ఆ విషయంలో ఎం.ఎస్‌.నారాయణను మించిన వారు ఇండియాలోనే లేరు!

(ఏప్రిల్ 16 ఎం.ఎస్.నారాయణ జయంతి సందర్భంగా..) తెలుగు చిత్ర పరిశ్రమలోని హాస్యనటుల్లో ఎం.ఎస్‌.నారాయణకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరినీ అనుకరించకుండా.. డైలాగ్‌ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణ. నటుడిగా 1994లో కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆయనకు బ్రేక్‌ వచ్చింది 1997లో. అప్పటి నుంచి 17 సంవత్సరాల్లో దాదాపు 700 సినిమాల్లో నటించడం అనేది ఒక అరుదైన రికార్డుగానే చెప్పాలి. అందులో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలు పోషించి మెప్పించడం ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్స్‌ చేసిన నటుడు ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి రచయిత కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ఎం.ఎస్‌.నారాయణ.. ఒక అద్భుతమైన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, నేపథ్యం ఏమిటి? ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటనేది తెలుసుకుందాం. 1951 ఏప్రిల్‌ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు మైలవరపు సూర్యనారాయణ. వీరిది రైతు కుటుంబం అయినప్పటికీ పది మంది సంతానం కావడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. దాంతో కుటుంబంలోని అందరూ పొలం పనులకు వెళ్లేవారు. కానీ, ఎం.ఎస్‌.నారాయణ మాత్రం తాను చదువుకుంటానని పట్టుపట్టారు. అలా తండ్రికి ఇష్టం లేకపోయినా పదో తరగతి వరకు ఇల్లందులో చదువుకున్నారు. ఆ తర్వాత ఫత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో భాషా ప్రవీణ కోర్సు చేశారు. అదే సమయంలో మూర్తిరాజు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశారు. ఎం.ఎస్‌. రచయితగా ఎదిగేందుకు అది దోహదమైంది. భాషా ప్రవీణ కోర్సు పూర్తయిన తర్వాత భీమవరంలోని కెజిఆర్‌ఎల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ రైలెక్కారు.  అర్జున్‌, భానుచందర్‌ హీరోలుగా సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేగుచుక్క పగటిచుక్క’ చిత్రం కథా రచనలో సహాయకుడిగా పనిచేశారు. ఎం.ఎస్‌.నారాయణ పేరు స్క్రీన్‌పై తొలిసారి కనిపించింది ఈ సినిమాకే. ఆ తర్వాత ప్రయత్నం, హలోగురు, హలో నీకునాకు పెళ్లంట, అలెగ్జాండర్‌, శివనాగ వంటి సినిమాలకు మాటలు రాశారు. 1993లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘పేకాట పాపారావు’ చిత్రానికి జనార్థన మహర్షితో కలిసి కథ అందించారు. ఈ సినిమా ఎం.ఎస్‌.కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ చిత్రానికి కామెడీ ట్రాక్‌ను రాశారు. అలాగే ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘పెదరాయుడు’, ‘రుక్మిణి’ చిత్రాల్లో కూడా ఎం.ఎస్‌.కి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చారు రవిరాజా. అలా ఓ పది సినిమాల్లో నటించిన తర్వాత ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రంలో ఒక తాగుబోతు క్యారెక్టర్‌ ఇచ్చారు ఇ.వి.వి.సత్యనారాయణ. 1997లో విడుదలైన ‘మా నాన్నకి పెళ్లి’ చిత్రంలో ఎం.ఎస్‌.నారాయణ చేసిన క్యారెక్టర్‌.. ఒక అద్భుతమైన కెరీర్‌కి పునాది వేసింది. నటుడిగా ఫుల్‌ బిజీ అయిపోయారు. దాంతో సినిమా రచన పక్కన పెట్టి నటనపైనే దృష్టి కేంద్రీకరించారు. అప్పుడు మొదలు సంవత్సరానికి 15 నుంచి 20 సినిమాల్లో నటిస్తూ వచ్చారు. 2001లో ఏకంగా 50 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 30 సినిమాలకు తక్కువ కాకుండా నటించేవారు. ఒక దశలో ఎం.ఎస్‌.నారాయణ లేని సినిమా రిలీజ్‌ అయ్యేది కాదు. 1997 నుంచి 2015 వరకు 700 సినిమాల్లో నటించారు ఎం.ఎస్‌.నారాయణ. అందులో ఆయన చేసిన సినిమాల గురించి, క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తాగుబోతు క్యారెక్టర్లే కాదు, పేరడీ క్యారెక్టర్స్‌లోనూ ఎం.ఎస్‌.దే పైచేయిగా ఉండేది. దుబాయ్‌ శీను, దూకుడు, డిస్కో వంటి సినిమాల్లో ఆయన చేసిన పేరడీ క్యారెక్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాదు, 5 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు ఎం.ఎస్‌.నారాయణ. ఎం.ఎస్‌.నారాయణ వ్యక్తిగత జీవిత విషయాల గురించి చెప్పాలంటే.. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తన క్లాస్‌మేట్‌ కళాప్రపూర్ణను ప్రేమించారు. వీరికి పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వివాహం జరిపించారు. ఎం.ఎస్‌., కళాప్రపూర్ణలది కులాంతర వివాహం. వీరికి కుమార్తె శశికిరణ్‌, కుమారుడు విక్రమ్‌ ఉన్నారు. వీరిద్దరికీ సినిమా రంగంలో రాణించాలని ఉంది. శశికిరణ్‌ తన దర్శకత్వంలో ‘సాహెబ్‌ సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని రూపొందించారు. అలాగే విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ‘కొడుకు’ చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎస్‌.నారాయణ. అయితే ఇది పరాజయాన్ని చవిచూసి ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘భజంత్రీలు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కూడా విజయం సాధించలేదు. తను పుట్టి పెరిగిన నిడమర్రు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలనుకున్నారు ఎం.ఎస్‌. దాని కోసం అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్లి అక్కడి పెద్దలతో చర్చించేవారు. అలా 2015 సంక్రాంతికి నిడమర్రు వెళ్లిన ఎం.ఎస్‌. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. కొన్నిరోజులపాటు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి విషమించడంతో జనవరి 23న 63 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు ఎం.ఎస్‌.నారాయణ. 

డిప్రెషన్‌లో వున్న బాబుమోహన్‌ని మామూలు స్థితికి తీసుకొచ్చిన డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

(ఏప్రిల్ 14 నటుడు బాబుమోహన్ పుట్టినరోజు సందర్భంగా..) తెలుగువారు హాస్య ప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. హాస్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఆస్వాదించడం మన వారికి అలవాటు. అందుకే సినిమాల్లో హాస్యాన్ని ఎంతో బాగా ఎంజాయ్‌ చేస్తారు. పాత తరం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హాస్య నటులు ఇండస్ట్రీకి వచ్చారంటే వారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఏ హాస్య నటుడైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి కలిగి ఉంటేనే రాణిస్తారు. అలా పాత తరంలో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి వారు కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఆ తర్వాతి తరంలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, నూతన్‌ప్రసాద్‌, రాళ్ళపల్లి వంటి వారు తమదైన శైలిలో నవ్వులు పూయించారు. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం ఒక చరిత్ర సృష్టించారు. హాస్యనటుడిగా ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. అతనితోపాటే సినిమాల్లో ప్రవేశించిన బాబుమోహన్‌కి ప్రేక్షకులు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఎవరినీ అనుకరించకుండా ఓ ప్రత్యేకమైన స్టైల్‌, మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరి కలిగిన విశిష్టమైన నటుడు బాబుమోహన్‌. అయితే బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు. ఆ తర్వాత కమెడియన్‌గా అంతటి గ్లామర్‌ ఉన్న నటుడు బాబుమోహన్‌. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాబుమోహన్‌ సినిమా రంగానికి ఎలా వచ్చారు? నటుడుగా నిలదొక్కుకొని స్టార్‌ కమెడియన్‌గా ఎలా ఎదిగారు అనే విషయాలు తెలుసుకుందాం. 1952 ఏప్రిల్‌ 14న ఖమ్మం జిల్లాలోని బీరోలు గ్రామంలో పల్లి ఆనందరావు, పేరమ్మ దంపతులకు జన్మించారు బాబుమోహన్‌. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. బాబుమోహన్‌కి మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. దాంతో తండ్రి మతిస్థిమితం కోల్పోయారు. ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేస్తూ చెల్లెల్ని స్కూల్‌ పంపించేవాడు బాబుమోహన్‌. అలా కొన్నాళ్ళ తర్వాత తండ్రి ఆరోగ్యం కుదుటపడిరది. ఆ గ్రామంలోనే ఉంటే తల్లి గుర్తు వస్తోందని కుటుంబం ఖమ్మంకి మారింది. బాబుమోహన్‌ 9వ తరగతిలో ఉండగా తండ్రి చనిపోయారు. ఆ తర్వాత చెల్లెల్ని చూసుకుంటూ ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఇందిర విజయలక్ష్మి పరిచయం కావడం, అది ప్రేమగా మారడం జరిగిపోయింది. బాబుమోహన్‌కి సత్తెనపల్లిలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. అలాగే ఇందిరకు నర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో బాబుమోహన్‌, ఇందిర పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన జాబ్‌ను ఖమ్మంకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు బాబుమోహన్‌.  బాబుమోహన్‌కి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా నటుడు కావాలని ఉండేది. అలా ఇంటర్‌లోకి వచ్చేసరికి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. అయితే పెళ్ళయిన తర్వాత కూడా అతను నాటకాలు వేయడం భార్య ఇందిరకు నచ్చేది కాదు. నాటకం వేస్తే నెలరోజులపాటు బాబుమోహన్‌తో ఆమె మాట్లాడేవారు కాదు. అలాగే ఆఫీస్‌కి సెలవు పెట్టి నాటకాలు వేస్తున్నాడని నువ్వు ఎందుకూ పనికి రావు అని ఆఫీస్‌లో ఎగతాళి చేసేవారు. అయితే అప్పుడు కలెక్టర్‌గా ఉన్న మురళీకృష్ణ ఆయన్ని బాగా ఎంకరేజ్‌ చేసేవారు. తనని ఎగతాళి చేసిన వారితో ఒక ఛాలెంజ్‌ చేశారు బాబూమోహన్‌. ‘ఎప్పటికైనా నేను నటుడ్ని అవుతాను. లేకపోతే నా పేరు మార్చుకుంటాను. అంతేకాదు, నేను యాక్టర్‌ అయ్యే వరకు ఫ్లైట్‌ ఎక్కను’ అని ప్రకటించారు. అదే సమయంలో భార్య ఇందిరకు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది. అప్పటికే బాబుమోహన్‌కి ఇద్దరు పిల్లలు కలిగారు. కుటుంబం అంతా హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిపోయింది. బాబుమోహన్‌ ఖమ్మంలో జాబ్‌ చేసేవారు. మూడు రోజులకోసారి హైదరాబాద్‌ వెళ్లేవారు. అది చాలా కష్టంగా ఉండడంతో 5 సంవత్సరాలు లాంగ్‌ లీవ్‌ పెట్టేసి పిల్లల్ని చూసుకునేవారు. ఇలా ఉండగా.. సారధీ స్టూడియోలో కోతలరాయుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అది చూసేందుకు అక్కడికి వెళ్లారు బాబుమోహన్‌. తన డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసే ఒక స్నేహితుడు అక్కడ కనిపించి మురళీకృష్ణ ఇప్పుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని చెప్పడంతో ఆయన్ని కలిశారు బాబుమోహన్‌. హైదరాబాద్‌, ఖమ్మం అప్‌ అండ్‌ చేస్తున్నాడని తెలుసుకొని వెంటనే అతన్ని హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. అలా మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఈలోగా దుబాయ్‌లో ట్యూషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఇందిరను నియమించింది ప్రభుత్వం. దీంతో ఆమె దుబాయ్‌ వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెళుతూ వెళుతూ టైమ్‌ పాస్‌ కోసం నాటకాలు వేస్తూ ఉండమని భర్తకి చెప్పారు.  భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా నాటకాలు వేయడం ప్రారంభించారు బాబుమోహన్‌. అలా ఓసారి రవీంద్రభారతిలో వేసిన నాటకంలో బాబుమోహన్‌ నటన చూసి నిర్మాత రాఘవ ముచ్చటపడ్డారు. తను నిర్మిస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది?’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘అహ నా పెళ్ళంట’ చిత్రంలో చాలా చిన్న క్యారెక్టర్‌ చేశారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘ఆహుతి’ చిత్రం బాబుమోహన్‌కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ‘అంకుశం’ చిత్రంలో చేసిన వెంకటరత్నం క్యారెక్టర్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు బాబుమోహన్‌. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అయితే ఆ తర్వాత నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ కాకుండా మంచి కమెడియన్‌గా స్థిరపడ్డారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌ కాంబినేషన్‌ కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. వీరిద్దరి కామెడీకి ఒక స్పెషల్‌ క్రేజ్‌ వచ్చింది. 2010 వరకు నటుడిగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న బాబుమోహన్‌కి ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి.  సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 1998లో లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్‌.టి.ఆర్‌. తెలుగుదేశం పార్టీ తరఫున అమలాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అదే సంవత్సరం ఆందోల్‌ ఉప ఎన్నికలో చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో దామోదర్‌ రాజనరసింహ చేతిలో బాబుమోహన్‌ ఓడిపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆందోల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దామోదర్‌ రాజనరసింహపై గెలుపొందారు. 2018లో టిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023లో ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. 2024 మార్చిలో కె.ఎ.పాల్‌ సారధ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఒక నెలలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా ఆయన రాజకీయ జీవితం రకరకాల మలుపులు తిరుగుతూ వెళుతోంది.  ఇక బాబుమోహన్‌ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ఇందిర విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బాబుమోహన్‌. వీరికి ఇద్దరు సంతానం పవన్‌కుమార్‌, విజయ్‌కుమార్‌. 2003 అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌ మరణించారు. దాంతో బాబుమోహన్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దాదాపు మూడు నెలలపాటు సినిమాలు చేయకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక రూమ్‌లోనే గడిపారు. ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పారు బాబుమోహన్‌. ఆ స్థితి నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేశారు దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. 

గొల్లపూడి మారుతీరావు జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి.. అసలేం జరిగింది?

