తను చనిపోతున్నానని తెలిసి కోట్ల ఆస్తిని అందరికీ పంచేసిన హీరోయిన్‌!

సినిమా రంగం గ్లామర్‌ ప్రపంచం.. ఆ ప్రపంచంలో విహరించాలని, సుఖ సౌఖ్యాలు అనుభవించాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అది వారి ప్రతిభ కావచ్చు లేదా అదృష్టం కావచ్చు. అవకాశాలు వారిని వరిస్తాయి, ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు. అలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే ఆ స్థానాన్ని అందరూ కాపాడుకోలేరు. కొందరు స్వయంకృతాపరాథం వల్ల దీనస్థితికి చేరుకుంటే, మరికొందరు విధి ఆడే వింత నాటకంలో బలిపశువులుగా మారతారు. ఈ విషయంలో నటుల కంటే నటీమణుల జీవితాల్లోనే ఎక్కువ విషాదాన్ని మనం చూస్తుంటాం. అలాంటి వారిలో శ్రీవిద్య ఒకరు. అందర్నీ కట్టిపడేసే అందం ఆమె సొంతం. అన్నింటినీ మించి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి గుణం. అయినా ఎంతో ఉన్నతంగా సాగాల్సిన ఆమె వ్యక్తిగత జీవితం విషాదభరితం కావడం వెనుక జరిగిన ఘటనలు ఏమిటి? ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఎలాంటివి? అనే విషయాలు తెలుసుకుందాం. తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎల్‌.వసంతకుమారిలకు శ్రీవిద్య జన్మించింది. ఆమె పుట్టిన సంవత్సరానికే తండ్రికి పక్షవాతం రావడంతో ఆయన నటనకు స్వస్తి పలికారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లిపైనే పడిరది. కచ్చేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీవిద్య సినిమాల్లోకి ప్రవేశించింది. 14 ఏళ్ళ వయసులో శివాజీ గణేషన్‌ హీరోగా నటించిన తిరువరుచెల్వర్‌ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పేదరాశిపెద్దమ్మ కథ. శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువగా ప్రోత్సహించారు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంలో కమల్‌హాసన్‌, రజినీకాంత్‌ నటించారు. ఇదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు పడమర’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. రెండు భాషల్లోనూ శ్రీవిద్య ప్రధాన పాత్ర పోషించారు.  కమల్‌హాసన్‌, శ్రీవిద్య ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. ఆ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా దానికి అంగీకారం తెలిపాయి. కారణం తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు కమల్‌. ఆ తర్వాత మలయాళ దర్శకుడు జార్జ్‌ థామస్‌తో ప్రేమలో పడి 1978లో అతన్ని వివాహం చేసుకున్నారు శ్రీవిద్య. థామస్‌ క్రిస్టియన్‌. శ్రీవిద్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఈ పెళ్ళికి శ్రీవిద్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వారిని ఎదిరించి థామస్‌ని పెళ్ళి చేసుకున్నారు. అతని కోరిక మేర పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీవిద్య. రెండు సంవత్సరాలు మాత్రమే వారి వైవాహిక జీవితం నడిచింది. థామస్‌ కెరీర్‌ సవ్యంగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. సినిమాల్లో నటించాలని శ్రీవిద్యకు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ నటిగా కొనసాగారు. శ్రీవిద్య సంపాదిస్తుంటే.. దాన్ని ఖర్చు చేసే పనిలో ఉండేవాడు థామస్‌. దానికితోడు వేధింపులు కూడా ఎక్కువ కావడంతో 1980లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు శ్రీవిద్య.  ఆ తర్వాత నటిగా కొనసాగారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. 2003లో శ్రీవిద్య అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు జరిపిన పరీక్షల్లో ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టుగా తేలింది. తను ఎంతో కాలం బ్రతకదని తెలుసుకున్న శ్రీవిద్య తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. సంగీత, నృత్య కళాశాలలోని విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ అందడం లేదని తెలుసుకొని మలయాళ నటుడు గణేష్‌ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్‌ను రిజిష్టర్‌ చేసారు. దాని ద్వారా అర్హులైనవారికి సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఆరోజుల్లోనే శ్రీవిద్యకు ఉన్న కోట్ల ఆస్తుల్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్‌కి కొంత రాసారు. తన తమ్ముడి పిల్లలకు ఐదేసి లక్షలు చొప్పున, తన దగ్గర పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున చెందేలా వీలునామా రాయించారు. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌  తీసుకున్న శ్రీవిద్య ఆరోగ్యం క్షీణించడంతో 2006 అక్టోబర్‌ 19న 53 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు.

రెండు సార్లు ఫ్లాప్‌ అయినా.. మూడోసారి ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది!

దక్షిణ భారతదేశంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఎన్నో చిత్ర నిర్మాణ సంస్థలు వెలిశాయి. వాటిలో ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌ ఒకటి. ఆ తర్వాతి కాలంలో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎ.వి.ఎం. సంస్థ పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ అధినేత ఎ.వి.మెయ్యప్పన్‌ చెట్టియార్‌ చిత్ర నిర్మాణాన్ని ఒక తపస్సులా భావించి చేసేవారు. ఈ సంస్థ ద్వారా తన మాతృభాష అయిన తమిళ్‌లోనే ఎక్కువ సినిమాలు నిర్మించారు. 50వ దశకంలో తెలుగులో జీవితం, వదిన, సంఘం చిత్రాలను నిర్మించారు. అయితే ఈ మూడు సినిమాలూ ఆర్థికంగా ఎ.వి.ఎం. సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత చెట్టియార్‌ నిర్మించిన ‘నాగులచవితి’, ‘భూకైలాస్‌’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అయినా ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు తప్ప తెలుగులో ఎక్కువగా సినిమాలు నిర్మించలేదు. అయితే ఇతర భాషల్లో ఈ సంస్థ నిర్మించిన సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేసేవారు. ఎ.వి.ఎం. సంస్థ తమిళ్‌లో నిర్మించిన ఓ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగులో ‘నాదీ ఆడజన్మే’ పేరుతో ఎస్వీ రంగారావు నిర్మించారు. దీనికి ఎ.వి.ఎం. సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.  ఈ సినిమా తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా తెలుగులో సినిమాలను నిర్మించడం ప్రారంభించారు చెట్టియార్‌. ఆ సమయంలో ఆయనకు భక్త ప్రహ్లాదుని కథతో సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది.  భక్తప్రహ్లాద పేరుతో అంతకు మునుపే రెండు సినిమాలు వచ్చాయి. 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 1942లో వచ్చిన భక్తప్రహ్లాద చిత్రాన్ని చిత్రపు నారాయణమూర్తి రూపొందించారు. ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు. అయితే కథలో వైవిధ్యం ఉందని, దాన్ని అప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా, అందరికీ అర్థమయ్యేలా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని చెట్టియార్‌ నమ్మారు. ఆరోజుల్లో పౌరాణిక సినిమాలకు సముద్రాల రాఘవాచార్య సంభాషణలు రాసేవారు. అయితే సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మాటలు ఉంటేనే సినిమా రక్తి కడుతుందని భావించి డి.వి.నరసరాజుకి మాటలు రాసే బాధ్యతను అప్పగించారు. అదే ఆయనకు తొలి పౌరాణిక సినిమా. 1942లో వచ్చిన భక్తప్రహ్లాద, తమ సంస్థ నిర్మించిన నాగులచవితి చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తినే దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు చెట్టియార్‌.  హిరణ్యకశ్యపుని పాత్రకు ఎస్వీఆర్‌ను, లీలావతి పాత్రకు అంజలీదేవిని ఎంపిక చేసుకున్నారు. ప్రహ్లాదుని పాత్ర కోసం ఎంతో మంది పిల్లలను చూశారు. కానీ, ఎవరూ ఆ పాత్రకు సరిపోయేలా కనిపించలేదు. చివరికి సినిమారంగం మాసపత్రికలో పనిచేసే సత్యం కుమార్తె ఐదేళ్ళ రోజారమణిని ఎంపిక చేసారు. అయితే రోజారమణి చాలా సన్నగా ఉండడంతో మూడు వారాలపాటు చక్కని డైట్‌ ఇచ్చారు. దాంతో పాప చాలా బాగా తయారైంది. రోజా రమణికి నటనలో, డైలాగులు చెప్పడంలో శిక్షణ ఇచ్చారు. ఒక్కసారి చెబితే ఇట్టే నేర్చుకునే రోజారమణి తక్కువ సమయంలోనే శిక్షణ పూర్తి చేసుకుంది. ఆమెపై చెట్టియార్‌ పెట్టుకున్న నమ్మకాన్ని రోజారమణి నిజం చేసింది. సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. సింగిల్‌ టేక్‌లోనే ప్రతి షాట్‌ను పూర్తిచేసింది.  ఆరోజుల్లో నారదుడి పాత్రకు కాంతారావు పెట్టింది పేరు. అయితే రొటీన్‌కి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో నారదుడి పాత్రకు సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు. అంతటి సంగీత విద్వాంసుడికి తాను రాగాలు కట్టి పాడిరచడం గౌరవం కాదని, ఆయన పాడిన పాటలకు స్వరాలు సమకూర్చే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావు. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన తర్వాత చెట్టియార్‌కు సినిమాపై మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే సినిమాను కలర్‌లో తియ్యాలని నిర్ణయించుకున్నారు. 1965లో ప్రారంభమైన ఈ సినిమా 1967 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమాతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ‘అవేకళ్ళు’ చిత్రాన్ని నిర్మించింది ఎ.వి.ఎం. సంస్థ. ఆ చిత్ర నిర్మాణాన్ని చెట్టియార్‌ కుమారులు చూసుకునేవారు. భక్తప్రహ్లాద సినిమాపై అంతగా నమ్మకం లేని వారు.. ‘అవేకళ్ళు’ చిత్రానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే భక్తప్రహ్లాద చిత్ర నిర్మాణం బాగా ఆలస్యమైంది. విశేషం ఏమిటంటే.. ‘అవేకళ్ళు’ ఫ్లాప్‌ అవ్వగా, ‘భక్త ప్రహ్లాద’ ఘన విజయం సాధించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించిన రోజారమణి ఈ ఒక్క సినిమాతోనే టాప్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అయిపోయారు.

ఎఎన్నార్‌, కృష్ణ కాంబినేషన్‌లో సినిమా అనే ఎనౌన్స్‌మెంట్‌ చూసి షాక్‌ అయిన శోభన్‌బాబు!

