విజయనిర్మల గిన్నిస్‌ రికార్డ్‌ సాధించడం ఎలా సాధ్యమైందో తెలుసా?

(ఫిబ్రవరి 20 నటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా..) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పరిశ్రమలో ఎంతో మంది మహిళా దర్శకులు చిత్రాలు రూపొందించినప్పటికీ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. వాటిలో ఒక తమిళ సినిమా, ఒక మలయాళ సినిమా కూడా ఉన్నాయి. 24 సినిమాలు బయటి బేనర్స్‌ నిర్మించినవి కాగా, 20 సినిమాలు సొంత బేనర్‌లో నిర్మించారు. సూపర్‌స్టార్‌ కృష్ణతో 47 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. నటిగా, నిర్మాతగా దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని పొందిన విజయనిర్మల వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలను ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. విజయనిర్మల అసలు పేరు నిడుదవోలు నిర్మల. 1946 ఫిబ్రవరి 20న రామ్మోహనరావు, శకుంతల దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం నరసరావుపేట అయినప్పటికీ తమిళనాడులో స్థిరపడ్డారు. రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆ సంస్థలోనే కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కూడా సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేసేవారు. నిర్మల బంధువైన రావు బాలసరస్వతీదేవి ప్రోత్సాహంతో నాలుగేళ్ళ వయసులోనే ‘మచ్చరేకై’ అనే తమిళ సినిమాతో బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అలా ఆరు తమిళ సినిమాల్లో నటించిన తర్వాతే తెలుగులో సినిమా చేసే అవకాశం వచ్చింది. 1957లో వచ్చిన ‘పాండురంగ మహత్మ్యం’లో బాలకృష్ణుడుగా నటించారు నిర్మల. ఈ సినిమాలోని ‘జయ కృష్ణా ముకందా మురారి’ పాటలో ఆమె నటన, నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. నిర్మల బాలనటిగా చేసిన చివరి సినిమా ‘భూకైలాస్‌’. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్‌కి గ్యాప్‌ వచ్చింది. ఎందుకంటే బాలనటి కంటే ఎక్కువ, హీరోయిన్‌కి తక్కువ వయసు కావడంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో చదువుకుంటూనే నృత్యం నేర్చుకున్నారు.  1962లో కె.ఎస్‌.మూర్తిని వివాహం చేసుకున్నారు నిర్మల. భర్త ప్రోత్సాహంతో హీరోయిన్‌గా తిరిగి తన కెరీర్‌ను ప్రారంభించారు. 1964లో మలయాళ చిత్రం ‘భార్గవి నిలయం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత ‘రంగుల రాట్నం’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా తెలుగులో పరిచయమయ్యారు. అప్పటికే వెన్నిరాడై నిర్మల అనే హీరోయిన్‌ ఉండడంతో తన పేరును నీరజగా మార్చుకున్నారు. అయినా అందరూ తనని నిర్మల అనే పిలుస్తుండడంతో తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన విజయ సంస్థ గుర్తుగా పేరుకు ముందు విజయను చేర్చి విజయనిర్మలగా మారారు.  1967వ సంవత్సరం విజయనిర్మల జీవితాన్ని మార్చేసింది. అదే సంవత్సరం బాపు దర్శకత్వంలో ‘సాక్షి’ చిత్రంలో నటించారు. హీరో కృష్ణతో కలిసి నటించిన తొలి సినిమా అదే. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారి తీసింది. భర్త కె.ఎస్‌.మూర్తికి విడాకులు ఇచ్చి 1969లో కృష్ణను పెళ్లి చేసుకున్నారు విజయనిర్మల. అప్పటికే ఆమెకు ఐదేళ్ళ కొడుకు నరేష్‌ ఉన్నాడు. కృష్ణకు కూడా అది రెండో వివాహం. కొంతకాలం వారి వివాహాన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. విజయనిర్మల తన 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ‘కవిత’ అనే మలయాళ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం తెలుగులో ‘మీనా’ చిత్రానికి దర్శకత్వం వహించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటి నుంచి నటిగా, దర్శకురాలిగా ఎంతో బిజీ అయిపోయారు. దర్శకురాలిగా తన రెండో సినిమాతోనే పెద్ద సాహసం చేశారు విజయనిర్మల. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ఎవర్‌గ్రీన్‌ చిత్రం ‘దేవదాసు’ను రీమేక్‌ చేయడానికి సిద్ధపడడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమా సినిమా స్కోప్‌, కలర్‌లో రూపొందింది. అయితే అదే సమయంలో ఎఎన్నార్‌ ‘దేవదాసు’ను రీరిలీజ్‌ చేయడంతో విజయనిర్మల దేవదాసు పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమా మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత ఆమె దర్శకత్వంలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. ఎక్కువ శాతం సినిమాల్లో కృష్ణ హీరోగా నటించడం విశేషం. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన చివరి సినిమా నేరము శిక్ష.  నటిగా, దర్శకురాలిగా విశేషమైన ప్రతిభ కనబరిచిన విజయనిర్మల వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. సూపర్‌స్టార్‌ కృష్ణను పెళ్లి చేసుకున్నప్పుడు వీరి దాంపత్యం మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది అని కొందరు ఎగతాళి చేశారు. ఇండస్ట్రీలోని చాలా మంది అదే అభిప్రాయంతో ఉండేవారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎంతో గౌరవప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపడమే కాకుండా, ఒక ఆదర్శమైన జంటగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ, విజయనిర్మల. ఆమె కుమారుడు నరేష్‌ హీరోగా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. విసుగు, విరామం లేకుండా దాదాపు 50 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో కొనసాగిన విజయనిర్మల 2009 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ భర్త కృష్ణతో శేష జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 2019 జూన్‌లో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్‌ 27న తుదిశ్వాస విడిచారు విజయనిర్మల. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు 2022 నవంబర్‌ 15న సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూశారు.

తండ్రి చనిపోయిన తర్వాత ఆయన డైరీ చదివి షాక్ అయిన కె.విశ్వనాథ్‌!

(ఫిబ్రవరి 19 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జయంతి సందర్భంగా..) మన సంస్కృతీ సాంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు రూపొందించడం ద్వారా దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. తన సినిమాల ద్వారా ప్రజలకు కళల పట్ల మక్కువ ఏర్పడేందుకు చేసిన కృషి అద్వితీయం అని చెప్పాలి. సినిమాల్లోకి రావడం, దర్శకుడు కావడం అనేది విశ్వనాథ్‌ ముందుగా డిజైన్‌ చేసుకున్నది కాదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం ఆయన వదులుకోలేదు. బిఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్న విశ్వనాథ్‌ని ఆయన తండ్రి వాహిని స్టూడియోలో సౌండ్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ చేశారు. అక్కడ పని నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత సౌండ్‌ ఇంజనీర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. విశ్వనాథ్‌లోని ప్రతిభను మొదట గుర్తించిన వారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. సినిమాలపై విశ్వనాథ్‌ చేస్తున్న విశ్లేషణ నచ్చడంతో తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్చుకున్నారు. ఆయన దగ్గర ఎన్నో సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశారు విశ్వనాథ్‌. ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌లో రూపొందిన మొదటి సినిమా ఆత్మగౌరవం. ఈ సినిమా తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. వాటిలో సుడిగుండాలు, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి వంటి సినిమాలు ఉన్నాయి.  1976లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రంతో తన పంథా మార్చుకున్నారు విశ్వనాథ్‌. కళలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటి పట్ల వారికి ఆసక్తిని కలిగించాలని అనుకున్నారు.  తెలుగులో ఘనవిజయం సాధించిన సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో సర్గమ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విశ్వనాథ్‌ రూపొందించిన మరో మంచి సినిమా సీతామాలక్ష్మి. 1980 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. శంకరాభరణం వంటి కళాఖండం విడుదలై ఆయన కీర్తి విశ్వవ్యాప్తం కావడానికి కారణమైన సంవత్సరం. ఆ సినిమాకి లభించిన ఆదరణ అసామాన్యమని చెప్పాలి. ఆ తర్వాత సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి అద్భుతమైన సినిమాలను తీర్చిదిద్దారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శుభప్రదం.  కె.విశ్వనాథ్‌ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకి జోతిష్యం హాబీగా ఉండేది. కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి చెప్పేవారు కాదు. కానీ, విశ్వనాథ్‌ మాత్రం ఏనాడూ జోతిష్యం, జాతకాల జోలికి వెళ్లలేదు. వాటిని మూఢంగా నమ్మేవారు కాదు. కాకపోతే మంచిరోజులు కాదు అని చెప్పుకునే అష్టమి, నవమి రోజుల్లో మంచికార్యాలు మొదలు పెట్టేవారు కాదు. మంచి రోజులు, మంచి ఘడియలు కాని సమయంలో కూడా రైళ్లు, విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే అందరికీ చెడు జరగాలని లేదు. కాకపోతే మనకు జరిగే చెడుని తప్పించే వీలు వున్నప్పుడు మంచి రోజుల్లోనే కొన్ని పనులు మొదలు పెట్టాలని మాత్రం అనుకునేవారు. ఆయన ఎదుగుదలను చూసి తండ్రి సుబ్రహ్మణ్యం లోలోపలే సంతోషించేవారు తప్ప ఏనాడూ విశ్వనాథ్‌ని పొగడలేదు. అంతేకాదు, ఆయన చేసే సినిమాలకు సంబంధించి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ముఖ్యంగా సినిమాలకు ముహూర్తాలు పెట్టడం కానీ, వాటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలు కానీ విశ్వనాథ్‌తో చర్చించేవారు కాదు.  తండ్రి చనిపోయిన తర్వాత ఒకరోజు ఆయన రాసుకున్న డైరీలను పరిశీలించారు విశ్వనాథ్‌. తనతో ఏనాడూ చెప్పని విషయాలు ఆయన అందులో రాసుకున్నారు. తన కెరీర్‌లో సాధించిన విజయాలకు సంబంధించి కొన్ని లెక్కలు కనిపించాయి. సరిగ్గా ఆయన రాసినట్టే జరిగిందని విశ్వనాథ్‌ తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయన డైరీలో శంకరాభరణం చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా కొన్నేళ్ళపాటు తెలుగువారు గుర్తు పెట్టుకుంటారు. చలనచిత్ర సీమలో శంకరాభరణం చరిత్ర సృష్టిస్తుందని రాసుకున్నారు. అలాగే ఆ సినిమా ప్రభావం విశ్వనాథ్‌పై బలంగా ఉంటుందని కూడా అందులో ఉంది. ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని కూడా ఆయన అందులో రాశారు. విశ్వనాథ్‌ సినీ జీవితానికి సంబంధించి ఆయన తండ్రి రాసిన విషయాలన్నీ అక్షర సత్యాలుగా కళ్ళముందు కనిపించడంతో విస్తుపోయారు విశ్వనాథ్‌. అందుకే తనకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నీ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే వచ్చాయని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చెప్పేవారు.

మొదటి 4 సినిమాలు రిలీజ్‌ కాలేదు.. ఆమెను ఐరన్‌లెగ్‌ అన్నారు.. కానీ, సూపర్‌స్టార్‌ అయిపోయింది!

సినిమా రంగంలో స్టార్స్‌గా, సూపర్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు వారి తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు మాత్రం కష్టాలతోపాటు ఎన్నో అవమానాలను కూడా సహించారు. నీ మొహం, నీ వాయిస్‌ సినిమాకి పనికి రాదు అనే మాట ఎంతో మంది  నటీనటుల అనుభవంలో ఉన్నదే. ఇక కొందరికి అవకాశాలు వచ్చినప్పటికీ కాలం కలిసి రాక ఆ సినిమాలు విడుదల అవ్వవు. అలాంటి చిత్రమైన పరిస్థితి ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ జీవితంలో జరిగింది. ఆమె కెరీర్‌ ప్రారంభంలో నాలుగు సినిమాల్లో నటించే ఛాన్స్‌ వచ్చింది. అయితే వరసగా ఒకదాని వెంట మరొకటి షూటింగ్‌ ఆలస్యం కావడంతోపాటు అవి రిలీజ్‌కి కూడా నోచుకోలేదు. దాంతో అవకాశాల కోసం ఏ ప్రొడ్యూసర్‌ దగ్గరికి వెళ్లినా, ఏ డైరెక్టర్‌ దగ్గరికి వెళ్లినా ఛాన్స్‌ ఇచ్చేవారు కాదు. పైగా ఆమెకు ‘ఐరన్‌ లెగ్‌’ అనే బిరుదును కూడా తగిలించారు. విషయం తెలుసుకున్న ఇతర దర్శకనిర్మాతలు కూడా ఆమెను దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఓ తెలుగు దర్శకుడు మాధురీ దీక్షిత్‌తో ఒక సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ఆ సినిమా పేరు ‘పుష్పక విమానం’. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటో తెలుసుకుందాం.. కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూకీ చిత్రం ‘పుష్పక విమానం’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి సరిపోయే అమ్మాయి కోసం సింగీతం వేట మొదలుపెట్టారు. అప్పట్లో బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నీలమ్‌ కొఠారిని తమ సినిమాలో ఎంపిక చేసేందుకు బొంబాయి వెళ్లి ఆమెను కలిశారు సింగీతం. సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో చేస్తానని ఒప్పుకుంది నీలమ్‌. అయితే బొంబాయి నుంచి తనతోపాటు హెయిర్‌ స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా వస్తారనే కండిషన్‌ పెట్టింది. ఇది రొటీన్‌గా తీస్తున్న కమర్షియల్‌ సినిమా కాదని, ఒక ప్రయోగమని చెప్పారు సింగీతం. మామూలు సినిమాకైతే మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పించేవాళ్లం అని చెప్పారు. కానీ, నీలమ్‌ ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ హీరోయిన్‌ వేట మొదలైంది.  ఆ సమయంలో ‘షోలే’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ సినిమాను రూపొందించిన రమేష్‌ సిప్పీని కలిసి విషయం చెప్పారు సింగీతం. ‘ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆమె నటించిన నాలుగైదు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కటి కూడా రిలీజ్‌ అవ్వలేదు. ఆమెకు ఐరన్‌లెగ్‌ అనే పేరు వచ్చేసింది. ఆమె పేరు మాధురీ దీక్షిత్‌. మీకు ఇంట్రెస్ట్‌ ఉంటే వెళ్లి కలవండి’ అని చెప్పారు రమేష్‌ సిప్పీ. ఆయన చెప్పినట్టుగానే మాధురీ దీక్షిత్‌ అడ్రస్‌ కనుక్కొని ఆమె మేనేజర్‌తో విషయం చెప్పారు సింగీతం. అలాంటి డైలాగులు లేని సినిమాలో మా హీరోయిన్‌ చేయదు అంటూ తిప్పి పంపించాడు ఆ మేనేజర్‌. ఆ తర్వాత ఓ ఫంక్షన్‌లో అమలను చూశారు సింగీతం. ఆమె గురించి వాకబు చేస్తే.. శివాజీ గణేశన్‌తో ఒక సినిమాలో నటించిందనీ, నటన అస్సలు తెలీదని చెప్పారు. అయితే దర్శకుడిగా ఆమెను సునిశితంగా పరిశీలించిన సింగీతంకి అలా అనిపించలేదు. ఎంతో సహజంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి తమ సినిమాలోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌ సూట్‌ అవుతుందని  భావించి ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు.  మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా టైమ్‌ బాగోకపోతే ఎవరో ఒకరు అడ్డు పడతారనీ, ఏదో విధంగా అది పక్కకి వెళ్లిపోతుందనే విషయం మాధురీ దీక్షిత్‌ విషయంలో ప్రూవ్‌ అయింది. అప్పటికే నాలుగు రిలీజ్‌ అవ్వని సినిమాల్లో నటించిన ఆమెకు పుష్పక విమానం ఒక మంచి అవకాశం. కానీ, అది ఆమె మేనేజర్‌ వల్ల చేజారిపోయింది. ఆ తర్వాత ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకొని హీరోయిన్‌గా బిజీ అయిపోయిన తర్వాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో ఓ సినిమా చేశారు. ఆ సమయంలో పుష్పక విమానం గురించి ఆమెతో ప్రస్తావించి జరిగింది చెప్పారు సింగీతం. ఆయన మాటలకు ఆమె షాక్‌ అయిపోయి ఒక్కసారిగా తలకొట్టుకుంటూ.. అప్పుడు ఉన్న మేనేజర్‌ను ‘మంచి ఛాన్స్‌ మిస్‌ చేశాడు’ అని తిట్టుకుంది మాధురీ దీక్షిత్‌.