(ఏప్రిల్‌ 14 గొల్లపూడి మారుతీరావు జయంతి సందర్భంగా..) రచయితలుగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత నటులుగా మారిన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో అందరి కంటే సీనియర్‌గా గొల్లపూడి మారుతీరావును చెప్పుకోవచ్చు. అయితే సినిమా నటుడు అవ్వాలన్న ఆలోచన ఒక్క శాతం కూడా లేని మారుతీరావు అనుకోకుండానే నటుడిగా అవతారమెత్తారు. అలా మొదలైన ఆయన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. దాదాపుగా 250 సినిమాల్లో అన్ని తరహా పాత్రలు పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆలిండియా రేడియో ఉద్యోగిగా, రచయితగా, సినిమా రచయితగా, నటుడిగా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన గొల్లపూడి మారుతీరావు జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం. 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని నందబలగ గ్రామంలో సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు గొల్లపూడి మారుతీరావు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎస్‌సి మ్యాథమెటికల్‌ ఫిజిక్స్‌ చేశారు. డిగ్రీ తీసుకున్న సంవత్సరంలోనే ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై హైదరాబాద్‌, విజయవాడలలో పనిచేశారు. వివిధ హోదాల్లో 20 సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. చిన్నతనం నుంచీ సాహిత్యంపై అభిలాష పెంచుకున్న గొల్లపూడి.. ఆ రంగంలో విశేషమైన కృషి చేశారు. 14 ఏళ్ళ వయసులోనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆరోజుల్లో గొప్ప రచయితలుగా పేరు తెచ్చుకున్న వారందరితోనూ గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేది. ఓపక్క ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తూ మరో పక్క తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు.  గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. 1954 డిసెంబర్‌ 9న ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక రేనాడు పత్రికలో ఆయన తొలి కథ అచ్చయింది. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరుతో ఒక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్‌, వాపస్‌ వంటి నాటకాలను నిర్మించి దర్శకత్వం వహించడంతోపాటు అందులో ప్రధాన పాత్ర పోషించేవారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా రూపొంది ఎన్నో అవార్డులు గెలుచుకున్న ‘కళ్లు’ చిత్రానికి గొల్లపూడి కథ అందించారు. ఈ సినిమాకి ఉత్తమ కథా రచయితగా ఆయనకు నంది పురస్కారం లభించింది. గొల్లపూడి రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్‌, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. రచయితగా, నాటక రచయితగా కొనసాగుతున్న సమయంలో సినిమా రంగంలోని ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయాలు ఉండేవి. 1963లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. కోడూరి కౌసల్యాదేవి చక్రభ్రమణం నవలకు సినిమా అనుకరణ రాయాలని గొల్లపూడిని కోరారు దుక్కిపాటి. తనకు సినిమా స్క్రిప్ట్‌ ఎలా రాయాలో తెలీదు అని చెప్పినప్పటికీ దుక్కిపాటితోనే ఉన్న దాశరథి ధైర్యం చెప్పారు. అలా ఆ సినిమాకి స్క్రీన్‌ప్లే రాయడం ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యారు గొల్లపూడి. ఈ సినిమాతో ఆయనకు రచయితగా చాలా మంచి పేరు వచ్చింది. దాంతో బిజీ రైటర్‌ అయిపోయారు. రోజుకి నాలుగైదు షిఫ్టులతో ఏడాదికి 30 సినిమాలకు పనిచేసేవారు. 1963 నుంచి 1981 వరకు రచయితగానే కొనసాగిన గొల్లపూడి జీవితాన్ని ఆ సంవత్సరం మలుపు తిప్పింది. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రతాప్‌ ఆర్ట్స్‌ రాఘవ. ఆ సినిమా కోసం గొల్లపూడిని కథ రెడీ చెయ్యమని చెప్పారు. ఆ కథ అందరికీ బాగా నచ్చింది. అయితే అందులో సుబ్బారావు అనే క్యారెక్టర్‌ మాత్రం గొల్లపూడే చెయ్యాలని రాఘవ పట్టుపట్టారు. గొల్లపూడి నాటకాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమా వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. అలాంటిది ఆ సినిమాలో కీలక పాత్ర పోషించమని అడిగే సరికి ఆయన షాక్‌ అయ్యారు. తన వల్ల కాదని చెప్పారు. కానీ, రాఘవ వినలేదు. ఆ కథలోని సుబ్బారావు క్యారెక్టర్‌కి మీరైతేనే న్యాయం చెయ్యగలరు అని చిరంజీవి పదే పదే చెప్పడంతో కాదనలేక ఆ పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు గొల్లపూడి. అదే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి సిల్వర్‌ జూబ్లీ జరుపుకోవడమే కాకుండా గొల్లపూడికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. దాంతో ఆయనకు వరసగా అవకాశాలు రావడం మొదలైంది. 42 సంవత్సరాల వయసులో నటుడిగా కెరీర్‌ ప్రారంభించి దాదాపు 250 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు గొల్లపూడి. రచయితగా, నటుడిగా ఆయనకు 7 నంది అవార్డులు లభించాయి. ఇవికాక వివిధ సంస్థలు అందించిన అవార్డులు అనేకం ఉన్నాయి.  ఇక గొల్లపూడి వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన వివాహం.. విద్యావంతులు, సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో 1961 నవంబర్‌ 11న గొల్లపూడి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.. సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్‌. వీరిలో శ్రీనివాస్‌ దర్శకుడిగా కెరీర్‌ కొనసాగాలనుకున్నారు. ఇప్పుడు తమిళ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న అజిత్‌ హీరోగా 1993లో ‘ప్రేమ పుస్తకం’ పేరుతో సినిమా ప్రారంభించారు. వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోవడం వల్ల శ్రీనివాస్‌ కన్నుమూశారు. అప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను గొల్లపూడి తీసుకొని పూర్తి చేశారు. ఆ తర్వాత తన కుమారుడి జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస్‌ అవార్డు పేరుతో జాతీయ స్థాయిలో ఉత్తమ నూతన దర్శకులకు అవార్డులు అందిస్తున్నారు. గొల్లపూడి ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజన్సీని నడుపుతున్నారు. నటుడిగా మారిన తర్వాత గొల్లపూడి రచనా వ్యాసంగానికి దూరమయ్యారనే చెప్పాలి. ఆయన నటించిన చివరి చిత్రం 2019లో వచ్చిన ‘జోడి’. అప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడి అదే సంవత్సరం డిసెంబర్‌ 12న 80 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

ముగ్గురు అగ్రనిర్మాతలు 30 లక్షల్లో తీసిన సినిమా 2 కోట్లు వసూలు చేసింది!

ఏ సినిమాకైనా కథే మూలం, కథే ప్రధానం. కథాబలం ఉన్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయని అనేకసార్లు ప్రూవ్‌ అయింది. కొన్ని కమర్షియల్‌ సినిమాలు కథాబలం లేకున్నా స్టార్‌ వాల్యూతో ఘనవిజయాలు సాధిస్తుంటాయి. ఓ పక్క కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే కథాబలం ఉన్న సినిమాలను తక్కువ బడ్టెట్‌తో, చిన్న ఆర్టిస్టులతో చేసి విజయాలు అందుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకు దక్కుతుంది. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన దాసరి.. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్ని తరహా సినిమాలు చేశారు. అలాగే కొన్ని ప్రయోగాలు కూడా చేసి సక్సెస్‌ అయ్యారు. అలా ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కించిన సినిమా ‘అమ్మ రాజీనామా’.  మరాఠిలో అశోక్‌ పాటిల్‌ రాసిన ‘రిటైర్‌ హోతి’ అనే నాటకం మహారాష్ట్రలో చాలా పాపులర్‌. ఎన్నో వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ నాటకం గురించి తెలుసుకున్న సి.అశ్వినీదత్‌.. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో హక్కులు కొన్నారు. ఈ నాటకం గురించి తన మిత్రులు, ప్రముఖ నిర్మాతలు కె.దేవీవరప్రసాద్‌, టి.త్రివిక్రమరావులకు చెప్పారు. వారికి కూడా కథ బాగా నచ్చింది. వాస్తవానికి ఈ ముగ్గురూ అగ్ర నిర్మాతలే. ఆ సినిమాను ఒక్కరే నిర్మించగల సామర్థ్యం వారికి ఉంది. కానీ, ప్రయోగాత్మకంగా ఉంటుందన్న ఉద్దేశంతో  ముగ్గురూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ కథా చిత్రాలు, మహిళల సమస్యలపై సినిమాలు రూపొందించడంలో సిద్ధహస్తుడైన దాసరి నారాయణరావుకే ఆ బాధ్యతను అప్పగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ కథకు సంబంధించిన పూర్తి వివరాలు దాసరితో చెప్పి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను రెడీ చెయ్యమన్నారు.  పూర్తి ఉత్తర భారత నేపథ్యం ఉన్న ఈ కథలో ఎన్నో మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథ సిద్ధం చేశారు దాసరి. అందరికీ ఆసక్తి కలిగించే విధంగా ‘అమ్మ రాజీనామా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాను ఎక్కడ తియ్యాలనే విషయంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. మోహన్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ దాసరి నారాయణరావు తీసిన స్వర్గం నరకం చిత్రం, కృష్ణ కుమారుడు రమేష్‌బాబు తొలిసారి నటించిన నీడ చిత్రాలను విజయవాడలో తీశారు దాసరి. అమ్మ రాజీనామా చిత్రం షూటింగ్‌ కూడా విజయవాడలోనే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1991 అక్టోబర్‌ 9న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. కేవలం 21 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోవడం విశేషం.  ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ ఉంటుంది. పెళ్లి తర్వాత భర్తకు, ఆ తర్వాత పిల్లలకు సేవ చేసే తల్లి మాత్రం మరణం తర్వాతే రిటైర్‌ అవుతుంది. అయితే భర్తకు, పిల్లలకు ఎంత చేసినా తనకు విలువ ఇవ్వకపోవడంతో ఆ బాధ్యతల నుంచి విరమణ తీసుకుంటుంది ఆ తల్లి. అదే ‘అమ్మ రాజీనామా’ కథ. ఈ టైటిల్‌ను ఎనౌన్స్‌ చెయ్యగానే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అంతేకాదు, సినిమా రిలీజ్‌కి ముందే విడుదలైన ఆడియో సూపర్‌హిట్‌ అయింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ముఖ్యంగా ‘ఎవరు రాయగలరు.. అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం..’, ‘సృష్టికర్త ఒక బ్రహ్మ.. అతనిని సృష్టించినదొక అమ్మ..’ అనే పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. ఈ పాటలతో సినిమాపై ప్రేక్షకులకు ఒక మంచి ఒపీనియన్‌ వచ్చింది. దీంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. సి.అశ్వినీదత్‌, కె.దేవీవరప్రసాద్‌, టి.త్రివిక్రమరావు కలిసి రూ.30 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.2 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఎలాంటి అవార్డులు రాకపోవడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్‌ అయిన 10 సంవత్సరాల తర్వాత కన్నడలో లక్ష్మి ప్రధాన పాత్రలో ‘అమ్మ’ పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. 

పాటకు కొత్త సొబగులు అద్దిన అనంతశ్రీరామ్‌.. చదువు మధ్యలో ఎందుకు ఆపేసారో తెలుసా?

(ఏప్రిల్ 8 గేయ రచయిత అనంత శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా..)   మన సినిమాలలో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. దాదాపుగా పాటలు లేకుండా భారతీయ సినిమాలు ఉండవనే చెప్పాలి. ఒక్కోసారి కథా గమనాన్ని పాటలు నిర్దేశిస్తాయని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. అంతటి ప్రభావం పాటలకు ఉంటుంది. తెలుగు సినిమాల్లో పాటల గురించి చెప్పాలంటే పాత తరంలో పింగళి నాగేంద్రరావు, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి వంటి ఘనాపాటి గేయ రచయితలు తెలుగు సినిమా పాటల్ని కొత్త పుంతలు తొక్కించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాతి తరంలో గేయరచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు వేటూరి సుందరామ్మూర్తి. ఆ తర్వాత వచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి వంటి గేయ రచయితలు ఉధృతంగా పాటలు రాస్తున్న తరుణంలో కూడా సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరామ్మూర్తి వంటి వారు కూడా తమ పాటలతో అలరించడం విశేషం. ఆ సమయంలోనే ఒక యువ కెరటం తెలుగు సినిమా రంగానికి వచ్చింది. అతి చిన్న వయసులోనే తెలుగు సినిమా పాటలకు కొత్త సొబగులను అద్ది శ్రోతలను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. అతనే అనంత శ్రీరామ్‌. 2005లో కెరీర్‌ ప్రారంభించి ఇప్పటివరకు 1000కి పైగా పాటలు రాసిన అనంత శ్రీరామ్‌ సినీ, వ్యక్తిగత జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1984 ఏప్రిల్‌ 8న పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో సి.వి.వి.సత్యనారాయణ, ఉమారాణి దంపతులకు జన్మించారు అనంతశ్రీరామ్‌. నిర్మాత, రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఇతనికి పెదనాన్న అవుతారు. శ్రీరామ్‌ ప్రాథమిక విద్య దొడ్డిపట్లలోనూ, ఇంటర్మీడియట్‌ విజయవాడలోనూ, ఇంజనీరింగ్‌ బాపట్ల ఇంజనీరింగ్‌ కాలేజీలోనూ కొనసాగించారు. చిన్నతనం నుంచి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న శ్రీరామ్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతుండగానే చిత్ర పరిశ్రమకు వచ్చారు. మరో సంవత్సరం చదివితే ఇంజనీరింగ్‌ పూర్తవుతుందని, ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించవచ్చని తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పినప్పటికీ ఇంజనీరింగ్‌ చదువు కొనసాగించకుండా మధ్యలోనే ఇండస్ట్రీకి వచ్చేశారు.  పాటల రచనలో అనంతశ్రీరామ్‌కి గురువు అంటూ ఎవరూ లేరు. తండ్రి సత్యనారాయణకు సాహిత్యాభిలాష ఉండడం వల్ల ఇతను కూడా దానిపై అభిరుచిని పెంచుకున్నారు. తన 12 ఏళ్ళ వయసు నుంచే పాటలు రాయడం మొదలు పెట్టారు. ఇతనిలోని ప్రతిభను మొదట గుర్తించిన నిర్మాత.. కోగంటి రామకృష్ణ. 2005లో తను నిర్మించిన ‘కాదంటే ఔననిలే’ చిత్రంలోని అన్ని పాటల్ని రాసే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వడమే కాదు, అనంత శ్రీరామ్‌ టాలెంట్‌ గురించి ఎంతో మందికి చెప్పి అతన్ని ప్రమోట్‌ చేసిన వ్యక్తి కోగంటి రామకృష్ణ. అదే సంవత్సరం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘అందరివాడు’ చిత్రంలో ‘పడుచు బంగారమా..’ అనే పాట రాశారు. ఆ పాట పెద్ద హిట్‌ కావడంతో అనంత శ్రీరామ్‌ అనే గేయ రచయిత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి వరస అవకాశాలు సంపాదించుకోగలిగారు. 2014 వరకు దాదాపు 195 చిత్రాల్లో 558 పాటలు రాశారు. అతనికి ఇష్టమైన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.  సాధారణ శ్రోతలకు, ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో, చక్కని భావంతో పాటలు రాయడం అనేది అనంత శ్రీరామ్‌ ప్రత్యేకత. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, ఆలోచింపజేసే పాటలు ఎన్నో రాశారు. ‘ఇంకేం ఇంకే ఇంకేం కావాలే...’,  ‘నిజంగా నేనే నా..’, ‘పచ్చబొట్టేసినా..’, ‘నమ్మవేమో గానీ..’, ‘ఈ హృదయం.. కరిగించి వెళ్లకే..’, ‘కళావతి..’, ‘మేఘాలు లేకున్న..’.. ఇలా ఒకటేమిటి అనంతశ్రీరామ్‌ రాసిన 1000 పాటల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ అయినవే ఉండడం విశేషం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గేయ రచయితలు ఉన్నప్పటికీ అనంత్‌ శ్రీరామ్‌ రాసే పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాటలు వినేందుకు ఇష్టపడుతున్నారు అనేది గ్రహించి దానికి తగ్గట్టుగా పాటలు రాసుకుంటూ వెళ్తున్న అనంతశ్రీరామ్‌ నుంచి మరిన్ని మధుర గీతాలు వస్తాయని ఆశించవచ్చు.

