ఏ హీరోకీ సాధ్యం కాని ఆ పాత్రను పోషించి చరిత్ర సృష్టించిన ఎన్‌.టి.ఆర్‌.!

ఏ నటుడికైనా తను ఎన్ని రకాల క్యారెక్టర్స్‌ చేసినా ఇంకా ఏదో చెయ్యాలి, అంతకుమించిన పాత్ర పోషించాలి అనే తపన ఉంటుంది. అంతేకాదు, తనకంటూ ఓ డ్రీమ్‌ క్యారెక్టర్‌ కూడా ఉంటుంది. దాన్ని పోషించి ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే అతనిలోని కళాకారుడు సంతృప్తి చెందుతాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. కొన్ని దశాబ్దాలపాటు సినిమాలు చేసినా తన మనసుకి దగ్గరగా ఉంటూ తను ఎంతో ప్రేమించే క్యారెక్టర్‌ చేసే అవకాశం రాదు. అయితే మహానటుడు ఎన్‌.టి.రామారావులాంటి వారు అలాంటి పాత్రలు చేసేందుకు ఎంత రిస్క్‌ తీసుకోవడానికైనా సిద్ధపడతారు. ఎంతమంది విమర్శించినా దాన్ని మనసులో పెట్టుకోకుండా తను చేసే పాత్రపైనే మనసు పెడతారు. అలాంటి ఓ క్యారెక్టర్‌పై ఎన్టీఆర్‌ మనసు పడ్డారు. ఆ క్యారెక్టర్‌ చెయ్యడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఎన్‌.టి.రామారావు అంత ఛాలెంజింగ్‌గా తీసుకున్న క్యారెక్టర్‌ ఏదో తెలుసా? అదే రావణాసురుడి పాత్ర.  1958లో కె.శంకర్‌ దర్శకత్వంలో ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ‘భూకైలాస్‌’ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. రావణాసురుడిగా నటించారు. అయితే ఈ సినిమాలో రాముడి ప్రస్తావన ఉండదు. కేవలం రావణాసురుడి చుట్టూనే కథ తిరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రావణాసుర జీవిత క్రమం మాత్రమే ఉంటుంది.  పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. మహాశివుడి ఆత్మలింగాన్ని సాధించి, అమరత్వం పొందాలని రావణాసురుడికి కోరిక కలుగుతుంది. ఆ నేపథ్యంలో ‘భూకైలాస్‌’ చిత్రకథ కొనసాగుతుంది. ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత తాను రాముడిగా, ఎస్‌.వి.రంగారావు రావణాసురుడిగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కి వచ్చింది. కథ సిద్ధం చేసుకొని ఇక సినిమా మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ సన్నిహితుడు కృష్ణచౌదరి.. రావణాసురుడిలోని విశిష్టతను తెలియజేసే ఓ పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత ఎన్టీఆర్‌కి రావణాసురుడి పాత్రపై మక్కువ పెరిగింది. తను ఆ సినిమాలో రావణ పాత్రను పోషించాలని నిర్ణయించుకున్నారు. కానీ, దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం ‘కృష్ణుడిగా చూపించిన నిన్ను రావణాసురుడిగా చూడలేను. పైగా రావణాసురుడు వంటి రాక్షసుడ్ని ధీరోదాత్తుడిగా చూపించడం నా వల్ల అయ్యేది కాదు’ అన్నారు. ఈ విషయంలో తాను అనుకున్న దానికే కట్టుబడిన కె.వి.రెడ్డి మర్యాద పూర్వకంగానే సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక అప్పుడు ఎన్టీఆరే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. కానీ, తెరపై దర్శకుడిగా తన పేరు వేసుకోకపోవడం విశేషం.  నటీనటుల ఎంపిక మొదలైంది. రాముడిగా హరనాథ్‌, సీతగా గీతాంజలి, లక్ష్మణుడిగా శోభన్‌బాబు, నారదుడిగా కాంతారావు, రావణాసురుడి భార్యగా బి.సరోజాదేవి.. మిగతా పాత్రల కోసం  ప్రముఖ నటీనటులు ఎంపికయ్యారు. సినిమా పేరు ‘సీతారామ కళ్యాణం’ అయినప్పటికీ కథ మొత్తం రావణాసురుడి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రావణాసురుడి పాత్ర చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘భూకైలాస్‌’లో రావణుడిగా నటించినప్పటికీ అందులో రాముడి పాత్ర ఉండదు. ఈ సినిమాలో రాముడి పాత్ర ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ రావణ పాత్ర పోషించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ పాత్రకు జీవం పోసి తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు ఎన్టీఆర్‌. అంతకుముందు ఎన్టీఆర్‌ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ రెహమాన్‌ అందుబాటులో లేకపోవడంతో రవికాంత్‌ నగాయిచ్‌ అనే కొత్త కుర్రాడికి ఆ బాధ్యతను అప్పగించారు. ఎన్నో సన్నివేశాలను తన ట్రిక్‌ ఫోటోగ్రఫీతో అద్భుతంగా తీశారు రవికాంత్‌. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పది తలలు కనిపించడం కోసం ఎన్టీఆర్‌, రవికాంత్‌ ఎంతో శ్రమించారు. ఆ సీన్‌ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం చేతులు చాచి పైకి చూస్తూ దాదాపు పది గంటలు అలాగే నిలబడ్డారు ఎన్టీఆర్‌. ఆ సీన్‌ పూర్తయిన తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత మరో సన్నివేశంలో శివానుగ్రహం కోసం కడుపులోని పేగులు తీసి వీణానాదం చేస్తూ తన మొహంలో పలికించిన భావాలు చూసి సినీ పరిశ్రమలోని ప్రముఖులు షాక్‌ అయ్యారు. రౌద్రం, క్రోదం, ఆవేదన కలగలిసిన ఆ మొహాన్ని చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారట. ఇంట్లో అద్దం ముందు కూర్చొని ఆ హావభావాలను పలికించాలని ప్రయత్నించారట అక్కినేని. కానీ, తన వల్ల కాలేదు. అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యం అని అక్కినేని స్వయంగా చెప్పడం విశేషం.  1961 జనవరి 6న ‘సీతారామకళ్యాణం’ విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రతినాయకుడైన రావణాసురుడిలోని విశిష్టత, శివభక్తుడిగా అతనిలోని ప్రత్యేతలను చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూసిన సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ను రావణుడిగా చూడలేనన్న కె.వి.రెడ్డి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజల మనసుల్లో రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు అనే భావన ఉన్న రోజుల్లో అతని పాత్రనే ప్రధానంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మరో విశేషం ఏమిటంటే ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా నిలిచిన ‘లవకుశ’ చిత్రం ‘సీతారామకళ్యాణం’ విడుదలైన రెండు సంవత్సరాలకు రిలీజ్‌ అయింది. ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తను ఏ పాత్ర చేసినా దానికి జీవం పోస్తానని ‘లవకుశ’, ‘సీతారామకళ్యాణం’ చిత్రాలతో నిరూపించారు ఎన్టీఆర్‌.

రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన నటి!

ఆమె పేరు వసుంధరాదేవి..అందానికి అందం.. అభినయానికి అభినయం..1965 నుంచి 1980 వరకు దాదాపు 15 సంవత్సరాలు తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి. ఒక దశలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ వైభవం ఎంతో కాలం నిలవదని, విధి వారిని దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేస్తుందనే విషయం కొందరు నటీనటుల జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అలాంటి హీరోయిన్లలో కాంచన కూడా ఒకరు. ఆమె అసలు పేరు వసుంధరాదేవి. 1939 ఆగస్ట్‌ 16న ప్రకాశం జిల్లా కరవదిలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబమంతా మద్రాస్‌లో స్థిరపడ్డారు. వారిది ఎంతో సంపన్న కుటుంబం. చిన్నతనం నుంచీ ఐశ్వర్యంలో పెరిగారు. ఆరోజుల్లోనే కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు వారికి ఉండేవి. కాంచనకు 16 సంవత్సరాలు వచ్చే వరకు సమాజంలో అప్పు అనేది ఒకటి ఉంటుందని, మన అవసరానికి ఎవరి దగ్గరైనా తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాలనే విషయం తెలీదంటేనే అర్థం చేసుకోవచ్చు వారు ఎంత ధనవంతులో. ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి అనే సామెత కాంచన కుటుంబం విషయంలో అక్షరాల నిజమైంది. వారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒక్కసారిగా పేదరికం వారిని చుట్టుముట్టింది. దాంతో తన చదువును ఇంటర్‌తో ఆపేశారు కాంచన.  కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు. అప్పటివరకు మోడ్రన్‌ డ్రెస్సుల్లో కనిపించిన ఎయిర్‌ హోస్టెస్‌లు సంప్రదాయమైన చీరలు కట్టుకోవాలని ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొత్త రూల్‌ పాస్‌ చేసింది. చీరలో ఎంతో అందంగా కనిపించే కాంచన ఎయిర్‌ హోస్టెస్‌ అనే జాబ్‌కి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన కొందరు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కాంచనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. కానీ, ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఫ్లైట్‌లోనే కాంచనను చూసి తమిళ దర్శకుడు శ్రీధర్‌ ఆమెను ఒప్పించి ‘ప్రేమించి చూడు’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అప్పుడే ఆమె పేరును కాంచనగా మార్చారు దర్శకుడు శ్రీధర్‌. అంతకుముందు బాలనటిగా చాలా సినిమాల్లో నటించిన కాంచన హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా అదే. అయితే ‘వీరాభిమన్యు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు కాంచన. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నించారు. కానీ, ఆమె మాత్రం పెళ్లికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం 84 ఏళ్ళ వయసులో ఉన్న కాంచన ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. 1980 వరకు ఆమె కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా ఉంది. ఆ తర్వాత ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. కెరీర్‌ పరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తన తండ్రి నుంచి సంక్రమించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానం, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేసి దైవసన్నిధిలో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాంచన. ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలను ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు కాంచన.  ‘నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. నాన్న అప్పుల పాలవ్వడంతో ఆస్తి కరిగిపోయింది. ఆ సమయంలోనే ఎయిర్‌హోస్టెస్‌గా జాయిన్‌ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎన్నో సినిమాల్లో నటించాను. దాదాపు 15 సంవత్సరాలు సినిమాల కోసమే పరుగులు తీశాను. చివరికి ఒంటరిదాన్ని అయిపోయాను. నా తల్లిదండ్రులు.. మా పిన్ని కొడుకుని బాగా నమ్మారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు వాడు. ఇప్పటికే నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు వాడేసుకున్నాడు. ఇవన్నీ భరించలేక 1996లో ఆ ఇంటి నుంచి వచ్చేశాను. మా అమ్మ, నాన్న కూడా నాకు వ్యతిరేకంగా మారిపోయారు. వాడిని నమ్మి నన్ను మోసం చేశారు. ఎన్నో ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరనే బాధ నాకు లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు తోడున్నాడు.  ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దవారిని, ఎన్నో సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్టుని గౌరవించడం లేదు. పైగా అవమానిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయమని అడిగేందుకు రాజమౌళి వచ్చారు. రెండు రోజుల క్యారెక్టర్‌ చెయ్యాలని చెప్పారు. నేను దానికి రూ.5 లక్షలు అడిగాను. అయితే అంత ఇచ్చుకోలేమని, వేలల్లో ఇవ్వగలమని అన్నారు. నాకు చాలా బాధ కలిగింది. సినిమాలో క్యారెక్టర్‌ ఇస్తానని చెప్పి నన్ను అలా అవమానించడం సరికాదు అనిపించింది. నా ఆస్తినంతా టెంపుల్‌కే ఇచ్చేశాను. నాకు డబ్బుతో పనేముంది. ఎన్నో సేవలు చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బును కూడా సేవ కోసమే వినియోగిస్తాను. రాజమౌళి లాంటి వారికి రూ.5 లక్షలు ఒక లెక్కా. పైగా నన్ను అవమానించినట్టు కూడా మాట్లాడారు. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ, అలాంటిది ఏమీ లేదు. ఆర్థికంగా బాగానే ఉన్నాను. దైవసన్నిధిలో సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాను’ అన్నారు కాంచన.

53 ఏళ్ళ క్రితమే 80 దేశాల్లో రిలీజ్‌ అయి.. రికార్డు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా!