హీరో కృష్ణ, శోభన్‌బాబు సమకాలీనులు. వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలాగే సోలో హీరోలుగా నటించిన సినిమాలతో కృష్ణ, శోభన్‌బాబు పోటీ పడేవారు. ఒక దశలో శోభన్‌బాబు కెరీర్‌ కాస్త నెమ్మదించింది. కృష్ణ వరస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఆ సమయంలో నటుడు కైకాల సత్యనారాయణ ఒకసారి కృష్ణను కలిసి ‘ఈమధ్య శోభన్‌బాబు సినిమాలు అంతగా ఆడడం లేదు. అతనితో కలిసి నువ్వు ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా’ అన్నారు. తనతో ఒక సినిమా చెయ్యమని శోభన్‌బాబు స్వయంగా కబురు పంపడం కృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తప్పకుండా చేస్తాను’ అని సత్యనారాయణకు మాట ఇచ్చారు కృష్ణ. ఆ తర్వాత కృష్ణ స్వయంగా శోభన్‌బాబు ఇంటికి వెళ్ళి కలిసారు. మనం కలిసి సినిమా చేద్దామని అని చెప్పి, స్టోరీ ఫైనల్‌ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. ఆరోజుల్లో శోభన్‌బాబు ఒక సినిమాకి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు. తను కూడా అంత ఎమౌంట్‌ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు కృష్ణ. ఆ తర్వాత మహారథి, విజయనిర్మల, అప్పలాచార్య కలిసి సినిమా ఔట్‌ లైన్‌ తయారు చేశారు. ఆ సినిమానే ‘హేమాహేమీలు’. సినిమా కోసం అనుకున్న ఔట్‌లైన్‌ని శోభన్‌బాబుకి వినిపించారు మహారథి. అందులో కొన్ని మార్పుల గురించి చెప్పారు శోభన్‌బాబు. ఆ మార్పుల గురించి విజయనిర్మలతో కలిసి మహారథి చర్చలు జరుపుతున్న రోజుల్లోనే శోభన్‌బాబు నటించిన ‘మల్లెపూవు’ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ‘ఇక మనకు శోభన్‌బాబు సినిమా చెయ్యడు’ అన్నారు కృష్ణ. ఆయన అన్న మాట నిజమైంది. కథ తనకు నచ్చలేదని, అందుకే సినిమా చెయ్యలేకపోతున్నానని శోభన్‌బాబు నుంచి కబురు వచ్చింది.  శోభన్‌బాబు చెయ్యను అన్న తర్వాత అంత కంటే పెద్ద హీరోతోనే వెళ్లాలి తప్ప చిన్న హీరోతో సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యారు కృష్ణ. అప్పటికి ఎన్‌.టి.ఆర్‌, కృష్ణల మధ్య మాటలు లేవు. కాబట్టి ఆయన్ని అడిగే అవకాశం లేదు. ఇక ఎఎన్నార్‌తో ‘దేవదాసు’ వివాదం ఉండనే ఉంది. కానీ, ఈ సినిమాలో ఎఎన్నార్‌ అయితేనే బాగుంటుందని భావించిన కృష్ణ తమ మనస్పర్థలు పక్కన పెట్టి అక్కినేనిని కలవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రజినీకాంత్‌ కాంబినేషన్‌లో ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రం చేస్తున్నారు కృష్ణ. షూటింగ్‌ కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి సరాసరి అక్కినేని ఇంటికి వెళ్లారు. మీతో సినిమా చెయ్యాలనుకుంటున్నాను అని విషయం చెప్పారు. దానికి ఎఎన్నార్‌ ‘జరిగినవన్నీ మర్చిపోదాం.. మనం కలిసి సినిమా చేద్దాం’ అన్నారు.  అప్పటివరకు ఔట్‌ లైన్‌ మాత్రమే సిద్ధంగా ఉంది. సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌ రెడీ చేసే పనిలో పడ్డారు విజయనిర్మల, మహారథి. ‘హేమాహేమీలు’ హిందీ చిత్రం ‘డాన్‌’ స్ఫూర్తితో రూపొందింది. ఇందులో కృష్ణ, విజయనిర్మల పాత్రలను అదనంగా చేర్చారు. మహారథి సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌ తయారు చెయ్యగానే అక్కినేనికి కథ వినిపించారు. ఆయనకు కథ నచ్చి ఓకే చెప్పారు. ఆ సమయంలో శోభన్‌బాబు ‘ఎంకి నాయుడుబావ’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ‘హేమాహేమీలు’ సినిమా ఎనౌన్స్‌మెంట్‌ పేపర్‌లో చూసి షాక్‌ అయ్యారు శోభన్‌బాబు. నాగేశ్వరరావుగారిని అంత ఈజీగా ఎలా ఒప్పించారు, అంత త్వరగా సినిమా షూటింగ్‌ ఎలా స్టార్ట్‌ చేస్తున్నారు అని శోభన్‌బాబు ఆశ్చర్యపోయారట. ఈ సినిమా షూటింగ్‌ పాటలతో సహా అంతా హైదరాబాద్‌లోనే చేశారు.  అవి తెలుగు సినిమాకి సినిమా స్కోప్‌ అనే ప్రక్రియ ప్రారంభమైన రోజులు. అప్పట్లో అది కొత్తదనంగా భావించిన దర్శకనిర్మాతలు ఎక్కువ శాతం సినిమా స్కోప్‌లోనే సినిమాలు నిర్మించేవారు. దాని వల్ల కిందిస్థాయి సెంటర్లలో సినిమాను ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ విషయంలో పంపిణీదారులు గొడవ చేసేవారు. వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ‘హేమాహేమీలు’ చిత్రాన్ని 35 ఎంఎంలోనే చిత్రీకరించారు. ‘డాన్‌’ చిత్రంలో మాదిరిగానే ఈ సినిమాలో ఎఎన్నార్‌ డాన్‌ రఘువీర్‌గా, పల్లెటూరి అబ్బాయి రామచంద్రంగా రెండు పాత్రలు పోషించారు. అక్కినేని సరసన బాలీవుడ్‌ నటి జరీనా వాహబ్‌ నటించారు. ఎన్నో సినిమాల్లో ఎఎన్నార్‌తో కలిసి నటించిన విజయనిర్మల ఈ సినిమాలో ఆయన్ని డైరెక్ట్‌ చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని విజయనిర్మల అనేవారు. ఈ సినిమా కోసం ఆరోజుల్లోనే ఒక ట్రైన్‌ను, హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. రమేష్‌నాయుడు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. 1979 మార్చి 23న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. కలెక్షన్లలో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించింది. ఎఎన్నార్‌, కృష్ణ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను చాలా బాగా బ్యాలెన్స్‌ చేశారు విజయనిర్మల. అందుకే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

‘లవకుశ’ ఒరియాలో రిలీజ్‌ అయినపుడు జరిగిన సంఘటన ఇది.. తనికెళ్ళ భరణి వెల్లడించిన సంచలన విషయం!

దేవుళ్ళు ఎలా ఉంటారు.. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇది నటరత్న ఎన్‌.టి.రామారావు సినిమా రంగానికి పరిచయం అవ్వక ముందు మాట. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత దేవుళ్ళు ఎలా ఉంటారు, వారి రూపం ఎలా ఉంటుంది అనేది పరిచయం చేశారు ఎన్టీఆర్‌. రాముడు, కృష్ణుడు, శివుడు.. ఇలా ఏ పాత్ర ధరించినా ఆ దేవుళ్ళ రూపాలు ఇలాగే ఉంటాయోమో అనిపించేంతగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు ఎన్‌.టి.రామారావు. దీనికి సంబంధించిన ఓ యదార్థ సంఘటన గురించి నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.  ‘ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి నటరత్న ఎన్‌.టి.రామారావుగారి గురించి ఓ విషయం చెప్పారు. అది కూడా వాళ్ళ అక్క చెప్పిందట. అది విని నేను స్టన్‌ అయిపోయాను. అదేమిటంటే.. 1963లో విడుదలైన ‘లవకుశ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాని ఒరియా భాషలోకి డబ్‌ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్స్‌ను గోడలపై అంటిస్తున్నప్పుడు అక్కడి జనం ఒక్కో పోస్టర్‌ని 50 పైసలు పెట్టి కొనుక్కొని ఇంట్లో అతికించుకున్నారట. ఈ విషయం నేను ఫస్ట్‌ టైమ్‌ విన్నాను. రాముడు అంటే ఇలాగే ఉంటాడు అనిపించేంత తేజస్సు రామారావుగారిలో ఉండడంతో ఇంట్లో దేవుడు ఉండాల్సిన స్థానంలో లవకుశ చిత్రంలో రాముడి గెటప్‌లో ఉన్న ఆయన ఫోటోను పెట్టుకున్నారంటే ఒక కళాకారుడికి అంతకు మించిన గౌరవం ఏముంటుంది’ అన్నారు తనికెళ్ళ భరణి.  

కాంతారావుకు జానపద హీరోగా పేరు తెచ్చిన విఠలాచార్య.. ఆయన కెరీర్‌ని కూడా నాశనం చేశారా?

జానపద చిత్రాలు అంటే చాలు.. వెంటనే మనకు గుర్తొచ్చే పేరు విఠలాచార్య. పౌరాణిక, సాంఘిక చిత్రాల ఒరవడి ఎక్కువగా ఉన్న రోజుల్లో చందమామ కథల్లాంటి జానపద చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత విఠలాచార్యకు దక్కుతుంది. ఇక జానపద చిత్రాలు అనగానే మన మనసులో మెదిలే హీరో కాంతారావు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి హీరోలు ఎన్నో జానపద చిత్రాల్లో నటించినా ఆ తరహా సినిమాలకు వన్నె తెచ్చిన హీరో కాంతారావు. 1953లో ఎన్టీఆర్‌ సొంతంగా నిర్మించిన ‘జయసింహ’ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించారు కాంతారావు. కాంతారావు చేసిన తొలి జానపద చిత్రం ఇదే.  ఆ తర్వాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘జయవిజయ’ చిత్రంతో కాంతారావుకు కత్తి వీరుడుగా ముద్రపడిపోయింది.  మోడరన్‌ థియేటర్స్‌ పతాకంపై ‘సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి’ చిత్రాన్ని నిర్మించారు సుందరం. ఈ సినిమాకి ఎస్‌.డి.లాల్‌ దర్శకుడు. మెయిన్‌ హీరో జగ్గయ్య కాగా, రాకుమారుల పాత్రల్లో కాంతారావు, హరనాథ్‌ నటించారు. సెట్‌లో సిగరెట్‌ తాగడం నిర్మాత సుందరానికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఇదే విషయాన్ని జగ్గయ్యకు చెప్పినా ఆయన వినకపోవడంతో ఆ సినిమా నుంచి జగ్గయ్యను తొలగించి కాంతారావును మెయిన్‌ హీరో చేశారు సుందరం. ఈ సినిమా కాంతారావును జానపద హీరోగా ఒక రేంజ్‌కి తీసుకెళ్లింది. ‘జయ విజయ’ నుంచి ‘పేదరాశి పెద్దమ్మ కథ’ వరకు కాంతారావు, విఠలాచార్య కాంబినేషన్‌లో లెక్కకు మించిన జానపద చిత్రాలు వచ్చాయి. కాంతారావుకు జానపద హీరోగా ఒక బ్రాండ్‌ని క్రియేట్‌ చేసిన దర్శకుడు విఠలాచార్య.  తనకు జానపద హీరోగా ఎంతో పేరు తెచ్చిన  దర్శకుడు విఠలాచార్య అనీ, అలాగే తన కెరీర్‌ని నాశనం చేసింది కూడా ఆయనేనని కాంతారావు చెప్పేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా హిట్‌ సినిమాలు మంచి వసూళ్ళు సాధించినా, ఏ సినిమా కూడా 100 రోజులు పూర్తి చేసుకోకుండా విఠలాచార్య అడ్డుపడేవారని కాంతారావు చెప్పేవారు. 100 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవాన్ని జరుపుకుంటే థియేటర్స్‌ స్టాఫ్‌కి, పంపిణీదారుల స్టాఫ్‌కి బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందని అలా చేసేవారు. విఠలాచార్య కాంబినేషన్‌లోనే కాంతారావు ఎక్కువ సినిమాలు చెయ్యడంతో ఆయనకు శతదినోత్సవ సినిమాలు ఎక్కువగా లేవు. అంతేకాదు, సినిమా సూపర్‌హిట్‌ అయినప్పటికీ తదుపరి సినిమాకి కాంతారావు రెమ్యునరేషన్‌ పెంచేవారు కాదు. బయటి సినిమాల నిర్మాతలకు కూడా పారితోషికం పెంచవద్దని, అలా పెంచితే తను కూడా పెంచి ఇవ్వాల్సి వస్తుందని ఎంతో మంది నిర్మాతలకు చెప్పారని కాంతారావు చెప్పేవారు.  కాంతారావు జానపద హీరోగా చక్రం తిప్పుతున్న రోజుల్లోనే నిర్మాత డూండీ ఆయనతో మూడు సినిమాలు వరసగా నిర్మించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కాంతారావును పిలిపించి రెమ్యునరేషన్‌ ఎంత ఇవ్వమంటారు అని అడిగారు డూండీ. సినిమాకి 15 వేలు చొప్పున 45 వేలు ఇవ్వండి అని అడిగారు కాంతారావు. దానికి డూండీ కూడా అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విఠలాచార్య వెంటనే డూండీ దగ్గరకు వెళ్ళి అతని పారితోషికం 10 వేలే.. మీరు 15 వేలు ఇస్తే నాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని డూండీకి చెప్పారు. అయితే విఠలాచార్యకు తెలియకుండా కాంతారావుకి 15 వేల పారితోషికం ఇచ్చారు డూండీ. ఇలా తన రెమ్యునరేషన్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న విఠలాచార్యతో ఇకపై సినిమాలు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు కాంతారావు. అనుకున్నట్టుగానే చాలా కాలం ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దాంతో వేరే హీరోలతో సినిమాలు చెయ్యడం ప్రారంభించారు విఠలాచార్య. కానీ, అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో తిరిగి కాంతారావు దగ్గరికే రావాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నానని, తనకు ఒక జానపద సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్‌ చేశారు విఠలాచార్య. మొదట ఆయనతో సినిమా చెయ్యకూడదు అనుకున్నప్పటికీ తనకు జానపద హీరోగా మంచి పేరు రావడానికి కారణం విఠలాచార్యేనన్న కృతజ్ఞతతో ‘అగ్గిదొర’ చిత్రం చేశారు కాంతారావు. ఈ సినిమా హిట్‌ అయింది. ఆ తర్వాత కాంతారావు, కృష్ణ హీరోలుగా ‘ఇద్దరు మొనగాళ్ళు’  చిత్రాన్ని రూపొందించారు విఠలాచార్య. ఇక ఎన్టీఆర్‌, కాంతారావు హీరోలుగా విఠలాచార్య రూపొందించిన ‘చిక్కడు దొరకడు’ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమాను తమిళ్‌లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే అక్కడ కూడా సూపర్‌హిట్‌ అయింది.

