ఒకే సంవత్సరం మూడు భారీ బ్లాక్‌బస్టర్స్‌తో రికార్డు సృష్టించిన నటరత్న ఎన్‌.టి.రామారావు!

(జనవరి 18 ఎన్‌.టి.రామారావు వర్థంతి సందర్భంగా..) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న అన్న ఎన్‌.టి.రామారావు ఎంతో మందికి ఆరాధ్య దైవం. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ, ఎన్టీఆర్‌ ఆ పాత్రలో కనిపిస్తే నిజంగా దేవుడనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయగలిగే ఛరిష్మా ఆయనలో ఉంది. దేవుడి పాత్రలే కాదు, ఏ పౌరాణిక పాత్ర పోషించినా నూటికి నూరుశాతం అందులో ఒదిగిపోయే అసమాన నటుడు ఎన్టీఆర్‌. ఆయన తెరపై కనిపించిన తొలి సినిమా ‘మనదేశం’ 1949 నవంబర్‌ 24న విడుదలైంది. ఆఖరి సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ 1993 అక్టోబర్‌ 21న రిలీజ్‌ అయింది. 44 సంవత్సరాల సినీ కెరీర్‌లో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక పాత్రల్లో కొన్ని వందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌ కెరీర్‌లో 1977 సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఏ హీరోకీ సాధ్యంకాని ఘనవిజయాలు, రికార్డులు సృష్టించారు ఎన్టీఆర్‌.  1977లో ఎన్‌.టి.రామారావు నటించిన ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘చాణక్య చంద్రగుప్త’, ‘మా ఇద్దరి కథ’, ‘యమగోల’, ‘ఎదురీత’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఆరు సినిమాల్లో మూడు సినిమాలు ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. వీటిలో జనవరి 14 సంక్రాంతికి విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ చిత్రానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కువ నిడివిగల చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. 22,450 అడుగులతో 4 గంటల 7 నిమిషాల ప్రదర్శన సమయం ఉంటుంది. అంతకుముందు రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మేరా నామ్‌ జోకర్‌’ చిత్రం 4 గంటల 20 నిమిషాలతో భారత దేశంలో ఎక్కువ నిడివిగల చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే 40 నిమిషాల సినిమాను కట్‌ చేయడంతో ‘దానవీరశూర కర్ణ’ చిత్రం ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. 4 గంటల 7 నిమిషాల సినిమాలో ఎన్టీఆర్‌ 4 గంటల పాటు తెరపై కనిపించడం విశేషం. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన నందమూరి బాలకృష్ణకు ఇదే తొలి పౌరాణిక చిత్రం.  కర్ణ, దుర్యోధన, కృష్ణ పాత్రల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పౌరాణిక చిత్రాన్ని 43 వర్కింగ్‌ డేస్‌లో పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.   20 రోజుల్లోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తిచేశారు. అంత భారీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడంలో తనకు సహకరించిన యూనిట్‌ సభ్యులకు, స్టూడియో సిబ్బందికి డిసెంబర్‌ 17 రాత్రి నిజాం క్లబ్‌లో చక్కని విందు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్‌. ఈ సినిమా చేస్తూనే ‘అడవి రాముడు’ చిత్రాన్ని కూడా పూర్తి చేద్దామని మొదట అనుకున్నారు ఎన్టీఆర్‌. అయితే ‘దానవీరశూర కర్ణ’ చిత్రానికి పోటీగా హీరో కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి ‘అడవిరాముడు’ చిత్రం కోసం ఇచ్చిన డేట్స్‌ని వెనక్కి తీసుకొని దానవీరశూర కర్ణ చిత్రాన్ని వేగంగా పూర్తి చేశారు. 10 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని 1977 జనవరి 14న 30 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి అప్పటికి రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా విడుదల సమయానికి అడవిరాముడు షూటింగ్‌ కోసం ముదుమలై ఫారెస్ట్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌. దానవీరశూర కర్ణ సాధించిన విజయాన్ని అక్కడే సెలబ్రేట్‌ చేసుకున్నారు.  అడవిరాముడు ఎన్టీఆర్‌ నటించిన తొలి సినిమా స్కోప్‌ చిత్రం. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో కె.రాఘవేంద్రరావు చేసిన తొలి సినిమా కూడా ఇదే. అడవిరాముడు ఎన్టీఆర్‌ కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ మూవీగా చెప్పొచ్చు. లుక్‌ పరంగా, డాన్సుల పరంగా, యాక్షన్‌ సీన్స్‌ పరంగా ఎన్టీఆర్‌ను రాఘవేంద్రరావు చూపించిన విధానాన్ని ప్రేక్షకులు, ఎన్టీఆర్‌ అభిమానులు కొత్తగా ఫీల్‌ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. రాఘవేంద్రరావు పాటలు అద్భుతంగా తియ్యగలరు అని ఈ సినిమాతోనే ప్రూవ్‌ అయింది. కేవలం పాటల కోసమే ఈ సినిమాకి రిపీట్‌ అడియన్స్‌ వచ్చేవారంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు, ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. పాటను విపరీతంగా ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులు స్క్రీన్‌పైకి డబ్బులు విసిరేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక పాట కోసం థియేటర్‌లో డబ్బులు విసిరేయడం అనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది. 40 ప్రింట్లతో 1977 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ సినిమా 4 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి అంతకుముందు దానవీరశూర కర్ణ పేరుతో ఉన్న రికార్డును క్రాస్‌ చేసింది.  అడవిరాముడు తర్వాత ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరో భారీ హిట్‌ సినిమా యమగోల. అంతకుముందు ఎన్టీఆర్‌ నటించిన దేవాంతకుడు చిత్రంలో కూడా యముడ్ని టీజ్‌ చేయడం అనే అంశం ఉంటుంది. అదే ఫార్ములాతో రూపొందిన సినిమా యమగోల. ఈ సినిమా షూటింగ్‌ 30 రోజుల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్‌ చేశారు. అయితే 27 రోజుల్లోనే టాకీ పూర్తి కావడం విశేషం. తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజ్‌కి సిద్ధమైంది. అడవిరాముడు ప్రదర్శిస్తున్న థియేటర్లలోనే యమగోల చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు నిర్మాత వెంకటరత్నం. అయితే అడవిరాముడు వంద రోజులు పూర్తయినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. దీంతో పంపిణీదారులు యమగోల చిత్రానికి వేరే థియేటర్లు ఇస్తామని చెప్పారు. కానీ, నిర్మాత ఒప్పుకోలేదు. అయితే 175 రోజులు పూర్తయ్యేవరకు ఆగాల్సిందేనని పంపిణీదారులు అన్నారు. దానికి కూడా సిద్ధపడ్డారు నిర్మాత వెంకటరత్నం. అడవిరాముడు 175 పూర్తయినా కలెక్షన్లు తగ్గలేదు. కానీ, అగ్రిమెంట్‌ ప్రకారం ఆ సినిమాను తీసేసి ఆ స్థానంలో యమగోల చిత్రాన్ని ప్రదర్శించారు. ఆగస్ట్‌లో సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తను అనుకున్న థియేటర్లలోనే రిలీజ్‌ చేసేందుకు రెండు నెలలు వెయిట్‌ చేసిన నిర్మాత ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.  సినిమాలకు ముఖ్యమైన సీజన్స్‌గా చెప్పుకునే సంక్రాంతి, సమ్మర్‌, దసరా సందర్భంగా విడుదలైన దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల చిత్రాలు ఎన్టీఆర్‌ కెరీర్‌లో అతిముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఇక మిగతా మూడు సినిమాల్లో  చాణక్య చంద్రగుప్త చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఎందుకంటే 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జునయుద్ధం తర్వాత ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి నటించలేదు. 14 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా చాణక్య చంద్రగుప్త. అంతేకాదు, తమిళ స్టార్‌ హీరో శివాజీ గణేశన్‌ ఈ సినిమాలో అలెగ్జాండర్‌గా ఓ కీలక పాత్ర పోషించారు. కానీ, ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం విడుదలైన ఎదురీత చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్‌ వి.ఎస్‌.ఆర్‌.స్వామి సమర్పణలో శాఖమూరి రామచంద్రరావు నిర్మించారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో మా ఇద్దరి కథ చిత్రం విడుదలైంది. మొదట ఈ సినిమాలో హీరోగా ఎఎన్నార్‌ను ఎంపిక చేశారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. 25 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. షూటింగ్‌ మొదలయ్యే సమయానికి ఎఎన్నార్‌కు గుండెపోటు రావడంతో వైద్యం కోసం ఆయన్ని అమెరికా తీసుకెళ్లారు. తను తీసుకున్న అడ్వాన్స్‌ కూడా తిరిగి ఇచ్చేశారు ఎఎన్నార్‌. అప్పుడు ఎన్టీఆర్‌ ఆ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. అలా 1977లో విడుదలైన 6 సినిమాల్లో మూడు సినిమాలు చరిత్ర సృష్టించగా, మూడు సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి.

ఇండియాలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఎల్.వి.ప్రసాద్ సొంతం!

(జనవరి 17 దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జయంతి సందర్భంగా..) ఎల్‌.వి.ప్రసాద్‌.. ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు. సాధారణ వ్యక్తి నుంచి సినీ పరిశ్రమలో ఓ శక్తిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. చేసే పనిపట్ల గౌరవం, అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మేధావి. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఏళ్ళ తరబడి నిరీక్షించి విజయం సాధించిన నిత్య కృషీవలుడు. తను నటుడిగా, దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా, థియేటర్‌ గేట్‌మెన్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. అన్ని శాఖల్లోనూ విశేష అనుభవం సంపాదించి తన కెరీర్‌కి గట్టి పునాది వేసుకున్నారు. సినిమా పరిశ్రమలో ఒక మహోన్నత వ్యక్తిగా ఎల్‌.వి.ప్రసాద్‌ ఎదగడం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతటి శ్రమ ఉంది అనే విషయాల గురించి ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1908 జనవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు ఎల్‌.వి.ప్రసాద్‌. ఆయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు.  రైతు కుటుంబంలో జన్మించిన ప్రసాద్‌ చురుకైన వాడే అయినప్పటికీ చదువుపై శ్రద్ద పెట్టేవారు కాదు. నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపులు ఆయన్ని ఆకర్షించేవి. పాత సినిమా రీళ్లను ప్రదర్శించే గుడారాల్లో వాటిని ఆసక్తిగా చూసేవారు. స్థానికంగా కొందరు ప్రదర్శించే నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. అది సినిమాలపై ఆసక్తిని పెంచింది. 17 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను 1927లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి జన్మించింది. ప్రసాద్‌ తండ్రి శ్రీరాములు అప్పుల బాధ భరించలేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితికి వచ్చేశారు. దీంతో తనలోని నటనా ప్రతిభను జీవనోపాధికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో 1930లో వంద రూపాయలు తీసుకొని ఎవరికీ చెప్పకుండా బొంబాయి చేరుకున్నారు ప్రసాద్‌. బొంబాయిలోని వీనస్‌ ఫిల్మ్‌ కంపెనీలో నెలకు 15 రుపాయల వేతనంతో చిన్నచిన్న పనులు చేసేందుకు అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యారు. ఆ సమయంలోనే స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. 1931లో ఇంపీరియల్‌ ఫిలింస్‌ నిర్మించిన భారతదేశపు మొదటి టాకీ ఆలం ఆరా చిత్రంలో నాలుగు చిన్న చిన్న పాత్రల్లో నటించారు ప్రసాద్‌. ఆ సంస్థ ద్వారా దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి పరిచయమయ్యారు. ఆయన నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాస్‌లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు.  ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగులో నిర్మించిన తొలి టాకీ భక్త ప్రహ్లాద చిత్రంలో నటించారు ప్రసాద్‌. అలా భారతదేశంలో మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత సాధించారు ఎల్‌.వి.ప్రసాద్‌. కాళిదాస్‌, భక్త ప్రహ్లాద చిత్రాలు విజయం సాధించడంతో తన భార్యను బొంబాయి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో జీవనోపాధి కోసం డ్రీమ్‌ల్యాండ్‌ థియేటర్‌లో గేట్‌ కీపర్‌గా చేరారు. ఆ సమయంలోనే హెచ్‌.ఎం.రెడ్డి నిర్మిస్తున్న సతీసావిత్రి చిత్రంలో నటిస్తూనే రాత్రి వేళ గేట్‌ కీపర్‌గా పనిచేశారు.  ప్రసాద్‌లోని టాలెంట్‌, కష్టపడే తత్వం హెచ్‌.ఎం.రెడ్డికి బాగా నచ్చాయి. దాంతో అతన్ని హీరో చెయ్యాలనుకొని మాయల ఫకీరు పేరుతో ఓ సినిమాను ప్రారంభించారు. కానీ, అదే సమయంలో బాలనాగమ్మ పేరుతో రెండు సినిమాలు ప్రారంభం కావడంతో అదే కథతో సినిమా ఎందుకు చెయ్యడం అని దాన్ని ఆపేశారు. అయితే ప్రసాద్‌కి ఇచ్చిన మాట మర్చిపోలేదు. ఆ తర్వాత ఘరానా దొంగ అనే టైటిల్‌తో సినిమా ప్రారంభించారు. అందులో ప్రసాద్‌ హీరో. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. 1930లో బొంబాయికి వెళ్ళిన నాటి నుంచి 1945 వరకు అంటే 15 సంవత్సరాలపాటు ఎల్‌.వి.ప్రసాద్‌ ఎన్నో కష్టాలు అనుభవించారు. భారతదేశంలో ప్రారంభమైన మూడు తొలి టాకీల్లో నటించిన ఘనత సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా, థియేటర్‌ గేట్‌మెన్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. ఇలా అన్ని శాఖల్లో మంచి అనుభవం సంపాదించుకున్నారు.  1943 ప్రాంతంలో త్రిపురనేని గోపీచంద్‌ కథ, దర్శకత్వంలో పెంకి పిల్ల అనే సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో మరో దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావు.. ఎల్‌.వి.ప్రసాద్‌ పేరు సూచించారు. బొంబాయిలో ఉన్న ఆయన్ని మద్రాస్‌ తీసుకొచ్చారు. కథ విన్న ప్రసాద్‌ మొదట టైటిల్‌ నెగెటివ్‌గా ఉందని, గృహప్రవేశం అనే టైటిల్‌ బాగుంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు, కథలో కూడా కొన్ని మార్పులు చెప్పారు. అవన్నీ విన్న గోపీచంద్‌, చిత్ర యూనిట్‌ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమాని ఎల్‌.వి.ప్రసాద్‌ డైరెక్ట్‌ చేస్తేనే న్యాయం జరుగుతుందని భావించారు. అలా గృహప్రవేశం చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా మారారు. అప్పటికే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న భానుమతి ఆయనకు జంటగా నటించారు. 1946లో విడుదలైన గృహప్రవేశం చిత్రం ఘనవిజయం సాధించింది.  ఆ తర్వాత పల్నాటి యుద్ధం, ద్రోహి చిత్రాలు కూడా డైరెక్ట్‌ చేశారు ప్రసాద్‌. 1949లో ఆయన డైరెక్షన్‌లో వచ్చిన మరో సినిమా మనదేశం. ఈ సినిమా ద్వారా మహానటుడు ఎన్‌.టి.రామారావును తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు ప్రసాద్‌. 1950లో ప్రసాద్‌ దర్శకత్వంలోనే విజయా వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకారు విడుదలైంది. ఎన్‌.టి.రామారావు పూర్తి స్థాయి హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. అదే సంవత్సరంలో ఎన్‌.టి.రామరావు, అక్కినేని నాగేశ్వరరావు సోదరులుగా నటించిన సంసారం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 1955లో ప్రసాద్‌ రూపొందించిన మిస్సమ్మ ఒక చరిత్ర సృష్టించింది. తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఎల్‌.వి.ప్రసాద్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత పెళ్లిచేసిచూడు, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలు ఘనవిజయం సాధించి దర్శకుడిగా ప్రసాద్‌కి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టాయి. ఆయన నటించిన సినిమాలు 15, దర్శకత్వం వహించిన సినిమాలు 30, ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఆయన నిర్మించిన సినిమాలు 32. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లో ఎల్‌.వి.ప్రసాద్‌ సినిమాలు చేశారు.  ఎల్‌.వి.ప్రసాద్‌ సినిమాల ద్వారా సంపాదించినదంతా సినిమా పరిశ్రమ అభివృద్ధికే ఉపయోగించారు. ప్రసాద్‌ కలర్‌ లాబరేటరీస్‌, ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌, ప్రసాద్‌ ఇఎఫ్‌ఎక్స్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌.. ఇలా వివిధ శాఖల్లో సినిమాను అభివృద్ధి చేశారు. అంతేకాదు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అనుగుణంగా 1987లో హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి పేదలకు కంటి వైద్యాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి 277 విజన్‌ సెంటర్స్‌ ఉన్నాయి. సినిమా రంగానికి, సమాజానికి ఎల్‌.వి.ప్రసాద్‌ చేసిన సేవకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఒక రహదారికి ఎల్‌.వి.ప్రసాద్‌ మార్గ్‌ అని పేరు పెట్టారు.