ఆ సినిమా విషయంలో చిరంజీవి అనుకున్నదే జరిగింది.. వెంకటేష్‌కి మాత్రం బాధ మిగిలింది!

కొన్ని కథలు హీరోలు, వారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. అంతకుముందు వారు చేసిన ఆ తరహా సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలా జాగ్రత్తలు తీసుకున్న ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. అయితే కొన్ని సార్లు ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అనే ధోరణిలో సినిమాలు తయారవుతుంటాయి. ఏ డైరెక్టర్‌ అయినా తాను అనుకున్న కథకు లేదా ఎంపిక చేసుకున్న కథకు హీరో ఎవరైతే బాగుంటుంది అనేది జడ్జ్‌ చెయ్యగలిగితే సగం సక్సెస్‌ సాధించినట్టే. కానీ, కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ల అంచనాలు తారుమారు అవుతుంటాయి. కథ, కథనాలు, హీరో పెర్‌ఫార్మెన్స్‌.. ఇలా అన్నీ బాగున్నా సరే ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుంది. అందుకే ఈ విషయంలో హీరోలు ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు మొహమాటం కొద్దీ చేస్తారు. కానీ, రిలీజ్‌ అయిన తర్వాత అనుకున్నట్టుగానే ఆ సినిమాలకి ప్రేక్షకాదరణ లభించదు.  అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితి మెగాస్టార్‌ చిరంజీవికి వచ్చింది. సాధారణంగా దర్శకనిర్మాతలు తన దగ్గరికి తీసుకొచ్చే కథ తనకు సూట్‌ కాదు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్పేసేవారు. అంతేకాదు, ఆ కథ ఏ హీరోకైతే బాగుంటుంది అనే సలహా కూడా ఇచ్చేవారు. అలా తను చెయ్యాల్సిన ఎన్నో సినిమాలకు ఇతర హీరోల పేర్లను సూచించేవారు. 2001 ప్రారంభంలో చిరంజీవికి రచయిత భూపతిరాజా ఒక కథ వినిపించారు. అదే ‘డాడీ’. కథ విన్న చిరంజీవి అది తనకంటే వెంకటేష్‌కైతే బాగుంటుందని, ఆ తరహా కథలకు అతను న్యాయం చెయ్యగలడని చెప్పారు. ‘ఇప్పటివరకు మీరు మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ కథ మీకు వెరైటీగా ఉంటుంది. ఒక పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ మేన్‌గా మీరు సూట్‌ అవుతారు’ అని చెప్పారు. ఆ కథ విన్న నిర్మాత అల్లు అరవింద్‌ కూడా అదే ఫీల్‌ అయ్యారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా.. రచయిత, నిర్మాతల బలవంతం మీద ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్‌ హీరోయిన్‌గా నటించింది. 2001 అక్టోబర్‌ 4న ‘డాడీ’ చిత్రం విడుదలైంది.  కథ పరంగా సినిమా బాగానే వున్నప్పటికీ అది చిరంజీవి మీద వర్కవుట్‌ కాలేదు. చిరంజీవి ఇమేజ్‌ దృష్ట్యా కమర్షియల్‌గా ఏవరేజ్‌గా నిలిచి ఫర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చిరంజీవికి ఫోన్‌ చేసిన వెంకటేష్‌ ‘సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ కథ నాకైతే బాగుండేది. కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ అయ్యేది’ అని చెప్పడంతో ఆ కథపై తనది కూడా అదే అభిప్రాయమనీ, అయితే ఎవరూ తన మాట వినలేదని వెంకటేష్‌కి అసలు విషయం చెప్పారు చిరంజీవి. అలాంటి మంచి సినిమా తన వరకు రాలేదని వెంకటేష్‌ ఎంతో బాధపడ్డారు. దీన్ని బట్టి కొన్ని కథలు తమకు సూట్‌ కావన్న విషయాన్ని హీరోలు కూడా ముందుగానే గుర్తిస్తారని అర్థమవుతుంది. అప్పటికే ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన వెంకటేష్‌కి ‘డాడీ’ చిత్రం నిజంగానే బాగుండేదని ఆ తర్వాత అందరూ అనుకున్నారు. 

లెజెండ్‌ అనిపించుకోవాల్సిన హరనాథ్‌.. చిన్న వయసులోనే ఎలా చనిపోయారు?

తెలుగు చలన చిత్ర సీమలో ఎంతో మంది అందాల నటులు తమ అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి నటుల్లో హరనాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటరత్న ఎన్‌.టి.రామారావు తర్వాత కృష్ణుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో రాణించిన నటుల్లో హరనాథ్‌ ప్రముఖంగా నిలుస్తారు. సాధారణంగా సినిమాల్లో నటించాలని, హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు, అవకాశాల కోసం ఏళ్ళ తరబడి వేచి చూస్తారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదుగుతారు. కానీ, హరనాథ్‌ సినీ ప్రస్థానం మాత్రం దానికి భిన్నమైనది. సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన అలాంటి కష్టాలు పడలేదు. మొదటి నుంచీ ఆయన కెరీర్‌ ఉజ్వలంగానే సాగింది. ఆరోజుల్లో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలన్నా, హీరో స్థానాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం. ఆ క్రమశిక్షణ హరనాథ్‌లో లోపించడం వల్ల తర్వాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసలు హరనాథ్‌ సినీ రంగానికి ఎలా వచ్చారు? హీరోగా ఏ స్థాయికి వెళ్ళారు? తన కెరీర్‌ను చేజేతులా ఎలా నాశనం చేసుకున్నారు? చివరికి చిన్న వయసులోనే మృత్యు ఒడిలోకి ఎలా చేరారు? అనే విషయాలు తెలుసుకుందాం.  1936 సెప్టెంబర్‌ 2న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు హరనాథ్‌. ఆయన పూర్తి పేరు బుద్దరాజు అప్పల వెంకటరామ హరనాథ్‌ రాజు. బుద్ధరాజు వరహాలరాజు శ్రీఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథాన్ని రచించారు. ఆయన నటుడు కూడా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. వీరు పిఠాపురం రాజవంశానికి చెందినవారు. స్వతహాగా వీరిది ధనిక కుటుంబం. హరనాథ్‌ తన విద్యాభ్యాసం రాపర్తి, మద్రాస్‌లలో సాగింది. ఆయన కాలేజీలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచేవారు. ఖరీదైన దుస్తులతోపాటు ఖరీదైన వస్తువులు వాడుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఒక గ్యాంగ్‌ని మెయిన్‌టెయిన్‌ చేసేవారు. ఇతర గ్యాంగులతో గొడవలకు దిగుతూ కాలేజీ రౌడీగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉండడం వల్ల హరనాథ్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. ఇవికాక ఆయనకు ఉన్న మరో వ్యాపకం నాటకాలు. ఎంతో ఉత్సాహంగా నాటకాల్లో పాల్గొనేవారు. డిగ్రీ వరకు ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్ని గొడవలు వున్నా నాటకాలు మాత్రం మానేవారు కాదు. హరనాథ్‌కి చిన్నతనం నుంచి పైలట్‌ అవ్వాలనే కోరిక ఉండేది. కానీ, అతని స్నేహితులు మాత్రం ‘నువ్వు అందంగా ఉంటావు. సినిమాల్లో అయితే రాణిస్తావు’ అని ప్రోత్సహించేవారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మిత్రుడి ద్వారా హరనాథ్‌ గురించి తెలుసుకున్న దర్శకుడు గుత్తా రామినీడు తను రూపొందిస్తున్న మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన జమున ఈ సినిమాలో హరనాథ్‌కు జోడీగా నటించారు. అయితే ఆయన మొదట కెమెరా ముందు నిలబడిన సినిమా మాత్రం రుష్యశృంగ. 1959లో హరనాథ్‌ మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి విడుదలైన తర్వాత మరి కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే ఎన్‌.టి.రామారావు సీతారామకళ్యాణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ రావణాసురుడి పాత్ర పోషించారు. రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తను రావణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొత్త నటుడితో రాముడి పాత్ర చేయిస్తే బాగుంటుంది అనుకున్నారు. ఒకరోజు ఎన్టీఆర్‌ పాండీ బజార్‌లోని ఓ షాపుకి వెళ్లారు. అక్కడ హరనాథ్‌ కనిపించారు. ‘బ్రదర్‌.. ఎలా ఉంది మీ సినీ ప్రయాణం’ అని అడిగారు. తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలు చెప్పారు హరనాథ్‌. అప్పుడు ఎన్టీఆర్‌ ఆయన్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడి వేషం ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారం రోజులకు హరనాథ్‌ను మేకప్‌ టెస్ట్‌కి పిలిపించారు. ఆయనతోపాటు మరికొందరు నటులు కూడా ఆ టెస్ట్‌కి వచ్చారు. కానీ, హరనాథ్‌ను ఎంపిక చేశారు ఎన్టీఆర్‌. పురాణ పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్‌ ఎంతో నిష్టగా ఉండేవారు. కానీ, హరనాథ్‌ మాత్రం ఆ నియమాలు పాటించకుండా రాముడి వేషం వేస్తూనే సెట్‌లో సిగరెట్లు తాగే వారు. అది తెలిసి ఎన్టీఆర్‌ ఎంతో బాధపడి, హరనాథ్‌ని మందలించారు. అయినా తన అలవాటు మానుకోకుండా ఎన్టీఆర్‌కి తెలియకుండా సిగరెట్లు కాల్చేవారు. అయితే సీతారామకళ్యాణంలో రాముడిగా హరనాథ్‌ చాలా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు. హరనాథ్‌ను ఎన్టీఆర్‌ సోదరుడిగా భావించి ఆదరించేవారు. అతనికి ఎన్నో అవకాశాలు ఇప్పించారు. ఎన్టీఆర్‌తో కలిసి హరనాథ్‌ నటించిన నాదీ ఆడజన్మే, చిట్టి చెల్లెలు, గుండమ్మకథ, భీష్మ, పల్నాటి యుద్ధం, పాండవ వనవాసం, పుణ్యవతి, కలసిఉంటే కలదు సుఖం వంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. 1961 నుంచి 1972 వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు హరనాథ్‌. ఆరోజుల్లో జమునతో ఎన్టీఆర్‌కు, ఏఎన్నార్‌కు ఓ వివాదం ఉండేది. ఆ కారణంగా ఆమెతో కలిసి నటించేవారు కాదు. ఆ సమయంలో హరనాథ్‌ కాంబినేషన్‌లో జమున చేసిన చాలా సినిమా సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ జంటకు అప్పట్లో చాలా మంచి క్రేజ్‌ ఉండేది. ఇద్దరూ కలిసి దాదాపు 30 సినిమాల్లో నటించారు. రొమాంటిక్‌ హీరోగా హరనాథ్‌ అందర్నీ ఆకట్టుకునేవారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా ఆయన సరసన నటించాలని ఉవ్విళ్ళూరేవారు. 1959 నుంచి 1972 వరకు హరనాథ్‌కు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఆయన కెరీర్‌లో 140కిపైగా సినిమాలు చేసినా మొదటి 50 సినిమాల హరనాథ్‌ వేరు, ఆ తర్వాత కనిపించిన హరనాథ్‌ వేరు అంటారు. ఆయనకు ఎప్పటి నుంచో మద్యం అలవాటు ఉంది. ఒక దశలో అది ఎక్కువైంది. ఈ విషయంలో ఎవరి మాటా వినేవారు కాదు. మద్యానికి బానిసైన మరో నటుడు ఎస్‌.వి.రంగారావుతో హరనాథ్‌కు స్నేహం ఉండేది. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ షూటింగులకు ఆలస్యంగా వెళ్ళేవారు. విషయం తెలిసిన దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనే హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్న కృష్ణ, శోభన్‌బాబులకు ఆ సినిమాలు వెళ్లిపోయేవి. ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ అంటే హరనాథ్‌కు గౌరవం, భయం ఉన్నాయి. అందుకే హరనాథ్‌ తీరు గురించి ఎన్‌.టి.రామారావుకు చేరవేశారు హరనాథ్‌ సన్నిహితులు. అప్పుడు హరనాథ్‌ని పిలిచి మందలించారు ఎన్టీఆర్‌. కెరీర్‌ పట్ల శ్రద్ధ పెట్టమనీ, మద్యానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పిన తర్వాత కొన్నాళ్లు మానేసినా ఆ తర్వాత యదావిధిగా తన అలవాటును కొనసాగించారు. హరనాథ్‌కు ఎన్ని అలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు అనే పేరు ఉంది. అందుకే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా అప్పటి హీరోలంతా హరనాథ్‌ను ఎంతో అభిమానించేవారు. ఆయనకి అవకాశాలు తగ్గిపోవడం చూసి తమ బేనర్‌లో నిర్మించే సినిమాల్లో, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించేవారు. అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయారు. 1984 వరకు అప్పుడప్పుడు సినిమాలు చేసిన హరనాథ్‌ ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యారు. చివరికి 53 ఏళ్ళ వయసులో 1989 నవంబర్‌ 1న మద్రాస్‌లో కన్నుమూశారు. ఆయన భార్య పేరు భానుమతీదేవి. ఆమె 2015లో మరణించారు. కుమారుడు శ్రీనివాసరాజు.. పవన్‌కళ్యాణ్‌తో గోకులంలో సీత, ప్రభాస్‌తో రాఘవేంద్ర చిత్రాలు నిర్మించారు. కుమార్తె పద్మజ. ఈమె కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. అల్లుడు జి.వి.జి.రాజు కూడా నిర్మాతే. తొలిప్రేమ, గోదావరి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించారు. 