20 ఏళ్లలో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగి.. నేషనల్‌ అవార్డు సాధించిన ఏకైక హీరో అల్లు అర్జున్‌!

(ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా)   తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్‌ అంటే ఒక స్టైల్‌.. అల్లు అర్జున్‌ అంటే ఒక మెరుపు. తన డాన్సులతో, డైలాగులతో, విచిత్రమైన మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న హీరో. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్‌ నిలిచారు. కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు సైతం అతన్ని బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అరవింద్‌ వంటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కుమారుడిగా, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకొని స్టైలిష్‌ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్‌. ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప2’ వరకు ఎన్నో విభిన్నమైన సినిమాలతో ఒక స్టాండర్డ్‌ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న అల్లు అర్జున్‌ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1983 ఏప్రిల్‌ 8న అల్లు అరవింద్‌, నిర్మల దంపతులకు రెండో సంతానంగా చెన్నయ్‌లో జన్మించారు అల్లు అర్జున్‌. ఆయనకు అన్నయ్య వెంకటేశ్వరరావు, తమ్ముడు శిరీష్‌ ఉన్నారు. 18 ఏళ్ళ వరకు చెన్నయ్‌లోనే పెరిగిన బన్నీ.. తన ప్రాథమిక విద్యను కూడా అక్కడే పూర్తి చేశారు. చదువులో అంతంత మాత్రంగా ఉండే బన్నీ ఇతర కళల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే జిమ్నాస్టిక్స్‌, పియానో ప్లే చేయడం నేర్చుకున్నారు. 1985లో తన రెండేళ్ళ వయసులో తండ్రితో కలిసి చిరంజీవి ‘విజేత’ షూటింగ్‌కి వెళ్లాడు. అక్కడ డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి అతన్ని చూసి ముచ్చటపడి ఆ సినిమాలో నటింపజేశారు. ఆ తర్వాత 1986లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రంలో కమల్‌హాసన్‌ మనవడిగా నటించాడు. 18 ఏళ్ళ వయసులో చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ చిత్రంలో ఒక డాన్సర్‌గా నటించాడు బన్నీ. అప్పుడే అతనికి సినిమాలపై ఆసక్తి కలిగింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే బన్నీ బొమ్మలు బాగా వేయడాన్ని గమనించిన అరవింద్‌.. యానిమేషన్‌ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కెనడాలోని ఒక యానిమేషన్‌ సంస్థకు ఫీజు కూడా కట్టారు. కానీ, కెనడా వెళ్లేందుకు ఇష్టపడలేదు బన్నీ. తాను హీరో అవ్వాలనుకుంటున్నాననే విషయాన్ని తండ్రికి చెప్పాడు. కానీ, కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోలేదు. హీరో అవ్వడం అంటే అంత ఈజీ కాదని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, బన్నీ వినలేదు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు అరవింద్‌. ముందు యాక్టింగ్‌ కోర్స్‌ చేయించమని ఆయన సలహా ఇచ్చారు. అలా ముంబయిలో యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ చేశారు. దీంతో అతన్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అరవింద్‌. అయితే బన్నీ మొదటి సినిమా చేసే బాధ్యత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్న తరుణంలో రాఘవేంద్రరావును అప్రోచ్‌ అవ్వమని చిరంజీవి చెప్పారు. అప్పటికే 99 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రతిష్ఠాత్మక 100వ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవితో చెయ్యాలని స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు రాఘవేంద్రరావు. ఆ సమయంలో ఆయన్ని కలిసిన అరవింద్‌ తన కుమారుడిని హీరోగా పరిచయం చెయ్యమని అడిగారు. దానికి రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. తన 100వ సినిమా చిరంజీవితో చెయ్యాలని డిసైడ్‌ అయినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పారు అరవింద్‌. అప్పుడు రాఘవేంద్రరావు కన్విన్స్‌ చేసి అల్లు అర్జున్‌ని హీరోగా మీరే పరిచయం చెయ్యాలని కోరారు. చిరు మాట కాదనలేక ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తనపై చిరంజీవి, అరవింద్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కథ, మ్యూజిక్‌తోపాటు మిగతా విషయాల్లో కూడా ఎంతో కేర్‌ తీసుకున్నారు రాఘవేంద్రరావు. అలా అల్లు అర్జున్‌, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘గంగోత్రి’ ప్రారంభమైంది.  2003 మార్చి 28న ‘గంగోత్రి’ విడుదలై మ్యూజికల్‌గా, బాక్సాఫీస్‌ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అల్లు అర్జున్‌కి మంచి మార్కులే పడినా లుక్‌ పరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘ఇతను హీరో ఏంటి’ అని అందరూ అతన్ని ఎద్దేవా చేశారు. ఆ విమర్శలకు మొదట బాధపడినా ఆ తర్వాత వాటిని పాజిటివ్‌గా తీసుకున్నాడు. తనని తాను మార్చుకోవాలనే స్థిర నిర్ణయానికి వచ్చాడు. దాని కోసం కోఠర శ్రమ చేశాడు. మెగా ఫ్యామిలీ ముద్ర తనపై పడకూడదని.. తనకంటూ ఒక కొత్త స్టైల్‌ని ఏర్పరుచుకున్నాడు.  ఆ సమయంలోనే సుకుమార్‌ డైరెక్షన్‌లో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్క్రిప్ట్‌ వర్క్‌ అయిపోయింది. ఆ కథను మొదట ప్రభాస్‌కి వినిపించారు. కానీ, అందులోని క్యారెక్టర్‌కి తను సూట్‌ కానని చెప్పేశారు ప్రభాస్‌. అప్పుడు అల్లు అర్జున్‌ దగ్గరికి వచ్చింది ఆ కథ. అలా ‘ఆర్య’ చిత్రం ప్రారంభమైంది. అప్పటివరకు వున్న ట్రెండ్‌ని మారుస్తూ సుకుమార్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004లో విడుదలై ఘనవిజయం సాధించింది. గంగోత్రి చిత్రాన్ని విమర్శించిన వారంతా ఆర్య సినిమాలో బన్నీ లుక్‌, యాక్టింగ్‌ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ‘బన్ని’ చిత్రం చేశారు. అది కూడా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత 2006లో బన్నీ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేశముదురు’ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం బన్నీతో సిక్స్‌ ప్యాక్‌ చేయించారు పూరి. అలా టాలీవుడ్‌లో తొలి సిక్స్‌ ప్యాక్‌ హీరోగా ఘనత సాధించారు బన్నీ. ఈ సినిమా తర్వాత ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రంలో గెస్ట్‌గా నటించారు. మరోసారి దిల్‌రాజు బేనర్‌లో బన్నీ చేసిన ‘పరుగు’ చిత్రానికి మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత సూపర్‌హిట్‌ సినిమా అనిపించుకుంది. అలా తన కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా డిజైన్‌ చేసుకుంటూ వెళ్లిన బన్నీకి కొన్ని అపజయాలు కూడా ఎదురయ్యాయి.  ఆ క్రమంలోనే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ చిత్రంలో బన్నీ చేసిన కేబుల్‌ రాజు క్యారెక్టర్‌ అతనికి మంచి పేరు తెచ్చింది. అంతేకాదు, ఉత్తనటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా గెలుచుకున్నారు. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి సినిమాలు హీరోగా అతని ఇమేజ్‌ని పెంచడమే కాకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరగడమే కాకుండా ఐకాన్‌ స్టార్‌గా ఎదిగేలా చేశాయి. ఆ క్రమంలోనే గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకవిధంగా ఈ చిత్రంలో అనుష్క, రానా కంటే బన్నీకే ఎక్కువ పేరు వచ్చింది. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం, ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం గమనించిన బన్నీ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సరైనోడు బన్నీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చేసిన డి.జె., నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు నిరాశ పరిచాయి.  అలాంటి సమయంలో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేసిన అల వైకుంఠపురములో చిత్రంతో మళ్లీ విజయపథంలోకి వచ్చారు బన్నీ. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా హీరోగా అతని ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకు బన్నీ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే 2021లో సుకుమార్‌ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ ఒక ఎత్తు. ఒక కొత్త లుక్‌తో, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశారు బన్నీ. టాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది ‘పుష్ప’ధీ సినిమాలోని నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకొని తెలుగు సినీ చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను అల్లు అర్జున్‌ సాధించారు. ఈ సినిమా దానికి సీక్వెల్‌గా సుకుమార్‌ రూపొందించిన ‘పుష్ప2’ కోసమే పనిచేశారు బన్నీ. ఈ సినిమా నిర్మాణం జరుపుకున్న మూడేళ్ళు మరో సినిమా చేయలేదు. 2024 డిసెంబర్‌ 5న విడుదలైన ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా.. అప్పటివరకు ఇండియాలో వున్న కలెక్షన్ల రికార్డులను అధిగమించింది. ‘దంగల్‌’ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘పుష్ప2’ రికార్డుల కెక్కింది.  ప్రస్తుతం అల్లు అర్జున్‌ మూడు సినిమాలు కమిట్‌ అయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. వీటిలో మొదట అట్లీ సినిమా ప్రారంభమవుతుందని, కొంత షూటింగ్‌ జరిగిన తర్వాత త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత సందీప్‌ వంగా సినిమా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మైథలాజికల్‌ సినిమా చేయబోతున్నారు బన్నీ. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ సినిమా అయ్యే అవకాశం ఉంది.

ఉజ్వలంగా వెలుగుతున్న రష్మిక మందన్న కెరీర్‌లో మాయని మచ్చ అదే!

(ఏప్రిల్ 5 రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా..) రష్మిక మందన్న.. చిత్ర పరిశ్రమలో గోల్డెన్‌ లెగ్‌ అని పేరు తెచ్చుకున్న అందాల నటి. అంతేకాదు, ఇండియాలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా చెప్పుకుంటున్న ఆమె.. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయారు. కన్నడలో మొదలైన ఆమె సినీ ప్రస్థానం.. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాలతో కొనసాగుతోంది. అందం, అభినయం కలగలిసిన రష్మిక ఇప్పుడు యూత్‌ ఐకాన్‌ అనిపించుకుంటోంది. ఇప్పటివరకు రష్మిక నటించిన పాతిక సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ అయిన సినిమాలే. సౌత్‌లోనే కాదు, నార్త్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న రష్మికను తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు దర్శకనిర్మాతలు క్యూలు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 2016లో ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక.. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? ఎలాంటి విజయాలు సాధించారు? ఆమె వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం. 1996 ఏప్రిల్‌ 5న కర్ణాటకలోని విరాజ్‌పేటలో సుమన్‌, మదన్‌ మందన్న దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు రష్మిక. ఈమెకు ఒక చెల్లెలు షిమాన్‌ ఉన్నారు. మదన్‌ మందన్నకు విరాజ్‌పేటలో కాఫీ ఎస్టేట్‌ ఉంది. కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న రష్మిక.. బెంగళూరులో కాలేజీ విద్యను అభ్యసించింది. ఎం.ఎస్‌.రామయ్య ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ తీసుకున్నారు. 2014లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ పోటీలో టైటిల్‌ను గెలుచుకుంది రష్మిక. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు రష్మిక. ఆ తర్వాత క్లీన్‌ అండ్‌ క్లియర్‌ పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. తనకు నటనపై ఆసక్తి ఉండడంతో ముందుగా మోడలింగ్‌ చేస్తే అవకాశాలు వస్తాయని గుర్తించిన రష్మిక.. ఆ దిశగా అడుగులు వేసింది.  ఒక ఇంటర్వ్యూలో రష్మికను చూసిన కన్నడ హీరో, డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి.. తను చేయబోతున్న ‘కిరిక్‌ పార్టీ’ చిత్రంలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారు. ఈ సినిమాలో రక్షిత్‌శెట్టి సరసన హీరోయిన్‌గా నటించింది రష్మిక. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించి 50 కోట్లు కలెక్ట్‌ చేసింది. నటిగా రష్మికకు చాలా మంచి పేరు తెచ్చిందీ సినిమా. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రష్మికకు తెలుగులో ‘ఛలో’ చిత్రంలో నాగశౌర్య సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ వెంటనే ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.  2021లో అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం రష్మిక కెరీర్‌ను టాప్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘పుష్ప’ పాన్‌ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘సీతారామం’, తమిళ్‌లో ‘వారిసు’, హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2023లో రణబీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్‌’ చిత్రంతో మరో పెద్ద బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. ఈ సినిమాలో కొన్ని ఇంటిమసీ సీన్స్‌లో ఆమె నటనకు యూత్‌ ఫిదా అయిపోయింది. ఆ మరుసటి సంవత్సరం ‘పుష్ప’కి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప2’తో మరో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రష్మిక ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘ఛావా’ ఆమె కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘తమా’ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక.  ఇక రష్మిక వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మొదటి సినిమా ‘కిరిక్‌ పార్టీ’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడ్డారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. దాంతో 2017 జూలై 3న విరాజ్‌పేటలో రక్షిత్‌ శెట్టి, రష్మిక మందన్నల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సంవత్సరం తర్వాత 2018 సెప్టెంబర్‌లో ఆ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని రష్మిక తల్లి సుమన్‌ అధికారికంగా ప్రకటించారు. ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన సమయంలో అతనితో రష్మికకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. వారి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఇద్దరూ ఖండించలేదు. దాంతో వారిద్దరి పెళ్లిని సోషల్‌ మీడియా దాదాపు ఖరారు చేసింది. కానీ, విజయ్‌ దేవరకొండగానీ, రష్మిక మందన్నగానీ వారి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా అనే దాని గురించి ఏ సందర్భంలోనూ స్పష్టం చేయకపోవడంతో ఇప్పటికీ అది రూమర్‌గానే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సినిమా డాన్స్‌ ట్రెండ్‌ సెట్టర్‌ ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా!

(ఏప్రిల్ 3 ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా..) ఇండియన్‌ డాన్స్‌లో ఒక సంచలనం. అతని స్టెప్పులకు కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. అతని డాన్స్‌ మూమెంట్స్‌ని కళార్పకుండా చూస్తుండిపోతారు. అతనే ప్రభుదేవా అలియాస్‌ ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌. ఎన్నో భాషల్లో తన కొరియోగ్రఫీతో కొత్త స్టెప్పులకు రూపకల్పన చేసిన డాన్స్‌మాస్టర్‌ ప్రభుదేవా. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సుందరం మాస్టర్‌ వారసుడిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించిన ప్రభుదేవా చాలా తక్కువ సమయంలోనే తన డాన్స్‌తో అందర్నీ మెప్పించారు. డాన్స్‌మాస్టర్‌గానే కాదు, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న ప్రభుదేవా పుట్టినరోజు ఏప్రిల్‌ 3. ఈ సందర్భంగా ఆయన సినీరంగంలోకి ఎలా అడుగుపెట్టారు, ఎలాంటి విజయాలు సాధించారు అనే విశేషాల గురించి తెలుసుకుందాం. 1973 ఏప్రిల్‌ 3న కర్ణాటకలోని మైసూర్‌లో ముగుర్‌ సుందర్‌, మహదేవమ్మ దంపతులకు రాజుసుందరం తర్వాత రెండో సంతానంగా జన్మించారు ప్రభుదేవా. ఇతని తర్వాత నాగేంద్రప్రసాద్‌ పుట్టారు. ఈ ముగ్గురూ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుదేవాకి చదువు కంటే డాన్స్‌ మీదే ఎక్కువ దృష్టి ఉండేది. అందుకే తండ్రితో కలిసి షూటింగ్స్‌కి వెళుతుండేవాడు. డాన్స్‌పై ప్రభుకి వున్న ఆసక్తిని గమనించి తన దగ్గరే అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు సుందరం. ఆ సమయంలోనే భరతనాట్యంతోపాటు ఇతర భారతీయ నృత్యరీతుల్ని ఉడిపి లక్ష్మీనారాయణన్‌, ధర్మరాజు వద్ద నేర్చుకున్నారు ప్రభు. అలాగే వెస్ట్రన్‌ స్టైల్‌ డాన్స్‌ను కూడా అభ్యసించారు. తండ్రి దగ్గరే కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేసిన తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు.  1986లో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘మౌనరాగం’ చిత్రంలోని ‘తడి తడి తలపు..’ అనే పాటలో 13 ఏళ్ళ వయసులో మొదటిసారి స్క్రీన్‌పై చిన్న బిట్‌లో కనిపించారు ప్రభుదేవా. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులోనే మొదటిసారి కొరియోగ్రఫీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ప్రతాప్‌ పోతన్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌, ప్రభు హీరోలుగా నటించిన ‘వెట్రి విజా’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. 1991లో మురళి హీరోగా కదిర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హృదయం’ చిత్రంలోని ‘ఏప్రిల్‌ మేలలో పాపల్లేరురా..’ పాటలో మొదటిసారి స్టెప్స్‌ వేస్తూ కనిపించారు. ఆ ఒక్క పాటతోనే అందరి దృష్టిలో పడ్డారు ప్రభుదేవా. ఆ తర్వాత శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంలోని ‘చికుబుకు చికుబుకు రైలే..’ పాటతో ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు.  మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొని వరసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే 1994లో దర్శకుడు పవిత్రన్‌ ‘ఇందు’ అనే చిత్రం ద్వారా ప్రభుదేవాను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రభుదేవా డాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే డైరెక్టర్‌ శంకర్‌ తను చేస్తున్న ‘కాదలన్‌’ చిత్రంలో ప్రభుని హీరోగా బుక్‌ చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమికుడు’గా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళ్‌లో, తెలుగులో కొరియోగ్రఫీ చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించారు. తెలుగులో ప్రభుదేవా నటించిన చుక్కల్లో చంద్రుడు, తొట్టిగ్యాంగ్‌, సంతోషం, కళ్యాణరాముడు వంటి సినిమాలు నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చాయి.  సిద్ధార్థ్‌, త్రిష జంటగా యం.యస్‌.రాజు నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు ప్రభుదేవా. ఈ సినిమా ఘనవిజయం సాధించి డైరెక్టర్‌గా ప్రభుకి మంచి పేరు తెచ్చింది. అదే బేనర్‌లో ప్రభాస్‌, త్రిష, ఛార్మి ప్రధాన పాత్రల్లో ప్రభుదేవా రూపొందించిన ‘పౌర్ణమి’ పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘పోకిరి’ చిత్రాన్ని అదే పేరుతో తమిళ్‌లో, హిందీలో ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడా సూపర్‌హిట్‌ చేశారు. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, గేయ రచయితగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ప్రభుదేవా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా దాదాపు 50 సినిమాల్లో నటించిన ప్రభుదేవా డాన్సర్‌గా 30, దర్శకుడిగా 15, నిర్మాతగా 3 సినిమాలు చేశారు. ఇప్పటికీ కొరియోగ్రాఫర్‌గా దేశంలోని వివిధ భాషల సినిమాలకు పనిచేస్తున్నారు ప్రభుదేవా.  ఇక ప్రభుదేవా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1995లో రమాలత్‌ని వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలపాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితానికి 2011లో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. హీరోయిన్‌ నయనతారతో ప్రభుదేవా కొన్నాళ్ళు ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడంతో ప్రభుదేవా, రమాలత్‌ల మనస్పర్థలు వచ్చాయి. అయితే ప్రభుదేవా, నయనతార పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ప్రభుదేవా నుంచి రమాలత్‌ విడిపోయారు. అప్పటి నుంచి 9 సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా 2020లో హిమాని సింగ్‌ని వివాహం చేసుకున్నారు. అంతకుముందు ప్రభుదేవాకు ముగ్గురు పిల్లలు వున్నారు. 2023లో ఓ పాపకు జన్మనిచ్చారు హిమాని సింగ్‌.

ఒకే కథతో గుణశేఖర్‌, కృష్ణవంశీ సినిమాలు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

ఒక సినిమా రూపుదిద్దుకోవడానికి రచయిత మనసులో పుట్టిన ఆలోచన ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. తను జీవితంలో చూసిన సంఘటనలు కావచ్చు లేదా ఎవరి జీవితంలోనైనా జరిగిన ఆసక్తికర సంఘటనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. దాన్ని సినిమాకి అనుగుణంగా మార్చి పూర్తి స్థాయి కథను సిద్ధం చేయడంలోనే ఆ రచయిత ప్రతిభ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి కూడా రావచ్చు. ఆ ఇద్దరికీ స్ఫూర్తి ఒకే సంఘటన కావచ్చు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ సంఘటన నేపథ్యాన్నే తీసుకొని సినిమాను రూపొందిస్తే ఏం జరుగుతుంది? అలాంటి ఆసక్తికరమైన అంశం రెండు సినిమాల విషయంలో చోటు చేసుకుంది. ఆ రెండు సినిమాలు గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చూడాలని వుంది’, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘అంత:పురం’. ఈ రెండు సినిమాల ప్రధాన కథాంశం ఒక్కటే. దూరమైన బిడ్డను తనతోపాటు తీసుకెళ్లాలని ‘చూడాలని వుంది’ చిత్రంలో ఓ తండ్రి తపిస్తాడు. అలాగే ‘అంత:పురం’ చిత్రంలో తన బిడ్డను తనతో తీసుకెళ్లాలని ఓ తల్లి సాహసం చేస్తుంది.  ‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల కథలు ఒకటే అనే విషయం ఇద్దరు దర్శకులకు తెలిసింది. అదెలాగంటే.. ‘చూడాలని వుంది’ సినిమా రిలీజ్‌కి వారం రోజుల ముందు నంది అవార్డుల ఫంక్షన్‌ జరిగింది. ఆ సమయంలో కలిసిన గుణశేఖర్‌, కృష్ణవంశీ మాటల సందర్భంలో వారు చేస్తున్న సినిమాల కథల గురించి ప్రస్తావన వచ్చింది. ఒకరి కథ ఒకరు విని షాక్‌ అయ్యారు. అయితే ఇద్దరూ ప్రతిభావంతులైన దర్శకులు కాబట్టి పాయింట్‌ ఒకటే అయినా దాన్ని రెండు విభిన్నమైన సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు. ఈ రెండు సినిమాలకూ మూలం 1991లో వచ్చిన ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే హాలీవుడ్‌ మూవీ. ‘అంత:పురం’ చిత్రంలో మాదిరిగానే తన బిడ్డ కోసం ఓ తల్లి చేసిన సాహసమే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా. అయితే ‘చూడాలని వుంది’ చిత్రంలో మాత్రం బిడ్డ కోసం తండ్రి పోరాటం చేస్తాడు. అసలు ఈ కథ ఎలా పుట్టింది.. జరిగిన యదార్థ సంఘటన ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇరాన్‌కు చెందిన డాక్టర్‌ మహ్మదీ.. అమెరికాకు చెందిన బెట్టీని వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ఒక పాప. ఒకరోజు ఇరాన్‌ వెళ్లాలని, తన ఫ్యామిలీ నీ కోసం, పాప కోసం ఎదురుచూస్తోందని, మళ్ళీ రెండు వారాల్లో వచ్చేద్దామని బెట్టీతో చెప్పాడు మహ్మదీ. దాంతో ముగ్గురూ ఇరాన్‌ బయల్దేరారు. కానీ, అక్కడి వాతావరణం, ఇస్లామిక్‌ పద్ధతులు బెట్టీకి నచ్చలేదు. అయినా రెండు వారాలే కదా అని ఓపిక పట్టింది. అయితే మనం తిరిగి అమెరికా వెళ్లడం లేదని, ఇరాన్‌లోనే ఉంటున్నామని చెప్పాడు భర్త. దాన్ని బెట్టీ వ్యతిరేకించింది. దాంతో ఆమెను శారీరకంగా హింసించాడు భర్త. అలాగే మహ్మదీ కుటుంబం నుంచి కూడా బెట్టీపై వ్యతిరేకత వచ్చింది. అమెరికా వెళ్లాలంటే పాపను వదిలి వెళ్లాలని ఆర్డర్‌ వేసాడు భర్త. అప్పటి నుంచి పాపను తీసుకొని అమెరికా వెళ్లడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ చేసింది. ఆ ప్రయత్నంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో పాస్‌పోర్ట్స్‌ రెడీ చేసే ఓ వ్యక్తి సాయంతో పాపతోపాటు అమెరికా చేరుకుంది బెట్టీ. ఇదీ ఆ యదార్థగాధ. అమెరికా వెళ్లిన తర్వాత ఇరాన్‌ నుంచి అమెరికా వచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలను ఓ పుస్తకరూపంలో తీసుకొచ్చింది బెట్టీ. ఆ పుస్తకం ఆధారంగానే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా రూపొందింది.  అదే కథతో తెలుగులో రూపొందిన ‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల విషయానికి వస్తే.. దాదాపుగా యదార్థంగా జరిగిన ఘటనే ‘అంత:పురం’ చిత్రంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకొని ఆ కథను తెరకెక్కించారు కృష్ణవంశీ. తల్లి పాత్రలో సౌందర్య అద్భుతమైన నటనను ప్రదర్శించింది. రాయలసీమ నుంచి ఆమెను తప్పించే పాత్రలో జగపతిబాబు విలక్షణమైన నటనను ప్రదర్శించారు. ఇక ‘చూడాలని వుంది’ సినిమా విషయానికి వస్తే.. అదే పాయింట్‌ని తీసుకొని కొడుకును వెతుక్కుంటూ తండ్రి కలకత్తా వెళ్ళడాన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు గుణశేఖర్‌. ఈ రెండు సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రను ప్రకాష్‌రాజ్‌ ధరించడం విశేషం. ‘చూడాలని వుంది’ చిత్రంలో కూడా సౌందర్య హీరోయిన్‌గా నటించడం మరో విశేషం. ఈ పాయింట్‌కి ‘అంత:పురం’లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకుంటే.. ‘చూడాలని వుంది’ చిత్రంలో అండర్‌వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకున్నారు.  1998 ఆగస్ట్‌ 27న ‘చూడాలని వుంది’ చిత్రం రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి ఎన్నో సెంటర్స్‌లో శతదినోత్సవాలు జరుపుకుంది. ముఖ్యంగా మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ‘యమహా నగరి కలకత్తాపురి..’ అనే పాట చిరంజీవి కెరీర్‌లోని టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రాన్ని ‘కలకత్తా మెయిల్‌’ పేరుతో తెలుగులో నిర్మించిన అశ్వినీదత్తే హిందీలో అల్లు అరవింద్‌తో కలిసి రీమేక్‌ చేశారు. ఇక ‘అంత:పురం’ విషయానికి వస్తే.. 1998 నవంబర్‌ 30న ఈ సినిమా విడుదలైంది.  కృష్ణవంశీ రూపొందించిన మోస్ట్‌ ఎమోషనల్‌ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు హై ఎమోషన్స్‌తో యదార్థ ఘటనను తలపించే విధంగా ఉంటుంది. ఇళయరాజా సంగీత సారధ్యంలో ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సినిమా కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి 3 ఫిలింఫేర్‌ అవార్డులు, 9 నంది  అవార్డులు లభించాయి. ప్రకాష్‌రాజ్‌ నటనకు జాతీయ ప్రత్యేక ప్రశంస అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘శక్తి’ పేరుతో బోనీకపూర్‌ రీమేక్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ, అప్పటికి ఆమె ప్రెగ్నెంట్‌ కావడంతో కరిష్మా కపూర్‌ను తీసుకున్నారు. ప్రకాష్‌ రాజ్‌ పాత్రలో నానా పాటేకర్‌ నటించారు. తమిళ్‌లో ‘అంత:పురం’ పేరుతోనే పార్తీబన్‌ రీమేక్‌ చేశారు. 

నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోని ఒకే ఒక్క నాయకుడు ఎన్‌.టి.రామారావుగారు!

‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు..’ అంటూ నటరత్న నందమూరి తారకరామారావు ఇచ్చిన సందేశం ఎందరికో తలమానికం. ఆయన్ని నటుడిగా, రాజకీయ వేత్తగా కంటే ఒక మహోన్నత వ్యక్తిగా, తమ దైవంగా భావించే వారు ఎంతో మంది ఉన్నారు. 76 సంవత్సరాల క్రితం సినీరంగంలో ప్రవేశించిన ఎన్టీఆర్‌.. నిజంగానే దైవాంశ సంభూతుడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పురాణాల్లోని దైవ స్వరూపాలైన రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఆ దైవాలను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎన్‌.టి.రామారావు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. వెండితెరపై నవరసాలను అలవోకగా పలికించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్‌. సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్‌. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా అవి మనసు పొరల్లోంచి వచ్చే భావాలే తప్ప ఒక నటుడిగానో, రాజకీయ వేత్తగానో ఆయన్ని పొగిడేందుకు చేసే ప్రయత్నం కాదు. ఎన్టీఆర్‌ తమ జీవితాల్లో ఎలా భాగస్వామి అయ్యారు, ఆయన జీవితం తమను ఎలా ప్రభావితం చేసింది, ఆయన కనిపిస్తే చాలు ఎలా పరవశించిపోయాము అనే విషయాలను ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులు ప్రస్తావించారు. ‘బలగం’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్‌ గౌడ్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్‌.టి.రామారావుపై తనకు వున్న ఆరాధనా భావాన్ని తెలిపారు.  ‘సిద్ధిపేటలో పశుపతినాథ్‌ అనే వ్యక్తికి మెడికల్‌ షాప్‌ ఉంది. ఆయన అక్కినేని నాగేశ్వరరావుగారికి వీరాభిమాని. ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం పశుపతినాథ్‌ దగ్గర ఉండేది. ఒకసారి అక్కినేనిగారిని ఆయన సిద్ధిపేటకు తీసుకొచ్చారు. అలా మా కాలేజీకి కూడా వచ్చారు. మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన నాగేశ్వరరావుగారిని తీసుకొచ్చారు. మేం ఎన్‌.టి.రామారావుగారిని తీసుకురాలేకపోతున్నాం అనే బాధ. ఎలాగైనా అన్నగారిని సిద్ధిపేట తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాం. అయితే మాకు ఎలాంటి సోర్స్‌ లేదు. సిద్ధిపేటలో ఉన్న బాలాజీ టాకీస్‌ ఓనర్స్‌లో ఒకరైన కన్యాలాల్‌ని మేం ఎంతో గౌరవించేవాళ్ళం. మాకు హనుమాన్‌ వ్యాయామశాల ఉండేది. దానికి ఆయన్ని గౌరవ అధ్యక్షుడిగా చేశాం. రామారావుగారిని సిద్ధిపేట తీసుకు రావాలంటే థియేటర్‌ ఓనర్‌ కాబట్టి కన్యాలాల్‌గారి వల్లే అవుతుంది అనిపించింది. అదే విషయాన్ని ఆయనకు చెప్పాం. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎలా చేశారో తెలీదుగానీ, రామారావుగారిని సిద్ధిపేటకు తీసుకొచ్చారు. మేం 8 మంది ఫ్రెండ్స్‌. మేమంతా ఆయన వచ్చిన సందర్భంగా చాలా హంగామా చేశాం. ఆయన కారులో నుంచి దిగగానే ఓపెన్‌ టాప్‌ జీప్‌లో సిద్ధిపేట మొత్తం తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. బయల్దేరిన దగ్గర నుంచి తిరిగి కాలేజీకి వచ్చే రూట్‌ మొత్తం మేమే చూపించాం.  ఆ సందర్భంగా రామారావుగారు మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఏమిటంటే.. ‘సిద్ధిపేటలో నాకు ఇంత ఘనస్వాగతం లభిస్తుందని అనుకోలేదు’ అన్నారు. నిజానికి ఆరోజు ఎక్కడికెక్కడి నుంచో ఇసుక వేస్తే రాలనంతగా కొన్ని వేల మంది జనం అక్కడికి వచ్చారు. ఆరోజుల్లో రామారావుగారికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడే కాదు, ఇప్పటికైనా రామారావుగారు అంటే ఒక అద్వితీయమైన వ్యక్తి. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, వ్యక్తిగా నభూతో నభవిష్యత్‌. అలాంటి మహానుభావులు ఇంతకుముందు లేరు, ఇకపై రారు కూడా. ఈరోజు వరకు ప్రజలకు సంబంధించిన ఒక్క పైసా కూడా వాడుకోకుండా సేవ చేసిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు రామారావుగారు. ఇప్పుడు అలాంటి వారిని ఒక్కర్ని చూపించండి. అయితే ప్రధానమంత్రి మోది, యోగి వంటి ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. కానీ, సొంత డబ్బు ఖర్చుపెట్టి ప్రజలకు సేవ చేసిన మహానుభావుడు ఎన్‌.టి.రామారావుగారు. ఫ్లైట్‌లో వెళ్లాలంటే సొంతంగా టికెట్‌ వేసుకొని వెళ్లేవారు. గవర్నమెంట్‌ కారులో ఇంటికి వెళితే మళ్ళీ దాన్ని ఆఫీస్‌కి పంపించేవారు తప్ప సొంతంగా వాడుకునేవారు కాదు. అలా ఎవరు చేయగలరు? ఒక మనిషి మనిషిగా జీవించాలన్నా.. జీవితంలో ఎదగాలన్నా రామారావుగారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి’ అంటూ ఎన్‌.టి.రామారావుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మురళీధర్‌గౌడ్‌.

100 రోజుల ఫంక్షన్‌కి డైరెక్టర్‌ని రావొద్దన్న నిర్మాత.. ఫంక్షన్‌ క్యాన్సిల్‌ చేసిన మహేష్‌బాబు!

1979లో నాలుగేళ్ళ వయసులో ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన మహేష్‌బాబు 11 ఏళ్ళ పాటు 8 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు గ్యాప్‌ తీసుకొని ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించి మహేష్‌కు హీరోగా మంచి ప్రారంభాన్నిచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన యువరాజు, వంశీ చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో మహేష్‌ కెరీర్‌ ఏమైపోతుందోనని సూపర్‌స్టార్‌ కృష్ణ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత చేసే సినిమా కథ, దర్శకుడి విషయంలో ఎంతో కేర్‌ తీసుకోవాలని భావించారు. అంతకుముందు కృష్ణతో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన నందిగం రామలింగేశ్వరరావు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఆయన స్వతహాగా కృష్ణ అభిమాని కావడంతో మహేష్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కృష్ణవంశీని డైరెక్టర్‌గా సెలక్ట్‌ చేసుకున్నారు. అతనితో సినిమా చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ నిర్మాతను భయపెట్టారు. అయితే సినిమా రిచ్‌గా ఉంటుందని కూడా వారే అన్నారు. అయినా రామలింగేశ్వరరావు వెనుకడుగు వేయకుండా ఎంత ఖర్చయినా మంచి సినిమా చెయ్యాలనుకున్నారు.  కృష్ణవంశీ మొదట శ్రీఆంజనేయం, చక్రం కథలు చెప్పారు. కానీ, అవి రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. కథలు సెలెక్ట్‌ చేసే బాధ్యతను సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తె మంజుల, మహేష్‌, రామలింగేశ్వరరావులకు అప్పగించారు కృష్ణ. కథ ముగ్గురికి నచ్చినా ఓకే చెయ్యమని చెప్పారు. అప్పుడు మురారి కథ చెప్పారు కృష్ణవంశీ. ఆ కథ అందరికీ నచ్చింది. ఇక ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక మొదలైంది. కమల్‌హాసన్‌ దర్శకత్వంలో వచ్చిన హేరామ్‌ చిత్రంలో నటించిన వసుంధరాదాస్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని కృష్ణవంశీ అనుకున్నారు. కానీ, ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. తన కుమార్తె సూచించిన సోనాలి బింద్రేను ఎంపిక చేశారు. అలాగే సినిమాటోగ్రాఫర్‌గా భూపతిని ఎంపిక చేశారు కృష్ణవంశీ. కానీ, సి.రాంప్రసాద్‌ని తీసుకొచ్చారు నిర్మాత. కృష్ణ పర్సనల్‌ మేకప్‌మేన్‌ సి.మాధవరావు అంటే రామలింగేశ్వరరావుకు ఎంతో అభిమానం అందుకే రాంప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఇలా అన్ని విషయాల్లోనూ దర్శకనిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ వుండేవి.  ‘మురారి’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రారంభించారు. దాదాపు 45 రోజులపాటు చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆలయ సన్నివేశాలను శంషాబాద్‌ టెంపుల్‌లో తీశారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో గొడవలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన రామలింగేశ్వరరావు షూటింగ్‌ బాధ్యతను తన బావమరిది బుల్లి సుబ్బారావుకి అప్పగించి ఆయన మద్రాస్‌ వెళ్లిపోయారు. ఇవేవీ పట్టించుకోకుండా కృష్ణవంశీ మాత్రం షూటింగ్‌పైనే కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు. మహేష్‌ నుంచి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. ఆరోజుల్లోనే ఈ సినిమాకి రూ.8 కోట్ల బడ్జెట్‌ అయ్యింది. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడని రామలింగేశ్వరరావు రిలీజ్‌కి ముందు చేసే పబ్లిసిటీ విషయంలో కూడా కాంప్రమైజ్‌ అవ్వలేదు.  2021 ఫిబ్రవరి 17న ‘మురారి’ చిత్రం విడుదలైంది. పరీక్షల ముందు సినిమా రిలీజ్‌ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు రాలేదు. దాంతో మొదటి రెండు వారాలు కలెక్షన్లు డల్‌గానే ఉన్నాయి. యూనిట్‌ మొత్తం సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఆ సమయంలోనే రామలింగేశ్వరరావు పబ్లిసిటీ పెంచారు. పరీక్షలు పూర్తి కాగానే ‘మురారి’ సినిమా తప్పకుండా చూడాలి అనేంతగా తన పబ్లిసిటీతో ప్రేక్షకుల్ని ప్రభావవంతం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. ఫైనల్‌గా సినిమా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల సినిమా చూసి మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ని మెచ్చుకున్నారు. తన అభిమాన హీరో కుమారుడికి సూపర్‌హిట్‌ ఇవ్వాలని ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన రామలింగేశ్వరరావు తన కోరిక నెరవేర్చుకున్నారు. ఎన్నో కేంద్రాల్లో మురారి 100 రోజులు పూర్తి చేసుకుంది.  సినిమా నిర్మాణానికి అయ్యే బడ్జెట్‌ విషయంలోగానీ, పబ్లిసిటీకి అయ్యే ఖర్చు విషయంలోగానీ ఎక్కడా రాజీపడని రామలింగేశ్వరరావు మురారి 100 రోజుల ఫంక్షన్‌ మాత్రం చేయలేకపోయారు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సమయంలోనే వంద రోజుల ఫంక్షన్‌ను హైదరాబాద్‌, విజయవాడలలో నిర్వహిస్తామని చెప్పారు. దానికి వీలుగా హైదరాబాద్‌లో ఫంక్షన్‌ పూర్తవ్వగానే చార్టెట్‌ ఫ్లయిట్‌లో ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను విజయవాడకు తీసుకెళ్తానని చెప్పారు రామలింగేశ్వరరావు. అయితే దానికి ఒక కండిషన్‌ పెట్టారు. వంద రోజుల ఫంక్షన్‌కి కృష్ణవంశీ రాకూడదని కృష్ణకు చెప్పారు నిర్మాత. నిజానికి కృష్ణకు, మహేష్‌కు దర్శకులంటే ఎంతో గౌరవం. అలాంటిది ఫంక్షన్‌కు డైరెక్టర్‌ రావడానికి వీల్లేదని నిర్మాత చెప్పడం వారికి బాధ కలిగించింది. డైరెక్టర్‌ లేకుండా ఫంక్షన్‌ చేయడం కరెక్ట్‌ కాదని భావించిన మహేష్‌ ‘మురారి’ 100 రోజుల ఫంక్షన్‌ను క్యాన్సిల్‌ చేశారు.

చిరంజీవిని మోసం చేసిన అగ్ర నిర్మాత.. ఏ విషయంలో?

మెగాస్టార్‌ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎవరి అండా లేకుండా, కేవలం స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన వైనం అందరికీ తెలుసు. అయితే ఆయన సినీ జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో అందరిలాగే  ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. చిరంజీవి తొలిసారి నటించిన సినిమా పునాదిరాళ్లు. కానీ, రిలీజ్‌ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా తర్వాత మనవూరి పాండవులు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సెకండ్‌ హీరోగా, కొన్ని సాధారణ సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ పెద్ద బేనర్‌, పెద్ద డైరెక్టర్‌ చేతిలో చిరంజీవి పడలేదు. ఆ సమయంలో అడవిరాముడు వంటి బ్లాక్‌బస్టర్‌ని నిర్మించిన సత్యచిత్ర సంస్థలో ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సూర్యనారాయణ ఈ విషయం చెబుతూ.. ‘ప్రస్తుతం కృష్ణతో కొత్త అల్లుడు సినిమా చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత నువ్వు హీరోగా సినిమా స్టార్ట్‌ చేస్తాం. అయితే కొత్త అల్లుడు సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఉంది. అది నువ్వు చెయ్యాలి’ అన్నారు. అప్పటికి కొన్ని సినిమాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లు, మోసగాడు వంటి సినిమాలో విలన్‌గా నటించిన చిరంజీవి.. ఇకపై విలన్‌గా నటించకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ తర్వాతి సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తామని చెప్పడంతో కొత్త అల్లుడు సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి చేసిన విలన్‌ క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. సినిమా విడుదలై ఘన విజయం సాధించింది.  ఆ సినిమా తర్వాత తనతోనే సినిమా చేస్తారని భావించారు చిరంజీవి. కానీ, నిర్మాత సూర్యనారాయణ ఆ విషయం గురించి మళ్లీ ప్రస్తావించలేదు. పైగా తమ నెక్స్‌ట్‌ సినిమాను కూడా ఎనౌన్స్‌ చేసేశారు. అందులో కూడా కృష్ణ, జయప్రదే హీరోహీరోయిన్స్‌. తనను హీరోగా పెట్టి సినిమా చేస్తానని మాట ఇచ్చిన నిర్మాత మరో సినిమా మొదలు పెట్టడంతో చిరంజీవి షాక్‌ అయ్యారు. సూర్యనారాయణ దగ్గరకు వెళ్లి అదే విషయాన్ని అడిగారు చిరంజీవి. దానికాయన.. ‘ఈ సినిమా తప్పనిసరిగా చెయ్యాల్సి వస్తోంది. నెక్స్‌ట్‌ ఇయర్‌ తప్పనిసరిగా నీతో సినిమా చేస్తాం. అయితే కొత్తపేట రౌడీ చిత్రంలో ఒక గెస్ట్‌ రోల్‌ ఉంది. విలన్‌ క్యారెక్టర్‌  కాదు. పాజిటివ్‌ రోల్‌. పైగా నీకు ఒక పాట కూడా ఉంటుంది’ అన్నారు. తనకు హీరోగా ఛాన్స్‌ ఇవ్వకపోయినా మొహమాటానికి పోయి రెండో సినిమా కూడా చెయ్యడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. ఆ సమయంలో మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. తమ సినిమాలో హీరోగా చేస్తూ వేరే సినిమాల్లో విలన్‌గా, గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా నటించడం ఆ నిర్మాతలకు నచ్చలేదు. అయితే వారికి సర్ది చెప్పి కొత్తపేట రౌడీ చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ సినిమా కూడా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అప్పుడైనా తనతో సినిమా చేస్తారేమోనని చిరంజీవి ఎదురుచూశారు. కానీ, సత్యచిత్ర అధినేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ క్షణం ఎంతో బాధపడిన చిరంజీవి.. తాను మోసపోయానని గ్రహించారు. అయితే దాని గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించలేదు. అలా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చేతిలో మెగాస్టార్‌ చిరంజీవి ఘోరంగా మోసపోయారు.

బాలకృష్ణ, మాధురీ దీక్షిత్‌లతో ఎ.ఎం.రత్నం హిందీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?

నటరత్న ఎన్‌.టి.రామారావు తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేశారో తెలిసిన విషయమే. తన 45 సంవత్సరాల సినీ జీవితంలో తెలుగు, తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు తప్ప మరో భాషలో నటించే ప్రయత్నం చెయ్యలేదు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తను చేయని పాత్ర లేదు అన్నంతగా తన నటనతో అలరించారు ఎన్టీఆర్‌. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అద్భుతమైన నటుడు నందమూరి బాలకృష్ణ. తండ్రిలాగే అన్ని జోనర్స్‌లో సినిమాలు చేసి ఈ తరంలో అలాంటి నటులు లేరని నిరూపించారు. బాలయ్య సమకాలీన నటులైన చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి హీరోలు తెలుగులోనే కాదు, హిందీలోనూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో నాగార్జున మాత్రమే అప్పుడప్పుడు హిందీలో సినిమాలు చేస్తున్నారు తప్ప చిరంజీవి, వెంకటేష్‌ కొన్ని సినిమాలతోనే వెనక్కి వచ్చేశారు. అయితే వీరిద్దరూ చేసిన సినిమాలు తెలుగులో సూపర్‌హిట్‌ అయినవే తప్ప కొత్త కథలు కాదు. ప్రతిబంధ్‌, ఆజ్‌ కా గూండారాజ్‌, ది జెంటిల్‌మేన్‌ అనే మూడు సినిమాలు మాత్రమే చిరంజీవి చేశారు. ఈ సినిమాలు అక్కడ కమర్షియల్‌గా బాగా వర్కవుట్‌ అయినప్పటికీ బాలీవుడ్‌ నిర్మాతలెవరూ చిరంజీవితో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. అలాగే వెంకటేష్‌ అనాడి, తక్‌దీర్‌వాలా చిత్రాలు చేశారు. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత వెంకటేష్‌ మళ్ళీ హిందీ సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే 2023లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన కిసీకా భాయ్‌ కిసీకి జాన్‌ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు.  నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. 50 ఏళ్ళ తన కెరీర్‌లో తెలుగు సినిమాల్లోనే నటించారు తప్ప మరో భాషకి వెళ్ళలేదు. ఎన్టీఆర్‌ కొన్ని తమిళ్‌ సినిమాల్లో నటించారు. బాలకృష్ణ మాత్రం తెలుగుకే పరిమితం అయ్యారు. అయితే బాలకృష్ణ నటించిన సినిమాలను హిందీలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే మంచి కలెక్షన్లు వచ్చేవి. 1992లో బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాన్ని హిందీలోకి డబ్‌చేసి 17 సెంటర్స్‌లో విడుదల చేశారు. అప్పటికి అది రికార్డ్‌ అనే చెప్పాలి. ఆ సినిమా అక్కడ మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా హిందీలోకి డబ్‌ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణను బాలీవుడ్‌కి పరిచయం చెయ్యాలని నిర్మాత ఎ.ఎం.రత్నం భావించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించాలని అనుకున్నారు. తేజాబ్‌ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించి నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు ఎన్‌.చంద్ర. అలాగే తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ప్రతిఘటన చిత్రాన్ని హిందీలో ప్రతిఘాత్‌ పేరుతో రీమేక్‌ చేసి విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎన్‌.చంద్ర దర్శకుడు. బాలయ్య బాలీవుడ్‌ ఎంట్రీకి అతనే కరెక్ట్‌ అని భావించిన రత్నం ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్ర కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. బాలకృష్ణ, చంద్ర, రత్నం స్టోరీ డిస్కషన్‌ కోసం నాలుగైదు సిట్టింగ్స్‌ కూడా వేశారు. బాలయ్యకు ఒక పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేశారు చంద్ర.   అప్పట్లో మాధురీ దీక్షిత్‌ బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. ఎన్‌.చంద్ర డైరెక్షన్‌లో వచ్చిన తేజాబ్‌ చిత్రంలోని ఏక్‌దోతీన్‌ పాటతో దేశాన్ని ఉర్రూతలూగించి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది మాధురి. ఆ సమయంలోనే టాలీవుడ్‌కి ఆమెను తీసుకు రావాలని ఎంతో మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ, బాలీవుడ్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న మాధురి.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే తనను స్టార్‌ని చేసిన చంద్ర డైరెక్టర్‌ కాబట్టి బాలయ్య కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అయితే అదే టైమ్‌లో చంద్ర బాలీవుడ్‌లో ఒక సినిమా చెయ్యాల్సి వచ్చింది. దీంతో బాలకృష్ణ, మాధురీ దీక్షిత్‌ సినిమాను పక్కన పెట్టారు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నించారు రత్నం. కానీ, అప్పటికి బాలయ్య వరస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. దాంతో బాలకృష్ణ బాలీవుడ్‌ ఎంట్రీ అనేది ప్రయత్నంతోనే ఆగిపోయింది. అప్పుడు తెలుగులో సూపర్‌హిట్‌ అయిన కర్తవ్యం చిత్రాన్ని హిందీలో తేజస్విని పేరుతో రీమేక్‌ చేస్తూ రత్నం కూడా బిజీ అయిపోయారు. అలా బాలకృష్ణను హిందీకి పరిచయం చేద్దామనుకున్న రత్నం కోరిక తీరలేదు. 

సెన్సార్‌పై కేసు వేసి మూడేళ్లు పోరాడిన ఎన్టీఆర్‌.. తన సినిమాతో చరిత్ర సృష్టించారు!

భక్తి ప్రధాన చిత్రంతోనే తొలి తెలుగు సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా తెలుగులో భక్తి ప్రధానంగా ఉన్న సినిమాలనే నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు రాజ్యమేలాయి. సాంఘిక చిత్రాల ఒరవడి మొదలైన తర్వాత భక్తి చిత్రాల నిర్మాణం తగ్గు ముఖం పట్టింది. రకరకాల జోనర్స్‌లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ భక్తి చిత్రాలకు మాత్రం ఆదరణ బాగానే ఉండేది. భక్తి ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా దర్శకులు ఉండేవారు. వారు మాత్రమే భక్తి రసాన్ని బాగా పండించగలరని నిర్మాతలు నమ్మేవారు. ఆ తరహా సినిమాలు రూపొందించడంలోనూ నటరత్న ఎన్‌.టి.రామారావు తన ప్రత్యేకతను చాటుకున్నారు. మన పురాణాల్లోని పురుషులను అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, శివుడు.. ఇలా ఎవరినైనా తన రూపంలోనే చూపించేవారు ఎన్టీఆర్‌.  దానవీరశూర కర్ణ వంటి ఘనవిజయం తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని అనుకున్నారు ఎన్టీఆర్‌. అంతకుముందే ఈ కథతో సినిమా తెరకెక్కించాలని కొందరు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో మధ్యలోనే ఆ సినిమాలు ఆగిపోయాయి. 1953లో స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్‌తో బ్రహ్మంగారి కథని తెరకెక్కించాలనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఆ సినిమా చేసేందుకు తన అంగీకారాన్ని తెలియజేశారు. కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌కు బ్రహ్మంగారి గెటప్‌ వేసి స్టిల్స్‌ కూడా తీశారు. అయితే కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ సినిమా చెయ్యవద్దని వారించడంతో ఎన్టీఆర్‌ ఆ సినిమాను వదులుకున్నారు. ఆ తర్వాత హీరో హరనాథ్‌.. బ్రహ్మగారి కథను కె.వి.నందనరావు దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు. బ్రహ్మంగారిగా హరనాథ్‌, సిద్ధయ్యగా శ్రీధర్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, అది కూడా సెట్స్‌కి వెళ్లకుండానే ఆగిపోయింది. కరుణామయుడు చిత్రంలో ఏసుక్రీస్తుగా నటించిన విజయ్‌చందర్‌ కూడా ఈ కథతో సినిమా చెయ్యాలని ప్రయత్నించారు. కానీ, ఆయన కూడా దాన్ని విరమించుకున్నారు. చివరికి ఆ సినిమాను తెరకెక్కించే బాధ్యతను ఎన్టీఆర్‌ తీసుకున్నారు.  దానవీరశూర కర్ణ చిత్రానికి మాటలు రాసిన కొండవీటి వెంకటకవితో కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్లారు ఎన్టీఆర్‌. అక్కడే 14 రోజులు ఉండి బ్రహ్మంగారి చరిత్రను పూర్తిగా తెలుసుకున్నారు. తర్వాత హైదరాబాద్‌ వచ్చి స్క్రిప్ట్‌ వర్క్‌ను మొదలుపెట్టారు. గతంలో మాదిరిగానే ఈ సినిమా చెయ్యొద్దని ఆయన శ్రేయోభిలాషులు మరోసారి ఎన్టీఆర్‌కు చెప్పారు. అప్పటివరకు వరస విజయాలు అందుకుంటున్న ఆయనకు కమర్షియల్‌ అంశాలు లేని ఈ కథ వర్కవుట్‌ అవ్వదని వారు అభిప్రాయపడ్డారు. కానీ, ఈసారి వారి మాటలు వినకుండా చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళారు ఎన్టీఆర్‌. 1980లో శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు. బ్రహ్మంగారు సంచరించిన అహోబిలం, కందిమల్లయ్యపల్లె, బనగానపల్లె ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మొత్తం 50 వర్కింగ్‌ డేస్‌లో షూటింగ్‌ పూర్తి చేశారు. సన్నిహితులు హెచ్చరించినట్టుగానే చిత్ర నిర్మాణ సమయంలోనే నటుడు ముక్కామల, కొందరు టెక్నీషియన్లు, కొందరు జూనియర్‌ ఆర్టిస్టులు కన్నుమూశారు. అవి సహజ మరణాలే అయినప్పటికీ బ్రహ్మంగారి చరిత్రను సినిమాగా తీస్తున్నారు కాబట్టే అలా జరిగిందని అంతా అనుకున్నారు. అయినా అవేవీ ఎన్టీఆర్‌ పట్టించుకోలేదు. 1981 నాటికి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రంలో సిద్ధయ్యగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. అలాగే కక్కడు పాత్రకు కైకాల సత్యనారాయణ జీవం పోశారు. ఈ సినిమాలో గౌతమ బుద్ధుడు, వేమన, ఆదిశంకరాచార్య, రామనుజాచార్యులుగా కూడా ఎన్టీఆర్‌ కనిపిస్తారు.  సినిమా పూర్తి చేయడం వరకు ఎదురైన ఇబ్బందులు ఒక ఎత్తయితే.. సినిమా రిలీజ్‌కి ముందు వచ్చిన కష్టాలు మరో ఎత్తు. ఈ చిత్రాన్ని సెన్సార్‌కి పంపించగా నలుగురు సభ్యులు కలిగిన ఎగ్జామినింగ్‌ కమిటీ నాలుగు కట్స్‌ను సూచించింది. అయితే దానికి ఎన్టీఆర్‌ ఒప్పుకోకుండా రివైజింగ్‌ కమిటీకి వెళ్లారు. 10 మంది సభ్యులున్న రివైజింగ్‌ కమిటీ మరో నాలుగు కట్స్‌ను చేర్చింది. దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్‌ సెన్సార్‌పై కేసు వేశారు. సెన్సార్‌ సభ్యులు కట్స్‌ విధించిన సీన్స్‌ ఏమిటంటే.. విధవ రాజ్యమేలును అని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఉంటుంది. ఈ సినిమా సెన్సార్‌ అయ్యే నాటికి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ కారణంగానే ఆ కట్‌ను విధించారు. ఏమండోయ్‌ పండితులారా.. ఏమంటారు.. అనే పాటలో బ్రాహ్మణులను కించపరిచారని అభిప్రాయ పడిన కమిటీ ఆ పాటను తొలగించాలని చెప్పింది. తెరపై కదిలే బొమ్మలే అధికారంలోకి వచ్చేను అనే తత్వం చెప్తున్నప్పుడు స్క్రీన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్‌, అమెరికా ప్రెసిడెంట్‌ రోనాల్డ్‌ రీగన్‌లను చూపించడాన్ని కూడా సెన్సార్‌ అభ్యంతరం తెలిపింది. అలాగే వేమనలో మార్పు వచ్చే సన్నివేశంలో అతని వదినను నగ్నంగా చూపిస్తారు. అది కూడా తొలగించాలని సూచించారు. అయితే సినిమాలోని కీలక సన్నివేశాలైన వాటిని తొలగించేందుకు ఎన్టీఆర్‌ అంగీకరించలేదు. అందుకే మూడు సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారు. చివరికి ఎన్టీఆర్‌కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. తనకి దూరమైన సతీమణి బసవతారకంకు అంకితమిస్తూ శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాన్ని 1984 నవంబర్‌ 29న విడుదల చేశారు. అప్పటికి ఎన్టీఆర్‌ రాజకీయరంగ ప్రవేశం చేయడం, కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా జరిగిపోయింది.  ఎన్టీఆర్‌ విశ్వాసానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. సినిమా ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ చేసిన కృషికి మంచి ఫలితాన్ని అందించింది.

ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ సినిమా షూటింగ్‌లో 20 మంది.. సినిమా చూస్తూ 24 మంది చనిపోయారు!

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది రకరకాలుగా ఉంటుంది. కొన్ని నవ్వించడం ద్వారా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. కొన్ని భయపెడుతూ ఎంటర్‌టైన్‌ చేస్తాయి. సినిమాల్లో భయానక సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. 1896లో వచ్చిన ఫ్రెంచ్‌ మూవీ ‘ది హాంటెడ్‌ క్యాజిల్‌’ ప్రపంచంలోనే మొదటి హారర్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇది మూకీ చిత్రం. ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ఈ సినిమాలో ఆరోజుల్లోనే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ని ఉపయోగించడం విశేషం. ఆ తర్వాత హాలీవుడ్‌లో ఎన్నో రకాల హారర్‌ మూవీస్‌ని నిర్మించారు. ఇండియా విషయానికి వస్తే.. 1949లో అశోక్‌కుమార్‌, మధుబాల జంటగా కమల్‌ అమ్రోహి దర్శకత్వంలో వచ్చిన ‘మహల్‌’ తొలి హారర్‌ మూవీ.  హారర్‌ మూవీస్‌కి పరాకాష్టగా చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు హాలీవుడ్‌లో నిర్మించబడ్డాయి. వాటిలో ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని తర్వాత ఈ తరహా సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ఆ క్రమంలోనే ‘ది ఆమెన్‌’, ‘ది ఈవిల్‌ డెడ్‌’, ‘పోల్టర్‌గీస్ట్‌’ వంటి సినిమాలు ప్రేక్షకుల్ని భయపెట్టి సొమ్ము చేసుకున్నాయి. ఒక దశలో హారర్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడిరది. హాలీవుడ్‌ దర్శకులే కాకుండా వివిధ దేశాలకు చెందిన దర్శకులు ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రకరకాల కాన్సెప్ట్‌లతో సినిమాలను రూపొందించేవారు. 1896లోనే తొలి హారర్‌ వచ్చినప్పటికీ 1973 నుంచే ప్రేక్షకులు ఆ తరహా సినిమాలను విపరీతంగా ఆదరించడం మొదలుపెట్టారు. వీటన్నింటిలోనూ ‘ది ఎక్సార్సిస్ట్‌’ అనే హారర్‌ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విలియమ్‌ ఫ్రీడ్‌కిన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రం 1973 డిసెంబర్‌ 26న విడుదలైంది. 12 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి 442 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ‘ది ఎక్సార్సిస్ట్‌’ అనే సినిమాను ప్రపంచంలోనే ఎక్కువ శాపానికి గురైన సినిమాగా భావిస్తారు. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఎంతో మంది చనిపోవడం, మరెంతో మంది అనారోగ్యం బారిన పడడం జరిగింది. ఒకరోజు రాత్రి స్టూడియోలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో సెట్‌ మొత్తం మంటలు అలుముకున్నాయి. ఆ ప్రమాదంలో యూనిట్‌లోని 20 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎలెన్‌ బర్ట్సిన్‌ తీవ్రంగా గాయపడ్డారు. అలా ఎన్నో అవాంతరాలు, ప్రమాదాల మధ్య సినిమా షూటింగ్‌ పూర్తయింది.  నిర్మాణ సమయంలోనే మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకుల శరీరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సినిమాలోని హారర్‌ సీన్స్‌కి, సౌండ్‌ ఎఫెక్ట్స్‌కి కొంతమందికి గుండె పోటు వచ్చింది. మరికొందరు తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. గుండె పోటుతో మరణించిన వారు, అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 24కి చేరింది. హారర్‌ సినిమాల్లో 10 విభాగాలకు నామినేట్‌ అయిన తొలి హారర్‌ సినిమాగా ‘ఎక్సార్సిస్ట్‌’ చిత్రం చరిత్ర సృష్టించింది. వాటిలో స్క్రీన్‌ప్లే, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. అలాగే ఓ అరడజను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. 

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఆ మూడు సినిమాలు రిలీజ్‌ అవ్వడానికి 32 ఏళ్లు పట్టింది!

సినిమా నిర్మాణం అనేది ఖర్చుతోనూ, శ్రమతోనూ కూడుకున్న పని. కొందరు నిర్మాతలు తాము అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం నిర్మాణం పూర్తి చేసి రిలీజ్‌ చేస్తారు. మరికొందరికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతుంటాయి. సినిమా ప్రారంభించిన రోజు నుంచి పూర్తయ్యేవరకు ఆ చిత్ర నిర్మాత రకరకాల ఇబ్బందులకు, మానసిక ఆందోళనలకు గురవుతారు. అలా కొన్ని సినిమాలు పూర్తి కావడానికి ఎంతో సమయం పడుతుంది. సినిమా ప్రారంభించి కొంత షూటింగ్‌ జరిగిన తర్వాత ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని రిలీజ్‌కి నోచుకోని సినిమాలు లెక్కకు మించి ఉంటాయి. కొందరు నిర్మాతలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ సినిమాను రిలీజ్‌ చేసే తీరతారు. అలా సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకొని విడుదలైన మూడు సినిమాలు ఉన్నాయి. ఎన్‌.టి.రామారావు హీరోగా నటించిన ఆ మూడు సినిమాలు అలాంటి సమస్యలు ఎదుర్కొని రిలీజ్‌ అవ్వడానికి 32 ఏళ్ళు పట్టింది.  తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా, ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలిచిన సినిమా ‘లవకుశ’. శ్రీరాముడిగా ఎన్‌.టి.రామారావు, సీతగా అంజలీదేవి నటించిన ఈ సినిమాను పూర్తి చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా తెలుగులో తొలి పౌరాణిక రంగుల చిత్రం. తెలుగులో, తమిళ్‌లో ఒకేసారి నిర్మాణం జరుపుకున్న సినిమా ఇది. షూటింగ్‌ ప్రారంభమైన కొన్నాళ్ళకు నిర్మాత ఎ.శంకర్‌రెడ్డికి ఆర్థిక సమస్యలు రావడంతో చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. కొన్నాళ్లకు ఆర్థికంగా నిలదొక్కుకున్న శంకర్‌రెడ్డి మళ్ళీ సినిమాను ప్రారంభించారు. అయితే సినిమాలో లవకుశులుగా నటించిన పిల్లల శరీరాకృతిలో చాలా మార్పులు వచ్చాయి. అయిప్పటికీ సినిమాటోగ్రాఫర్‌ తన నైపుణ్యంతో ఆ తేడాలను కవర్‌ చేశారు. ఈలోగా చిత్ర దర్శకుడు సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించడంతో ‘లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను ఆయన కుమారుడు సి.ఎస్‌.రావు తీసుకున్నారు. అలా సినిమాను పూర్తి చేసి 1963 మార్చి 29న విడుదల చేశారు. ‘లవకుశ’ ఘనవిజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా నిలిచింది.  ‘లవకుశ’ తర్వాత అత్యధిక సంవత్సరాలు నిర్మాణం జరుపుకున్న మరో చిత్రం ‘ఎవరు దేవుడు’. ఆరోజుల్లో ఎన్టీఆర్‌, జమున జంటను ప్రేక్షకులు ఎంతో ఆదరించేవారు. వీరిద్దరూ కలిసి 31 సినిమాల్లో నటించారు. వీరి మొదటి సినిమా ‘ఇద్దరు పెళ్లాలు’. 1969లో ఎ.వి.ఎం.రాజన్‌, షావుకారు జానకి జంటగా తమిళ్‌లో ‘తునైవన్‌’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇందులో శ్రీదేవి తన ఐదేళ్ళ వయసులో మురుగన్‌ పాత్రలో నటించారు. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు నిర్మాత వాసుదేవ మీనన్‌ హక్కులు కొనుగోలు చేశారు. 1972లో ఎన్టీఆర్‌, జమున జంటగా ఎ.భీమ్‌సింగ్‌ దర్శకత్వంలో ‘ఎవరు దేవుడు’ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. డి.వి.నరసరాజు, సి.నారాయణరెడ్డి, కె.వి.మహదేవన్‌ వంటి టాప్‌ టెక్నీషీయన్స్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. 10 రీళ్ళు పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. 5 సంవత్సరాలపాటు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా నిర్మాత వాసుదేవ మీనన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. 1977లో ఆయన కుమారులు హరిదాస్‌ మీనన్‌, రవి మీనన్‌ కొంత డబ్బు కూడగట్టుకొని చిత్ర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నారు. అప్పుడు వారిద్దరూ ఎన్టీఆర్‌ను కలిశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్‌ డేట్స్‌ ఇచ్చారు. అలాగే జమున కూడా షూటింగ్‌కు సహకరించారు. అలా సినిమాను పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఎన్టీఆర్‌ ఇమేజ్‌లో చాలా మార్పులు వచ్చాయి. అడవిరాముడు, యమగోల, డ్రైవర్‌రాముడు, వేటగాడు వంటి సినిమాలతో మాస్‌ హీరోగా ఎన్టీఆర్‌ ప్రభ వెలిగిపోతోంది. ఆ సమయంలో ఆయన సాఫ్ట్‌ క్యారెక్టర్‌లో నటించిన ‘ఎవరు దేవుడు’ చిత్రాన్ని విడుదల చేసేందుకు పంపిణీదారులు ముందుకు రాలేదు. అలా మరి కొంతకాలం ఆలస్యం జరిగిపోయింది. అయితే ఎన్నో కష్టాలు పడి ఈ చిత్రాన్ని 1981 ఏప్రిల్‌ 4న విడుదల చేశారు. అంటే సినిమా ప్రారంభమైన 9 సంవత్సరాలకు విడుదలైంది. ఒక పక్క మాస్‌ క్యారెక్టర్స్‌తో యాక్షన్‌ సినిమాలు చేస్తూ స్టెప్పులు వేస్తున్న ఎన్టీఆర్‌ సినిమాలను ఎంజాయ్‌ చేస్తున్న ఆడియన్స్‌కి ‘ఎవరు దేవుడు’ చిత్రం నచ్చలేదు. అన్ని సంవత్సరాల శ్రమను వృధా చేస్తూ ఆ సినిమా ఫ్లాప్‌ అయింది.  ‘ఎవరు దేవుడు’ తర్వాత నిర్మాణపరంగా ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న సినిమా ‘ఎర్రకోట వీరుడు’. 1955లో ప్రముఖ దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో ‘గజదొంగ’ పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి వై.ఆర్‌.స్వామి దర్శకత్వం వహించారు. సావిత్రి, బి.సరోజాదేవి హీరోయిన్లు కాగా రాజనాల, ఆర్‌.నాగేశ్వరరావు విలన్లు. అలాగే కొందరు తమిళ నటీనటుల్ని కూడా తీసుకున్నారు. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచీ ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ సగానికిపైగా సినిమాని పూర్తి చేశారు. ఆ సమయంలోనే నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి కన్నుమూశారు. దాంతో సినిమా ఆగిపోయింది. అప్పటికే ఎన్టీఆర్‌ హీరోగా మంచి ఫామ్‌లో ఉండడంతో ఆగిపోయిన సినిమాను పూర్తి చేసేందుకు  కొందరు ముందుకొచ్చారు. కొన్ని రోజులు ఆటంకం లేకుండా షూటింగ్‌ జరిగిన తర్వాత నటుడు ఆర్‌.నాగేశ్వరరావు మరణించారు. దీంతో మరోసారి సినిమా ఆగిపోయింది. ఆయన స్థానంలో తమిళ నటుడు నంబియార్‌ను తీసుకున్నారు. షూటింగ్‌ ప్రారంభించేలోపు దర్శకుడు వై.ఆర్‌.స్వామి సినిమా నుంచి తప్పుకోవడంతో తమిళ దర్శకుడు పార్థసారధి ఆ బాధ్యతను తీసుకున్నారు. దర్శకుడితోపాటు సినిమా టైటిల్‌ని కూడా ‘ధర్మవిజయం’గా మార్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొత్తానికి సినిమాను పూర్తి చేశారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాలనుకుంటున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మరోసారి సినిమా ఆగిపోయింది. అన్నిరకాల కష్టనష్టాలను ఎదర్కొన్న నిర్మాతలు ఆ సినిమా గురించి పట్టించుకోవడం మానేశారు. అలా ఏళ్ళ తరబడి ఆ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోయింది. మంచి తారాగణం ఉన్న సినిమా కావడం వల్ల ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తే మంచి ఫలితం ఉంటుందని కొందరు నిర్మాతలు భావించారు. అయితే ఆ సినిమా చుట్టూ ఎన్నో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో భయపడి వెనక్కి తగ్గారు. 1973లో ‘ధర్మవిజయం’ చిత్రానికి మోక్షం లభించింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని నిర్మాత టి.గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు వారికి డబ్బింగ్‌ రూపంలో ఓ సమస్య ఎదురైంది. 18 సంవత్సరాల క్రితం నిర్మించిన సినిమాకి ఇప్పుడు డబ్బింగ్‌ చెప్పమని ఎన్‌.టి.రామారావును అడిగేందుకు నిర్మాతలు భయపడ్డారు. దాంతో దశరథరామిరెడ్డి అనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. అయితే సినిమా టైటిల్‌ను తెలుగులో ‘ఎర్రకోట వీరుడు’గా, తమిళ్‌లో ‘తిరుడదే తిరుడన్‌’ అని మార్చారు. అప్పటికి ఎన్టీఆర్‌ నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదలై ఘనవిజయం సాధించి శతదినోత్సవం పూర్తి చేసుకుంది. అంతేకాదు, ‘వాడేవీడు’ చిత్రం కూడా విడుదలై సూపర్‌హిట్‌ కావడంతో ఎన్టీఆర్‌ మంచి ఊపులో ఉన్నారు.  ‘ఎర్రకోట వీరుడు’ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి అదే మంచి సమయంగా భావించిన నిర్మాతలు.. 1973 డిసెంబర్‌ 22న విడుదల చేశారు. అంతకుముందు ఎన్టీఆర్‌ నటించిన రెండు సూపర్‌హిట్‌ సినిమాలు రిలీజ్‌ అయి ఉండడం వల్ల ‘ఎర్రకోట వీరుడు’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతుంది. అప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఆయన్ని చప్పట్లతో, విజిల్స్‌తో ఆహ్వానించారు. ఆ మరుక్షణమే అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఎందుకంటే ఆ పాత్రకు ఎన్టీఆర్‌ కాకుండా మరొకరు డబ్బింగ్‌ చెప్పడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భారీ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు వేరెవరో డబ్బింగ్‌ చెప్పారన్న వార్త మౌత్‌టాక్‌తో స్ప్రెడ్‌ అయిపోయింది. అంతటి భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాకి నిజంగా ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పి ఉంటే దేవుడు చేసిన మనుషులు, వాడే వీడు వరసలో ‘ఎర్రకోట వీరుడు’ మరో సూపర్‌హిట్‌ సినిమాగా నిలిచి ఉండేది. అలా ఎన్టీఆర్‌ నటించిన ఈ మూడు సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి 32 సంవత్సరాలు పట్టింది.

ఇది నిజం.. ఇండియాలో మొదటి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ కాదు!

సూపర్‌స్టార్‌ కృష్ణ సాహసానికి మారు పేరు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీరోగా తన కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి తెలుగు సినిమాను ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారు. మొదటి సాంఘిక కలర్‌ చిత్రం, మొదటి సినిమా స్కోప్‌ చిత్రం, మొదటి 70 ఎంఎం సినిమా, మొదటి జేమ్స్‌బాండ్‌ మూవీ.. ఇలా చెప్పుకుంటే చాలా కొత్త తరహా సినిమాలు కృష్ణతోనే మొదలయ్యాయి. ఆ వరసలోనే ఇండియాలో మొదటి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ అని చెబుతారు. 1971లో రిలీజ్‌ అయిన ఈ సినిమా గురించి గత 50 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటివరకు అదే మొదటి కౌబాయ్‌ సినిమా అనేది జనంలో నానుతూ వచ్చింది. నిజానికి ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఫస్ట్‌ కౌబాయ్‌ మూవీ కాదు అనేది వాస్తవం. ఈ సినిమా కంటే ముందే శోభన్‌బాబు హీరోగా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ అనే సినిమా రిలీజ్‌ అయింది. ఇది కూడా కౌబాయ్‌ సినిమాయే. ‘మోసగాళ్ళకు మోసగాడు’ 1971 ఆగస్ట్‌ 27న రిలీజ్‌ అయితే.. అదే సంవత్సరం మే 20న ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ రిలీజ్‌ అయింది. అంటే మూడు నెలల ముందే కౌబాయ్‌ సినిమా తెలుగులో వచ్చేసింది.  సూపర్‌స్టార్‌ కృష్ణ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ‘అగ్ని పరీక్ష’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. అప్పటికే ‘గూఢచారి 116’, ‘నేనేంటే నేనే’ వంటి క్రైమ్‌ సినిమాలు చేసి ఉన్నారు కృష్ణ. ఆ సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణ తన సొంత బేనర్‌లో ఆ తరహా సినిమా చెయ్యాలనుకున్నారు. అప్పటికే ‘ది గుడ్‌ ది బ్యాడ్‌ అండ్‌ ది అగ్లీ’, ‘మెకన్నాస్‌ గోల్డ్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌ అయి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయ్యాయి. అలాంటి కౌబాయ్‌ సినిమా చేస్తే వెరైటీగా ఉంటుందని భావించిన కృష్ణ.. రచయిత ఆరుద్రను ఆ సినిమాలు చూసి తెలుగు నేటివిటీకి తగిన కథను రెడీ చెయ్యమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఒక మంచి కథను సిద్ధం చేశారు ఆరుద్ర. అప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల కంటే బిగ్‌ రేంజ్‌లో ఈ కౌబాయ్‌ సినిమా చెయ్యాలనుకున్నారు. అప్పటి వరకు బాలీవుడ్‌లో కూడా ఎవరూ కౌబాయ్‌ సినిమాను నిర్మించే సాహసం చెయ్యలేదు. 1970లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా కోసం కృష్ణ ఎంతో కష్టపడ్డారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి వి.ఎస్‌.ఆర్‌.స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. రూ.7 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 1971 ఆగస్ట్‌ 27న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తొలుత ఎన్‌.టి.రామారావుకు చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు కృష్ణ. సినిమా చూసిన ఎన్టీఆర్‌ ‘ఈ సినిమాకి మహిళా ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు. మొదటి రన్‌లో కంటే రిపీట్‌ రన్‌లో బాగా కలెక్ట్‌ చేస్తుంది. తప్పకుండా మంచి సినిమా అవుతుంది’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే యూత్‌ ఆడియన్స్‌ తప్ప ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్స్‌కి రాలేదు. అయినా సినిమా ఘనవిజయం సాధించి రిపీట్‌ రన్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఒక మైల్‌స్టోన్‌ అయింది.  ఇదిలా ఉంటే.. ‘మోసగాళ్ళకు మోసగాడు’ ప్రారంభం కావడానికి ముందే ‘దేవదాసు’ నిర్మాత డి.ఎల్‌.నారాయణ ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ పేరుతో ఓ కౌబాయ్‌ చిత్రాన్ని ప్రారంభించారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు పురాణం సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. 1967లో ఇంగ్లీష్‌, ఇటాలియన్‌ భాషల్లో రూపొందిన ‘డెత్‌ రైడ్స్‌ ఎ హార్స్‌’ చిత్రం ఆధారంగా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో నిర్మించారు. అప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలకు భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాను కూడా యూత్‌ మాత్రమే ఆదరించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాను చూడలేదు. అయినా నిర్మాత డి.ఎల్‌.నారాయణకు పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన 100 రోజుల తర్వాత ‘మోసగాళ్ళకు మోసగాడు’ విడుదలైంది. మొదట రిలీజ్‌ అయిన ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా కావడం, నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. బికనీర్‌, సిమ్లా, పాండిచ్చేరి వంటి ప్రదేశాల్లో, థార్‌ ఎడారిలో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ లొకేషన్స్‌ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ నిచ్చాయి. ఏ విధంగా చూసినా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ కంటే ‘మోసగాళ్ళకు మోసగాడు’ బిగ్‌ రేంజ్‌ సినిమా. అంతేకాకుండా ఘన విజయం సాధించిన సినిమా కావడంతో అప్పటి నుంచి ఇండియాలో మొదటి కౌబాయ్‌ సినిమా అనగానే ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్నే ప్రస్తావిస్తారు. రిలీజ్‌ పరంగా చూస్తే ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ మొదటి కౌబాయ్‌ సినిమాగా చెప్పుకోవాలి.

తండ్రి చెప్పినట్టే సౌందర్య కెరీర్‌ సాగింది.. ఆమె జీవితం కూడా అలాగే ముగిసింది!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాతి తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య. 1990వ దశకంలో టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌పైనే తమ కెరీర్‌ ఆధారపడి ఉందని నమ్మేవారు. ఆ విధంగానే సినిమాలు చేస్తుండేవారు. కానీ, దానికి భిన్నంగా తాను ఎక్స్‌పోజింగ్‌ చేయబోనని తన దర్శకనిర్మాతలకు చెప్పి ఆ మాట మీదే నిలబడ్డారు సౌందర్య. మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య. 1992లో ప్రారంభమైన సౌందర్య కెరీర్‌ 2004తో ముగిసింది. 31 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబళించింది. ఎంతో వైవిధ్యంగా సాగి, విషాదంగా ముగిసిన సౌందర్య సినీ, జీవిత విశేషాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగళ్‌లో కె.ఎస్‌.సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు, తమిళ్‌ అనర్గళంగా మాట్లాడగలరు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్‌కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారు. అప్పుడు ఎంబిబిఎస్‌ చదువుతున్న సౌందర్య అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత వరస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో హరీష్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా 1993లో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఆమె నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 8 తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య.  సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు చిత్రం 1992లోనే ప్రారంభమైంది. అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాక సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చింది. దాంతో సంవత్సరానికి 10కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయారు సౌందర్య. తన 12 సంవత్సరాల సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య. ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్‌ అయిన చివరి సినిమా శ్వేతనాగు. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. తమిళ్‌, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్‌ అయింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌,  జగపతిబాబు, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ వంటి స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ చేశారు. అలాగే తమిళ్‌లో రజినీకాంత్‌తో పడయప్పా, అరుణాచలం వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించారు. అలాగే హరీష్‌, వినీత్‌ వంటి యంగ్‌ హీరోలతో కూడా సౌందర్య మంచి సినిమాలు చేశారు. తన కెరీర్‌లో 100కిపైగా సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలోనూ అశ్లీలమైన పాత్రలు పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్లామర్‌ పాత్రలు చేయకపోయినా ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. ఒకప్పుడు సావిత్రి తరహాలో ఆమెను అందరూ ఆదరించేవారు. తెలుగులో సౌందర్యకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, అమ్మోరు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాముడొచ్చాడు, పెదరాయుడు, ప్రియరాగాలు, తారకరాముడు, అంత:పురం, చూడాలని వుంది. 1995లో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ మరణించడంతో సౌందర్య మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. ఎన్నో కథలు విని చివరికి గిరీష్‌ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే చిత్రాన్ని కన్నడలో నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి. వాటితోపాటు కర్ణాటక స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు కూడా ద్వీప చిత్రం గెలుచుకుంది.  సౌందర్య వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును 2003 ఏప్రిల్‌ 27న వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. చిన్నతనం నుంచి ప్రజాసేవ చెయ్యాలని, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది. అంతేకాదు, ఆమెకు హిందూత్వ భావాలు ఎక్కువ. అందుకే తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కళ్లాపి చల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు. దాన్ని బట్టి హిందూ సాంప్రదాయంపై ఆమెకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అమర సౌందర్య సోషల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలోని ముళబాగల్‌ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి చేసారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమరనాథ్‌, అతని భార్య ఎంతో సహకరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు. సౌందర్య కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరి అని భావించిన సౌందర్య.. 2004 జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అందులో భాగంగానే కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగరరావు తరఫున ప్రచారం చేసేందుకు 2004 ఏప్రిల్‌ 17 ఉదయం 11 గంటలకు బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి చార్టెర్డ్‌ విమానంలో బయల్దేరారు సౌందర్య. ఆమెతోపాటు సోదరుడు అమరనాథ్‌ కూడా ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్‌ అత్యవసర ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో ఉన్నవారంతా సజీవ దహనమైపోయారు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో సౌందర్య ఐదు నెలల గర్భవతి. ఒక అద్భుతమైన నటి జీవితం 31 సంవత్సరాల అతి చిన్న వయసులో విషాదాంతం కావడం అందర్నీ కలచివేసింది. సౌందర్య నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారట. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళపాటు అగ్రనటిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు, ఆమె కెరీర్‌ 2004లో ఎండ్‌ అవుతుందని కూడా ఆయన చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన చెప్పినట్టుగానే సౌందర్య కెరీర్‌ ముగిసింది. అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరం. 

నందమూరి తారకరత్న జీవితం చిన్న వయసులోనే ఎందుకు ముగిసింది?

(ఫిబ్రవరి 22 నందమూరి తారకరత్న జయంతి సందర్భంగా..) తారకరత్న.. నందమూరి కుటుంబంలో ఒక విశిష్టమైన వ్యక్తి. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్లోనూ మంచి స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన తారకరత్న అంటే నందమూరి అభిమానులు ఎంతో ఇష్టపడతారు. సినిమా ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనత ఆయన సొంతం. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ క్రాస్‌ చెయ్యలేకపోయారు. ఇకపై కూడా ఆ రికార్డు అలాగే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకేరోజు తారకరత్న హీరోగా నటిస్తున్న 9 సినిమాలు ప్రారంభమయ్యాయి. నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న సినీ, వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయాల్లో ఎలా రాణించారు అనే విషయాల గురించి ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1983 ఫిబ్రవరి 22న నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు చెన్నైలో జన్మించారు తారకరత్న. అతని అసలు పేరు ఓబులేశు. ఆయన ప్రాథమిక విద్య చెన్నయ్‌లో జరిగింది. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. దానికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. అప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ నెం.1, ఆది చిత్రాలతో స్టార్‌ హీరో అనిపించుకున్నారు. తన కుమారుడ్ని కూడా హీరోగా చూడాలనుకున్న మోహనకృష్ణ ఎన్‌.టి.ఆర్‌. అని వచ్చేలా నందమూరి తారకరత్నగా అతని పేరు మార్చారు. హీరోగా అతని కెరీర్‌ ఒకేసారి 9 సినిమాలతో ప్రారంభం కావడం అనేది ఏ హీరోకీ జరగలేదు. అది ఒక రికార్డుగా నిలిచింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒకటో నంబర్‌ కుర్రాడు తొలి సినిమాగా విడుదలైంది. ఈ సినిమా ఆడియోపరంగా ఘనవిజయం సాధించినా సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత యువరత్న, తారక్‌, భద్రాద్రి రాముడు వంటి సినిమాలు చేశారు. అవి కూడా అతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఆ సమయంలోనే అమరావతి చిత్రంతో విలన్‌గా కొత్త అవతారం ఎత్తారు తారకరత్న. ఈ సినిమాలోని అతని నటనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత నందీశ్వరుడు, మహాభక్త శిరియాళ, కాకతీయుడు, ఎవరు సినిమాలు చేశారు. హీరోగా అంతగా సక్సెస్‌ కాకపోవడంతో క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారి మనమంతా, రాజా చెయ్యివేస్తే, 9 అవర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు. 2012లో అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదివరకే పెళ్ళయిన యువతిని వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తారకరత్నను వ్యతిరేకించారు. అయినా ఆ తర్వాత అన్నీ సర్దుకోవడంతో మళ్ళీ కుటుంబ సభ్యులతోనే కొనసాగారు. తారకరత్న, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి తనవంతు కృషి చెయ్యాలనుకున్న తారకరత్న ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. తాత నందమూరి తారక రామారావు అడుగు జాడల్లో నడుస్తూ ఆయన క్రమశిక్షణను వారసత్వంగా తీసుకున్న తారకరత్న.. నందమూరి అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. బావ నారా లోకేష్‌ చేపట్టిన యువగళం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల్ని కలుసుకున్నారు. సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన తారకరత్న రాజకీయ రంగంలో రాణించాలనుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు కదిలారు. అయితే విధి ఆయన్ని బలి తీసుకుంది. నారా లోకేష్‌తో కలిసి నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా పాదయాత్ర చేయడం వల్ల ఆయన నీరసించిపోయారు. 2023 జనవరి 27న యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో తారకరత్న జనంతో కలిసి నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లో కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. హాస్పిటల్‌లో చేరిన రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే కొనసాగింది. 22 రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందినప్పటికీ తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఎంతో సౌమ్యుడిగా, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న తారకరత్న 39 ఏళ్ళ అతి చిన్న వయసులో మృత్యువు ఒడిలోకి చేరుకోవడం అందర్నీ బాధించింది.