ఇండియాలో ఆ ఘనత సాధించిన ఏకైక హీరోయిన్‌ విజయశాంతి!

  చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ అంటే గ్లామర్‌ పాత్రలు లేదా సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే పాత్రలు మాత్రమే చేయగలరు అనే పేరు వచ్చేస్తుంది. కానీ, ఆ చట్రంలో ఉండకుండా ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగలను అని నిరూపించిన హీరోయిన్‌ విజయశాంతి. గ్లామర్‌ పాత్రలు, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్లు,  ఫెరోషియస్‌గా ఉండే క్యారెక్టర్లు, కామెడీ ప్రధానంగా సాగే పాత్రలు, సెంటిమెంట్‌ను పండిరచే క్యారెక్టర్లు.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు విజయశాంతి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా లేడీ సూపర్‌స్టార్‌, లేడీ అమితాబ్‌ అనే బిరుదులు సంపాదించుకున్న ఏకైక హీరోయిన్‌. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ టాలీవుడ్‌ టాప్‌ హీరోల సరసన నిలిచారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణిస్తున్న విజయశాంతి జీవితం గురించి, ఆమె సినీ, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.   1966 జూన్‌ 24న తెలంగాణలోని వరంగల్‌లో సత్తి శ్రీనివాస్‌ ప్రసాద్‌, వరలక్ష్మి దంపతులకు జన్మించారు విజయశాంతి. విశేషం ఏమిటంటే.. విజయశాంతి భర్త పేరు కూడా శ్రీనివాస్‌ ప్రసాదే. 1988లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పుట్టింది వరంగల్‌లోనే అయినప్పటి ఆ తర్వాత వారి కుటుంబం మద్రాస్‌ షిఫ్ట్‌ అయిపోయింది. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని విజయలలిత. ఆమె నుంచి విజయను తీసుకొని విజయశాంతిగా తన స్క్రీన్‌ నేమ్‌ పెట్టారు. 7 ఏళ్ళ వయసులోనే బాలనటిగా ఒక తమిళ సినిమాలో నటించారు విజయశాంతి. భారతీ రాజా తన దర్శకత్వంలో 1979లో రూపొందిన కల్లుక్కుళ్‌ ఈరమ్‌ చిత్రం ద్వారా హీరోయిన్‌ పరిచయం చేశారు. విజయశాంతి మొదటి హీరో సుధాకర్‌. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన కిలాడి కృష్ణుడు చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన హీరోయిన్‌గా నటించడం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్ళలో తెలుగు, తమిళ భాషల్లో 20 సినిమాల్లో నటించారు విజయశాంతి. అయితే ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే చేయడం వల్ల నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఆమెకు రాలేదు.    1983లో టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేటిభారతం చిత్రంలో విజయశాంతికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఇది అభ్యుదయ భావాలు కలిగిన సినిమా కావడంతో గ్లామర్‌ పాత్రలు చేసే విజయశాంతిని హీరోయిన్‌గా తీసుకోవడంపై పలువురు విమర్శించారు. కానీ, టి.కృష్ణ మాత్రం తన సినిమాలోని క్యారెక్టర్‌కి ఆమె పూర్తి న్యాయం చెయ్యగలదని నమ్మారు. మొదటిరోజు జరిగిన షూటింగ్‌లో విజయశాంతి పెర్‌ఫార్మెన్స్‌ చూసి తన నమ్మకం వమ్ము కాలేదు అనుకున్నారు కృష్ణ. ఆ సినిమా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా విజయశాంతికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన 5 సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు టి.కృష్ణ. ఆ సినిమాలతో విజయశాంతికి స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. ముఖ్యంగా ప్రతిఘటన చిత్రంలోని నటనతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఓ పక్క టి.కృష్ణ సినిమాలు చేస్తూనే అప్పటి టాప్‌ హీరోలైన కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో గ్లామర్‌ రోల్స్‌ కూడా చేస్తూ యూత్‌ని కూడా బాగా ఆకట్టుకున్నారు విజయశాంతి.      ఆ సమయంలోనే ప్రతిఘటన చిత్రంతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చెయ్యడం మొదలుపెట్టారు విజయశాంతి. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ తరహా సినిమాలతో తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత ఆమెను స్టార్‌ హీరోయిన్‌ని చేసిన సినిమా కర్తవ్యం. టాప్‌ హీరోల సినిమాలు కలెక్ట్‌ చేసిన రేంజ్‌లో ఈ సినిమా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు, నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి. ఒక హీరోయిన్‌కి ఒకే సినిమాకి సంబంధించి మూడు అత్యున్నత అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఆ ఘనతను సాధించారు విజయశాంతి. ఆ తర్వాత చాలా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేశారు. ఆమె కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌లాంటి సినిమా ఒసేయ్‌ రాములమ్మా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని అద్భుతమైన నటనకు ఉత్తమనటిగా నంది అవార్డుతోపాటు ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు విజయశాంతి. ఇలా మహిళా ప్రధాన పాత్రలో ఆమె ఓ డజను సినిమాలు చేశారు. టాలీవుడ్‌లోని హీరోయిన్లలో విజయశాంతికే ఆ ఘనత దక్కింది.    సాధారణంగా హీరోలైనా, హీరోయిన్లు అయినా ఒక తరహా పాత్రలో నటించి బాగా పేరు తెచ్చుకుంటే ఆ తరహా పాత్రలకే వారిని పరిమితం చేస్తారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వారి మనసుకు నచ్చిన క్యారెక్టర్‌ చేసే అవకాశం కెరీర్‌ మొత్తంలో కూడా రాదు. అయితే విజయశాంతి విషయంలో అది పూర్తి విరుద్ధంగా జరిగింది. అమాయకమైన పాత్రలు, హీరోల పక్కన డాన్సులు చేసే క్యారెక్టర్లు, కుటుంబ కథా చిత్రాల్లో సెంటిమెంట్‌ను పండిరచే పాత్రలు, విలన్లను చితక్కొట్టే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, విప్లవ భావాలు కలిగిన యువతిగా, కామెడీ పాత్రలు.. ఇలా ఒక తరహా పాత్రలకే పరిమితం అయిపోకుండా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించిన ఏకైక హీరోయిన్‌ విజయశాంతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.    1980లో మొదలైన ఆమె కెరీర్‌ 2006లో విడుదలైన నాయుడమ్మ సినిమా వరకు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 200 సినిమాల్లో నటించారు విజయశాంతి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మహేష్‌ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇటీవల విడుదలైన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009లో టీఆర్‌ఎస్‌ తరపున మెదక్‌ ఎంపీగా గెలిచారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. (జూన్‌ 24 విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా..)  

సినిమాలంటే ఇంట్రెస్ట్‌ లేని మురళీమోహన్‌.. 350 సినిమాలు ఎలా చేశారో తెలుసా?

  పాతతరం హీరోలైనా, ఇప్పుడు టాప్‌ హీరోలుగా కొనసాగుతున్న వారైనా సినిమాపై ఉన్న ఆసక్తితోనే పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ, సినిమా మీద ఏమాత్రం ఆసక్తి లేకపోయినా హీరో అయిపోయి ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో నటించిన ఘనత మురళీమోహన్‌కి దక్కుతుంది. అది కూడా పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉన్న సమయంలో 33 సంవత్సరాల వయసులో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఈ తరహా చరిత్ర ఏ హీరోకీ ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 50 సంవత్సరాల సినీ కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు మురళీమోహన్‌. హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రవేశించి అందులోనూ విజయం సాధించి మంచి బిజినెస్‌ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమా రంగంలో, వ్యాపార రంగంలో విజయం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మురళీమోహన్‌ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన జీవిత విశేషాలు ఏమిటి అనే విషయాలు ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.   1940 జూన్‌ 24న పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు మాగంటి మురళీమోహన్‌. ఆయన అసలు పేరు రాజబాబు. ఈయన తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో ఇంటర్‌ వరకు చదువుకున్నారు మురళీమోహన్‌. హీరో కృష్ణ, దర్శకులు క్రాంతికుమార్‌, విజయేంద్రప్రసాద్‌ ఆయనకు క్లాస్‌మేట్స్‌. చిన్నతనం నుంచి చదువు కంటే వ్యాపారంపైనే ఆయనకు ఎక్కువ మక్కువ. ఆయన పినతండ్రికి ఏలూరులో కిసాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఉండేది. విజయవాడలో కూడా ఒక బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో మురళీమోహన్‌కి అందులో ఉద్యోగం ఇచ్చి లాభాల్లో 15 పైసల వాటా కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తన వాటాను అమ్మెయ్యాలని ఆయన పినతండ్రి అనుకున్నారు. ఆయన వాటాను కూడా మురళీమోహన్‌ కొనుక్కొని 50 పైసల వాటాదారుడు అయ్యారు. వ్యాపారం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో ఎంతో కష్టపడి బిజినెస్‌ను బాగా డెవలప్‌ చేశారు. విజయవాడ చుట్టు పక్కల గ్రామాలకు, వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ మోటార్లు సప్లై చేసేవారు. వ్యాపారం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే విజయలక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం మధుబిందు, రామ్మోహన్‌.      వ్యాపారం చేస్తూనే విజయవాడలో అప్పుడప్పుడు కాలక్షేపానికి నాటకాల్లో కూడా నటించేవారు మురళీమోహన్‌. ఆ సమయంలోనే క్రాంతికుమార్‌ వంటి మిత్రులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని, మంచి బిజినెస్‌ మేన్‌ అనిపించుకుంటానని వారికి చెప్పారు. కానీ, మిత్రులు వినకుండా అతనికి మేకప్‌ చేయించి ఫోటోలు తీశారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఆ సమయంలో జగమేమాయ అనే సినిమా నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆయన.. మురళీమోహన్‌ని తన ఆఫీస్‌కి పిలిపించారు. తమ సినిమాలో హీరోగా నటిస్తావా అని అడిగారు. తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్‌ లేదని, మిత్రుల బలవంతం మీద ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మురళీమోహన్‌ భార్య.. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మురళీమోహన్‌ భార్య కూడా చెప్పడంతో 1973లో ‘జగమేమాయ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మురళీమోహన్‌.    మొదటి సినిమా జగమేమాయ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తనకు సినిమాలు సరిపడవని, బిజినెస్‌లోనే కొనసాగాలని అనుకున్నారు మురళీమోహన్‌. ఆ సమయంలో దాసరి నారాయణరావు రూపొందిస్తున్న తిరుపతి చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా మురళీమోహన్‌కి మంచి పేరు తెచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వరసగా అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి ఐదు సినిమాలకు తగ్గకుండా చేశారు. జ్యోతి, తూర్పు పడమర, ప్రేమలేఖలు, కళ్యాణి, కల్పన వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా సెకండ్‌ హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు.. 1979లో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థను ప్రారంభిస్తూ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న కళ్యాణి చిత్రంలో మురళీమోహన్‌ని హీరోగా ఎంపిక చేసుకున్నారు. అది తన జీవితంలో గొప్ప విషయమని మురళీమోహన్‌ అంటారు. ఆ తర్వాత 1980లో మురళీమోహన్‌ సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్‌ మూవీస్‌ను ప్రారంభించి 25 సినిమాలు నిర్మించారు. ఈ బేనర్‌లో 2005లో వచ్చిన చివరి సినిమా అతడు.    50 సంవత్సరాల సినీ కెరీర్‌లో మురళీమోహన్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 350 సినిమాల్లో నటించారు. వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్న ఉద్దేశంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఆశించిన పాత్రలే లభిస్తున్నాయి. నటుడు, నిర్మాతగానే కాకుండా సినిమా రంగానికి సంబంధించి కొన్ని పదవుల్లో కూడా ఆయన పనిచేశారు. నేషనల్‌ ఫిలిం డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు గౌరవాధ్యక్షునిగా వ్యవహరించారు. హీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా మేరకు తను సినిమాల్లో సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టి జయభేరి గ్రూప్‌ సంస్థను స్థాపించి అక్కడ కూడా మంచి విజయాలు సాధించారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రత్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో అదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు మురళీమోహన్‌. ఆ తర్వాత మురళీమోహన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసన్‌ పూర్తి చేసేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్‌ ద్వారా 10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసన్‌ పూర్తి చేశారు. (జూన్‌ 24 మురళీమోహన్‌ పుట్టినరోజు సందర్భంగా..)  

తెలుగు సినిమా హాస్యానికి కొత్త అర్థం చెప్పిన ఒకే ఒక్కడు.. ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల!

(జూన్ 19 హాస్యబ్రహ్మ జంధ్యాల వర్థంతి సందర్భంగా..) నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. ఇదీ హాస్యం గురించి దర్శకుడు జంధ్యాల చెప్పిన సూక్తి. అది అక్షరాలా నిజం. తెలుగు వారు హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. హాస్యం ఏ రూపంలో ఉన్నా ఆస్వాదిస్తారు. సాధారణ జనజీవనంలోనూ హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు హాస్యం అనేది సినిమాలో ఒక భాగంగా మాత్రమే ఉండేది. ప్రధాన కథాంశంతోపాటు కామెడీ అనేది ఒక ట్రాక్‌గా నడిచేది. ఆ సమయంలో కూడా కొన్ని పూర్తి హాస్య ప్రధాన చిత్రాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలను పూర్తి స్థాయిలో రూపొందించిన ఘనత మాత్రం జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులకు మాత్రమే దక్కుతుంది. 1981లో ఒక నెల తేడాలో ఈ ఇద్దరు దర్శకులుగా పరిచయమయ్యారు. అయితే అంతకుముందు రచయితగా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన జంధ్యాల.. ఆ అనుభవంతోనే దర్శకుడిగా మారారు. హాస్య చిత్రాలకు విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చిన జంధ్యాలను హాస్యబ్రహ్మగా పిలుచుకుంటారు ప్రేక్షకులు. మరి ఈ హాస్యబ్రహ్మ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, దర్శకుడుగా మారేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. రచయితగా, దర్శకుడుగా ఆయన సాధించిన విజయాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. విజయవాడలో బి.కాం. వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అలా ఎన్నో నాటకాలు రచించారు. ఏక్‌ దిన్‌కా సుల్తాన్‌, గుండెలు మార్చబడును ఆయన రచనల్లో ప్రముఖమైనవి. ఆయన నాటకాలు రేడియో కూడా ప్రసారమయ్యేవి. నాటకాలు రచించడమే కాకుండా దర్శకత్వం వహించడంతోపాటు నటించేవారు కూడా. అలా తన రచనల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. 1976లో వచ్చిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయమయ్యారు జంధ్యాల. ఆ తర్వాత కొన్ని సినిమాలకు కథ, మాటలు కూడా అందించారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు మాటలు రాసి ఆ డైలాగులు జనం చెప్పుకునేలా చేశారు జంధ్యాల. తన కెరీర్‌ ప్రారంభంలోనే సిరిసిరిమువ్వ, అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్‌ రాముడు వంటి కమర్షియల్‌ సూపర్‌హిట్‌ చిత్రాలకు మాటలు రాసి స్టార్‌ రైటర్‌ అయిపోయారు. అలాగే శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం వంటి క్లాసిక్స్‌కి కూడా మాటలు రాసి ఏ తరహా సినిమాకైనా అద్భుతమైన సంభాషణలు అందించగలనని నిరూపించుకున్నారు. అలా 5 సంవత్సరాలపాటు నెలకు 30 సినిమాలకు తగ్గకుండా పనిచేశారు జంధ్యాల. కథా రచయితగా, మాటల రచయితగానే కాకుండా నాటకాలకు దర్శకత్వం వహించిన అనుభవం జంధ్యాలకు ఉంది. దాంతో తనదైన శైలిలో సినిమాలను రూపొందించాలన్న ఉద్దేశంతో దర్శకుడుగా మారారు. ప్రదీప్‌, పూర్ణిమలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తొలి ప్రయత్నంగా ‘ముద్దమందారం’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా డైరెక్టర్‌గా జంధ్యాలకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నరేష్‌, ప్రదీప్‌, తులసి, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ సంచలన విజయం సాధించి జంధ్యాలను స్టార్‌ డైరెక్టర్‌ను చేసింది. ఈ సినిమా ద్వారా సుత్తిజంటగా వీరభద్రరావు, వేలులను స్టార్‌ కమెడియన్స్‌ను చేశారు జంధ్యాల.  40 సినిమాలకు దర్శకత్వం వహించిన జంధ్యాల తన ప్రతి సినిమాలోనూ పూర్తి స్థాయి హాస్యం ఉండేలా చూసుకున్నారు. బలమైన కథాంశంతో సినిమాను నడిపిస్తూనే ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. దీంతో సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోని హాస్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించారు. నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడిబొమ్మ, బాబాయ్‌ అబ్బాయ్‌, రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయ్‌, అహనా పెళ్ళంట, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటివి జంధ్యాల నవ్వులు పూయించిన సినిమాల్లో కొన్ని మాత్రమే.  పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేస్తూనే ఆనందభైరవి, పడమటి సంధ్యారాగం, అమరజీవి, బాబాయ్‌ హోటల్‌, సత్యాగ్రహం వంటి ఉదాత్తమైన సినిమాలను కూడా రూపొందించారు జంధ్యాల. తన కెరీర్‌లో ఉత్తమ మాటల రచయితగా, ఉత్తమ దర్శకుడుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అశ్లీల దృశ్యాలు, సంభాషణలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లాదకరమైన సినిమాలను రూపొందించిన దర్శకుడు జంధ్యాల ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాల ద్వారా సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి స్టార్‌ కమెడియన్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా జంధ్యాలకే దక్కుతుంది. హాస్య చిత్రాలకు ఆయన వేసిన బాటలోనే ఎంతో మంది దర్శకులు తమ కెరీర్‌ను సాగిస్తున్నారు. అయితే జంధ్యాల సినిమాల్లో ఉన్నంత ఆరోగ్యకరమైన కామెడీ లేకపోయినా తమదైన శైలిలో హాస్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తన హాస్య చిత్రాల ద్వారా అందర్నీ నవ్విస్తూ వారి ఆయుష్షును మరికొంత పెంచిన జంధ్యాల.. చాలా చిన్న వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరారు. రచయితగా, దర్శకుడుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జంధ్యాల.. 2001 జూన్‌ 19న 50 ఏళ్ల వయసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన రూపొందించిన సినిమాల్లోని హాస్యాన్ని తెలుగు ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఆ ‘హాస్యబ్రహ్మ’కు నివాళులు అర్పిస్తూనే ఉంటారు.

తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన మహాకవి శ్రీశ్రీ!

(జూన్‌ 15 మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా..) అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం.. ఈ వాక్యం వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీశ్రీ. తన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన మహాకవి. హేతువాది, నాస్తికుడు, విప్లవకవి.. ఇలా అనేక భిన్నమైన కోణాలు కలిగిన తెలుగు రచయిత. గన్ను కంటే పెన్ను బలమైనదని నిరూపించిన వ్యక్తి. విప్లవ సాహిత్యంలోనే కాదు, సినిమా సాహిత్యంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్న మేధావి. సినిమా పాటల్లోనూ తన అభ్యుదయ భావాలను పలికించారు. అంతేకాదు, ప్రేమ గీతాల్లోనూ తనదైన బాణీలో రచనలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు అందుకున్నారు శ్రీశ్రీ. అంతటి మహాకవి జీవితంలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం అనేది ఆయన ఇంటిపేరు అని అందరూ అనుకున్నారు. కానీ, అది ఇంటిపేరు కాదు అనే విషయం కొందరికే తెలుసు. 1930 ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమనయ్య, ఆటప్పకొండ దంపతులకు జన్మించారు పూడిపెద్ది శ్రీనివాసరావు. ఆయన్ని శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడం వల్ల శ్రీరంగం ఇంటిపేరుగా మారింది. శ్రీశ్రీ పాఠశాల విద్యాభ్యాసం అంతా విశాఖలో సాగింది. తర్వాత మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో బీఏ హానర్స్‌ చేశారు. ఆంధ్రప్రభ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. ఢల్లీి ఆకాశవాణి, ఆంధ్రవాణి పత్రికల్లోనూ శ్రీశ్రీ పని చేశారు. తెలుగు రచనలో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సామాన్యుల గొంతుకగా మారిన కవి శ్రీశ్రీ. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ‘మహాప్రస్థానం’. అందులో కవితలు ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో ప్రముఖుల నోటి వెంట వినపడతాయి. ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే...’, ‘మరో ప్రపంచం’, ‘నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితరసాధ్యం నా మార్గం’ తదితర కవితలు ఆయన రాసినవే. 1950లో విడుదలైన ‘ఆహుతి’ అనే డబ్బింగ్‌ సినిమాకు మాటలు, పాటలు రాయడం ద్వారా సినీ కెరీర్‌ను ప్రారంభించారు శ్రీశ్రీ. తెలుగులో తొలి డబ్బింగ్‌ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా రచయితగా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. దీంతో దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతంతో తన ఆస్థాన రచయితగా నియమించుకున్నారు. అక్కడి నుంచి శ్రీశ్రీ రచయితగా బాగా బిజీ అయిపోయారు. ఎన్నో డబ్బింగ్‌ సినిమాలకు మాటలు, పాటలు రాశారు. బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాకు ఒకేరోజు 12 పాటలు రాసి రికార్డు సృష్టించారు.  1974లో సూపర్‌స్టార్‌ కృష్ణ స్వీయ నిర్మాణంలో నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా..’ అంటూ శ్రీశ్రీ రాసిన విప్లవ గేయానికి జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు లభించింది. తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అదే. ఆ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘నేటి భారతం’ చిత్రంలోని ‘అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం..’ పాటకు నంది అవార్డు అందుకున్నారు శ్రీశ్రీ. ఇవికాక తన ఇతర రచనలకు గాను సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు అనేక ఇతర పురస్కారాలు ఆయన్ని వరించాయి.  శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు. మొదటి సతీమణి పేరు వెంకట రమణమ్మ. ఆవిడ మరణం తర్వాత సరోజినీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు మాల, మంగళ, మంజుల. అబ్బాయి పేరు వెంకట్‌. హాస్యనటుడు రాజబాబుకి శ్రీశ్రీ తోడల్లుడు. శ్రీశ్రీ మరదల్ని రాజబాబు పెళ్లి చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు రాశారు శ్రీశ్రీ. ఒక తరహా పాటలకే పరిమితం కాకుండా అన్నిరకాల పాటలు రాసి ప్రేక్షకుల్ని అలరించారు. ‘వెలుగు నీడలు’లో ‘పాడవోయి భారతీయుడా...’, ‘ఇలవేల్పు’ సినిమాలో ‘చల్లని రాజా ఓ చందమామ’, ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాలో ‘శ్రామిక జీవన సౌందర్యానికి సమాధానమనేది లేనే లోదోయ్‌’ ‘డాక్టర్‌ చక్రవర్తి’లో ‘మనసున మనసై’, ‘మనుషులు మారాలి’ సినిమాలో ‘తూరుపు సింధూరపు’, ‘ఈనాడు’ సినిమాలో ‘రండి కదిలి రండి...’, ‘ఆరాధన’ సినిమాలో ‘నా హృదయంలో నిదురించే చెలి’ ఇలా శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు ఇప్పటికీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తూనే ఉంటారు. సాహితీ ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శ్రీశ్రీ చివరి రోజుల్లో క్యాన్సర్‌ బారిన పడి కొంతకాలం ఆ వ్యాధితో బాధపడిన ఆయన 1983 జూన్‌ 15న తుది శ్వాస విడిచారు.

ఎవరి దగ్గరా పనిచేయకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన చక్రి.. ఎలాగో తెలుసా?

ఏ సినిమాకైనా కథ, కథనాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. సంగీతానికి కూడా అంతే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంగీతం సినిమా ఫలితాన్ని కూడా డిసైడ్‌ చేస్తుంది. సంగీత దర్శకుడిగా పరిశ్రమలో ప్రవేశించి సక్సెస్‌ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సాధారణ సంగీతానికి, సినీ సంగీతానికి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. సంగీతంలో తలలు పండిన వారు కూడా సినిమా సంగీతానికి న్యాయం చెయ్యలేరు. అందుకే వారు కచ్చేరీలకే పరిమితమవుతారు తప్ప చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రేక్షకులు కోరుకునే సంగీతాన్ని అందించడం, వారు పాడుకునేలా పాటల్ని స్వరపరచడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. దాన్ని పట్టుకొని సినీ సంగీత ప్రపంచంలో పేరు సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. ఇందులో రాణించాలంటే ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేయాలి. అందులోని మెళకువలు నేర్చుకోవాలి. ఆ తర్వాతే స్వంతంగా సినిమాలకు సంగీతం అందించగలరు. కానీ, ఏ సంగీత దర్శకుడి దగ్గరా పనిచేయకుండా సినీ సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది. 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాచి’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి 2014 వరకు దాదాపు 85 సినిమాలకు సంగీతాన్ని అందించారు. 150 పాటలు పాడారు. అందులో ఎక్కువ శాతం సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అయినవే. ప్రముఖ సంగీత దర్శకుడిగా, సింగర్‌గా పేరు తెచ్చుకున్న చక్రి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించారు? ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1974 జూన్‌ 15న వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ సమీపంలోని కంభాలపల్లిలో జిల్లా వెంకటనారాయణ, విద్యావతి దంపతులకు జన్మించారు చక్రధర్‌ అలియాస్‌ చక్రి. వెంకటనారాయణ టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే బుర్రకథలు స్వయంగా రాసి ప్రదర్శించేవారు. తల్లి విద్యావతి గాయని. వారివల్లే చక్రికి సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. చిన్నతనం నుంచి బాగా పాడేవారు. చక్రిలోని టాలెంట్‌ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించేవారు. చిన్నతనంలోనే ఫ్లూట్‌ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత వయొలిన్‌తోపాటు కర్ణాటక సంగీతాన్ని కూడా అభ్యసించారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి సాహితీ కళాభారతి పేరుతో ఓ ట్రూప్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ చుట్టుపక్కల జరిగే కార్యక్రమాల్లో చక్రి ట్రూప్‌ ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. చక్రిలోని టాలెంట్‌ ఇలాంటి ప్రదర్శనలకు పరిమితం కాకూడదని స్నేహితులు భావించేవారు. హైదరాబాద్‌ వెళ్లి సినిమాల్లో ప్రయత్నించమని పదే పదే చెప్పేవారు. చక్రి వారి మాట వినేవారు కాదు. చివరికి వారి పోరు తట్టుకోలేక హైదరాబాద్‌ బయల్దేరారు చక్రి. మొదట ‘పండువెన్నెల’ అనే ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ను రూపొందించారు. అందులోని పాటల్ని తనే స్వయంగా రాసి సంగీతం సమకూర్చారు. 1995లో హైదరాబాద్‌ వెళ్లిన చక్రి మూడు సంవత్సరాల్లో దాదాపు 30 ఆల్బమ్స్‌ చేశారు. అదే క్రమంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘చిరునవ్వు’ అనే ఆల్బమ్‌ రూపొందించారు. అది విని చక్రిని ఎంతో అభినందించారు చిరంజీవి. ఆ ఆల్బమ్‌ వల్లే చక్రికి తొలి అవకాశం వచ్చింది. బద్రి తర్వాత బాచి చిత్రానికి చక్రిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో చక్రికి గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రానికి మరోసారి చక్రిని తీసుకున్నారు పూరి. అయితే ఆ చిత్ర నిర్మాత చక్రిని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో నిర్మాతనే మార్చేశారు తప్ప చక్రికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు పూరి. అలా వారి మధ్య స్నేహం కంటే సోదర భావం పెరిగింది. తను చేస్తున్న సినిమాలకు వరసగా అవకాశాలు ఇచ్చి చక్రి సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి తోడ్పడ్డారు పూరి.  ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం పాటలు సూపర్‌హిట్‌ అవ్వడంతో చక్రికి అవకాశాలు రావడం మొదలైంది. ఇతర డైరెక్టర్ల సినిమాలు చేస్తూనే పూరి జగన్నాథ్‌తో ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, ఆంధ్రావాలా వంటి సినిమాలు చేశారు. మరోపక్క డైరెక్టర్‌ వంశీ కాంబినేషన్‌లో చేసిన సినిమాలు కూడా చక్రికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చాయి. అప్పటివరకు ఇళయరాజాతో వరసగా సినిమాలు చేసిన వంశీ.. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి చక్రితోనే కంటిన్యూ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గోపి గోపిక గోదావరి, దొంగరాముడు అండ్‌ పార్టీ వంటి సినిమాలు వచ్చాయి.  మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన రెండు సంవత్సరాలకే చక్రి బాగా బిజీ అయిపోయారు. 2003లో 13 సినిమాలకు మ్యూజిక్‌ చేశారు. అదే సంవత్సరం సత్యం సినిమాలోని ‘ఓ మగువ నీతో స్నేహం కోసం..’ పాటకు బెస్ట్‌ సింగర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు చక్రి. ఆ తర్వాత దేవదాసు, కృష్ణ, దేశముదురు, సింహా, నేనింతే, పెదబాబు.. ఇలా చాలా సినిమాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేశారు. టాలీవుడ్‌లో వున్న ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కీ లేని ప్రత్యేకత చక్రిలో ఉంది. అదేమిటంటే.. తను కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పటి నుంచి ప్రతి సినిమాలోనూ కొత్త సింగర్స్‌కి, కొత్త లిరిక్‌ రైటర్స్‌కి అవకాశాలు ఇస్తూనే వచ్చారు. తను చేసిన 85 సినిమాల్లో 65 మంది కొత్త సింగర్స్‌కి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు చక్రి.  చక్రి గొప్ప స్నేహశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని అందరితోనూ స్నేహంగా ఉండే చక్రి.. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అతను చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తన ప్రతి పుట్టినరోజున ఏదో ఒక కార్యక్రమం చేపట్టేవారు. అతని అభిమానులు రక్తదానం చేసేవారు. వరదలు సంభవించినపుడు బాధితులకు అభిమానులతో కలిసి నిత్యావసర సరుకులు అందించేవారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే 2014 డిసెంబర్‌ 14న 40 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్ను మూశారు చక్రి. ఆయన మరణం ఇండస్ట్రీలోని ఎంతో మందిని కలచివేసింది. ఆ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చక్రిపై వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేసింది. ముఖ్యంగా దాసరి నారాయణరావు స్పందిస్తూ.. చక్రి తన బిడ్డలాంటివాడు అన్నారు. విశేషం ఏమిటంటే.. సంగీత దర్శకుడుగా చక్రి చివరి సినిమా ఎర్రబస్సు. అలాగే దర్శకుడుగా దాసరి నారాయణరావు చివరి సినిమా కూడా అదే.

90 శాతం సూపర్‌హిట్స్‌ అందించిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ గురించి మీకు తెలుసా?

(జూన్‌ 14 దర్శకుడు వి.మధుసూదనరావు జయంతి సందర్భంగా..) తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది దర్శకులు వచ్చారు, ఎన్నో అపురూపమైన, అద్భుతమైన సినిమాలను రూపొందించారు. కొందరు శతాధిక చిత్రాల దర్శకులు కూడా వున్నారు. అయితే ఏ దర్శకుడిలోనూ లేని ప్రత్యేకత వి.మధుసూదనరావులో ఉంది. అందరూ ఆయన్ని విక్టరీ మధుసూదనరావు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన రూపొందిచిన 70 సినిమాల్లో 90 శాతం సూపర్‌హిట్‌ చిత్రాలే. అందులో శతదినోత్సవ చిత్రాలతోపాటు సిల్వర్‌ జూబ్లీ సినిమాలు, కొన్ని సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. దాదాపు 40 సంవత్సరాలపాటు ఎన్నో విభిన్నమైన సినిమాలను రూపొందించిన విక్టరీ మధుసూదనరావు సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 1923 జూన్‌ 14న విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు గ్రామంలో వీరమాచనేని రామభద్రయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు వీరమాచనేని మధుసూదనరావు. ఎన్నో కష్టాల మధ్య ఇంటర్‌ పూర్తి చేశారు. ఆ సమయంలోనే స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో చురుగ్గా పాల్గొనడం వల్ల రెండు సార్లు జైలుకి వెళ్ళొచ్చారు. ఇంటర్‌ వరకే చదివిన మధుసూదనరావు సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్‌ బయల్దేరి వెళ్లారు. ఎల్‌.వి.ప్రసాద్‌, తాతినేని ప్రకాశరావు వంటి ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కొన్ని సంవత్సరాలపాటు దర్శకత్వశాఖలో పనిచేశారు. 1959లో సతీ తులసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు మధుసూదనరావు. ఆ తర్వాత 1960లో వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన తొలి సినిమా అన్నపూర్ణ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి మధుసూదనరావు డైరెక్షన్‌లోనే చాలా సినిమాలు నిర్మించారు రాజేంద్రప్రసాద్‌. జగపతి బేనర్‌లోనే కాకుండా బయటి బేనర్‌లో ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ప్రతి సినిమా సూపర్‌హిట్‌ అయ్యేది. ఆయన కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్టీఆర్‌, సావిత్రిలతో చేసిన రక్త సంబంధం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత వచ్చిన దాదాపు 200 సినిమాలకు ‘రక్తసంబంధం’ చిత్రం రిఫరెన్స్‌గా నిలిచింది.  ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, లక్షాధికారి, వీరాభిమన్యు, గుడిగంటలు, లక్ష్మీనివాసం, ఆత్మీయులు, మంచి కుటుంబం, అదృష్టవంతులు, ఆత్మీయులు, కృష్ణవేణి.. ఇలా అన్నీ వరస సూపర్‌హిట్‌ చిత్రాలు చేస్తూ బిజీ డైరెక్టర్‌ అయిపోయారు మధుసూదనరావు.  ఆయన కెరీర్‌లో మెమరబుల్‌ హిట్‌గా నిలిచిన మరో చిత్రం మనుషులు మారాలి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయంతో శోభన్‌బాబు స్టార్‌ హీరో అయ్యారు. అలాగే భక్తతుకారాం, చక్రధారి వంటి భక్తి రసాత్మక చిత్రాలను కూడా తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబును వీరాభిమన్యుతో హీరోను చేశారు. ఆ తర్వాతి కాలంలో విక్రమ్‌ చిత్రంతో అక్కినేని నాగార్జునను, సింహస్వప్నం చిత్రంతో జగపతిబాబును, సామ్రాట్‌ చిత్రంతో రమేష్‌బాబును హీరోలుగా పరిచయం చేశారు. హైదరాబాద్‌లో మధు ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి ఎంతో మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు మధుసూదనరావు.  విక్టరీ మధుసూదనరావుకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ఆయన రీమేక్‌ చిత్రాలను బాగా తియ్యగలరు అనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు రీమేక్‌ కింగ్‌ అనే పేరు ఉండేది. ఏ భాషా చిత్రమైనా తనకు నచ్చితే వెంటనే దాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యడం ఆయన ప్రత్యేకత. నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్‌తో ఉండేవారు. అంతేకాదు, ఆయన చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన డైరెక్ట్‌ చేసిన 70 సినిమాల్లో 60 సినిమాలు రీమేక్‌లే ఉంటాయి. అది ఇతర భాషలో వచ్చిన సినిమా కావచ్చు, నవల కావచ్చు లేదా రంగస్థలంపై వేసిన నాటకం కావచ్చు. దాన్ని సినిమా తీసేసి హిట్‌ కొట్టేవారు విక్టరీ మధుసూదనరావు. రీమేక్‌ సినిమాలతో ఇంతటి సక్సెస్‌ రేట్‌ సాధించిన దర్శకుడు టాలీవుడ్‌లో మరొకరు లేరు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘స్వాతికిరణం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించారు మధుసూదనరావు. ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాల్లో 6 సినిమాలకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డులు లభించాయి. అలాగే 1965లో అంతస్తులు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మధుసూదనరావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

బాల‌కృష్ణ న‌ట‌ జీవితాన్ని మ‌లుపు తిప్పిన ఆ న‌లుగురు ద‌ర్శ‌కులెవ‌రు?

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తారాక రామారావు త‌న‌యుడిగా ఇంత లాంగ్ లాస్టింగ్ కెరీర్ న‌డ‌ప‌టం అంటే అది మామూలు విష‌యం కాదు. యాభై ఏళ్ల పాటు న‌టుడిగా కొన‌సాగిన వ్య‌క్తి కూడా బాల‌య్య బాబే. (Nandamuri Balakrishna) బాల‌కృష్ణ ప‌ద‌నాలుగేళ్ల వ‌య‌సులో అంటే, 1974లో త‌న తండ్రి ఎన్టీఆర్ డైరెక్ష‌న్లో వ‌చ్చిన తాత‌మ్మ క‌ల చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మయ్యాడు. మొద‌ట్లో వివిధ సినిమాల్లో స‌హాయ‌న‌టుడి పాత్ర పోషించాడు బాల‌య్య‌. ఆక్ర‌మంలో ఆయ‌న ఎలాంటి సినిమాలు చేశాడో చూస్తే.. దాన‌వీర శూర‌క‌ర్ణ‌, అక్బ‌ర్ సలీం అనార్క‌లీ, అన్న‌ద‌మ్ముల అనుబంధం, శ్రీమ‌ద్విరాట ప‌ర్వ‌ము, శ్రీ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క‌ళ్యాణం వంటి చిత్రాల్లో ఆయ‌న ఆడుతూ పాడుతూ న‌టిస్తూ వ‌చ్చాడు. తొలి ప‌ది సంవ‌త్స‌రాలు అలా గ‌డ‌వ‌గా.. 1984లో కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు విజ‌యంతో సోలోహీరోగా స్థిర‌ప‌డ్డాడు బాల‌య్య బాబు. ఇక అక్క‌డి నుంచి ముద్దుల కృష్ణ‌య్య‌, మువ్వ‌గోపాలుడు, ముద్దుల మేన‌ల్లుడు, ముద్దుల మావ‌య్య అంటూ.. కోడిరామ‌కృష్ణ‌తో ఒక హిట్ కాంబోగా నిలిచింది. బాల‌కృష్ణ‌- కోడిరామ‌కృష్ణ‌- ఎస్ గోపాల్ రెడ్డి కాంబో అంటే అప్ప‌ట్లో అదో సూపర్ డూప‌ర్ హిట్ కాంబో. ఫ్యామిలీ హీరోగా చాలా కాలం పాటు బాల‌కృష్ణ సినిమాలు వ‌చ్చాయి. త‌ర్వాత క‌థానాయ‌కుడు, లారీడ్రైవ‌ర్, రౌడీ ఇన్ స్పెక్ట‌ర్, ఆదిత్య 369 వంటి చిత్రాల‌తో త‌న‌దైన ల్యాండ్ మార్క్ హిట్స్ ఇవ్వ‌డం మాత్ర‌మే కాకుండా.. మూడో త‌రం హీరోల్లో అగ్ర‌గ‌ణ్యుడిగా ఉంటూ వ‌చ్చాడు బాల‌కృష్ణ‌. బాల‌కృష్ణ ఫ్యామిలీ హీరో స్టేజ్ నుంచి ఫ్యాక్ష‌న్ హీరోగా అవ‌త‌రించిన స‌మ‌యం సంద‌ర్భం మాత్రం.. బీగోపాల్ ద్వారా వ‌చ్చింది. 1999లో వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి- అప్ప‌ట్లో అదో స‌న్సేష‌న‌ల్ హిట్. స‌రికొత్త బాల‌కృష్ణ ఆవిర్భావం జ‌రిగింది అప్పుడే. ఆ త‌ర్వాత న‌ర‌సింహ‌నాయుడు, సీమ సింహం వంటి వ‌రుస ఫ్యాక్ష‌న్ మూవీస్ వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఇదో ట్రెండు. బాల‌కృష్ణ ఒక ట్రెండ్ సెట‌ర్ గా పేరొచ్చిందంటే కార‌ణం ఈ సినిమాలు అంత‌గా విజ‌య‌వంతం కావ‌డ‌మే. త‌ర్వాతి కాలంలో బాల‌కృష్ణ కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పిన మ‌రో ద‌ర్శ‌కుడు మాత్రం బోయ‌పాటి శ్రీను. శ్రీను ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సింహా. 2010లో విడుద‌లైన ఈ చిత్రం బాల‌కృష్ణ ఫ్యాన్స్ కి పండ‌గ‌లా క‌నిపించింది. వింటేజ్ బాల‌య్య‌ను తిరిగి తెర‌పైకి తెచ్చాడు బోయ‌పాటి. అక్క‌డి నుంచి బాల‌కృష్ణ యాభై ఏళ్ల సినిమా జీవితంలో స‌రికొత్త పార్ట్ మొద‌లైంది. లెజండ్, అఖండ వంటి చిత్రాల‌తో ఈ ఇద్ద‌రి కాంబో ప్ర‌స్తుతం అఖండ 2 వ‌ర‌కూ వ‌చ్చింది. రీసెంట్ గా బాల‌కృష్ణ వ‌రుస హిట్ సినిమాలేంట‌ని చూస్తే.. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకూ మ‌హ‌రాజ్. ఇవన్నీ వంద‌కోట్లు వ‌సూలు చేసిన చిత్రాలుగా  నిలిచాయి. అంటే వరుస నాలుగు సెంచ‌రీల‌తో టాలీవుడ్ లో మ‌రే హీరోకి లేని స‌రికొత్త రికార్డ్ అన్న‌మాట‌. ప్ర‌తి ప‌ది ప‌దిహేనేళ్ల‌కు బాల‌కృష్ణ‌లో ఒక కొత్త న‌ట‌బాల‌కృష్ణుడు క‌నిపించాడంటే, అతిశ‌యోక్తి కాదేమో. అంతగా తెలుగు ప్రేక్ష‌క స‌మాజాన్ని ప్ర‌భావితం చేసిన న‌టుల్లో మ‌రొక‌రు లేరేమో, అలాంటి అఖండ‌మైన‌ పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించాడాయ‌న‌. బాల‌కృష్ణ సినిమాలు ఆడుతూనే ఉన్న థియేట‌ర్లు ఇప్ప‌టికీ ఉన్నాయి. ఈ మాస్ రాంపేజ్ మ‌రెవ‌రికీ లేదేమో. ఇక‌పై రాదేమో. ఇప్పుడొక సినిమా వారం ప‌దిరోజులు ఆడితే మ‌హా గొప్ప‌. అదే బాల‌య్యా బాబు సినిమా ఏపీ, తెలంగాణ థియేట‌ర్ల‌లో ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఆడుతున్న విధం క‌నిపిస్తుంది. కొన్ని సినిమా హాళ్లు బాల‌కృష్ణ‌కే డెడికేట్ చేసిన‌వి ఉంటాయంటే అబ‌ద్ధం కాదు. అంత‌గా బాల‌య్య త‌న ఫ్యాన్స్ కి ఎప్పుడూ ద‌గ్గ‌ర‌గానే ఉంటాడు.  ప‌ర్స‌న‌ల్ గా బాల‌కృష్ణ స్టామినా ఏంటంటే మీరెక్క‌డైనా ప‌బ్బుకు గానీ ఇత‌ర వండ‌ర్లా వంటి పార్కుల‌కు గానీ వెళ్తే.. అక్క‌డ జై బాల‌య్య స్లోగ‌న్ ఎక్కువ‌గా వినిపిస్తుంది. కార‌ణం ఒక మొండి ధైర్యానికి నిద‌ర్శ‌నంగా బాల‌య్య‌ను వారు భావిస్తారు కాబ‌ట్టి. ఏదైనా ఆప‌ద‌లో ఉన్న‌పుడు గానీ, లేదంటే మ‌రేదైనా క‌ష్ట సాధ్య‌మైన ప‌నులు చేయాల్సి వ‌చ్చిన‌పుడు కానీ బాలకృష్ణను త‌లుచుకోవ‌డం కుల‌మ‌తాల‌కు, పార్టీల‌కు అతీతంగా ఒక న‌మ్మ‌కం ఉందంటే ఆశ్చ‌ర్యం లేదేమో. అంత‌గా ఆయ‌న పేరు దేశ విదేశాల్లోనూ మార్మోగుతుంది. బాల‌కృష్ణ సినిమాల‌కు విదేశాల్లోని తెలుగు వారే కాదు.. అక్క‌డి విదేశీయుల్లోనూ వీరాభిమానులున్నారు. ద‌టీజ్ బాల‌య్య బాబు! త‌న తండ్రి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంక‌టేశ్వ‌రుడు వంటి పాత్ర‌ల్లో దేవుడిగా ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌న‌మిస్తే.. బాల‌కృష్ణ మాత్రం స్వ‌యంగా త‌నే ఆరాధ్య దైవంగా, అంతులైని ధైర్యాన్నిచ్చేందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తారు. దీంతో బాల‌కృష్ణ  డేరింగ్ క‌మ్ డ్యాషింగ్ నేచ‌ర్ కి నిద‌ర్శ‌నంగా  నిలిచిపోయార‌నే చెప్పాలి. దీంతో ప‌దిమందికీ ఆద‌ర్శ‌వంగా నిల‌వ‌డం మాత్ర‌మే కాదు.. వారి క‌ష్ట‌కాలంలో వాడే ఊత‌ప‌దంగానూ మారిపోయాడాయ‌న‌. ఇది తెలుగు సినిమాలే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో ఏ సినీ హీరోల్లో లేని అరుదైన క్వాలిఫికేష‌న్.  ఒక అగ్ర‌నటుడి కుమారుడిగా పుట్టి.. ఆ ప్రెష‌ర్ని త‌ట్టుకుని యాభై ఏళ్ల‌పాటు కెరీర్ ని విజ‌య‌వంతంగా  న‌డ‌ప‌ట‌మే కాకుండా.. ఇటు బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వాహ‌కుడిగా, అటు హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ త్రిపాత్రాభిన‌యానికి మెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌ణ్ అనే పుర‌స్కారం అందించింది. అంతే కాదు తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు సైతం ఇచ్చింది. ఈ అవార్డును త‌న 67వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అందుకుంటున్నాడు బాల‌య్య బాబు. ఇక బాల‌కృష్ణకు ప్రేక్ష‌కులిచ్చిన బిరుద‌లేంట‌ని చూస్తే యువ‌ర‌త్న‌గా మొద‌లైన ఈ ప‌రంప‌ర న‌ట సింహం, లెజండ్, రోరింగ్ లైన్ వంటివి ఎన్నో ఉన్నా.. జైబాల‌య్య అనేది ఒక పాట రూపంలోనే కాదు.. మాట రూపంలోనూ ప్రేక్ష‌కుల పాలిట అదో జీవ‌న మంత్రం.   బాల‌కృష్ణకు వ‌య‌సు ఒక లెక్క కాదు. ఎందుకంటే ఆయ‌నది ఎప్ప‌టికీ చిన్న పిల్లాడి మ‌న‌స్తత్వం. ఆయ‌న త‌న కొడుకు మోక్ష‌జ్ఞ‌తోనూ పోటీ ప‌డ‌గ‌ల‌డు. ద‌ర్శ‌కుల‌ను న‌మ్మ‌డం అన్న‌ది ఆయ‌న విజ‌య‌ర‌హస్యాల్లో ఒక‌టి. ఎందుకంటే ఆయ‌న తొలి నాళ్ల‌లో ఎక్కువగా త‌న తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల్లో న‌టించాడు. దీంతో తండ్రే ద‌ర్శ‌కుడు కావ‌డం వ‌ల్ల‌.. దానికి తోడు త‌న తండ్రికి సైతం డైరెక్ట‌ర్ చైర్ అంటే ఉన్న గౌర‌వాభిమానాల వ‌ల్ల ఆయ‌న త‌న డైరెక్ట‌ర్ ని బ‌లంగా న‌మ్ముతారు.  బాల‌కృష్ణ‌కు క‌థ చెప్ప‌డం సులువు. ఆయ‌న చేత న‌టింప చేయ‌డ‌మూ సులువే. ఎందుకంటే ఆయ‌న‌కంటూ ఎలాంటి భేష‌జాలుండ‌వు. లైట్ బాయ్ నుంచి డైరెక్ట‌ర్ వ‌రకూ అంద‌రితోనూ ఇట్టే క‌ల‌సిపోయి.. క‌నిపిస్తాడు కాబ‌ట్టి. ఫైన‌ల్ గా బాల‌కృష్ణ కెరీర్ ని శాసించిన ఆ న‌లుగురు ద‌ర్శ‌కులు ఎవ‌ర‌య్యా అంటే తొలుత తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్, ఆ త‌ర్వాతి రోజుల్లో కోడి రామ‌కృష్ణ‌, ఆపై రోజుల్లో బీ గోపాల్, ప్రెజంట్ బోయ‌పాటి శ్రీను బాల‌య్య బాబు కెరీర్ ని అమాంతం మ‌లుపు తిప్పిన ద‌ర్శ‌కుల్లో కీల‌కంగా భావించాలి. అలాగ‌ని బాల‌కృష్ణ ఇత‌ర ద‌ర్శ‌కుల సినిమాల‌ను చేయ‌లేద‌ని కాదు.. కానీ ప్ర‌ధానంగా ఈ ద‌ర్శ‌కుల ప్ర‌భావం ఆయ‌న కెరీర్ నిండా ప‌రుచుకుని క‌నిపిస్తుంది. ఇక బాల‌కృష్ణలో ఉన్న సెయింట్ హుడ్. మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ అంశ‌మే ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌స్తోందంటే.. ఇది కేవ‌లం బాల‌య్య బాబుకు మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌త‌. మ‌రెవ‌రికీ లేని ఈ అతీత శ‌క్తి బాల‌య్య‌కి మాత్ర‌మే సొంతం. అందుకే అనేది జై బాల‌య్య ఒక స్లోగ‌న్ కాదు. ఎంద‌రో జీవితాల్లో ధైర్యాన్ని నింపే ఒకానొక లైప్ లైన్ క్యాప్ష‌న్ గా అభివ‌ర్ణిస్తారు సినీ పండితులు.  హ్యాపీ బ‌ర్త్ డే బాల‌య్య బాబూ! మీరిలాగే మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌రుపుకుని.. ఇటు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే కాక అటు స‌మాజంలోని ఎంద‌రో అభాగ్యుల పాలిట ఆరాధ్య దైవంగా కొన‌సాగాల‌ని ఆశిస్తూ సెల‌వు.

ఇ.వి.వి.సత్యనారాయణ వంటి డైరెక్టర్‌ మరొకరు లేరు అని చెప్పడానికి ఇదే నిదర్శనం!

(జూన్‌ 10 దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి సందర్భంగా..) నవరసాల్లో అన్నింటికంటే కష్టమైనది, అందరికీ ఇష్టమైనది హాస్యరసం. నటీనటులందరికీ హాస్యాన్ని పండించడం సాధ్యం కాదు. అలాగే అందరు రచయితలు కామెడీ కథలు రాయలేరు, అందరు దర్శకులు కామెడీ సినిమాలు తియ్యలేరు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీని ఒక ట్రాక్‌గా పెట్టి నడిపించేవారు. కథతోపాటు ప్యారలల్‌గా కామెడీ ట్రాక్‌ నడిచేది. దాని కోసం ప్రత్యేకంగా కమెడియన్స్‌ ఉండేవారు. అది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. అడపా దడపా పూర్తి హాస్య సినిమాలు కూడా వచ్చేవి. అయితే పూర్తి స్థాయిలో కామెడీ సినిమాలు వెలుగులోకి వచ్చింది 1980వ దశకం నుంచి. 1981లో ఒక్క నెల తేడాతో ఇద్దరు దర్శకులు టాలీవుడ్‌కి వచ్చారు. ఆగస్ట్‌లో ‘నేను మా ఆవిడ’ చిత్రంతో రేలంగి నరసింహారావు, సెప్టెంబర్‌లో ‘ముద్ద మందారం’ చిత్రంతో జంధ్యాల పరిచయమయ్యారు. ఈ ఇద్దరు దర్శకులు ఆ తర్వాతి కాలంలో కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. వీరి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. ఆద్యంతం నవ్వులు పూయించే సినిమాలు తీసి హాస్యప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. కామెడీ సినిమాల్లో ఈవీవీ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అసలు ఇ.వి.వి.సత్యనారాయణ నేపథ్యం ఏమిటి? ఆయన సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? హాస్య చిత్రాల దర్శకుడిగా ఆయన ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు తెలుసుకుందాం. 1956 జూన్‌ 10న పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరులో వెంకటరావు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈవీవీకి చిన్నతనం నుంచీ సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఇంటర్‌ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్లకుండా రోజుకి రెండు, మూడు సినిమాలు చూడడం వల్ల పరీక్ష తప్పారు. దాంతో చదువు మాన్పించేసి పొలం పనులకు తీసుకెళ్లారు తండ్రి. అలా రెండు సంవత్సరాలు పనిచేశారు ఈవీవీ. అదే క్రమంలో 1976లో 19 ఏళ్ళ వయసులోనే సరస్వతికుమారితో ఈవీవీ వివాహం చేశారు. వారికి ఇద్దరు కొడుకులు రాజేష్‌, నరేష్‌ కలిగారు. ఆ తర్వాత వ్యవసాయంలో నష్టం రావడంతో పొలం అమ్మెయ్యాల్సి వచ్చింది. కుటుంబానికి అలాంటి పరిస్థితి ఏర్పడడంతో ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత నవత కృష్ణంరాజు బంధువు అదే ఊరిలో ఉండడంతో ఆయన దగ్గరి నుంచి ఒక రికమండేషన్‌ లెటర్‌ తీసుకొని మద్రాస్‌ రైలెక్కేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కృష్ణంరాజు బేనర్‌లో ఓ అవకాశం దక్కింది. దేవదాస్‌ కనకాల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఓ ఇంటి భాగోతం చిత్రానికి అసిస్టెంట్‌గా ఈవీవీని తీసుకున్నారు.  ఆ తర్వాత జంధ్యాల దగ్గర అసోసియేట్‌గా 8 సంవత్సరాలపాటు 22 సినిమాలకు పనిచేశారు. ఆ సమయంలోనే ఈవీవీకి డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తానని చెప్పారు రామానాయుడు. అయితే తను నిర్మిస్తున్న ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి అసోసియేట్‌గా పనిచేయమన్నారు. ఆ సినిమా పూర్తయినప్పటికీ రామానాయుడు అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ సమయంలోనే రామానాయుడు మేనల్లుడు అశోక్‌కుమార్‌.. ఈవీవీతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. అలా అతను డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా చెవిలో పువ్వు 1990లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సినిమా హిట్‌ కాకపోయినా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవీవీ. అదే సంవత్సరం రామానాయుడు తన బేనర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. హరీష్‌, మాలాశ్రీ జంటగా ఈవీవీ చేసిన ప్రేమఖైదీ చాలా పెద్ద హిట్‌ అయింది.  ఆ తర్వాత ఈవీవీకి వరసగా అవకాశాలు వచ్చాయి సీతారత్నంగారి అబ్బాయి, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయిగారు, వారసుడు, జంబలకిడి పంబ, హలో బ్రదర్‌, అల్లుడా మజాకా, ఆయనకి ఇద్దరు, మావిడాకులు వంటి సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు. ఈ సినిమాల్లో కొన్ని పూర్తి స్థాయి కామెడీ సినిమాలు కాగా, మరికొన్ని కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయి. చక్కని కథ ఉంటూనే కామెడీ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకునేవారు ఈవీవీ. అలాగే ఆమె, తాళి, ఆరుగురు పతివ్రతలు వంటి మహిళా ప్రధాన చిత్రాలు కూడా చేశారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మా నాన్నకు పెళ్లి, ఆవిడా మా ఆవిడే, కన్యాదానం, చాలా బాగుంది, ఎవడిగోల వాడిది సినిమాలు ఈవీవీ చేసిన సూపర్‌హిట్‌ సినిమాల్లో కొన్ని మాత్రమే. ఈవివి సినిమా పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి కొన్ని సినిమాలు కూడా నిర్మించారు ఈవీవీ.  ఈవీవీ పెద్ద కుమారుడు ఆర్యన్‌ రాజేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ హాయ్‌ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా అంతగా సక్సెస్‌ అవ్వలేదు రాజేష్‌. ఇక చిన్న కుమారుడు నరేష్‌.. అల్లరి చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయ్యారు. అయితే కామెడీ హీరోగా నరేష్‌ మంచి పేరు తెచ్చుకొని ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు. నరేష్‌తోనే ఈవీవీ చాలా సినిమాలు చేశారు. చివరగా 2010లో ఆయన దర్శకత్వంలో వచ్చిన బురిడీ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. దాదాపు సంవత్సరంపాటు అనారోగ్యంతో బాధపడిన ఈవీవీ 2011 జనవరి 21న తుది శ్వాస విడిచారు. ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు రూపొందించారు ఈవీవీ.  ఆయన తర్వాత ఆ స్థాయిలో హాస్య చిత్రాలు చేసే దర్శకుడు టాలీవుడ్‌లో మరొకరు కనిపించలేదు.

నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం.. ఇదే గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ జైత్రయాత్ర!

(జూన్‌ 10 నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..) నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారు. ‘జై బాలయ్యా..’ అంటూ తమ అభిమాన కథానాయకుడికి జేజేలు పలుకుతారు. బాలయ్య చెప్పే వీరోచిత డైలాగ్స్‌కి పులకించిపోతారు. తెరపై బాలకృష్ణ కనిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవర్‌ఫుల్‌ డైలాగులు చెప్పాలన్నా, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలన్నా అది బాలయ్యకే సాధ్యం అనేది నందమూరి అభిమానుల్లో ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని తన డైలాగులతో చైతన్యపరిచే బాలయ్య.. ఆ తరహా క్యారెక్టర్సే చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళుగా తన కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. క్రమశిక్షణ, వృత్తి పట్ల గౌరవం తండ్రి నుంచి ఆయనకు సంక్రమించిన మంచి లక్షణాలు. ఎన్టీఆర్‌లాగే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని గణనీయంగా పెంచుకున్నారు బాలకృష్ణ. 1974లో ‘తాతమ్మకల’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, సినిమాల పరంగా, రాజకీయంగా ఆయన సాధించిన విజయాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.  1960 జూన్‌ 10న మద్రాసులో నటరత్న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు మగ సంతానంలో ఆరోవాడిగా జన్మించారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు చిత్ర పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండడంతో బాలకృష్ణ బాల్యం అంతా అక్కడే గడిచింది. కొంత వయసు వచ్చిన తర్వాత హైదరాబాద్‌ వచ్చి నిజాం కాలేజీలో బి.కాం పూర్తి చేశారు. 14 సంవత్సరాల వయసులో తండ్రి దర్శకత్వంలో రూపొందిన తాతమ్మకల చిత్రంలో తొలిసారి నటించారు బాలయ్య. 1974లో ఈ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి 1983 వరకు 11 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వీటిలో 6 సినిమాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. 1975లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించారు. అలాగే దానవీరశూర కర్ణ చిత్రంలో అన్నయ్య హరికృష్ణ అర్జునుడి పాత్ర పోషించగా, కుమారుడు అభిమన్యుడు పాత్రలో బాలకృష్ణ నటించారు.  1984లో సంతాన భారతి, పి.వాసు దర్శకత్వంలో వచ్చిన సాహసమే జీవితం చిత్రంతో సోలో హీరోగా పరిచయమయ్యారు బాలయ్య. ఈ సినిమా తర్వాత డిస్కోకింగ్‌, జననీ జన్మభూమి చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన మంగమ్మగారి మనవడు చిత్రం ఘనవిజయం సాధించి బాలకృష్ణ కెరీర్‌ను టర్న్‌ చేసింది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. హైదరాబాద్‌లో 565 రోజులు ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలోని తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో చేసిన సిద్ధయ్య పాత్ర నటుడిగా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది.  ఆ తర్వాత కథానాయకుడు, ఆత్మబలం, బాబాయ్‌ అబ్బాయ్‌, భలే తమ్ముడు, నిప్పులాంటి మనిషి వంటి సినిమాల్లో విభిన్నమైన చిత్రాలతో ముందుకెళ్తున్న బాలకృష్ణకు ముద్దుల కృష్ణయ్య చిత్రంతో విజయపరంపర మొదలైంది. ఆ సంవత్సరం ఆయన చేసిన సినిమాల్లో ఆరు సినిమాలు సూపర్‌హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ఒక హీరో ఒకే సంవత్సరం చేసిన ఆరు సినిమాలు సూపర్‌హిట్‌ కావడం అనే రికార్డు ఇప్పటికీ బాలకృష్ణ పేరు మీదే ఉంది. ఆ తర్వాత మువ్వగోపాలుడు, రాము, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, భలేదొంగ, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగారు బాలయ్య. ఆ తర్వాత చేసిన ఆదిత్య 369, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ వంటి సినిమాలు ఆయన రేంజ్‌ని మరింత పెంచాయి.  నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలిసింహం, వంశానికొక్కడు సినిమాలు బాలకృష్ణను టాలీవుడ్‌లో టాప్‌ హీరోని చేశాయి. ఆ తర్వాత కూడా కొన్ని హిట్‌ సినిమాల్లో నటించిన బాలకృష్ణకు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన సినిమా సమరసింహారెడ్డి. సెంటిమెంట్‌, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు వంటివి చేస్తూ వచ్చిన బాలయ్యను ఒక ఫెరోషియస్‌ క్యారెక్టర్‌లో చూపించి ప్రేక్షకులకు, అభిమానులకు ఒక కొత్త బాలకృష్ణను పరిచయం చేశారు దర్శకుడు బి.గోపాల్‌. అంతకుముందు బాబాయ్‌ అబ్బాయ్‌, సీతారామకళ్యాణం వంటి సినిమాల్లో కామెడీని అద్భుతంగా పండిరచిన బాలయ్య.. సమరసింహారెడ్డితో దాన్ని పక్కన పెట్టి రౌద్ర పూరితమైన పాత్రలు పోషించడానికి పరిమితమైపోయారు. ఎందుకంటే బాలయ్యను ఆ తరహా పాత్రల్లో చూసేందుకే ప్రేక్షకులు, అభిమానులు ఇష్టపడేవారు. ఆ తర్వాత నరసింహనాయుడు చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ ఆ తరహా క్యారెక్టర్లు తాను మాత్రమే చెయ్యగలనని ప్రూవ్‌ చేసుకున్నారు. లక్ష్మీనరసింహా, సింహా, లెజెండ్‌, అఖండ, భగవంత్‌ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్‌ వంటి పూర్తి యాక్షన్‌ సినిమాలు చేస్తూ తిరుగులేని మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అఖండ2తో మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  నటరత్న ఎన్‌.టి.రామారావు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. బాలకృష్ణ కూడా ఆ తరహా పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. దానవీరశూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, వేములవాడ భీమకవి, శ్రీమద్‌విరాటపర్వం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన బాలకృష్ణ.. సోలో హీరో అయిన తర్వాత భైరవద్వీపం చిత్రంతో మొదలుపెట్టి శ్రీకృష్ణార్జున విజయం, ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, పాండురంగడు, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాల్లో.. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు అత్యద్భుతంగా పోషించి ఆ తరహా సినిమాలు చెయ్యడం నందమూరి వంశానికే సాధ్యం అని మరోసారి నిరూపించారు.  ఇక ఆయనకు లభించిన పురస్కారాల గురించి చెప్పాలంటే.. సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డును బాలకృష్ణకు అందించింది. నరసింహనాయుడు, సింహా, లెజెండ్‌ చిత్రాలకు మూడు సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే వివిధ సంస్థలు బాలకృష్ణకు పలు పురస్కారాలు అందించాయి. వ్యక్తిత్వ పరంగా చూస్తే.. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలందరి కంటే భిన్నమైన వ్యక్తి బాలకృష్ణ. తన మనసులో ఉన్నది నిర్మొహమాటంగా బయటికి చెప్పడం, తప్పు జరిగితే దాన్ని నిర్భయంగా ఖండిరచడం వంటి లక్షణాలు ఎన్టీఆర్‌ నుంచి అలవడ్డాయి. తన సహనటీనటులను, తన కంటే సీనియర్‌ నటీనటులను గౌరవించడం, నిర్మాతల శ్రేయస్సు కోరుకోవడం, దర్శకులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వంటివి బాలకృష్ణలో ఉన్న మంచి లక్షణాలు. సినిమాల్లోనే కాదు, టీవీ షోల్లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు బాలయ్య. ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అయ్యే అన్‌స్టాపబుల్‌ షోకి బాలకృష్ణ హోస్ట్‌ అని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంతో గంభీరంగా ఉండే ఆయన దగ్గరికి వెళ్ళడానికే చాలా మంది భయపడుతుంటారు. కానీ, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అనీ, ఎంతో జోవియల్‌గా మాట్లాడతారని బాలకృష్ణను దగ్గరగా చూసినవారు చెప్తుంటారు. అందుకే అన్‌స్టాపబుల్‌ షోకి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ షో ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. షోకి వచ్చిన సెలబ్రిటీస్‌తో ఎంతో సరదాగా మాట్లాడుతూ వారితో కలిసి పోతారు. షో చూస్తున్నవారికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. 1982లో ఎన్‌.టి.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్‌లో ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు కోసం ప్రచారం చేశారు బాలకృష్ణ. 2014లో హిందూపూర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో, 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఇక బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తల్లి బసవతారకం పేరు మీద అత్యాధునిక సౌకర్యాలతో ‘బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఈ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని వేలమందికి ఈ హాస్పిటల్‌ ద్వారా వైద్య సేవలు అందించారు.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో 22 ఏళ్ళ వయసులో వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు బాలకృష్ణ. వీరికి ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం.. చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌తో జరిగింది. అలాగే రెండో కుమార్తె తేజస్వినికి వైజాగ్‌ ఎం.పి. భరత్‌తో వివాహం జరిపించారు. కుమారుడు మోక్షజ్ఞను తన నట వారసుడిగా పరిచయం చెయ్యాలనే ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఒక మంచి సినిమా ద్వారా మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ2’ చిత్రం చేస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతోంది. మరో విశేషం ఏమిటంటే.. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చేస్తున్న ‘జైలర్‌2’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. 

తెలుగు సినిమాలోని సీన్‌ని కాపీ చేసి తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన మురుగదాస్‌!

భారతదేశంలోని వివిధ భాషల్లో నిర్మిస్తున్న అనేక సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా మన హీరోలకు, టెక్నీషియన్స్‌కి దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. గతంలో మన దర్శకుల్లో కొందరు ఏదో ఒక రిఫరెన్స్‌ లేనిదే సినిమా తీసే స్థితిలో ఉండేవారు కాదు. హాలీవుడ్‌, కొరియన్‌, జపాన్‌, ఫ్రెంచ్‌, చైనీస్‌.. ఇలా అనేక భాషల్లో నిర్మించిన సినిమాల్లోని కొన్ని కీలక సన్నివేశాలను కాపీ కొట్టి వాటిని మన సినిమాల్లో జొప్పించేవారు. మరికొందరు సినిమా అంతా మక్కీకి మక్కీ కాపీ కొట్టడంలో సిద్ధహస్తులుగా ఉండేవారు. తాను హాలీవుడ్‌ సినిమాలను కాపీ చేస్తానని రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకులు ఓపెన్‌గానే చెప్పేశారు. ఆ తర్వాతి కాలంలో మన సినిమాలను మనమే కాపీ కొట్టుకునే స్థితికి వచ్చేశాం. దీనికి ఉదాహరణగా గతంలో అనేక సినిమాలు సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి. రాజమౌళి చేసిన మగధీర, విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాల్లో అనేక ఇతర సినిమాల్లోని సన్నివేశాలను యధాతథంగా కాపీ చేసినట్టు సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచం దృష్టికి వచ్చింది. తాజాగా అలాంటి ఓ సీన్‌ గురించి నెటిజన్లు తెగ డిస్కస్‌ చేసుకుంటున్నారు. అదే.. సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా. ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని తెలుగు సినిమా నుంచి కాపీ చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున, రజని జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్‌.గోపాలరెడ్డి నిర్మించిన ‘మురళీకృష్ణుడు’ చిత్రం 1988లో విడుదలైంది. 2005లో సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ ఎంతో పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సన్నివేశం ఉంటుంది. ఎయిర్‌ వాయిస్‌ ఓనర్‌ సంజయ్‌ రామస్వామి, ఒక యాడ్‌ కంపెనీలో మోడల్‌గా పనిచేసే కల్పన అనే అమ్మాయి మధ్యన సాగే ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ‘మురళీకృష్ణుడు’ చిత్రం నుంచి కాపీ చేశారు మురుగదాస్‌. ఆ సినిమాలో మురళీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ ఎం.డి. మురళీకృష్ణ, డ్రామా కంపెనీలో డాన్స్‌ టీచర్‌గా పనిచేసే కృష్ణవేణి అనే అమ్మాయి మధ్య ఆ సీన్‌ ఉంటుంది. ఒక్కసారి ఆ సీన్‌ని పరిశీలిస్తే... మురళీకృష్ణ అనే వ్యక్తి ఎవరో తెలియకుండానే అతనితో కృష్ణవేణికి లవ్‌ ఎఫైర్‌ ఉందనే వార్త ఆ డ్రామా కంపెనీలో స్ప్రెడ్‌ అయిపోతుంది. దాంతో తనకు పరిచయమైన ఓ వ్యక్తిని మురళీకృష్ణగా నటించమని కోరుతుంది కృష్ణవేణి. ఆ క్రమంలోనే ఓ హోటల్‌లో ఆ డ్రామా కంపెనీ సభ్యులతోపాటు కృష్ణవేణి.. మురళీకృష్ణను కలుస్తుంది. మురళీకృష్ణ ఆ డ్రామా కంపెనీ కోసం రెండు లక్షల చెక్‌ కూడా ఇస్తాడు. ఫేక్‌ మురళీకృష్ణ రెండు లక్షల చెక్‌ ఇవ్వడం ఏమిటని కృష్ణవేణి షాక్‌ అవుతుంది.  ఇదే సీన్‌ని ‘గజిని’ చిత్రంలో సూర్య, అసిన్‌ మధ్య రిపీట్‌ చేశారు మురుగదాస్‌. బ్యాక్‌డ్రాప్‌ మారినప్పటికీ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌లో విరాళంగా చెక్‌ ఇవ్వడం వరకు ఈ సినిమాలో ఉంటుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన సినిమా కావడం, ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఆ సినిమాను, అందులోనీ సీన్స్‌ను అందరూ మర్చిపోయారు. కానీ, మురుగదాస్‌ మాత్రం దాన్ని గుర్తుపెట్టుకొని యధాతథంగా తన సినిమాలో దింపేశాడు. ఒకవిధంగా గజిని సినిమాలో ఇది చాలా కీలక సన్నివేశంగా చెప్పొచ్చు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు సినిమాలోని సన్నివేశాన్ని తమిళ్‌లో వాడుకున్న మురుగదాస్‌ను ట్రోల్‌ చేస్తూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. 

ఆ ఒక్క సినిమా మూవీ మొఘల్‌ జీవితాన్ని మార్చేసింది!

(జూన్‌ 6 మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు జయంతి సందర్భంగా..) సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు నటీనటులుగా రాణించడానికి ఇష్టపడతారు, మరికొందరు సాంకేతిక నిపుణులుగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. మరికొందరు మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాంటి ఓ బలమైన కోరికతో సినిమా రంగానికి వచ్చారు మూవీ మొఘల్‌ డా.డి.రామానాయుడు. తను ఏ పనిచేసినా నెంబర్‌ వన్‌గా ఉండాలని ఇష్టపడే రామానాయుడు.. సినీ రంగానికి రాకముందు కొన్ని వ్యాపారాలు చేశారు. అందులోనూ నెంబర్‌వన్‌ అనిపించుకొని నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి సినిమా రంగంలోనూ నెంబర్‌వన్‌గా నిలిచారు డి.రామానాయుడు.  1936 జూన్‌ 6న ప్రకాశం జిల్లా కారంచేడులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు దగ్గుబాటి రామానాయుడు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. రామానాయుడు మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత పిల్లలను తండ్రి వెంకటేశ్వర్లు పెంచి పెద్ద చేశారు. మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు రామానాయుడు. ఆ తర్వాత కారంచేడు వచ్చి రైస్‌మిల్లు, ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేశారు. ఆ సమయంలోనే నమ్మినబంటు షూటింగ్‌ కారంచేడులో చేశారు. ఆ సినిమాలో రామానాయుడు ఒక చిన్న పాత్ర కూడా చేశారు. ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో సినిమాల్లోకి రమ్మని అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు. అలా సినిమా రంగంవైపు అడుగులు వేశారు రామానాయుడు.  1962లో కొందరు భాగస్వాములతో కలిసి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. అయితే ఆ సినిమాకి పెట్టుబడి పెట్టినా నిర్మాతగా ఆయన పేరు వెయ్యడం కుదరదని చెప్పారు. అయితే షూటింగ్‌కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇన్‌వాల్వ్‌ అవుతానని ఆ దర్శకనిర్మాతలకు చెప్పారు రామానాయుడు. అలా ఆ సినిమాను పూర్తి చేసి 1962 జూన్‌లో రిలీజ్‌ చేశారు. అది మంచి సినిమా అని పేరొచ్చినప్పటికీ డబ్బు రాలేదు. దాంతో అదే సంవత్సరం తన పెద్ద కుమారుడు పేరుతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ఎన్‌.టి.రామారావుతో ‘రాముడు భీముడు’ చిత్రాన్ని తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి డూయల్‌ రోల్‌ సినిమా ఇదే. 1964 మే 21న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. ‘రాముడు భీముడు’ తర్వాత కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. ఆ సినిమా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావుతో ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ, ఆశించినంత విజయం సాధించలేదు. 1970లో జగ్గయ్య హీరోగా ‘ద్రోహి’ చిత్రం చేశారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందించింది. దాంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు రామానాయుడు. అదే సమయంలో ‘ప్రేమనగర్‌’ చిత్రం చేసేందుకు సిద్ధపడ్డారు. ఆరోజుల్లోనే 15 లక్షలతో ఈ చిత్రాన్ని ఎంతో భారీగా నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే సినిమా రంగాన్ని వదిలేసి వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. 1971 సెప్టెంబర్‌ 24న ‘ప్రేమనగర్‌’ రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజ్‌ రోజు నుంచి రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంత వర్షంలోనూ రిలీజ్‌ అయిన అన్ని సెంటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అయింది ‘ప్రేమనగర్‌’. తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.  ఆ మరుసటి సంవత్సరమే శివాజీగణేశన్‌తో ‘వసంత మాళిగై’ పేరుతో ప్రేమనగర్‌ను తమిళ్‌లో రీమేక్‌ చేశారు రామానాయుడు. అక్కడ కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత రాజేష్‌ఖన్నాతో ‘ప్రేమ్‌నగర్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఇలా ప్రేమనగర్‌ సాధించిన విజయంతో నిర్మాతగా స్థిరపడిపోయారు రామానాయుడు. ఆ తర్వాత వరసగా జీవనతరంగాలు, సోగ్గాడు, చక్రవాకం, దేవత, ముందడుగు, మండే గుండెలు, అహనా పెళ్ళంట, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలు, చిన్న హీరోలతో ఒకదాని వెంట ఒకటి సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ వెళ్ళారు. అలాగే హిందీలో కూడా చాలా హిట్‌ సినిమాలు నిర్మించారు. 13 భాషల్లో 150 సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించారు రామానాయుడు.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. రామానాయుడు వివాహం 1958 నవంబర్‌ 13న రాజేశ్వరితో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. పెద్దవాడైన సురేష్‌బాబు చిత్ర నిర్మాణంలో ఉండగా, చిన్నవాడు వెంకటేష్‌ని 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు రామానాయుడు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లోనే వెంకటేష్‌తో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించారు. 1999లో తెలుగు దేశం పార్టీ తరఫున బాపట్ల లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రామానాయుడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అదే స్థానంలో ఓటమి పాలయ్యారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం రామానాయుడికి దాదా సాహెబ్‌ ఫాల్కే, 2012లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. వివిధ భాషల్లో నిర్మించిన సినిమాలకు జాతీయ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు అనేకం అందుకున్నారు రామానాయుడు.  2014 జనవరిలో జరిపిన వైద్య పరీక్షల్లో రామానాయుడుకు ప్రాస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత ఏడాది పాటు ఆ వ్యాధితో బాధపడిన ఆయన 2015 ఫిబ్రవరి 18న 78 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్ర సీమలో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న వారిలో రామానాయుడు ముందు వరసలో ఉంటారు. ఆయన ఎంతో మంది కొత్త నిర్మాతలకు ఆదర్శంగా నిలిచారు. చిత్ర పరిశ్రమలో ఎదగాలి అనే పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని రామానాయుడు సినీ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది.