రావుగోపాలరావు గొంతు సినిమాలకు పనికిరాదన్నారు.. ఎందుకో తెలుసా?

(జనవరి 14 రావు గోపాలరావు జయంతి సందర్భంగా..) ఏ సినిమాలోనైనా హీరోకి ఎక్కువ ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అయితే కథలో విలన్‌ ఉంటేనే హీరో ఎలివేట్‌ అవుతాడు. తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు హీరోల వేషధారణ, భాష, నటన వంటి విషయాలు ఎలా మారుతూ వచ్చాయో విలన్స్‌ కూడా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందారు. మొదట్లో విలన్‌ అంటే వేషధారణ, డైలాగుల్ని బిగ్గరగా చెప్పడం, వికృతంగా నవ్వడం వంటి వాటితో తమ విలనిజాన్ని ప్రదర్శించేవారు. ఈ విషయంలో రాజనాల పేరును ప్రస్తావించవచ్చు. విలన్స్‌ అనగానే హీరోతో తన్నులు తినడమే కార్యక్రమంగా పెట్టుకునేవారు. ఆ తరహా విలన్స్‌ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న రోజుల్లో.. నాగభూషణం.. కామెడీ, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ని మిక్స్‌ చేయడం ద్వారా,  డైలాగ్‌ మాడ్యులేషన్‌ ద్వారా విలనిజానికి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.  ఆ తర్వాత రావు గోపాలరావు విలనిజానికి మరో అర్థాన్ని చెప్పారు. తాను సీరియస్‌ విలన్‌గా కనిపిస్తూ పక్కనే ఓ కమెడియన్‌తో కామెడీ చేయిస్తూ కొత్తపంథాను అనుసరించారు. అలాంటి సినిమాలు సూపర్‌హిట్‌ కావడం, రావుగోపాలరావు విలనిజానికి మంచి పేరు రావడంతో దర్శకనిర్మాతలు కూడా దాన్నే కొనసాగించారు. పాతరోజుల్లో విలన్‌లా హీరో చేత తన్నులు తినే సందర్భాలు రావుగోపాలరావు కెరీర్‌లో ఎక్కువ రాలేదు. ఏ సందర్భంలో ఎలా డైలాగులు చెప్పాలి, ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్‌ చెయ్యాలి అనేది రావు గోపాలరావుకు బాగా తెలుసు. ఎందుకంటే నాటక రంగం నుంచి రావడంతో సులువుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు. ఓసారి కాకినాడలో నాటకం వేస్తున్నప్పుడు ఎస్‌.వి.రంగారావు కూడా అక్కడ ఉన్నారు. రావుగోపాలరావు నటన నచ్చి మద్రాస్‌ వచ్చి తనను కలవమని చెప్పారు. మద్రాస్‌ వెళ్ళిన రావు గోపాలరావుకు దర్శకుడు గుత్తా రామినీడును పరిచయం చేశారు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే చిన్న చిన్న క్యారెక్టర్లు వేయడం మొదలుపెట్టారు.  నాటకరంగంలో తన డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రావు గోపాలరావుకు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. సినిమాలకు తన గొంతు పనికిరాదని డైరెక్టర్లు చెప్పడం ఆయన్ని ఎంతో బాధించింది. కొన్ని సినిమాల్లో తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్‌ చెప్పించడం ఆయన్ని మరింత కుంగదీసింది. అయితే ఆ సమయంలోనే ఓ విచిత్రం జరిగింది. అందరూ పనికిరాదంటున్న రావు గోపాలరావు గొంతు.. బాపు, రమణలను ఆకర్షించింది. అతనికి తగిన పాత్రను ఇవ్వడమే కాకుండా, ఆయన గొంతును ఎలివేట్‌ చేసే డైలాగులు రాశారు రమణ. అది రావు గోపాలరావుకు ఎంతో మంచి పేరు తెచ్చింది. అదే ముత్యాల ముగ్గు చిత్రం. కాంట్రాక్టరు పాత్రలో రావుగోపాలరావు చూపించిన విలనిజం, చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు చెప్పిన డైలాగులు గ్రామఫోన్‌ రికార్డుల రూపంలో రిలీజ్‌ అయ్యాయి. ఆరోజుల్లోనే అత్యధిక స్థాయిలో ఈ రికార్డులు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత భక్తకన్నప్ప చిత్రంలో కైలాసనాథ శాస్త్రి పాత్రను కూడా బాపు, రమణలే ఇచ్చారు. ఈ రెండు పాత్రలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు రావుగోపాలరావు. అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆ తర్వాత యమగోల, వేటగాడు, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తుండిపోతాయి. అలాంటి డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, ఆ ఒక్కటీ అడక్కు తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. రావు గోపాలరావు తర్వాత ఎంతో విలన్స్‌ వచ్చినా, కొందరు విలనీ కామెడీ చేసినా ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చెయ్యలేకపోయారు.

హాస్య చిత్రాల పితామహుడు జంధ్యాల జీవితం అలా ముగిసింది!

(జనవరి 14 దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా..) ‘నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’.. జంధ్యాల పేరు ప్రస్తావనకి వస్తే మనకు గుర్తొచ్చే మాటలు ఇవే. టాప్‌ హీరోలతో, భారీ కథలతోనే కాదు, హాస్యంతో కూడా ఘనవిజయాలు అందుకోవచ్చు అని నిరూపించిన దర్శకుడు జంధ్యాల. పూర్తి స్థాయి హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే కాదు, టాలీవుడ్‌కి బ్రహ్మానందం, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు వంటి హాస్యనటుల్ని పరిచయం చేశారు. అద్భుతమైన హాస్య చిత్రాలను రూపొందించి హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్న జంధ్యాల బాల్యం ఎలా గడిచింది, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం.  1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నారాయణమూర్తి, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు జంధ్యాల. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి. పుట్టింది నరసాపురంలో అయినా పెరిగింది, చదువుకుంది మాత్రం విజయవాడలోనే. పదో ఏటనే కథలు రాయడం మొదలు పెట్టారు జంధ్యాల. అది చూసి స్కూల్‌ టీచర్స్‌ ఎంతో ఆశ్చర్యపోయేవారు. వారి సహకారంతో కొన్ని కథలను సంపుటిగా ప్రచురించారు కూడా. ఆయన కథల్లో హాస్యం ప్రధానంగా ఉండేది. పియుసి చదువుతున్న రోజుల్లో జంధ్యాల రాసిన 30 కథలు రేడియోలో వచ్చాయి. డిగ్రీ చదివే సమయంలో నాటకాలు రాసేవారు. రాయడమే కాదు, అందులో వేషాలు కూడా వేసేవారు. ఆయన 75 నాటకాలు, 20 నాటికలు రచించారు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. 1976లో హనుమాన్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన బొమ్మలు చిత్రంలో తొలిసారి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రానికి డైలాగ్స్‌ రాశారు. దాంతో రచయితగా జంధ్యాలకు మంచి పేరు వచ్చింది.  1977లో ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అడవి రాముడు జంధ్యాలకు పెద్ద బ్రేక్‌ అని చెప్పాలి. అప్పటివరకు సినిమాల్లో వినిపిస్తున్న మాటలకు భిన్నంగా ఆయన రాసిన మాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అడవిరాముడు తర్వాత డ్రైవర్‌ రాముడు, వేటగాడు వంటి సినిమాలకు కూడా జంధ్యాలనే తీసుకున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. మాస్‌, యాక్షన్‌ సినిమాలకే కాదు, సంగీత ప్రధాన చిత్రాలకు కూడా ఎంతో డీసెంట్‌ డైలాగులు రాసేవారు. శంకరాభరణం, సాగరసంగమం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1976 నుంచి 1981 వరకు దాదాపు 100 సినిమాలకు రచన చేశారు జంధ్యాల. అందులో 90 శాతం సినిమాలు విజయం సాధించాయంటే అందులో ఆయన భాగస్వామ్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.  దాదాపు 200 సినిమాలకు మాటలు రాసిన జంధ్యాలకు నాటకాలు డైరెక్ట్‌ చేసిన అనుభవం కూడా ఉండడంతో స్నేహితుల ప్రోత్సాహంతో దర్శకుడుగా మారాలనుకున్నారు. తొలి సినిమాగా ముద్దమందారం చిత్రాన్ని రూపొందించారు. అప్పటివరకు రాని ఒక విభిన్నమైన కథ, కథనం, మాటలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జంధ్యాల చేసిన నాలుగు స్తంభాలాట చిత్రం అప్పట్లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. సెంటిమెంట్‌తో కూడిన కథతో రూపొందిన ఈ సినిమాలో కామెడీ కూడా సమపాళ్ళలో ఉండడంతో ఇది శతదినోత్సవ చిత్రంగా నిలిచింది.  అప్పటి వరకు సినిమాల్లో కామెడీ అనేది ఒక భాగంగా, సెపరేట్‌ ట్రాక్‌గా ఉంటూ వచ్చింది. జంధ్యాల రాకతో పూర్తి కామెడీ సినిమాలు మొదలయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు రెళ్లు ఆరు, శ్రీవారి శోభనం, రెండు జెళ్ళ సీత, పుత్తడిబొమ్మ, జయమ్ము నిశ్చయమ్మురా, శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్ళంట, బాబాయ్‌ అబ్బాయ్‌, చంటబ్బాయ్‌, పడమటి సంధ్యారాగం, చూపులు కలిసిన శుభవేళ, సీతారామకళ్యాణం వంటి సినిమాలు ఘనవిజయం సాధించడమే కాకుండా టాలీవుడ్‌లో హాస్యచిత్రాల ఒరవడిని బాగా పెంచాయి. ముఖ్యంగా జంధ్యాల సినిమాల్లోని క్యారెక్టర్స్‌ చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఒక డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవి. ఒక సినిమాలోని క్యారెక్టర్‌ మరో సినిమాలో కనిపించేది కాదు. తన ప్రతి సినిమాలో క్యారెక్టర్లకు అంతటి వ్యత్యాసం చూపించేవారు. జంధ్యాల తర్వాత రేలంగి నరసింహారావు, ఇ.వి.వి.సత్యనారాయణ, వంశీ వంటి దర్శకులు పూర్తి హాస్య భరిత చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలను రూపొందించాలని ఇండస్ట్రీకి వచ్చే దర్శకులంతా జంధ్యాలను తమ గురువుగా భావిస్తారు. ఆయన చేసిన తరహా సినిమాలు యువ దర్శకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  కొందరికి మాస్‌ సినిమాలంటే ఇష్టం. మరికొందరు యాక్షన్‌, సెంటిమెంట్‌ సినిమాలను ఇష్టపడతారు. కానీ, అందరూ ఇష్టపడేది మాత్రం హాస్య చిత్రాలనే. మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు తను స్ట్రెస్‌ ఫీల్‌ అయినపుడు జంధ్యాల సినిమాలు, రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూస్తానని చెప్పేవారు. అంతేకాదు, ఇప్పుడు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఎంతో మంది ఇళ్ళల్లో జంధ్యాల సినిమాల కలెక్షన్‌ ఉంటుందంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. ఆయన దర్శకుడుగానే కాదు నటుడుగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాటకాలు వేసే రోజుల్లో ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంది ప్రముఖ నటులకు తన గాత్రాన్ని అందించారు.  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు కూడా లభించింది. పడమటి సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు, ఆపద్బాంధవుడు చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు. తను రూపొందించిన హాస్య చిత్రాల ద్వారా ఎంతోమందికి గుండెజబ్బును దూరం చేశారని అంటారు. కానీ, చివరికి 50 సంవత్సరాల వయసులో 2001 జూన్‌ 19న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు జంధ్యాల హాస్య చిత్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గదు అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం.

ఒకే సంవత్సరం 5 బ్లాక్‌బస్టర్స్‌తో చరిత్ర సృష్టించిన శోభన్‌బాబు!

