నటుడిగా ఓ వెలుగు వెలిగిన రంగనాథ్‌ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలుసా?

(జూలై 17 నటుడు రంగనాథ్‌ జయంతి సందర్భంగా..) సినిమా అనేది ఓ విచిత్ర ప్రపంచం. అందులోనూ సినిమా వారి జీవితాలు మరింత విచిత్రంగా ఉంటాయి. ఎవరి జీవితం ఎలా సాగుతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో చివరికి ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో అందంగా సాగిపోతున్న జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం, దాంతో ఒక్కసారిగా వారు అంధకారంలోకి జారిపోవడం మనం చూశాం. అలా నటుడు రంగనాథ్‌ జీవితం విషాదాంతంగా ముగిసింది.  రంగనాథ్‌ పూర్తిపేరు.. తిరుమల సుందర శ్రీ రంగనాథ్‌. 1949 జూలై 17న టీఆర్‌ సుందర రాజు, టీఆర్‌ జానకి దేవి దంపతులకు జన్మించిన రంగనాథ్‌.. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ఆ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభావంతో ఎదుగుతూ.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో బీఏ డిగ్రీ పట్టా పొందారు. ఆ అర్హతతోనే భారత రైల్వేస్‌ లో టికెట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం పొందిన రంగనాథ్‌ ని.. రంగుల ప్రపంచం ఎంతగానో ఆకర్షించింది. ఈ క్రమంలోనే.. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుతో దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన ‘బుద్ధిమంతుడు’ సినిమాలో రంగనాథ్‌కి చిన్న వేషం దక్కింది. 1969లో రిలీజైన ఈ సినిమా తరువాత వెంటనే అవకాశాలు రాకపోయినా.. 1974లో రూపొందిన ‘చందన’లో కథానాయకుడి పాత్ర దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న రంగనాథ్‌.. ఆపై ‘జమీందారు గారి అమ్మాయి’, ‘పల్లెసీమ’, ‘పంతులమ్మ’, ‘రామచిలుక’, ‘అమెరికా అమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘మా ఊరి దేవత’, ‘దేవతలారా దీవించండి’, ‘ఇంటింటి రామాయణం’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు.  హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ సరైన సినీ నేపథ్యం, ప్రోత్సహించేవారు లేకపోవడంతో తన అర్హతకు తగ్గ స్థాయికి వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ నిరాశపడక తనను వరించిన అవకాశాలతో ముందుకు సాగారు. ‘ఎర్రమల్లెలు’, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘ఇది కాదు ముగింపు’ వంటి ఆలోచనాత్మక చిత్రాల్లో ఆకట్టుకున్న రంగనాథ్‌.. ‘ఖైదీ’, ‘పల్నాటి సింహం’, ‘అడవి దొంగ’, ‘కలియుగ కృష్ణుడు’, ‘దొంగ మొగుడు’, ‘అంతిమ తీర్పు’, ‘స్టేట్‌ రౌడీ’, ‘ముత్యమంత ముద్దు’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమ సింహం’, ‘బృందావనం’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘స్నేహితులు’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘కలిసుందాం.. రా’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో ‘మొగుడ్స్‌ పెళ్ళామ్స్‌’ చిత్రాన్ని రూపొందించి దర్శకుడుగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.  ఓ పక్క సినిమాలు చేస్తూనే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగవతం’తో బుల్లితెరపై తొలిసారిగా మెరిసిన రంగనాథ్‌.. ఆపై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్‌ ‘శాంతి నివాసం’తో సందడి చేశారు. ‘మై నేమ్‌ ఈజ్‌ మంగతాయారు’, ‘ఇద్దరు అమ్మాయిలు’, ‘అత్తో అత్తమ్మ కూతురో’, ‘మొగలిరేకులు’ వంటి ధారావాహికల్లో కూడా రంజింపజేశారు. మొత్తంగా.. నాలుగు దశాబ్దాలకి పైగా సినీ జీవితంలో 300కి పైగా చలనచిత్రాల్లో కథానాయకుడిగా, సహాయకనటుడిగా, ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా పలు వేషాల్లో మురిపించారు రంగనాథ్‌.  వెండితెర జీవితంలో తన అభినయంతో వెలుగులు పంచిన రంగనాథ్‌.. నిజజీవితంలోనూ భర్తగా, తండ్రిగా బాధ్యాతయుతంగా ముందుకు సాగారు. తన శ్రీమతి తిరుమల చైతన్య ఓ ప్రమాదం కారణంగా వీల్‌ ఛైర్‌ కే పరిమితమైన సమయంలో.. నాలుగేళ్ళ పాటు భర్తగా పలు సపర్యలు చేశారు రంగనాథ్‌. అయితే 2009లో శ్రీమతి తిరుమల చైతన్య తనువు చాలించాక.. రంగనాథ్‌ ఆలోచనాధోరణి మారిపోయింది. భార్యావియోగంతో ఒంటరి జీవితాన్ని గడపలేక సతమతమైన ఆయన.. 2015 డిసెంబర్‌ 19న తన ఆలోచన శైలికి భిన్నంగా ఆత్మహత్య చేసుకున్నారు. అలా.. ఓ విషాదాంత సినిమాలా ఆయన జీవితం ముగిసింది. 

ఉత్తమ దర్శకుడుగా 5 జాతీయ అవార్డులు అందుకున్న భారతీరాజా!

(జూలై 17 దర్శకుడు భారతీరాజా పుట్టినరోజు సందర్భంగా..) ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. వారి అభిరుచికి అనుగుణంగా కథలు ఎంపిక చేసుకుంటే ఎక్కువ సక్సెస్‌ సాధించగలుగుతారు దర్శకులు. ఏ ట్రెండ్‌ అయినా ఓ పది సంవత్సరాలు ఉంటుంది. ఆ కాలంలో ఆ తరహా సినిమాలే వస్తుంటాయి. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తుంటారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచిస్తారు. అలాంటి కొత్త ఆలోచనలతో 1970వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు భారతీరాజా. ఆ సమయంలో మన సినిమాల్లోని కథలు.. హీరో, హీరోయిన్‌ ప్రేమించుకోవడం ఆ తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి విడిపోవడం, చివరలో కలుసుకోవడంతో ముగుస్తుంది. దానికి భిన్నంగా కథలు ఉండాలన్న ఆలోచన భారతీరాజాకు ఉండేది. అలాంటి కథలతోనే సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నారు. తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించిన భారతీరాజాకు ఇండియన్‌ సినిమాలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం రొటీన్‌కి భిన్నంగానే ఉంటాయి. దర్శకుడిగానే కాదు, నటుడుగా కూడా ఎన్నో సినిమాలు చేశారు భారతీరాజా. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా ఆణిముత్యాల్లాంటి సినిమాలతో తనదైన ముద్ర చూపించారు.  1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించారు భారతీరాజా. ఆయన అసలు పేరు చిన్నస్వామి. సినిమాలపై ఆసక్తి ఉండడంతో మద్రాస్‌ చేరుకొని కన్నడ డైరెక్టర్‌ పుట్టణ్న కనగళ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత పి.పుల్లయ్య వంటి ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేశారు. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘16 వయతనిలే’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు భారతీరాజా. 1977లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రేమకథను ఇలా కూడా తియ్యొచ్చు అని ఈ సినిమాతో నిరూపించారు భారతీరాజా. ఆ మరుసటి సంవత్సరం ఇదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో రీమేక్‌ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది.  భారతీరాజా తెలుగులో నాలుగు సినిమాలు మాత్రమే డైరెక్ట్‌ చేశారు. అవి కొత్త జీవితాలు, సీతాకోక చిలక, ఆరాధన, జమదగ్ని. వీటిలో కొత్త జీవితాలు, సీతాకోక చిలక సూపర్‌హిట్‌ అయ్యాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా తమిళ్‌లో ఆయన చేసిన సూపర్‌హిట్‌ సినిమాలను తెలుగులోకి అనువదించేవారు లేదా రీమేక్‌ చేసేవారు. నందమూరి బాలకృష్ణకు మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మంగమ్మగారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. అలాగే కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా తమిళ్‌లో రూపొందిన సిగప్పు రోజాక్కాల్‌ చిత్రాన్ని తెలుగులో ఎర్రగులాబీలు పేరుతో డబ్‌ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన టిక్‌టిక్‌టిక్‌ చిత్రం కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.  దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు భారతీరాజా. అయితే ఆయన నటించిన సినిమాలన్నీ తమిళ్‌లో రూపొందినవే. అందులో చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అలాగే తమిళ్‌లో కొన్ని టీవీ సీరియల్స్‌కి కూడా భారతీరాజా దర్శకత్వం వహించారు. కొందరు తమిళ నటులకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. భారతీరాజా తన కెరీర్‌లో అన్నీ వైవిధ్యమైన సినిమాలే చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఉత్తమ దర్శకుడిగా 5 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇవి కాక ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు అనేకం ఉన్నాయి. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలక చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు.. ఇలా 5 అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది. 

సినిమాటోగ్రఫీకే కొత్త వన్నె తెచ్చిన వి.ఎస్‌.ఆర్‌.స్వామి!

  ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటుంటారు. కానీ, డైరెక్టర్‌కి సమాన స్థాయిలో పనిచేసే మరో టెక్నీషియన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ. ఒక సినిమా అద్భుతంగా రావడానికి కథ, కథనాలు, నటీనటుల అభినయం ముఖ్యం. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడం దర్శకుడు చెయ్యాల్సిన పని. అయితే ఆ సన్నివేశాన్ని డైరెక్టర్‌ ఊహకు తగ్గట్టుగా తెరకెక్కించడం అనేది సినిమాటోగ్రాఫర్‌ పని. ఒక సీన్‌ని డైరెక్టర్‌ ఎంత అందంగా చెప్పినా దాన్ని స్క్రీన్‌ మీద అదే స్థాయిలో సినిమాటోగ్రఫర్‌ చిత్రీకరించలేకపోతే డైరెక్టర్‌ కూడా ఫెయిల్‌ అవుతాడు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండిరగ్‌తో పనిచేస్తేనే మంచి సినిమా తయారవుతుంది. సినిమా మొదలైన నాటి నుంచి ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లు అద్భుతమైన సినిమాలతో తమ ప్రతిభను చాటుకున్నారు. అయితే ఒక సినిమాటోగ్రాఫర్‌కి స్టార్‌ స్టేటస్‌ రావడం అనేది వి.ఎస్‌.ఆర్‌.స్వామితోనే మొదలైంది. సినిమాటోగ్రాఫర్‌గా అతన్ని తీసుకుంటే చాలు తన సినిమాకి ఢోకా లేదు అనే నమ్మకం డైరెక్టర్లకు కలిగించారు స్వామి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలకు వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఛాయాగ్రహణ దర్శకుడిగా వ్యవహరించారు. సినిమా రంగంలో ఫోటోగ్రఫీనే ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి సినిమాలకు పనిచేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1935 జూలై 15న కృష్ణా జిల్లా వలివర్తిపాడు గ్రామంలో జన్మించారు వి.ఎస్‌.ఆర్‌.స్వామి. చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టపడేవారు స్వామి. ఆ ఆసక్తితోనే సినిమాటోగ్రాఫర్‌ సి.నాగేశ్వరరావు దగ్గర చేరారు. పాండవ వనవాసం, గుడిగంటలు, ఆస్తులు, అంతస్తులు, ఆరాధన వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు సి.నాగేశ్వరరావు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించారు. ఆయన దగ్గర సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు స్వామి. ఆ తర్వాత రవికాంత్‌ నగాయిచ్‌, ఎస్‌.శంకర్‌ల వద్ద కూడా పనిచేశారు. అలాగే వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు ఆపరేటివ్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన అసాధ్యుడు చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు స్వామి.    వి.ఎస్‌.ఆర్‌.స్వామి పనితనం బాగా నచ్చడంతో తను నటించిన చాలా సినిమాలు, కొన్ని సొంత సినిమాలు అతనితోనే చేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు స్వామి. సినిమా చిత్రీకరణలో ఎన్నో ప్రయోగాలు చేశారు. 1986లో కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి 70 ఎంఎం సినిమా సింహాసనంకు స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వి.ఎస్‌.ఆర్‌.స్వామి దగ్గర ఎం.వి.రఘు, ఎస్‌.గోపాలరెడ్డి, సి.రాంప్రసాద్‌ శిష్యరికం చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్లుగా ఎదిగారు.    సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన అల్లూరి సీతారామరాజు అంత అద్భుతంగా రావడం వెనుక డైరెక్టర్లు వి.రామచంద్రరావు, కృష్ణలతోపాటు వి.ఎస్‌.ఆర్‌.స్వామి కృషి కూడా ఎంతో ఉంది. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌ అయ్యాయి. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అందాలరాముడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ, ఖైదీ, కొండవీటి దొంగ, రౌడీ ఇన్‌ స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాలు వాటిలో కొన్ని మాత్రమే. వి.ఎస్‌.ఆర్‌.స్వామిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లుగా తమ ప్రతిభను నిరూపించుకున్నారు.    సినిమాటోగ్రాఫర్‌గానే కాదు, దర్శకుడుగా తెలుగులో ఆపద్బాంధవులు, హిందీలో మహాశక్తిమాన్‌ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఎదురీత చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ ద్వారా బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు వి.ఎస్‌.ఆర్‌.స్వామి. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన చివరి సినిమా ప్రభాస్‌ హీరోగా నటించిన ‘అడవిరాముడు’. 40 సంవత్సరాల కెరీర్‌లో 250 సినిమాలకు ఛాయాగ్రహణాన్ని అందించారు స్వామి. టెక్నికల్‌గా సినిమా పరిశ్రమ ఎదుగుతున్న వివిధ దశల్లో తన సినిమాటోగ్రఫీతో ఎన్నో ప్రయోగాలు చేసిన వి.ఎస్‌.ఆర్‌.స్వామి 2008 నవంబర్‌ 12న 70 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.   (జూలై 15 సినిమాటోగ్రాఫర్‌ వి.ఎస్‌.ఆర్‌.స్వామి జయంతి సందర్భంగా..)  