సూపర్‌స్టార్‌ కృష్ణ వంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరు.. ఇకపై రారు!

తెలుగు సినిమా చరిత్రలో సూపర్‌స్టార్‌ కృష్ణకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన తన సినీ జీవితంలో చేయని ప్రయోగం లేదు. తెలుగు సినిమాకి ఎన్నో దశల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్‌స్టార్‌ కృష్ణకే దక్కుతుంది. హీరోగా కంటే వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన ఆయన సినిమా ఇండస్ట్రీలో దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి కాలేజీ రోజుల్లోనే ఆయనకు దేవుడు అనే నిక్‌నేమ్‌ పెట్టారు స్నేహితులు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ పేరును సార్థకం చేసుకున్నారు కృష్ణ. ఆయన స్వతహాగా ఎన్‌.టి.రామారావు అభిమాని. ఆయనకు నచ్చిన సినిమా ‘పాతాళభైరవి’. సినిమా హీరో కావాలన్న ఆలోచన కృష్ణలో కలిగించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. కాలేజీ రోజుల్లో కృష్ణకు చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఒక సినిమా ఫంక్షన్‌కి అక్కినేని రావడం, ఆయన్ని చూసేందుకు జనం ఎగబడడం కృష్ణను ఆకర్షించింది. అంతటి ఫాలోయింగ్‌ మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నారాయన. అప్పటి నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఆ తర్వాత మద్రాస్‌ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1961 నుంచి 1965 వరకు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణను ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమా నుంచి 2015లో వచ్చిన ‘శ్రీశ్రీ’ వరకు సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన 340 సినిమాల గురించి, సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. మే 31 సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని మైలు రాళ్ళు, చేసిన ప్రయోగాలు, కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.  తెలుగులో తొలి సాంఘిక కలర్‌ చిత్రం సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా పరిచయమైన ‘తేనె మనసులు’. అలాగే తొలి  జేమ్స్‌బాండ్‌ సినిమా ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి సినిమా స్కోప్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’. ఇలా తెలుగు సినిమాకు దశలవారీగా కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్‌స్టార్‌ కృష్ణకే దక్కుతుంది. 1965లో హీరోగా పరిచయమైన కృష్ణ ఐదు సంవత్సరాల్లోనే అంటే 1970లో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించడం విశేషం. పద్మాలయా ఫిలింస్‌ పతాకంపై ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించారు. అలాగే 1983లో పద్మాలయా స్టూడియోను ప్రారంభించి తెలుగు సినిమా అభివృద్దికి ఎంతో దోహదం చేశారు. సినిమాల ఎంపికలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే కృష్ణ డాషింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎవరికీ సాధ్యం కాని ‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్ళకు మోసగాడు’ వంటి సినిమాలు చేసి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు.  1968 నుంచి 1975 వరకు సంవత్సరానికి 10 కంటే ఎక్కువ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు కృష్ణ. అత్యధికంగా 1969లో 19 సినిమాలు చేశారు. అది ఇప్పటికీ రికార్డుగానే ఉంది. 1971లో పద్మాలయా ఫిలింస్‌ పతాకంపై సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తొలి పాన్‌ వరల్డ్‌ మూవీ. ఈ సినిమా ‘ట్రెజర్‌ హంట్‌’ పేరుతో ఇంగ్లీషులోకి అనువాదమై 150 దేశాల్లో రిలీజ్‌ అయింది. ఈ రికార్డును కూడా ఇప్పటి వరకు ఏ సినిమా క్రాస్‌ చెయ్యలేకపోయింది. తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న హీరోగా సూపర్‌స్టార్‌ కృష్ణ రికార్డు సాధించారు. అప్పట్లో ఆయనకు 2400 అభిమాన సంఘాలు ఉండేవి. ఒక సినిమా శతదినోత్సవానికి రాష్ట్రం నుంచి 30,000 మంది అభిమానులు 400 బస్సుల్లో మద్రాస్‌ తరలి వెళ్లారు. దీన్ని బట్టి ఆయనకు ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాలను స్వయంగా చదివి వారికి సమాధానం ఇచ్చేవారు కృష్ణ.  సినిమాల్లో హీరోగా అందరి మన్ననలు పొందడమే కాదు, నిజ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో హీరో అనిపించుకున్నారు కృష్ణ. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ తమ పాలిట దేవుడు అని నిర్మాతలు భావించేవారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా అన్ని ఏర్పాట్లు తానే చేసి కొందరు నిర్మాతలతో  సినిమాలు చేయించేవారు. అందులో వచ్చిన లాభాలను పూర్తిగా వారికే చెందేలా చూసేవారు. రిలీజ్‌ సమయంలో నిర్మాతలకు ఆర్థిక సమస్యలు ఏర్పడితే ఫైనాన్సర్స్‌కి తాను బాధ్యత వహిస్తూ సంతకాలు కూడా పెట్టేవారు. అలా సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మాతల హీరో అనిపించుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడుగా భావించే సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం ఎంతో మంది నిర్మాతలను మానసికంగా కృంగదీసింది. అలాంటి హీరో తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ లేరు, ఇకపై రారు అనే విధంగా అందరి మనసుల్లోనూ నిలిచిపోయిన సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

తనకు వ్యతిరేకంగా సినిమా తీసిన దర్శకుడు ఎదురుపడితే ఎన్‌.టి.ఆర్‌. ఏం చేశారో తెలుసా?

నటరత్న నందమూరి తారక రామారావు సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని వున్నాయి. తన ఇమేజ్‌ని పక్కన పెట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఫామ్‌లో ఉన్న హీరో ఎవరూ చేయడానికి సాహసించని కొన్ని పాత్రల్ని అద్భుతంగా పోషించి నిజమైన హీరో అనిపించుకున్నారు. అలాంటి వాటిలో ‘బడిపంతులు’ చిత్రంలోని వృద్ధుడి పాత్ర ఒకటి. నిజానికి ఎవరైనా క్యారెక్టర్‌ ఆర్టిస్టు పోషించాల్సిన ఆ పాత్రను చేసేందుకు ఎన్టీఆర్‌ ఆసక్తి చూపించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. అప్పటి వరకు పౌరాణిక, జానపద, కమర్షియల్‌ సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఎన్టీఆర్‌ పూర్తి సెంటిమెంట్‌తో కూడిన ఒక వృద్ధుడి పాత్ర చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు దగ్గర ప్రస్తావించారు అభిమానులు. ఇకపై అన్నగారు అలాంటి పాత్రలు చేయరు అని హామీ ఇచ్చిన తర్వాత వారు శాంతించారు. ‘బడిపంతులు’ సినిమా 1972 నవంబర్‌ 22న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించారు. ఒక అద్భుతమైన సినిమా చేశారనే ప్రశంసలు ఆయనకు లభించాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఒక విభిన్నమైన సినిమాని అందించిన పి.సి.రెడ్డికి ఆ తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రాకపోవడం గమనార్హం. తన కెరీర్‌ని సరైన విధంగా ప్లాన్‌ చేసుకోకపోవడం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగింది.  ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా హీరో కృష్ణ నిర్మించిన ‘నా పిలుపే ప్రభంజనం’ చిత్రానికి దర్శకత్వం వహించారు పి.సి.రెడ్డి. ఎన్టీఆర్‌తో ‘బడిపంతులు’ వంటి అందమైన చిత్రాన్ని రూపొందించిన పి.సి.రెడ్డి ఆయన్ని విమర్శిస్తూ సినిమా చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదలైన 7 సంవత్సరాల తర్వాత చదలవాడ బ్రదర్స్‌ ‘అన్నా వదిన’ పేరుతో సెంటిమెంట్‌ ప్రధానంగా ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమాకి చదలవాడ తిరుపతిరావు, చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతలు. పి.సి.రెడ్డి దర్శకుడు.  నందమూరి తారక రామారావు అంటే చదలవాడ బ్రదర్స్‌కి దైవంతో సమానం. అందుకే తమ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అన్నగారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆయనకి వ్యతిరేకంగా సినిమా తీయడం వల్ల పి.సి.రెడ్డి వారితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ, వారు పట్టుబట్టి పి.సి.రెడ్డిని కూడా తీసుకెళ్లారు. అయితే ఆయన కారులోనే కూర్చున్నారు. చదలవాడ బ్రదర్స్‌ మాత్రమే అన్నగారిని కలిసారు. ఆయన ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించారు. కృష్ణంరాజుతో తాము నిర్మించ తలపెట్టిన సినిమా గురించి ఆయనకు వివరించారు. హీరోయిన్‌గా ఎవరిని తీసుకున్నారు అని అడిగారు ఎన్టీఆర్‌. జయసుధ పేరు చెప్పారు చదలవాడ బ్రదర్స్‌. ఆ సయమంలో టేబుల్‌పై ఉన్న డైలీ పేపర్‌లో ‘జయసుధ ఆత్మహత్యాయత్నం...’ అనే హెడ్‌లైన్‌ చూసిన ఎన్టీఆర్‌ ‘ఆ అమ్మాయి ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంది.. జయప్రదను తీసుకోండి’ అని చెప్పారు. ‘మరి డైరెక్టర్‌ ఎవరు’ అని అడిగారు. అప్పుడు పి.సి.రెడ్డి పేరు చెప్పారు. అక్కడే ఉన్న చంద్రబాబునాయుడు ‘మనకు వ్యతిరేకంగా సినిమా తీశారాయన. మీరు ఓపెనింగ్‌కి వెళ్ళకండి’ అన్నారు. దానికి ఎన్టీఆర్‌ ‘అందులో ఆయన తప్పేముంది? నిర్మాతలు సినిమా చెయ్యమన్నారు, చేశారు. అయినా మనకు ‘బడిపంతులు’ వంటి అద్భుతమైన సినిమా చేశారు. మేం మీ సినిమా ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తాం’ అని చదలవాడ బ్రదర్స్‌కి హామీ ఇచ్చారు.  అన్నగారు చెప్పినట్టుగానే జయప్రదను హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘అన్నా వదిన’ చిత్రం ద్వారానే చదలవాడ తిరుపతిరావు కుమారుడు భరత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అతని సరసన సాక్షి శివానంద్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఎన్టీఆర్‌ కారు స్టూడియోలోకి ప్రవేశించగానే అందరి కంటే ముందు దర్శకుడు పి.సి.రెడ్డి కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అన్నగారు కారులో నుంచి దిగగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి ‘నన్ను క్షమించండి అన్నగారు.. చాలా తప్పు చేశాను’ అన్నారు. దానికి ఎన్టీఆర్‌ ‘అదేం లేదు. లేవండి బ్రదర్‌’ అంటూ ఆప్యాయంగా భుజాలు పట్టుకొని పైకి లేపారు. ఈ సినిమా ముహూర్తపు షాట్‌ను కృష్ణంరాజు, జయప్రద, రాజ్‌కుమార్‌, భరత్‌, సాక్షి శివానంద్‌లపై చిత్రీకరించారు. నారా చంద్రబాబు నాయుడు క్లాప్‌ నివ్వగా, నటరత్న ఎన్టీఆర్‌ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. అలా ఎన్టీఆర్‌ ఆశీస్సులతో ప్రారంభమైన ‘అన్నా వదిన’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది.

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహా పురుషులౌతారు!

‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అనే పాట వేటూరి కలం నుంచి ఏ శుభ ముహూర్తాన జాలువారిందోగానీ నూటికి నూరుపాళ్ళూ ఆ పాటకు, అందులోని భావాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. ఎన్‌.టి.రామారావు. తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్‌. సాధారణ వ్యక్తి నుంచి ఒక మహోన్నత శక్తిగా ఎదిగిన ఆయన జీవన క్రమం అందరికీ ఆదర్శప్రాయం. భావితరాలకు బంగారు బాట వేయాలనే తపనతోనే తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా సాగించారు.  నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన సాధించిన విజయాల గురించి తెలియని తెలుగువారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. చిన్నతనం నుంచీ నటనపై మక్కువ పెంచుకున్న ఎన్టీఆర్‌ కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. కాలేజీ రోజుల్లోనే నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ తర్వాత ఆ సంస్థ పేరుతోనే కొన్ని సినిమాలను కూడా నిర్మించారు ఎన్టీఆర్‌. ఆయనకు నటనలోనే కాదు, చిత్రలేఖనంలో కూడా ప్రవేశం ఉంది. రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో చిత్రకారుడిగా బహుమతి కూడా అందుకున్నారు ఎన్టీఆర్‌. 1947లో బి.ఎ. పట్టా అందుకున్న ఎన్టీఆర్‌ మద్రాస్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసారు. పరీక్ష రాసిన 1100 మందిలో ఎంపికపై ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఆయనలో బలీయంగా ఉండడంతో ఆ ఉద్యోగంలో మూడు వారాలు మాత్రమే కొనసాగారు ఎన్టీఆర్‌. 1949లో విడుదలైన ‘మనదేశం’ ఆయన నటించిన మొదటి సినిమాయే అయినా.. నటుడిగా మొదటి అవకాశం మాత్రం ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం రూపంలో వచ్చింది. ఈ సినిమా ఆలస్యంగా ప్రారంభమై 1950లో విడుదలైంది.  పాతాళభైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసిచూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌.టి.రామారావుకు ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. ఈ సినిమాల నిర్మాణ సమయంలో నెలకు రూ.500 జీతం, సినిమాకి రూ.5,000 పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత మాయాబజార్‌ సినిమాకి ఎన్టీఆర్‌ రూ.7,500 అందుకున్నారు. అప్పట్లో ఇదే అత్యధిక పారితోషికం. ఆ తర్వాత ఆయన చేసిన పౌరాణిక చిత్రాల్లోని అవతార పురుషులకు ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి.. ఇలా ప్రజలకు కనిపించే దైవంగా మారారు ఎన్టీఆర్‌. తను చేసే పాత్రల ఎంపికలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు ఎన్టీఆర్‌. ఎంతమంది విమర్శించినా సీతారామకళ్యాణం చిత్రంలో రావణ పాత్రను పోషించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటిసారి ఒక పౌరాణిక చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. పౌరాణిక, జానపద చిత్రాల్లోనే కాదు, సాంఘిక చిత్రాల్లోనూ ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలు పోషించారు. తెలుగు సినిమాకి మొదటి కమర్షియల్‌ హిట్‌ని అందించిన ఘనత ఎన్టీఆర్‌దే. 1977లో అడవిరాముడు కమర్షియల్‌ విజయాన్ని అందుకొని అప్పటికి అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ క్రమంలోనే వేటగాడు, డ్రైవర్‌ రాముడు, యమగోల, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం.. వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్‌ సినిమాల జోరును పెంచారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించారు. పౌరాణిక చిత్రాల్లో దాదాపు అందరు అవతార పురుషుల పాత్రలను పోషించిన ఎన్టీఆర్‌ను తెలుగువారు కనిపించే దేవుడుగా కొలుస్తారు. 44 ఏళ్ళ సినీ జీవితంలో 186 సాంఘిక చిత్రాలు, 13 చారిత్రక సినిమాలు, 55 జానపద చిత్రాలు, 44 పౌరాణిక సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రజల ఆరాధ్యదైవంగా మారారు.  అందరూ ఎంతో అభిమానంగా ‘అన్న’ అని పిలుచుకునే ఆ మహానుభావుడు.. ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలకు ఆదర్శప్రాయమైన ప్రత్యామ్నాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రజా నాయకుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్‌. ఆయన సమకాలికుల్లో అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు మరొకరు లేదు. 1978లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సమస్యల వల్ల స్థిరంగా ఐదేళ్ళ పాలన సాగించలేకపోయారు. నాలుగు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ఆ దశలో తెలుగుదేశం అనే కొత్త పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్‌ కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిరచి అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్‌.టి.రామారావు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. అంతేకాదు, పురోహితులుగా బ్రాహ్మణులే కాదు, ఏ కులం వారైనా వ్యవహరించవచ్చు అనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందరో ముఖ్యమంత్రుల్లా ఎన్‌.టి.రామారావు బాబాలను, మాతలను నమ్మేవారు కాదు. ఆయన అపారమైన దైవభక్తి ఉంది. ముఖ్యంగా బుద్ధునిపట్ల ఆరాధ్య భావం ఉంది. ఎన్‌.టి.రామారావు పాలనలో ప్రజల మధ్య కుల ప్రస్తావన ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నట్టే.. తమ పార్టీలో ఉన్న వారి విషయంలోనూ దాన్ని అమలు చేశారు. బడుగు, బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. పేదవారిని పట్టి పీడుస్తున్న పటేల్‌, పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారారు ఎన్‌.టి.రామారావు. ఆ మహానటుడు, మహోన్నత నాయకుడి జయంతి మే 28. ఈ సందర్భంగా ఆ యుగపురుషుడికి, కారణజన్ముడికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

తొలిరోజుల్లో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ తనను ఆదరించిన తీరుకు ఆశ్చర్యపోయిన కృష్ణంరాజు!

ఏ నటుడికైనా, ఏ నటికైనా ప్రశంస అనేది ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు కొత్త ఉత్సాహాన్ని గుండెల్లో నింపుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో కొత్త నటీనటులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిని చులకన భావంతో చూడడం కొంతమంది సీనియర్స్‌ నైజం. కానీ, కొందరు మాత్రం అలా ఉండరు. కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అలాంటి అరుదైన సంఘటనలు తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైనట్టు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్వూలో తెలిపారు. తనను ఎంతో ప్రోత్సహించి తన ఎదుగుదలకు కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వి.రంగారావు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింకా’ చిత్రంతో కృష్ణంరాజు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన కృష్ణకుమారి ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌ సమీపంలోని భువనగిరి కోటలో జరిగింది. చాలా భాగం షూటింగ్‌ జరిగిన తర్వాత ఎస్‌.వి.రంగారావు కాంబినేషన్‌లో కృష్ణంరాజు నటించాల్సి ఉంది. కానీ, దానికి సంబంధించిన సీన్‌ పేపర్స్‌ మద్రాస్‌ నుంచి ఆత్రేయ పంపించాలి. ఈ విషయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఆత్రేయ ‘చిలకా గోరింకా’ సినిమా విషయంలో కూడా అదే చేశారు. ఓ పక్క ఎస్వీఆర్‌ డేట్స్‌ అయిపోతున్నాయి. మరుసటి రోజు మరో సినిమా షూటింగ్‌కి హాజరు కావాల్సి ఉంది. చివరి రోజు సాయంత్రం 4 గంటలకు సీన్‌ పేపర్స్‌ వచ్చాయి. తన కాంబినేషన్‌లో నటించబోతున్న కృష్ణంరాజును చూసి ‘కొత్త కుర్రాడితో ఈ సీన్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుంది’ అని చిరాకు పడ్డారు ఎస్వీఆర్‌. షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రతి షాట్‌ను సింగిల్‌ టేక్‌లో ఓకే చేస్తున్న కృష్ణంరాజును చూసి ఎస్వీఆర్‌ ముగ్ధుడైపోయారు. ఒకరోజు పట్టే షూటింగ్‌ రెండు గంటల్లో పూర్తయింది. కృష్ణంరాజును ఎస్వీఆర్‌ విశేషంగా ప్రశంసించారు. మరుసటిరోజు ఎస్వీఆర్‌ మద్రాస్‌ వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత యూనిట్‌ సభ్యులంతా మద్రాస్‌ చేరుకున్నారు. కృష్ణంరాజు పరిచయస్తులంతా తనని అభినందిస్తుంటే ఆశ్చర్యం కలిగింది. తన గురించి ఎస్వీఆర్‌ అందరికీ చెప్పడం వల్లే తనకు కంగ్రాట్స్‌ చెబుతున్నారని కృష్ణంరాజుకి అర్థమైంది. ఎస్వీఆర్‌ అక్కడా, ఇక్కడా చెప్పిన మాటలు పేపర్లు సైతం ప్రచురించాయి. దీంతో కృష్ణంరాజుకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. మద్రాసులో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న స్టూడియోలోనే శ్రీకృష్ణతులాభారం షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌ను చూద్దామని ఆ సెట్‌కి వెళ్లిన కృష్ణంరాజును చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. తన పక్కన కూర్చోబెట్టుకొని ‘ఎస్వీఆర్‌ నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని ఆశీర్వదించారు. తన మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్‌ అవ్వలేదు. అలాంటిది తనతో ఆయన అంత ప్రేమగా మాట్లాడడం కృష్ణంరాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది.   ‘చిలకా గోరింకా’ 1966 జూన్‌ 10న విడుదలైంది. సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినా కృష్ణంరాజు చెయ్యడానికి ఒప్పుకోలేదు. నటనలో మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూశారు. కానీ, ఎవరూ ఛాన్స్‌ ఇవ్వలేదు. ఒక సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు కృషంరాజు. ‘ఇంటి దొంగలు’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత హీరోగా బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే చలసాని గోపి, హరిరామజోగయ్యలతో కలిసి ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణంరాజు. ఈ సినిమా ఫస్ట్‌కాపీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా షో వేసి ఎన్టీఆర్‌కు చూపించారు. సినిమా చూసిన ఆయన ఎంతో ప్రశంసించారు. రివర్స్‌ సెంటిమెంట్‌ కథాంశంతో ఎంతో ధైర్యంగా సినిమా చేశారన్నారు. ఈ సినిమా గురించి ఎంతో మంది ఎన్నోరకాలుగా చెబుతారని, అవేవీ పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా శతదినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దానికి ముఖ్యఅతిథిగా ఎన్‌.టి.రామారావును ఆహ్వానించారు. కానీ, ఆ సమయంలో షూటింగ్‌ ఉందని, కుదరకపోవచ్చని, అవకాశం ఉంటే తప్పకుండా వస్తానని అన్నారు ఎన్టీఆర్‌. ఇచ్చిన మాట కోసం షూటింగ్‌నే క్యాన్సిల్‌ చేసుకొని ఫంక్షన్‌కు హాజరయ్యారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత కృష్ణంరాజు నిర్మాణంలోనే రూపొందిన ‘భక్త కన్నప్ప’ ఫస్ట్‌ కాపీని కూడా మొదట ఎన్టీఆర్‌కే చూపించారు. సినిమా చూసిన ఎన్టీఆర్‌ క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చెప్పారు. అలా చేస్తే ఇంకా ఇంపాక్ట్‌ ఉంటుందని అన్నారు. కానీ, ఆ మార్పులు చేసేందుకు దర్శకుడు బాపు ఒప్పుకోలేదు. అలాగే రిలీజ్‌ చేశారు. ‘భక్త కన్నప్ప’ విడుదలై సంచలన విజయం సాధించింది. అలా కెరీర్‌ ప్రారంభంలోనే ఎస్‌.వి.రంగారావు, ఎన్‌.టి.రామారావు వంటి దిగ్గజ నటుల ప్రోత్సాహం కృష్ణంరాజుకి లభించింది. ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే అసూయపడే మన సమాజంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టే కృష్ణంరాజు వంటి నటులు వెలుగులోకి వచ్చారు. తన ఎదుగుదలకు కారకులైన వారిద్దరి గురించి ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపేవారు కృష్ణంరాజు.

పోస్టర్స్‌లో దర్శకుడిగా దాసరి నారాయణరావు పేరును తీసేసి ఆఫీస్‌బోయ్‌ పేరు వేసిన నిర్మాత!

రచయితగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 250 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన దర్శకరత్న దాసరి నారాయణరావును ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత కె.రాఘవ. తనను దర్శకుడిగా పరిచయం చేసిన రాఘవ పట్ల ఎప్పుడూ గౌరవంగానే ఉండేవారు దాసరి. అయితే ‘తూర్పు పడమర’ చిత్ర నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి సద్దుమణగకపోగా తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ విభేదాలు రావడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.  తమిళ్‌లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’ పేరుతో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, శ్రీవిద్య, జయసుధ నటించారు. తమిళ్‌లో ముఖ్యపాత్ర పోషించిన శ్రీవిద్య తెలుగులోనూ అదే పాత్రలో నటించారు. మిగతా పాత్రలను సత్యనారాయణ, మోహన్‌బాబు, నరసింహరాజు, మాధవి పోషించారు. సత్యనారాయణ, నరసింహరాజు తండ్రీకొడుకులుగా... శ్రీవిద్య, మాధవి తల్లీకూతుళ్ళుగా నటించారు. తమిళ్‌లో రజినీకాంత్‌ చేసిన పాత్రను తెలుగులో మోహన్‌బాబు పోషించారు. తనకంటే వయసులో పెద్దదైన శ్రీవిద్యను నరసింహరాజు ప్రేమిస్తాడు, అలాగే శ్రీవిద్య కూతురు మాధవి తనకంటే వయసులో పెద్దవాడైన నరసింహారాజు తండ్రిని ప్రేమిస్తుంది. ఈ విచిత్రమైన ప్రేమకథ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భేతాళ కథల్లో జవాబులేని ఆఖరి ప్రశ్నగా ఈ కథ ఉంటుంది. బాలచందర్‌ తీసిన ఎన్నో సినిమాలు ఒక పజిల్‌లాగే అనిపిస్తాయి. ఈ కథ కూడా ఆ కోవలోనే నడుస్తుంది.  తనను దర్శకుడుగా పరిచయం చేసిన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో దాసరి నారాయణరావు చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచీ దాసరి, నిర్మాత రాఘవ మధ్య విభేదాలు మొదలయ్యాయి. తమిళ్‌లో నటించిన ఆర్టిస్టులతోనే తెలుగులోనూ తీస్తే కొన్ని సన్నివేశాలు మళ్ళీ తియ్యాల్సిన అవసరం ఉండదని, వాటినే తెలుగు వెర్షన్‌కి కూడా వాడుకోవచ్చని రాఘవ అభిప్రాయపడ్డారు. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ, దాసరి మాత్రం దానికి అంగీకరించలేదు. ఆ సన్నివేశాలనే తెలుగులోనూ వాడేట్టయితే మళ్ళీ తెలుగులో తియ్యడం దేనికి? దాన్నే తెలుగులోకి డబ్‌ చేస్తే సరిపోతుంది కదా అన్నారు దాసరి. దీంతో దాసరిపై రాఘవకు విపరీతమైన కోపం వచ్చింది. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. చివరికి తన నిర్ణయాన్నే అమలు పరిచారు దాసరి.  తమిళ్‌ వెర్షన్‌కు కొన్ని మెరుగులు దిద్ది ‘తూర్పు పడమర’ చిత్రాన్ని రూపొందించారు దాసరి. ఈ సినిమాకి దర్శకుడిగానే కాదు, మాటల రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1976 అక్టోబర్‌ 24న ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. రమేష్‌నాయుడు సంగీత సారధ్యంలో రూపొందిన అన్ని పాటలు విజయఢంకా మోగించాయి. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా ఇవే పాటలు వినిపించేవి. అంతగా ఈ సినిమాలోని పాటలు పాపులర్‌ అయ్యాయి. అయితే ఈ విజయాన్ని నిర్మాత రాఘవ ఆస్వాదించలేకపోయారు. ఎందుకంటే సినిమా ప్రారంభం నుంచి దాసరి నారాయణరావు మీద ఎంతో కోపంగా ఉన్నారాయన. ఆరోజుల్లో పబ్లిసిటీ పోస్టర్స్‌లో తమ పేర్లను వెరైటీగా వేసుకునేవారు కె.బాలచందర్‌, దాసరి నారాయణరావు. డైరెక్టర్‌గా వారి పేర్లను మబ్బుల్లో వేసుకునేవారు. ‘తూర్పు పడమర’ చిత్రానికి కూడా దాసరి అలాగే చేశారు. కానీ, దాసరి మీద ఉన్న కోపంతో మబ్బుల్లో ఉన్న దాసరి పేరును తీసేసి ఆ స్థానంలో ‘ఆఫీస్‌ బోయ్‌ గోపాల్‌’ అనే పేరును వేసి తన కక్ష తీర్చుకున్నారు రాఘవ. దర్శకుడు దాసరి పేరు వున్న స్థానంలో ఆఫీస్‌ బోయ్‌ పేరుతో పోస్టర్స్‌ ప్రింట్‌ చేయించడంపై ఆ తర్వాత పెద్ద గొడవే జరిగింది. ఈ ఉదంతంతో దాసరి నారాయణరావు, కె.రాఘవల మధ్య దూరం పెరిగింది. ఈ వివాదం తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చెయ్యలేదు.

ఇది తెలుసా.. రావుగోపాలరావు నటనకు ఎస్‌.వి.రంగారావు పెద్ద ఫ్యాన్‌!

ఇదెలా సాధ్యం?.. ఎస్‌.వి.రంగారావు 1974లోనే కన్నుమూసారు. ఇక రావుగోపాలరావుకి నటుడిగా మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు’. అంతకుముందు ఓ ఇరవై సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అతనిలోని నటనా పటిమ గురించి ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు రావుగోపాలరావు నటనకు ఎస్‌.వి.రంగారావు ఫ్యాన్‌ ఎలా అవుతారు అనుకోవచ్చు. కానీ, ఇది అక్షరాలా నిజం. నాటక రంగం నుంచి వచ్చిన వారు సినిమాల్లో తప్పకుండా రాణిస్తారు అనడానికి రావుగోపాలరావు గొప్ప ఉదాహరణ. అయితే ఆయనకు నటన కంటే దర్శకత్వంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. నటుడు కావాలన్న ఆలోచన రావుగోపాలరావుకి లేదు. ఓసారి కాకినాడలో ‘కీర్తిశేషులు’ అనే నాటకంలో మురారి పాత్రను పోషించడమే కాకుండా ఆ నాటకానికి దర్శకత్వం కూడా వహించారు గోపాలరావు. ఆ నాటకాన్ని ఎస్‌.వి.రంగారావు తిలకించి గోపాలరావు బృందాన్ని అభినందించారు. కాకినాడలో ఎస్వీఆర్‌ బంధువు ఉండడం వల్ల తరచూ అక్కడికి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా గోపాలరావు నాటకాలను చూసేవారు. ఆయన నటన చూసి ఎస్వీఆర్‌ ఎంతో ముగ్ధులయ్యేవారు. ఆయన డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ని ఎనలైజ్‌ చేసేవారు. ఓ నాటకంలో ఆయన నటన చూసి ‘నేను నీ అభిమానినయ్యా’ అని రావుగోపాలరావుతో చెప్పారు ఎస్వీఆర్‌. అంత గొప్ప నటుడై ఉండి కూడా తనకు అభిమానినని చెప్పడంతో ఆయనపై గోపాలరావుకు ఎంతో గౌరవం పెరిగింది. గోపాలరావును ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకున్న ఎస్వీఆర్‌ ఆయన్ని మద్రాస్‌ పిలిపించారు. దర్శకుడు జి.రామినీడు రూపొందిస్తున్న ‘భక్తపోతన’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా  పనిచేసే అవకాశం కల్పించారు. అంతేకాదు, ఆ సినిమాలో రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర ఇప్పించారు. ఆ క్యారెక్టర్‌ రావుగోపాలరావుకి ఇప్పించడం వెనుక ఓ కథ ఉంది. ఆ సినిమాలో శ్రీనాథుని పాత్రను పోషించారు ఎస్వీఆర్‌. శృంగార నైషధాన్ని రాజుకి అంకితమిచ్చే సన్నివేశం సినిమాలో ఉంటుంది. ఆ రాజు పాత్ర ఎవరో చేస్తే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టడం ఇష్టంలేని ఎస్వీఆర్‌.. ఆ పాత్రకు అర్హుడు రావుగోపాలరావే అని భావించి అతనిచేత ఆ వేషం వేయించారు. ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గోపాలరావు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఆయన నటన, వాయిస్‌ నచ్చి తను నిర్మిస్తున్న ‘జగత్‌కిలాడీలు’ చిత్రంలో విలన్‌ భయంకర్‌గా నటించే అవకాశం ఇచ్చారు నిర్మాత రాఘవ. అయితే సినిమా పూర్తయిన తర్వాత రావుగోపాలరావు వాయిస్‌ బాగాలేదని పంపిణీదారులు చెప్పడంతో వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఆయన వాయిస్‌ బాగా లేదని చాలా మంది అనేవారు. ఇది గోపాలరావును ఎంతో బాధించేది.  అప్పటివరకు తనను విమర్శించిన వారితోనే శభాష్‌ అనిపించుకోవాలన్న పట్టుదలతో నటనలో, డైలాగ్‌ డెలివరీలో ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని తనను తాను మార్చుకున్నారు గోపాలరావు. ఆ తర్వాత రావుగోపాలరావు చాలా సినిమాల్లో చెప్పిన డైలాగ్స్‌ ఎంత పాపులర్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎంతో మంది విమర్శించిన ఆ స్వరమే కొన్నాళ్ళ తర్వాత మిమిక్రీ కళాకారుల పాలిట వరంగా మారింది. రావుగోపాలరావు వాయిస్‌ని ఇమిటేట్‌ చెయ్యకుండా ఏ మిమిక్రీ కళాకారుడు ప్రదర్శన ఇవ్వరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా రావుగోపాలరావుకు పెద్ద బ్రేక్‌ ఇచ్చిన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ చిత్రంలోని రావుగోపాలరావు డైలాగ్స్‌ ఎంత పాపులర్‌ అయ్యాయంటే.. కొలంబియా రికార్డింగ్‌ కంపెనీ కేవలం డైలాగులతో కూడిన రికార్డ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటివరకు సినిమా పాటలే రికార్డులుగా వచ్చేవి. కేవలం డైలాగులతో రికార్డు విడుదల కావడం అదే ప్రథమం. ఆ ఘనతను దక్కించుకున్నారు రావుగోపాలరావు. ‘ముత్యాల ముగ్గు’ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించారు. మూడు తరాల హీరోలకు విలన్‌గా నటించిన ఘనత రావుగోపాలరావుది. దాదాపు 400 సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ఆయన ఎక్కువగా విలన్‌గానే నటించారు.  కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమాలో విలన్‌ అంటే రావుగోపాలరావే. సినిమాల్లో భయంకరమైన విలన్‌గా కనిపించే ఆయన నిజజీవితంలో ఎంతో సాత్వికమైన మనసు కలవారు. అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. దానికి ఉదాహరణ.. తన వైవాహిక జీవితంలో ఏనాడూ తన భార్యను ఏకవచనంతో పిలిచి ఎరుగరు రావుగోపాలరావు. హరికథ కళాకారిణి అయిన కమలకుమారిని కాకినాడలో హరికథ చెబుతుండగా చూసి ఆమెతో ప్రేమలో పడిపోయారు. 1966లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల్లో రావు రమేష్‌ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటూ తండ్రి పేరును నిలబెడుతున్నారు.

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 14 సార్లు చూసిన శోభన్‌బాబు సినిమా ఇదే!