చిరంజీవి సినిమా టైటిల్‌లో తన పేరు కూడా ఉండాలని డిమాండ్‌ చేసిన శ్రీదేవి!

1983లో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖైదీ’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు చిరంజీవి. ఆ సమయంలోనే చిరంజీవి హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆ సినిమా పేరు ‘వజ్రాలదొంగ’. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌ ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్‌ కొట్టారు. షూటింగ్‌ ప్రారంభమైంది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత దర్శకుడు కోదండరామిరెడ్డికి కథపై అనుమానం వచ్చింది. ఇది చిరంజీవి, శ్రీదేవి మీద వర్కవుట్‌ అయ్యే సబ్జెక్ట్‌ కాదని అన్నారు. దీంతో సినిమా నిర్మాణాన్ని శ్రీదేవి ఆపేశారు. అప్పటివరకు జరిగిన షూటింగ్‌కి దాదాపు కోటి రూపాయలు ఖర్చయింది.  అంతకుముందు శ్రీదేవితో కలిసి మోసగాడు, రాణీకాసుల రంగమ్మ వంటి సినిమాల్లో నటించారు చిరంజీవి. అయితే ఆ సినిమాల్లో చిరంజీవి నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేశారు. వీరిద్దరూ హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1987లో ఈ కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు నిర్మాత టి.త్రివిక్రమరావు ముందుకొచ్చారు. ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లోనే సినిమా చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే కథ సిద్ధం కాకముందే సినిమాకి కొండవీటి దొంగ అనే టైటిల్‌ని త్రివిక్రమరావు ఫిక్స్‌ చేశారు. ఆ టైటిల్‌కి తగ్గ కథను సిద్ధం చెయ్యమని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పారు. అంతకుముందు దొంగ, అడవిదొంగ వంటి సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్‌కి ఇది మూడో దొంగ సినిమా. నిర్మాత చెప్పినట్టుగానే మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన కథను సిద్ధం చేశారు. ఆ కథను చిరంజీవికి వినిపించారు. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత శ్రీదేవికి నేరేట్‌ చేశారు. కథ విన్న శ్రీదేవి.. కొన్ని మార్పులు చేయాలని సూచించారు. అక్కడితో ఆగకుండా టైటిల్‌ కొండవీటి దొంగ కాదని, తన పాత్ర పేరు కూడా టైటిల్‌లో ఉండాలని డిమాండ్‌ చేశారు.  ఇదే విషయాన్ని చిరంజీవికి, త్రివిక్రమరావుకు చెప్పారు పరుచూరి బ్రదర్స్‌. కథలో మార్పులు చేయాలని చెప్పడం, టైటిల్‌లో తన పాత్ర పేరు కూడా ఉండాలని పట్టుపట్టడం వారికి నచ్చలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టి మరో కొత్త కాన్సెప్ట్‌తో కథను సిద్ధం చేయమని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పారు. వారు చెప్పినట్టుగానే కథను రెడీ చేశారు. ఇది పూర్తిగా మాస్‌ కథలా ఉందని, దానికి కాస్త క్లాస్‌ టచ్‌ కూడా ఉంటే బాగుంటుందని నిర్మాత, హీరో భావించారు. అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్‌ని రంగంలోకి దించారు. పరుచూరి గోపాలకృష్ణ మాస్‌ ఎలిమెంట్స్‌పై దృష్టి పెట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు, యండమూరి వీరేంద్రనాథ్‌ క్లాస్‌ అంశాలను జోడించారు. అలా కథలో కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ కథలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అది కూడా అక్కా చెల్లెళ్లు. ఒకరు పోలీస్‌ ఆఫీసర్‌, మరొకరు డాక్టర్‌. ఆ క్యారెక్టర్ల కోసం విజయశాంతి, రాధలను ఎంపిక చేశారు.  ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించాలని నిర్మాత త్రివిక్రమరావు అనుకున్నారు. అందుకే 70 ఎంఎం 6 ట్రాక్‌ స్టీరియోఫోనిక్‌ సౌండ్‌తో సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు సంవత్సరం పాటు జరిగింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటివరకు చిరంజీవి సినిమాల్లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇదే. అంతకుముందు సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. 1989 సంక్రాంతికి విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. దీంతో 1990 సంక్రాంతికి ‘కొండవీటి దొంగ’ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. అయితే 70 ఎంఎం 6 ట్రాక్‌ స్టీరియోఫోనిక్‌ సౌండ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్ల టెక్నికల్‌గా కొన్ని అవాంతరాలు రావడంతో ఫస్ట్‌ కాపీ సిద్ధం కావడానికి ఆలస్యమైంది. అందుకే మార్చి 9న విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే 9న రిలీజ్‌ అయింది.  కొన్ని సినిమాలు విడుదలైన రోజు మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకుపోతాయి. మరికొన్ని మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత మౌత్‌ పబ్లిసిటీతో పుంజుకుంటాయి. కానీ, ‘కొండవీటి దొంగ’కు అలా జరగలేదు. మొదటి షోకే నెగెటివ్‌ టాక్‌ వచ్చేసింది. దానికి కారణం.. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు నెల్లూరు నుంచి వచ్చిన ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆ ఏరియాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వచ్చిన అతను తన అగ్రిమెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. అంతేకాకుండా సినిమా కొనవద్దని మిగతా బయ్యర్లకు చెప్పాడు. దాంతో సినిమా బాగా లేదనే న్యూస్‌ ట్రేడ్‌లో స్ప్రెడ్‌ అయిపోయింది. అందుకే ఈ సినిమాకి ఎంతో కష్టం మీద బిజినెస్‌ జరిగింది. నిర్మాత గట్టివాడు కావడం వల్ల అవన్నీ తట్టుకొని అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయగలిగారు.  రిలీజ్‌కి ముందు జరిగిన నెగెటివ్‌ ప్రచారం సినిమాపై ప్రభావం చూపించింది. మొదటి వారం ఫ్లాప్‌ అనే టాక్‌ వచ్చేసింది. సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినా వాటన్నింటినీ తట్టుకొని సినిమా సూపర్‌హిట్‌ అయింది. కథలో కొత్తదనం లేకపోయినా చిరంజీవి పెర్‌ఫార్మెన్స్‌, ఇద్దరు హీరోయిన్ల అందచందాలు, కోదండరామిరెడ్డి టేకింగ్‌, ఇళయరాజా సంగీతం, వి.ఎస్‌.ఆర్‌.స్వామి సినిమాటోగ్రఫీ, సినిమాలోని రిచ్‌నెస్‌.. ఇవన్నీ ‘కొండవీటి దొంగ’ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశాయి. మొదటివారం రూ.74 లక్షలకుపైగా షేర్‌ సాధించింది. ఆ తర్వాత లాంగ్‌ రన్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ రాబట్టి అప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘కొండవీటి దొంగ’ సంచలనం సృష్టించింది. ఈ చిత్రం శతదినోత్సవాన్ని మద్రాస్‌లోని తాజ్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

2010 తర్వాత లతా మంగేష్కర్‌ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్‌ ఇదే!

  నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ, వాయిస్‌ ఆఫ్‌ ది మిలీనియం, లతా దీది.. ఇలాంటి అరుదైన బిరుదులు కలిగిన ఏకైక గాయని లతా మంగేష్కర్‌. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భారతావనిని తన మధుర గానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్‌. సినీ సంగీత ప్రపంచానికి లభించిన ఓ ఆణిముత్యం లతా దీది. ఆమె గానం, ఆమె గళం ఎందరో యువ గాయనీగాయకులకు స్ఫూర్తి. ఈనాటికీ లత గాన మాధుర్యాన్ని ఎంతో మంది ఆస్వాదిస్తున్నారు. 70 సంవత్సరాలపాటు తన గానంతో అలరించిన లత.. 36 దేశ, విదేశీ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలను రికార్డ్‌ చేసిన గాయనిగా 1974లో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. భారత రత్న, పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ పాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనీమణి లతా మంగేష్కర్‌. ఆమె సినీరంగ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆమె నేపథ్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.    1929 సెప్టెంబర్‌ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు లత. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌కు ఐదురుగు సంతానం. వారిలో పెద్ద కుమార్తె లత. ఆమె తర్వాత ఆశా, హృదయనాథ్‌, ఉషా, మీనా జన్మించారు. దీనానాథ్‌ సంగీత కళాకారుడు, రంగస్థల నటుడు. తన ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు లత. సంగీతం వినడం, పాడడం తప్ప ఆమెకు మరో లోకం తెలియదు. తన తర్వాతి వారు కూడా చదువు కంటే సంగీతంపైనే ఆసక్తి చూపించడంతో ఆ కుటుంబమంతా సంగీతమయం అయిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా దీనానాథ్‌ ఆరోగ్యం క్షీణించడంతో 1942లో మరణించారు. దాంతో పదమూడేళ్ళకే కుటుంబాన్ని పోషించే బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలో ప్రవేశించి 1942లోనే మరాఠి చిత్రంలో రెండు పాటలు పాడడమే కాకుండా ఆ సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత చిముక్లా సుసార్‌, గజెభావు, జీవన్‌ యాత్ర, మందిర్‌ వంటి సినిమాల్లో నటించారు.    1947లో మజ్‌బూర్‌ చిత్రంతో పూర్తి స్థాయి గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు లత. అప్పటికే ప్రముఖ గాయనీమణులుగా ఉన్న ఖుర్షీద్‌, నూర్జహాన్‌లు దేశ విభజన కారణంగా పాకిస్తాన్‌ వెళ్లిపోయారు. ఆ సమయంలోనే నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యం పెరగడం వల్ల లత గాయనిగా ఉన్నత శిఖరాలకు చేరేందుకు అవకాశం లభించింది. మొదట్లో సంగీత దర్శకుడు గులాం హైదర్‌.. లతను ప్రోత్సహించారు. ఆ తర్వాత మరో సంగీత దర్శకుడు సి.రామచంద్ర లతా మంగేష్కర్‌ పాట ఉన్నత శిఖరాలకు చేరేందుకు దోహదపడ్డారు. లత పాటను ఇష్టపడని వారు లేరు అనేంతగా తన గానంతో అలరించారు. హిందీ చిత్రసీమలో పాత తరం సంగీత దర్శకులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఆర్‌.డి.బర్మన్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, కళ్యాణ్‌ జీ అనంద్‌ జీ, బప్పీలహరి, రాంలక్ష్మణ్‌లతో సహా తర్వాతి తరం సంగీత దర్శకులు కూడా లతతో పాడించుకోవడం ఓ అదృష్టంగా భావించారు. అయితే 1950వ దశకంలో సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌తో ఏర్పడిన వివాదం కారణంగా లతతో ఒక్క పాట కూడా ఆయన పాడించలేదు. అయితే ఆమె సోదరి ఆశాభోస్లేను బాగా ప్రోత్సహించారు ఓ.పి.నయ్యర్‌.    లతా మంగేష్కర్‌ గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా కూడా పనిచేశారు. రాంరాంపహునా, మొహిత్యాంచి మంజుల, మరాఠా టిటుకమేల్‌ వాలా, స్వాథూ మాన్‌ సే వంటి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాగే చిత్ర నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టారు. మరాఠీలో వాదల్‌, కాంచన్‌ గంగా, హిందీలో జాంజర్, లేకిన్‌ చిత్రాలు నిర్మించారు. తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు మదన్‌మోహన్‌ అని, ఇష్టమైన సింగర్‌ కె.ఎల్‌.సైగల్‌ అని చెప్పేవారు లత. లతా మంగేష్కర్‌ సోదరీమణులు ఆశాభోస్లే, ఉషా మంగేష్కర్‌ కూడా సింగర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులో కూడా లతా మంగేష్కర్‌ పాటలు పాడారు. 1955లో వచ్చిన సంతానం చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా..’ అనే పాట అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఇప్పటికీ ఆ పాటను వింటూనే ఉంటారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఆఖరిపోరాటం చిత్రంలో ‘తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా’ అనే పాటను పాడారు. అలాగే హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘చాందిని’ చిత్రాన్ని తెలుగులో ‘శ్రీదేవి’ పేరుతో డబ్‌ చేశారు. హిందీ వెర్షన్‌లో తను పాడిన పాటలను తెలుగులో కూడా లతా మంగేష్కరే పాడారు.    1972లో గీత రచయిత గుల్జార్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘పరిచయ్‌’ చిత్రంలోని ‘బీతి న బితాయ్‌ రైనా..’ అనే పాటకు, 1974లో అనిల్‌ గంగూలి దర్శకత్వం వహించిన ‘కోరా కాగజ్‌’ చిత్రంలోని ‘రూటే రూటే పియా..’ పాటలకు ఉత్తమ నేపథ్యగాయనిగా లతా మంగేష్కర్‌ జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ రెండు పాటల్లోనూ జయా బచ్చన్‌ నటించడం విశేషం. ఆ తర్వాత 1992లో లతా మంగేష్కర్‌ స్వయంగా నిర్మించిన ‘లేకిన్‌’ చిత్రంలోని ‘యారా సిలి సిలి..’ పాటకు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికి ఆమె సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ సంగీతాన్ని అందించారు. అతనికి కూడా ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు లభించింది. అలాగే లతా మంగేష్కర్‌ 6 ఫిలింఫేర్‌ అవార్డులు, జర్నలిస్ట్స్‌ అసోసియేషన్స్‌ ఇచ్చే అవార్డులు 15 అందుకున్నారు. అంతేకాదు, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం లెజెండ్‌ ఆఫ్‌ హానర్‌ అవార్డు లతా మంగేష్కర్‌ను వరించింది. ఆ తర్వాత ఎన్‌.టి.ఆర్‌. జాతీయ అవార్డు, ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డులు కూడా లత అందుకున్నారు. ఇక వివిధ సంస్థల నుంచి, యూనివర్సిటీల నుంచి ఆమె పొందిన సత్కారాలు, అందుకున్న అవార్డులు వందల సంఖ్యలో ఉంటాయంటే ఆశ్చర్యం కలగక మానదు.    1963 జనవరి 27న చైనా, భారత యుద్ధ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో ‘ఏ మేరే వతన్‌కి లోగో..’ పాటను ఆలపించారు. ఆ పాట విన్న నెహ్రూ కంటతడి పెట్టుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన లత 2000 సంవత్సరం తర్వాత పాటలు తగ్గించుకున్నారు. దానికి కారణం ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘గతంలో మంచి సాహిత్యంతో, సంగీతంతో కూడిన పాటలు వచ్చేవి. కానీ, ఇప్పుడు వస్తున్న పాటల్లో బూతు వినిపిస్తోంది. అందుకే నేను పాటలు పాడడం ఈమధ్యకాలంలో తగ్గించాను’ అని చెప్పారు. 2006లో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘రంగదే బసంతి’ చిత్రంలోని ‘లుకా చుపి..’ అనే పాట లతా మంగేష్కర్‌ చివరి సినిమా పాట. ఆ తర్వాత రెండు సినిమాల్లో పాటలు పాడినప్పటికీ చెప్పుకోదగిన పాట ఇదే. 2010 తర్వాత లతా మంగేష్కర్‌ సినిమా పాటలు పాడలేదు. 70 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్‌ను సాగించిన ఆమె చివరి వరకు అవివాహితగానే ఉండిపోయారు.    కరోనా తర్వాత తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు లతా మంగేష్కర్‌. ఆస్పత్రిలోనే కొన్నాళ్లు ఉన్న ఆమె చికిత్స పొందుతూ 2022 ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. చనిపోయే నాటికి ఆమెకు 92 సంవత్సరాలు. లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఫిబ్రవరి 6, 7 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదే సంవత్సరం లతా మంగేష్కర్‌ స్మారక అవార్డును ఏర్పాటు చేశారు. తొలి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి 2022 ఏప్రిల్‌ 24న ప్రదానం చేశారు.   (ఫిబ్రవరి 6 గాయని లతా మంగేష్కర్‌ వర్థంతి సందర్భంగా..)  