సినిమా పాటకు కొత్త అర్థం చెప్పిన మధుర స్వరాల విశ్వనాథన్‌!

(జూలై 14 ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ వర్థంతి సందర్భంగా..) ఏ సినిమాకైనా కథ, కథనాల తర్వాత సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఎమోషన్‌ అయినా సంగీతం ద్వారానే ప్రేక్షకుల మనసుల్లోకి చేరుతుంది. సినిమా ఎంత బాగా తీసినా సందర్భానుసారం వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల పూర్తి స్థాయిలో సినిమా అనుభూతి కలుగుతుంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది సంగీత దర్శకులు తమదైన శైలిలో పాటలు చేస్తూ ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తున్నారు. అలాంటి సంగీత దర్శకుల్లో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఒకరు. అందరూ మధుర స్వరాల విశ్వనాథన్‌ అని పిలుచుకునే ఎం.ఎస్‌.విశ్వనాథన్‌.. సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు. ఇది విశ్వనాథన్‌ చేసిన పాట అని అందరూ గుర్తుపట్టేలా ఆయన స్వరాలు సమకూర్చేవారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులుగా వెలుగొందుతున్న ఎంతో మందికి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఆదర్శం. కొందరు ఆయన దగ్గర శిష్యరికం చేసి సంగీతంలోని ఎన్నో మెళకువలు తెలుసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్‌లో తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 700 సినిమాలకు సంగీతాన్నందించారు. తన పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ కెరీర్‌ గురించి, ఆయన స్వరపరిచిన మధురగీతాల గురించి తెలుసుకుందాం.  1928 జూన్‌ 24న కేరళలోని ఎలప్పుల్లి గ్రామంలో సుబ్రమణియన్‌, నారాయణి దంపతులకు జన్మించారు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌. ఆయన మాతృభాష మలయాళం. నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన విశ్వనాథన్‌.. తన మేనమామ దగ్గర పెరిగారు. థియేటర్‌లో బఠాణీలు అమ్ముతూ, సినిమా పాటలు వింటూ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లే దారిలో నీలకంఠ భాగవతార్‌ అనే మాస్టారు పిల్లలకు సంగీతం నేర్పుతుంటే శ్రద్ధగా విని వంటబట్టించుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే హార్మోనియం నేర్చుకొని దాన్ని వాయిస్తూ పాటలు పాడేవారు. అది చూసిన నీలకంఠ భాగవతార్‌.. అతనిలోని కళాకారుడ్ని గుర్తించారు. మూడు గంటలపాటు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్రాస్‌ చేరుకొని జూపిటర్‌ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేశారు విశ్వనాథన్‌. మరికొన్నాళ్లకు గురుముఖంగా సంగీతం నేర్చుకొని ప్రముఖ సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బరామన్‌ దగ్గర హార్మోనియం ప్లేయర్‌గా చేరారు. అక్కడే టి.కె.రామ్మూర్తి పరిచయమయ్యారు. ఈ ఇద్దరూ కొంతకాలం సి.ఆర్‌.సుబ్బరామన్‌ దగ్గర పనిచేశారు.  1950 నుంచి 1965 మధ్యకాలంలో ‘విశ్వనాథన్‌ రామ్మూర్తి’ పేరుతో ఇద్దరూ కలిసి తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో దాదాపు 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆరోజుల్లో వీరి పాటలను ప్రజలు ఎంతో ఆదరించేవారు. ‘సంతోషం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘మంచి-చెడు’, ‘ఆడబ్రతుకు’, ‘కర్ణ’ వంటి సినిమాల్లో వీరు చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1965లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ సోలోగా సినిమాలు చేశారు. ఆయన సారధ్యంలో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. లేతమనసులు, మనసే మందిరం, భలే కోడలు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, మరో చరిత్ర, సింహబలుడు, అందమైన అనుభవం, ఇదికథ కాదు, గుప్పెడు మనసు వంటి ఎన్నో సినిమాల్లో తన పాటలతో అలరించారు విశ్వనాథన్‌.  కె.బాలచందర్‌ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఎం.ఎస్‌.విశ్వనాథన్‌కి దక్కుతుంది. ‘ఏ తీగ పూవునో..’, ‘భలే భలే మగాడివోయ్‌, ‘పల్లవించవా నా గొంతులో’, ‘సరిగమలు గలగలలు’, ‘కుర్రాళ్ళోయ్‌ కుర్రాళ్ళోయ్‌ వెర్రెక్కి ఉన్నోళ్ళు’, ‘కన్నెపిల్లవని కన్నులున్నవని..’, ‘పదహారేళ్ళకు..నీలో నాలో’, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’, ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’, ‘అరె ఏమిటి లోకం’.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ సాంగ్స్‌. విశ్వనాథన్‌ చేసిన పాటలు పాడడం ద్వారానే ఎల్‌.ఆర్‌.ఈశ్వరి బాగా పేరు తెచ్చుకున్నారు. అలాగే కొందరు గీత రచయితలు కూడా విశ్వనాథన్‌ పాటల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్‌లో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ నాలుగు భాషల్లో 700 సినిమాలకు సంగీతం అందించారు. అందులో 500కి పైగా తమిళ్‌ సినిమాలే ఉన్నాయి. తెలుగులో ఆయన 70 సినిమాలు చేశారు. అంతకుముందు రామ్మూర్తితో కలిసి 100 సినిమాలకు సంగీతం అందించారు. విశ్వనాథన్‌పై ఉన్న అభిమానంతో తమిళ ప్రేక్షకులు ఆయన్ని ‘మెల్లిసై మన్నార్‌’ అని పిలుచుకునేవారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. విశ్వనాథన్‌ను ‘తిరై ఇసై చక్రవర్తి’ అని బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణాలు ఆయనకు బహూకరించారు. సినీ సంగీత ప్రియులను తన సంగీతంతో ఓలలాడించిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ 2015 జూలై 14న కన్నుమూశారు. భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన స్వరపరిచిన పాటలు సంగీత ప్రియుల మనసుల్లో సుస్థిరంగా ఉండిపోతాయి.

బి.సరోజాదేవి అందానికి ఫిదా అయిన ప్రధాన మంత్రి!

1950 నుంచి 1970 వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారిలో కొందరు హీరోయిన్లు మాత్రమే అప్పటి కుర్రకారుకి నిద్రలేకుండా చేశారు. వారిని తమ ఆరాధ్య దేవతలుగా భావించారు. అలాంటి వారిలో బి.సరోజాదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన ముద్దు ముద్దు మాటలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు. అందాన్ని ఆస్వాదించడానికి, అభినందించడానికి కారెవరు అనర్హులు అన్నట్టుగా నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా బి.సరోజాదేవి అందానికి ఫిదా అయిపోయారు. 1963లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆమెను చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైన నెహ్రూ ‘నువ్వు మెరిసిపోతున్నావు’ అంటూ ఆమెకు కితాబునివ్వడం మామూలు విషయం కాదు. అంతటి అందం, మెరుపు సొంతం చేసుకున్న బి.సరోజాదేవి సినిమా రంగంలోకి ఎలా వచ్చారు, తను చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని ఎలా అలరించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1938 జనవరి 7న బెంగళూరులో బైరప్ప, రుద్రమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు బి.సరోజాదేవి. తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆయనకు కళలంలే చాలా మక్కువ. దాంతో సరోజాదేవికి చిన్నతనంలోనే డాన్స్‌, సంగీతం నేర్పించారు. 13 ఏళ్ళ వయసులో ఒక ఫంక్షన్‌లో పాట పాడుతూ కనిపించిన సరోజాదేవిని చూసిన కన్నడ నటుడు, నిర్మాత హోనప్ప భాగవతార్‌ తను నిర్మిస్తున్న ‘మహాకవి కాళిదాస’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే సరోజాదేవికి సినిమాలంటే ఆసక్తి లేదు. తను పెద్దయ్యాక టీచర్‌ అవ్వాలనేది ఆమె కోరిక. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.  ‘మహాకవి కాళిదాస’ చిత్రం తర్వాత కన్నడలో వరసగా అవకాశాలు రావడం మొదలైంది. దాంతో ఆమెకు కూడా సినిమాలపై ఆసక్తి మొదలైంది. అలా కన్నడలో వరసగా సినిమాలు చేశారు. 1956లో విడుదలైన తిరుమానం చిత్రం సరోజాదేవి నటించిన తొలి తమిళ చిత్రం. పాండురంగ మహత్మ్యం చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. 1950 దశకంలో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెకే దక్కింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. ఆరోజుల్లో కొందరు అమ్మాయిలు సరోజాదేవిని అనుకరిస్తూ మాట్లాడేవారు.  తమిళ్‌లో ఎం.జి.రామచంద్రన్‌, శివాజీగణేశన్‌, జెమినీగణేశన్‌ల సరసన, కన్నడలో రాజ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, కళ్యాణ్‌కుమార్‌లతో, హిందీలో దిలీప్‌కుమార్‌, షమ్మీ కపూర్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌ వంటి టాప్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు సరోజాదేవి. ఆరోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న దక్షిణాది హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఆంధ్రా క్లియోపాత్రాగా, ఆంధ్రా ఎలిజిబెత్‌ టేలర్‌గా పిలిచేవారు. పదేళ్ళపాటు నాలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సరోజాదేవి తన కెరీర్‌లో మొత్తం 200 సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. తను నటించిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాలు జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం అని చెప్పేవారు సరోజాదేవి. 1970లో వచ్చిన ‘మాయని మమత’ హీరోయిన్‌గా ఆమె నటించిన చివరి చిత్రం. తెలుగులో ఎన్టీఆర్‌ సినిమా ద్వారానే పరిచయమైన సరోజాదేవి చివరి సినిమా ‘సామ్రాట్‌ అశోక’ కూడా ఎన్టీఆర్‌దే కావడం విశేషం.  వ్యక్తిగత విషయాలకు వస్తే... 1967 మార్చి 1న వ్యాపార వేత్త శ్రీహర్షతో బి.సరోజాదేవి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్‌ రామచంద్ర. 1986లో భర్త శ్రీహర్ష గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత 1997లో పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. ఇక సరోజాదేవి అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే.. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను 1969లో పద్మశ్రీతోనూ, 1992లో పద్మభూషణ్‌తోనూ సరోజాదేవిని సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవికాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక అవార్డులు ఆమెను వరించాయి. బెంగళూరు యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్‌నిచ్చి గౌరవించింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బి.సరోజాదేవి 2025 జూలై 14న తుదిశ్వాస విడిచారు.

‘శివ’ నుంచి ‘ఆటగదరా శివా’ వరకు తనికెళ్ళ భరణి కెరీర్‌ అట్ల డిసైడ్‌ అయింది!