సినిమా నచ్చితే ఒకటికి రెండుసార్లు చూడడం సహజమే. లెక్కకు మించిన సార్లు ఒక సినిమాను చూసిన వారూ ఉన్నారు. అయితే ఒక తమిళ స్టార్‌.. తెలుగు హీరో శోభన్‌బాబు సినిమాను 14 సార్లు చూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఇది జరిగి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఆ సినిమా పేరు ‘మానవుడు దానవుడు’. 1972లో ఈ సినిమా రిలీజ్‌ అయింది. అప్పటికి బెంగళూరులో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నారు రజినీకాంత్‌. తాను ‘మానవుడు దానవుడు’ చిత్రాన్ని 14 సార్లు చూశానని ఒక సందర్భంలో స్వయంగా రజినీకాంత్‌ తెలియజేశారు. అసలు ఆ సినిమాని రజినీ అన్నిసార్లు ఎందుకు చూశారు? ఆ సినిమాలోని విశిష్టత ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం. 1959లో చిత్ర పరిశ్రమకు వచ్చిన శోభన్‌బాబు మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత హీరో అయినప్పటికీ ఆయనకి మొదటి కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మానవుడు దానవుడు’. పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయం తర్వాత శోభన్‌బాబు తన రెమ్యునరేషన్‌ను లక్ష రూపాయలకు పెంచారు. లక్ష రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరో శోభన్‌బాబే.  అప్పటివరకు అన్నీ సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ వచ్చిన శోభన్‌బాబు మొదటిసారి ఒక ఎగ్రెసివ్‌ క్యారెక్టర్‌ చేసి మెప్పించారు. పగలు డాక్టర్‌ వేణుగా ఎంతో డీసెంట్‌గా ఉండే క్యారెక్టర్‌లో కనిపించే శోభన్‌బాబు, రాత్రి కాగానే ప్రతీకారం తీర్చుకునే జగన్‌ పాత్రలో పూర్తి వేరియేషన్‌ చూపించారు. క్లాస్‌ పాత్రలే కాదు, మాస్‌ క్యారెక్టర్స్‌ కూడా చేసి మెప్పించగలనని ‘మానవుడు దానవుడు’ చిత్రంతో ప్రూవ్‌ చేశారు శోభన్‌బాబు. క్లాస్‌ ఇమేజ్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఆ సమయంలో జగన్‌లాంటి క్యారెక్టర్‌ చెయ్యడం నిజంగా సాహసమనే చెప్పాలి.  ప్రస్తుతం సొసైటీలో దిశ, నిర్భయలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. 50 ఏళ్ళ క్రితమే ఇలాంటి ఓ కథావస్తువును తీసుకొని కమర్షియల్‌గా హిట్‌ సాధించిన దర్శకుడు పి.సి.రెడ్డి. ఈ సినిమాలో హీరో చిన్నతనంలో అతని అక్కకు అలాంటి అన్యాయమే జరుగుతుంది. అతను పెరిగి పెద్దయిన తర్వాత ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే రాక్షసులను వెంటాడి చంపుతుంటాడు. ఇందులో సి.నారాయణరెడ్డి రాసిన ‘ఎవరు వీరు ఎవరు వీరు..’ అనే పాట రాశారు. వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు అనుభవిస్తున్న మహిళలను ఉద్దేశించి ఆ పాటను రాశారు నారాయణరెడ్డి. రోజుకి రెండు, మూడు షాట్స్‌ చొప్పున 20 రోజులు ఈ పాటను చిత్రీకరించడం విశేషం. చెన్నయ్‌లోని ప్రసాద్‌ రికార్డింగ్‌ థియేటర్‌లో రికార్డ్‌ అయిన తొలి పాట ఇదే. ఈ పాటను ఎస్‌.పి.బాలు పాడారు. అంత మంచి పాటను తను పాడినట్టుగా కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌గా పెట్టడంతో ఫీల్‌ అయ్యారు. ఇదే సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేసినపుడు తెలుగులో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్‌ శివాజీ గణేశన్‌ పాడినట్టు చూపించారు. కానీ, తమిళ ప్రేక్షకులకు అలా చేయడం నచ్చలేదు.  1972లో విడుదలైన ‘మానవుడు దానవుడు’ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు 3 లక్షల 60 వేలు. సినిమా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించి మొదటి రెండు వారాల్లోనే రూ.11 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ఈ సినిమాను అలంకార్‌ థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీని ద్వారా వచ్చిన రూ.18వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఒక బెనిఫిట్‌ షో ద్వారా అంత మొత్తం వసూలు చేసిన తొలి సినిమా ‘మానవుడు దానవుడు’.

ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసం నెలరోజులు.. సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది!

ఒక సినిమా నిర్మాణం ఎంత కాలంలో పూర్తవుతుందీ అనేది ఆ సినిమా హీరో, కథ, బ్యాక్‌డ్రాప్‌, జోనర్‌ని బట్టి ఉంటుంది. కొన్ని సినిమాలు ఆరు నెలల్లో పూర్తి కావచ్చు, మరికొన్ని సినిమాలు ఆరేళ్ళు పట్టొచ్చు. అలా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘అంజి’ సినిమా పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. గ్రాఫిక్స్‌ ప్రధానంగా, ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి హయ్యస్ట్‌ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సోషియో ఫాంటసీ మూవీ అనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో గ్రాఫిక్స్‌కి అంతగా ప్రాధాన్యం లేదు. 2004లో విడుదలైన పూర్తి గ్రాఫిక్స్‌తో ‘అంజి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి. అసలు చిరంజీవితో గ్రాఫిక్స్‌ ప్రధానంగా సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన విశేషాల గురించి దర్శకుడు కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.  ‘నా సినిమా కెరీర్‌లో నాకు బాగా గుర్తుండిపోయే సినిమా ‘అంజి’. ఈ సినిమా నిర్మాణంలో ఎంతో మంది కృషి ఉంది. ముందుగా అందర్నీ అభినందించాలి. అందర్నీ మించి నిర్మాత శ్యాంప్రసాద్‌కి పూర్తి క్రెడిట్‌ ఇవ్వాలి. ఎందుకంటే ‘అమ్మోరు’ వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత శ్యామ్‌గారికి చిరంజీవిగారు డేట్స్‌ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా ఒక కమర్షియల్‌ సినిమా ప్లాన్‌ చేసుకుంటారు. కానీ, శ్యామ్‌గారు మాత్రం ఆయనతో ఒక గ్రాఫిక్స్‌ సినిమా చెయ్యాలని ఉంది అన్నారు. ‘చిరంజీవిగారితో గ్రాఫిక్స్‌ సినిమా ఎందుకండీ. నా దగ్గర ఒక కమర్షియల్‌ కథ ఉంది. అది చేద్దాం’ అన్నాను. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ఇలా కాదని, ఆయనకు తెలియకుండా చిరంజీవిగారిని కలిసి విషయం చెప్పాను. గ్రాఫిక్స్‌తో సినిమా అంటే ఎంతో రిస్క్‌ కూడుకున్నదని, ఎక్కువ టైమ్‌ కూడా పడుతుందని నచ్చజెప్పాను. దానికి చిరంజీవిగారు ఎంతో కూల్‌గా ‘మీరు ఏం కంగారు పడకండి. ఎంత రిస్కయినా చేద్దాం. నా పూర్తి కోఆపరేషన్‌ ఉంటుంది’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సినిమా కోసం ఎంతో రిస్క్‌ తీసుకున్నారు. సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది. ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ తియ్యడానికి నెలరోజులు పట్టింది. ఒక టాప్‌ హీరో తన సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు ఓపికగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న సీన్‌ కోసం 120 షాట్స్‌ వరకు తియ్యాల్సి వచ్చేది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి.  ఈ సినిమాలోని ఒక కాస్ట్యూమ్‌ను రెండు సంవత్సరాలు వేసుకున్నారు చిరంజీవిగారు. ఎందుకంటే గ్రాఫిక్స్‌ కోసం ఆ కాస్ట్యూమ్‌కి కొన్ని మార్కులు పెట్టేవాళ్ళం. దాన్ని వాష్‌ చెయ్యడానికి వీలు లేదు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి వర్క్‌ చేశారు. సినిమాపై భారీ అంచనాలు ఉండడం వల్ల రిలీజ్‌ తర్వాత ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ రాలేదు. అయితే అది నా దృష్టిలో ‘అంజి’ ఒక గొప్ప సినిమా. మొదట సాధారణమైన సినిమాలాగే అనిపించినా చూడగా చూడగా అందరికీ నచ్చింది. ఇప్పటికీ టీవీలో ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని వివరించారు దర్శకుడు కోడి రామకృష్ణ.

గుమ్మడికి గుండెపోటు వచ్చింది.. థియేటర్‌లో నవ్వులే నవ్వులు!

ఏ నటుడికైనా అన్ని రకాల పాత్రలు పోషించాలి అనే కోరిక ఉంటుంది. అలా నవరసాలూ పోషించే అవకాశం కొందరికే దక్కుతుంది. సాత్విక పాత్రలైనా, హాస్య పాత్రలైనా, విలన్‌ పాత్రలైనా.. ఇలా ఏ రకమైన పాత్రలోనైనా జీవించే అవకాశం వస్తుంది. ప్రేక్షకులు కూడా వారు ఏ క్యారెక్టర్‌ చేసినా ఆదరిస్తారు. కానీ, కొందరి విషయంలో అలా జరగదు. ఒక సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వస్తే.. ఆ తర్వాత సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్సే చెయ్యాల్సి వస్తుంది. కళాకారులకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇదే ఇబ్బంది పాత తరం నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుకు అనే సందర్భాల్లో ఎదురైంది. ఈ విషయాన్ని ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.  ‘నేను అదృష్టదీపుడు అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో అలాంటి పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలు పోషించే అవకాశం నాకు రాదు అని గట్టిగా నిర్ణయించుకొని ఊరికి వెళ్లిపోదామనుకుంటున్న తరుణంలో ఎన్‌.టి.రామారావుగారితో పరిచయం ఏర్పడింది. ఆయన ననెంతో ఆదరించారు. ఆ సమయంలోనే ఆయన నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ అనే బేనర్‌ స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో నాకు ప్రధాన పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమాలో రామారావుగారి కంటే పెద్దవాడిగా నటించాను. ఈ సినిమా చూసిన డైరెక్టర్‌ పుల్లయ్యగారు ఆయన చేస్తున్న ‘అర్థాంగి’ సినిమాలో జమిందారు క్యారెక్టర్‌ ఇచ్చారు. అప్పటికి నా వయసు 27 సంవత్సరాలే. అందులో నా రెండో భార్యగా నటించిన శాంతకుమారిగారు నాకన్నా పది సంవత్సరాలు పెద్దవారు. ఈ సినిమాలో నాకు కొడుకులుగా నాగేశ్వరరావుగారు, జగ్గయ్యగారు నటించారు. వాళ్ళిద్దరూ నా కంటే పెద్దవారే. అలా చిన్న వయసులోనే పెద్ద వయసు క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది. ఆ తర్వాత అవే వేషాలు రావడం మొదలైంది. అలా ఎన్నో సినిమాల్లో వృద్ధుడిగా నటించాను. ప్రతి సినిమాలోనూ తండ్రి, తాత, పెదనాన్న, బాబాయ్‌, మావయ్య.. ఇలా అన్నీ నా వయసుకు మించిన పాత్రలే చేశాను.  అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. ‘గుండెపోటు’. ఒక దశలో ఈ మాట వింటేనే భయపడేవాడ్ని. ఏ ఆర్టిస్టుకైనా ఇది ఒక శాపమే. ఒకే తరహా పాత్రలు వరసగా రావడం కొంత బాధ కలిగించే విషయమే. నేను గుండె పట్టుకుంటే థియేటర్‌లో జనం నవ్వుకునే స్థాయికి వచ్చేశారు. అప్పటి నుంచి ఏ సినిమా అవకాశం వచ్చినా ‘నేను మధ్యలోనే చనిపోతానా.. లేక చివరి వరకు ఉంటానా’ అని అడిగి మరీ ఒప్పుకునేవాడిని. ఒకసారి ఒక సినిమాలో నా వేషం గురించి చెబుతూ గుండెపోటుతో మీరు చనిపోతారు అని చెప్పారు. అప్పుడు ‘చచ్చిన చావు చావకుండా చచ్చేన్ని చావులు చచ్చాను. ఇక ఈ చావు నేను చావలేను. నన్ను చంపకండి’ అంటూ నామీద నేనే జోక్‌ వేసుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్లు చేసి చేసి నాకే విసుగొచ్చేసింది. ఇక జనం మాత్రం ఎంత కాలం భరిస్తారు’ అంటూ సరదాగా చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు.