  సౌ   సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో అనగానే గుర్తొచ్చే పేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. కథల ఎంపికలోగానీ, చిత్ర నిర్మాణంలోగానీ, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా గానీ ఎక్కడా రాజీ పడకుండా, లాభనష్టాల గురించి ఆqలోచించకుండా ముందుకు దూకే కృష్ణ.. ఆ దూకుడుతోనే భారీ విజయాల్ని అందుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ‘అల్లూరి సీతారామరాజు’ జీవితాన్ని తెరకెక్కించడం. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇండియాలోనే మొదటి కౌబాయ్‌ చిత్రాన్ని నిర్మించి మరోసారి సాహసాన్ని ప్రదర్శించారు కృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారంటే దాన్ని పాన్‌ ఇండియా సినిమాగా పిలుస్తున్నారు. కానీ,  53 ఏళ్ళ క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని 80 దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్‌ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ. అసలు ఈ సినిమా నిర్మాణానికి ప్రేరణ ఏమిటి, తెలుగులో కౌబాయ్‌ సినిమా చెయ్యాలని కృష్ణ ఎందుకు అనుకున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  కౌబాయ్‌ కల్చర్‌కి, ఇండియాకి అసలు సంబంధమే లేదు. మెక్సికో, సదరన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌లో ఈ కౌబాయ్‌ కల్చర్‌ అనేది ఉంటుంది. హాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు విపరీతంగా వచ్చేవి. హాలీవుడ్‌ సినిమాల్లో కౌబాయ్‌ అనగానే గుర్తొచ్చే హీరో క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌. కౌబాయ్‌ పాత్రకు ప్రాణం పోసిన హీరో అతను. సూపర్‌స్టార్‌ కృష్ణ హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఆ క్రమంలో ‘మెకన్నాస్‌ గోల్డ్‌’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే కౌబాయ్‌ సినిమాలు చూశారు. అప్పుడే తెలుగులో కౌబాయ్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ విషయం రచయిత ఆరుద్రకు చెప్పి కథ రెడీ చేయమన్నారు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా కథను బేస్‌ చేసుకొని, 23 కౌబాయ్‌ సినిమాలు, రెండు ఇంగ్లీష్‌ నవలల ఆధారంగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ‘అదృష్ట రేఖ’ అనే కథను సిద్ధం చేశారు ఆరుద్ర.  ఈ కథతో సినిమా చెయ్యాలంటే బడ్జెట్‌ చాలా ఎక్కువ అవుతుంది.  అంత డబ్బుతో ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తే డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కూడా కృష్ణకు వచ్చింది. ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది. అప్పటివరకు భారీ తెలుగు సినిమాలన్నీ ఎక్కువగా స్టూడియోల్లోనే రూపొందేవి. కానీ, తొలిసారి ఒక సినిమాను ఔట్‌డోర్‌లో షూట్‌ చేసేందుకు రెడీ అయ్యారు కృష్ణ. అంతకుముందు ఏ తెలుగు సినిమాలు షూటింగ్‌ చేయని బికనీర్‌ కోట, శివబాడి టెంపుల్‌, దేవికుంట సాగర్‌, సిమ్లా, రాజస్థాన్‌, టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో షూటింగ్‌ చేసిన ఘనత సూపర్‌స్టార్‌ కృష్ణకు దక్కింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే విజయా సంస్థ అధినేత చక్రపాణి ఈ సినిమాకి సంబంధించిన గెటప్స్‌ చూసి ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టం అని చెప్పారు. ఆరోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్‌కి ఒక వేల్యూ ఉండేది. అప్పటికే సగం సినిమా పూర్తయి ఉండడంతో అవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు కృష్ణ.  పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌లో కృష్ణ నిర్మించిన తొలి సినిమా ‘అగ్నిపరీక్ష’. ఈ సినిమా అంతగా ఆడలేదు. దీంతో రెండో సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. షూటింగ్‌ జరిగిన తర్వాత కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని సన్నిహితులు చెప్పడంతో వాటిని రీ షూట్‌ చేసారు. అలాగే క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా రాకపోవడంతో మళ్ళీ తీశారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీ వచ్చిన తర్వాత సన్నిహితులు, శ్రేయోభిలాషుల కోసం ప్రివ్యూ వేశారు కృష్ణ. అక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి సినిమా నచ్చలేదు. ఆడియన్స్‌ ఈ తరహా సినిమాలను ఆదరించడం కష్టం అని చెప్పుకున్నారు. అయితే ఎన్‌.టి.రామరావు మాత్రం వారికి భిన్నంగా సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పి కృష్ణను అభినందించారు. 1971 ఆగస్ట్‌ 27న ‘మోసగాళ్ళకు మోసగాడు’ విడుదలై కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇంగ్లీష్‌ చిత్రాల స్ఫూర్తితో తెలుగులో రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని మళ్ళీ ఇంగ్లీష్‌లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే అక్కడ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు వెర్షన్‌ నిడివి 14,000 అడుగులు. దాన్ని ఇంగ్లీష్‌ వెర్షన్‌ కోసం 9,000 అడుగులకు కుదించి ‘ట్రెజర్‌ హంట్‌’ పేరుతో 80 దేశాల్లో రిలీజ్‌ చేశారు. అలాగే తమిళ్‌, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజుల్లో కలర్‌లో సినిమా తియ్యాలంటే రూ.12 లక్షల వరకు బడ్జెట్‌ అయ్యేది. అలాంటిది కేవలం రూ.7 లక్షల్లోనే 28 రోజుల్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని నిర్మించి సంచలనం సృష్టించారు సూపర్‌స్టార్‌ కృష్ణ.  ఈ సినిమా తర్వాత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలోనే అర్జున్‌ హీరోగా కౌబాయ్‌ నెం.1 అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మరో కౌబాయ్‌ మూవీ ‘కొదమసింహం’. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత 2002లో కృష్ణ తనయుడు మహేష్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ ‘టక్కరిదొంగ’ చిత్రాన్ని రూపొందించారు. ఇది డిజాస్టర్‌ అయింది. ఇక ఆ తర్వాత తెలుగులో కౌబాయ్‌ సినిమాలను నిర్మించే సాహసం ఎవరూ చేయలేదు.

మనసు మీదే మనసు పడిన ‘మనసు కవి’ ఆచార్య ఆత్రేయ!

మనం చేస్తున్న పని సక్సెస్‌ అవ్వాలంటే దాని మీద మనసు పెట్టమని చెబుతారు మన పెద్దలు. అలా చేస్తే విజయం వరిస్తుంది అంటారు. కానీ, ఆయన మాత్రం మనసు కోసమే పనిచేస్తారు. ఆ తర్వాత ఆ మనసు మీదే మనసు పడ్డారు. ఆయనే ఆచార్య ఆత్రేయ. ఆయన అసలు పేరు కిళాంబి వెంకటనరసింహాచార్యులు. పేరులోని చివరి అక్షరాలను ముందుకు తీసుకొచ్చి దానికి తన గోత్రనామాన్ని జోడిరచి ‘ఆచార్య ఆత్రేయ’గా మారారు. మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రమేమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది. మామూలు పదాలు రాసినా పదికాలాల పాటు నిలిచే గీతమయ్యేది. చిన్నతనంలోనే మేనమామ వదదాచార్యులు దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు ఆత్రేయ. నాటకాలు, నాటికలు, కథలు, సినిమాకు పాటలు, కొన్ని సినిమాలకు మాటలు, పాటలు రాశారు. అంతేకాదు, నాటక రంగానికి కూడా ఆయన ఎంతో సేవ చేశారు.  సినిమాల విషయానికి వస్తే దసరాబుల్లోడు, ప్రేమనగర్‌, మూగ మనసులు, మంచి మనసులు, వెలుగునీడలు, ఆరాధన, ఆత్మబలం.. ఇలా ఎన్నో సినిమాల్లో హృదయానికి హత్తుకునే పాటలు రాసి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఆరోజుల్లో ఆత్రేయ రచయితగా ఎంతో పాపులర్‌ అయిపోయారు. రచయిత పేరును చూసి సినిమాకి వెళ్ళడం అనే సంప్రదాయం ఆత్రేయతోనే ప్రారంభమైంది. మనసులోని భావాలను తన పాట రూపంలో ఆవిష్కరించే ఆత్రేయ మనసు కవిగా పేరు తెచ్చుకున్నారు. ‘మరోచరిత్ర’ చిత్రంలోని ‘పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు..’, ‘గుప్పెడుమనసు’ సినిమాలోని ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..’ ‘మూగమనసులు’లోని ‘పాడుతా తీయగా.. చల్లగా..’ వంటి పాటలు జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.  మనిషికీ, మనసుకీ వున్న అనుబంధం గురించి గొప్పగా చెప్పిన రచయితల్లో ఆత్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే! మనసు లేకుండా బతికేయడమంటే అది నరకంతో సమానం ‘సెక్రటరీ’ చిత్రంలోని ‘మనసులేని బతుకొక నరకం..’  పాటలో ప్రియురాలి సొగసును ఎంతగా వర్ణించారో అంతకు రెట్టింపు ఆమెను ఘాటుగా విమర్శించారు. ఇలాంటి పాటలు ఆయన కలం నుంచి ఎన్నో వచ్చాయ. ‘కన్నెమనసు’ లోని ‘ఓ హృదయం లేని ప్రియురాలా..’, ‘అభినందన’ చిత్రంలోని ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం..’, ‘ఆడబ్రతుకు’ సినిమాలోని ‘తనువుకెన్ని గాయాలైనా..’ వంటి పాటల్లో ప్రియురాలిని ఎంత పదునైన మాటలతో దూషించారో తెలుస్తుంది.  ఒక పాట రాయాలంటే ఆత్రేయ ఎంత మనోవేదనకు గురవుతారో, అది ఒక అద్భుతమైన గేయంగా బయటికి రావడానికి ఎంత సమయం తీసుకుంటారో ఆ పాటలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే ఒక పాట రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఆత్రేయ. తన పాటల్లోని వేదనతో ప్రేక్షకుల్ని ఏడిపించే ఆత్రేయ.. ఆ పాటను సరైన సమయంలో ఇవ్వకుండా నిర్మాతను కూడా అంతే ఏడిపిస్తారనే విమర్శ ఆయనపై ఉంది. ఆయన చివరి దశలో ఓసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దాన్ని కూడా ఆయన భావాలతో ముడిపెట్టారు. తనకోసం వచ్చిన వాళ్ళందర్నీ ఉద్దేశిస్తూ ‘ఇన్నాళ్ళూ నేను హృదయం లేని మనిషినంటూ అందరూ నన్ను ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఆత్రేయకు కూడా హృదయం ఉందని రుజువైంది కదా’ అని సరదాగా అన్నారట. అంతే కాదు, ‘నాకూ, చావుకి అస్సలు పడదు... నేనున్న చోటకి అదిరాదు.. అదొస్తే నేనుండను’  అని ఛలోక్తులు విసిరేవారట ఆత్రేయ. ఆ తర్వాత మరణం ఆయనకు చేరువైంది. దాని వల్ల ఆయన మనకు దూరమయ్యారు తప్ప పాటల రూపంలో ఎప్పుడూ అందరి మనసుల్లో జీవించే వుంటారు. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.. వున్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు’ అంటూ జీవిత పరమార్థాన్ని తెలియజెప్పిన ఆచార్య ఆత్రేయ జయంతి మే 7. ఈ సందర్భంగా ఆ మనసు కవికి నివాళులర్పిస్తోంది తెలుగువన్‌.

చిన్న మాటతో 20 ఏళ్ళ స్నేహం విచ్ఛిన్నమైంది.. ఎన్‌.టి.ఆర్‌, విశ్వనాథ్‌ల మధ్య దూరం పెరిగింది!

సినీ పరిశ్రమలో స్నేహాలు, మనస్పర్థలు ఏర్పడడం, అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. ఎన్నో సంవత్సరాలు స్నేహంగా ఉన్నవారు కూడా చిన్న చిన్న కారణాలకు వారి మధ్య దూరాన్ని పెంచుకుంటారు. కొందరు మాత్రం సన్నిహితుల ప్రమేయంతో దూరమైన స్నేహితులతో మళ్ళీ బంధాన్ని కొనసాగిస్తారు. అభిప్రాయ భేదాలు అనేవి హీరోల మధ్య రావచ్చు, హీరో, హీరోయిన్‌ మధ్య రావచ్చు, దర్శకులతో నటీనటులకు రావచ్చు. ఏది ఏమైనా అందరూ సినిమా కోసమే పనిచేస్తారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం ఎప్పటికీ ఆ దూరాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఎన్‌.టి.రామారావు, కె.విశ్వనాథ్‌ల గురించి చెప్పుకోవాలి.  ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ల స్నేహం.. వారు సినిమా పరిశ్రమలోకి రాకముందు నుంచే ఉంది. గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు విశ్వనాథ్‌. ఆయనకు ఎన్టీఆర్‌ ఒక సంవత్సరం సీనియర్‌. విశ్వనాథ్‌ కాలేజీలో ఉండగానే ఎన్టీఆర్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌గా గుంటూరులో జాబ్‌ వచ్చింది. ఉద్యోగరీత్యా ప్రతిరోజూ విజయవాడ నుంచి గుంటూరు ట్రైన్‌లో ప్రయాణించేవారు ఎన్టీఆర్‌. విశ్వనాథ్‌ కాలేజీకి వెళ్లేందుకు అదే ట్రైన్‌ ఎక్కేవారు. తాను చదివిన కాలేజీలోనే విశ్వనాథ్‌ జూనియర్‌ కావడంతో అలా ఇద్దరికీ పరిచయమైంది. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు సినిమాల్లో అవకాశాలు రావడంతో మద్రాస్‌ వెళ్లిపోయారు ఎన్టీఆర్‌. డిగ్రీ పూర్తయిన తర్వాత విశ్వనాథ్‌ వాహినీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. షూటింగ్‌ నిమిత్తం స్టూడియోకి వచ్చే ఎన్టీఆర్‌ని అప్పుడప్పుడు కలుసుకునేవారు విశ్వనాథ్‌. అలా వారు తమ స్నేహాన్ని కొనసాగించారు.  విశ్వనాథ్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా ఆయన రూపొందించిన తొలి చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. ఎస్‌.వి.ఎస్‌. ఫిలిమ్స్‌ బేనర్‌పై మిద్దె జగన్నాథరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌కు జగన్నాథరావు మంచి మిత్రుడు. ఆయన ఎన్టీఆర్‌తోనే వరసగా సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇదే బేనర్‌లో ఎన్టీఆర్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో నిర్మించిన సినిమా ‘నిండు హృదయాలు’. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్‌. ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో హాస్య పాత్ర పోషించిన వాణిశ్రీ తన పక్కన హీరోయిన్‌గా నటించేందుకు ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. వేరే హీరోయిన్ల డేట్స్‌ కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ, దొరకలేదు. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటిస్తున్న ‘ఆత్మీయులు’ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయం ఎన్టీఆర్‌కి చెప్పి వాణిశ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 1969లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఎస్‌.వి.ఎస్‌. ఫిలిమ్స్‌ బేనర్‌లో ఎన్టీఆర్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో ‘నిండు దంపతులు’ మూడో సినిమాగా రూపొందింది. 1971లో విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు.  ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో సినిమా ‘చిన్ననాటి స్నేహితులు’. ఈ చిత్రాన్ని డి.వి.ఎస్‌.రాజు నిర్మించారు. 1971లోనే విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. సినిమాలోని ఓ సెంటిమెంట్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు విశ్వనాథ్‌. అదే సమయంలో సెట్‌కి వచ్చారు ఎన్టీఆర్‌. అయితే ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నారు. షాట్‌ చిత్రీకరిస్తున్నప్పుడు కూడా అదే కళ్ళజోడుతో ఉన్నారు. దానికి విశ్వనాథ్‌ అభ్యంతరం చెప్పారు. ‘ఇలాంటి సెంటిమెంట్‌ సీన్స్‌ చేసేటపుడు కూలింగ్ గ్లాసెస్ తో ఉంటే బాగుండదు’ అని ఎన్టీఆర్‌తో చెప్పారు. విశ్వనాథ్‌ చెప్పినదాన్ని పట్టించుకోకుండా ‘మరేం ఫర్వాలేదు. బాగానే ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్‌. ఈ విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. విశ్వనాథ్‌పై ఎన్టీఆర్‌ మండిపడ్డారు. అప్పుడు నిర్మాత డి.వి.ఎస్‌.రాజు జోక్యం చేసుకొని విశ్వనాథ్‌కి నచ్చజెప్పారు. అంత జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్‌ కూలింగ్ గ్లాసెస్ తోనే ఆ షాట్‌ నటించారు.  ఈ సినిమా తర్వాత ఎస్‌.వి.ఎస్‌. ఫిలింస్‌ నిర్మించ తలపెట్టిన ‘డబ్బుకు లోకం దాసోహం’ చిత్రానికి కూడా విశ్వనాథే దర్శకుడు. ఈ సినిమా కథా చర్చల్లో విశ్వనాథ్‌ పాల్గొన్నారు. కథ తయారయ్యే వరకు ఆ యూనిట్‌లోనే ఉన్నారు. విశ్వనాథ్‌పై ఆగ్రహంతో ఉన్న ఎన్టీఆర్‌ ఆ సినిమా నుంచి అతన్ని తప్పించి యోగానంద్‌ని తీసుకున్నారు. ఇది జరిగిన 14 సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ‘జననీ జన్మభూమి’ చిత్రాన్ని రూపొందించారు కె.విశ్వనాథ్‌. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. 20 ఏళ్ళపాటు ఎంతో స్నేహంగా ఉండటమే కాకుండా ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలకు పనిచేశారు ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌. చిన్న అభిప్రాయ భేదం వల్ల విడిపోయిన వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా చెయ్యలేదు.