(జూలై 14 తనికెళ్ళ భరణి పుట్టినరోజు సందర్భంగా..) పాతతరంలోని నటీనటులు, రచయితలు, దర్శకులు.. అందరూ నాటక రంగం నుంచి వచ్చినవారే. వారు నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూ వివిధ పాత్రల్లో నటించారు. అయితే రచయితలు, దర్శకులు ఎప్పుడూ తెరపై కనిపించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ, ఆ తర్వాతి తరంలో రచయితలు, దర్శకులు నటులుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా సినీ పరిశ్రమలో ప్రవేశించి ఆ తర్వాత నటుడిగా మారిన రచయిత తనికెళ్ళ భరణి. విలనీ, సెంటిమెంట్‌, కామెడీ.. ఇలా ఏ తరహా పాత్రకైనా న్యాయం చెయ్యగల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘మిథునం’ వంటి గొప్ప చిత్రాన్ని రూపొందించి నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు. తన రచనలతో సాహిత్య రంగంలో కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన తనికెళ్ళ భరణి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన జీవితంలోని విశేషాలేమిటి అనేది తెలుసుకుందాం. 1954 జూలై 14న పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం గ్రామంలో టి.వి.ఎస్‌.ఎస్‌.రామలింగేశ్వరరావు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు తనికెళ్ల భరణి. ఆయనకు తెలుగు భాష అంటే అమితమైన గౌరవం. తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటివారు తనికెళ్ళ భరణికి బంధువులు. దాంతో భరణి ఇంట్లోనూ సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ సాహిత్యంలో పట్టు సాధించారు భరణి. అయితే ఇంటర్మీడియట్‌కి వచ్చే వరకు ఆయన ఒక్క రచన కూడా చేయలేదు. హైదరాబాద్‌లో కాలేజీలో చదువుతున్నప్పుడు ‘అద్దెకొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా దానికి మొదటి బహుమతి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో కొన్ని కవితలు రాశారు. డిగ్రీ చదివేటప్పుడు రాళ్ళపల్లి పరిచయమయ్యారు. ఆయనకు శ్రీమురళి కళానిలయం పేరుతో ఓ నాటక సమాజం ఉండేది. దాని ద్వారా అనేక నాటకాలు రాసి ప్రదర్శించారు రాళ్ళపల్లి. ఆయన మద్రాస్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ సంస్థకు రచయిత కావాల్సి వచ్చింది. అలా భరణి పూర్తిస్థాయి రచయితగా స్థిరపడడానికి ఆ సంస్థ కారణమైంది. అలా చాలా నాటకాలు రాయడమే కాకుండా నటించారు కూడా. వాటిలో ఎక్కువ శాతం విలన్‌ పాత్రలే పోషించారు భరణి.  సినిమా రంగానికి వచ్చిన తర్వాత భరణికి రాళ్ళపల్లి ద్వారా వంశీ పరిచయమయ్యారు. అయితే ఆయన మాటలు రాసిన తొలి సినిమా సుమన్‌ హీరోగా నటించిన ‘కంచు కవచం’. ఆ తర్వాత వంశీతో భరణి జర్నీ ఎన్నో సంవత్సరాలు సాగింది. కెరీర్‌ ప్రారంభంలోనే ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రంలో ఆయన రాసిన డైలాగ్స్‌కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వంశీ డైరెక్షన్‌లో వచ్చిన లాయర్‌ సుహాసిని, మహర్షి, శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌, చెట్టుకింద ప్లీడరు వంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాయడమే కాకుండా నటించారు కూడా. ముఖ్యంగా లేడీస్‌ టైలర్‌ చిత్రంలో భరణి కనిపెట్టిన ‘జ’ భాష ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేసింది. ఆ తర్వాత  రామ్‌గోపాల్‌వర్మ తొలి చిత్రం ‘శివ’ చిత్రానికి ఆయన రాసిన డైలాగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఆ సినిమాలో భరణి చేసిన నానాజీ క్యారెక్టర్‌కి విపరీతమైన పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత రచయితగా కంటే నటుడిగానే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. దాంతో నెమ్మదిగా రచనలు తగ్గించుకోవాల్సి వచ్చింది. విలన్‌గా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. అలాగే 52 సినిమాలకు రచయితగా పనిచేశారు.  స్వతహాగ శివ భక్తుడైన తనికెళ్ళ భరణి.. తను రచించిన ‘ఆట గదరా శివా’ అందరి ప్రశంసలు అందుకుంది. భక్తులు ఆ పాట విని పరవశించిపోయారు. ఆ తర్వాత ఓ విభిన్నమైన కథాంశాన్ని తీసుకొని ‘సిరా’ పేరుతో ఓ షార్ట్‌ ఫిలింను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ షార్ట్‌ ఫిలింను విమర్శకులు సైతం ప్రశంసించారు. 2012లో కేవలం రెండు పాత్రలతో తనికెళ్ళ భరణి రూపొందించిన ‘మిథునం’ చాలా గొప్ప చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు, ఈ సినిమాలో నటించిన ఎస్‌.పి.బాలు, లక్ష్మీలకు స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డులు లభించాయి. ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ళ భరణి నంది అవార్డు అందుకున్నారు. అంతకుముందు సముద్రం చిత్రానికి ఉత్తమ విలన్‌గా, నువ్వు నేను చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు లభించాయి. ఇవికాక సాహిత్య రంగంలో అయనకు లభించిన పురస్కారాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1988లో దుర్గా భవానితో తనికెళ్ళ భరణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం మహాతేజ, సౌందర్యలహరి.

కీ బోర్డ్‌ ప్లేయర్‌ నుంచి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వరకు మణిశర్మ జర్నీ ఇదే!

సినీ సంగీత ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలందరికీ మ్యూజికల్‌ హిట్స్‌ అందించిన సంగీత దర్శకుడు మణిశర్మ. స్టార్‌ హీరోలకే కాదు వర్థమాన హీరోల సినిమాలకు కూడా అద్భుతమైన స్వరాలను సమకూర్చి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు మణిశర్మ. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆయన నేపథ్యం ఏమిటి, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, మ్యూజికల్‌గా మణిశర్మ సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1964 జూలై 11న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యశర్మ. సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత మణిశర్మగా తన పేరును మార్చుకున్నారు. తండ్రి నాగయజ్ఞశర్మ వయొలిన్‌ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలన్న ఉద్దేశంతో కుటుంబంతో సహా మద్రాస్‌ చేరుకున్నారు నాగయజ్ఞశర్మ. అలా మణిశర్మ అక్కడే పెరిగారు. అతనికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి చిన్నతనంలోనే వయొలిన్‌, మాండొలిన్‌, గిటార్‌ నేర్పించారు తండ్రి. ఆ తర్వాతికాలంలో ఈ వాయిద్యాల కంటే కీబోర్డ్‌ ప్లేయర్‌కే ఎక్కువ ఆదాయం వస్తోందని గమనించిన నాగయజ్ఞశర్మ.. మణిశర్మకు కీబోర్డ్‌ కూడా నేర్పించారు. ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి చాలా మందికి గురువైన జాకబ్‌జాన్‌ దగ్గర వెస్ట్రన్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నారు మణిశర్మ. అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇంటర్‌ సెకండియర్‌లోనే చదువు ఆపేసి సంగీతాన్నే వృత్తిగా చేసుకున్నారు.  1982లో సంగీత దర్శకుడు సత్యం దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్‌, కోటి, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి కీబోర్డు సహాయకుడిగా వర్క్‌ చేశారు. కీరవాణి మొదటి సినిమా మనసు మమత నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాకీ మణిశర్మ పనిచేశారు. క్షణక్షణం సినిమాకి రీరికార్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టూడియోకి వచ్చిన రామ్‌గోపాల్‌వర్మ.. మణిశర్మలోని టాలెంట్‌ను గుర్తించి తన దర్శకత్వంలో వచ్చిన ‘రాత్రి’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఆ సినిమా కోసం ‘చలెక్కి ఉందనుకో..’ అనే పాటను కూడా రికార్డ్‌ చేయించారు. అయితే ఆ పాటను నాగార్జున హీరోగా వర్మ చేసిన ‘అంతం’ సినిమాకి ఉపయోగించారు. మణిశర్మ తొలిసారి స్వరకల్పన చేసిన పాట అదే.  1997లో ఏవీయస్‌ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్‌ హీరోస్‌’ చిత్రం ద్వారా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు మణిశర్మ. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా చిత్రానికి మహేష్‌ మహదేవన్‌తో కలిసి సంగీతాన్ని అందించారు. చిరంజీవి హీరోగా జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రం మణిశర్మకు సంగీత దర్శకుడుగా బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇక అక్కడి నుంచి చిరంజీవి సినిమాలకు వరసగా సంగీతాన్ని అందించారు. హీరో ఎవరైనా టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌ అంతా మణిశర్మకే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశాలు ఇచ్చేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌.. ఇలా అందరు హీరోల సినిమాలకు సంగీతం అందించారు మణిశర్మ. ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్‌ బీట్‌తో, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. అందుకే మణిశర్మను మెలోడీ బ్రహ్మ అంటారు.  1997 నుంచి ఇప్పటివరకు బ్రేక్‌ అనేది లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు మణిశర్మ. ఇతర సంగీత దర్శకులు పనిచేసిన ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. అలాగే చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌ సీజన్‌4కి థీమ్‌ మ్యూజిక్‌ చేశారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న థమన్‌, దేవిశ్రీప్రసాద్‌, హ్యారిస్‌ జైరాజ్‌ తొలిరోజుల్లో మణిశర్మ దగ్గర పనిచేశారు. ఇతని తనయుడు మహతి స్వర సాగర్‌ కూడా సంగీత కళాకారుడే. ఇప్పటికి 20 సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు.

55 ఏళ్ళ పద్మాలయా.. సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు!

ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలన్న ఆలోచనతో పాతరోజుల్లో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభమయ్యాయి. వాటిలో విజయ వాహిని, అన్నపూర్ణ పిక్చర్స్‌, నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌, పి.ఎ.పి., భరణి పిక్చర్స్‌... ఇలా పలు సంస్థలు ఎన్నో అపురూపమైన సినిమాలను నిర్మించాయి. ఆ తర్వాత డి.రామానాయుడు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. 1970వ దశకం వచ్చేసరికి సూపర్‌స్టార్‌ కృష్ణ సారధ్యంలో పద్మాలయా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ద్వారా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అలా చిత్ర నిర్మాణ రంగంలో పద్మాలయాకు ఒక విశిష్ట స్థానం లభించింది. పద్మాలయా మూవీస్‌, పద్మాలయా పిక్చర్స్‌, పద్మాలయా స్టూడియోస్‌.. ఇలా పలు బేనర్లలో చిత్రాలను నిర్మించిందీ సంస్థ. తెలుగులో 18, హిందీలో 16, తమిళ్‌లో 3, కన్నడలో ఒక సినిమా.. మొత్తం పద్మాలయా నిర్మించిన సినిమాలు 38. ఈ సంస్థ నిర్మించిన తొలి సినిమా ‘అగ్ని పరీక్ష’ 1970 జూలై 10న విడుదలైంది. పద్మాలయా సంస్థ ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థ గురించి, ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 1965లో తేనెమనసులు చిత్రంతో హీరోగా పరిచయమైన కృష్ణ చాలా తక్కువ సమయంలోనే బిజీ హీరో అయిపోయారు. 5 సంవత్సరాల్లో 48 సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తన అభిరుచికి తగ్గ సినిమాలు రావడం లేదనే బాధ ఆయనలో ఉండేది. అందుకే పద్మాలయా మూవీస్‌ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌లో ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని బాపు గీయగా, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ లోగోను క్రియేట్‌ చేశారు. పద్మాలయా మూవీస్‌ బేనర్‌పై తొలి చిత్రంగా అగ్నిపరీక్ష చిత్రాన్ని నిర్మించారు. 1970 జూలై 10న విడుదలైన ఈ చిత్రానికి కె.వరప్రసాదరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆర్థిక విజయం సాధించకపోయినా ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు. తొలి సినిమా విజయం సాధించకపోయినా నిరాశపడలేదు కృష్ణ. అప్పటివరకు ఎవరూ చేయని ఒక విభిన్నమైన సినిమాను నిర్మించాలనుకున్నారు.  అదే సమయంలో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, మెకన్నాస్‌ గోల్డ్‌ వంటి సినిమాలు రిలీజ్‌ అయి ఇండియాలోనూ ఘనవిజయం సాధించాయి. ఆ జోనర్‌లో ఒక సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కృష్ణకు వచ్చింది. అప్పటివరకు ఇండియాలోని ఏ భాషలోనూ కౌబాయ్‌ సినిమా రాలేదు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఇండియాలోని పలు రేర్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది. 1971 ఆగస్ట్‌ 27న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తమిళ్‌, హిందీ భాషల్లో కూడా డబ్‌ చేశారు. అలాగే ట్రెజర్‌ హంట్‌ పేరుతో ఇంగ్లీష్‌లోనూ అనువదించారు. ఈ సినిమా లెక్కకు మించిన దేశాల్లో విడుదలై అక్కడ కూడా విజయం సాధించింది. ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్‌లోకి అనువాదమై విదేశాల్లో విడుదల కావడం అదే ప్రథమం.  ఆ తర్వాత ఎన్‌.టి.ఆర్‌., కృష్ణ హీరోలుగా నిర్మించిన దేవుడు చేసిన మనుషులు, కృష్ణ హీరోగా నిర్మించిన మాయదారి మల్లిగాడు ఘనవిజయాలు సాధించి పద్మాలయా అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది. ఈ సంస్థకు, హీరో కృష్ణకు 1974 సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు వంటి హీరోలతో తెరకెక్కించాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ, ఎవరి వల్లా అది కాలేదు. సీతారామరాజు కథతో సినిమా చెయ్యాలనే ఆలోచన కృష్ణకు ఎప్పటి నుంచో వుంది. దాన్ని కార్యరూపంలో పెట్టి ఎన్నో వ్యయప్రయాసలకోచ్చి ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించారు. కొంతభాగం షూటింగ్‌ జరిగిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు కన్నుమూశారు. మిగిలిన భాగాన్ని తెరకెక్కించే బాధ్యతను కృష్ణ తీసుకొని చిత్రాన్ని పూర్తి చేశారు కృష్ణ. తన కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా కూడా ఇదేనని కృష్ణ స్వయంగా చెప్పారు. ఈ సినిమా 1974 మే 1న విడుదలై సంచలన విజయం సాధించింది. సీతారామరాజుగా నటించిన కృష్ణ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పద్మాలయా బేనర్‌లోనే కురుక్షేత్రం, ఈనాడు చిత్రాలు నిర్మించారు. కురుక్షేత్రం నిరాశపరిచినా ఈనాడు మాత్రం ఘనవిజయం సాధించింది.  చిత్ర నిర్మాణంలో మరింత ముందుకు వెళ్లే ఉద్దేశంతో 1984లో పద్మాలయా స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కృష్ణ. 1986లో విడుదలైన సింహాసనం పద్మాలయా స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న మొదటి సినిమా. కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన సినిమా ఇది. తెలుగులో నిర్మించిన తొలి 70ఎంఎం సినిమా ఇదే. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, వంశీ, పండంటి సంసారం వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించింది పద్మాలయా సంస్థ.  తెలుగులో సూపర్‌హిట్‌ అయిన కృష్ణ సినిమాలను హిందీలో జితేంద్ర హీరోగా చాలా సినిమాలు నిర్మించింది పద్మాలయా సంస్థ. ఈ బేనర్‌ ద్వారా 16 హిందీ సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం ఘనవిజయం సాధించిన సినిమాలే ఉండడం విశేషం. తమిళ్‌లో రజినీకాంత్‌తో ఒక సినిమా, శివాజీ గణేశన్‌తో రెండు సినిమాలు నిర్మించారు. కన్నడలో అంబరీష్‌ హీరోగా ఒక సినిమా నిర్మించారు. 2004లో సూపర్‌స్టార్‌ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన హిందీ చిత్రం ‘ఇష్క్‌ హై తుమ్‌సే’ పరాజయాన్ని చవి చూసింది. ఈ సంస్థ నిర్మించిన చివరి సినిమా ఇదే. పద్మాలయా సంస్థకు ఉన్న రికార్డులు మరే సంస్థకూ లేవంటే అతిశయోక్తి కాదు. తెలుగులో తొలి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఇంగ్లీష్‌లో అనువాదమై పలు దేశాల్లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. అలాగే తొలి సినిమా స్కోప్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’. ఇలా ఏ నిర్మాణ సంస్థా బ్రేక్‌ చేయలేని రికార్డులను పద్మాలయా తన సొంతం చేసుకుంది.