(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..) 1959లోనే నటుడుగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన శోభన్‌బాబు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కొన్నేళ్ళపాటు తన కెరీర్‌ను కొనసాగించారు. హీరోగా మారిన తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1970వ దశకం వచ్చేసరికి రంగుల చిత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ దశలో తను కలర్‌ సినిమాల్లో మాత్రమే నటిస్తానని నిర్మాతలకు చెప్పేవారు శోభన్‌బాబు. తనతో సినిమా చెయ్యాలని వచ్చే నిర్మాతలను ముందుగా కథ గురించి, దర్శకుడి గురించి అడక్కుండా కలర్‌లో తీస్తారా, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీస్తారా అని అడిగేవారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అని చెబితే నిర్మొహమాటంగా చెయ్యను అని చెప్పేవారు. ఆ నిర్ణయం వల్ల ఎన్నో సినిమాలు శోభన్‌బాబు వదులుకున్నారు. అలా ఆ తర్వాతికాలంలో శోభన్‌బాబు చేసిన సినిమాలన్నీ కలర్‌లోనే రూపొందాయి. ముఖ్యంగా 1975 సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అన్నీ కలర్‌ సినిమాలే కావడం విశేషం. ఇందులో 5 సినిమాలు సూపర్‌హిట్‌ అయి ఆరోజుల్లో సంచలనం సృష్టించాయి.  దేవుడు చేసిన పెళ్లి, అందరూ మంచి వారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు.. ఈ 8 సినిమాలు 1975లో విడుదలయ్యాయి. వీటిలో ఐదు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా బలిపీఠం, జీవనజ్యోతి, సోగ్గాడు సాధించిన సంచలన విజయాలు శోభన్‌బాబును  స్టార్‌ హీరోగా నిలబెట్టాయి. ఆ ఏడాది మొదట విడుదలైన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శోభన్‌బాబు సరసన శారద నటించారు. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చక్కని సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందడంతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒకరోజు ఉదయం ఆటను పూర్తిగా మహిళలకు కేటాయించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాలకు మంచి పోటీనిచ్చి ఘనవిజయం సాధించింది. 17 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు.  శోభన్‌బాబు, మంజుల జంటగా నటించిన సూపర్‌హిట్‌ సినిమా మంచి మనుషులు తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అందరూ మంచివారే. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన బాబు చిత్రం విడుదలైంది. కె.రాఘవేంద్రరావు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆయన తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు కథను అందించారు. ఈ సినిమా మొదటివారం 16 లక్షలు కలెక్ట్‌ చేసినప్పటికీ రెండు నెలల తర్వాత ఇదే జంటతో కె.విశ్వనాథ్‌ రూపొందించిన జీవనజ్యోతి విడుదల కావడంతో బాబు చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. దీంతో ఆశించిన విజయం లభించలేదు. జీవనజ్యోతి సంచలన విజయం సాధించడమే కాకుండా శోభన్‌బాబుకి ఉత్తమనటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. శోభన్‌బాబు ఉత్తమనటుడుగా అవార్డు అందుకున్న ప్రతి సినిమాకీ కె.విశ్వనాథే దర్శకుడు కావడం విశేషంగా చెప్పుకోవాలి. అదే సంవత్సరం దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శారద జంటగా నటించిన బలిపీఠం చిత్రం ఘనవిజయం సాధించింది.  ఆ తర్వాత వి.మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన చిత్రం జేబుదొంగ. ఈ సినిమాలో మంజుల హీరోయిన్‌గా నటించారు. అప్పటివరకు క్లాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న శోభన్‌బాబు దొంగ అనే పేరుతో ఉన్న సినిమాలో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. డెఫినెట్‌గా సినిమా ఫ్లాప్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. 7 కేంద్రాల్లో 100 రోజులు, 30 కేంద్రాల్లో 50 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా విడుదలైన 3 నెలలకు శోభన్‌బాబు, మంజుల జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో గుణవంతుడు సినిమా రిలీజ్‌ అయింది. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన సోగ్గాడు విడుదలైంది. అంతకుముందు ఇదే బేనర్‌లో ద్రోహి అనే ఫ్లాప్‌ సినిమా తీసిన బాపయ్యకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు రామానాయుడు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు బాపయ్య. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్‌, వాణిశ్రీ జంటగా ఎదురులేని మనిషి ప్రారంభమైంది. ఈ సినిమాకి కూడా బాపయ్యే దర్శకుడు. ఈ రెండు సినిమాలూ వారం గ్యాప్‌తో రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించాయి. అలా 1975లో శోభన్‌బాబు 5 బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చి రికార్డు క్రియేట్‌ చేశారు.

తెలుగు సినిమా ‘లెక్కలు’ మార్చిన సుకుమార్‌!

(జనవరి 11 దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా..) 1970 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టమర్రు గ్రామంలో తిరుపతిరావు నాయుడు, వీరవేణి దంపతులకు జన్మించారు బండ్రెడ్డి సుకుమార్‌. సాహిత్యం మీద అభిరుచితో చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. తమ ఊరిలోని గ్రంథాలయంలోని పుస్తకాలు చాలా వరకు చదివేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే కవితలు రాసేవారు. సినిమా రంగంలో ప్రవేశించి రైటర్‌గానో, డైరెక్టర్‌గానో పేరు తెచ్చుకోవాలనే కోరిక చిన్నతనంలో ఉంది. కాలేజీలో డిగ్రీ చదివే సమయానికి అది మరింత బలపడింది. అలా డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో జాయిన్‌ అయ్యారు. కాలేజీలో మ్యాథ్స్‌ చెప్పే లెక్చరర్స్‌ లేకపోవడంతో పది మైళ్ళ దూరం వెళ్లి మరో లెక్చరర్‌ దగ్గర మ్యాథ్స్‌లోని మెళకువలు నేర్చుకున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి అందులో మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత చదువుకుంటూనే తన జూనియర్స్‌కి ట్యూషన్‌ చెప్పేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత 1998లో కాకినాడలోని ఆదిత్య జూనియర్‌ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా ఉద్యోగం లభించింది. నెలకు రూ.75 వేల జీతం. ఆరోజుల్లో అది చాలా ఎక్కువ జీతం అని చెప్పాలి.  ఉద్యోగం చేస్తున్నప్పటికీ మనసు మాత్రం సినిమా రంగంపైనే ఉండేది. రెండు సంవత్సరాలు లెక్చరర్‌ ఉద్యోగంలో కొనసాగిన సుకుమార్‌ 2000 సంవత్సరంలో తండ్రి అనుమతితో సినీ రంగంలో ప్రవేశించారు. మొదట ఎడిటర్‌ మోహన్‌ తనయుడు రాజా డైరెక్ట్‌ చేస్తున్న హనుమాన్‌ జంక్షన్‌ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వి.వి.వినాయక్‌ డైరెక్ట్‌ చేసిన దిల్‌ చిత్రానికి వర్క్‌ చేశారు. ఆ సమయంలో సుకుమార్‌లోని టాలెంట్‌ని నిర్మాత దిల్‌రాజు గుర్తించారు. అతనికి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలనుకొని ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. ఆ టైమ్‌లోనే ఆర్య కథ చెప్పారు సుకుమార్‌. అది దిల్‌రాజుకి బాగా నచ్చింది. హీరో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నావు అని అడిగితే.. నితిన్‌కి కథ సరిపోతుందని చెప్పారు సుకుమార్‌. ఆ కథని నితిన్‌కి చెప్పారు. కానీ, అతనికి నచ్చలేదు. ఆ తర్వాత ఈ కథతో రవితేజ, ప్రభాస్‌ దగ్గరకు కూడా వెళ్లారు. వారు కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు.  2003లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రితో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్‌ అయితే ఆర్య కథకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడని అతనికి కథ చెప్పారు. అల్లు అర్జున్‌కి కథ నచ్చింది. దాంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టారు. అదే సమయంలో ఏప్రిల్‌ 4న దిల్‌ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ వెంటనే అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఆర్య చిత్రాన్ని ప్రారంభించారు దిల్‌రాజు. 2004 మే 7న ఈ సినిమా రిలీజ్‌ అయింది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. 86 సెంటర్స్‌లో 50 రోజులు, 56 సెంటర్స్‌లో 100 రోజులు, 8 సెంటర్స్‌లో 420 రోజులు ప్రదర్శించబడింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని మలయాళంలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఈ కథను తమిళ్‌, బెంగాలీ, ఒరియా, శ్రీలంకలోని సింహళ, ఉర్దూ భాషల్లో రీమేక్‌ చేశారు. తొలి సినిమాతోనే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డుతోపాటు పలు అవార్డులు సాధించారు సుకుమార్‌.  ఆర్య తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లోనే మరో సినిమా చెయ్యాలనుకున్నారు దిల్‌రాజు. అయితే సుకుమార్‌ చెప్పిన కథలో కొన్ని కరెక్షన్స్‌ చెప్పారు దిల్‌రాజు. కానీ, కథను మార్చేందుకు సుకుమార్‌ ఇష్టపడలేదు. దీంతో తను సినిమా చెయ్యలేనని దిల్‌రాజు చెప్పారు. ఈ విషయంలో హర్ట్‌ అయిన సుకుమార్‌ రాత్రికి రాత్రే రామ్‌ పోతినేనిని హీరోగా ఓకే చేశారు. ఆదిత్యబాబు నిర్మాత. మరుసటి రోజే సినిమా ప్రారంభించారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఆ తర్వాత అదే బేనర్‌లో ఆర్య2 చిత్రం చేశారు. అది కూడా సక్సెస్‌ అవ్వలేదు. అయితే ఈ సినిమాను మలయాళంలో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా అక్కడ బాగానే ఆడింది. ఆర్య2 సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యారు సుకుమార్‌. వరుణ్‌ సందేశ్‌, తమన్నా జంటగా సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, ఆర్య2 కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవడంతో వరుణ్‌ సందేశ్‌ బదులుగా.. ఏమాయ చేసావె చిత్రంతో ఫామ్‌లో ఉన్న నాగచైతన్యను తీసుకున్నారు. ఈ సినిమాకి మొదట బాలు వెడ్స్‌ మహాలక్ష్మి అనే టైటిల్‌ అనుకున్నారు. అది రొటీన్‌గా అనిపించడంతో ఆ తర్వాత ఓ అరడజను టైటిల్స్‌ని పరిశీలించి ఫైనల్‌గా 100 పర్సెంట్‌ అవ్‌ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. 2011లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి కూడా బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు సుకుమార్‌.  ఆ తర్వాత మహేష్‌బాబుకి సైకలాజికల్‌ థ్రిలర్‌ కథ 1 నేనొక్కడినే చెప్పారు సుకుమార్‌. అది మహేష్‌కి బాగా నచ్చింది. సుకుమార్‌ చెప్పినట్టుగా ఈ సినిమా కోసం మహేష్‌ ఫిజికల్‌గా మేకోవర్‌ అయ్యారు. 2014 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మార్నింగ్‌ షో చూసిన సుకుమార్‌ నాన్నగారు తన అభిప్రాయాన్ని చెబుతూ.. ‘సినిమా బాగా తీశావు. కానీ, ప్రేక్షకులకు అర్థం కాదు. నువ్వు ముందే దానికి ప్రిపేర్‌ అయి ఉండు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సినిమా ఎవరికీ అర్థం కాలేదు. ఫలితంగా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందించిన 1 నేనొక్కడినే హాలీవుడ్‌ సినిమాలా ఉందనే అప్రిషియేషన్‌ వచ్చింది. అయితే ఐదారు దేశాలలో ఈ సినిమాను విడుదల చేస్తే అక్కడ మాత్రం విజయం సాధించింది.  ఆ తర్వాత సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌ను స్థాపించి తన దగ్గర పనిచేసిన సూర్యప్రతాప్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు. రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా కుమారి 21ఎఫ్‌ చిత్రాన్ని నిర్మించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత ఇదే బేనర్‌లో మరికొన్ని సినిమాలు నిర్మించారు. తన దగ్గర పనిచేసిన వారికి డైరెక్టర్స్‌గా అవకాశాలు ఇచ్చారు. అలాగే నిర్మాణ పరంగా కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామిగా కూడా ఉన్నారు. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. 2016లో విడుదలైన ఈ సినిమాకి మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఆ మరుసటి సంవత్సరమే రామ్‌చరణ్‌ కోసం ఓ కథను రెడీ చేసి అతనికి వినిపించారు. అతనికి బాగా నచ్చింది. ఆ తర్వాత చిరంజీవి కూడా విని సుకుమార్‌ను అప్రిషియేట్‌ చేశారు. అదే రంగస్థలం. 2018లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచింది.  ఈ సినిమా తర్వాత దర్శకుడుగా సుకుమార్‌ ఓ కొత్త టర్న్‌ తీసుకున్నారు. అల్లు అర్జున్‌తో పుష్ప ది రైజ్‌ చిత్రాన్ని ప్రారంభించారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా 2021లో విడుదలై సంచలనం సృష్టించింది. అప్పటివరకు అల్లు అర్జున్‌కి ఉన్న ఇమేజ్‌ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలోని నటనకుగాను ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్‌. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. పుష్ప తర్వాత దానికి సీక్వెల్‌గా సుకుమార్‌ రూపొందించిన పుష్ప ది రూల్‌ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 2024 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా అన్ని భారతీయ చిత్రాల కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేస్తూ రూ.1850 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టించింది. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా పుష్ప ది రూల్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత మరోసారి రామ్‌చరణ్‌తో సినిమా చెయ్యబోతున్నారు సుకుమార్‌. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అలాగే పుష్ప సిరీస్‌లో భాగంగా పుష్ప ది ర్యాంపేజ్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. సుకుమార్‌ వివాహం 2009లో తబితతో జరిగింది. వీరికి కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్‌ ఉన్నారు. గాంధీతాత చెట్టు అనే చిత్రంలోని నటనకుగాను ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు సుకృతివేణి. అలాగే ఉత్తమ తొలి సినిమా బాలనటిగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌, ఇండియన్‌ ఇంటర్నేషనల్‌  ఫిలిం ఫెస్టివల్‌ పురస్కారాలు కూడా సుకృతి సొంతం చేసుకున్నారు.

భానుమతి, విజయనిర్మల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.జయ!

సినిమా రంగంలోని సాంకేతిక విభాగాలలో మహిళలు రాణించడం అనేది తక్కువగా చూస్తుంటాం. అందులోనూ దర్శకత్వ శాఖలో తమ ప్రతిభను చాటుకున్న వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారిలో మొదటగా భానుమతి, విజయనిర్మల వంటివారి పేర్లు వినిపిస్తాయి. వీరి తర్వాత దర్శకురాలిగా ప్రేక్షకుల్ని మెప్పించి, విజయవంతమైన సినిమాలు రూపొందించిన వారిలో బి.జయ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి, కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన తర్వాత సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని స్థాపించి పత్రికారంగంలో కూడా విశేష పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆ తర్వాత దర్శకురాలిగా తన ప్రయాణం మొదలుపెట్టి అద్భుతమైన విజయాలు అందుకున్నారు. జర్నలిస్ట్‌ నుంచి దర్శకురాలిగా ఎదిగిన బి.జయ జయంతి జనవరి 11. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాల గురించి, తన కెరీర్‌లో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.  1964 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ. చెన్నయ్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్‌ లిటరేచర్‌), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా పనిచేశారు. ఆరోజుల్లోనే సినిమా జర్నలిస్ట్‌లలో డైనమిక్‌ లేడీగా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పడం ఆమెకు మొదటి నుంచీ అలవాటు. పత్రికలలో ఆమె రాసే ఆర్టికల్స్‌ కూడా అలాగే ఉండేవి. దాంతో అందరి దృష్టినీ ఆకర్షించారు జయ. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.  అదే సమయంలో ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా, పి.ఆర్‌.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు. అప్పటివరకు తమకు ఉన్న అనుభవంతో 1994లో సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని సొంతంగా ప్రారంభించారు. తొలి సంచికతోనే సంచలనం సృష్టించి ఆరోజుల్లో ప్రముఖంగా వున్న సినీ వారపత్రికలకు పోటీగా సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని నిలబెట్టారు బి.ఎ.రాజు, బి.జయ దంపతులు. ఆరోజు మొదలుకొని చివరి రోజుల వరకు ఒక్క వారం కూడా పత్రిక ఆలస్యం అవకుండా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఘనత ఆ దంపతులకు దక్కుతుంది.  సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్‌ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్‌హిట్‌ ఫ్రెండ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బి.జయ. బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్‌ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

60 ఏళ్లుగా తన గాన మాధుర్యంతో అలరిస్తున్న సంగీత జ్ఞాని కె.జె.ఏసుదాస్‌!

(జనవరి 10 గాన గంధర్వుడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు సందర్భంగా..) భారతదేశంలో ఆణిముత్యాల్లాంటి ప్రతిభావంతులు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరచి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పారు. అలా సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాట వేసుకొని తనకు తనే సాటి అనిపించుకున్న మధుర గాయకుడు కె.జె.ఏసుదాస్‌. భారతదేశానికి లభించిన వెలకట్టలేని అరుదైన ఆణిముత్యం ఆయన. తన గానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయగల అద్భుతమైన నైపుణ్యం జేసుదాస్‌లో ఉంది. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని తన గాన మాధుర్యంతో ప్రపంచంలోని సంగీతాభిమానుల్ని అలరిస్తున్నారు కె.జె.ఏసుదాస్‌ అలియాస్‌ జేసుదాస్‌. 60 ఏళ్లుగా తన గాన మాధుర్యాన్ని పంచుతున్న ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.  1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో అగస్టిన్‌ జోసెఫ్‌, ఎలిజిబెత్‌ జోసెఫ్‌ దంపతులకు జన్మించారు జేసుదాస్‌. ఆయన పూర్తి పేరు కట్టసేరి జోసెఫ్‌ ఏసుదాస్‌. తండ్రి అగస్టిన్‌ రంగస్థల నటుడుగా, భాగవతార్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి ప్రభావం జేసుదాస్‌పై బాగా ఉండేది. అందుకే సంగీతంపై మక్కువ పెంచుకొని చిన్నతనం నుంచే పాటలు పాడుతుండేవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్‌ చేరుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, ఆయన గాత్రం సినిమా సంగీతానికి పనికి రాదని తిరస్కరించేవారు. అయితే వివిధ కార్యక్రమాల్లో వేదికపై పాటలు పాడుతుండేవారు. 17 ఏళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీత పోటీల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు జేసుదాస్‌. అతనిలోని సంగీతానికి మరిన్ని మెరుగులు అద్దేందుకు మ్యూజిక్‌ కాలేజీలో చేర్పించారు అగస్టిన్‌. అక్కడ కూడా తన ప్రతిభను చాటుకొని కళాశాలలో ప్రథమ స్థానం సంపాదించుకున్నారు. తనలోని సంగీతానికి మరింత పదును పెట్టుకునేందుకు కొందరు సంగీత విద్వాంసుల వద్ద మెళకువలు తెలుసుకున్నారు.  1961 నవంబర్‌ 14న జేసుదాస్‌ పాడిన మొదటి పాటను రికార్డ్‌ చేశారు. మలయాళ దర్శకుడు ఎల్‌.కె.ఆంటోని మొదటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు వరసగా అవకాశాలు వచ్చాయి. జేసుదాస్‌ గానంలోని మాధుర్యాన్ని అందరూ గుర్తించారు. శాస్త్రీయ సంగీతంలో ఆయన ప్రతిభకు మలయాళ చిత్ర రంగమే కాదు, భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలు ఆశ్చర్యపోయాయి. మాతృభాష మళయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలి, గుజరాతి, ఒడియా, మరాఠి, సంస్కృ తం, తుళు వంటి భారతీయ భాషల్లోనే కాదు మాలే, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఇంగ్లీష్‌ వంటి విదేశీ భాష ల్లోనూ పాటలు పాడిన ఘనత కేవలం జేసుదాస్‌కే దక్కుతుంది. 60 సంవత్సరాలుగా తన గానంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.  జేసుదాస్‌ క్రైస్తవ మతానికి చెందినవారైనా అయ్యప్ప స్వామితోపాటు ఆయన ఆలపించిన ఇతర భక్తి గీతాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారి పవళింపు సేవ సమయంలో జేసుదాస్‌ పాడిన ‘హరివరాసనం.. స్వామి విశ్వమోహనం..’ పాటను ప్రతి నిత్యం వినిపిస్తారంటే ఆయన గానంలో ఎంతటి భక్తిభావం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుడై ఉండి హిందూ భజనలు పాడుతున్నారని జేసుదాస్‌ను ఒక చర్చి వారు వెలివేశారు. అయితే సంగీతానికి భాష, మతం అడ్డు కాదని తర్వాతి రోజుల్లో గుర్తించిన ఆ చర్చి వారు మళ్ళీ ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు.  ఉత్తమ గాయకుడిగా ఇప్పటివరకు 8 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే అవార్డులు 40 సార్లు అందుకున్నారు జేసుదాస్‌. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. అలాగే కేంద్రపభుత్వం వివిధ సందర్భాల్లో పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు చేసిన సత్కారాలకు, అందించిన బిరుదులకు లెక్కే లేదు.  తమ దేశంలోని కొన్ని నగరాలలో కచేరీలు చేయాల్సిందిగా సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం ఆరోజుల్లో జేసుదాస్‌కి ఆహ్వానం పంపింది. అలాంటి ఘనత సాధించిన ఏకైక సంగీత కళాకారుడు జేసుదాస్‌. భారత దేశంలోని భాషలతోపాటు విదేశీ భాషల్లో దాదాపు 80,000 పాటలు పాడారు. ఇవి కాకుండా పలు భాషల్లోని భక్తి పాటలను కలిపితే ఆయన లక్షకుపైగా పాటలు పాడారు. ఇది ఒక ప్రపంచ రికార్డు అనే చెప్పాలి. 2006లో చెన్నయ్‌లోని ఎవిఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు భాషల్లో 16 పాటలు పాడి రికార్డు సృష్టించారు జేసుదాస్‌. 1970 ఫిబ్రవరి 1న ప్రభను వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం.. వినోద్‌, విజయ్‌, విశాల్‌. వీరిలో విజయ్‌.. విజయ్‌ ఏసుదాస్‌గా అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. తండ్రిని పోలిన స్వరంతో వివిధ భాషల్లో పాటు పాడుతూ అలరిస్తున్నారు విజయ్‌.

మెగా ప్రొడ్యూసర్‌గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు అరవింద్‌!

(జనవరి 10 నిర్మాత అల్లు అరవింద్‌ పుట్టినరోజు సందర్భంగా..) హాస్య నటచక్రవర్తి అల్లు రామలింగయ్య తన కామెడీతో ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్‌ చేసేవారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుమారుడిగా నట వారసత్వాన్ని తీసుకోకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో ప్రవేశించి అద్భుతమైన విజయాలు అందుకున్న నిర్మాత అల్లు అరవింద్‌. మెగాస్టార్‌ చిరంజీవి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. 50 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న అల్లు అరవింద్‌ వ్యక్తిగత జీవితం, సినీరంగ ప్రవేశం, ఆయన సాధించిన విజయాలు.. వంటి విషయాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.  1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు అల్లు అరవింద్‌. ఆయనకు ఒక అక్క, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అరవింద్‌ పుట్టిన రెండేళ్ళ తర్వాతే అల్లు రామలింగయ్య ‘పుట్టిల్లు’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రిలాగే తను కూడా నటుడు అవ్వాలనుకున్నారు. కానీ, ఓ సంఘటన తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. ఓరోజు షూటింగ్‌లో అల్లు రామలింగయ్య ఎక్కువ టేకులు తీసుకోవడంతో డైరెక్టర్‌ ఆయన్ని తిట్టారట. ఆ విషయాన్ని తన భార్యతో చెప్పి అల్లు రామలింగయ్య బాధపడడం అరవింద్‌ చూశారు. ఆ క్షణమే నటుడు అవ్వకూడదని డిసైడ్‌ అయ్యారు. ఒకరి దగ్గర మనం పని చెయ్యకూడదని, మనమే పది మందికి పని ఇచ్చే స్థితిలో ఉండాలని అనుకున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత అరవింద్‌కి తెలియకుండా ఓ బ్యాంక్‌లో ఉద్యోగం ఏర్పాటు చేశారు అల్లు రామలింగయ్య. ఆ విషయం తెలుసుకున్న అరవింద్‌.. తను ఉద్యోగం చెయ్యనని వ్యాపారం చేస్తానని చెప్పారు. కొడుకు మాట కాదనలేక సరేనన్నారు.  ఎక్కడికో వెళ్లి వ్యాపారం చెయ్యడం ఎందుకు.. సినిమా రంగంలోనే నిర్మాతగా కొనసాగితే బాగుంటుంది కదా అనిపించింది అరవింద్‌కి. ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంట్రోతు భార్య చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత దాసరి సత్యనారాయణమూర్తి. ఆ సినిమాకి పార్టనర్‌గా అల్లు అరవింద్‌ జాయిన్‌ అయ్యారు. 1974లో బంట్రోతు భార్య విడుదలై సక్సెస్‌ అయింది. ఆ సంవత్సరమే ఏప్రిల్‌ 7న నిర్మలను వివాహం చేసుకున్నారు అరవింద్‌. 1975లో వారికి మొదటి సంతానంగా వెంకటేష్‌ జన్మించాడు. ఆ తర్వాత మరో కుమారుడు రాజేష్‌ జన్మించాడు. బంట్రోతు భార్య చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన అరవింద్‌ ఆ తర్వాత సోలో నిర్మాతగా దేవుడే దిగివస్తే, మావూళ్ళో మహాశివుడు చిత్రాలు నిర్మించారు.  ఇదిలా ఉండగా.. ఒకరోజు అల్లు రామలింగయ్యను కలిసేందుకు వారి బంధువు సత్యనారాయణ వచ్చారు. ఆయన కోసం చిరంజీవి వచ్చారు. అప్పుడు కనకరత్నమ్మ.. చిరంజీవితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత సత్యనారాయణను పిలిపించి చిరంజీవి గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న కూతురు సురేఖను అతనికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇదే విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. పెద్ద కూతుర్ని డాక్టర్‌కి ఇచ్చి చేశాం. చిన్నమ్మాయిని కూడా బయటి వారికే ఇద్దామన్నారు. కానీ, కనకరత్నమ్మ మాత్రం పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావనకు తీసుకు రావడంతో చిరంజీవికి సురేఖను ఇచ్చి చెయ్యాలనుకున్నారు. అయితే నెలరోజులు చిరంజీవిని పరిశీలించిన తర్వాత 1980 ఫిబ్రవరి 20న ఇద్దరికీ వివాహం జరిపించారు. 1982 ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ జన్మించారు. ఆయన పుట్టిన కొన్నాళ్లకు అరవింద్‌ రెండో కుమారుడు రాజేష్‌ ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. ఈ విషాద ఘటన నుంచి అల్లు అరవింద్‌ కుటుంబం చాలా కాలం కోలుకోలేదు. ఆ తర్వాత 1987 మే 30న అల్లు శిరీష్‌ జన్మించాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరోగా ఏ రేంజ్‌లో ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే శిరీష్‌ మాత్రం హీరోగా రాణించలేకపోయాడు. అయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  1972లో గీతా ఆర్ట్స్‌ సంస్థను ప్రారంభించిన అల్లు అరవింద్‌ మూడో సినిమాగా చిరంజీవితో నిర్మించిన శుభలేఖ చిత్రానికి మాత్రం సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో చాలా కాలం చిరంజీవితోనే సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు రావడంతో వారితో కూడా సినిమాలు నిర్మించి మెగా ప్రొడ్యూసర్‌ అని పేరు తెచ్చుకున్నారు. రౌడీ అల్లుడు, ఎస్‌.పి.పరశురామ్‌, పరదేశి, పెళ్లిసందడి, పెళ్లాం ఊరెళితే, అన్నయ్య, బన్ని, భలే భలే మగాడివోయ్‌ వంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు అరవింద్‌. గీతా ఆర్ట్స్‌2 అనే బేనర్‌ను స్థాపించి గీతగోవిందం, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, పక్కా కమర్షియల్‌, చావు కబురు చల్లగా, 18 పేజెస్‌ సినిమాలు నిర్మించారు. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 55 సినిమాలు నిర్మించారు. తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో నిర్మించిన సినిమాలన్నీ తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే కావడం విశేషం. 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్‌ బడ్జెట్‌ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తయ్యేలా చూస్తారు. రామ్‌చరణ్‌తో నిర్మించిన మగధీర చిత్రానికి మాత్రం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్‌ అయింది. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం వచ్చింది.  సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టి బిజినెస్‌ చేస్తారు అరవింద్‌. అయితే ఆయన ఏ బిజినెస్‌ చేసినా సక్సెస్‌ అవుతారు. ఎందుకంటే ఆయనకు ఉన్న వ్యాపార దక్షత అలాంటిది. చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్‌రాజు వంటి వారితో కలిసి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత దాన్ని స్టార్‌ నెట్‌వర్క్‌కి రూ.2400 కోట్లకు అమ్మేశారు. ఇటీవలికాలంలో ఓటీటీలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహా అనే పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇది కూడా చాలా పెద్ద సక్సెస్‌ అయింది. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.  అల్లు అరవింద్‌లో మంచి నటుడు కూడా ఉన్నారు. తండ్రిలాగే ఆయన కూడా కామెడీ క్యారెక్టర్లు బాగా చెయ్యగలరు. నటనపై ఆయనకు ఆసక్తి లేనప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు పోషించారు. మావూళ్ళో మహాశివుడు, హీరో, మహానగరంలో మాయగాడు, చంటబ్బాయ్‌ వంటి సినిమాల్లో అరవింద్‌ చేసిన క్యారెక్టర్లకు మంచి స్పందన లభించింది. అయితే నటుడుగా కంటే నిర్మాతగానే కొనసాగాలన్న ఉద్దేశంతో నటన వైపు వెళ్లలేదు. ఇక ఆయన అందుకున్న అవార్డుల గురించి చెప్పాల్సి వస్తే.. పెళ్లిసందడి, మగధీర సినిమాలకు నంది అవార్డులు, మగధీరకు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి. అలాగే ఫిలింఫేర్‌ నుంచి లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును కూడా అందుకున్నారు అల్లు అరవింద్‌.

వైవిధ్యమైన కథలకు, స్క్రీన్‌ప్లేకు పెట్టింది పేరు కె.భాగ్యరాజ్‌!

(జనవరి 7 దర్శకుడు కె.భాగ్యరాజ్ పుట్టినరోజు సందర్భంగా..) ఏ సినిమాకైనా ప్రధానంగా కావాల్సింది చక్కని కథ, కథనం. గతంలో దర్శకనిర్మాతలు కేవలం కథను నమ్ముకొని సినిమాలు చేసేవారు. అయితే రాను రాను కథ, కథనాల మీద దర్శకులకు శ్రద్ధ తగ్గింది. సినిమా ఎంత హంగూ ఆర్భాటంగా ఉంటే అంత గొప్ప సినిమా అనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే అవేవీ సినిమాను బ్రతికించలేవని ఎప్పటికప్పుడు కొన్ని సినిమాల ఫలితాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఎవరేమన్నా సినిమాకి మూలస్తంభం కథే. అలాంటి కథలతో ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్‌. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం. తన సినిమాలతో ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న భాగ్యరాజ్‌ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్‌ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్‌. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్‌ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్‌ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్‌ అయ్యాయి.  1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్‌ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్‌ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్‌, కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్‌ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు. 1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్‌ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్‌ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్‌ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్‌ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్‌.