తెలుగు సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి 50 ఏళ్ళు!

భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా ఎదిగి బిట్రీష్‌ వారిని గడగడలాడిరచారు. రవి అస్తమించని బిట్రీష్‌ సామ్రాజ్యానికి చుక్కలు చూపించిన మన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖిస్తూ ఇప్పటికీ, ఎప్పటికీ కీర్తించుకుంటున్నాము అంటే ఆ మహావీరుడు దేశమాత స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం, త్యాగాలే కారణం. అంతటి మహనీయుని జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే ప్రయత్నం చాలా కాలం వరకు జరగలేదు. 1974లో సూపర్‌స్టార్‌ కృష్ణ ఆ బృహత్కార్యానికి పూనుకున్నారు. తెలుగు సినిమా పుట్టి దాదాపు 100 సంవత్సరాలు కావస్తున్నా ఆయన నటించి, నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ తప్ప ఆ మన్యం వీరుడి కథతో మరో సినిమా తెలుగులో రూపొందలేదు. 1974 మే 1న విడుదలైన ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం రూపొందడం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం.  అల్లూరి సీతారామరాజు జీవితం తెరపై చూడాలన్న ఆసక్తి సూపర్‌స్టార్‌ కృష్ణకు చదువుకునే రోజుల్లోనే కలిగింది. 12 సంవత్సరాల వయసులోనే అల్లూరి సాతంత్య్ర పోరాటం గురించి చదువుకున్న కృష్ణ ఆయన పోరాట పటిమ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ సమయంలోనే ‘అగ్గిరాముడు’ సినిమాలో 10 నిమిషాలపాటు నాజర్‌ ఆధ్వర్యంలో సీతారామరాజు చరిత్రను బుర్రకథ రూపంలో ప్రదర్శించారు. అది చూసిన తర్వాత ఆయన జీవిత చరిత్రపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు కృష్ణ. అలాంటి వీరుడి కథను సినిమాగా ఎవరైనా తీస్తే చూడాలని అనుకునేవారు. ఒకరోజు ‘జయసింహ’ పాటల పుస్తకాన్ని కొనుక్కున్నారు కృష్ణ. ఆ పుస్తకం వెనుక మా రాబోవు సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటన కనిపించింది. ఇక అప్పటి నుంచి ఎన్‌.టి.రామారావుగారు ఆ సినిమా ఎప్పుడు తీస్తారా.. ఎప్పుడు తెరపై చూసేద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కృష్ణ.  వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచన మొదట చేసింది ఎన్‌.టి.రామారావు. దానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకొని షూటింగ్‌కి వెళ్దామని అనుకుంటున్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకస్మికంగా మరణించారు. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత అక్కినేనితో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. శోభన్‌బాబుతో సీతారామరాజు చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ, అదీ సాధ్యపడలేదు. చివరికి ఈ సినిమా పట్ల చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణకే ఆ అవకాశం దక్కింది. నటుడిగా ఆయన్ని అందనంత ఎత్తులో నిలిపిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. తన కెరీర్‌లో 360 సినిమాలు చేసినప్పటి తనకు ఎంతో నచ్చిన సినిమా ఇదేనని చెప్పేవారు కృష్ణ.   1966లో హీరోగా తెరంగేట్రం చేసిన కృష్ణ హీరోగా బిజీ అయిపోయిన తర్వాత వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కృష్ణ 11వ సినిమా ‘అసాధ్యుడు’ చిత్రంలో నెల్లూరు కాంతారావు.. కృష్ణతో సీతారామరాజు గెటప్‌ వేయించి 10 నిమిషాల ‘బ్యాలే’ చేశారు. అది అందరికీ నచ్చింది. చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత కృష్ణ చాలా సినిమాల్లో నటించారు. కానీ, అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడానికి ఎవరూ ముందుకు రాలేదు. 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ.  ఆ సినిమాలో ఎన్‌.టి.రామారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. దాని తర్వాత తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన అల్లూరి సీతారామరాజు సినిమాపై దృష్టి పెట్టారు కృష్ణ. తనే సొంతంగా ఆ సినిమాను నిర్మించాలనుకున్నారు.  తన 100వ సినిమాగా సీతారామరాజు చరిత్రను సినిమాగా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు కృష్ణ. అప్పట్లో ఈ వార్త ఎంతో సంచలనం సృష్టించింది. ఆ సినిమా స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు కృష్ణ. ఆయన దాన్ని ఓ తపస్సులా భావించారు. ఈ సినిమా కోసం చాలా సినిమాలను వదులుకొని పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో పడిపోయారు. ఈ సినిమాకి మాటలు కూడా ఆయనే రాశారు. ఆ స్క్రిప్టు చదివిన కృష్ణకు ఒక గొప్ప సినిమా తీస్తున్నామనే నమ్మకం కలిగింది. మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఇండోర్‌ సీన్లు చిత్రీకరించి, చింతపల్లి అడవుల దగ్గర ఔట్‌డోర్‌ సీన్లు తీశారు. అప్పటిదాకా కృష్ణ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే.. సీతారామరాజు పాత్ర మరొక ఎత్తు అనే రీతిలో ఆ పాత్రకు జీవం పోశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తప్ప అల్లూరి సీతారామరాజు పాత్రను మరొకరు చెయ్యలేరు అనేంతగా మెప్పించారు.  ‘అసాధ్యుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావునే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కొంత షూటింగ్‌ జరిగిన తర్వాత రామచంద్రరావు ఆరోగ్యం క్షీణించడం మిగిలిన భాగాన్ని కృష్ణ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరించే బాధ్యతను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ తీసుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కృష్ణ. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే దర్శకుడు వి.రామచంద్రరావు మృతి చెందారు. సినిమాలోని ఎక్కువ భాగాన్ని డైరెక్ట్‌ చేసింది కృష్ణే అయినా దర్శకుడు వి.రామచంద్రరావు చివరి కోరిక మేర దర్శకుడిగా ఆయనే పేరునే వేశారు కృష్ణ.  1974 మే 1న ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలైంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రిలీజ్‌ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆదినారాయణరావు బాణీలు సమకూర్చిన తెలుగువీర లేవరా, వస్తాడు నా రాజు, రగిలింది విప్లవాగ్ని ఈరోజు, వీరుడు మరణించడు పాటలు అజరామరంగా నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. మహారథి రాసిన డైలాగ్స్‌ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించాయి. క్లౖెెమాక్స్‌లో కృష్ణ ఆవేశ పూరితంగా చెప్పిన డైలాగ్స్‌, ఆయన నటన రోమాలు నిక్కబొడుచుకొనేలా చేశాయి. శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. 19 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ‘అల్లూరి సీతారామరాజు’ తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యంలా నిలిచింది.  ఈ సినిమా రిలీజ్‌ అయిన పది సంవత్సరాల తర్వాత ఎన్‌.టి.రామారావు మళ్ళీ ఆ సినిమాను చెయ్యాలని ప్రయత్నించారు. ఆ సమయంలోనే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని చూడాలని ఉందని కృష్ణకు చెప్పడం, ఎన్టీఆర్‌ కోసం కృష్ణ ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సీతారామరాజు పాత్రకు కృష్ణ పూర్తి న్యాయం చేశాడని ఎన్టీఆర్‌ ప్రశంసించారు. ఇక ఆ సినిమాను మళ్ళీ చెయ్యాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్‌ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారంటే కృష్ణ.. సీతారామరాజు పాత్రలో ఎంతగా జీవించారో అర్థం చేసుకోవచ్చు.

ట్రిపుల్‌ రోల్స్‌లో నటించిన తెలుగు హీరోలు.. ఎక్కువ సినిమాలు చేసింది ఎవరో తెలుసా?

ఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు చేసే హీరోలను మనం ఇండియాలోనే చూస్తాం. అలాంటి అసాధారణమైన సినిమాలను భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. డూయల్‌ రోల్స్‌ చేయడం అంటే హీరోలకు కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే. అయినా మన హీరోలు అలాంటి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. 1966లో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రంలో ఏకంగా 9 క్యారెక్టర్లలో నటించి ఆరోజుల్లో రికార్డు సృష్టించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తొమ్మిది క్యారెక్టర్లను ఎంతో అద్భుతంగా పోషించారని అప్పట్లో అక్కినేనిని అందరూ ప్రశంసించారు. ఈ సినిమా తమిళ్‌ రీమేక్‌గా వచ్చింది. తమిళ్‌లో ఆ 9 క్యారెక్టర్లను శివాజీ గణేశన్‌ పోషించారు. దాదాపు 42 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌ ‘దశావతారం’ చిత్రంలో ఏకంగా 10 క్యారెక్టర్లు చేసి శివాజీగణేశన్‌ పేరిట ఉన్న రికార్డును క్రాస్‌ చేశారు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటికీ 9 క్యారెక్టర్లు చేసిన అక్కినేనిదే రికార్డు. ఆ తర్వాత ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్లు చేసిన హీరోల గురించి చెప్పుకోవాలంటే తెలుగు హీరోల్లో ఆ ఫీట్‌ సాధించినవారు ఆరుగురు ఉన్నారు. వారిలో మూడు క్యారెక్టర్లు పోషించిన మొదటి హీరోగా ఎన్‌.టి.రామారావు రికార్డు క్రియేట్‌ చేశారు. 1977లో విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు. ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తూ మూడు పాత్రలు చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఎన్‌.టి.రామారావే. ఈ సినిమా ఘనవిజయం సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ‘దానవీరశూర కర్ణ’ ఎవర్‌గ్రీన్‌ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 1979లో మళ్ళీ స్వీయ దర్శకత్వంలోనే ‘శ్రీమద్‌ విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు పోషించారు. కృష్ణుడు, అర్జునుడు, దురోధ్యనుడు, బృహన్నల, కీచకుడు.. ఇలా ఐదు పాత్రలు పోషించి మెప్పించడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.  ‘దానవీరశూర కర్ణ’ చిత్రం విడుదలైన తర్వాతి సంవత్సరమే హీరో కృష్ణ మూడు పాత్రలు పోషించగా రూపొందిన సినిమా ‘కుమార రాజా’. ఈ చిత్రంలో తండ్రిగా, ఇద్దరు కుమారులుగా కృష్ణ నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో మూడు పాత్రలు పోషించిన హీరోగా కృష్ణ రికార్డు సృష్టించారు. ఆయన కెరీర్‌లో ఏడు సార్లు ఈ ఫీట్‌ను సాధించారు. 1982లో విడుదలైన ‘పగబట్టిన సింహం’, ‘డాక్టర్‌ సినీ యాక్టర్‌’ చిత్రాల్లో ట్రిపుల్‌ రోల్‌ చేశారు. వీటిలో ‘పగబట్టిన సింహం’ చిత్రం ఎబౌ ఏవరేజ్‌ అయింది. 1983లో ‘సిరిపురం మొనగాడు’ చిత్రంలో కృష్ణ మూడు పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. 1984లో వచ్చిన ‘రక్త సంబంధం’, ‘బంగారు కాపురం’ చిత్రాల్లో మూడేసి పాత్రలు పోషించారు కృష్ణ. ఇందులో ‘రక్తసంబంధం’ ఫ్లాప్‌ అవ్వగా, ‘బంగారు కాపురం’ జస్ట్‌ ఓకే అనిపించుకుంది. 1997లో చివరిసారి ‘బొబ్బిలిదొర’ చిత్రంలో కృష్ణ మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఇలా ఏడు సార్లు ట్రిపుల్‌ రోల్‌లో నటించి రికార్డు సృష్టించారు కృష్ణ.  1983లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో హీరో శోభన్‌బాబు ట్రిపుల్‌ రోల్‌లో నటించారు. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. 1994లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏవరేజ్‌ మూవీ అనిపించుకుంది. ఆ తర్వాత 2012లో నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రంలో మూడు క్యారెక్టర్స్‌లో నటించారు. ఇది ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. ఇక యంగ్‌ హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆ ఫీట్‌ను సాధించారు. 2017లో విడుదలైన ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషించి అందర్నీ మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్‌ హీరోలు ట్రిపుల్‌ రోల్‌లో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌ సినిమాలుగానే నిలిచాయి. ఈ కేటగిరిలో హిట్‌ అయిన సినిమాలుగా ‘దానవీరశూర కర్ణ’, ‘కుమారరాజా’, ‘జై లవకుశ’ చిత్రాలను చెప్పుకోవచ్చు.