‘బాహుబలి’కి పదేళ్లు.. ఈ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డులివే!

  ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ప్రధానంగా బాలీవుడ్‌ను చెప్పుకునేవారు. దేశంలోని వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ బాలీవుడ్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్‌ అయ్యేవి. మిగతా భాషల్లోకి అనువాద చిత్రాలుగా ఆ తర్వాత రిలీజ్‌ చేసేవారు. అలాంటి సమయంలో టాలీవుడ్‌ నుంచి ఎస్‌.ఎస్‌.రాజమౌళి.. ఓ సంచలనంగా వార్తల్లోకి వచ్చారు. అప్పటికి రాజమౌళి 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు పలు భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా డైరెక్టర్‌గా అతనికి మంచి పేరు తెచ్చాయి. ఆ తరుణంలో ‘బాహుబలి’ పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి.  తెలుగు సినిమా స్టామినా ఇది కాదు, అంతకుమించి అని నిరూపించేందుకు, ఇండియాలోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించేందుకు పథకం రచించారు. అప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.   కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తూ ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ సినిమా నిర్మాణంలో రామోజీ ఫిలింసిటీ కూడా భాగస్వామ్యం అయింది. 180 కోట్లతో ఇండియాలోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా ‘బాహుబలి’ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న ‘బాహుబలి’ చిత్రాన్ని 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 4,000 స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేశారు. ఒక అద్భుత దృశ్యకావ్యంగా రూపొందిన ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా నిర్మాణం వెనుక ఎలాంటి ఆసక్తికర విశేషాలు ఉన్నాయి, రిలీజ్‌ తర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా చేరుకుంది, కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు సృష్టించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.   ‘బాహుబలి’ వంటి బిగ్‌స్కేల్‌ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచన రాజమౌళికి అంతకుముందే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ట్రయల్‌గా రామ్‌చరణ్‌తో ‘మగధీర’ చిత్రాన్ని రూపొందించారు. అలాంటి ఫోక్లోర్‌ చిత్రాలను కూడా తాను సమర్థవంతంగా డీల్‌ చెయ్యగలను అని ఆ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నారు. దాంతో ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌ మీద రాజమౌళికి కాన్ఫిడెన్స్‌ వచ్చింది. 2009లో ‘మగధీర’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత మర్యాద రామన్న, ఈగ చిత్రాలను రూపొందించి మరో రెండు సూపర్‌హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి. 2010లో మర్యాద రామన్న విడుదలైంది. ఆ మరుసటి సంవత్సరమే రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. 2013 జనవరిలో ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో ‘బాహుబలి’ వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. 2013 జూలై 6న కర్నూలులోని రాక్‌ గార్డెన్స్‌లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్‌ రెండు సంవత్సరాలపాటు జరిగింది.    ‘బాహుబలి’ చిత్రం మూడు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉంది. స్క్రిప్ట్‌కి సంబంధించి సంవత్సర కాలం చర్చలు జరిగాయి. ఆ తర్వాత షూటింగ్‌ రెండు సంవత్సరాలపాటు జరిగింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆరు నెలలు కొనసాగాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్స్‌ నిర్మించారు. ఈ సెట్స్‌ నిర్మాణం వెనుక వేల మంది కృషి ఉంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్టులను, 300 గుర్రాలను, డజనుకి ఏనుగులను ఉపయోగించారు. ఈ యుద్ధ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్‌గా మారింది. ఆ యుద్ధాన్ని చిత్రీకరించిన తీరు చూసి బాలీవుడ్‌ మేకర్స్‌ సైతం ఆశ్చర్యచకితులయ్యారు.   ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి. ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే ‘బాహుబలి’ సిరీస్‌ను ప్రారంభించారు. ప్రతినాయకుడు భళ్లాళదేవుడు క్యారెక్టర్‌ కోసం దగ్గుబాటి రానాను ఎంపిక చేశారు. వీరిద్దరి తర్వాత సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర శివగామి. ఈ పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదించారు. పారితోషికం అధికంగా డిమాండ్‌ చెయ్యడం వల్లే ఆమెను కాదని.. రమ్యకృష్ణను అప్రోచ్‌ అయ్యామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలో ఎంతో కీలకంగా కనిపించే కట్టప్ప క్యారెక్టర్‌ను సత్యరాజ్‌తో చేయించారు. భళ్లాలదేవుడి దుష్ట చర్యలను సమర్థించే తండ్రి పాత్రలో నాజర్‌ కనిపిస్తారు. భళ్లాల దేవుడి చెరలో ఏళ్ల తరబడి మగ్గే దేవసేన పాత్రను అనుష్కతో చేయించారు. పోరాట యోధురాలు అవంతికగా తమన్నా నటించారు. ఈ క్యారెక్టర్ల చుట్టూనే ‘బాహుబలి’ మొదటి భాగం నడుస్తుంది. నటీనటులు వారి వారి క్యారెక్టర్లలో జీవించారని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడకుండా రాజమౌళి కోరుకున్న ఎఫెక్ట్‌ను తెచ్చారు.    ఏ ప్రొడక్ట్‌కి అయినా మార్కెటింగ్‌ అనేది చాలా కీలకం. దాన్ని ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో వినియోగించారు రాజమౌళి. సినిమా ఎనౌన్స్‌ చేసిన నాటి నుంచి రిలీజ్‌ అయ్యే వరకు.. అంటే దాదాపు 2 సంవత్సరాలపాటు ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో రన్‌ అవుతూనే ఉండేది. తమ సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు అన్ని మాధ్యమాలను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నారు మేకర్స్‌. దీంతో సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. థియేటర్స్‌లో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు. దేశంలోనే కాదు, విదేశాల్లో సైతం భారీ ఓపెనింగ్స్‌తో ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.   ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ కలెక్షన్ల వర్షం కురిపించింది. అమెరికాలో మొదటి రోజు 15 కోట్లు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే వరల్డ్‌వైడ్‌గా అన్ని వెర్షన్స్‌ కలిపి మొదటివారం 165 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన మొదటి సినిమా బాహుబలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన నాలుగో సినిమా. ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 391 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఆగస్ట్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఇండియాలోనే 511 కోట్లు వసూలు చేసిన ఏకైక చిత్రంగా బాహుబలి నిలిచింది. అంతకుముందు ‘పికె’ చిత్రం 440 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దాన్ని బాహుబలి క్రాస్‌ చేసింది. ఈ సినిమా బయ్యర్స్‌కి 180 కోట్లు లాభాల్ని తెచ్చిపెట్టింది. ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ రిలీజ్‌ అయి 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.  

సినిమాలంటే ఆసక్తి లేని కోట శ్రీనివాసరావు 750 సినిమాలు ఎలా చేశారో తెలుసా?

(జూలై 10 కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా..) నవరసాలూ పోషించగల నటులు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. పాతతరం నుంచి ఇప్పటివరకు అలాంటి కొందరు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1980వ దశకంలో అలాంటి ఓ నటుడు పరిచయమయ్యారు. అతనే కోట శ్రీనివాసరావు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ నటుడిగా ఎదిగారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి చాలా ఆలస్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు నేపథ్యం ఏమిటి, సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన పోషించిన పాత్రల ద్వారా ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్‌. తండ్రిలాగే తను కూడా డాక్టర్‌ అవ్వాలని చిన్నతనంలో అనుకున్నారు కోట. కానీ, నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనవైపే మొగ్గు చూపారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో సినిమా రంగానికి రావాలన్న ఆలోచన ఆయనకు లేదు. 1977లో కోట, అతని మిత్రులు కలిసి ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. నిర్మాత క్రాంతికుమార్‌కి ఆ నాటకం బాగా నచ్చింది. దాన్ని సినిమాగా తియ్యాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందర్నీ తన సినిమా కోసం తీసుకొని ‘ప్రాణం ఖరీదు’ పేరుతోనే ఆ చిత్రాన్ని నిర్మించారు క్రాంతికుమార్‌. అలా ఆ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోట. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్‌ చిరంజీవి నటుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో కోట చాలా చిన్న క్యారెక్టర్‌ చేశారు. ఆ తర్వాత అమరజీవి, బాబాయ్‌ అబ్బాయ్‌ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆ సినిమాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు.  హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘మీరైతే ఏం చేస్తారు?’ అనే నాటకాన్ని ప్రదర్శించారు కోట బృందం. ఆ నాటకాన్ని దర్శకుడు టి.కృష్ణ చూశారు. అందులో కోట నటన ఆయనకు బాగా నచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత తను రూపొందిస్తున్న ‘వందేమాతరం’ చిత్రం కోసం కోటను కాంటాక్ట్‌ చేసి ఆయనకు ఒక మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. అది ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం టి.కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలో చేసిన కాశయ్య పాత్ర కోట నట జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారిగా ఆయన ఇమేజ్‌ను పెంచేసింది. దాంతో వరసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ చిత్రం కోటకు మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత కామెడీ విలన్‌గా కూడా తన సత్తా చూపించారు. ఎంతలా అంటే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు ఉండడం వల్లే హిట్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  తెలుగులోనే కాదు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. తెలుగులో ఆయన నటించిన సినిమాల్లో చిత్రం భళారే విచిత్రం, ఆమె, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్‌, ఆ నలుగురు.. ఇలా చెప్పుకోదగిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇవివి సత్యనారాయణ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో కమెడియన్‌గా మంచి పాత్రలు పోషించారు కోట. సినీ పరిశ్రమలో విశేష సేవలందించిన కోటను 2015లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. తన నటనకుగాను 9 సార్లు ఉత్తమ విలన్‌గా, కమెడియన్‌గా, సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారం కూడా కోటను వరించింది.  వ్యక్తిగత జీవితానికి వస్తే.. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ చరుకుగా పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1966లో కోట వివాహం రుక్మిణితో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు కోట ప్రసాద్‌ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు కూడా నటుడే. ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. 45 సంవత్సరాల తన సినిమా కెరీర్‌లో 750కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు కోట శ్రీనివాసరావు. ఆయన నటించిన చివరి సినిమా 2023లో వచ్చిన సువర్ణ సుందరి. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మధ్య తరగతి కథలతో.. మహోన్నత విజయాలు అందుకున్న కె.బాలచందర్‌!