50 ఏళ్ళు తన గాన మాధుర్యాన్ని పంచిన ఎస్‌.పి.బాలు సినీ ప్రస్థానం ఇదే!

(జూన్‌ 4 ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా..) ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన మాటలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఆయన పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగు ఆయన మాటల్లో, పాటల్లో ధ్వనిస్తుంది. ఒక దశలో ఆయన పాట లేని సినిమా లేదు. ఆయన పాట వినిపించని ఇల్లు లేదు. ఆయన పాట లేని మ్యూజికల్‌ నైట్‌ లేదు. ప్రేమ గీతమైనా, విషాద గీతమైనా, నవ్వులు పూయించే పాటైనా, శాస్త్రీయ సంగీతమైనా ఆయన గళం నుంచి వచ్చింది అంటే శ్రోతలు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్‌, ఏసుదాస్‌ వంటి దిగ్గజ నేపథ్యగాయకులు తెలుగు సినిమా సంగీతాన్ని ఏలుతున్న రోజుల్లో ఓ యువ కెరటంలా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. దేశంలోని 16 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బాలు సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితాన్ని ఎలా ప్రారంభించారు? సింగర్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? 50 సంవత్సరాలకు పైగా సంగీత ప్రియులను అలరించిన ఆయన జీవన ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి హరికథ కళాకారుడు. వారి ఇంట్లో నిత్యం పండితులు, కవులు సాహిత్యపరమైన చర్చలు జరిపేవారు. దాంతో బాలుకి తెలుగు భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథలు చెప్తుండడంతో అతనికి సంగీతంపై మక్కువ ఏర్పడింది. రేడియోలో వచ్చే పాటలు వింటూ వాటినే ప్రాక్టీస్‌ చేసేవారు. పియుసి చదివే రోజుల్లోనే ఒక లలిత గీతాన్ని స్వయంగా రాసి, స్వరపరిచి రేడియోలో పాడారు. ఆ పాటకు బహుమతి లభించింది. ఆ తర్వాత నెల్లూరు వెళ్లి మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. తన కొడుకు ఇంజనీరు కావాలని సాంబమూర్తి కలలు కనేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాస్‌లో ఎ.ఎం.ఐ.ఇ. కోర్సులో చేరారు బాలు. కాలేజీలో చదువుకుంటూనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు.  1964లో మద్రాస్‌లో జరిగిన లలిత సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఘంటసాల, పెండ్యాల, ఎస్‌.పి.కోదండపాణి హాజరయ్యారు. అందులో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ సమయంలోనే బాలుకి సింగర్‌గా అవకాశం ఇస్తానని కోదండపాణి మాట ఇచ్చారు. దాని ప్రకారమే పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పి.బి.శ్రీనివాస్‌, రఘురామయ్య, పి.సుశీలతో కలిసి పాట పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. ‘ఏమి ఈ వింత మోహం..’ అంటూ సాగే పాట ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు బాలు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు బాలు పాడిన పాటను వినిపించి అతనికి అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. అలా తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో తర్వాతి కాలంలో తను నిర్మించిన ఆడియో లాబ్‌కి కోదండపాణి పేరే పెట్టుకున్నారు బాలు. 1968లో విడుదలైన సుఖదు:ఖాలు చిత్రంలో బాలుకి మూడు పాటలు పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. అందులో ‘మేడంటే మేడా కాదు..’ అనే పాట బాలుకి సింగర్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి శోభన్‌బాబు, కృష్ణ, చలం, హరనాథ్‌, చంద్రమోహన్‌ వంటి హీరోలకు వరసగా పాటలు పాడుతూ వచ్చారు బాలు.  అప్పటివరకు తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన ఘంటసాల.. ఆరోగ్య రీత్యా 1965 తర్వాత తనకు తానుగా పాటలు తగ్గించుకున్నారు. ఆ సమయంలో బాలుకి బాగా అవకాశాలు వచ్చాయి. కొన్ని పాటలకు బాలుని ఘంటసాల రికమెండ్‌ కూడా చేసేవారు. 1974లో ఘంటసాల కన్ను మూసిన తర్వాత బాలు నెంబర్‌వన్‌ సింగర్‌ అవుతారని అంతా భావించారు. కానీ, అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం అప్పుడే కొత్తగా వచ్చిన సింగర్‌ రామకృష్ణ. ఘంటసాల గొంతుని పోలి ఉండడంతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు.. తమ సినిమాలో అతనే పాడాలని కండిషన్‌ పెట్టారు. ఆ దశలో బాలుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో అతన్ని ప్రోత్సహించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. సంవత్సరానికి ఐదారు సినిమాలకు తక్కువ కాకుండా చేసే కృష్ణకు అన్ని పాటలూ పాడేవారు బాలు. మరోపక్క రామకృష్ణ పెద్ద హీరోలందరికీ పాటలు పాడుతున్నారు. స్వతహాగా బాలుకి మిమిక్రీ కళ తెలుసు. ఏ హీరో ఎలా మాట్లాడతారు, పాట పాడితే ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన ఉంది. ఆ సమయంలో సంగీత దర్శకుడు చలపతిరావు ఇచ్చిన సలహా బాలుకి బాగా ఉపయోగపడింది. హీరోలకు తగ్గట్టుగా గొంతులో కొంత మార్పు చేసి పాడితే సక్సెస్‌ అవుతావని ఆయన చెప్పారు. అలా ఆలుమగలు చిత్రంలోని ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను..’ అనే పాటను అక్కినేని నాగేశ్వరరావును అనుకరిస్తూ పాడడం అందర్నీ ఆకట్టుకుంది. ఇక అక్కడి నుంచి బాలు కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎన్టీఆర్‌ నుంచి చిన్న హీరోల వరకు అందరూ బాలుతోనే పాటలు పాడించుకోవాలని డిసైడ్‌ అవ్వడంతో అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.  1980లో వచ్చిన ‘శంకరాభరణం’ ఎస్‌.పి.బాలు కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటల్ని బాలుతోనే పాడించాలని కె.వి.మహదేవన్‌ అనుకున్నారు. అయితే శాస్త్రీయ సంగీతం తెలియని బాలు ఆ పాటలు పాడేందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మహదేవన్‌ శిష్యుడు పుహళేంది.. బాలుకి శిక్షణ ఇచ్చి ఆ పాటలు పాడించారు. ఆ పాటలు ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో బాలు తిరుగులేని సింగర్‌ అయిపోయారు. అప్పుడు మొదలు దాదాపు 30 సంవత్సరాలపాటు పెద్దా, చిన్నా హీరోలందరికీ తనే పాడుతూ బిజీ సింగర్‌ అయిపోయారు. ఆయన పాడిన పాటల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే తెలుగు శ్రోతలు, ప్రేక్షకుల మనసుల్లో ఆయన పాడిన పాటలు ఎప్పుడూ మారు మోగుతూనే ఉంటాయి. ఆ పాటలను మళ్ళీ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు.  నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ళ పంట చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. స్వతహాగా మంచి హాస్యప్రియుడైన బాలు.. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్‌ చేసేందుకే ఇష్టపడేవారు. నటుడిగా ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే సినిమా మిథునం. ఈ చిత్రంలోని నటనకుగానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు బాలు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత కొంత సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి దాదాపు 50 సినిమాలకు సంగీతాన్నందించారు. అంతేకాదు, డబ్బింగ్‌ కళాకారుడిగా కూడా రాణించి ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మన్మథలీల చిత్రంలో తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పగా, అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్‌కి బాలు తన వాయిస్‌ని ఇచ్చారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌లతోపాటు ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు బాలు.  ఎస్‌.పి.బాలు అజాత శత్రువు.. ఎవరితోనైనా స్నేహం చేయగల స్నేహశీలి. 50 సంవత్సరాల్లో చిన్న వివాదం కూడా లేని కెరీర్‌ని నడిపారు బాలు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. తోటి సింగర్స్‌.. ఇలా అందరితోనూ స్నేహభావంతోనే మెలిగేవారు. ఎవరికైనా ఆపద వస్తే ముందుకు వచ్చి ఆదుకునేవారు. ఈ లక్షణం అందరికీ నచ్చడం వల్ల అందరికీ బాలు ఎంతో ఇష్టుడయ్యారు. అయితే టాలెంట్‌ ఉండడం వల్లే అది సాధ్యమైంది. ఒకప్పుడు మహ్మద్‌ రఫీని భారతీయ గాయకుడు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన హిందీలోనే కాకుండా కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే.. 16 భాషల్లో పాటలు పాడారు. కొన్ని లిపి లేని భాషల్లో కూడా పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలా మహ్మద్‌ రఫీ తర్వాత భారతీయ గాయకుడుగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పేరును చెప్పుకోవచ్చు. ఇక బాలు అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. భారతదేశంలోని ఏ గాయకుడికీ లభించని గౌరవం బాలుకి దక్కింది. లెక్కకు మించిన అవార్డులు ఆయన్ని వరించాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలతోపాటు ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు అందుకున్నారు.

పరాజయాలతో మొదలై.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన మణిరత్నం!

  సినీ పరిశ్రమకు వచ్చి పేరు తెచ్చుకోవాలనుకున్న ఏ దర్శకుడైనా ఒక విభిన్నమైన సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. ఆ విధంగా తనదైన ముద్ర వెయ్యాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు కథ, కథనాలు, దర్శకత్వం ఎంత విభిన్నంగా ఉన్నప్పటికీ అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. అతను తన సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం అర్థం కాదు. భారతదేశంలో అత్యుత్తమ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం విషయంలో ఇదే జరిగింది. ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా సినిమాలు తియ్యడం ద్వారా ఒక దశలో మణిరత్నం అంటే నిర్మాతలు భయపడేవారు. ఆ స్థితి నుంచి మణిరత్నంలాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకునేంత పెద్ద దర్శకుడుగా మారారు మణిరత్నం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడుగా పేరు తెచ్చుకోవడం వెనుక మణిరత్నం కృషి ఏమిటి? దర్శకుడుగా మొదటి అవకాశాన్ని ఎలా సంపాదించారు? ఆయన సినీ ప్రస్థానం ఎలా కొనసాగింది అనే విషయాలు తెలుసుకుందాం.   1956 జూన్‌ 2న తమిళనాడులోని మధురైలో జన్మించారు మణిరత్నం. ఆయన పూర్తి పేరు గోపాలరత్నం సుబ్రమణ్యం. తండ్రి గోపాలరత్నం వీనస్‌ పిక్చర్స్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. మణిరత్నం మేనమామ కృష్ణమూర్తి వీనస్‌ పిక్చర్స్‌ అధినేత. సినిమా కుటుంబమే అయినప్పటికీ పిల్లలను సినిమాలు చూడనిచ్చేవారు కాదు గోపాలరత్నం. అయినా ఇంట్లో తెలియకుండా సినిమాలు చూసేవారు మణిరత్నం. అప్పట్లో శివాజీగణేశన్‌ నటించిన సినిమాలు, కె.బాలచందర్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. 1977లో ముంబాయిలో ఎంబిఎ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్‌లో మేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెంట్‌గా ఉద్యోగం చేశారు. అయితే మణిరత్నం ఉద్యోగంలో ఇమడలేకపోయారు. ఒక సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌లో కొన్నాళ్ళు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టాలనుకున్నారు. ఆ సమయంలోనే పి.సి.శ్రీరామ్‌ పరిచయమయ్యారు. అప్పటికి అతను సినిమాటోగ్రాఫర్‌ అవ్వలేదు. ఇద్దరూ తరచూ కలుసుకొనేవారు. సినిమాలకు సంబంధించిన చర్చలు చేసేవారు. అప్పుడు సినిమాలు విపరీతంగా చూడడం మొదలుపెట్టారు మణిరత్నం. ముఖ్యంగా భారతీరాజా, కె.బాలచందర్‌, మహేంద్రన్‌ సినిమాలు చూడడం ద్వారా కథ, కథనాల విషయంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. అలా కొన్ని కథలు కూడా రాసుకున్నారు. వాటిలో తనకు బాగా నచ్చిన కథతో ఆ ముగ్గురు దర్శకులను కలిశారు. వారికి మణిరత్నం రాసిన కథ నచ్చలేదు. దాదాపు మూడు సంవత్సరాలపాటు 20 మంది నిర్మాతలకు ఆ కథ వినిపించినా సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.    మణిరత్నం కష్టం చూసిన ఆయన మేనమామ కృష్ణమూర్తి ఓ చిన్న సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా కన్నడలో చెయ్యాలని, తన బడ్జెట్‌ని మించి చేయకూడదని చెప్పారు. అప్పుడు అనిల్‌కపూర్‌, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో ‘పల్లవి అను పల్లవి’ అనే సినిమా చేశారు. 1983లో విడుదలైన ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. అయితే ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా మణిరత్నం కర్ణాటక స్టేట్‌ అవార్డు అందుకున్నారు. తర్వాత మలయాళంలో ‘ఉన్నరూ’ అనే సినిమా చేశారు. అది ఫ్లాప్‌ అయింది. 1985లో ‘పగల్‌ నిలవు’, ‘ఇదయ కోవిల్‌’ అనే తమిళ్‌ సినిమాలు చేశారు. అవి కూడా విజయం సాధించలేదు. పల్లవి అనుపల్లవి సినిమా చేస్తున్న సమయంలోనే దివ్య పేరుతో ఓ కథ రాసుకున్నారు మణిరత్నం. అప్పటికి సక్సెస్‌ అనేది లేకపోవడంతో ఆయనతో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్‌ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తను రాసుకున్న దివ్య కథతోనే సినిమా చెయ్యాలనుకున్నారు. మోహన్‌, రేవతి, కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో ప్రారంభమైన ఈ సినిమాకి ‘మౌనరాగం’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ సినిమాకి పి.సి.శ్రీరామ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. 1986లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి దర్శకుడుగా మణిరత్నంకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 1970లో విడుదలై సూపర్‌హిట్‌ అయిన హిందీ సినిమా ‘పగ్లా కహీ కా’ చిత్రాన్ని కమల్‌హాసన్‌తో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, కమల్‌ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఏదైనా కొత్త కథ చెప్పమని మణిరత్నంని అడిగారు. 1975 నుంచి 1977 వరకు ముంబాయిలో ఎంబిఎ చదువుతున్న రోజుల్లో వరదరాజన్‌ ముదలియార్‌ అక్కడ అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ఉండేవాడు. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తయారు చేసిన కథను కమల్‌కు వినిపించారు మణిరత్నం. అది ఆయనకు బాగా నచ్చింది. 1987లో ‘నాయకన్‌’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించడమే కాకుండా కమల్‌హాసన్‌కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరూ చర్చించుకునే స్థాయికి మణిరత్నం చేరుకున్నారు.   తను చేసే ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉండాలని తపించేవారు మణిరత్నం. దానికి తగ్గట్టుగానే సినిమాలను రూపొందించారు. భారతీయ సినిమాలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ మణిరత్నం శైలి వేరు. ఆయన సినిమాలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు ఎంతో భిన్నంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్‌ అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మణిరత్నం రూపొందించిన సినిమాలన్నీ ఇదే తరహాలో ఉంటాయి. ‘నాయకన్‌’ తర్వాత ప్రభు, కార్తీక్‌ హీరోలు రూపొందించిన ‘అగ్నినక్షత్రం’ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తర్వాత నాగార్జునతో మణిరత్నం చేసిన ‘గీతాంజలి’ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలిచింది. నాగార్జున కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది.    ఆ తర్వాత అంజలి, దళపతి వంటి సినిమాలు మణిరత్నంను ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ఇక ఆయన కెరీర్‌లో మరో మరపురాని సినిమా రోజా. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మణిరత్నం పేరు మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి మణిరత్నంకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడిరది. ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలను ఆదరించారు. అలా దొంగ దొంగ, బాంబే, ఇద్దరు, దిల్‌సే, సఖి, యువ, గురు, రావణ్‌, చెలియా, ఓకే బంగారం వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా 2022లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌1తో తనేమిటో మరోసారి నిరూపించుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 2023లో  విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌2 కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. తాజాగా కమల్‌హాసన్‌తో రూపొందించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 5న విడుదల కాబోతోంది. 38 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత కమల్‌హాసన్‌తో రూపొందించిన ఈ సినిమా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.    జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మణిరత్నం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మణిరత్నం. పద్మశ్రీ అవార్డుతోపాటు నేషనల్‌ అవార్డులు, నంది అవార్డులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అనేకం ఆయన్ని వరించాయి. తాజాగా ప్రకటించిన గద్దర్‌ అవార్డులలో పైడి జైరాజ్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు మణిరత్నంను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1988లో కమల్‌హాసన్‌ సోదరుడు చారు హాసన్‌ కుమార్తె, ప్రముఖ హీరోయిన్‌ సుహాసినిని వివాహం చేసుకున్నారు మణిరత్నం. వీరికి ఒక కుమారుడు నందన్‌. దర్శకుడిగానే కాదు, నిర్మాతగా మద్రాస్‌ టాకీస్‌ బేనర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు మణిరత్నం.   (జూన్‌ 2 దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా..)  

పేరు లేని సంగీత దర్శకుడిగా మొదలై.. మ్యాస్ట్రోగా ఎదిగిన ఇళయరాజా..!

  సంగీతాన్ని ఆస్వాదించనివారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంగీతం అనేది మహా సముద్రం. వేల సంవత్సరాలు గడిచినా ఎప్పటికప్పుడు కొత్త సంగీతం పుడుతూనే ఉంటుంది. అలా ఎంతో మంది సంగీత దర్శకులు తమ మధురమైన సంగీతంతో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ సంగీతం విషయానికి వస్తే.. భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులు ఆయా ప్రాంతాల ప్రజల అభిరుచి మేరకు స్వరాలను సమకూరుస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అలా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లెక్కకు మించిన సంగీత దర్శకులు కొన్ని వేల పాటల్ని ఆవిష్కరించారు. వారిలో 1970వ దశకంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇళయరాజా తన సంగీతంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తన పాటలతో దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ఎవరి సంగీతాన్నీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్న ఇళయరాజా.. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. సంగీత ప్రియుల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిన ఇళయరాజా సినీ ప్రస్థానం గురించి, ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.   1943 జూన్‌ 2న తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురం గ్రామంలో.. రామస్వామి, చిన్న తాయమ్మాల్‌ దంపతులకు మూడో కుమారుడుగా జన్మించారు ఇళయరాజా. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్‌. స్కూల్‌లో చేర్పించే సమయంలో ఆయన పేరును రాజయ్యగా మార్చారు రామస్వామి. చిన్నతనంలో పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీతం రాజయ్యకు బాగా వంటపట్టింది. ఆ తర్వాత సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్‌ మాస్టర్‌ దగ్గర చేరినపుడు ఆయన పేరును రాజాగా మార్చారు. అతని సోదరుడు పావలార్‌ వరదరాజన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీత కారుడుగా ఉండేవారు. రాజా, అతని సోదరుడు గంగైఅమరన్‌ ఆ బృందంలో చేరారు. పావలార్‌ బ్రదర్స్‌గా ఊరూరా తిరుగుతూ ఎన్నో ప్రోగ్రామ్స్‌ చేశారు. ఆ క్రమంలోనే భారతీరాజా, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ బృందానికి పరిచయమయ్యారు. అప్పటికి బాలసుబ్రహ్మణ్యంకి సినిమాల్లో ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు. దాంతో కచ్చేరీలు చేస్తుండేవారు. పావలార్‌ బ్రదర్స్‌కి తన కచ్చేరీల్లో ఆర్కెస్ట్రా చేసే అవకాశం ఇచ్చారు బాలు. ఆ సమయంలోనే తనకు సినిమాల్లో చేరాలనే ఆసక్తి ఉందని బాలుకి చెప్పడంతో రాజాను ప్రముఖ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేర్పించారు.    అలా రాజా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. దాదాపు 200 సినిమాలకు వెంకటేష్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు రాజా. ఆ సమయంలో అతనిలోని టాలెంట్‌ని వెంకటేష్‌ బాగా ఉపయోగించుకున్నారు. ఆయన పేరుతో వచ్చిన చాలా పాటల్ని రాజా ట్యూన్‌ చేసేవారు. సినిమాలో జి.కె.వెంకటేష్‌ పేరే ఉండేది. రాజాలోని టాలెంట్‌ని గుర్తించిన రచయిత పంజు అరుణాచలం తను రచన చేస్తున్న ‘అన్నకిలి’ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇప్పించారు. 1976లో విడుదలైన ఈ సినిమాకి దేవరాజ్‌, మోహన్‌ దర్శకులు. ఆ సమయంలో రాజాను ఇళయ అని పిలిచేవారు అరుణాచలం. ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం. ఆ సినిమా నుంచి రాజా అనే పేరు కాస్తా ఇళయరాజాగా మారింది. తనకు తొలి అవకాశం ఇచ్చిన దేవరాజ్‌, మోహన్‌లకు ఆ తర్వాత వారు చేసిన సినిమాలన్నింటికీ సంగీత దర్శకుడుగా పనిచేశారు ఇళయరాజా. తమిళ్‌లో రూపొందిన భద్రకాళి చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా ద్వారా ఇళయరాజా తెలుగులో పరిచయమయ్యారు. వయసు పిలిచింది, యుగంధర్‌, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక చిత్రాలకు ఇళయరాజా చేసిన అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.    ఆ సమయంలో చక్రవర్తి, కె.వి.మహదేవన్‌, రమేష్‌నాయుడు, సత్యం వంటివారు తెలుగులో బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా ఉన్నారు. వారికి భిన్నమైన శైలిలో పాటలు చేయడం ద్వారా తెలుగులో కూడా బిజీ అయిపోయారు ఇళయరాజా. ఆ తర్వాత ఆయన చేసిన అభిలాష, ఛాలెంజ్‌, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, రుద్రవీణ, అన్వేషణ, లేడీస్‌ టైలర్‌, ఏప్రిల్‌ 1 విడుదల, స్వర్ణకమలం చిత్రాల్లోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. దాంతో తెలుగు, తమిళ్‌లో కూడా నెంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇండియాలో ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకులు ఉన్నప్పటికీ ఇళయరాజాకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇసై జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఆయన్ని ఎవరితోనూ పోల్చలేం. ఒకవిధంగా చెప్పాలంటే.. ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు గతంలో లేరు, ఇకపై రారు కూడా. సినీ సంగీత సామ్రాజ్యంలో ఆయనకు ఆయనే సాటి.   దక్షిణ భారతదేశంలో ఉన్న స్టార్‌ హీరోలందరికీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ అందించిన ఘనత ఇళయరాజాకే దక్కుతుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్‌ రోజు అభిమానులు పెద్ద పెద్ద కటౌట్స్‌ పెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఒక సంగీత దర్శకుడికి హీరోతో సమానంగా కటౌట్‌ పెట్టడం అనేది ఇళయరాజాతోనే మొదలైంది. తమిళ్‌లో రజినీకాంత్‌ నటించిన ఓ సినిమా రిలీజ్‌ రోజున అతని కటౌట్‌ పక్కనే ఇళయరాజా కటౌట్‌ను పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు సంగీత ప్రియులు. ఇక ఇళయరాజా అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 2010లో పద్మభూషణ్‌, 2018లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆరు నేషనల్‌ అవార్డులు, 16 ఫిలింఫేర్‌ అవార్డులు, 6 నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం అందించే అవార్డులతోపాటు కలైమామణి పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇళయరాజా. అలాగే కేరళ స్టేట్‌ అవార్డులు, ఇంకా జాతీయ అంతర్జాతీయ అవార్డులు అనేకం ఆయన్ని వరించాయి. 50 సంవత్సరాల తన కెరీర్‌లో 1,000 సినిమాల్లో 5,000  పాటలు స్వరపరిచారు. 82 సంవత్సరాల వయసులో ఇప్పటికీ అదే ఉత్సాహంతో అందరికీ వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్నారు.   శాస్త్రీయ సంగీతంలోనే కాదు, వెస్ట్రన్‌ మ్యూజిక్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఇళయరాజా.. మరే భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని సింఫోని కాన్సర్ట్‌ని అద్భుతంగా నిర్వహించి ప్రపంచ సంగీత కళాకారుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమా సంగీతమే కాదు, భారతీయ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని మిక్స్‌ చేస్తూ 1986లో ‘హౌ టు నేమ్‌ ఇట్‌’, 1988లో ‘నథింగ్‌ బట్‌ విండ్‌’ అనే ఆల్బమ్స్‌ను రూపొందించి ఆరోజుల్లోనే గొప్ప ప్రయోగం చేశారు. ఈ ఆల్బమ్స్‌ అప్పట్లో విపరీతంగా సేల్‌ అయ్యాయి. 40 సంవత్సరాల క్రితమే దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏకైక భారతీయ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే.. భార్య పేరు జీవా రాజయ్య, కుమారులు యువన్‌ శంకర్‌రాజా, కార్తీక్‌రాజా, కుమార్తె భవతారిణి. యువన్‌ శంకర్‌రాజా, కార్తీక్‌ రాజా సంగీత దర్శకులుగా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. కుమార్తె భవతారిణి తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. గత ఏడాది జనవరిలో 47 ఏళ్ళ వయసులో క్యాన్సర్‌తో కన్నుమూశారు భవతారిణి.   (జూన్‌ 2 ఇసై జ్ఞాని ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా..)  

ఎస్‌.వి.కృష్ణారెడ్డి టాప్‌ డైరెక్టర్‌ ఎలా అయ్యారో తెలిస్తే షాక్‌ అవుతారు!

(జూన్‌ 1 ఎస్‌.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా..) చక్కని కథా బలం ఉన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఈ తరహా సినిమాలు తీసిన దర్శకులు ఎంతో మంది ఉన్నప్పటికీ ఎస్వీ కృష్ణారెడ్డికి మాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. తన సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగులుగానీ, అశ్లీల దృశ్యాలు ఉండకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. 35 సంవత్సరాల కెరీర్‌లో 40కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. 1961 జూన్‌ 1న తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామంలో వెంకటరెడ్డి, సుబ్బాయమ్మ దంపతులకు జన్మించారు సత్తి వెంకట కృష్ణారెడ్డి. వెంకటరెడ్డి వ్యవసాయంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. అందులో స్వీట్స్‌ బిజినెస్‌ ఒకటి. కృష్ణారెడ్డి పాథమిక విద్య అదే గ్రామంలో జరిగినప్పటికీ హైస్కూల్‌కి వచ్చే సమయానికి వీరి కుటుంబం తణుకు దగ్గరలో ఉన్న ఆరవల్లికి మారింది. అక్కడ కృష్ణారెడ్డికి అచ్చిరెడ్డి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత భీమవరంలో ఎం.కాం. పూర్తి చేశారు కృష్ణారెడ్డి. ఆయనకు చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. హీరో కావాలన్నది అతని కల. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలు చూసి వాటి గురించి విశ్లేషించేవారు. హైస్కూల్‌ నుంచి స్నేహితుడైన అచ్చిరెడ్డి అతనిలోని టాలెంట్‌ను గుర్తించాడు. ఎం.కాం పూర్తయిన తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి హైదరాబాద్‌ వచ్చారు. ఇద్దరూ కలిసి కొంతకాలం స్వీట్స్‌ బిజినెస్‌ చేశారు. ఆ సమయంలోనే కృష్ణారెడ్డిని మద్రాస్‌ పంపించి సినిమా ప్రయత్నాలు చేసుకొమ్మని చెప్పారు అచ్చిరెడ్డి. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అందుకే తనే సొంతంగా ‘పగడాల పడవ’ అనే సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా ఒకటి, రెండు చోట్ల మాత్రమే రిలీజ్‌ అయి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘కిరాతకుడు’ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఆయనకు ఉపయోగపడలేదు. దాంతో తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు.  ఆ తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి డబ్బింగ్‌ సినిమాల రైట్స్‌ తీసుకోవడం, వాటిని తెలుగు రిలీజ్‌ చెయ్యడం, కొన్ని సినిమాలను దూరదర్శన్‌కు అమ్మడం వంటి విషయాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు. ఒక పక్క స్వీట్‌ బిజినెస్‌ కూడా బాగానే నడుస్తోంది. ఆ సమయంలోనే కిశోర్‌ రాఠి పరిచయమయ్యారు. ముగ్గురూ కలిసి మనీషా ఫిలింస్‌ సంస్థను ప్రారంభించారు. తొలి సినిమాగా రాజేంద్రప్రసాద్‌తో ‘కొబ్బరిబొండాం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు కృష్ణారెడ్డి. కాటగ్రడ్డ రవితేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌తోనే తన దర్శకత్వంలో తొలి సినిమా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ప్రారంభించారు కృష్ణారెడ్డి. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో దర్శకుడుగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఆ తర్వాత చేసిన ‘మాయలోడు’ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 1994 సంవత్సరం కృష్ణారెడ్డి చేసిన మూడు సినిమాలు ఆయన్ని టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేర్చాయి. అప్పటివరకు హీరో కృష్ణ చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో ‘నెంబర్‌వన్‌’ చిత్రం చేసి మరో సూపర్‌హిట్‌ని అందుకున్నారు కృష్ణారెడ్డి. కామెడీ ఆర్టిస్టుగా పేరు పొందిన అలీ హీరోగా ‘యమలీల’ వంటి బ్లాక్‌బస్టర్‌ని రూపొందించారు. ఆ వెంటనే చేసిన ‘శుభలగ్నం’తో చక్కని కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా ఎస్‌.వి.కృష్ణారెడ్డి పేరు మారుమోగిపోయింది.  ఆ తర్వాతి సంవత్సరం చేసిన టాప్‌ హీరో, వజ్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఘటోత్కచుడు చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో మొదటి సారి రోబోను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, దీర్ఘ సుమంగళీభవ, మనసులోమాట, ప్రేమకు వేళాయెరా, పెళ్లాం ఊరెళితే వంటి పూర్తి కుటుంబ కథా చిత్రాలు రూపొందించారు కృష్ణారెడ్డి. ఆయన కెరీర్‌లో గన్‌షాట్‌, అతడే ఒక సైన్యం వంటి డిఫరెంట్‌ సినిమాలు కూడా చేసి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఆహ్వానం చిత్రం ఆధారంగా ‘డైవర్స్‌ ఇన్విటేషన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని కూడా రూపొందించారు కృష్ణారెడ్డి. 2014లో వచ్చిన యమలీల2 తర్వాత దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2023లో రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విజయం సాధించలేదు. 1990 నుంచి దాదాపు 15 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా తన హవా కొనసాగించారు కృష్ణారెడ్డి. తను టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఉగాది, అభిషేకం వంటి సినిమాలతో హీరో కావాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పూర్తిగా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కారణంగా మళ్ళీ మెగా ఫోన్‌ పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు ఎస్‌.వి.కృష్ణారెడ్డి.

డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ!

  తెలుగు చలనచిత్ర సీమకి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. పాతతరం నుంచి ఇప్పటివరకు మహానటులుగా, ప్రేక్షకుల పాలిట ఆరాధ్యదైవాలుగా, ఎవర్‌గ్రీన్‌ హీరోలుగా వెలుగొందారు. అయితే వారందరిలో సూపర్‌స్టార్‌ కృష్ణకు మాత్రం ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేరు, ఆయనతో ఎవరినీ పోల్చలేరు. ఎందుకంటే సినిమా రంగంలో కృష్ణ సాధించిన విజయాలు, క్రియేట్‌ చేసిన ట్రెండ్స్‌ అలాంటివి. 55 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ సాధించిన విజయాలు అనన్య సామాన్యం. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా చేసిన ప్రయోగాలు, సాహసాల గురించి వింటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక స్థాయికి రావడానికి ఆయన ఎంత కృషి చేశారో అర్థమవుతుంది. సాధారణంగా కొందరు హీరోలను నిర్మాతల హీరో అంటూ ఉంటారు. కానీ, అసలైన నిర్మాతల హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ. అందుకే సినీ పరిశ్రమలో ఎవరికీ లేని ‘దేవుడు’ అనే పేరు ఆయనకు ఉంది. అలాంటి కృష్ణ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తీరు గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.    కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ఆయన పెద్ద కొడుకు. హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సోదరులు. వారిది రైతు కుటుంబం. కృష్ణను ఇంజనీరుగా చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. అందుకే ఇంటర్‌లో ఎం.పి.సి. గ్రూప్‌ కోసం కొన్ని కాలేజీల్లో ప్రయత్నించి చివరికి ఏలూరులోని సి.ఆర్‌.రెడ్డి కాలేజీలో చేరారు. అక్కడే బి.ఎస్‌.సి. పూర్తి చేశారు. ప్రముఖ నటుడు మురళీమోహన్‌ ఆయనకు క్లాస్‌మేట్‌. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఓసారి ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. వేలసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అక్కినేనికి ఉన్న ఫాలోయింగ్‌ చూసిన కృష్ణ.. ఆయన సినిమా స్టార్‌ కావడం వల్లే అంత పాపులారిటీ వచ్చిందని గ్రహించారు. తను కూడా ఎందుకు హీరో అవ్వకూడదు అనుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తనకు సినిమా రంగానికి వెళ్ళాలని ఉంది అని తండ్రితో చెప్పారు కృష్ణ. ఆయన కూడా దానికి అంగీకరించి సినిమా రంగంలో తనకు తెలిసిన ఇద్దరిని కలవమని చెప్పి రెండు ఉత్తరాలు రాసిచ్చారు. ఆ క్రమంలోనే ఎల్‌.వి.ప్రసాద్‌, చక్రపాణిలను కలిశారు. అయితే వయసులో చిన్నవాడు కావడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత అయితే హీరోగా బాగుంటావని వారు చెప్పారు. అలాగే నాటకాలు వేస్తే నటనపై మంచి అవగాహన వస్తుందని సలహా ఇచ్చారు. ఆ తర్వాత తెనాలి నుంచి సినిమా రంగానికి వచ్చిన జగ్గయ్య, గుమ్మడిలను కలిశారు. వాళ్ళు కూడా అదే చెప్పడంతో గరికపాటి రాజారావు, మరికొంతమంది వేసిన నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి నటనలోని మెళకువలు తెలుసుకున్నారు.    తన దగ్గరికి వేషం కోసం వచ్చిన కృష్ణను గుర్తుపెట్టుకున్న ఎల్‌.వి.ప్రసాద్‌.. తను తీస్తున్న కొడుకులు కోడళ్లు చిత్రంలో ఒక పాత్రకు ఎంపిక చేశామని కబురు చేశారు. నలుగురు కొడుకుల్లో ఒక కొడుకుగా కృష్ణను, మరో కొడుకుగా శోభన్‌బాబును ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు కృష్ణ. ఆ క్రమంలోనే పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అదే సమయంలో కాదలిక్క నేరమిల్లై అనే తమిళ చిత్రంలో కృష్ణను హీరోగా ఎంపిక చేశారు దర్శకుడు సి.వి.శ్రీధర్‌. ఆ సినిమా కోసం కృష్ణను తమిళ్‌ నేర్చుకోమని చెప్పారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆయనకు తమిళ్‌ రాలేదు. అలా ఆ అవకాశాన్ని కోల్పోవడంతో తిరిగి బుర్రిపాలెం వెళ్లిపోయారు కృష్ణ.    1964లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందిస్తున్న తేనెమనసులు కోసం కొత్త నటీనటులు కావాలని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసి తన వివరాలతోపాటు ఫోటోలు పంపారు కృష్ణ. ఆడిషన్‌కి మద్రాస్‌ రావాల్సిందిగా కృష్ణకు పిలుపు వచ్చింది. ఆ ఆడిషన్‌కు కృష్ణంరాజు, జయలలిత, హేమమాలిని కూడా వచ్చారు. కానీ, కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. మరో హీరోగా రామ్మోహన్‌, హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్యలను ఎంపిక చేశారు. సినిమాను ప్రారంభించి ఒక షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఆ సమయంలో కొత్తగా వచ్చిన కలర్‌ ఫిల్మ్‌పై దర్శకనిర్మాతలు మక్కువ చూపేవారు. అందరూ కొత్త నటీనటులు కావడం, బడ్జెట్‌ కూడా తక్కువ అవడం వల్ల సినిమాను కలర్‌లోనే తియ్యాలని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత సుందరం అనుకున్నారు. అప్పటివరకు తీసిన దాన్ని పక్కన పెట్టేసి కలర్‌లో మళ్ళీ మొదలుపెట్టారు. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసి 1965 మార్చి 31న తేనెమనసులు చిత్రాన్ని విడుదల చేశారు. అందరూ కొత్తవారైనా సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే తమ బేనర్‌లో మరో సినిమా చేసే విధంగా కృష్ణతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు నిర్మాతలు. దాని ప్రకారమే కన్నెమనసులు సినిమాలోనూ నటించారు కృష్ణ. 1966లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తేనెమనసులు సినిమాలో  కృష్ణతో కలిసి నటించిన రామ్మోహన్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని అందరూ భావించారు. కానీ, కృష్ణ హీరోగా నిలదొక్కుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.      కన్నెమనసులు రిలీజ్‌ అయిన సంవత్సరమే కృష్ణ కెరీర్‌ మలుపు తిరిగింది. 1962లో హాలీవుడ్‌లో మొదటి జేమ్స్‌బాండ్‌ సినిమా డాక్టర్‌ నో రిలీజ్‌ అయింది. అది ఇండియాలో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తెలుగులో జేమ్స్‌బాండ్‌ సినిమా చెయ్యాలని భావించారు నిర్మాత డూండీ. ఆ క్యారెక్టర్‌కి కృష్ణ అయితే కరెక్ట్‌గా సూట్‌ అవుతాడనుకున్నారు. అలా అనుకోవడానికి కారణం.. తేనెమనసులు చిత్రంలోని ఓ కార్‌ ఛేజ్‌లో స్కూటర్‌ పై నుంచి కారులోకి జంప్‌ చేసే సీన్‌లో కృష్ణ డూప్‌ లేకుండా నటించారు. అది చూసిన డూండీ అలా ఫిక్స్‌ అయ్యారు. 1966 ఆగస్ట్‌ 11న ‘గూఢచారి 116’ విడుదలై ఘనవిజయం సాధించింది. కృష్ణపై డూండీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అప్పటివరకు తెలుగులో రాని ఓ కొత్త జోనర్‌లో రూపొందిన ‘గూఢచారి 116’ సూపర్‌హిట్‌ అవ్వడంతో వెంటనే 20 సినిమాల్లో హీరోగా బుక్‌ అయిపోయారు కృష్ణ. ఆ ఒక్క సినిమాతో అవకాశాలు కృష్ణను వెతుక్కుంటూ వచ్చాయి. గూఢచారి 116 తర్వాత 20 సంవత్సరాల వ్యవధిలో మరో 6 జేమ్స్‌బాండ్‌ తరహా సినిమాలు చేశారు. అవన్నీ విజయం సాధించాయి. 1967లో కృష్ణ నటించిన ఏడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో సాక్షి, మరపురాని కథ, అవేకళ్ళు వంటి మంచి సినిమాలు ఉన్నాయి.    ఆ తర్వాత.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తీరిక లేని హీరో అయిపోయారు కృష్ణ. ఏ నిర్మాతకు ఏ సినిమా చేస్తున్నారో కూడా అర్థం కాని విధంగా షూటింగ్‌లో పాల్గొనేవారు. రోజుకి మూడు షిప్టుల చొప్పున విరామం లేకుండా పనిచేసేవారు. ఆయన నిద్రపోతున్న సమయంలో తమ సినిమాలో నిద్రపోతున్న సీన్స్‌ను తీసుకున్న దర్శకులు కూడా ఉన్నారు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో 16 సినిమాలు, 1970లో 15 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు.. ఇలా ప్రతి సంవత్సరం పదికి తక్కువ కాకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ప్రతి నెలా కృష్ణ హీరోగా నటించిన సినిమా రిలీజ్‌ అయ్యేది. ఒకే నెలలో రెండు, మూడు సినిమాలు రిలీజ్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నాను అని బాధపడేవారు కృష్ణ. దీంతో పద్మాలయా పిక్చర్స్‌ పేరుతో తనే ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి సినిమాగా అగ్నిపరీక్ష నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ప్రొడక్షన్‌కి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నారు. ఆ సినిమా విజయం సాధించలేదు. దాంతో 1971లో అప్పటివరకు తెలుగులోనే కాదు, ఇండియాలోనే రాని ఓ కొత్త తరహా సినిమాకి శ్రీకారం చుట్టారు కృష్ణ. అదే మోసగాళ్లకు మోసగాడు. ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి కౌబాయ్‌ మూవీ ఇది. రూ.7 లక్షల బడ్జెట్‌తో దేశంలోని వివిధ లొకేషన్స్‌లో ఎంతో శ్రమకోర్చి నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ రిలీజ్‌ కంటే సెకండ్‌ రిలీజ్‌, థర్డ్‌ రిలీజ్‌లలో ఎక్కువ కలెక్ట్‌ చేసింది. ఈ సినిమాను ట్రెజర్‌ హంట్‌ పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఇండియాలోనే తొలిసారి ఇంగ్లీష్‌లోకి అనువదించిన చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు రికార్డు క్రియేట్‌ చేసింది. 123 దేశాల్లో ట్రెజర్‌ హంట్‌ విడుదలై ఘనవిజయం సాధించింది. మోసగాళ్ళకు మోసగాడు చిత్రంతో కృష్ణకు స్టార్‌ హీరో ఇమేజ్‌ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాకరరెడ్డితో కలిసి నిర్మించిన పండంటి కాపురంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు కృష్ణ. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు.      1974 సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇదే సంవత్సరం తెలుగు చలనచిత్ర సీమ ప్రతిష్టను పెంచే విధంగా పద్మాలయా పిక్చర్స్‌ బేనర్‌లో అల్లూరి సీతారామరాజు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కృష్ణ. అంతకు కొన్ని సంవత్సరాల ముందు ఎన్‌.టి.రామారావు.. సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్నారు. స్క్రిప్ట్‌ కూడా తయారు చేయించారు. కానీ, అది ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబులతో కూడా అల్లూరి జీవిత చరిత్రను సినిమాగా తియ్యాలని విఫల యత్నం చేశారు. చివరికి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేందుకు కృష్ణ సిద్ధపడ్డారు. అల్లూరి సీతారామరాజు.. కృష్ణకు 100వ సినిమా. తెలుగులో తొలి సినిమా స్కోప్‌ సినిమా కూడా ఇదే. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. 30 శాతం షూటింగ్‌ పూర్తయిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు మరణించారు. స్నేహితుల సలహాతో మిగిలిన భాగాన్ని తన దర్శకత్వంలోనే పూర్తి చేశారు కృష్ణ. సినిమాలోని పోరాట సన్నివేశాలను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ తెరకెక్కించారు. అయితే దర్శకుడుగా వి.రామచంద్రరావు పేరునే వేశారు. ప్రివ్యూ చూసిన నిర్మాత చక్రపాణి ‘ఈ సినిమా తర్వాత నువ్వు చేసిన 10 సినిమాలు ఫ్లాప్‌ అవుతాయి. సీతారామరాజుగా నిన్ను చూసిన ప్రేక్షకులు మరో పాత్రలో ఊహించుకోలేరు’ అని చెప్పారు. 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు అఖండ విజయాన్ని దక్కించుకుంది. చక్రపాణి చెప్పినట్టుగానే ఆ తర్వాత కృష్ణ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. వాటిలో కృష్ణ ఎంతో సాహసోపేతంగా రీమేక్‌ చేసిన దేవదాసు కూడా ఉంది.    ఒక్కసారిగా సినిమా అవకాశాలు తగ్గి, ఆయన కెరీర్‌ స్తబ్దుగా మారిపోయింది. ఆ సమయంలోనే ధైర్యం తెచ్చుకొని పాడిపంటలు చిత్రాన్ని సొంత బేనర్‌లో నిర్మించారు. పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో కృష్ణ కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది. ఆ తర్వాత భలే దొంగలు, దేవుడే గెలిచాడు, అన్నదమ్ముల సవాల్‌, కొత్తపేట రౌడీ, ఊరికి మొనగాడు, ఘరానా దొంగ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు. మూడు దశాబ్దాల కాలంలో సగటున సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు కృష్ణ. 1989 వరకు సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌ ఉజ్వలంగా సాగింది. అప్పటివరకు 274 సినిమాలు పూర్తి కాగా, మరో పది సంవత్సరాల్లో కేవలం 44 సినిమాలు మాత్రమే చేయగలిగారు. హీరోగా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించారు.    1986లో సింహాసనం చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. తెలుగులో 70ఎంఎం స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌తో రూపొందిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత శంఖారావం, నా పిలుపే ప్రభంజనం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు.. ఇలా 16 సినిమాలకు దర్శకత్వం వహించారు కృష్ణ. స్వతహాగా కాంగ్రెస్‌ అభిమాని అయిన కృష్ణ.. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరి 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్యకు గురి కావడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు కృష్ణ.    సూపర్‌స్టార్‌ కృష్ణకు 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. అలాగే ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేసింది. అలాగే ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డును కూడా కృష్ణ అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలోని అద్భుత నటనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడుగా నంది అవార్డును అందించింది. 55 సంవత్సరాల కెరీర్‌లో 360 సినిమాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ.   ఇక సూపర్‌స్టార్‌ కెరీర్‌లోని ప్రత్యేకమైన విశిష్టతల గురించి చెప్పాలంటే.. కృష్ణ నటించిన తేనెమనసులు తెలుగులో నిర్మించిన తొలి కలర్‌ సాంఘిక చిత్రం. గూఢచారి 116 తెలుగులో తొలి జేమ్స్‌బాండ్‌ మూవీ. మోసగాళ్ళకు మోసగాడు ఇండియాలోనే తొలి కౌబాయ్‌ మూవీ. కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు తెలుగులో తొలి సినిమా స్కోప్‌ మూవీ. కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సింహాసనం తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా. స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ కూడా ఈ సినిమాతోనే ప్రారంభమైంది. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేని విధంగా కృష్ణకు 2,500 అభిమాన సంఘాలు ఉండేవి. మద్రాస్‌లో జరిగిన సింహాసనం 100 రోజుల ఫంక్షన్‌కు వివిధ ప్రాంతాల నుంచి 400 బస్సుల్లో 30,000 మంది అభిమానులు హాజరయ్యారు.   వ్యక్తిగత విషయాలకు వస్తే.. కృష్ణ తొలి సినిమా తేనెమనసులు రిలీజ్‌ అయ్యే సమయానికే ఇందిరతో వివాహం జరిగింది. ఆ తర్వాత 1969లో ఆమె అనుమతితోనే నటి విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. కృష్ణ నటవారసుడుగా తండ్రి పేరును నిలబెడుతున్నారు మహేష్‌. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. 1987లో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబును హీరోగా పరిచయం చేశారు. అయితే ఆయన హీరోగా సక్సెస్‌ అవ్వలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు కూడా హీరోగా రాణిస్తున్నారు. విజయనిర్మల మరణం తర్వాత మానసికంగా కృంగిపోయిన కృష్ణ కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. 2022 నవంబరు 15న కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల్లో రెండవ భార్య విజయనిర్మల (2019), పెద్ద కుమారుడు రమేష్‌బాబు (2022), మొదటి భార్య ఇందిరాదేవి (2022) మరణాలు చూడవలసి వచ్చింది.   (మే 31 సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా..)  

తరతరాలకు తరగని వెలుగు.. యుగపురుషుడు ఎన్.టి.ఆర్!

(మే 28 నటరత్న ఎన్‌.టి.రామారావు జయంతి సందర్భంగా..) ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులౌతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు..’ అంటూ వేటూరి రాసిన పాట.. తెలుగుతెర ఇలవేల్పు నందమూరి తారక రామారావుకు సరిగ్గా సరిపోతుంది. ఆయన సినీ ప్రస్థానం అంతా ఆ పాట పల్లవిలోనే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉంటారు. వివిధ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. కానీ, ప్రేక్షకులు దైవంగా భావించే మహానటుడు ఎన్‌.టి.రామారావు ఒక్కరే. రాముడు, కృష్ణుడు, శివుడు అంటే మనకు ఆ మహానుభావుడి రూపమే స్ఫురిస్తుంది. ‘నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా నీ రూపమే నాకు కృష్ణుడిగా కనిపిస్తుంది’ అని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పారంటే.. నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు. వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. అయితే అందులో కొందరు కారణజన్ములుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు వారిని దైవంగా కొలిచారు. తమ గుండెల్లో పవిత్రమైన స్థానాన్ని ఇచ్చారు. అలాంటి అతి కొద్దిమంది మహానుభావుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఒకరు. తను చేసిన సినిమాల ద్వారా మన పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అనిపించేంతగా ప్రేక్షకుల్ని మైమరపించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి తిరుగులేని కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్‌.టి.ఆర్‌. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడ కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అలాంటి మహానుభావుడి జీవితం ఎంతో మందికి ఆదర్శం. అసలు ఎన్‌.టి.ఆర్‌. నేపథ్యం ఏమిటి? ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయంగా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎలాంటి కృషి చేశారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1923, మే 28 సాయంత్రం 4:32కి కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్యచౌదరి, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు నందమూరి తారక రామారావు. పాఠశాల విద్యను విజయవాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాలలో చేరారు. ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. కళాశాల వార్షికోత్సవంలో ‘రాచమల్లుని దౌత్యం’ అనే నాటకం ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులోని నాగమ్మ పాత్ర వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాలేజీలోనే మంచి అందగాడుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ను ఆ వేషం వెయ్యమన్నారు విశ్వనాథ సత్యనారాయణ. ఇష్టం లేకపోయినా ఆ పాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మేకప్‌ మేన్‌ మీసాలు తీసెయ్యాలన్నారు. కానీ, దానికి ఎన్టీఆర్‌ ససేమిరా ఒప్పుకోలేదు. అలా మీసాలతోనే ఆడవేషం వేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను అందరూ మీసాల నాగమ్మా అని పిలిచేవారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్‌. పెళ్లి తర్వాత చదువును అశ్రద్ధ చేయడం వల్ల పరీక్షల్లో రెండు సార్లు తప్పారు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో చేరారు. అక్కడ కూడా నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం వంటి వారితో కలిసి నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్‌ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనికి బహుమతి కూడా వచ్చింది. ఎన్టీఆర్‌ చదువుకునే రోజుల్లోనే కొన్ని కారణాల వల్ల వారి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. యువకుడిగా ఉన్న ఎన్టీఆర్‌ జీవనం కోసం చాలా పనులు చేసేవారు. కొన్నిరోజులు పాల వ్యాపారం చేశారు, ఆ తర్వాత కిరాణా షాపు పెట్టారు. ఆ తర్వాత ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ను కూడా నడిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పు చేసేవారు కాదు. 1947లో ఎన్టీఆర్‌ పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్‌-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. ఎన్టీఆర్‌కు సినిమాలపై ఆసక్తి లేదుగానీ నాటకాలు మాత్రం ఎక్కువగా వేసేవారు. అలా ఓసారి విజయవాడలో ‘చేసిన పాపం’ అనే నాటకం వేశారు. అందులో ఎన్టీఆర్‌ నటన చూసిన ఎల్‌.వి.ప్రసాద్‌ గుంటూరులో ఫోటో షూట్‌ చేయించారు. ఆ తర్వాత మద్రాస్‌లో స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలో వేషం లేదని, సరిపోయే వేషం ఉన్నప్పుడు కబురు చేస్తానని చెప్పారు ఎల్‌.వి.ప్రసాద్‌. అలా తిరిగి మంగళగిరి వచ్చేశారు ఎన్టీఆర్‌. కొన్నాళ్ళకు తను ‘మనదేశం’ అనే సినిమా చేస్తున్నానని, మద్రాస్‌ వస్తే చిన్న వేషం ఇస్తానని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరానికి ఎన్టీఆర్‌ బదులు ఇవ్వలేదు.  ఆ సమయంలో నిర్మాత బి.ఎ.సుబ్బారావు.. ఎల్‌.వి.ప్రసాద్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఫోటో చూసి తను నిర్మిస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తాను, పిలిపించమన్నారు. ఇదే విషయాన్ని మరో ఉత్తరం ద్వారా ఎన్టీఆర్‌కు తెలిపారు ఎల్‌.వి.ప్రసాద్‌. మద్రాస్‌ వెళ్ళిన తర్వాత ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను హీరోగా ఎంపిక చేశారు. రూ.1116 అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఆ సినిమాలో ఎఎన్నార్‌ కూడా నటించారు. ఎన్టీఆర్‌కి కెమెరా అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో మనదేశం చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు ఎల్‌.వి.ప్రసాద్‌. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల షూటింగ్‌ ప్రారంభించారు. అదే సమయంలో షావుకారులో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లో షావుకారు మొదట రిలీజ్‌ అయింది. ఆ తర్వాత మాయా రంభ, సంసారం చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్‌. ఇక ఆయన్ని తిరుగులేని మాస్‌ హీరోగా నిలబెట్టిన సినిమా పాతాళభైరవి. మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు. మాంత్రికుడి పాతకు ముక్కామలను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఎన్టీఆర్‌ను హీరోగా, మాంత్రికుడిగా ఎస్‌.వి.రంగారావును ఎంపిక చేశారు. 1951లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ను స్టార్‌ హీరోని చేసింది. ఈ చిత్రాన్ని 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. ఆ తర్వాత రిపీట్‌ రన్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. పాతాళభైరవి చిత్రాన్ని విజయా సంస్థ నిర్మించింది. అప్పుడు ఆ సంస్థలో నెల జీతానికి ఎన్టీఆర్‌ సినిమాలు చేసేవారు. నెలకు రూ.500, ఒక సినిమా పారితోషికం రూ.5000. అలా మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు చేశారు. ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టాయి. ఆ తర్వాత వద్దంటే డబ్బు, రాజుపేద, అగ్గిరాముడు, మిస్సమ్మ, కన్యాశుల్కం వంటి సినిమాల్లో ఎన్టీఆర్‌ ప్రదర్శించిన నటనకు అందరూ ముగ్దులయ్యారు. 1957లో వచ్చిన మాయాబజార్‌లో ఎన్టీఆర్‌ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రతో నీరాజనాలు అందుకున్నారు. ఆ తర్వాత భూకైలాస్‌లోని రావణబ్రహ్మ పాత్రకు జీవం పోశారు ఎన్టీఆర్‌. అలాగే శ్రీవేంకటేశ్వర మహత్మ్యం చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా, సీతారామకళ్యాణం చిత్రంలో మరోసారి రావణ పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ క్రమంలోనే శ్రీకృష్ణార్జునయుద్ధం, కర్ణ, లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం, దక్షయజ్ఞం, నర్తనశాల, దానవీరశూర కర్ణ వంటి పురాణ ఇతిహాసాలలో తను పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల పాలిట దైవంగా కీర్తించబడ్డారు ఎన్టీఆర్‌.  పౌరాణిక పాత్రల్లోనే కాదు, జానపద చిత్రాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఎన్టీఆర్‌. జయసింహ, జయం మనదే, కంచుకోట, బందిపోటు, గులేబకావళి కథ, మంగమ్మ శపథం, జగదేకవీరుని కథ, మర్మయోగి, అగ్గిపిడుగు వంటి ఎన్నో జానపద చిత్రాల్లో సైతం తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ఎన్టీఆర్‌. పౌరాణిక, జానపద చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాంఘిక చిత్రాల్లో అప్పుచేసి పప్పుకూడు, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, గుండమ్మ కథ, గుడిగంటలు, రక్తసంబంధం, రాముడు భీముడు వంటి సినిమాల్లో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచారు. 1970వ దశకంలో దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల, వేటగాడు, డ్రైవర్‌ రాముడు వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో కమర్షియల్‌గా పెద్ద విజయాలు అందుకున్నారు ఎన్టీఆర్‌. 1980 దశకంలో సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, నాదేశం వంటి బ్లాక్‌ బస్టర్స్‌తో ఎన్టీఆర్‌ కెరీర్‌ పీక్స్‌కి వెళ్లిపోయింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలైన బొబ్బిలియుద్ధం, సామ్రాట్‌ అశోక, శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీనాథ కవిసార్వభౌముడు, చాణక్య చంద్రగుప్త, అక్బర్‌ సలీమ్‌ అనార్కలి వంటి సినిమాల్లోని చారిత్రాత్మక పాత్రల్లోనూ తన ముద్ర వేశారు ఎన్టీఆర్‌. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడైన ఎన్‌.టి.రామారావు తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ’ స్వీకరించారు.  నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎన్టీఆర్‌ను క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో ఆయనకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌ అంటే.. ఆ సమయానికి మేకప్‌తో సహా సెట్‌లో ఉండడం మొదటి నుంచీ అలవాటు చేసుకున్నారు. చివరి వరకు దాన్నే అనుసరించారు. శరీర దారుఢ్యం కోసం ప్రతిరోజూ కఠోరమైన వ్యాయామాలు, తన స్వరాన్ని కాపాడుకునేందుకు ఉదయమే మద్రాస్‌లోని మెరీనా బీచ్‌కి వెళ్లి అభ్యాసం చేసేవారు. నర్తనశాల చిత్రంలో ఎన్టీఆర్‌ పోషించిన బృహన్నల పాత్ర కోసం అవసరమైన కూచిపూడి నృత్యాన్ని వెంపటి చినసత్యం దగ్గర నేర్చుకున్నారు. వృతి పట్ల, తను చేసే పాత్రల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అలాంటిది. ఆయన ఏకసంథాగ్రహి. ఎన్ని పేజీల డైలాగులు ఇచ్చినా కంఠతా పట్టేసేవారు. షాట్‌లో ఎక్కడా తడబడకుండా నటిస్తూ పొల్లుపోకుండా డైలాగులు చెప్పేవారు.  1978లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రతిష్టపాలైంది. 1981లో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగ్‌ విరామ సమయంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. వారికి ఏదో ఒకటి చెయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. అందులో భాగంగానే ఈ ఏడాది నా పుట్టినరోజు తర్వాత నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను’ అని చెప్పారు. భవిష్యత్తులో ఎన్టీఆర్‌ చేయబోయే రాజకీయ ప్రయాణానికి అక్కడే బీజం పడ్డట్టు అయింది. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడంతో అప్పటివరకు కమిట్‌ అయిన సినిమాలను వేగంగా పూర్తి చేశారు. తమ అభిమాన కథానాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త తెలుసుకున్న అభిమానులు 1982 మార్చి 21న హైదరాబాద్‌ వచ్చినపుడు ఆయనకు ఎర్ర తివాచీతో ఘన స్వాగతం పలికారు. 1982 మార్చి 29 మధ్యాహ్నం గం2:30లకు తను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు, తన స్థాపించబోయే పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు ఎన్టీఆర్‌. పార్టీ ప్రచారం కోసం తన పాత చెవర్లెట్‌ వ్యానుకు మరమ్మతులు చేయించి దాన్ని కదిలే వేదికగా మార్పించారు. ఆ వ్యానుపై నుంచే ప్రజల నుద్దేశించి ప్రసంగించేవారు. ఆ వాహనం పేరు చైతన్యరథం. దానిపై తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా! అనే నినాదం రాయించారు. చైతన్యరథంపై ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలకు తన ప్రచారాన్ని నిర్వహించారు ఎన్టీఆర్‌. ఒక శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజలను ఎంతో ప్రభావితం చేసారు. ఎన్టీఆర్‌ ప్రసంగాలు ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. కాంగ్రెసు పార్టీ వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢల్లీిలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌ విధానాల పట్ల అప్పటికే విసుగెత్తిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.  1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్‌ 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలోనే జరిగిన కొన్ని పరిణామాలతో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లారు ఎన్టీఆర్‌. కేవలం నెలరోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 1994లో ఎన్టీఆర్‌ తిరిగి అధికారంలోకి వచ్చారు. పార్టీని ప్రకటించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, అప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి తెరదించడం అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడు దఫాలు, 7 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్‌.టి.రామారావు. అప్పటివరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం, పటేల్‌ పట్వారి వ్యవస్థల రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.  ఎన్‌.టి.రామారావు వ్యక్తిగత విషయాలకు వస్తే.. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్‌ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. కుమారుల్లో హరికృష్ణ తండ్రి రాజకీయ జీవితంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. ఇక నందమూరి తారక రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర సీమలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 110 సినిమాలు.. దర్శకేంద్రుడు సాధించిన విజయాలివే!

(మే 23 దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా..) చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విజన్‌ వేరు, ఆయన చేసే సినిమాల తీరు తెన్నులు వేరు. కథ, కథనాల దగ్గర నుంచి పాటల చిత్రీకరణ వరకు ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చూపించడం ఆయన మొదటి సినిమా నుంచీ అలవరుచుకున్నారు. 1975లో బాబు చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 110 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్‌.టి.రామారావు వంటి లెజండరీ హీరో నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఒక దశలో ఎన్‌.టి.ఆర్‌. ఇమేజ్‌ పీక్స్‌కి వెళ్లిపోవడంలో ప్రధాన పాత్ర పోషించారు రాఘవేంద్రరావు. అప్పటి టాప్‌ హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలకు బ్లాక్‌ బస్టర్స్‌ అందించారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు రూపొందించారు. అంతేకాదు, వెంకటేష్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి హీరోలను పరిచయం చేసి వారికి శుభారంభాన్నిచ్చారు. కమర్షియల్‌ చిత్రాల్లోనే కాదు, భక్తి చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చూపించారు. మనం మాట్లాడడం కాదు, మనం చేసిన సినిమా మాట్లాడాలి అని బలంగా నమ్మే దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1942 మే 23న కె.ఎస్‌.ప్రకాశరావు, కోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జన్మించారు రాఘవేంద్రరావు. అయితే ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా మద్రాస్‌లోనే జరిగింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకుడు అవ్వక ముందు హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1950లో మొదటి రాత్రి చిత్రంతో దర్శకుడిగా మారారు. రాఘవేంద్రరావుపై తండ్రి ప్రభావం బాగా ఉండేది. సినిమాలపై ఆసక్తి, దర్శకుడు కావాలన్న కోరిక ఆయనకు చిన్నతనంలోనే కలిగాయి. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరమని రాఘవేంద్రరావుకు చెప్పారు ప్రకాశరావు. అయితే తను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని చెప్పారు. అలా బి.ఎ. పూర్తయిన తర్వాత దర్శకత్వ శాఖలో చేరారు. పాండవ వనవాసం చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరి మొదటి క్లాప్‌ ఎన్‌.టి.రామారావుపై కొట్టారు. ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. అలా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అలాగే ఎన్టీఆర్‌ చివరి సినిమా మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి ప్రకాశరావు దగ్గర దాదాపు 10 ఏళ్లు దర్శకత్వ శాఖలో పనిచేశారు రాఘవేంద్రరావు.  1975లో నిర్మాత అడుసుమిల్లి లక్ష్మీకుమార్‌ నిర్మించిన ‘బాబు’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు రాఘవేంద్రరావు. ఈ సినిమాకి ఓపెనింగ్స్‌ బాగానే వచ్చినా రెండు వారాల గ్యాప్‌లో ‘జీవనజ్యోతి’ చిత్రం విడుదల కావడంతో అది పెద్ద హిట్‌ అయింది. ‘బాబు’ ఏవరేజ్‌ మూవీ అయింది. ఆ తర్వాత మమతల కోవెల అనే నవల ఆధారంగా ‘జ్యోతి’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడుగా ఆయనకు పేరు తెచ్చింది. సత్యచిత్ర సంస్థ అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ.. ప్రకాశరావు దర్శకత్వంలో ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో అతనిలోని టాలెంట్‌ గుర్తించారు ఆ నిర్మాతలు. ‘జ్యోతి’ సినిమా జరుగుతున్న సమయంలోనే ఒక భారీ చిత్రం చేసే అవకాశం ఇచ్చారు సత్యనారాయణ, సూర్యనారాయణ. అదే ‘అడవిరాముడు’. అలా ఎన్టీఆర్‌ను తొలిసారి డైరెక్ట్‌ చేసే అవకాశం రాఘవేంద్రరావుకు లభించింది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించాలని నిర్ణయించుకున్నారు. లుక్‌ పరంగా, కాస్ట్యూమ్‌ పరంగా అంతకుముందు ప్రేక్షకులు చూడని ఓ కొత్త ఎన్టీఆర్‌ను ఆవిష్కరించారు రాఘవేంద్రరావు. అడవిరాముడు చిత్రం 1977 ఏప్రిల్‌ 28న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మొదలు దాదాపు 5 సంవత్సరాలపాటు ఎన్టీఆర్‌ కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. డ్రైవర్‌ రాముడు,  కేడీ నెం.1, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్‌చౌదరి వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు ఎన్టీఆర్‌. ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఎన్టీఆర్‌కు ఆ సమయంలో అంతటి క్రేజ్‌ రావడానికి ముఖ్య కారకుడు రాఘవేంద్రరావు అనే చెప్పాలి. ఇక కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు కూడా బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సూపర్‌హిట్స్‌ చేశారు. ముఖ్యంగా చిరంజీవితో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. పాటల చిత్రీకరణలో అంతకుముందు ఏ దర్శకుడూ చేయని ప్రయోగాలు రాఘవేంద్రరావు చేశారు. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ కూడా అంతే ముఖ్యమని నమ్మి పాటల చిత్రీకరణలో పూలు, పండ్లు, నగలు వాడుతూ వారిని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే 40 సినిమాల తర్వాతే తనకు ఆ ఆలోచన వచ్చిందని రాఘవేంద్రరావు చెబుతారు. ఆ తర్వాత చాలా మంది దర్శకులు పాటల విషయంలో ఆయన్ని అనుసరించారు. తెలుగులోనే కాదు, హిందీలోనూ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన చేసిన 14 హిందీ సినిమాల్లో 12 సూపర్‌హిట్‌ అవ్వడం విశేషం. పక్కా కమర్షియల్‌ సినిమాలే కాదు, భక్తి రసాత్మక చిత్రాలు కూడా బాగా తియ్యగలనని అన్నమయ్య చిత్రంతో ప్రూవ్‌ చేసుకున్నారు రాఘవేంద్రరావు. కమర్షియల్‌ హీరోగా మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో నాగార్జునతో అన్నమయ్య చిత్రం చెయ్యడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సినిమా ఘనవిజయం సాధించి నాగార్జున, రాఘవేంద్రరావు కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. ఆ తర్వాత శ్రీరామదాసు, శిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుంచి లభించిన రివార్డులే కాదు, ఎన్నో అవార్డులు రాఘవేంద్రరావును వరించాయి. ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్‌ అవార్డులు, సైమా, ఐఫా, సినీమా అవార్డులు.. ఇలా ఎన్నో ఆయనకు లభించాయి.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. రాఘవేంద్రరావు సతీమణి పేరు సరళ. వీరికి ఇద్దరు సంతానం. వారిలో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన మొదటి సినిమా బొమ్మలాటకు ఉత్తమ చిత్రంగా, ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్‌కి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డులు లభించాయి. రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహనరావు. ఇద్దరూ కలిసి ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్‌ బేనర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌ చేశారు. వాటిలో ప్రముఖంగా వినిపించే పేరు శాంతి నివాసం. గత పాతికేళ్లుగా 10 టీవీ సీరియల్స్‌ నిర్మించారు. అలాగే సౌందర్యలహరి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. అంతేకాదు, కెఆర్‌ఆర్‌ వర్క్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌ నిర్వహిస్తున్నారు. 

27 ఏళ్ల కెరీర్‌లో వై.వి.యస్‌.చౌదరి 9 సినిమాలే చేశారు. కారణం తెలుసా?

(మే 23 వై.వి.యస్.చౌదరి పుట్టినరోజు సందర్భంగా..) 1990వ దశకం నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన దర్శకులు ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. వారిలో వై.వి.యస్‌.చౌదరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను చేసే సినిమా కోసం ఎంపిక చేసుకునే కథ, నటీనటులు మిగతా దర్శకులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేవరకు ఎన్నిరోజులైనా షూట్‌ చేస్తారు. 1998లో చౌదరి డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ విడుదలైంది. 27 సంవత్సరాల తన కెరీర్‌లో కేవలం 9 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అతని డైరెక్షన్‌లో వచ్చిన చివరి సినిమా ‘రేయ్‌’ 2015లో విడుదలైంది. తాజాగా నందమూరి జానకిరామ్‌ కుమారుడు ఎన్‌.టి.ఆర్‌.ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను లాంచ్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. దర్శకుడిగా సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్నప్పటికీ ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏమిటి, చౌదరి చేసిన సినిమాల్లో విజయాల శాతం ఎంత, దర్శకుడుగా ఎందుకు గ్యాప్‌ తీసుకున్నారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం.  1965 మే 23న యలమంచిలి నారాయణరావు, రత్నకుమారి దంపతులకు గుడివాడలో జన్మించారు యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. చదువులో ఎప్పుడూ ముందుండే చౌదరి 6, 7, 8 తరగతుల్లో పట్టణ స్థాయిలో ప్రథమస్థానం సంపాదించారు. గుడివాడలో ఇంటర్‌ వరకు చదువుకున్న తర్వాత మద్రాస్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరారు. ఎన్‌.టి.రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి 9వ తరగతి చదువుతున్నప్పుడే ఎన్టీఆర్‌ అభిమాన సంఘం స్థాపించి దానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. సినిమాల పట్ల చౌదరికి ఉన్న ఆసక్తిని గమనించిన స్నేహితులు సినిమా డైరెక్టర్‌గా రాణిస్తావని చెప్పడంతో చిన్నతనంలోనే డైరెక్టర్‌ అవ్వాలనుకున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే కాలేజీ మానేసి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని డబ్బింగ్‌ సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన పట్టాభిషేకం చిత్రానికి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకుల దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు చౌదరి. సినిమాల గురించి చౌదరి విశ్లేషించే తీరు నచ్చడంతో తన సొంత బేనర్‌ గ్రేట్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు నాగార్జున. ఈ సినిమా డైరెక్టర్‌గా చౌదరికి చాలా మంచి పేరు తెచ్చింది.  చౌదరికి రెండో అవకాశం కూడా నాగార్జునే ఇచ్చారు. కామాక్షి మూవీస్‌తో కలిసి ‘సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించారు నాగార్జున. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘యువరాజు’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత తనే నిర్మాతగా మారి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి హరికృష్ణకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత వరసగా వచ్చిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దేవదాసు తర్వాత చౌదరికి హిట్‌ అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత చేసిన ఒక్క మగాడు, సలీమ్‌, నిప్పు, రేయ్‌ చిత్రాలు నిరాశపరిచాయి. ఇందులో నిప్పు చిత్రాన్ని గుణశేఖర్‌ డైరెక్ట్‌ చేయగా, చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. 2015 వరకే చౌదరి డైరెక్టర్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. అంటే 17 సంవత్సరా కెరీర్‌లో అతను చేసిన సినిమాలు తొమ్మిదే. దానికి కారణం ప్రతి సినిమా హై బడ్జెట్‌తో ఉండడం, షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల తక్కువ సినిమాలు చేశారు. తెలుగు ఇండస్ట్రీకి రామ్‌ పోతినేని, ఇలియానా, ఆదిత్య ఓం, అంకిత వంటి నటీనటుల్ని పరిచయం చేసిన ఘనత వై.వి.యస్‌.చౌదరికి దక్కుతుంది.  చౌదరి వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేశారు చౌదరి. ఆ సమయంలోనే ఆ చిత్రంలో నటించిన గీతను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సిందూరం చిత్రంలో రవితేజ సరసన, భరత్‌ దర్శకత్వంలో వచ్చిన అయ్యిందా లేదా చిత్రంలో అలీకి జోడీగా నటించారు గీత. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యుక్తా చౌదరి, ఏక్తా చౌదరి.