హీరోగా సంచలన విజయాలు సాధించిన రాజశేఖర్‌ వెనకబడడానికి రీజన్‌ ఇదే!

(ఫిబ్రవరి 4 నటుడు రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా..) డా.రాజశేఖర్‌.. పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌కు, పర్‌ఫెక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీసే కాకుండా సెంటిమెంట్‌ ప్రధానంగా రూపొందిన సినిమాల్లోనూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు రాజశేఖర్‌. మాతృభాష తమిళ్‌ అయినప్పటికీ తెలుగులోనే నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1984 నుంచి నటుడుగా కొనసాగుతున్న రాజశేఖర్‌ ఇప్పటివరకు 75 సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాకి కూడా సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోకపోవడం గమనార్హం. స్వతహాగా డాక్టర్‌ అయిన రాజశేఖర్‌ సినిమా హీరో అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆయన హీరోగా ఎలా ఎంట్రీ ఇచ్చారు, తన కెరీర్‌లో సాధించిన విజయాలు, పొందిన అపజయాల గురించి తెలుసుకుందాం.  1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని లక్ష్మీపురంలో వరదరాజన్‌ గోపాల్‌, ఆండాళ్లు దంపతులకు జన్మించారు రాజశేఖర్‌. వరదరాజన్‌.. గుంటూరు జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. రాజశేఖర్‌ కూడా తండ్రిలాగే పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకున్నారు. కానీ, తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించారు. ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన తర్వాత చెన్నయ్‌లో కొంతకాలం ప్రాక్టీస్‌ చేశారు. ఆయన స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా రంగం మీద ఆసక్తి కలిగింది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పుథుమై పెన్‌ చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. తెలుగులో ఘనవిజయం సాధించిన నేటి భారతం ఆధారంగా తమిళ్‌లో రూపొందిన పుతియ తీర్పు చిత్రంలో రాజశేఖర్‌ నటన చూసి తను తెలుగులో రూపొందిస్తున్న ప్రతిఘటన చిత్రంలో అవకాశం ఇచ్చారు దర్శకుడు టి.కృష్ణ. ఆ సినిమా తర్వాత రాజశేఖర్‌, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వందేమాతరం చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తలంబ్రాలు చిత్రంలో పోషించిన నెగెటివ్‌ క్యారెక్టర్‌ రాజశేఖర్‌కు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత చేసిన ఆహుతి, శ్రుతిలయలు, ఆరాధన వంటి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం చిత్రం రాజశేఖర్‌ కెరీర్‌కి పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన పోషించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఆ పాత్ర ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్లకు స్ఫూర్తినిచ్చింది.  అంకుశం తర్వాత రాజశేఖర్‌ చేసిన సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. ప్రజా తీర్పు, చెన్నపట్నం చిన్నోళ్లు, ధర్మయుద్ధం, మంచివారు మావారు, వింత దొంగలు వంటి సినిమాలు.. అంకుశం రేంజ్‌ విజయాలు అందుకోలేకపోయాయి. ఆ తర్వాత అక్కమొగుడు చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో రాజశేఖర్‌ కెరీర్‌ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత అహంకారి, బలరామకృష్ణులు చిత్రాలు నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చాయి. యాక్షన్‌ హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరిప్రియుడు చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించడమే కాకుండా మ్యూజికల్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో రాజశేఖర్‌ రొమాంటిక్‌ హీరో అనిపించుకున్నారు. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిన సినిమాల్లో గోరింటాకు, రాజసింహం, రౌడీయిజం నశించాలి, అన్న, సింహరాశి, సూర్యుడు, శివయ్య, మనసున్న మారాజు, ఎవడైతే నాకేంటి ముఖ్యమైనవి. ఇక రాజశేఖర్‌ కెరీర్‌లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన చాలా సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. తమిళ్‌లో విక్రమ్‌ హీరోగా నటించిన సేతు చిత్రాన్ని తెలుగులో జీవిత రాజశేఖర్‌ దర్శకత్వంలో శేషు పేరుతో రీమేక్‌ చేశారు. భారీ వ్యయంతో రాజశేఖర్‌ సొంతంగా నిర్మించిన ఈ సినిమా నటుడుగా అతనికి పేరు తెచ్చినా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత జీవిత దర్శకత్వంలో నిర్మించిన మరో సినిమా సత్యమేవ జయతే చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు వి.సముద్ర దర్శకత్వంలో మొదలైన ఎవడైతే నాకేంటి చిత్రాన్ని మరో నిర్మాతతో కలిసి నిర్మించారు రాజశేఖర్‌. సినిమా నిర్మాణ సమయంలో సముద్రతో తలెత్తిన మనస్పర్థల కారణంగా దర్శకత్వ బాధ్యతలను జీవిత చేపట్టారు. ఈ సినిమాలో రాజశేఖర్‌ కొన్ని గత చిత్రాల్లో మాదిరిగా యంగ్రీ హీరోగా కనిపిస్తారు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫర్వాలేదు అనిపించింది. రాజశేఖర్‌ తన కెరీర్‌లో 75కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఇందులో హిట్‌ అయిన సినిమాల శాతం తక్కువే అయినా హీరోగా అతని రేంజ్‌ని బాగా పెంచాయి. తన అభిరుచి మేరకు సినిమాలు చెయ్యాలన్న కోరికతో సొంత నిర్మాణ సంస్థ ద్వారా చేసిన సినిమాలు చాలా వరకు పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్న రాజశేఖర్‌ మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

నాగభూషణంపై ఉన్న గౌరవంతో సూపర్‌స్టార్‌ కృష్ణ ఎలాంటి సాయం చేశారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల పాలిట దేవుడుగా చెప్పుకునే హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ. తన సహ నటీనటుల పట్ల, తనతో సినిమాలు తీసే నిర్మాతల పట్ల ఆయన వ్యవహారశైలి గురించి చిత్ర పరిశ్రమలో తెలియనివారు లేరు. నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరోల్లో మొదటి స్థానం కృష్ణదే అని చెప్పాలి. తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతలను ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. 5 దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగిన కృష్ణ.. తన కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు. అందులో కృష్ణకు పారితోషికం పరంగా బకాయి పడ్డ నిర్మాతలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంతేకాదు, తన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తన సీనియర్‌ నటీనటులంటే కృష్ణకు ఎంత గౌరవభావం ఉంటుందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా నటుడు, నిర్మాత నాగభూషణం జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి.  తెలుగు చిత్ర పరిశ్రమలో విలనీకి కొత్త అర్థం చెప్పిన నటుడు నాగభూషణం. ఆయన డైలాగ్‌ చెప్పే విధానంగానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ తెలుగులో మరే ఇతర నటుడికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. నాగభూషణం అంటే కృష్ణకు వల్లమాలిన అభిమానం. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించిన నాగభూషణం ప్రజా నాయకుడు సినిమా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాగభూషణం ప్రధాన పాత్ర పోషించారు. ఆయనపై ఉన్న అభిమానంతో కాంతారావు, జగ్గయ్య, షావుకారు జానకి వంటి నటీనటులు సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో నాగభూషణం నటించారు. ప్రధాన పాత్ర తనదే అయినప్పటికీ, ఒక యంగ్‌ హీరో ఉంటే బాగుంటుందనిపించి ఎంతో మంది హీరోలను సంప్రదించారు. కానీ, నాగభూషణం ప్రధాన పాత్ర కావడంతో ఆ సినిమాలో నటించేందుకు ఎవరూ అంగీకరించలేదు. దాంతో చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు.  ప్రజానాయకుడు సినిమా గురించి హీరో కృష్ణకు తెలిసింది. వెంటనే నాగభూషణంకు ఫోన్‌ చేసి ‘మీ సినిమాలో హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది. మీరెందుకు అంత బాధపడతారు. నేను మీ సినిమాలో నటిస్తాను. మీరు ఎనౌన్స్‌ చేసుకోండి. నాకు ఇచ్చే పారితోషికం గురించి ఆలోచించకండి. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. సినిమా స్టార్ట్‌ చెయ్యండి’ అని ఆయనకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఈ సినిమా 1972 నవంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. అంతేకాదు, తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా ఈ చిత్రానికి లభించింది. అప్పటికే మోసగాళ్ళకు మోసగాడు, గూడుపుఠాణి, పండంటి కాపురం వంటి సూపర్‌హిట్‌ సినిమాలు చేసి హీరోగా బిజీగా ఉన్న సమయంలో నాగభూషణం కోసం ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం కృష్ణ గొప్ప మనసును తెలియజేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాగభూషణం స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

ఒక్క రాత్రిలో పాటలన్నీ ట్యూన్‌ చేసిన చక్రవర్తి.. ఆ సినిమా గోల్డెన్‌ జూబ్లీ అయింది!

(ఫిబ్రవరి 3.. సంగీత దర్శకుడు చక్రవర్తి వర్థంతి సందర్భంగా..) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ స్వరాలతో ప్రేక్షకులను, శ్రోతలను అలరించారు. అయితే వారందరిలోనూ చక్రవర్తిది ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పొచ్చు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తన సంగీతంతో తెలుగు చిత్ర పరిశ్రమను శాసించారు. 1971 నుంచి 1989 వరకు స్టార్‌ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు తన బాణీలతో మ్యూజికల్‌ హిట్స్‌ అందించారు. 70వ దశకంలో దాదాపు అన్ని సినిమాలూ చక్రవర్తే చేశారా అన్నంతగా పేరు మారు మోగిపోయింది. 1995లో వచ్చిన అమ్మోరు.. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా. 25 సంవత్సరాల కెరీర్‌లో 960 సినిమాలకు సంగీతం అందించారు చక్రవర్తి. కమర్షియల్‌ సినిమాలకు, ప్రేమకథా చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు మ్యూజిక్‌ చెయ్యడంలో ఓ ప్రత్యేకమైన శైలిని కలిగిన చక్రవర్తి సినీ కెరీర్‌ ఎలా మొదలైంది, ఆయన సినీ జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.  చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. 1936 సెప్టెంబర్‌ 8న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో బసవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. చక్రవర్తి ప్రాథమిక విద్య పొన్నెకల్లులో, డిగ్రీ గుంటూరు హిందు కాలేజీలో చదివారు. తండ్రి రంగస్థల కళాకారుడు, తల్లి మంచి గాయని. ఆమె ప్రభావం చక్రవర్తిపై ఉండడంతో సంగీతంపై ఆసక్తి కలిగింది. అది గమనించిన తండ్రి అతనికి శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆ తర్వాత వినోద్‌ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు చక్రవర్తి. అలాగే విజయవాడ రేడియో స్టేషన్‌లో 1954, 1958 మధ్య ఆయన పాడిన పాటలు వినిపించేవి. 1958లో డిగ్రీ పూర్తి చేశారు. అయినా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా సంగీతాన్నే నమ్ముకున్నారు. అదే ఏడాది తన మేనమామ కుమార్తె రోహిణీదేవిని వివాహం చేసుకొని మద్రాస్‌ చేరుకున్నారు. ప్రారంభంలో చక్రవర్తికి గాయకుడిగా అవకాశాలు వచ్చాయి. ఆయన మొదట కన్నడ సినిమాలో పాట పాడారు. ఆ తర్వాత బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన జయవిజయ చిత్రంలో రెండు పాటలు పాడారు. అలా పది సంవత్సరాలపాటు సింగర్‌గానే కొనసాగారు. ఓ పక్క పాటలు పాడుతూనే కంచుకోట, పెత్తందార్లు, నిలువు దోపిడీ, దేశోద్ధారకుడు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో డబ్బింగ్‌ కూడా చెప్పేవారు. తమిళ నటులు ఎంజిఆర్‌, శివాజీగణేశన్‌, నగేష్‌, హిందీ నటులు రాజ్‌కుమార్‌, సంజీవ్‌కుమార్‌ వంటి వారికి తెలుగులో గాత్రదానం చేసేవారు. ఆయన కెరీర్‌ మొత్తంలో 600 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. 1970 ప్రాంతంలో చక్రవర్తిలోని సంగీత జ్ఞానాన్ని పసిగట్టిన నిర్మాత చటర్జీ.. తను నిర్మిస్తున్న మూగప్రేమ చిత్రానికి సంగీతాన్ని అందించే బాధ్యతను అప్పగిస్తూ అప్పారావు పేరును చక్రవర్తిగా మార్చారు. 1971లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన శారద చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించారు చక్రవర్తి. ఆ తర్వాత వరసగా బాబు, అన్నదమ్ముల అనుబంధం, ఇదాలోకం, చీకటి వెలుగులు బలిపీఠం, జేబుదొంగ వంటి మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చారు.  1977లో దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్‌ సినిమా యమగోలలోని పాటలు సంగీత దర్శకుడుగా చక్రవర్తిని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అప్పటికే బిజీగా ఉన్న ఆయన్ని తీరిక లేని మ్యూజిక్‌ డైరెక్టర్‌ని చేశాయి. ఓ పక్క సినిమాలకు సంగీతం చేస్తూనే చాలా సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న చిన్నా పెద్దా హీరోలందరి సినిమాలకు మ్యూజిక్‌ చేశారు చక్రవర్తి. ఎలాంటి పాటనైనా నిమిషాల్లో ట్యూన్‌ చెయ్యడం ఆయనలోని ప్రత్యేకత. అక్కినేని, శ్రీదేవి జంటగా నటించిన ప్రేమాభిషేకం చిత్రంలోని అన్ని పాటల్ని ఒక్క రాత్రిలోనే ట్యూన్‌ చేశారంటే చక్రవర్తి వర్క్‌ ఎంత స్పీడ్‌గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1976-89 మధ్యకాలంలో యమగోల, డ్రైవర్‌ రాముడు, వేటగాడు, సర్దార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌చౌదరి, మల్లెపూవు, పదహారేళ్ళ వయసు వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారు. కమర్షియల్‌ చిత్రాలకే కాకుండా ఎర్రమల్లెలు, విప్లవశంఖం, ప్రజారాజ్యం, మహాప్రస్థానం. నేటిభారతం, వందేమాతరం, రేపటి పౌరులు వంటి అభ్యుదయ చిత్రాలకు సైతం సూపర్‌హిట్‌ సాంగ్స్‌ చేశారు. 1989లో 95 తెలుగు సినిమాలు రిలీజ్‌ అయితే అందులో 66 సినిమాలకు చక్రవర్తి సంగీతం చెయ్యడం ఒక ప్రపంచ రికార్డుగా చెప్పొచ్చు. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చక్రవర్తి ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా నేటిభారతం, శ్రావణ మేఘాలు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో శ్రీగా పిలవబడే శ్రీనివాస చక్రవర్తి కూడా చాలా సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత చిన్న వయసులోనే ఆయన మరణించారు. 1995లో విడుదలైన అమ్మోరు తర్వాత అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు చక్రవర్తి. చివరికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2002 ఫిబ్రవరి 3న తుదిశ్వాస విడిచారు.