టాలీవుడ్‌లో ఆ క్వాలిటీస్‌ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్‌!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో నవరసాలూ పలికించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున చెప్పే పేరు ఎన్టీఆర్‌. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను తన నటనలో ఎంతో ఈజీగా చూపించగల నటుడు ఎన్టీఆర్‌. ఏ షాట్‌ అయినా డైరెక్టర్‌కి కావాల్సిన విధంగా సింగిల్‌ టేక్‌లో చేసి ఓకే చెప్పించుకునే హీరో ఎన్టీఆర్‌. ‘నిన్ను చూడాలని’ చిత్రం నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, మాస్‌ యాక్షన్‌తో కూడిన సినిమాలు చేసిన ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ చిత్రం చేస్తున్నారు. మే 20 ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.  ప్రస్తుతం నందమూరి తారక రామారావుగా పిలవబడుతున్న ఎన్టీఆర్‌ అసలు పేరు తారక్‌రామ్‌. నందమూరి హరికృష్ణ తన కుమారులకు జానకిరామ్‌, కళ్యాణ్‌రామ్‌, తారక్‌రామ్‌ అనే పేర్లు పెట్టారు. చిన్నతనంలో తన పోలికలతోనే ఉన్న తారక్‌ని చూసిన సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. అతనికి తన పేరు పెట్టమని హరికృష్ణకు చెప్పారు. అలా తారక్‌రామ్‌ కాస్తా నందమూరి తారక రామారావు అయ్యారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ను మొట్టమొదటిసారి డైరెక్ట్‌ చేసిన డైరెక్టర్‌ ఎన్‌.టి.రామారావు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో హిందీ చిత్ర సీమకు పరిచయం చేశారాయన. ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్‌. ‘బాల రామాయణం’ చిత్రంలో ఎన్టీఆర్‌ బాలరాముడిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు, ఎన్టీఆర్‌కు స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డు కూడా లభించింది.  డైరెక్టర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎస్‌.ఎస్‌.రాజమౌళి.. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. కమర్షియల్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్‌ ‘ఆది’ చిత్రంతో డైరెక్టర్‌ అయ్యారు. మెహర్‌ రమేష్‌ను ‘కంత్రి’ చిత్రంతో తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం చేశారు ఎన్టీఆర్‌. అలాగే వక్కంతం వంశీ, కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌ సినిమాల ద్వారానే రచయితలుగా పరిచయమయ్యారు.  ఎన్టీఆర్‌ ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించారు. కానీ, ఏ ఒక్క సినిమాలోనూ ఎన్టీఆర్‌ లుక్‌గానీ, గెటప్‌గానీ ఒకేలా ఉండవు. ప్రతి సినిమాకీ గెటప్‌ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలందరూ గడ్డాలతో కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్‌ని స్టార్ట్‌ చేసింది ఎన్టీఆరే. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో గడ్డంతో ఒక కొత్త గెటప్‌లో కొన్ని సంవత్సరాల క్రితమే కనిపించారు ఎన్టీఆర్‌. ఓవర్సీస్‌లో వరసగా నాలుగు సినిమాలతో 1.5 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసిన మొదటి సౌత్‌ ఇండియన్‌ హీరో ఎన్టీఆర్‌. అలాగే ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోల్లో వరసగా ఐదు సూపర్‌హిట్‌ సినిమాలు ఇచ్చిన హీరో కూడా ఎన్టీఆర్‌ ఒక్కరే. ఇప్పుడు ఉన్న హీరోల్లో పౌరాణిక పాత్ర పోషించే కెపాసిటీ ఉన్న హీరో కూడా ఎన్టీఆర్‌ ఒక్కరే. చిన్నతనంలో బాల రామాయణంలో శ్రీరాముడిగా, ఆ తర్వాత యమదొంగ చిత్రంలో యముడి పాత్రను అద్భుతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. మాస్‌ యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు చెప్పగలడు. కానీ, కామెడీ పండిరచలేడు అనే విమర్శలకు ‘అదుర్స్‌’తో చక్కని సమాధానం ఇచ్చారు. ఆ చిత్రంలోని చారి పాత్రను అత్యద్భుతంగా పోషించి ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇమిడిపోగలనని ప్రూవ్‌ చేసుకున్నారు ఎన్టీఆర్‌. పాజిటివ్‌ క్యారెక్టర్సే కాదు, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లను కూడా అవలీలగా చెయ్యగలనని టెంపర్‌లోని దయా క్యారెక్టర్‌తో ప్రూవ్‌ చేశారు. అలాగే ‘జై లవకుశ’ చిత్రంలో పూర్తి స్థాయిలో నెగెటివ్‌ క్యారెక్టర్‌తో మెప్పించారు.  నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు ఎన్టీఆర్‌. ఓలమ్మీ తిక్కరేగిందా, 123 నేనొక కంత్రి, చారి, రాకాసి రాకాసి, ఫాలో ఫాలో వంటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ పాడి తనలోని గాయకుడ్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.  కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తను హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలోని ‘గెలెయా గెలెయా..’ అనే పాటను ఎన్టీఆర్‌తో పాడించుకున్నారు.  ఏ హీరో అయినా తనకు కథ నచ్చకపోతే కొన్ని సినిమాలను రిజెక్ట్‌ చేస్తుంటారు. అలా ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేసిన సినిమాలు ఆర్య, బొమ్మరిల్లు, భద్ర. మొదట ఈ ప్రాజెక్టులు ఎన్టీఆర్‌ దగ్గరకే వచ్చాయి. ఇతర హీరోలు నటించిన ఆ సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. అలా ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేసిన బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య వంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.  టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ వచ్చే ఏడాది ‘వార్‌2’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కెజిఎఫ్‌ సిరీస్‌, సలార్‌ వంటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించిన ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఇలా సినిమా సినిమాకీ హీరోగా తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

వరసగా వచ్చిన నందులు ఆయన కడుపు నింపలేదు.. ఆ ఒక్క పాట సిరివెన్నెల జీవితాన్నే మార్చేసింది!

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని.. అంటూ సమాజాన్ని ప్రశ్నించినా,  జామురాతిరి జాబిలమ్మా, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.. అంటూ ప్రేమ భావాలు పలికించినా, బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది, భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ.. అంటూ యువతను మేల్కొలిపినా అది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలానికే చెల్లింది. తన పాటలోని భావాల ద్వారా శ్రోతలను ఆలోచింప జేయడం లేదా ఆస్వాదించేలా చేయడం అనేది సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాలో ఆయన రాసిన పాట ఉందీ అంటే అది ఎంతో కొంత విజ్ఞానాన్ని పంచేది, సామాజిక స్పృహను కలిగించేది, ఆహ్లాదాన్ని పంచేది అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. 1986లో సినీ గేయరచయితగా కెరీర్‌ను ప్రారంభించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనలా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ వంటి రచయితల శైలి వేరు, సిరివెన్నెల దారి వేరు అన్నట్టుగా ఉండే ఆయన పాటలంటే ఇష్టపడని వారుండరు.  ఉత్తమ పాటల రచయితగా 1986 నుంచి మూడేళ్లపాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది. అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్ర పడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఓ పాట. ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది. డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టింది. మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఆ విశేషాల గురించి తెలుసుకుందాం.  కాకినాడలో ఎం.ఎ. చేస్తున్న చెంబోలు సీతారామశాస్త్రికి ఒకరోజు దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘సిరివెన్నెల’ చిత్రంలోని అన్ని పాటలూ రాసే అవకాశం ఇచ్చారు. అయితే అంతకు రెండేళ్ళ ముందే ఒక చిత్రంలో సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు విశ్వనాథ్‌. అది ఆయనకు బాగా నచ్చడంతో ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలు రాయగల ప్రతిభ సీతారామశాస్త్రిలో ఉందని గుర్తించి అన్ని పాటలూ ఆయనకే ఇచ్చారు. చిత్రంలో 9 పాటలు ఉండగా, ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా మలిచారు సీతారామశాస్త్రి. పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఆ విజయంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. మొదటి మూడు సంవత్సరాలు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమాలు ఆయనకు ఉపయోగపడలేదు. తనపై ఆధారపడిన తమ్ముళ్లు, చెల్లెళ్లతో సహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు సిరివెన్నెల.  వరసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్‌ రైటర్‌గా ముద్రపడిపోయింది. ఆ రోజుల్లో ద్వంద్వార్థాల పాటలకు క్రేజ్‌ ఉండడం, అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోవడంతో ఆయనకు కమర్షియల్‌ చిత్రాలలో పాటలు రాసే అవకాశాలు రాలేదు. ఆ సమయంలో బి. గోపాల్ తన సినిమాకి పాట రాయమనడంతో మొదట కొంచెం సంకోచించారు సిరివెన్నెల. ఎక్కడ డబుల్‌ మీనింగ్‌ పాట రాయమంటారోనని టెన్షన్‌ పడ్డారు. కానీ, దానికి భిన్నంగా బి. గోపాల్ ఆ పాట ఎలా ఉండాలో చెప్పారు. సాధారణ ప్రేక్షకులకు సైతం ఎంతో సులువుగా అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో ఒక మంచి పాట రాయమని ఆయన చెప్పడం, దానికి ఇళయారాజా అద్భుతమైన ట్యూన్‌ ఇవ్వడంతో మొదటిసారి ఒక కమర్షియల్‌ సినిమాకు పాట రాశారు. అందరూ ఎంతో ఈజీగా పాడుకునే పాట ఆవిష్కృతమైంది. అదే ‘బలపం పట్టి భామ బళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా..’ పాట. 1990 సెప్టెంబర్‌ 24న విడుదలైన ‘బొబ్బిలిరాజా’ సూపర్‌హిట్‌ కావడం, సిరివెన్నెల రాసిన ఆ పాటకు జనం బ్రహ్మరథం పట్టడంతో సిరివెన్నెల సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడి నుంచి సిరివెన్నెల పాటల ప్రభంజనం మొదలైంది. దాదాపు 35 సంవత్సరాలపాటు ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది. ఈ మూడు దశాబ్దాలలో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. ఇదీ అదీ అని కాకుండా అన్ని తరహా పాటలు రాసి అందర్నీ మెప్పించారు. అయితే తన కెరీర్‌లో ఎనాడూ వెకిలి పాటలు, డబుల్‌ మీనింగ్‌ పాటలు రాయకపోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. తన కెరీర్‌లో కొన్ని వేల పాటలు రాసి ప్రేక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి మే 20. ఈ సందర్భంగా ఆ మహారచయితకు నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

250 సినిమాల్లో విలన్‌గా భయపెట్టిన రామిరెడ్డి జీవితం చివరికి అలా ముగిసింది!

‘అనుకున్నామని.. జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని..’ అని ఆత్రేయ చెప్పిన జీవిత సత్యాలు కొందరి విషయంలో అక్షరాలా జరుగుతాయి. అలాంటి వారిలో నటుడు రామిరెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అతని జీవన విధానం వేరు, జీవితంలో అతని లక్ష్యం వేరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన రామిరెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘ది మున్సిఫ్‌ డైలీ’ అనే పత్రికలో విలేకరిగా చేరాడు. ప్రైమరీ స్కూల్‌ నుంచి డిగ్రీ అందుకునే వరకు అతని విద్య అంతా హైదరాబాద్‌లోనే సాగింది. దాంతో అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ స్లాంగ్‌ మర్చిపోయాడు. పూర్తిగా తెలంగాణా స్లాంగ్‌లోనే మాట్లాడేవాడు. అంతేకాదు, హిందీ, ఉర్దూ ధారాళంగా మాట్లాడేవాడు. జనరల్‌ న్యూస్‌ కవర్‌ చేస్తూనే ఫ్రీలాన్స్‌గా సినిమా ఈవెంట్స్‌ను కూడా కవర్‌ చేసేవాడు. అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖుల్ని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆ క్రమంలోనే ఓరోజు దర్శకుడు కోడి రామకృష్ణకు ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగాడు. ఆయన ఒక టైమ్‌ చెప్పి రమ్మన్నారు.  డా. రాజశేఖర్‌, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో శ్యాంప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘అంకుశం’ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ విలన్‌గా నటించే ఆర్టిస్ట్‌ కోసం చూస్తోంది చిత్ర యూనిట్‌. ఆ టైమ్‌లోనే ఇంటర్వ్యూ కోసం రామిరెడ్డి వెళ్లాడు. లాల్చీ పైజామాతో, నుదుటిన బొట్టుతో అక్కడికి వెళ్ళిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్‌ అయ్యారు. తను ఎలాంటి విలన్‌ కోసమైతే ఎదురుచూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్‌ రామిరెడ్డిలో ఆయనకు కనిపించాయి. అప్పుడు ఇంటర్వ్యూ విషయం పక్కనపెట్టి ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ వేషం ఉంది చేస్తావా? మంచి పేరు వస్తుంది అని అడిగారు కోడి రామకృష్ణ. ‘నాకు యాక్టింగ్‌ తెలీదు సార్‌’ అని రామిరెడ్డి చెప్పినా.. ‘అదంతా నేను చూసుకుంటాను. చేస్తావా’ అని అడిగారు. డైరెక్టర్‌ ఇచ్చిన భరోసాతో రామిరెడ్డి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.  ఆ క్షణం రామిరెడ్డి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. మొదటి సినిమా అయినా ఒక క్రూరమైన విలన్‌ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందర్నీ భయపెట్టింది. విలన్‌ అంటే ఇలాగే ఉండాలి అనేంతగా ఆకట్టుకున్నాడు రామిరెడ్డి. ‘అంకుశం’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. డా.రాజశేఖర్‌, రామిరెడ్డి పోటాపోటీగా నటించి సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమా తర్వాత  ఒసేయ్‌ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ట, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే, నాయకుడు వంటి సినిమాల్లో రామిరెడ్డి చేసిన క్యారెక్టర్స్‌కి చాలా మంచి వచ్చింది.  ‘అంకుశం’ చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘ప్రతిబంధ్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులో రామిరెడ్డి స్పాట్‌నానాగా తన విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా రామిరెడ్డి నటన చూసి ఆశ్చర్యపోయారు. స్పాట్‌నానాగా బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు రామిరెడ్డి. ‘ప్రతిబంధ్‌’ తర్వాత బాలీవుడ్‌లో విపరీతమైన ఆఫర్స్‌ వచ్చాయి. ఒక దశలో రెండు సంవత్సరాలు తెలుగు నిర్మాతలకు రామిరెడ్డి అందుబాటులో లేరు. బాలీవుడ్‌లో గ్రేట్‌ విలన్స్‌గా చెప్పబడే అమ్రిష్‌ పూరి, అమ్జాద్‌ ఖాన్‌, డానీ,   గుల్షన్‌ గ్రోవర్‌, ప్రేమ్‌ చోప్రా సరసన రామిరెడ్డి పేరును కూడా చేర్చారంటే అక్కడ అతనికి ఎంత ఫాలోయింగ్‌ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గుండా, ఖుద్దార్‌, శపథ్‌, వక్త్‌ హుమారా హై, ఆందోళన్‌, దిల్‌వాలే, అంగ్‌రక్షక్‌, ఎలాన్‌ వంటి చిత్రాలలో అతని నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి వంటి హీరోలు తమ సినిమాలో విలన్‌గా రామిరెడ్డి కావాలని అడిగేవారంటే అతనికి అక్కడ ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలుస్తుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌ఫురి భాషల్లో దాదాపు 250 సినిమాల్లో నటించారు రామిరెడ్డి.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందని.. తనకు ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్‌లోకి ఎంటర్‌ అయి బెస్ట్‌ విలన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామిరెడ్డి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట లివర్‌ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్‌పై కూడా ప్రభావం చూపించింది. చివరలో అది క్యాన్సర్‌గా మారి రామిరెడ్డి మరణానికి కారణమైంది. 2011 ఏప్రిల్‌ 14న 52 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు రామిరెడ్డి.