జమున-ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ల మధ్య కోల్డ్‌వార్‌.. ‘గుండమ్మ కథ’ పూర్తి కావడానికి ఏడాది పట్టింది!

ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు రూపొందుతుంటాయి. వాటిలో కొన్ని క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచిపోతాయి. సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి ఎన్నో క్లాసిక్స్‌ వచ్చాయి. తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటాయి ఆ సినిమాలు. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. 1962లో ఈ సినిమా విడుదలైంది. అప్పటికి ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా ఛలామణి అవుతున్నారు. ఆ ఇద్దరిని హీరోలుగా పెట్టి ఓ మంచి సినిమా తియ్యాలంటే దానికి తగిన కథ ఉండాలి. అలాంటి కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో కన్నడలో బి.విఠలాచార్య దర్శకత్వంలో 1958లో రూపొంది ఘనవిజయం సాధించిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమా విజయా ప్రొడక్షన్స్‌ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి బాగా నచ్చింది. దాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ‘మనె తుంబిద హెణ్ణు’ నిర్మాణ సమయంలో విజయా సంస్థ ఆ సినిమా నిర్మాతకు ఎంతో సహకరించింది. ఆ కృతజ్ఞతతో తెలుగు రీమేక్‌ హక్కులను విజయా సంస్థకు ఇచ్చారు. సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు నాగిరెడ్డి తీసుకునేవారు. కానీ, ఫైనల్‌గా చక్రపాణి ఆమోద ముద్ర వేసిన తర్వాతే సినిమా పట్టాలెక్కేది. అయితే కన్నడ చిత్రంలోని కొన్ని అంశాలు చక్రపాణికి నచ్చలేదు. దీంతో సినిమా చేయడం కుదరదని తేల్చి చెప్పారు. కానీ, నాగిరెడ్డికి మాత్రం ఆ సినిమా చెయ్యాలనే ఆసక్తి ఉంది. దాంతో కన్నడ చిత్రంలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చెయ్యాలని చెప్పారు చక్రపాణి. షేక్స్‌ పియర్‌ రచన ‘టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ’ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కథ తయారు చేశారు. ఈ క్రమంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు. అయితే ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చర్చలు జరిగాయి. ఇంకా వేరే పేరెందుకు అదే పేరు పెట్టెయ్యమని చెప్పారు చక్రపాణి. వాస్తవానికి గుండమ్మ అనే పేరు కన్నడలోనే ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత అది తెలుగు పేరులాగే అందరికీ అనిపించింది. సినిమాలో ఇద్దరు అగ్ర కథానాయకులు ఉన్నప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను మొదట బి.ఎన్‌.రెడ్డికి అప్పగించాలనుకున్నారు. కానీ, ఒక రీమేక్‌ సినిమాను బి.ఎన్‌.రెడ్డి వంటి అగ్ర దర్శకుడితో చేస్తే బాగుండదని పుల్లయ్యను ఓకే చేశారు. డి.వి.నరసరాజుతో స్క్రిప్ట్‌ను రెడీ చేయించి ఆయనకు పంపారు. కానీ, తనకు స్క్రిప్ట్‌ నచ్చలేదని చెప్పారు పుల్లయ్య. అప్పుడు కమలాకర కామేశ్వరరావుకు ఆ బాధ్యతను అప్పగించారు. అప్పటివరకు అన్నీ పౌరాణిక చిత్రాలనే రూపొందించిన ఆయనకు అదే తొలి సాంఘిక చిత్రం.  ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, సావిత్రి, జమున ప్రధాన పాత్రల కోసం అనుకున్నారు. కానీ, అప్పటికి మూడేళ్ళ ముందు జమునతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో వారిద్దరూ ఆమెతో కలిసి నటించలేదు. నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి కలిసి ఆ ముగ్గురి మధ్య రాజీ కుదిర్చారు. ఎన్టీఆర్‌కి ‘గుండమ్మకథ’ 100వ సినిమా కాగా, అక్కినేనికి 99వ సినిమా. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి 15 సినిమాల్లో నటించారు. ‘గుండమ్మ కథ’ 10వ సినిమా. సినిమాకి సంబంధించి అంతా సిద్ధంగానే ఉన్నప్పటికీ షూటింగ్‌ మొదలు పెట్టలేదు. దానికి కారణం గుండమ్మ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా రోజులు చర్చలు జరిగాయి. చివరికి సూర్యకాంతంను ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ అప్పటికి చాలా బిజీగా ఉన్నారు. కాల్షీట్లు ఎడ్జస్ట్‌ చేయడం యూనిట్‌కి ఎంతో కష్టమైపోయింది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావడానికి సంవత్సరం పట్టింది. సినిమాలోని ‘కోలో కోలోయమ్మ కోలో నా సామి’ పాటను ఎన్టీఆర్‌, సావిత్రి, ఎఎన్నార్‌, జములపై చిత్రీకరించారు. హీరోలిద్దరూ ఒకే సమయంలో అందుబాటులో లేకపోవడంతో రామారావు, సావిత్రిలపై ఒకసారి, నాగేశ్వరరావు, జమునలపై మరోసారి చిత్రీకరించారు. సినిమాలో మాత్రం ఒకేసారి ఈ పాటను తీసినట్టుగా అనిపిస్తుంది.  ఈ సినిమాలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు రచించగా, ఘంటసాల ఆ పాటలను అద్భుతంగా స్వరపరిచారు. పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇందులోని ‘ప్రేమయాత్రలకు బృందావనము..’ అనే పాట వెనుక ఒక ఆసక్తిరమైన విషయం ఉంది. పాటల రచయిత పింగళి ‘తర్వాతి డ్యూయెట్‌ను ఎక్కడ తీస్తున్నారు’ అని అడిగారు. ‘ఎక్కడో తియ్యడం ఎందుకు.. పాటలో విషయం ఉంటే ఊటీ, కాశ్మీర్‌, కొడైకెనాల్‌ వరకు వెళ్ళక్కర్లేదు.. విజయా గార్డెన్స్‌లోనే తియ్యొచ్చు’ అన్నారట. ఆ మాటలు పింగళిని బాగా ఆకట్టుకున్నాయి. ఆ మాటలకు తగ్గట్టుగానే ‘ప్రేమయాత్రలకు బృందావనము.. నందన వనము ఏలనో’ అనే పల్లవితో రాశారు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 24 సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. సెకండ్‌ రిలీజ్‌లో కూడా భారీగానే వసూళ్ళు సాధించింది. ఈ సినిమా సిల్వర్‌ జూబ్లీ వేడుకను జరపాలని మొదట అనుకున్నారు. కానీ, ఆ వేడుకకు అయ్యే ఖర్చును అప్పటి భారత్‌, చైనా వార్‌ ఫండ్‌కు అందించింది విజయా సంస్థ.

తెలుగు పాట‌కు తొలి జాతీయ అవార్డు అందించిన శ్రీ‌శ్రీ‌.. ఆ పాట‌లో వ్యాక‌ర‌ణ దోషం!

1968లో జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డులు ప్రారంభ‌మైతే ఈ 56 సంవ‌త్స‌రాల్లో నాలుగంటే నాలుగు సార్లు తెలుగు పాట‌కు సాహిత్య‌ప‌రంగా అవార్డులు ద‌క్కాయంటే ఒకింత బాధ క‌లిగించే విష‌య‌మే. 1974లో గేయ‌ర‌చ‌యిత‌గా మ‌హాక‌వి శ్రీ‌శ్రీ తొలి జాతీయ అవార్డును తెలుగు పాట‌కు అందించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంలో శ్రీ‌శ్రీ రాసిన "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.." పాట జాతీయ అవార్డును సాధించింది. ఆ త‌ర్వాత 1993లో 'మాతృదేవోభ‌వ' చిత్రానికి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి రాసిన గీతం "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.." రెండో జాతీయ అవార్డును, తిరిగి 2003లో సుద్దాల‌ అశోక్‌తేజ 'ఠాగూర్' సినిమా కోసం రాసిన "నేను సైతం ప్ర‌పంచాగ్నికి.." పాట మూడో అవార్డును సాధించిపెట్టింది. ఇక 2021లో 'కొండ‌పొలం' సినిమాలో చంద్రబోస్ రాసిన "ధం ధం ధం" గీతం నాలుగో అవార్డును సాధించింది. 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంలో మ‌న్యం ప్ర‌జ‌ల‌ను తిరుగుబాట‌కు ప్రేరేపిస్తూ రామ‌రాజు పాడే మార్చింగ్ సాంగ్‌ను రాయాల్సిందిగా శ్రీ‌శ్రీ‌ని కోరారు కృష్ణ‌. ఉద్విగ్న‌భ‌రిత‌మైన ఆ స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లు అంతే ఉద్వేగ‌భ‌రితంగా "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.. దేశ‌మాత స్వేచ్ఛ‌కోరి తిరుగుబాటు చేయ‌రా.." అంటూ శ్రీ‌శ్రీ రాయ‌డంతో కృష్ణ‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు ఆదినారాయ‌ణ‌రావు కూడా సంబ‌ర‌ప‌డిపోయారు. ఆ పాట‌కు న్యాయం చేయ‌గ‌లిగేది ఘంట‌సాల గాత్ర‌మేన‌ని కృష్ణ త‌ల‌చారు. అయితే అప్పుడు ఘంట‌సాల చాలా అనారోగ్యంతో ఉన్నారు. పాడ‌టం కూడా బాగా త‌గ్గించేశారు. కృష్ణ ఆయ‌న ఇంటికి వెళ్లి మరీ ఈ పాట‌ను పాడాల్సిందిగా కోరారు. ఘంట‌సాల త‌న ప‌రిస్థితి చెప్ప‌గానే, "మీకోసం ఎన్ని నెల‌లైనా ఆగుతాను" అన్నారు కృష్ణ‌. దాంతో ఘంట‌సాల ఆయ‌న మాట‌ను మ‌న్నించి, కాస్త ఆరోగ్యం కుదుట‌ప‌డ‌గానే విజ‌యా గార్డెన్స్‌కు వ‌చ్చి ఆ పాట‌ను పాడారు.  'అల్లూరి సీతారామ‌రాజు' సినిమా విడుద‌ల‌య్యాక "తెలుగువీర లేవ‌రా దీక్ష‌బూని సాగ‌రా.." అంటూ తెలుగువాళ్లంతా ఊగిపోయారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆ పాట‌కు జాతీయ అవార్డు ద‌క్కింది. అప్ప‌టి రాష్ట్రప‌తి జాకిర్ హుస్సేన్ చేతుల‌మీదుగా ఆ అవార్డును అందుకున్నారు శ్రీ‌శ్రీ‌. అయితే ఈ పాట‌లో వ్యాక‌ర‌ణ‌ప‌రంగా ఓ దోషం చోటు చేసుకుంది. పాట బ‌య‌ట‌కు వ‌చ్చేదాకా దాన్ని శ్రీ‌శ్రీ‌తో పాటు చిత్ర బృందం కూడా ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. అదేమంటే.. చర‌ణంలో "ప్ర‌తి మ‌నిషి తొడ‌లుగొట్టి.." అంటూ "సింహాలై గ‌ర్జించాలి" అని రాశారు శ్రీ‌శ్రీ‌. ప్ర‌తి మ‌నిషి అనేది ఏక‌వ‌చ‌నం. సింహాలై అనేది బ‌హువ‌చ‌నం. నిజానికి అక్క‌డ ఉండాల్సింది.. "సింహంలా గ‌ర్జించాలి" అని. ఏదేమైనా తెలుగుపాట‌కు తొలిసారిగా జాతీయ అవార్డును సాధించిపెట్టిన క‌విగా శ్రీ‌శ్రీ చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. (ఏప్రిల్ 30న శ్రీ‌శ్రీ‌ జయంతి)

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌. ఎందుకో తెలుసా?

సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే అది అందరి వల్లా అయ్యేది కాదు. ఎంతో డెడికేషన్‌, పట్టుదల, అన్నింటినీ మించి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అద్భుతాల్ని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి ప్రత్యేకత కలిగిన సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఇలాంటి ఒక మరపురాని సినిమా, చరిత్ర సృష్టించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎంతోమంది శ్రమ, కృషి దాగి వున్నాయి. ఈ అద్భుత చిత్రరాజం ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసి 34 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాకి వన్నె తగ్గలేదు. ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది. ఈ కథకు పాత, కొత్త అనే తేడా లేదు. ఎన్ని జనరేషన్లు మారినా, కొత్త ట్రెండ్లు ఎన్ని వచ్చినా, ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నిలిచిందంటే దానికి కారణం నిత్యనూతనంగా ఉండే కథావస్తువుతో ఈ చిత్రం రూపొందడమే. రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 13 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇది అప్పటికి ఇండస్ట్రీ రికార్డు. నందమూరి తారక రామారావు, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అడవిరాముడు’ 70వ దశకంలో ఇలాంటి రికార్డును సాధించింది. ఆ సినిమా తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఆ స్థానాన్ని దక్కించుకుంది.  ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ తన వైజయంతి మూవీస్‌ బేనర్‌పై నిర్మించిన సి.అశ్వినీదత్‌కి ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉండేది. అదే ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’. ఎప్పటికైనా తన బేనర్‌లో అలాంటి సినిమా తియ్యాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది. చిరంజీవితో ఆ సినిమా చెయ్యాలని అనుకునేవారు. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమా చెయ్యాలనుకున్నారు దత్‌. ఒక మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావును, రచయిత శ్రీనివాస చక్రవర్తిని తిరుపతి పంపించారు. అశ్వనీదత్‌ ఎలాంటి సినిమా తియ్యాలనుకుంటున్నారో, ఎలాంటి కథ అయితే రాఘవేంద్రరావు పూర్తి న్యాయం చెయ్యగలుగుతారో శ్రీనివాస చక్రవర్తికి తెలుసు. తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్‌ను రాఘవేంద్రరావుకి చెప్పారు శ్రీనివాస్‌. ‘ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది. ఆ సమయంలో ఆమె వేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరుకుతుంది’ ఇదీ లైన్‌. ఈ లైన్‌ రాఘవేంద్రరావుకి, అశ్వినీదత్‌కి, చిరంజీవికి నచ్చింది. ఆ ఒక్క లైన్‌ తప్ప పూర్తి కథగా శ్రీనివాస చక్రవర్తి దగ్గర లేదు. అప్పుడు అశ్వినీదత్‌ మద్రాస్‌లోని తన కొత్త ఆఫీస్‌ను ఈ సినిమా స్టోరీ డిస్కషన్‌కు సిద్ధం చేశారు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్‌, సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్‌, క్రేజీ మోహన్‌, శ్రీనివాస చక్రవర్తి ఈ కథ మీద కూర్చున్నారు. నెలరోజులపాటు చర్చించి కథను ఓ కొలిక్కి తెచ్చారు. ఈ డిస్కషన్స్‌కి చిరంజీవి కూడా వెళ్లి తనకు తోచిన సలహాలను ఇచ్చారు. మొత్తానికి కథ సిద్ధమైంది. మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్‌ ‘భూలోక వీరుడు’. ఆ తర్వాత ‘జగదేక వీరుడు’ అనుకున్నారు. ఇందులో దేవకన్య పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ‘అతిలోక సుందరి’ అని చేర్చారు. మరి ఈ జగదేకవీరుడికి అతిలోక సుందరిగా నటించేదెవరు? అనే ప్రశ్నకు శ్రీదేవి రూపంలో వెంటనే సమాధానం దొరికింది. ఒక క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. తన క్యారెక్టర్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ముంబాయిలో తనే దగ్గరుండి సిద్ధం చేయించారు శ్రీదేవి.  ఈ సినిమా కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 6 పాటల్ని రికార్డ్‌ చేశారు ఇళయరాజా. ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.చలం ఆధ్వర్యంలో మానససరోవరం, దేవలోకం, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌.. ఇలా 7 భారీ సెట్స్‌ నిర్మించారు. షూటింగ్‌ ప్రారంభించే సమయానికి సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. దీంతో బెంగళూరులో ముహూర్తం షాట్‌ను చిత్రీకరించడం ద్వారా లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. కన్నడ హీరో రవిచంద్రన్‌ ఫస్ట్‌ షాట్‌కి క్లాప్‌నివ్వగా, ఎ.కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేశారు. 1990 మే 9న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది. మొదటి మూడు రోజులు సినిమాకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చిందన్న విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రిలీజ్‌ సమయానికి ఆంధ్రప్రదేశ్‌ తుపాన్‌ తాకిడికి గురైంది. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌ సరిగా లేని కారణంగా చాలా సెంటర్స్‌కి ప్రింట్లు ఆలస్యంగా వెళ్ళాయి. మ్యాట్నీ నుంచి ప్రదర్శన మొదలు పెట్టారు. జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కలెక్షన్లు చాలా మందకొడిగా ఉన్నాయి. దీంతో నిర్మాత అశ్వినీదత్‌ షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే ఉన్నదంతా సినిమాకే పెట్టేశారు. కాస్త అటూ ఇటూ అయితే మళ్ళీ తన కెరీర్‌ను జీరో నుంచి స్టార్ట్‌ చెయ్యాలి. మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌తోనే రన్‌ అయింది. నాలుగో రోజు నుంచి సినిమా స్టామినా ఏమిటో అందరికీ అర్థమైంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకొని మరీ థియేటర్లకు వచ్చారు. శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌ వర్షం నీటితో ఉంది. జనం సినిమా చూస్తుంటే ఫైరింజన్ల సాయంతో థియేటర్‌లోని వర్షం నీటిని బయటకు తోడారు. అంతటి భారీ వర్షాల్లో సైతం ‘జగదేక వీరుడు’ అతిలోక సుందరి’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఈ సినిమా కథాకథనాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వాటికి తగ్గట్టు వేటూరి రాసిన పాటలు, ఇళయరాజా సంగీతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇక చిరంజీవి సినిమాల్లో ఉండే రెగ్యులర్‌ స్టెప్స్‌ ఈ సినిమాలో లేకపోయినా ప్రేక్షకులకు అవి కొరతగా కనిపించలేదు. ఈ సినిమాకి నటీనటుల నుంచి మొదలుకొని టెక్నీషియన్స్‌ వరకు అన్నీ కలిసొచ్చాయి. అందరి కృషికీ తగిన ఫలితం లభించింది. సమిష్టి కృషితో భారీ ఘనవిజయాన్ని సాధించవచ్చు అని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ టీమ్‌ నిరూపించింది. ఈ సినిమా 46 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ శతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అశ్వినీదత్‌.  ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజా, ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా స్వామినాథన్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా సుందరం, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎం.కృష్ణ, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బి.చలం నంది అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా కె.రాఘవేంద్రరావు ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా చివరలో దేవకన్య ఉంగరాన్ని ఒక చేప మింగినట్టు చూపించడం ద్వారా సినిమాకి  సీక్వెల్‌ ఉండే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు రాఘవేంద్రరావు. సీక్వెల్‌ చేసే ఉద్దేశం తనకు కూడా ఉందని నిర్మాత అశ్వినీదత్‌ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2020 ప్రాంతంలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జంటగా సీక్వెల్‌ చేసేందుకు అశ్వినీదత్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేయడం ద్వారా ఆ ఊహాగానాలకు తెరదించారు అశ్వినీదత్‌.

9 భాషల్లో రీమేక్‌ అయిన ఏకైక ఇండియన్‌ మూవీ గురించి తెలుసా?

నిర్మాత యం.యస్‌.రాజు తన కెరీర్‌లో చేసిన సూపర్‌హిట్‌ సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ ఒకటి. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై 2005లో ఆయన నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. సిద్ధార్థ్‌, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో రియల్‌స్టార్‌ శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు. 2004లో ప్రభాస్‌, త్రిష జంటగా నటించిన ‘వర్షం’ చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..’ పాటనే టైటిల్‌గా పెట్టి రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు దేవిశ్రీప్రసాదే సంగీతాన్ని అందించడం విశేషం.  ప్రేమజంటగా సిద్ధార్థ్‌, త్రిష ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తారు. వారి కెమిస్ట్రి కూడా బాగా వర్కవుట్‌ అయింది. ఇక హీరోయిన్‌ అన్నయ్య పాత్ర పోషించిన శ్రీహరికి ఇది ఒక మైల్‌స్టోన్‌లాంటి సినిమా. హీరో తండ్రిగా నటించిన ప్రకాష్‌రాజ్‌ ఈ సినిమాలో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఎంతో ఆసక్తికరంగా సాగే కథ, కథనాలతో ఆద్యంతం అద్భుతంగా రూపొందించారు ప్రభుదేవా. సిద్ధార్థ్‌, త్రిషల మధ్య సాగే ప్రేమను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అనవసరమైన సన్నివేశం అంటూ లేని సినిమా ఇది. ప్రతి సీన్‌ సినిమాకి ఇంపార్టెంటే అనిపిస్తుంది.  ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు 9 ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకున్న ఏకైక సౌత్‌ సినిమాగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ రికార్డు క్రియేట్‌ చేసింది. అంతేకాదు ఈ సినిమా 5 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఉత్తమ నటిగా త్రిష, ఉత్తమ సహాయనటుడిగా శ్రీహరి, ఉత్తమ కమెడియన్‌గా సంతోషి నంది అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు దర్శకుడుగా ఇదే మొదటి సినిమా. అప్పటికి ‘బాయ్స్‌’ అనే డబ్బింగ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్‌కి తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాతో తెలుగులోనూ అతనికి మార్కెట్‌ వచ్చింది. త్రిష ఈ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇక అప్పటివరకు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సమయానికి ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతోనే శ్రీహరి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ తీసుకున్నారు. అన్నింటినీ మించి 9 భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. అన్ని భాషల్లో రీమేక్‌ అయిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సినిమా. సాధారణంగా ఎంత పెద్ద హిట్‌ అయిన సినిమా అయినా నాలుగైదు భాషలకు మించి రీమేక్స్‌ ఉండవు. కానీ, ఈ సినిమాను 9 భాషల్లో రీమేక్‌ చేశారంటే దానికి కారణం యూనివర్సల్‌గా ఉన్న స్టోరీ పాయింట్‌. ఈ చిత్రానికి వీరు పోట్ల కథను అందించారు. 1989లో సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జంటగా రూపొందిన ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ చిత్ర కథను తయారు చేశారు వీరు పోట్ల. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన తర్వాతి సినిమా ‘పౌర్ణమి’ నిర్మించారు యం.యస్‌.రాజు.  కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్‌ రెండున్నర కోట్లు. అయితే ప్రభుదేవా ప్రతి సీన్‌ని ఎంతో అందంగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తం 100 రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. రూ.4 కోట్లు బడ్జెట్‌ అయింది. 2005 జనవరి 14న సంక్రాంతి కానుకగా 90 ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్‌ అయింది. నాలుగు వారాల్లో 160 ప్రింట్లకు చేరింది. 80 సెంటర్లలో 50 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమైంది. రూ.24 కోట్లు గ్రాస్‌, రూ.16 కోట్లకుపైగా షేర్‌ కలెక్ట్‌ చేసి 2005లోని టాప్‌ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’.  ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో, 2 విదేశీ భాషల్లో రీమేక్‌ అయింది. ఈ సినిమా ఏయే భాషల్లో రీమేక్‌ అయ్యిందో చూద్దాం. ఉనక్కం ఎనక్కం(తమిళం), నీనెల్లో నానల్లే(కన్నడ), ఐ లవ్‌ యు(బెంగాలీ), నింగోల్‌ తజబ(మణిపురి), సునా ఛాదీ మో రూపా ఛాదీ(ఒడియా), తేరా మేరా కీ రిష్తా(పంజాబీ), రామయ్య వస్తావయ్యా(హిందీ), నిస్సా అమర్‌ తుమీ(బంగ్లాదేశ్‌ బెంగాలీ), ది ఫ్లాష్‌ బ్లాక్‌: ఫర్కెరా హెర్దా(నేపాలీ).. ఇలా 9 భాషల్లో రీమేక్‌ అయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్‌ చిత్రంగా నిలవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి.

లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించని ఒకప్పటి బాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

బాలీవుడ్‌లో ఒకప్పటి టాప్‌ సింగర్స్‌ ఎవరూ అంటే ఠక్కున లతా మంగేష్కర్‌, మహ్మద్‌ రఫీ, కిషోర్‌కుమార్‌, ముఖేష్‌, ఆశా భోస్లే.. ఇలా ఓ పది మంది పేర్లు చెబుతాం. అలాగే బాలీవుడ్‌లోని టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఎవరు అంటే.. ఎస్‌.డి.బర్మన్‌, శంకర్‌ జైకిషన్‌, ఖయ్యాం, రవీంద్రజైన్‌, ఆర్‌.డి.బర్మన్‌లతోపాటు ఒ.పి.నయ్యర్‌ పేరు కూడా వినిపిస్తుంది. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరూ పైన చెప్పుకున్న టాప్‌ సింగర్స్‌తో పాటలు పాడించారు ఒక్క ఒ.పి.నయ్యర్‌ తప్ప. అవును. ఇది నిజమే. భారతదేశం గర్వించదగిన సింగర్‌, భారతరత్న, దాదా సాహెఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు లత. అంతేకాదు కోట్లాది మంది సంగీత సంగీత ప్రియుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నేటింగేల్‌ ఆఫ్‌ ఇండియా లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించకుండా టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడం సాధ్యమేనా?.. తనకు సాధ్యమేనని ప్రూవ్‌ చేశారు ఓంకార్‌ ప్రసాద్‌ నయ్యర్‌.  లాహోర్‌లోని ఓ రేడియో స్టేషన్‌లో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఒ.పి.నయ్యర్‌ ఆ తర్వాత ముంబై చేరుకొని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1952లో వచ్చిన ‘ఆస్మాన్‌’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో సంగీత దర్శకుడుగా పరిచయమయ్యారు. అప్పటివరకు ఉన్న సంగీత దర్శకుల సంగీతానికి భిన్నంగా స్వరాలను సమకూర్చడం, ఆర్కెస్ట్రాను కూడా విభిన్నంగా కండక్ట్‌ చేయడం వంటి వినూత్న ప్రక్రియల వల్ల అనతికాలంలోనే సంగీత దర్శకుడిగా మంచి పేరు, రిథమ్‌ కింగ్‌ అనే బిరుదును సంపాదించుకున్నారు. 1956లో వచ్చిన ‘సిఐడి’ చిత్రంలోని పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఆ సినిమాతో ఒ.పి.నయ్యర్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయారు. ఎంతమందిలో ఉన్నా ఒ.పి.నయ్యర్‌ను ఇట్టే గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే నెత్తిమీద ఎప్పుడూ హ్యాట్‌తో డిఫరెంట్‌ గెటప్‌తో ఉంటారాయన. అలాగే ఎన్ని పాటల మధ్యలోనైనా ఇది ఒ.పి.నయ్యర్‌ స్వరపరచిన పాట అని సంగీత ప్రియులెవరైనా ఇట్టే చెప్పగలరు. అలా తన సంగీతానికి ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నారు నయ్యర్‌.  ఒ.పి.నయ్యర్‌ చేసిన పాటల్లో పెద్ద విజయం సాధించిన పాటలు కోకొల్లలు. ‘ఓ లేకే పహలా పహలా ప్యార్‌’, ‘పుకార్‌తా ఛలా హూ మై..’, ‘బాబూజీ ధీరే ఛల్‌నా..’, ‘మై ప్యార్‌ కా రాహీ హూ..’, ‘దీవాన హువా బాదల్‌’ వంటి పాటలు మచ్చు తునకలు మాత్రమే. 1951, 1970 మధ్యలో అప్పటి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒ.పి.నయ్యర్‌ ఒకరు. 1994 వరకు కొనసాగిన తన కెరీర్‌లో కొన్ని వందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్స్‌లో ఒకరైన ఆశా భోంస్లే.. ఒ.పి.నయ్యర్‌ సంగీతంలో పాడిన పాటల ద్వారానే టాప్‌ సింగర్‌గా ఎదిగారు. ఆయన సంగీత దర్శకత్వంలో అప్పటి టాప్‌ సింగర్స్‌ అందరూ పాడారు. కానీ, లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించలేదు నయ్యర్‌. మ్యూజిక్‌ ఇండస్ట్రీలో ఉంటూ అందులో టాప్‌ పొజిషన్‌లో ఉన్న సింగర్‌తో పాడించకుండా సంగీత దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకోవడం ఒ.పి.నయ్యర్‌కే సాధ్యమైంది. అంతేకాదు, నయ్యర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు మహ్మద్‌ రఫీతో కూడా పాడించలేదు. ఆ సమయంలో మహేంద్రకపూర్‌కి అవకాశాలు ఇచ్చారు  ఇక దక్షిణ భారతదేశంలోని సినిమా సంగీతంపై ఒ.పి.నయ్యర్‌ ప్రభావం బాగా ఉండేది. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ నయ్యర్‌ ప్రభావంతో చేసిన పాటే. ఎంతో గొప్ప సంగీతదర్శకులైన ఎం.ఎస్‌. విశ్వనాథన్‌.. నయ్యర్‌ ప్రభావంతో చాలా పాటలు చేశారు. ఇళయరాజా పగలిల్‌ ఒరు ఇఱవు సినిమాలో చేసిన అద్భుతమైన పాట ‘ఇళమై ఎనుం పూంగార్ట్రు పాడియదు ఓర్‌ పాట్టు’ పాటకు నయ్యర్‌ ‘జాయియే ఆప్‌ కహా జాయేంగే’’ పాట స్ఫూర్తినిచ్చిందేమో అని అనిపిస్తుంది. సత్యం, మణిశర్మ వంటి సంగీత దర్శకులు కూడా నయ్యర్‌ ప్రభావంతో పాటలు చేశారు. ఒ.పి.నయ్యర్‌ తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ‘నీరాజనం’. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. దీనికి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నయ్యర్‌. భారతదేశంలో మహ్మద్‌ రఫీ తర్వాత అంతటి గొప్ప గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అని ఒ.పి.నయ్యర్‌ ప్రశంసించడం అప్పట్లో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు.

పొగరుతో అవకాశాన్ని కాలదన్నాడు.. అదృష్టం అతన్నే వరించింది.. ఆ సినిమాకి 11 ఆస్కార్లు వచ్చాయి!

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కళాకారులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. కానీ, కొందరు నటీనటులు మాత్రం అతిగా ఆలోచించడం వల్ల, పొగరు వల్ల కొన్ని క్యారెక్టర్స్‌ని చేజేతులా జారవిడుచుకుంటారు. ఆ తర్వాత తాము వదులుకున్న క్యారెక్టర్‌ని వేరే ఆర్టిస్టులు చేసి సక్సెస్‌ అయితే బాధతో కుంగిపోతారు. ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు. ఇప్పుడు స్టార్‌ హీరోలుగా ఛలామణి అవుతున్న చాలా మంది హీరోలు అలాంటి తప్పులు చేసినవారే. అయితే అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది. వారు చేసే పొరపాట్లను అది సరిచేస్తూ ముందుకు నడిపిస్తుంది. అయితే అందరి విషయంలో అలా జరిగే అవకాశం లేదు. కొందరు వారి ప్రవర్తన వల్ల అధోగతి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట చెప్పుకున్న అదృష్టవంతుల జాబితాలోకి ‘టైటానిక్‌’ హీరో లియోనార్డో డికాప్రియో  కూడా వస్తాడు.  ప్రపంచ సినీ చరిత్రలో ఓ మరపురాని ప్రేమకావ్యంగా నిలిచిన చిత్రాల్లో ‘టైటానిక్‌’ ఒకటి. లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్‌స్లెట్‌ జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్లపరంగా, అవార్డుల పరంగా చరిత్ర సృష్టించింది. రోజ్‌గా కేట్‌ విన్‌స్లెట్‌, జాక్‌గా డికాప్రియో నటన అందరి మనసుల్ని దోచుకుంది. ఈ సినిమాతో డికాప్రియో అమ్మాయిల పాలిట డ్రీమ్‌బాయ్‌గా మారిపోయాడు. ఇంతటి సంచలనం సృష్టించిన సినిమాలో వచ్చిన అవకాశాన్ని తన పొగరుతో చేజార్చుకునే పరిస్థితి నుంచి అదృష్టం అతన్ని వెనక్కి లాగింది. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం.  1980లో కమర్షియల్‌ యాడ్స్‌లో నటించడం ద్వారా కెరీర్‌ ప్రారంభించిన డికాప్రియో ఆ తర్వాత కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాల్లో కనిపించాడు. 1991లో అతను నటించిన మొదటి సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఐదేళ్ళలో 9 సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టిన ‘టైటానిక్‌’ చిత్రంలోని జాక్‌ పాత్ర కోసం స్క్రీన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు కామెరూన్‌. అందులో భాగంగానే ఎంతో మంది నటులతోపాటు డికాప్రియోను కూడా పిలిపించారు. అప్పటికే టెర్మినేటర్‌, అబిస్‌, అలియెన్స్‌, ట్రూ లైస్‌, టెర్మినేటర్‌ 2 వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కావడంతో ఆ స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చేందుకు డికాప్రియో ఉత్సాహం చూపించాడు. తను ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి అవకాశం తనకే వస్తుందన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అతనిలో ఉంది. అయితే కామెరూన్‌ చెప్పిన డేట్‌కి కాకుండా రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు. అది కామెరూన్‌కి కోపం తెప్పించినా ఓపిక పట్టాడు. డికాప్రియో రాగానే స్క్రిప్ట్‌ అతని చేతికి ఇచ్చి చదవమన్నాడు కామెరూన్‌. తను ఆర్టిస్టుగా ప్రూవ్‌ చేసుకున్నాడు. అయినా తనని స్క్రిప్ట్‌ చదవమని ఇవ్వడం అతనికి నచ్చలేదు. తను చదవను అని దురుసుగా చెప్పాడు. దాంతో కామెరూన్‌కి కోపం వచ్చింది. ‘స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక బయల్దేరవచ్చు’ అని చెప్పాడు. డికాప్రియో కూడా కోపంగా వెనుదిరిగాడు. ఆ రూమ్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత కాస్త ఆలోచించి.. మళ్ళీ వెనక్కి వచ్చి  ‘స్క్రిప్ట్‌ చదవకపోతే.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వరా?’ అని ప్రశ్నించాడు. దానికి కామెరూన్‌ ‘ఎస్‌’ అని సమాధానమిచ్చాడు. దాంతో ఏమనుకున్నాడో ఏమో సైలెంట్‌గా కామెరూన్‌ చెప్పినట్టే చేశాడు. అంతే.. ‘టైటానిక్‌’లో హీరోగా సెలెక్ట్‌ అయిపోయాడు. ఆ తర్వాత సినిమా ఎలా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించింది అనే విషయం అందరికీ తెలిసిందే. అలా పొగరుతో అక్కడి నుంచి వెళ్లిపోవాలకున్న డికాప్రియోను అదృష్టమే వెనక్కిలాగి బంగారు భవిష్యత్తును అందించింది.

సిల్క్‌స్మిత చేసిన పనికి చిరంజీవి ఆ పాటను ముగ్గురితో చెయ్యాల్సి వచ్చింది!

ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారన్న విషయం తెలిసిందే. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత, డిస్కో శాంతి, అనురాధ..లాంటి డాన్సర్స్‌ ఐటమ్‌ సాంగ్స్‌లో నటించి ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేవారు. అప్పట్లో టాప్‌ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఉండేవి. తర్వాతి కాలంలో ఐటమ్‌ సాంగ్స్‌ను హీరోయిన్స్‌తోనే చేయిస్తూ వాటిని స్పెషల్‌ సాంగ్స్‌గా ఛలామణిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఐటమ్‌ సాంగ్స్‌లో హీరోతోపాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్‌ ఉండేవారు. కానీ, చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘కొండవీటి రాజా’ చిత్రంలోని ‘యాల యాలా.. ఉయ్యాలలోనా..’ అనే ఐటమ్‌ సాంగ్‌ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్‌తో చేశారు. అయితే ఇది కావాలని చేసింది కాదు. ఈ ఐటమ్‌సాంగ్‌ను అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే... ఈ ఐటమ్‌ సాంగ్‌ను భారీగా తియ్యాలని కె.రాఘవేంద్రరావు ప్లాన్‌ చేశారు. ఈ సాంగ్‌లో నటించేందుకు సిల్క్‌ స్మితను సెలెక్ట్‌ చేసుకున్నారు. రూ.25 వేలు రెమ్యునరేషన్‌ కూడా ముందుగానే చెల్లించారు. అంతేకాదు, కాస్ట్యూమ్స్‌ కోసం రూ.20వేలు అదనంగా ఇచ్చారు. చెన్నయ్‌లోని వాహిని స్టూడియోలో రూ. 5 లక్షల ఖర్చుతో భారీ సెట్‌ వేశారు. ఆరోజుల్లో సిల్క్‌స్మిత హవా నడుస్తోంది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమెతో సినిమా చెయ్యాలంటే కొన్ని నెలల ముందుగానే కాల్షీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగానే స్మిత కాల్షీట్లు నాలుగు నెలల ముందుగానే తీసుకుంది చిత్ర యూనిట్‌. షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ ప్రారంభించారు.  కాల్షీట్స్‌ ప్రకారం ఆరోజు ఉదయమే సెట్‌కి వచ్చింది స్మిత. ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్‌ అయ్యారు. అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా ఉంది. హెయిర్‌ స్టైల్‌ చాలా చిందరవందరగా ఉంది. పాటల చిత్రీకరణ విషయంలో, హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలుసిన విషయమే. అందుకే ఆమె గెటప్‌ ఆయనకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్‌ స్టైల్‌ మార్చమన్నారు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్‌ చెబితే టాప్‌ హీరోయిన్‌ అయినా సరే దాన్ని పాటించాల్సిందే. కానీ, స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. పైగా హెయిర్‌ స్టైల్‌ బాగానే ఉందంటూ వాదించింది. ఆమెతో డిస్కస్‌ చేయడం ఇష్టంలేని రాఘవేంద్రరావు పాటను తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆరోజంతా యూనిట్‌లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత. పాటలోని కొంత భాగాన్ని పొగమంచులో తియ్యాల్సి ఉంది. షాట్‌కి ముందు పొగమంచును స్ప్రెడ్‌ చేశారు టెక్నీషియన్స్‌. ఆ సమయంలోనే ఫ్యాన్‌ వేసుకొని కూర్చుంది స్మిత. దాంతో పొగమంచు వీడిపోయింది. ఆ కారణంగా షూటింగ్‌ మరింత ఆలస్యమైంది. ఇదంతా నిర్మాత దేవివరప్రసాద్‌ గమనిస్తున్నారు. షూటింగ్‌కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన. మరుసటిరోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. పైగా డైరెక్టర్‌ని కూడా తన మాటలతో అవమానించిందట. దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు. రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి, మరో చరణం బ్యాలెన్స్‌ ఉన్నాయి. పల్లవిని జయమాలినితో, మరో చరణాన్ని అనురాధతో తీశారు. అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది. మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది. అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు. ఆ చరణాన్ని మరో డాన్సర్‌తో తీస్తే కావాలనే ముగ్గురితో పాట చేశారనే ఫీలింగ్‌ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు. ఈ ఐటమ్‌ సాంగ్‌ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ ఏడిద నాగేశ్వరరావు