కళాతపస్వి శివైక్యం చెందారు.. ఆరోజుతో ఆయనకున్న అనుబంధం ఏమిటో తెలుసా?

  తెలుగు సినిమా ఖ్యాతిని దాదాపు 45 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. ఈ పేరు వింటేనే ఎవరికైనా గౌరవ భావం అనాలోచితంగా వచ్చేస్తుంది. మరుగున పడిపోతున్న సంప్రదాయ సంగీత, నృత్య కళలకు జీవం పోసి తన చిత్రాల ద్వారా ఎందరిలోనో ఆ కళలను నేర్చుకోవాలనే తపనను పెంపొందించిన కళాతపస్వి. తెలుగు చలన చిత్ర సీమకు వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్ప రచయితలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1980లో విడుదలైన శంకరాభరణంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్వనాథ్‌.. 1965లోనే ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతటి మహోన్నత దర్శకుడు నిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన సినీ ప్రయాణం ఎలా సాగింది, సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనాన్ని చెబుతూ మూఢాచారాలను వ్యతిరేకించే సినిమాలను రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది వంటి విషయాల గురించి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకా పెద పులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు కాశీనాథుని విశ్వనాథ్‌. ప్రాథమిక విద్య అదే గ్రామంలో చేసినా వారి కుటుంబం విజయవాడ చేరింది. విజయవాడలో హైస్కూల్‌ వరకు చదువుకొని హిందు కాలేజీలో ఇంటర్‌, ఎసి కాలేజీలో బి.ఎస్‌సి పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్‌లోని వాహిని స్టూడియోలో సౌండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌గా జాయిన్‌ అయ్యారు విశ్వనాథ్‌. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా అక్కడే పనిచేసేవారు. సౌండ్‌ ఇంజనీర్‌ ఎ.కృష్ణన్‌ ఆధ్వర్యంలో సౌండ్‌ ఇంజనీరింగ్‌లో మెళకువలు నేర్చుకొని అసిస్టెంట్‌గా ఎదిగారు. విజయ ప్రొడక్షన్స్‌ నిర్మించిన పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్‌ సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దుక్కిపాటి మధుసూదనరావు సంస్థ అన్నపూర్ణలో సౌండ్‌ ఇంజనీర్‌గా చేరారు. చిన్నతనం నుంచి విశ్వనాథ్‌కి సినిమాల పట్ల మంచి అవగాహన ఉంది. ఆ విషయాన్ని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గమనించి 1956లో తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్చుకున్నారు. తోడికోడళ్లు, మూగమనసులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్‌ చక్రవర్తి వంటి సినిమాలకు ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు విశ్వనాథ్‌. ఆ సినిమాలు చేస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు దృష్టిలో పడ్డారు. మంచి కథ ఉంటే సినిమా చేస్తానని విశ్వనాథ్‌కు మాటిచ్చారు అక్కినేని. అలా ఆత్మగౌరవం చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న విశ్వనాథ్‌ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించారు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది.  ఆత్మగౌరవం చిత్రం తర్వాత విశ్వనాథ్‌కు దర్శకుడుగా మంచి అవకాశాలు వచ్చాయి. ప్రైవేట్‌ మాస్టారు, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టు పెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు, కాలం మారింది, నేరము శిక్ష, శారద, అమ్మ మనసు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించారు విశ్వనాథ్‌. 1974లో ఓ సీత కథ చిత్రంతో వేటూరి సుందరరామ్మూర్తిని గేయరచయితగా పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్ననాటి కలలు, జీవనజ్యోతి, మాంగల్యానికి మరోముడి వంటి సినిమాలను రూపొందించారు. దాదాపు పది సంవత్సరాలపాటు 16 చిత్రాలను డైరెక్ట్‌ చేశారు విశ్వనాథ్‌. ఆ సమయంలోనే ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. అందరూ చేస్తున్న తరహాలోనే తను కూడా సినిమాలు చేస్తున్నాననే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇకపై తను చేసే సినిమాలు విభిన్నంగా ఉండాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సిరిసిరిమువ్వ.  1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రం ఘనవిజయం సాధించింది. కొత్త తరహా చిత్రాలు రూపొందించాలన్న విశ్వనాథ్‌ ఆలోచనకు ఆ సినిమా ఊపిరి పోసింది. ఇకపై అలాంటి సినిమాలే చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే కమిట్‌ అయి ఉన్న కొన్ని సినిమాలను పూర్తి చేసిన తర్వాత సీతామాలక్ష్మీ పేరుతో విభిన్నమైన సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అయింది. ఆ క్రమంలోనే సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో సర్గమ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా హిందీలో కూడా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ గొప్ప సంచలనం సృష్టించిన చిత్రానికి శ్రీకారం చుట్టారు కె.విశ్వనాథ్‌. అప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఒక విభిన్నమైన కథ ఆయన మనసులో మెదిలింది. దాన్ని పేపర్‌పై పెట్టి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అదే శంకరాభరణం. శంకరాభరణం చిత్రంలోని శంకరశాస్త్రి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు చేస్తే బాగుంటుందని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భావించారు. కానీ, విశ్వనాథ్‌ మాత్రం ఆ పాత్రకు శివాజీ గణేశన్‌ అయితే సరిపోతారు అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన్ని అప్రోచ్‌ అవ్వలేకపోయారు. ఆ తర్వాత కృష్ణంరాజును కూడా అనుకున్నారు. అయితే ఒక స్టార్‌ హీరో శంకరశాస్త్రి పాత్ర చేస్తే తను అనుకున్న ఎఫెక్ట్‌ రాదని భావించిన విశ్వనాథ్‌ ఫైనల్‌గా రంగస్థల నటుడు జె.వి.సోమయాజులుని ఫైనల్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేశారు. రాజమండ్రి, అన్నవరం, రామచంద్రాపురం, తమిళనాడు, కర్ణాటకలలో ఈ చిత్రం చేశారు. ఎన్నో అవరోధాల తర్వాత శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. స్టార్స్‌ లేకుండా కేవలం కథను మాత్రమే నమ్ముకొని తీసిన ఈ సినిమాకి మొదటి వారం ఎలాంటి స్పందన లేదు. రెండో వారం నుంచి మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవ్వడంతో రోజురోజుకీ కలెక్షన్లు పుంజుకొని సిల్వర్‌ జూబ్లీ చిత్రం అయింది. అలా ఒక్కసారిగా శంకరాభరణం చిత్రంతో కె.విశ్వనాథ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమాను తమిళ్‌లో, కన్నడలో డబ్‌ చేశారు. అక్కడ కూడా పెద్ద విజయం సాధించింది.  శంకరాభరణం తర్వాత విశ్వనాథ్‌ పూర్తిగా క్లాసికల్‌ చిత్రాలకు పరిమితమైపోయారు. ఆ తర్వాత సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతికిరణం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి క్లాసికల్‌ మూవీస్‌ను డైరెక్ట్‌ చేశారు. కె.విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన చివరి చిత్రం 2010లో వచ్చిన శుభప్రదం. ఈ సినిమాలన్నీ ఆయన కెరీర్‌లో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి. ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పడమే కాదు, సమాజంలో పాతుకుపోయిన కొన్ని మూఢాచారాలను, దురాచారాలను రూపుమాపే కథాంశాలు కూడా ఈ సినిమాల్లో ఉన్నాయి. 1965 నుంచీ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నప్పటికీ శంకరాభరణం చిత్రంతోనే విశ్వనాథ్‌కు ఒక ప్రత్యేకమైన ఖ్యాతి లభించింది. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సిరిసిరిమువ్వ, జీవనజ్యోతి, శంకరాభరణం, సప్తపది, శుభోదయం, శుభలేఖ, స్వాతిముత్యం చిత్రాలను హిందీలో రీమేక్‌ చేశారు. ఇవికాక డైరెక్ట్‌గా హిందీలో సంగీత్‌, ఔరత్‌ ఔరత్‌ ఔరత్‌, ధన్‌వాన్‌ చిత్రాలను రూపొందించారు విశ్వనాథ్‌. దర్శకుడిగానే కాదు, నటుడిగా కూడా ప్రేక్షకులపై తనదైన ముద్రవేశారు. 1995లో విశ్వనాథ్‌ దర్శకత్వంలోనే రూపొందిన శుభసంకల్పం చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 30 సినిమాల్లో నటించారు.  ఇక కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అందుకున్న అవార్డులు అనేకం. కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును 2016లో అందుకున్నారు. 1992లో పద్మశ్రీ అవార్డు, అదే సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు తను రూపొందించిన చిత్రాలకు 6 జాతీయ అవార్డులు, నంది అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు దివంగత ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మీ జీవితకథను విదూషమణి పేరుతో సినిమా తియ్యాలని అనుకున్నారు విశ్వనాథ్‌. అయితే అది నెరవేరలేదు. తనకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2నే కళా తపస్వి కె.విశ్వనాథ్‌ శివైక్యం చెందడం చూస్తే ఆ సినిమాతో ఆయనకు ఉన్న అనుబంధం ఏమిటో తెలుస్తుంది.

బ్రహ్మానందం గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సాధించే స్థాయికి వచ్చారంటే.. దానికి కారణం సుత్తివేలు!

(ఫిబ్రవరి 1 హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..) అతను తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్‌లో నవ్వులే నవ్వులు. ఆఖరికి ఏదైనా వేదికపై కనిపించినా కేరింతలు వినిపిస్తాయి. ఒక స్టార్‌ హీరోకి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్‌ అతని సొంతం. అతనే నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం. తెలుగువారు మంచి హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. కామెడీని ఏ రూపంలో ఉన్నా, అది ఎవరు చేసినా ఆస్వాదిస్తారు. అందులోనూ బ్రహ్మానందం పండిరచే కామెడీ పూర్తిగా విభిన్నం. తన డైలాగులతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్‌తో కూడా నవ్వు తెప్పించగల నటుడు. అంతేకాదు, ఎలాంటి డైలాగు చెప్పకుండా తన ఎక్స్‌ప్రెషన్‌తోనే ప్రేక్షకుల్ని నవ్వించగల సమర్థుడు బ్రహ్మానందం. తన 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 1250కిపైగా సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. కేవలం హాస్యనటుడిగా 1250 సినిమాలు చేసి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన కమెడియన్‌ బ్రహ్మానందం. జగమెరిగిన బ్రహ్మానందం గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రస్తావించుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అయితే ఆయన జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం, చేసిన పాత్రల తీరుతెన్నుల గురించి చెప్పుకోవడం సమంజసం అనిపించుకుంటుంది.  1956 ఫిబ్రవరి 1న అప్పటి గుంటూరు జిల్లాలోని చాగంటివారి పాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఏడో సంతానంగా జన్మించారు బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్‌ వరకు చదివారు. ఆ తర్వాత చదివించే ఆర్థిక స్తోమత నాగలింగాచారికి లేకపోవడం వల్ల సన్నిహితులైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కాలేజీలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశారు. ఖాళీ సమయాల్లో సినిమా తారలను ఇమిటేట్‌ చేస్తూ స్నేహితులను నవ్విస్తూ ఉండేవారు. అంతేకాదు, విద్యార్థులకు వినోదాన్ని అందిస్తూనే పాఠాలు చెప్పేవారు. ఇది చూసిన ఆయన మిత్రులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఓసారి హైదరాబాద్‌ వచ్చినపుడు రచయిత ఆదివిష్ణు పరిచయమయ్యారు. బ్రహ్మానందంలోని టాలెంట్‌ని గుర్తించిన ఆయన దూరదర్శన్‌లోని ‘పకపకలు’ అనే కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇప్పించారు. ఆరోజుల్లో దూరదర్శన్‌ తప్ప మరో టీవీ ఛానల్‌ లేని కారణంగా బ్రహ్మానందం చెప్పే జోకులు రాష్ట్రం నలుమూలలా పాకాయి.  1985లో నరేష్‌ హీరోగా వేజెళ్ళ సత్యనారాయణ రూపొందిస్తున్న శ్రీతాతావతారం చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. విశేషం ఏమిటంటే.. బ్రహ్మానందం పుట్టినరోజైన ఫిబ్రవరి 1న తొలిసారి మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. ఈలోగా బ్రహ్మానందం గురించి జంధ్యాలకు తెలియడంతో తను చేస్తున్న సత్యాగ్రహం చిత్రంలో గుండు హనుమంతరావు కాంబినేషన్‌లో ఒక క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ తర్వాత చంటబ్బాయ్‌ షూటింగ్‌ సమయంలో బ్రహ్మానందంను చిరంజీవికి పరిచయం చేశారు జంధ్యాల. అప్పుడు తను నటిస్తున్న పసివాడి ప్రాణం చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ ఇప్పించారు చిరంజీవి. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని కూడా ఎవరికీ తెలీదు. అలా మూడు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు బ్రహ్మానందం.  1987 జూలై 23న పసివాడి ప్రాణం విడుదలైంది. అదే సమయంలో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు అహ నా పెళ్లంట చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చే అరగుండు పాత్రను సుత్తి వేలుతో చేయించాలి అనుకున్నారు. అయితే ఆ టైమ్‌కి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయినా అతని డేట్స్‌ బాగా ట్రై చేశారు. కానీ, వీలుపడలేదు. ఆ సమయంలో రామానాయుడికి సత్యాగ్రహం చిత్రంలో నటించిన బ్రహ్మానందం గుర్తొచ్చి ఆ క్యారెక్టర్‌ అతనితో చేయించమని జంధ్యాలకు చెప్పారు. అప్పుడు బ్రహ్మానందంకి ఫోన్‌ చేసి పిలిపించారు. అలా సుత్తివేలు చెయ్యాల్సిన పాత్ర బ్రహ్మానందంకి దక్కింది. అహ నా పెళ్ళంట విడుదలై ఘనవిజయం సాధించింది. 16 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 5 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా బ్రహ్మానందంకి పెద్ద బ్రేక్‌ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 1992లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమాతో బ్రహ్మానందం కెరీర్‌ తారా స్థాయికి చేరింది. సంవత్సరానికి 30కి పైగా సినిమాలు చేస్తూ బిజీ కమెడియన్‌ అయిపోయారు. హీరో ఎవరైనా బ్రహ్మానందం మాత్రం సినిమాలో కామన్‌ అనే స్థాయికి ఆయన కెరీర్‌ ఎదిగింది. ఒక దశలో బ్రహ్మానందం లేకుండా ఏ స్టార్‌ హీరో సినిమాగానీ, ఒక రేంజ్‌ హీరో సినిమా గానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం ఉండడం వల్లే బిజినెస్‌ జరిగాయి.  బ్రహ్మానందం పోషించిన పాత్రల్లోని మేనరిజమ్స్‌, ఊతపదాలు, డైలాగులు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లిపోయాయి. దైనందిన జీవితంలో వాటిని తరచుగా వాడడం జనానికి అలవాటైపోయింది. అలాంటి వాటిలో చిత్రం భళారే విచిత్రంలోని ‘నీ ఎంకమ్మా’,  మనీ చిత్రంలోని ‘ఖాన్‌తో గేమ్స్‌ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్‌’, ధర్మచక్రం చిత్రంలోని ‘ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా’, అనగనగా ఒకరోజు చిత్రంలోని ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు’, నువ్వు నాకు నచ్చావ్‌ చిత్రంలోని ‘రకరకాలుగా ఉంది మాస్టారూ’, ఎన్నో చిత్రాల్లో వాడిన పదం ‘జఫ్ఫా’, పోకిరి చిత్రంలోని ‘పండగ చేస్కో’, ఢీ చిత్రంలోని ‘నన్ను ఇన్‌వాల్వ్‌ చెయ్యకండి రావుగారూ’, దూకుడులోని ‘నా పెర్‌ఫార్మెన్స్‌ మీకు నచ్చినట్టయితే ఎస్‌ఎంఎస్‌ చేయండి’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం చెప్పిన డైలాగులకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలు చేయకపోయినా, ఆయన నటించిన కామెడీ సీన్స్‌ టీవీల్లో ప్రతిరోజూ మారుమోగిపోతూ ఉంటాయి. అలాగే మీమ్స్‌లో, రీల్స్‌లో బ్రహ్మానందం రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటారు.  వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మీ. వీరికి గౌతమ్‌, సిద్ధార్థ్‌ సంతానం. వీరిలో గౌతమ్‌.. పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించినా నటుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న క్యారెక్టర్స్‌ ప్రేక్షకులకు బోర్‌ కొట్టాయని చెప్పొచ్చు. ఒక విధంగా 2000 సంవత్సరంలో సునీల్‌ ఎంటర్‌ అయిన తర్వాత బ్రహ్మానందం కెరీర్‌ కాస్త మందగించింది. సునీల్‌ తన డిఫరెంట్‌ కామెడీతో, డైలాగ్‌ మాడ్యులేషన్‌తో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఢీ చిత్రం బ్రహ్మానందంకి మరో బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్‌ తన కామెడీతో అలరిస్తున్నప్పటికీ మరోపక్క బ్రహ్మానందం కూడా తన హవా కొనసాగించారు. ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. కొత్తతరం కామెడీ యాక్టర్స్‌ ఇండస్ట్రీకి వస్తున్నారు. దాంతో బ్రహ్మానందం ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తను నటుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా. ప్రస్తుతం తన ఊహలకు తగ్గట్టుగా బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