(జూలై 9 కె.బాలచందర్‌ జయంతి సందర్భంగా..) తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది గొప్ప దర్శకులు చిత్ర పరిశ్రమకు వచ్చి అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులకు అందించారు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు.. ఇలా ఎవరి స్టైల్‌లో వాళ్ళు సినిమాలు తీసేవారు. 70వ దశకం వచ్చేసరికి కొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు పరిశ్రమకు వచ్చారు. అలాంటి వారిలో కె.బాలచందర్‌ది ఓ భిన్నమైన శైలి. అప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ హీరో ప్రధానంగా ఉండేవి. కానీ, బాలచందర్‌ మాత్రం తన సినిమాలు  ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులే ఆయన హీరోలు, వారి మధ్య ఉన్న సమస్యలే కథా వస్తువులు. స్టార్స్‌ జోలికి వెళ్లకుండా వర్థమాన నటీనటులతోనే ఆ సినిమాలు రూపొందించేవారు. ఆయన చేసిన ప్రతి సినిమా అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉండేది. ఆ విధంగా ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు బాలచందర్‌. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో నటీనటులు తరువాతి రోజుల్లో తారాపథంలో జైత్రయాత్ర సాగించారు. మధ్య తరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచందర్‌ చిత్రాలు తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనేవి. 40 సంవత్సరాల కెరీర్‌లో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 20కి పైగా టీవీ సీరియల్స్‌ని రూపొందించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కె.బాలచందర్‌ అంటే ఇష్టపడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఉండరు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాలచందర్‌.. సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన రూపొందించిన సినిమాలు ఏ స్థాయిలో విజయాల్ని సాధించాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1930 జూలై 9న తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నిలంలో జన్మించారు కైలాసం బాలచందర్‌. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ సినిమాలంటే ఆయన ఇష్టపడేవారు. ఆయన నటించిన ప్రతి సినిమా చూసేవారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించేవారు బాలచందర్‌. బి.ఎస్‌సి. వరకు చదివిన ఆయన.. కొంతకాలం టీచర్‌గా, మరి కొంతకాలం ఒక అకౌంటెంట్‌ జనరల్‌ దగ్గర క్లర్క్‌గా పనిచేశారు. అదే సమయంలో సొంతంగా ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నాటక సమాజంలోనే సౌందర్‌రాజన్‌, షావుకారు జానకి, నగేశ్‌, శ్రీకాంత్‌ వంటి వారు నటించేవారు. ఆ తర్వాతి కాలంలో వీరంతా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన నాటకాల్లో మేజర్‌ చంద్రకాంత్‌ నాటకానికి విశేషాదరణ లభించింది. అలా రచయితగా, దర్శకుడిగా రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎం.జి.ఆర్‌. హీరోగా నటించిన ‘దైవతాయ్‌’ చిత్రానికి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమాగా తీశారు. దానికి కూడా బాలచందర్‌ మాటలు అందించారు.  1965లో వచ్చిన ‘నీర్‌ కుమిళి’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు బాలచందర్‌. తెలుగులో ‘భలే కోడళ్లు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, జీవిత రంగం వంటి సినిమాలతో మంచి దర్శకుల సరసన నిలిచారు. తెలుగులో ఆయన్ని టాప్‌ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా అంతులేని కథ. ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత చేసిన మరోచరిత్ర ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’గా రూపొందించారు బాలచందర్‌. ఆ సినిమాతోనే కమల్‌ హాసన్‌ హిందీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఆ చిత్రంలోని ‘తేరే మేరే బీచ్‌ మే..’ అనే పాటను అద్భుతంగా గానం చేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. అది ఆయన అందుకున్న రెండో జాతీయ అవార్డు. ‘ఏక్‌ ధూజె కె లియే’ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించడం విశేషం! కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇదికథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ వంటి సినిమాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. బాలచందర్‌ సినిమాలతోనే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు మంచి పేరు సంపాదించారు. చిత్రసీమలో తమదైన బాణీ పలికించగలిగారు. ఇలా ఎందరికో సినిమాల్లో రాణించే అవకాశం కల్పించిన బాలచందర్‌, తమ కవితాలయా ప్రొడక్షన్స్‌ పతాకంపై తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాలు నిర్మించారు. ఆపై ఇతర దర్శకులతోనూ తన బ్యానర్‌లో సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర కలిగిన బాలచందర్‌ను 1987లో పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 2010లో ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇవి కాక ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు నేషనల్‌ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు.. ఇలా అనేక పురస్కారాలు లభించాయి. కె.బాలచందర్‌ తర్వాత ఆ తరహా సినిమాలు రూపొందించే దర్శకులు చిత్ర పరిశ్రమలో మరొకరు కనిపించలేదు. 2014లో ఆయనకు న్యూరోసర్జరీ జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డిసెంబర్‌ 15న చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 8 రోజులపాటు చికిత్స తీసుకున్న తర్వాత డిసెంబర్‌ 23న తుదిశ్వాస విడిచారు కె.బాలచందర్‌. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రూపొందించిన అపురూప చిత్రాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. 

ఆ విషయంలో గుమ్మడిని మించిన నటుడు మరొకరు లేరు!

(జూలై 9 గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా..) గుమ్మడి వెంకటేశ్వరరావు.. ఈ పేరు వినగానే సాత్వికమైన నిలువెత్తు మనిషి మన ఊహల్లోకి వస్తాడు. మంచితనం మూర్తీభవించిన వ్యక్తి మనకు కనిపిస్తాడు. దాదాపు 60 సంవత్సరాల కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గుమ్మడి అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన నటుడు. అక్కినేని నాగేశ్వరరావు 70 సంవత్సరాల సినీ కెరీర్‌ను కొనసాగించారు. ఆయన తర్వాతి స్థానం గుమ్మడికే దక్కుతుంది. తను చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని తపించే నటుల్లో గుమ్మడి కూడా ఒకరు. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా తను చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని జనరంజకంగా పోషించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గుమ్మడి తను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం తన వయసుకి మించిన పాత్రలే పోషించారు. అలా చేసిన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో మరొక నటుడు లేడంటే అతిశయోక్తి కాదు. వయసు మీరిన పాత్రల్లో జీవించడం గుమ్మడికి ఎలా సాధ్యమైంది? అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆయన సినీ ప్రస్థానంలో సాధించిన విజయాలేమిటి? అనే విషయాలు తెలుసుకుందాం. 1927 జూలై 9న గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో బసవయ్య, బుచ్చెమ్మ దంపతులకు జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు. వీరి నాన్న, బాబాయ్‌ కలిసే ఉండేవారు. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతల గురించి చిన్నతనంలో ఆయనకు అవగాహన వచ్చింది. వీరి కుటుంబంలో వయసు మీద పడిన వారు ఎక్కువగా ఉండేవారు. అలా వారి మధ్య పెరగడంతో గుమ్మడికి సాత్విక గుణం బాగా అబ్బింది. వారి కుటుంబ వాతావరణం భవిష్యత్తులో ఆ తరహా పాత్రలు చేయడానికి దోహదపడిరది. హైస్కూల్‌లో చదివే రోజుల్లోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు గుమ్మడి. కాలేజీలో చేరితే అలాంటి భావాలు మరింత పెరుగుతాయని గ్రహించిన కుటుంబ సభ్యులు 17 ఏళ్ళ వయసులోనే లక్ష్మీ సరస్వతితో వివాహం చేశారు. అయితే చదువు మాత్రం సజావుగా సాగలేదు. ఇంటర్‌ పరీక్ష తప్పారు. దాంతో గుమ్మడిని వ్యవసాయంలోకి దించారు.  ఆ సమయంలోనే గుమ్మడి మనసు నటన వైపు మళ్లింది. అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని మిత్రులు చెప్పడంతో మద్రాస్‌ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నో అవరోధాల తర్వాత అదృష్టదీపుడు అనే చిత్రంలో తొలిసారి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా గుమ్మడికి మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే ఎన్‌.టి.రామారావుతో పరిచయం ఏర్పడిరది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరూ బీచ్‌లో తిరుగుతూ కాలక్షేపం చేసేవారు. అదృష్టదీపుడు తర్వాత గుమ్మడికి మరో అవకాశం రాలేదు. దీంతో తిరిగి ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. త్వరలోనే తాను సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నానని, తమ సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు. ఎన్‌.ఎ.టి. పేరుతో సంస్థను ప్రారంభించారు. తొలి సినిమాగా పిచ్చిపులయ్య నిర్మించారు. ఈ సినిమాలో గుమ్మడికి మంచి వేషం ఇచ్చారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఆ బేనర్‌లో వచ్చిన తోడుదొంగలు, జయసింహ చిత్రాల్లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఈ మూడు సినిమాలతో గుమ్మడి నటుడిగా నిలదొక్కుకోగలిగారు.  తోడుదొంగలు చిత్రంలో వయసు మీరిన పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు గుమ్మడి. ఆ సినిమా చూసిన దర్శకుడు పి.పుల్లయ్య తను రూపొందిస్తున్న అర్థాంగి చిత్రంలో ఎఎన్నార్‌, జగ్గయ్యలకు తండ్రిగా నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన పాత్ర ఇంకా పేరు తెచ్చింది. దాంతో వయసు మీరిన పాత్రలు ఉంటే దర్శకనిర్మాతలంతా గుమ్మడినే సంప్రదించేవారు. అలా ఆ పాత్రలు చేయడం తనకు మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ నటుడికీ ఆ అవకాశం రాలేదు. తనకంటే వయసులో పెద్దవారికి తండ్రిగా, అన్నయ్యగా, బాబాయ్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం అవే ఉంటాయి. సాత్విక పాత్రల్లోనే కాదు, తేనె పూసిన కత్తిలాంటి విలన్‌ పాత్రలతో కూడా మెప్పించారు గుమ్మడి.  చిత్ర పరిశ్రమలోని అందరికీ గుమ్మడి అంటే ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఆయన్ని మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు. తమ సొంత బేనర్‌లో నిర్మించిన సినిమాలతోపాటు ఇతర సినిమాల్లో కూడా మంచి పాత్రలు ఇప్పించారు. గుమ్మడికి నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణదేవరాయలుగా, గుమ్మడి తిమ్మరుసుగా నటించారు. అయినప్పటికీ సినిమా టైటిల్‌ను మహామంత్రి తిమ్మరుసు అని పెట్టడం విశేషం. గుమ్మడి చేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేది. సినిమాల్లో ఆ పాత్రలు కనిపిస్తాయి తప్ప గుమ్మడి కనిపించరు. అంతగా ఆ పాత్రల్లో జీవించి అందర్నీ ఆకట్టుకునేవారు.  2008లో వచ్చిన జగద్గురు శ్రీకాశీనాయని చరిత్ర.. గుమ్మడి నటించిన చివరి చిత్రం. తన జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ ‘చేదు గుర్తులు.. తీపి జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని రచించారు. సినీ పరిశ్రమకు గుమ్మడి చేసిన సేవలకుగాను 1970లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1998లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. మాయా బజార్‌ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి ప్రదర్శించినపుడు ప్రజల మధ్య ఆ సినిమాను వీక్షించారు. అదే ఆయన చూసిన చివరి సినిమా. ‘ఇంత గొప్ప సినిమాను రంగుల్లో చూసేందుకే నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి ఉన్నాను’ అన్నారు. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2010 జనవరి 26న హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు గుమ్మడి. భౌతికంగా ఆయన లేకపోయినా తను చేసిన సినిమాల ద్వారా ప్రతిరోజూ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో నిర్మాతగా ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసిన కె.ఎస్‌.రామరావు!