రూ.60 వేల కోసం నాలుగు సూపర్‌హిట్‌ సినిమాల నెగెటివ్‌లు తాకట్టు పెట్టిన నిర్మాత!

పాత తరం హాస్య నటుల్లో పద్మనాభంది ఒక విభిన్నమైన శైలి. తన హాస్యంతో దాదాపు 50 సంవత్సరాలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌, సావిత్రి జంటగా రూపొందిన ‘దేవత’ చిత్రం ద్వారా పద్మనాభం నిర్మాతగా మారి ఆ తర్వాత పది సినిమాలు నిర్మించారు. ఒక సినిమాను నిర్మించేంత ఆర్థిక స్తోమత తనకు లేకపోయినా ఇల్లు తాకట్టుపెట్టి భారీ తారాగణంతో ఆ సినిమాను తీశారు. ‘దేవత’ నిర్మాతగా పద్మనాభానికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాకట్టులో వున్న ఇల్లును కూడా విడిపించుకున్నారు. మొదటి సినిమానే భారీ తారాగణంతో నిర్మించిన పద్మనాభం ఆ తర్వాత కూడా పెద్ద తారలతోనే సినిమాలు తీసి ఉంటే నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో ఉండేవారు. అలా కాకుండా కొత్తదనం కోసం అనేక ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన నిర్మించిన సినిమాల్లో కొన్ని సూపర్‌హిట్‌ అవ్వగా, మరికొన్ని ఫ్లాప్‌ అయ్యాయి.  ‘దేవత’  పెద్ద హిట్‌ అవ్వడంతో పద్మనాభం వ్యాపారత్మకంగా ఆలోచించడం మానేసి ప్రయోగాలు చెయ్యాలనుకున్నారు. అంతకుముందు రేలంగి, నగేష్‌ వంటి హాస్యనటులు హీరోలుగా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తను కూడా వారిలాగే హీరో అవ్వాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన రెండో ప్రయత్నంగా ‘పొట్టిప్లీడరు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తనే హీరోగా ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. ఈ సినిమా ద్వారా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంను నేపథ్యగాయకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.  ఇక నాలుగో సినిమా ‘శ్రీరామకథ’తో పద్మనాభం దర్శకుడిగా మారారు.  1969లోనే ఈ సినిమాను రూ.6 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా విజయం సాధించకపోవడంతో లక్షన్నర నష్టపోయారు పద్మనాభం. ఈ సినిమా తర్వాత వాణిశ్రీ ప్రధాన పాత్రలో ‘కథానాయిక మొల్ల’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత పద్మనాభం హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘జాతకరత్న మిడతంభొట్లు’. ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఇదే సినిమాను కన్నడ హాస్యనటుడు నరసింహరాజుతో కన్నడలో రీమేక్‌ చేశారు. అక్కడ మాత్రం ఘనవిజయం సాధించింది. పద్మనాభంకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ఒక సినిమా హిట్‌ అయితే, మరో సినిమా ఫ్లాప్‌ అవుతుండడంతో నష్టాల్లోకి జారిపోయారు పద్మనాభం. నిర్మాతగా ఆయన చేసిన ఆజన్మ బ్రహ్మచారి, మాంగల్యభాగ్యం వంటి సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చాయి. నటుడుగా దర్శకనిర్మాతగా చక్కని హోదాను చూసిన పద్మనాభం చివరి రోజుల్ని పేదరికంలోనే గడిపారు.  పద్మనాభం చిన్నతనంలో చేసిన ఓ పని అతన్ని జీవితాంతం బాధించింది. అదేమిటంటే.. ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బును దొంగిలించారు. ఆ పాపభీతి పెద్దయ్యాక కూడా వెంటాడేది. అందుకే ఆ పాప పరిహారం కోసం ‘లిటిల్‌ ఫ్లవర్‌ బ్లైండ్‌ అండ్‌ డెఫ్‌’ సంస్థకు ఆరోజుల్లోనే రూ.5 వేలు విరాళంగా ఇచ్చారు పద్మనాభం.  తొలిరోజుల్లో ఎంతో ఉన్నతంగా జీవించిన ఎంతోమంది నటీనటులు చివరి రోజులు కష్టాల్లోనే గడిపారు. పద్మనాభం విషయంలో కూడా అదే జరిగింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో సినీతారలు నాటకాలు వేసి విరాళాలు సేకరించారు. ఆ తర్వాత అవే నాటకాలను మద్రాసులో స్టూడియోలో షూట్‌ చేయించారు పద్మనాభం. ఆ నాటకాలను ‘సినిమా వైభవం’ పేరుతో విడుదల చేశారు. అప్పటికే ఆర్థికంగా నష్టపోయి ఉన్న పద్మనాభం ఈ సినిమా విడుదల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.60 వేలు అప్పు చేశారు. అందుకుగాను ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగెటివ్‌లను ఆ వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చలేకపోతే ఆ సినిమాల హక్కులను వదులు కోవాలనేది ఒప్పందం. కానీ, ఆ అప్పు తీర్చలేకపోయారు పద్మనాభం. దాంతో ఆ సినిమా రిలీజ్‌ హక్కులను ఆంధ్రా, రాయలసీమ, నైజాంలకు  దాదాపు రూ.3లక్షలకు అమ్మారు. అప్పు తీరిన తర్వాత బ్యాలెన్స్‌ డబ్బు తిరిగి ఇవ్వకపోగా, నెగెటివ్‌లు కూడా ఇవ్వలేదా వ్యక్తి. 1983 వరకు ఈ కేసు కోర్టులోనే నలిగింది. చివరికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు నెగెటివ్‌లు తిరిగి ఇచ్చేందుకు పద్మనాభం నుంచి లక్ష రపాయలు తీసుకున్నారు.

వాడి పెళ్లి నా చావుకొచ్చింది.. అనే మాట గిరిబాబు విషయంలో అక్షరాలా నిజమైంది!

జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో తమాషాగా అనిపిస్తాయి. అందులో నిజానిజాలు తెలుసుకునే వరకు అప్పటి వరకు ప్రచారంలో వున్నది వాస్తవమేనని నమ్ముతాం. అలాంటి ఓ తమాషా అయిన విషయం నటుడు గిరిబాబు విషయంలో జరిగింది. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. సినిమాల కోసం తన పేరును గిరిబాబుగా మార్చుకున్నారు. 1973లో వచ్చిన ‘జగమేమాయ’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే ‘దేవతలారా దీవించండి’ చిత్రంతో నిర్మాతగా మారారు గిరిబాబు. ఆ తర్వాత కూడా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. కెరీర్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వ్యక్తిగతంగా ఓ విషయంలో గిరిబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  రాజమండ్రిలో ఓ థియేటర్‌ ఓనర్‌ అయిన బండారు గిరిబాబు అనే పేరు గల మరో వ్యక్తి సినిమా ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టారు. రంగనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘చందన’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో జయంతి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే గిరిబాబు, జయంతిల మధ్య ప్రేమ చిగురించింది. ఇదివరకే పెళ్ళయి, పిల్లలున్న గిరిబాబును జయంతి పెళ్లి చేసుకుంది. జయంతికి కూడా ఇదివరకే పేకేటి శివరాంతో పెళ్ళి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. గిరిబాబు, జయంతిల పెళ్లి వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలోని చాలా మందికి నిర్మాత గిరిబాబు, నటుడు గిరిబాబు వేర్వేరు అనే విషయం తెలుసు. కానీ, సాధారణ ప్రజలకు ఈ విషయంలో అవగాహన లేకపోవడంతో అందరూ నటుడు గిరిబాబు, జయంతి పెళ్లి చేసుకున్నారని నమ్మేశారు.  ఈ విషయంలో ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా ఔట్‌ డోర్‌కి వెళ్లినపుడు, తమ సొంత ఊరికి వెళ్లినపుడు గిరిబాబుకి ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారేది. ఆ గిరిబాబు వేరు, తను వేరు అని చెబితే కొంతమంది నమ్మేవారు, మరి కొంతమంది సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకోవడం సాధారణమైన విషయమే కదా అంటూ గిరిబాబు చెప్పేది నమ్మేవారు కాదు. ఒకప్పుడు తిరుపతి వెళ్లిన వారు అటు నుంచి అటే మద్రాస్‌ వెళ్లి ఎన్టీఆర్‌, కృష్ణ వంటి హీరోల ఇళ్ళకు వెళ్లి కలుసుకొని వచ్చేవారు. అలా కొంతమంది గిరిబాబు ఇంటికి కూడా వచ్చేవారు. వాళ్ళు కూడా జయంతిగారిని చూసి వెళతాం అని అడిగేవారు. వచ్చిన వారందరికీ అసలు విషయం చెప్పి వారిని ఒప్పించడం గిరిబాబుకి పెద్ద పనిగా మారేది.  ఆ తర్వాత కొన్నిరోజులకు కృష్ణ, జయప్రద జంటగా విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘శంఖుతీర్థం’ చిత్రం షూటింగ్‌ లొకేషన్‌లో ఓ తమాషా అయిన సంఘటన జరిగింది. షాట్‌ గ్యాప్‌లో గిరిబాబు, సూర్యకాంతం ఒకేచోట కూర్చున్నారు. మాటల మధ్యలో జయంతి విషయం తీసుకొచ్చారు సూర్యకాంతం. అప్పటివరకు పేకేటి శివరాం దగ్గర చాలా ఇబ్బందులు పడిరదని, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు జాగ్రత్తగా చూసుకో అని జాగ్రత్తలు చెప్పారు. దానికి గిరిబాబు మనసులోనే నవ్వుకొని.. తనకు జయంతి అంటే ఎప్పటి నుంచో ఇష్టమనీ, ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోవడానికి కుదిరింది. మీరు చెప్పినట్టు జాగ్రత్తగానే చూసుకుంటాను అని ఎంతో సిన్సియర్‌గా చెప్పారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయనిర్మల, జయప్రద వారిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం గురించి తెలుసుకొని పగలబడి నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని సూర్యకాంతం అయోమయంగా చూసింది. అప్పుడు అసలు విషయం చెప్పారు విజయనిర్మల. దాంతో ఒక్కసారిగా కోపంగా పైకి లేచి గిరిబాబుపై దాడి చేసారు సూర్యకాంతం. ప్రమాదం గ్రహించిన గిరిబాబు పరుగు లంకించుకున్నారు. అలా సెట్‌లో గిరిబాబు వెంట సూర్యకాంతం పరుగెత్తడం చూసి యూనిట్‌లోని వారంతా నవ్వుకున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. గూగుల్‌లో కూడా ‘చందన’ చిత్రానికి దర్శకనిర్మాతగా నటుడు గిరిబాబు పేరు ఉండడమే.