ఎవరికీ సాధ్యంకాని కీర్తి శిఖరాలను అధిరోహించిన లెజండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

(జనవరి 6 సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా..) భారతీయ సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. అంతేకాదు, భారతదేశానికి తొలి ఆస్కార్‌ అవార్డును అందించి దేశ ప్రతిష్టను మరింత పెంచిన మ్యూజిక్‌ డైరెక్టర్‌. ట్రెడిషనల్‌ క్లాసిక్స్‌ నుంచి పాప్‌ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్‌ చేసి మ్యాజిక్‌ చేసిన లివింగ్‌ లెజెండ్‌. ఇండియన్‌ మ్యూజిక్‌ ప్రపంచంలో సంచలనాలకు సెంటర్‌ పాయింట్‌. అతను కంపోజ్‌ చేసిన ప్రతి పాటా ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్‌ బీట్స్‌ కూడా కంపోజ్‌ చేసి చిందులేయించగలరు. ఇండియాలో మ్యూజిక్‌ అంటే రెహమాన్‌ అనేంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కీబోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ‘రోజా’ చిత్రంతో సంగీత దర్శకుడుగా ప్రపంచానికి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డును అందుకున్నారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రెహమాన్‌ ఈ స్థాయికి రావడం వెనుక చేసిన కృషి, పడిన కష్టాలు ఏమిటి అనే విషయాలు అతని బయోగ్రఫీలో తెలుసుకుందాం.  1967 జనవరి 6న ఆర్‌.కె.శేఖర్‌, కస్తూరి దంపతులకు జన్మించారు ఎ.ఆర్‌.రెహమాన్‌. అతనికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. రెహమాన్‌ అసలు పేరు ఎ.ఎస్‌.దిలీప్‌కుమార్‌. తండ్రి ఆర్‌.కె.శేఖర్‌ కూడా సంగీత దర్శకుడే. ఆయన 52 సినిమాలకు సంగీతాన్ని అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతూనే సంగీత వాయిద్యాలను అద్దెకు ఇచ్చేవారు. రెహమాన్‌ ఐదేళ్ళ వయసులోనే తండ్రి దగ్గర హార్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అతను తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. తల్లి కస్తూరి వాయిద్యాలను అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని పోషించేవారు. రెహమాన్‌ స్కూల్‌కి వెళుతూనే సంగీతం కూడా నేర్చుకునేవారు. ఈ రెండూ చేయడం కష్టంగా మారడంతో.. సంగీతాన్నే కొనసాగించమని తల్లి సలహా ఇచ్చారు. సంగీత విద్వాంసుడు దక్షిణామూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు రెహమాన్‌. పదేళ్ళ వయసులో ఆర్‌.కె.శేఖర్‌ మిత్రుడు ఎం.కె.అర్జునన్‌ ఒక మలయాళ సినిమాలో రెహమాన్‌కు కీబోర్డ్‌ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చారు. అలా కీ బోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. రమేష్‌నాయుడు, రాజ్‌, కోటి, ఇళయరాజాల వద్ద చాలా సినిమాలకు కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశారు. కీ బోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేస్తూనే చిన్నప్పటి ఫ్రెండ్స్‌ శివమణి, జాన్‌ ఆంథోని, సురేశ్‌ పీటర్స్‌, జొజొ, రాజాలతో కలిసి రూట్స్‌ అనే రాక్‌ బ్యాండ్స్‌ గ్రూప్‌ని ఫామ్‌ చేసారు రెహమాన్‌. నెమెసిస్‌ అవెన్యూ అనే చెన్నయ్‌ బేస్డ్‌ రాక్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసారు. ఈ బ్యాండ్స్‌ ద్వారా ఎన్నో స్టేజ్‌ షోలు చేశారు. ఆ తర్వాత యాడ్స్‌కి జింగిల్స్‌ చేయడం ప్రారంభించారు రెహమాన్‌. దాదాపు 300 బ్రాండ్లకు జింగిల్స్‌ చేశారు. అతని గురించి తెలుసుకున్న మణిరత్నం తమిళ్‌లో రూపొందిస్తున్న ‘తిరుడా తిరుడా’ చిత్రం కోసం ట్యూన్స్‌ చేయించారు. అయితే ఆ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా టైమ్‌ ఉండడంతో కె.బాలచందర్‌ ఓ సినిమా చేయమని మణిరత్నంని కోరారు. అలా ‘రోజా’ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా ద్వారా రెహమాన్‌ను సంగీత దర్శకుడుగా పరిచయం చేశారు. తొలి సినిమాతోనే తనేమిటో నిరూపించుకొని సినీ సంగీత ప్రియులకు కొత్త తరహా పాటలను పరిచయం చేశారు రెహమాన్‌. ఎవరూ వినని ప్రత్యేక శైలిలో పాటలు కంపోజ్‌ చేయడం రెహమాన్‌ ప్రత్యేకత. శ్రోతలను సున్నితంగా తాకే మధురమైన బాణీలతో చాలా తక్కువ సమయంలోనే టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు. మూడు దశాబ్దాలుగా తన సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.  రెహమాన్‌ మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు. కీబోర్డ్‌, పియానో, సింథసైజర్‌, హార్మోనియమ్‌, గిటార్‌.. వంటి మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్లు ప్లే చేయడంలో రెహమాన్‌ మాస్టర్‌ అని చెప్పాలి. సింథసైజర్‌ అంటే అతనికి క్యూరియాసిటీ ఎక్కువ. ఎందుకంటే.. అది మ్యూజిక్‌, టెక్నాలజీల కాంబినేషన్‌ అని రెహమాన్‌ చెబుతారు. మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడమే కాదు మంచి సింగర్‌ కూడా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో సినిమాలకు పాటలు రాసి.. అద్భుతంగా పాడారు. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా కంపోజ్‌ చేసారు.  రెహమాన్‌. కర్ణాటక సంగీతాన్ని, ఖవ్వాలీ స్టయిల్‌ను, రెగే, హిప్‌-హాప్‌, ర్యాప్‌, రాక్‌, పాప్‌, జాజ్‌, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్‌, అరేబియన్‌, వెస్టర్న్‌ మ్యూజిక్‌లను పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఇండియన్‌ స్టైల్‌లో బాణీలు కట్టడడంలో రెహమాన్‌ సిద్ధహస్తుడు.  వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఒక కల. ఆ లోటును రెహమాన్‌ తీర్చారు. రెహమాన్‌ మ్యూజిక్‌ అందించిన ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రంలోని ‘జయహో’ పాటకు ఆస్కార్‌ అవార్డులతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. టైమ్‌ మ్యాగజైన్‌ రెహమాన్‌కు మొజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌ బిరుదు ఇచ్చింది. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత రెహమాన్‌కే దక్కుతుంది. ఆస్కార్‌ అవార్డులు అందుకున్న తర్వాత.. ఆ విజయం వంద కోట్ల భారతీయులదని చెప్పి దేశాభిమానాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తిత్వం అతని సొంతం. రెహమాన్‌ మంచి ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు.. తనలో దేశభక్తి కూడా ఎక్కువగానే ఉందని వందేమాతరం గీతం ద్వారా నిరూపించుకున్నారు రెహమాన్‌. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం ఆల్బమ్‌ను రిలీజ్‌ చేశారు రెహమాన్‌. ఈ ఆల్బమ్‌లోని వందేమాతరం పాటకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. ఆల్‌టైమ్‌ లాంగెస్ట్‌ సెల్లింగ్‌ ఆల్బమ్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది.  ఇండియన్‌ సినిమాలకే కాకుండా దాదాపు 10 హాలీవుడ్‌ మూవీస్‌కి సంగీతాన్ని అందించారు రెహమాన్‌. ఇక తన ఆర్కెస్ట్రాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కచ్చేరీలు చేశారు. లెక్కకు మించిన మ్యూజిక్‌ వీడియోలు చేశారు. సంగీత దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన టాలెంట్‌ను చూపించారు. ‘లే మస్క్‌’ పేరుతో ఓ వర్చువల్‌ రియాలిటీ థ్రిల్లర్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో ఏడు సార్లు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, హిందీ, తమిళ చిత్రాలకు ఎన్నో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’, ‘పద్మభాషణ్‌’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వివిధ సంస్థల నుంచి అందుకున అవార్డులకు లెక్కే లేదు.  ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1995లో సైరాబానుని వివాహం చేసుకున్నారు రెహమాన్‌. వీరికి ముగ్గురు సంతానం. వారిలో ఖతీజా, అమీన్‌ కూడా సింగర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రెహమాన్‌ అక్క కుమారుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ కూడా ఇప్పుడు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 2024 సెప్టెంబర్‌లో తమ 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు రెహమాన్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

జనవరి 7 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 65వ జయంతి

తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా, పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన బిఏ రాజు గారి (జనవరి 7న) 65వ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే  పిఆర్ఓగా సినీ కేరీర్ ని ఆరంభించిన  బిఏరాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన, వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసి అనంతరం తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా  27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు అంటే ఆయన అఖుంటిత దీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు రాజు గారు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బిఏ రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకుని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఆ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే చిత్రంతో ఆర్జే సినిమాస్ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju's Team ద్వారా అందిస్తున్నారు. ఆర్ జే సినిమాస్ ద్వారా ఆయన తనయుడు శివకుమార్ బి కూడా నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత  సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ... ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులతో రాజు గారికి మంచి అనుబంధం ఉండేది. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ దర్శకుడు ఏ  హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా హ్యూమన్ టాలీవుడ్ ఎన్సైక్లోపీడియాలా టక్కున చెప్పేవారు. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు రాజు గారు. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు దూరమై ఏళ్లు గడుస్తున్నా ఆయన అందిస్తున్న సేవలు అజరామరం. ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 65వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం.

100 సినిమాలు డైరెక్ట్‌ చేస్తానని ఛాలెంజ్‌ చేసి అన్నంత పనీ చేసిన దర్శకుడు!

(జనవరి 5 దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జయంతి సందర్భంగా..) కె.ఎస్‌.ఆర్‌.దాస్‌.. తెలుగు సినిమాను పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాల నుంచి క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ వైపు పరుగులు తీయించిన దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో ఈ పంథాలో సినిమాలు తీసి మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో యాక్షన్‌ సినిమా చెయ్యాలంటే కె.ఎస్‌.ఆర్‌.దాసే చెయ్యాలి. అంతలా ప్రేక్షకుల్నే కాదు, ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని కూడా మెస్మరైజ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక చిత్రంలోని పోరాట సన్నివేశాలను చిత్రీకరించే బాధ్యత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌కి అప్పగించారంటే యాక్షన్‌ సీక్వెన్స్‌లపై ఆయనకు ఉన్న పట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే తొలి కౌబాయ్‌ మూవీ మోసగాళ్ళకు మోసగాడుని తెరకెక్కించిన ఘనత ఆయనది. తెలుగు సినిమాకి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన దాస్‌ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, తన కెరీర్‌లో ఆయన ఎలాంటి విజయాలు సాధించారు అనే విషయాలు తెలుసుకుందాం. 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చెంచురామయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌. ఆయన పూర్తి పేరు కొండా సుబ్బరామదాస్‌. హైస్కూల్‌ చదువు పూర్తయిన తర్వాత గుంటూరులోని కృష్ణ మహల్‌ థియేటర్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. థియేటర్‌లో పనిచేస్తున్న రోజుల్లో ప్రతిరోజూ సినిమాలు చూస్తూ వాటి గురించి విశ్లేషించేవారు. ఒకసారి గేటు పక్కన నిలబడి సినిమా చూస్తూ అందులోని సన్నివేశాల గురించి విమర్శిస్తూ మాట్లాడారు. తనైతే ఇలాంటి సినిమాలు వంద తియ్యగలను అన్నారు. అతని మాటలు పక్కనే ఉన్న ప్రముఖ నిర్మాత ఎస్‌.భావనారాయణ విన్నారు. సినిమాలపై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి అతన్ని మద్రాస్‌ రమ్మన్నారు. అక్కడ ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేర్పించారు. అలా 20 సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆయన పనిచేసిన తొలి సినిమా ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన బండరాముడు. దాదాపు 10 సంవత్సరాల పాటు భావనారాయణ సంస్థలోనే పనిచేసిన దాస్‌ అదే సంస్థ నిర్మించిన లోగుట్టు పెరుమాళ్ళ కెరుక చిత్రంతో దర్శకుడయ్యారు. మూడో చిత్రం కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ తెరకెక్కించిన రౌడీరాణి. ఈ సినిమాలో విజయలలిత హీరోయిన్‌. దక్షిణాదిన ఇదే తొలి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ కావడం విశేషం. ఇది చాలా పెద్ద హిట్‌ కావడంతో దాస్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా క్రైమ్‌, జేమ్స్‌బాండ్‌, యాక్షన్‌, జానపద, సాంఘిక చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. వాటిలో ఎక్కువ శాతం విజయం సాధించాయి. ముఖ్యంగా క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీస్‌ ఒరవడి పెంచిన ఘనత ఖచ్చితంగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌దే. తను చేసే సినిమాల టైటిల్స్‌ దగ్గర నుంచి హీరో గెటప్స్‌ వరకు అన్నీ ప్రత్యేకంగానే ఉండేవి. సూపర్‌స్టార్‌ కృష్ణ కాంబినేషన్‌లో దాస్‌ చేసిన మొదటి సినిమా టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో వీరి కాంబినేషన్‌కి తిరుగు లేకుండాపోయింది. ఇద్దరూ కలిసి 30 సినిమాలు చేశారంటే.. ఈ కాంబినేషన్‌కి ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జేమ్స్‌బాండ్‌ 777, మోసగాళ్ళకు మోసగాడు, హంతకులు దేవాంతకులు, దొంగలవేట, ఏజెంట్‌ గోపి, దొంగలకు సవాల్‌, అన్నదమ్ముల సవాల్‌, భలేదొంగలు, ఈనాటి బంధం ఏనాటిదో వంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. కుటుంబ కథా చిత్రాల్లో, సెంటిమెంట్‌ సినిమాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు దాస్‌.  మెగాస్టార్‌ చిరంజీవితో రోషగాడు, బిల్లా రంగా, పులి బెబ్బులి వంటి సినిమాలు రూపొందించారు. శోభన్‌బాబుతో లోగుట్టు పెరుమాళ్ళ కెరుక, గిరిజా కళ్యాణం, చేసిన బాసలు వంటి సినిమాలు చేశారు. ఇంకా కాంతారావు, రామకృష్ణ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసిన దాస్‌.. ఎఎన్నార్‌తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. 80 సినిమాలకు పైగా డైరెక్ట్‌ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో యుగంధర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో 20 సినిమాలు చేసిన దాస్‌.. అందులో 14 సినిమాలు హీరో విష్ణువర్థన్‌తోనే చేయడం విశేషం. ఇక నిర్మాతగా 18 సినిమాలు నిర్మించారు. ఇండియాలోనే తొలి కౌబాయ్‌ సినిమా మోసగాళ్ళకు మోసగాడుని డైరెక్ట్‌ చేసిన ఘనత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌కి దక్కుతుంది. ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌ హిట్స్‌ సాధించినా అవి యాక్షన్‌ అండ్‌ క్రైమ్‌ చిత్రాలు కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాలేదు. అయితే కన్నడ ప్రభుత్వం పుట్టన్న కణగల్‌ అవార్డుతో కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ను సత్కరించింది. థియేటర్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా పనిచేసిన దాస్‌.. ఆ సమయంలో ఛాలెంజ్‌ చేసినట్టుగానే ఇండస్ట్రీకి వచ్చి 100కి పైగా సినిమాలను రూపొందించారు. ఆయన చివరి చిత్రం 2000లో వచ్చిన నాగులమ్మ. ఆ తర్వాత వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరికి 2012 జూన్‌ 8న చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌.

కొత్త తరహా విలనీకి అర్థం చెప్పిన విలక్షణ ప్రతి నాయకుడు రాజనాల!