(జూలై 7 కె.ఎస్.రామారావు పుట్టినరోజు సందర్భంగా..) సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంతో మంది నిర్మాతలు తమ అభిరుచికి అనుగుణమైన సినిమాలు నిర్మించేందుకు ఇండస్ట్రీకి వచ్చారు. చిత్ర నిర్మాణంలో కొన్ని సంస్థలు తమ కంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ఒకటి. ఈ పేరు వినగానే ఎన్నో కమర్షియల్‌ హిట్‌ సినిమాలు, ఫీల్‌గుడ్‌ మూవీస్‌ గుర్తొస్తాయి. ఈ సంస్థ అధినేత కె.ఎస్‌.రామారావు మంచి అభిరుచితో పరిశ్రమకు వచ్చి ఎన్నో మెమరబుల్‌ మూవీస్‌ని ప్రేక్షకులకు అందించారు. ఒక దశలో మెగాస్టార్‌ చిరంజీవితో వరస బ్లాక్‌బస్టర్స్‌ నిర్మించి అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కె.ఎస్‌.రామారావు చిత్ర రంగానికి ఎలా వచ్చారు? ఆయన నేపథ్యం ఏమిటి? తన బేనర్‌లో ఎలాంటి సినిమాలు నిర్మించారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. జూలై 7న విజయవాడలో జన్మించారు కె.ఎస్‌.రామారావు. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. 21 ఏళ్ళ వయసులో సినిమాలపై ఉన్న మక్కువతో డైరెక్టర్‌ అవ్వాలని మద్రాస్‌ చేరుకున్నారు. దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావు దగ్గర బందిపోటు దొంగలు, విచిత్ర కుటుంబం, నా కుటుంబం చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 1973లో నిర్మాత వడ్డే రమేష్‌ వంటి మిత్రుల సహకారంతో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అనే సంస్థను స్థాపించి సినిమాలకు రేడియో ద్వారా పబ్లిసిటీ చేసేవారు. కొన్ని వందల సినిమాలను తమ సంస్థ ద్వారా పబ్లిసిటీ చేశారు. అలా ఆయన్ని అందరూ రేడియో రామారావు అని పిలిచేవారు. తర్వాత కొన్నాళ్ళకు సినిమా నిర్మాణంపై ఆసక్తి కలగడంతో తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ఎర్రగులాబీలు, మౌనగీతం, టిక్‌టిక్‌టిక్‌ వంటి సినిమాలను తెలుగులోకి అనువదించి ఘనవిజయాలు అందుకున్నారు. నిర్మాతగా సక్సెస్‌ అవ్వడంతో స్ట్రెయిట్‌ మూవీ చెయ్యాలనుకున్నారు.  ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల అభిలాష.. కె.ఎస్‌.రామారావుకి బాగా నచ్చింది. దాన్ని సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, రాధిక జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అభిలాష చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు కె.ఎస్‌.రామారావు. ఈ సినిమా కమర్షియల్‌ పెద్ద హిట్‌ అవ్వడమే కాకుండా మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అదే టెక్నికల్‌ టీమ్‌తో ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణ మృదంగం సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో స్టువర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఆర్థికంగా కె.ఎస్‌.రామారావుకు నష్టాలు తెచ్చింది. ఆ తర్వాత చిరంజీవి కాంబినేషన్‌లో సినిమాలు చెయ్యలేదు. 1992లో వెంకటేష్‌ హీరోగా నిర్మించిన చంటి కమర్షియల్‌ హిట్‌ సాధించి కె.ఎస్‌.రామారావుకు చాలా మంచి పేరు తెచ్చింది.  1993లో నిర్మించిన మాతృదేవోభవ నిర్మాతగా కె.ఎస్‌.రామారావుకు చాలా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా వేటూరి సుందరరామ్మూర్తికి జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత క్రిమినల్‌, వాసు, బుజ్జిగాడు వంటి సినిమాలను నిర్మించారు. భాగస్వామ్యంలో కూడా చాలా చిత్రాలు నిర్మించారు. అయితే ఈమధ్యకాలంలో కె.ఎస్‌.రామారావు నిర్మించిన సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. తనయుడు కె.ఎ.వల్లభను హీరోగా పరిచయం చేస్తూ ఎవరే అతగాడు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌ అవ్వలేదు. 

దశాబ్దకాలం హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన చలాకీ కన్నుల మంజుల!

(జూలై 4 నటి మంజుల జయంతి సందర్భంగా..) తమ అందం, అభినయంతో కథానాయికలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రేక్షకుల మనసుకు దగ్గరైన వారు, వారి మనసుల్ని దోచుకున్న వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందం, అభినయంతోపాటు చలాకీతనం, చిలిపితనం, కళ్ళతోనే నవ్వులు చిందించగల ప్రతిభ ఆమె సొంతం. మంజుల వంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి అరుదుగా వస్తుంటారు. ఆమె అందానికి ఆరోజుల్లో ఎంతో మంది మనసు పాడుచేసుకున్నారు. కేవలం ఆమెను చూసేందుకే యూత్‌ మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. 40 సంవత్సరాల తన కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు మంజుల. దశాబ్దంపాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్న మంజుల జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1954 జూలై 4న మద్రాస్‌లో జన్మించారు మంజుల. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. చదువుతోపాటు కళల పట్ల కూడా ఆమె శ్రద్ధ చూపించేవారు. స్కూల్‌లో జరిగే కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా ఆమె పాల్గొనేవారు. చిన్నతనం నుంచీ ఎంతో చలాకీ ఉంటూ అందర్నీ ఆకర్షించేవారు మంజుల. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే మంజులకు సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమాల్లో నటించాలన్న ఆమె ఆలోచనను తల్లిదండ్రులు కూడా బలపరిచారు. 1970లో జెమిని గణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు మంజుల. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు. ఆ సినిమాలో జెమినీ గణేశన్‌కు మేనకోడలి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌ హీరోగా వచ్చిన ‘రిక్షాకారన్‌’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు.  జైజవాన్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమయ్యారు మంజుల. మరపురాని మనిషి, నీతినిజాయితి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత కృష్ణ హీరోగా రూపొందిన మాయదారి మల్లిగాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్‌ హీరోయిన్‌గా మంజులకు ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో అందరు టాప్‌ హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్‌తో వాడే వీడు, మనుషులంతా ఒక్కటే, దేవుడు చేసిన మనుషులు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, చాణక్య చంద్రగుప్త చిత్రాల్లో నటించారు. ఎఎన్నార్‌తో మహాకవి క్షేత్రయ్య, దొరబాబు, బంగారు బొమ్మలు సినిమాలు చేశారు. మాయదారి మల్లిగాడు తర్వాత కృష్ణతో భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు మంజుల. అయితే తెలుగులో శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఎక్కువ సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు మంజుల. మంచి మనుషులు, పిచ్చిమారాజు, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, గుణవంతుడు, మొనగాడు సినిమాలు చేశారు. శోభన్‌బాబు, మంజుల హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా పదేళ్ళపాటు గ్లామర్‌ హీరోయిన్‌గా తన హవాను కొనసాగించారు మంజుల.  1980వ దశకం వచ్చేసరికి మంజులకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. 1983 వరకు నటిగా కొనసాగిన ఆమె కొంత గ్యాప్‌ తీసుకొని 1988లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన చిక్కడు దొరకడు చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. టూ టౌన్‌ రౌడీ, ప్రేమ, చంటి, సరదాబుల్లోడు, వాసు వంటి సినిమాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వెంకటేష్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించడం విశేషం. 2011లో వచ్చిన వాసు తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా.  ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1976లో నటుడు విజయకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి. వీరు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. విజయకుమార్‌కు అంతకుముందే వివాహం అయింది. వారికి కలిగిన సంతానంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. 2011 తర్వాత సినిమాలకు దూరమైన మంజుల.. కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించారు. అలాగే కొన్ని గేమ్‌ షోలలో కూడా కనిపించారు. 2013లో జూలై 23న మంజుల ప్రమాదవశాత్తూ మంచం మీద నుంచి కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ గాయంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అదేరోజు 59 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు మంజుల. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా మంజుల పేరుతో ఒక హీరోయిన్‌ ఉండేవారు. 1986లో వంటగదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 ఏళ్ళ అతి చిన్న వయసులో మంజుల ప్రాణాలు విడిచారు. ఒకే పేరు ఉన్న ఈ ఇద్దరు నటీమణులు ప్రమాదవశాత్తూ మరణించడం గమనార్హం.

36 ఏళ్లుగా తన సంగీతంతో అలరిస్తున్న ‘స్వరవాణి’ కీరవాణి జీవితంలోని అరుదైన విశేషాలివే!

(జూలై 4 ఎం.ఎం.కీరవాణి పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని కె.వి.మహదేవన్‌, చక్రవర్తి, ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఏలుతున్న రోజుల్లో వారి బాణీలకు భిన్నంగా ఉండే ఓ కొత్త సంగీత దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయనే ఎం.ఎం.కీరవాణి. ఒక తరహా సంగీతానికి పరిమితం కాకుండా ఫాస్ట్‌ బీట్‌, మెలోడీ, ఫోక్‌ సాంగ్స్‌, భక్తిరస గీతాలు.. ఇలా ఏ పాటకైనా తనదైన శైలిలో అద్భుతమైన స్వరాలు సమకూర్చగల స్వరవాణి కీరవాణి. 1989లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన కీరవాణి చాలా తక్కువ సమయంలోనే తన సంగీతంలోని మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. 36 సంవత్సరాల ఆయన సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో 190 సినిమాలకు సంగీతాన్నందించారు. ఒక తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ తెచ్చి పెట్టిన ఘనత ఎం.ఎం.కీరవాణికి దక్కుతుంది. సంగీత దర్శకుడిగా ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కీరవాణి జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. చిన్నతనంలో తల్లిదండ్రులు పెట్టిన పేరును బట్టి వారి జీవితం, వారి కెరీర్‌ సాగదు అనేది సత్యం. ఎవరి జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో, కెరీర్‌ పరంగా ఏ రంగంలో వారు రాణిస్తారు అనేది చెప్పడం కష్టం. కానీ, కీరవాణి మాత్రం తన పేరును సార్థకం చేసుకున్నారు. కీరవాణి అనేది ఒక రాగం పేరు. ఆ పేరునే తన తల్లిదండ్రులు పెట్టడం, సంగీత ప్రపంచంలోనే కీరవాణి రాణించడం అనేది అరుదుగా జరిగే విషయం. కీరవాణి తండ్రి శివశక్తి దత్త సాహితీవేత్త, సంగీతం అభ్యసించినవారు. ఆయనకు ఎస్‌.రాజేశ్వరరావు సంగీతం అంటే ఎంతో మక్కువ. ‘విప్రనారాయణ’ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన..’ అంటూ భానుమతి ఆలపించిన పాటంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు ఎస్‌.రాజేశ్వరరావు. ఆ పాటపై ఉన్న మక్కువతో తన కుమారుడికి కీరవాణి అనే పేరు పెట్టారు శివశక్తి దత్త.  చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు కీరవాణి. అలాగే వయొలిన్‌ కూడా నేర్చుకున్నారు. ఆయన సంగీత కారుడే కాదు, మంచి కవి కూడా. సినిమా రంగానికి రాక ముందే ఎన్నో కథలు, కవితలు రాశారు. స్వాతి వంటి పత్రికలో ఆయన రచనలు వచ్చాయి. సాహిత్యంపై ఉన్న మక్కువతోనే వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశారు కీరవాణి. అలా సాహిత్య రచనలోని మెళకువల గురించి తెలుసుకున్నారు. సంగీత దర్శకుడిగా మారిన తర్వాత తన కెరీర్‌ ప్రారంభం నుంచి పాటలు రాస్తూనే ఉన్నారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో ‘నాకోసం నువ్వు..’, ‘అనగనగనగా..’, ‘బాహుబలి’ చిత్రంలో ‘కన్నా నిదురించరా..’, ‘ఒక ప్రాణం..’, ‘దండాలయ్యా..’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘జననీ..’, ‘ఈగ’ చిత్రంలోని ‘నేనే నానినే..’, ‘విక్రమార్కుడు’ చిత్రంలోని ‘జుం జుం మాయా..’, ‘జో లాలీ..’ వంటి పాటలు రచించారు కీరవాణి. కెరీర్‌ ప్రారంభంలో ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఆత్మబంధం, పెళ్లిసందడి.. ఇలా చాలా సినిమాల్లో పాటలు రాశారు. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు సాహిత్యాన్ని అందించారు కీరవాణి. 1979లో ఎన్‌.టి.రామారావు హీరోగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘యుగంధర్‌’ చిత్రంలోని ‘దాదాదా.. దాస్తే దాగేదా..’ అనే పాట కీరవాణిని బాగా ఆకర్షించింది. ఆ సినిమాకి ఇళయరాజా సంగీత దర్శకుడు. అప్పటికి ఆయన తెలుగులో అంత పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాదు. ఆ ఒక్క పాటతో ఇళయరాజాకు అభిమానిగా మారిపోయారు కీరవాణి. ఆ తర్వాత సంగీత పరంగా ఆయన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. కీరవాణి మొదటి సినిమా ‘మనసు మమత’ విడుదలయ్యే సమయానికి ఇళయారాజా సౌత్‌లో టాప్‌ మోస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయారు. ఆయన ప్రభావం కీరవాణిపై బాగా ఉండేది. మొదటి రెండు సంవత్సరాలు ఇళయరాజా తరహా పాటలే చేశానని కీరవాణి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని స్వరాలు సమకూర్చారు కీరవాణి.  కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు, చినాన్న విజయేంద్రప్రసాద్‌కు సినిమా రంగంతో పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాలతోనే చక్రవర్తి దగ్గర కీరవాణిని అసిస్టెంట్‌గా చేర్పించారు. వేటూరి దగ్గర, చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న సమయంలో రామ్‌గోపాల్‌వర్మతో కీరవాణికి పరిచయం ఏర్పడిరది. మ్యూజిక్‌ పరంగా కీరవాణి టాలెంట్‌ ఏమిటో వర్మ గుర్తించారు. ‘నా ఫస్ట్‌ సినిమాకి నువ్వే మ్యూజిక్‌ డైరెక్టర్‌’ అని కీరవాణికి మాటిచ్చారు వర్మ. ‘శివ’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చినపుడు కీరవాణి గురించి నాగార్జునకు, వెంకట్‌కు చెప్పారు వర్మ. ‘డైరెక్టర్‌గా నువ్వు కొత్త.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా కొత్తవాడు ఎందుకు.. ఇళయరాజాను తీసుకుందాం’ అన్నారు. అలా వర్మ తొలి సినిమాకు సంగీతాన్ని అందించే ఛాన్స్‌ మిస్‌ అయ్యారు కీరవాణి. ఆ వెంటనే వర్మ దర్శకత్వంలోనే వచ్చిన ‘క్షణక్షణం’ చిత్రానికి మ్యూజిక్‌ చేసే అవకాశం కీరవాణికి ఇచ్చారు.  తన కెరీర్‌ ప్రారంభంలోనే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో సంగీత దర్శకుడుగా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు కీరవాణి. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలను మ్యూజికల్‌గా హిట్‌ చేశారు కీరవాణి. వీరిద్దరి కాంబినేషన్‌లో 27 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లోని పాటలు పెద్ద విజయం సాధించాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, సుందరకాండ, అల్లరి ప్రియుడు, పెళ్లిసందడి వంటి సినిమాల పాటలు ఆరోజుల్లో చాలా పాపులర్‌ అయ్యాయి. ఫాస్ట్‌ బీట్‌, మెలోడీ సాంగ్స్‌లోనే కాకుండా భక్తి రసాత్మక చిత్రాల్లోనూ వీనుల విందైన సంగీతాన్ని అందించారు కీరవాణి. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి, పాండురంగడు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.  తమ్ముడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్‌ నెం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు అన్ని సినిమాలకూ అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు కీరవాణి. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించగా, దాదాపు ప్రతి సినిమాలోనూ ఒకటి, రెండు పాటలు రాసే అవకాశం కీరవాణికి ఇచ్చారు రాజమౌళి. ఒక దర్శకుడు చేసిన అన్ని సినిమాలనూ మ్యూజికల్‌ హిట్స్‌ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఆ ఘనత సాధించారు కీరవాణి. ఇక కీరవాణి చేసిన పాటలకు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి లభించిన పురస్కారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి ‘నాటు నాటు..’ పాటకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. అలాగే ‘అన్నమయ్య’ చిత్రాన్ని ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు కీరవాణి. ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కిగాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడుగా, నేపథ్య గాయకుడుగా, పాటల రచయితగా నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు కీరవాణిని వరించాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ 36 సంవత్సరాలుగా అందరూ మెచ్చే వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి.. తాజాగా మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌ రాబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

నటిస్తూనే తుది శ్వాస విడుస్తానని చెప్పిన ఎస్‌.వి.రంగారావు.. చివరికి అన్నంత పనీ చేశారు!

(జూలై 3 ఎస్‌.వి.రంగారావు జయంతి సందర్భంగా..) పాతతరం నటీనటులంతా నాటక రంగంపైనా, సినిమా రంగంపైనా విపరీతమైన గౌరవంతోనే తమ కెరీర్‌ను కొనసాగించారు. నటనను దైవంగా భావించేవారు. ఎంతగా అంటే తమ చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలి, నటనకు రిటైర్‌మెంట్‌ అనేది ఉండకూడదు అని చెబుతూ ఉండేవారు. అలా చివరి శ్వాస వరకూ నటిస్తూ కన్నుమూసిన నటులు ఎస్‌.వి.రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు. 70 సంవత్సరాలపాటు నటనలోనే కొనసాగి 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు అక్కినేని. ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ అదే సంవత్సరం మే 23న విడుదలైంది. అంతకుముందు ఎస్‌.వి.రంగారావు కూడా నటిస్తూనే కన్ను మూస్తానని పలుమార్లు చెప్పేవారు. చెప్పినట్టుగానే యశోదకృష్ణ సినిమా సెట్స్‌లోనే ప్రాణాలు విడిచారు.  వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎస్‌.వి.రంగారావు. తన కెరీర్‌లో చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేసిన సందర్భాలు చాలా తక్కువ. తను చేసే ప్రతి క్యారెక్టర్‌ వైవిధ్యంగా, విభిన్నంగా ఉండాలనుకునేవారు. అనుకున్నట్టుగానే అలాంటి పాత్రలే ఆయనకు వచ్చేవి. ఆయా పాత్రల్లో ఆయన జీవించేవారు. ప్రేక్షకులకు ఆ పాత్ర కనిపించేది తప్ప ఎస్వీఆర్‌ కనిపించేవారు కాదు. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అలాంటి గొప్ప నటుడికి తీరని అన్యాయం జరిగిందని ఇప్పటికీ ఎంతో మంది ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఎస్వీఆర్‌ ప్రేక్షకులు మెచ్చిన నటుడే కాదు, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ నచ్చిన నటుడు కూడా. అలాంటి గొప్ప నటుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి పురస్కారాలూ లభించలేదు. అంత గొప్ప నటుడ్ని ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయమని అందరూ బాధపడుతూ ఉంటారు.  1947లో వరూధిని చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఎస్‌.వి.రంగారావుకు ఆ తర్వాత పల్లెటూరిపిల్ల, షావుకారు చిత్రాలు చాలా మంచి పేరు తెచ్చాయి. అలా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత పాతాళభైరవిలో చేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర ఆయనలోని గొప్ప నటుడ్ని వెలికి తీసింది. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొందరు నటులు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తూ ఉంటారు. కానీ, ఎస్వీఆర్‌కి ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలు వచ్చేవి. వాటిని ఎంతో సమర్థవంతంగా పోషించడం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎస్వీఆర్‌ భారతదేశం గర్వించదగిన నటుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కంటే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండేది. వారిద్దరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. నటన విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌తో ఎప్పుడూ పోటీ పడేవారు ఎస్వీఆర్‌. కానీ, వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో నటుడుగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన ఎస్వీఆర్‌లో ఉండేది. అది గమనించిన ఎన్టీఆర్‌ ఆయనకు ధైర్యం చెప్పేవారు. నటుడుగా అత్యున్నత స్థానానికి వెళతారు అని ప్రోత్సహించేవారు.  వ్యక్తిత్వం విషయానికి వస్తే.. ఎదుటివారు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. దానివల్ల ఆయన నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1950లో విజయ సంస్థ తెలుగులో నిర్మించిన షావుకారు చిత్రాన్ని 1965లో ఎంగవీట్టు పెన్‌ పేరుతో తమిళ్‌లో రీమేక్‌ చేశారు. తెలుగులో జానకి పోషించిన పాత్ర కోసం తమిళ్‌లో నిర్మలను తీసుకున్నారు. విజయ సంస్థ ద్వారా నటిగా పరిచయమవడంతో తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు నిర్మల. అప్పటికి నటుడుగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు ఎస్వీఆర్‌. తెలుగులో ఎస్వీఆర్‌ పోషించిన సున్నపు రంగడు పాత్ర కోసం ఆయన్నే ఎంపిక చేశారు. షూటింగ్‌ ప్రారంభం రోజున విజయనిర్మలను చూసి ‘ఇంత బక్కపలచగా ఉందీ అమ్మాయి. ఈమె ఈ సినిమాలో హీరోయినా. ఈమె కంటే కె.ఆర్‌.విజయ బాగుంటుంది. ఆమెను తీసుకోండి’ అని నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు ఎస్వీఆర్‌. దాంతో హీరోయిన్‌గా తనకు వచ్చిన అవకాశం పోయిందంటూ విజయనిర్మల మేకప్‌ రూమ్‌లో ఏడుస్తూ కూర్చున్నారు. అయితే మరుసటి రోజు విజయనిర్మల ఇంటికి కారు వచ్చింది. షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిన ఆమెకు ఎస్వీఆర్‌ కనిపించలేదు. తర్వాత తెలిసిందేమిటంటే.. ఆ సినిమా నుంచి ఆయన్ని తీసేసి మరొకర్ని పెట్టారు. అలా ఒక చిన్న మాట వల్ల ఆ సినిమాలో అవకాశాన్ని కోల్పోయారు ఎస్వీఆర్‌.  తన చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను అని ఎస్వీఆర్‌ చెప్పిన మాటల్ని యశోద కృష్ణ చిత్రం నిజం చేసింది. 1974లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు దర్శకుడు సి.ఎస్‌.రావు. ఈ సినిమాలో కంసుడి పాత్ర పోషించారు ఎస్వీఆర్‌. కథ ప్రకారం కృష్ణుడి చేతిలో కంసుడు చనిపోతాడు. దానికి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఎస్వీఆర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. అలా తను కోరుకున్న విధంగానే సినిమా సెట్స్‌లోనే ప్రాణాలు వదిలారు ఎస్వీఆర్‌. అప్పటికి ఆయన కమిట్‌ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో కొంత భాగం నటించారు కూడా. అయితే ఎస్వీఆర్‌ మరణం తర్వాత ఆ సినిమాల్లో ఎస్వీఆర్‌ చేసిన పోర్షన్‌ వరకు తొలగించి గుమ్మడితో వాటిని పూర్తి చేశారు దర్శకనిర్మాతలు. 

టాలీవుడ్‌లో 90 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఏకైక దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి!

  పాత తరం నుంచి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో 90 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఏకైక దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. 1980లో ప్రారంభమైన ఆయన కెరీర్‌ 2009 వరకు కొనసాగింది. ఈ 30 సంవత్సరాల్లో 94 సినిమాలు డైరెక్ట్‌ చేశారు కోదండరామిరెడ్డి. అప్పటి టాప్‌ హీరోలందరికీ సూపర్‌హిట్‌ సినిమాలు చేసిన ఘనత ఆయనది. దాదాపు 20 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగిన కోదండరామిరెడ్డి సినీ ప్రవేశం ఎలా జరిగింది, డైరెక్టర్‌గా మొదటి అవకాశం ఎలా వచ్చింది, ఆయన సాధించిన తిరుగులేని విజయాల వెనుక వున్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం.   1950 జూలై 1న నెల్లూరు జిల్లాలోని మైపాడులో వెంకురెడ్డి, రమణమ్మ దంపతులకు జన్మించారు కోదండరామిరెడ్డి. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి నాటకాలు, సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. అలా చదువు మీద శ్రద్ధ తగ్గడం వల్ల పియుసి మధ్యలోనే ఆపేసి హీరో అయిపోదామని మద్రాస్‌ రైలెక్కేశారు. తన బంధువు ప్రభాకరరెడ్డి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి పరిచయమయ్యారు. ఆ సమయంలో వి.మధుసూదనరావు మనుషులు మారాలి సినిమా చేస్తున్నారు. కోదండరామిరెడ్డిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పెట్టించారు. అలా మొదలైన కోదండరామిరెడ్డి కెరీర్‌.. అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా, కోడైరెక్టర్‌గా ఎనిమిదేళ్లు కొనసాగింది. వి.మధుసూదనరావు శిష్యరికంలో సినిమా మేకింగ్‌కి సంబంధించిన అనేక మెళకువలు నేర్చుకున్నారు.    1980లో హిందీలో సూపర్‌హిట్‌ అయిన అమర్‌ అక్బర్‌ అంటోని చిత్రాన్ని తెలుగులో రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌ పేరుతో రీమేక్‌ చేశారు నిర్మాత సూర్యనారాయణబాబు. మొదట ఈ సినిమాకి కోదండరామిరెడ్డిని దర్శకుడుగా అనుకున్నారు. అయితే అనుభవమున్న డైరెక్టర్‌ అయితే బాగుంటుందని విజయనిర్మలతో చేయించారు. అదే సంవత్సరం ‘సంధ్య’ చిత్రం ద్వారా కోదండరామిరెడ్డి దర్శకుడుగా పరిచయమయ్యారు. అయితే ఈ చిత్రం ఎబౌ ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ సమయంలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న చిరంజీవితో న్యాయంకావాలి సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. హీరోగా చిరంజీవికి, డైరెక్టర్‌గా కోదండరామిరెడ్డికి మంచి పేరు వచ్చింది. అలా మొదలైన వీరి కాంబినేషన్‌లో 25 సినిమాలు వచ్చాయి. వాటిలో 23 సూపర్‌హిట్‌ సినిమాలు ఉండడం విశేషం. న్యాయంకావాలి, అభిలాష చిత్రాలు కెరీర్‌ ప్రారంభంలో చిరంజీవికి మంచి పేరు తెచ్చిన సినిమాలు. 1983లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఖైదీ ఒక చరిత్ర సృష్టించింది. చిరంజీవిని టాప్‌ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణమృదంగం, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ.. ఇలా అన్నీ సూపర్‌హిట్‌ సినిమాలే వచ్చాయి. 1993లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ముఠామేస్త్రి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా. చిరంజీవికి స్టార్‌డమ్‌ రావడానికి, మెగాస్టార్‌గా ఎదగడానికి నూటికి నూరు శాతం దర్శకుడు కోదండరామిరెడ్డి కారణం. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనదే.    నందమూరి బాలకృష్ణతో 13 సినిమాలు, నాగార్జునతో 7, వెంకటేష్‌తో 2, అక్కినేని నాగేశ్వరరావుతో 6, సూపర్‌స్టార్‌ కృష్ణతో 6, శోభన్‌బాబుతో 6.. ఇలా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ సినిమాలు చేశారు కోదండరామిరెడ్డి. అలాగే కమల్‌హాసన్‌, మోహన్‌బాబు, జగపతిబాబు వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి వారికి సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. ఎన్‌.టి.రామారావుతో తప్ప మిగిలిన అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం కోదండరామిరెడ్డికి మూడు సార్లు వచ్చింది. అయితే అప్పుడు ఆయన మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమా చెయ్యలేకపోయారు.    ఇక కోదండరామిరెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన దర్శకుడుగా పరిచయం అవ్వకముందే భారతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సనీల్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి. ‘గొడవ’ చిత్రం ద్వారా వైభవ్‌ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత వైభవ్‌ హీరోగా ‘కాస్కో’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. అయితే తమిళ్‌లో నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వైభవ్‌. ఇక పెద్ద కుమారుడు సునీల్‌రెడ్డి కూడా కొన్ని సినిమాల్లో నటించారు. దర్శకుడుగా కోదండరామిరెడ్డి చివరి సినిమా 2009లో విడుదలైన పున్నమినాగు.   (జూలై 1 దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా..)  

తెలుగు సినిమా డైలాగ్స్‌ను కొత్త పుంతలు తొక్కించిన ముళ్లపూడి వెంకటరమణ!

(జూన్‌ 28 ముళ్లపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా..) బాపు, రమణ... ఈ రెండు పేర్లు తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ రెండు పేర్లు విడిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి స్నేహబంధం అంత గొప్పది. అచ్చ తెలుగుదనాన్ని  ప్రేక్షకులకు పంచిన వీరిద్దరిలో ఒకరు దర్శకుడు, చిత్రకారుడు, మరొకరు రచయిత. చిన్నతనంలోనే రచయితగా తన జీవితాన్ని ప్రారంభించిన ముళ్లపూడి వెంకటరమణ... అనతి కాలంలోనే సినీ సాహితీ రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పటికి ఎంతో మంది రచయితలు ఉన్నప్పటికీ ఒక భిన్నమైన శైలిలో రచనలు సాగించి.. తన రచనల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అల్లరి పిల్లవాడు ‘బుడుగు’ పాత్రను సృష్టించి దాని ద్వారా పాఠకులకు అమితానందాన్ని కలిగించారు. ఋణానంద లహరి, విక్రమార్కుని మార్కు సింహాసనం, గిరీశం లెక్చర్లు వంటి రచనలు ఆయన సినీ రంగానికి రాకముందే ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి కొత్త తరహా సంభాషణలు ప్రేక్షకులకు పరిచయం చేశారు. శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో ఎ.భీమ్‌సింగ్‌ రూపొందించిన ‘పాశమలార్‌’ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో వి.మధుసూదనరావు దర్శకత్వంలో సుందర్‌లాల్‌ నహతా, డూండీ నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్‌.టి.రామారావు, కాంతారావు, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ముళ్ళపూడిని మాటల రచయితగా ఎంపిక చేశారు. కామెడీ రచనలకు పేరుగాంచిన ముళ్ళపూడిని అన్నా చెల్లెళ్ళ కథతో పూర్తి సెంటిమెంట్‌ నిండి ఉన్న సినిమాకి మాటలు ఎలా రాయగలడు అంటూ అంతా విమర్శించారు. కానీ, ‘రక్త సంబంధం’ చిత్రానికి అద్భుతమైన మాటలు రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో పడ్డారు ముళ్ళపూడి. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన మూగమనసులు, దాగుడుమూతలు, తేనెమనసులు, కన్నెమనసులు, పూలరంగడు చిత్రాలకు ముళ్ళపూడి కథను సమకూర్చారు. ‘మూగమనసులు’కు ఆచార్య ఆత్రేయతో కలసి కథ, మాటలు అందించిన ముళ్ళపూడి తొలిసారి సోలో కథకునిగా ‘దాగుడుమూతలు’ రాశారు. అలా కొన్ని సినిమాలకు కథ, కొన్ని సినిమాలకు మాటలు రాస్తూ రచయితగా బిజీ అయిపోయారు. కథా రచయితగా, మాటల రచయితగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు ముళ్ళపూడి.  తన మిత్రుడు బాపు తొలిసారి దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రానికి కథ, మాటలు రాశారు ముళ్ళపూడి. ఈ సినిమా బాపు, రమణలతోపాటు ఈ సినిమాలో నటించిన కృష్ణ, విజయనిర్మలకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాపు, రమణల కాంబినేషనలో ఎన్నో సినిమాలు రూపొందాయి. బంగారు పిచిక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతాకళ్యాణం, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, రాధా కళ్యాణం, త్యాగయ్య, పెళ్ళీడు పిల్లలు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్ళి పుస్తకం, మిస్టర్‌ పెళ్ళాం, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీరామరాజ్యం.. ఇలా ఎన్నో సినిమాలకు కలిసి పనిచేస్తూ చివరి వరకు ప్రాణ స్నేహితులుగా కొనసాగారు.  ముళ్ళపూడి తన రచనల్లో మెరుపులు మెరిపించేవారు కానీ, వ్యక్తిత్వ పరంగా చూస్తే ఎంతో మృధు స్వభావి. విభేదాలు లేకుండా అందరితోనూ ఎంతో బాగా కలిసిపోయేవారు. అయితే ఆయన మనసుకు బాధ కలిగితే ఆ దరిదాపుల్లో కనిపించేవారు కాదు. ముళ్ళపూడికి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుతో మంచి అనుబంధం ఉండేది. ఒకసారి పూలరంగడు సినిమా సమయంలో ముళ్ళపూడి మనసు నొచ్చుకుంది. అంతే.. తర్వాత ఆ సంస్థకు ఆయన పనిచేయలేదు. చాలా కాలం తర్వాత బాపు దర్శకత్వంలో ఆ సంస్థ ఓ సినిమా నిర్మిస్తుండడంతో స్నేహితుడి కోసం ఆ సినిమాకి పనిచేశారు ముళ్ళపూడి. ఆయనది ఎంతటి సున్నితమైన మనసు అంటే.. ఒక పెద్ద హీరో.. తాను నిర్మిస్తున్న సినిమాకు డబ్బు అవసరం అయితే.. పూచికత్తు ఉండి 25 లక్షలు ఇప్పించారు. ఆ హీరో ఆ డబ్బు కట్టకపోతే తన ఇంటిని అమ్మేసి ఆ అప్పు తీర్చారు ముళ్లపూడి. తర్వాత కూడా ఆ హీరో నుంచి డబ్బు ముళ్లపూడికి రాలేదు. అయినా ఆ హీరో గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు.

ఉదయ్‌కిరణ్‌ పేరు మీద ఉన్న ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రాస్‌ చెయ్యలేదు!

(జూన్‌ 26 ఉదయ్‌కిరణ్‌ జయంతి సందర్భంగా..) సినీ పరిశ్రమలోని కళాకారుల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి స్టార్‌డమ్‌ వస్తుందో, ఎప్పుడు పరాజయాలు వెంటాడతాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది హీరోలకు ఎన్నో సినిమాలు చేసిన తర్వాతగానీ స్టార్‌డమ్‌ రాదు. మరికొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్‌ అయిపోతారు. అలాంటి అరుదైన హీరో ఉదయ్‌కిరణ్‌. చాలా చిన్న వయసులోనే హీరోగా పరిచయమై, చిన్న వయసులోనే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్‌ సాధించి లవర్‌బోయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు. యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్‌కిరణ్‌ 33 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు ప్రేక్షకుల్ని కలచి వేసింది. హీరో అవ్వాలనే నిర్ణయం చిన్నతనంలోనే తీసుకున్న ఉదయ్‌.. దాన్ని సాధించేందుకు ఎలాంటి కృషి చేశారు? అతని చిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది? యూత్‌లో అంత ఫాలోయింగ్‌ ఎలా సంపాదించగలిగారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1980 జూన్‌ 26న వి.వి.కె.మూర్తి, నిర్మల దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు ఉదయ్‌కిరణ్‌. అతని విద్యాభాసం కూడా ఇక్కడే జరిగింది. తను పెద్దయ్యాక చిరంజీవి అంతటి హీరో అవుతానని చిన్నతనంలోనే తన అక్క శ్రీదేవితో చెప్పారు ఉదయ్‌. చిన్నప్పుడు అలాగే అంటారులే అని దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు అతని అక్క. కానీ, ఆ కోరిక పెద్దయ్యాక మరింత పెరిగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌కి వెళ్ళి కొన్ని చిన్న చిన్న యాడ్స్‌కి పనిచేశారు ఉదయ్‌. సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మిస్తున్న ‘చిత్రం’ సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులు కావాలని పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి రామోజీ ఫిలింసిటీకి వెళ్లారు. వందల మందిలో ఉదయ్‌ని సెలెక్ట్‌ చేశారు డైరెక్టర్‌ తేజ. తన సినిమాలో హీరో ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉదయ్‌ని తయారు చేశారు తేజ. 2000 జూన్‌ 16న ‘చిత్రం’ విడుదలై సంచలన విజయం సాధించింది. యాక్షన్‌ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో ఒక లవ్‌స్టోరీతో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు డైరెక్టర్‌ తేజ.  ఆ మరుసటి సంవత్సరం తేజ దర్శకత్వంలోనే ‘నువ్వు నేను’ చేశారు ఉదయ్‌. ఆ సినిమా కూడా పెద్ద హిట్‌ అయి యూత్‌ హీరోల్లో నెంబర్‌ వన్‌ అనిపించుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. 21 ఏళ్ళ వయసులో ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న హీరో అనే రికార్డు ఇప్పటికీ ఉదయ్‌కిరణ్‌ పేరుమీదే ఉంది. రెండు నెలల తేడాలోనే ‘మనసంతా నువ్వే’ చిత్రం కూడా విడుదలై ఘనవిజయం సాధించింది. అలా అతి చిన్న వయసులోనే హ్యాట్రిక్‌ సాధించిన హీరోగా ఉదయ్‌ పేరు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. 2002లో ‘నీ స్నేహం’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఉదయ్‌. ఈ సినిమాకి కూడా ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ నాలుగు సినిమాలకూ ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందించడం విశేషం. మ్యూజికల్‌గా ఈ సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి.  ఉదయ్‌కిరణ్‌ 14 సంవత్సరాల కెరీర్‌లో 20 సినిమాల్లో నటించారు. వాటిలో మూడు తమిళ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి నాలుగు సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయారు. ఒక విధంగా ‘నీ స్నేహం’ ఉదయ్‌కిరణ్‌ కెరీర్‌లో చివరి హిట్‌ అని చెప్పాలి. ఆ తర్వాత రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేశారు. కానీ, విజయం మాత్రం అతని దరి చేరలేదు. 2003లో మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుస్మితతో ఉదయ్‌ కిరణ్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. త్వరలోనే వారిద్దరి వివాహం జరిపించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఉదయ్‌ని పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభం కావాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. 2012లో విషితను వివాహం చేసుకున్నారు ఉదయ్‌కిరణ్‌. చిన్న వయసులోనే స్టార్‌ స్టేటస్‌ను చూసిన ఉదయ్‌ ఆ తర్వాత వచ్చిన పరాజయాలకు తట్టుకోలేకపోయారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.  2014 జనవరి 5న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్‌కిరణ్‌. అతని మరణవార్త విని ఇండస్ట్రీలోని ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అతని భౌతికకాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. వారిలో ఎంతో మంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఏ యూత్‌ హీరోకి లేనంత ఫాలోయింగ్‌ ఉదయ్‌కిరణ్‌కి ఉందనే విషయం అందరికీ తెలిసింది. 8 కిలోమీటర్ల దూరంలో వున్న స్మశాన వాటికకు ఉదయ్‌కిరణ్‌ బౌతికకాయం వెంట వేలమంది అభిమానులు నడుచుకుంటూ వెళ్లారు. అంతేకాదు, విజయనగరంలో ఉంటున్న ఓ అభిమాని ఉదయ్‌కిరణ్‌ మరణాన్ని తట్టుకోలేక తను కూడా ఓ చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.