38 ఏళ్ళ వయసు వరకు వేటూరి ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం తెలుసా? 

(జనవరి 29 గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా..) తెలుగు సినిమా పాటను కొత్త పుంతలు తొక్కించి, పండితుల నుంచి పామరుల వరకు నోరారా పాడుకునే పాటల్ని అందించిన అక్షర శిల్పి వేటూరి సుందరరామ్మూర్తి. భాష, భావుకతలను రెండు కళ్లుగా చేసుకొని మనసు పొరల్ని అంతర్లీనంగా తడిమిన అద్భుత గేయ రచయిత. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టే.. ఆయన కలానికి కూడా రెండు వైపులా పదును ఉంటుంది. సంస్కృత సమాసాలతో పాటను రాసి రక్తి కట్టించగలరు, మసాలాలు దట్టించి మాస్‌ శ్రోతలను ఉర్రూతలూగించగలరు. దాదాపు 40 సంవత్సరాలపాలు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి దిగ్గజ కవులు తెలుగు సినిమా పాటను ఏలుతున్న రోజుల్లో చిత్ర రంగ ప్రవేశం చేసిన వేటూరి తన పాటలతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు. ఆరోజుల్లో ఒక్కో రచయితలో ఒక్కో ప్రత్యేకత ఉండేది. కానీ, వారందరి ప్రత్యేకత తనలోనే పొందుపరుచుకున్న అసమాన గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి. తన 38వ ఏట కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రంలోని భారతనారి చరితము అనే హరికథతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. చిత్ర పరిశ్రమకు అంత ఆలస్యంగా రావడం వెనుక కారణం ఏమిటి, గేయ రచయితగా ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, తెలుగు సినిమా పాట రచనలో ఎలాంటి ప్రయోగాలు చేశారు వంటి విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం.  1936 జనవరి 29న కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరరామ్మూర్తి. వీరిది సంగీత, సాహిత్య సమ్మేళనంగా ఉన్న కుటుంబం. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. ఆయనకు సాహిత్యంలో ప్రవేశం ఉంది. అలాగే వేటూరి పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి మంచి సాహితీ వేత్త. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చారు వేటూరి. వృత్తి రీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదువుకున్నారు. మద్రాస్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి బి.ఎ. ఎకనమిక్స్‌ చేశారు. అటు పిమ్మట లా చేసేందుకు మద్రాస్‌ వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. అయితే ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో పాటలు వినడం ద్వారానే పాటలు రాయాలనే ఆసక్తి పెరిగిందని వేటూరి చెప్పేవారు. లా రెండో సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ళపాటు పాత్రికేయ వృత్తిలోనే కొనసాగారు.  ఆంధప్రత్రికలో ఉండగానే ఆయన రాసిన వ్యాసాలు, శీర్షికలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అలా ఎన్‌.టి.రామారావు దృష్టిలో పడ్డారు వేటూరి. సినిమాల్లో పాటలు రాస్తే బాగుంటుందని ఆయన ప్రోత్సహించారు. ఆ విధంగా తొలిసారి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రంలో భారతనారి చరితము అనే హరికథ రాశారు. అలా చిత్ర రంగ ప్రవేశం చేసిన వేటూరికి రెండో అవకాశంగా ఎన్‌.టి.రామారావు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అడవిరాముడు చిత్రంలో అన్ని పాటలూ రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాటలతో ఒక్కసారిగా వేటూరి సుందరరామ్మూర్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరిమువ్వ చిత్రాల్లో అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరిమువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు వేటూరి.  1980లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలోని పాటలతో ఒక్కసారిగా వేటూరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం.. ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి సుందరరామ్మూర్తి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి.  ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే.. కృషి వుంటే మనుషులు రుషులౌతారు, మానసవీణా మధుగీతం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, రaుమ్మంది నాదం.. సై అంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి.., శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఆకాశ దేశాన.. ఆషాఢ మాసానా.., కిన్నెరసారి వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే, ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, సఖియా చెలియా.. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి కలం నుండి జాలువారిన మధురగీతాల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో 2011లో వచ్చిన బద్రినాథ్‌ చిత్రంలో ఓంకారేశ్వరి.. వేటూరి రాసిన చివరి పాట. ఈ సినిమా విడుదల కావడానికి సంవత్సరం ముందు 2010 మే 22న 75 ఏళ్ళ వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు వేటూరి సుందరరామ్మూర్తి.

60 ఏళ్ళ క్రితమే విజువల్‌ ఎఫెక్ట్స్‌లో వండర్స్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు బి.విఠలాచార్య!

( జనవరి 28 దర్శకుడు బి.విఠలాచార్య జయంతి సందర్భంగా..) 93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయి. వివిధ జోనర్స్‌లో సినిమాలు రూపొందించడం ద్వారా ఎంతో మంది దర్శకులు పరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. వారందరిలో ఎంతో భిన్నమైన డైరెక్టర్‌ అనిపించుకున్నవారు బి.విఠలాచార్య. అందరు డైరెక్టర్ల దారి వేరు, ఆయన దారి వేరు. ప్రేక్షకుల్ని ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్లి అక్కడి వింతలు, విడ్డూరాలు చూపించి, వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమే ఆయన లక్ష్యం. థియటర్‌కి వచ్చే ప్రేక్షకుల మనసు నిండా వినోదాన్ని, ఓ కొత్త అనుభూతిని నింపి పంపడమే ఆయనకు తెలుసు. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లోనే ట్రిక్‌ ఫోటోగ్రఫీ ద్వారా ప్రేక్షకుల్ని మాయ చేసి థ్రిల్‌ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జానపద చిత్రాలను తియ్యాలంటే విఠలాచార్యకు తప్ప మరొకరికి సాధ్యం కాదని నిరూపించుకొని జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు విఠలాచార్య. సినిమాలకు మ్యాజిక్‌ తప్ప లాజిక్‌ అవసరం లేదని గట్టిగా నమ్ముతారాయన. అందుకే ఆయన కెరీర్‌లో ఆ తరహా సినిమాలనే రూపొందించారు. అంతటి దర్శక మాంత్రికుడి సినీ జీవితం ఎలా ప్రారంభమైంది? ఆయన జీవితంలోని విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. 1920 జనవరి 28న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు విఠలాచార్య. ఆయన తండ్రి పద్మనాభాచార్య ఆయుర్వేద వైద్యుడు. అందరికీ ఉచితంగా వైద్యం చేసేవారు. విఠలాచార్యకు చిన్నతనం నుంచి నాటకాలు, యక్షగానాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన మూడో తరగతి వరకే చదువుకున్నారు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు 9 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయల్దేరారు. అరసికెరె పట్టణంలో తన కజిన్‌ నుంచి ఉడిపి రెస్టారెంట్‌ని కొనుగోలు చేసి కొన్నాళ్లు నిర్వహించారు. ఆ సమయంలోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు విఠలాచార్య. ఆ తర్వాత తన హోటల్‌ను తమ్ముడికి అప్పగించితన స్నేహితుడు శంకర్‌ సింగ్‌తో కలిసి  హసన్‌ జిల్లాలో ఓ టూరింగ్‌ టాకీస్‌ను తీసుకున్నారు. అందులో ప్రదర్శించే సినిమాలన్నింటినీ చూసి సినిమా అంటే టెక్నికల్‌గా ఎలా ఉంటుందో ఒక అవగాహన తెచ్చుకున్నారు.  తన స్నేహితుడితో కలిసి మహాత్మ పిక్చర్స్‌ అనే బేనర్‌ను స్టార్ట్‌ చేసి 18 సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత అతని నుంచి విడిపోయి సొంతంగా విఠల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి కన్నడలో శ్రీశ్రీనివాస కళ్యాణ పేరుతో తొలి చిత్రాన్ని నిర్మించారు. అలా కన్నడలోనే నాలుగు సినిమాలు నిర్మించిన తర్వాత వద్దంటే పెళ్లి చిత్రంతో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించారు విఠలాచార్య. కాంతారావు హీరోగా రూపొందించిన జయవిజయ చిత్రంతో జానపద చిత్రాల ఒరవడిని పెంచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, కాంతారావులతో వరసగా జానపద చిత్రాలు చేశారు. కనకదుర్గ పూజా మహిమ, బందిపోటు, చిక్కడు దొరకడు, అగ్గిబరాట, నిన్నే పెళ్లాడతా, భలే మొనగాడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీకటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం వంటి విజయవంతమైన జానపద చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్‌, కాంతారావులకు మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిన దర్శకుడు విఠలాచార్య. ఎన్టీఆర్‌తో 15 సినిమాలు చేశారు. అందులో 5 సినిమాలు ఆయన సొంత బేనర్‌లో నిర్మించినవే. 40 ఏళ్ళ కెరీర్‌లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 70 సినిమాలకు దర్శత్వం వహించారు విఠలాచార్య.  విఠలాచార్య సినిమాల్లో నటీనటులకే కాకుండా జంతువులకు, పక్షులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. సినిమా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలి అనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయంతో ఉండేవారు. బడ్జెట్‌ను ఎలా కంట్రోల్‌ చెయ్యాలి అనే విషయంలో ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నారు. ఒక సినిమా కోసం వేసిన సెట్‌ను కొన్ని మార్పులు చేసి తర్వాత సినిమాకి వాడేవారు. ఒకే సెట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఎక్కువ సెట్స్‌ వేసిన ఫీల్‌ తీసుకొచ్చేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలు కూడా ప్రధాన పాత్రలకు తప్ప మిగతా పాత్రలకు వాటినే వాడేవారు. ప్రేక్షకుల్ని తమ సినిమాలోని కథతో కట్టి పడెయ్యాలి. అప్పుడు ఈ తేడాలను వారు గుర్తించలేరు అని చెప్పేవారు విఠలాచార్య. నటీనటుల కాల్షీట్లు అడ్జస్ట్‌ కానప్పుడు, వారు సినిమా నుంచి తప్పుకున్నప్పుడు వారి పాత్రలను కోతులుగానో, చిలుకలుగానో మార్చేసి ఆటంకం లేకుండా సినిమా పూర్తి చేసేవారు.  ఇక తన సినిమా కోసం పనిచేసే నటీనటులకు, టెక్నీషియన్స్‌కి కమిట్‌ అయిన పారితోషికాన్ని విభజించి ప్రతినెలా ఒకటవ తేదీన అందరికీ చెక్కులు పంపించేవారు. తమ యూనిట్‌ పట్ల అంత శ్రద్ధ తీసుకునేవారు. సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని కూడా ప్రకటించి అదే రోజు రిలీజ్‌ చెయ్యడం ఆరోజుల్లో విఠలాచార్యకు మాత్రమే సాధ్యమైంది. జానపద చిత్రాల జోరు తగ్గిన తరుణంలో అక్కినేనితో బీదలపాట్లు అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు. ఆ తర్వాత తన పంథాను కొంత మార్చి నరసింహరాజు వంటి యంగ్‌ హీరోతో గంధర్వకన్య, జగన్మోహిని, మదనమంజరి, నవమోహిని, జై బేతాళ, మోహిని శపథం, వీరప్రతాప్‌ వంటి జానపద చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా కరుణించిన కనకదుర్గ.  విఠలాచార్య వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1944లో జయలక్ష్మీ ఆచార్యను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. సినిమాలకు దూరమైన తర్వాత మనవళ్ళతో, మనవరాళ్ళతో శేష జీవితాన్ని సంతోషంగా గడిపారు విఠలాచార్య. కొన్నాళ్ళకు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1999 మే 28న చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు. తన సినిమాలతో జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు పుట్టినరోజునే విఠలాచార్య కన్ను మూయడం యాధృశ్చికం. 