అనేక కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు సొంతం. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన క్లాసిక్ సినిమాల నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో 'లోభి' అనే నాటకంలో తొలిసారిగా అమ్మాయి వేషం వేశారాయన. దానికి రజత పతకం అందుకోవడంతో నటనపై మక్కువ పెరిగింది. అలా నాటకాల వైపు జీవిత పయనం సాగింది. అది ఎక్కడిదాకా వెళ్లింది అంటే మద్రాసు రైలెక్కి చెన్నపట్నం చేరేదాకా వెళ్లింది. చిన్నాచితకా వేషాలు వేస్తూ బతుకు బండి సాగించారు. భుక్తి కోసం డబ్బింగ్ కూడా చెప్పాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో గీతాకృష్ణా కంబైన్స్ బ్యానర్ మీద 'సిరిసిరి మువ్వ' చిత్ర నిర్మాణాన్ని 1976లో చేపట్టారు. ఆ సినిమా ఘనవిజయంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి 'తాయారమ్మ బంగారయ్య' నిర్మించారు . అది కూడా ఘనవిజయం సాధించింది. కళా తపస్వి కె. విశ్వనాధ్ తో 'సిరిసిరి మువ్వ' నుంచి ఉన్న అనుబంధం 'శంకరాభరణం' వైపు దారి చూపింది. దాంతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. అటు కలెక్షన్ల పరంగా ఇటు సంగీతపరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే.. ఏ చోట విన్నా బాలు పాటే. ఆ తర్వాత 'సీతాకోకచిలుక' అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అనేక ప్రేమ కథా చిత్రాలకు ఇది ప్రేరణ అనడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏ చిత్ర నిర్మాణం చేపట్టినా అది హిట్ల బాటే. కమలహాసన్, కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో 'సాగర సంగమం' మరో క్లాసికల్ మూవీ అయ్యింది. కమల్ నటనకు జనం నీరాజనం పట్టారు. తెలుగు, తమిళం, మలయాళం లో ఒకే సారి విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 'సితార'కు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా తన వద్ద అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి మరీ ఈ సినిమా నిర్మించారు. సుమన్, భానుప్రియ జంటగా రూపొందిన ఆ సినిమా కూడా మరో క్లాసిక్. జాతీయ అవార్డును సైతం సాధించిపెట్టింది. 'స్వాతిముత్యం' గురించి ప్రత్యేకించి చెప్పే పనే లేదు. కమల్ హాసన్, రాధిక జంటగా రూపొందిన ఈ సినిమాకి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులనూ తిరగరాసింది. అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సైతం ఈ సినిమా సంపాదించి పెట్టింది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డు అయిన ఆస్కార్ కు మన దేశం తరఫున ఎంపికైన ఘనత కూడా ఈ తెలుగు సినిమా దక్కించుకుంది. ఆయన నిర్మించిన ప్రతి సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి. అలాగని కమర్షియల్ అంశాలను కోల్పోలేదు. క్లాసికల్ గా ఈ తరహా కమర్షియల్ తీయవచ్చని ఏడిద నాగేశ్వరరావు నిరూపించారు. అప్పటిదాకా ఆయన కమల్ హాసన్ తోనే ఎక్కువగా సినిమాలు చేశారు. తెలుగులో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాలు తీయాలన్న సంకల్పం ఆయనను 'స్వయంకృషి' వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా కొత్త చిరంజీవిని ప్రజలకు పరిచయం చేసింది. చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రను చిరంజీవి అంగీకరించడమూ సాహసమే. చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటిసారిగా నంది అవార్డును ప్రసాదించిన సినిమా ఇది. మెగాస్టార్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి 'ఆపద్బాంధవుడు'గా చూపారు. తన కుమారుడు ఏడిద శ్రీరాంను హీరోగా చేసి తీసిన 'స్వరకల్పన' మోస్తరుగా ఆడింది. ఆయన మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.. మనల్ని పరవశింపజేస్తూనే ఉంటాయి.  - ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జయంతి

దేశవ్యాప్తంగా ఆ సినిమాపై నిరసనలు, దాడులు.. అయినా కాసుల వర్షం కురిసింది.. అవార్డుల పంట పండింది.!

మన భారతీయ సినిమాలకు ఒక ఫార్మాట్‌ ఉంది. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఓవరాల్‌గా ఇండియన్‌ ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడతారు. కొన్నిసార్లు కొత్తదనంతో కూడిన కథలను, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను సైతం ఆదరిస్తారు. భారతదేశంలో సినిమా పుట్టినప్పటి నుంచి దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అప్పుడప్పుడు వాటిని బ్రేక్‌ చేసేందుకు కొందరు దర్శకులు ప్రయత్నించారు. అయితే వారిలో కొందరు సక్సెస్‌ అయితే మరికొందరు మరుగున పడిపోయారు. రెండున్నర గంటల నిడివి ఉండే సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు, వారికి కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కావాలా లేక ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించినా చూస్తారా? అనే విషయంలో కొందరు దర్శకులకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం సమాజాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కథను రెడీ చేసి సినిమాగా తీస్తే ఆదరణ ఉండదని, అంతర్లీనంగా ఒక మంచి కల్పిత కథను కూడా జోడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కొందరు దర్శకులు ప్రూవ్‌ చేశారు. అలాంటి వారిలో మణిరత్నం ప్రథముడు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా తను చేసే సినిమా ఒక విజువల్‌ వండర్‌గా ఉండాలని కోరుకునే దర్శకుడు మణిరత్నం. తను చేసిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయినా ఆడియన్స్‌ మాత్రం మణిరత్నంకి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులే వేస్తారు. తను చేసిన ప్రతి సినిమాకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో దేశంలో అనిశ్చితి నెలకొన్నప్పుడు కూడా కొన్ని సున్నితమైన అంశాలను తీసుకొని ఎంతో ధైర్యంగా సినిమాలు తీశారు మణిరత్నం. అలాంటి వాటిలో రోజా, బొంబాయి వంటి సినిమాల గురించి మొదట చెప్పుకోవాలి.  డిసెంబర్‌ 6, 1992. దేశాన్ని మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా కుదిపేసిన రోజు. ఎన్నాళ్ళుగానో రెండు మతాల మధ్య నలుగుతున్న సమస్య ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. వివాదాస్పద బాబ్రీ మసీదును హిందూ విశ్వపరిషత్‌ పిలుపు మేరకు అయోధ్య చేరుకున్న కరసేవకులు కూల్చివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో 3 వేలకు పైగా సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా ముంబాయిలో ఈ అల్లర్లు ఎక్కువగా జరిగాయి. అప్పుడు మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులే దానికి కారణం. ఇలాంటి సామాజిక అంశాలపై ఎంతో అవగాహన ఉన్న మణిరత్నం దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై ఆందోళన చెందారు. ఆ సమయంలో తన డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘దొంగ దొంగ’ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఒకపక్క వర్క్‌ జరుగుతున్నా అతని ఆలోచనలు మాత్రం బాబ్రీ మసీదు గొడవల చుట్టూనే తిరుగుతున్నాయి. ముంబాయిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఓ సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు మణిరత్నం. ప్రముఖ మలయాళ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ను కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేయవలసిందిగా కోరారు. అయితే అది కార్యరూపం దాల్చేందుకు ఎంతో సమయం పట్టేలా ఉండడంతో మణిరత్నమే దానికి పూనుకున్నారు. ఎంతో వేగంగా స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్‌, మనీషా కోయిరాలాకు ఫోటోషూట్‌ చేయించారు. అప్పటికే మరో సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచిన విక్రమ్‌ ఈ సినిమా కోసం వాటిని తొలగించేందుకు అంగీకరించలేదు. చివరికి తన ‘రోజా’ చిత్రంలో నటించిన అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారు. సినిమా మొదలైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రాన్ని షూట్‌ చేశారు. ఈ సినిమాలో బాబ్రీ మసీదు కూల్చి వేస్తున్న వీడియోను సినిమాలో చూపించేందుకు ప్రయత్నించారు మణిరత్నం. కానీ, సెన్సార్‌ బోర్ట్‌ ఒప్పుకోలేదు. అలా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు. 1995 మార్చి 10న ఈ సినిమాను తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు చెందిన ఎబిసిఎల్‌ సంస్థ ఈ చిత్రం హిందీ విడుదల హక్కులను రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది.  ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. ‘బొంబాయి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఎవరు ఎన్నిరకాలుగా ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆదరించారు. అప్పట్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా గొప్ప సంచలనాన్నే సృష్టించింది. మణిరత్నం సినిమా అంటేనే ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది. అది మిస్‌ అవ్వకుండా బొంబాయిలో జరిగిన అల్లర్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో మణిరత్నం హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమాకి కథ, కథనాలు ప్రాణం అయితే.. దానికి కొత్త ఊపిరి పోసింది ఎ.ఆర్‌.రెహమాన్‌ చేసిన పాటలు. ‘ఉరికే చిలకా..’, ‘కన్నానులే..’, ‘హమ్మ హమ్మ’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకి బాగా ప్లస్‌ అయిన మరో అంశం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. సినిమాలోని ఎమోషన్‌ని, కొన్ని భయానక పరిస్థితుల్ని బాగా ఎలివేట్‌ చేసింది మ్యూజిక్‌. కాశ్మీర్‌ టెర్రరిస్టుల నేపథ్యంలో మణిరత్నం చేసిన ‘రోజా’ 1992లో ఒక సంచలనం అయితే, 1995లో వచ్చిన ‘బొంబాయి’ మరో సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఈ సినిమాను చూసి మణిరత్నంను ప్రశంసల్లో ముంచెత్తారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘బొంబాయి’ చిత్రం నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డులతోపాటు విదేశాల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించి అవార్డులు అందించారు. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకి, ఇందులోని పాటలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మణిరత్నం కెరీర్‌లో ‘బొంబాయి’ సినిమా ఓ దృశ్యకావ్యంలా నిలిచిపోయింది.

కృష్ణంరాజు చేసిన పనికి అందరూ షాక్‌.. ‘భక్త కన్నప్ప’ నిర్మాణానికి అన్నీ అవరోధాలే.!

సినిమా రంగంలో నటీనటులుగా పేరు తెచ్చుకున్న వారందరికీ ఏదో ఒక డ్రీమ్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. ఎప్పటికైనా అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌ చెయ్యాలని కలలు కంటూ ఉంటారు. కొందరికి మాత్రమే అది సాధ్యపడుతుంది. అలాంటి డ్రీమ్‌ క్యారెక్టర్‌ రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుకి కూడా ఉండేది. ‘చిలకా గోరింకా’ చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, సహాయనటుడిగా ఎన్నో పాత్రలు చేశారు. దాదాపు 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత గోపీకృష్ణా మూవీస్‌ పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వి.మధుసూదనరావు దర్శకుడు. సినిమాకి మంచి పేరు వచ్చింది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం లభించలేదు.  అయితే తన బేనర్‌లో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘భక్త కన్నప్ప’ను భారీ బడ్జెట్‌తో రెండో సినిమాగా నిర్మించాలనుకున్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా చెయ్యాలనుకున్నారు. కథ సిద్ధం చేసుకున్నారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా రికార్డ్‌ చేశారు. కానీ, ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాంతో ప్రాజెక్ట్‌ను కొన్నాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ మరుసటి ఏడాది బాపు దర్శకత్వంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. బాపు, రమణల పేర్లు మారుమ్రోగిపోయాయి. వారిద్దరే తన భక్తకన్నప్పకు న్యాయం చెయ్యగలరని భావించారు కృష్ణంరాజు. ఈ ప్రాజెక్ట్‌ గురించి బాపు, రమణలకు చెప్పగానే వారు కూడా సినిమా చేసేందుకు అంగీకరించారు. సాధారణంగా బాపు శ్రీరాముడి కథాంశంతో సినిమా చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ, ఒక శివభక్తుడి సినిమా చేసేందుకు ఆయన అంగీకరించడం గొప్ప విషయంగానే చెప్పాలి. అలా ‘భక్త కన్నప్ప’ మళ్ళీ పట్టాలెక్కింది.  అంతకుముందు సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు రమణ. గతంలో భక్త కన్నప్ప కథాంశంతో వచ్చిన కాళహస్తి మహత్మ్యం చిత్రంలో లేని కిరాతార్జునీయం ఎపిసోడ్‌ని ‘భక్త కన్నప్ప’ చిత్రంలో చేర్చారు రమణ. ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి రచించారు. అప్పటివరకు వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ ఎక్కువ శాతం స్టూడియోల్లో చిత్రీకరించినవే. మొదటిసారి ఎక్కువ శాతం ఔట్‌డోర్‌లో రూపొందిన సినిమాగా ‘భక్త కన్నప్ప’ క్రెడిట్‌ దక్కించుకుంది. జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బుట్టాయగూడెం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో సినిమాను తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మోటార్ల సాయంతో ఏర్లు సృష్టించారు. కొన్ని వందల తాడిచెట్లను కొట్టేసి సినిమాకు అనుగుణంగా ఎరెనా సెట్‌ వేశారు. ఈ సెట్‌ను కొంత భాగం వేసిన తర్వాత కళాదర్శకుడు భాస్కరరాజుకు అత్యవసరంగా వేరే పని రావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో సెట్‌ పనులు ఆగిపోయాయి. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న బాపు, రమణల స్నేహితుడు బి.వి.ఎస్‌.రామారావుకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన మొదట సందేహించినా ఆ సెట్‌ను పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఆ సెట్‌ను మొదట అనుకున్న దానికంటే బాగా వేశారాయన. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని, ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ అడవికి దారి సరిగా లేకపోవడంతో 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇవన్నీ చేయడానికి 45 రోజులు పట్టింది. రూ.9 లక్షలు ఖర్చయింది. ఆరోజుల్లో పౌరాణిక చిత్రాన్ని భారీగా తియ్యాలంటే రూ.15 లక్షల వరకు బడ్జెట్‌ అయ్యేది. కానీ, ఈ సినిమాకి మాత్రం రూ.20 లక్షలు ఖర్చయింది. యూనిట్‌ సభ్యులంతా ఆ అడవిలోనే బస చేసేవారు. వారానికి 6 రోజులు మాత్రమే షూటింగ్‌ చేసేవారు. ఒకరోజు విశ్రాంతి దినం. ఆరోజు అందరికీ బిర్యానీ వండిరచేవారు. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవారు. మొత్తం 550 మంది యూనిట్‌ సభ్యులకు భోజన వసతి కల్పించారు. ఈ సినిమా షూటింగ్‌ 70 రోజులపాటు జరిగింది.  ఈ సినిమాలో రావుగోపాలరావు కొడుకు పాత్ర కోసం రాజబాబును అనుకున్నారు. సమయానికి అతని కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ అవ్వకపోవడంతో, పద్మనాభంతో ఆ క్యారెక్టర్‌ చేయించాలనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కూడా షూటింగ్‌కి రాలేకపోయారు. అప్పుడా క్యారెక్టర్‌ సారధికి దక్కింది. అది ఆయనకు ఎంతో పేరుతో పాటు కళానగర్‌ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వాణిశ్రీ అప్పటికే టాప్‌ హీరోయిన్‌. ‘భక్త కన్నప్ప’ను బాపు తెరకెక్కించిన విధానం నచ్చడంతో ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోరంత దీపం’ చిత్రంలో డీగ్లామరైజ్డ్‌ రోల్‌ చేసేందుకు ఒప్పుకున్నారు వాణిశ్రీ.  ముత్యాలముగ్గు చిత్రంలో నటించిన శ్రీధర్‌, రావుగోపాలరావు, జయమాలినిలకు ఈ సినిమాలో మంచి పాత్రలు లభించాయి. ఈ చిత్రంలోని మల్లన్న పాత్రకు పూర్తి న్యాయం చేశారు శ్రీధర్‌. అలాగే రావుగోపాలరావు కైలాసనాథశాస్త్రిగా అద్భుతంగా నటించారు. ‘శివ శివ అననేలరా..’ పాటతో అలరించారు జయమాలిని. ఈ చిత్రం కోసం వేటూరి రాసిన ‘శివశివ శంకర..’ పాటను ఆదినారాయణరావు స్వరపరచారు. అనారోగ్య కారణాల వల్ల తన శిష్యుడు సత్యంకు మిగతా పాటల బాధ్యతను అప్పగించారు. బాపు కాంబినేషన్‌లో సత్యం చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడుగా సత్యం నంది అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలు వి.రామకృష్ణకు ఎంతో మంచి పేరును తెచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. 45 డ్రమ్స్‌తో ‘కండ గెలిచింది..’ అనే పాటను ఎంతో భారీగా చిత్రీకరించారు. నృత్య దర్శకుడు శ్రీను ఈ పాటను ఎంతో అద్భుతంగా చేశారు. ఈ పాట కోసం బాపు చెప్పిన షాట్స్‌కి అనుగుణంగా పాట రాసారు సి.నారాయణరెడ్డి. ఈ పాటలో వాడిన డ్రమ్స్‌ను బుట్టాయగూడెంలోనే తయారు చేయించారు. 9 నిమిషాల ఈ పాటను తియ్యడానికి 10 రోజులు పట్టింది. ఈ సినిమాలోని మరో పాట ‘ఎన్నీయల్లో ఎన్నీయల్లో చందామామా..’ పాటను ఆ ప్రాంతంలోని కోయవారి దగ్గర నుంచి సేకరించి ఆరుద్రతో రాయించారు. ఈ పాటను మిట్టమధ్యాహ్నం తీశారు. కానీ, సినిమాలో మాత్రం వెన్నెల్లో తీసినట్టు అనిపిస్తుంది. ఆ క్రెడిట్‌ అంతా డి.ఓ.పి. వి.ఎస్‌.ఆర్‌.స్వామికి దక్కుతుంది. ఇలా సినిమా ఆద్యంతం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మనం పుస్తకాల్లో చదువుకున్న కథను సినిమాగా మలిచి అందర్నీ ఆకట్టుకోవడం బాపు వంటి దర్శకుడి వల్లే అవుతుందని ‘భక్త కన్నప్ప’ మరోసారి రుజువు చేసింది. 1976లో ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కల నెరవేరింది. ‘కృష్ణవేణి’ చిత్రం నిర్మాతగా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా, ‘భక్తకన్నప్ప’ మాత్రం గోపీకృష్ణా మూవీస్‌ సంస్థను లాభాల్లోకి నడిపించింది.

చిన్నతనంలో పెద్ద ప్రమాదం. 23 సర్జరీలు.. నటుడు కావాలన్న తపనే అతన్ని బ్రతికించింది.! 

సినిమా రంగంలో ఎంతో మంది హీరోలు ఉంటారు. తమ విలక్షణమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటారు. కానీ, నటనను దైవంగా భావించేవారు, తాము చేసే క్యారెక్టర్‌ కోసం ఎలాంటి రిస్‌ అయినా తీసుకునేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కమల్‌హాసన్‌ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడు విక్రమ్‌. తను చేసే క్యారెక్టర్‌ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని నటుడని ‘ఐ’ చిత్రంలోని అతని గెటప్స్‌ కోసం పడిన కష్టం చూస్తే అర్థమవుతుంది. అలాగే ‘అపరిచితుడు’ చిత్రంలో విక్రమ్‌ పోషించిన మూడు విభిన్నమైన పాత్రలు నటన పట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని సూచిస్తుంది. నేషనల్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు గవర్నమెంట్‌ అవార్డులు.. ఇలా అతని కెరీర్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న నటుడు చియాన్‌ విక్రమ్‌. భారతదేశం గర్వించదగ్గ నటుడుగా ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, తపన.. ఇవన్నీ అతన్ని ఉత్తమనటుడిగా నిలబెట్టాయి. ఏప్రిల్‌ 17 చియాన్‌ విక్రమ్‌ పుట్టినరోజు. తనకెంతో ఇష్టమైన హీరోయిన్‌ సౌందర్య అని చెబుతాడు విక్రమ్‌. కాకతాళీయంగా విక్రమ్‌ పుట్టినరోజునే సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం అతన్ని ఎంతో బాధించిన విషయంగా చెబుతాడు. చియాన్‌ విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని పథమకుడి విక్రమ్‌ స్వస్థలం. ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమనటులు రావడం విశేషం. కమల్‌హాసన్‌, చారుహాసన్‌, సుహాసిని ఈ ప్రాంతం నుంచి వచ్చినవారే. తండ్రి వినోద్‌రాజ్‌ హీరో అవ్వాలని కలలు కన్నాడు. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా ఆశించిన గుర్తింపు రాలేదు. విక్రమ్‌కి చిన్నతనం నుంచి కళల పట్ల ఎంతో ఆరాధన ఉండేది. ఈత, కరాటేలో అతనికి ఎంతో ప్రావీణ్యం ఉంది. అలాగే గిటార్‌, పియానో అద్భుతంగా ప్లే చేయగలడు. చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మాయి వేషంలో నటించి ప్రథమ బహుమతి అందుకున్నాడు. అందరూ అతన్ని ప్రశంసించారు. ఆ క్షణమే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. చదువు కన్నా నటనమీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. అయినా బి.ఎ. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎం.బి.ఎ. డిగ్రీ కూడా తీసుకున్నాడు.  విక్రమ్‌కి బైక్‌ రైడిరగ్‌ అంటే కూడా ఎంతో మక్కువ. అతనికి ఇష్టమైన బైక్‌ రాజ్‌దూత్‌. అతను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో  స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన పెద్ద ప్రమాదం అతని జీవితంలో మర్చిపోలేని ఘటన. శరీరంపై ఎన్నో గాయాలయ్యాయి. ముఖ్యంగా ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. డాక్టర్లు ఎన్నిరోజులు ట్రీట్‌మెంట్‌ చేసినా అతనికి నయం చేయలేకపోయారు. ఈ క్రమంలోనే అతనికి 23 సర్జరీలు జరిగాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాలు తీసెయ్యాలని డాక్టర్లు చెప్పారు. కానీ, తన ఆత్మవిశ్వాసంతో కోలుకొని మామూలు స్థితికి వచ్చాడు విక్రమ్‌. ఒక గొప్ప నటుడు కావాలన్న సంకల్పమే తనను మామూలు మనిషిని చేసిందని అంటారు విక్రమ్‌.  1990లో ‘ఎన్‌ కాదల్‌ కన్మణి’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్‌ ఈ 35 సంవత్సరాల్లో చేసిన సినిమాలు కేవలం 55 మాత్రమే. దీన్ని బట్టి ఎంత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా నిర్మాణంలో ఉండగా మరో సినిమా ఒప్పుకోడు. అది పూర్తయిన తర్వాత మరో సినిమా కోసం ఆరు నెలలు లేదా సంవత్సరం వర్కవుట్‌ చేసిన తర్వాతే మరో సినిమాకు వెళతాడు. దీనివల్లే అతను చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తనకు సినిమాల సంఖ్య, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని, తనకెంతో ఇష్టమైన నటనను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న సినిమాలు చేయడమే ప్రధానమని చెబుతాడు విక్రమ్‌. ఎన్ని విలక్షణమైన, విభిన్నమైన పాత్రలు పోషించినా తను చేసే సినిమాల్లో, తను చేసే క్యారెక్టర్లలో కొత్తదనం ఉండాలని కోరుకునే అరుదైన నటుల్లో విక్రమ్‌ ఒకరు. అతని సినిమా కెరీర్‌లో ఇంకా మరెన్నో వైవిధ్యమైన క్యారెక్టర్ల ద్వారా ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ చియాన్‌ విక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. అందరికీ అందనిదీ పూచిన కొమ్మ!

మహానటి అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు సావిత్రి. ఆమెలాంటి నటి మళ్లీ పుట్టదు అంటారు. అది నిజమే. ఏ జనరేషన్‌కి తగ్గట్టు నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు, వెళుతుంటారు. ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటాం. అయితే ఈ తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన నటీమణి ఎవరైనా ఉన్నారా? వెంటనే మనకు స్పురించే పేరు సౌందర్య. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇట్టే ఒదిగిపోయి దానికి పూర్తి న్యాయం చేసే సౌందర్యతో మిగతా హీరోయిన్లను పోల్చలేం. ఎందుకంటే ఆమెకు ఒక నిబద్ధత ఉంది. తన తోటి హీరోయిన్లు అందరూ పాత్రకు అవసరం అనుకుంటే ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు వెనుకాడేవారు కాదు. కానీ, సౌందర్య అలా కాదు. నటిగా కెరీర్‌ ప్రారంభించిన రోజు నుంచి చనిపోయే వరకు ఏ సినిమాలోనూ ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. నిండుగా దుస్తులు వేసుకొని కేవలం తన నటనతోనే అందర్నీ ఆకట్టుకుంది తప్ప అంగ ప్రదర్శనతో కాదు.  అందానికి అందం, అభినయానికి అభినయం.. ముగ్థ మనోహర రూపంతో వెండితెరను కొన్నేళ్ళపాటు ఏలిన ఈ సౌందర్య రాశి మన నుంచి దూరమై అప్పుడే 20 సంవత్సరాలు పూర్తవుతోంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి నటి అనే పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్‌ సౌందర్య. సావిత్రి శకం ఎప్పుడో ముగిసిపోయినా అంతటి పేరును ప్రేక్షకులకు మరెవ్వరికీ ఇవ్వలేదు. ఆ ఘనత సౌందర్యకు మాత్రమే దక్కింది. ఏప్రిల్‌ 17 సౌందర్య వర్థంతి సందర్భంగా ఆమె వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.  డాక్టర్‌ కావాలనుకున్నాను. కానీ, యాక్టర్‌ అయ్యాను అంటారు. సౌందర్య విషయంలో నిజంగా అదే జరిగింది. ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తున్న సమయంలో రచయిత త్రిపురనేని మహారథి కుమారుడు త్రిపురనేని వరప్రసాద్‌ ‘రైతుభారతం’ చిత్రంతో సౌందర్యను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌ అవ్వడానికి మూడేళ్ళు పట్టింది. ‘మనవరాలి పెళ్లి’ ఆమె నటించిన మొదటి చిత్రంగా విడుదలైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 100 సినిమాలకు పైగా నటించి హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య. మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లో అందరు టాప్‌ హీరోల సరసన నటించింది.  సౌందర్యను అందరూ సావిత్రితో పోలుస్తారు. సావిత్రిలాగే తనకు కూడా డైరెక్షన్‌ చెయ్యాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ, ఆ అవకాశం రాకుండానే చిన్న వయసులో అందర్నీ వదిలి వెళ్లిపోయింది. ఆమె నటించిన చివరి చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రెండో షెడ్యూల్‌ సమయానికి ఆమె మనమధ్య లేదు. అలా ఆ సినిమా ఆగిపోయింది. ఆమె కెరీర్‌లో రిలీజ్‌కి నోచుకోని మరో సినిమా కూడా ఉంది. ఆ సినిమా పేరు ‘గెలుపు’. తెలుగు చిత్ర పరిశ్రమకు సౌందర్యను హీరోయిన్‌గా పరిచయం చేసిన త్రిపురనేని వరప్రసాద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో డిఫెన్స్‌ లాయర్‌గా ఓ కీలక పాత్ర పోషించారు సౌందర్య. తన క్యారెక్టర్‌ నిడివి తక్కువే అయినప్పటికీ  ‘రైతు భారతం’ చిత్రంతో తనను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారన్న గౌరవంతో వరప్రసాద్‌ అడగ్గానే ఆ క్యారెక్టర్‌ చేసేందుకు ఒప్పుకుంది సౌందర్య. 2003లో షూటింగ్‌ పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీ రెడీ అయిన తర్వాత ఇక సినిమా రిలీజ్‌ కావడమే తరువాయి అనుకుంటున్న టైమ్‌లో బ్రేక్‌ పడిరది. అంతే.. అప్పటి నుంచి ‘గెలుపు’ చిత్రం ప్రింటు రామోజీ ఫిలిం సిటీలోని ల్యాబ్‌లోని బాక్సుల్లోనే ఉండిపోయింది. ఈ సినిమా రిలీజ్‌ కాకపోవడానికి కారణం ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాకి అయిన బడ్జెట్‌కి 10 శాతం ఎక్కువ ఇచ్చి తీసుకునేందుకు అంగీకరించింది. అయితే దాన్ని నోటి మాటగా అనుకున్నారే తప్ప రాతపూర్వకంగా అగ్రిమెంట్‌ చేసుకోలేదు. ఆ కారణంగా సినిమా పూర్తవుతున్న సమయంలో కూడా ఎంతో మంది బయ్యర్లు సినిమాను కొనేందుకు వచ్చినా ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాను తీసుకుంటుందన్న గట్టి నమ్మకంతో ఎవ్వరికీ ఇవ్వలేదు వరప్రసాద్‌. ఈ సినిమా రిలీజ్‌కి వచ్చేసరికి ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాల పరంగా భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమాలకు సంబంధించిన లావాదేవీలను తాత్కాలికంగా ఆపేశారు. ఆ కారణంగా ‘గెలుపు’ చిత్రాన్ని కూడా రిలీజ్‌ చేయలేకపోయారు. మిగతా బయ్యర్లు కూడా ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు.  హీరోయిన్‌గా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉంది. ఆ సమయంలోనే తన మేనమామ, చిన్నప్పటి స్నేహితుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన జి.ఎస్‌.రఘును 2003 ఏప్రిల్‌ 27న వివాహం చేసుకుంది సౌందర్య. పెళ్ళి చేసుకొని ఏడాది నిండకముందే 2004 ఏప్రిల్‌ 17న హెలికాప్టర్‌ ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. చనిపోయే సమయానికి సౌందర్య గర్భవతి. ఆమె మరణం సినిమా పరిశ్రమ మొత్తాన్ని శోకసముద్రంలో ముంచేసింది.