(జనవరి 3 నటుడు రాజనాల జయంతి సందర్భంగా..) పాతతరం నటుల్లో విలన్‌ అనగానే మనకు గుర్తొచ్చే పేరు రాజనాల. విలనీకి నిలువెత్తు నిదర్శనం ఆయన. పౌరాణికాలైనా, జానపదాలైనా, సాంఘికమైనా దుష్టపాత్రలకు రాజనాల పెట్టింది పేరు. విలన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని పాతిక సంవత్సరాలపాటు తిరుగులేని బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. 1953లో ప్రతిజ్ఞ సినిమాతో తన కెరీర్‌ ప్రారంభించిన రాజనాల 1995లో విడుదలైన తెలుగు వీర లేవరా చిత్రంతో ముగిసింది. 45 సంవత్సరాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో 1350 సినిమాల్లో నటించారు. వాటిలో ఎక్కువ శాతం విలన్‌ పాత్రలే ఉంటాయి. హాలీవుడ్‌కి చెందిన ఎంజిఎం సంస్థ మాయా ది మ్యాగ్నిఫిషెంట్‌ అనే ఇంగ్లీష్‌ చిత్రాన్ని ఇండియాలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు రాజనాల గురించి తెలుసుకున్న దర్శకనిర్మాతలు అందులో ఒక ముఖ్యమైన ఇండియన్‌ ఆఫీసర్‌ పాత్రను ఇచ్చారు. అలా హాలీవుడ్‌ సినిమాలో నటించిన తొలి తెలుగు నటుడిగా రాజనాల పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎనలేని కీర్తి సంపాదించిన రాజనాల సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన వ్యక్తిగత, సినీ జీవిత విశేషాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1925 జనవరి 3న రాజనాల వెంకటనారాయణయ్య, సుబ్బమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. ఆయన ఇంటర్‌ వరకు చదువుకున్నారు. అయితే ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా. దానికోసం ఇంకా చదవడం ఎందుకు, ఇప్పుడే ఉద్యోగం చేస్తే సరిపోతుంది అనుకున్న రాజనాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసి అందులో పాస్‌ అయి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గుమస్తాగా చేరారు. ఆ తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అయ్యారు. అవినీతికి పాల్పడకుండా, లంచాలు తీసుకోకుండా నీతిగా తన విధులు నిర్వహించేవారు రాజనాల. ఆ సమయంలోనే లక్ష్మీకుమార్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో కలిసి ఓ నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేస్తుండేవారు. ఆ క్రమంలోనే ఎవరు దొంగ, ప్రగతి అనే నాటకాలు వేశారు. ప్రభుత్వ శాఖలో ఉండే అవినీతిని ప్రశ్నించేవిగా ఆ నాటకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని ప్రశ్నించే పాత్రను పోషించాడని రాజనాలను మూడు నెలలు సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత లక్ష్మీకుమార్‌రెడ్డి మద్రాస్‌ వెళ్లి దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి దగ్గర చేరాడు. అదే సమయంలో అంతా కొత్తవారితో ప్రతిజ్ఞ చిత్రం చేస్తున్నారాయన. విలన్‌ క్యారెక్టర్‌ ఎవరితో చేయించాలా అని హెచ్‌.ఎం.రెడ్డి చూస్తున్నారు. తన మిత్రుడు రాజనాల గురించి ఆయనకు చెప్పారు లక్ష్మీకుమార్‌రెడ్డి. అప్పుడు రాజనాలను మద్రాస్‌ పిలిపించమని చెప్పారు. ఆ తర్వాత రాజనాలకు స్క్రీన్‌ టెస్ట్‌ చేసి కబురు చేస్తామని పంపించేశారు హెచ్‌.ఎం.రెడ్డి. 1951 డిసెంబర్‌లో ప్రతిజ్ఞ షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ సినిమాలో కాంతారావు హీరో కాగా, రాజనాల విలన్‌. అయితే అప్పటికే కాంతారావు రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ ప్రతిజ్ఞ సినిమా టైటిల్స్‌లో రాజనాల పేరు ముందు వేయడం విశేషం. ఆ తర్వాతే కాంతారావు పేరు వేశారు. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా రాజనాలకు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, అగ్రిమెంట్‌ ప్రకారం బయటి చిత్రాల్లో నటించడానికి వీల్లేకపోవడంతో వాటిని వదులుకున్నారు.  ఆ తర్వాత వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. 25 ఏళ్ళ రాజనాల.. ఎన్టీఆర్‌కి పిల్లనిచ్చిన మామగా నటించి ఆయన దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి రాజనాలను మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్‌. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎన్టీఆర్‌ సొంతంగా నిర్మించిన చిత్రాల్లో విలన్‌గా అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇతర చిత్రాల్లోనూ రాజనాలను రికమెండ్‌ చేసేవారు. అలా అగ్గిపిడుగు, పిడుగు రాముడు, సువర్ణసుందరి, జయసింహ, వినాయక చవితి, కుటుంబగౌరవం, పల్నాటి యుద్ధం, గులేబకావళి కథ, గుండమ్మకథ, కంచుకోట, సిరిసంపదలు వంటి ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు సినిమాల్లోని విలనీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. 60వ దశకంలో రాజనాల చేతి నిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. హీరో ఎన్టీఆర్‌ అయినా, కాంతారావు అయినా విలన్‌ మాత్రం కాంతారావే ఉండేవారు. ఆ హీరోలిద్దరితో రాజనాల చేసిన కత్తియుద్ధాలు అప్పట్లో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునేవి. రాజనాల డేట్స్‌ కావాలంటే నిర్మాతలు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఒక దశలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారు రాజనాల. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆయన భార్య శోభ 32 ఏళ్ళ వయసులో మరణించారు. ఆరోజు కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్‌ దగ్గరుండి జరిపించారు. భార్య మరణంతో రాజనాల మానసికంగా కృంగిపోయారు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో 1971లో భూదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. 1975 వచ్చేసరికి ఇండస్ట్రీకి కొత్త కొత్త విలన్స్‌ రావడంతో రాజనాలకు అవకాశాలు బాగా తగ్గాయి. అయినా అప్పుడప్పుడు ఎన్టీఆర్‌ తన సొంత సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు.  ఇదిలా ఉండగా 1984లో రాజనాల పెద్ద కుమారుడు మూర్ఛ వ్యాధితో మరణించాడు. ఆ తర్వాతి సంవత్సరం చిన్న కుమారుడు ఉద్యోగం కోసం ముంబాయి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో రాజనాల మానసికంగా బాగా కుంగిపోయారు. అలా ఆయనకు షుగర్‌ వ్యాధి సంక్రమించింది. కొన్ని వందల సినిమాల్లో నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా వాటిని దాన ధర్మాలకు, వ్యసనాలకు ఉపయోగించడం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయారు. చివరికి షుగర్‌ వ్యాధికి మందులు తెచ్చుకోవడానికి కూడా డబ్బులేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యారు. అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చేవి. ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన నెంబర్‌వన్‌ చిత్రంలో, ఇవివి డైరెక్ట్‌ చేసిన హలోబ్రదర్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. కృష్ణ హీరోగా రూపొందిన తెలుగు వీర లేవరా చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. షుగర్‌ వ్యాధి అధికంగా ఉండడంతో ఆయన కాలి వేలికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. దాంతో ఆ వేలిని తొలగించారు. అయినా ఇన్‌ఫెక్షన్‌ కాలు మొత్తం పాకడంతో ఒక కాలును తొలగించారు. ఇక తను సినిమాల్లో నటించే అవకాశం లేదని గ్రహించిన రాజనాల చివరి దశలో తనకు తెలిసిన జోతిష్యం, హస్త సాముద్రికం చెబుతూ కొన్నాళ్ళు జీవనం సాగించారు. మానసిక కుంగుబాటు, షుగర్‌ వ్యాధి ఎక్కువ కావడం, ఒక కాలు లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో 1998 మే 21న తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా చరిత్రలో ప్రతి నాయకుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు రాజనాల పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు రాజనాల కాళేశ్వరరావు.

ఒక సిద్ధాంతానికే కట్టుబడి సినిమాలు చేస్తున్న ఏకైక నటుడు పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి!

(డిసెంబర్ 31 ఆర్.నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా..) ఆర్‌.నారాయణమూర్తి.. ఈ పేరులోనే ఆవేశం కనిపిస్తుంది, అభ్యుదయ భావాలు కనిపిస్తాయి, అన్యాయాల్ని.. అక్రమాల్ని ఎదిరించే ధైర్యం కనిపిస్తుంది. ఏ స్టార్‌ హీరోకీ తీసిపోనంత ఇమేజ్‌ ఆయన సొంతం. ఆయన గురించి తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమా అంటే కేవలం కళ కోసమే కాదు, సామాజిక శ్రేయస్సు కోసం అని నమ్మిన మానవతా వాది. ఆయన సినిమాలకు ప్రజల గాధలే కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన సినిమాల్లోని పాత్రలు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీళ్ళను తెరపై ఆవిష్కరించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న విలక్షణమైన నటుడు. తన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన మొదటి సినిమా ‘అర్థరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు నిర్మించారు నారాయణమూర్తి. అందులో 15 సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. అయినా కమర్షియల్‌ చిత్రాల జోలికి వెళ్ళకుండా తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి అభ్యుదయ చిత్రాలే నిర్మించారు, నిర్మిస్తున్నారు. ఆ తరహా చిత్రాలకు కాలం చెల్లినా తన పంథా మాత్రం మార్చుకోలేదు. సమకాలీన సమస్యలను తీసుకొని వాటికి తెరరూపం ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణమూర్తి. ఒక స్టార్‌ హీరోకి ఎలాంటి ఫాలోయింగ్‌ ఉంటుందో అంతటి అభిమానగణం కలిగిన రెడ్డి నారాయణమూర్తి సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు? ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం. 1954 డిసెంబర్‌ 31న కాకినాడ జిల్లా మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు రెడ్డి నారాయణమూర్తి. తల్లి రెడ్డి చిట్టెమ్మ, తండ్రి చిన్నయ్యనాయుడు. రౌతులపూడిలో 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆయనకు సినిమాలపై ఆసక్తి కలిగింది. విపరీతంగా సినిమాలు చూసి హీరోలను అనుకరించేవారు. సినిమా నటుడు అవ్వాలన్న కోరిక చిన్నతనంలోనే కలిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కోరిక కూడా పెరిగింది. 1972లో ఇంటర్‌ పరీక్షలు అవ్వగానే తల్లిదండ్రులకు చెప్పి మద్రాస్‌ రైలెక్కేశారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది తప్ప అవకాశాలు ఎలా వస్తాయో తెలీదు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. పూట గడవడమే కష్టంగా మారిపోయింది. హోటల్‌లో పనిచేస్తానన్నా, రిక్షా తొక్కుతానన్నా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అలా పస్తులతోనే కాలం వెళ్ళదీస్తున్న సమయంలో రాజబాబు మేకప్‌మేన్‌ అయిన కృష్ణ అసిస్టెంట్‌ చిన్ని పరిచయమయ్యాడు. నారాయణమూర్తి పరిస్థితి తెలుసుకొని ఒక కారు షెడ్డులో వసతి కల్పించాడు. మరుసటి రోజు విక్రమ్‌ స్టూడియోకి రమ్మని చెప్పాడు చిన్ని. అక్కడ తాత మనవడు షూటింగ్‌ జరుగుతోంది. చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకనే అక్కడికి చేరుకున్నారు నారాయణమూర్తి. చాలా రోజులుగా పస్తులున్న ఆయనకు అక్కడ కడుపు నిండా భోజనం దొరికింది. అప్పుడు దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగారు. దానికాయన ‘నువ్వు ఇంకా చిన్నవాడివి. ఊరికి వెళ్లి డిగ్రీ పూర్తిచేసి రా. నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను’ అన్నారు. అదే సమయంలో ఓ జూనియర్‌ ఆర్టిస్టు సప్లయర్‌ ఒక సినిమాలో వేషం ఉందని చెప్పాడు. వెంటనే ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్లిపోయారు నారాయణమూర్తి. ‘నేరము శిక్ష’ చిత్రంలోని ఒక పాటలో 170 మందిలో ఒకడిగా నటించారు. దానికి పారితోషికంగా 36 రూపాయలు ఇచ్చారు. వాటిని తీసుకొని ఊరికి వచ్చేశారు. అక్కడ పడిన కష్టాలు గుర్తొచ్చి ఇక సినిమా ఇండస్ట్రీకి వెళ్లక్కర్లేదు అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు నేరము శిక్ష ఆ ఊరిలో రిలీజ్‌ అయింది. 170 మందిలో ఉన్నప్పటికీ ఊరి జనం నారాయణమూర్తిని గుర్తు పట్టారు. ఆయనకు రెడ్డి బాబులు అనేది ముద్దు పేరు. రెడ్డి బాబులు సినిమాలో కనిపించాడంటూ ప్రచారం పెరిగిపోవడంతో ఎంతో మంది పనిగట్టుకొని ఆ సినిమా చూశారు. అది నారాయణమూర్తిపై ప్రభావం చూపించింది. ఒక చిన్న పాత్ర చేస్తేనే తమ ఊరిలో ఇంత గుర్తింపు వచ్చింది. పెద్ద క్యారెక్టర్లు చేస్తే ఎంత పేరు వస్తుందో.. అనే ఆలోచనతోపాటు సినిమాల్లోకి మళ్ళీ వెళ్ళాలనే నిర్ణయం కూడా తీసేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి మళ్ళీ మద్రాస్‌ వెళ్లారు. దాసరి నారాయణరావు మాట ఇచ్చినట్టుగానే కృష్ణ కుమారుడు రమేష్‌బాబు హీరోగా నటించిన నీడ చిత్రంలో నారాయణమూర్తికి నక్సలైట్‌గా ఓ కీలక పాత్రను ఇచ్చారు. అయితే ఈ సినిమా చేసిన తర్వాత పెద్ద అవకాశాలు ఏమీ రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. అయితే తను వెళ్తున్న దారి కరెక్ట్‌ కాదని నారాయణమూర్తి అనుకున్నారు.  తనే ఓ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా తనే నటించాలని నిర్ణయించుకున్నారు నారాయణమూర్తి. అయితే తన దగ్గర డబ్బులేదు. ఆయనకు స్నేహితులు చాలా ఎక్కువ. తను సినిమా చేయబోతున్న విషయం వారికి చెప్పారు. స్నేహితుడి కోసం వారంతా తోచిన ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బుతోనే సినిమాను ప్రారంభించారు. స్నేహితుల సాయంతో చేస్తున్న సినిమా కావడంతో తన బేనర్‌కు స్నేహచిత్ర అని పేరు పెట్టి ‘అర్థరాత్రి స్వతంత్రం’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించి నారాయణమూర్తికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరసగా దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, లాల్‌సలామ్‌, అడవి దివిటీలు, చీకటి సూర్యులు, ఎర్రోడు, ఊరు మనదిరా వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత నారాయణమూర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది దర్శకనిర్మాతలు విప్లవాత్మక చిత్రాలు నిర్మించారు. అభ్యుదయ చిత్రాల్లో నటించడం ద్వారా ఒక స్టార్‌ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఏకైక నటుడు నారాయణమూర్తి. ఆయనకు ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఒసేయ్‌ రాములమ్మ చిత్రంలో దాసరి పోషించిన పాత్ర, టెంపర్‌ చిత్రంలో పోసాని చేసిన క్యారెక్టర్‌ కోసం మొదట నారాయణమూర్తినే అడిగారు. తను హీరోగానే నటిస్తానని, ఇతర పాత్రలు చేయనని చెప్పారు. అలా నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు ఒరేయ్‌ రిక్షా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. తన సినిమాలు గతంలో మాదిరిగా విజయాలు సాధించకపోయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.  కాలేజీ రోజుల్లో నాయకత్వ లక్షణాలతో వుండేవారు నారాయణమూర్తి. పెద్దాపురంలో బి.ఎ. చదువుతున్న రోజుల్లో రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. ఈయన విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నారు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగానూ పనిచేశారు. నారాయణమూర్తి పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందు వలన పోలీసులు ఆయన్ని ఇంటరాగేట్‌ చేశారు. సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారు నారాయణమూర్తి. అప్పట్లో బీహార్‌లో వరద బాధితుల సహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డారు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా పిలిచేవారు. వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ఎంతో సాదాసీదా కనిపిస్తారు నారాయణమూర్తి. ఎలాంటి ఆడంబరాలు ఆయన జీవితంలో కనిపించవు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నారో.. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడూ అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత వాహనం లేదు. కాలి నడక లేదా ఆటోలలో తన గమ్యానికి చేరుకుంటారు. అవసరమైతే విమానంలో ప్రయాణిస్తారు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు నారాయణమూర్తి. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం. వారి జీవన శైలి తన జీవన విధానానికి సరిపోదని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేదు. అప్పటి నుంచి అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే.. అది చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీ కాదని అంటారు. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి అడ్డు వస్తుందనే కారణంగానే పెళ్ళి చేసుకోలేదని చెప్పారు. నారాయణమూర్తికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడతారు గానీ అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. తెలుగుదేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రెస్‌ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా వాటిని సున్నితంగా తిరస్కరించారు నారాయణమూర్తి. తన జీవితం సినిమాలకే అంకితం అని చెప్తుంటారు. గతంలో ఎంతో మంది దర్శకనిర్మాతలు అభ్యుదయ చిత్రాలు చేశారు. కాలక్రమేణా వారు కమర్షియల్‌ చిత్రాలను కూడా నిర్మించారు. కానీ, నారాయణమూర్తి మాత్రం ఇప్పటివరకు ఒక్క కమర్షియల్‌ సినిమా కూడా చెయ్యలేదు. ఆయన సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ఉండవు, ద్వందార్థాలతో కూడిన మాటలకు అవకాశమే లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడమే నారాయణమూర్తికి తెలుసు. ఆ పద్ధతిలోనే ఎన్నో ఘనవిజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రేక్షకులే కాదు, సినిమా ఇండస్ట్రీలోని వారందరికీ నారాయణమూర్తి అంటే ఎంతో అభిమానం. అతని సినిమాల్లో చిన్న వేషం ఇచ్చినా చాలు, ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తామని స్టార్‌ హీరోలు సైతం అడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనూ ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నారాయణమూర్తి వంటి నటుడు మరొకరు లేరు అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

సెట్‌లో సిగరెట్‌ కాల్చినందుకు జగ్గయ్యను తొలగించి కాంతారావును హీరోగా తీసుకున్న నిర్మాత!

(డిసెంబర్ 31 కొంగర జగ్గయ్య జయంతి సందర్భంగా..) తెలుగు చిత్రసీమలో నటుడు జగ్గయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. తన గంభీరమైన కంఠంతో రంగస్థలం మీద, వెండితెరపైన తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. కళావాచస్పతిగా పేరు గాంచిన జగ్గయ్యలో ఎన్నో కోణాలు వున్నాయి. నటుడుగా, సాహితీ వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు. నటనలో జగ్గయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన డైలాగులు చెప్పే విధానం ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇట్టే ఇమిడిపోయే జగ్గయ్య హీరోగానే కాకుండా, ఆరోజుల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ చిత్రాల్లో కూడా నటించారు. అందరితోనూ స్నేహభావంతో మెలిగే జగ్గయ్య అంటే సహ నటీనటులందరికీ ఇష్టమే. జగ్గయ్యను తమ కుటుంబ సభ్యుడిగానే భావించేవారు మహానటి సావిత్రి. ఆయన్ని ‘బావా’ అని పిలిచేవారు. మంచి స్వభావం ఉన్న జగ్గయ్యకు ఓ సందర్భంలో ఘోరమైన అవమానం జరిగింది.  1935లో తమిళనాడులోని సేలంలో మోడరన్‌ థియేటర్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. 1982 వరకు తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ, ఇంగ్లీష్‌ భాషల్లో 150కి పైగా సినిమాలు నిర్మించిన ఘనత మోడరన్‌ థియేటర్స్‌ది. ఈ సంస్థకు అధిపతి టి.ఆర్‌.సుందరం ముదలియార్‌. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేవారాయన. ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకునేవారు కాదు. ఏ ఆరిస్టయినా తప్పు చేస్తే వారిని తీసేసి వేరే వారిని తీసుకునేందుకు కూడా వెనుకాడేవారు కాదు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఫ్లోర్‌లో ఎవరూ సిగరెట్‌ కాల్చకూడదు అనే కండిషన్‌ పెట్టారు. తమ సంస్థ నిర్మించే సినిమాల్లో పనిచేసేవారికి ముందుగానే ఆ కండిషన్స్‌ గురించి చెప్పేవారు. దానికి ఒప్పుకున్న వారినే తీసుకునేవారు. అయితే ఫ్లోర్‌ బయట సిగరెట్‌ కాల్చుకునేందుకు ప్రత్యేకంగా కుర్చీలు వేయించేవారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి సిగరెట్‌ కాల్చుకుని రావాలి. ఇలాంటి ఎన్నో కఠినమైన నిబంధనలు ఆ సంస్థలో ఉండేవి. 1961లో జగ్గయ్య హీరోగా ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రాన్ని ప్రారంభించింది మోడరన్‌ థియేటర్స్‌. జగ్గయ్యకు ఆరోజుల్లో సిగరెట్‌ కాల్చే అలవాటు ఉండేది. ఈ సినిమాలోకి తీసుకునే ముందే జగ్గయ్యకు తమ సంస్థ నిబంధనల గురించి చెప్పారు సుందరం. ఈ సంస్థ ఏ సినిమా ప్రారంభించినా ఎలాంటి గ్యాప్‌ లేకుండా షూటింగ్‌ను ఫాస్ట్‌గా పూర్తి చేసేవారు. అలా ఈ సినిమా కూడా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరికొన్ని రోజుల్లో జగ్గయ్యకు సంబంధించిన పోర్షన్‌ పూర్తయిపోతుంది. ఇలా ఉండగా.. ఒకరోజు షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జగ్గయ్య సిగరెట్‌ కాల్చాలనుకున్నారు. ఒక్క సిగరెట్‌ కోసం ఫ్లోర్‌ బయటికి వెళ్ళి రావడం టైమ్‌ వేస్ట్‌ అనుకున్న జగ్గయ్య సెట్‌లోనే కూర్చొని సిగరెట్‌ తాగుతున్నారు. అదే సమయంలో సెట్‌లోకి వస్తున్న సుందరం అది చూశారు. వెంటనే తన ఆఫీస్‌ రూమ్‌కి వెళ్ళిపోయి.. ప్రొడక్షన్‌ మేనేజర్‌ను పిలిచారు. జగ్గయ్యకు ఇవ్వవలిసిన పారితోషికాన్ని చెల్లించి ఆయన్ని పంపించెయ్యమని అతనికి చెప్పారు. ఆ సినిమాకి అదే చివరి షెడ్యూల్‌. ఇప్పుడు జగ్గయ్యను తీసేసి వేరే హీరోని పెడితే అతనికి సంబంధించిన సీన్స్‌ అన్నీ రీషూట్‌ చెయ్యాలి. కానీ, ఆ ఖర్చు గురించి సుందరం లెక్క చేయలేదు. మద్రాస్‌లోని తమ ఆఫీస్‌కి ఫోన్‌ చేసి కాంతారావు డేట్స్‌ ఖాళీగా ఉన్నాయేమో కనుక్కోమని చెప్పారు. అతని డేట్స్‌ దొరకడంతో వెంటనే సేలం పంపించారు అక్కడి ఆఫీస్‌ సిబ్బంది. సెట్‌కి వెళ్ళే వరకు జగ్గయ్యను ఆ సినిమా నుంచి తొలగించిన విషయం కాంతారావుకు తెలీదు. ఇదే విషయం గురించి జగ్గయ్యతో మాట్లాడి ఆయన ఓకే అన్న తర్వాత మేకప్‌ వేసుకున్నారు కాంతారావు. అలా ఒక్క సిగరెట్‌ వల్ల ఆ సినిమాను కోల్పోయారు జగ్గయ్య. ఆ ఒక్క సిగరెట్‌ వల్లే నిర్మాత సుందరం రీషూట్‌ కోసం ఎంతో డబ్బును ఖర్చు చెయ్యాల్సి వచ్చింది. తనను ఆ సినిమా నుంచి తొలగించిన విషయం తర్వాత తెలుసుకున్న జగ్గయ్య ఎంతో బాధపడ్డారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఘోరమైన అవమానంగా దీన్ని పరిగణించేవారు.

‘నేను ఆ స్థాయి నటిని కాదు..’ పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన మహానటి సావిత్రి!

(డిసెంబర్ 26 సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాత తరం నటీనటుల జీవితాల్లో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. వాటి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా మహానటి సావిత్రి వంటి వారి జీవితాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. వారి జీవితం కూడా సినిమాని తలపిస్తుంది. ఆ సినిమాలో ఆనందం ఉంటుంది, విషాదం ఉంటుంది, ఎన్నో మలుపులు కూడా మనకు కనిపిస్తాయి. ఒక సామాన్య యువతిగా జీవితాన్ని ప్రారంభించిన సావిత్రి.. ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే సినీ పరిశ్రమకు వచ్చినపుడు ఆమె ఎంతో భయపడేవారు. ఆ భయంతోనే సంసారం చిత్రంలో మొదటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సావిత్రి తీరు చూసిన దర్శకనిర్మాతలు ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి లక్ష్మీరాజ్యంకి అవకాశం ఇచ్చారు. సావిత్రి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భయపడిన సందర్భం అదే. ఆ భయమే ధైర్యంగా అడుకు ముందుకు వేసేందుకు ఉపయోగపడింది. నటిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్‌ డమ్‌ వచ్చినా ఏనాడూ ఆ హోదాని ప్రదర్శించలేదు సావిత్రి. కెరీర్‌ మొత్తం ఒక సాధారణ నటిగానే కొనసాగారు. ఒక స్టార్‌ హీరోయిన్‌కి కల్పించే వసతుల పట్ల ఆమె విముఖత చూపించేవారు. తనకంటూ పర్సనల్‌ స్టాఫ్‌ ఎవరూ ఉండేవారు కాదు. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వస్తే తనకు తోడుగా ఒక అమ్మాయిని తెచ్చుకునేవారు. బస చేసేందుకు హోటల్స్‌కి వెళ్లేవారు కాదు. సారధీ స్టూడియోలోనే ఉండేవారు. ఇక కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. సినిమాలోని క్యారెక్టర్‌ కోసం దర్శక నిర్మాతలు ఏ దుస్తులు ఎంపిక చేసారో వాటినే ధరించేవారు. నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరోయిన్లలో సావిత్రిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి నటించాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా నడుచుకునేవారు. ఇద్దరిలో ఎవరి సినిమా చేసినా వారికంటే ముందుగానే సెట్‌కి వచ్చి సిద్ధంగా ఉండేవారు.  తను నటిస్తున్న సినిమా యూనిట్‌లోని సభ్యుల్ని ఆమె ఎంత బాగా చూసుకుంటారో తెలిసిందే. ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేయించి షూటింగ్‌ స్పాట్‌కి తెప్పించేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. షూటింగ్‌ విరామ సమయంలో ఆమెకు ఇష్టమైన త్యాగలు, జామకాయలు, వేరుశనక్కాయలు తెప్పించి జూనియర్‌ ఆర్టిస్టులకు పంచి, వారితోపాటే కూర్చొని తినేవారు. హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ వచ్చినా తను గతంలో ఒక సాధారణ యువతిగా వున్న విషయాన్ని మర్చిపోయేవారు కాదు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా చూసేవారు. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేసేవారు. ఆమె సహ నటీనటులు కూడా సావిత్రిని అంతే గౌరవంగా చూసేవారు. పాతతరం నటీనటుల్లో ఎస్‌.వి.రంగారావు, సావిత్రిలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1969లో సావిత్రిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయబోతున్నట్టు ముందుగానే ఆమెకు తెలియజేశారు. కానీ, తను నటిగా అంతటి స్థాయికి ఎదగలేదనీ, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.  నటనను జీవితంగా మార్చుకున్న సావిత్రి నిజజీవితంలో ఎప్పుడూ నటించలేదు. అంతేకాదు, తనతో నటిస్తూ మాట్లాడేవారిని గుర్తించలేకపోయేవారు. ఆ కారణంగానే సావిత్రి తన జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది. ఆమెతో సరితూగగల ఏకైక నటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాకుమారి. ఆమెను అక్కా అని పిలిచేవారు సావిత్రి. దురదృష్టవశాత్తూ ఇద్దరి జీవితాలూ విషాదాంతాలుగానే మారాయి. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత తను మోసపోయానని సన్నిహితులకు చెప్పుకొని బాధపడేవారు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విషాదాన్నే చూశారు.  ఇక సావిత్రి చేసిన దాన ధర్మాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా ప్రచారంలోకి రాని విషయం ఏమిటంటే.. సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మ సొంత ఊరు గుంటూరు జిల్లాలోని వడ్డివారి పాలెం. సావిత్రికి ఆ ఊరంటే ఎంతో మమకారం. దీంతో పెద్దమ్మ సలహాతో ఆ ఊరిలోనే స్థలాన్ని కొని ఒక స్కూల్‌ కట్టించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్‌ను గుర్తించి గ్రాంట్‌ అందిస్తూ వచ్చింది. ఒకసారి ప్రభుత్వం గ్రాంట్‌ను పంపించడం ఆలస్యం చేసింది. దీంతో ఆరు నెలల పాటు అక్కడి సిబ్బందికి జీతాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి.. అప్పటికప్పుడు 1 లక్ష 4 వేల రూపాయలు పంపించి స్కూల్‌కి అండగా నిలిచారు. 1962లో ప్రారంభమైన ‘శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇప్పటికీ అదే పేరుతో నడుస్తోంది. అక్కడ సావిత్రి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ‘మహానటి’ చిత్ర దర్శకనిర్మాతలు ఈ స్కూల్‌ విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందించారు.

శత వసంతాలు పూర్తి చేసుకున్న ‘మనదేశం’ నిర్మాత సి.కృష్ణవేణి!

ఆమె పేరు సి.కృష్ణవేణి.. ఒక మహోన్నత వ్యక్తి. తెలుగుజాతికి ఒక మహానటుడిని, ఒక గానగంధర్వుడ్ని పరిచయం చేసిన ఘనత ఆమె సొంతం. బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి నటిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మీర్జాపురం రాజాను వివాహం చేసుకొని నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘మనదేశం’ ఈ చిత్రం ద్వారా మహానటుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావును పరిచయం చేశారు. అలాగే మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి తెలుగు సినిమా పురోగతికి తనవంతు కృషి చేశారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితం గురించిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.  1924 డిసెంబర్‌ 24న రాజమహేంద్రవరంలో వైద్యుల ఇంట జన్మించారు కృష్ణవేణి. నాలుగేళ్ళ వయసులోనే ‘రామదాసు’ అనే నాటకంలో కమల పాత్ర ధరించి అందర్నీ మెప్పించారు. అది చూసిన దర్శకుడు సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రంలో బాలనటిగా అవకాశం ఇచ్చారు. అలా సినీరంగంలోకి ప్రవేశించారు కృష్ణవేణి. ఆ తర్వాత 13 ఏళ్ళ వయసులో కథానాయికగా నటించారు. మీర్జాపురం రాజా నిర్మించిన ‘భోజ కాళిదాసు’ చిత్రంలో రెండవ కథానాయికగా అవకాశం లభించింది. ఆ సమయంలో రాజావారితో పరిచయం పెళ్ళి వరకు వెళ్లింది. కృష్ణవేణికి రంగస్థలంలో ఉన్న అనుభవం, పుస్తక పఠనం, సంగీతంపై పట్టు రాజావారి సినీ వ్యాపారానికి బాగా ఉపయోగపడిరది. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 15కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు కృష్ణవేణి. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు.  బెంగాలీ నవల విప్రదాస్‌.. కృష్ణవేణికి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని భర్తతో చెప్పారు. ఆ సమయంలో మీర్జాపురం రాజా ‘జస్టిస్‌’ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ బ్రిటీష్‌ వారికి అనుకూలంగా వుండేది. కృష్ణవేణి చెప్పిన కథ దేశభక్తితో కూడుకున్నది కావడం, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఉండడంతో ఆయన సినిమాగా నిర్మించేందుకు ఒప్పుకోలేదు. అయితే కృష్ణవేణి మాత్రం పట్టుదలగా ఆ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకే కుమార్తె అనురాధ పేరుతో ఎం.ఆర్‌.ఎ. ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ‘మనదేశం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కు అప్పగించారు. ఈ సినిమాలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కోసం ఎన్‌.టి.రామారావును ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎంతటి ఘనకీర్తిని సాధించారో అందరికీ తెలిసిందే. ఒక మహానటుడ్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణవేణి పేరు దేశమంతా మారుమోగిపోయింది.  ఎన్టీఆర్‌, ఘంటసాలనే కాకుండా ఎస్‌.వి.రంగారావు, అంజలీదేవి, సంగీత దర్శకుడు రమేష్‌నాయుడు, జూనియర్‌ శ్రీరంజనిని పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణవేణిదే. మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతులు ఎన్నో చిత్రాలను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావుతో 11 సినిమాలు నిర్మించడం విశేషం. భర్త మరణం ఆమెను మానసికంగా క్రుంగదీసింది. అక్కినేని నాగేశ్వరరావు సలహా మేరకు మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఫిలింనగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. కుమార్తె అనురాధ నిర్మాతగా చిత్ర నిర్మాణం చేపట్టారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో చేసిన ‘భక్త కుంబార’ అనూహ్య విజయాన్ని సాధించింది. శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు కృష్ణవేణి. ఎన్టీఆర్‌ వంటి మహానటుడిని పరిచయం చేసిన వ్యక్తిగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె చేతి నుంచి డబ్బు తీసుకుంటే తమకు కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే కొందరు కొత్త నిర్మాతలు ఆమె నివాసానికి వెళ్లి పలకరిస్తుంటారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణవేణి.. రఘుపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌ అభినయ పురస్కారాలను అందుకున్నారు. డిసెంబర్‌ 24తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేరు తెచ్చుకున్న ఏకైక మహిళ భానుమతి!

(డిసెంబర్ 24 భానుమతీ రామకష్ణ వర్థంతి సందర్భంగా..) ఎవరైనా ఒక రంగంలో తమ ప్రజ్ఞ చూపించి అందులోనే విజయాలు సాధిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం వివిధ రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అలాంటి వారిలో భానుమతి ఒకరు. నటిగా, నేపథ్యగాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, ఎడిటర్‌గా, నిర్మాతగా, రచయిత్రిగా, స్టూడియో అధినేతగా అద్భుతమైన విజయాలు సాధించారు. ఒక విధంగా సినీ రంగంలోని ఇన్ని శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఏకైక మహిళగా భానుమతి పేరును చెప్పుకోవచ్చు. అంతేకాదు, తెలుగు చిత్ర సీమలో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా కూడా ఆమె పేరును ఉదహరించవచ్చు. అంతటి ప్రజ్ఞాపాటవాలు కలిగిన భానుమతి గురించి తెలుసుకోవడం భావి తరాలవారికి ఎంతో ఉపయోగకరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బయోగ్రఫీలో భానుమతి సినిమా రంగంలోకి ప్రవేశించిన విధానం గురించి, వారి వ్యక్తిగత, సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1926 సెప్టెంబర్‌ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు భానుమతి. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. తండ్రి వద్దే సంగీత అభ్యాసం చేశారు భానుమతి. అనేక కట్టుబాట్లు ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమెకు చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు ఎక్కువ. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఓ సందర్భంలో తప్పనిసరి కావడంతో రెండు నాటకాల్లో నటించారు. అలా నటిగా తన తొలి అడుగు వేశారు. 14 ఏళ్ళ వయసులో తొలిసారి వరవిక్రయం అనే సినిమాలో నటించారు. 18 ఏళ్ళ వయసులో రామకృష్ణారావును వివాహం చేసుకున్నారు. 19 ఏళ్ళకు రచయిత్రిగా మారారు. 21 ఏళ్ళకు నిర్మాతగా తొలి సినిమా నిర్మించారు. 25 ఏళ్ళకు తమ కుమారుడు భరణి పేరు మీద సొంత స్టూడియోను నిర్మించారు. 28 ఏళ్ళకు చండీరాణి చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదలైంది. ఒకవిధంగా పాన్‌ ఇండియా మూవీని తొలిసారి నిర్మించి, దర్శకత్వం వహించిన ఘనత భానుమతికి దక్కుతుంది. కేవలం 15 సంవత్సరాల వ్యవధిలో భానుమతి జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. 65 సంవత్సరాల సినిమా కెరీర్‌లో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు. వాస్తవానికి ఇవన్నీ ఆమె కోరుకున్నవి కావు. మొదటి నుంచీ ఆమెకు నాటకాల్లో, సినిమాల్లో నటించాలనే ఆలోచన ఉండేది కాదు. సాధారణ గృహిణి భర్త, పిల్లలతో జీవితాన్ని సాగించాలని ఆశపడ్డారు. అయితే మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని అనుకునేవారు. ఆరోజుల్లో నాటకాల్లో, సినిమాల్లో నటించే మహిళలకు గౌరవం ఉండేది కాదు. అలాంటి సమయంలో టంగుటూరి సూర్యకుమారి సినిమా రంగంలో హీరోయిన్‌గా ప్రవేశించారు. ఆమె స్ఫూర్తితోనే హీరోయిన్‌గా అవకాశం వస్తే అంగీకరించారు. ఆ సినిమా పేరు మాలతీ మాధవం. కానీ, హీరోయిన్‌గా నటించడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. దర్శకుడు సి.పుల్లయ్య.. వారికి ధైర్యం చెప్పి ఒప్పించారు. అయితే భానుమతిని తాకరాదని, కౌగలింతల వంటి సీన్స్‌ ఉండకూడదని, కాస్ట్యూమ్స్‌ కూడా పద్ధతిగా ఉండాలనే కండిషన్‌ పెట్టి అగ్రిమెంట్‌ చేసుకున్నారు వెంకటసుబ్బయ్య. ఇలాంటి కండిషన్స్‌తోనే భానుమతి చాలా సంవత్సరాలు సినిమాల్లో నటించారు. ఆమె కెరీర్‌లో కృష్ణప్రేమ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పి.ఎస్‌.రామకృష్ణారావును ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు.  1939లో భానుమతి నటించిన మొదటి సినిమా విడుదలైంది. దాదాపు ఆరు సంవత్సరాలపాటు పది సినిమాల్లో నటించిన తర్వాత 1945లో స్వర్గసీమ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కేవలం నటిగానే కాదు, గాయనిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. భానుమతి నటించిన తొలి తమిళ చిత్రం రాజముక్తి. ఆ తర్వాత తెలుగులో లైలా మజ్ను, రక్షరేఖ, మల్లీశ్వరి, విప్రనారాయణ, సారంగధర, బాటసారి, బొబ్బిలియుద్ధం, పల్నాటి యుద్ధం, అంతస్తులు, తోడు నీడ... ఇలా ఆమె నటించిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. భరణి పిక్చర్స్‌ అనే బేనర్‌ను స్థాపించి కొన్ని సినిమాలను నిర్మించారు. వాటిలో కొన్ని సినిమాలకు భానుమతి, కొన్ని సినిమాలకు ఆమె భర్త రామకృష్ణారావు దర్శకత్వం వహించారు. 1967లో ఆమె హీరోయిన్‌గా నటించిన చివరి సినిమాలు గృహలక్ష్మీ, పుణ్యవతి. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్‌ ఇచ్చి మట్టిలో మాణిక్యం చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆమె చివరి సినిమా 1998లో వచ్చిన పెళ్లికానుక.  నటిగానే కాకుండా దర్శకురాలిగా భానుమతి విభిన్నమైన సినిమాలను రూపొందించారు. చండీరాణి, గృహలక్ష్మీ, అంతా మనమంచికే, విచిత్ర వివాహం, భక్త ధృవ మార్కండేయ వంటి 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. గాయనిగా విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, రచయిత్రిగా అత్తగారి కథలు, అత్తగారు.. నక్సలైట్లు, నాలో నేను వంటి రచనలతోపాటు ఎన్నో కథానికలు రచించారు. నిర్మాతగా బాటసారి, వరుడు కావాలి, చింతామణి, విప్రనారాయణ, చక్రపాణి, చండీరాణి1, చండీరాణి2, ప్రేమ, లైలామజ్ఞు, రత్నమాల వంటి వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించారు. నటిగా, గాయనిగా అద్భుతమైన విజయాలు అందుకున్న భానుమతి తెలుగులో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. భానుమతికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆరోజుల్లో భానుమతిని ధైర్యానికి పర్యాయపదంగా చెప్పుకునేవారు. ఆ పేరులోనే ఓ గాంభీర్యం ఉండేది. ఆమె దగ్గరకు వెళ్లాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా పెద్ద స్టార్స్‌ కూడా భయపడేవారు. ‘ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో మీరు కలిసి నటించారు కదా’ అని అడిగితే.. దానికి ‘నేను కాదు.. వాళ్ళే నాతో కలిసి నటించారు’ అని చెప్పుకున్న సాహసి భానుమతి. ఆమె అవకాశాల కోసం ఎప్పుడూ వెంపర్లాడేవారు కాదు. తన దగ్గరకు వచ్చిన సినిమాలే చేసేవారు. అందులోనూ తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్నవి మాత్రమే అంగీకరించేవారు. షూటింగ్‌ సమయంలో కూడా తనని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఆరోజుల్లో హీరోయిన్లంటే ఎంతో చులకన భావంతో చూసేవారు డైరెక్టర్లు. అలాంటి ఓ డైరెక్టర్‌ హీరోయిన్లను రావే, పోవే అంటూ మాట్లాడేవారు. ఆ డైరెక్టర్‌ ఓ సినిమా లొకేషన్‌లో భానుమతిని ‘ఇటు రావే’ అని పిలిచాడు. దాంతో ఆమెకు ఒళ్ళు మండిపోయి ‘ఏంట్రా పిలిచావ్‌..’ అని అతని దగ్గరికి వెళ్లారు. అంతే.. ఆ డైరెక్టర్‌కి నోట మాట రాలేదు. ఒక్కసారిగా షాక్‌ అయిపోయాడు. ఆయనతోపాటు యూనిట్‌లో ఉన్నవారు కూడా షాక్‌ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ డైరెక్టర్‌ హీరోయిన్లెవరినీ అమర్యాదగా చూడలేదు. ఆరోజుల్లో భానుమతితో చాలా మందికి విభేదాలు ఉండేవి. ఎవరు తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా ఆమె ఉపేక్షించేది కాదు. అందుకే అందరూ ఆమెకు గర్వం అనుకునేవారు. అది ఆత్మాభిమానం వల్ల వచ్చిందే తప్ప గర్వం కాదని ఆమె సన్నిహితులకు, ఆమెను దగ్గరగా చూసిన వారికి తెలుస్తుంది. ఆ కారణంగానే చాలా సినిమాల నుంచి ఆమె తప్పుకున్నారు. ఎఎన్నార్‌, సావిత్రి నటించిన దేవదాసు చిత్రంలో మొదట భానుమతినే సెలెక్ట్‌ చేశారు. అయితే ఆ సినిమాను నిర్మించిన డి.ఎల్‌.నారాయణ తమ భరణి పిక్చర్స్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశాడు. తన దగ్గర ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేసిన వాడి సినిమాలో నేను నటించాలా అంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతే హీరోయిన్‌. నాలుగైదు రీళ్ళు తీసిన తర్వాత నిర్మాత చక్రపాణికి, ఆమెకు చిన్న మాట పట్టింపు వచ్చింది. ఒకరోజు తన ఇంట్లో వ్రతం చేసుకొని షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారు. దాంతో చక్రపాణి ఆమెపై అరిచారు. తను లేట్‌గా వస్తానని మేనేజర్‌తో చెప్పానని, అందులో నా తప్పు ఏమీ లేదని భానుమతి అన్నారు. అయినా సరే క్షమాపణ కోరుతూ ఒక లెటర్‌ ఇవ్వమని చక్రపాణి అడిగారు. దానికి భానుమతి ‘నాకంత ఖర్మ పట్టలేదు. నా తప్పు లేనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి. మీ సినిమా నేను చెయ్యడం లేదు’ అంటూ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయనపై కోపంతో చక్రపాణి పేరుతో ఓ హాస్యచిత్రాన్ని నిర్మించారు భానుమతి. దానికి ఆమె భర్త రామకృష్ణ దర్వకత్వం వహించారు. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా, స్టూడియో అధినేతగా పలు శాఖల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భానుమతిని ఎన్నో పురస్కారాలతో సత్కరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గౌరవ పురస్కారాన్ని అందించింది. మూడుసార్లు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. అన్నాదురై.. నడిప్పుకు ఇళక్కనం అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. తమిళ అభిమానులు ఆమెను అష్టావధాని అని కీర్తించారు. 1966లో ఆమె రచించిన అత్తగారి కథలు అనే హాస్యకథల సంపుటికి పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు ప్రభుత్వం గౌరవించింది. 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి అవార్డు  అందుకున్నారు భానుమతి. 2001లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో భానుమతి పేరును కూడా పొందుపరిచారు.  మట్టిలో మాణిక్యం చిత్రం ద్వారా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భానుమతి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాతమ్మకల, మంగమ్మగారి మనవడు వంటి సినిమాల్లో ఆమె నటనకు భారీ ప్రశంసలు లభించాయి. 1986 జూన్‌లో తనయుడు భరణి.. తల్లిదండ్రులిద్దరినీ అమెరికా తీసుకెళ్ళారు. అక్కడ భరణి డాక్టరుగా పనిచేస్తున్నారు. అమెరికా వెళ్లిన తర్వాత రామకృష్ణారావుకు గుండెపోటు రావడంతో సెప్టెంబర్‌ 7న తుదిశ్వాస విడిచారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే భానుమతి పుట్టినరోజు సెప్టెంబర్‌ 7. అదే రోజు భర్త మరణించడం ఆమెను క్రుంగదీసింది. ఇండియా వచ్చిన తర్వాత కొంతకాలం ఎవరితోనూ మాట్లాడలేదు. తన భర్త దూరమైన బాధను భరిస్తూ కొన్నాళ్లు గడిపారు. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు 1990లో బామ్మబాట బంగారుబాట చిత్రంలో నటించారు. ఆ తర్వాత పెద్దరికం, చామంతి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 1995 వరకు అడపా దడపా సినిమాలు చేసిన భానుమతి ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే 1998లో వచ్చిన పెళ్లికానుక చిత్రంలో మాత్రం నటించారు. అదే ఆమె చివరి సినిమా. ఆ తర్వాత సినిమాలకు దూరంగా భర్త రామకృష్ణారావు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శేష జీవితాన్ని గడిపారు. 2005 డిసెంబర్‌ 24న భానుమతి ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. సినిమా రంగంలో మహిళగా అసాధారణ విజయాలను సొంతం చేసుకున్న భానుమతీ రామకృష్ణ జీవితం యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.