గుమ్మడి.. తన వయసుకి మించిన పాత్రలు చేయడం వెనుక అసలు కారణం అదే!

(జనవరి 26 నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు వర్థంతి సందర్భంగా..) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ నటుడికీ లేని ప్రత్యేకత గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉంది. ఆయన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎంతో విభిన్నమైనవి. చదువుకునే రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నత స్థానానికి చేరుకున్న రోజుల వరకు ఎక్కువ శాతం వృద్ధ పాత్రలు ధరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుమ్మడి చేసినన్ని వృద్ధ పాత్రలు ఏ నటుడూ చెయ్యలేదంటే అతిశయోక్తి కాదు. తనకంటే ఎన్నో సంవత్సరాలు పెద్దవారుగా ఉన్న నటులకు తండ్రిగా, తాతగా, బాబాయ్‌గా ఎంతో సహజంగా నటించి పేరు తెచ్చుకున్నారు. 1950లో నటుడిగా ప్రారంభమైన గుమ్మడి కెరీర్‌ దాదాపు 50 సంవత్సరాలు కొనసాగింది. తెలుగు, తమిళ్‌ భాషల్లో 500 చిత్రాల్లో నటించారు.  హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన గుమ్మడి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎలా మారారు? తన వయసుకు మించిన పాత్రలు చేయడానికి కారణం ఏమిటి? ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది వంటి ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం. 1927 జూలై 9న గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా అప్యాయత, అనుబంధాల మధ్య ఆయన బాల్యం గడిచింది. ఆయన చిన్నతనం నుంచి తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన వారితో స్నేహం చేసేవారు. అంతేకాకుండా, వారి కుటుంబంలో వృద్ధులు ఎక్కువగా ఉండేవారు. ఆ కారణంగానే ఆయనకు సాత్విక స్వభావం బాగా అబ్బింది. గుమ్మడి పాఠశాల విద్యాభ్యాసం రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో సాగింది. అక్కడ ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు చదివారు. పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు అడుగులు వేశారు. కమ్యూనిస్టు భావాలు పుణికిపుచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆ ఊరి మునసబు బుచ్చిరామయ్య.. గుమ్మడి తీరును గమనించి అతని మనసు మార్చారు. 17 సంవత్సరాల వయసులోనే గుమ్మడికి లక్ష్మీసరస్వతితో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత గుంటూరులోని హిందూ కాలేజీలో చేరారు గుమ్మడి.  స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే పేదరైతు అనే నాటకంలో నటించాలంటూ స్కూల్‌ మాస్టారు ఆదేశించడంతో వృద్ధుడి పాత్ర ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు గుమ్మడి. అలా రంగస్థల ప్రవేశం జరిగింది. గుమ్మడికి పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టం. ఆ ఊరి లైబ్రరీలోని పుస్తకాలను బాగా చదివేవారు. అలా వీరాభిమన్యు నాటకం చదివారు. అది ఆయన్ని ఎంతో ఆకర్షించింది. కొంతమంది స్నేహితుల్ని పోగేసి కొంత డబ్బు సమకూర్చుకొని వీరాభిమన్యు నాటకం వేశారు. అందులో దుర్యోధనుడిగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆరోజుల్లో దుర్యోధనుడి పాత్ర వేయడంలో పేరు మోసిన మాధవపెద్ది వెంకట్రామయ్య ఈ విషయం తెలుసుకొని గుమ్మడిని కలిసారు. తనకోసం మరోసారి ఆ నాటకాన్ని ప్రదర్శించమని అడిగారు. నాటకం చూసిన తర్వాత పౌరాణిక పాత్రలు పోషించడంలోని మెళకువలను గుమ్మడికి నేర్పించారు. అతని నటన చూసి సినిమాల్లోకి వెళితే రాణిస్తావు అని చెప్పారు. ఆ క్షణమే గుమ్మడి మనసు సినిమాలవైపు మళ్లింది.  ఆ తర్వాత మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసినా కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. చివరికి 1950లో వచ్చిన అదృష్టదీపుడు చిత్రంతో నటుడుగా తొలి అవకాశాన్ని పొందారు. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు, పేరంటాలు, ప్రతిజ్ఞ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఊరికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్‌.టి.రామారావుతో ఉన్న పరిచయం కారణంగా ఆయనకు ఒక మాట చెప్పి వెళ్లాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం తిరిగి వెళ్లొద్దని, నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పేరుతో ఓ నిర్మాణం సంస్థను ప్రారంభిస్తానని, తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో మద్రాస్‌లోనే ఉండిపోయారు గుమ్మడి. పిచ్చిపుల్లయ్య సినిమాలో ఆయనకు విలన్‌ పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత తోడుదొంగలు చిత్రంలో ఎన్టీఆర్‌, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.  తోడు దొంగలు చిత్రం తరువాత కూడా చిన్నచిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనకు అభించింది. అర్ధాంగిలో జమీందారు పాత్ర గుమ్మడికి చాలా మంచి పేరు తేవడమే కాకుండా సినిమా ఘనవిజయం సాధించింది. అలా తెలుగు చిత్ర సీమకు గంభీరమైన తండ్రి పాత్రలు చేయగల నటుడు లభించారు. ఈ సినిమా తర్వాత గుమ్మడి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయనకు లభించాయి. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో అయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అయితే ప్రతి సినిమాలోనూ దాదాపుగా తన వయసుకు మించిన పాత్రలే చేసేవారు గుమ్మడి. ఒక సినిమాలో తనకంటే పెద్ద వారైన ఎస్‌.వి.రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య కంటే వయసులో పెద్దవాడి పాత్ర పోషించారు.  పౌరాణిక చిత్రాల్లోని వశిష్ట, విశ్వామిత్ర పాత్రల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గుమ్మడి పోషించిన దశరథుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, సత్రజిత్‌, బలరాముడు, భృగు మహర్షి వంటి పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక సాంఘిక చిత్రాల్లో దాదాపుగా అన్నీ సాత్విక పాత్రలే పోషించారు గుమ్మడి. నమ్మినబంటు, లక్షాధికారి, విచిత్ర బంధం వంటి సినిమాల్లో విలన్‌గా కూడా మెప్పించారు. మాయాబజార్‌, మహామంత్రి తిమ్మరుసు, మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కుల గోత్రాలు, జ్యోతి, నెలవంక, మరోమలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏ సిరాతో?, గాజు బొమ్మలు, పెళ్ళి పుస్తకం చిత్రాలు.. ఆయన చేసిన అద్భుతమైన సినిమాల్లో కొన్ని మాత్రమే.  దాదాపు ఐదు దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగిన గుమ్మడిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో, భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. జాతీయ సినిమా అవార్డుల న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు గుమ్మడి. ఎన్టీఆర్‌ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తన జీవిత చరిత్రను తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. 1995లో వచ్చిన ఆయనకి ఇద్దరు చిత్రంలో నటించినపుడు తన గొంతు సరిగా లేకపోవడంవల్ల నూతన్‌ప్రసాద్‌తో డబ్బింగ్‌ చెప్పించారు. తనకు వేరొకరు డబ్బింగ్‌ చెప్పడం ఇష్టం లేక సినిమాల్లో నటించడం మానుకున్నారు. ఆ తర్వాత 2008లో జగద్గురు శ్రీకాశీనాయన చరిత్ర చిత్రంలోని పాత్రకు గొంతు సరిపోతుంది కాబట్టి నటించారు. అదే ఆయన చివరి సినిమా. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 2008 తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2010 జనవరి 26న హైదరాబాద్‌లోని కేర్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన చూసిన చివరి సినిమా రంగుల్లోకి మార్చిన మాయాబజార్‌. ఈ చిత్రాన్ని ఆయన ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో చూశారు. ‘అంతటి గొప్ప సినిమాను రంగుల్లో చూసేందుకే నేను ఇంతకాలం బ్రతికి వున్నాను అనుకుంటున్నాను’ అంటూ సంతోషంగా అన్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు.

మాస్‌ మహారాజ్‌ రవితేజ.. ఇలా అనిపించుకోవడం వెనుక ఉన్నది మెగాస్టార్‌ చిరంజీవి!

  ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్‌ లేకుండా కేవలం టాలెంట్‌తో, స్వయంకృషితో స్టార్‌ హీరోగా ఎదిగిన మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే పరిశ్రమకు వచ్చినవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్‌ చేరుకున్న రవితేజ చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడంతోపాటు కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా వర్క్‌ చేశారు. దాదాపు పది సంవత్సరాలపాటు కష్టపడిన తర్వాతే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగారు. 35 సంవత్సరాల సినీ కెరీర్‌లో 74 సినిమాలు పూర్తి చేసిన రవితేజ 75వ సినిమా మాస్‌ జాతరతో సమ్మర్‌లో రాబోతున్నారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొంది మంచి మాస్‌ హీరోగా అనిపించుకోవడమే కాకుండా మాస్‌ మహరాజ్‌గా పేరు తెచ్చుకున్న రవితేజ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అతను పడిన శ్రమ ఎలాంటిది, ఒక స్టార్‌ హీరోగా ఎదగడం వెనుక ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే విషయాలు ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. (Ravi Teja)   1968 జనవరి 26న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో భూపతిరాజు రాజగోపాలరాజు, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించారు రవితేజ. ఆయన అసలు పేరు భూపతిరాజు రవిశంకర్‌రాజు. ఆయన తమ్ముళ్లు రఘు, భరత్‌. తండ్రి ఫార్మాసిస్టు కావడంతో జైపూర్‌, ఢల్లీి, ముంబై, భోపాల్‌ వంటి ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. చివరికి వీరి కుటుంబం విజయవాడకు చేరింది. అక్కడ సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో బి.ఎ. పూర్తి చేశారు రవితేజ. సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల పై చదువులకు వెళ్ళకుండా మద్రాస్‌ రైలెక్కేశారు. అతనికి డైరెక్షన్‌పై కూడా ఇంట్రెస్ట్‌ ఉండడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేందుకు చాలా మందిని కలిశారు. ఆ సమయంలో గుణశేఖర్‌, వై.వి.ఎస్‌.చౌదరిలతో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారు రవితేజ. అప్పటికి వాళ్ళు కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలోనే కర్తవ్యం చిత్రంలో తొలిసారి ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత అరడజను సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌ చేశారు. నిన్నే పెళ్లాడతా చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచి అమితాబ్‌ బచ్చన్‌ అభిమాని అయిన రవితేజ కొందరు హీరోలను ఇమిటేట్‌ చేసేవారు. అతనిలోని టాలెంట్‌ ఉందని గుర్తించిన కృష్ణవంశీ బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా సిందూరం చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా విజయం సాధించలేదుగానీ రవితేజకు నటుడుగా మంచి పేరు వచ్చింది.    సిందూరం తర్వాత యధావిధిగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రవితేజ హీరోగా నీకోసం చిత్రాన్ని రూపొందించారు శ్రీను వైట్ల. కమర్షియల్‌గా ఫర్వాలేదు అనిపించిన ఈ సినిమా 7 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ హీరోగా సక్సెస్‌ కాలేకపోయారు. ఆ తర్వాత కూడా సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రవితేజ 2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో హీరోగా తన మార్క్‌ చూపించగలిగారు. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో కమర్షియల్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకొని హీరోగా తన టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్నారు.    2002లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్‌ చిత్రంతో కమర్షియల్‌ హీరోగా ఎదిగారు రవితేజ. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా రవితేజకు ఒక డిఫరెంట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, భద్ర వంటి సినిమాలు రవితేజను పక్కా మాస్‌ హీరోగా నిలబెట్టాయి. 2006లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు చిత్రంతో స్టార్‌ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అప్పుడు మొదలు రవితేజ కెరీర్‌ మంచి సక్సెస్‌ రేట్‌తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. నేనింతే, కిక్‌, డాన్‌ శీను, మిరపకాయ్‌, బలుపు, పవర్‌, బెంగాల్‌ టైగర్‌, రాజా ది గ్రేట్‌ వంటి కమర్షియల్‌ సినిమాలతో తన ఇమేజ్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు రవితేజ. ఇటీవలి కాలంలో రవితేజ కెరీర్‌ కాస్త మందకొడిగా నడుస్తోంది. గడిచిన ఏడు సంవత్సరాల్లో రవితేజ 12 సినిమాల్లో నటించగా, వాటిలో క్రాక్‌, ధమాకా వంటి సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ సాధించాయి. ప్రస్తుతం భాను బొగ్గవరపు దర్శకత్వంలో మాస్‌ జాతర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్‌ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.    రవితేజ నటుడిగానే కాకుండా నిర్మాతగా ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ పతాకంపై తమిళ్‌లో మట్ట కుస్తీ, తెలుగులో రావణాసుర, ఛాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్‌ వంటి చిత్రాలను నిర్మించారు. ఖడ్గం చిత్రంలోని నటనకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు, నేనింతే చిత్రానికి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు రవితేజ. వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. 2002లో కళ్యాణితో రవితేజ వివాహం జరిగింది. వీరికి కుమార్తె మోక్షధ, కుమారుడు మహాధన్‌ ఉన్నారు. రవితేజ సోదరులు రఘు, భరత్‌రాజు కూడా పలు చిత్రాల్లో నటించారు. 2017లో భరత్‌రాజు ఓ కార్‌ యాక్సిడెంట్‌లో మృతి చెందారు. (జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా..)  

రవితేజ టాప్-10 మూవీస్.. మీ ఫేవరెట్ ఏది..?

