహేష్‌కి నచ్చలేదు. అతనితో ఇది రెండో మీటింగ్‌. ఈసారి ఉత్తమ్‌సింగ్‌ కథ చెప్పాడు. మహేష్‌కి కథ నచ్చింది. నెక్స్‌ట్‌ ఇయర్‌ స్టార్ట్‌ చేద్దాం అంటూ సిఖ్‌ బ్యాక్‌డ్రాప్‌ మార్చమని చెప్పాడు. అలాగే ఉత్తమ్‌సింగ్‌ అనే టైటిల్‌ మహేష్‌కి నచ్చలేదు. వెంటనే ‘పోకిరి’ టైటిల్‌ చెప్పాడు పూరి. ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయింది. అయితే నెక్స్‌ట్‌ ఇయర్‌ వరకు ఆగలేని పూరి వెంటనే నాగార్జునతో ‘సూపర్‌’ చిత్రాన్ని స్టార్ట్‌ చేసేశాడు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత ‘పోకిరి’ ప్రాజెక్ట్‌కి వచ్చాడు పూరి. అప్పటికి మహేష్‌ కూడా ఫ్రీ అయిపోయాడు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ కోసం వేట మొదలైంది. అయేషా టకియా, దీపిక పదుకొనే, పార్వతి మెల్టన్‌..ఇలా చాలా మందిని అనుకున్నారు. చివరికి ఇలియానా ఫిక్స్‌ అయింది.  ‘పోకిరి’ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. పూరి జగన్నాథ్‌ వర్కింగ్‌ స్టైల్‌ మహేష్‌కి బాగా నచ్చింది. అప్పటివరకు మహేష్‌ పనిచేసిన డైరెక్టర్లందరిలో పూరి స్పీడ్‌ అని అర్థమైంది. ప్రతి షాట్‌ని సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేసేవాడు. 70 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్‌ గెటప్‌, క్యారెక్టరైజేషన్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌... ఇలా అన్నీ మార్చేశాడు పూరి. అతనికి ఒక కొత్త లుక్‌ తీసుకొచ్చాడు. మణిశర్మ మ్యూజిక్‌లో చేసిన పాటలన్నీ బాగా కుదిరాయి. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ పాట సినిమా రిలీజ్‌కి ముందే పెద్ద సంచలనం సృష్టించింది. ‘శివమణి’ షూటింగ్‌ టైమ్‌లో ఫారిన్‌ వెళ్ళిన పూరికి ఒకచోట ఒక వ్యక్తి గిటార్‌తో ‘లిజన్‌ టు ది ఫాలింగ్‌ రైన్‌’ పాటను ప్లే చేస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు పూరి. సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన ‘గౌరి’ చిత్రంలోని ‘గల గల పారుతున్న గోదారిలా..’ పాటే అది. ఆ ఇంగ్లీష్‌ పాట ఇన్‌స్పిరేషన్‌తోనే తెలుగులో పాట చేశారని తర్వాత తెలుసుకున్నాడు పూరి. అది కృష్ణ పాటే కాబట్టి తమ సినిమాలో పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కొత్తగా వినిపించిన ఆ పాట చాలా పెద్ద హిట్‌ అయింది.  2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ చెల్లా చెదురు చేసేసింది. ‘పోకిరి’ మహేష్‌కి స్టార్‌డమ్‌ తీసుకొచ్చింది. పూరిని టాప్‌ డైరెక్టర్‌ని చేసింది. హీరోయిన్‌గా ఇలియానాకు క్రేజ్‌ వచ్చింది. సినిమాలోని ప్రతి సీన్‌ పేలింది. డైలాగులు, యాక్షన్‌ సీన్స్‌, అలీ, వేణుమాధవ్‌, బ్రహ్మాంనందం కాంబినేషన్‌లో రూపొందిన బెగ్గర్స్‌ సీన్స్‌ థియేటర్‌లో అదిరిపోయాయి. 75 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమా కూడా సాధించిన రికార్డులు ‘పోకిరి’ సాధించింది. 2007లో విజయ్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ్‌లో రూపొంది అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. 2009లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్‌లోనే ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తే బాలీవుడ్‌లో కూడా బిగ్‌ హిట్‌గా నిలిచింది. 2010లో దర్శన్‌ హీరోగా కన్నడలో ‘పోర్కి’గా, 2014లో షకీబ్‌ఖాన్‌ హీరోగా ‘రాజోట్టో’ పేరుతో బంగ్లాదేశ్‌లో ఈ సినిమా రూపొంది ఘనవిజయం సాధించింది. రీమేక్‌ చేసిన అన్ని భాషల్లో ‘పోకిరి’ సూపర్‌హిట్‌ కావడం విశేషం. మహేష్‌, పూరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పోకిరి’ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. 63 కేంద్రాల్లో 175 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 17 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శించారు. ఇది అప్పటికి ఆల్‌ ఇండియా నేషనల్‌ రికార్డుగా నిలిచింది. తిరుపతిలోని ఓ థియేటర్‌లో ఫ్లోటింగ్‌ బాగా ఎక్కువ ఉండడంతో రోజూ 5 ఆటలు చొప్పున 200 రోజులు రన్‌ అయింది. టోటల్‌ రన్‌లో రూ.66 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది ‘పోకిరి’. అందులో రూ.48 కోట్ల షేర్‌ వచ్చింది. ‘మగధీర’ రిలీజ్‌ అయ్యేవరకు అంటే మూడు సంవత్సరాలపాటు ఆ రికార్డు అలాగే ఉంది. అప్పటికి ఇండియా లెవల్‌లో టాప్‌ గ్రాసర్‌గా ‘పోకిరి’ రెండవ స్థానంలో ఉంది. అలా టాప్‌ 5లో నిలిచిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ సినిమా అది. 

మొదటి రెండు వారాలు కలెక్షన్స్‌ నిల్‌.. ఆ తర్వాత ఆస్కార్‌ రేంజ్‌ సినిమా అనే ప్రశంసలు!

డబ్బు గొప్పదా.. మానవత్వం గొప్పదా? ఒక ఘటన చూసిన తర్వాత ఓ కుర్రాడిలో వచ్చిన ఆలోచన ఇది. తను ప్రత్యక్షంగా చూసిన ఆ ఘటన అతన్ని కదిలించింది. అసలే రచయిత.. దానికితోడు హృదయాన్ని హత్తుకున్న ఘటన. తన ఆలోచనలని ఒక కథగా మలిచాడు. ఆ కథ పేరు ‘అంతిమయాత్ర’. ఆ కుర్రాడి పేరు మదన్‌. సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టైమ్‌లో ఈటీవీలో సీరియల్‌ కోసం కథ చెప్పడానికి ఈటీవీ ఆఫీస్‌కి వచ్చాడు. ఆ కథ వినేందుకు ఆ సంస్థలోని ఓ ప్రముఖ్య వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. కథ చెప్పడం మొదలుపెట్టాడు మదన్‌. ఒక వ్యక్తి చనిపోతాడు.. అదే మొదటి సీన్‌. అది విన్న ఆ వ్యక్తి.. ఈ కథతో ఎక్కువ ఎపిసోడ్స్‌ చెయ్యలేం అంటూ పదినిమిషాల్లోనే కథను రిజెక్ట్‌ చేశాడు. ఇదే కథను ఎంతో మందికి వినిపించాడు మదన్‌. కానీ, ఎక్కడా వర్కవుట్‌ అవ్వలేదు.  చివరికి అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గరకి వెళ్ళి కథ వినిపించాడు. ఆయనకి బాగా నచ్చింది. వెంటనే అతన్ని ఊటీ పంపించారు. నెల రోజులు టైమ్‌ ఇచ్చి ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని రమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఫుల్‌ స్క్రిప్ట్‌తో వచ్చాడు మదన్‌. అప్పుడు చెన్నయ్‌ నుంచి కె.భాగ్యరాజాను పిలిపించారు అట్లూరి. ఎందుకంటే కథలపై ఆయనకు మంచి జడ్జిమెంట్‌ ఉంటుంది. మదన్‌ చెప్పిన కథ విని చలించిపోయాడు భాగ్యరాజా. తెలుగు, తమిళ భాషల్లో తానే డైరెక్ట్‌ చేస్తానని, హీరో కూడా తనేనని చెప్పాడు. అది అట్లూరికి నచ్చలేదు. ఈ సినిమాలో ఎవరు నటించాలి అనే విషయంలో ఆయనకు కొన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. విసు, దాసరి నారాయణరావు, మోహన్‌బాబు.. వీళ్ళలో ఎవరో ఒకరితో సినిమా చేస్తే బాగుంటుందనేది అట్లూరి ఆలోచన. వీరు కాకపోతే మరో ఆప్షన్‌ తీసుకోవాలి అనుకున్నారు. ఒక దశలో ప్రకాష్‌రాజ్‌ని అనుకున్నారు. కథ విన్న ప్రకాష్‌రాజ్‌.. సినిమా కంటే నవలగా అయితే బాగుంటుంది. ట్రై చెయ్యమని సలహా ఇచ్చారు. మదన్‌కి విసుగొచ్చేసింది. తన కథకు ఏ దారి దొరకడం లేదు అని బాధపడ్డాడు. చివరికి అతనికి ఒక దారి దొరికింది. మదన్‌ దగ్గర మంచి కథ ఉందని, వెంటనే దాని రైట్స్‌ తీసుకోమని దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ సోదరుడు చెప్పాడు. కథ వినకుండానే అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గర నుంచి దాని రైట్స్‌ తీసుకున్నాడు. అప్పటికే ఆ కథపై నమ్మకంతో ఎన్నో ప్రయత్నాలు చేసిన అట్లూరి కూడా విసిగిపోయి చంద్రసిద్ధార్థ్‌ అడగ్గానే నో చెప్పకుండా రైట్స్‌ ఇచ్చేశారు. అయితే ఎందుకైనా మంచిది అని తమిళ రైట్స్‌ మాత్రం తనదగ్గరే ఉంచుకున్నారు. ఆ తర్వాత ఔట్‌లైన్‌గా కథ విన్నాడు చంద్ర. ఆ కథను సినిమాగా తీసేందుకు ప్రేమ్‌కుమార్‌ పట్రా ఓకే చెప్పారు. ఈ సినిమాలోని ప్రదాన పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో తర్జనభర్జలు పడిన తర్వాత రాజేంద్రప్రసాద్‌ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు.  రాజేంద్రప్రసాద్‌తో టైమ్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. మదన్‌ కథ చెబుతుంటే ఆయనతోపాటు చంద్రసిద్ధార్థ్‌ కూడా విన్నాడు. కథ పూర్తి కాగానే మారు మాట్లాడకుండా.. రాజేంద్రప్రసాద్‌ బెడ్‌రూమ్‌లోకి, చంద్రసిద్ధార్థ్‌ బాల్కనీలోకి వెళ్లిపోయారు. మదన్‌కి విషయం అర్థమైంది. ఇక ఈ కథ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని డిసైడ్‌ అయ్యాడు. బెడ్‌రూమ్‌ నుంచి వచ్చిన రాజేంద్రప్రసాద్‌.. వెంటనే సినిమా స్టార్ట్‌ చేసెయ్యాలి.. ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు అన్నాడు కళ్లు తుడుచుకుంటూ. చంద్రసిద్ధార్థ్‌ పరిస్థితి కూడా అంతే ఉంది.  టైటిల్‌ విషయానికి వస్తే.. అంతిమయాత్ర అనే టైటిల్‌ చంద్రసిద్ధార్థ్‌కి నచ్చలేదు. అతని మనసులో ఆ నలుగురు అనే టైటిల్‌ ఎప్పటి నుంచో ఉంది. మదన్‌ కూడా అదే అనుకున్నాడు. ఫైనల్‌ ‘ఆ నలుగురు’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసుకున్నారు. ఈ టైటిల్‌ గురించి తెలుసుకున్న చంద్రసిద్ధార్థ్‌ తండ్రి.. టైటిల్‌ చాలా బాగుందని, ఈ సినిమా నీ కెరీర్‌ని టర్న్‌ చేస్తుందని చెప్పారు. తప్పకుండా సినిమా చూస్తానని అన్నారు. సినిమాలంటే ఇష్టపడని తండ్రి నుంచి ఆశీర్వాదం రావడంతో చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాడు చంద్ర. అలా సినిమా మొదలైంది. కోటి పాతిక లక్షల బడ్జెట్‌తో 38 రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు. ఎడిటింగ్‌లో బిజీగా ఉన్నాడు చంద్ర. శవ యాత్ర సీన్‌ను ఎడిట్‌ చేస్తున్నారు. అప్పుడు ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది.. తండ్రి చనిపోయారని. ఆయన తన సినిమా చూడకుండానే వెళ్లిపోయారు. వెంటనే ఊరికి బయల్దేరాడు చంద్ర. ఆ తర్వాత కొన్ని రోజులకు డిసెంబర్‌ 9, 2004లో ‘ఆ నలుగురు’ రిలీజ్‌ అయింది.  టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా రిజల్ట్‌ కూడా ఉంది. 27 ప్రింట్లతో రిలీజ్‌ చేస్తే 16 ప్రింట్లు రిటర్న్‌ వచ్చేశాయి. మొదటి రెండు వారాలు కలెక్షన్లు నిల్‌. మూడో వారం మొదటి రోజు అందరూ షాక్‌ అయ్యారు. మార్నింగ్‌ షో నుంచి సెకండ్‌ షో వరకు ఫుల్స్‌ అయ్యాయి. అలా రోజు రోజుకీ థియేటర్లు పెరుగుతూ వెళ్ళాయి. సినిమా చూసిన వాళ్ళంతా యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ సినిమాను థియేటర్‌లో చూసినవారి కంటే టీవీలో చూసినవారే ఎక్కువ. ‘ఆ నలుగురు’ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడుగా రాజేంద్రప్రసాద్‌, ఉత్తమ సహాయ నటుడిగా కోట శ్రీనివాసరావు నందులు అందుకున్నారు. ఈ సినిమా మరాఠీలో షాయాజీ షిండే రీమేక్‌ చేశారు. కన్నడలో విష్ణువర్థన్‌ సిరివంత పేరుతో రీమేక్‌ చేశారు. 

ఆ సినిమా చూసి 20 జంటలు ఆత్మహత్య.. డైరెక్టర్‌పై మానవ హక్కుల సంఘం ఫైర్‌!

కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, కొన్ని సినిమాలు కంటతడి పెట్టిస్తాయి, మరికొన్ని సినిమాలు జీవితంలో విజయాలు సాధించడానికి ఇన్‌స్పిరేషన్‌ని ఇస్తాయి. అలా కాకుండా ఒక సినిమా చూసిన తర్వాత జీవితమంటేనే విరక్తి కలిగితే, ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పితే.. ఒక సినిమా విషయంలో అదే జరిగింది. తమ ప్రేమ విఫలమవుతుందనే భయంతో, తమని పెదలు విడదీస్తారనే బాధతో ఒక జంట ఆ సినిమాలో ఆత్మహత్యకు పాల్పడిరది. ఆ సినిమాని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 20 జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. అంతేకాదు, తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సినిమాయే ఇన్‌స్పిరేషన్‌ అని సూసైడ్‌ నోట్‌ రాసి మరీ చనిపోయారంటే.. ఆ సినిమా యువ ప్రేమికుల్లో ఎంత గాఢమైన ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి సంచలనం సృషించిన ఆ సినిమా ఏమిటో తెలుసా? కమల్‌హాసన్‌, సరిత జంటగా కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మరోచరిత్ర’.  ఆండాళ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.బాలచందర్‌ దర్శకత్వంలో రామ అరంగణల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలచందర్‌ రాసిన కథకు గణేష్‌ పాత్రో సంభాషణలు, ఆత్రేయ పాటలు రాశారు. ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. మొదట అనుకున్న పేరు మరో ప్రేమకథ. ప్రేమకథల్లోనే కొత్త దనం ఉన్న కథ కాబట్టి చరిత్ర అని వచ్చేలా ఉంటే బాగుంటుందని బాలచందర్‌ అన్నారు. అప్పుడు మరో ప్రేమచరిత్ర అనుకున్నారు. టైటిల్‌లోనే ప్రేమ అని ఉంటే లవ్‌స్టోరీ అని తెలిసిపోతుందని ఫైనల్‌గా ‘మరోచరిత్ర’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.  ఇక సినిమాలో నటించే నటీనటుల ఎంపిక మొదలు పెట్టారు. హీరో కమల్‌హాసన్‌, యువ వితంతు పాత్రలో నటించేందుకు మాధవిని ఎంపిక చేశారు. ప్రధాన కథానాయిక పాత్ర కోసం మొదట జయప్రదను అనుకున్నారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత దీపను అడిగారు. బాలచందర్‌ అడిగిన డేట్స్‌ను ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’ చిత్రానికి ఇచ్చేశారు దీప. ఎంత ప్రయత్నించినా డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వలేదు. ఆ తర్వాత 160 మందికి స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. సంగీత దర్శకుడు టి.చలపతిరావు బంధువు కుమార్తె అభిలాషను ఒకసారి గణేష్‌ పాత్రో చూశారు. ఆ అమ్మాయి అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆండాళ్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీస్‌లో ఆమెను బాలచందర్‌కు పరిచయం చేశారు. పొట్టిగా, నల్లగా ఉన్నప్పటికీ ఆమెలోని చలాకీతనం, తెలివితేటలు బాలచందర్‌కు బాగా నచ్చాయి. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అభిలాష కరెక్ట్‌ సరిపోతుందని ఆమెనే సెలెక్ట్‌ చేశారు. ఆమె పేరును సరితగా మార్చారు బాలచందర్‌. ఈ సినిమా షూటింగ్‌ అంతా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది.  1978 మే 19న ఈ సినిమా విడుదలైంది. సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలోని బాలు, స్వప్న క్యారెక్టర్లకు యూత్‌ బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమాలోని పాటలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. ఆచార్య ఆత్రేయ, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఇద్దరూ టీనేజ్‌ కుర్రాళ్ళలా ఆలోచించి ఈ పాటలు చేశారు. అప్పట్లో ఈ పాటల్ని బట్టీ పట్టి మరీ పాడుకున్నారు యువతీయువకులు. తమిళనాడు అంతా ఈ సినిమా తెలుగు వెర్షన్‌నే రిలీజ్‌ చేస్తే అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. మద్రాస్‌లోని సఫైర్‌ థియేటర్‌లో 556 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇదే సినిమాను 1981లో ‘ఏక్‌ దూజే కే లియే’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఎల్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కె.బాలచందర్‌ దర్శకత్వం వహించారు. హిందీలో కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. తెలుగు, హిందీ వెర్షన్స్‌ హైదరాబాద్‌లో 365 రోజులు ప్రదర్శింపబడ్డాయి.  ఈ సినిమా ఎండిరగ్‌ ట్రాజెడీ అయితే ఆడియన్స్‌ శాటిస్‌ఫై అవ్వరని గణేష్‌ పాత్రో, ఆత్రేయ వంటి వారు బాలచందర్‌తో అన్నారు. కానీ, ఆయన మాత్రం తను కథగా ఏదైతే అనుకున్నాడో దాన్నే స్క్రీన్‌పై చూపించారు. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. చివరలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం సినిమాకి బాగా ప్లస్‌ అయింది. ఈ సినిమా ఇన్‌స్పిరేషన్‌తోనే మొదట ముంబాయిలోని జుహు బీచ్‌లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిరది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోని 20 జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. దీనిపై మానవ హక్కుల సంఘం, అభ్యుదయ సంఘాలు సీరియస్‌ అయ్యాయి. సినిమాను డైరెక్ట్‌ చేసిన కె.బాలచందర్‌ను ఆ సంఘాల సభ్యులు తీవ్రంగా విమర్శించారు. ‘మరోచరిత్ర’ 200 రోజుల ఫంక్షన్‌లో బాలచందర్‌ మాట్లాడుతూ తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఈ సినిమా తీయడమేనని అన్నారు. ఈ సినిమా తీసినందుకు ప్రతిరోజూ బాధపడుతున్నానని, తనని క్షమించమని బహిరంగంగా కోరారు. యూత్‌ని ప్రభావితం చేసే ఇలాంటి సినిమాలు ఇకపై చెయ్యను అని చెప్పారు. ఆ తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా 1992లో ‘వానమె ఎల్లే’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ‘అక్టోబర్‌ 2’ పేరుతో తెలుగులో విడుదలైంది. రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఐదుగురు యువతీయువకులు చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని తమకి ఉన్న సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఎలా విజయం సాధించారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

అందరితోనూ గొడవపడే ఆ హీరోయిన్‌ జీవితంలో అన్నీ వివాదాలే.. అందరూ శత్రువులే!

సమాజంలో మంచి, చెడు ఉన్నట్టే.. సినీ పరిశ్రమలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఇక ఎప్పుడూ వివాదాలతోనే సహజీవనం చేసేవారూ ఉంటారు. అలాంటి వారి గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చడం వార్తల్లోకి ఎక్కడం అనేది వారికి సర్వసాధారణ విషయం. పాతతరం హీరోయిన్లలో అలాంటి మనస్తత్వం ఉన్న వారిలో జి.వరలక్ష్మీ ఒకరు. ఆమె జీవితమే వివాదాల మయం. తోటి నటీనటులతో, దర్శకనిర్మాతలతో దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం వంటి ఘటనలు ఆమె జీవితంలో కోకొల్లలు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. నటిగా జి.వరలక్ష్మీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆత్మవిశ్వాసం అనేది ఆమెకు మెండుగా ఉండేది. ఏ క్యారెక్టర్‌ పోషించినా అది స్పష్టంగా కనిపించేది. కొన్ని సినిమాల్లో శాంత స్వభావం ఉన్న క్యారెక్టర్లు చేసినా అహంకారం, దురుసుతనం ఉన్న క్యారెక్టర్స్‌లోనే ఆమె ఎక్కువగా రాణించింది. నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉండేది. ఎవ్వరినీ లెక్కచేసేది కాదు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే ఆమె జీవితం వివాదాస్పదంగా మారింది. అప్పటికే పెళ్లయిన నటుడు, దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావును పెళ్లి చేసుకోవడంలో, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రకాశరావును వదిలేసి పహిల్వాన్‌ అజిత్‌సింగ్‌ను పెళ్లి చేసుకోవడంలో ఆమె తొందరపాటు కనిపిస్తుంది. ప్రకాశరావు మొదటి భార్య కుమారుడు కె.రాఘవేంద్రరావు, తన కుమారుడికి కె.ఎస్‌.ప్రకాశ్‌ అని తన మొదటి భర్త పేరే పెట్టుకున్నారు వరలక్ష్మీ. కె.ఎస్‌.ప్రకాశ్‌ సినిమాటోగ్రాఫర్‌గా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు పనిచేశారు.  వివాదాలు, గొడవలు కొనితెచ్చుకునే వరలక్ష్మీని ఆరోజుల్లో కొందరు రౌడీ వరలక్ష్మీ అని, పిచ్చి వరలక్ష్మీ అని పిలిచేవారు. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ద్రోహి’ చిత్రంలో కె.ఎస్‌.ప్రకాశరావు, వరలక్ష్మీ జంటగా నటించారు. లక్ష్మీరాజ్యం ఓ కీలక పాత్ర పోషించారు. ఆ నిర్మాణ సంస్థకు ప్రకాశరావు మేనేజింగ్‌ డైరెక్టర్‌. తను కంపెనీ ఓనర్‌ భార్యని అనే అహంభావం వరలక్ష్మీకి ఉండేది. అందుకే లక్ష్మీరాజ్యం మీద ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించేది. ఇది లక్ష్మీరాజ్యంకి నచ్చేది కాదు. వరలక్ష్మీకి అనుకూలంగా నడిచేది కాదు. దీంతో వరలక్ష్మీకి కోపం వచ్చేది. ఒకసారి ఆమెపై చెప్పుతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టడం మొదలు పెట్టింది. యూనిట్‌లోని వారు ఇద్దరినీ విడిపించారు. ఈ ఘటనతో కోపం వచ్చిన లక్ష్మీరాజ్యం ఆమెపై పోలీస్‌ కేసు పెట్టింది. ఇది తెలుసుకున్న సినీ పెద్దలు రంగంలోకి దిగి కేసు కోర్టు వరకు వెళ్ళకుండా ఇద్దరికీ రాజీ కుదిర్చారు.  వరలక్ష్మీ దుందుడుకు మనస్తత్వాన్ని చెప్పే మరో ఘటన సావిత్రి విషయంలో జరిగింది. చెన్నయ్‌లో జ్యోతి సినిమా షూటింగ్‌ జరుగుతోంది. వరలక్ష్మీ, సావిత్రి ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మీ మేకప్‌ రూమ్‌లో మేకప్‌ చేసుకుంటోంది. సావిత్రి మేకప్‌ పూర్తి చేసుకొని సెట్‌లో కూర్చున్నారు. ఆమెకు కాస్త దూరంగా తండ్రి వెంకటరామచౌదరి కూర్చున్నారు. ఈలోగా కెమెరామెన్‌ చంద్రన్‌ అక్కడికి వచ్చాడు. షాట్‌ రెడీ అవడంతో వరలక్ష్మీని తీసుకెళ్ళాలనుకున్నాడు. సావిత్రిని వెనుక నుంచి చూసి వరలక్ష్మీ అనుకొని ‘పని కంప్లీట్‌ అయితే రా..’ అంటూ సావిత్రి భుజం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా పైకి లేచిన సావిత్రి ‘కళ్లు కనిపించడం లేదా?’ అని కోపంగా అరిచింది. దానికి చంద్రన్‌ పొరపాటు జరిగింది.. సారీ అన్నాడు. దీంతో సావిత్రి శాంతించింది. కానీ, ఆమె తండ్రి మాత్రం ఊరుకోలేదు. చంద్రన్‌ని నాన్‌స్టాప్‌గా తిట్టడం మొదలుపెట్టాడు. పనిలో పనిగా వరలక్ష్మీని కూడా తిట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మీ  కోపంగా అక్కడికి వచ్చి చౌదరికి చెప్పు చూపిస్తూ తిట్టడం మొదలు పెట్టింది. తండ్రిని తిడుతున్నందుకు సావిత్రి కూడా వరలక్ష్మీని తిట్టింది. వీళ్ళ గొడవ చూసిన యూనిట్‌ సభ్యులు వారిద్దరినీ విడదీశారు.  ఆ తర్వాత కొన్నిరోజులకు సావిత్రి కొత్త కారు కొన్నారు. వరలక్ష్మీ ఆ కొత్త కారు టైర్లను కోయించేసింది. ఆ తర్వాత అది చాలా పెద్ద గొడవగా మారింది. ఎప్పుడూ గొడవకు సిద్ధంగా ఉండే వరలక్ష్మీకి ఆడవారంటే పడేది కాదు. ఈ విషయాన్ని ఆమే చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పట్లో ఆమెకు అందరూ మగస్నేహితులే ఉండేవారు. కస్సుబుస్సులాడుతూ కయ్యానికి కాలు దువ్వేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే వరలక్ష్మీ అంటే ఎవరికీ నచ్చేది కాదు. అందుకే ఆమెకు స్నేహితులకంటే శత్రువులే ఎక్కుమంది ఉండేవారు. 

ఆ కథను అందరూ రిజెక్ట్‌ చేశారు. కానీ, పద్మనాభం నిర్మాతగా తొలి విజయం అందుకున్నారు!

కొన్ని సూపర్‌హిట్‌ సినిమాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా పాత సినిమాలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు వింటూ వుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అంత మంచి కథ సినిమాగా రావడానికి అన్ని సంవత్సరాలు పట్టిందా? అనిపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ ‘దేవత’ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకి కథను అందించింది వీటూరి. ఈ కథను ఎంతో మంది దర్శకనిర్మాతలకు వినిపించారాయన. అందరూ కథ బాగుంది అన్నారు. కానీ, సినిమాగా తీసేందుకు ఎవరూ ధైర్యం చెయ్యలేదు. అటు తిరిగి, ఇటు తిరిగి పద్మనాభం దగ్గరికి వచ్చిందా కథ. మరి ఈ కథ సినిమాగా రూపుదిద్దుకోవడం వెనుక ఎలాంటి సంగతులు జరిగాయో తెలుసుకుందాం.  1945లో నటుడిగా తెరంగేట్రం చేసిన పద్మనాభం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హాస్యపాత్రలు, సహాయనటుడి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదేళ్ళ వయసులోనే నాటక రంగ ప్రవేశం చేశారు పద్మనాభం. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ రేఖ అండ్‌ మురళీ ఆర్ట్స్‌ అనే సంస్థను స్థాపించి నాటకాలు కూడా ప్రదర్శించేవారు. సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి ఆ నాటకాలకు సంగీతం అందించేవారు. ఆయన, పద్మనాభం రూమ్‌మేట్స్‌. ఒకసారి వారిని రచయిత వీటూరి కలిసారు. ఆ సందర్భంలో తన దగ్గర ఉన్న కథను వినిపించారాయన. కథ బాగుంది. హీరోయిన్‌ డబుల్‌ రోల్‌. ఇది నాటకానికి పనికి రాదు, పెద్ద తారలను పెట్టి భారీ బడ్జెట్‌తో సినిమాగా తియ్యాలి. పద్మనాభంకి నిర్మాత కావాలని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ నటుడిగా బాగా బిజీగా ఉండడం వల్ల సినిమా నిర్మాణం జోలికి వెళ్ళలేదు. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గుతాయని భావించారాయన. అలాంటి సమయంలో సినిమా నిర్మాణం కరెక్ట్‌ కాదు అనుకున్నారు. ఈ కథను ఇంకా ఎవరికైనా చెప్పండి. ఎవరు చేసినా సంతోషమే అన్నారు పద్మనాభం.  ఇక ఆ కథ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు పద్మనాభం. రెండు నెలలు గడిచిపోయింది. కానీ, కోదండపాణి మాత్రం మర్చిపోలేదు. ‘మంచి కథ దొరికింది కదా. నువ్వే ధైర్యం చేసి సినిమా తియ్యొచ్చుగా’ అన్నారు. దాంతో ఆలోచనలో పడ్డ పద్మనాభం. ఆ కథతోనే సినిమా నిర్మించాలనుకొని ఎన్టీఆర్‌ హీరో అయితే బాగుంటుంది భావించారు. వీటూరితో కలిసి ఆయన్ని కలిసారు పద్మనాభం. కథ బాగా నచ్చడంతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు ఎన్టీఆర్‌. తను హీరోగా నటించే సినిమాతో పద్మనాభం నిర్మాతగా మారుతున్నందుకు ఆయన ఎంతో ఆనందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆ తర్వాత సావిత్రిని కలిసారు. ఆమెకు కూడా కథ నచ్చి ఓకే చెప్పారు. ఒకే సినిమా నాకు రెండు మంచి పాత్రలు లభించాయన్నమాట అంటూ సరదాగా అన్నారు సావిత్రి. అప్పటికి ఆమె మూడు నెలల గర్భవతిగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ ఆరు నెలలైనా పడుతుంది. అప్పుడు తను షూటింగ్‌లో పాల్గొనడం కష్టం కదా అన్నారామె. దానికి పద్మనాభం.. మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెకు అడ్వాన్స్‌గా కొంత డబ్బు ఇచ్చే సమయంలో పొరపాటున ఒక వంద రూపాయల నోటు జారి కిందపడిపోయింది. దాన్ని సావిత్రి తీసి ఇస్తూ ఇది శుభసూచకం.. మీ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అన్నారు. ఆమె నోటి వాక్కు ఫలించి సినిమా ఘనవిజయం సాధించింది. కె.హేమాంబరధరరావు దర్శకుడుగా. ఎస్‌.పి. కోదండపాణి సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు. తన ఇంటిని రూ.40 వేలకు తాకట్టు పెట్టి సినిమా నిర్మాణం ప్రారంభించారు పద్మనాభం.  ఎన్టీఆర్‌ తల్లిదండ్రులుగా నిర్మల, నాగయ్య నటించారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించారు. మిగతా పాత్రలను రాజబాబు, రాజనాల, నగేష్‌, పేకేటి తదితరులు పోషించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో 22 మంది ప్రముఖ నటీనటులు పాల్గొన్న ప్రప్రథమ చిత్రం అంటూ పబ్లిసిటీ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే నటుడు నాగయ్యకు పద్మశ్రీ అవార్డు లభించింది. దాన్ని సెట్‌లోనే సెలబ్రేట్‌ చేశారు పద్మనాభం. ఈ చిత్రానికి ఎస్‌.పి.కోదండపాణి అద్భుతమైన పాటలు చేశారు. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న పాటల్లో ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి..’, ‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..’, ‘బొమ్మను చేసి, ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక’, ‘తొలి వలపే పదే పదే..’ వంటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ పాటల రికార్డులు అప్పట్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. సంగీత కళాకారులు తమ ప్రతి కచ్చేరీలో ఈ పాటలను ఆలపించి జనం చేత చప్పట్లు కొట్టించుకునేవారు. ముఖ్యంగా ‘బొమ్మను చేసి, ప్రాణము పోసి’ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. 1965 జూలై 24న ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్‌ను రాజమండ్రిలోని ఓ థియేటర్‌లో నిర్వహించారు.