  మాస్ మహారాజ రవితేజ సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ గా ఎదిగాడు. మూడు దశాబ్దాలకు పైగా సినీ జర్నీతో 74 సినిమాలు చేశాడు రవితేజ. త్వరలో తన 75వ సినిమా 'మాస్ జాతర'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో టాప్ సినిమాలను గుర్తు చేసుకుందాం. (Ravi Teja)   సింధూరం: అప్పటివరకు సహాయక పాత్రల్లో నటించిన రవితేజ, తొలిసారి బ్రహ్మాజీతో కలిసి హీరోగా నటించాడు. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1997 లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటుడిగానూ రవితేజకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.   ఇడియట్: 'నీ కోసం' సినిమాతో సోలో హీరోగా మారిన రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన చిత్రమంటే 'ఇడియట్' అని చెప్పవచ్చు. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 'ఇడియట్' సినిమా అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే యూత్ లో, మాస్ లో రవితేజకు తిరుగులేని ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది.   ఖడ్గం: సింధూరం, సముద్రం తర్వాత రవితేజ-కృష్ణవంశీ కలయికలో వచ్చిన చిత్రం 'ఖడ్గం'. ఈ చిత్రం నటుడిగా రవితేజను మరో మెట్టు ఎక్కించింది. 'ఖడ్గం' చిత్రానికి రవితేజ నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నాడు.   అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి: 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్' తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. ఈ స్పోర్ట్స్ డ్రామాలో రవితేజ పోషించిన చందు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ అల్లరి, ఆటిట్యూడ్ యూత్ ని కట్టిపడేశాయి.   వెంకీ: రవితేజ కెరీర్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో 'వెంకీ' ఒకటి. 'నీ కోసం' తర్వాత రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 'వెంకీ' సినిమా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించి, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా, ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్.   భద్ర: బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'భద్ర'. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉండేలా బోయపాటి రూపొందిన ఈ చిత్రం.. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.   విక్రమార్కుడు: రవితేజ ద్విపాత్రాభినయం పోషించిన విక్రమార్కుడు సినిమాకి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించాడు. అత్తిలి సత్తిబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్ గా పూర్తి వైవిధ్యమున్న పాత్రల్లో రవితేజ నటనను అంత తేలికగా మరచిపోలేము.   కృష్ణ: వెంకీ తర్వాత రవితేజ ఆ స్థాయిలో నవ్వులు పంచిన చిత్రం 'కృష్ణ'. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బ్రహ్మానందంతో కలిసి కుడుపుబ్బా నవ్వించాడు రవితేజ.   నేనింతే: నటుడిగా రవితేజ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలలో 'నేనింతే' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు.   కిక్: రవితేజ ఎనర్జీని, కామెడీ టైమింగ్ ని పూర్తి స్థాయిలో వాడుకున్న సినిమాల్లో 'కిక్' ముందు వరుసలో ఉంటుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో రవితేజ చేసిన అల్లరికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.   వీటితో పాటు 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', 'నా ఆటోగ్రాఫ్', 'దుబాయ్ శీను', 'శంభో శివ శంభో', 'మిరపకాయ్' ఇలా రవితేజ నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి.  

నభూతో నభవిష్యతి అంటే.. ఆ సినిమాలో నరేష్‌ చేసిన క్యారెక్టర్‌ అనే చెప్పాలి!

(జనవరి 20 నటుడు నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా..) నవరసాల్లో హాస్యాన్ని పండించడం అనేది చాలా కష్టం అనే విషయాన్ని ప్రతి కళాకారుడు ఒప్పుకుంటాడు. హాస్యాన్ని తమ నటనలో పలికించగల నటులు ఏ రసాన్నయినా అవలీలగా పోషించగలరు అని ఎంతో మంది హాస్యనటులు ప్రూవ్‌ చేశారు. మన సినిమాల్లో హాస్యం ఒక ట్రాక్‌గా ఉండేది. ఆ తర్వాత హాస్యం ప్రధానంగా హీరోలతోనే నవ్వించే ప్రయత్నం 80వ దశకం నుంచి ప్రారంభమైంది. అంతకుముందు కూడా అలాంటి సినిమాలు వచ్చినా అవి అడపా దడపా వచ్చేవి. పూర్తి స్థాయి హాస్య చిత్రాల ఒరవడి పెరిగింది మాత్రం జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు చేసిన కామెడీ సినిమాల వల్లే. వీరి డైరెక్షన్‌లో చంద్రమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి హీరోలు ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాతి స్థానాన్ని నరేష్‌ దక్కించుకున్నారు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో నటించిన నరేష్‌.. కామెడీ సినిమాలతోనే రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. 1960 జనవరి 20న విజయనిర్మల, కె.ఎస్‌.మూర్తి దంపతులకు జన్మించారు. నరేష్‌ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. 12 సంవత్సరాల వయసులో పండంటి కాపురం చిత్రంలో తొలిసారి నటించారు నరేష్‌. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించడంతో సినిమా పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే విజయనిర్మలకు మాత్రం నరేష్‌ని ఒక డాక్టర్‌గా చూడాలన్న కోరిక ఉండేది. కానీ, చదువు కంటే సినిమాలపైనే అతని ఆసక్తి ఉందని గ్రహించిన విజయనిర్మల అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ప్రేమ సంకెళ్ళు పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. హిందీలో విజయవంతమైన లవ్‌స్టోరీ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే జంధ్యాల దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. అదే నాలుగు స్తంభాలాట. నరేష్‌ మొదటి సినిమా ప్రేమసంకెళ్ళు అయినప్పటికీ మొదట రిలీజ్‌ అయిన సినిమా మాత్రం నాలుగు స్తంభాలాట. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో నరేష్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ప్రేమసంకెళ్లు విజయం సాధించలేదు.  ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే పుత్తడిబొమ్మ, రెండుజెళ్ళ సీత చిత్రాల్లో నటించారు నరేష్‌. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే రామోజీరావు నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో నరేష్‌కి హీరోగా మంచి బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా జంధ్యాల దర్శకత్వంలో హాస్య ప్రధాన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కామెడీ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఇతర యాక్షన్‌, సెంటిమెంట్‌ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. దాదాపు 15 సంవత్సరాల పాటు హీరోగా, సెకండ్‌ హీరోగా, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు నరేష్‌. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పటికీ వివిధ పాత్రల్లో నటిస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.  నరేష్‌ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా ఆయన లేడీ గెటప్‌లో కనిపించిన చిత్రం భళారే విచిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నరేష్‌ నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్‌ గురించి దర్శకుడు పి.ఎన్‌.రామచంద్రరావు చెప్పిన తర్వాత పాత తరం హీరోయిన్లయిన సావిత్రి, బి.సరోజాదేవి, విజయనిర్మల వంటివారి సినిమాలు చూసి వాళ్లు నడుస్తారు, వారి బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది వంటి విషయాల గురించి తెలుసుకున్నారు. ఆ గెటప్‌ కోసం ఎంతో కేర్‌ తీసుకున్నారు. షూటింగ్‌ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు నుంచే తన డైట్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా 11 కేజీల బరువు తగ్గారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఒళ్లంతా షేవింగ్‌ చేయించుకొని అమ్మాయిల శరీరంలా స్మూత్‌గా కనిపించేందుకు కృషి చేశారు. అలా చేయడం వల్ల స్కిన్‌ ఎలర్జీ వచ్చినప్పటికీ దాన్ని కూడా భరించి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో మెయిన్‌ అంశాలు చెప్పుకోదగ్గవి రెండు. ఒకటి బ్రహ్మానందం కామెడీ, రెండు నరేష్‌ వేసిన లేడీ గెటప్‌. నరేష్‌ వేసిన లేడీ గెటప్‌ ఎంతో ప్రభావం చూపించింది. ఈ సినిమా రిలీజ్‌ అయ్యే వరకు నరేష్‌ గెటప్‌ని ఎక్కడా రివీల్‌ చెయ్యలేదు దర్శకనిర్మాతలు. రిలీజ్‌కి ముందు సితార పత్రికలో నరేష్‌ గెటప్‌ని బ్లో అప్‌గా వేశారు. ఆ ఫోటో చూసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి ఎంతో ముచ్చటపడ్డారు. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్‌ వచ్చిందని, తమ నెక్స్‌ట్‌ సినిమాలో ఆమెను బుక్‌ చేయమని తన అసిస్టెంట్స్‌కి చెప్పారట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎం.ఎస్‌.రెడ్డి. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత నరేష్‌ వేసిన లేడీ గెటప్‌కి మంచి అప్లాజ్‌ వచ్చింది. రాష్ట్రంలోని చాలా థియేటర్స్‌లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. చిత్రం భళారే విచిత్రం సినిమాలో నభూతో నభవిష్యతి అన్నట్టు నరేష్‌ నటించారు. ఆ సినిమా 32 సంవత్సరాల క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ ఆ సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. 

555 సిగరెట్‌ వల్ల తొలి అవకాశాన్ని చేజార్చుకున్న కృష్ణంరాజు!

(జనవరి 20 కృష్ణంరాజు జయంతి సందర్భంగా...) మహానటులుగా, పెద్ద స్టార్స్‌గా ఎదిగిన వారంతా తొలిరోజుల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన వారే. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఎన్నో కష్టాలు పడినవారే. అయితే కొందరు మాత్రం క్రమశిక్షణా లోపం వల్ల చేజేతులా అవకాశాల్ని వదులుకుంటూ వుంటారు. తర్వాతి కాలంలో తమ తప్పును సరిదిద్దుకొని ఎన్నో మంచి సినిమాల్లో నటించి స్టార్స్‌గా ఎదిగారు. అలాంటివారిలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఒకరు. స్వతహాగా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన కృష్ణంరాజు.. కొందరు నటుల్లా తొలిరోజుల్ని పస్తులతో గడపలేదు. అయితే అతనికి సినిమాల్లో నటించాలనిగానీ, హీరో అయిపోవాలని గానీ కోరిక లేదు. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత స్టార్‌ హీరో అయిపోయారు.  హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన కృష్ణంరాజుకు చిన్నతనం నుంచీ ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర రకరకాల కెమెరాలు కూడా ఉండేవి. ఆ అభిరుచితోనే హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఓ ఫోటో స్టూడియోను ప్రారంభించారు. ఆ స్టూడియోలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే వ్యక్తి.. కృష్ణంరాజును రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసి డిస్‌ప్లేలో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన కొందరు.. సినిమా హీరోలా ఉన్నావని అనేవారు. ఆ క్రమంలోనే ఒక వ్యక్తి కృష్ణంరాజు దగ్గరికి వచ్చి సినిమాల్లో అవకాశమిప్పిస్తానని మద్రాస్‌ తీసుకెళ్లాడు. మేకప్‌ టెస్ట్‌ కూడా చేయించాడు. కానీ, ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత తను మోసపోయానని గ్రహించారు కృష్ణంరాజు. విషయం తెలిస్తే స్నేహితుల దగ్గర అవమానం తప్పదని భావించిన ఆయన హైదరాబాద్‌ వచ్చి స్టూడియోను అమ్మేసి ఆ డబ్బుతో మద్రాస్‌ వెళ్లిపోయారు. ఎలాగైనా సినిమాల్లో అవకాశం సంపాదించాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు.  అదే సమయంలో వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు సుందర్‌లాల్‌ నహతా, డూండీ. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు. టైటిల్‌ రోల్‌లో నటించేందుకు ఒక అందమైన, చురుకైన యువకుడి కోసం చూస్తున్నారు. అంతకుముందు వచ్చిన నర్తనశాల, పాండవవనవాసం చిత్రాల్లో అభిమన్యుడిగా హరనాథ్‌ నటించారు. కాబట్టి అతన్నే తీసుకుందామని నిర్మాత డూండీ అన్నారు. కానీ, దానికి మధుసూదనరావు ఒప్పుకోలేదు. రొటీన్‌గా వెళ్ళడం ఎందుకు ఎవరైనా కొత్త కుర్రాడిని పరిచయం చేద్దాం అన్నారు. ఈ డిస్కషన్‌ జరిగిన రోజు డూండీ మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్‌కి వెళ్లారు. అక్కడ కనిపించిన కృష్ణంరాజు ఆయన్ని ఆకర్షించారు. ఆరడుగులపైన ఎత్తు ఉన్న కృష్ణంరాజు అభిమన్యుడు పాత్రకు సరిపోతాడనిపించింది. అతను కూడా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న డూండీ.. తాము చేస్తున్న సినిమా వివరాలు చెప్పి ఆఫీస్‌కి రమ్మన్నారు.  మరుసటి రోజు డూండీ చెప్పిన అడ్రస్‌కి వెళ్ళారు కృష్ణంరాజు. అక్కడ డూండీ ఉన్నారుకానీ డైరెక్టర్‌ మధుసూదనరావు లేరు. ఆయన వచ్చే వరకు వెయిట్‌ చెయ్యమని కృష్ణంరాజుకు చెప్పారు డూండీ. బయట హాల్‌లోకి వచ్చారు కృష్ణంరాజు. అప్పట్లో ఆయనకు 555 సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. అందుకే వెయిట్‌ చేసే క్రమంలో మధ్య మధ్య బయటికి వెళ్లి సిగరెట్‌ తాగేవారు. అలా కొన్ని గంటల సేపు ఎదురుచూసినా డైరెక్టర్‌ రాకపోవడంతో ఏమీ తోచక బయటికి వచ్చారు. అలా వస్తున్నప్పుడు 555 సిగరెట్‌ ప్యాకెట్‌ను బల్లమీద మర్చిపోయారు. కృష్ణంరాజు అలా బయటికి వెళ్లిన కొద్ది సేపటికే డైరెక్టర్‌ మధుసూదనరావు ఆఫీస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. వచ్చీ రావడంతోనే టేబుల్‌పై ఉన్న సిగరెట్‌ ప్యాకెట్‌ను చూశారు. డైరెక్టర్‌గారు వచ్చారన్న విషయం తెలుసుకున్న కృష్ణంరాజు ఆఫీస్‌లోకి వెళ్లారు. అప్పుడు మధుసూదనరావు అడిగిన తొలి ప్రశ్న ‘ఆ బల్లమీద ఉన్న సిగరెట్‌ ప్యాకెట్‌ నీదేనా?’ అని. దానికి కృష్ణంరాజు ‘నాదే సార్‌’ అని చెప్పారు. ‘నీకు మా సినిమాలో అవకాశం ఇవ్వడం లేదు. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అని నిక్కచ్చిగా చెప్పారు మధుసూదనరావు. అప్పటివరకు ఆయన కోసం వెయిట్‌ చేసిన కృష్ణంరాజుకు కోపం వచ్చింది. చిన్నతనం నుంచి కాస్త దుందుడుకుగా ఉండే ఆయన డైరెక్టర్‌ మధుసూదనరావుపై తన కోపాన్ని ప్రదర్శించారు. ‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇస్తానంటేనే నేను వచ్చాను. ఇప్పుడు లేదంటే ఎలా’ అంటూ నిలదీశారు. దానికి మధుసూదనరావు ‘నాకు సిగరెట్‌ తాగేవాళ్ళంటే ఇష్టం ఉండదు. నాకోసం నీ అలవాట్లు మార్చుకోవడం నాకిష్టం లేదు. అలాగే సిగరెట్‌ తాగేవాళ్ళకు అవకాశం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు’ అని చెప్పారు. ఆ మాటతో చేసేది లేక వెనుదిరిగారు కృష్ణంరాజు. అలా ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ వల్ల మంచి అవకాశాన్ని వదులుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత అభిమన్యుడి పాత్రలో శోభన్‌బాబును తీసుకున్నారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత ‘చిలకా గోరింకా’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు.